శనివారం, ఆగస్టు 29, 2015

అదీ సంగతి ...

హోటల్ డైనింగ్ హాల్ అంతా హడావిడిగా ఉంది. శనివారం సాయంత్రం టిఫిన్స్ అన్-లిమిటెడ్ బఫే ఆఫర్. పెద్దలూ, పిల్లలూ అన్న భేదం లేకుండా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆబాలగోపాలమూ అక్కడే ఉన్నారు. మెనూ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇడ్లీ, కోకోనట్ ఇడ్లీ, పకోడీ, పుణుకులు, పెసరట్, ఉప్మా, పుల్కా విత్ రాజ్మా కర్రీ, నూడుల్స్, చాట్ మరియూ అక్కడిక్కడ తయారు చేసి వడ్డిస్తున్న స్వీట్ మలై పూరీ. ప్లేట్లో రెండిడ్లీలు పెట్టుకుని, చట్నీలు, సాంబారు కప్పుతో చోటు వెతుక్కుంటూ హాలంతా కలియతిరుగుతున్న నా బాధ భరించలేక ఓ టేబుల్ కార్నర్ సీట్ చూపించాడు మేనేజర్.

నా ఎదురుగా ఇద్దరు పెద్దవాళ్ళు. ఎప్పుడో రిటైరైన ఉద్యోగులై ఉంటారు బహుశా. కొంచం గట్టిగానే కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వద్దన్నా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, బంగారం ధరల్లో మార్పులు, షేర్ మార్కెట్ పతనం లాంటి టాపిక్స్ జమిలిగా నడుస్తున్నాయి. పక్క టేబిల్ లో కుర్ర గుంపు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటూ టాపు లేపేస్తున్నారు. శ్రద్ధగా రెండిడ్లీలూ పూర్తి చేసి పెసరట్ ఉప్మా కోసం వెళ్ళబోతూ ఎదుటివాళ్ళిద్దరివైపూ చూశాను. ఒకాయన మా పక్క టేబిల్ వైపు విసుగూ కోపం కలగలిపి చూస్తున్నాడు. ఎందుకై ఉంటుంది?

పెసరట్టు, పేస్టుప్మాతో పాటు చట్నీలు వడ్డించుకుని సీటు దగ్గరికి వస్తూ ఈసారి పక్క టేబిల్ మీద దృష్టి పెట్టాను. మొత్తం నలుగురు. కాలేజీ ఈడు వాళ్ళు. ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి. ఆమె వాళ్ళందరితోనూ నవ్వుతూ, తుళ్ళుతూ కబుర్లు చెబుతోంది. 'అరేయ్' 'ఒరేయ్' అంటూ కబుర్లు చెబుతూ, అప్పుడప్పుడూ చనువుగా ఒక్కటేస్తోంది. కూర్చుంటూ ఎదుటాయన్ని ఓసారి చూశా. ఆయనకే శక్తి ఉంటే వాళ్ళ నలుగురినీ అక్కడికక్కడే బూడిద చేసేసి ఉండేవాడేమో బహుశా. పెసరట్టు పని పడుతూ ఉండగా మహేష్ బాబు గ్రూపుకీ, పవన్ కళ్యాణ్ కీ తగాదా. పవన్ కళ్యాణ్ గ్రూపులో ఒక్కడే. ఆ అమ్మాయి ఈ గొడవ పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటోంది.

చుడీదారు, కళ్ళజోడుతో చదువుల సరస్వతిలా ఉందా అమ్మాయి (స్కూలు, కాలేజీ పిల్లలకి కనుక కళ్ళజోడు ఉంటే వాళ్ళు పుట్టు మేధావులని నాకో బలమైన ఫీలింగ్, నా చిన్నప్పటినుంచీ కూడా). గొడవ చల్లారింది. వాళ్ళు నలుగురూ వెళ్లి స్వీటు తెచ్చుకున్నారు. ఎదుటి ఇద్దరూ కళ్ళతోనే మొటికలు విరుస్తున్నారు. ఒకాయన ఉన్నట్టుండి వాళ్ళ పిల్లలని తను ఎంత క్రమశిక్షణతో పెంచాడో చెప్పడం మొదలుపెట్టాడు, రెండో ఆయనకి. నేను నవ్వాపుకోవాల్సిన తరుణం రానే వచ్చేసింది. ఆయన్ని పూర్తి చేయనివ్వకుండా రెండో ఆయన అందుకుని 'పిల్లలు-తల్లిభయం' టాపిక్ అలవోకగా అందుకున్నాడు. ఆ పిల్లలు కనీసం ఇటు చూడకుండా 'శ్రీమంతుడు' గురించి చెప్పుకుంటున్నారు.

చూస్తుండగానే జనం పెరిగారు. చిన్న పిల్లలు మెనూ చూసి సరదా పడిపోతున్నారు. స్త్రీలేమో ఒకరి నగలని ఒకరు వోరగా చూసుకుంటున్నారు. మగవాళ్ళు యధావిధిగా జేబులు తడుము కుంటున్నారు. నేను పుల్కా తినడమా లేక నూడుల్స్ రుచి చూడ్డమా అని తీవ్రంగా ఆలోచిస్తుండగా వెయిటరమ్మాయి వచ్చి "ప్లేటు తీసేయనా సార్?" అని వినయంగా అడిగింది. నేనెక్కడ 'ఊ' అనేస్తానో అని కంగారు పడ్డ ఎదుటాయన "ఆయనింకా ఏం తినలేదు" అనడంతో, "సారీ సర్" అని చెప్పి వెళ్ళిపోయింది. రాజ్మా తిని చాలా రోజులయిందని గుర్తు రావడంతో నా మనసు పుల్కా వైపు మొగ్గింది.

నేను సీట్లో కూర్చుంటూ ఎదుటివాళ్ళ వైపు చూసేసరికి ఒక్క క్షణం అయోమయం కలిగింది. మన్ను తిన్న కృష్ణుళ్ళా ఇద్దరూ నోళ్ళు తెరుచుకుని ఉన్నారు. ఇద్దరి కళ్ళూ పక్క టేబిల్ వైపే ఉన్నాయి. ఆ అమ్మాయి ముగ్గురబ్బాయిలకీ రాఖీలు కడుతోంది. దృశ్యం చూడముచ్చటగా అనిపించడంతో నేనూ చూస్తూ ఉండిపోయాను. కుర్రాళ్ళు ముగ్గురూ జేబుల్లోనుంచి గిఫ్ట్లు తీసిచ్చారు ఆ అమ్మాయికి. ఇంతలో బిల్ వచ్చింది. ఆ అమ్మాయి అందుకుంది. ఇప్పుడు ముగ్గురబ్బాయిలకీ వాళ్ళ హీరోలు గుర్తొచ్చినట్టు లేదు. ఒకే పార్టీగా మారిపోయి ఆమె చేతినుంచి బిల్ ఫోల్డర్ అక్షరాలా లాగేసుకున్నారు. మరో ఐదు నిమిషాల్లో ఆ టేబిల్ ఖాళీ అయ్యింది. ఎదుటి ఇద్దరివైపూ నేనస్సలు చూడలేదు.

మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!!

మంగళవారం, ఆగస్టు 25, 2015

అడివి దారి -2

(మొదటిభాగం తరువాత...)

"పెద్దయ్యా.. కలక్టర్ దొరగారొచ్చారు," డవాలా బంట్రోతు కేక వింటూనే, ఆ ఒంటి నిట్రాట పాక నుంచి ఓ వృద్ధుడు బయటికి వచ్చి దండం పెట్టాడు. ఉన్న ఒకే ఒక్క కుక్కి మంచాన్ని నాకు చూపించి, కాస్త దూరంగా నేలమీద కూలబడ్డాడు.

నా షూస్ విప్పిన బంట్రోతు, నేను కణతలు ఒత్తుకోడం చూసి పరుగున వెళ్లి జీపునుంచి క్యాంప్ బ్యాగ్ తీసుకొచ్చి, ఫ్లాస్కులోంచి వొంపిన కాఫీని, బిస్కెట్లతో కలిపి అందించాడు. రెండు గుక్కలు కాఫీ లోపలికి వెళ్లేసరికి నేను మనుషుల్లో పడి చుట్టూ చూశాను. కురుస్తున్న వర్షాన్ని నిర్లిప్తంగా చూస్తున్నాడా వృద్ధుడు.

అతనింటిని నాదిగా చేసేసుకోడం అసహజంగా అనిపించలేదు నాకు. కాకపొతే కర్టెసీ గుర్తొచ్చి, అతనిక్కూడా కాఫీ ఇవ్వమని సైగ చేశాను బంట్రోతుకి. కాఫీనీ, బిస్కెట్లనీ కూడా తిరస్కరించాడతను.

కాఫీ పూర్తి చేసేసరికి ఆచార్లు గుర్తొచ్చాడు. రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న తాసీల్దార్. నన్ను కలిసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఐటీడీయే మీటింగ్ నుంచి తప్పించడం కోసం అతనికి వేరే డ్యూటీ వేయించాను. ఫోన్లో అయినా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. తీర్చాల్సిన బాధ్యతలో, మరొకటో వంక చెప్పి తనని తప్పించమని వేడుకుంటాడు, సహజమే.

"పులులెప్పుడూ బలవ్వవోయ్ సారథీ. బలయ్యే పరిస్థితే వస్తే ఏ మేకనో బలిపెట్టి తప్పుకుంటాయి.." సెక్రటేరియట్ లో ఓ సీనియర్ ఆఫీసర్ తరచూ చెప్పే మాట ఇది. ఇప్పుడు ఆచార్లు మేక. ఏమవుతుంది, మహా అయితే సస్పెన్షన్. ఓ నామమాత్రపు ఎంక్వయిరీ. ఓ ఆర్నెల్ల తర్వాత అన్నీ పాతబడి పోతాయి. అయినా ఆచార్లుకెందుకింత కంగారు? ఉహు, అతన్ని అనుకునే ముందు ఎందుకో నేనే పూర్తిగా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను.

'పెద్ద సర్' నేరుగా ఫోన్ చేస్తేనే కదా అప్పటికప్పుడు ఫైల్ పుటప్ చేసి, క్లియరెన్సులు ఇచ్చింది. అనుకోకుండా ఏదో చిన్న ఇబ్బంది. అయినా ఈ మీడియా వాళ్లకి బొత్తిగా పని లేకుండా పోతోంది. మీడియా అనగానే మధుమతి మళ్ళీ గుర్తొచ్చింది. ఇరవై-ఇరవై రెండు మధ్యలో ఉంటుందేమో వయసు. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ అవుతూనే ఓ నేషనల్ మేగజైన్ లో ఉద్యోగం. ఎన్విరాన్మెంట్ తన స్పెషలైజేషన్ అట. ఆమె లాగింది తీగ. డొంకంతా కదిలింది.

"మీడియాని మేనేజ్ చేయడం తెలీదా మీకు?" మధుమతి రాసిన కథనం పత్రికలో వచ్చిన రోజు చీఫ్ సెక్రటరీ అడిగిన మొదటి ప్రశ్న అది.

"టాప్ టు బాటం.. అందరూ చేస్తున్న పని అదే.. ఏ తప్పు బయటికి వచ్చినా ఆఫీసర్లదే రెస్పాన్సిబిలిటీ.. యు నో, పెద్ద సర్ ఎంత అప్సెట్ అయ్యారో? అవర్స్ ఈజే క్లీన్ గవర్నమెంట్..." సీఎస్ ఆగ్రహాన్ని చాలాసేపే వినాల్సి వచ్చింది.

మధుమతి నాకు కేవలం జర్నలిస్టుగా అనిపించలేదు. ఆ ఉరకలెత్తే ఉత్సాహం, చొరవ, సాహసం.. అవన్నీ చూసినప్పుడు నాకూ గిరిజకీ ఓ కూతురు పుడితే ఇలాగే ఉండేదేమో అనిపించింది. ఆమె అడిగేవన్నీ నిజాలే అవ్వడం కొంత, డాటర్లీ ఫీలింగ్ మరి కొంత, ఆమె క్రాస్ చెక్ చేసుకోడానికి ప్రయత్నించిన చాలా విషయాలని కాదని ఖండించలేక పోయాను.

"ప్రాజెక్ట్ టేకప్ చేసే కాంట్రాక్టర్ల కోసం గవర్నమెంట్ రోడ్స్ వేస్తోంది. పేరుకి మాత్రం అభివృద్ధి, నక్సల్ ఇష్యూ. ప్రాజెక్ట్ వస్తే, కొన్నేళ్ళలోనే అడివి పూర్తిగా అంతరించిపోతుంది.. మిస్టర్ సారథీ, ఇవన్నీ మీకు తెలుసనే అనుకుంటున్నాను" అని మధుమతి అన్నప్పుడు "హౌ అబౌట్ ఏ కప్పాఫ్ కాఫీ?" అని మాత్రమే అడిగాన్నేను.

మధుమతిని చూస్తే గిరిజక్కూడా నాక్కలిగిన భావనే కలుగుతుందా అన్న ఆలోచన మొగ్గలోనే ఆగిపోయింది. కచ్చితంగా కలగదు. మా ఇద్దరికీ ఇక సంతానం కలగదని తెలిసినప్పుడు, ఎవరినన్నా పెంచుకుందాం అన్నాను.

