గురువారం, జనవరి 28, 2021

రామేశ్వరం కాకులు 

ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగుల అవినీతి మీద లెక్కకు మిక్కిలి కథలొచ్చాయి తెలుగు సాహిత్యంలో. వీటితో పోల్చుకుంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు కథా వస్తువులైన సందర్భాలు అరుదు. ఇలాంటి అరుదైన ఇతివృత్తంతో రాసిన రెండు కథలు కనిపించి ఆశ్చర్య పరిచాయి 'రామేశ్వరం కాకులు' కథా సంకలనంలో. సుప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, పర్యావరణ వేత్త తల్లావఝల పతంజలి శాస్త్రి రాసిన పన్నెడు కథల సంకలనం ఈ 'రామేశ్వరం కాకులు.' తన స్నేహితుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మకి అంకితం ఇచ్చిన ఈ సంకలనంలో కథలన్నీ గతంలో వివిధ పత్రికల్లో అచ్చయినవే. మానవ జీవితంలో వివిధ పార్శ్వాలని నిపుణతతో తన కథల్లో చిత్రించే పతంజలి శాస్త్రి అదే పంథాని కొనసాగిస్తూ రాసిన కథలివి. వస్తు విస్తృతి, పాత్ర చిత్రణలో వైవిధ్యం ప్రతి కథనీ దేనికదే ప్రత్యేకంగా నిలబెట్టాయి. 

'కె. ఎల్. గారి కుక్కపిల్ల' కథలో నాయకుడు కె. ఎల్. రావు సెక్రటేరియట్లో సెక్రటరీ స్థాయి అధికారి. చూస్తున్నది గనుల శాఖ బాధ్యతలని. విలువలున్న వాడు, అతర్ముఖుడూ కూడా. తనకి చేతనైనంత మేరకి వ్యవస్థకి మంచి చేయాలన్న ఆలోచన ఇంకా మిగిలి ఉన్నవాడు కూడా. అతని పై అధికారి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రావుకి బాల్య మిత్రుడే. అయితే, ఆ విషయం ఎవరికీ తెలీదు. రావు ఆలోచనలు, అతని సంఘర్షణా అంతా చీఫ్ సెక్రటరీకి తెలుసు. కథ నేరుగా కాక ప్రతీకాత్మకంగా నడుస్తుంది. చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఉండే నల్లని కుక్కపిల్ల అంటే రావుకి చిరాకు. తన దగ్గర పనిచేసే పీయే మీద కూడా ఒకలాంటి అయిష్టత. ఆఫీసులో పీయేని చూడక తప్పదు, చీఫ్ సెక్రటరీ ఇంటికి ప్రయివేటు పార్టీకి వెళ్ళినప్పుడల్లా కుక్కపిల్ల గుర్ గుర్ లని భరించకా తప్పదు. గుర్తుండిపోయే ముగింపుని ఇచ్చారీ కథకి. 

'మంచుగాలి' కథలో నాయకుడు స్వామి, గనుల శాఖలో జిల్లా స్థాయి అధికారి. ఒత్తిళ్ళని తట్టుకుని విధి నిర్వహణ చేసే ఉద్యోగి. విద్యావంతురాలైన భార్య, ఉద్యోగం చేస్తున్న కొడుకు, చదువుకుంటున్న కూతురు.. వీళ్ళందరికీ ఈజీమనీ మీద ప్రేమ, ఒక్క స్వామికి తప్ప. ఇంటికి వచ్చే సూట్ కేసుల్ని స్వామి తిరగ్గొట్టేయడం పట్ల వాళ్లలో అసంతృప్తి. వాటిని తీసుకుంటే బాగుండునని వాళ్ళకి కోరిక. అయితే దానిని నేరుగా కాక, అన్యాపదేశంగా వెలిబుచ్చుతూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఏముందో స్వామికి తెలుసు. పై నుంచి, స్థానికంగా కాంట్రాక్టర్ల నుంచీ వచ్చే ఒత్తిళ్లు సరేసరి. వీటన్నింటి మధ్యా స్వామి వ్యక్తిగత, వృత్తిగత జీవనం ఎలా సాగిందో చిత్రించిన కథ ఇది. ఈ కథా చాలావరకూ ప్రతీకాత్మకంగానే సాగుతుంది. స్వామి భార్యా, కూతురూ కలిసి చేసే 'పులకాలు' కూడా కథ చెబుతాయి. ఈ రెండు కథలూ గనుల శాఖ నేపధ్యం నుంచి రావడం యాదృచ్చికం కాదేమో. 

రాజకీయాలు ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు కథలకీ బౌద్ధ జాతక కథల్ని నేపధ్యంగా వాడుకున్నారు. వీటిలో మొదట చెప్పుకోవాల్సిన కథ 'గారా.' ఈమధ్య కాలంలో ఇంత గొప్ప పొలిటికల్ సెటైర్ రాలేదు తెలుగులో. ఆశ్రమంలో మిగిలిన భిక్షువులకి భిన్నంగా ప్రవర్తించే ఇద్దరు భిక్షువుల భవిష్యత్ దర్శనం ఈ కథ. రాజకీయ నాయకులుగా జన్మించి, శాప వశాన గాడిదలుగా మారి, అక్కడ కూడా రాజకీయాన్ని వదలని జీవుల కథ ఇది. కాస్త పొడిగించి నవలికగా రాసి ఉంటే, కేఎన్వై పతంజలి 'అప్పన్న సర్దార్' సర్దార్ సరసన నిలిచేది. పతంజలి శాస్త్రి గతంలో రాసిన 'జర్రున' కథనీ జ్ఞాపకం చేసిందీ కథ. రెండు రాజ్యాల మధ్య సాగునీటి సమస్య ఇతివృత్తంగా రాసిన కథ 'రోహిణి.' బుద్ధ భగవానుడి పాత్ర చూసి ఇది జాతక కథ అనుకుంటే పొరపాటే. కరెంట్ అఫైర్స్ దృష్టితో ఆలోచిస్తే ఈ కథ ఎంత సమకాలీనమో అర్ధమౌతుంది. 

