శుక్రవారం, మే 29, 2009

ఉషా పరిణయం

సాహసాలు చేయడమంటే నాకు సరదా.. ఇవి చేయబోతున్నట్టు ఇంట్లో చెప్పకపోవడం నా అలవాటు. ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకం లో వివరంగా రాసి ఉంచి వాటిని క్రమం తప్పకుండా అప్డేట్ చేసే అలవాటు ఉంది కాబట్టి నా సాహసాల వల్ల వెనుక వాళ్లకి అన్యాయం జరుగుతుందనే భయం లేదు. అలా "సిరికిం జెప్పకుండా" నేను చేసిన తాజా సాహసం సుమనోహరుడి ఉషా పరిణయ వీక్షణం.

రిలీజ్ షో చూసే అవకాశం ఇవ్వని ఉద్యోగాన్ని తిట్టుకుంటూ, సెకండ్ షో కి థియేటర్ దగ్గరికి చేరుకున్నాను. మరీ తెర ముందుగా కూర్చుని చూడడం కష్టమని, "ఏ రో" అని అడిగాను కౌంటర్ అబ్బాయిని. "ఫోర్త్ సార్" అన్నాడు వినయంగా. "స్క్రీన్ ముందునుంచా?" నా సందేహం. నాకేసి విచిత్రం గా ఓ చూపు చూసి "బ్యాక్ నుంచి సార్" అని టిక్కెట్ చేతిలో పెట్టాడు.

పక్క థియేటర్ లో వేరే సినిమాకి టిక్కెట్లు దొరకని ఓ ఫ్యామిలీ ఇంతలో అక్కడికి వచ్చింది. "ఉషా పరిణయం చూద్దామా అమ్మా?'' తన కూతురిని పర్మిషన్ అడిగాడు. "ఈలో ఎవలూ?" అడిగిందా నాలుగేళ్ల పిల్ల ముద్దుగా.. ఆయన అక్కడే ఉన్న నీలిమేఘ శ్యాముడి పోస్టర్ చూపించాడు. "ఈలు బూచాలు..వద్దు" చెప్పేసిందా అమ్మాయి నిష్కర్షగా.. శకునం బాగోలేదనుకుంటూ థియేటర్ లోకి అడుగుపెట్టాను.

ఇంకా సినిమా మొదలు కాలేదు. జనం ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఎవరూ ఫోన్లు చేసి డిస్ట్రబ్ చేయకుండా ముందు జాగ్రత్తగా స్నేహితులందరికీ సంక్షిప్త సందేశాలు పంపాను, సినిమా చూడబోతున్నట్టు. వెంటనే జవాబులు వచ్చేశాయి. నా ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేయబోతున్నట్టు ఒకరు, 'నీధైర్యాన్ని దర్శించి దైవాలే తల దించగా..' అని మరొకరూ.. ఇలా... వీటికి నేను భయపడతానా?

మొత్తం ఓ పాతిక మంది ప్రేక్షకులు ఉన్నారు హాల్లో. సినిమా మొదలయ్యింది. ఎక్కడా ఉషా కిరణ్ పేరు గాని, రామోజీ పేరు గాని లేకుండా టైటిల్స్ పూర్తయ్యాయి. బాణాసురడనే రాక్షసుడు శివుడు తన రాజ్యానికి కావలి ఉండే విధంగా వరం పొందడం తో మొదటి సీన్ అయ్యింది. ఓ డెబ్బై ఏళ్ళు పైబడ్డ తాతగారు ఆయన టీనేజ్ మనవడు వచ్చి నా పక్క సీట్లలో సెటిల్ అయ్యారు. గ్రాంధికం, వ్యావహారికం కలగలిపిన భాషలో శివుడు, రాక్షసుడు మాట్లాడుకోడాన్ని ఎంజాయ్ చేస్తున్న నేను ఈ కొత్త వాళ్ళ కోసం మౌనం పాటించాల్సొచ్చింది.

రెండో సీన్ లో తెరమీద బారెడు పొద్దెక్కింది. ద్వారకలో బంగారు శేషపాన్పు మీద పవ్వళించిన శ్రీకృష్ణుడు.. మరెవ్వరో కాదు మన సుమనోహరుడే... ఆనందంగా నాట్యం చేస్తూ ఆయనకి మేలు కొలుపు పాడుతున్న జానపదులు. ఆ జానపదులకి నాయకుడు మన ప్రభాకరుడు. (ప్రత్యేక అతిధి పాత్ర, ఈ పాటకే పరిమితం). పాట సాంతం అయ్యాక స్వామి కళ్ళు తెరిచి చిరు నవ్వులు చిందించారు.. అది మొదలు, మూడు గంటల పాటు అంతా తానే అయ్యారు.

కథ అత్యంత మందగమనంతో సాగుతోంది. బాణాసురిడి కూతురు కలలోకి ఓ అందగాడు (?) వచ్చి ఆమెని కలవరపెడతాడు. అతను మరెవరో కాదు కృష్ణుడి సోదరుడు బలరాముడి (ఇంకెవరూ..మన ఈశ్వర్రావే) మనవడు అనిరుద్ధుడు. మాయలు మంత్రాలు తెలిసిన తన స్నేహితురాలు చిత్రరేఖ సహాయంతో అతన్ని కిడ్నాప్ చేయించి తన అంతః పురానికి రప్పించుకుంటుంది ఉష. స్వామి ఇందుకు రహస్యంగా సహాయం చేస్తారు. మరోపక్క అనిరుద్దుడికి భార్య కాగల అమ్మాయిల చిత్రపటాలు తెప్పిస్తుంది బలరాముడి భార్య రేవతి (నాగమణి).

స్వామి లీల వల్ల వాటిలో ఉష పటం వచ్చి చేరడం. రేవతికి ఆ పటమే ఎంతగానో నచ్చడం జరుగుతాయి. నా పక్కన కూర్చున్న తాతగారి మనవడు అసహనంగా కదులుతున్నాడు. (నేనెంతగా సినిమాలో లీనమైపోయినా..అతన్ని గమనిస్తూనే ఉన్నా) ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది. "డొక్కు సినిమారా.. ఇంటర్వెల్ లో వచ్చేస్తా" అని గుసగుసగా చెప్పడం వినిపించింది. తెరమీద అనిరుద్ధుడి కిడ్నాప్ వార్త అతని తల్లిదండ్రులకి తెలిసింది. వాళ్ళు ఆందోళన పడుతుంటే కేళీ విలాసంగా చిరునవ్వులు చిందించారు స్వామి. నేను చూసుకుంటా అని వాళ్లకి హామీ ఇచ్చి మాకు 'విశ్రాంతి' ని ప్రసాదించారు.

లైట్లు వెలగ్గానే తాతగారి మనవడు "అంకుల్..చిన్న రిక్వెస్ట్" అన్నాడు. "నేను బయటికి వెళ్తున్నాను. కొంచం మా తాతగారిని చూసుకోండి.. సినిమా అవ్వగానే వచ్చి పికప్ చేసుకుంటా.." అన్నాడు. నేను కొంచం అమాయకంగా ముఖం పెట్టి "సినిమా బాగుంది కదా" అన్నాను, వెళ్ళిపోవడం ఎందుకూ అన్నట్టు. అతను కొంచం ఇబ్బందిగా నవ్వి, "అర్జెంటు పని అంకుల్, ఫ్రెండ్ ఫోన్ చేశాడు..ప్లీజ్" అన్నాడు. ఇంతకీ ఆ తాతగారు ముందువరుసలో తన వయసు వాళ్ళ పక్కన కూర్చున్నారు.. "అంత వెనక్కి రాలేను" అంటూ.. విశ్రాంతి తర్వాత పది మందిమి మిగిలాం.

రెండో సగం లో ఘటోత్కచుడు, చిత్ర విచిత్రమైన రాక్షసులు బోల్డంత మంది వచ్చి హాస్యం పుట్టించే ప్రయత్నం చేశారు.. నాకైతే సుమన్ గారి హాస్యం ముందు అవన్నీ బలాదూర్ అనిపించాయి. ఆయన నవ్వు, నడక, మాట, పాట.. ఒకటేమిటి.. ప్రతి కదలికా హాస్య రస భరితమే. అనిరుద్ధుడు తన కూతురి దగ్గర ఉన్నాడని తెలిసిన బాణాసురుడు అతన్ని జైల్లో బంధిస్తాడు. ఘటోత్కచుడు తన మాయలతో అనిరుద్ధుడి జాడ తెలుసుకుంటాడు.

ఈ మాత్రం మాయలు కృష్ణుల వారే చేయగలరు కానీ, ఎందుకో ఆయన అన్నా వదినా ఆయన్ని నమ్మరు. ఘటోత్కచుడు, కృష్ణుల వారు, వారి బృందం బాణాసురుడి రాజ్యానికి వెళ్లి అనిరుద్ధుడిని విడిపించడం, యుద్ధం అనివార్యం కావడంతో కృష్ణుల వారు బాణాసురిడితో యుద్ధం చేసి పెళ్ళికి ఒప్పించడం కథ ముగింపు. ఎప్పటిలాగే సుమన్ గారు తెర ముందు, వెనుక అన్నీ తానే అయ్యారు. మొత్తం నటీ నటులందరి లోనూ తనే అందంగా కనిపించే విధంగా శ్రద్ధ తీసుకున్నారు.

సినిమా అన్నారు కాని చూడ్డానికి టెలిఫిలిం లాగే అనిపించింది..పైగా 35 mm. నాకైతే "శ్రీకృష్ణ బలరామ యుద్ధం" పదే పదే గుర్తొచ్చింది. ఐతే ఇది థియేటర్ కాబట్టి విశ్రాంతి మినహా ఎక్కడా కమర్షియల్ బ్రేక్స్ లేవు. అందరూ టీవీ నటులే కావడం తో, సుమన్ తో కాంబినేషన్ సీన్లలో వాళ్ళంతా కంపెనీ ఎండీ ముందు నాలుగో తరగతి ఉద్యోగుల్లా భయ భక్తులతో నిలబడ్డారు. కథలో భాగంగా జానపదుడి గాను, బృహన్నల (?) గానూ మారు వేషాలు వేశారు స్వామి.

నల్లనయ్యగా సుమన్ నయనానందకర విశ్వ రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకుంటూ కింద రాసిన "సర్వేజనా సుఖినోభవన్తు" వాక్యాన్ని చదువుకుంటూ థియేటర్ బయటికి వస్తున్నానో లేదో మిత్రుల నుంచి నా క్షేమాన్ని తెలియజెప్పమంటూ సందేశాలు. "సినిమా ఎలా ఉందని మర్యాదకైనా అడగరా?" రిప్లై లో కోప్పడ్డాను నేను. "మాకు తెలియక పోతే కదా..." ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ జవాబు.

గురువారం, మే 28, 2009

ఏమి సెట్?

ఏటా మూడు లక్షల మందికి పైబడి విద్యార్ధులు రాసే పరీక్ష..రాష్ట్రం లో జరిగే ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటి.. చాలా మంది విద్యార్ధులతో పాటు, వాళ్ళ తల్లిదండ్రులు సైతం జీవన్మరణ సమస్యగా తీసుకునే పరీక్ష.. ఇలాంటి పరీక్షను నిర్వహించడం లో ఏటా కనిపించేది అధికారుల నిర్లక్ష్యం.. కనీసం ఒక్క తప్పు లేకుండా ఒక్క సంవత్సరమైనా ప్రశ్న పత్రం తయారు చేయలేని పరిస్థితి.. అవును.. ఆ పరీక్ష ఎంసెట్.

ఇప్పుడు మనమంతా ఏదో రకంగా ఎంసెట్ తో సంబంధం ఉన్నవాళ్ళమే.. మన ఇంట్లో పిల్లలో, బంధువుల/స్నేహితుల పిల్లలో, పక్కింటి పిల్లలో లేదా మనతో పనిచేసే వాళ్ళ పిల్లలో ఇలా ఎవరో ఒకరు ఎంసెట్ కోసం సిద్ధం కావడం మనం చూస్తూనే ఉంటాం. మరికొంచెం గమనిస్తే ఎల్కేజీ నుంచి ఎంసెట్ కోచింగ్ అని బోర్డులు పెట్టే (ఇప్పుడు ఐఐటీ కూడా వచ్చి చేరింది) స్కూళ్ళూ కోకొల్లలు.

అబ్బాయో అమ్మాయో పదో తరగతిలోకి రాక ముందే ఇంటర్ ఏ కాలేజిలో చేర్పించాలని చర్చలు, ఫీజుల వివరాల సేకరణ తల్లిదండ్రుల వంతు. స్నేహితులతో మాట్లాడడం తో సహా ప్రతి చిన్న సంతోషాన్నీ త్యాగం చేసి పరీక్షకి సిద్ధం కావడం పిల్లల బాధ్యత. అవును మరి..ఎంసెట్ పరీక్షలో ఒక్క మార్కు కూడా జాతకాలు మార్చేస్తుంది..భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇంత గొప్ప పరీక్ష కోసం ఆ మాత్రం సిద్ధం కాకపోతే ఎలా?

రెండేళ్ళ పాటు పిల్లలూ, వాళ్ళ తల్లిదండ్రులూ సర్వస్వం త్యాగం చేసి సిద్ధమయ్యే ఈ పరీక్ష ఎలా జగురుతుంది? అచ్చు తప్పుల ప్రశ్న పత్రాలతో.. సిలబస్ లో లేని, సుదీర్ఘమైన ప్రశ్నలతో. ఒకే ప్రశ్నకి రెండు మూడు సరైన సమాధానాలు చూపించి కన్ఫ్యూస్ చేసే ఆప్షన్స్ తో.. మూడు గంటల పరీక్ష కాలంలో మూడొంతుల సమయం ప్రశ్నలు చదువుకోడానికే సరిపోతే జవాబులు ఆలోచించేదేప్పుడు? టిక్కు పెట్టేదేప్పుడు?

ఈ సంవత్సరం పరీక్ష పూర్తయ్యాక ఘనత వహించిన ఎంసెట్ కన్వీనర్ గారు అధికారికంగా ధ్రువీకరించిన తప్పులు మూడు. జువాలజీ ప్రశ్న పత్రంలో ఒక ప్రశ్న ను తొలగించడంతో పాటు, మరో ప్రశ్నకి రెండు సమాధానాలు సరైనవని, కెమిస్ట్రీ లో ఒక ప్రశ్నకి రెండు సరైన సమాధానాలు ఉన్నాయని ప్రకటించారాయన. ఇక్కడితో ఆగితే బాగానే ఉండేది..కానీ అసలు కథ ఇక్కడే మొదలయ్యింది..

ఒకటి కాదు, రెండు కాదు..ప్రశ్న పత్రం లో మరో ఏడు తప్పులున్నాయన్నది సీనియర్ అధ్యాపకుల డిస్కవరీ. వీటిలో మూడు ప్రశ్నలు చాలా మంది విద్యార్ధులు 'టఫ్' గా ఉందని చెప్పిన కెమిస్ట్రీ విభాగం నుంచి కాగా, మిగిలిన నాలుగూ జువాలజీ విభాగం లో ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకి వెంటనే వచ్చే సమాధానం "అధికారుల మధ్య కో-ఆర్డినేషన్ లేకపోవడం."

తెలుగు అకాడమి తయారు చేసే పాఠ్య పుస్తకాల నుంచి ఎంసెట్ లో ప్రశ్నలు అడుగుతారు. అసలు ఈ పుస్తకాలే తప్పుల కుప్పలు. ప్రశ్నలని ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పాఠాల నుంచి అడుగుతారు. ఒకే ప్రశ్నకి రెండు సంవత్సరాల పాఠ్య పుస్తకాల లోనూ పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఉండడం ఈ పుస్తకాల గొప్పదనం. ఈ అకాడెమీ ని సంస్కరించే ఓపిక, తీరిక ఏలిన వారికి లేవు.

ప్రశ్నలు తయారు చేసేది, వాటిని ఫిల్టరు చేసేది, తుది ప్రశ్న పత్రం రూపొందించేది సబ్జక్ట్ ఎక్స్పర్టులే..కాని ఏ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్ధిని పరీక్ష హాల్లోకి రానివ్వనంత స్ట్రిక్ట్ గా నిబంధనలు అమలు పరిచే అధికారులు, తమ బాధ్యల నిర్వహణ లో జరుగుతున్నా 'పొరపాట్ల' గురించి సరైన సమాధానాలు ఇవ్వరు. హైకోర్టు సైతం ఎంసెట్ విషయం లో కన్వీనరు గారిదే తుది నిర్ణయం అని చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

బుధవారం, మే 27, 2009

ఈతపళ్ళు-ముంజెల బండి

చిన్నప్పటి నా తీరని కోరికల జాబితా రాస్తే అది మా తోటలో ఉండే ముచ్చెట్టు కన్నా పెద్దది అవుతుంది. (మామూలు కొబ్బరి చెట్టుకన్నా రెట్టింపు పొడవున్న కొబ్బరి చెట్టుని ముచ్చెట్టు అంటారు). వేసవి కాలానికి సంబంధించిన అలాంటి రెండు తీరని కోరికలు (మరీ పూర్తిగా తీరనివి కాదు కానీ, సంతృప్తిగా అనిపించనివి) రెండున్నాయి. అవి ఈతపళ్ళు తినడం, ముంజెల బండి నడపడం.

వేసవి సెలవుల్లో బడికి వెళ్ళక్కర్లేదన్న ఆనందం ఉన్నా సెలవులిచ్చిన కొన్నాళ్ళకే ఆ ఆనందం కాస్తా ఆవిరైపోయేది. ఇందుకు కారణం బాగా విసుగ్గా అనిపించే మధ్యాహ్నాలు. మా ఇంట్లో అందరికీ మద్యాహ్నం భోజనం తర్వాత ఓ కునుకు తీయడం అలవాటు, నాకు తప్ప. ఎండలో బయటికి వెళ్ళకూడదు, క్లాసు పుస్తకాలు ఉండవు, వేరే పుస్తకాలు చదవకూడదు. ఏవి పడితే అవి తినకూడదు.

మధ్యాహ్నం భోజనం కాగానే అందరూ నిద్రలోకి జారుకుంటే, నేను మాత్రం కటకటాల ముందు గదిలో కూర్చుని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. సాయంత్రం ఆటలకి కలిసినప్పుడు, వాళ్ళు పొలాల వెంటా, తోటల్లోనూ తిరిగి ఈతపళ్ళు ఎలా సంపాదించారో మిత్రులు కథలు కథలు గా చెబుతూ ఉంటే నోరు తెరుచుకుని వినడం చాలా కష్టంగానే ఉండేది. మధ్యాహ్నపు జైలు శిక్షలను తప్పించుకోవడం గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు ఓ ఆలోచన తళుక్కున మెరిసింది.

మధ్యాహ్నం స్నేహితుల దగ్గరికి ఆటలకి వెళ్ళినా, వాళ్ళతో కలిసి తిరిగినా ఇంట్లో తెలుస్తుంది. నేనొక్కడినీ విడిగా ఎక్కడికైనా వెళ్లి వస్తే తెలిసే అవకాశం తక్కువ. ఇందులోనూ కొంచం రిస్కు ఉంది కానీ, జైలు శిక్ష తప్పించుకోడానికి ఆ మాత్రం రిస్కు తప్పదు. ఓ మధ్యాహ్నం కొంచం ధైర్యం చేశాను. తలుపు గడియలో అప్పటికే కొబ్బరి నూనె వేసి ఉంచడం వల్ల చప్పుడు లేకుండా తెరుచుకుంది తలుపు.

పిల్లిలా అడుగులేస్తూ మా పెరటి తోటలోకి వెళ్లాను. తోట చివర ఈత చెట్లు చూడగానే, ఈతపళ్ళు ఏరుకోవాలన్న కోరిక మొలకెత్తింది. చెట్ల కింద వెతికితే అన్నీ పచ్చి కాయలే. ఇవే ఏరుకుందాం అని వాటిని జేబులో నింపుకున్నాను. ఇంట్లో వాళ్ళు లేచే టైం తెలుసు కాబట్టి ముందుగానే ఇల్లు చేరుకున్నాను. ఈ పచ్చి కాయలని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే చటుక్కున ఓ ఆలోచన వచ్చింది.

అరటి కాయలని ముగ్గ బెట్టడానికి వాటిని గోనె సంచులతో కప్పి చెక్క పెట్లలో పెట్టే వాళ్ళు. ఈతకాయలను కూడా అలాగే ముగ్గపెట్టాను, రహస్యంగా.. మర్నాడు ఉదయం లేచి చూద్దును కదా.. ఈత కాయలన్నీ మిగల ముగ్గిపోయి ఉన్నాయి. నేనెప్పుడూ ఏనుగెక్కలేదు కానీ ఒకవేళ ఎక్కి ఉంటే కూడా అంత సంతోషం కలిగి ఉండేది కాదేమో.. ఇలా ఓ నాలుగైదు రోజులు గడిచాయంతే.. ఒక రోజు ఉదయాన్నే ఈతపళ్ళు నాన్న కంట పడ్డాయి.. కట్ చేస్తే..మళ్ళీ నాకెప్పుడూ ఈతపళ్ళ కోసం వెళ్లాలనిపించ లేదు.

ముంజెల బండిది మరో కథ.. తినేసిన మూడు ముంజెలతో చేసిన ఈ బండిని నడుపుతూ నా మిత్రులందరూ ఏదో కారు నడుపుతున్నట్టు ఫోజులు కొట్టేవాళ్ళు. ఓ చిన్న కర్ర ముక్కకి అటూ ఇటూ ముంజె కాయలు గుచ్చి చక్రాల లాగా చేసేవాళ్ళు. మరో పొడవాటి కర్రకి ఒక చివర మరో ముంజె కాయని గుచ్చి స్టీరింగ్ లాగా చేసి ఆ కర్ర రెండో చివరని చక్రాలకి అనుసంధానిస్తే ముంజెల బండి తయారు.

వేసవిలో మమ్మల్ని తాగినన్ని కొబ్బరి బొండాలు తాగనిచ్చే వాళ్ళు కానీ, ముంజెల జోలికే వెళ్తే తోలు వలిచే వాళ్ళు. ముంజెలు తినకుండా ముంజెల బండి ఎలా చేసుకోగలం? అందుకే ఆ బండి ఉన్న భాగ్యశాలుల వెంట పడే వాడిని. వాళ్ళని బతిమాలి కాసేపు ఆ బండి నడిపి ఆనందించే వాడిని. ఈ నడపడాన్ని కూడా ఇంట్లో వాళ్ళు చూడకూడదు. ఇంట్లో చాలా ఆట వస్తువులు ఉన్నాయి కదా, వాటితో ఆడుకోవచ్చు కదా అని వాళ్ళ వాదన. ఎప్పటికైనా సొంతంగా ఓ బండి చేసుకోవాలన్న కోరిక ఎప్పటికీ తీరలేదు..

మంగళవారం, మే 26, 2009

అధ్యక్షా...

చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ప్రభుత్వంలో శాసన సభ కి స్పీకర్ కాబోతున్నారు. గత సభ తో పోలిస్తే ప్రతిపక్ష బలం బాగా పెరిగిన ప్రస్తుత శాసన సభ లో స్పీకర్ బాధ్యత నెరవేర్చడం కత్తి మీద సాము. 'నొప్పించక తానొవ్వక' విధి నిర్వహణ చేయాలి.. అదే సమయంలో 'తప్పించుకు తిరగ'రాదు కూడా.

మన శాసన సభలో తరచూ వినిపించే మాట సభా మర్యాద. సభ నడిచే తీరుని గమనించినప్పుడు ప్రతి సభ్యుడూ తాను తప్ప మిగిలిన సభ్యులంతా 'సభా మర్యాద' పాటించాలని ఆశిస్తారనిపిస్తుంది. వ్యక్తిగత దూషణలు, నిందారోపణలకి లోటు లేదు. స్వయానా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు గత సభలో ఈ తరహా దూషణలకి దిగడాన్ని జనులంతా టీవీ చానళ్ళ సాక్షిగా వీక్షించారు.

ఇలాంటి సందర్భాలలో స్పీకర్ విధులు వీధి బడిలో మాష్టార్ల విధులని మరపిస్తాయి. పాఠం వినకుండా అల్లరి చేసే పిల్లల్ని మాష్టారు బెత్తం తో అదిలించి, అవసరమైతే ఒకరిద్దరిని దండించి క్లాసు కొనసాగించినట్టు, స్పీకర్ కూడా అప్పుడప్పుడు సభని 'అదుపులో' పెడుతూ ఉండాలి. ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాలి. తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి..ఆ నిర్ణయాలు నిష్పాక్షికంగా ఉండాలి.

సమస్య అంతా ఈ 'నిష్పాక్షికం' అన్న దగ్గరే వస్తుంది. స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తికి పార్టీల విషయంలో తరతమ బేధం ఉండకూడదు. పార్టీలకి అతీతంగా పనిచేయాలి. ఆచరణలో ఇది వంద శాతం సాధ్యం కాదని గతంలో ఎన్నో సార్లు రుజువైంది. స్పీకర్ తన సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ప్రతిసారీ ఆ పదవి వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి మార్పు మొదలు, ప్రతిపక్షాలకి సమయం కేటాయించడం వరకు ఎన్నో సందర్భాలలో స్పీకర్ 'నిష్పాక్షికత' ప్రశ్నార్ధకమైంది.

రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి సన్నిహితుడని పేరు. తెలుగు దేశం పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుడి మీదా ఘాటు విమర్శలు చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన ఇంతవరకు వదులుకోలేదు. క్రికెట్ నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఈ నేత చీఫ్ విప్ హోదాలో కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద ప్రతిపక్షాల దాడులని సమర్ధంగా తిప్పి కొట్టారు. ఇక ముఖ్యమంత్రి కుమారుడి గురించి ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు తాను 'చంద్రబాబు తనయుడి గురించి మాట్లాడాల్సి వస్తుందని' ఇంచుమించుగా బెదిరించారు.

ప్రతిపక్షం బలంగా ఉన్న సభలో పార్టీకి విధేయుడిగాను, తనకి అత్యంత అనుకూలుడిగాను పేరుపొందిన వ్యక్తిని స్పీకర్ స్థానానికి ఎంపిక చేయడం ముఖ్యమంత్రి వేసిన రాజకీయ ఎత్తుగడ కావొచ్చు. సభలో ప్రతిపక్షాలను కొంతమేరకు నిలువరించే ప్రయత్నంలో ఇది భాగం అయి ఉండొచ్చు. స్పీకర్ పదవి చేపట్టే వ్యక్తి కి ఉండవలసిన విషయ పరిజ్ఞానం, చట్టాల పై అవగాహన అలాగే వాటిల్లో ఉన్న లొసుగులు కిరణ్ కుమార్ రెడ్డికి బాగానే తెలుసనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

అయితే ఈ పరిజ్ఞానాన్ని ఆయన స్పీకర్ గా తన బాధ్యతలని సమర్ధంగా నిర్వహించడానికి ఉపయోగిస్తారా? లేక సభలో ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి ప్రాముఖ్యత ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిన అంశం. 'టెక్నో సావీ' గా పేరొందిన నాదెండ్ల మనోహర్ కి డిప్యుటీ స్పీకర్ పదవి లభించింది. ఇప్పటికే శాసన సభ రికార్డుల కంప్యూటరీకరణ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడంలో కీలక పాత్ర పోషించిన మనోహర్, కొత్త హోదాలో అసెంబ్లీ ని మరెంత hi-fi గా మారుస్తారో చూడాలి.

ఆదివారం, మే 24, 2009

నాయికలు-(మల్లాది)మందాకిని

"భర్త అరచేతిలో ఇసుక లాంటి వాడు. అతన్ని బంధించి ఉంచాలని గుప్పెట మూస్తే, వేళ్ళ సందుల నుంచి జారిపోతాడు.." తనకి పెళ్లి చేసి, అత్తవారింటికి పంపుతూ తల్లిదండ్రులు చెప్పిన ఈ మాటని అనుక్షణం గుర్తుంచుకుంది మందాకిని. వ్యసన పరుడైన తన భర్త భానుమూర్తిని తన ఓర్పుతో, నేర్పుతో మంచి మనిషిని చేసింది. ఇష్టపూర్వకంగానే అతను తన వ్యసనాలను ఒక్కొక్కటిగా వదిలిపెట్టే పరిస్థితులని సృష్టించింది. పెళ్లి పీటల మీద తనని చూసి జాలిపడ్డ వారందరి అభినందనలూ అందుకుంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల 'మందాకిని' లో కథానాయిక ఓ మధ్యతరగతి పురోహితుడి ముగ్గురు కూతుళ్ళలో రెండో అమ్మాయి. చదువుకున్న తను, తన చెల్లెలు ఉద్యోగం చేయడం తండ్రికి ఇష్టం లేకపొతే ఆయన్ని ఎదిరించి బయటికి వెళ్ళలేదు. ఇంట్లో ఉంటూనే సంపాదించే మార్గాలు అన్వేషించింది..ఆర్ధికంగా తండ్రికి కొంత వెసులుబాటు కలిగించింది. ఇంట్లో ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకోడానికి మొదట గుర్తొచ్చేది మందాకినే. పెళ్ళయ్యి, ఒక పిల్లకి తల్లయిన అక్క వసంతలక్ష్మి కూడా ఇందుకు మినహాయింపు కాదు.

వసంతలక్ష్మి భర్త భానుమూర్తి వ్యసనపరుడు. అతనికి లేని దురలవాటు లేదు. అటు అతన్ని భరించలేక, ఇటు తండ్రికి భారం కాలేక ఆత్మహత్య చేసుకుంటుంది వసంతలక్ష్మి. మరోపక్క, ఓ ప్రేమ వ్యవహారంలో పీకలోతు కూరుకుపోయిన మందాకిని చెల్లెలు వెంటనే పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తుంది. తల్లితండ్రులని బలవంతంగా ఒప్పించి భానుమూర్తి రెండో భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది మందాకిని. సమస్యలవలయంలోకి అడుగుపెట్టడానికి మానసికంగా సిద్ధపడ్డా, ఆ సమస్యల తీవ్రత తాను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడం భయపెడుతుంది మందాకినిని.

ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందన్న సానుకూల దృక్పధాన్ని అలవర్చుకున్న మందాకిని తన భర్త వ్యసనాలు, అతను వాటికి అలవాటు పడడానికి గల కారణాలను అన్వేషిస్తుంది. నాటకాలు, తాగుడు, పేకాట, సిగరెట్లు, స్త్రీ వ్యసనం ఉన్న భానుమూర్తి కి అందరిచేత గొప్పవాడు అనిపించుకోవాలన్న కోరిక ఉందని గ్రహిస్తుంది. అతని చేత పేకాట మాన్పించడానికి భానుమూర్తికి చదరంగం అలవాటు చేస్తుంది. ఒక సంవత్సరం పాటు ప్రతి రోజు కనీసం అరగంట సేపు తనతో చదరంగం ఆడాలనీ, ఈ యేడాది కాలం లో మరెవరితోనూ చదరంగం ఆడకూడదనీ షరతు విధిస్తుంది.

స్త్రీ వ్యసనాన్ని మాన్పించడానికి తన తండ్రికి తెలిసిన ఒక డాక్టరుసహాయం తీసుకుంటుంది. నాటకాలలో నటించే బదులు, భానుమూర్తే నాటకం రాస్తే ఆ నాటకం ఎక్కడ ప్రదర్శించినా రచయితగా అతనికి పేరొస్తుందని చెప్పి ఒప్పిస్తుంది. భానుమూర్తిలో ఉన్న మంచిగుణాలను గ్రహించి, వాటిని మెచ్చుకుంటూనే తన ప్రేమతో అతను మిగిలిన వ్యసనాలకి దూరం జరిగేలా చేస్తుంది. ఓర్పుతో, నేర్పుతో, సరైన దిశగా కృషి చేస్తే పరిష్కరించుకోలేని సమస్య లేదని నిరూపిస్తుంది మందాకిని.

ఈ 'మల్లాది' మార్కు నవలలో మందాకిని జీవితంతో పాటు, నాటక రంగంలో తెర వెనుక రాజకీయాలు, నాటక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సొంత వైద్యాల వల్ల  జరిగే ప్రమాదాలు, వంటింటి చిట్కాలు..ఇలా ఎన్నో అంశాల ప్రస్తావన ఉంటుంది. సంకల్ప బలం ఉన్నప్పటికీ, తన మార్గంలోకి ముళ్ళు అడ్డొచ్చిన ప్రతిసారి మందాకిని బాధ పడడం, లక్ష్యాన్ని సాధించలేనేమో అని భయపడదాన్ని వివరించడం ద్వారా ఆ పాత్రని ఎలాంటి ప్రత్యేక లక్షణాలు లేని ఓ మామూలు అమ్మాయిగా చిత్రీకరించారు. ఆశావహ దృక్పథంతో సాగే ఈ నవల పాజిటివ్ గానే ముగుస్తుంది. 'మందాకిని'నవల ప్రింట్ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో లేదు. త్వరలోనే వస్తుందని తెలిసింది..

శనివారం, మే 23, 2009

కుంటి గేదె కొంపముంచింది..

అమ్మమ్మ వాళ్ళది చాలా విశాలమైన పెరడు.. రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూరల మొక్కలు, పాదులు ఉండేవి అందులో.. పెరటికి, కొబ్బరి తోటకి మధ్య పెద్ద నుయ్యి, నూతిలో చిన్నవి, పెద్దవి కలిపి ఓ డజను తాబేళ్లు. ఆ నూతి గట్టుకి దగ్గరలో ఓ పెద్ద నేరేడు చెట్టు, వేప చెట్టు. ఈ రెండూ చాలా పెద్ద చెట్లు..మూడు తరాల పిల్లలు ఆటలాడుకున్నారు వాటి నీడలో..వాళ్ళలో మేము కూడా ఉన్నాము. మా కన్నా ముందు అమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు ఆ చెట్ల కిందే మధ్యాహ్నాలు ఆడుకునే వాళ్ళు.

అమ్మ వాళ్ళ అక్కలకి ఓ స్నేహితురాలు ఉండేది.. ఆమె పేరు ముంతాజ్. 'రౌడీ పిల్ల' అని పేరు ఆమెకి. అమ్మ మూడో అక్కకి ఆమెకి మంచి స్నేహం. వాళ్ళిద్దరి ఆటపాటలు, అభిరుచులు బాగా దగ్గరగా ఉండేవి. అమ్మ వాళ్ళ ఏడుగురు అక్క చెల్లెళ్ళలో రెండో ఆమె బాగా నెమ్మదస్తురాలు. ఎవరి జోలికి వెళ్ళదు, తన పని ఏమిటో తనది. ఆమెకి స్నేహితురాళ్ళు కూడా తక్కువే. అమ్మమ్మ వెనుక తిరుగుతూ ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉండేది.

తాతగారికి వ్యవసాయం తో పాటు పాడి కూడా ఉండేది. ఎల్లవేళలా పెరట్లో కనీసం నాలుగు పాడి పశువులు ఉండాల్సిందే. అమ్మమ్మకి ఆవులంటే ఇష్టం..అందువల్ల కనీసం రెండు ఆవులు తప్పనిసరి. అమ్మకి ఆరేడేళ్ళ వయసప్పుడు వాళ్ళకో గేదె ఉండేది. ఆ గేదెకి ఒక కాలు 'సొట్ట కాలు' కావడంతో గుర్తు కోసం కుంటి గేదె అనేవాళ్ళు. వర్షాల రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పశువులని ఎక్కువ సమయం చెట్ల కిందే కట్టేసి ఉంచే వాళ్ళు. అక్కడే వాటికి గడ్డి, కుడితి అందుబాటులో ఉంచేవాళ్ళు.

కుంటి గేదె నిలబడ లేదు కాబట్టి వేప చెట్టు కింద పడుకుని గడ్డిపరకలు నములుతూనో, నెమరు వేస్తూనో ఉండేది.. పాలు పితికే సమయంలో ఒకరు గేదెని పట్టుకుంటే మరొకరు పాలు పితికే వాళ్ళు. మిగిలిన రోజంతా ఆ గేదె చెట్టు కింద పడుకునే ఉండేది. ఆ వేప చెట్టు ప్రత్యేకత ఏమిటంటే కొమ్మలు పైకి కాకుండా కొంచం కిందకి ఉండడంతో పాటు పిల్లలు చెట్టు ఎక్కడానికి అనువుగా ఉండేది. పళ్ళు తోముకోడానికి పంథుం పుల్ల కావాలన్నా కూడా పిల్లలు కొమ్మెక్కి విరుచుకోవచ్చన్న మాట.

వేసవి మధ్యాహ్నాలు భోజనం కాగానే ముంతాజ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేది. ఆమె, అమ్మ వాళ్ళ మూడో అక్క కలిసి ఆడుకునే వాళ్ళు. ఉన్న ఆటలతో సరిపెట్టుకుంటే వాళ్ళు పిల్లలెందుకు అవుతారు? అందుకే వాళ్ళో కొత్త ఆట కనిపెట్టారు. ఆట ఏమిటంటే వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత మరొకరు వేప చెట్టు ఎక్కడం, కొమ్మ మీద నుంచి కుంటి గేదె మీదకి దూకడం. వాళ్ళు ఎన్నిసార్లు దూకినా కుంటి గేదె తన పనిలో తాను ఉండేదే తప్ప కనీసం కదిలేది కాదు.

పిల్లలిద్దరికీ ఈ ఆట నచ్చడం తో రోజూ ఇదే ఆట ఆడడం కొనసాగించారు. ఎప్పుడూ తన పనేమిటో తానూ చూసుకునే రెండో అక్కకి ఈ ఆట ఎందుకో ఆసక్తిగా అనిపించింది. స్వతహాగా భయస్తురాలు కావడంతో, వీళ్ళ సాహసం ఆమెకి చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. పెరట్లో కూర్చుని వీళ్ళ ఆటని గమనించేది. ఆమెకి ఈ ఆట నచ్చిందని వీళ్ళిద్దరూ తెలుసుకుని, ఆమెని కూడా ఆడమని బలవంతం చేశారొక రోజున. ఒక్కొక్కరూ రెండేసి సార్లు దూకి చూపించాక ఈమెకి కొంచం ధైర్యం వచ్చింది.

లోపల్లోపల భయపడుతూనే వేప చెట్టెక్కింది. "మేమున్నాం నీకెందుక" ని ఇద్దరూ ధైర్యం చెప్పారు. కాసేపు తటపటాయించి, ఆమె చెట్టు మీద నుంచి గేదె మీదకి దూకేసింది. సరిగ్గా అప్పుడే కుంటి గేదె కి ఏమైందో కాని, ఒక్కసారిగా కదిలి పైకి లేచే ప్రయత్నం చేసింది.. అనుకోకుండా గేదె కదలడంతో కొంత, భయంతో మరికొంత, ఈమె బ్యాలన్స్ చేసుకోలేక కింద పడిపోయింది. వళ్ళంతా గీసుకుపోయి గాయాలు. జడుపు జ్వరం. ఓ నాలుగైదు రోజులు మంచం పట్టింది. ఈ కొత్త ఆట గురించి అమ్మమ్మకి తెలియడంతో ముంతాజు వాళ్లకి మళ్ళీ ఆ ఆట ఆడుకునే అవకాశం లేకపోయింది.

గురువారం, మే 21, 2009

పుష్కరాల రేవులో పుల్లట్లు

కథగా మలచగలిగిన ఒక అంశాన్ని నవలగా రూపు దిద్దడానికి రచయిత ఎంత కృషి చేయాలో, ఒక నవలకు సరిపడే కాన్వాస్ ఉన్న వస్తువును కథగా కుదించడానికి అంతకు మించి శ్రమించాలి. ఇలాంటి సవాళ్ళు రచయితల్లోని రచనాశక్తిని వెలికి తీస్తాయి. ఈ రెండో కోవకి చెందిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ బి.వి.ఎస్. రామారావు రాసిన 'పుష్కరాల రేవులో పుల్లట్లు.' 'ఆంధ్రజ్యోతి' దీపావళి ప్రత్యేక సంచిక (1984) లో తొలిసారి ప్రచురితమైన ఈ కథ, రచయిత ప్రచురించిన కథా సంకలనం 'గోదావరి కథలు' లో పునర్ముద్రితమైంది.

రాజమండ్రి పుష్కరాల రేవులో పుల్లట్లు పోసుకుని జీవించే పుల్లమ్మ కథ ఇది. ప్రభుత్వాసుపత్రి, పోలీసు స్టేషన్, కోర్టులలో సామాన్యుడికి ఎలాంటి న్యాయం జరుగుతుందో వివరించారు రచయిత. పుల్లమ్మ పుల్లట్లు తినని జీవితం వ్యర్ధం అనుకుంటారు గోదారి రేవు చుట్టుపక్కల వాళ్ళు. గోదారిలో స్నానం చేసి ఉదయాన్నే నాలుగు పొయ్యిలు వెలిగించి నాలుగు రకాల అట్లు పోస్తూ అష్టావధానం చేసే పుల్లమ్మతన అట్లకి తీసుకునేది నామ మాత్రపు ధరే. ఎవరికీ పార్సిళ్ళు కట్టకూడదనేది ఆమె పెట్టుకున్న ఏకైక నియమం.

పన్నులశాఖకి చెందిన ఓ పెద్ద అధికారి ఆఫీసుపనిమీద రాజమండ్రి వచ్చి, పుల్లమ్మ అట్ల గురించి విని వాటిని పార్సిల్ తెప్పించుకోవాలి అనుకుంటాడు. 'కావాలంటే మీరున్న హోటల్ కొచ్చి అట్లు వేస్తాను కానీ పార్సిల్ కట్టను' అంటుంది పుల్లమ్మ. ఆ ఆఫీసరు గారికి కోపం వస్తుంది. పన్ను కట్టనందుకు పుల్లమ్మ మీద కేసు రాయమంటారు. పుల్లమ్మ అట్ల కొట్టు పక్కనే టీ కొట్టు పెట్టుకున్న ఈశ్వరయ్య తొందరలోనే డబ్బు సంపాదించి ఓ హోటల్ పెడతాడు. పుల్లమ్మని తన రెండో భార్యగా ఆహ్వానిస్తాడు. ఆమె నిర్ణయం చెప్పడమే ఆలస్యం.

చెట్టు కిందున్న తన హోటల్ కి వచ్చిన పన్నుల శాఖ ఉద్యోగులతో తానేమీ సంపాదించలేదని, కావాలంటే తన ఇంటికొచ్చి చూడమంటుంది పుల్లమ్మ. వాళ్ళు వినిపించుకోకపోవడంతో 'నేను పన్ను కడితే ఆ డబ్బు ఏం చేస్తారు?' అని అడుగుతుంది పుల్లమ్మ. 'ప్రభుత్వం వారు ఈ డబ్బుతో ధర్మాసుపత్రులు కట్టిస్తారు, పోలీసు స్టేషన్లు కోర్టులు నడుపుతారు' అని చెబుతారు వాళ్ళు. తన ప్రాణం పోయినా ధర్మాసుపత్రికి గాని, పోలీసు స్టేషన్ కి గాని వెళ్ళని కోర్టు గడప తొక్కనని చెబుతుంది పుల్లమ్మ. ఆలోచించుకోడానికి సాయంత్రం వరకూ టైం ఇస్తారు వాళ్ళు. అట్ల పని ముగిశాక స్నానానికి గోదారిలోకి దిగి తన గతాన్ని గుర్తుచేసుకుంటుంది పుల్లమ్మ.

రిక్షా తొక్కుకునే రాజయ్య, పాచిపనులు చేసుకునే రత్తాయమ్మదంపతులకి గోదారి రేవులో దొరుకుతుంది పసి పిల్లగా ఉన్న పుల్లమ్మ. తామే పెంచుకుని, తమ కొడుకు సారిగాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు ఆ దంపతులు. పేడ పోగేసి పిడకలు అమ్మడం మొదలు, ఎన్నో పనులు చేస్తుంది బాల పుల్లమ్మ. వయసొచ్చాక, తను చేసుకోబోయే నారిగాడు అట్లు పోసే ఓ అమ్మి వెనకాల పడుతున్నాడని తెలిసి, తనూ అట్లు పోయడం నేర్చుకుని సారిగాడిని తనవైపు తిప్పుకుంటుంది. రత్తాయమ్మ చనిపోవడం తో ఇంటికి ఆడ దిక్కు లేదని పుల్లమ్మ పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు రాజయ్య.

సారిగాడితో తన పెళ్లి ఊహించుకున్న పుల్లమ్మ, పందిట్లో రాజయ్య తన మెడలో తాళి కట్టడంతో నిర్ఘాంత పోతుంది. జరుగుతున్నదేమిటో అర్ధమయ్యేలోగానే తను ప్రేమించిన వాడికి సవతి తల్లి అయిపోతుంది. తన మీద కన్నేసిన బాబూరావు అనే కానిస్టేబులు, కేవలం తనని లొంగ దీసుకోవడం కోసమే రాజయ్య తో పెళ్లి నాటకం ఆడించాడని తెలుసుకుని, తనకి జరిగింది పెళ్ళే కాదనే నిర్ణయానికి వస్తుంది పుల్లమ్మ. సారిగాడి మనసు మార్చే ప్రయత్నాలలో పడుతుంది. పుల్లమ్మ విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో రాజయ్య చేతిలో తీవ్రంగా గాయపడ్డ సారిగాడిని ధర్మాసుపత్రికి తీసుకెళ్తుంది ఆమె.

సమయానికి వైద్యం అందక సారిగాడు ఆస్పత్రి అరుగుమీదే ప్రాణాలు విడుస్తాడు. కేసు భయంతో రాజయ్య పారిపోతాడు. పుల్లమ్మ తనకి లొంగలేదనే కోపంతో ఆమెమీద బ్రోతల్ కేసు పెట్టిస్తాడు బాబూరావు. పోలీసు స్టేషన్ లోను, కోర్టులోనూ ఆమెకి అన్యాయం జరుగుతుంది. వ్యభిచారిగా ముద్ర వేయించు కుంటుంది. జీవిక కోసం పుల్లట్ల వ్యాపారం మొదలు పెట్టి తక్కువ రేటుకే అట్లు అమ్ముతూ ఉంటుంది. అట్లు తినే వాళ్ళలో తన సారిగాడిని చూసుకోడం కోసం పార్సిల్ కట్టకూదడనే నియమం పెట్టుకుంటుంది.

గతాన్ని తలుచుకుంటూ సాయంత్రం వరకూ గోదారిలోనే ఉండిపోయిన పుల్లమ్మ దగ్గరకి పన్నుల శాఖ వారు, రెండో భార్య గా ఉండే విషయంలో నిర్ణయం చెప్పమంటూ ఈశ్వరయ్యా వస్తారు. ఆమె నిర్ణయం ఏమిటన్నది ఈ కథకి హృద్యమైన ముగింపు. కథల సంపుటిలో ఎనభై పేజీలున్న ఈ కథ నాకెప్పుడూ ఓ నవల చదువుతున్న అనుభూతినే ఇస్తుంది.

మంగళవారం, మే 19, 2009

అనంతపురం-ఆకాశమంత

గడిచిన రెండు వారాల్లో నేను రెండు సినిమాలు చూశాను. అవి అనంతపురం-1980, ఆకాశమంత. మొదటిది 'సుబ్రమణ్యపురం' అనే తమిళ సినిమాకి డబ్బింగ్ ఐతే రెండోది ద్విభాషా చిత్రం. రెండు సినిమాలూ నాకు చాలా నచ్చాయి. కథ, కథనం, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఈ వరుసలో ఈ రెండు సినిమాలకీ ఎలాంటి పోలికా లేదు, కేవలం రెండు సినిమాలకీ మూలం తమిళమే అన్న ఒక్క విషయం తప్ప.

'అనంతపురం' కథకి నేపధ్యం ఫ్యాక్షన్, ప్రేమ. అయితే ఇది తెలుగు తెర ఫ్యాక్షన్ కి పూర్తి భిన్నంగా ఉంది. బాంబుల మోతలు, సుమోలు గాలిలోకి ఎగరడాలు లేకుండా కూడా ఫ్యాక్షన్ సినిమా తీయొచ్చు అనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. కథాకాలాన్ని 1980 గా ఎన్నుకోవడం వల్ల బోల్డంత వైవిధ్యం చూపడానికి వీలైంది. మన తెలుగమ్మాయి స్వాతి ('కలర్స్' స్వాతి) లో ఉన్న నటిని వెలికితీసిందీ సినిమా.

తమిళ 'సుబ్రమణ్యపురా'న్నితెలుగు 'అనంతపురం' గా మార్చడం లో జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే కథలో రాయలసీమ గ్రామీణ మాండలికాన్ని ఉపయోగించడం ముఖ్యమైనది. అలాగే నాయికా నాయకుల మధ్య నేపధ్యంగా వచ్చే సినిమా పాట కోసం 'పూజ' సినిమా లోని 'ఎన్నెన్నో జన్మల బంధం..' పాట వాడడం అతికినట్టు సరిపోయింది. ఈ పాట వస్తుంటే థియేటర్లో విజిల్స్ వినిపించాయి.

ఫ్యాక్షన్ సినిమా కావడం తో హత్యలు కొంచం ఎక్కువగానే ఉన్నాయి. మొదటి సగం దాదాపు సాఫీగా జరిగినప్పటికీ రెండో సగం లో కథనం మరింత వేగవంతం కావడంతో పాటు హత్యా దృశ్యాలూ పెరిగాయి. కొన్ని హత్యలను వివరంగానూ, మరికొన్నింటిని ఇంచుమించు సింబాలిక్ గానూ చూపారు. ఊహించని మలుపులు రెండో సగం ప్రత్యేకత. డబ్బింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా తమిళ వాసనలు తప్పలేదు.

ఇక 'ఆకాశమంత' విషయానికొస్తే తండ్రులంతా - ముఖ్యంగా ఆడపిల్ల తండ్రులు - తప్పక చూడాల్సిన సినిమా. కూతుర్ని ఎక్కువగా ప్రేమించే తండ్రి, ఆమె స్వతంత్ర నిర్ణయాలను ఆమోదించలేక, వ్యతిరేకించలేక పడే ఆవేదనను చక్కగా చిత్రీకరించారు. ముఖ్యంగా కూతురు తన పెళ్లిని తానే నిర్ణయించుకునే సందర్భంలో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన గుర్తుండిపోతుంది. కొన్ని సన్నివేశాలను తెలుగు కోసం రి-షూట్ చేసిన ఈ తమిళ సినిమాలో కూడా అక్కడక్కడా తమిళ వాసనలున్నాయి.

అయితే కథా సమయానికి సంబంధించిన చిత్రీకరణ విషయంలో 'అనంతపురం' సినిమా బృందం తీసుకున్నంత శ్రద్ధ 'ఆకాశమంత' సినిమా వాళ్ళు తీసుకోలేదు. 'అనంతపురం' లో 1980 దృశ్యాలలో దుస్తులు, మేకప్, సెట్టింగ్స్, నేపధ్యంలో వచ్చే సినిమా పాటలు..ఇలా ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. అది తెర మీద కనిపించింది. 'ఆకాశమంత' లో ఇరవై ఏళ్ళ క్రితం దృశ్యాలు చూపించేటప్పుడు పాత్రధారులు మోడర్న్ జీన్స్, టీషర్టు లలో కనిపిస్తారు.

తన కూతురికి స్కూల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో ప్రకాష్ రాజ్ తమిళనాడు ముఖ్యపట్టణం 'చెన్నై' అంటాడు. అలాగే కూతురి బాల్యాన్ని అత్యాధునిక వీడియో కెమెరా తో చిత్రీకరిస్తాడు. ఇలాంటి లోపాలను పరిహరిస్తే 'ఆకాశమంత' ఇంకా మంచి సినిమా అయి ఉండేది. 'అనంతపురం' లో ఇలాంటి తప్పుల కోసం వెతికాను కానీ కనిపించలేదు.. రెండోసారి మరికొంచెం జాగ్రత్తగా చూడాలి, ఏమైనా దొరుకుతాయేమో..

ఆదివారం, మే 17, 2009

నిశ్శబ్ద సాక్షి

రాష్ట్రంలో ఐదేళ్ళ పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ విజయానికీ, ప్రతిపక్షాల మహా కూటమి, కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం పార్టీల ఓటమికీ కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. వీటిల్లో చెప్పుకో వలసిందీ, నిశ్శబ్దంగా తన పని తానూ చేసుకుపోయిందీ ఒకటి ఉంది. అది యేడాది క్రితం పుట్టిన 'సాక్షి' దిన పత్రిక.

పేపరు చదివే అలవాటు ఉన్న తెలుగు వాళ్లకి 'సాక్షి' పుట్టుకకి దారి తీసిన పరిస్థితులేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని రెండు ప్రధాన తెలుగు పత్రికలతో పాటు, వాటిలో ఓ పత్రిక యాజమాన్యంలోనే నడుస్తున్న ఓ టీవీ చానల్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని అజెండా గా చేపట్టినప్పుడు అధికార కాంగ్రెస్ కి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం తనకంటూ ఓ పేపర్ ని ప్రారంభించుకోవడం.

అధికారం లో ఉన్న పార్టీ ప్రాపగాండా కోసం ఓ పత్రికను ప్రారంభించు కోవచ్చా? అన్న ప్రశ్నలు చాలా వినిపించాయి. మరి ఏ పార్టీకీ చెందని పత్రికలుగా తమని తామూ అభివర్ణించుకునే 'ఆ రెండు' పత్రికలూ ప్రభుత్వ వ్యతిరేకతని పెంచి పోషించడమే ఎజెండా గా పెట్టుకోవచ్చా? ఈ ప్రశ్నకి మేధావులెవరి నుంచీ సరైన సమాధానం రాలేదు. ఇది 'సాక్షి' ఆరంభాన్ని సమర్ధించడం కాదు, అందుకు అనివార్యమైన నేపధ్యాన్ని వివరించడమే.

నిజానికి రాజకీయ పార్టీలకి సొంత పత్రికలు ఉండడం 'సాక్షి' తోనే మొదలు కాలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు 'నేషనల్ హెరాల్డ్' అనే పత్రిక ఉండేది. నెహ్రూ మానస పుత్రిక ఐన ఈ పత్రిక ఉద్దేశ్యం పార్టీని ప్రమోట్ చేయడం కానే కాదు. నిజానికి ఈ పత్రిక చాలా సందర్భాలలో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టే, నెహ్రూని ఇరుకున పెట్టే రాతలు రాసింది. వామపక్ష పార్టీలకి, బీజేపీ అనుబంధ సంఘాలకీ కూడా సొంత పత్రికలు ఉన్నాయి. అవి పూర్తిగా పార్టీ పత్రికలు.

ఐతే 'సాక్షి' మాత్రం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కోసం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పత్రిక. గడిచిన యేడాది కాలం లో ముఖ్యమంత్రి సమస్యను ఎదుర్కొన్న ప్రతిసారీ ఆయనకి అండగా నిలిచింది 'సాక్షి.' ప్రతి అంశంలోనూ ముఖ్యమంత్రి వాదనను బలంగా వినిపించింది. 'ఆ రెండు పత్రికలకి' ధాటీగా సమాధానాలు చెప్పడమే కాదు, గీత దాటి రాస్తే వాటి బండారాలని బయట పెడతానని బెదిరించడానికీ వెనుకాడ లేదు.

'సాక్షి' రాతలని జనం పూర్తిగా నమ్మేశారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఆ పత్రిక వాళ్ళు కూడా ఇలా భావించక పోవచ్చు. ఐతే పత్రికా ముఖంగా జరుగుతున్న దాడుల నుంచి ముఖ్యమంత్రిని రక్షించడంలో, ఎదురుదాడుల ద్వారా ప్రత్యర్దులని నిలువరించడం లోనూ విజయం సాధించిందని చెప్పక తప్పదు. యేడాది క్రితం వాతావరణాన్ని గుర్తు చేసుకుంటే, 'సాక్షి' పత్రికే లేకపొతే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండేది? ముఖ్యమంత్రికి తన వాదన వినిపించే 'గొంతు' ఉండేది కాదు. ఏకపక్షంగా ఆరోపణలు సాగిపోతూ ఉండేవి. వాటి ప్రభావం ఎంతోకొంత వోటర్ల పై పడి ఉండేది.

ఇదే సమయంలో మరో ఆలోచన కలుగుతోంది. 'ప్రజారాజ్యం' పార్టీకి సొంతంగా ఓ పత్రిక ఉండి ఉంటే అ పార్టీ మరికొన్ని స్థానాలు సంపాదించి ఉండేదేమో.. ఒకప్పుడు పత్రిక కరదీపిక. ఇప్పుడు కరపత్రం. సొంత వ్యాపారాలకి, రాజకీయ వ్యవహారాలకి రక్షణ చక్రం. 'సాక్షి' ఈ ట్రెండ్ ని ప్రారంభించ లేదు, వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఏమిటో సామాన్య పాఠకులకి కూడా అయ్యేలా చేసింది. అంతిమంగా తన లక్ష్యాన్ని సాధించింది.

శనివారం, మే 16, 2009

ఝుమ్మందినాదం..

ఎదురుచూసిన ఎన్నిక ఫలితం వచ్చింది.. నేను రాష్ట్రం లో ఎవరు గెలుస్తారని ఎదురు చూడలేదు.. కేంద్రంలో ఏ కూటమి అధికారం లోకి వస్తుందా అన్న విషయంలో కూడా ఆసక్తి చూపించలేదు. గత కొద్ది రోజులుగా నేను ఎదురు చూస్తున్న ఒకే ఒక్క ఫలితం 'రాంపూర్.' అవును.. ఇంట ఓడిపోయి, రచ్చ గెలుస్తున్న రాజమండ్రి అమ్మాయి జయప్రద పొరుగు రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించి తలెత్తుకుంటుందా, ఓటమితో తల వంచుకుని వస్తుందా? అన్న ప్రశ్న కొద్ది రోజులుగా నన్ను వెంటాడింది.

ముప్పయ్యేళ్ళ క్రితం జయప్రద నటించిన 'అంతులేని కథ' ఇవ్వాల్టికీ నా అభిమాన చిత్రాలలో ఒకటి. ఆ తర్వాత 'సిరిసిరి మువ్వ' 'సాగర సంగమం' ఇంకా మరికొన్ని సినిమాలు. ఐతే ఈ అభిమానం వెండితెరకే పరిమితం. చాలా మంది సిని నటుల్లాగే ఆమె రాజకీయాలలో ప్రవేశించినప్పుడు కొంచం ఆసక్తిగా గమనించాను. ఈమె కూడా 'చిలుక పలుకుల' తోనే రాజకీయ కెరీర్ మొదలుపెట్టింది. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన జయప్రద 'వెన్నుపోటు' తర్వాత చంద్రబాబు నాయుడు వెంట ఉండడం కొంత ఆశ్చర్యపరిచింది.

రాజకీయాలకి ఆమె ఎంతవరకు 'సూటబుల్' అన్న ప్రశ్న పక్కన పెడితే, అప్పట్లో తెలుగు దేశం పార్టీ కోసం ఆమె కష్టపడిన మాట వాస్తవం. కొన్ని వివాదాలకూ ఆమె కేంద్ర బిందువయ్యింది. ఐతే ఆమె తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిన పరిస్తితులు మాత్రం దారుణం. అత్యంత అవమానకర పరిస్థితుల్లో ఆమె పార్టీని విడిచి పెట్టాల్సి వచ్చింది. చాలా సెన్సిటివ్ గా కనిపించే జయప్రద ఇప్పుడేం చేస్తుంది, ఈ అవమానాన్ని ఎలా తట్టుకుంటుంది అనుకున్నాను నేను. ఆమె తలవంచుకుని బయటికి వెళ్ళిపోలేదు, అపజయాన్ని ఓ అవకాశంగా మలచుకుని జాతీయ రాజకీయాలలో ప్రవేశించింది.

ఐదేళ్ళ క్రితం జరిగిన ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ తరపున ఆమె 'రాంపూర్' నుంచి పోటీ చేసినప్పుడు మరో రాంగ్ స్టెప్ వేస్తోందేమో అనుకున్నాను. బాలీవుడ్ సినిమాల పుణ్యమా అని అక్కడి ప్రజలకి ఆమె పరిచితురాలే అయినా ఆ అభిమానం వోట్లని తెచ్చిపెడుతుందా అన్న సందేహం ఉంది. సైకిల్ గుర్తుపై ఎంపీ గా గెలిచి పార్లమెంటులో ఆమె అడుగుపెట్టిన క్షణం లో జయప్రద తనను తాను నిరూపించుకుంది అనిపించింది. సహనటి శ్రీదేవితో తనకున్న గొడవల గురించి ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలలో 'ఈమె ఇంత అమాయకురాలా?' అనిపిస్తుంది.

మొన్న తన పుట్టినరోజున 'నా వయసు పదహారు' అని ప్రకటించి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది జయప్రద. రాంపూర్ టిక్కెట్ విషయంలో పార్టీ లో వచ్చిన గొడవల ఫలితంగా ఎన్నో తలనొప్పులనీ అనుభవించింది. రాజకీయనాయకులు ఎంతకైనా దిగజారతారనడానికి ఆమె ప్రత్యర్ధులు వేయించిన జయప్రద అశ్లీల పోస్టర్లే ఉదాహరణ. ఓ దశలో పోటీ నుంచి వైదొలగే నిర్ణయం తీసుకున్న జయప్రద మొండితనాన్ని ఆశ్రయించి ప్రచారం కొనసాగించింది. నిజానికి ఆమె గడిచిన ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. పార్టీ లో ఇంటిపోరూ తక్కువేమీ కాదు. ఇంతటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా విజయ బావుటా ఎగరేసిన జయప్రద కి అభినందనలు.

శుక్రవారం, మే 15, 2009

అనంతం

"శ్రీశ్రీ గారి శతజయంతి సంవత్సరం కదా.. ఆయన పుస్తకాలు ఏవైనా చదువుతారా?" అని అడిగాడు పుస్తకాల షాపు అబ్బాయి, గతసారి నేను షాపుకి వెళ్ళినప్పుడు. శ్రీశ్రీ పద్యాలు మాత్రమే చదివిన నాకు, ఆయన గద్యం చదవాలనిపించి, 'అనంతం' ని చేతిలోకి తీసుకున్నాను. తెలుగు సాహిత్యంపై తమదైన ముద్రవేసిన గత శతాబ్దపు కవుల్లో ఒకరైన శ్రీశ్రీ తన అనుభవాలను, జ్ఞాపకాలనూ పంచుకోవడం తో పాటు, సమకాలీన సాహిత్యం, సినిమాలు, రాజకీయాలు, ఇంకా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలనూ సూటిగా, స్పష్టంగా చెప్పారు తన 'ఆత్మకథ' లో. 'అనంతం' గురించి పరిచయం 'పుస్తకం' లో...

గురువారం, మే 14, 2009

నీళ్ళావకాయ

ఆవకాయల సీజన్ హడావిడి చూడగానే నాకు మా చిన్నప్పటి నీళ్ళావకాయ గుర్తొచ్చింది. ఇదేమీ కొత్తరకం వంటకం కాదు. నాకు తెలిసి మా ఊరికి మాత్రమె ప్రత్యేకమైనది. ఈ ఆవకాయ ని గురించి చెప్పాలంటే ముందుగా మా సుబ్బమ్మ గారి గురించి చెప్పాలి. సుబ్బమ్మ గారు ఓ వితంతువు. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. జీవిక కోసం ఓ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవారు. ఆవిడ కొడుకు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. దీనితో ఆవిడే తిప్పలు పడి ఏదోలా ఇల్లు నడుపుతూ ఉండే వారు.

ఆవిడ కొట్లో ఏ వస్తువైనా, యెంత తక్కువ పరిమాణం లో అయినా విసుక్కోకుండా ఇచ్చేవారు. చిన్న పిల్లలు కొనడానికి వస్తే వాళ్లకి విధిగా బెల్లం ముక్క కొసరు ఇచ్చేవారు. ఈ కారణాల వాళ్ళ మరో పెద్ద కిరాణా కొట్టు ఉన్నా ఎక్కువమంది ఈవిడ కొట్లోనే కొనడానికి మొగ్గు చూపించే వాళ్ళు. మా కోనసీమలో ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే కదా.. చెట్టు మీద నుంచి రాలిన కాయను తోట యజమాని చూడక ముందే ఇంకెవరైనా చూశారంటే అది చూసిన వాళ్ళదే అన్న మాట.

ఇలా సేకరించిన కాయలని సుబ్బమ్మ గారికి అమ్మేసేవాళ్ళు మా ఊరి జనం. బదులుగా చిల్లరో, లేక ఏవైనా సరుకులో, చిరుతిళ్లో పట్టుకేళ్ళే వాళ్ళు. ఆవిడ ఆ కాయలని ఓపికగా విభజించి, ముదురు కాయలని నూనె కోసం పక్కన పెట్టి, లేత కాయలతో కొబ్బరి ఉండలు చేసి కొట్లో అమ్మేవాళ్ళు. చీపురీనల మొదలు, బూరుగు కాయల వరకు ఎవరేం పట్టుకొచ్చినా కొనేవాళ్ళు. వాటిని రూపాంతరం చెందించి అమ్మేవాళ్ళు. అంటే చీపురీనలని చీపుళ్ళుగాను, బూరుగు దూది విడిగానో లేక తలగడలుగా చేసో.. ఇలా అన్నమాట.

ఇక ఎండలు వస్తున్నాయనగా వాళ్ళింట్లో హడావిడి మొదలయ్యేది. ఆవిడ పొరుగూరు వెళ్లి మిరపకాయలు, ఆవాలు, ఉప్పు కొనుక్కుని, నేల టిక్కెట్ లో ఓ సినిమా చూసి సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్ళు. మర్నాడు ఒకరో ఇద్దరో కూలీలని పెట్టి మిరపకాయలు, ఆవాలు, ఉప్పు రాళ్ళు పొడులు కొట్టించి, జల్లించి జాడీలకి ఎత్తించేవాళ్ళు. అది మొదలు, కొట్లోకి వచ్చిన పిల్లలకి మామిడి కాయలు కొంటానని అన్యాపదేశంగా చెప్పేవాళ్ళు.

మధ్యాహ్నాలు గాలి కోళ్ళలా ఊరి మీద పడి తిరిగే పిల్లలకి పండగన్నమాట. దొంగతనంగా మామిడి కాయలు కొట్టి రహస్యంగా పట్టుకెళ్ళి ఆవిడకి అమ్మేసేవాళ్ళు. సాయంత్రానికి ఆవిడ ఆవకాయ పెట్టేసేవాళ్ళు. మామిడి కాయ ముక్కలు, కొట్టి ఉంచిన కారం, ఆవ, ఉప్పు పొడులు, కాసిన్ని వేడి నీళ్ళు ఓ గిన్నెలో వేసి కలిపేస్తే ఆవకాయ తయారు. ఎర్రెర్రని ఆవకాయని కొట్లో ప్రదర్శించే వాళ్ళు.

వేసవి వస్తుండగానే వ్యవసాయ పనులు ముమ్మరం అవుతాయి కాబట్టి కూలీలంతా ఉదయాన్నే పనులకెళ్ళి ఏ రాత్రికో తిరిగొచ్చే వాళ్ళు. కూర వండే ఓపిక లేని వాళ్లకి ఈ ఆవకాయ మహా ప్రసాదం. పైగా కనీస ధర అన్నది లేదు. ఎంత తక్కువ డబ్బిచ్చినా ఆవకాయ వస్తుంది. దీనితో అందరూ చిన్న చిన్న గిన్నెలతో కొట్టు దగ్గర మూగే వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి. 'వర్రగా (కారం) ఉంద'నో, ఉప్పు సరిపోలేదనో వాళ్ళిచ్చే సలహాలను ఆవిడ పాటించేవాళ్ళు. మర్నాడు ఆవకాయ కలిపేటప్పుడు రుచి మార్చేవాళ్లు.

వేసవి సాయంత్రాలు వీధిలో కూర్చుంటే చాలు, జనం కొనుక్కుని పట్టుకెళ్ళే ఆవకాయ వాసన ముక్కుపుటాలని సోకేది. పైన మూత లేని చిన్న గిన్నెల్లో కొత్తావకాయ నోరూరించేది. ప్చ్.. ఏం లాభం.. ఆ ఆవకాయ తినే అదృష్టం లేక పోయింది. రహస్యంగా తినగలిగేది కాదు. అక్కడికీ ధైర్యం చేసి ఒకటి రెండు సార్లు అమ్మని అడిగాను.. "గట్టిగా అనకు..నాన్నగారు వింటే వీపు చీరేస్తారు" అని చెప్పింది. ఎన్నో రకాల ఊరగాయలు రుచి చూశాను కానీ, మా సుబ్బమ్మ గారి నీళ్లావకాయ తినలేకపోయాననే లోటు మాత్రం మిగిలిపోయింది.

బుధవారం, మే 13, 2009

ఫోను కష్టాలు

ఇది అష్టకష్టాల జాబితాలో లేని కష్టం. అష్టకష్టాల లెక్క రాసిన రోజుల్లో లేని కష్టం. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అన్న చలం వాఖ్యని గుర్తు చేసుకోనవసరం లేదు. ఎందుకంటే ఫోనున్న ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురయ్యే సమస్యే ఇది. రెండు వారాల క్రితం నా సెల్ ఫోన్ పాడయింది. నిజానికి ఇది చాలా ఆనందంగా ప్రకటించాల్సిన విషయం. కాని ఇక్కడ రెండు సమస్యలు. ఆ ఫోన్ వయసు కేవలం ఆరు నెలలు. రెండో సమస్య ఏమిటంటే ఇరవై నాలుగంటల్లో ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా గడవని పరిస్థితి.

సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన నాటినుంచీ నేను ఎంచుకున్తున్నది బేసిక్ మోడల్ హ్యాండ్ సెట్ నే. స్నేహితులంతా రకరకాల ఫీచర్లున్న ఫోన్లు వాడుతుంటే "కుక్క పని కుక్క, గాడిద పని గాడిద, ఫోన్ పని ఫోన్ చేయాలి" అని వాదించిన రోజులున్నాయి. ఐతే ఎప్పుడూ ఒకేలా గడిస్తే కాలం గొప్పదనం ఏముంది? ఓ బలహీన క్షణంలో ఫోన్ గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నచ్చిన పాటలు ఇయర్ ఫోన్స్ తో వినొచ్చు, ఎఫ్ఫెం రేడియో వింటూ ఇప్పటి కుర్రకారు ఆలోచనలు పట్టుకోవచ్చు, ఫోటోగ్రఫీ లో మన టాలెంట్ 'భంగిమా' అయినా ఫోనులో కెమెరా ఉంటె ఎప్పుడైనా ఫోటోలు తీయొచ్చు... ఇలా ఓ లిస్టు వేశాను.

వాడుతున్న ఫోన్ పనిచేయకపోవడం తో కొత్త ఫోన్ కొనాల్సిన సందర్భం రానే వచ్చింది. అప్పటికే ఓ నిర్ణయం తీసేసుకోవడంతో ఓ 'పెద్ద' పేరున్న షాపుకెళ్ళి కాసేపు రకరకాల సెట్లు చూసి ఒకటి ఎంపిక చేసేసుకున్నా.. ఫీచర్ల గురించి సేల్స్ వాళ్ళని కాసేపు విసిగించి బిల్లు కట్టేశాను. ఇదంతా ఆర్నెల్ల క్రితం సంగతి. ఫోన్ కొన్న నాలుగో రోజునో, ఐదో రోజునో ఓ సందేహం వచ్చింది. మాన్యువల్ ఆమూలాగ్రం చదివినా సమాధానం దొరకలేదు. ఇలా లాభం లేదని బిల్లుతో సహా షాప్కెళ్లా.. అక్కడ వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానం చూసి ఇంకా జీవితంలో ఈ షాపుకి రాకూడదని నిర్ణయించుకున్నాను.

ఫోన్ గురించి అడిగిన వాళ్ళందరికీ, ఫలానా 'పెద్ద' షాపుకి మాత్రం వెళ్ళ వద్దని చెప్పాను కొన్నాళ్ళు. సరే.. కొన్నాళ్ళు బాగానే గడిచింది. నెమ్మదిగా ఫోన్ మెమరీ లో డాటా పెరుగుతోంది. మెమరీ పుణ్యమా అని ఓ పుస్తకంలో ఫోన్ నంబర్లు రాసుకునే అలవాటు కూడా మానేశా. డాటాని బ్యాకప్ తీసుకునే పనిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. ఎప్పుడో కొంప మునుగుతుందని నా సిక్స్త్ సెన్స్ పాపం అప్పుడప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 'ఇదెంత..పది నిమిషాల పని..' అని ఎప్పటికప్పుడు దాని నోరు నొక్కేశాను.

ఆవేల్టి శుభ తిధి, నక్షత్రం గుర్తు లేవు కానీ రెండు వారాల క్రితం ఓ ఉదయం నా ఫోన్ నోరు పడి పోయింది. బిల్లులో అడ్రస్ చూసుకుని రిపేరు షాప్ కెళ్లా. వాళ్ళు పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు. ఓ ఐదారు గంటలు ఫోన్ పనిచేయక పోయేసరికి మనుషులు నన్ను వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. (నేనెవరికీ బాకీలు లేనని మనవి చేసుకుంటున్నాను) అన్నాళ్ళ ఫోన్ వియోగం కుదరని పని అని అర్ధమై ఓ ఫ్రెండు దగ్గర స్పేర్ లో ఉన్న ఫోన్ తాత్కాలికంగా తీసుకున్నాను. అది మొదలు 'ఈ ఫోన్ కి ఏమైనా ఐతే..' అన్న భయమే.

నంబర్లన్నీ పోవడం మరో సమస్య. ఇదివరకేవరైనా 'మీ నెంబర్ మిస్ ఐంది.. ఫోన్ మార్చాను..' అంటే అప నమ్మకంగా చూసేవాడిని. నిజంగా మీకు ఆసక్తి ఉంటే అలా పోగొట్టుకుంటారా? అన్నట్టు. ఇప్పుడు అదే వివరణ నేను ఇవ్వాల్సి రావడం, అందరూ నా గురించి అలాగే అనుకుంటున్నారేమో అని సదేహం. ఇదో రకం కష్టం. ఇలా కథ సాగుతుండగా ఇవాల్టి ఉదయం ఫోన్ రిపేరు షాపు వాళ్ళు సంక్షిప్త సందేశం పంపారు. రిపేర్ పూర్తయ్యింది, వచ్చి ఫోన్ తీసుకెళ్ళమని. ఫోన్ తీసుకోగానే చేసిన మొదటి పని. ఫ్రెండు ఫోన్ తిరిగి అప్పచెప్పడం. ఫోన్ భద్రంగా ఇచ్చేస్తున్నానన్న ఆనందంలో పువ్వుల్లో పెట్టి ఇవ్వడం మర్చిపోయాను.

ఫోన్ మెమరీ లో ఒక్క నంబరూ, ఒక్క మెసేజీ లేక పోయినా నా ఫోను నాకు వచ్చేసిందన్న సంతోషం మిగిలింది. ఐతే అది ఎంతో సేపు నిలవలేదు. ఓ గంటైనా గడవక ముందే మళ్ళీ 'మూగనోము' పట్టింది నా ఫోన్. చలో రిపేర్ షాపు. 'ఫిఫ్టీన్ డేస్ సర్' స్టైలుగా చెప్పింది కౌంటర్ అమ్మాయి. 'విధి చేయు వింతలన్నీ..' పాట గుర్తొచ్చింది. ఇంక చేసేదేముంది.. ఓ బేసిక్ మోడల్ ఫోన్ కొనుక్కున్నా..

మంగళవారం, మే 12, 2009

అభిప్రాయం

"ఒపీనియన్స్ చేంజ్ చేసుకోనివాడు పొలిటిషియన్ కానేరడు," అని చెప్పిన 'కన్యాశుల్కం' గిరీశాన్ని మొదట తలచుకోవాలి. కేవలం పొలిటీషియన్సే కాదు, మానవ మాత్రులంతా ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయాలను మార్చుకోక తప్పదు. కొన్ని సార్లు ఇది ప్రయత్న పూర్వకంగా జరిగితే, చాలాసార్లు మనకి తెలియకుండానే జరిగి పోతుంది. అంటే కాలం తెచ్చే మార్పన్న మాట. 'ఎలాంటివాళ్ళనైనా కాలం మారుస్తుంది' అంటారు ఇందుకేనేమో.

"అసలు అబ్బిప్రాయం అంటే ఏమిటి? మనకి అది ఉంటే మంచిదా? లేక పోతే మంచిదా?" ఇది అలమండ వాస్తవ్యుడు రొంగలి అమ్మన్న కి వచ్చిన సందేహం. మచిలీపట్టణం గోపాత్రుడు లేవనెత్తిన 'భూమాత ఆకారం' సమస్య విషయంలో అలమండ మొత్తం రెండుగా చీలిపోయిన సందర్భంలో అబ్బిప్రాయాన్ని గురించి చాలానే ఆలోచించాడు అమ్మన్న. (కే.యెన్.వై. పతంజలి నవల 'గోపాత్రుడు' ) తెలివైన వాడు కనుక అబ్బిప్రాయం లాభదాయకంగా ఉండాలని గుర్తించాడు.

అసలు అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయి? ఇది కొంచం కష్టమైన ప్రశ్న. మనం పుట్టినప్పటినుంచీ మన అభిప్రాయాలు వెలిబుచ్చుతూనే ఉంటాం కానీ, పెద్దవాళ్ళు తమకి తాముగా మనకి మన అభిప్రాయం వెలిబుచ్చే అవకాశం ఇచ్చేది మాత్రం అన్నప్రాశన చేసినప్పుడు. మన ఎదురుగా బోల్డన్ని వస్తువులు ఉంచి ఏదో ఒకటి ముట్టుకోమంటారు. పెన్నో, పుస్తకమో పట్టుకుంటే సంతోషిస్తారు. అదే ఏ చాకో పట్టుకుంటే ఉలిక్కిపడతారు.

ఇంట్లో అమ్మ చేసే వంటల మొదలు, బళ్ళో మాష్టార్లు పాఠం చెప్పే విధానం వరకూ ప్రతి విషయం వరకూ మనకి అభిప్రాయాలు ఉంటాయి. మన అభిప్రాయాలని ఉన్నదున్నట్టుగా పైకి వ్యక్తం చేయడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను నెమ్మది నెమ్మదిగా గ్రహిస్తాం, కొన్ని అనుభవాల తర్వాత. అమ్మ వంటలో ఉప్పుకారాల గురించి నా అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని తెలుసుకోడానికి కొన్ని టెంకి జెల్లలూ, మాస్టారు పాఠం మధ్యలో ఉండగా సందేహాలు అడగకూడదని గ్రహించడానికి చిన్నపాటి శిక్షలనూ మూల్యంగా చెల్లించాను నేను.

వంటల గురించి చిన్నప్పుడే ఏర్పడి పోయిన అభిప్రాయాలను మార్చుకోక తప్పని సందర్భం ప్రతి మగాడికీ ఎదురవుతుంది. అది పెళ్లి. అతనికి వంకాయంటే చిరాకు. ఆవిడకి వంకాయ కూరుంటే ఇంకేమీ అక్కర్లేదు. ఫలితం..వాళ్ళింట్లో వారానికి మూడు రోజులు వంకాయ కూర. బజార్లో వేరే కూరల్లేవనో, ఇదైతే వండడం సులువనో సమాధానం రావడంతో పాటు 'సద్దుకుపోవాలనే' కొసరు వ్యాఖ్య కూడా తప్పదు. చిన్నప్పుడు అమ్మ నాతో తరచూ "అమ్మ దగ్గర సాగినట్టు ఆలి దగ్గర సాగదు" అంటూ ఉండేది.

ఒక్క భోజనమేనా? ఇంకా చాలా విషయాల్లో మగ వాళ్ళు అభిప్రాయాలు మార్చుకోవాలి. ఆఫ్కోర్స్, ఆడవాళ్లక్కూడా ఇది వర్తిస్తుంది, కొన్ని కొన్ని విషయాల్లో. అభిమాన హీరోలు, హీరోయిన్లు, ఆటగాళ్ళు, సినిమాలు, సంగీతం, రాజకీయ నాయకులు.. ఒకటేమిటి దాదాపు అన్ని విషయాల్లోనూ అభిప్రాయాలు మారిపోతూనే ఉంటాయి. అభిప్రాయాలు మార్చడంలో పిల్లల పాత్ర కూడా తక్కువేమీ కాదు. దీని గురించి ఓ ప్రత్యేక టపా అవసరం. ఆఫీసులో ఫలానా కొలీగు చాలా మంచివాడని మన అభిప్రాయం. అవసరానికి అప్పివ్వకపోతేనే, మనకి పని సాయం చేయకపోతేనో మనం అదే అభిప్రాయాన్ని కొనసాగించగలమా?

పుస్తకాల విషయంలోనూ ఓ కొత్త అనుభవం ఎదురవుతోంది నాకు. గతంలో నన్ను ఉర్రూతలూగించిన పుస్తకాలు ఇప్పుడు అంతగా పస లేనట్టుగా అనిపిస్తున్నాయి. వీటినేనా ఒకప్పుడు నేను నిద్రమానుకుని బెడ్ లైట్ వెలుగులో చదివింది అనిపిస్తోంది కొన్ని పుస్తకాలు ఇప్పుడు తిరగేస్తుంటే. కొన్నాళ్ల క్రితం చదివి 'పర్లేదు' అని పక్కన పెట్టిన పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. మరి ఇది అభిప్రాయం మారడమే కదా? చూడాలి, భవిష్యత్తులో ఇంకెన్ని అభిప్రాయాలు మారతాయో..

శనివారం, మే 09, 2009

నాయికలు-ప్రమద్వర

యండమూరి వీరేంద్రనాథ్ 'వెన్నెల్లో గోదారి' నవలని మొదటి సారి చదివినప్పుడు నాకు బాగా నచ్చిన పాత్ర ప్రమద్వర. ఆ తర్వాత ఆ నవలని చాలాసార్లు చదివాను. మొదటిసారి చదివినప్పటి ఉత్కంఠత లేదు, కథ తెలిసిపోవడం వల్ల. ఐతే ప్రమద్వర మీద ఇష్టంలో ఏమాత్రం మార్పు లేదు. కథ, కథనాల్లో నాటకీయత పాళ్ళు ఎక్కువగా ఉన్నట్టూ, ప్రమద్వర అతిమంచి తనాన్ని చూపించడం కోసం మరో నాయిక తరళ ను అతి మూర్ఖం గా చిత్రించినట్టూ అనిపించింది..అయినా కూడా ప్రమద్వర నచ్చింది.

గోదారొడ్డున ఉన్న ఓ పల్లెటూళ్ళో ఓ వేశ్య కూతురు ప్రమద్వర. పెద్ద అందగత్తె కాదు. తల్లిని ఎదిరించి డిగ్రీ చదివింది. తనని కులవృత్తిలోకి దింపాలన్న తల్లి ప్రయత్నాలని అడ్డుకుంది. ఆ ఊరికే కాక, చుట్టుపక్కల పదూళ్ళకి కోటీశ్వరుడైన జి.ఫై.రావు ఏకైక కూతురు తరళ, ప్రమద్వర ప్రాణ స్నేహితులు. చదువు పూర్తిచేసుకుని ప్రమద్వర తన భవిష్యత్తుని నిర్ణయించుకునే సమయానికి ఆమెకి ఆనందరావు పరిచయ మవుతాడు. చదువుకున్నవాడు. ఓ ఎరువుల కంపెనీలో సేల్స్ ఉద్యోగం చేస్తున్నవాడు.. అదే పల్లెలో ఉంటున్న వాడు.

ప్రమద్వర, ఆనందరావు నాటకీయంగా జరిగిన తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఇష్టపడతారు..కానీ వ్యక్తపరుచుకోరు. మరోపక్క కూతుర్ని వృత్తిలోకి దింపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ప్రమద్వర తల్లి. ఆనందరావుని పెళ్లి చేసుకోవడం ద్వారా మురికూపం లాంటి ఇంట్లోనుంచి బయటపడా లనుకుంటుంది ప్రమద్వర. సరిగ్గా అప్పుడే తరళ కి ఆనందరావుతో పరిచయం అవుతుంది. తొలి పరిచయం లోనే తానతని ప్రేమలో పడిపోయానని ప్రమద్వరకి చెబుతుంది తరళ. తాను ఇష్టపడేదీ, పెళ్లి చేసుకోబోయేదీ ప్రమద్వరనే అని, ప్రమద్వరకి చెబుతాడు ఆనందరావు.

అటు ఆనందరావు కానీ, ఇటు ప్రమద్వర కానీ తామిద్దరం ప్రేమించుకుంటున్న విషయం తరళకి చెప్పరు. తను ఆనందరావుని ప్రేమిస్తున్నానన్న సంగతి తన తండ్రికి చెబుతుంది తరళ. కూతురు ఏనుగు బొమ్మ అడిగితే నిజం ఏనుగుని కొని తెచ్చే జి.పి. రావు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఓ చిన్న మోసంతో ఆనందరావు ని తన అల్లుడిగా చేసుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో తన మేనమాన భైరవమూర్తి ని పెళ్లి చేసుకుంటుంది ప్రమద్వర. జరిగిన మోసం తెలిశాక దాదాపు పిచ్చివాడవుతాడు ఆనందరావు.

ఆనందరావుని మనిషిని చేసి, తరళ కాపురం బాగు చేయడం కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది ప్రమద్వర. అతనితో ఓ పందెం కడుతుంది. పాతికేళ్ళ తర్వాత మాత్రమే కలుసుకుందా మంటుంది. ఎన్నో కష్టాలు పడుతుంది. ఎదుటివారిని బాధపెట్టని దయాగుణం, కష్టపడే తత్త్వం, ఆత్మవిశ్వాసం.. ఈ మూడు గుణాలనూ విడిచి పెట్టకుండా తనవాళ్ళందరికీ దూరంగా జీవన పోరాటం చేస్తుంది ప్రమద్వర. కేవలం ప్రమద్వరకిచ్చిన మాట కోసం మామూలు మనిషవుతాడు ఆనందరావు. పాతికేళ్ళ తర్వాత ఆమె ఆనందరావుని కలిసిందా? పందెం గెలిచిందా? అన్నది నవల ముగింపు. చదవగానే శరత్ నవలలు గుర్తొచ్చే 'వెన్నెల్లో గోదారి' ని 'నవసాహితి' ప్రచురించింది. (అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు, వెల రూ. 50)

గురువారం, మే 07, 2009

సత్యభామ-చివరి భాగం

(సత్యభామ-1, 2 తర్వాత)
చెరువు గట్టు కిటకిటలాడుతోంది. చుట్టుపక్కల నాలుగైదు ఊళ్ళ నుంచి జనం వచ్చేశారు. నిజానికి ఊళ్ళో అమ్మవారి జాతరకి కూడా ఎప్పుడూ అంత జనాన్ని చూడలేదు ఊళ్ళో వాళ్ళు. భక్తుల ఆధ్వర్యంలో మైకులు ఏర్పాటయ్యాయి. గ్రామఫోన్ రికార్డులు మోగుతున్నాయి. కానీ జనం అంటా ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు. 'నీళ్ళ మీద నడవడం సాధ్యమేనా?' అనే అంశం మీద వాదోపవాదాలు జరుగు తున్నాయి. 'మరి కాసేపట్లో సత్యభామ గారు మనూరి చెరువు మీద నడవబోతున్నరహో..' అని దండోరా బయలుదేరింది.

ఆవేళ సత్యభామ డ్యూటీ అమ్మ వాళ్ళది. అమ్మ, వాళ్ళక్క, చెల్లి. ముగ్గురూ పొద్దున్నే చద్దన్నం తిని బయలుదేరారు. 'బడెక్కడికీ పోదు కదా..ముందు ఈ సత్యభామ సంగతి చూసి అప్పుడు బళ్లోకి వెళ్దాం' అనుకున్నారు ముగ్గురూ. ఇంట్లో వాళ్ళెవరూ చూడడం లేదని నిశ్చయించుకుని, చెరువు గట్టున ఓ చెట్టు కిందకి చేరారు. వరద గోదారి నీటిమట్టంలా క్షణ క్షణానికీ జనం పెరుగుతున్నారు. పిల్లల్ని తీసుకుని ఎడ్ల బళ్లమీద దిగిపోతున్నారు చెరువు గట్టున.

కాఫీ హోటలూ, చిరు తిళ్ళు అమ్మే అంగళ్ళూ వెలిశాయి చెరువు గట్టున. సత్యభామ ఇంటి దగ్గర కోలాహలం గా ఉంది. భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. సత్తెమ్మ గారు ఉదయానే జామ చెట్టు (ఆవిడ భాషలో పొన్న వృక్షం) ఎక్కేశారు. కామాక్షి, వామాక్షి భజనలు మొదలు పెట్టారు. కుచేలుడు అప్పుడప్పుడు ఆశ్రమం నుంచి బయటికి వచ్చి 'మరి కాసేపట్లో అమ్మ చెరువు మీద నడుస్తారు' అని ప్రకటిస్తున్నాడు. మా అమ్మ వాళ్లకి మాత్రం అదంతా వింతగా ఉంది. 'ఆ నడిచేదేదో త్వరగా నడిచేస్తే మనం వెళ్లిపోవచ్చు కదా' అనుకుంటున్నారు వాళ్ళు.

చూస్తుండగానే మద్యాహ్నం అయ్యింది. భక్తుల రాక క్రమంగా తగ్గింది. దూరం నుంచి వచ్చిన వాళ్ళు తిరుగు ప్రయాణం ఆలోచనలో ఉన్నారు. పొద్దున్న తిన్న చద్దన్నం అరిగిపోయి అమ్మ వాళ్లకి ఆకలి మొదలైంది. చిరుతిళ్ళు దొరుకుతున్నాయి కానీ చేతిలో అర్ధణా లేదు. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అంటే తీరా ఇంటికెళ్ళాక నడుస్తుందేమో, మళ్ళీ రాడానికి కుదరదు అని బాధ. మిగిలిన వాళ్ళు తిండి ఏర్పాటు చూస్తారనుకుంటే వాళ్ళు బడినుంచి భోజనానికి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ గొడవకి బడికి ఓ పూట సెలవు ఇచ్చేశారు.

మైకులో పాటలు వస్తూనే ఉన్నాయి. సత్తెమ్మగారు పొన్న వృక్షం దిగడం లేదు. కాసేపు వేణువు ఊదుతూ, మరి కాసేపు ధ్యానం చేస్తూ గడుపుతున్నారు. భక్తులతో మాట్లాడడమే లేదు. పాద పూజలు కూడా అంగీకరించడం లేదు. "శ్రీ కృష్ణుల వారిపై అమ్మ అలిగారు. ఆ స్వామే వచ్చి అమ్మని బతిమాలుకుంటారు" అని కామాక్షి, వామాక్షి చెబుతున్నారని చూసి రాడానికి వెళ్ళిన మా పిన్ని అమ్మ వాళ్లకి చెప్పింది. "కృష్ణులవారు మనక్కూడా భోజనం ఏర్పాటు చేస్తే బాగుండునే.. ఒకటే ఆకలి" అన్నదట మా పెద్దమ్మ.

భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. పొరుగూరి వాళ్ళు వెళ్ళిపోగా, ఊళ్ళో పని లేని వాళ్ళు, ఇదేదో చూడాలని పట్టుదలగా ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నారు చెరువు గట్టున. మరి కాసేపట్లో సూర్యాస్తమయం అవుతుందనగా కుచేలుడు వచ్చి ప్రకటించాడు. "ఇవాళ చెరువు మీద నడవొద్దని అమ్మని శ్రీ కృష్ణులవారు ఆదేశించారు. మళ్ళీ ఎప్పుడు నడిచేదీ, స్వామి అమ్మ ద్వారా సెలవిస్తారు.." సత్యభామని తిట్టుకుంటూ అమ్మ వాళ్ళు దొడ్డి దారిన ఇల్లు చేరుకున్నారు.

విచిత్రం ఏమిటంటే పొరుగూళ్ళ వాళ్లకి ఆ సాయంత్రం ఏం జరిగిందో తెలియదు. వాళ్లకి తెలిసిందల్లా చెరువు మీద నడుస్తానన్న సత్యభామ ప్రకటన. దానితే సత్యభామ చేరువుమీద నడిచిందనీ, చాలా మహిమ కలదనీ ప్రచారం జరిగిపోయింది. (శిష్యులే ఆ ప్రచారం చేశారని చాలామంది అనుమానించారట). దానితో సత్తెమ్మ గారిని ఇంటికి పిలిచి పాద పూజ చేసుకోడానికి జనం క్యూలు కట్టారట. పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడం మొదలు, గృహ ప్రవేశాలకి ముఖ్య అతిధిగా హారజవడం వరకూ సత్తెమ్మ గారి ప్రభ వెలిగిపోయిందిట. అసలు అదృష్టం కాకాసురుడుది, ప్రహ్లాదుడుదిదీను. వద్దంటే డబ్బు వాళ్లకి.

ఇప్పటికీ టీవీల్లో స్వామీజీల ప్రవచనాలు చూస్తూ అప్పుడప్పుడూ అమ్మ సత్యభామని తల్చుకుని బాధ పడుతూ ఉంటుంది. "అప్పట్లో ఇన్ని టీవీలు లేవు. లేకపోతె మా సత్తెమ్మ కూడా టీవీలో కనిపించును కదా.." అని. నాకు మాత్రం ఈ మాటలు టీవీ చానళ్ళ మీద సెటైర్లలా అనిపిస్తాయి, ఆవిడకి ఆ ఉద్దేశం లేకపోయినా..

బుధవారం, మే 06, 2009

అద్దింటి కతలు

ఉద్యోగం అని ఊళ్ళు పట్టుకుని తిరిగే వాళ్లకి అన్ని చోట్లా సొంత ఇల్లు ఉండడం సాధ్యపడదు కదా.. కాబట్టి అద్దె ఇల్లు తప్పదు. అసలు సొంతిల్లు అనే భావన కోసం (ఎలాగూ ఎక్కువరోజులు ఉండలేం కదా) బోల్డంత డబ్బు ఖర్చు పెట్టడం వృధా అని 'డెడ్ ఇన్వెస్ట్మెంట్ ' అనీ చాలా రోజులు వాదించాను.

'అబ్బో అక్కడికేదో ఇన్వెస్ట్మెంట్లు మురిగిపోతున్నట్టు డెడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కబుర్లు..' అన్న వ్యాఖ్యల పుణ్యమా అని నా అభిప్రాయాలు నాలోనే దాచుకోవడం మొదలుపెట్టాను. సంచార జీవితంలో ఎలాగూ కేరాఫ్ అడ్రస్ అద్దిల్లే కాబట్టి 'అద్దిల్లే సౌఖ్యం' అనుకోవడమూ మొదలు పెట్టాను.

"అసలు సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఒక చోట ఉండాలి కానీ, మనకా అవసరం ఏముంది.. ఇల్లు నచ్చినన్నాళ్ళు ఉంటాం. నచ్చకపోతే మరో ఇల్లు వెతుక్కుంటాం" అని ఇల్లేరమ్మ చెప్పిన మాటలు నాకు ఎంత ఊరటనిచ్చాయో చెప్పలేను. వెతికేటప్పుడు విసుగొస్తుంది కానీ, ఇల్లు దొరికేకా వెతుకులాటని తల్చుకోడం భలే ముచ్చటగా ఉంటుంది.

ఎన్ని టూలెట్ బోర్డులు? ఎంతమంది ఓనర్లు? ఎన్ని రకాల కండిషన్లు? ఒకటా రెండా తల్చుకున్న కొద్దీ గుర్తొస్తూ ఉంటాయి. ఓ పట్టణం లో అద్దింటి వేట మొదలుపెట్టాను. వెతగ్గా, వెతగ్గా ఓ ఇల్లు పర్వాలే దనిపించింది. ఓనరు పెట్టిన ప్రాధమిక పరీక్ష గట్టెక్కేశాం. ఆ ఇల్లు చూపించినతను ఓనరుకి దగ్గర బంధువు అవడంతో పని కొంచం సులువైంది. రెండు మూడు రోజుల్లో వాళ్ళు రిపేర్లు చేయించడానికి, మర్నాడు అడ్వాన్సు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.

ఇల్లు దొరికేసిందన్న ఆనందంతో చక్కగా నిద్రపోయి, మర్నాడు ఉదయం బుద్ధిగా తల దువ్వుకుని అడ్వాన్స్ పట్టుకెళ్ళా. అడ్వాన్స్ ఇవ్వబోతుండగా కాబోయే ఓనరుగారికి అప్పటికే అయిపోయిన భార్య (అంటే కాబోయే భార్య కాదన్న మాట) నుంచి 'మీరెవరు?' అని ప్రశ్న. అది విననట్టుగా నటించి "ఇల్లు చాలా నీట్ గా ఉంచుతాం. పెద్దగా బంధువులు ఎవరూ రారు. అద్దె కచ్చితంగా ఫస్టుకి ఇచ్చేస్తాం.." అని నా ధోరణి లో నేను చెప్పేస్తున్నా.. ఓనర్ ఎవరైనా కామన్ గా చెప్పాల్సిన మాటలివి.

ఆవిడ అదే ప్రశ్న మళ్ళీ సంధించి, నా సమాధానంతో సంతృప్తి చెందక "బాలా (వాళ్ళ బంధువు) తీసుకొస్తే మా వాళ్లనుకున్నా.. మీకివ్వడం కుదరదు" అని కరాఖండీగా చెప్పేశారు. సరే.. ఇంక చేసేదేముంది. మళ్ళీ తొలినుంచీ ప్రయత్నం మొదలు. సదరు బాలాని కొంచం కోప్పడ్డాను.. అతనేమో 'మీరు మేనేజ్ చేసేస్తారనుకున్నాను' అన్నాడు, తప్పంతా నాదే ఐనట్టు.

ఇంకో ఊళ్ళో మరో విచిత్రమైన కథ. ఓ ఇంటికి డైరెక్ట్ పవర్ సప్లై లేదు. నీళ్ళ సమస్య ఉంది. ఇంటికి వెంటిలేషన్ కూడా అంత బాగా లేదు. ఇంటాయన (ఓనరు) భగవద్గీత లో కృష్ణ పరమత్మలా అభయ హస్తం ఇచ్చేసి 'అన్నింటికీ నేనున్నా.. మీరు దిగిపొండి' అని బలవంతాలు. ఇల్లు చూపించడానికి ముందే ఆయన నా వివరాలు ఓ పుస్తకంలో రాసేసుకున్నారు. తర్వాత రెండు మూడు రోజులు ఫోన్లు చేసి మరీ చెప్పారు ఒప్పేసుకోమని. నేను ధైర్యం చేయలేదు కాని నా మిత్రుడు ఒకతను తెలియక ఒప్పుకుని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు.

"మీకు ఏ పేపర్ వస్తుంది? ... మాకూ అదే వస్తుంది.. రేపటి నుంచి నేను మానిపించేస్తా.." అన్నారో ఓనరు, ఇంట్లోకి దిగగానే. ఆయన వీధిలో కాపు కాసి పేపర్ అందుకునే వారు. ఆయన ఆమూలాగ్రం చదివాకే పేపర్ నా దగ్గరికి వచ్చేది. ఉదయాన్నే పేపర్ మడత నేనే విప్పాలన్నది నాకున్న చిరు కోరికల్లో ఒకటి. ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఆ కోరికను త్యాగం చేయాల్సొచ్చింది. ఒక్కరోజు కూడా మడత విప్పని పేపర్ తెరవ లేదు నేను. మిగిలిన ఏ విషయం లోనూ ఇబ్బంది లేక పోవడంతో నేనే సర్దుకుపోయాను.

"ఇల్లంతా బాగుంది. ఆ గదిలో మాత్రం వర్షం వచ్చినప్పుడు సీలింగ్ కొద్దిగా లీక్ అవుతుంది" అన్నారో ఓనరు, జానపద కథలో రహస్యం చెబుతున్నట్టు. ముచ్చటైన ఇండిపెండెంట్ ఇల్లు. ఇంటిముందు పూలతోట. మెయిన్ రోడ్డుకి మరీ దగ్గరా, మరీ దూరం కాని ప్రాంతం. అన్నిరకాలుగా నచ్చేసింది. ఈ ఆనందంలో "అతః కుంజరః" ని సరిగా వినకుండా దిగిపోయాం.

కొన్నాళ్ళు బాగానే గడిచాయి. ఓ శుభ ముహూర్తాన ఆకాశం ఉరిమింది. బెడ్రూం లో వర్షం కురిసింది. ఉన్నది బెడ్రూమ్లోనో, రోడ్డుమీదో అర్ధం కాలేదు. రాఘవేంద్రరావు లాంటి దర్శకుడికి పాట తీయడానికి ఓ మంచి కాన్సెప్ట్ అనిపించింది కానీ, అలాంటివి పైకి ప్రకటించే సందర్భం కాదు. సమస్య బెడ్రూం కి మాత్రమే పరిమితం కాలేదు. వంటింట్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి.

జీవితం లో మొట్టమొదటి సారిగా వర్షం ఆగిపోవాలని కోరుకున్నాను. కాలనీ వాళ్ళ చూపులకి అసలు అర్ధం అప్పుడు తెలిసింది. అప్పటివరకు చక్కటి ఇంట్లో ఉంటున్నందుకు జెలసీ అనుకున్నా.. చేసేదేం ఉంది.. మరో ఇల్లు వెతుక్కోడం తప్ప. అక్కడికీ ఇంటివాళ్ళకి బాగు చేయించే అవకాశం ఇచ్చినా, రిపేరు చేసేవాళ్ళు 'ఎంతోకొంత కురవక తప్పదు' అని చెప్పడం తో ఆశ వదిలేసుకోవాల్సి వచ్చింది.

అద్దె ఇళ్ళలో అన్నీ చేదు అనుభవాలే ఉండవు. బందువులకన్నా ఎక్కువగా దగ్గరయ్యి మిత్రులుగా మారే ఓనర్లూ ఉంటారు. ఫోన్ పలకరింపులూ, అప్పుడప్పుడూ కలుసుకోడాలూ ఉంటాయి. ఓ ఇంట్లో ఓనర్ వాళ్ళమ్మగారు ఎనభయ్యేళ్ళావిడ..ఆంగ్ల సాహిత్యం మీద చాలా పట్టున్నావిడ. ఇంటి ముందు కుర్చీలో కూర్చుని, ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు. అప్పుడప్పుడూ కబుర్లు, పుస్తకాల గురించి.

నా సంగతి తెలిసి ఆవిడ కొన్ని పుస్తకాలు అడిగారు. నేను వాటిని సంపాదించే లోపునే ఆవిడ చనిపోయారు. ఇప్పటికీ ఇంగ్లీష్ నవలలు చూసినప్పుడల్లా ఆవిడ గుర్తొస్తారు. ఒక్కోసారి అద్దిళ్ళ మీద వైరాగ్యం వచ్చినా, సొంతింట్లో ఉంటే ఈ అనుభవాలన్నీ మిస్ అవుతాము కదా అనిపిస్తూ ఉంటుంది.

మంగళవారం, మే 05, 2009

చెకుముకి నిప్పు

మృత్యువు కథా వస్తువు గా వచ్చిన సాహిత్యం అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అందుకే, పదమూడేళ్ళ క్రితం 'ఇండియా టుడే' ప్రచురించిన 'చెకుముకి నిప్పు' కథ ని జాగ్రత్త గా దాచుకున్నాను. బీనాదేవి రాసిన ఈకథ ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పుని ఎండగడుతుంది. హాస్య, వ్యంగ్య ధోరణిలో సాగే కథనం ఆసాంతం వదలకుండా చదివిస్తుంది. రచయిత గొంతునుంచి వినిపించే ఈ కథలో ప్రధాన పాత్రలు రెండు. రచయిత, అతని స్నేహితుడు ఆనంద రావు.

ఆరోయేట నుంచి దాదాపు ఆరు దశాబ్దాల పాటు తనకి ప్రాణ స్నేహితుడైన ఆనందరావు మరణించాడన్న వార్త రచయిత కి తెలియడంతో కథ ప్రారంభమవుతుంది. ఆనందరావుని (శవాన్ని అనడానికి రచయితకి మనసొప్పదు) చూడడానికి వాళ్ళింటికి వెళ్తే వింత అనుభవాలు ఎదురవుతాయి. ప్రీ-స్కూల్లో చదువుతున్న తనకొడుకుని ముందు గదిలో కూర్చోపెట్టుకుని హోం వర్క్ చేయిస్తూ ఉంటాడు పెద్దల్లుడు. పై చదువుకి విదేశాలకి ప్రయాణమవుతూ ఉంటుంది చిన్న కూతురు. రైల్లో రిజర్వేషన్ దొరకలేదని ప్రయాణం ఒక రోజు వాయిదా వేసుకుంటాడు పెద్ద కొడుకు.

చిన్న కొడుకు డీఎస్పీ కావడం తో పోలీసులంతా వచ్చి శవం మీద పూలదండలు పడేసి పోతూ ఉంటారు. బంధువులంతా టీవీల గురించి, సినిమాల గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటారు. "వీధి గదిలో ఆనందరావు శవం గనక లేకపోతే పెళ్ళివారిల్లు లా ఉంది." తన శవం పక్కనే కూర్చుని ఉన్న ఆనందరావు కనిపిస్తాడు రచయితకి. దండలు కుళ్ళిన వాసన భరించలేక పోతున్నాననీ, త్వరగా దహనం జరిగే ఏర్పాట్లు చూడమనీ మొర పెట్టుకుంటాడు ఆనందరావు. ఆ బాధ చూడలేక సంపంగి అత్తరు తెప్పించి ఆనందరావు మీద చల్లుతాడు రచయిత. యవ్వనం లో తను ప్రేమించిన 'సంపంగి' ని గుర్తు చేసుకుని అరమోడ్పు కన్నులతో ఏదో లోకానికి వెళ్ళిపోతాడు ఆనందరావు.

తను నమ్మిన ఆశయాలను ఆచరణలో చూపిన ఆనందరావు చివరి ఘడియలు ఇలా గడవడం భరించలేక పోతాడు రచయిత. సరిగ్గా అప్పుడే ఓ డెబ్భయ్యేళ్ళ వృద్ధుడు (దూరపు చుట్టం) ఇంట్లో కి వచ్చి, పిల్లలకి చీవాట్లు పెట్టి దహనం ఏర్పాట్లు చూడమంటాడు. "ఆనందరావు యజ్ఞం చేశాడు.. కాబట్టి వాడి శవానికి మామూలు నిప్పు పనికి రాదు..చెకుముకి నిప్పు పెట్టాలి" అని ప్రకటిస్తాడు ఆ వృద్ధుడు. ఈ చెకుముకి ఉపద్రవం ఏమిటో అర్ధం కాదు రచయితకి. అతనికి తెలిసి ఆనందరావుకి దేవుడిపైనే నమ్మకం లేదు. అదే విషయం ఆనందరావునే అడిగేస్తాడు. "నేను యజ్ఞం చేయడం ఏమిట్రా.. నా ఐదో ఏటో, ఆరో ఏటో మా తాత యజ్ఞం చేస్తుంటే ఆయన ఒళ్ళో కూర్చుని ఓ సమిధ విసిరాను.. అంతే.." అని సమాధానం వస్తుంది.

మర్నాడు అంత్యక్రియలు. పోలీసులు ఎక్కడినుంచో ఓ బస్తాడు రాళ్ళు తెచ్చి పడేస్తారు. ఐతే రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నానిపోయి ఉంటాయి అవి. శాస్త్ర ప్రకారం తలకొరివి పెట్టాల్సింది పెద్ద కొడుకే అయినా, నిప్పు ఎవరైనా చేయొచ్చు కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటాడు రచయిత. స్టవ్ మీద పెనం పెట్టి రాళ్ళని వేడి చేస్తాడు. జనం చుట్టూ మూగుతారు. చిన్నప్పుడు తనూ, ఆనందరావూ దొంగతనంగా సిగరట్లు కాల్చిన రోజులు గుర్తొస్తాయి. అప్పట్లో అగ్గిపుల్లని రాయిమీద గీసి వెలిగించడం ప్రాక్టీసు చేశారు ఇద్దరూ. ఆనందరావుకి ఎప్పుడైనా గురి తప్పేది కానీ, రచయితకి ఎప్పుడూ తప్పలేదు. రెండు రాళ్ళు తీసుకుని రహస్యంగా అగ్గిపుల్ల దాచి అగ్గి చేయడం మొదలుపెడతాడు.

కథలో చివరి వాక్యాలు: "నా గుండెలో చితి మండుతోంది. ఆనందరావు చితికి నేను నిప్పు చేయడవా? ఇది సంభవమేనా? చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారి తలెత్తి చూసేను. అందరితోపాటు ఆనందరావు కూడా నామీదకి వంగి చూస్తున్నాడు. ఇప్పుడతని మొహంలో ఏడుపు లేదు. నవ్వుతూ "ఇదే ఆఖరి చూపు కదా" అన్నాడు. నా గుండెలో మండుతున్న చితికి భూగోళం బద్దలైంది. ఆకాశం ఆవిరైపోయింది. ప్రకృతి స్తంభించి పోయింది అంతే. అగ్గిపుల్లలున్న రాతితో రెండో దాని మీద "ఠక్" మని కొట్టేను. భగ్గున మంట వచ్చింది. నా కంటి నుంచి రాలిన కన్నీటి బొట్టు ఆ మంటని ఆర్పకుండా జాగ్రత్తపడి గిర్రున వెనక్కి తిరిగేను. ఇంకా నేను చేయాల్సింది, చూడాల్సింది ఏం లేదు. చెయ్యకూడనిది చేసేను. కనీసం చూడ కూడనిది చూడదల్చుకోలేదు. "చెకుముకి రాళ్ళతో చితికి నిప్పెట్టడం థ్రిల్లింగ్ గా ఉంది కదూ" అంటున్నారెవరో."

శనివారం, మే 02, 2009

వేషం తప్పిపోయింది...

నాలో ఓ నటుడున్నాడన్న విషయాన్ని మొదట గుర్తించినవాడు ఆనంద భూపతి. మా ఊళ్ళో అడుసు తొక్కి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. నిజానికి అతని అసలు పేరు 'ఆనంద భూపతి' కాదు.. ఏమిటో కూడా నాకు తెలియదు. నాలోని నటుడిని గుర్తించాడన్న కృతజ్ఞత లేనట్టయితే అతన్ని ఎప్పుడో మర్చిపోయే వాడిని. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఓ యువజన సంఘం ఉండేది. దేవుడి కళ్యాణానికి ఈ సంఘం వాళ్ళు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఓ యేడాది మా సంఘం వాళ్ళంతా కలసి నాటకం వేయాలని నిర్ణయించుకున్నారు.

అవి పౌరాణికాల రోజులు. ఐతే మా వాళ్లకి పౌరాణిక నాటకం పద్యాలు నేర్చుకునేంత ఓపిక, తీరిక లేవు. అందువల్ల కొంచం భిన్నంగా సాంఘిక నాటకం వెయ్యాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు ఓ ఇద్దరు రాజమండ్రి వెళ్లి దొరికిన నాటకాల పుస్తకాలు ఓ నాలుగైదు పట్టుకొచ్చారు. నేను చాలా రోజులపాటు రాజమండ్రిలో కేవలం నాటకాల పుస్తకాలు మాత్రమే దొరుకుతాయనీ, ఎవరికి నాటకం కావల్సొచ్చినా రాజమండ్రి వెళ్ళాల్సిందేననీ అనుకునే వాడిని.

మొత్తానికి అందరూ కలిసి ప్రేమ, పగ ఇతివృత్తంతో ఉన్న ఓ నాటకాన్ని ఎంపిక చేశారు. నాటకానికి ఏం ఉన్నా, లేకపోయినా రిహార్సల్సూ, అవి వేయడానికి ఓ గదీ అవసరం. మా ఇంటి పక్కనే మా బంధువుల ఇల్లొకటి ఖాళీగా ఉండేది. తాళాలు కూడా మా దగ్గరే ఉండేవి. యువజన సంఘానికి నాన్న సలహాదారు కూడా కావడంతో సంఘం వాళ్ళు రిహార్సల్సు కోసం ఆ ఇల్లు అడగడమూ, ఈయన ఒప్పుకోవడమూ జరిగింది. పాత్రధారుల ఎంపిక కూడా మా పక్కింట్లోనే జరగడంతో దగ్గరుండి చూసే అవకాశం దొరికింది నాకు, వాళ్ళందరికీ మంచినీళ్ళూ అవీ తీసుకెళ్ళి ఇచ్చే నెపం మీద.

పొరుగూరినుంచి హీరోయిన్ని తీసుకురావాలని నిర్ణయించడంతో కుర్రాళ్ళంతా హీరో వేషం కోసం పోటీలు పడడం మొదలెట్టారు. సంఘ సభ్యులంతా కూర్చుని అందరికన్నా ఎక్కువ జతల కొత్త బట్టలూ, బూటీలూ (షూస్) ఉన్న కుర్రాడిని హీరోగా ఎంపిక చేశారు. పులిగోరు పతకం ఉందన్న ఏకైక కారణంతో మా ఆనంద భూపతిని జమీందారు ఆనంద భూపతి వేషానికి ఎంపిక చేసేశారు. మొత్తం బృందంలో అతనే పెద్దవాడు కావడం తో అందరినీ అదిలిస్తో పెత్తనం చేస్తూ ఉండేవాడు. నాటకంలో హీరోకి ఓ కొడుకు ఉంటాడు, ఆరేడేళ్ళ వాడు. ఆ పాత్ర కి నటుడి ఎంపిక ఇంకా పూర్తవలేదు.

రిహార్సల్ గదిలో ఓ రోజు అందరూ మాట్లాడుకుంటుండగా ఆనంద భూపతి నన్ను చూపించి నాన్నతో "కుర్రాడేసం అబ్బాయిగారిసేత కట్టిద్దారండి" అన్నాడు. నాన్నేమీ మాట్లాడలా.. మౌనం అంగీకారం అన్నమాట. అప్పటివరకు పొరుగూరి హీరోయిన్తో నటించడం గురించి ఊహల్లో మునిగి తేలుతున్న నా నాటక జనకుడు (దుష్ట సమాసం! నాటకం లో నా తండ్రి అన్నమాట) కళ్ళు తేలేశాడు. అతికొద్ది ముద్దుగా, అత్యంత బొద్దుగా ఉన్న నన్నెత్తుకుని డైలాగులు చెప్పడం అంటే మాటలా? అలా అని వేషం వదులుకోలేడు. నాకు మాత్రం భలే గర్వంగా అనిపించింది. ఆనంద భూపతి నా కళ్ళకి దేవుడిలా కనిపించాడు. నాటకం లో వేషం అంటే మాటలా మరి?

నిజం దేవుడు మాత్రం మా కథానాయకుడి పక్షాన ఉన్నాడు. లేకపొతే నా నోటితో నేనే వేషం వద్దని చెప్పేలా ఎందుకు చేస్తాడు? అదెలా జరిగిందంటే, వేషాలన్నీ ఫైనలైజ్ అయ్యాక, టెక్నికల్ డిపార్ట్మెంట్ల గురించి చర్చ వచ్చింది. మేకప్పులు మాత్రం సత్యమే చేయాలని మా వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయించేశారు. 'పొరుగూర్లో పౌరానికాలకి కూడా మనోన్నే పిలుత్తున్నారు.. మనం మేకప్పేయించుకోపోతే ఎలాగా?' అనేశారు. సత్యం మేకప్ వేస్తాడన్న మాట వినగానే నేను వేషం వదులుకోడానికి నిర్ణయించేసు కున్నాను.

"మాకు బళ్ళో పరీక్షలు పెడతామంటున్నారు. వేషం ఇంకెవరిచేతైనా వేయించండి.." అని నిండు సభలో బుద్ధిగా ప్రకటించాను. నా నిజ జనకుడి (నాన్న) కళ్ళలో సంతోషం. (నిజంగా చదువు మీద శ్రద్ధ అనుకుని). నాటక జనకుడు కూడా చాలా సంబర పడ్డాడు. బక్కగా ఉండే మా ఫ్రెండు దొరబాబు ఆ వేషం వేశాడు. ఇంతకీ అతనికి మేకప్ వెయ్యనే లేదు! ఆనంద భూపతికి హీరోతో ఏవో మాట పట్టింపులు ఉన్నాయనీ, అతన్ని ఇరికించడం కోసం నన్ను బాల నటుడిగా సూచించాడనీ తర్వాత తెలిసింది.

ఎప్పుడైనా కుర్చీలో వెనక్కి వాలి గతంలోకి వెళ్ళినప్పుడు ఆరోజు నేనెంత తప్పు చేశానో అర్ధమై బాధ పడుతూ ఉంటాను. ఏమో ఎవరికి తెలుసు? నేను ఆ వేషం వేస్తే...నెమ్మదిగా నాటకాలలోనూ ఆపై సినిమాలలోనూ వేషాలు వచ్చేవేమో.. నేనూ, నా తర్వాత కొన్ని తరాల పాటు నా వారసులూ తెలుగు ప్రజలకు కళాసేవ చేసుకునే వాళ్ళమేమో.. ప్చ్..

శుక్రవారం, మే 01, 2009

వైకుంఠపాళీ

జీవితాన్ని వైకుంఠపాళీ తో పోల్చిన పెద్దాయన ఎవరో తెలియదు కాని, ముందుగా ఆయనకి నా వందనాలు. వైకుంఠపాళీ లో పాము నోట్లో పడతామో, నిచ్చెన మెట్లెక్కుతామో పందాన్ని నేలపై పరిచేంత వరకూ తెలుసుకోలేనట్టే, జీవితంలో ఎదురయ్యే జయాపజాలనూ ముందుగా పసిగట్టలేము. ఆటలో పందెం సరిగా పడక పాము నోట్లో పడ్డప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, నిచ్చెన కోసం ఎదురు చూస్తూ ఆట కొనసాగించడం తప్ప.. జీవితం లోనూ అంతే.

చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా ఆడిన ఆటల్లో వైకుంఠపాళీ ఒకటి. ముఖ్యంగా వేసవి మధ్యాహ్నాలు బడికి వెళ్ళక్కర్లేకుండా, ఇంటి నుంచి బయటకి కదలడానికి పెద్దవాళ్ళ అనుమతి లభించని సందర్భాలలో నాకు కాలక్షేపం అందించింది ఈ ఆటే. మద్యాహ్నం నిద్ర అలవాటు లేకపోవడంతో, పావులు కదుపుతూ గడిపేసేవాడిని. మరొకరితో ఆడుతున్నప్పుడు, వాళ్ళ పావులు నిచ్చెనల మీద, నావి పాముల నోట్లోనూ ఉన్నప్పుడు భలే ఉక్రోషంగా ఉండేది మొదట్లో. ఎంత ఆవేశంగా గవ్వలు విసిరినా కావాల్సిన పందెం పడేది కాదు.

కొన్ని క్షణాలలోనే ఆట తారుమారయ్యేది.. పెద్ద పందేలతో పైకెళ్లిన వాళ్ళు ఒక్కసారిగా పెద్దపాము నోట్లో పడి మొదటికి వచ్చేసే వాళ్ళు. కొన్నాళ్ళు ఆడేసరికి ఆట అర్ధం కావడం మొదలుపెట్టింది. ఆడడానికి ఎవరూ లేనప్పుడు నేనే రెండు పావులతో ఆడేవాడిని. తెలియకుండానే గెలుస్తున్న పావు నాది అనిపించేది. బహుశా విజయానికి ఆ ఆకర్షణ ఉందేమో. కొన్నాళ్ళు వైకుంఠపాళీ ఆడడం ఓ వ్యసనమైపోయింది. ఈ ఆటలో గెలుపోటములు మన చేతిలో అస్సలు ఉండవనే విషయం పూర్తిగా అర్ధమైంది.

జీవితంలో మొదటి వైఫల్యం ఎదురైనప్పుడు నాకు వైకుంఠపాళీ లో పెద్దపాము 'అరుకాషురుడు' గుర్తొచ్చాడు. వచ్చి వచ్చి వీడి నోట్లో పడ్డాను కదా అని బాధ పడ్డాను. విజయం కోసం కసిగా ప్రయత్నాలు చేశాను..కానీ వైఫల్యాలే ఎదురయ్యాయి. విజయానికీ, వైఫల్యానికీ ఎంత భేదం ఉందో స్పష్టంగా అర్ధమైంది. విజయం వస్తూ వస్తూ మిత్రులని తీసుకొస్తే, వైఫల్యం మిత్రులు అనుకుంటున్నా వాళ్ళని దూరం చేస్తుందని తెలిసింది. కొన్ని వైఫల్యాల తర్వాత ఒక విజయం దొరికింది. కానీ, నాకది అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. వైఫల్యం కారణంగా నాకు దూరమైన వాళ్ళు నాకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు మాత్రం బాగా నవ్వొచ్చింది.

విజయాలనూ, వైఫల్యాలనూ ఒకేలా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాలేదు కానీ, వైఫల్యాలని తట్టుకోగలిగే స్థైర్యం బాగానే అలవడింది. వైకుంఠపాళీ లో పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో కూడా అపజయాలు, విజయాలు అంతే సహజమని అనుభవపూర్వకంగా తెలిసింది. పాము నోట్లో పడ్డప్పుడు పందెపు గవ్వలను నేలకి విసిరి కొట్టడం వల్ల ఉపయోగం లేదని, కొంచం ఓపికగా ఆట కొనసాగిస్తే నిచ్చెన తప్పక వస్తుందన్న సత్యం బోధ పడ్డాక జీవితపు వైకుంఠపాళీ కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పాము నోట్లో పడ్డ ప్రతిసారీ, ఓ నిచ్చెన నా కోసం ఎదురు చూస్తోందన్న భావన నాకు బలాన్ని ఇస్తోంది..