"ఎవరో కన్న బిడ్డని నా బిడ్డ అనుకునేంత విశాల హృదయం నాకు లేదు.. ఇలాంటి విషయాల్లో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు మనం.. బిడ్డని తెచ్చుకుని, సరిగా చూడలేక, అన్యాయం చేస్తున్నామన్న గిల్ట్ ని భరిస్తూ.. ఇదంతా అవసరమా చెప్పు?" అంది గిరిజ.

మా ఇద్దరిమధ్యా సూది మొనంత దూరం మొదలయ్యింది ఆరోజునే. అదిప్పటికి పెరిగి పెరిగి పెద్ద అగాధం అయ్యింది. గిరిజనుల కోసం పనిచేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ లో చేరింది గిరిజ. మొదట్లో వాళ్ళ కార్యక్రమాలకి పిలిచేది. నగరాల్లో ఉంటూ ట్రైబల్ వెల్ఫేర్ కోసం పనిచేయడం నాకో జోక్ లా అనిపించింది. నేను వెళ్ళే వాడిని కాదు. రానురానూ పిలవడం మానేసింది.

ఈ ప్రాజెక్ట్ గొడవ మొదలయ్యాక ఒక రోజు "నువ్వు అడివికి అన్యాయం చేస్తున్నావ్.. అడివి నా పుట్టిల్లు.." అంది గిరిజ. అటు తర్వాత తప్పనిసరి అయితేనే నాతో మాట్లాడుతోంది.

ఉద్యోగంలో చేరిన మొదట్లో మెదడుతో పనిచేయాలా లేక హృదయంతోనా అన్న ప్రశ్న తరచూ వేధించేది. సమాధానం 'హృదయం' అయిన ప్రతి సందర్భమూ నాకేవో కొత్తచిక్కులు తెస్తూనే ఉంది.  అధికారి ఎవరైనా పైవాళ్ళు ఎలాగూ వాళ్ళు చేయదల్చుకున్నదే చేస్తారన్న ఎరుక నిర్లిప్తతని పెంచింది. హృదయాన్ని పక్కకి నెట్టేశాక నా తోటి వాళ్ళకన్నా వెనుకబడిపోతున్నానన్న బాధ మాయమయింది. కానీ, కారణం ఇదీ అని చెప్పలేని అసంతృప్తులెన్నో పెరిగి పెద్దవవుతున్నాయి.

వర్షం కాస్త నెమ్మదించడంతో "ఓసారి బండి సూసొస్తా అయ్యగారూ" అంటూ వెళ్ళాడు బంట్రోతు. అడివి తాలూకు పచ్చి వాసనలు గాలితో కలిసొచ్చి పలకరిస్తూ బిభూతి భూషణుడి 'వనవాసి' ని గుర్తు చేస్తున్నాయి. క్యాంప్ క్లర్క్ మోకాళ్ళ మీద తల పెట్టుకుని కునికిపాట్లు పడుతున్నాడు. వృద్ధుడు కళ్ళు తెరిచే నిద్రపోతున్నట్టున్నాడు. ఇంట్లో మరో మనిషి అలికిడి లేదు.

క్లర్కుకి ఏం గుర్తొచ్చిందో, ఒక్కసారి తలెత్తి "అన్నలొస్తారా పెద్దయ్యా?" అని అడిగాడు. అతని గొంతులో భయం వినిపిస్తోంది.

"ఎవురూ రారయ్యా.. ఎవ్వురూ రారు," స్థిరంగా చెప్పాడా వృద్ధుడు. మాట్లాడ్డం మరచిపోతున్నాడేమో అనిపించేలా ఉంది గొంతు.

"ఒక్కడివే ఉంటున్నావా?" పలకరించాన్నేను. చుట్టుపక్కల ఇళ్లేవీ లేవు. విసిరేసినట్టుగా ఈ ఒక్క ఇల్లే.

"అవును బాబూ.. ముసిల్దెల్లిపోయేక ఒక్కన్నే.." చెప్పాడతను.

"గూడెం మొత్తానికి ఇదొక్కటే ఇల్లా?" ఆశ్చర్యం దాచుకోలేదు నేను. కాళ్ళు జాపుకున్నాడతను.

"గూడెం దూరానున్నాది బాబూ.. నేను ఎలడ్డాను.." ఈ 'వెలి పడడం' ఏమిటో వెంటనే అర్ధం కాలేదు నాకు.

"అంటే ఏంటి పెద్దయ్యా?" అడిగాడు మా క్లర్క్.

"ఎనకటి రోజుల్లో నేను గూడెం పెద్దనయ్యా. అందరికీ మంచీ, సెడ్డా సెప్పటం, తప్పు సేసినోన్ని ఎలెయ్యటం ఇయన్నీ పెద్ద సెయ్యాల్సిన పన్లు. అలాటిది నావొల్లే తప్పు జరిగింది. నాకు నేను సిచ్చేసుకోపోతే, పెద్దరికానికి ఇలవేం ఉంటాది? అందుకే ఎలేసుకున్నాను.." 

ఎవరికైనా వేసే శిక్ష అయితే ఏడాదో, రెండేళ్లో వెలి. పెద్ద వల్లే తప్పు జరిగింది కాబట్టి జీవిత కాలపు వెలి. ఇరవయ్యేళ్ళుగా అతనూ, భార్యా అందరికీ దూరంగా ఈ ఇంట్లో.. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయాక అతనొక్కడే.. మిగిలిన సమూహానికి దూరంగా.. ఎలా సాధ్యపడింది?

"మీ గూడెం వాళ్ళు ఒప్పుకున్నారా మరి?" అడిగాడు క్యాంప్ క్లర్క్.

వర్షం తగ్గింది. బంట్రోతు, గన్ మ్యాన్, డ్రైవరు జీపులో వచ్చారు.

"ఎందుకొప్పుకోరయ్యా? తీరుపన్నాక తీరుపే.. తప్పు సేత్తే సిచ్చ  అనుబించాల్సిందే.. సిచ్చ తప్పించుకోటం అన్నిటికన్నాని పెద్ద తప్పుగాదా? తప్పిచ్చుకుట్టే తిండి సయిత్తాదా, కునుకడతాదా బాబూ?"

ఏకకాలంలో దూరంగా ఉరుము ఉరిమి, దగ్గర్లో మెరుపు మెరిసింది.

షూ లేసులు బిగించుకుని, లేచి నిలబడి "సెలవు పెద్దయ్యా" అంటూ చేతులు జోడించాను.

జీపు రోడ్డుదారి పట్టింది.

(అయిపోయింది)

సోమవారం, ఆగస్టు 24, 2015

అడివి దారి -1

గతుకుల రోడ్డు మీద కొత్త జీపు పరుగులు పెడుతోంది. ఘాటీ మార్గం, అదికూడా కిందకి దిగడమేమో అనాయాసంగా కదిలిపోతోంది బండి. డ్రైవర్ దృష్టి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఉంది. వెనుక సీట్లో గన్ మ్యాన్, క్యాంప్ క్లర్క్, డవాలా బంట్రోతు కూర్చున్నారు వరుసగా. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. సాయంకాలమైంది కదా, అందరికీ ఇళ్ళ మీదకి ధ్యాస మళ్ళి ఉంటుంది.

సిగ్నల్ ఉండదని తెలిసీ, మొబైల్ ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాను అప్రయత్నంగా. ఘాటీ దాటితే తప్ప సిగ్నల్ ఉండదు. అక్కడి నుంచీ ఇక కాల్స్ మొదలవుతాయి. ప్రతి సంభాషణా ప్రశ్నతోనే ముగుస్తుంది. నా దగ్గర ఏ ప్రశ్నకీ సమాధానం లేదిప్పుడు. సమాధానం ఆలస్యం అయ్యే కొద్దీ జవాబు కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.

ఫోన్ నుంచి దృష్టి మరల్చి, అద్దంలోనుంచి బయటికి చూశాను. అడివి చెట్ల పైన తుమ్మెదలు గుంపులుగా ఝుంకారాలు చేస్తున్నాయి. పెద్ద వర్షం రాబోతోందిప్పుడు. ఇది సైన్స్ చెప్పిన మాట కాదు, సెన్స్ చెప్పింది. వర్షం మొదలయ్యేలోపు ఈ అడివి దాటేస్తే ఇక పర్వాలేదు. వేగము, దూరము, కాలము... ఈక్వేషన్లు తిరుగుతున్నాయి బుర్రలో. ఉహు, ఏకాగ్రత కుదరడంలేదు.

కొంచం ముందుగా బయల్దేరి ఉండాల్సింది. ఐటీడీయే పీవో కొత్తగా వచ్చిన డైరెక్ట్ రిక్రూటీ.. గంటలో ముగించాల్సిన మీటింగ్ మూడు గంటల పాటు నడిపాడు. అది అయ్యింది అనుకుంటూ ఉండగా, గిరిజన నాయకులు అర్జీలు పట్టుకుని వచ్చారు 'కలక్టర్ దొరవారి దర్శనం' అంటూ. వాళ్ళతో మాట్లాడి బయల్దేరేసరికి ఆలస్యం అయింది. అయినా ఉన్నది అడివిలోనే కదా.. అడివి నాకు కొత్తేమీ కాదు కదా..

"నీకింక అడివంతా అత్తారిల్లే..." గిరిజ గొంతు నా చెవిలో గుసగుసలాడుతున్నట్టే ఉంది. ఇదిగో అదిగో అంటూ ఇరవయ్యేళ్ళు గడిచిపోయాయి గిరిజ నాకీ మాట చెప్పి. యూనివర్సిటీ లైబ్రరీని ఆనుకుని ఉన్న పెద్ద చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు చప్టా మీద కూర్చుని భవిష్యత్ ప్రణాళికలు రచించుకున్న కాలమది.

పట్టీలు పెట్టుకున్నా, లేకున్నా గిరిజ అడుగుల చప్పుడు పరిచితమే. 'నేను నడవడం వల్ల నేలకి నొప్పి కలుగుతోందేమో' అని ఆలోచిస్తుందేమో మరి. వెనుకనుంచి వచ్చి నాకళ్ళు మూయడం అప్పట్లో తనకో సరదా. నేను కావాలని ఇంకెవరెవరి పేర్లో చెప్పినా, తనని గుర్తు పట్టేసిన విషయం గిరిజకి తెలిసిపోయేది.

యూనివర్సిటీ హాస్టళ్ళలో ఉండి పీజీ చేస్తూ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఇద్దరం. మొదటి ప్రయత్నం ఇద్దరికీ ఫెయిల్యూర్ నే ఇచ్చింది. తనిక సివిల్స్ రాయనని చెప్పేసింది గిరిజ. "అయినా, జనానికి ఏదన్నా చేయాలంటే కలక్టర్ అవ్వడం ఒక్కటే మార్గం కాదు" అంది తను ఆ సాయంత్రం వేళ. "అవును, కలెక్టర్ భార్యగా కూడా చాలా చెయ్యొచ్చు" అన్నాన్నేను. నాగొంతులో అతిశయం పలికే ఉంటుంది బహుశా. అదిగో, అప్పుడంది గిరిజ "నీకింక అడివంతా అత్తారిల్లే" అని.

ప్రపోజ్ చేసుకోడాలు, లవ్యూలు, పూల బొకేలు, సినిమాలు, డిన్నర్లు.. ఇవేవీ లేని ప్రేమకథ మాది. అదిమొదలు, తను నన్ను వాళ్ళూరికి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. వెళ్తే పెళ్లి ప్రస్తావన వచ్చి తీరుతుంది. ఏమీ సాధించకుండా, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పడం? అందుకే ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చాను, గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చే వరకూ.

"ఆర్డీవో గారూ.. ఇప్పటికైనా మా ఊరొస్తారా?" అడిగింది గిరిజ. ఆ వారంలోనే వెళ్లాం వాళ్ళ ఊరికి. నిజానికి ఊరు కాదది, గూడెం. అడివి మధ్యలో ఉన్న కొన్ని ఇళ్ళ సముదాయంలో అన్నింటికన్నా పెద్దగా, ఎత్తుగా ఉన్న ఇల్లు. వాళ్ళ నాన్న ఆ గూడేనికి పెద్ద. గూడెంలో మిగిలిన వాళ్ళతో పోలిస్తే గిరిజ తల్లిదండ్రులు నాగరికంగానే ఉన్నారనిపించింది. నన్ను వాళ్ళెవరూ కొత్తగానూ, వింతగానూ చూడకపోవడం, నా హోదాని గుర్తించకపోవడం మాత్రం గుచ్చుకుంది నాకు. 

అడివిని చూడడం అదే మొదటిసారి. బోలెడన్ని వనరులున్నా మార్కెట్ సౌకర్యాలు లేవు. ఈమాటే అన్నాను గిరిజతో. నన్నోసారి చూసి ఊరుకుంది. ఇన్నేళ్ళ లోనూ ఆ గూడేనికి చాలాసార్లే వెళ్లాం మేమిద్దరం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నన్ను పూర్తిగా మర్చిపోతుంది గిరిజ. వెళ్లకపోయినా గత కొన్నాళ్ళుగా తనకి నామీద శ్రద్ధ తగ్గుతూ వస్తోంది. కారణాలు నాకు తెలియనివి కావు. ఎప్పుడో తప్ప నా అంచనాలు తప్పవు.

ఉన్నట్టుండి ఠపా ఠపా చినుకులు మొదలవ్వడంతో వెనక కూర్చున్న ముగ్గురూ ఉలికిపడ్డారు. వైపర్స్ ఆన్ చేశాడు డ్రైవర్. రోడ్డు మీద గతుకులు బాగా పెరిగాయి. ఉండుండి ఈడ్చి కొడుతోంది కొండగాలి. తప్పనిసరై వేగం తగ్గించాడు డ్రైవర్. ఏవిటీ రోడ్డు? ఏమైపోతున్నాయి ఫండ్స్ అన్నీ? ప్రశ్నల వెనుకే నవ్వూ వచ్చింది.

గంటక్రితం చూసిన రంగురంగుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కళ్ళముందు మెదిలింది. గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో రోడ్ల  నిర్మాణం ఒకటి. మరీ ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లని నిర్మించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. కోట్లాది రూపాయల తాలూకు అంకెలు బుర్రలో గిరగిరా తిరిగాయి. త్వరలో రీకార్పెటింగ్ చేయబోయే రోడ్ల జాబితాలో ఈ రోడ్డూ ఉంది. పైకి చెప్పే కారణం గిరిజనాభివృద్ధే అయినా, అసలు కారణం మాత్రం పూర్తిగా వేరే.

"ఐ నో ది రీజన్ మిస్టర్ సారథీ" అంది మధుమతి. పేరుపెట్టి పిలిచేంత చనువు నేనివ్వలేదు, తనే తీసుకుంది. మధుమతి అనగానే లిప్ స్టిక్ పెదాల మధ్య బిగించిన పెన్సిల్ కొన, దట్టమైన మస్కారా చాటున మెరిసే పెద్ద కళ్ళూ జ్ఞాపకం వస్తాయి ముందుగా. ఆ వెనుకే, ఆమెకి మాత్రమే ప్రత్యేకమైన ఓ సువాసన. అచ్చం అడివిపూల వాసన లాంటిదే. మధుమతి మాటల్లో చెప్పిన విషయాన్నే గిరిజ తన మౌనంతో చెబుతుంది.

గిరిజతో మాటలు బాగా తగ్గిపోయాయి. నన్ను చూసినప్పుడల్లా మెరిసే ఆ కళ్ళు, నిర్లిప్తంగా వాలుతున్నాయిప్పుడు. ఏదో జరగబోతోంది మొత్తానికి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో గిరిజని గురించి ఆలోచించడం సాధ్యమేనా అన్న ప్రశ్న రావడం లేదు. గిరిజ సమస్యలకి లోపలే ఉంది తప్ప బయట కాదనిపిస్తోంది.

ఒక్కసారిగా తల విదిలించి చుట్టూ చూశాను. మబ్బులు మూసేయడంతో చుట్టూ అంధకారం. వాన హోరున కురుస్తోంది. రేపు సాయంత్రానికి మించి సమస్యని నేను వాయిదా వేయలేకపోవచ్చు. ఇరవయ్యేళ్ళుగా నిర్మించుకున్న కెరీర్. అదే సమయంలో దృఢ పరుచుకున్న వైవాహిక జీవితం. రెండూ ప్రమాదపుటంచునే ఉన్నాయి. కూలిపోకుండా నిలబెట్టుకోగలిగే శక్తి నాకుందా?

మేఘాల్లో పేరుకున్న తడి వర్షంగా కురుస్తోంది. నాగుండెల్లో తడి బొత్తిగా లేనట్టుంది. ఒక్క కన్నీటి చుక్కా రానంటోంది. కరువుతీరా ఏడవగలిగే వాళ్ళది యెంత అదృష్టం!

సడెన్ బ్రేకుతో ఆగింది జీపు. టైర్ పంక్చర్ అయ్యింది. జీపు దిగిన డ్రైవర్ కొంచం ఆందోళనగా చెప్పాడు "దారి తప్పినట్టున్నాం సార్.." గన్ మ్యాన్ ఏజెన్సీ కుర్రాడే. చుట్టూ చూసి, మరీ లోపలికి వెళ్లిపోలేదని చెప్పాడు. దూరంగా దీపం మినుకు మినుకుమంటోంది. బంట్రోతు గొడుగేసుకుని అటువైపు వెళ్ళాడు.

డ్రైవర్, గన్ మ్యాన్ చెట్టుకింద నిలబడ్డారు. క్యాంప్ క్లర్క్ గొంతు విప్పాడు. "తమరు మీటింగులో ఉండగా తాసీల్దార్ ఆచార్లు రెండు సార్లు ఫోన్ చేశారండయ్యా. అర్జెంటుగా మాట్లాడాలన్నారు తవరితో.."  ఏం జరగబోతోందో ఆచార్లుకి స్పష్టంగా అర్ధమయ్యిందన్నమాట! "సీఎస్ గారి విషయం గుర్తుచెయ్యమన్నారు తవరు.." అతనే చెప్పాడు మళ్ళీ. చీఫ్ సెక్రటరీతో మాట్లాడాల్సి ఉందని బాగా గుర్తే నాకు.

దూరంగా ఉన్న ఇంట్లో కూర్చోడానికి వీలుగా ఉందని బంట్రోతు కబురు తెచ్చాడు. అతను పట్టిన గొడుగులో నేను, నా వెనుకే తడుస్తూ క్యాంప్ క్లర్క్ ఆ ఇంటివైపు బయలుదేరాం. టైరు మార్చడంలో డ్రైవరుకి సాయంగా గన్ మ్యాన్ జీపు దగ్గరే ఉండిపోయాడు. గాలీ, వానా మమ్మల్ని ఎంతగా చిరాకు పెట్టాయంటే, అది నక్సల్-ప్రోన్ ఏరియా అన్న విషయం ఆ క్షణంలో మాకెవరికీ గుర్తు రాలేదు. ఏదో జరగబోతోంది అని మాత్రం నాకు చాలా బలంగా అనిపించింది.  సైన్స్ కాదు, సెన్స్ చెప్పింది.

(మరికొంచం దూరం...)

శుక్రవారం, ఆగస్టు 07, 2015

బాకీ పడ్డాను ...

శ్రీనివాస్ నాకు ఐదేళ్లుగా పరిచయం. ఇతన్ని తెలిసిన మనిషి అనాలో, స్నేహితుడు అనాలో, ఇంకేమనాలో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. ఇకపై ఆలోచించాల్సిన పనిలేదు.. పనిలేకుండా చేసేశాడు తను. కానీ, కొన్నాళ్ళ పాటు.. కనీసం కొన్నేళ్ళ పాటు గుర్తొస్తూనే ఉంటాడు నాకు. ఐదేళ్ళ క్రితం ఓ తెలుగు దినపత్రిక ఏజెంట్ గా పరిచయం అయ్యాడతను. నేనా పత్రిక చందాదారుడిగా చేరడంతో ప్రతినెలా మొదటివారంలో బిల్లు వసూలు చేసుకోడానికి వచ్చేవాడు.

కొన్ని నెలల తర్వాత, ఓ నెలలో తను వచ్చేసరికి నా దగ్గర తనకివ్వడానికి సరిపడే చిల్లర లేదు. తనదగ్గరా లేదు. హాల్లో కూర్చోమని చెప్పి, ఇంట్లోకి వెళ్లి, చిల్లరతో తిరిగొచ్చేలోగా బొత్తులుగా ఉన్న పాత పేపర్లని చూశాడు తను. "నేను పాత పేపర్లు కూడా కొంటాను సార్. తీసుకెళ్ళి పొమ్మంటారా?" అని అడిగాడు. అప్పటివరకూ, పేపర్లు పేరుకుపోయిన ప్రతిసారీ కొనే వాళ్ళకోసం వెతకడం ఓ పెద్ద పనిగా ఉండేది. అప్పటి నుంచీ నెలకి రెండు సార్లు వచ్చేవాడు. బిల్లుకి ఓసారి, పేపర్ల కోసం రెండోసారి.

తెలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు విడగొట్టి, విడిగా లెక్క కట్టి, వేటికి ఎంత అయ్యిందో విడిగా లెక్క చెప్పి, మొత్తం మాచేతే కూడించి డబ్బు చేతిలో పెట్టేవాడు. లెక్కేయడానికి బద్దకించి "మీరే లెక్క చూసి ఇచ్చేయండి" అన్నా వినేవాడు కాదు. ఓ పక్క పేపర్లు లెక్క పెట్టుకుంటూనే రాజకీయాల మొదలు, తన సొంత సంగతులవరకూ చెప్పుకొచ్చేవాడు. నేను చదివే ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఏజెంట్ గా చేరాలని తన కోరిక. ఆ ప్రయత్నాల గురించి చెబుతూ, తనకి ఏజెన్సీ వస్తే నాకా పేపర్ ఉదయాన్నే అందేలా చూస్తానని మర్చిపోకుండా చెప్పేవాడు.

ఒక నెల బిల్లు కట్టించుకుంటూ, మర్నాడు వచ్చి పేపర్లు తీసుకెళ్తానని చెప్పాడు. ఎప్పుడూ క్రమం తప్పనివాడు ఆసారి రాలేదు. ఈలోగా ఇంకో పేపర్ కుర్రాడు హాల్లో పేపర్లు చూసి తనకి ఇవ్వమని మరీ మరీ అడగడంతో, పేపర్ బిల్లు వెతికి శ్రీనివాస్ కి ఫోన్ చేశాను. "పాప పుష్పవతి అయ్యింది సార్.. ఆ హడావిడిలో ఉన్నాను.. నాల్రోజుల్లో వచ్చి తీసుకెళ్తాను" అనడంతో వచ్చిన కుర్రాణ్ణి ఉత్తి చేతులతో పంపేశాను. చెప్పిన ప్రకారం తను వచ్చి, ఫంక్షన్ ఖర్చులు వగయిరా విషయాలు చెబుతూ పేపర్లు లెక్కచూసి తీసుకెళ్ళి పోయాడు.

పుష్టిగా ఉండేవాడు కాస్తా ఉన్నట్టుండి బరువు తగ్గడం మొదలుపెట్టాడు. రెండు నెలలు చూసి, నాలుగైదు నెలల క్రితం బిల్లిస్తూ అడిగాను "వాకింగ్ చేస్తున్నారా? బరువు తగ్గారు" అని. "ఏమీ లేదు సార్" అనేసి వెళ్ళిపోయాడు. తర్వాతి నెల వచ్చినప్పుడు చెప్పాడు: "మొన్న మీరు బరువు తగ్గేను అన్నారు కదా సార్. ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు. డాక్టర్ కి చూపించుకున్నాను.. సుగర్ తగిలిందన్నారండి.." అని, "పిల్లలింకా చిన్నాళ్ళండి" అని బెంగ పడ్డాడు. నాకు తోచిన నాలుగు మాటలు ధైర్యం చెప్పి పంపించాను.

గతనెలలో అనుకోకుండా ఓ పెద్ద టూర్ తగలడంతో, తనకి ఫోన్ చేసి ఏరోజు నుంచి ఏరోజు వరకూ పేపర్ అవసరంలేదో చెప్పాను. ఊరి నుంచి తిరిగి వచ్చినా పేపర్ రావడం లేదు. తనకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. సరే, బిల్ తీసుకుని, పేపర్లు పట్టుకెళ్ళడానికి వస్తాడు కదా అనుకుని, నా పనుల్లో పడిపోయాను. ఉదయాన్నే ప్రింట్ ఎడిషన్ కి బదులు నెట్ ఎడిషన్ చదువుతూ, ఈపాటికి రావాలి కదా, ఇంకా రావడం లేదేమిటి అనుకుంటున్నాను తప్ప అంతకు మించి ఆలోచించడం లేదు.

ఇవాళ పక్కవాళ్ళ ఇంటికి వెళ్తే, మాటల్లో పక్కాయన "పేపర్ ఏజెంట్ పోయాడు, తెలుసా?" అనడంతో ఉలికి పడ్డాను. "సుగర్ తగిలిందని బాధ పడ్డాడు ఆ మధ్యన" అని నేనంటే, "అనారోగ్యం కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. పదిహేను రోజులు అవుతోంది. తెలియలేదా?" అని అడగడంతో షాక్ తగిలినట్టు అనిపించింది నాకు. "మా డ్రైవర్ ఉండే ఏరియాలోనే ఉంటాడతను. భార్యతో గొడవొచ్చి, ఉరి పోసుకున్నాట్ట.." ఆయన చెబుతుంటే, "పిల్లలు చిన్నవాళ్ళు సార్" అన్న శ్రీనివాస్ గొంతు వినిపించింది నాకు.

నేను మీకు పదిహేను రోజుల పేపర్ బిల్ బాకీ శ్రీనివాస్ గారూ.. పాత పేపర్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి.. ఎప్పుడొస్తారు ??

సోమవారం, ఆగస్టు 03, 2015

వదిలేద్దామా?

నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజలకి తమ దేశభక్తిని చాటుకోడానికి మునుపెన్నడూ లేని రీతిలో అవకాశాలిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో చీపురు పట్టడం, యోగా చేయడం 'దేశభక్తి' గా బాగా చెలామణి అయ్యాయి. ఈ జాబితాలోకి తాజాగా వచ్చి చేరిన విషయం 'గివిటప్.' అంటే మరేమీలేదు, ఎల్పీజీ రీఫిల్ సిలిండర్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీని వినియోగదారులు స్వచ్చందంగా వదులుకోవడం. 'స్వచ్చ భారత్' 'యోగా' లని మించి ఈ 'గివిటప్' కి ప్రభుత్వం ప్రచారం చేసినా, దేశభక్తులనుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా సబ్సిడీ సిలిండర్లు వాడుతున్న పదిహేను కోట్ల కుటుంబాల్లోనూ కేవలం ఆరు లక్షల కుటుంబాలు మాత్రమే ఇప్పటివరకూ సబ్సిడీ వదులుకోడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చాయి. అనగా, నూటికి కేవలం 0.35 శాతం వినియోగదారులు మాత్రమే గివిటప్ పత్రాలపై సంతకాలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచేసరికి ప్రజల్లో దేశభక్తి ఉన్నట్టుండి తగ్గిపోయిందా? తండోపతండాలుగా చీపుర్లు పట్టినవాళ్ళు, తెలతెల్లని కుర్తా పైజమాల్లో యోగాసనాలు వేసినవాళ్ళూ ఇప్పుడెందుకు మిన్నకుండిపోతున్నారు??

ఎందుకంటే, స్వచ్ఛ భారత్, యోగాసనాలూ బొత్తిగా ఖర్చు లేని పనులు. గివిటప్ ఏమో ప్రభుత్వం నుంచి ఇన్నాళ్ళుగా హక్కుభుక్తంగా వస్తున్న సబ్సిడీని ఎప్పటికీ వదిలేసుకోవడం. తేడా లేదూ మరి? ప్రభుత్వం టీవీలో చూపిస్తున్న ప్రకటనల ప్రకారం, మార్కెట్ ధరకి సిలిండర్ కొనుక్కోగలిగిన వాళ్ళందరూ సబ్సిడీని వదిలేసుకుంటే, ఇప్పటికీ కట్టెలపొయ్యి మీద వంట చేసుకుంటున్న అనేకమంది పేదవాళ్ళకి ప్రభుత్వం వంట గ్యాస్ పంపిణీ చేయగలుగుతుంది. మదర్ సెంటిమెంట్ జోడించి చేసిన ఆకర్షణీయమైన ప్రకటనలు అన్ని చానళ్ళలోనూ ప్రైమ్ టైం లో ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రచారం కోసం పెద్ద ఎత్తునే ఖర్చు చేస్తున్నట్టున్నారు.


ఈ 'గివిటప్' ని గురించి మా మిత్రుల మధ్య కొంత చర్చ జరిగింది. కేంద్ర మంత్రులు, అధికారులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరి చేతా మొదట 'గివిటప్' మీద సంతకాలు చేయించి, అటుపై ప్రజల్లోకి వచ్చి ఉంటే బాగుండేది అన్నది ఒక అభిప్రాయం. నాకిందులో న్యాయం కనిపించింది. ఎందుకంటే, వాళ్ళందరూ కూడా సబ్సిడీ అవసరం లేని వాళ్ళే. వీళ్ళతో పాటు, కార్పొరేట్లు, సినిమా తారలనీ ఈ జాబితాలో చేర్చవచ్చు. 'స్వచ్చ భారత్' లో చీపురు పట్టి టీవీల్లోనూ, పేపర్లలోనూ కనిపించారు కదా మనకి.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్లకి వస్తున్న అన్ని రాయితీలనీ వదిలేసుకుని అప్పుడు 'గివిటప్' కోసం ప్రజల్ని అడగాలన్నది మరో అభిప్రాయం. ఇది కొంచం అడ్వాన్సుడు గా ఉంది. రాయితీలు వదులుకోడమే దేశభక్తి అయినప్పుడు, గౌరవ ప్రజా ప్రతినిధులందరూ దేశ భక్తులు అయి ఉండాలని ఆశించడంలో తప్పు లేదు కదా. కానీ, ఓ పక్క ఈ 'గివిటప్' ప్రచారం నడుస్తున్న సమయంలోనే ఎంపీల జీతభత్యాలు, కేంటీన్లో ఆహార పదార్ధాలపై రాయితీ మరియు పార్లమెంటు భవనంలో స్మోకింగ్ జోన్ తదితర ముఖ్యాతి ముఖ్యమైన సమస్యల మీద చర్చలు జరిగాయి. ప్రజలకి మాత్రం దేశభక్తి ఉంటే చాలునేమో మరి.

చమురు ఉత్పత్తులన్నింటి పైనా ప్రభుత్వం పన్నుల్ని పూర్తిగా ఎత్తివేసి, లేదూ కనీసం సగానికి తగ్గించి అప్పుడు 'గివిటప్' కోసం పిలుపు ఇస్తే బావుండేది అన్నది ఇంకో అభిప్రాయం. ఇదికూడా మరీ తీసి పారేయాల్సిందేమీ కాదు. ఎందుకంటే ఆయిల్, నేచురల్ గ్యాస్ ల అసలు ధర కన్నా వాటిపై ప్రభుత్వం వేస్తున్న పన్నుల మొత్తమే ఎక్కువ. పన్నులు తొలగిస్తే గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ అవసరం లేకుండానే అందరికీ అందుబాటులోకి వచ్చే వీలుందిట! అసలు ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టు విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం మొత్తం తెచ్చేస్తే, ప్రజలందరికీ పెట్రోలూ, గ్యాసూ ఉచితంగా సరఫరా చెయ్యొచ్చు అన్నది ఓ మిత్రుడి వాదన. 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' అనుకోవాలి ప్రస్తుతానికి. ఇంతకీ, గ్యాస్ సిలిండర్లపై రాయితీని వదిలేద్దామా?

ఆదివారం, ఆగస్టు 02, 2015

రక్తస్పర్శ - శారద కథలు

భవిష్యత్తు దర్శనం చేయగలిగే వారిని 'ద్రష్ట' లు అంటారు. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఇలాంటి వారు కనిపిస్తారు. కాలపరిక్షకి నిలబడడమే కాదు, ఏ కాలంలో చదివినా 'ఇది ఈ కాలానికి సరిపోయే రచన' అనిపించడం వీరి రచనల ప్రత్యేకత. ఇలాంటి ద్రష్టల జాబితాలో 'శారద' కలం పేరుతో కలకాలం నిలిచిపోయే రచనలు చేసిన ఎస్. నటరాజన్ ది చెదరని స్థానం. శారద కథలు ఆపకుండా చదివిస్తాయి.. పదేపదే వెంటాడతాయి కూడా.

జన్మతః తమిళుడైన నటరాజన్, యవ్వనారంభంలో పొట్టకూటి కోసం తెనాలికి వలస వచ్చి, హోటల్ సప్లయర్ గా పనిచేస్తూ రాత్రి వేళల్లో తెలుగు నేర్చుకుని, సాహిత్యాన్ని మధించడం మాత్రమే కాకుండా, తెలుగు రచయితగా పేరు సంపాదించుకోవడం గొప్ప విశేషం. కాలపరిక్షకి నిలబడే కథలెన్నో రాసిన నటరాజన్ తన ముప్ఫై రెండో ఏటే అనారోగ్యంతో కన్ను మూయడం ఓ గొప్ప విషాదం.

తన ఇరవై నాలుగో ఏట 1948 లో రచనా వ్యాసంగం ఆరంభించిన శారద తర్వాతి ఏడెనిమిదేళ్ళ కాలంలో అరవై కథలు, నవలలు, నాటికలు, నాటకాలు, వ్యంగ్య రచనలూ చేసినా అందుబాటులో ఉన్నవాటి సంఖ్య స్వల్పం. కృత్యాద్యవస్థ మీద సంపాదించిన ముప్ఫై ఐదు కథలతో తెనాలికి చెందిన శారద సాహిత్య వేదిక ప్రచురించిన సంకలనమే 'రక్తస్పర్శ.' నటరాజన్ మరణించిన ఎనిమిదేళ్ళకి 'రక్తస్పర్శ' పేరుతో 1963 లో వెలువడ్డ సంకలనానికి మరికొన్ని కథలు చేర్చి వెలువరించిన పుస్తకం ఇది.


శారద కథలు పందొమ్మిది పేజీల నిడివిగల 'రక్తస్పర్శ' మొదలు సింగిల్ పేజీ కథ 'దేశమును ప్రేమించుమన్నా' వరకూ భిన్న ఇతివృత్తాలని స్పృశిస్తూ సాగాయి. సాహిత్యానికి సతతహరిత ఇతివృత్తంగా చెప్పే మానవ సంబంధాల చుట్టూ అల్లిన కథలదే సింహభాగం. కథా రచనలో శారదది తనదైన శైలి. అయితే, చలం, కొకు, చాసోల ప్రభావం స్పష్టాస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 'రక్తస్పర్శ' తో పాటు 'స్వార్ధపరుడు,' 'మరలో చక్రం,' 'గొప్పవాడి భార్య,' 'వింత ప్రకృతి,' 'పిరికి ప్రియుడు,' 'సంస్కార హీనుడు,' 'మర్యాదస్తుడు,' 'అవసానం' కథలకి ఇతివృత్తం మానవనైజమే.

చిన్న వయసులోనే తల్లినీ తండ్రినీ పోగొట్టుకుని, కాపురం ఆరంభించిన కొన్నాళ్ళకే వితంతువుగా మారిన అనసూయ, తన తమ్ముడు ప్రసాదరావుని యోగ్యుడిగా తీర్చిదిద్దిన వైనమే 'రక్తస్పర్శ.' చాసో 'లేడీ కరుణాకరం' గుర్తురాక మానదు ఈ కథ చదువుతుంటే. లోకం నోరుమూయించి మరీ తాము కోరుకున్నట్టుగా జీవించగల శక్తి ఉంది ఈ రెండు కథల్లో ప్రధాన పాత్రలకీ. వకీలు విజయరాఘవరావు గారి కాళ్ళు లేని కూతురు పద్మావతిని పెళ్ళిచేసుకున్న పేదింటి ప్రకాశరావు కథ 'స్వార్ధపరుడు.' పద్మావతి తీసుకున్న నిర్ణయం కారణంగా ఆమెనీ, ఈ కథనీ కూడా మర్చిపోలేరు పాఠకులు.


సనాతనుడైన తండ్రి, ఆదర్శవంతుడైన అన్న, అంతకు మించి ఆదర్శాలున్న భర్త.. వీళ్ళందరి పంచనా బతుకుతూ వచ్చిన ఓ స్త్రీ తనదైన జీవితాన్ని వెతుక్కోడం 'మరలోచక్రం' కథ ఇతివృత్తం. భర్త గొప్పదానాన్ని పెంచే విధంగా జీవించి, అందుకోసమే మరణించిన స్త్రీ కథ 'గొప్పవాడి భార్య.' స్త్రీ పురుషుల చాంచల్యాలని 'వింత ప్రకృతి' కథ చిత్రిస్తే, తనని ప్రేమించిన స్త్రీని చితికెక్కించిన భీరువు కథ 'పిరికి ప్రియుడు.' 'సంస్కార హీనుడు' కథలో కామేశ్వరి పాత్ర చిత్రణ జరుక్ శాస్త్రి రాసిన గొప్ప కథ 'ఒక్క దణ్ణం' లో కథానాయిక రామసీతనీ, పురాణం కథ 'సీత జడ' నాయిక సీతనీ ఏకకాలంలో గుర్తుచేస్తుంది. అయితే ఈ మూడు కథలకీ పోలిక లేదనే చెప్పాలి.

నటరాజన్ కి వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉంది. తెలంగాణా సాయుధ పోరాటాన్ని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ చారిత్రిక పోరాటం ఇతివృత్తంగా రాసిన కథలు 'కొత్త వార్త' 'గెరిల్లా గోవిందు.' సోషియో ఫాంటసీ మీద కూడా ఆసక్తి మెండే అనిపిస్తుంది 'వింతలోకం,' 'ఎగిరే పళ్ళెం' కథలు చదివినప్పుడు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని చెప్పే కథ 'కోరికలే గుర్రాలైతే.' శృంగార రస ప్రధానంగా సాగే 'కౌముది' కథనీ ఒప్పించేలా రాశారు నటరాజన్. 'శారద' లభ్య రచనల సమగ్ర సంకలనం వెలువడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(కొసమెరుపు: ఘనత వహించిన విశ్వవిద్యాలయం వారొకరు ఎమ్మే తెలుగు పాఠ్య పుస్తకంలో శారద రచనల్ని 'అశ్లీల సాహిత్యం' జాబితాలో వేశారట!)