'అతను', 'అతను, ఆమే, ఏనుగూ', 'అతని శీతువు', 'అతని వెంట' ఈ నాలుగు కథల పేర్లూ దగ్గరగా వినిపిస్తున్నాయి కానీ ఏ రెండు కథలకీ పోలిక ఉండదు. వర్చువల్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య గీతని చెరిపేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ 'అతను'. తాను చేసింది తప్పు అనే స్పృహ కూడా లేనంతగా ఉద్యోగ జీవితానికి (మరీ ముఖ్యంగా స్క్రీన్ కి) బానిస అయిపోయిన వాడి కథ ఇది. సాఫ్ట్వేర్ జీవితాల్లో ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ప్రస్తుత కాలపు అర్బన్ జంటల వైవాహిక జీవితం ఇతివృత్తంగా రాసిన కథ 'అతను, ఆమే, ఏనుగూ'. అసంతృప్తులని లోపలే దాచుకునే జంటలో ఇద్దరి కథా చెప్పారు రచయిత. 'కష్టాలు లేనిది ఎవరికీ?' అనే ప్రశ్నకి సరైన సమాధానం 'ఎదుటి వాళ్లకి.' తాను తప్ప తతిమ్మా ప్రపంచం అంతా సుఖంగా ఉందని నమ్మే ఓ ఆచార్యులు కథ 'అతని శీతువు.' ఈ కథలో తాత్వికత వెంటాడుతుంది. రజ్జు భ్రాంతి చుట్టూ అల్లిన కథ 'అతని వెంట.' 

రామాయణంలో ఊర్మిళ కథలో కొత్త కోణాన్ని చెప్పే కథ 'కచ్చప సీత.' ఇది పురాణాన్ని తిరగ రాసిన కథ కాదు. పాత్రల ఔచిత్యాలకి భంగం కలగలేదు. ఒక రచయిత పర్యావరణ వేత్త కూడా అయిన ఫలితం 'ఉర్వి' కథ. ప్రతీకాత్మకమైన కథ ఇది. త్రికాలాలనీ, పంచ భూతాలనీ, ఋతువులనీ గుర్తు పట్టగలిగితే కథ సాఫీగా సాగిపోతుంది. 'వెన్నెల వంటి వెలుతురు గూడు' పేరులాగా పొయెటిక్ గా సాగే చిన్న స్కెచ్. ఇక పుస్తకానికి శీర్షిక, సంపుటంలో మొదటి కథ 'రామేశ్వరం కాకులు'. వ్యభిచార వృత్తిలోకి లాగబడిన ఓ అమ్మాయీ, జీవితం మీద అనురక్తి కోల్పోయిన ఓ వ్యాపారీ, ఖాకీ వెనుక లోపలెక్కడో తడి మిగిలి ఉన్న ఓ పోలీసూ ముఖ్య పాత్రలీ కథలో. చదివాకా చాలాసేపు ఆలోచనల్లోకి నెట్టేసే కథ. ఆ మాటకొస్తే, అన్నీ కథలూ ఆలోచింపజేసేవే, ఆలోచించిన కొద్దీ కొత్త కోణాలని చూపించేవే. ('రామేశ్వరం కాకులు,' ఛాయా ప్రచురణలు, పేజీలు 130, వెల రూ. 150). ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు,  నాణ్యమైన ముద్రణ. 

ఆదివారం, జనవరి 24, 2021

ట్వెల్వ్

ఓ శనివారం మధ్యాహ్నం.. చుట్టూ ఎవ్వరూ లేరు. చేయడానికి ఇతరత్రా పనులేమీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న కంప్యూటర్లో గూగుల్ తోనూ, బ్లాగర్ తోనూ కుస్తీ మొదలు పెట్టాను. ఓ రెండు గంటలు గడిచేసరికి కాస్త సంతృప్తికరమైన రూపమొకటి కళ్ళముందు కనిపించింది. ఈలోగా చేయాల్సిన పని తరమడం మొదలు పెట్టడంతో, 'పబ్లిష్' బటన్ నొక్కి, ఆ విండో క్లోజ్ చేసి, రోజువారీ పనిలో పడ్డాను. 'రెస్టీజ్ హిస్టరీ' అనేంత లేదు కానీ, ఇది జరిగింది మాత్రం ఇవాళ్టికి సరిగ్గా పుష్కర కాలం క్రితం.  'నెమలికన్ను' పన్నెండో పుట్టినరోజివాళ. 

'బ్లాగు రాయడం ఎందుకు?' అనే విషయంలో మొదటి నుంచీ నాకో స్పష్టత ఉంది. ఇన్నాళ్ల లోనూ నా అభిప్రాయాలలో మార్పు రాలేదు.  రాయడాన్ని ఆస్వాదిస్తున్నా, అప్పుడూ, ఇప్పుడూ కూడా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అర్ధమయ్యింది ఏమిటంటే, గత పుష్కర కాలంలోనూ నా వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో వచ్చిపడిన మార్పుల తాలూకు ప్రభావం నా బ్లాగు మీద స్పష్టంగా కనిపిస్తోంది.  అయితే, అంతకు ముందు కాలానికీ, గడిచిన ఏడాదికీ చాలా స్పష్టమైన తేడా ఉంది. అది నా ఒక్కడికే కాదు, మొత్తం ప్రపంచానికి. మరికొన్ని వారాల్లో 'కరోనా' నామ సంవత్సరం పూర్తవ్వబోతోంది. 

ఈ సంవత్సరం ప్రభావమో లేక ఇతరత్రా కారణాల వల్లనో  తెలీదు కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా "ఇంకా ఎన్నాళ్ళు రాస్తాం, బ్లాగు ఆపేద్దాం" అన్న ఆలోచన గతేడాదితో చాలాసార్లు వచ్చింది.  బ్లాగు మొదలు పెట్టని క్రితం నాకు బ్లాగర్లు ఎవరితోనూ పరిచయం లేదు. మొదలు పెట్టిన కొన్నాళ్లకే చాలా మందితో స్నేహం కుదిరింది. వ్యాఖ్యలు, చాట్లతో పాటు, ఉత్తర ప్రత్యుత్తరాలూ ఉండేవి. కాలం గడిచే కొద్దీ వారిలో కొందరు మార్గశ్రాంతులయ్యారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి 'బ్లాగులు మరణించాయి' అని ప్రకటించేశారు. మిగిలిన కొద్దిమందీ అడపాదడపా రాస్తున్నారు. కొత్తవాళ్లు రాకడ అప్పుడప్పుడూ  కనిపిస్తోంది.

Google Image

పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా పలకరించే బ్లాగుమిత్రులు ఉండడం విశేషంగానే అనిపిస్తోంది. ఈ మాధ్యమంలో ఉన్న సౌకర్యానికి అలవాటు పడ్డం వల్లనో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ప్రారంభం ఎందుకన్న ఆలోచనో, లేదూ రెండింటి కలగలుపో తెలీదు కానీ మరో మాధ్యమంలో రెండో కాలు పెట్టాలని  అనిపించడం లేదు. పైగా, ఇప్పటికే వేరే చోట అకౌంట్లు నిర్వహిస్తున్న మిత్రులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఒకరిద్దరు మాత్రం "అందరం ఇటు వచ్చేశాం, మీరొక్కరూ అక్కడెందుకూ?" అంటూ మెయిల్స్ రాస్తున్నారు అప్పుడప్పుడూ. వాళ్ళని మిస్సవుతున్నప్పటికీ, నావరకూ ఈ పడవ ప్రయాణం బాగుంది మరి. 

వెనక్కి తిరిగి లెక్కలు చూసుకుంటే ఒకటి తక్కువ అరనూరు పోస్టులు కనిపించాయి గడిచిన ఏడాదిలో. ఎప్పటిలాగే పుస్తకాలూ సినిమాల కబుర్లే అధికం. పీవీ శతజయంతి సందర్భంగా పోస్టు రాస్తే, కారణాలు వెతికారు కొందరు. అక్కడితో ఆగకుండా, జగన్ పార్టీ అభిమానిని అని ముద్రవేసే ప్రయత్నం చేశారు. నవ్వుకున్నాను. ఎవరైనా క్రమం తప్పకుండా నా బ్లాగు చదువుతూ ఉన్నట్టయితే వాళ్ళు కూడా నవ్వుకునే ఉంటారు బహుశా. చాలామందికి మల్లేనే నాక్కూడా లాక్ డౌన్ లో మలయాళం సినిమాలు పరిచయం అయ్యాయి, కొత్తగా. ఒకప్పుడు ఇరానీ సినిమాలు (ఎక్కువగా బాలల చిత్రాలే) ఎంత కొత్తగా అనిపించాయో, ఇప్పుడు ఇవీ అలాగే అనిపిస్తున్నాయి. 

ఇంతకీ, బ్లాగు కోసం రాయాలనుకున్న కొన్ని సంగతులు అలాగే ఉండిపోయాయి. "ఇక ఆపేద్దాం" అనే ఆలోచన బలపడక ముందే రాయాలనుకున్నవన్నీ రాసేయాలని సంకల్పం. ఎంతవరకూ నెరవేర్చుకోగలనో చూడాలి మరి. సముద్ర పరిమాణంలో సమాచారం చుట్టుముట్టేసిన ప్రస్తుత సందర్భంలో కూడా బ్లాగుల్ని గుర్తు పెట్టుకుని చదువుతున్న వారికీ, అభిప్రాయాలూ పంచుకుంటున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానీ పుట్టినరోజు సందర్భంలో..

గురువారం, జనవరి 21, 2021

నాలుగో ఎకరం

"వంకాయ బజ్జి పచ్చడిలో - తత్వాలు పాడేటప్పుడు తంబూరా శ్రుతిలా కొత్తిమీర ఉండాలి కానీ హద్దుమీరి అసలు విషయాన్ని మింగెయ్యకూడదు" అని తన కథానాయకుడు అప్పదాసు చేత 'మిథునం' కథలో చెప్పించారు శ్రీరమణ. ఆయనే రాసిన మరో పెద్దకథ 'నాలుగో ఎకరం.' సంపుటిలో ఒకటిగా కాక, చిరుపొత్తంగా అచ్చులో వచ్చింది, గిరిధర్ గౌడ్ కుంచె నుంచి వచ్చిన (వర్ణ) చిత్రాలతో సహా. బొమ్మలతో కలిపి అచ్చులో 71 పేజీలున్న ఈ కథ - పేరే చెబుతున్నట్టుగా - కూడా పల్లెటూరు నేపధ్యంగా సాగేదే. రెండు కుటుంబాల కథే, కానీ ఆ రెండు కుటుంబాల మధ్యా జరిగే కథ కాదు. ఓ కుటుంబంలో జరిగే కథని, రెండో కుటుంబంలో కథకుడు మాధవ స్వామి తన గొంతుతో చెబుతాడు. కథా స్థలం గుంటూరు జిల్లాలో ఓ పల్లెటూరు. 'పెదకాపు' గా పిలవబడే రాఘవయ్య కుటుంబం కథ ఇది. ఆ రాఘవయ్య కొడుకు సాంబశివరావుదీ, కూతురు చిట్టెమ్మదీ కూడా. 

ఒకప్పుడు పశువుల సాయంతో జరిగిన వ్యవసాయంలో కాల క్రమేణా యంత్రాలు ప్రవేశించడంతో రైతులకి పశువులతో అనుబంధం తగ్గుతూ రావడంతో మొదలు పెట్టి, ఒక్కసారిగా ఊపందుకున్న నగరీకరణ ఫలితంగా భూముల రేట్లు అనూహ్యంగా పెరిగిపోయి పంటపొలాలు రియలెస్టేట్ వెంచర్లుగా మారిపోడాన్ని నిశితంగా చిత్రించారు రచయిత. రాఘవయ్య తొమ్మిదెకరాల మాగాణానికి రైతు. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, పశుపోషణలోనూ అందెవేసిన చేయి. ముఖ్యంగా ఎడ్లని పెంచడం, వాటిని పందేలకు తీసుకెళ్లి బహుమతులు గెలుచుకు రావడం వల్ల ఆయన పేరు ఆ చుట్టుపక్కల ఊళ్లలో మార్మోగిపోయింది. వ్యవసాయ అనుబంధ పనులన్నింటిలోనూ నైపుణ్యం ఉంది రాఘవయ్యకి. 

ఆ పెదకాపు రాఘవయ్య కొడుకు సాంబశివ రావు, తండ్రికి తగ్గ కొడుకే. పట్నంలో హాస్టల్లో ఉండి కాలేజీలో చదువుకుంటున్న వాడల్లా ఓ రాత్రి దుక్కిటెడ్లు కల్లోకి వచ్చాయని, మర్నాడు లేస్తూనే ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. చదువుకోమని బలవంతం చేయలేదు తండ్రి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా, ఉన్నట్టుండి కరువు ప్రవేశించింది. అది ఏ ఒక్క రైతుకో వచ్చిన సమస్య కాదు, మొత్తం రైతాంగానిది. పంటలూ, పనులూ కూడా లేవు. ఒకరకమైన స్తబ్దత అలముకుంది ఊళ్లలో. ఆ స్తబ్దతని బద్దలుకొడుతూ ఊరి శివార్లలో వందెకరాల పంటపొలం, సువిశాలమైన కార్పొరేట్ కాలేజీగా మారిపోయింది. దాంతో ఉన్నట్టుండి భూముల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. వ్యవసాయాన్ని ప్రాణంగా ప్రేమించే రాఘవయ్య పొలం రోడ్డుని ఆనుకునే ఉన్న ఏక ఖండం. అందులో మూడెకరాలు కూతురు చిట్టెమ్మకి పెళ్లినాడు స్త్రీధనంగా ఇచ్చినది. ఆ చిట్టెమ్మ ఇప్పుడు అమెరికాలో ఉంటోంది. 

ఈ కథని మనకి రాఘవయ్యో, సాంబశివరావో చెప్పరు. ఆ ఊరి కృష్ణాలయం పూజారి పెద్దస్వామి రాఘవయ్యకి స్నేహితుడైతే, ఆ పెద్దస్వామి కొడుకు, కాలేజీలో సాంబశివరావుకి లెక్చరర్ అయిన చిన్నస్వామి చెబుతాడు. ఈ చిన్నస్వామికి ఒకనాటి వ్యవసాయ విధానాలనీ, రైతు జీవితాలనే రికార్డు చేయాలని కోరిక. వీలు చిక్కినప్పుడల్లా పెదకాపుని కదిల్చి ఆ ముచ్చట్లు చెప్పిస్తూ ఉంటాడు. అప్పటివరకూ దూరంగా ఉన్న పట్నంలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న వాడు కాస్తా, కార్పొరేట్ కాలేజీ పుణ్యమా అని ఉన్న ఊళ్ళోనే ఉద్యోగస్తుడవుతాడు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడని సాంబశివ రావు నోరూ, మనసూ విప్పేది  ఈ చిన్నస్వామి ఎదుటే. సాంబశివరావు మాటల్లో ఈ చిన్న స్వామి గుళ్లో దేవుడి లాంటివాడు. ఏం చెప్పినా వింటాడే తప్ప, ఏమీ బదులు చెప్పడు. 

రాఘవయ్య నుంచి గతాన్నీ, సాంబశివరావు నుంచి వర్తమాన విషయాలనీ వింటూ ఉండే కృష్ణస్వామి ఆ కుటుంబానికి హితైషిగా ఉంటాడే తప్ప, ఎలాంటి సలహాలూ ఇవ్వడు. కేవలం ప్రేక్షక పాత్ర, అంతే. తొమ్మిదెకరాల భూమినీ అమ్మకానికి పెట్టినప్పుడు కూడా పెద్దగా స్పందించని రాఘవయ్య, కూతురొచ్చి "అయితే మరి నాలుగో ఎకరం మాటేంటి నాన్నా?" అన్నప్పుడు మాత్రం నిలువునా కదిలిపోతాడు. అప్పటివరకూ సాఫీగా సాగిన కథలో ఇదే కుదుపు. రాఘవయ్య, సాంబశివరావు ఇద్దరూ సహజంగానే -లేదా- అసహజంగానే ప్రవర్తించారా? ఒక్కరు మాత్రమే సహజంగా స్పందించారా అన్నది పాఠకులు ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవల్సిందే.  చిన్నస్వామి విషయం చెబుతాడే తప్ప, వ్యాఖ్యానించడు మరి. కథ మలుపుకి కారణమైన  చిట్టెమ్మ ప్రశ్న అసహజం అనిపించే అవకాశం లేదు. 

కథా స్థలాన్ని కాస్త స్పష్టంగానే చెప్పినా, కథా కాలం విషయంలో అస్పష్టతకి చోటిచ్చారు రచయిత. ఊరి చివర కార్పొరేట్ కాలేజీ వచ్చి ఎంట్రన్స్ పరీక్షలకి కోచింగు మొదలు పెట్టడానికీ, అమెరికా మనవరాలు తాతయ్య అమ్మమ్మలతో సెల్ఫీ దిగడానికీ మధ్య కాలం కొంత సుదీర్ఘమైనది. కథాగమనం కోసం దీనిని కురచ చేసేయడంతో కథాకాలం విషయంలో కొంత అయోమయం ఏర్పడింది. చాలా చిన్నదైన కథని చెప్పే క్రమంలో నాస్టాల్జియాని చాలా ఎక్కువగా చొప్పించారు రచయిత. సన్నివేశానికి అవసరమైన చోట ఆ పాత విషయాలు చెప్పించడం కాక, వాటిని వివరించడం కోసమే సన్నివేశాలని సృష్టించారు. ఒకప్పటి వ్యవసాయ, పశుపోషణ విధానాలు, అంతరించిపోయిన కొన్ని పదాలు, పదబంధాలకి మంచి రిఫరెన్స్ ఈ పుస్తకం. కథకి అలంకారం కావాల్సిన విశేషాలన్నీ, అసలు కథని మించిపోవడం వల్ల ఈ బజ్జి పచ్చడిలో కొత్తిమీర ఎక్కువయిందనే భావన కలిగింది. ('నాలుగో ఎకరం', వెల రూ. 100, అమెజాన్ ద్వారా లభిస్తోంది). 

బుధవారం, జనవరి 20, 2021

సినిమా వంటలు

ముందుగా 'రియలిస్టిక్' సినిమాల మీద బాపూ చెప్పినట్టుగా చెలామణిలో ఉన్న ఓ జోకు: హీరో ఆఫీసు నుంచి నిదానంగా ఇల్లు చేరుకొని, అంతే నిదానంగా కుర్చీలో కూర్చుంటాడు. అతని భార్య అంతకన్నా నిదానంగా వచ్చి, చేతిలో ఫైల్ అందుకుని, 'టీ తీసుకురానా' అని అడుగుతుంది. అతను తలూపుతాడు. ఆమె వంటింట్లోకి వెళ్లి, గిన్నె కడిగి, నీళ్లతో స్టవ్ మీద పెట్టి, స్టవ్ వెలిగించి, నీళ్లు కాగాక టీ పొడి తదాదులన్నీ వేస్తుంది. టీ మరిగే వరకూ కెమెరా టీగిన్నె మీంచి కదలదు. కప్పులో పోసి తెచ్చి భర్తకి ఇచ్చి, పక్కన కూర్చుంటుంది. అతను నింపాదిగా తాగి, కప్పు కింద పెట్టాక, 'ఇంకో కప్పు టీ తీసుకురానా?' అని అడుగుతుంది. అతను జవాబు చెప్పేలోపే థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ ముక్త కంఠంతో 'వద్దూ' అని అరుస్తారు, హాలు దద్దరిల్లిపోయేలా. 

