బుధవారం, జులై 06, 2011

హిమబిందు

చిత్రకారులంతా కుంచెలనీ, రంగులనీ ఉపయోగించి అందమైన వర్ణచిత్రాలకు రూపు దిద్దుతారు. ఒకానొక చిత్రకారుడు, కుంచెతో పాటుగా కలాన్నీ చేతపట్టి, కేవలం రంగులతో మాత్రమే కాకుండా అక్షరాలతోనూ బొమ్మలు గీశాడు. వాటిలో ఒకానొక దృశ్య కావ్యమే 'హిమబిందు.' రచయిత అడివి బాపిరాజు. ఈ చారిత్రాత్మక నవల చదువుతున్నంత సేపూ ఎక్కడా కూడా కేవలం 'చదువుతున్న' అనుభవం కలగలేదు. కథంతా నా కళ్ళెదుట జరుగుతున్నట్టుగానూ, నన్ను నేను మైమరిచి జరుగుతున్న దానిని చూస్తున్నట్టుగానూ అనిపించిందంటే, అది కేవలం అడివి బాపిరాజు చేసిన అక్షర మాయాజాలం.

ఆంధ్రుల చరిత్రలో శాతవాహనులది ముఖ్యమైన కాలం. అసలు తొట్టతొలి ఆంధ్ర పాలకులు శాతవాహనులే అన్న వాదనకూడా ఉంది. 'హిమబిందు' నవల కథాకాలం శ్రీముఖ శాతవాహనుడు ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రోజులు. ధాన్యకటక పట్టణంలో ప్రముఖ వ్యాపారి చారుగుప్తుడి ఏకైక కుమార్తె హిమబిందు కుమారి. చారుగుప్తుడిని గురించి ఒక్క మాటలోచెప్పాలంటే అతడు కుబేరునికే అప్పివ్వగలవాడు. గ్రీకు వ్యాపారవేత్త డెమాస్తనీస్ సోదరి - తర్వాతికాలంలో ముక్తావళిదేవి గా మారిన - 'పెర్లా' కుమార్తె ప్రజాపతి మిత్ర హిమబిందు తల్లి. ఆవిధంగా హిమబిందులో ఆంధ్ర, యవన రక్తాలు ప్రవహిస్తున్నాయి. స్త్రీలు కూడా తిరిగి చూసే అందం హిమబిందు కుమారిది.

చారుగుప్తుని సోదరి అమృతలతా దేవి కుమారుడు, శాతవాహన రాజ్యపు యువ సైనికాధికారీ అయిన సమదర్శికి తన మరదలంటే ఇష్టం. అమృతలతా దేవికి మేనకోడలినే తన కోడలిగా చేసుకోవాలని కోరిక. అయితే, యువరాజు శ్రీకృష్ణ శాతవాహనునికి హిమబిందు కుమారిని ఇచ్చి వివాహం చేయడం ద్వారా మహారాజుతో వియ్యమందాలన్నది చారుగుప్తుని అభీష్టం. మహారాజు జన్మదిన సందర్భంగా జరిగిన ఎడ్లబళ్ళ పందాలలో సమదర్శిని సైతం ఓడించి నిలిచిన యువ వీరుడూ, శిల్పీ అయిన సువర్ణశ్రీ - హిమబిందు తొలిచూపులోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. అదే సంరంభంలో సువర్ణశ్రీ చెల్లెలు నాగబంధునిక సమదర్శితో ప్రేమలో పడుతుంది.

బౌద్ధ మతావలంబకులైన శాతవాహనుల కారణంగా, రాజ్యంలో ఆర్ష ధర్మం అడుగంటుతోందన్న ఆగ్రహంతో అపర విశ్వామిత్రుడిగా పేరు తెచ్చుకున్నస్థౌలతిష్య మహర్షి, శాతవాహనుల మీద ఆగ్రహంతో, శ్రీకృష్ణ శాతవాహన యువరాజుని అంతం చేయాలనే సంకల్పంతో తన మనవరాలు చంద్రబాలని 'విషబాల' గా తయారు చేసి ఆమెని యువరాజుపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తాడు. ఇంతలోనే ఉజ్జయిని పై శత్రువులు దండెత్తడంతో యుద్ధం అనివార్యమయింది. పాటలీపుత్రాన్ని కూడా జయించి శ్రీముఖుడు జంబూద్వీపానికే చక్రవర్తి కావాలన్న తన ఆకాంక్షని బయట పెట్టిన చారుగుప్తుడు, దండయాత్రకి అవసరమయ్యే సమస్త ఖర్చులూ తనేభరిస్తానని మనవి చేస్తాడు మహారాజుకి.

ఓపక్క సువర్ణశ్రీ-హిమబిందు కుమారిల ప్రణయం, మరోవంక యుద్ధ సన్నాహాలు. మహారాజుతో కలిసి యుద్ధానికి బయలుదేరబోతూ, హిమబిందుని శ్రీకృష్ణ శాతవాహనునికిచ్చి ఆమెని భావి సామ్రాజ్ఞిగా చూడాలన్నతన కోరికని కుమార్తె ముందుంచుతాడు చారుగుప్తుడు. తండ్రికి ఎదురు చెప్పే స్వభావం కాదు హిమబిందుది. హిమబిందు భావి సామ్రాజ్ఞి కానున్నదన్న విషయం సువర్ణశ్రీ కి తెలుస్తుంది. అంతలోనే ఊహించని విధంగా, శత్రువులెవరో హిమబిందునీ, ఆమె అమ్మమ్మ ముక్తావళీ దేవినీ అపహరిస్తారు. ఆమెని వెతుకుతూ బయలుదేరతాడు సువర్ణశ్రీ. యుద్ధానికి బయలుదేరుతున్న శ్రీకృష్ణ శాతవాహనునిపై విషబాలని ప్రయోగిస్తాడు స్థౌలతిష్య మహర్షి.

ప్రేమలూ, పగలూ, రాచరికపుటెత్తులూ, వ్యాపారపు మాయలూ, ఆర్ష ధర్మం, బుద్ధ బోధనలు, యుద్ధ నీతులూ, ఉత్కృష్టమైన కళా సంస్కృతులు, ఊహకందని మానవ సంబంధాలు... పూర్తిగా ఓ కొత్త ప్రపంచం - అది కూడా పాఠకులని ఇట్టే ఆకర్షించే ప్రపంచాన్ని అలవోకగా సృష్టించారు బాపిరాజు. మొదటి పాతిక పేజీలని కొంచం ఓపిగ్గా చదివితే, తర్వాత ఈ పుస్తకాన్ని పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేం. సువర్ణశ్రీ పాత్ర పట్ల రచయిత ప్రేమ ఎక్కడా దాగలేదు. అతన్నో వీరాధి వీరుడిగా, నిశిత బుద్ధి గలవాడిగా, ఒక ఆదర్శ మూర్తిగా చిత్రించారు బాపిరాజు. హిమబిందు ప్రధాన నాయిక అయినప్పటికీ, ఆమెకన్నా విషబాలని ఎక్కువ శ్రద్ధగా తీర్చి దిద్దారేమో అనిపించింది చాలాసార్లు.

స్థౌలతిష్య మహర్షి చేసే పనులు తెలిసీ మహారాజు ఊరకుండడం ద్వారా శాతవాహనుల పరమత సహనాన్ని చిత్రించారు రచయిత. అలాగే స్థౌలతిష్యుడు బౌద్ధ గురువు అమృతపాదుల మధ్య జరిగిన వేదాంత చర్చ ఆద్యంతం ఆసక్తిగా చదివించింది. ఇక్కడే కథకి ఒక అందమైన ముడి వేశారు బాపిరాజు. శాతవాహనుల పాలన, సైన్యాన్ని పోషించిన తీరు, ఆనాటి వర్తక వాణిజ్యాలు, చార వ్యవస్థ, బౌద్ధాన్ని వ్యాప్తి చేసిన విధానం వీటన్నింటినీ అత్యంత నిశితంగా అక్షరబద్ధం చేశారు. సువర్ణ శ్రీ కుటుంబం చెల్లెళ్ళు నాగబంధునిక, సిద్ధాంతికలతో అతని అనుబంధం, హిమబిందు-నాగబంధునికల స్నేహ బంధం, విషబాలని పెంచిన తీరు, ఆమె ఆలోచనల్లో క్రమంగా కలిగే మార్పులు, వివాహాన్ని గురించి యువరాజు, సమదర్శిల ఆలోచనలు.. ఇలా ఎక్కడా బిగి సడలని విధంగా కథని నడిపించారు.

నిజానికి ఈనవల ఆధారంగా ఒక మల్టీ స్టారర్ చారిత్రిక సినిమా చేయొచ్చు. ముగ్గురు కథానాయకులు, నాయికలు, ఇంకా అనేక ప్రధాన పాత్రలు. రాజమహళ్ళు, యుద్ధాలు.. చాలా భారీ బడ్జట్టే అవుతుంది. అయితేనేం? కథలో సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. అసలు నవల చదువుతుంటేనే సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. 'నారాయణరావు' 'కోనంగి' నవలల్లో వలె ప్రధాన కథానాయకుడు సువర్ణశ్రీ ఉత్తమ గుణాలు కలవాడు, 'తుపాను' కథానాయకుని వలె శిల్పి. ఆ నవలల్లాగే ఈ నవలకీ చదివించే గుణం పుష్కలంగా ఉంది. విశాలాంధ్ర ప్రచురించిన ఈ 296 పేజీల నవల వెల రూ.150. ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది.

11 కామెంట్‌లు:

  1. నేను నారాయణ రావు, కోనంగి చదివాను కానీ.. ఈ పుస్తకం చదవలేకపోయాను. మీ రివ్యూ తర్వాత ఇప్పుడు చదవాలనిపిస్తుంది. తెప్పించుకుంటాను. థాంక్స్!

    రిప్లయితొలగించండి
  2. మురళీగారు ఇలా మంచి పుస్తకాలు నేను ఎన్ని చదవాలో???

    రిప్లయితొలగించండి
  3. నారాయణరావు తరవాత నాకు చాలా ఇష్టమైన నవల ఇది. ఇందులో బాపిరాజుగారు ప్రస్తావించిన చారిత్రక అంశాలు ఎంతవరకూ నిజమో తెలియదుగాని నాకు మాత్రం బహుగొప్పగా ఉంటుంది చదివినప్పుడల్లా. చారుగుప్తుడు, స్థౌలతిష్య మహర్షి పాత్రలు కూడ చాలా ఇష్టం. ఈ హీరో కూడా మిగతా బాపిరాజు హీరోల్లాగానే ఉదాత్తుడూ సకలకళా కోవిదుడూ అయినా, కథలో అతనికంత పెద్దపాత్ర లేదు, కథే హీరో ఒకరకంగా.

    రిప్లయితొలగించండి
  4. బాబోయ్ ఇన్ని పాత్రలు ఉన్నాయో. పేజీలు తిరగేస్తూ పేర్లు మర్చిపోతానేమో అనిపిస్తోంది. కానీ కథ బాక్డ్రాప్ బావుంది. నాకు ఇలా చారిత్రక కథలంటే భలే ఇష్టం. అందులో వాస్తవాలు ఎక్కువుంటే మరీను.
    విషబాల అనగానే రాక్షస మంత్రి చంద్రగుప్తుని మీద ప్రయోగించిన విషబాల గుర్తొచ్చింది.

    మీ లైబ్రరీ ఫోటో ఇంకా పెట్టలేదు మీరు. దాని మీద ఒక టపా రాయండి మహాశయా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ రచయితవి ఎక్కువ ఉన్నాయి ఇలా.. అది తెలుసుకోవాలని ఉంది.

    రిప్లయితొలగించండి
  5. నా బుద్ధి: ఈ టపాకి కూడా ఏదోటి రాస్తావా...నువ్వా ఆ పుస్తకం చదవలేదు...ఇప్పుడు కొన్న నారాయణరావే చదివివేలా లేవు...రాయకు
    నేను: ఆ మాత్రం నాకూ తెలుసు మురళీగారి టపాలన్నింటికీ ఇలా వ్యాఖ్యలు రాస్తున్నాను. ఈ సంబంధం లేని టపాకి రాయడం కరెక్ట్ కాదని తెలుసు.
    నా బుద్ధి: అదిగో అదిగో నేంచెప్పిందే వ్యాఖ్యగా గిలికావ్... ఇలాంటివి రాస్తే నిన్ననరు..నీకు బుద్ధుందా అని నన్నంటారు.
    నేను: :-)

    రిప్లయితొలగించండి
  6. @కృష్ణప్రియ: తప్పకుండా చదవండి.. నాకైతే వాటికన్నా కొంచం ఎక్కువే నచ్చింది.. ధన్యవాదాలు.
    @సృజన: మొదలు పెట్టేయండి మరి.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: స్థౌలతిష్యుడు కేవలం విశ్వామిత్రుడే అనిపించిందండీ నాకు.. ఆ ధారణ, పునః సృష్టి చేయగల శక్తి, అన్నింటికీ మించి ఆ తమస్సు.. సువర్ణ శ్రీ మీద కొంచం ప్రేమ తగ్గించుకుని, శ్రీకృష్ణ శాతవాహనుడు, సమదర్శి పాత్రల మీద మరికొంచం దృష్టి పెడితే ఇంకా గొప్ప నవల అయ్యి ఉండేదని నా భావన.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @వాసు: పాత్రల విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ ఉండదండీ.. ఎందుకంటె ప్రతి పాత్రకీ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది.. పని మనుషులతో సహా.. దీనివల్ల ఎక్కడా కన్ఫ్యూజన్ అన్న సమస్యే రాదు.. 'విషబాల' గురించి చదివేటప్పుడు నాకు 'చాణక్య-చంద్రగుప్త' 'సింహాసనం' సినిమాలు గుర్తొచ్చాయ్. ఇకపోతే, మీరు లైబ్రరీ అన్నప్పుడల్లా నాకు పోగొట్టుకున్న పుస్తకాలన్నీ కళ్ళముందు మెదులుతూ ఉంటాయి. మొత్తం పుస్తకాలని ఒక చోటకి చేర్చాక తప్పకుండా ఫోటో తీసి పెడతాను.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: :)) బాగుందండీ మీ ద్విపాత్రాభినయం.. ఒకవేళ ఈపుస్తకం కూడా మీ దగ్గర ఉంటే, 'నారాయణ రావు' కన్నా ముందు ఇది చదవడం మొదలు పెట్టండి.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. ఆ బాలిక హిమబిందు .ఎంత చక్కని పేరు !స్నిగ్ధ శ్వేత భాసమాన హిమబిందువా ఆ బాల !ఆ తెలుపు ఎరుపులు ఔత్సరాహికములు .ఆమెలో గాంధార రక్తమున్నది .ఎవ్వరా బాలిక ?ఏ రాజ తనయ ?ఏ నందనవనమున అవతరించినదో:-)
    good novel

    రిప్లయితొలగించండి
  9. @చిన్ని: వావ్.. మొత్తం నోటికొచ్చాన్న మాట!! ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. మొత్తానికి ఈ టపా చూడటంలో చాలా ఆలస్యం అయిందన్నమాట.

    నాక్కూడా ఈ నవల అంటే చాలా ఇష్టం. ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు.చదువుతున్నంత సేపు మనల్ని చేయి పట్టుకొని లాక్కెళ్ళి ఆ శాతవాహన పుర వీధుల్లో విహరింపజేస్తాడు బాపిరాజు. హిమ బిందు, సువర్ణ శ్రీ ఉద్యానవనం లో కలుసుకున్నప్పటి వర్ణన ఎంత బావుంటుందంటే, మనం అక్కడే అదృశ్యం గా ఉండి, వాళ్ళిద్దరిని చూస్తూ, వాళ్ళ love feel ని మన మనసుతో వింటున్నట్టు feel అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకెవరూ అంత ఇదిగా (సరైన పదం దొరకలేదు!) వర్ణించలేరెమో !

    గుర్తు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @బ్రహ్మి-సాఫ్ట్వేర్ ఇంజినీర్: నిజమండీ.. నాక్కూడా ఎక్కడా చదువుతున్నట్టు అనిపించలేదు.. ఆ పాత్రల మధ్యలో నిశ్శబ్దంగా తిరుగుతూ జరుగుతోన్నది చూస్తున్నట్టుగా అనిపించింది.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి