సోమవారం, ఏప్రిల్ 27, 2015

'ఉపాధ్యాయుల' నరసింహమూర్తి

'ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు...' ...డెబ్భై ఏళ్ళ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి ఇకలేరు అన్న వార్త వినగానే నాక్కలిగిన భావన ఇది. భాషా, సాహితీ పరిశోధనలకి జీవితాన్ని అంకితం చేసిన నరసింహ మూర్తి ఆరునెలల క్రితం వరకూ కేవలం తన రచనల ద్వారా మాత్రమే నాకు పరిచయం. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తన ఖాళీ సమయాలని తెలుగు భాష, సాహిత్య పరిశోధనకి వెచ్చించిన నరసింహ మూర్తి, పుష్కర కాలం క్రితం పదవీ విరమణ చేసిన తరువాత తన పూర్తి సమయాన్ని ఈ నిమిత్తమే కేటాయించారు. కేవలం రచయితే కాదు, ఆయన మంచి వక్త కూడా.

'కన్యాశుల్కం' సృష్టికర్త గురజాడ వేంకట అప్పారావు అన్నా, ఆయన ఇతర రచనలన్నా ఉపాధ్యాయుల వారికి ప్రాణ సమానం. 'కన్యాశుల్కం' నాటకంపై ఆయనకి ఉన్న అథారిటీ అసామాన్యం. ఆ నాటకంలో ఏ అంకాన్ని గురించైనా, ఏ పాత్రని గురించైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన పరిశోధనల్లో సింహభాగం గురజాడ రచనలు, జీవితాన్ని గురించే. 'కన్యాశుల్కం' పై వచ్చిన విమర్శలు అన్నింటిని గురించీ ఆయన విస్పష్టమైన సమాధానాలు ఇవ్వడమే కాదు, కువిమర్శకుల 'అసలు ఉద్దేశాలని' నిర్మొహమాటంగా ఎత్తిచూపించి, ఖండించారు కూడా.

ఆరేడు నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో 'కన్యాశుల్కం' గురించి నరసింహమూర్తి చేసిన ప్రసంగాన్ని వినగలిగే అవకాశం, ఆయనతో కొంతసేపు ముచ్చటించే అదృష్టం అనుకోకుండా కలిగాయి. అనారోగ్యాన్ని  ఏమాత్రం లెక్కచేయకుండా గంటసేపు అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగం 'కన్యాశుల్కం' నాటకం ఎందుచేత గొప్పదో, ప్రపంచ స్థాయి సాహిత్యంగా గణించదానికి గల అర్హతలేవిటో సాదోహరణంగా వివరించారు. ఆ నాటకంలో ఒక్కో స్త్రీ పాత్రనీ ఒక్కో 'స్టేట్మెంట్' అంటారాయన. "బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం కన్యాశుల్కం" అన్న శ్రీశ్రీ అభిప్రాయం, ఆ నాటకాన్ని తక్కువ చేయడమే అని నిర్మొహమాటంగా చెప్పారు.


ఉపన్యాసం పూర్తయ్యాక ఆయనతో మాట కలుపుతూ, "మరికాసేపు మాట్లాడితే బావుండేదండీ.. అప్పుడే అయిపోయిందా అనిపించింది" అన్నాను. "ఎంత గొప్ప సబ్జక్ట్ అయినా గంట కన్నా వినలేరండీ.." అన్నారు క్లుప్తంగా. ప్రసంగంలో చెప్పీచెప్పకుండా వదిలేసిన విషయాలని గురించి సంభాషణ సాగింది. "గురజాడకి మహాకవి అనే గౌరవం దక్కడం కొందరికి మింగుడు పడదు. ఇది ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు. తొలినుంచీ ఉన్నదే. ఇలాంటి వాళ్ళకి గురజాడ సాహిత్యమే సమాధానం చెబుతుంది," అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ద్వారా జరిగిన గురజాడ డైరీల పరిష్కారం, ఆ క్రమంలో జరిగిన లోపాలని గురించి కొంత మాట్లాడారు.

కొందరు మిత్రులు ఆయనతో ఫోటోలు దిగడానికి రావడంతో సంభాషణ మధ్యలో ఆగింది. ఆయన జరిపిన, జరుపుతున్న పరిశోధనలు, తెలుగుకి ప్రాచీన హోదా లాంటి విషయాల మీద కబుర్లు దొర్లాయి. ఆయనతో కూడా ఉన్న శ్రీమతి నరసింహమూర్తి ఆయనకి వేసుకోవాల్సిన మందుల గురించి గుర్తుచేశారు. "ఈవిడ నాకు రాతపనిలో సాయం చేస్తూ ఉంటుంది. నేను చెబుతూ ఉంటే తను చకచకా రాసేస్తుంది. ఆవిడ చేతిరాత బావుటుంది కూడా," అన్నారు నవ్వుతూ. వాళ్ళు వెళ్ళగానే, "మనం ఏదో మాట్లాడుకుంటున్నాం.." అన్నారు నాతో. "కన్యాశుల్కంలో స్త్రీపాత్రలు అన్నీ స్టేట్మెంట్స్ అన్నారు?" అడిగాను.

"అవును.. ఒక్క మధురవాణే కాదు, బుచ్చమ్మ, పూటకూళ్ళమ్మ, మీనాక్షి.. వీళ్ళందరూ స్టేట్మెంట్లే.. ఎవరి ఆలోచనా శక్తి మేరకి వాళ్ళు ఆలోచించవచ్చు ఈ పాత్రలని గురించి. మధురవాణి మాటల్లో హాస్యం అందరికీ నచ్చుతుంది. కానీ, ఆమె వ్యంగ్యం వెనుక ఏమున్నదో కొందరికే అర్ధమవుతుంది. పూటకూళ్ళమ్మలూ, మీనాక్షులూ తయారు కావడానికి కారణం ఎవరు? ఆనాటి సమాజమే కదా..." తలూపాను నేను. "అసిరి పాత్రని గురించి కూడా చాలానే చర్చ జరిగింది.." నేను అంటూ ఉండగానే, "ఒక్క అసిరి మాత్రమే కాదండీ, ప్రతి పాత్రా చర్చనీయమే. తెలుగు వాళ్ళ అదృష్టం కన్యాశుల్కం నాటకం.." అంటూ వాచీ చూసుకున్నారు.

"మీతో చాలా మాట్లాడాలి.. ఇప్పుడు కాదు.." అన్నాను. "విజయనగరం రండి.. సావధానంగా మాట్లాడుకుందాం" అన్నారు కారెక్కుతూ. వెళ్ళలేదు విజయనగరం. ఆయనకోసం ఇకపై వెళ్ళక్కర్లేదు కూడా. ప్రతిభ, నిరంతర కృషి, నిరాడంబరత సమపాళ్ళలో ఉన్న మరో పరిశోధకుడు ఎక్కడ? పరిశోధనా ఫలాలని సామాన్యులకి నేరుగా చేరవేసే భాషా పరిశోధకులు ఎక్కడున్నారిప్పుడు?? యు. ఎ. నరసింహమూర్తి ఆరంభించిన పరిశోధనా యజ్ఞాన్ని కొనసాగించే ఔత్సాహికులు కావాలిప్పుడు. ఆ యజ్ఞం కొనసాగడమే నరసింహమూర్తికి ఇచ్చే నిజమైన నివాళి..

శనివారం, ఏప్రిల్ 25, 2015

ఓకే బంగారం

పెళ్లి.. ఇద్దరు సరైన వ్యక్తుల మధ్య జరిగితే దాన్ని మించిన బంధం లేదు. అదే, ఆ ఇద్దరికీ సరిపడనట్టయితే అంతకు మించిన బంధనమూ లేదు. అదిగో, ఆ బంధనంలోనుంచి బయటపడ్డ ఓ దంపతుల కూతురు తార. తన ఏడేళ్ళ వయసులో, అప్పటికే ఎన్నో గొడవలు పడి, కేసులు పెట్టుకుని విడాకులు తీసుకోడానికి సిద్ధ పడ్డ తల్లిదండ్రులు 'మా ఇద్దరిలో నీకు ఎవరు కావాలి?' అని అడిగితే, "ఇద్దరూ వద్దు" అనుకుంది తార. అంతేకాదు, జీవితంలో పెళ్లి జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ప్యారిస్ లో పైచదువులు చదివి, తనకంటూ ఓ కెరీర్ ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్న తారకి తారసపడ్డాడు ఆదిత్య.. ఆదిత్య కంఠమనేని.

ఈతరం కుర్రాళ్ళు చాలామందిలాగే స్వేచ్చా ప్రియుడు ఆదిత్య. బంధాలు బంధనాలే అనీ, పెళ్లి వల్ల ఇబ్బందులే తప్ప సంతోషం ఉండదనీ నమ్మినవాడు. జీవితాన్ని ఓ వీడియో గేమ్ లా చూసే ఆదిత్యకి, ముంబాయిలో ఓ గేమింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మొదటిరోజే కొంచం సినిమాటిక్ గా బాస్ ని ఒప్పించి ఓ 'దేశీ వీడియో గేమ్' తయారు చేసే ప్రాజెక్టు పని మొదలు పెట్టేస్తాడు. ఆర్నెల్లలో అతని ప్రాజెక్ట్ అప్రూవ్ అయితే, కంపెనీ అతన్ని యూఎస్ పంపిస్తుంది.. జీవితంలో ఎదగడానికి బిల్ గేట్స్ ని ఆదర్శంగా తీసుకున్న ఆదిత్య మధ్యతరగతి నుంచి వచ్చినవాడు. బ్యాంకు ఉద్యోగం చేసుకునే అన్నే అతనికి పెద్ద దిక్కు.

ముంబాయి మహానగరంలో కెరీర్ నిర్మించుకునే పనిలో తలమునకలైన తార, ఆదిత్య అనుకోకుండా కలుసుకుంటారు. తొందరలోనే వారి పరిచయం స్నేహంగా మారి, లివిన్ రిలేషన్షిప్ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇద్దరికీ ఉన్న సమయం కేవలం ఆరునెలలు. తర్వాత ఎవరిదారి వాళ్ళది. ఇద్దరికీ పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. పెళ్లిని గురించి వాళ్ళిద్దరిలోనూ పాతుకుపోయిన అభిప్రాయాలని వాళ్ళ లివిన్ రిలేషన్ షిప్, చుట్టూ ఉన్న మనుష్యులూ ఏమన్నా మార్చగలిగారా? ఈ ప్రశ్నకి సమాధానం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా 'ఓకే బంగారం.' గతవారం విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.


మణిరత్నం దర్శకత్వంలో యూత్ సినిమా అనగానే, 'సఖి' 'యువ' గుర్తురావడం అత్యంత సహజం. ఐదేళ్ళక్రితం, ఐశ్వర్య రాయ్-విక్రమ్ జంటగా వచ్చిన 'విలన్' దెబ్బనుంచి కోలుకున్నానన్న ధైర్యం కలగడంతో చూశానీ సినిమాని. ప్రేమకథలనీ, మరీ ముఖ్యంగా వాటిలో ఉండే సున్నితమైన భావోద్వేగాలనీ తెరకెక్కించడం లో మణిరత్నంది ఓ ప్రత్యేకమైన బాణీ. నిత్య మీనన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ జంటగా తీసిన 'ఓకే బంగారం' ప్రేమకథా చిత్రంలో మణిరత్నం తనదైన మేజిక్ ని శ్రీకారం నుంచీ శుభం కార్డువరకూ తెరమీద చూపించి, ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు.

కథలోకి వస్తే, ఆదిత్య (దుల్కర్ సల్మాన్) బ్యాంకులో తన అన్నకి సీనియర్ అయిన గణపతి (ప్రకాష్ రాజ్) ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా దిగుతాడు. గణపతి, భవాని (లీలా శ్యాంసన్) లది ఆదర్శ దాంపత్యం. తార (నిత్య మీనన్) తో పరిచయం స్నేహంగా మారాక, ఆమెతో అహమ్మదాబాద్ వెళ్తాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఓ రాత్రి గడిపిన తర్వాత, ఆర్నెల్ల పాటు లివిన్ రిలేషన్ లో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి గణపతి ఇంట్లోనే ఉండేందుకు గణపతి-భవాని లని ఒప్పిస్తారు. చాలా ప్రాక్టికల్ గా మొదలైన వాళ్ళ లివిన్ రిలేషన్ ఎమోషనల్ టర్న్ తీసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ముగింపు ఊహించగలిగేదే అయినా ఎండ్ టైటిల్స్ పూర్తయ్యే వరకూ ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేసిన మణిరత్నాన్ని అభినందించకుండా ఉండలేం.

నటీనటుల్లో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ పోటీపడి నటించారు. నిత్యచేత మరీ ఎక్కువగా తింగరితనం చేయించలేదు. చాలా సినిమాల్లో తన పాత్రని కొంత లౌడ్ గా చేసే ప్రకాష్ రాజ్ గణపతి పాత్రని అండర్ ప్లే చేశాడు. ప్రకాష్ రాజ్ కి సమ ఉజ్జీగా నటించింది లీలా శ్యాంసన్. నిజంచెప్పాలంటే ఆమెకే ఓ మార్కు ఎక్కువ పడుతుంది కూడా. సాంకేతిక అంశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది పీసీ శ్రీరాం ఫోటోగ్రఫీని. తక్కువ బడ్జెట్లో ఎక్కువ అందాన్ని చూపించడం, సెట్ ప్రాపర్టీస్ ని పూర్తిగా వినియోగించుకోవడం శ్రీరాంకి చాలా బాగా తెలుసు. రెహమాన్ నుంచి మరికొంచం ఎక్కువ ఆశించాను నేను, పాటలు.. నేపధ్య సంగీతం కూడా.

మారుతున్న కాలానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే దర్శకుడు మణిరత్నం. నేటితరం అర్బన్ యువత పోకడల్ని చాలా బాగా పట్టుకున్నాడీ సినిమాలో. పెళ్లి అనేది ఓ 'బూచి' కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా చూసిన మిత్రులు కొందరు రెండో సగంలో ఎడిటింగ్ అవసరం అన్నారు కానీ, నాకలా అనిపించలేదు. మరీముఖ్యంగా టైం కౌంట్ డౌన్ మొదలయ్యాక వచ్చే సన్నివేశాలు వెన్ను నిటారుగా చేసి చూసేలా ఉన్నాయి. నాయిక పాత్ర చిత్రణ కన్విన్సింగ్ గా అనిపించింది. పెళ్లి నుంచి బయటపడిన ఆమె తల్లి వ్యాపార నిర్వహణలో తనని తాను బిజీగా ఉంచుకుంటే, తండ్రి ఓ ఆశ్రమంలో మనశ్శాంతి వెతుక్కుంటాడు. అలాగే, గణపతి దంపతులు కూడా కథలో అతికినట్టు కాక, సహజంగా ఇమిడిపోయారు. వైవిద్యభరితమైన సినిమాల్ని ఇష్టపడేవాళ్ళకి నచ్చే సినిమా ఇది.

గురువారం, ఏప్రిల్ 23, 2015

స్వర చక్రవర్తి

తెలుగు సినిమా పరిశ్రమలో అటు క్లాస్ పాటలనీ, ఇటు మాస్ గీతాలనీ ఏక కాలంలో రాసి ఒప్పించిన ప్రజ్ఞాశాలిగా వేటూరి పేరు ఎలా అయితే సుప్రసిద్ధమో, ఈ రెండు తరహా గీతాలకీ జనం మెచ్చే రీతిలో స్వరాలద్దిన సంగీత దర్శకుడు చక్రవర్తి పేరూ అంతే ప్రసిద్ధం. ముప్ఫయ్యేళ్ళ కెరీర్ లో 960 సినిమాలకి సంగీతం అందించడంతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని కళల్లోనూ తనదైన ముద్రవేసిన చక్రవర్తిని గురించి, కొత్తగా ఆరంభమైన సినీ వెబ్ పత్రిక Thinking Donkey లో నేనురాసిన నాలుగు మాటలూ ఇక్కడ...

***

చిరంజీవి కథానాయకుడిగా ముప్ఫై రెండేళ్ళ క్రితం విడుదలై సంచనలం సృష్టించిన సినిమా 'ఖైదీ.' ఈ సినిమా విజయంలో పాటలకీ భాగం ఉంది. 'ఖైదీ' సినిమా అనగానే మొదట గుర్తొచ్చే పాట 'రగులుతోంది మొగలిపొద,' రెండోది 'గోరింట పూసింది.. గోరింక కూసింది..' సినిమా పరిభాషలో చెప్పాలంటే మొదటిది మాస్ గీతం, రెండోది క్లాస్ పాట. సినిమాలాగే ఈ రెండు పాటలూ సూపర్ హిట్. వయోభేదం లేకుండా సంగీత ప్రియుల చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఈ రెండు పాటలనీ స్వరపరిచిన సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరరచనలో వైవిధ్యాన్ని గురించి చెప్పాలంటే ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదేమో.

పోటీకి మారుపేరైన సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముప్ఫయ్యేళ్ళ కాలంలో 960 సినిమాలకి సంగీతం అందించడం అన్నది ఆషామాషీ విషయం కాదు. సినీ సంగీతం మీద సంపూర్ణ అవగాహనతో పాటు, కాలానుగుణంగా ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులని గమనించుకుని, అందుకు తగ్గట్టుగా తమని తాము మలచుకోగలిగే నిత్య కృషీవలురకు మాత్రమే సాధ్యపడుతుందిది. నిర్మాతలు, దర్శకులు, హీరోలకి తగ్గట్టుగా, ప్రేక్షకులు మెచ్చేలా సంగీతం అందించి, సుదీర్ఘ కాలంపాటు తమదైన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న సంగీత దర్శకుల జాబితాలో చక్రవర్తికీ స్థానం ఉంది.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1938వ సంవత్సరంలో జన్మించిన కొమ్మినేని అప్పారావు తన ముప్ఫై మూడో ఏట 'చక్రవర్తి' గా మారారు. 1971 లో విడుదలైన 'మూగప్రేమ' సంగీత దర్శకుడిగా చక్రవర్తి మొదటి సినిమా. పి. సుశీల, ఎల్లార్ ఈశ్వరి కలిసి పాడిన 'నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే..' చక్రవర్తి రికార్డు చేసిన మొదటి పాట. పక్కా మాస్ పాట ఇది! తనకెంతో ఇష్టమైన 'మాయా మాళవ గౌళ' రాగంలో స్వరపరిచారీ పాటని. సినిమా పరిశ్రమ అంటేనే సెంటిమెంట్లకి పుట్టిల్లు. సంపూర్ణ రాగంలో ఉన్న పాట స్వరపరచడంతో కెరీర్ మొదలు పెడితే, కెరీర్ కూడా సంపూర్ణమవుతుందన్నది పరిశ్రమలో ఓ నమ్మకం. చక్రవర్తి విషయంలో ఈ నమ్మకం నిజమయ్యింది. అంతేకాదు, ఇదే సినిమాలో క్లాస్ టచ్ తో సాగే 'ఈ సంజెలో.. కెంజాయలో' పాట కూడా అంతగానూ శ్రోతలకి చేరువయ్యింది. 

అతి తక్కువ కాలంలోనే చక్రవర్తి బిజీ సంగీత దర్శకుడిగా మారడమే కాదు, మాస్ పాటలకి కేరాఫ్ అడ్రస్ గానూ మారిపోయారు. మరీముఖ్యంగా ఎన్టీఆర్-కె.రాఘవేంద్ర రావు-చక్రవర్తి లది హిట్ కాంబినేషన్. 'వేటగాడు,' 'యమగోల,' 'కొండవీటి సింహం,' 'జస్టిస్ చౌదరి,' 'డ్రైవర్ రాముడు' లాంటి సినిమాలకోసం చక్రవర్తి స్వరపరిచిన పాటలు నాటి కుర్రకారుచేత థియేటర్లలో చిందులేయించాయి. 'ఆకుచాటు పిందె తడిసే..' 'చిలకకొట్టుడు కొడితే..' 'బంగినపల్లి మావిడిపండు..' 'ఇది ఒకటో నెంబరు బస్సు..' 'మావిళ్ళ తోట కాడ పండిస్తే..' లాంటి పాటలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. అలాగని కేవలం మాస్ పాటలకి మాత్రమే పరిమితమయిపోలేదు చక్రవర్తి. ఇవే సినిమాల్లోని 'ఇది పువ్వులు పూయని తోట..' 'ఆడవె అందాల సురభామిని..' 'వానొచ్చె వరదొచ్చె...' 'నీ తొలిచూపులోనే...' 'ఏమని వర్ణించనూ..' చక్రవర్తి బహుముఖీన స్వర ప్రతిభకి తార్కాణాలు.

అక్కినేని-దాసరి-చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమాభిషేకం' పాటలు మ్యూజిక్ రికార్డులని తిరగరశాయి. ఈ సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఓ పక్క కమర్షియల్ దర్శకులతో పని చేస్తూనే, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శారద' సినిమాకి కలకాలం నిలిచిపోయే పాటలు చేశారు చక్రవర్తి. 'రేపల్లె వేచెనూ.. వేణువు వేచెనూ..' పాటని ఒకసారి విని, మర్చిపోవడం ఎవరితరం? ఇదే సినిమా కోసం 'అటో ఇటో తేలిపోవాలి..' అనే తమాషా పాటని స్వయంగా పాడారు కూడా. శోభన్ బాబుకి 'కుశలమా.. నీకు కుశలమేనా..' (బలిపీఠం) లాంటి క్లాస్ పాటల్నీ, 'ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా...' (దేవత) లాంటి ఎవర్ గ్రీన్ మాస్ పాటల్నీ అందించారు.

సాధారణంగా వేరే భాషలో విజయవంతమైన సినిమాని తెలుగులో పునర్మిస్తున్నప్పుడు అవే ట్యూన్స్ ని కొద్దిపాటి మార్పు చేర్పులతో ఉంచేయమని దర్శకనిర్మాతలు కోరడం పరిపాటి. చాలామంది సంగీత దర్శకులు ఈ కోర్కెని మన్నిస్తూ ఉంటారు కూడా. కానీ, ఇలా చేయడానికి ససేమిరా ఒప్పుకోని (బహుశా ఏకైక) సంగీత దర్శకుడు చక్రవర్తి. హిందీ మ్యూసికల్ హిట్ 'ప్యాసా' తెలుగుసేత 'మల్లెపువ్వు' కి చక్రవర్తి సంగీతం అందించారు. తెలుగు సినిమాకోసం 'ప్యాసా' లో ఏ ఒక్క బాణీ నీ ఉపయోగించకుండా 'చిన్నమాట.. ఒక చిన్న మాట...' 'నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా..' లాంటి నిలిచిపోయే పాటలు చేశారు. ఇతర సంగీత దర్శకుల బాణీలని ఉపయోగించుకోడానికి బద్ధ వ్యతిరేకి చక్రవర్తి.

సంగీత దర్శకుడిగా చక్రవర్తి చేసిన ప్రయోగాలకి లెక్కలేదు. 'జ్యోతి' సినిమాలో 'సిరిమల్లె పువ్వల్లె నవ్వు..' పాట ఆసాంతమూ గాయని జానకి నవ్వులు మాత్రమే వినిపిస్తాయి, అనేక శ్రుతుల్లో. విడిగా చదివితే 'వ్యాసమా?' అనిపించే 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో..' పాటని ఆవేశ భరిత గీతంగా మార్చారు 'ప్రతిఘటన' సినిమాకోసం. చక్రవర్తి ట్యూన్ చేసిన గీతాలని ఇప్పటి తరం సినిమాల్లో రి-మిక్స్ చేస్తున్నారు. అవి ఆదరణ పొందుతున్నాయికూడా. జూనియర్ ఎన్టీఆర్ 'అల్లరి రాముడు' కోసం 'రెండువేల రెండువరకు..' ('ఆకుచాటు పిందె తడిసే') మొదలు రవితేజ 'వీరా' లో 'మావిళ్ళతోట కాడ' రీమిక్స్ వరకూ జాబితా వేస్తే చాలా పాటలే లెక్క తేలతాయి.

చక్రవర్తి కేవలం సంగీతదర్శకుడు, గాయకుడు మాత్రమే కాదు. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, రచయిత కూడా. రజనీకాంత్, కమల్ హాసన్ లకి డబ్బింగ్ చెప్పారు. 'సింహాద్రి' పేరుతో తెలుగులోకి అనువదింపబడ్డ మమ్ముట్టి-రంభల మళయాళ డబ్బింగ్ సినిమాకి తెలుగులో మాటలు రాశారు. నటుడిగా 'గోపాలరావు గారి అమ్మాయి,' 'పక్కింటి అమ్మాయి,' 'తేనెటీగ,' 'నిన్నే ప్రేమిస్తా,' 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాల్లోనూ, 'కలిసుందాం రా' టీవీ సీరియల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు ధరించారు. వెంకటేష్, సౌందర్య నటించిన 'రాజా' సినిమాలో కథని మలుపు తిప్పే కీలకమైన పాత్రలో నటించారు చక్రవర్తి. సినీ సంగీత దర్శకుడు చక్రవర్తిగా నిజజీవిత పాత్రలోనే కనిపించారీ సినిమాలో.

రాజన్-నాగేంద్ర ల దగ్గర సినీ సంగీతంలో మెళకువలు నేర్చుకున్న చక్రవర్తి దగ్గర కీరవాణి, రాజ్-కోటి, వందేమాతరం శ్రీనివాస్, మాధవపెద్ది సురేష్, వాసూరావులు శిష్యరికం చేశారు. చక్రవర్తి కుమారుడు 'శ్రీ' కొన్ని సినిమాలకి గుర్తుండిపోయే సంగీతాన్ని అందించారు. తెలుగు సినిమా సంగీతం మీద తనదైన సంతకం చేసిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న తన 64వ ఏట కన్నుమూశారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో చక్రవర్తి ఓ అధ్యాయం అనడం అతిశయోక్తి కాదు. 

సోమవారం, ఏప్రిల్ 20, 2015

ఇల్లలకగానే ...

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కథకుల పేర్లు తలుచుకోగానే మొదటి వరుసలో గుర్తొచ్చే పేరు పి. సత్యవతి. నలభయ్యేళ్ళుగా కథలు రాస్తున్న ఈ రచయిత్రి తాజా కథల్లో ఆకర్షించే అంశం 'సంయమనం.' దృక్కోణం స్త్రీవాదమే అయినప్పటికీ, కథాంశం ఎంపిక మొదలు, పాత్రల చిత్రణ, సంభాషణల వరకూ ఒక సంయమనం కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఇరవయ్యేళ్ళ క్రితం సత్యవతి విడుదల చేసిన తన మొదటి కథా సంకలనం 'ఇల్లలకగానే ...' లో ఈ సంయమనం కొంచం అటూ ఇటూ అయ్యిందేమో అనిపించింది, సంకలనాన్ని పూర్తి చేసి పక్కన పెట్టగానే.

సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి. ఇవన్నీ 1989-95 మధ్య కాలంలో రాసినవి, ప్రచురితమయినవీను. ఏ కొందరు స్త్రీలో కెరీర్లో సాధించిన విజయాల్ని మొత్తం స్త్రీజాతి విజయాలుగా చిత్రీకరించరాదనీ, మెజారిటీ మహిళలు నిత్యం అనేకానేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారనీ తను రాసిన ముందుమాట తో పాటు, ఒకట్రెండు కథల్లోనూ చెప్పారు సత్యవతి. ఇందుకు తగ్గట్టుగానే ఈ కథల్లో ప్రధాన స్త్రీ పాత్రలన్నీ ఇంటా, బయటా ఎదురయ్యే సమస్యల్లో తలమునకలయ్యేవే. భర్త, పిల్లలు, అత్తమామలకి అన్నీ అమర్చి పెడుతూనే వారినుంచి సమస్యలు ఎదుర్కొనే వారు, స్త్రీ అయిన కారణంలో పని ప్రదేశంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళూ కనిపిస్తారీ కథల్లో.

సంపుటిలో తొలికథ 'ఆకాశంబున నుండి,' బీనాదేవి రాసిన 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవలని జ్ఞాపకం చేసింది. తన అందం కారణంగా ఇంటా, బయటా ఎన్నో సమస్యలు ఎదుర్కోడమే కాక, కుటుంబ జీవితం నుంచి బయటికి నెట్టబడిన పేదింటమ్మాయి 'సూరీడు' కథ ఇది. అందం లేకపోయినా, పేదింటి నుంచి పెద్దింటికి కోడలిగా వెళ్ళిన గోమతి కథ 'గోవు.' తనకి ఎంతో ఇష్టమైన విరిబోణి వర్ణాన్ని వీణ మీద శృతి చేసుకోడానికి సమయం దొరకని ఇల్లాలు శారద కథ 'తాయిలం' కాగా, ఇంటి చాకిరీకి జీవితాన్ని అంకితం చేసి ఆ క్రమంలో తన పేరునే మర్చిపోయిన గృహిణి కథ - సంపుటికి శీర్షిక - 'ఇల్లలకగానే ...' ఉద్యోగినుల సమస్యలని చిత్రించిన మరో రెండో కథలు 'చీమ,' 'దేవుడు.'


పేదింటి కథలు 'ఇందిర' 'వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు.' తల్లిపాత్రలలో సామ్యం కనిపిస్తుంది ఈ రెండు కథల్లోనూ. పేదరికం కారణంగా ఇందిర తండ్రి ఆ అమ్మాయిని దూరం ఊరికి పనికి పంపిస్తే, వెంకటేశ్వర్లుని అతని తల్లి కేవలం తన రెక్కల కష్టంతో గొప్పవాడిని చేస్తుంది. 'ముసుగు,' 'భద్రత,''దేవుడు,' 'గాంధారి రాగం' కథలు భద్ర జీవితాలు గడిపే మహిళల కథలు. వాళ్ళ భర్తల మంచితనం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలు ఆ మహిళలకి అవగతమయ్యే సందర్భాలే ఈ కథలు. పిల్లలిద్దరూ జీవితాల్లో స్థిరపడిన తరువాత, తన భర్తతో కలిసి ఉండలేక, ఉండే అవసరమూలేక తన జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయం తీసుకున్న అరుంధతి కథ 'అరుణసంధ్య.'

మిగిలిన పదమూడు కథలకన్నా కొంత భిన్నంగా ఉన్న రెండు కథలు 'పెళ్లి ప్రయాణం,' 'బదిలీ.' వీటిలో, 'పెళ్లి ప్రయాణం' పెద్ద కథ. మూడు తరాల ఆడవాళ్ళ జేవితాలని చిత్రించిన కథ. ఓ పెళ్ళిలో కలుసుకున్న అక్కచెల్లెళ్ళు తమ జీవితాలని, తమ ముందుతరం, తర్వాతి తరం జీవితాలనీ తరచి చూసుకున్న కథ. గృహ రాజకీయాలు, గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పులు లాంటి ఎన్నో అంశాలని స్పృశిస్తూ సాగిన కథ ఇది. చివరి కథ 'బదిలీ' ఆత్మాభిమానం మెండుగా ఉన్న రజని కథ. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినప్పుడు, బదిలీలు తప్పనప్పుడు, భర్త కెరీర్ కే ప్రాధాన్యత ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తుంది రజని.

మొత్తం పదిహేను కథల్లోనూ ఉన్న ఒక సామ్యం 'చెడ్డ భర్త' పాత్రలు. ఓ మంచి భర్త పాత్ర కలికానిక్కూడా కనిపించలేదు. ఈ భర్తలు పేదవాళ్ళు అయితే సంపాదన అంతా తాగేసి, భార్యని కొట్టేవాళ్ళు. మధ్యతరగతి అయితే భార్య మీద ప్రేమ నటిస్తూ ఆమె సంపాదననీ, శ్రమనీ దోచుకుంటూ, సమయం వచ్చినప్పుడు నిజరూపం బయట పెట్టేవాళ్ళు, ఉన్నత తరగతి వాళ్ళయితే భార్యని 'అదుపు'లో పెట్టుకుని ఆమె తన అభిరుచుల్ని కూడా మర్చిపోయేలా చేసేవాళ్ళూను. 'బదిలీ' కథలో రాఘవరావు పాత్ర కొంచం భిన్నంగా ఉంది అనుకునేలోగానే అతగాడు భార్య రజని మీద నింద మోపేశాడు. 'మొగుళ్ళందరూ ఒక్కటే' అనే బ్రాండింగ్ చేసేశారు రచయిత్రి. (పేజీలు  144, వెల రూ. 40).

బుధవారం, ఏప్రిల్ 08, 2015

వర్ణచిత్రం -2

(మొదటిభాగం తర్వాత)

ఒడిదుడుకులు నా జీవితంలో ఓ భాగం అయిపోయినా, ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. అంతేకాదు, వాటినుంచి బయటపడే శక్తి చిన్నా నుంచే దొరుకుతూ ఉంటుంది నాకు. విమానం సాఫీగా సాగుతోంది. కుదుపు తగ్గడంతో మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు చిన్నా. నేను వెళ్ళడానికి నా గతం ఉండనే ఉంది కదా..

అమ్మ నన్ను పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చిన రోజునే శ్రీకాంత్ గారు ఇంటికి వచ్చారు. నేను ఏమీ అడిగింది లేదు. జరిగింది ఇదీ అని అమ్మకి చెప్పనూలేదు. గంగ గురించి నాకు తెలియకపోతే శ్రీకాంత్ గారు 'నా భర్త' లేదా 'మా ఆయన' అయ్యేవారేమో. తెలిసిన తర్వాత కూడా నాకు ఎవరిమీదా కోపం రాలేదు అని చెబితే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ అది నిజం.

పుట్టింట్లో అమ్మ పుస్తకాలు ప్రేమగా పలకరించాయి నన్ను. పెళ్ళికి ముందు చెప్పినట్టుగానే అమ్మ నాకు రోజూ జాగ్రత్తలు చెబుతోంది. తేడా అల్లా, ఇప్పుడావిడ నాకు బాగా అర్ధమవుతోంది.

చిన్నా భూమ్మీద పడ్డ రోజున, నాకంటూ ఓ ప్రపంచం ఏర్పాటయినట్టు అనిపించింది. వాడి సన్నని వేళ్ళూ, ఎర్రని గోళ్ళూ, బోసి నోరూ, కళ్ళు మూసుకుని ఆడుకునే ఆటలూ మరీ మరీ చూసుకునేదాన్ని.

కబురందుకుని కొడుకుని చూసుకోడానికి వచ్చారు శ్రీకాంత్ గారు. ఆ కళ్ళలో వెలుగు. ఒక బొమ్మని పూర్తి చేసినప్పుడు కనిపించే వెలుగు. ఓ బహుమతిని గెలుచుకున్నప్పుడు కనిపించే వెలుగు. రెండు రోజులుండి వెళ్ళారు. ఆలోగానే పిల్లవాడి బారసాల ఎలా జరిపించాలో నిర్ణయించేశారు అందరూ. ఇద్దరు జమీందార్ల మనవడు మరి.

నెలన్నా గడవక మునుపే అత్తింటినుంచి కబురు, మావగారు కాలం చేశారని. అమ్మా, నాన్నా నన్ను తీసుకుని ప్రయాణం అయ్యారు. బారసాల జరపకుండా, చీర, సారె పెట్టకుండా తీసుకెళ్ళాల్సి వస్తున్నందుకు అమ్మ ఎంతగానో నొచ్చుకుంది.

మావగారి కర్మకాండలు పూర్తవుతూనే, మరో చావు కబురు. అమ్మ మేనమామ అనారోగ్యంతో తీసుకుని ప్రాణం వదిలారు. అమ్మకి ఆయనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. చివరిచూపుకి వెళ్ళడం మానొద్దని గట్టిగానే చెప్పాను. అప్పలనరసమ్మకి వెయ్యి జాగ్రత్తలు చెప్పి అమ్మా, నాన్నా ఆ ఊరికి బయల్దేరారు.

శ్రీకాంత్ గారు చిన్నాతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆ తండ్రీ కొడుకుల మధ్యకి వెళ్ళడం కన్నా, దూరంగా నిలబడి వాళ్ళని చూడడమే బాగుంటుంది నాకు. పిల్లవాడితో ఆడుతూనే మధ్య మధ్యలో తన గదికి వెళ్లి ఓ పెయింటింగ్ చేస్తున్నారు. ఏదో పోటీకి పంపాలి కాబోలు. వేళ మించకుండా పూర్తి చేయాలని తాపత్రయ పడుతున్నారు.

ఆ వేళ ఉదయం, చిన్నా పనులు చూస్తున్నాను నేను. స్నానం అవగానే నిద్రపోవడం వాడి అలవాటు. ఆవేళ మాత్రం చాలా తిక్కలో ఉన్నాడు. జోకొట్టే ప్రయత్నాలు చేస్తున్నాను నేను. పక్క గదిలో నుంచి అప్పలనరసమ్మ గావు కేక వినిపించి, చిన్నాని ఎత్తుకుని పరిగెత్తాను. నేలమీద అపస్మారకంగా పడి ఉన్నారు శ్రీకాంత్ గారు. కొయ్యబారిపోయాన్నేను.

పనివాళ్ళందరూ పోగు పడ్డారు. కబురు విని, శరత్ వచ్చి, డాక్టర్ని పిలిపించారు. "అయాం సారీ" అన్న డాక్టర్ మాట వింటూనే స్పృహ తప్పి పడిపోయాను.

నేను స్పృహలోకి వచ్చేసరికి శ్రీకాంత్ గారి అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మా నాన్నే కాదు, బంధువులు కూడా ఎవరూ రాలేదు. ఆగమనే వాళ్ళు లేరు. "చివరి సారి నమస్కరించుకోండమ్మా,"  అన్న మాట విని, నన్ను పాడె దగ్గరకు తీసుకు వెళ్ళింది అప్పలనరసమ్మ.

నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. ఎప్పుడూ బంగారం రంగులో మెరిసిపోయే శ్రీకాంత్ గారి చెంపలు కమిలినట్టుగా కనిపించాయి. కళ్ళు తుడుచుకుని పరీక్షగా చూశాను. శవం నల్లబడుతోంది. ఒక్కుదుటన గదిలోకి పరిగెత్తాను. చిన్నా ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. వాడి పొట్ట కదలడం చూసేలోగా నేనెలా బతికున్నానో నాకే తెలీదు.

నేను పడగనీడలో ఉన్నానన్న నిజం తెలిసిన క్షణం నుంచీ, చిన్నాకి అక్షరాలా పహారా కాశాను. అమ్మా, నాన్నా రావడం ఆలస్యం. జరిగింది చెప్పేశాను.

"అయ్యో తల్లీ.. ఆస్తి కోసం సొంత వాళ్ళని చంపుకునే మనుషులనుకోలేదమ్మా వీళ్ళు," బావురుమంది అమ్మ. నాన్నెప్పుడూ నాతో పెద్దగా మాట్లాడింది లేదు. ఆవేళ మొదటిసారి నోరువిప్పారు.

"ఎంతోమంది ఆడపిల్లల ఉసురు పోసుకున్నానమ్మా నేను.. అదంతా నా కూతురికి తగులుతుందనుకోలేదు.. వద్దు.. నువ్వీ ఇంట్లో క్షణం కూడా ఉండొద్దు," అనడమే కాదు, శరత్ మాటలు కాదని నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు.

అప్పటికప్పుడు తన ఆస్తిని మూడు భాగాలు చేశారు. ఒక భాగం  అమ్మేసి డబ్బు చేశారు. తిండీ, నిద్రా మాని నా కోసం శ్రమించారు నాన్న. పెద్దన్నయ్య అప్పటికే బోస్టన్ లో డాక్టర్ గా సెటిల్ అయ్యాడు. శ్రీకాంత్ గారు పోయిన పదో రోజుకి మేము మద్రాస్ లో ఉన్నాం. నెల తిరక్కుండానే నేనూ, చిన్నా బోస్టన్ లో అడుగుపెట్టాం.

అన్నయ్య, వదిన మంచి వాళ్ళే. కానీ ఎన్నాళ్ళని వాళ్ళ మీద ఆధార పడడం? నాన్నిచ్చిన డబ్బుంది. కానీ, కూర్చుని తింటే కొండలైనా కరగవూ? పైగా రూపాయలని డాలర్లలోకి మార్చుకుని ఖర్చు చేయాలి. అమెరికాని అర్ధం చేసుకుని, నెమ్మదిగా నాకంటూ ఓ వ్యాపకాన్ని ఎంచుకున్నాను. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాను.

నేను పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. పుస్తకజ్ఞానం తప్ప, లోకజ్ఞానం బొత్తిగా లేనిదాన్ని. ఎన్నో ఒడిదుడుకులు. కష్టం వచ్చిన ప్రతిసారీ, చిన్నాని చూసుకుని ధైర్యం తెచ్చుకునే దాన్ని. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే వాటన్నింటినీ ఎలా దాటానో అనిపిస్తూ ఉంటుంది.

చిన్నాకి, తండ్రి గురించి పూర్తిగా నేనెప్పుడూ చెప్పలేదు. ఆ ఇంటికి, ఆ మనుషులకి వాడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఉద్దేశం. మాకంటూ ఉన్న బంధువులల్లా  పెద్దన్నయ్య కుటుంబమే. అమ్మ పోయినప్పుడూ, నాన్న పోయినప్పుడూ ఇండియా వెళ్ళినా ఆ ఊరికి వెళ్ళలేదు.

ఆ ఇంట్లో నుంచి నేను తెచ్చుకున్న ఒకే ఒక్క వస్తువు శ్రీకాంత్ గారు పూర్తి చేయలేకపోయిన పెయింటింగ్. ఆ ఇంట్లో ఏ వస్తువూ వద్దనుకున్నాను కానీ, ఆ పెయింటింగ్ మాత్రం తెచ్చుకోకుండా ఉండలేకపోయాను. సాయం సంధ్య వేళలో వారణాసిలో ప్రవహిస్తున్న గంగానది వర్ణచిత్రమది. ఆ పెయింటింగ్ ని చూసినప్పుడల్లా నాకు రకరకాల ఆలోచనలు వస్తాయి.

ఇప్పుడు చిన్నా మనసులో ఉన్న ఆలోచన ఏమిటో?  ఏమీ లేకుండా ఇండియా ప్రయాణం పెట్టడు.  వాడు ప్రయాణం విషయం చెప్పగానే, పెద్దన్నయ్యతో మాట్లాడదామా అనిపించింది ఒక్క క్షణం. కానీ, నా కొడుకుని నేనే నమ్మకపోతే ఎలా? అందుకే ఆ ఆలోచన విరమించుకున్నాను.

విమానం నుంచి కారులోకి మారినా, ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. దివాణం ముందు ఆగింది కారు. చాలా కోలాహలంగా ఉందక్కడ. రోడ్డు మీద కారుల బారు. పాతికేళ్ళ తర్వాత ఆ లోగిట్లోకి అడుగు పెట్టాలంటే ఎలాగో ఉంది నాకు. పైగా, ఏ పరిస్థితుల్లో నేనా  గడప దాటానో ఈ జన్మకి మర్చిపోలేను.

చిన్నాకి మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ఎక్కడా బెరుకు లేదు వాడిలో. దర్జాగా నడుస్తున్నాడు. తన ఇంట్లోకి తను వెళ్తున్నట్టుగా. అవును వాడి ఇల్లే కదూ ఇది? ఆస్తులు కోరుకుంటాడా వీడు? నా పెంపకం మీద నాకెంత నమ్మకం ఉందో అర్ధం కావడం లేదు.

అతిథులకి స్వాగతం చెబుతూ బేనర్లు రెపరెపలాడుతున్నాయి. 'శరత్ బాబు చిత్రకళా ప్రదర్శనకి స్వాగతం' ..ఆ పేరు చూడగానే చిన్నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. ఆగాడు వాడు. ద్వారబంధం దగ్గర ఉన్నాం ఇద్దరం. దర్బారు హాలు నుంచి ప్రసంగం వినిపిస్తోంది. ఎవరో ప్రముఖ చిత్రకారుడు కావొచ్చు. భారతీయ చిత్రకళని గురించి చెబుతున్నాడు.

"ఇక, తెలుగు దేశానికి వస్తే, ప్రాక్పశ్చిమ వర్ణచిత్రాల్లో సొబగులని ఒడిసిపట్టుకుని చిన్న వయసులోనే తనకంటూ ఓ శైలిని సృష్టించుకున్న చిత్రకారుడు కీర్తిశేషులు శ్రీకాంత్ బాబు.. మన శరత్ బాబు గారికి స్వయానా సోదరుడు. శ్రీకాంత్ బాబుని కోల్పోవడం భారతీయ చిత్రకళ దురదృష్టం.." నిటారుగా నిలబడి చెవి ఒగ్గి వింటున్నాడు చిన్నా.

అంత గొప్ప ఆర్టిస్టా శ్రీకాంత్ గారు!! ఆ మనిషిని మాయం చేసిన వాళ్ళకి, పేరుని మాయం చేయడం మాత్రం సాధ్యపడలేదన్న మాట.  తమ్ముడి ప్రస్తావన విని శరత్ మొహంలో ఎన్ని రంగులు మారి ఉంటాయో. ఇంతకీ, ఈ కార్యక్రమం ఉందని చిన్నాకి తెలుసునా? వీడూ, శరత్ ఎదురు పడగానే ఏం జరుగుతుంది?? నా ఆలోచనలు అనంతంగా సాగిపోతున్నాయి.

చిన్నా కూడా అక్కడినుంచి కదిలే ప్రయత్నం చేయడం లేదు. గుమ్మంలోనే నిలబడిపోయిన మమ్మల్ని పనివాళ్ళు వింతగా చూస్తున్నారు.

"శ్రీ శరత్ బాబు గారు తన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండడంతో పాటు, చిత్రకళ ని తగురీతిలో  ప్రోత్సహించడం ఎంతైనా ముదావహం.." ఉపన్యాసం ముగియడంతోనే హాలంతా చప్పట్లు మారుమోగాయి.

సరిగ్గా అప్పుడే దివాణం లోపలినుంచి అప్పలనరసమ్మ పరుగున వచ్చింది. నన్ను చూస్తూనే గుర్తుపట్టి ముఖమింత చేసుకుంది.

"మైదిలమ్మా.. ఏవైపోయారు ఇన్నాళ్ళూ.. బావున్నారు కదా.. శానా సంతోసం తల్లే.. సిన్నబాబా? అచ్చం బాబుగారి పోలికేనమ్మా.. మా బాస తెలుత్తాదా అమ్మా సిన్నబాబుకి?" నా రెండు చేతులూ పట్టుకుని వరసగా ప్రశ్నలు వేసేస్తోంది.

"మీకోసమే వచ్చాం నరసమ్మా" అన్నాడు చిన్నా. అప్పలనరసమ్మతో పాటు, నేనూ ఆశ్చర్యపోయాను.

"గంగమ్మ గారింటికి తీసుకెళ్ళవూ మమ్మల్ని?" వాడి మాటకి అదిరి పడ్డాం మేమిద్దరం. నా చేతులు వదిలేసింది నరసమ్మ. ముందుగా తెరుకున్నది నేనే. ఇండియా ట్రిప్ ఎందుకో నెమ్మది నెమ్మదిగా అర్ధమవుతోంది. నా కాళ్ళ కింద నేల ఉందిప్పుడు.

"ఆయమ్మి నేదు బాబూ.. బాబుగోరి దినవోరాలు అవ్వకుండానే బెంగడి సచ్చిపోనాది.." నేల కదిలినట్టుగా అనిపించి, చిన్నా భుజాన్ని ఆసరా చేసుకున్నాన్నేను. ఈ సారి ముందుగా తేరుకున్నది చిన్నానే.  హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న పనివాళ్ళు ఆగి మమ్మల్ని కుతూహలంగా గమనిస్తున్నారు, దూరంనుంచే.

"బయల్దేరతాం నరసమ్మా.." అన్నాడు చిన్నా. ఏం చేయాలో తెలియని అయోమయంలో మా వెనుకే కారు వరకూ వచ్చింది నరసమ్మ. కారెక్క గానే చిన్నాకేదో గుర్తొచ్చింది. జేబులో నుంచి చిన్న పేకెట్ తీసి "ఇది నీకోసం నరసమ్మా.. చూసి చెప్పు ఎలా ఉందో?" అని అడిగాడు.

పేకెట్లో ఉన్న బంగారు గొలుసు చూసుకుని అప్పలనరసమ్మ మొహం చింకి చేటంత అయ్యింది.

"సల్లగుండు మారాజా... మైదిలమ్మా, సినబాబుకి పేరేం యెట్టేరమ్మా?"

నేను నోరు తెరిచేలోగానే చిన్నా చిరునవ్వుతో చెప్పాడు "నా పేరు.. గంగాధర్..."

కారు కదిలిపోయింది.

(అయిపోయింది)

సోమవారం, ఏప్రిల్ 06, 2015

వర్ణచిత్రం -1

నేనిప్పుడు భూమికీ, ఆకాశానికీ మధ్యన ఉన్నాను. త్రిశంకు స్వర్గం అంటే ఇదేనా? విమానం వేగంగా ముందుకు ప్రయాణిస్తుంటే, నా ఆలోచనలు అంతకన్నా వేగంగా వెనక్కి ప్రయాణం చేస్తున్నాయి. పక్క సీట్లో ఒళ్ళు మరిచి నిద్రపోతున్న చిన్నా చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు నా కంటికి. వాడిప్పుడు పాతికేళ్ళ వాడైనా, నా కంటికి పసిబిడ్డే.

రెండువారాల క్రితం ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే "మనం ఇండియా వెళ్తున్నాం అమ్మా" అన్నాడు వాడు. ఏం చెప్పాలో నాకు అర్ధం కాలేదు. ఆ ముందు రోజే వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్లి వచ్చాడు. "ఇండియా వెళ్దామా అమ్మా?" అని అడిగి ఉంటే నేను ఏదన్నా జవాబు చెప్పి ఉండేదాన్నేమో. వాడు నిర్ణయం తీసేసుకున్నాకా, ఇక నేనేం చెప్పగలను?

ఇన్నేళ్ళ జీవితంలో ఏనాడూ, ఎవరికీ ఎదురు చెప్పడం తెలియని దాన్ని. ఎటొచ్చీ ఇన్నాళ్ళూ నాకన్నా పెద్దవాళ్ళ మాట మన్నించాను. ఇప్పడు, నా కొడుకు మాటకి తలవంచాను. నా కొడుకు నన్ను శాసించే అంతటి పెద్దవాడు అయినందుకు సంతోషం కన్నా, వాడి నిర్ణయం తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయమే ఎక్కువగా కలుగుతోంది నాలో.

నిద్రపోతున్న చిన్నాని చూడడం నాకిష్టమైన వ్యాపకాల్లో ఒకటి. ఏ అర్ధరాత్రి వేళో లేచి, బ్లాంకెట్ లో నుంచి కనిపించే వాడి ముఖాన్ని చూస్తూ గంటలు గడిపేస్తూ ఉంటాను నేను. నల్ల మబ్బుల్లో చందమామలా కనిపిస్తాడు నాకొడుకు నాకంటికి. ఇప్పుడైతే ఆకాశంలో చందమామ.

చిన్న కళ్ళు, సూదంటు ముక్కూ, ఆడపిల్లలకి ఉండే లాంటి సన్నని పెదవులూ, నుదుటిమీద పడే ఉంగరాల జుట్టూ.. దాచినా దాగని సౌకుమార్యం.. ముమ్మూర్తులా శ్రీకాంత్ గారి పోలికే వాడు. ఆ పోలిక కూడా నాకు ఏకకాలంలో సంతోషాన్నీ, భయాన్నీ కలిగిస్తూ ఉంటుంది.

వాడి పెంపకంలో తండ్రికి కూడా భాగం ఉండి ఉంటే బాగుండేదని నేను అనుకోని క్షణం లేదు. ఎంత తల్లినైనా నేను తండ్రిని కాలేను కదా. చిన్నాకి తండ్రి దూరమైనందుకు బాధ పడాలా? వాణ్ణి దక్కించుకోగలిగినందుకు సంతోషపడాలా?? ఏవిటో అన్నీ ప్రశ్నలే నాకు.

జమీందారీ కుటుంబంలో ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్లని నేను. సహజంగానే కాలు కింద పెట్టనక్కర్లేకుండా గడిచిపోయింది నా బాల్యం. అన్నయ్యలిద్దరికీ బాగా చదువులు చెప్పించారు కానీ, నన్ను మాత్రం కాలేజీ గడప తొక్కనివ్వలేదు. పై చదువులకి వెళ్ళడానికి నా వయసే అడ్డంకిగా మారింది.

ఎలా వచ్చిందో తెలియదు కానీ, మా అమ్మకి పుస్తకాలు చదివే అలవాటు వచ్చింది. మా దివాణంలో ఓ గది నిండా పెద్ద పెద్ద అద్దాల బీరువాలు, వాటి నిండా తెలుగువీ, ఇంగ్లీషువీ పుస్తకాలు. కొత్తగా అచ్చయిన పుస్తకాలన్నీ మా దివాణానికి పార్సిల్ వస్తూ ఉండేవి. చదువు మధ్యలోనే ఆగిపోయిన నాకు, అమ్మ పరిచయం చేసిన పుస్తకాల్లో ప్రపంచాన్ని వెతుక్కోవడం అలవాటయింది నెమ్మదిగా.

నాలుగ్గోడలు దాటి బయటికి వెడితే ఒకటే ప్రపంచం. కానీ, మా లైబ్రరీ గదిలో ఒక్కో పుస్తకమూ ఒక్కో ప్రపంచం. నేనా ప్రపంచ యాత్రల్లో క్షణం తీరిక లేకుండా ఉండగానే, ఒకరోజు నా పెళ్లి నిశ్చయం చేశారని చెప్పింది అమ్మ. నేనున్న దివాణానికీ వెళ్లబోయే దివాణానికీ మధ్య గోదారే అడ్డు.

"అంత పెద్ద జమీందారీకీ ఇద్దరే వారసులు. ఇతను చిన్నవాడు. చదువుకున్న వాడు. ఈడూ జోడూ బావుంటుంది అన్నారు నాన్నగారు. అబ్బాయి ఫోటో తెప్పిస్తానన్నారు," ఇదీ అమ్మ చెప్పిన కబురు.

నిజానికి అప్పటి చాలా ఏళ్ళ క్రితమే జమీందారీలు రద్దయ్యాయి. భూసంస్కరణల గొడవకూడా చెలరేగి చల్లారింది. వాటిమీద బోల్డన్ని కథలూ, కవిత్వాలూ కూడా వచ్చాయి. చట్టాలూ, శాసనాలూ బయటి ప్రపంచాన్ని ఏమన్నా మార్చాయేమో తెలీదు కానీ, మా దివాణాల పద్ధతుల్లో లేశమాత్రం మార్పూ లేదు.

'పెళ్లి విషయం మాట్లాడకుండా, ఇవన్నీ ఏవిటీ?' అంటే నేను చెప్పగలిగేది ఒక్కటే. ఆడపిల్లకి పెళ్లి జరగాలి కాబట్టి జరుగుతోంది అంతే. ఆ పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందన్నది పూర్తిగా నాచేతుల్లో ఉన్న విషయం కాదు కదా. నేనలా అనుకున్నాను కానీ, అమ్మ అలా ఊరుకోలేకపోయింది. పెళ్లి నిశ్చయం అయింది మొదలు, ఏదో ఒక సమయంలో రోజూ ఓ గంట సేపన్నా నేను అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో చెప్పేది, కొన్నిసార్లు నేరుగానూ.. చాలాసార్లు అన్యాపదేశంగానూను.

ఆవిడ మాటల సారాంశం సర్దుకుపోవాలి అని. సంసారం గుట్టుగా జరుపుకోవాలి. మామూలు వాళ్ళ ఇళ్ళలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరు కానీ, గొప్ప వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతిదీ ఊరందరి నోళ్ళలోనూ నానుతుంది. రెండు కుటుంబాల గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఆడపిల్లమీదే ఉంది అని పదేపదే చెప్పిందావిడ. "అయినా, కుర్రాడు చాలా మంచివాడేనుట," అని ముక్తాయించేది ప్రతిసారీ.

పెళ్లి ఇంకా వారంరోజులు ఉందనగా బంధువులు ఒక్కొక్కరూ రావడం మొదలయ్యింది. వాతావరణం హడావిడిగా మారిపోయింది. "మైథిలి మొగుడు బొమ్మలేస్తాట్టే.. పెళ్ళయ్యాక కుంచెల బదులు దీని జడతోనే రంగులు అద్దుతాడేమో," నా పొడవాటి జడను చూసి మేనత్త కూతుళ్ళు హాస్యాలాడేరు.

"శ్రీకాంత్ బాబుట.. పేరే దర్జాగా ఉంది.. ఇంక మనిషెలా ఉంటాడో?" పిన్ని కూతురి కుతూహలం. నాకు పెళ్లి జరుగుతోందన్న ఉత్సాహమూ లేదు. జీవితం ఎలా ఉండబోతోందో అన్న భయమూ లేదు. మా రెండో మేనత్త మాటల్లో చెప్పాలంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాను.

మగ పెళ్ళివారు విడిదింట్లో దిగిన వెంటనే మా బంధువుల్లో పెద్దవాళ్లందరూ పరుగున వెళ్ళారు, మర్యాదలు చూడడం కోసం. నిజానికి వాళ్ళలో సగం మంది వెళ్ళింది పెళ్ళికొడుకుని చూడ్డానికే.

"అదృష్టవంతురాలివే అమ్మాయీ.. కుర్రాడు బంగారమే అనుకో. కాసేపు చూస్తే నా దిష్టి తగులుతుందేమో అని చూపు తిప్పుకుని వచ్చేశాను" పెద్దత్త చెప్పింది, నన్ను దగ్గరగా తీసుకుని.

శ్రీకాంత్ గారిని నేను మొదటిసారి చూసింది పెళ్లి పీటలమీదే. పెద్దత్త మాటల్లో అతిశయోక్తి ఏమాత్రం లేదు. నాలుగైదు సార్లు చూశాక నాకు అర్ధమైంది ఏమిటంటే, మనిషి ఇక్కడ ఉన్నారు కానీ, ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఆ కళ్ళు నన్ను చూడడం లేదు. చేతలన్నీ యాంత్రికంగానే ఉన్నాయి, నవ్వుతో సహా. నేను తలవంచుకున్నాను.

శ్రీకాంత్ గారి దివాణంలో కాపురం మొదలయింది. అవే నాలుగు గోడలు. గుమాస్తాలు, వంట మనుషులు, పని మనుషులు. ఒక్కటే తేడా ఏమిటంటే, ఈ ఇంట్లో లైబ్రరీ గది ఉన్నట్టులేదు. మా పడక గదికి ఆనుకునే శ్రీకాంత్ గారు బొమ్మలు వేసుకునే గది. ఆ గదిలో స్టాండ్లకి అమర్చిన కేన్వాసులు, రంగులు, కుంచెలతో పాటు, రెండు అద్దాల బీరువాలు. ఆ బీరువాలని చూడగానే నాకు పాత స్నేహితురాళ్ళని చూసినట్టు అనిపించింది. నా అంతట నేనుగా ఆ గదిలోకి వెళ్ళే ప్రయత్నం ఏనాడూ చేయలేదు.

ఓ రోజు ఉదయం, పనివాళ్ళు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో శ్రీకాంత్ గారి గదిలోకి కాఫీ తీసుకెళ్ళాల్సి వచ్చింది. కాఫీ చేతికిచ్చి, అద్దాల బీరువాల్లో ఉన్న పుస్తకాలని ఆసక్తిగా చూస్తూ ఉంటే, "పుస్తకాలు చూస్తావా?" అని అడిగారు. ఆ కళ్ళనిండా వెలుగు.

నిజానికి ఆ గదిలో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు పూర్తిగా వేరే మనిషి. ఆనంద పారవశ్యం అంటారే, అలాంటి స్థితిలో ఉండేవారు. నేనేమీ జవాబు చెప్పలేదు. కాఫీ తాగడం మధ్యలో ఆపేసి, ఆ బీరువాలు తెరిచి పుస్తకాలు చూపించారు, ఓపిగ్గా. అవేవీ నేను అంతకుముందు చదివినవీ, చూసినవీ కాదు. పెయింటింగ్స్ కి సంబంధించిన పుస్తకాలు. మెరిసే దళసరి పేజీలు, చేతికి అంటుకుంటాయేమో అనిపించే రంగులు.

"ఇవి పికాసో వర్క్స్... ఇవి మైకెలేంజిలోవి... ఇవేమో మన రాజా రవివర్మవి.." శ్రీకాంత్ గారు పుస్తకాల పేజీలు  తిప్పుతూ చాలా ఆసక్తిగా చెప్పుకుపోతున్నారు. "ఈ బీరువాలో  అంతా ఇంగ్లీష్ లిటరేచర్. నువ్వు చదువుకోవచ్చు. ఎక్కడతీసిన పుస్తకం అక్కడ పెట్టెయ్యాలి సుమా" చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పారు. తను గెలుచుకున్న బహుమతులన్నింటి గురించీ చాలా వివరంగా చెప్పారు నాకు. మా పెళ్ళయ్యాక శ్రీకాంత్ గారు నాతో 'మాట్లాడిన' మొదటి రోజది.

మా పుట్టింటి నుంచి అమ్మ పంపిన దాదికి ఉన్నట్టుండి జబ్బు చేయడంతో వెనక్కి వెళ్ళిపోయింది. వెంటనే మరో దాదిని పంపడం అమ్మకి వీలుకాలేదు. రాణివాసంలో దాది లేకపోవడం కన్నా కష్టం మరొకటి ఉండదు. ఏపనీ స్వయంగా చేసుకోకూడదు మరి. ఒకరోజు శ్రీకాంత్ గారు ఓ ఆడమనిషిని తీసుకొచ్చారు. నాకన్నా ఓ పదేళ్ళు పెద్దదేమో. నల్లని చెయ్యెత్తు మనిషి. పేరు అప్పలనరసమ్మట.

"ఈమెకి పని దొరకడం అవసరం. నీకెటూ దాది కావాలి కదా" అన్నారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో మగవాళ్ళు కలిగించుకోరు. శ్రీకాంత్ గారు నా ఇబ్బందిని గమనించారో, అప్పలనరసమ్మ అవసరాన్ని గుర్తించారో ఇప్పటికీ తెలియదు నాకు. ఆ క్షణం నుంచీ అప్పలనరసమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకోడం మొదలుపెట్టింది.

ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన ఆమెకి మొదలే మా దివాణం సంగతులు కొన్ని తెలుసు. జమీందారీ గుట్లన్నీ బహిరంగ రహస్యాలే కదా. ఎప్పుడో తప్ప నాతో మాట కలిపేందుకు ప్రయత్నించేది కాదు. నేను నోరు విప్పనవసరం లేకుండానే నా అవసరాలన్నీ చూసేది.

ఓ రోజు సాయంత్రం వేళ దర్బారు హాల్లో పెద్ద గలాభా. శ్రీకాంత్ గారికీ, వాళ్ళ అన్నయ్యకీ - పేరు శరత్ బాబు - గొడవ జరుగుతోంది. పని వాళ్ళెవరూ కిక్కురు మనడంలేదు. అత్తగారు అంతకు చాలా ఏళ్ళ క్రితమే కాలం చేశారు. మావగారు మంచాన ఉన్నారు. తోడికోడలు లోకం వేరు. జరుగుతున్నది ఏవిటో నాకు అర్ధం కాలేదు. కాసేపటికి గొడవ సద్దు మణిగింది. శ్రీకాంత్ గారు ఇంటికి రాలేదు.

జరిగిందేవిటో అప్పలనరసమ్మ ద్వారా తర్వాత తెలిసింది. రోడ్డు మీద బొమ్మలేసుకుని, డబ్బులడుక్కునే మనిషిని ఇంటికి తీసుకు వచ్చారట శ్రీకాంత్ గారు. అతన్ని తన గదికి తీసుకు వెళ్లి రంగుల మిశ్రమం గురించీ అదీ చాలాసేపు మాట్లాడి, తన దగ్గర ఉన్న కొన్ని రంగులు, కుంచెలు, కేన్వాసులూ ఇచ్చి పంపారుట. అలగా వాళ్ళని దివాణం లోపలికి రానివ్వడం అన్నగారికి నచ్చక, తమ్ముడిని కోప్పడ్డారు.

శరత్ కూడా అప్పుడప్పుడూ బొమ్మలేస్తారట. అప్పలనరసమ్మ చెబితే నాకు తెలిసిందా విషయం. అత్తగారు ప్రత్యేకం మేష్టర్లని పిలిపించి కొడుకులిద్దరికీ పెయింటింగ్ నేర్పించారట.

పెళ్ళయ్యి ఏడాది గడిచినా నేను వట్టి మనిషిగానే ఉండిపోవడం అమ్మని చాలా కంగారు పెట్టింది. చిన్నన్నయ్య పెళ్ళికని నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు "అతను నిన్ను బాగా చూసుకుంటున్నాడా?" అని ఒకటికి పదిసార్లు అడిగింది.

"మగవాడికి రకరకాల సరదాలుంటాయి. మనం సర్దుకోవాలి. మన ఇళ్ళల్లో ఇలాంటివన్నీ మామూలే.. నేను సర్దుకోవడం లేదూ?" అమ్మ మాటలు నాకు అర్ధమయ్యీ కాకుండా ఉన్నాయి. అమ్మదీ అదే పరిస్థితి. ఏదో అడిగే ప్రయత్నం చాలా సార్లు చేసి, నోటి చివరి వరకూ వచ్చిన ప్రశ్నని వెనక్కి లాగేసుకుంది. వస్తూ వస్తూ అమ్మ లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను నాతో.

మరో ఆరునెలల తర్వాత నేను నెల తప్పడంతో అమ్మ ఊపిరి పీల్చుకుంది. వచ్చి నాతో నాలుగు రోజులు గడిపి, వెళుతూ వెళుతూ అప్పలనరసమ్మకి వంద జాగ్రత్తలు చెప్పింది. ఏడో నెల వస్తూనే పురిటికి తీసుకెళ్ళిపోతానని మరీ మరీ చెప్పి వెళ్ళింది.

అమ్మకన్నా ఎక్కువగా సంబర పడిపోయింది అప్పలనరసమ్మ. అప్పటివరకూ ముక్తసరిగా ఉన్నది కాస్తా, నాతో తరచూ మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఆలోచనల్లో ఉండకూడదు అని ఆమె తాపత్రయం. తన కబుర్లన్నీ చెప్పేది. మొగుడి పధ్ధతి నచ్చక 'ఇడిబావులు' పెట్టేసుకుందిట. వాళ్ళ బంధువుల ముసలమ్మ ఒకామె ఉంటే, ఆమెకి తోడుగా ఈ ఊరు వచ్చేసిందిట. ఆమె కబుర్లకి 'ఊ' కొట్టకపోతే ఊరుకునేది కాదు.

ఆ రోజుల్లోనే శ్రీకాంత్ గారు ఐదార్రోజులు ఇంటికి రాలేదు. అప్పుడప్పుడూ ఇంటికి రాకపోవడం మామూలే కానీ, చెప్పకుండా ఇన్నాళ్ళు దూరంగా ఉండడం మాత్రం మొదటిసారి. నాలుగు రోజులు గడిచేటప్పటికి నాకు కంగారు మొదలయ్యింది. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి?? అప్పలనరసమ్మ నాతో మాట్లాడడానికి తటపటాయిస్తోంది. ఆ మధ్యాహ్నం ఆమే నా దగ్గరికి వచ్చింది.

"గాబరైపోమాకమ్మా.. ఆ మణిసికి పేణం బానేదంట.. బావుగోరు ఆయమ్మ కాణ్ణే   ఉన్నారు. తెరిపినొడగానే ఒచ్చేత్తారు?" చెప్పి వెళ్లబోతుంటే, ఎప్పుడూ మాట్లాడని నేను నోరు విప్పాను.

"ఎవరికి నరసమ్మా? ఎవరికి బాగోలేదు? సగం సగం కాదు, పూర్తిగా చెప్పు" నేనంతగా నిలదీయగలనని నాకే తెలీదు. నా మాటలు విని నోరు తెరుచుకుని ఉండిపోయింది.

"అయ్యో తల్లీ.. నీకు తెలుసనీసుకున్నాను.. నా నోటితో సెప్పిత్తన్నాడు పాడు దేవుడు. నిబ్బరించుకో అమ్మా.. ఆ మణిసి గంగమ్మ. ఊళ్లోనే ఉంటాది. సాని పుట్టకయినా గొప్ప మణిసంతారు. ఈ బాబే కన్నెరికం సేసేరు. అసలు, మనువాడతానని పేసీ యెట్టేరంట.. శానా గొడవలే అయ్యేయప్పట్నో.. ఆ మణిసి మరొకడికేసి కన్నెత్తి సూడదు.. ఈబాబు ఆ మణిసిని సూడకుండా ఉండనేరు," చెప్పేసి గదిలోనుంచి వెళ్ళిపోయింది అప్పలనరసమ్మ.

సీట్లో కూర్చున్న నేను ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగుతున్నాను.. టర్బ్యులెన్స్.. విమానం క్షేమంగా ల్యాండ్ అవుతుందా? నాకు తెలియకుండానే చిన్నాని గట్టిగా పట్టుకున్నాను. కుదుపుకి వాడు కళ్ళు తెరిచాడు. నన్ను చూసి నిబ్బరంగా నవ్వాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అదే నిబ్బరం వాడిలో.

(ప్రయాణం కొనసాగుతుంది...)