ఇప్పుడో ప్రశ్న: మన తెలుగు సినిమాల్లో వంట చేయడాన్ని చూపించిన సినిమాలెన్ని?? అలా అలనాటి 'మాయాబజార్' నుంచీ ప్రయాణం మొదలు పెడితే, ఘటోత్కచుడి వేషంలో ఉండే ఎస్వీఆర్ పళ్ళాలతో, గుండిగలతో నిండిన వంటకాల్ని చులాగ్గా ఆరగించడాన్ని చూపించారే కానీ, ఎక్కడా వంట చేయడాన్ని చూపలేదు. ఆ వంటకాలన్నీ వండబడినవి కాదు, సృష్టింపబడినవి. 'గుండమ్మ కథ' లో రామారావు పప్పు రుబ్బిపెడితే, 'బుచ్చిబాబు' లో నాగేశ్వర రావు -జయప్రద ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం  - వంటవాడిగా నటించాడు. 'దసరా బుల్లోడు' లో వాణిశ్రీ, చంద్రకళల మిరపకాయ బజ్జీల సీన్ సినిమా కథనే మలుపు తిప్పింది.  'గొప్పింటి అల్లుడు' సినిమాలో బాలకృష్ణ వంటవాడిగా హీరోయిన్ల ఇంటికొచ్చి ఒక్క పాటలోనే ఇంటిల్లిపాదికీ కావాల్సినవన్నీ వండి వార్చేస్తాడు. 'చిరునవ్వుతో' హీరో వేణు తొట్టెంపూడి వృత్తి గరిట తిప్పడమే అయినా రెండే సీన్లలో వంట చేస్తూ కనిపిస్తాడు. 

కేరక్టర్ ఆర్టిస్టుల వంట అనుకోగానే డబ్బింగ్ జానకి గుర్తోచేస్తుంది మొదటగా. స్టేజీ మీద మంజుభార్గవీ, వెనుక కమల్ హాసనూ 'బాల కనకమయ చేల' కి నాట్యం చేస్తూ ఉంటే, సాక్షి రంగారావు ట్రూపులో వంట చేసే జానకి, పప్పు రుబ్బుతూ కమల్ నాట్యాన్ని అబ్బురంగా చూడడం, ఆ దృశ్యాలని జయప్రద కెమెరాలో బంధిచడం.. 'సాగర సంగమం' చూసినవాళ్లు మర్చిపోలేని దృశ్యం. 'సప్తపది' లో ఇదే డబ్బింగ్ జానకి కోడలు పాత్రధారిణి కుంపటి రాజేసే సీన్ కూడా భలే సింబాలిక్ గా ఉంటుంది.  బాగా గుర్తుండి పోయే మరో సన్నివేశం 'సీతారామయ్య గారి మనవరాలు' లోది. సీత పెళ్లి గురించి స్త్రీ బంధు జనమంతా వంటింట్లో వాదులాడుకుంటూ ఉండగా, తనకేం పట్టనట్టుగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటుంది రోహిణి హట్టంగడి. ఏమాటకామాట, ఎంత సహజంగా వంట చేస్తుందో అసలు!! మేనత్త పప్పు రుబ్బుతుంటే, సీత తన వేలు నలిగినట్టుగా అభినయించడమూ ఉందీ సినిమాలో. 

బాలూ-లక్ష్మిల 'మిథునం' లో భోజనాలది పెద్ద పాత్ర. పెసరపప్పు రుబ్బిన పిండితో లక్ష్మి పెసరట్టు వేయడాన్ని క్లోజప్ లో చూడొచ్చు. మన సినిమాల్లో వంట సన్నివేశాలు సినిమాలో అంతర్భాగంగా ఉన్నాయి తప్ప, వంటింటి చుట్టూ మాత్రమే తిరిగే సినిమాలు రాలేదనే చెప్పాలి. మనకి మాత్రమే ప్రత్యేకమైన బోలెడన్ని రకాల వంటలున్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో మరి. అసలిదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ మధ్య చూసిన ఒకానొక మలయాళం సినిమా వల్ల. 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే టైటిల్ బాగా ఆకర్షించడంతో చూడడం మొదలు పెట్టా. సినిమా నిడివి కేవలం వంద నిమిషాలే కావడం, లాక్ డౌన్ లో మలయాళం సినిమాలు చూసిన అనుభవం ఉండడం కూడా నన్నీ సినిమా చూడడానికి పురిగొల్పాయి. సినిమాలో మూడొంతులు వంటగదిలోనే జరుగుతుంది. కేరళ మాంసాహార, శాఖాహార వంటలన్నీ వండించారు నాయిక చేత. 

ఈ సినిమా మొదట్లో కూడా, నాయిక తన భర్తకి కాఫీ ఇచ్చి, అతగాడా కాఫీని పూర్తిగా తాగాక, ఆ కప్పుని సింకులో శుభ్రంగా కడుగుతుంది, క్లోజప్పులో. అసలు ఈ సీన్ చూస్తుంటేనే నాకూ బాపూ రియలిస్టిక్ సినిమా జోకు గుర్తొచ్చింది. సినిమా ఆసాంతమూ కూడా వంటగదిలో ఆమె చేసే ప్రతి పనినీ అంతే నిశితంగా చిత్రించారు. మొదట్లో ఏంటబ్బా ఇదీ అనిపించినా, రానురాను ఆసక్తి పెరిగి, చివరికొచ్చేసరికి ఆ షాట్ల ఆంతర్యం బోధ పడింది. వంటపని ఒక 'డ్రెడ్జరీ' గా ఎందుకు మారుతుందన్నది సులువుగా తెలిసేలా ఉన్నాయి సన్నివేశాలు. సినిమా ఆసాంతామూ కిచెన్ ఇతివృత్తంతోనే తీసిఉంటే మరింత బాగుండేది కానీ, రెండేళ్ల నాటి ఈ సినిమా రెండో సగంలో అప్పటి ట్రెండింగ్ టాపిక్ వైపుకి కథని మలుపు తిప్పారు. దీనివల్ల అసలు పాయింట్ కి కాస్త అన్యాయం జరిగిందన్న భావం కలిగింది, సినిమా పూర్తయ్యాక. 

'మన దగ్గర ఇలాంటి సినిమాలు ఎందుకు రావు?' అన్న ప్రశ్న మలయాళం సినిమాలు చూసే ప్రతిసారీ వచ్చేదే కానీ, ఈ సారి మాత్రం 'కిచెన్ చుట్టూ తిరిగే కథల్ని తెలుగులో ఇంకా బాగా చెప్పే వీలుంటుంది కదా' అనిపించింది. మొన్నటి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఇతివృత్తం 'బొంబాయి చట్నీ' అయినప్పటికీ అందులో కూడా మెయిన్ పాయింట్ కి జరగాల్సిన న్యాయం జరగలేదు. జంధ్యాల కూడా 'బాబాయ్ హోటల్' సినిమాలో కాసేపు మాత్రమే హోటల్ని చూపించి, తర్వాత కథనంతా బాబాయి చుట్టూ తిప్పేయడం, శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్-బిర్యానీ' కూడా టైటిల్ ని దాటి ఎటో వెళ్లిపోవడం మనకి తెలిసిందే. భోజనం అనేది మనుషులందరికీ సంబంధించిన విషయం కాబట్టి, విషయాన్ని సరిగా చెబితే ప్రేక్షకులు 'కనెక్ట్' కాకపోవడం అనే ప్రశ్న ఉండదు. కిచెన్ కథల్ని మన సినిమా వాళ్ళు ఎప్పుడు వండుతారో.. 

సోమవారం, జనవరి 18, 2021

మౌనసుందరి

కవి, రచయిత, నాటక కర్త, విమర్శకుడు ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి రచనల్ని పునర్ముద్రిస్తుండడం సాహిత్యాభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఇప్పటికే వారి ఆత్మకథ 'గౌతమీ గాథలు' అచ్చులోకి వచ్చి ఈ తరం వారి అభిమానాన్ని కూడా చూరగొంది. పందొమ్మిదివందల ముప్ఫయ్యో దశకంలో మొదలు పెట్టి తర్వాతి యాభయ్యేళ్ళ కాలంలో హనుమచ్చాస్త్రి రాసిన కథలు అక్షరాలా ఇరవై తొమ్మిది. వీటిలో ఒక్క అలభ్య కథ మినహా, మిగిలిన 28 కథలతో 'అనల్ప' ప్రచురణ సంస్థ తీసుకువచ్చిన సంకలనమే 'మౌన సుందరి.' ఏ కథా ఆరేడు పేజీలకి మించక పోవడమూ, మానవ మనస్తత్వాన్ని ఇతివృత్తంగా చేసుకుని సాగేవే కావడమూ ప్రధాన ఆకర్షణ. కథలన్నీ కాలపరీక్షకి నిలబడేవి కావడం మరో విశేషం. 

మూఢాచారాల పట్ల విముఖత, కొత్తని ఆహ్వానించాలనే ఉత్సాహం, కొద్దిపాటి ఆదర్శాలు, స్త్రీ పక్షపాతం ప్రధానంగా కనిపిస్తాయీ కథల్లో. మధ్యతరగతి జీవితాలు, వాటిలో వేదనలు, చిన్నపాటి ఆనందాలూ కూడా కథా వస్తువులే. వస్తు వైవిధ్యంతో పాటు, సరళమైన భాష, చదివించే గుణం పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వవు. విలువలని గురించే చెప్పే 'ఆశ్రమవాసి' తో మొదలయ్యే ఈ సంకలనంలో రెండో కథ 'మౌనసుందరి,' శిల్పాన్ని ప్రతీకగా ఉపయోగించారిందులో. మూడో కథ 'అందని ఆశలు' అప్రాప్త మనోహారిని గురించిన కథ. ఆశ్రమంలో స్వేచ్ఛగా ఎదిగిన అమ్మాయి 'వనదేవతలు' లో నాయిక. పిరికి ప్రేమికుడికి రైల్లో అనుకోకుండా తారసపడే మాజీ ప్రేయసి 'శర్వాణి' కాగా స్నేహితుడికి భార్యతో పొరపొచ్చం రాకుండా ఉండేందుకు సాయపడే మిత్రుడి కథ 'విజయదశమి.' ఈ కథే తర్వాతి కాలంలో కొన్ని మలుపులతో 'చక్రభ్రమణం' నవలాగానూ, 'డాక్టర్ చక్రవర్తి' సినిమాగానూ వృద్ధి చెంది ఉండొచ్చనిపించింది. 

రొమాంటిక్-హర్రర్ జానర్ లో రాసిన కథ 'రేరాణి' కాగా, కల కాని కలని వర్ణించే కథ 'స్వర్గ ద్వారాలు.' రాజాశ్రయం కోరే శిల్పి కథ 'తలవంచని పువ్వులు' చదువుతుంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'గులాబీ అత్తరు' గుర్తుకు రాకుండా ఉండదు. యవ్వనంలో తాను ద్వేషం పెంచుకున్న యువకుడే జీవితపు తర్వాతి దశలో సన్యాసిగా కనిపించినప్పుడు ఆమె ఎలా స్పందించిందో 'నిప్పు నుంచి నీరు' లో చిత్రిస్తే, వర్షపు రాత్రి ఓ బిచ్చగత్తె కడుపాకలికి రూపు కట్టిన కథ 'ఆకలి మంటలు.' అలనాటి వివాహ వేడుకని కళ్లముందుంచే 'వివాహ మంగళం'లో మెరుపు ముగింపు పాఠకులని చకితుల్ని చేస్తుంది. ఈ కథ రచయిత స్వీయానుభవమే అని 'గౌతమీ గాథలు' చెబుతుంది. 'యతి ప్రాస మహాసభ' 'కల నిజమైంది' ఈ కథలు రెండూ సాహిత్య సభల నేపధ్యంగా సాగేవి. 

గల్ఫికలా అనిపించే కథానిక '6 నెంబరు గది' లో నాయిక సమయస్ఫూర్తి గుర్తుండిపోతుంది. భావకవుల మీద ఎక్కుపెట్టిన సెటైర్ 'కళాభాయి' కాగా, పైమెరుగులకి భ్రమపడి, మోసపోయి, తిరగబడ్డ స్త్రీకథ 'ప్రేమ దొంగలు.' వేశ్యకి తారసపడే ఆదర్శపురుషుణ్ణి 'చీకటి బ్రతుకులు' కథలో చూడొచ్చు. తర్వాతి కాలంలో ఈ ఇతివృత్తంతో పదులకొద్దీ కథలొచ్చాయి. 'వినోద యాత్ర' కథ కాలేజీ విద్యార్థుల ఎక్స్ కర్షన్ సరదానీ, చరిత్ర పట్ల మన నిర్లక్ష్యాన్నీ చిత్రిస్తూనే, సంప్రదాయాన్ని కేవలం డాంబిక ప్రదర్శనకి ఉపయోగించే వారి వీపున చరుస్తూ ముగుస్తుంది. 'రెండు ముఖాలు' లో ఓ అంతర్ముఖుడి ఆలోచనాస్రవంతిని చిత్రించారు రచయిత. మరో మెరుపు ముగింపు కథ 'బస్సులో.' బాబాలు, స్వామీజీలు ఇతివృత్తంగా రాసిన రెండు కథల్లో ఇది మొదటిది కాగా, రెండోది 'స్వర్ణయోగం' - ఈ కథకీ మెరుపు ముగింపునే ఇచ్చారు హనుమఛ్ఛాస్త్రి. 

స్త్రీ సాధికారికతని చిత్రించిన 'దౌర్జన్యం', చలం సాహిత్యాన్ని గుర్తు చేసే కథ. దొంగలు ఎలా తయారవుతారో 'వెలుగు-నీడలు' చెబుతుంది. చదవడం పూర్తి చేసేసరికి దాహంతో నాలుక పిడచకట్టినట్టు అనిపించే కథ 'ఎండమావులు.' ఈ కథకీ మెరుపు ముగింపే ఇచ్చారు. ఆదర్శాలు పాటిస్తూ జీవించాలనుకునే యువకుడికి ఎదురయ్యే అవరోధాలని చిత్రించిన కథ 'వ్రణకిణాంకాలు.' పేరు కాస్త కంగారు పెట్టినా, కథ ఆసాంతమూ సాఫీగా సాగిపోయింది.  ప్రేమలేఖ రాసిన యువకుడికి మర్చిపోలేని పాఠం చెప్పిన యువతి కథ 'దొంగలున్నారు, జాగ్రత్త!' నాయిక శకుంతల గుర్తుండిపోతుంది.మతసామరస్యాన్ని చెప్పే చిన్న కథ 'మా విద్విషావహై' కి చరిత్రని నేపధ్యంగా తీసుకున్నారు. 'గౌతమీ గాథలు' చదివిన వాళ్ళకి చాలా కథల నేపధ్యాలు సులభంగానే అర్ధమవుతాయి. కొన్ని కథలైతే "తిలక్, బుచ్చిబాబు కలిసి రాశారా?!!" అన్న ఊహ కలిగింది చదువుతున్నంతసేపూ. 

"శాస్త్రి గారు సంప్రదాయ బద్ధంగా సంస్కృతాంధ్రాలు అధ్యయనం చేసిన 'ఉభయభాషా ప్రవీణు' లైనా - అయన దృక్పధం మాత్రం ఆధునికం. నవ్యత ఎక్కడ కనిపించినా దానిపట్ల ఆకర్షితులు కావడం ఆయన స్వభావంలో వుంది. తరచుగా యువ రచయితలతో, పాఠకులతో సన్నిహితంగా మసలుతూ, మారుతూ వస్తున్న అభిరుచులపట్ల, తన దృక్పథాన్ని స్ఫష్టంగా ప్రకటించడం ఆయన అలవాటుగా ఉండేది. గొప్ప సౌందర్యాలను కలగనడం, ఆవేశంతో చలించిపోవడం, అందని అంశాల పట్ల సంతృప్తి, అందువల్ల తిరుగుబాటు ధోరణి, శ్రీ హనుమఛ్ఛాస్త్రిలో జితించిపోయాయి" అన్నారు ముందుమాట రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జానకీబాల (హనుమఛ్ఛాస్త్రి కుమారుడు, కోడలూ). సంపుటంలో ఏ నాలుగు కథలు చదివినాఈ మాటలు అక్షరసత్యాలని బోధ పడుతుంది. 'మౌనసుందరి' పేజీలు 216, వెల రూ. 175, ముద్రణ, నాణ్యత బాగున్నాయి. అమెజాన్ లో లభిస్తోంది.

సోమవారం, జనవరి 11, 2021

సోమవారం, జనవరి 04, 2021

యారాడకొండ

ప్రతి ప్రాంతానికీ ఓ చరిత్ర ఉంటుంది. ఆ ప్రాంతాలు నగరాలు, మహా నగరాలూ అయినట్లయితే కళ్లెదుటే  చరిత్రలో పేజీలు చకచకా తిరిగిపోతాయి. కాలంతో పాటు వచ్చిన మార్పుల్ని అదే క్రమంలో ఒడిసి పట్టుకుని, కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా వాస్తవ జీవితాలనుంచి కల్పిత పాత్రల్ని తీసుకుని, 'నిజంగా జరిగిందేమో' అనిపించేలాంటి కథని సృష్టించడం కత్తిమీది సాము. ఆ సాముని అలవోకగా పూర్తిచేయడమే కాక, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి నవలల పోటీలో బహుమతినీ అందుకున్నారు ఉణుదుర్తి సుధాకర్. కథకుడిగా తెలుగు సాహిత్యానికి పరిచయమైన సుధాకర్ రాసిన మొదటి నవల 'యారాడకొండ.' మహానగరం విశాఖ చరిత్రలో ఓ నలభై ఏళ్ళ కాలంలో జరిగిన మార్పుల్ని సునిశితంగా చిత్రించిన నవల ఇది. 

విశాఖపట్నం అంటే కేవలం జాలరిపేట, సోల్జరు పేట, చంగల్రావు పేట మాత్రమే ఉన్న కాలంలో మొదలయ్యే ఈ కథ ఆ చిన్న ఊరు పట్టణంగా, నగరంగా, మహా నగరంగా విస్తరించడాన్ని చిత్రించింది. విశాఖని తలచుకోగానే మొదట గుర్తొచ్చేది సముద్రమే, అలాగే ఈ నవల్లో ప్రధాన పాత్రల్లో అత్యధికం జాలరి కుటుంబ నేపధ్యం నుంచి వచ్చినవి. ఓ తుపాను రాత్రి ఐదుగురు మత్స్యకారులతో నడిసముద్రంలో దారితప్పిన ఓ నాటు పడవని, ఒక పెద్ద సముద్రపు ఓడ ఢీ కొట్టడంతో మొదలయ్యే కథ, ఊహించని మలుపులు తిరుగుతూ, ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివిస్తుంది. ఆ మత్య్సకారులు కుటుంబాల జీవితాలనీ, ఓడ కెప్టెన్ జీవితాన్నీ సమాంతరంగా చిత్రిస్తూ సాగే కథనాన్ని 'యారాడకొండ' గొంతు నుంచి వినిపించారు రచయిత. 

ఔను, పడవ ప్రమాదానికి, దానికి ముందూ, వెనకా జరిగే సంఘటనలకీ ప్రత్యక్ష సాక్షి అయిన యారాడకొండే ఈ కథని పాఠకులకి చెబుతుంది. ప్రమాదానికి గురైన బోటు యజమాని గంగరాజు కుటుంబానికి ఆంగ్లో-ఇండియన్ అయిన ఓడ కెప్టెన్ కుటుంబం సాయపడడం కథలో మొదటి మలుపైతే, ప్రమాదం నుంచి బయటపడ్డ గంగరాజు టీనేజీ మేనల్లుడు నూకరాజు చేపల వేట నుంచి చదువు మీదకి దృష్టి మరల్చడం రెండో మలుపు. అటు గంగరాజు పిల్లలు వెంకటేశు, ఎల్లమ్మ, ఇటు నూకరాజు పై చదువులు చదవడం, కెరీరిస్టులుగా మారిపోకుండా తమ చుట్టూ జరుగుతున్న మార్పులని పట్టించుకుని, నమ్మిన సిద్ధాంతాల ఆచరణ కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు చేసిన ప్రయత్నాల్ని, వాళ్ళ పిల్లల తరం వచ్చేసరికి విలువల్లో వచ్చిన మార్పునీ పాఠకులకి చెబుతుంది యారాడకొండ.


ఇది కేవలం మత్స్యకారులు, ఆంగ్లో-ఇండియన్ల కథ మాత్రమే కాదు. భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి, నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితుడై తన బ్రాహ్మణ అస్థిత్వాన్ని చెరిపేసుకోడానికి తాపత్రయ పడే భాస్కర్, గుంటూరు ప్రాంత చౌదరి కుటుంబంలో పుట్టి, తమిళ దళితుడు సెల్వాన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ కమల, కోస్తాంధ్ర నుంచి విశాఖకు వ్యాపారం కోసం వచ్చి రాజకీయంగానూ చక్రం తిప్పిన శాంతమూర్తి, అతని బావమరిది రొయ్యలనాయుడు, తన విద్యార్థి నూకరాజు మీద అవ్యాజమైన అనురాగాన్ని చూపించే అధ్యాపకుడు కృష్ణారావు, తోటి విద్యార్థుల్ని నక్సల్బరీ ఉద్యమంలోకి ప్రోత్సహించి తను మాత్రం సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకున్న మలయాళీ గిరిధర్ నాయర్... ఇలా ఎందరెందరి కథలో ప్రధాన కథలో అంతర్భాగంగా కలగలిసిపోయాయి. 

కథాకాలంలో విశాఖ వేదికగా జరిగిన ప్రతి ఉద్యమానికీ నవల్లో చోటిచ్చారు  రచయిత. ప్రధాన పాత్రలు నూకరాజు, భాస్కర్ లకి వామపక్ష రాజకీయాలంటే అభిమానం. ఈ కారణంగా నవల వామపక్ష రాజకీయ దృష్టికోణాన్ని ప్రధానంగా చూపిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీల మీద, భావజాలాల మీదా సెటైర్లు కనిపిస్తాయి. అయితే ఎక్కడా సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకపోవడం పెద్ద రిలీఫ్. ఈ నవల నక్సల్బరీ ఉద్యమాన్ని, హింసనీ ప్రోత్సహించదు. వ్యాపారానికి-రాజకీయానికి మధ్య ఉన్న లంకెని వివరించడానికి, విశాఖ మీద పెరిగిపోతున్న 'బయటి వాళ్ళ' పెత్తనాన్ని ఆక్షేపించడానికీ ఈ రచన వెనుకాడలేదు. అదే సమయంలో స్థానికుల వెనుకబాటుకు కారణాలనీ విశ్లేషిస్తుంది. ఒక్కొక్కటీ పది పేజీలు మించని పద్దెనిమిది అధ్యాయాలుగా కథని విభజించడమే కాక, సంభాషణలు, సన్నివేశ చిత్రణలో ఆసాంతమూ క్లుప్తతని పాటించారు రచయిత. 

'ఉపోద్ఘాతం' పేరుతో మొదలయ్యే మొదటి అధ్యాయం మొదటిసారి చదివినప్పుడు జాగ్రఫీ పాఠాన్ని తలపిస్తుంది. మరీ ముఖ్యంగా విశాఖని గురించి ఏమాత్రం తెలియని పాఠకులకి ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. మొత్తం నవలని పూర్తి చేశాక ఈ అధ్యాయాన్ని మరోసారి చదవాలి. 'తుపాను రాత్రి' అధ్యాయంలో కథ మొదలై, 'జమీలా' లో పరుగందుకుంటుంది. విశాఖతోనూ, గత శతాబ్దపు డెబ్భైల నుంచి నిన్న మొన్నటి వరకూ జరిగిన వామపక్ష ఉద్యమాలతోనూ రేఖామాత్రపు పరిచయం ఉన్నవాళ్ళు కూడా కల్పితమైన ప్రధాన పాత్రల చిత్రణకి స్ఫూర్తినిచ్చిన నిజ జీవితపు వ్యక్తులని పోల్చుకో గలుగుతారు. మొత్తం 206 పేజీలున్న ఈ నవల వెల రూ. 225. (ఇంత వెలపెట్టినందుకైనా ముద్రణలో మరికాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది). అమెజాన్ ద్వారా లభిస్తోంది.