శనివారం, జులై 09, 2011

భామిని విభునకు వ్రాసిన...

ప్రాణేశ్వరా,
....ఇలా పిలవడం మీకు అస్సలు ఇష్టం ఉండదని తెలుసు. 'ఏమిటీ నాటకాల భాష.. నాన్సెన్స్' అనేస్తారనీ తెలుసు. కానీ ఏం చేయను? నాకేమో ఉత్తరం రాయడం రాదు. మీర్రాసిన ఇరవై మూడు పేజీల ఉత్తరంలో మొత్తం పద్నాలుగు సార్లు తప్పకుండా జవాబు రాయమని రాశారు. మరి ఏదోలాగ మొదలెట్టాలి కదా. ఇరవై రోజులన్నా కలిసి కాపురం చేశామో లేదో ఆషాఢం రాజనాల్లాగా కత్తుచ్చుకుని వచ్చేసి, నన్నిక్కడికి తీసుకొచ్చేసింది.

నేను లేకపోవడం మీకు కొత్తగా ఉందని రాశారు కదూ. ఇక్కడ నా పరిస్థితి ఏమని చెప్పను? వచ్చిన రోజు సాయంత్రం స్నానానికి వెళ్ళబోతూ, "నాకు మైసూర్ శాండల్ వద్దమ్మా. మా ఇంట్లో పియర్సే వాడతాం?" అనేసరికి అమ్మ ఒక్క చూపు చూసిందంతే. మర్నాడు పొద్దున్నే కాఫీ కావాలని అడగ్గానే ఒకటే బుగ్గలు నొక్కుకోడం, 'ఇరవై ఏళ్ళుగా లేని అలవాటు ఇరవై రోజుల్లో వచ్చేసిందే నీకు' అంటూ. చెల్లీ, తమ్ముడూ అయితే నేనెక్కడ దొరుకుతానా అన్నట్టు చూస్తున్నారు. అసలు వాళ్ళిద్దరూ చూడకుండా మీ ఉత్తరం చదూకోడానికి ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా మీకు?

ఇప్పుడైనా వాళ్ళిద్దర్నీ మేటనీకి పంపించేసి, పెరట్లో బాదం చెట్టు కింద మంచం వేసుకుని కూర్చున్నా, మీకు ఉత్తరం రాయడం కోసం. ఇంట్లో అందరూ గుర్రు కొడుతూ నిద్రపోతున్నారు. బామ్మ గురకైతే ఇక్కడిక్కూడా వినిపిస్తోంది. మొన్నో రోజు నన్ను చూసి 'చిక్కిపోయావే అమ్ములూ' అంటూ బామ్మ ఒకటే గొడవ. గతేడాది సంక్రాంతికి నాన్నారి చేత కొనిపించుకున్న శాటిన్ పువ్వుల పరికిణీ ఉంది చూడండి, అదీను నీలం వోణీ వేసుకున్నాను. అసలు మన పెళ్లి కుదిరినప్పటి నుంచీ చీరల్లోకి మారిపోయాను కదా, అలవాటవుతుందని. ఒక్కసారిగా వోణీ లో చూసేసరికి చిక్కినట్టు కనిపించి ఉంటాను. 'ఇంకీ పరికిణీ నాకే కదే అక్కా' అంటూ చెల్లి ఒకటే ఏడిపించడం.

ఆవేళ మీరు సినిమాకి వెళ్దామన్నప్పుడు నేను పెట్లో వెతికి వెతికి నీలం రంగు శిల్కు చీర కట్టుకుంటే సిగరెట్ కాల్చుకుంటూ మీరన్నారు చూడండి 'ఆకాశం ఒంటికి చుట్టుకున్నట్టు ఉన్నావ్' అని, ఆమాట గుర్తొస్తూనే ఉంది రోజంతా. అక్కడికి వచ్చేటప్పుడు ఈ పరికిణీ తెచ్చేసుకుంటానండీ. ఇంట్లో ఉన్నప్పుడే కట్టుకుంటాను. సరేనా? అవునూ, నేను లేను కదా అని సిగరెట్లు ఎక్కువ కాల్చేసున్నారా? రోజూ రెండుకన్నా కాల్చనన్నారుకదా నాతో. కాల్చాలనిపించినప్పుడల్లా నన్ను గుర్తుచేసుకోవాలి మరి. అసలు మీ గురించి అడగనే లేదు కదా.. ఇంతకీ ఎలా ఉన్నారు? భోజనమన్నా సరిగ్గా చేస్తున్నారో లేదో అని పూటా తల్చుకుంటున్నాను. రత్తమ్మ రెండుపూటలా మానకుండా వస్తోందా? వస్తూ వస్తూ మంచి చీర పట్టుకొస్తానని చెప్పాను దానికి.

నేనొచ్చానని తెలిసి మొన్న మా కుసుమకుమారొచ్చింది. నా బెస్ట్ ఫ్రెండని చెప్పాను చూడండీ, అది. పాపం మన పెళ్లికి రాలేకపోయింది. మీరెలా ఉంటారని ఒకటే అడగడం. అసలీ ప్రశ్న చాలామందే అడుగుతున్నారనుకోండి. పక్కింటి నరసమ్మమ్మ గారైతే "యేవే పిల్లా.. నువ్వూ మీ ఆయనా ఒక్కసారైనా గొడవ పడ్డారుటే?' అని అడిగేసింది. 'అబ్బే అలాంటివేవీ లేవండీ' అని నేను చెబితే, 'మొగుడూ పెళ్ళాం గొడవ పడకపోతే అసలదేం సంసారమే?' అనేసిందావిడ, శాపం పెట్టే మంత్రగత్తెలాగా. 'దిష్టి కళ్ళమ్మా.. పచ్చగా ఉంటే ఓర్చలేరు' అని ఆవిణ్ణి తిట్టుకుంటూ అమ్మ పాపం నాకు దిష్టి తీసేసిందనుకోండి. 'నీది మరీ చాదస్తం సుభద్రా' అంటూ నాన్నారు, అమ్మని కేకలేయడం.

కుసుమకుమారి గురించి చెబుతూ మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయాను కదూ. ఏవిటో పరధ్యానం. మొన్నొక రోజు ఇలాగే అన్నం వదిలేసి గుత్తొంకాయ కూరొకటీ తినేస్తుంటే తమ్ముడు చూసి ఒకటే నవ్వడం. 'మాకు అన్నంలో కలుపుకుంటేనే కారంగా ఉంది.. బావగారు నీకు కారాలు బాగానే అలవాటు చేసేసినట్టున్నారూ' అంటూ. సరే, కుసుమ మీ ఫొటోన్నా చూపించమని ఒకటే గొడవ. స్టూడియో వాడు మన పెళ్లి ఫోటోలు ఇంకో నెల్లాళ్ళ వరకూ రావన్నాడు. ప్రింటింగుకనీ రాజమండ్రో, విజయవాడో పంపాట్ట. సరిగ్గా చెబితే కదా. సరే, పెళ్లికి ముందు మీరు పంపిన ఫోటో ఉంది కదా, అదన్నా చూపిద్దాం అనుకున్నా. ఎక్కడా, అదక్కడే నా పెట్టిలో ఉండిపోయింది. 'ఏకంగా ఆయన్నే చూద్దువుగాని లేవే' అని దాన్ని జోకొట్టాను.

అన్నట్టు మీరిక్కడికి ఎప్పుడొస్తారు? ఏదో వంక పెట్టుకుని మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తానని, రైలు దగ్గర నాన్నారు వినకుండా నాతో చెప్పారు కదా. రోజూ ఎదురు చూడ్డవే నేను. గోదారొడ్డున సినిమా షూటింగ్ అవుతోంది. నాగేసర్రావూ, సావిత్రీ ఒచ్చారుట. మా సదాశివం మావయ్యకి ఆ సినిమా వాళ్ళు తెలుసుట. మీరొస్తే మనిద్దరం కలిసెళదాం. నేను వెళ్ళడానికి నాన్నారొప్పుకోకపోతే, మీరన్నా వెళ్లి చూసొద్దురుగాని. సావిత్రంటే ఇష్టం కదా మీకు. మరేమో, ముఖ్యమయిన విషయం. మొన్న బామ్మా నాన్నారూ మాటాడుకుంటుంటే నా చెవిన పడింది. ఏకంగా శ్రావణ మాసం నోములూ అవీ అయ్యాక పంపుతారుట నన్ను. అలాగని మావయ్యగారికి ఉత్తరం రాయమని నాన్నారికి చెబుతోంది బామ్మ. వింటున్నారు కదూ?

మల్లంటు మీదనుంచి వచ్చే చల్లగాలి మాంచి వాసనొస్తోందండీ, మీరు కొనిచ్చిన అత్తర్లాగా. బుజ్జి మొక్కని నేనే పాతాను, పెంచాను. చెల్లేమో పూలకి వాటాకి రావడం తప్ప ఆకైనా దుయ్యదు ఎప్పుడూ. ఇన్నాళ్ళూ పూల కోసం దెబ్బలాడుకునే వాళ్ళమా, ఇప్పుడు మొత్తం దానికే ఇచ్చేస్తుంటే అదెంత ఆశ్చర్యపోతోందో. 'ఇంత మారిపోయావేమిటే నువ్వు?' అని రోజుకోసారైనా అంటోంది. హమ్మో. మల్లెమొగ్గలు విచ్చుతున్నాయ్. రాస్తుండగానే సాయంత్రం అయిపోయింది. కాసేపట్లో మా కోతులు రెండూ సినిమా నుంచి వచ్చేస్తాయ్. వాళ్ళ కళ్ళ పడకుండా దీన్ని డబ్బాలో వేయించాలి. ఏం రాశానో చదవడానిక్కూడా టైము లేదు. రోజులు లెక్క పెడదామన్నా కేలండర్ కూడా ఎవరూ చూడనప్పుడు చూడాల్సొస్తోంది. మీ జవాబు కోసం చూడనండీ.. జవాబుగా మీరే వచ్చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. వస్తున్నారు కదూ. - మీ ప్రాణసఖి

33 కామెంట్‌లు:

  1. oka nalabayyi yella kritham uttharam..idhi..chaalaa baagundhandi.ilaati yttharaala baasha ippudu undhaa?

    రిప్లయితొలగించండి
  2. ఆషాడం కాదుగాని, ఉద్యోగ ధర్మం నిమిత్తం ఇల్లొదిలి రెండ్రోజుల క్రితం అమెరికా వచ్చిన నాకు మీ టపా చదివాక ఇంటిమీద మరింత బెంగ పెరిగింది.

    ఇంతకూ యీ ఉత్తరం అసలుదా? మీ కల్పితమా? నాకయితే అసలుదే అనిపిస్తోంది!

    రిప్లయితొలగించండి
  3. మొదలుపెట్టాక ఆపకుండా చదివించింది. చాలా చాలా బావుంది.

    ఇంతకీ ఇది ఎవరు, ఎప్పుడు, ఎందులో.. వ్రాశారో ఏమీ చెప్పకుండా ఇలా ఉత్తరమొక్కటీ పోస్ట్ చేస్తే ఎలా మురళీ గారూ...

    నాక్కొంచెం పుస్తకాల నాలెడ్జ్ తక్కువ. దయచేసి వివరాలు చెప్తారని ఆశిస్తూ...

    గీతిక

    రిప్లయితొలగించండి
  4. bhimini sangathemo gaani bavagaaru matram ilage padukonuntaaru....

    manasaina cheliya leka
    nayanaala yeru vaaka
    saagindi shithila nauka
    teeraanni cheraleka...


    migathaa song kosam...
    www.raki9-4u.blogspot.com lo vethakandi...


    letter chala baagundi..

    రిప్లయితొలగించండి
  5. బాగుందండి.
    నాది కూడా గీతిక గారు, మురళి గారు అడిగిన ప్రశ్నేనండి.
    వివరాలు రాయక పోతే ఎల్గండి?

    రిప్లయితొలగించండి
  6. మీ మీద ఆషాడమాసం చూపించిన ప్రభావం బాగానే గుర్తుచేసుకున్నారు:) నా కైతే శ్రీవారికి ప్రేమలేఖ గుర్తొచ్చింది. అయినా అంత మంచి ఉత్తరాల కాలం మళ్ళీ వస్తుందంటారా. వాటిని దాచిపెట్టి మరీ చదువుకుంటున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. ఇప్పటికీ ఎక్కడో అక్కడ ఆతృప్తిననుభవిస్తున్న వారు లేకపోరు అని నా ఆశ.

    రిప్లయితొలగించండి
  7. Beautiful.. ఇంతకీ ఎవరండీ ఈ భామినీ, విభుడూ?

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగుంది. ఉత్తరాలు రాసుకోవడం, అందుకోవడం లోని ఆనందమే వేరు.

    రిప్లయితొలగించండి
  9. @వనజ వనమాలి: భాషే కాదండీ, ఉత్తరాలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు కదా.. ధన్యవాదాలు.
    @శ్రీ: బెంగ?.. 'కుశలమా..నీకు కుశలమేనా?' అని ఒక మెయిల్ కొట్టేయండి :-) ..పూర్తిగా అసలూ కాదు, మొత్తం కల్పితమూ కాదండి.. అదీ సంగతి!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @గీతిక: 'చాలా చాలా బాగుంది..' వావ్.. ధన్యవాదాలండీ.. ఇకపోతే, మీరు, మరికొందరు మిత్రులు అడిగిన దానికి జవాబు కొంచం పెద్దది. నాకు అన్నమాచార్య కీర్తనలలో 'ఏమకో..చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను.. భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా..' కీర్తన చాలా ఇష్టం. నిన్న ఉదయం పాటలు వింటూ ఈ కీర్తన మళ్ళీ మళ్ళీ విన్నాను. సరిగ్గా అదే సమయంలో, రోజూ కనీసం పద్దెనిమిది గంటలు ఫోన్లో మాట్లాడుతున్న పక్కింటి ఆషాఢం పెళ్ళికూతురు కనిపించింది.. ఫలితం ఈ టపా అండీ.. :))

    రిప్లయితొలగించండి
  11. @రాఖీ: బాగుందండీ మీ బ్లాగు.. ఎప్పుడన్నా తీరికగా చూడాలి మొత్తం పాటలన్నీ.. ధన్యవాదాలు.
    @మురళి: వివరాలు గీతిక గారికి చెప్పినవేనండీ. టూకీ గా అదీ కథ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @ప్రబంద్ చౌదరి: వివరాలు రాసి ఉండాల్సింది అంటారా..? నేనింతగా కన్ఫ్యూజ్ చేస్తానని అనుకోలేదండీ.. ఇప్పుడు చెప్పేశాను కదా.. ధన్యవాదాలు.
    @జయ: ఉన్నారు జయగారూ ఉన్నారు.. 'ఎక్కడ? నాకు తెలియాలి, ఇప్పుడే..' అని మాత్రం అనకండేం :)) ..కొంచం రూపం మారినా ఇప్పుడు మెయిల్స్ ఉన్నాయి కదండీ.. కాలంతో పాటుగా మార్పు అనివార్యం కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @శిశిర: అన్నమాచార్య కీర్తనలో అయితే అమ్మవారూ, అయ్యవారూనండీ.. ఈ టపాలో అయితే ఆషాఢం ఎడబాటుని అనుభవిస్తున్న జంటలన్నీను :)) ..ధన్యవాదాలండీ..
    @మురారి: కదండీ!! సేమ్పించ్ ఇక్కడ కూడా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. yemiti ...yekkadidi ...ee pete lona
    daachina mogali poola parimalam....
    haayigaa peelchukodi...

    రిప్లయితొలగించండి
  15. మురళి గారు అద్భుతంగా వ్రాసారండీ. నేను చదవటం మొదలు పెట్టినప్పుడు ఇల్లాలి ముచ్చట్లు నుండీ ఏమో అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  16. One of your best posts i believe.
    ఈ జనరేషన్ వాళ్ళు మిస్ అవుతున్నదేంటో చెప్పకుండానే చెప్పారు!

    రిప్లయితొలగించండి
  17. ఎంత అద్భుతమైన టైటిల్ పెట్టారండీ. స్థలకాలాదులు వాచ్యంగా చెప్పకుండా మధ్యలో గోదారొడ్డున నాగేసర్రావు, సావిత్రీ వచ్చారని టైం అండ్ ప్లేస్ స్ఫురింపజేయడం.. వంశీ(ముఖ్యంగా మా పసలపూడి కథల) ప్రభావం కదా

    రిప్లయితొలగించండి
  18. So sweet!
    మీరు చెప్పిన ఆ అన్నమాచార్య కీర్తన నాకు కూడా చాలా ఇష్టం! :)
    చాలా చాలా చాలా బాగా రాశారు.. :)

    రిప్లయితొలగించండి
  19. @శశి: 'మొగలి పూల పరిమళం..' చక్కని ప్రశంశ.. ధన్యవాదాలండీ..
    @కొత్తావకాయ: ఇదేమిటండీ కొత్తావకాయ ఘాటు అంటారు కదా, మీరేమిటీ స్వీటు అంటున్నారు?! :)) ..హమ్మయ్య పాత కక్షలు తీరిపోయినట్టేనండీ :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @ఇద్దరు: ప్రచురించాక చదువుకుంటే నాకూ ఆ ప్రభావం కొంచం పడ్డట్టే అనిపించిందండీ.. పెద్ద ప్రశంశ!! ..ధన్యవాదాలు.
    @హరిచందన: థాంక్యూ.. కాలంతో పాటు మార్పు అనివార్యం కదండీ.. ఇప్పుడు ఉత్తరాల కోసం ఎదురు చూసే పని లేదు కదా.. అందుబాటులో ఫోన్లున్నాయ్..

    రిప్లయితొలగించండి
  21. @పక్కింటబ్బాయి: అసలు ఇది శీర్షిక కోసం రాసిన టపా అండీ.. నాకు మాత్రం పురాణం సీత గారి 'ఇల్లాలి ముచ్చట్లు' ప్రభావం కొంచం, నా ఇల్లాలి ముచ్చట్ల ప్రభావం కొంచమూ ఉన్నట్టుగా అనిపించిందండీ!! చాలా నిశితంగా చదివినందుకు ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: థాంక్యూ..
    @మధురవాణి: మొత్తం మూడు 'చాలా' లు, అది కూడా మీ నుంచి.. విశేషమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. ఈ కీర్తన ఏ సైట్లో దొరుకుతుందండి?

    రిప్లయితొలగించండి
  23. పరమపూజ్యులు,ఈనేలమీద నడిచిన ఆంధ్రాక్షర మానుషరూపం శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రిగారి స్త్రీపాత్రల్లో యేదో ఒకపాత్ర చేయిచేసుకున్నదా అనిపించింది మొదట.మీరు అనవసరంగా ఉత్కంఠపోగొట్టారు :)
    అయితే మూగమనసులు సినేమా తీస్తున్నప్పుడయ్యిందా మీ పెళ్ళి?

    రిప్లయితొలగించండి
  24. @హరిచందన: చాలా చోట్లే దొరుకుతోందండీ.. నేనైతే ప్రస్తుతం ఇక్కడ నుంచి వింటున్నాను.
    http://www.raaga.com/play/?id=243936
    @రాజేంద్రకుమార్ దేవరపల్లి: శ్రీపాద వారి నాయిక అచ్చ తెలుగు తప్ప 'నాన్సెన్స్'లాంటి పరభాషా పదాలు వాడదు కదండీ.. మొత్తం మీద చాలా పెద్ద ప్రశంశ.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. మురళిగారూ...చాలాబాగుందండీ...సహజంగా....ఆత్మీయంగా...ఎంత బాగా వ్రాసారో!:)

    రిప్లయితొలగించండి
  26. శీర్షిక చూసిన వెంటనే ఆ కీర్తన మదిలో మెదిలిందండీ.. ఈ శీర్షికను ఎన్నుకోడంలోనే ఉత్తరం ఎలా ఉండబోతోందోనని చెప్పినట్లు అనిపించింది... ఉత్తరం చదివాక మరింత నచ్చేసింది.. చాలా బాగా రాశారు..

    రిప్లయితొలగించండి
  27. @ఇందు: :-) ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: శీర్షిక చూసి భావాన్ని ఊహించారన్నమాట!! ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  28. మురళీ గారూ,

    కొంచెం ఆలస్యంగా చూసినా చాలా అద్భుతమైన టపా చదివిన ఆనందం కలిగింది.

    >>
    ఇరవై రోజులన్నా కలిసి కాపురం చేశామో లేదో ఆషాఢం రాజనాల్లాగా కత్తుచ్చుకుని వచ్చేసి, నన్నిక్కడికి తీసుకొచ్చేసింది.
    >>

    నాకైతే పదిహేడు రోజులు మాత్రమే. :( :( :(

    తర్వాత మూఢం ఒకటీ నా ప్రాణం మీదకి!!! :( :( :( :( :( :( :( :( :(

    తనని ఇంకో రెండు నెలలు ఇంటికి తీసుకురావడం కుదరదు. అర్జెంటుగా ఈ టపాని తనకి చూపించాలి.

    రిప్లయితొలగించండి
  29. @లక్ష్మీ నారాయణ సునీల్ వైద్యభూషణ్ : ఓహ్.. మీరు బాధితులా?!! అందుకే అంత బాగా నచ్చేసింది మీకు.. రెండు నెలలంటే బాగా కష్టమేనండీ పాపం. చదివించి, ఏమన్నారో చెప్పండి కొంచం :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. babaoy baboy! yelaa miss ayipoyaanu yee lekhanee...jyothirmayi gaari punyamaani chadavagaligaa...maa aththaarintlo aasaada maasam pattimpu ledantaa...undi unteh..appatlo yee(mee) neelam rangu parikinee pillani adigi wraayinchukundunu ..pch pch...

    రిప్లయితొలగించండి