ఆదివారం, జులై 03, 2011

పాటల్లేవ్...

గడిచిన ఇరవై ఏళ్ళలో తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టి గాయనీ గాయకులుగా స్థిరంగా కొనసాగుతున్నవాళ్ళు ఎంతమంది? దీనికి జవాబు ప్రశ్నంత సులువు కాదు. నిజానికి గాయనీ గాయకులు మాత్రమే కాదు, తెలుగు సినిమా పాటకు సంబంధించి ఎవరూ కూడా నిశ్చింతగా కెరీర్ కొనసాగించలేని పరిస్థితి నడుస్తోందిప్పుడు. ఎంతో మంది కొత్త గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, గీత రచయితలు నిత్యం పరిచయం అవుతున్నారు. వీళ్ళలో చాలామంది ఎంత తొందరగా వస్తున్నారో, అంత తొందరగానూ తెరమరుగై పోతున్నారు.

ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ - అంటే ఏ.ఆర్. రెహ్మాన్ సిని సంగీత దర్శకుడిగా అవతరించక ముందు వరకూ - తెలుగు సినిమా పాట అంటే కేవలం కొన్ని పేర్లు మాత్రమే వినిపించేవి. అప్పటివరకూ ప్రభంజనం సృష్టించిన ఇళయరాజా మొదలు అప్పటికే బాగా స్థిరపడ్డ ఏ సంగీత దర్శకుడు సంగీతం సమకూర్చినా మెజారిటీ పాటలు పాడేది మాత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, సుశీల, జానకి, వాణి జయరాం, శైలజ, చిత్ర. వీళ్ళలో జేసుదాసు, చిత్ర మలయాళీలు, వాణీ జయరాం తమిళ్.. అయినప్పటికీ ఎక్కడో తప్ప ఉచ్చారణా దోషాలు లేకపోవడం వల్ల తెలుగు పాట వింటున్న భావనే కలిగేది.

ఒకేసారి అనేక కొత్త గొంతుల్ని పరిచయం చేయడం ద్వారా, అప్పటివరకూ ఉన్న గాయనీ గాయకుల మొనోపలీని విజయవంతంగా బద్దలుకొట్టాడు రెహ్మాన్. కొత్త ఎప్పుడూ వింతే కాబట్టి, శ్రోతలకి కూడా ఈ కొత్త స్వరాలు, కొత్త గొంతులూ బాగా నచ్చాయి. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. రెహ్మాన్ స్పూర్తితో ఎందరెందరూ కొత్త సంగీత దర్శకులు రావడం, ప్రతి ఒక్కరూ కొందరు గాయనీ గాయకులని, గీత రచయితల్నీ పరిచయం చెయ్యడం. గ్లోబలైజేషన్ మొదలైన తరుణం కావడంతో ఆ ప్రభావం సిని సంగీతం మీదా పడింది. అప్పటినుంచీ అదే ట్రెండ్ కొనసాగుతోంది.

ఫలితంగా ఇవాల్టి రోజున తెలుగు సినిమా పాటలు పాడుతున్న గాయనీ గాయకుల్లో నూటికి తొంభై మందికి తెలుగు రాదు. సంగీత దర్శకుల్లో ఈ శాతం నలభై నుంచి యాభై వరకూ ఉంది. ఒక్క రచయితలు మాత్రం తెలుగు వాళ్ళే. అయితేనేం? వీళ్ళ పాటల్లోనుంచి తెలుగు నెమ్మది నెమ్మదిగా తప్పుకుంటోంది. కొన్ని తన స్థాయికి తగని పాటలు రాసినా, వేటూరి చాలా గొప్ప పాటలు రాశారన్నది నిర్వివాదం. తర్వాత ఎవరు? అన్న వెతుకులాటకి దొరికిన ఓకే ఒక సమాధానం సిరివెన్నెల సీతారామశాస్త్రి. జాను తెలుగు మీద పట్టున్న గీత రచయిత. మరి, తర్వాత? ఈ ప్రశ్న వేసుకోడానికే ఆలోచించాల్సి వస్తోంది.

ఉండడానికి డజనుకి పైగా గీత రచయితలున్నారు మనకి. కానీ వాళ్ళలో నిజమైన తెలుగు పాటని, ఒక్క పరభాషా పదాన్నీ ఉపయోగించకుండా రాయగలిగే వాళ్ళు ఎందరు? ఒకవేళ ఎవరైనా కష్టపడి రాసినా, ఉచ్చారణా దోషం లేకుండా పాడగలిగే వాళ్ళు ఏరీ? గాయకులు తప్పు పాడితే పట్టుకోగలిగే సంగీత దర్శకులు ఎక్కడ? ఈటీవీలో వస్తున్న 'పాడుతా తీయగా' కార్యక్రమానికి ఈ మధ్య కాలంలో రెండు వేర్వేరు ఎపిసోడ్లకి గాయనులు కౌసల్య, సునీత అతిధులుగా వచ్చారు. ఇద్దరూ తెలుగు వాళ్ళే. ఇద్దరూ గత పదేళ్లుగా రికార్డు సంఖ్యలో కాకపోయినా తెలుగు పాటలు పాడుతున్న వాళ్ళే. ఆశ్చర్యంగా ఇద్దరూ కూడా తమ కెరీర్ గమనం పట్ల అసంతృప్తినే వ్యక్తం చేశారు. మంచి పాటలు రావడం లేదన్నది వాళ్ళ అభిప్రాయం.

గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు అన్ని తెలుగు చానళ్ళూ ఏదో ఒక పేరుతో టాలెంట్ హంట్ నిర్వహించి, కొత్త గొంతుల్ని పరిచయం చేస్తున్నాయి. కానీ ఇలా వస్తున్న వాళ్ళెవరూ దీర్ఘకాలం పాడలేకపోతున్నారు. పోటీ విపరీతంగా పెరగడంతో, కెరీర్లో అనిశ్చితి. ఎప్పటికప్పుడు దూసుకొస్తున్న కొత్త గొంతులు, సంగీత దర్శకులు, రచయితలు. నిజానికి పోటీ పెరిగినప్పుడు ఉత్పత్తి నాణ్యత పెరగాలి. కానీ, శ్రోతలుగా మనకి దొరుకుతున్న మంచి పాటలు ఎన్ని? ధియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా గుర్తుండే పాటల్ని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు.

పోనీ ఇదంతా వేగం పెరగడం వల్ల అనుకుందామా అన్నా, గతంతో పోల్చినప్పుడు నిర్మాణమయ్యే సినిమాల సంఖ్య విపరీతంగా ఏమీ పెరిగిపోలేదు. కానైతే కొత్త కొత్త నిర్మాతలూ, దర్శకులూ వచ్చి పోతున్నారు. వీళ్ళలో కూడా నిలబడుతున్న వాళ్ళు తక్కువే. తెలుగు సినిమా పాట నిరంతర ప్రయోగ శీలి అనుకుందామన్నా ప్రయోగ ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదు. 'రెహ్మానైజేషన్' ని నిందించడం నా ఉద్దేశం కాదు. కొత్తని ఎప్పుడూ ఆహ్వానించాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నా, చాలా తక్కువ మొత్తంలో ఫలితాలు వస్తూఉండడమే ఈ అసంతృప్తికి కారణం.

7 కామెంట్‌లు:

  1. పాట పది కాలాలు నిలబడే అంతగా గొప్ప సంగీతం,సాహిత్యం కొరవడటమే కాదు.. సన్నివేశం కూడ వీక్షకుడి దృష్టి పథాన్ని ధాటి పోతుంది కాబట్టి ఏ పాట చెరగని ముద్ర వేయలేకపోతుంది. అంకితభావం లేకుండా ఏ పని చేసినా ఇలాటి ఫలితాలు..వస్తాయి. ట్రెండ్ మార్చుకుంటే తప్ప పాట అయినా సినిమా అయినా బతకదు.అది గుర్తిస్తే మంచి ప్రతిభ ఉన్నవారికి తప్పకుండా..అవకాశాలు దొరుకుతాయి.తెలుగు తనం లోపించిన తెగులు పట్టుకున్నది గనుక కర్ణకటోరంగా ఉంటున్నాయి.. మంచి విషయం చెప్పారు మురళి గారు.బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. కరక్టే...అలా చెప్పుకుంటూ పోతే మంచి సంగీతదర్శకులు...అభిరుచి ఉన్న నిర్మాతలు(ఇది పెద్దజోక్ అయ్యిపోయింది కూడా)... నటించగలిగిన హీరోలు ఇలా ఏ విభాగమైనా అలాగే ఉంది.

    రిప్లయితొలగించండి
  3. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదండి.ఏదయినా అతిగా చేస్తే ఇలానే ఉంటుంది.పాడేవాళ్ళు ఎక్కువయిపోయారు సరే ఆ తూకానికి సరిపడా సినిమాలు రావాలి,దాంట్లో మంచి సాహిత్యంతో కూడిన(?)పాటలుండాలి,అప్పుడా పాట ప్రాచుర్యం పొందితే ఆ గాయకులకీ రచయితకీ పేరొచ్చి ఇంకా కొన్ని అవకాశాలు వచ్చి స్థిరపడి....అబ్బో ఇదో పెద్ద రాత/పాట చరిత్ర.అసలు వీటన్నికన్నా ముందు ఆ సినిమా తీసే నిర్మాతకి మంచి అభిరుచి ఉండాలి కానీ ఇప్పుడున్న/వచ్చే నిర్మాతలకి ఉన్న రుచీ అభిరుచీ వేరు మరి...

    రిప్లయితొలగించండి
  4. సరి అయిన సంగీతం, సాహిత్యం లేని పాటలకి ఏ కాలమైనా ఇదే గతి అనిపిస్తుంది. కొన్ని సార్లు సాహిత్యం బాగాలేక పోయినా సంగీతం వల్ల వినాలనిపిస్తుంది. గాయకులు ఎంతమంది ఉన్నా ఈ ప్రభావం తప్పకుండా వారి మీద పడుతుంది. ఉత్తరాది సినిమా హీరోయిన్ల లాగానే, సినిమాకొక గాయకుడు విధానం కూడా మొదలైంది కదా. సినిమాల్లోనే పాడల్సిన అవసరం కూడా లేదు కదా. అనేక మద్యమాలు వచ్చాయి. ప్రతిదీ కమర్షియల్ అయినప్పుడు కళకోసం ఆరాట పడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మళ్ళీ ట్రెండ్ మారే వరకు ఎదురుచూడాల్సిందే. అప్పుడప్పుడొచ్చే చక్కటి సంగీతం కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఉన్నవారిలోనే మన అభిమాన గాయకులను ఎన్నుకోవాల్సిందే:)
    (ఏవిటో మీకీ మధ్య నేను చాలా పెద్ద పెద్ద కామెంట్లిస్తున్నాను:)

    రిప్లయితొలగించండి
  5. సీతారామశాస్త్రి గారి తరువాత చంద్రబోస్, అనంత్ శ్రీరాంలలో ఆ తెలుగుదనం ఉందనిపిస్తుంది నాకు. పరిస్థితులు అనుకూలిస్తే వీళ్ళూ చక్కని తెలుగులో రాయగలరు అనేది నా పరిశీలన. ఎంతవరకూ సరైనదో తెలియదు. కానీ మీరు అన్న "వీళ్ళ పాటల్లోనుంచి తెలుగు నెమ్మది నెమ్మదిగా తప్పుకుంటోంది" అన్నమాట మాత్రం నిజం.

    రిప్లయితొలగించండి
  6. @వజన వనమాలి: 'అంకిత భావం' ..చాలా మంచి అంశాన్ని స్పృశించారు మీరు.. ధన్యవాదాలండీ..
    @పక్కింటబ్బాయి: అసలు అభిరుచే పెద్ద జోకై పోతోందండీ.. మళ్ళీ మళ్ళీ చూసే సినిమాలు తగ్గిపోతున్నట్టే, మళ్ళీ మళ్ళీ వినే పాటలూ తగ్గిపోతున్నాయి.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: నిజం..నిజం.. బాలూ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా కనీసం దరిదాపులకి రాగలిగే గాయకుడు ఇంతవరకూ రాలేదండీ మనకి (ఏ భాష వాడు అయినప్పటికీ) ..ఇప్పటి రుచుల నేపధ్యంలో మనం అలా ఆశించకూడదేమో మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @జయ: అనేక మాధ్యమాలు ఉన్నప్పటికీ సినిమా శక్తివంతమైన మాధ్యమం కదండీ.. పైగా ఏ మాధ్యమం లో ఉన్న కళాకారుల అంతిమ లక్ష్యమైనా సినిమానే అవుతోంది ఇప్పుడు.. వివరంగా మీ అభిప్రాయాలు పంచుకుంటోన్నందుకు ధన్యవాదాలండీ..
    @శిశిర: అనంత శ్రీరాం విషయంలో ఏకీభవిస్తానండీ నేను.. కొన్ని మంచి పాటలు రాశాడు. కృషి చేస్తే ఇంకా బాగా రాయగలడు అనిపిస్తోంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి