మంగళవారం, అక్టోబర్ 26, 2010

సూక్ష్మం

మనకి చాలా బ్యాంకులున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు ఈమధ్యనే విస్తరిస్తున్న విదేశీ బ్యాంకుల వరకూ... ఓ మాదిరి పట్టణంలో కనీసం ప్రతి ప్రధాన వీధిలోనూ ఒకటి రెండు బ్యాంకు శాఖలు కనిపించే విధంగా బ్యాంకులు విస్తరించాయి. కానీ ఈ బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే విలువైన వస్తువో పత్రమో తనఖా పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకి కావలసిన మొత్తాన్ని అప్పురూపంలో కళ్ళ చూడగలం. వడ్డీతో సహా బాకీ తీర్చేశాక మనం తనఖా పెట్టిన వస్తువునో పత్రాన్నో వెనక్కి తెచ్చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

సామాన్యుడి మొదలు టాటా బిర్లాల వరకూ (వీళ్ళ పక్కనే మన తెలుగు తేజం జగన్ని కూడా చేర్చాలన్న వాదన వినిపిస్తోంది) డబ్బు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తనఖా పెట్టగల శక్తి ఉన్నవాళ్ళ కోసం బ్యాంకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మరి రెక్కల కష్టం తప్ప వేరే ఆధారం లేని వాళ్లకి? వడ్డీ వ్యాపారులు ఉంటారు (వీళ్ళనే ఒకప్పుడు ముద్దుగా కాబూలీవాలాలు అనేవాళ్ళు), వీళ్ళు అవసరానికి అప్పిస్తారు. వడ్డీ రేటు బాగా ఎక్కువగానే ఉంటుంది. చెప్పిన సమయానికి బాకీ కట్టకపోతే ఇంట్లో విలువైన వస్తువులతో పాటు, విలువ కట్టలేని పరువూ బజార్న పడుతుంది.

మేనేజ్మెంట్ పుస్తకాలు తిరగేస్తే మనకెన్నో విజయ గాధలు కనిపిస్తాయి. తోపుడు బండి మీద ఇడ్లీలు అమ్ముకున్న కుర్రాడు స్టార్ హోటల్ చైర్మన్ కావడం లాంటి నమ్మశక్యం కాని నిజాలెన్నో వాటిలో ఉంటాయి. రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకి తక్కువ వడ్డీకి అప్పిచ్చి, సులభ వాయిదాల మీద వాళ్ళ దగ్గరనుంచి బాకీ వసూలు చేసుకుంటే..? అప్పిచ్చిన సంస్థతో పాటు, అప్పు తీసుకున్న వాళ్ళూ క్రమంగా ఎదిగే అవకాశం ఉంది కదా? ఈ ఆలోచనే బంగ్లాదేశ్ కి చెందిన యూనస్ సుల్తాన్ కి వచ్చింది, ముప్ఫై నాలుగేళ్ల క్రితం. ఫలితం, గ్రామీణ బ్యాంకు స్థాపన.

ఈ గ్రామీణ బ్యాంకు విజయ గాధ ఆనోటా, ఆనోటా పాకి ప్రపంచానికంతటికీ తెలిసింది. యూనస్ కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంతే కాదు, ఈ గ్రామీణ బ్యాంకు పధకాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ఫలితంగా సూక్ష్మ ఋణం (మైక్రో ఫైనాన్స్) మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో మన రాష్ట్రంలో ఏలిన వారికి మహిళా శక్తి మీద అపారమైన గురి కుదిరి ఊరూరా స్వయంశక్తి సంఘాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) ప్రారంభించాలని సంకల్పించారు. రాజు తలచుకుంటే కానిదేముంది? స్వయంశక్తి సంఘాలకి ప్రభుత్వం లోన్లిచ్చింది. ఈ సంఘాల విజయాన్ని (కొన్ని) పత్రికలు వేనోళ్ళ పొగిడాయి. సూక్ష్మఋణ సంస్థలు చాపకింద నీరులా విస్తరించాయి.

అన్నీ సక్రమంగా జరిగిపోతే ఇంక రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు ఇవన్నీ ఎలా? అందుకే ముసలం పుట్టింది. ముందుగా స్వయం శక్తి సంఘాలకి ఋణ సరఫరా ఆగిపోయింది. నిజానికి ఇలా ఆగిపోవడంలో ప్రత్యక్షంగా సంఘ సభ్యులదీ, పరోక్షంగా రాజకీయ నాయకులదీ పాత్ర ఉంది. ఉత్పాదకత ఉన్నా లేకున్నా సంఘం నుంచి నెలనెలా ఋణం తీసుకుని, సులభ వాయిదాలలో చెల్లించడానికి అలవాటు పడ్డ సంఘ సభ్యులకి బ్యాంకుల నుంచి లింకేజి లోన్లు అందకపోవడం ఊహించని పరిణామం. లోన్లు ఆగిపోయినా, అవసరాలు ఆగవు కదా.

సరిగ్గా ఇప్పుడే, ఇప్పటికే చాపకింద నీరులా విస్తరించిన సూక్ష్మ ఋణ సంస్థలు తమ ఏజెంట్లని ఊళ్ళ మీదకి వదిలాయి. బ్యాంకులకి బదులుగా ఈ సంస్థలు స్వయం శక్తి సంఘాలకి రుణాలిస్తాయి, రెండు షరతుల మీద. మొదటగా సంఘం పేరు మార్చి కొత్త గ్రూపుగా ఏర్పడాలి.. పేరులో ఏముంది?? రెండో నిబంధన వడ్డీ.. బ్యాంకుల కన్నా'కొంచం' ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఆడడం ముఖ్యం కానీ, వడ్డీ కొంచం ఎక్కువైతే ఏమైంది??? ...ఈ ఆలోచనా ధోరణి సూక్ష్మ ఋణ సంస్థల పంట పండించింది.

మరోవైపు, స్వయంశక్తి సంఘాలకి వసూలవుతుందో లేదో తెలియని రుణాన్ని తక్కువ వడ్డీకి అందించడం కన్నా, అదే మొత్తాన్ని సూక్ష్మ ఋణ సంస్థలకి అప్పిస్తే కచ్చితంగా బాకీ వసూలవుతుందన్న హామీ ఉండడంతో బ్యాంకులు సైతం ఈ సంస్థలకి రుణాలివ్వడానికే మొగ్గు చూపుతున్నాయి. పైగా, నిబంధనల ప్రకారం ఈ సంస్థలకి ఋణం ఇవ్వడమూ 'సేవ' కిందకే వస్తోంది. సేవా సంస్థలన్న ముసుగు ఉండడం, నిన్న మొన్నటివరకూ వడ్డీ మీద ఎటువంటి నియంత్రణా లేకపోవడంతో ఈ సూక్ష్మ ఋణ సంస్థలది అక్షరాలా ఆడింది ఆట అయ్యింది. కాబూలీవాలాలే నయమనిపించేలా తయారయ్యింది పరిస్థితి.

కేవలం ఈ సంస్థలని మాత్రమే తప్పు పట్టడం సరికాదు. శక్తికి మించి అప్పులు తీసుకోవడం, ఆపై ప్రభుత్వం ఈ అప్పులని మాఫీ చేసుందన్న ధీమాతో బాకీలు చెల్లించకపోవడం అలవాటు చేసుకున్న ప్రజలూ ఉన్నారు మరి. ఋణ సంస్థలకైనా, బ్యాంకులకైనా కావాల్సింది వ్యాపారమే కాబట్టి వారి వారి వ్యాపార విస్తరణ వాళ్ళు చూసుకుంటున్నారు. సమస్య పరిష్కారం కన్నా, మీడియా కవరేజితో పూట గడవడమే ప్రతిపక్షాలకి ముఖ్యం కనుక వాళ్ళనీ ఏమీ అనలేం. మరి ప్రభుత్వం? "ఆయనే ఉంటే..." అన్న పాత సామెత గుర్తొస్తే తప్పు నాది కాదు.

సోమవారం, అక్టోబర్ 18, 2010

రాజేశ్ కి అభినందనలు...

అనంతపురం జిల్లాకి చెందిన యువ గాయకుడు రాజేశ్ కుమార్ కి అభినందనలు. ఈటీవీ నిర్వహించిన 'పాడుతా తీయగా' కార్యక్రమం ఫైనల్స్ లో ప్రధమ విజేతగా నిలిచిన రాజేశ్, సిని నటుడు చిరంజీవి చేతుల మీదుగా పది లక్షల రూపాయల బహుమతిని అందుకున్నారు . గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాత మరియు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతమూ ఆసక్తికరంగానూ, మునుపటి సిరీస్ కన్నా కొంచం వైవిధ్యంగానూ సాగింది.

రాజేశ్ తనకి చిన్నప్పటి నుంచీ సంగీతం అంతే మక్కువ అనీ, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాననీ, ఘంటసాల, బాలూలు తన అభిమాన గాయకులనీ ఫైనల్స్ కి ఎంపికైన సందర్భంగా చెప్పారు. రాజేశ్ చేసిన నిరంతర సంగీత సాధన సత్ఫలితాన్నే ఇచ్చింది. 'పాడుతా తీయగా' ప్రారంభించిన నాటినుంచీ ప్రతి సిరీస్ లోనూ ఫైనల్స్ కి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని ఎంపిక చేసి వారిలో ఒక అబ్బాయినీ, అమ్మాయినీ విజేతలుగా ప్రకటించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సిరీస్ లో అందుకు భిన్నంగా ముగ్గురు అమ్మాయిలు - లిప్సిక, మల్లిక, సబీహ - ఒకే అబ్బాయి రాజేశ్ ఫైనల్స్ కి ఎంపికయ్యారు.

సెమి-ఫైనల్స్ వరకూ ఖమ్మం జిల్లాకి చెందిన లిప్సిక, కడపకి చెందిన సబీహాల మధ్య 'నువ్వా-నేనా' అన్నట్టుగా జరిగిన పోటీ సరళి, ఫైనల్స్ కి వచ్చేసరికి అనూహ్యంగా మలుపు తిరిగి, రాజేశ్-లిప్సిక ల మధ్య పోటీగా మారింది. బాలసుబ్రహ్మణ్యం అభిమాన గాయని అయిన లిప్సిక విజేతగా ఎంపికవుతుందన్న నా అంచనాని తారుమారు చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. లిప్సిక రెండో స్థానంలో నిలిచి ఐదు లక్షల రూపాయల బహుమతిని అందుకున్నారు. మల్లిక, సబీహ లు వరుసగా మూడు నాలుగో స్థానాల్లో నిలిచారు.

నిజానికి నేనీ కార్యక్రమం క్రమం తప్పకుండా చూడడానికి కారణం సబీహ. ఈమె గొంతుని "మధుర స్వరం" అనడానికి సందేహం అనవసరం. ఈ పోటీలో తను పాడిన పాటల్లో "ఈ ఎర్రగులాబీ.." పాట ఇష్టమని సబీహ చెప్పారు. నాకు మాత్రం బాపు-రమణ ఎపిసోడ్ లో పాడిన "నిదురించే తోటలోకి.." చాలా చాలా నచ్చింది. సాఫీగా సాగిపోయే పాటలని అలవోకగా పాడేసే సబీహాకి, హుషారైన పాటలు పాడడం కొంచం కష్టమైన విషయం అనిపించింది, ఈమె పాడిన కొన్ని పాటలు విన్నప్పుడు. ఫైనల్స్ లో రెండు రౌండ్స్ లో హుషారైన గీతాలు పాడాల్సి రావడం సబీహకి మైనస్ గా మారిందని అనిపించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఆలస్యంగా (ఈ మధ్యనే) మొదలు పెట్టడం మరో మైనస్ అయ్యింది.

లిప్సిక గొంతులో మాధుర్యం పాళ్ళు తక్కువే అయినా, హుషారైన పాటలు పాడడం లో లిప్సిక ప్రతిభని తక్కువ చెయ్యలేం. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీత నేర్చుకోవడం ఈమె ప్లస్ పాయింట్. గొంతులో ఉండే కొద్దిపాటి జీర, పాటని అనుభవిస్తూ పాడే విధానం లిప్సిక ప్రత్యేకతలు. ఒక ఎపిసోడ్ లో ఈమె 'మానసవీణ మధుగీతం...' పాట పాడినప్పుడు న్యాయనిర్ణేత బాలూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, సెమి-ఫైనల్స్ లో ఒక రౌండ్ లో నూటికి నూరు మార్కులు ఇవ్వడం (పోటీల్లో, ముఖ్యంగా సెమి-ఫైనల్స్ దశలో ఇలా వందశాతం మార్కులు రావడం చాలా అరుదు) లిప్సిక ప్రతిభకి, ఈమె గళం పట్ల బాలూ అభిమానానికీ నిదర్శనం అని చెప్పాలి.

ప్రారంభపు ఎపిసోడ్లలో సాధారణంగానే పాడిన గుంటూరు జిల్లాకి చెందిన గాయని మల్లిక క్వార్టర్ ఫైనల్స్ నుంచి తన కృషిని రెట్టింపు చేశారు. ఎక్స్ ప్రెషన్ ని అలవోకగా పలికించడం ఈమె గళానికి ప్రత్యేకం. బహుమతి ప్రధానానికి చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వల్ల అప్పటివరకూ సాఫీగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా హడావిడి చోటు చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో హంగామా సృష్టించారు. ఒక సంగీత కార్యక్రమంగా 'పాడుతా తీయగా' ని తీసుకున్నప్పుడు, ముగింపు అసమగ్రంగా, అసంతృప్తిగా అనిపించింది.

మిగిలిన చానళ్ళలో వచ్చే సిని సంగీత కార్యక్రమాలతో పోల్చినప్పుడు ఇప్పటికీ 'పాడుతా తీయగా' చాలా రెట్లు నయం అనిపిస్తుంది నాకు. ఎస్సెమ్మెస్ల బెడద, ఎలిమినేషన్ తాలూకు అనవసర నాటకీయ దృశ్యాలు వంటి వాటికి అతీతంగా సాఫీగా సాగడమే ఇందుకు కారణం. ఈసారి కార్యక్రమంలో గాయనీ గాయకుల విషయంలో ప్రాధమిక దశ నుంచే క్వాలిటీ తగ్గిందన్నది చాలా చోట్ల వినిపించిన మాట. ఎంపికైన వారు 'జిల్లాకి ఒక్కరు' అనిపించేలా లేరన్నది ఫిర్యాదు. అలాగే మార్కులని మరికొంచం పారదర్శకంగా ఇస్తే బాగుంటుంది. కనీసం క్వార్టర్ ఫైనల్స్, కీలకమైన సెమి-ఫైనల్స్ దశలో అయినా మార్కులకి సంబంధించి మరికొంచం వివరణ జోడించడం అవసరం. అనవసరపు మసాలాలు ఏవీ చేర్చకుండా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని ఆశిస్తూ...

బుధవారం, అక్టోబర్ 13, 2010

చూడాల్సిందేనా?

ఒక నటుడికి అవార్డు వచ్చినందుకూ, మరో నటుడికి రానందుకూ రెండు వర్గాల మధ్యనా మాటల యుద్ధం. అవార్డు రావడం ఎంత సమంజసమో ఒకరు వివరిస్తే, రాకపోవడం వెనుక కుట్రల్ని మరొకరు బహిర్గతం చేస్తారు. వీళ్ళిలా కొట్టుకుంటూ ఉంటే జనం చచ్చినట్టు తమ చానల్నే చూస్తారన్న ఆనందం సదరు టీవీ చానల్ యాంకర్ ముఖంలో దాచినా దాగదు. మాటల మంటలు ఆరిపోకుండా మధ్య మధ్యలో సమిధలు విసురుతూ ఉంటాడతను. ఈలోగానే ఈ ముఖ్యాతి ముఖ్యమైన విషయం గురించి జనం తమ అమూల్య అభిప్రాయాలు ఎస్సెమ్మెస్ ద్వారా చెప్పాలంటూ స్క్రోలింగులు... చూడాల్సిందేనా?

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. డైలీ సీరియల్ని మించిన ట్విస్టులతో మాంచి ఉత్కంఠ భరితమైన మలుపులు తిరుగుతోంది. రాజ్యాంగ, రాజ్యాంగేతర శక్తులన్నీ తమ తమ శక్తి మేరకి ఈ కథకి మసాలా దినుసులని అందిస్తున్నాయి. తలనెరిసిన జనాలంతా రాజకీయ విశ్లేషకుల అవతారాలెత్తి చానళ్ళని పావనం చేసి జరుగుతున్న సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రమనీ, దిగ్భ్రాంతినీ తమ వాక్చాతుర్యం మేరకి వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాల నిర్వాహకులు ప్రజాస్వామ్యానికి ఇంతటి కష్టం ఇంతకుముందెప్పుడూ కలగలేదనీ, మరిన్ని అప్డేట్స్ కోసం తమ చానల్ చూస్తూనే ఉండమనీ సూచిస్తున్నారు... చూడాల్సిందేనా??

సంపదలో తాజాగా టాటాలనీ, బిర్లాలనీ మించిపోయిన రాజకీయ వారసుడు ఎవరూ ఊహించని మొత్తాన్ని ముందస్తు ఆదాయపు పన్నుగా చెల్లించాడు. కిట్టని వాళ్ళు ఈ పన్ను ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేసి గుండెలు బాదుకుంటుండగా, అతనేం చేసినా ముద్దుగానే అనిపించే వాళ్ళు అణా పైసలతో సహా లెక్కేసి పన్ను కట్టేయడం అతని నిజాయితీని సూచిస్తోందనీ, విమర్శలు చేసేవాళ్ళంతా పన్నులు ఎగేసే రకాలనీ టీవీ చానళ్ళ సాక్షిగా జనాలకి వివరిస్తున్నారు. చానళ్ళన్నీ ఇరువర్గాలతో తమకున్న సంబంధ బాంధవ్యాల మేరకు జరుగుతున్న తతంగాన్నంతా తమదైన దృష్టి కోణం నుంచి తిలకిస్తూ, ప్రేక్షకులని కూడా అదే దృష్టితో చూడమంటున్నాయి... చూడాల్సిందేనా???

ఎందుకొచ్చిన వార్తలనిపించి, ఎంటర్టైన్మెంట్ చానళ్ళ వైపు మళ్ళితే, ఒకప్పుడు వెండితెర మీద ఆడిపాడిన నాయిక ఇప్పుడు పెద్దంచు చీరలు కట్టుకుని పెద్ద తరహాగా కుటుంబ సమస్యలకి పరిష్కారాలు చెప్పేస్తోంది. గొడవ పడుతున్న కుటుంబ సభ్యులని రెండు పక్కలా కూర్చోబెట్టుకుని, వాళ్ళు ఒకరినొకరు తిట్టుకునే తిట్లని సెన్సార్ లేకుండా వింటూ, మనకి వినిపిస్తూ తనకి తోచిన సలహాలు చెప్పేస్తోంది. పనిలో పనిగా లాయర్లనీ, మానసిక వైద్యులనీ స్టూడియోలకి రప్పించి వాళ్ళచేతా సలహాలు చెప్పించేస్తోంది. వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే పరిమితం చేసుకోవాల్సిన గొడవలని మనం చూడాల్సిందేనా?

మానవ హక్కుల కమిషన్ తప్పు పట్టినా చలించకుండా ముక్కు పచ్చలారని పసిపిల్లలకి మూడోవంతు కురచ బట్టలేసి, ఏకార్ధపు పాటలకి వాళ్ళ చేత డాన్సులు చేయిస్తున్న 'అన్నయ్య'లూ 'తాతయ్య'లూ అంతటితో ఆగకుండా "వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలని ఉందమ్మా.." అంటూ తమ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు. "ఇలాగేనా స్టెప్పులేయించడం?" అని డేన్సు మేష్టర్లని అదిలించడం అయితేనేమి, "పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ కాకపొతే నిన్ను ఎలిమినేట్ చేసేస్తా" అంటూ చిన్నారుల్ని బెదిరించడం అయితేనేమి.. ఈ రియాలిటీ షోలు తమ పంధాని ఏమాత్రం మార్చుకోలేదు. అయినా కూడా వీటిని చూడాల్సిందేనా??

ఓపక్క థియేటర్లు జనాల్లేక వెలవెలబోతున్నా తమ సినిమా అన్ని రికార్డులనీ బద్దలుకొడుతోందని నిర్లజ్జగా ఇంటర్యూలిచ్చే సినిమా బృందాలు, "నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? మరి పాటని ఎవరికి డెడికేట్ చేయమంటావ్?" అంటూ కుర్రాళ్ళని కవ్వించే యాంకరీమణులు, వందలూ వేలూ ఎపిసోడ్లు జరిగిపోయాక కూడా ఇంకా పాలల్లో విషాలు కలుపుకునే అత్తలూ, కోడళ్ళూ, తన రెండో భర్తకి మూడో భార్య ఉందని తెలిసి రగిలిపోయే మహిళా పాత్రలున్న, అపూర్వ మహిళాదరణతో దీర్ఘ కాలంగా కదులూ మెదులూ లేకుండా కొనసాగుతున్న అరవ డబ్బింగ్ సీరియళ్ళూ... వీటన్నింటినీ కిమ్మనకుండా చూడాల్సిందేనా???

ఆదివారం, అక్టోబర్ 10, 2010

తోడికోడలు

కుటుంబ బంధాల్లో చాలా చిత్రమైన బంధం తోడికోడలు. అప్పటివరకూ ఒకరికొకరు ఏమాత్రం తెలియని స్త్రీలు, ఒకే కుటుంబంలోని అన్నదమ్ములని వివాహం చేసుకున్న కారణంగా ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్ళుగా కలిసి ఉండాల్సిన పరిస్థితి. అంతే కాదు, ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఒక కుటుంబం కలిసి ఉండడంలోనూ, విడిపోవడంలోనూ కూడా ప్రధాన పాత్ర పోషించింది తోడికోడళ్ళే. ఈ బంధాన్ని కథావస్తువుగా తీసుకుని దశాబ్దకాలం క్రితం చంద్రలత రాసిన కథ 'తోడికోడలు.'

కథానాయిక చిత్ర అమెరికాలో కంప్యూటర్స్ లో ఎంఎస్ పూర్తి చేసింది. తన చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ పెళ్ళికి సంపత్ వైపు నుంచి పెద్దరికం వహించింది అతని అన్న అనంత్ భార్య శారద. అలా తన తోడికోడలు శారదని తొలిసారిగా తన ఇంట్లో కలుసుకుంది చిత్ర. పొడవు లోనూ, చదువులో మాత్రమే కాదు, అంతస్తులోనూ చిత్ర కన్నా తక్కువే శారద. ఆమె కట్టు, బొట్టు, మాట, మన్నన అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే, చిత్రని తొలి చూపులోనే ఆకర్షించింది శారద కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ధీమా.

డిఫార్మసీ చేసిన శారద ఓ చిన్న పల్లెటూరి నుంచి హైదరాబాద్ వచ్చింది. అది కూడా అనంత్ ని పెళ్లి చేసుకున్నాకే. పెళ్ళయ్యాక ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. శారద లో కనిపించే ధీమాకి పక్కతాళం వేస్తున్నట్టు చురుకైన చూపులు. ఆ చూపుల్లో అహంకారం, అభిజాత్యం కనిపించకపోయినా, ఆ చూపులు వెంటాడుతూనే ఉన్నాయి చిత్రని. అనంత్ ఉద్యోగం మానేసి ఫైనాన్స్ కంపెనీ పెడితే, తను ఉద్యోగం చేస్తూ తనకి తెలిసిన వాళ్ళందరినీ చిట్టీల్లో చేర్పించింది శారద.

పెళ్ళయ్యాక ఉద్యోగానికి అమెరికా వెళ్ళిపోయిన చిత్రకి ఓ అర్ధరాత్రి పుట్టింటి నుంచి ఫోన్. శారద తమ ఇంటికి వచ్చిందనీ, అనంత్ కనిపించక రెండు వారాలు అయ్యిందనీ. చిత్ర కళ్ళ ముందు ధీమాగా ఉండే శారద రూపం మెదులుతుంది. కానీ, కట్టాల్సిన బాకీ డబ్బు ముప్ఫై నలభై లక్షలు ఉందనగానే గుండెల్లో రాయి పడుతుంది. అమెరికాలో ఇప్పుడిప్పుడే స్థిర పడుతున్న తమ మీద ఆ భారం పడుతుందేమో అన్న ఆలోచన ఆమెని స్థిరంగా ఉండనివ్వదు. అప్పు చేసి కొన్న కారు, కొనాలనుకుంటున్న ఇల్లూ కళ్ళ ముందు మెదులుతాయి.

తమకి సెలవు దొరికాక ఇండియాకి వెళ్తారు చిత్ర, సంపత్. అనంత్ సంగతులు శారదకి తెలిసినా ఎవరికీ చెప్పడం లేదని సంపత్ కి చెబుతుంది అతని తల్లి. చిట్టీలు కట్టిన వాళ్ళూ, పోలీసులూ, రౌడీలూ శారదని ఎలా ఇబ్బందులపాలు చేస్తున్నారో చిత్రకి వివరిస్తారు ఆమె తల్లిదండ్రులు. తిరిగి అమెరికాకి వెళ్ళే రోజున శారదతో మాట్లాడడానికి వెళ్తారు చిత్ర,సంపత్ లు. తనక్కడ ఉంటే శారద మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందని భావించిన చిత్ర పక్క గదిలోకి వెళ్ళబోతే, ఆమెని చేయి పట్టి ఆపుతుంది శారద.

చిత్ర భయపడ్డట్టుగానే, అన్నగారి బాకీలన్నీ తను తీర్చేస్తానని వదినకి హామీ ఇస్తాడు సంపత్. అన్నకి విడాకులిచ్చేయమని వదినకి సలహా ఇస్తాడు కూడా. చిత్రని ఆశ్చర్య పరుస్తూ ఆ సాయాన్ని తిరస్కరిస్తుంది శారద. అంతే కాదు, అనంత్ గురించి తనకి మాత్రమే తెలిసిన ఒక రహస్యాన్ని చిత్రతో పంచుకుని, తను ఏం చేయబోతోందో కూడా వివరంగా చెబుతుంది. "నువ్వు సంపత్ కు ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్రా. ఎందుకంటే... సంపత్ ఆ అన్నకు తమ్ముడేగా...!" శారద మాటల్లో హేళన ఉందో, హెచ్చరికే ఉందో తెలియదు చిత్రకి. ఆమాటలు అనుక్షణం ఆమెని వెన్నాడుతూనే ఉన్నాయి, శారద చూపుల్లాగే.

చంద్రలత కథల సంపుటి 'ఇదం శరీరం' లో 'తోడికోడలు' కథని చదవవచ్చు. 'ప్రభవ' పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 75. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. 'తోడికోడలు' తో పాటు ఉన్న మిగిలిన ఎనిమిది కథలూ ఆసాంతమూ చదివించేవే.

శుక్రవారం, అక్టోబర్ 08, 2010

వానగోదారి

ఆకాశం మబ్బుపట్టి ఉంది. ఉదయం కరిగి మధ్యాహ్నం మొదలవ్వబోతున్న వేళైనా వాతావరణం చల్ల చల్లగా ఉంది. ఉండుండి వీస్తున్నగాలి హాయిగొలుపుతోంది. మరి కాసేపట్లో గోదారి బ్రిడ్జి చేరుకోబోతున్నా. వర్ష ఋతువు కదూ.. ఎర్రెర్రని నీళ్ళతో కళకళ్ళాడిపోతూ ఉండి ఉంటుంది గోదారమ్మ. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఒక్కో ఋతువులోనూ ఒక్కో అందం మా గోదారిది. వేసవి వేడికి చిక్కిపోయిన గోదారే, నాలుగు వానలు పడేసరికి పెద్దరికం తెచ్చేసుకుని నిండు ముత్తైదువలా గాంభీర్యాన్ని ప్రదర్శించేస్తూ ఉంటుంది.

మాటల్లోనే వచ్చేసింది గోదారి బ్రిడ్జి. ఎక్కడా..యెర్ర నీళ్ళు కనపడవే? వరదల్లో భయపెట్టిన ఉగ్రరూపం ఆనవాళ్ళుకూడా లేవిప్పుడు. అచ్చం ఏమీ తెలియని నంగనాచిలా చూస్తోంది అందరికేసీ. నీళ్ళు నిశ్చలంగా, తేటగా ఉన్నాయి. ఆకాశంలో పరుగులు తీస్తున్న నల్ల మబ్బుల నీడలు అద్దంలాంటి గోదారి నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. చుట్టూ కొబ్బరి చెట్లు అంచు కడితే, మధ్య మధ్యలో పైకి తేలిన ఇసుక పర్రలూ, ఇక్కడోటీ అక్కడోటీగా తిరుగుతున్న పడవలూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా మార్చేశాయి గోదారిని.

అరె.. మధ్యాహ్నం కాబోతుండగా ఇప్పుడు చలేస్తోందేమిటి? జర్కిన్ తెచ్చుకోవాల్సింది. బలంగా వీచిన గాలికి అనుకుంటా నిశ్చల చిత్రంలా అనిపించిన గోదారిలో కదలికలు కనిపించాయి. నీళ్ళలో కనిపిస్తున్న మబ్బుల తాలూకు నీడల ఆకృతుల్లో మార్పులు వచ్చేస్తున్నాయ్. ఏం జరుగుతోందబ్బా? ఠప్ ఠాప్ మంటూ నెత్తిమీద పడ్డ రెండు వాన చినుకులు జరుగుతున్నదేమిటో చెప్పకనే చెప్పాయి. చూస్తుండగానే, జ్ఞానం తెలియని పసివాడు తన రెండు చేతుల్నీ రకరకాల రంగుల్లో ముంచి వాటిని మళ్ళీ ఆర్టు పేపర్ మీద పెట్టినట్టుగా.. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే మాడరన్ ఆర్టులా మారిపోయింది గోదారి.

పడవలో నల్ల గొడుగు తెరుచుకుంది. సరంగు బహుశా చుట్ట కాల్చుకుంటూ ఉండి ఉంటాడా? నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. చినుకులకి తడుస్తున్నానన్న స్పృహ నాకు కలగక ముందే వాన ఆగిపోయింది. క్రమ క్రమంగా మాడరన్ ఆర్టు నిశ్చల చిత్రంగా మారుతోంది. మరి కాసేపు వర్షం పడితే ఎలా ఉండేదో? చినుకులు ఆగిపోయాయనడానికి సాక్ష్యంగా ఓ పక్షుల గుంపు శక్తి మేరకి ఎగురుతూ గోదారి దాటే ప్రయత్నం చేస్తోంది. ఉన్నట్టుండి మబ్బు చాటు నుంచి సూరీడు మెరిశాడు. ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు.. అదీ గోదారి మీద.. సౌందర్యానికి ఇంతకన్నా అర్ధం ఏముంటుంది?

ప్రయాణం సాగుతూ ఉండగానే రోజు ముగింపుకి వచ్చేసింది. సూరీడు మబ్బు దుప్పటి వదలక పోవడంతో గడియారం చూస్తే కానీ సమయం తెలియడం లేదు. గోధూళి వేళ.. కానీ గోవులూ లేవు, ధూళీ లేదు. ఉన్నదంతా బురదే. మళ్ళీ గోదారి. పూటన్నా గడవక ముందే మళ్ళీ ఏం చూస్తావ్? అనలేదు తను. ఎంతసేపు చూసినా అదివరకెరుగని కొత్తదనం ఏదో ఒకటి తనలో కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మళ్ళీ చూడడం. నిజం చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చూడడం. వాన ఉద్ధృతంగా పడుతోందిప్పుడు. నింగినీ నేలనీ ఏకం చేస్తున్న వాన. రెయిన్ కోట్ నన్ను తడవనివ్వడం లేదు.

నల్లని ఆకాశం నుంచి తెల్లని వాన నీటి ధారలు నల్లని గోదారిలోకి చేసే ప్రయాణాన్ని చూడాల్సిందే. అప్పుడప్పుడూ మెరిసే మెరుపుల్లో ఈ నీటి ధారలు వెండి దారాలేమో అనిపిస్తోంది. పడవలు ఒడ్డుకి వచ్చేశాయ్. గొడుగుల జాడ లేదు. రంగురంగుల వర్ణ చిత్రంలోని రంగులన్నింటినీ కృష్ణవర్ణం తనలో కలిపేసుకుంది. ఇప్పుడు గోదారి కేవలం నలుపు తెలుపుల సమ్మేళనమే. చూస్తుండగానే చిన్న చిన్న ఇసుక పర్రలు మరింత చిన్నవై, ఇక అంతకన్నా చిన్నవి కాలేక గోదారిలో కలిసిపోయాయి మౌనంగా. సూర్యుడు అస్తమించేసినట్టున్నాడు. ఛాయామాత్రంగా అయినా కనిపించడం లేదు. దట్టంగా అలుముకున్న చీకటి వానగోదారిని తనలో కలిపేసుకుంది.

ఆదివారం, అక్టోబర్ 03, 2010

మిస్సమ్మ

తెలుగునాట గిలిగింతలు పెట్టే హాస్యంతో వచ్చిన సినిమాల జాబితా వేయాలంటే ఈనాటికీ మొదటివరుసలో ఉండే పేరు విజయా వారి 'మిస్సమ్మ'. నిర్మాణ విలువలకి పెట్టింది పేరైన విజయ సంస్థ, చక్రపాణి స్క్రిప్టు, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం, సావిత్రి, రామారావు, యస్వీ రంగారావు, జమున, నాగేశ్వర రావు, రేలంగి వంటి ఉద్దండపిండాల అసమాన నటవైదుష్యం, పింగళి నాగేంద్ర రావు మాటలు, సాలూరి రాజేశ్వర రావు సంగీతం... వీటన్నింటి కలబోతే యాభై ఐదేళ్ళ నాటి ఆణిముత్యం 'మిస్సమ్మ.'

ఓ చిన్న కథని రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాగా మలచడంలో ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో చేసిన కృషి ఈ సినిమాని చిరంజీవిని చేసింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. బ్రిటిష్ వారి పుణ్యమా అని ఆంగ్ల విద్యా బోధన పెరగడంతో ఊరూరా బీయేలు పెరిగిపోయారు. మరోపక్క వారికి ఉద్యోగాలు చూపించగల స్థితిలో లేదు ప్రభుత్వం. ఈ నిరుద్యోగ సమస్యని ఉన్నదున్నట్టుగా చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది కానీ కలకాలం నిలిచిపోయే సినిమా అవ్వదు కదా.

అందుకే ఈ కథకి "చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లకోసం వెతకడం" అనే ఫ్యామిలీ డ్రామాని జత చేసి ఎవ్వరికీ ఎక్కడా విసుగు కలిగించని విధంగా ఆసక్తికరమైన సినిమాగా మలిచారు నాగిరెడ్డి-చక్రపాణి మరియు ఎల్వీ ప్రసాద్ లు. కథ విషయానికొస్తే, మదరాసు మహా నగరంలో ఎం. టి. రావు (ఎన్టీ రామారావు) ఓ అనాధ. బీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకులాటలో అతనికి మిస్ మేరీ (సావిత్రి) తో పరిచయం అవుతుంది. ఆమె కూడా బీఏ, ఉద్యోగం ఆమెకి కూడా అవసరం, వృద్ధులైన తల్లిదండ్రులకి ఆమె ఒక్కర్తే ఆసరా. అదీకాక అవసరానికి అప్పిచ్చి, ఆపై పెళ్ళిచేసుకుంటానని వేధిస్తున్న డేవిడ్ (రమణారెడ్డి) ని వదిలించుకోడానికైనా ఆమెకి డబ్బు, అందుకోసం ఉద్యోగం అవసరం.

మదరాసుకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఆంధ్రదేశంలో అప్పాపురం అనే ఓ పల్లెటూళ్ళో గోపాలరావు (యస్వీ రంగారావు) ఓ ధనవంతుడు. భార్య (ఋష్యేంద్ర మణి), కూతురు సీతాలక్ష్మి (జమున), మేనల్లుడు 'డిటెక్టివ్' రాజు (నాగేశ్వర రావు) ఇదీ అతని కుటుంబం. పదహారేళ్ళ క్రితం మహాలయ అమావాస్య నాడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అప్పటికి నాలుగేళ్ల పిల్లగా ఉన్న పెద్ద కూతురు మహాలక్ష్మి జనసందోహంలో తప్పిపోతుంది. ఆమె పేరిట ఊళ్ళో ఓ ఎలిమెంటరీ స్కూలు నడుపుతూ ఉంటాడు గోపాలరావు.

మేష్టార్లు సరిగా పాఠాలు చెప్పని కారణంగా బడి మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం లేని గోపాల రావు ఇద్దరు బీయేల కోసం పేపర్లో ప్రకటన ఇప్పిస్తాడు. వారిలో ఒకరుసంగీతం వచ్చిన స్త్రీ అయితే, ఆమె దగ్గర సీతాలక్ష్మికి సంగీతం నేర్పించవచ్చునన్నది ఆయన ఆలోచన. కూతుర్ని ఎలాగైనా బీయే ని చేయాలన్నది ఆయనకున్న మరోకోరిక. మేష్టర్లిద్దరికీ తనే వసతి ఏర్పాటు చేసి, మంచి జీతలివ్వాలనుకుంటాడు. "వాళ్ళిద్దరూ భార్యా భర్తలై ఉండాలని రూలు పెడితే, ఒకే వసతి సరిపోతుంది కదా" అన్న రాజు సలహా మేరకు ప్రకటనలో ఆ మేరకు మార్పు చేయిస్తాడు గోపాలరావు.

సరిగ్గా అప్పుడే "నీ డిటెక్టివ్ పని చేసి, తప్పి పోయిన మా అక్కని వెతికి పెట్టొచ్చు కదా బావా" అన్న సీతాలక్ష్మి ప్రతిపాదన, రాజు లోని డిటెక్టివ్ ని ఉత్సాహ పరుస్తుంది. అప్పటికే పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రావు, మేరీ ఆ ప్రకటన చూసి ఉద్యోగాల కోసం భార్యాభర్తలుగా నటించడానికి సిద్ధపడి, దరకాస్తు చేస్తారు. సర్టిఫికేట్లైనా చూడకుండానే వాళ్లకి ఉద్యోగం ఇచ్చేస్తాడు గోపాలరావు. మిసెస్ రావు ని (కనీసం ఆమె పేరైనా అడగరు వాళ్ళు) చూడగానే తెలియని వాత్సల్యం పుడుతుంది గోపాలరావు దంపతులకి. మేరీనే మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అన్న సందేహం మొదలవుతుంది రాజుకి.

ఓపక్క తనకి ఏమాత్రం ఇష్టం లేని హిందూమత సంప్రదాయాలని పాటిస్తూ, అస్సలు ఇమడలేని కొత్త వాతావరణంలో ఇబ్బందులు పడే మేరీ, మరోపక్క ఆమెలో తమ కూతుర్ని చూసుకుని ఆపేక్ష చూపించే గోపాలరావు దంపతులు, ఇంకోపక్క మేరీయే మహాలక్ష్మి అన్న అనుమానంతో పరిశోధన చేసే రాజు. రావు, మేరీల మధ్య వచ్చే తగువులకి ప్రత్యక్ష సాక్షి రావు స్నేహితుడు దేవయ్య (రేలంగి). రావు, మేరీల కథంతా తెలుసు దేవయ్యకి. ఇదిగో ఈ దేవయ్యనే ఉపయోగించుకుని పరిశోధన చేయాలనుకుంటాడు రాజు.

కానీ చేతిలో 'తైలం' పడందే పెదవి విప్పుడు దేవయ్య. (ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన 'అందాల రాముడు' లో అల్లు రామలింగయ్య 'ఆమ్యామ్యా' ని పరిచయం చేసేవరకూ, లంచానికి ముద్దు పేరుగా కొనసాగింది ఈ తైలమే) పోనీ తైలం పడ్డాకైనా నిజం చెబుతాడా అంతే, అదీ లేదు. అమాయకురాలైన సీతాలక్ష్మి చేష్టల పుణ్యమా అని రావు మేరీల మధ్య స్పర్ధలు పెట్టి, ప్రేమ పెరగడానికి దోహదం చేస్తాయి. రావు-మేరీల నాటకం గోపాలరావుకి తెలిసిందా? మహాలక్ష్మి దొరికిందా? తదితర ప్రశ్నలకి జవాబిస్తూ సినిమా ముగుస్తుంది.

నటీనటుల గురించి చెప్పాలంటే మొదటగా చెప్పాల్సింది టైటిల్ పాత్ర పోషించిన సావిత్రి గురించే. బొట్టూ, పూలూ ధరించడంలో అయిష్టత చూపడం మొదలు, అమాయకురాలైన సీతాలక్ష్మి రావుతో చనువుగా ఉంటే భరించలేక ఆవేశ పడడం వరకూ ప్రతి సన్నివేశంలోనూ ప్రతి చిన్న హావభావాల్నీ అత్యంత సమర్ధంగా పోషించి, మిస్సమ్మ ని సజీవంగా కళ్ళముందు నిలిపింది సావిత్రి. 'సీమంతం' అంతే ఏమిటో తెలియకుండా సీమంతం జరిపించేసుకునే సన్నివేశం, రాజు వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా అతనికి సంగీతం నేర్పించే సన్నివేశాలని మర్చిపోవడం అంత సులభం కాదు. రావు పాత్రని తెర మీద చూసినప్పుడల్లా 'కన్యాశుల్కం' గిరీశం రేఖామాత్రంగా గుర్తొస్తాడు నాకు. తనకీ, మేరీకీ మధ్య జరిగిన తగువుల్ని గోపాలరావు దగ్గర 'మేనేజ్' చేసే సన్నివేశాల్లో రావుగా ఎన్టీఆర్ నటన గుర్తుండి పోతుంది.

పల్లెటూరి దంపతులుగా ప్రేమనీ, ఆపేక్షనీ కలబోసి చూపే పాత్రల్లో యస్వీఆర్, ఋష్యేంద్రమణి జీవించారనే చెప్పాలి. ఈ దంపతులు రావుని ఎంతగా నమ్మారంటే, ఒకసందర్భంలో సహనం కోల్పోయిన మేరీ "నేను క్రిష్టియన్ని, నా పేరు మేరీ, నాకింకా పెళ్ళికాలేదు" అని చెబితే, పంతులమ్మకి దెయ్యం పట్టిందనుకున్నారే తప్ప, ఆమె నిజమే చేబుతోందేమో అన్న అనుమానం లేశమైనా కలగలేదు వాళ్లకి. రావు-మేరీలని అమ్మాయి-అల్లుడు అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలు, వాళ్లకి ఇబ్బంది కలగ కూడదనుకుంటూ వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్లకి కలిగే ఇబ్బందులు, అప్పుడు పుట్టే హాస్యం తెర మీద చూడాల్సిందే.

పల్లెటూరి పిల్లగా జమున నటన గురించి చెప్పాలంటే మచ్చుకి ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలి. పంతులమ్మ దగ్గర సంగీతం నేర్చుకోడానికి మేష్టారింటికి వెళ్తుంది సీతాలక్ష్మి. పంతులమ్మ లోపలెక్కడో ఉంటుంది. మేష్టారి పక్కన సోఫాలో చనువుగా కూర్చుని కుశలాలు మొదలుపెడుతుంది సీతాలక్ష్మి. "కాఫీ తాగుతావా?" అని మేష్టారంటే "వద్దు మేష్టారూ, ఇప్పుడే చద్దన్నంలో పెరుగేసుకుని తినొచ్చా" అని చెబుతుంది. కాసేపట్లో పంతులమ్మ వచ్చి, మేష్టారి పక్కన కూర్చున్నందుకు భగ్గున మండి, సోఫాలో నుంచి లెమ్మంటే "ఇది మా సోఫా, నేనిక్కడే కూర్చుంటా"నంటుంది. అంతలోనే పంతులమ్మ "తెలుసుకొనవె చెల్లీ.." అని పాఠం మొదలెడితే, అలక మర్చిపోయి పాఠానికి వెళ్ళిపోతుంది.

రావు-మేరీ పాత్రలని ఇరుసు-చక్రం అనుకుంటే, ఆరెంటినీ సరిగ్గా పనిచేయించే కందెన దేవయ్య. ఈ పాత్రలో రేలంగి ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని మర్చిపోవడం అంత సులువు కాదు. తన పని కోసం వీళ్ళ చుట్టూ తిరిగే డిటెక్టివ్ రాజు గా నాగేశ్వరరావు నవ్విస్తాడు. రేలంగి-నాగేశ్వర రావు ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో నాగేశ్వరరావు సహాయకుడిగా నటించిన నటుడి హావభావాలు... ఇలా ఒకటేమిటి? సినిమా మొత్తాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. స్క్రిప్టు పకడ్బందీగా ఉండడం, ఎక్కడా ఏ సన్నివేశమూ అనవసరం అనిపించక పోవడం చక్రపాణి గొప్పదనం అనే చెప్పాలి. ఈ సినిమాకి మూలం ఓ బెంగాలీ సినిమా అంటోంది వికీపీడియా.

రాజేశ్వర రావు సంగీతంలో పాటలని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తి కాదు. ఏ.ఏం. రాజా, లీల, సుశీల పాడిన పాటల్లో 'ఆడువారి మాటలకు..,' 'రావోయి చందమామ...,' 'బృందావనమిది అందరిదీ..,' 'కరుణించు మేరి మాతా..' ఇంకా 'బాలనురా మదనా..' పాటలు సంగీత ప్రియుల కలెక్షన్లలో శాశ్విత స్థానం పొందాయి. ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో వచ్చే నేపధ్య సంగీతానికీ, రెండేళ్ళ తర్వాత విజయ సంస్థ తీసిన 'మాయా బజార్' సినిమాలోని 'భళి భళి భళి భళి దేవా..' పాట ట్యూన్ కీ దగ్గర పోలికలు వినిపిస్తాయి. మనసు బాగోనప్పుడు 'మిస్సమ్మ' సినిమా చూడడం కన్నా మంచి మందు మరొకటి ఉండదు.