బుధవారం, జులై 20, 2011

నాన్న

ప్రయోగాలు చేయడంలో మన తెలుగు హీరోలతో పోల్చినపుడు తమిళ హీరోలెప్పుడూ ముందుంటున్నారు. ప్రయోగాలని అభిమానులు అంగీకరించరు అన్నది మన తెలుగు హీరోలని సర్వత్రా పట్టి పీడించే సమస్య. తమిళ హీరోలకి ఆ శషభిషలేవీ లేవు కాబట్టి వైవిధ్య భరితమైన పాత్రలని ఎంచుకుని, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తునారు. 'అపరిచితుడు' లాంటి హిట్లూ 'మల్లన్న' లాంటి ఫ్లాపులూ తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రమ్ వెండితెర మీద చేసిన మరో ప్రయోగం 'నాన్న,' తమిళం నుంచి ('దైవా తిరుమగళ్') అనువాదమై గత వారమే విడుదలయ్యింది.

ఇది మానసికంగా ఎదగని ఒక తండ్రి కృష్ణ (విక్రమ్) అతని ఐదేళ్ళ కూతురు వెన్నెల (బేబీ సారా) ల కథ. పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న వెన్నెలని అల్లారు ముద్దుగా పెంచుతాడు కృష్ణ, ఊటీలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేసే చిరుద్యోగి. కృష్ణ అంటే అందరికీ అభిమానం. అతను అడక్కుండానే పాప పెంపకంలో సహాయం చేస్తూ ఉంటారు చుట్టుపక్కలవారు. వెన్నెలకి ఐదో ఏడు రాగానే ఆమెనో మంచి స్కూల్లో వేస్తాడు కృష్ణ. ముమ్మూర్తులా తండ్రి మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న వెన్నెల ఎంతో తెలివైనది కూడా. "నేను లేనప్పుడు నాతో మాట్లాడాలంటే ఆకాశంలో కనిపించే వెన్నెలతో మాట్లాడు నాన్నా.." అంటుంది తండ్రితో.

వెన్నెల చదివే స్కూలు యాజమాన్యమే కృష్ణని మోసం చేసి, ఆ పాపని కిడ్నాప్ చేస్తుందొక రోజు. "నాకు వెన్నెల కావాలి.." అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతూ కృష్ణ విశాఖపట్నం వీధుల్లో తిరుగుతూ ఉండడం సినిమాలో ప్రారంభ సన్నివేశం. కోర్టులో వాదించడానికి కేసుల్లేక గోళ్ళు గిల్లుకుంటున్న న్యాయవాది అనూరాధ (అనుష్క) దగ్గరికి వస్తాడు కృష్ణ. మొదట్లో కృష్ణని ఓ పిచ్చివాడిగా తీసిపారేసిన అనూరాధ, చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ద్వారా కృష్ణ గతం, అతనికి జరిగిన అన్యాయం తెలుసుకుని కేసు టేకప్ చేయడానికి అంగీకరించి, వెన్నెలని కోర్టులో ప్రవేశ పెట్టాలంటూ 'హెబియస్ కార్పస్' పిటిషన్ వేస్తుంది.

అవతలి పక్షం న్యాయవాది మరెవరో కాదు, ఓటమి అంటే ఏమిటో తెలియని భాష్యం (నాజర్). అసలు నిన్న మొన్నటివరకూ భాష్యం దగ్గర జూనియర్ గా పనిచేసే అవకాశం వస్తే చాలని ఎదురు చూసింది అనూరాధ. అంతటి భాష్యాన్ని ఎదుర్కొని అనూరాధ కేసుని గెలవగలిగిందా? కృష్ణ వెన్నెలని కలుసుకో గలిగాడా? వెన్నెలని కిడ్నాప్ చేసి, కృష్ణ నుంచి దూరం చేయాలని స్కూలు వాళ్ళు ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? కూతురికోసం కృష్ణ ఏం చేశాడు? తదితర ప్రశ్నలన్నింటికీ జవాబులిస్తూ బరువుగా ముగుస్తుందీ సినిమా.

కేరక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు విజయ్ ఇందుకోసమే ఎక్కువ స్క్రీన్ టైం ని వినియోగించాడు. సినిమా ప్రారంభంలోనే కృష్ణ తన అమాయకత్వంతో కూడిన మంచితనంతో ఓ చిల్లర దొంగ మనసు మార్చడం, పొరపాటున గూటి నుంచి జారిపడ్డ పక్షి పిల్లని చాలా కష్టపడి తిరిగి గూటిలోకి చేర్చడం ద్వారా జరగబోయే కథని సూచన ప్రాయంగా చెప్పాడు. తమ 'మేడం' కి కేసులు తేవడం కోసం అనూరాధ జూనియర్లు పడే పాట్లు లాంటివన్నీ చాలా వివరంగా చూపించడంతో సన్నివేశాల నిడివి, మొత్తంగా సినిమా నిడివి బాగా పెరిగి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరింది. సబ్జక్టు కూడా బరువైనది కావడంతో, విడివిడిగా సన్నివేశాలన్నీ బాగున్నప్పటికీ సినిమాని సాగదీశారన్న భావన కలిగింది.

నటీనటుల పరంగా మొదట చెప్పుకోవాల్సింది కృష్ణ గా చేసిన విక్రమ్ గురించే. నిజానికి ఈ తరహా ఎదిగీ ఎదగని పాత్రల మీద 'స్వాతిముత్యం' లో కమల్ హాసన్ చేసిన పాత్ర ప్రభావం ఎంతో కొంత ఉండడం సహజం. అయితే నటనలో ఆ ఛాయలేవీ రాకుండా జాగ్రత్త పడ్డాడు విక్రమ్. అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో 'పా' లో అమితాబ్ నటనని గుర్తుచేశాడు. తర్వాత చెప్పుకోవాల్సింది వెన్నెలగా చేసిన బేబీ సారా గురించి. తొలి సినిమానే అయినప్పటికీ, చాలా సన్నివేశాల్లో విక్రమ్ తో పోటీ పడిందీ చిన్నారి. ఈమె చేత పలికించిన కొన్ని డైలాగులు బాగా గుర్తుండిపోతాయి. 'అమ్మేదీ' అని అడిగినప్పుడు 'దేవుడి దగ్గరుంది' అని కృష్ణ చెప్పగానే, 'ఏం? దేవుడికి అమ్మ లేదా?' అని అడుగుతుంది వెన్నెల.

అనుష్క విక్రమ్ తో కన్నా, నాజర్ తో పోటీ పడి నటించిందనడం సబబు. ఎందుకటే, వాళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ కాంబినేషన్ సీన్స్ (కోర్ట్ సన్నివేశాలు) ఉన్నాయి. సహాయ నటుల్లో ఎక్కువమంది తమిళులే. తెలుగు నటి సురేఖావాణి కి చెప్పుకోదగ్గ పాత్ర దొరికింది. కథాంశం బరువైనది కావడంతో వీలున్న చోటల్లా హాస్యాన్ని జతచేసి బరువుని తగ్గించాలన్న దర్శకుడి ప్రయత్నం కొంతవరకూ ఫలించింది. కానైతే, సినిమా నుంచి బయటికి వచ్చాక వెంటాడేవి మాత్రం కరుణరస ప్రధానమైన దృశ్యాలే. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలతో పాటు, మొదటి సగంలో నేపధ్య సంగీతమూ బాగుంది. విక్రమ్ రెండు పాటలని పాడాడు కూడా.

చివర్లో వచ్చే విక్రమ్ అనుష్కల గ్రాఫిక్స్ వానపాట లేకపోయినా నష్టం లేదు. నాయికానాయకులకి డ్యూయట్ ఉండాలన్ని బాక్సాఫీస్ నియమం ప్రకారం ఇరికించినట్టున్నారు. మెచ్చుకోవాల్సిన మరో అంశం నీరవ్ షా ఫోటోగ్రఫి. ఊటీ అందాలని తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. తమిళ నేటివిటీ పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా సీరియస్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే మరింత బాగుండేది అనిపించింది. విక్రమ్ తో పాటు సారాకీ అవార్డులు లభించే అవకాశం ఉంది.

12 కామెంట్‌లు:

  1. బాగుంది. ప్రయోగాలు మన హీరోలు చేద్దామనుకున్నా మనం చెయ్యనివ్వం. అదీ దౌర్భాగ్యం. పోన్లెండి. కనీసం తెలుగులోకి డబ్ అయ్యాకైనా చూసే అవకాశం ఉంటోంది. Iam Sam లో నటనకి Sean Penn అకాడమీ అవార్డుకి నామినేట్ అయ్యాడు. మరి నాన్న విక్రం కి ఏమొస్తాయో చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. ఓహ్ అప్పుడే చూసేసారా! నేను ఇవాళ ప్లాన్ చేస్తున్నా...మా డిల్లీలో ఈరోజొక్కరోజే తమిళ్ లో విడుదల...మా డైరెక్టర్ అడ్డు తగలకపోతే చూసేసి వస్తా.

    సినిమా చాలా హృద్యంగా ఉందని అందరూ అంటున్నారు. మీరు కథ కొంత చెప్పి నన్ను మరీ సస్పెన్స్ లో పెట్టేసారు. :)

    రిప్లయితొలగించండి
  3. ee movie oka hindi picture remake. chaalaa rojula kritam choosanu. peru gurtu ledu. ajay devagan, susmita sen, anupam kher andulo actors. antavarake gurtu undi

    రిప్లయితొలగించండి
  4. ee movie hindhi lo "main aisa hi hoon" ani same story..ajay devagan and sushmitha sen..

    రిప్లయితొలగించండి
  5. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా చూసెయ్యాలనిపిస్తుంది మురళి గారూ:)) ఈ వారాంతం ప్లాన్ చేసేస్తా..

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు మంచి సినిమా గురించి పరిచయం చేశారు. ఇలాంటి సినిమాలకి నిడివి సమస్య తప్పదేమో. చివరి పాట వేస్ట్. మన హీరోలకు చెబితే ఒప్పుకోరు.. ఫాన్సు చూడరు అంటారు. నిజమే... మన వాళ్ళు కేవలం హీరోలు మాత్రమే... నటులు కారు.

    రిప్లయితొలగించండి
  7. మురళీ గారూ,
    మీ రికమెండేషన్ మీద సినిమా చూసాను. బాగుంది. మీరన్నట్టు కామెడీ బాగా పేలింది. తెలుగు వారు ఇలాంటీ సినిమాలు చేయట్లేదన్నరుగా మీరు . ఈ సినిమా బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకున్నా.

    రిప్లయితొలగించండి
  8. నిన్న రాత్రి చెప్పడం మరిచా ఈ సినిమాలో అనుష్కతో వచ్చే వాన పాట చాలా దురవగాహనలకు దారి తీసేసింది. ఈమేమైనా ఆ కృష్ణ క్యారెక్టర్ ని సగటు తెలుగు సినిమాల్లోలాగా పెళ్ళి చేసేస్కుటుందా అనే అనుమానాల్లాంటివి వచ్చేశాయి.కృష్ణ భార్య ఫోటో సైతం చూపించకపోవడం మంచి ఎత్తుగడ.ఏదేమైనా మంచి సినిమా.

    రిప్లయితొలగించండి
  9. @రాధిక (నాని): చాన్నాళ్ళ తర్వాత... కుశలమే కదండీ? ..ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: స్టేట్ అవార్డు (తమిళ్) వస్తుందండీ.. నేషనల్ కి లాబీయింగ్ ఉండాలి కదా!! ..చూడాలి మరి.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: కొంచం బరువుగా ఉన్నప్పటికీ చూడాల్సిన సినిమా అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @పూర్ణిమ: అవునా?! నేను ఇంగ్లీష్ పిక్చర్ అయి ఉండొచ్చని అనుకున్నానండీ.. ధన్యవాదాలు.
    @సృజన: పూర్ణిమ గారు చెప్పిన సినిమా ఇదే అన్నమాట!! నటన బాగుందండీ.. నేటివిటీని కూడా (తమిళ్) బాగానే మార్చారు.. ధన్యవాదాలు.
    @మనసు పలికే: తప్పక చూడండి.. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @చక్రవర్తి: 'కేవలం హీరోలు మాత్రమే, నటులు కారు' ..ఉన్న మాట చెప్పారు. నిన్నరాత్రి ఏదో టీవీ ప్రోగ్రాం లో బాలూ మాట్లాడుతూ 'చిరంజీవి వైవిధ్యంగా చేయగలిగీ, ఫాన్స్ ఒప్పుకోరని చేయడం లేదు' అన్నారు.. అదండీ సంగతి.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: మరీ అచ్చంగా ఇలాంటి సినిమానే కాకపోయినా, వంశం డైలాగులు, తొడ చప్పుళ్ళు, ఫ్యాక్షన్ల లాంటి వాటికి దూరంగా, సహజత్వానికి కొంచమైనా దగ్గరగా తీయొచ్చు కదా అనండీ.. ఇక, ఆ చివరి పాత కేవలం హీరో హీరొయిన్లకి ఒక డ్యూయట్ ఉండాలి అని పెట్టిందేమో అని నా డౌట్ ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి