శుక్రవారం, అక్టోబర్ 30, 2009

దిసిజిట్-జాక్సన్ కి నివాళి

నేను మైఖేల్ జాక్సన్ అభిమాని ని కాదు.. అప్పుడప్పుడూ అతని పాటలు వినడం, టీవీలో ఎక్కడైనా కనిపిస్తే కాసేపు చూడడం, పత్రికల్లో అతని గురించి వచ్చే కథనాలు చదవడం.. జాక్సన్ తో నా పరిచయం ఇంతవరకే. నాలుగు నెలల క్రితం ఈ పాప్ ప్రపంచపు రారాజు శాశ్వతంగా సెలవు తీసుకున్నప్పుడు "అయ్యో" అనిపించింది ఒక్క క్షణం.. అతని గురించి వచ్చిన చాలా కథనాలు చదివాను.

ఇప్పుడు జాక్సన్ ని వెండి తెరమీద చూశాను. సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన 'This Is It' డాక్యుమెంటరీ ని అనుకోకుండా చూశాను. జాక్సన్ చివరి రోజులకి సంబంధించిన డాక్యుమెంటరీ అని ప్రచారం జరిగింది కానీ, తెర మీద నేను చూసింది వేరు. ఈ డాక్యుమెంటరీ మనకి తెర వెనుక జాక్సన్ ని చూపిస్తుంది. అతను, అతని బృందం ఎంత కృషి చేస్తే ఒక ప్రదర్శన జరుగుతుందో వివరిస్తుంది.

తొంభై నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ, వివిధ షో ల కోసం జాక్సన్, అతని బృందం తో కలిసి చేసిన రిహార్సళ్ళ సమాహారం. అన్నీ డ్రెస్ రిహార్సళ్ళే కావడం వల్ల జాక్సన్ ఆహార్యం అతని షోలలో ఉన్నట్టుగానే ఉంది. విచిత్రమైన రంగుల కాంబినేషన్ల దుస్తులు, అతని శరీర బరువు కన్నా బరువుగా అనిపించే బూట్లు మొదలైన యాక్సెసరీలు, ప్రతి పాటకీ మారిపోయే కనుముక్కు తీరు, హెయిర్ స్టయిలూ.. వెరసి పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్.

వేదిక మీద ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాడో, తెర వెనుక కూడా అలాగే కనిపించాడు జాక్సన్. ఒక కళాకారుడిని మించిన టీం లీడర్ అతనిలో కనబడ్డాడు. తన బృంద సభ్యులతో మృదువుగా వ్యవహరిస్తూనే తనకి కావలసినది రాబట్టు కోవడం, తను వారి నుంచి ఏమి ఆశిస్టున్నాడో వివరంగా చెప్పడం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించడం, ఎక్కడా రాజీ పడక పోవడం.. ఎలాంటి కష్టమూ పడకుండా అంత పేరు వస్తుందా మరి?

లక్షలాది మంది జనం ముందు నాట్యం చేసే జాక్సన్, అవే సెట్టింగులతో, దుస్తులతో కేవలం తన బృంద సభ్యుల ముందు మాత్రమే ఇచ్చిన ప్రదర్శనలు చూడడం ఒక చిత్రమైన అనుభూతి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో, దానికి తను, తన బృందం ఎలా ప్రతిస్పందించాలో కూడా రిహార్సల్ చేశాడు జాక్సన్. ఇవన్నీ రికార్డు చేసినప్పుడు బహుశా అతనికి తెలిసి ఉండక పోవచ్చు, ఆ క్లిప్పింగులతో ఒక డాక్యుమెంటరీ చేస్తారని, తన తదనంతరం అది ప్రదర్శింప బడుతుందనీ.

జాక్సన్ బృంద సభ్యుల అభిప్రాయాలని కూడా రికార్డు చేసి చూపారు మధ్య మధ్యలో. అతను తన బృందాన్ని ఎంపిక చేసుకునే తీరు, వారి నుంచి తనకి కావాల్సింది రాబట్టుకోడానికి ఇచ్చే శిక్షణ తరగతులనూ చేర్చారు డాక్యుమెంటరీలో. జాక్సన్ సహాయకులు, హెయిర్ స్టయిలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ల అభిప్రాయాలనూ చూడొచ్చు. జాక్సన్ అభిమానులు ఎలాగూ చూస్తారు. అభిమానులు కాని వాళ్ళు కూడా చూడదగ్గ డాక్యుమెంటరీ ఇది. కేవలం రెండు వారాలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శింప బడుతుంది.

గురువారం, అక్టోబర్ 29, 2009

నారాయణరావు

డెబ్బై ఐదేళ్ళ క్రితం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగు నవలల పోటీ నిర్వహించినప్పుడు రెండు నవలల్లో దేనికి మొదటి బహుమతి ఇవ్వాలో న్యాయ నిర్ణేతలు నిర్ణయించుకోలేక పోయారు. ఫలితంగా ప్రధమ బహుమతి ని ఆ రెండు నవలలకీ కలిపి ప్రకటించారు. వాటిలో ఒకటి విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' కాగా రెండో నవల అడివి బాపిరాజు రాసిన 'నారాయణరావు.' 1933-34 సంవత్సరాలలో ప్రచురితమైన ఈ నవల ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని కళ్ళముందు ఉంచుతుంది.

'వేయి పడగలు' చదివిన నాటినుంచీ 'నారాయణరావు' చదవాలని ప్రయత్నం. ఎట్టకేలకి ఈమధ్యన పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు కొత్త ప్రింట్ కనిపించింది. వెంటనే తీసేసుకున్నాను. ఇది ఉన్నత తరగతి రైతు కుటుంబానికి చెందిన నారాయణరావు కథ. మద్రాసులో లా చదువుతున్న నారాయణరావు తన మిత్రులతో కలిసి సొంత ఊరైన కొత్తపేటకి వెళ్ళడం కోసం రైల్లో ప్రయాణిస్తుండడం తో కథ ప్రారంభమవుతుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో అతన్ని చూసిన విశ్వలాపురం జమీందారు లక్ష్మీ సుందర ప్రసాద రావు 'నీకు వివాహమైనదా?' అని ప్రశ్నిస్తాడు నారాయణరావును.

బాపిరాజు చిత్రకారుడు, కవీ కూడా కావడం వల్ల ఆ ఛాయలు నవలలో కనిపిస్తాయి. ప్రతి వ్యక్తినీ, స్థలానీ, సన్నివేశాన్నీ కళ్ళకి కట్టినట్టుగా వివరిస్తారు. నారాయణరావుని ఇలా వర్ణిస్తారు రచయిత: "నారాయణరా వాజానుబాహుడు, ఐదడుగుల పదనొకం డంగుళముల పొడవు వాడు. బలసంపదకు నెలవైన వాడు. ఉజ్జ్వల శ్యామలుడు. చిన్నవి, తీష్ణమైన లోచనములు తీరి, సమమై కొంచము పొడుగైన ముక్కు దూరస్థములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనస్సువలె తిరిగి పోయిన పై పెదవికి నాతిదూరమున నాగింది. అతని నోరు సుందరమై పద్మినీ జాతి లలనా రత్నమునకు వన్నె తీర్చునట్టిదై యున్నది"

'నారాయణరావు' మీద తనకున్న ప్రేమని ఎక్కడా దాచుకోలేదు రచయిత. తలిదండ్రులు, సోదరీ సోదరులు, బంధువులు, స్నేహితులు, ఇంట్లో పని వాళ్ళు, ఊరి జనం.. ఇలా ప్రతి ఒక్కరూ నారాయణరావు ని మెచ్చుకొనే వారే. జాతీయోద్యమం లో కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన నారాయణరావు మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ అహింసా సిద్ధాంతం మీద, సత్యాగ్రహం మీద విపరీతమైన నమ్మకం ఉన్నవాడు. జైలు జీవితం కారణం గా చదువుకి మధ్యలో ఆటంకం ఏర్పడడం వల్ల లా లో చేరతాడే తప్ప, న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి తో కాదు. ఐనప్పటికీ తరగతిలో అతడే ప్రధముడే.

జస్టిస్ పార్టీ శాసన సభ్యుడు కూడా అయిన విశ్వలాపురం జమీందారు తన పెద్ద కుమార్తెకి జమీందారీ సంబంధం చేసి తల బొప్పి కట్టి ఉండడం తో, రెండో కుమార్తె శారద కి మామూలు సంబంధం చేయాలని తలచి వరాన్వేషణలో ఉండగా అనుకోకుండా నారాయణరావుని చూడడం, అతన్ని అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించు కోవడం జరుగుతాయి. శారద కి ఇంట్లోనే చదువుతో పాటు సంగీతం చెప్పిస్తున్నారు. ఆమెకి సాహిత్యం అంటే ఆసక్తి మెండు.

జమీందారు గారి భార్య వరద కామేశ్వరీ దేవి గారికి నారాయణ రావు సంబంధం నచ్చదు. చిన్న కూతురికి కూడా జమీందారీ సంబంధం, అందునా తన మేనల్లుడు జగన్మోహన రావు సంబంధం చేయాలన్నది ఆమె కోరిక. తండ్రిగారి నిర్ణయానికి ఎదురు చెప్పదు శారద. నారాయణరావు తండ్రి సుబ్బారాయుడిని ఒప్పించి వియ్యమందుతారు జమీందారు గారు. తల్లికి నారాయణరావు పట్ల ఉన్న నిరసన భావం కారణంగా అతనికి దగ్గర కాలేక పోతుంది శారద. అయితే ఈ విషయాన్ని పొరపాటున కూడా బయట పెట్టడు ఉదాత్త చరితుడైన నారాయణరావు.

సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు మామా అల్లుళ్ళు. చదువు పూర్తి చేసి, మద్రాసులో న్యాయవాద వృత్తి ప్రారంభించి శారదతో వేరు కాపురం పెడతాడు నారాయణరావు. తన అక్క చెల్లెళ్ళు, స్నేహితుల సంసారాల్లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడతను. తన విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. భర్త పట్ల శారద తన వైఖరిని మార్చుకుందా లేదా? తన వృత్తికి సంబంధించి నారాయణ రావు ఏ నిర్ణయం తీసుకున్నాడు? అన్నది నవల ముగింపు.

ప్రధాన కథతో పాటు సాగే ఉప కథలు ఆనాటి పరిస్థితులని వివరిస్తాయి. ఆనాటి చదువుకున్న యువత మహాత్ముడిని ఎంతగా ఆరాధించిందో అర్ధమవుతుంది, ఈ నవల చదువుతుంటే. "ఆంధ్ర దేశానికి కోనసీమ నాయకమణి" లాంటి వర్ణనలకి కొదవ లేదు. ఆనాటి ఆంధ్ర దేశాన్నే కాదు, అమెరికానీ చూడొచ్చు ఈ నవలలో. 'నారాయణరావు' నవల చదువుతుంటే 'వేయిపడగలు' తో పాటు 'చదువు' (కొడవటిగంటి కుటుంబరావు) 'మాలపల్లి' (ఉన్నవ లక్ష్మీనారాయణ) తదితర నవలలు గుర్తుకు రాక మానవు. విడవకుండా చదివించే రచనాశైలి ఈ నవల ప్రత్యేకత.

కథానాయక పాత్రపై రచయితకి ఉన్న ప్రేమ ఆశ్చర్యం కలిగిస్తుంది, 'ధర్మారావు' పట్ల విశ్వనాథ వారికి ఉన్న ప్రేమను గుర్తుకు తెస్తుంది. నారాయణరావు మిత భాషి కావడం వల్ల, ధర్మారావు లాగా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడు. అయితే లలిత కళల గురించి, దేశ పరిస్థితుల గురించి మిత్రుల చర్చలు మాత్రం సుదీర్ఘంగానే సాగుతాయి. వివాహానికి వెలుపల ఉండే స్త్రీ పురుష సంబంధాలా తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాజేశ్వరుడు-పుష్పశీల పాత్రల ద్వారా చిత్రించారు బాపిరాజు. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 322, వెల రూ. 160, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). అడివి బాపిరాజు సాహిత్యాన్నంతటినీ పునః ప్రచురించాలన్న విశాలాంధ్ర ప్రయత్నానికి అభినందనలు.

బుధవారం, అక్టోబర్ 28, 2009

ప్రతిపక్షం

ఊహించినట్టుగానే కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని 'సాక్షి' దిన పత్రిక ప్రతిపక్ష పాత్రని పోషించడం మొదలు పెట్టింది. గత కొద్ది రోజులుగా -- మరీ స్పష్టంగా చెప్పాలంటే యువరాజ పట్టాభిషేకం ఇప్పట్లో లేదని పార్టీ హైకమాండ్ అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పేశాక - ప్రతిరోజూ కనీసం ఒక ప్రభుత్వ వ్యతిరేక వార్తా కథనం లో సాక్షి పాఠకుల ముందుకు వస్తోంది. టీవీ సంగతి నాకు తెలీదు.. ఎందుకంటే 'చక్కనోడు' పాటల భయంతో ఆ చానల్ చూడడం మానేశాను.

ఇంతకీ సాక్షి పోషిస్తున్న ఈ పాత్రని 'నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర' అంటారుట.. టీవీ లో ఎవరో విశ్లేషకులు (?!) చెబుతుండగా విన్నాను. ఇప్పుడా పత్రిక ప్రజల పక్షం వహిస్తోందిట. మంచిదే.. పత్రికలు అప్పుడప్పుడూ అయినా ప్రజల సమస్యలు పట్టించుకుంటే బాగానే ఉంటుంది. నిజానికి పత్రికలు ఇలా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం ఇదే మొదలు కాదనీ, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన ప్రతిసారీ 'ఆ రెండు పత్రికలు' అదే పాత్రను పోషించాయనీ ఎవరో అన్నారు. ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తోంది.

ఓడలు బళ్ళవడం అంటే ఇదేనేమో.. మొన్న మొన్ననే ప్రారంభమై ఆంధ్ర ప్రదేశ్ హరితాంధ్ర ప్రదేశ్ గా మారుతున్న వైనాన్నిరంగురంగులలో చూపించి, కాంగ్రెస్ ఇమేజ్ ని - ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ని - ఆ రెండు పత్రికల బారి నుంచి కాపాడి, రాష్ట్రంలో పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం లో తనవంతు పాత్ర పోషించిన పత్రిక ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి వచ్చేసింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే 'ఆ రెండు' పత్రికలు ఇప్పుడు ఆచి తూచి అడుగేస్తున్నాయి..దాదాపు ప్రభుత్వం మీద ఈగ వాలకుండా కాపాడుతున్నాయి.

ఆగస్టు రెండో వారంలో అనుకుంటా.. నాకు ఉన్నట్టుండి సాక్షి చదవడం మీద విసుగొచ్చింది.. మాన్పించి వేరే పేపర్ తెప్పించుకుందాం అనుకున్నా.. ఇంతలోనే సెప్టెంబర్ సంక్షోభం, అనంతర పరిణామాలు ఎలా ఉంటాయో, సాక్షి ఎలా స్పందిస్తుందో అన్న కుతూహలం.. మలుపులు తిరిగిన రాజకీయం.. మొత్తానికి సాక్షి ని విడవకుండా చదివేలా చేశాయి. ఇప్పుడింక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది కాబట్టి ఎలా అయినా చదవాల్సిందే. సాక్షి ఎలాంటి కథనాలు ప్రచురిస్తుందో, వాటికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

ఇప్పటికిప్పుడు హైకమాండ్ మనసు మార్చుకుని యువరాజ పట్టాభిషేకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సాక్షి కథనాలు ఎలా ఉంటాయి? ఊహాజనితమైన ప్రశ్న.. జవాబు వాస్తవం నుంచే వస్తుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ రెండు పత్రికలు ఏం చేస్తాయో, అదే చేస్తుంది. అప్పుడు ఆ రెండు పత్రికలు 'నిర్మాణాత్మక ప్రతిపక్ష' పాత్రను పోషిస్తాయన్న మాట. ఊహ నుంచి వాస్తవానికి వస్తే, సాక్షి కథనాల పట్ల ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది? ఎంతైనా వేరే పార్టీ ముద్ర వేయించుకున్న పత్రికలు విమర్శించడం వేరు, సొంత గూటి పత్రిక విమర్శించడం వేరు కదా..

సాక్షి ఎలాంటి కథనాలు ప్రచురించినా రోశయామాత్యుడు పట్టించుకోడన్నది నా అంచనా.. ఎందుకంటే హైకమాండ్ తనని ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పినన్నాళ్ళూ తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తానా పదవిలో కొనసాగాల్సిందే అనీ, అధిష్ఠానం మనసు మారాక తాను అరిచి గీ పెట్టినా ఒక్క క్షణం కూడా కుర్చీ లో ఉండనివ్వరనీ ఆయనకి బాగా తెలుసు. అంతకు మించి 'అంతా అమ్మే చూసుకుంటుందని' కూడా తెలుసు. నిన్న కాక మొన్న 'రోశయ్య మా నాయకుడు కాదు' అని చెప్పిన కొండా సురేఖ ఉన్నట్టుండి 'ఆయన నా తండ్రి లాంటి వాడు' అన్నదంటే, అమ్మ లీల కాక మరేమిటి? అమ్మ కన్నెర్ర చేస్తే సాక్షి కథనాల బాణీ మారక తప్పదనడంలో సందేహం ఏముంది?

మంగళవారం, అక్టోబర్ 27, 2009

కష్టం

"ప్రపంచం లో ఎవరూ భరించలేనిది ఒకటి ఉంది.. అది కష్టం.." వెంకటేష్ 'సుందరకాండ' సినిమాలో అపర్ణ చెప్పిన డైలాగ్ ఇది. నిజమే.. కష్టాన్ని భరించడం ఎంత కష్టమో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే అర్ధమవుతుంది. వచ్చిన ప్రతిసారీ "ఇంతటి కష్టం ఎప్పుడూ రాలేదు" అని మన చేత అనిపించడం కష్టం ప్రత్యేకత. ఎప్పుడైనా ఏ పనీ లేనప్పుడు ఒక్కసారి అలా వెనక్కి వెళ్లి మనం దాటి వచ్చిన కష్టాలన్నింటినీ తల్చుకుంటే ఎంత హాయిగా ఉంటుందో..

కష్టం రాగానే దానిని ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది.. కుటుంబ సభ్యులతో పంచుకోలేని పక్షంలో మనకి వెంటనే గుర్తొచ్చేది మిత్రులే. కాబట్టి వెంటనే వాళ్ళతో మన కష్టాన్ని చెప్పుకుని కొంచం తేలిక పడతాం.. ఇక్కడో చిక్కుంది. ప్రతి ఒక్కరూ తమకి వచ్చింది మాత్రమే కష్టం అనుకుంటారు. మరోలా చెప్పాలంటే.. చాలా ఏళ్ళ క్రితం 'స్వాతి' మాస పత్రిక పాఠకులకి 'కష్టాలు లేనిది ఎవరికి?' అని ప్రశ్న ఇచ్చి, ఉత్తమ సమాధానానికి బహుమతి ప్రకటించింది.. బహుమతి గెలుచుకున్న సమాధానం 'ఎదుటి వాళ్లకి.'

ఈ కారణంగా మనం అత్యంత భయంకరమైనది అనుకున్న కష్టం మన మిత్రులని కదిలించ లేకపోవచ్చు. అసలు, వాళ్ళ దృష్టిలో అది కష్టమే కాకపోవచ్చు. అదే మాటని వాళ్ళు పైకి అన్నారనుకోండి, నిస్సందేహంగా మన మనోభావాలు దెబ్బ తింటాయి. వాళ్ళు చెప్పిన కష్టానికి మనం అదే రీతిగా స్పందించినప్పుడు వాళ్ళ మనో భావాలు కూడా సేమ్ టు సేమ్. అందువల్ల చేత ఎవరైనా వాళ్ళ కష్టాన్ని గురించి చెబుతున్నప్పుడు 'ఓస్.. ఇంతేనా.. ఈ మాత్రానికేనా..' అనకుండా ఉండడం ఉత్తమం అనిపిస్తుంది.

చాలా సందర్భాలలో మనం కష్టాన్ని మరొకరితో పంచుకుని సాంత్వన పొందాలి చూస్తామే తప్ప, వాళ్ళ నుంచి పరిష్కారాన్ని ఆశించం. ముఖ్యంగా అది పరిష్కారం లేని సమస్య అని బలంగా నమ్మినప్పుడు, అవతలి వారు ఇచ్చే సలహాలు, సూచనలు మనకి నచ్చే అవకాశం తక్కువ. ఒక్కోసారి పరిష్కారం మన దగ్గరే ఉన్నా, సమయానికి ఆలోచన రాక బాధ పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మాత్రం ఎదుటివారు ఆ పరిష్కారాన్ని గుర్తు చేస్తే గొప్ప సంతోషం కలుగుతుంది.

ప్రతి మనిషిలోనూ ఇగో ఉంటుంది.. అది మానవసహజం. "నేను కాబట్టి ఇన్ని కష్టాలు భరించాను.. అదే మరోకరైతేనా.." అనుకోవడం ద్వారా ఆ ఇగోని సంతృప్తి పరుచుకుంటూ ఉంటాం.. ఇందులో ఎలాంటి తప్పూ లేదు.. ఎవరికీ ఇబ్బందీ లేదు. సమస్య ఎప్పుడు వస్తుందీ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన గురించి అలా అనుకోవాలని ఆశించినప్పుడు. మన కష్టం వాళ్ళ దృష్టిలో కష్టమే కానప్పుడు, మన గొప్పదనాన్ని వాళ్ళు ఎలా అంగీకరించగలరు? అన్న ఆలోచన రాదు మనకి.

అసలు కష్టమన్నదే లేకపొతే జీవితం ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది..నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటే కష్టం మనల్ని ఆలోచింప జేస్తుంది, జడులం కాకుండా కదలిక తెస్తుంది. రకరకాల పరిష్కారాలని వెతికేలా చేస్తుంది.. కష్టం తీరాక మనలో ఆత్మ విశ్వాసం పెరిగేలా చేస్తుంది. అదే ఏ కష్టమూ లేకపొతే, ఎలాంటి చాలెంజీ లేకపొతే.. 'మడిసికీ గొడ్డుకీ..' అన్న 'ముత్యాల ముగ్గు' డైలాగు గుర్తు చేసుకోవాలేమో.. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే మనిషి అంతగా రాటు దేలతాడు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు మరి.

ఆదివారం, అక్టోబర్ 25, 2009

క్షతగాత్ర గానం

ఉత్తరాంధ్ర.. ఈ పేరు వినగానే ఎన్నో ఎన్నెన్నో గుర్తొస్తాయి.. తమకంటూ ప్రత్యేకమైన సంస్కృతి ఉన్న, అమాయకత్వమే ఆభరణమైన ప్రజలు, కొబ్బరి తోటల ఉత్థానం, దట్టమైన అడవులూ, ఆ అడవుల్లో పుట్టి చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన శ్రీకాకుళ ఉద్యమం.. ఇలా ఎవరి శక్తి, ఆసక్తి మేరకు వాళ్ళు ఊహించుకోవచ్చు. మరి, అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకి కొంత వరకూ సమాధానం చెబుతుంది అట్టాడ అప్పల నాయుడి పదహారు కథల సంకలనం 'క్షతగాత్ర గానం.'

ఈ కథలన్నింటి నేపధ్యం ఉత్తరాంధ్ర గ్రామాలు. పక్కనే నదులున్నా తాగడానికీ సాగుకీ నీరందని దుస్థితి, ప్రాజెక్టులు వస్తాయన్న ఆశ తో పాటు వాటి వల్ల కలిగే నష్టాల గురించిన భయం, అవిద్య అమాయకత్వాల కారణంగా నిత్యం మోసపోతూ, పీడనకు గురవుతూ ఉండే ప్రజలు.. ఇవీ కథా వస్తువులు. నాయకుల రాజకీయాలు, దివాణాల కౌటిల్యాల మధ్య నలిగిపోతున్న సామాన్యుడే అప్పల నాయుడి కథల్లో కథా నాయకుడు.

పట్నవాసపు జీవితం లో ఖర్చులు పెరిగి, సంపాదన చాలక పల్లెలో ఉన్న భూమిని అమ్ముకుందామని వచ్చిన కోటేశ్వర రావుకి తన ఊళ్ళో ఎదురైన అనుభవాలే సంకలనం లో మొదటి కథ 'క్షతగాత్ర గానం.' పల్లె లో తను గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకున్న కోటేశ్వర రావుకి తమ జీవితాల్లో మార్పు ఎక్కడినుంచి వచ్చిందో అర్ధం కాదు. తండ్రి, ఇతర బంధువులు ఏ గ్రామ రాజకీయాలకి బలైపోయారో అదే నాయకుల వారసులతో సంధి చేసుకోవాల్సిన పరిస్థితి తో అతను ఏ నిర్ణయం తీసుకున్నాడన్నది ముగింపు.

పల్లె పట్నంగా మారే క్రమం లో ఉనికిని కోల్పోయిన 'ఓ తోట కథ' సంకలనం లో రెండో కథ. దగా పడ్డ తోట తన కథ తానే చెప్పుకుంటుంది. ఒకప్పుడు పళ్ళ తోటలతో విలసిల్లిన తాను రక్తపుటేరులని ఎందుకు చూడాల్సి వచ్చిందో వివరిస్తుంది. ఒకప్పటి ఆ తోట యజమాని కొడుకు ఇప్పుడు అదే స్థలం లో వెలిసిన వ్యాపార సంస్థలో కూలి చేయడాన్ని జీర్ణించుకోలేక పోతుంది ఆ తోట. మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా ఎలా మారాయో, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టగల శక్తి దేనికి ఉందో చెబుతుంది 'బంధాలూ-అనుబంధాలూ' కథ.

ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకి ఎందుకు ఉపయోగ పడలేకపోతున్నాయో 'ఎంపిక' కథ చెబితే, నిస్వార్ధంగా ప్రాణ త్యాగం చేయగల నక్సలైట్లు రచయిత అయిన ఒక పోలీసు అధికారిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించారన్నది 'వాళ్ళు' కథ చెబుతుంది. సర్వస్వం కోల్పోయినా ఆత్మవిశాసం సడలని 'బుధడు' మారుతున్న పల్లె ముఖచిత్రాన్ని చూపే 'ప్రయాణం' బతికి చెడిన చంద్రప్ప కి కనిపించే ఏకైక 'ప్రత్యామ్నాయం' కథలని కేవలం చదివి పక్కన పెట్టలేం.

స్త్రీల సమస్యలని చర్చించిన కథలు 'నేను నేనే' 'యానగాలి' 'సూతకం కబురు.' ఆర్ధిక స్వాతంత్రం సాధించినప్పటికీ స్త్రీ తనకి తెలియకుండానే పురుషుడిమీద ఎలా ఆధార పడుతోందో చెబుతుంది 'నేను నేనే.' ఒక పక్కనుంచి రాజకీయ నాయకులు, మరో పక్క నుంచి భర్త చేసే ఒత్తిడులని తట్టుకుని స్వయం నిర్ణయాలు చేసి అమలు పరిచే అధికారిని సరళమ్మ కథ 'యానగాలి.' ఇక నేనీ సంకలనం చదవడానికి కారణమైన కథ 'సూతకం కబురు.'

రెండేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమయిన ఈ కథ ఓ పల్లెటూరి గృహిణి స్వగతం. వ్యవసాయ పనులు లేక భర్త కూలి వెతుక్కుంటూ పరాయి దేశం వెళ్తే ఊళ్ళో కూలి చేసి పిల్లల్ని పోషిస్తోన్న నిరక్షరాస్యురాలైన మహిళకి గ్రామ రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకూ కొట్టిన పిండి. "మన గ్రేమమూ ఆదర్సి గ్రేమమట తెలుసా? రోజుకి పది, పదిహేను వేలు రూపాయల బ్రేందీ, సారా చెల్లిన గ్రేమం మండలం మొత్తం మీద మనదేనట. పొగులూ రేత్రీ పోలిసుబాబులు తిరుగాడే గ్రేమం ఇలాటిదింకొకటి లేదట," అని స్నేహితురాలు నీలవేణికి చెబుతుందామె. 'సూతకం కబురు' తెలిశాక ఆమె ఏం చేసిందన్నది ముగింపు.

వలసపోయిన రైతు కథ చెబుతుంది 'బతికి చెడిన దేశం' కథ. రాజకీయాలని చర్చించే కథలు 'పరిశి నాయుడి వొంశం' 'రెండూ ప్రశ్నలే' 'వల్మీకం' 'షా.' వామపక్ష ఉద్యమం పై, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ పై రచయితకి ఉన్న ప్రేమ ప్రతి కథలోనూ ప్రతిఫలిస్తుంది. అధికారులు, రాజకీయనాయకులు తమ ప్రైవేటు సంభాషణల్లో 'ఎర్ర జెండా' ని మెచ్చుకోవడం కనిపిస్తుంది చాలా కథల్లో. మొత్తం మీద కథలన్నీ ఉత్తరాంధ్ర జీవితంలోని ఒక పార్శ్వాన్ని మాత్రమే స్ప్రుశించాయని అనిపించక మానదు, పుస్తకం పూర్తి చేశాక. విశాలాంధ్ర ప్రచురించిన ఈ సంకలనం వెల రూ.100. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.

శనివారం, అక్టోబర్ 24, 2009

గమ్యం

"ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది.." ఈ సత్యాన్ని తెలుసుకోడం కోసం, తను ప్రేమించిన జానకిని కలుసుకోడం కోసం కోటీశ్వరుడి గారాల కొడుకు అభిరాం ఎన్నో చోట్ల తిరిగాడు. ఏసీ కారులోకాదు, ఓ ఖరీదైన మోటార్ బైక్ మీద.. ఈ ప్రయాణం లో అతనికి తారస పడిన వ్యక్తులు, ఎదురైన అనుభవాల సమాహారమే 'గమ్యం' తెలుగు సినిమా.

'ది మోటార్ సైకిల్ డైరీస్' అన్న స్పానిష్ చిత్రం స్ఫూర్తితో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 2008 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు తో సహా నాలుగు కేటగిరీల్లో 'నంది' అవార్డులని గెలుచుకుంది. 'గాలి శీను' పాత్ర పోషించిన అల్లరి నరేష్ కి ఉత్తమ సహాయ నటుడిగాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ఉత్తమ గీత రచయితగానూ అవార్డులు వచ్చాయి.

హైవే మీద ఒక టీ కొట్టు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో టీకొట్టు నడుపుకునే స్త్రీ కారు కింద పడి మరణించడం తో సినిమా ప్రారంభమవుతుంది. కారు నడిపిన కుర్రాడు గాయాలతో ఆస్పత్రి పాలవుతాడు. ఆ కుర్రాడు నగరంలోని మల్టి మిలియనీర్ కొడుకు అభిరాం అని టీవీ చానళ్ళకి తెలియడం తో టైటిల్స్ మొదలవుతాయి. అది మొదలు సినిమా ఆసాంతమూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. పాటలు, కామెడీ సైతం కథలో భాగంగా ఇమిడిపోయాయి.

ఆక్సిడెంట్ తాలూకు దెబ్బలు పూర్తిగా మానకుండానే 'జానకి' ని వెతుక్కుంటూ మోటార్ సైకిల్ మీద ఒక్కడూ బయలుదేరతాడు అభిరాం. మోటార్ సైకిల్ మీదే ఎందుకు? ఎందుకంటే కారు అద్దం లోనుంచి ప్రదేశాలను మాత్రమే చూడగలమనీ, ప్రపంచాన్ని చూడాలంటే మోటార్ సైకిల్ మీద తిరగాలనీ జానకి చెప్పింది కాబట్టి. జానకి ఒక మెడికో. ఎవరూ లేని అనాధ కావడం తో ఆమెకి అనాధలన్నా, అభాగ్యులన్నా ప్రేమ. పేద వాళ్లకి సాయం చేయడం కోసమే మెడిసిన్ చదివి, తన సంపాదనలో సింహ భాగాన్ని చారిటీ కోసం ఉపయోగిస్తూ ఉంటుంది.

అలాంటి జానకిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు అభిరాం. నెల్లాళ్ళలో ఆమె చేత 'ఐలవ్యూ' చెప్పించు కుంటానని స్నేహితుడితో బెట్ కడతాడు కూడా. జానకి తన డబ్బుని లెక్క చేయకపోవడం ఆశ్చర్య పరుస్తుంది అభిరాం ని. అతని ఇగో ని దెబ్బ కొడుతుంది కూడా. జానకికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తాడు. ఆమెతో స్నేహం చేసి, ప్రేమిస్తున్నానని చెబుతాడు. అదిగో అప్పుడంటుంది జానకి "ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది.." మాటని తిరిగి చెబితే ప్రేమ విషయం ఆలోచిస్తానని.

అభిరాం జానకిని ఇష్టపడతాడు కానీ ఆమె జీవితాన్ని ప్రేమించలేదు.. అతనికి పేదలంటే చిరాకు. మనుషులు ఎందుకంత డర్టీగా ఉంటారో అర్ధం కాదు. జానకి అభిరాం కి తన ప్రేమని ప్రకటిద్దామనుకున్న సమయంలోనే అతని బెట్ విషయం తెలుస్తుంది. ఆమె అతన్నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. జానకిని వెతుక్కుంటూ బయలుదేరిన అభిరాం కి మోటార్ సైకిల్ దొంగ గాలి శీను పరిచయమవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి యాడంకి, గుంటూరు, నర్సీపట్నం తిరుగుతారు, జానకిని వెతుక్కుంటూ.

ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు అభిరాం. ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం పాలవుతోందో, ఎన్నికలు ఎలా ఐదేళ్ళ కోసారి జరిగే తంతుగా మారిపోయాయో, కరువు ప్రాంతాల్లో గన్ కల్చర్, గ్రామాల్లో కనీస సౌకర్యాల లేమి, పొట్టకూటి కోసం పడుపు వృత్తికి సిద్ధ పడ్డ ఆడపిల్లలు, వాళ్లకి ఎదురయ్యే సమస్యలు, నక్సలైట్ ఉద్యమంలో చీలికలు... ఇలా ఎన్నో విషయాలు. తన చేతుల మీదుగా ఒక డెలివరీ చేస్తాడు, గాలి శీను తన చేతుల్లో మరణించడమూ చూస్తాడు.. ఒకలాంటి స్థిత ప్రజ్ఞత సాధిస్తాడు.

అభిరాం గా శర్వానంద్, జానకి గా కమలిని ముఖర్జీ, గాలి శీనుగా అల్లరి నరేష్ నటించిన ఈ సినిమాలో ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులనూ, ప్రభుత్వం నుంచి అవార్డునూ గెలుచుకున్నాడు అల్లరి నరేష్. ఈ సీరియస్ సినిమాని సామాన్య ప్రేక్షకుడికి చేరువ చేసింది గాలి శీను పాత్ర. నవ్విస్తూనే ఆలోచింపజేసే డైలాగులున్నాయి ఈ పాత్రకి. ఆనంద్, గోదావరి తర్వాత కమలిని కి దొరికిన మరో బలమైన పాత్ర జానకి, ఆమె పూర్తిగా న్యాయం చేసింది.

నిజానికి ఇది దర్శకుడి సినిమా. క్రిష్ స్వయంగా స్క్రిప్ట్ సమకూర్చుకున్న ఈ సినిమాకి అతి పెద్ద బలం స్క్రీన్ ప్లే. నర్సీపట్నం లో ఉన్న అభిరాం ని అతని తండ్రి కలుసుకుని అభినందిచడం మినహా అనవసరమైన సన్నివేశామేదీ లేదీ సినిమాలో. కే. శ్రావణ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, చివర్లో వచ్చే నక్సలైట్ సీన్ నిడివి కొంచం తగ్గించొచ్చు అనిపిస్తుంది. సీనియర్ నటులు గిరిబాబు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్ చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సీరియస్ విషయాలని చర్చించి నప్పటికీ సినిమా అంతా హాస్యరస భరితంగానే సాగుతుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం గంధం నాగరాజు రాసిన సంభాషణలు. సూటిగా, స్పష్టంగా, వ్యంగ్యంగా, హాస్యరస భరితంగా... మొత్తంగా సినిమా విజయంలో సంభాషనలది ప్రత్యేక పాత్ర. అలాగే యి.ఎస్ మూర్తి సంగీతం. సుజాత పాడిన 'సమయమా..' నాకు చాలా ఇష్టమైన పాట. థియేటర్ లో నేనీ సినిమాని మూడు సార్లు చూశానని తెలిసిన ఫ్రెండ్ ఒకరు డీవీడీ మార్కెట్లోకి రాగానే నాకు ప్రెజెంట్ చేశారు. అప్పటినుంచీ చాలా సార్లు చూశాను.

"హీరో హీరోయిన్లని చూస్తుంటే వరహీనం అనిపించడం లేదూ.." అని మిత్రులొకరు అన్నారు కానీ నాకలా అనిపించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని కేటగిరీల్లో అవార్డులు రానప్పటికీ, ఈ సినిమాకి నంది అవార్డులు రావడం నాకు సంతోషాన్ని కలిగించింది. 'గమ్యం' బృందానికి అభినందనలు. క్రిష్ తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్ళలో నేనూ ఒకడిని.

గురువారం, అక్టోబర్ 22, 2009

బ్లాగులు-పరిమళం

లేతాకుపచ్చ రంగు చిగురుటాకులు.. వాటి మధ్యలో తెల్లని చిన్న చిన్న పువ్వులు.. కంటికి ఆహ్లాదకరమైన దృశ్యం. మరి ఇన్ని పూలున్నా పరిమళం రాదేమి? ప్రశ్న అవసరం లేదు.. కంప్యూటర్ తెర మీద ఆ పూల మధ్య ఒదిగిపోయిన అక్షరాలు పరిమళాలను వెదజల్లుతాయి. కవితలు, కథలు, జ్ఞాపకాలు, స్పందనలు, ప్రతి స్పందనలు... ఎన్నెన్నో భావాలు.. మరెన్నో పరిమళాలు.. వీటిని పంచే అచ్చ తెలుగు బ్లాగు పేరు 'పరిమళం.'

"తెలుగు దేశంలో తెలుగు తెలిసిన, తెలుగు మాత్రమే తెలిసిన ఒక సామాన్య గృహిణిని పెద్దగా చదువుకోలేదు, స్కూల్ డేస్ లోనే చదువుకు పుల్ స్టాప్ పెట్టాల్సివచ్చింది కొంచెం కట్టుబాట్లున్న మెట్టినిల్లు ప్రపంచాన్ని చూసింది యండమూరి వీరేంధ్రనాథ్ గారి రచనల్లో ........ ఇక ఇష్టాలు ...... కృష్ణుడు ...వెన్నెలా ... గోదావరి...... పువ్వులూ, పసిపాపల నవ్వులూ వర్షపు చినుకులు, సీతాకోక చిలుకలూ ఇలా..... చాలా.." 'గోదావరి' దగ్గర ఒక్క క్షణం ఆగాను, మొదటిసారి ఈ బ్లాగు చూసినప్పుడు.

అప్పుడప్పుడే బ్లాగులు చూడడం కొంచం అలవాటై, ప్రొఫైల్ ని కూడా గమనిస్తున్న సమయంలో, నేను చూసిన మెజారిటీ బ్లాగుల్లో హైదరాబాద్, గుంటూరు, అమెరికా అని కనిపిస్తుండగా (బ్లాగ్మిత్రులు తప్పట్టుకోకూడదు, ఉన్నమాట చెబుతున్నా) ఈ బ్లాగులో 'గోదావరి' కనిపించేసరికి 'ఓ గోదావరి ఆడపడుచు కూడా బ్లాగు రాస్తున్నారు కదా' అని కూసింత గర్వ పడ్డా. ఈ బ్లాగులో నేను చదివిన మొదటి టపాని ఎప్పటికీ మర్చిపోలేను. నేను బ్లాగు మొదలు పెట్టినప్పుడూ, ఇప్పటికీ అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చూసినప్పుడు ఆ టపా గుర్తొస్తూనే ఉంటుంది నాకు.

ఇంతకీ ఆ టపా పేరు 'అంతర్మధనం.' నేనంటూ బ్లాగు మొదలు పెడితే తప్పకుండా కామెంట్ మోడరేషన్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నది అప్పుడే. ఇక 'మా ఊరి సంబరాలు' టపా చదివినప్పుడైతే నాకూ ఓ బ్లాగుంటే మాఊరి విశేషాలు కూడా రాయొచ్చు కదా అనిపించింది. అలా బ్లాగర్ పరిమళం గారు నన్ను ప్రభావితం చేశారు. అప్పట్లో ఒకటికి నాలుగు సార్లు చదివిన టపా 'పదిలంగా అల్లుకున్నా..' టపాలు చదవడం ద్వారా కృష్ణశాస్త్రి, తిలక్ ల కవిత్వమంటే ఈ బ్లాగర్ కి ఎంత ఇష్టమో అర్ధమయ్యింది. సరిగ్గా అప్పుడే 'ఉత్తరాలు' టపా ద్వారా జ్ఞాపకాల తుట్టెను కదిపారు.

కొన్ని కొన్ని టపాలు చదువుతుంటే పరిమళం గారు తన గురించి రాసుకున్న "పెద్దగా చదువుకోలేదు" వాక్యం పెద్ద అబద్ధం అనిపించక మానదు. కానీ ఆవిడ తన జీవితంలో ముఖ్యమైన మలుపుని కళ్ళకి కడుతూ రాసిన 'అనుకోకుండా ఒకరోజు' సీరియల్ చదివాక నమ్మక తప్పదు. 'మేక నాది' లాంటి సరదా టపా రాసినా, 'రియల్ హీరోస్' లాంటి సీరియస్ టపా రాసినా ఆసాంతమూ చదివించడం పరిమళం గారి శైలి. 'మన్నించు నేస్తం' 'విరజాజిపూలు' లాంటి టపాలు కదిలిస్తాయి. 'నాన్న చెప్పిన కథలు' ఆలోచింపజేస్తే, 'పిట్ట కథలు' నవ్విస్తాయి.

అన్నట్టు ఈ బ్లాగు పాఠకులు కొన్ని రహస్యాలని కూడా కాపాడాల్సి ఉంటుంది. 'గోరింట పూసింది' టపాలో అలాంటి రహస్యం ఒకటి ఉంది. గత సంవత్సరం నవంబరు తొమ్మిదిన 'నీ మౌనం' టపా తో బ్లాగు ప్రారంభించిన పరిమళం ఈ మధ్యనే తన వందో టపాతో 'ఆనంద దీపావళి' జరుపుకున్నారు. టపాలకి మాత్రమే కాదు, వాటికి జతగా కూర్చే ఫోటోలకీ వంక వెతకలేము. అప్పుడప్పుడూ చెప్పా పెట్టకుండా మిస్సయిపోతూ ఉంటారన్నది ఈ బ్లాగరు మీద ఉన్న పెద్ద ఫిర్యాదు. 'పరిమళం' బ్లాగు నిత్య పరిమళాలని వెదజల్లాలని మనసారా కోరుకుంటూ...

బుధవారం, అక్టోబర్ 21, 2009

చక్కనోడు

ఒక 'పేట నాయకుడు' స్థాయి వ్యక్తి మరణించాడు. అతని ఇంటి ముందు టెంటు వెలిసింది. రోడ్డుకి ఇరుపక్కలా ప్లాస్టిక్ కుర్చీలు వేశారు. వీధిలో అతని ఫోటో, దానికి పెద్ద పూల దండ, ఒక దీపం. 'కార్యకర్తలు' చొక్కాలకి నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు. ఫ్లెక్సీ బ్యానర్ల కోసం ఫోన్లు వెళ్తున్నాయి. చనిపోయిన వ్యక్తి బంధువులు, స్నేహితులూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వాతావరణం విషాద భరితంగానే ఉంది.

ఓ నలుగురు కుర్రాళ్ళు త్వరత్వరగా మైకు బిగించారు. నేను 'పార్దా యత్ ప్రతిబోధితా..' అంటూ మొదలయ్యే ఘంటసాల భగవద్గీత వినడానికి సిద్ధపడిపోయాను. ఇంతలో పాట మొదలయ్యింది.. "చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు.. ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు.." అసందర్భమే అయినా అప్రయత్నంగా నవ్వొచ్చేసింది. అవును మరి.. ఒక రోజా, రెండు రోజులా.. వరుసగా వారం పది రోజులు.. ఏ చానల్ తిప్పినా ఇదే పాట.. ఇలాంటివే మరికొన్ని పాటలు.

ఆ పాట, పాటతో పాటు వచ్చే విజువల్స్ మళ్ళీ కళ్ళ ముందుకి వచ్చాయి. ఆ చక్కనోడు, ఈ చక్కనోడు ఒకే ఫ్రేములో కళ్ళముందు కనబడ్డారు. బహుశా అందుకేనేమో నవ్వాగలేదు. ఆపద్ధర్మంగా సెల్ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నా. "పాడె కట్టడానికే స్నేహమన్నది.. కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది.." పాట వినబడుతూనే ఉంది. రెండు నెలల క్రితం ఈ పాటల గురించి జరిగిన చర్చలన్నీ గుర్తొచ్చాయి.

"మా వాడు అర్ధరాత్రి బాత్రూం కి లేచి 'నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ' అని పాడుతుంటే ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.. కొన్నాళ్ళు న్యూస్ చానల్స్ చూడకూడదు డిసైడయ్యాను" నాకు తెలిసిన ఒకతను చెప్పాడు అప్పట్లో. 'కార్యకర్తలు' గుండాగి మరణించడానికి ఈ పాటలు, దృశ్యాలే కారణమని నిందించిన వాళ్ళూ ఉన్నారు. మొత్తానికి ఒక నాయకుడికి మరణం తర్వాత 'మహానాయకుడు' ఇమేజ్ రావడం లో ఈ పాటలూ కొంత పాత్ర పోషించాయనడం అతిశయోక్తి కాదేమో.

నా ఆలోచనల్లో నేనుండగానే 'పేట నాయకుడి' మరణాన్ని కవర్ చేయడానికి లోకల్ చానళ్ళ ప్రతినిధులు కెమెరాలతో వచ్చారు. అప్పటి వరకూ దూరంగా కూర్చున్న ఇద్దరు నడి వయసు మహిళలు ఒక్క ఉదుటన నాయకుడి ఫోటో దగ్గర చేరి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. కెమెరాలు రికార్డు చేసేస్తున్నాయి. చోటా మోటా నేతలు టీవీ ముఖంగా సంతాపం తెలపడానికి పోటీ పడుతూ టీవీ వాళ్ళని మొహమాట పెడుతున్నారు.

మైకులో మాత్రం 'అప్పటి' పాటలన్నీ మారుమోగుతున్నాయి. ఒకందుకు చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సందర్భాలలో భగవద్గీత వినీ వినీ ఒక్కోసారి గుడి మీద మైకు నుంచి భగవద్గీత వినిపించినా 'ఎవరు పోయారో?' అన్న ఆలోచన వచ్చేస్తోంది. ఇప్పుడింక ఈ పాటల పుణ్యమా అని 'ఇలాంటి' సందర్భాలలో ఘంటసాల గొంతు నుంచి శ్రావ్యంగా వినిపించే భగవద్గీత వినక్కర్లేదు కదా.. అందుకు సంతోషం.

మంగళవారం, అక్టోబర్ 20, 2009

నాయికలు-వసుంధర

వసుంధరకి పేదరికమంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలీదు. ఎందుకంటే ఆమె డబ్బులో పుట్టి పెరిగింది. ఓ పల్లెటూరి భూస్వామ్య కుటుంబంలో చిన్న కోడలు అయ్యింది. కానీ వసుంధర ఆలోచనలెప్పుడూ పేద వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం కేవలం ఆమె ఆర్ధిక శాస్త్రం లో ఎమ్మే చదవడం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ ఆమెకి సామాజిక స్పృహ కొంచం ఎక్కువే. ఇరవై మూడేళ్ళ క్రితం సి.సుజాత రాసిన 'సుప్త భుజంగాలు' నవలలో ప్రధాన పాత్ర వసుంధర.

కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఇష్టంగా చదువుకుని, పేద సాదల పట్ల లోపల్లోపల సానుభూతిని పెంచుకుని కూడా తన కళ్ళెదురుగానే వాళ్లకి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి మాట్లాడ లేని నిస్సహాయ స్థితి వసుంధరది. తన ఇద్దరు కొడుకులనీ అడ్డుపెట్టుకుని ఇంటి పెత్తనం చేసే అత్తగారు వీర రాఘవమ్మ, వ్యవసాయ పనుల్లో తలమునకలుగా ఉండే బావ రంగశాయి, వ్యాపారం లో ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైము దొరకని భర్త రవి, పెద్దగా చదువుకోని తోడికోడలు యశోద, పట్నంలో చదువుకునే పిల్లలు.. ఇదే వసుంధర చుట్టూ ఉన్న ప్రపంచం.

కేవలం వీళ్ళు మాత్రమే కాదు.. పొలంలో పనిచేసే నారాయణ, ఇంట్లో పని చేసే అతని భార్య వెంకాయి, కూతురు రవణి, ఊళ్ళో కాన్వెంటు నడుపుతున్న అవివాహిత లలిత, జీవితాన్ని, సంపాదనలో సింహ భాగాన్నీ కమ్యూనిస్టు ఉద్యమానికే ధారపోసిన స్కూలు మాస్టారు కూతురు అన్నపూర్ణా.. వీళ్ళంతా కూడా వసుంధర ని ఆలోచింపజేస్తూ ఉంటారు. రోజంతా పనిచేసి సాయంత్రం ఇచ్చిన కూలి పుచ్చుకుని, ఆపై యజమానుల చేత తిట్లు తినే కూలీలను చూసి కాపురానికి వచ్చిన కొత్తలో చలించి పోతుంది వసుంధర. కూలీలకి చదువు చెప్పి వాళ్ళ ఆలోచనల్లో మార్పు తేవాలని వృధా ప్రయత్నం చేస్తుంది.

పుస్తకాలలో చదువుకున్న పెట్టుబడిదారీ విధానం ఆచరణలో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆశ్చర్య పోతుంది వసుంధర. కాలేజీ రోజుల్లో తను కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుతుంటే స్నేహితులు "నువ్వలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందే" అని ఎందుకు అన్నారో అర్ధమవుతుంది ఆమెకి. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోకూడదన్నది ఆమె ఒకప్పటి ఆదర్శం. "ఇది ఆస్తిలో నీ వాటా.. అన్నయ్యతో పాటు నీకూ వాటా వద్దూ?" అని ఒప్పిస్తుంది తల్లి. వ్యాపారంలో వచ్చే లాభాల కన్నా మరేదీ ఆనందాన్నివ్వదు రవికి. పుస్తకాల్లో సిద్ధాంతాలకీ, జరుగుతున్నవాస్తవాలకీ బేరీజు కుదరక ఆలోచనల్లో పడుతుంది వసుంధర.

ఇమడలేని వాతావరణంలో ఉండడం కన్నా రవి నుంచి విడిపోతే? అన్న ఆలోచన వస్తుంది వసుంధరకి. తనకంటూ చదువు, ఆస్తి ఉన్నాయి కాబట్టి జీవనానికి ఇబ్బంది ఉండదు. కానీ అదే సమయంలో అవివాహిత లలిత, డ్రామా ఆర్టిస్టు పద్మావతిల అనుభవాలు ఆమెలో రెండో ఆలోచన కలిగిస్తాయి. భర్త వల్ల లభించే 'సోషల్ సెక్యూరిటీ' గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. భర్త అండ లేని స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు ఆమెని పునరాలోచించుకునేలా చేస్తాయి.

ఎన్నో చేయాలని ఉన్నా ఏమీ చేయలేక పోతున్నానని వసుంధర సంఘర్షణ అనుభవించే సమయంలోనే ఆ ఊరి కూలి జనంలో చిన్నపాటి విప్లవం మొదలవుతుంది. భూస్వాములతో వచ్చిన తగాదా వల్ల కూలీలెవరూ ఊళ్ళో పని చేయరాదని నిర్ణయించుకుని, పొరుగూళ్ళలో పనులు వెతుక్కుంటారు. అంతేకాదు, పొరుగూరి కూలీలెవరినీ ఊళ్ళో అడుగు పెట్టనివ్వరు. ఈ పరిణామం చాలా ఉత్సాహాన్నిస్తుంది వసుంధరకి. బహుశా ఆ స్పూర్తితోనే కావొచ్చు, పల్లెటూరి ఉమ్మడి కుటుంబపు సంప్రదాయానికి విరుద్ధంగా అత్తగారినీ, బావగారినీ ఎదిరించి పేదల పక్షాన మాట్లాడుతుంది వసుంధర.

కథా రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్న సి. సుజాత తొలి రచన 'సుప్త భుజంగాలు' 1986 లో ప్రచురితమయ్యింది. వర్గ పోరాటాన్ని చిత్రించిన ఈ నవలలో రచయిత్రి పేదల కష్టాలనీ, భూస్వాముల దుర్మార్గాలనూ వివరించారు. పేదలకి సాయం చేయాలని భూస్వాములకి ఉన్నా, ఏకారణాల వల్ల వాళ్ళు ఆ పని చేయలేరో వివరించే ప్రయత్నం చేశారు. ఆసక్తి కరమైన కథనం ఈ నవల ప్రత్యేకత. ప్రస్తుతం ఈ నవల మార్కెట్లో అందుబాటులో లేదు.

శుక్రవారం, అక్టోబర్ 16, 2009

తిప్పుడు పొట్లం

అప్పుడు నాకు తొమ్మిది/పదేళ్ళు. ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా దీపావళి హడావిడి మొదలయ్యింది. అప్పటి పరిస్థితి ఏమిటంటే మతాబులు, కాకర పువ్వొత్తులు కాల్చడం మరీ చిన్నతనం, టపాకాయలు కాల్చడం మరీ పెద్దతనం. ఏం చెయ్యాలి మరి? అసలే దీపావళి అంటే నెల్లాళ్ళ ముందు నుంచే మతాబా గొట్టాలు చేసే పని మొదలైపోతుంది ఇంట్లో. మరో పక్క టపాకాయల హడావిడి. మతాబా మందూ, సూరే కారం, మన్నూ మశానం.. మొత్తం కలిపి చిత్ర విచిత్రమైన వాసనలు.

నేనంత ఉత్సాహంగా ఉండకపోడం తాతయ్య దృష్టిలో పడింది. ఒళ్లో కూర్చో పెట్టుకుని ఆ కబురూ, ఈ కబురూ చెప్పి నా బాధేమిటో కూపీ లాగారు. "ఓస్.. ఇంతేనా.. నీకీ సంవత్సరం తిప్పుడు పొట్లం చేయిస్తాను కదా.." నాకేమో మిఠాయి పొట్లం తెలుసు కానీ తిప్పుడు పొట్లం ఏమిటో తెలీదు. కనీసం ఆ పేరు కూడా వినలేదు. మా ఊళ్ళో నా ఈడు పిల్లలెవరూ అప్పటి వరకూ ఎవరూ తిప్పుడు పొట్లం కాల్చలేదని తెలిసి బోల్డంత గర్వ పడ్డాను. ఇక అది మొదలు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా అని ఎదురు చూడడమే..

తాతయ్య చిన్నప్పుడు ఇంట్లో పిల్లలంతా తిప్పుడు పొట్లం తిప్పుకునే వాళ్లుట.. కావాల్సిన సరంజామా అంతా వాళ్ళే సమకూర్చుకునే వాళ్లుట.. "ఏమేం కావాలో చెబుతాను.. తెచ్చుకుని ఒక చోట పెట్టుకో" అని తాతయ్య చెప్పడం ఆలస్యం, మరుక్షణం నేను వేట మొదలు పెట్టాను. తాతయ్య అభయ హస్తం ఉంది కాబట్టి నాన్న భయం లేదు. ముందుగా డొక్క పొట్టు తెచ్చి ఎండబెట్టాలి. కొబ్బరి పీచుతో డొక్క తాళ్ళు పేనే లక్ష్మమ్మ గారి ఇంటి చుట్టూ నాలుగైదు ప్రదక్షిణాలు చేసి తడి తడిగా ఉన్న డొక్క పొట్టు సంపాదించా.

నెక్స్ట్ ఐటెం చితుకులు. అర్ధమయ్యేలా చెప్పాలంటే తాటికాయల గుత్తి లో కాయలు రాలిపోయాక మిగిలి ఉండే ఖాళీ గుత్తులన్న మాట. తాటి తోపు చుట్టూ తిరిగి ఎన్ని సంపాదించానంటే.. అవి చూసి అమ్మ బోల్డంత సంతోష పడింది.. తిప్పుడు పోట్లానికి పోను మిగిలిన వాటితో ఒక నెల్లాళ్ళ పాటు వేడి నీళ్ళు కాచుకోవచ్చని. తగుమాత్రం చితుకులని ఎండ బెట్టి, కాల్చి బొగ్గులు చేసి, ఆ బొగ్గులని మరీ మెత్తగా కాకుండా పొడి కొట్టి పక్కన పెట్టేసరికి నా శరీర చాయ కృష్ణ వర్ణానికి మారింది. అద్దం లో చూసుకుంటే నేను దొరికిన పిల్లాడినేమో అని నాకే అనుమానం వచ్చింది.

తిప్పుడు పొట్లం చేయడానికి కావాల్సిన మరో ముఖ్యమైన వస్తువు ఉప్పు. అదెలాగో ఇంట్లో పెద్ద జాడీ నిండా సమృద్ధిగా ఉంటుంది. "ఇదిగో.. రేప్పొద్దున్న మీరు ఏడాదికి కొన్న ఉప్పు అప్పుడే అయిపోయిందా అంటారు.. తాతా మనవళ్ళు వేరే ఉప్పు కొనుక్కోండి.. ఇంట్లోది ఇవ్వను" అని బామ్మ పేచీ పెట్టింది. అలాంటివి పట్టించుకుంటే తాతయ్య గొప్పదనం ఏముంది? పాత నేత చీర కనీసం సగం ముక్కైనా కావాలి.. బామ్మని అడుగుదాం అనుకున్నాను కానీ.. "నా దగ్గర ఉందిరా.." అని అమ్మ ఇచ్చేసింది. ఒక తాటాకు కావాలిట.. తాతయ్య నరసింహులు చేత తెప్పించారు.

తెల్లారితే దీపావళి.. అయినా ఇల్లలకగానే పండుగ కాదు కదా.. తిప్పుడు పొట్లం అలకడానికి పేడ, మట్టి కావాలనేసరికి, కొమ్ముల గేదె దగ్గరికి కొంచం భయం భయంగా వెళ్లి పేడ తెచ్చేశా. తిప్పుడు పొట్లం ఎలా ఉంటుందో, ఎలా కాల్చాలో నా ఊహకి అస్సలు అందడం లేదు.. తాతయ్యని అడిగినా "చేసి ఇస్తాను కదా.." అంటున్నారు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు. ఇంక నేను చేసేదేముంది? తాతయ్య తిప్పుడు పొట్లం ఎలా చేస్తారో చూడడం తప్ప.

ముందుగా చీర ముక్కని అడ్డంగా మడతలు వేసి నిలువుగా పరిచారా.. దానిమీద ఎండబెట్టిన డొక్క పొట్టు, చితుకుల పొడి, ఉప్పు అన్నీ కలిపి సమంగా పరిచారు, తాతయ్య నాన్న కలిసి. ఇప్పుడు చీర ముక్కని రిబ్బన్ చుట్టినట్టుగా చుట్టుకుంటూ వెళ్ళారు, డొక్క పొట్టూ అవీ ఒలికి పోకుండా.. మొత్తం చుట్టేశాక పురికొస తాడుతో గట్టిగా కట్టేశారు. అప్పుడు తాతయ్య అమ్మని కేకేసి ఆ మూట చుట్టూ రెండు సార్లు అలకమన్నారు.. "నాకు తెలుసండీ మావయ్య గారూ.. మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం" అని వినయంగా చెప్పింది అమ్మ. మొత్తానికి ఒక పేడముద్ద లా తయారైన ఆ వస్తువు ని చూడగానే సగం ఆసక్తి పోయింది నాకు.

"అప్పుడే అయిపోలేదురా.. ఇంకా బోల్డంత పని ఉంది.. దీన్ని బాగా ఎండ బెట్టు.." చెప్పారు తాతయ్య. వీధిలో మంచం వేసి మతాబాలు, చిచ్చు బుడ్లు, జువ్వలు వాటన్నింటితో పాటూ పొట్లాన్ని కూడా ఎండ బెట్టాను. "బాగుంది తిప్పుడు పొట్లం.. మిగిలిన వాటికి దిష్టి తగలకుండా.." తాతయ్య వినకుండా బామ్మ వెక్కిరించింది. దీపావళి రోజు మధ్యాహ్నానికి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయింది ఆ తిప్పుడు పొట్లం. సాయంత్రం అవుతుండగా నరసింహులు వచ్చాడు. ఎండిన తాటాకులో కమ్మ మాత్రం ఉంచి, ఆకుని విడగొట్టేశాడు. ఆ కమ్మని ఒక ఉట్టిలా తయారు చేసి అందులో పొట్లాన్ని పెట్టి కదలకుండా కట్టేశాడు.

అది మొదలు నేను దివిటీలు కొట్టేస్తాననడం.. బామ్మేమో కాసేపు ఆగమనడం.. దివిటీలు కొట్టాక కూడా తిప్పుడు పొట్లం కాల్చడానికి తాతయ్య ఒప్పుకోలేదు.. "చీకటి పడ్డాక అయితే బాగుంటుంది" అనడంతో ఇష్టం లేకపోయినా మతాబాలూ అవీ కాల్చాను కాసేపు. చీకటి పడ్డాక తిప్పుడు పొట్లం లో పైన నిప్పు వేసి, ఓ రెండు తిప్పులు తిప్పి చూపించి పొట్లాన్ని నా చేతికి ఇచ్చారు తాతయ్య. తాటి కమ్మ పట్టుకుని వడిసెల తిప్పినట్టు గిరగిరా తిప్పితే పొట్లం లోపల నిప్పు రాజుకుని ఉప్పు కళ్ళు ఠాప్ ఠాప్ మని పేలడం.. బొగ్గు పొడి, కొబ్బరి పొట్టూ కలిసి మెరుపుల్లా బయటకి రావడం. ఎంత స్పీడుగా తిప్పితే అన్ని మెరుపులు.

మొదట్లో చాలా ఉత్సాహం గా ఉంది కానీ, రాను రానూ చెయ్యి నొప్పెట్టడం మొదలెట్టింది.. మెరుపులు బయటికి రావడం మినహా ఏ ప్రత్యేకతా లేదు తిప్పుడు పొట్లంలో.. ఎంత సేపు తిప్పినా ఎప్పటికీ అవ్వడం లేదన్న విసుగు.. అక్కడికీ 'కాసేపు మీరు కూడా తిప్పండి.. ఎంత బాగుందో' అని ఇంట్లో వాళ్ళని ఊరించా.. అబ్బే.. వింటేనా.. ఇలా కాదని "మిగిలింది రేపు మిగులు దీపావళి కి తిప్పుతా తాతయ్యా.." అన్నాను.. అలా కుదరదుట.. ఒకసారి వెలిగిస్తే పూర్తవ్వాల్సిందేట..

చేతులు మార్చుకుంటూ, స్పీడు బాగా తగ్గించి తిప్పుతుంటే చూసి కాసేపటికి తాతయ్య జాలి పడ్డారు.. "ఇంక చాల్లేరా.. పక్కన పడేయ్.." అనడంతో ప్రాణం లేచొచ్చింది. "ఇంతోటి సంబరానికి నా ఉప్పు జాడీ ఖాళీ చేసేశావా నాయనా" అన్న బామ్మ మాటలు విన్నట్టు నటించా..

బ్లాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

గురువారం, అక్టోబర్ 15, 2009

అనగనగా ఒక చేప

ఇంటి ఎదురుగా పెద్ద చెరువు.. చెరువు లోకి దిగడానికి రాళ్ళతో కట్టిన మెట్లు. ఆ మెట్ల మీద కాసేపు కూర్చుంటే చాలు.. నీళ్ళలో అటూ ఇటూ చురుగ్గా తిరిగే చేప పిల్లలెన్నో కంట పడతాయి.. అన్నీ బహు చిన్నవి.. పట్టుకుందామని ప్రయత్నిస్తే వేళ్ళ సందుల్లోనుంచి జారిపోయేవి.. నల్లవి, తెల్లవీ, మెరిసే కళ్ళవీ.. కాళ్ళు చల్లని నీళ్ళలో పెట్టి కదలకుండా కూర్చుంటే తాకి గిలిగింతలు పెట్టేవి చేప పిల్లలు. చేపలకి సంబంధించిన తొలి జ్ఞాపకాలివి. ఇంట్లో ఎవరిమీదైనా అలిగితే వెళ్లి కూర్చునేది చెరువు గట్టు మీదే.. పరిక్షలు వస్తే పుస్తకం పట్టుకుని చదువుకుంటూ కూర్చునేదీ ఆ చెరువు ఒడ్డునే.. రెండు సందర్భాలలోనూ తోడుండేవి చేప పిల్లలే..

పొడవాటి కర్ర.. ఆ కర్రకి చిరవ ఒక పొడవాటి దారం.. ఆ దారానికి చివర ఒక చిన్న ఇనుప కొక్కెం.. గాలం అంటారు దాన్ని. పక్కనే ఒక కొబ్బరి చిప్ప నిండా నల్ల మట్టి. దగ్గరికి వెళ్లి చూస్తే కనిపిస్తాయి ఆ మట్టిలో మెదిలే వాన పాములు.. 'ఎర' అంటారు వాటిని. పిల్లలకీ, పనిలేని పెద్దలకీ చెరువు గట్టు పెద్ద కాలక్షేపం.. ఎర ని కొక్కానికి గుచ్చి గాలం పట్టుకుని కూర్చుంటే కాసేపటికి గాలం బరువుగా ఒంగేది.. ఒడుపుగా వెనక్కి లాగితే కొక్కెం చివర చిన్నదో పెద్దదో చేప పిల్ల.. కొరమీనో, మట్టగడసో మరొకటో.. చిక్కిన చేపకి ఆయుష్షు ఉంటే పట్టిన వాడికి నచ్చేది కాదు.. చెరువులోకి విసిరేసే వాడు.

ఎందుకో తెలీదు కానీ గాలానికి చిక్కిన చేప మళ్ళీ చెరువులోకి వెళ్లిపోతుంటే భలే సంతోషంగా ఉండేది. తాటాకు బుట్టలో పడ్డ చేపల మీద జాలేసేది. ఈ గాలాలు కాకుండా ఏడాదికి ఒకసారి చెర్లో వేట జరిగేది. ఎక్కడి నుంచి వచ్చేవారో ఒక పది పదిహేను మంది జాలర్లు వంటికి నూనె రాసుకుని వలలతో చెర్లో దిగిపోయే వాళ్ళు. అది మొదలు రెండు రోజుల పాటు చెరువు అక్షరాలా రణక్షేత్రం అయిపోయేది. వేట ముగిసిన మరో నాలుగైదు రోజుల వరకూ ఆ నీళ్ళు ఇంట్లో వాడకానికి పనికొచ్చేవి కాదు.. అంతలా కలిగిపోయేవి.

చేపలే కాదు, చెర్లో కలువపూలనూ దుంపలతో సహా ఊడ్చేసేవాళ్ళు జాలర్లు. వేట జరిగిన రెండు రోజులూ ఊరంతటికీ చెరువు గట్టు ఒక యాత్రా స్థలి.. ఒక సంత.. ఎక్కడెక్కడి జనం వచ్చేసే వాళ్ళు.. కొందరు వేటలో దొరికిన చేపలని చూసి తృప్తి పడితే మరికొందరు కొసరి కొసరి బేరం చేసి తృప్తి పడే వాళ్ళు. పొరుగూరి వాళ్ళే అయినా కొనే వాళ్ళెవరో, కొన్ని వాళ్ళెవరో ఇట్టే తెలిసిపోయేది జాలర్లకి. వీధి అరుగు మీదకి వచ్చినా రేడియో గదిలో కూర్చున్నా, చివరికి పెరట్లో ఉన్నా బేరసారాలు చెవిన పడుతూనే ఉండేవి..

వేట జరిగిన మర్నాడు మరో కోలాహలం. చేపలు కొనుక్కునే తాహతు లేని వాళ్ళు ఆ చుట్టు పక్కలే తచ్చాడే వాళ్ళు.. పొరపాటున తప్పించుకున్న చేపలు ఏవైనా దొరుకుతాయన్న ఆశ. ఒకరిద్దరికి అలాగే దొరికేవి. వేట ముగిశాక రెండు మూడు నెలల వరకూ గాలాలు కనిపించేవి కాదు చెరువు గట్టున. గాలం వేసినా వృధానే కదా.. వేసవి కి ముందు చేపల వేట సాగేది. వర్షాకాలానికి చెరువు మళ్ళీ కొత్త చేపలతో కళకళ లాడేది. ఇంట్లో కొత్త తగువులు, అలకలు.. బళ్ళో కొత్త క్లాసు.. కొత్త పుస్తకాలు.. చదువుకోడానికి చెరువు గట్టుకి వెళ్తే చెర్లో కొత్త నేస్తాలు.. వాళ్ళని వేటాడే గాలాలు, వలలు.. మళ్ళీ అనగనగా నుంచీ మొదలయ్యే కథ.. ('జలపుష్పాభిషేకం' చేస్తున్న మరువం ఉష గారికి అభినందనలతో..)

బుధవారం, అక్టోబర్ 14, 2009

పడమటి సంధ్యారాగం

ఉద్యోగం కోసం సొంత ఊరినీ, దేశాన్నీ వదిలి కుటుంబంతో సహా పరాయి దేశానికి వలస వెళ్ళిన తొలితరం భారతీయుడి కథే 'పడమటి సంధ్యారాగం' సినిమా. చిన్నప్పటి నుంచీ అలవాటైన పద్ధతులను, ఆచారాలనూ వదులుకోలేక, వెళ్ళిన దేశం తాలూకు సంప్రదాయాలను అలవాటు చేసుకోలేక ఓ మధ్య వయస్సు వ్యక్తి పడే ఆవేదనను తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా చిత్రీకరించారు దర్శక రచయిత జంధ్యాల. ప్రవాసాంధ్రుడు గుమ్మలూరి శాస్త్రి సినిమాని నిర్మించడమే కాక ప్రధాన పాత్రనూ రక్తి కట్టించారు.

సదాచార సంపన్నుడైన ఆదినారాయణ (గుమ్మలూరి శాస్త్రి) ఉద్యోగం కోసం అమెరికా బయలుదేరతాడు, తన భార్యనీ, టీనేజ్ కూతురు సంధ్య (విజయశాంతి) నీ తీసుకుని. ఆదినారాయణ తమ్ముడు రవి అన్నగారికోసం ఒక ఉద్యోగం చూస్తాడు. తనకి ఉన్న రెండు ఇళ్ళలో ఒకదాన్నీ కేటాయిస్తాడు. సంప్రదాయ బద్ధంగా పెరిగిన సంధ్య పెద్దగా చదువుకోలేదు. ఆ ఇంటికి ఎదురిళ్ళలో ఉండే అమెరికా కుర్రాడు క్రిస్ (టాం) నీగ్రో రోనాల్డ్ (ఇప్పటి ప్రముఖ డ్రమ్మర్ శివమణి) లకి సంధ్యతో స్నేహం కుదురుతుంది.

కూతురు అలా నల్లవాడితోనూ, తెల్లవాడితోనూ స్నేహం చేయడం ఇష్టం ఉండదు ఆదినారాయణకి. సంధ్య స్నేహాన్ని తల్లి అభ్యంతర పెట్టదు. ఒక శుభ ముహూర్తాన అబ్బాయిలిద్దరూ సంధ్యకి ప్రపోజ్ చేస్తారు. క్రిస్ కి 'ఎస్' చెబుతుంది సంధ్య. సరిగ్గా అప్పుడే అమెరికా లో స్థిర పడ్డ ఒక తెలుగు డాక్టరుతో సంధ్యకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు ఆదినారాయణ. పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి సాయంతో క్రిస్ ని కలుసుకుని దూరంగా పారిపోతుంది సంధ్య. కూతురి మతాంతర వివాహాన్ని అంగీకరించక తప్పదు ఆదినారాయణకి.

కథంతా ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో నడుస్తుంది. ఆదినారాయణ మరణ వార్త తెలిసి, నడివయసు లో ఉన్న సంధ్య, క్రిస్ తో కలిసి అంత్యక్రియలకోసం ఇండియా రావడం తో కథ మొదలవుతుంది. కొడుకులు లేని ఆదినారాయణకి అల్లుడు క్రిస్ అంతిమ సంస్కారం చేయడం, సినిమా ప్రారంభ సన్నివేశం. తన ఐదేళ్ళ వయసులోనే తాతయ్యతో పాటు ఇండియా కి వచ్చేసిన సంధ్య-క్రిస్ ల కూతురు అనిత, 'అంతిమ సంస్కారం చేసే అర్హత నీకేం ఉంది?' అని క్రిస్ ని కోపంగా ప్రశ్నించడంతో కూతురికి తన గతం చెబుతుంది సంధ్య.

కథ తాలూకు సీరియస్ నెస్ ని ఏమాత్రం చెడగొట్ట కుండా, సినిమాని ఆసాంతమూ హాస్యరస భరితంగా రూపు దిద్దడం లో జంధ్యాల ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యపాత్రల్లో నటించిన ప్రవాస భారతీయుల్లో కొందరు సరిగా నటించలేకపోయినా డైలాగుల్లో విరుపులు, మెరుపుల ద్వారా ఆ లోపాన్ని చాలా వరకు కవర్ చేశాడు దర్శకుడు. అమెరికా జీవితంలో కష్టసుఖాలు, ముఖ్యంగా కొత్తగా ఆ దేశం వెళ్ళే వాళ్లకి ఎదురయ్యే ఇబ్బందులని చిన్న చిన్న సన్నివేశాల ద్వారా నవ్విస్తూ చెప్పాడు.

ముగింపు సన్నివేశంలో 'మతం' గురించి విజయశాంతి ఆవేశంగా చెప్పే పొడవైన డైలాగు వినగానే 'సప్తపది' క్లైమాక్స్ లో వర్ణ వ్యవస్థ గురించి జే.వి. సోమయాజులు చెప్పిన డైలాగు గుర్తొస్తుంది. (ఆ సినిమాకి కూడా రచన జంధ్యాలే) విజయశాంతి మినహా ప్రముఖ నటులెవ్వరూ లేరు. ప్రారంభ, ముగింపు సన్నివేశాల్లో ఆహార్యంలో పెద్దరికం కుదరకపోయినా అమెరికా సన్నివేశాల్లో అమాయకత్వం కలబోసిన పాత్రలో విజయశాంతి మెప్పించింది. తర్వాత చెప్పుకోవాల్సింది గుమ్మలూరి శాస్త్రి గురించి. తిండిపోతు 'గణపతి' కామెడీ ట్రాక్ పూర్తిగా జంధ్యాల మార్కులో ఉంటుంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చడం, పాటలు పాడడంతో పాటు 'లైఫ్ ఈజ్ షాబీ' అనే తమాషా పాటను రాశారు కూడా.. కేవలం ఈ పాటలో మాత్రమే విజయశాంతి వెస్ట్రన్ వేర్ లో కనిపిస్తుంది. సంప్రదాయ సంగీతాన్నీ, వెస్టర్న్ మ్యూజిక్ ని కలబోసి నేపధ్య సంగీతాన్నీ అందించారు బాలు. నాలుగు పాటలూ చెప్పుకోదగ్గవే.. నాకు 'ముద్దుగారే యశోద.. ' పాట అంతే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా ఈ పాట చిత్రీకరణ. 'పిబరే రామరసం' కీర్తన ని కనీసం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజునైనా తలచుకొని వాళ్ళు అరుదు. ఇక 'ఈ తూరుపు..' పాటలో నాయికా నాయకులు పరుగులు పెడుతూనే ఉంటారు.

ఈ సినిమా వచ్చింది 1986 లో. కథ అప్పటికి ఇరవయ్యేళ్ళ క్రితం జరిగింది (అని విజయశాంతి చెబుతుంది) కథలో ప్రస్తావించిన అంశాలు, అంటే రెండు భిన్న సంస్కృతుల మధ్య ఘర్షణ, పుట్టిన దేశాన్నీ అక్కడి సంస్కృతినీ మర్చిపోలేక పోవడం, కొత్త చోట ఇమడలేక పోవడం వగైరా లన్నీ ఈ నాలుగు దశాబ్దాలలోనూ ఏమైనా మారాయా? అని సందేహం నాకు. భూగోళానికి అవతలి వైపున ఉన్న బ్లాగ్మిత్రులు మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసి తమ ప్రస్తుత అనుభవాలని జోడించి టపాలు రాస్తే బాగుంటుందేమో..

మంగళవారం, అక్టోబర్ 13, 2009

గోపీ అన్నయ్య

"నాన్నగారూ మీకోసం గోపాలరావు అన్నయ్య గారు వచ్చారు.." అమ్మ వాళ్ళ చిన్నప్పుడు తాతగారింట్లో ఈ మాట వినబడగానే యెంతో సహనవతి అయిన అమ్మమ్మకి కోపం వచ్చేసేది.. తాతగారికి వార్తని చెప్పిన వాళ్ళతో సహా ఇంటిళ్ళపాదికీ ముఖాలు మాడిపోయేవి.. ఇందుకు భిన్నంగా తాతగారి ముఖం మాత్రం వెలిగిపోయేది.. చేస్తున్న పని వదిలి వీధిగదిలోకి నడిచేవాళ్ళు. మళ్ళీ ఆయన ఇంట్లోకి ఎప్పుడు తిరిగొస్తారనేది ఇంట్లో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉండేది.

సదరు గోపాలరావు గారు అప్పటికి ఒకప్పుడు ఓ పిల్ల జమిందారు.. పరిస్థితులు తలకిందులు కావడం తో తాతగారి ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చేశారు. తన ఆస్తులకి సంబంధించి దాయాదులతో వ్యాజ్యాలు నడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. వారానికో, పదిరోజులకో ఒకసారి తాతగారి దగ్గరికి వచ్చి జరిగిపోయిన సంగతులన్నీ కలబోసుకోవడం ఆయన అలవాటు. వాళ్ళిద్దరికీ కబుర్లలో గంటలు నిమిషాల్లా గడిచిపోయేవి. ఎటొచ్చీ ఇంట్లో వాళ్లకి నిమిషాలు రోజుల్లా గడిచేవి.

గోపాలరావు గారు ఉదయాన్నే వచ్చారంటే మిట్ట మధ్యాహ్నం దాటాకే తిరిగి వెళ్ళేవాళ్ళు. ఆయన వెళ్ళాకా తాతగారు భోజనం చేస్తే, ఆ తర్వాత అమ్మమ్మ తినాలి. ఒకవేళ గోపాలరావు గారు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చారంటే ఊరు మాటు మణిగే వరకూ కబుర్లు సాగిపోతూనే ఉండేవి. ఆయన ఉన్నంతసేపూ కాఫీ టీలు వంటింట్లో నుంచి వీధి గదిలోకి కాలువలు కట్టి ప్రవహించాల్సిందే. ఏదైనా ప్రాణావసరం వచ్చి "ఓ మాటు ఇటు రండి" అని అమ్మమ్మ పిల్లల చేత కబురెట్టినా తాతగారు లోపలికి వెళ్ళేవారు కాదు.

ఎంతైనా గోపాలరావు గారు జమీందారు కాబట్టి ఆయన వచ్చారంటే ఇంట్లో పెద్ద పిల్లలతో సహా ఆడవాళ్ళంతా ఘోషా పాటించాల్సిందే.. ఆయన వీధిలో ఉన్నారంటే అందరూ పెరటి దోవన మసలాలి. ఇక ఆయన చెప్పే కబుర్లలో ఎక్కువ భాగం విమర్శలే.. అవి కూడా ఆయనకి వదిన వరుసయ్యే బంధువులావిడ మీదే.. "నాలుగు పుంజీలెంటుకలు లేవు.. నాగరం పెడతాది నానా... పట్టీలు నానా.. ఆ బోద కాళ్ళకి మువ్వల పట్టీలూ.." ఇలా సాగిపోయేది వరుస..

ఇవి కాకపొతే తన గత వైభవాన్ని తలుచుకుని మురుసుకునే వాళ్ళు.. తను గుర్రం మీదెక్కి ఊళ్ళో తిరుగుతుంటే ఊరి వాళ్ళంతా ఎలా భయపడేవాళ్ళో, వాళ్ళింటి పద్ధతులు అవీ ఎలా ఉండేవో కథలు కథలుగా చెప్పెవాలు. తాతగారు తక్కువ తిన్నారా? చివరి క్షణాల్లో ఉన్నవాళ్ళని కూడా తను ఎలా వైద్యం చేసి బతికించారో, తన వైద్యాన్ని ఎవరెవరు ఎలా మెచ్చుకున్నారో వర్ణించి వర్ణించి చెప్పేవాళ్ళు. పాపం ఇంట్లో వాళ్లకి ఇవన్నీ వినక తప్పని పరిస్థితి.. తప్పించుకునే మార్గం లేదు కదా..

గోపాల రావు గారి మిగిలిన ఆస్తిలో చాలా భాగం వ్యాజ్యాల నిమిత్తం ఖర్చయి పోవడం తో ఊళ్ళో ఆయనకి గౌరవం మరికొంచెం తగ్గింది.. ఆయన వస్తే పిల్లలు "నాన్నగారూ మీకోసం గోపీ అన్నయ్య వచ్చారు.." అనడం మొదలు పెట్టారు. కబుర్ల పరంపర అలాగే కొనసాగుతూ ఉండడంతో అమ్మమ్మకి సహనం నశించి పిల్లలమీద విసుక్కోడం మొదలు పెట్టింది.. "ఊరిఖే మా తాతలు నేతులు తాగారు అని తల్చుకుంటే ఉపయోగం ఏముందీ.. ఇప్పుడు నోట్లోకి ముద్ద వెళ్ళే మార్గం చూడాలి కానీ.." అంటూ.. వీధి గదిలో ఉన్న పెద్ద మనుషులిద్దరి గొంతులూ పెద్దవి కావడం తో వాళ్ళ గొంతుల ముందు పాపం అమ్మమ్మ గొణుగుడు వినిపించేది కాదు..

బుధవారం, అక్టోబర్ 07, 2009

వరదలు-వార్తలు

ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలని ముంచెత్తిన వరదలు తగ్గు ముఖం పట్టాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో మనుషుల, వందల సంఖ్యలో మూగ జీవాల ప్రాణాలు పోయాయి. పంటలకి అపార నష్టం సంభవించింది. వ్యాపారాలూ దెబ్బ తిన్నాయి. అయితే, ఈ వరదలు రాష్ట్ర ప్రజలకి ఒక కనిపించని మేలు చేశాయి. వార్తా వ్యాపారపు వికృత క్రీడను సామాన్యుడు సైతం అర్ధం చేసుకోగలిగేలా చేశాయి. మేధావి వర్గం మొదలు, నిరక్షరాస్యుల వరకు టీవీ చూసే ప్రతి ఒక్కరికీ వార్తా చానళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నాయో స్పష్టంగా అర్ధమయ్యేలా చేశాయి.

కృష్ణా నది నీటి మట్టం పెరుగుతోందని తెలిసిన క్షణం మొదలు ఇప్పటివరకూ మెజారిటీ వార్తా చానళ్ళు అక్షరాలా పండుగ చేసుకున్నాయి. గడిచిన వారం రోజులుగా ఈ చానళ్ళు చూసిన వాళ్ళెవరూ కాదనలేని నిజం ఇది. శ్రీశైలం డ్యాం మొదలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి కూలిపోతున్నాయన్న భయాన్ని ప్రజల్లో ఇంజెక్టు చేయడం లో తెలుగులో ఉన్న పది వార్తా చానళ్ళ లోనూ కనీసం ఎనిమిది చానళ్ళు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.

ఏదైనా ప్రమాదం జరగబోతోందని తెలిసినప్పుడు బాధ్యత గల వ్యక్తులు గానీ, మీడియా గానీ చేయవలసింది ఏమిటి? ప్రజల్లో ధైర్యం నింపాలి.. అదే సమయంలో ప్రమాదం జరిగిన పక్షంలో నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి తన వంతు కృషి చేయాలి. దురదృష్టవశాత్తూ ఇక్కడ జరిగింది అందుకు పూర్తిగా భిన్నం. విపత్తు జరుగుతున్న స్థలం లో ఉన్న విలేకరి మొదలు, స్టూడియోలో కూర్చుని పరిస్థితిని సమీక్షిస్తున్న వార్తా నిర్వాహకుడి వరకు అందరి ముఖాల్లోనూ ఏదైనా జరిగిపోతే వార్త దొరుకుతుందనీ, అది తాము మాత్రమే ముందుగా చూపాలన్న తాపత్రయం కనిపించింది.

ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మిగిలిన చానళ్ళ కన్నా టీవీ తొమ్మిది నాలుగడుగుల ముందే ఉంది. ఈ చానల్ చూడకూడదని మొదలే నిర్ణయించుకున్నా, చానళ్ళు మార్చే సమయంలో కనబడ్డ దృశ్యాలు, వినిపించిన వాక్యాలు ఈ చానల్ విశ్వసనీయతను మరికొన్ని మెట్లు కిందకి దించాయి. (ఆకాశానికీ, పాతాళానికీ అంతు ఉండదు). తెలుగు టీవీ విశ్లేషకులు నాగసూరి వేణుగోపాల్ (వార్త, ఆంధ్రభూమి పత్రికల్లో టీవీ కార్యక్రమాల ప్రసార సరళిపై వ్యాసాలు రాస్తూ ఉంటారు) చాలా రోజుల క్రితం టీవీ తొమ్మిది వార్తల గురించి రాస్తూ పోటీ చానల్ తో పోల్చినప్పుడు నెట్ వర్క్, లైబ్రరీ విషయాల్లో ఈ చానల్ వెనుకబడి ఉందని, సంచనాల ద్వారా ఆ లోపాలని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందనీ రాశారు. ఆయన మాటలు నిజమని వరదల కవరేజీ మరోసారి నిరూపించింది.

ఇక, కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న 'సాక్షి' చానల్ ది మరోదారి. ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపే ఏ అవకాశాన్నే ఈ చానల్ వదులుకోలేదు. విపత్తు, పర్యవసానాల మీద కన్నా ప్రభుత్వ వైఫల్యాల మీదే 'సాక్షి' దృష్టి పెట్టిందేమో అనిపించింది. 'ఆయనే బతికుంటే..' 'ఆ దేవుడే ఉంటే..' లాంటి కథనాలు ఈ చానల్ ప్రత్యేకత. పూర్తిగా కాకపోయినా కొంతవరకూ సంయమనం పాటించిన చానల్ ఐన్యూస్. ఇక 'మఖ లో పుట్టిన' మిగిలిన చానళ్ళన్నింటిదీ ఒకటే దారి. వీటిలో పనిచేసే వాళ్ళలో కొందరికైనా అసలు 'వరద' అంటే ఏమిటో అవగాహన ఉందా అన్న సందేహం కలుగక మానదు.

చానళ్ళన్నీ ఇలా ఎందుకు ప్రవర్తించాయి? ఇందుకు సమాధానం కూడా వేణుగోపాల్ గారి పాత వ్యాసాల్లోనే దొరుకుతుంది. చానళ్ళు నడవాలంటే డబ్బు కావాలి. అది ప్రకటనల రూపంలో రావాలి. ప్రకటనలు రావాలంటే చానల్ కి ఎక్కువమంది ప్రేక్షకులు కావాలి. మరి ప్రేక్షకులు కావాలంటే..? వాళ్ళని కట్టిపడేసే కార్యక్రమాలు ప్రసారం చేయాలి. వార్తలు వ్యాపార సరుకుగా మారాక, వ్యాపార విలువలకే తప్ప నైతిక విలువలకీ, సామాజిక బాధ్యతకీ స్థానం ఉండదు కాబట్టి చానళ్ళు సహజంగానే ప్రకృతి భీభత్సాన్ని ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రయత్నించాయి. ఈ క్రమం లో సామాన్య ప్రేక్షకుడి ముందు సైతం తమ అసలు రంగుని బయట పెట్టుకున్నాయి. ఇక జాగ్రత్త పడాల్సింది ప్రేక్షకుడే.

వరదల ప్రసారం లో ఒక చానల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడు కోవాలి. అది ఈటీవీ రెండు. మిగిలిన చానళ్ళతో పోల్చినప్పుడు ఈ చానల్ వందల రెట్ల బాధ్యతతోనూ, సంయమనంతోనూ వ్యవహరించింది. పాత కాలపు నిర్మాణాలు కూలి పోనున్నాయని మిగిలిన చానళ్ళు హడావిడి చేసినప్పుడు ప్రజల్లో ధైర్యం నింపింది. ప్రమాదపు తీవ్రత తగ్గడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో విశ్లేషించింది. వరద తీవ్రత తగ్గేంత వరకూ సంయమనాన్ని కొనసాగించింది. నిజానికి ఈ చానల్ ప్రసారం చేసే రాజకీయ వార్తలపై నాకు అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మాత్రం ఈటీవీ రెండు కృషిని, బాధ్యతనూ అభినందిస్తున్నాను.

గురువారం, అక్టోబర్ 01, 2009

అంతరాయం

చిన్నప్పుడు రేడియోలో ఇష్టమైన పాట వస్తూ ఉంటే, పని మానుకుని రేడియో గదిలో చేరేవాళ్ళం. ఒక్కోసారి ఉన్నట్టుండి పాట ఆగిపోయేది. కరెంటు పోయిందేమో అని చూసుకుని, ఆ తర్వాత నాబ్ లు తిప్పి రిపేర్లు చేసినా ఉపయోగం ఉండేది కాదు. ఓ రెండు నిమిషాల తర్వాత పాట లో చివరి భాగం వినిపించేది. మరి కాసేపటికి ప్రసారం లో ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇన్ని నిముషాల ఇన్ని సెకన్ల సేపు సాంకేతిక కారణాల వల్ల అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నామంటూ ప్రకటన వచ్చేది.

అదేమిటో కానీ ఎప్పుడూ మంచి పాటలు వచ్చినప్పుడో, నాటకం మంచి రసకందాయంలో ఉన్నప్పుడో పగ పట్టినట్టు అంతరాయం వచ్చేసేది. పాటలంటే మరో సారి వచ్చినప్పుడు వినొచ్చు కానీ, నాటకం లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? పైగా అంతరాయం అందరి రేడియోల్లోనూ ఒకేసారి వస్తుంది కాబట్టి ఎవరినీ అడగడానికి కూడా ఉండేది కాదు. దాంతో ఆ టైములో కథ ఏ మలుపు తిరిగి ఉంటుందో మా ఊహా శక్తి మేరకు ఊహించుకునే వాళ్ళం.

టీవీ వచ్చాక సహజంగానే రేడియో వెనకబడింది. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారి ప్రసారాలు మొదటి నుంచి చివరి వరకూ దీక్షగా చూడాల్సిందే. సుబాబుల్ పంట లో తెగుళ్ళ నివారణ మొదలు, గొర్రెల్లో నట్టల వ్యాధి, శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకం కార్యక్రమాలు కూడా రెప్ప వెయ్యకుండా చూసిన రోజులు ఉన్నాయి.'ఓవర్ టు ఢిల్లీ' రాగానే టీవీ కట్టేసేవాళ్ళం మొదట్లో. తర్వాత 'చిత్రమాల' వగైరా కార్యక్రమాలు అలవాటయ్యాయి.

అలా శ్రద్ధగా టీవీ చూస్తుండగా ఉన్నట్టుండి బుల్లి తెర నిండా మెరుపులూ, మరకలూ కనిపించేవి. షరా మామూలుగా మనకి చేతనైన మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం. ఒక్కోసారి అంతరాయం అని బోర్డు పెట్టేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే కొన్ని కార్యక్రమాల కన్నా మధ్యలో వచ్చే అంతరాయమే బాగుండేది.

కాసేపయ్యాక ఎనౌన్సరు విషన్న వదనంతో ప్రత్యక్షమై (అప్పుడే టీవీ పెట్టిన వాళ్ళు ఏ దేశ నాయకుడో తనువు చాలించేశాడేమో అని సందేహించే విధంగా) ప్రసారంలో అంతరాయం కలిగినందుకు చింతించే కార్యక్రమం ఉండేది. అందరూ యధాశక్తిగా చింతించినప్పటికీ, నాకు గుర్తున్నంతవరకు మిగిలిన వాళ్ళ కన్నా శాంతి స్వరూప్, విజయదుర్గ చింతించే విధానం కొంచం ప్రత్యేకంగా ఉండేది. ఈ చింతించడం మీద బోల్డన్ని జోకులు ప్రచారంలో ఉండేవి. అనౌన్సర్ కన్నీళ్ళకి డ్రాయింగ్ రూం సగం మునిగిపోయినట్టు వచ్చిన కార్టూను ఇప్పటికీ గుర్తే.

శాటిలైట్ చానళ్ళు వచ్చి టీవీ కార్యక్రమాల ప్రసారం లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. వాటిలో ముఖ్యమైనది అంతరాయాలకి చింతించక పోవడం. 'వీళ్ళకి బొత్తిగా మర్యాద తెలీదు.. అదే దూరదర్శన్ వాళ్ళైతే ఎంత మర్యాదస్తులో' అన్న జోకులూ వినిపించాయి. ఇప్పుడిప్పుడు ఫలానా టైము నుంచి ఫలానా టైం వరకూ అంతరాయం వచ్చే అవకాశం ఉంది అన్న స్క్రోలింగులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీవీలో మొన్నో ఆసక్తి కరమైన విషయం కనిపించింది.

మొన్న రాత్రి టీవీ తొమ్మిది లో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు ఇంటర్వ్యూ వస్తోంది. యాంకరు తో పాటు, ప్రజా నాట్యమండలి కళాకారిణి/ కార్యకర్త దేవి కూడా వంగపండు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తన పాపులర్ పాట 'ఏంపిల్లడో ఎల్దమొస్తవా..' ట్యూన్ తో వైఎస్ ని పొగుడుతూ ఒక పాట రాశారట వంగపండు. 'ఇది మీకు తగునా?' అని వాళ్ళిద్దరూ వంగపండుని చెరిగేస్తూ, చెడుగుడు ఆడుతూ, మధ్యలో ఆయన చేత పాటలు పాడిస్తున్నారు.

ఒక రెండు బ్రేకులు బ్రేకాక, ఫోన్ ఇన్ పెట్టారు. చానల్ వారి నిలయ విద్వాంసులు ఫోన్ లో వంగపండుని నిలదీస్తుండగా, మిగిలిన ఇద్దరూ చిరు నవ్వులు చిందిస్తున్నారు. అప్పుడు వచ్చిందో ఫోన్ కాల్. కాలర్ టీవీ తొమ్మిది వారిమీద విరుచుకు పడ్డాడు. ఇంతసేపటికి ఒక భిన్నస్వరం వినిపించింది కదా అనిపించింది. ఇంతకన్నా పెద్ద పెద్ద విప్లవ ద్రోహాలు చేస్తున్న వాళ్ళని వదిలి అమాయకుడైన వంగపండునే ఎదుకు టార్గెట్ చేశారు? మిగిలిన వాళ్ళతో మాట్లాడే ధైర్యం మీకు లేదు.. అని సూటిగానూ, స్పష్టంగానూ మాట్లాడుతున్న క్షణాల్లో వచ్చింది అంతరాయం.

పాపం.. యాంకరు శక్తి వంచన లేకుండా 'హలో..హలో..' అంటూనే ఉన్నాడు. ఫోన్లో అవతలి నుంచి స్పందన లేదు. చేసినాయన ఎవరో ప్రజాసంఘం నాయకుడే.. 'లైన్లో ఏదో ప్రాబ్లం' అని చెప్పి ప్రోగ్రాం కొనసాగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ తర్వాత కార్యక్రమం దాదాపు అరగంట సేపు కొనసాగినా ఆయన మళ్ళీ ఫోన్ చేయలేదు.. చానల్ వాళ్లైనా ఆయనకి ఫోన్ చేసి అభిప్రాయం తీసుకుందామని ప్రయత్నించలేదు. కనీసం అంతరాయానికి చింతించనూ లేదు. తర్వాత అలా నిలదీసే కాల్ ఒక్కటి కూడా రాలేదు.