సోమవారం, సెప్టెంబర్ 30, 2019

సిమ్లా మిర్చి కూర

సిమ్లా మిర్చితో చేసే బజ్జీలు భలే రుచిగా ఉంటాయి. మామూలు మిరపకాయల్లో ఉండే కారం వాటిలో ఉండదు కదా, కమ్మని రుచితో మరిన్ని తినాలనిపిస్తాయి. కానయితే శనగపిండి, డీప్ ఫ్రై ఇవన్నీ చూడగానే డాక్టరు, లెక్చరు గుర్తొస్తాయి. తక్కువ పిండి, నూనెతో ఇంచుమించు బజ్జీ రుచితో ఉండే వంటకం ఒకటి ఆమధ్య ఒక చోట రుచి చూశాను. హోస్టుని అడిగి రెసిపీ జ్ఞాపకం పెట్టుకున్నాను. అవకాశం దొరకడంతో వండేశాను. ఆ వంటకం పేరే సిమ్లా మిర్చి కూర. మిర్చి బజ్జీకి కావాల్సిన దినుసులే. ఎటొచ్ఛీ మిరపకాయలు మినహా మిగిలినవన్నీ తక్కువ పరిమాణంలో సరిపోతాయి.  

మార్కెట్ నుంచి మిరపకాయలు ఎంచి తెచ్చుకోవడం (అన్నీ దాదాపు ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి) వరకూ బాగానే జరిగిపోయింది కానీ, అసలు కథ ఆ తర్వాతే మొదలయ్యింది. గుత్తి వంకాయ కూరకి వంకాయ ముచికలు సగానికి కోసినట్టుగా ఈ మిరపకాయలకి కూడా ముచికలు కొయ్యాలి. ఆ తర్వాత ఒక నిలువు చీలిక పెట్టి లోపలున్న గింజలన్నీ తీసేయాలి. వినేప్పుడు 'ఇదెంతపని' అనిపించింది కానీ, దిగాకే లోతు తెలిసింది. డాక్టర్లు సర్జరీ చేసినంత నేర్పుగా అనడం అతిశయోక్తిలా వినిపిస్తుందేమో కానీ, ఇంచుమించు అంత నేర్పూ అవసరం. 


మిర్చి విరిగిపోకండా, మొత్తంగా చీలిపోకుండా చూసుకుంటూనే, గింజలన్నీ బయటికి తెచ్చేయాలి. నేనైతే, మొత్తం నాట్లు పెట్టే పనయ్యాక, ఒక్కో మిర్చీకి షవర్ బాత్ చేయించాను. గింజల్ని వదుల్చుకున్న మిర్చీలన్నిటినీ ఓ చిల్లుల బుట్టలో వాడేసి, తర్వాత పనికి ఉపక్రమించాను. (ఈ స్టెప్పుని నేను సరిగ్గా వినకపోవడం వల్ల హోస్టు గారికి ఫోన్ చేసి మరోసారి కనుక్కోవాల్సి వచ్చింది, ఆవిడ పాపం ఓపిగ్గా మళ్ళీ చెప్పారు). ఇంతకీ ఇప్పుడు చేయాల్సిన పని స్టఫింగ్ రెడీ చేసుకోవడం. నేను చేసిన పధ్ధతి చెబుతున్నాను కానీ, ఇలా మాత్రమే చేయాలన్న రూలేమీ లేదు. ఈ స్టఫింగ్ రుచులలో ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు మార్పులు చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది (ఇది కూడా ఆవిడ మాటే). 

ముందుగా ఓ చిన్న కప్పులో చింతపండు తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాను. స్టవ్ మీద బాండీ వేడి చేసి, తగినంత శనగపిండిని దోరగా వేయించాను. నూనె అక్కర్లేదు, డ్రై రోస్టు సరిపోతుంది. వేగిన పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో వాము, ఉప్పు, కారం తగు పాళ్ళలో వేసి కలిపాను. (మొన్నామధ్య నేను చేసిన సాంబారు మా పనామెకి ఇస్తే, మర్నాడొచ్చి "ఉప్పెక్కువయ్యింది, అంతంత ఉప్పు తినడం ఒంటికి మంచిది కాదు" అని కుండ బద్దలు కొట్టేసింది. ఆమె 'సంసారం ఒక చదరంగం' లో చిలకమ్మలాగా మా  విషయాల్లో కొంచం చనువు తీసేసుకుంటూ ఉంటుంది, ఏమీ చేయలేం). ఈ మిశ్రమాన్ని చెంచాతో బాగా కలిపి పక్కన పెట్టాను. 

నానిన చింతపండు నుంచి రసం తీసి, ఆ రసాన్ని పిండిలో కలిపాను. మిశ్రమాన్ని గరిటజారుగా చేయడానికి కొంచం నీళ్లు కూడా కలిపి రుచి సరిచూసుకోవడంతో రెండో అంకం పూర్తయ్యింది. చివరి స్టెప్పు దగ్గరికి వస్తే, ఫ్లాట్ గా ఉన్న దోశల పెనం స్టవ్ మీద పెట్టి, వేడెక్కుతూ ఉండగా ఓ మూడు చెంచాల నూనె వేసి, ఆ నూనె పెనమంతా పరుచుకునేలా కదిపాను. స్టవ్ సిమ్ లో ఉంచి, ముందుగా సిద్ధం పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని (మాలతీ చందూర్ గారి 'ముందుగా తరిగిపెట్టుకున్న కూర ముక్క'ల్లాగా) ఒక్కో మిర్చి లోనూ కూరి - ఒక్కో మిర్చిలో ఒక్కో చిన్న చెంచాడు చొప్పున వేశా - పెనం మీద పరిచాను. ఇక మిగిలింది సూపర్వైజింగ్ పనే. 


అప్పుడప్పుడు మిర్చీలని కదుపుతూ,  అడుగువైపున వేగిన వాటిని తిరగేస్తూ, రెండు పక్కలా వేగినవాటిని పెనం మీంచి తీసేసి వేరే బౌల్ లోకి మారుస్తూ అరగంట గడిపితే ఎర్రెర్రని సిమ్లా మిర్చీ కూర నోరూరిస్తూ రెడీ అయిపోయింది. కాస్త నెయ్యి తగిల్చిన వేడన్నం ముద్దలు, మిర్చీ కాంబినేషన్ భలేగా కుదిరింది. మా హోస్టు ముద్దపప్పుతో వడ్డించారు కానీ, విడిగా అన్నంతో కూడా కూర బావుంది. ఉప్పుకారాల పాళ్ళు సరిపోయినట్టు అనిపించడంతో పనామెకి ఇచ్చే ధైర్యం చేశాం. చెప్పకపోడమేం, ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో అని గుండెలు బితుకు బితుకు మంటున్నాయి. 

గురువారం, సెప్టెంబర్ 26, 2019

ఇల్లేరమ్మ - సోమరాజు సుశీల

దాదాపు పాతికేళ్ల క్రితం మాట.. ఇంటికొచ్చిన బంధువొకరు తను  ప్రయాణంలో చదువుకోడానికి కొనుక్కున్న వారపత్రికని వెళ్తూ వెళ్తూ మా ఇంట్లో వదిలేసి వెళ్లారు. కాలక్షేపానికి నేనా పుస్తకం తిరగేస్తూ ఓ చోట ఆగిపోయాను. 'మేమందరం ఇంకో ఊరికి.. ఏలూరికి' పేరుతో ఓ చిన్న కథ. చదవడం మొదలెట్టగానే చిన్నప్పుడు నేనాలోచించినట్టే ఆలోచించే పాత్ర పరిచయం అయ్యింది. పోస్టుమాన్ టెలిగ్రామ్ తెస్తే ఎవరో చచ్చిపోయిన వార్త పట్టుకొచ్చాడని అనేసుకోడం మొదలు, సినిమాల్లో కుటుంబం అంతా కలిసి పాడుకునే పాటని ఇంట్లో అందరూ గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ ఎప్పుడైనా విడిపోయినా మళ్ళీ కలవడానికి పనికొస్తుందన్న ఆలోచన వరకూ.. ఆ కథ అలా గుర్తుండిపోయింది. ఆ పాత్ర పేరు ఇల్లేరమ్మ. సృష్టికర్త డాక్టర్ సోమరాజు సుశీల. 

కొన్నేళ్లు గడిచాక 'ఇల్లేరమ్మ కతలు ఆవిష్కరణ' అంటూ పేపర్లో వార్త. ఆవిష్కరించిన బాపూ రమణలు రచయిత్రి సోమరాజు సుశీలని అభినందించారని చదవగానే 'మేమందరం ఇంకో ఊరికి..' చటుక్కున గుర్తొచ్చింది. వెంటనే పుస్తకం కొని 'గణేశా ఈశా' మొదలు 'అయితే నా రెండెకరాలూ గోవిందేనా' వరకూ పుస్తకంలో ఉన్న కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేశాను, దాదాపు నోటికొచ్చేసేలా. చదివేశాను అనడం అతిశయోక్తి,  ఆ కథలు చదివించేశాయి అనడం నిజం. ఒక్క ఆలోచనలే కాదు, ఇంటి వాతారణం మొదలు, పాటించే ఆచారాలు, బంధువులు, గృహ రాజకీయాలు.. వీటన్నింటిలో పోలికలు కనిపించడం  వల్లనేమో ఇంటిల్లిపాదీ ఆ పుస్తకాన్ని 'సొంతం' చేసేసుకున్నాం. అద్దిల్లు వెతుక్కోడం మొదలు, పాలు పొంగేప్పుడు 'పొంగిపోతున్నాయీ' అనకూడదు అనడం వరకు  ఎన్ని విషయాలు నేర్పిందో ఇల్లేరమ్మ. 

కేవలం సరదా కబుర్లే కాదు, 'మిథునం' లో  బుచ్చిలక్ష్మి చెప్పినట్టు 'బరువు తగ్గించే మాటలు' ఎన్నో చెప్పింది ఇల్లేరమ్మ. 'పెరట్లో జామచెట్టు ఉన్నవాళ్ళకి ఉయ్యాలూగొచ్చని తెలీదు. తెలిసిన వాళ్లకి జామచెట్టు ఉండదు'  ఎంతగొప్ప జీవితసత్యం! చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటివి ఎన్నో. బంధుమిత్రుల్లో చదివే అలవాటున్న వాళ్లందరికీ 'ఇల్లేరమ్మ కతలు' కాపీలు పంచడం అనే కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే, ' దీపశిఖ' కధాసంపుటి మార్కెట్లోకి వచ్చింది. ఈలోగానే 'చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు' చదవడం పూర్తయ్యింది. చెప్పకపోడమేం, ఈ రెండు పుస్తకాలూ కూడా 'ఇల్లేరమ్మ కతలు' ముందు తేలిపోయినట్టు అనిపించాయి. తర్వాత వచ్చిన 'ముగ్గురు కొలంబస్ లు' ట్రావెలాగ్లు ఇలా కూడా రాయొచ్చు అని నిరూపించిన పుస్తకం. 

కొందరు రచయితలు కొన్ని పాత్రలు సృష్టించడానికే పుడతారేమో.. గురజాడ 'మధురవాణి,' ముళ్ళపూడి 'బుడుగు,' పతంజలి 'వీరబొబ్బిలి' ఇలా జాబితా వేస్తే డాక్టర్ సోమరాజు సుశీల 'ఇల్లేరమ్మ' ని చేర్చి తీరాలి. రాశిగా చూస్తే ఆధ్యాత్మిక రచనలతో కలిపి సుశీల పుస్తకాలు రెండు పుంజీలకి మించకపోవచ్చు. కానీ వాసిలో ఎంచితీరాల్సినవి. ఐ డ్రీమ్స్ వాళ్ళ 'అక్షర యాత్ర'  సిరీస్ లో డాక్టర్ సి. మృణాళిని, డాక్టర్ సుశీలని ఇంటర్యూ చేసినప్పుడు 'ఐ డ్రీమ్స్ వాళ్ళు చేస్తున్న మంచిపనుల్లో ఇదొకటి' అనిపించింది నాకు. మృణాళిని ఇంటర్యూ నిర్వహణని గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు కానీ, నవ్వుతూ, నవ్విస్తూనే తాను చెప్పదల్చిన విషయాలని చాలా స్పష్టంగా చెప్పారు సుశీల. 


ఇంటర్యూ వచ్చిన కొన్నాళ్ళకి ఇల్లేరమ్మని ముఖాముఖీ కలుసుకునే అవకాశం వచ్చింది, అదికూడా చాలా యాదృచ్చికంగా. 'ఇల్లేరమ్మ కతలు' గురించి ఎన్నో ప్రశ్నలు అడిగినా, ఆమె తను చెప్పదల్చుకున్న విషయాలు మాత్రమే చెప్పారు. "మీ హిందీ మేస్టార్ని కల్లో చంపేయడం గురించి చెప్పండి" అని ఎన్ని సార్లు అడిగినా ఇంకేదో చెప్పి మాట దాటేశారు తప్ప, అసలు విషయం మాత్రం చెప్పలేదు. 'జామచెట్టు ఉయ్యాల' ని ప్రస్తావిస్తే,  సువర్ణ అకాల మరణాన్ని తల్చుకుని బాధపడ్డారు. 'హరేరామ' తాతగారి గురించి, 'పుంగోణం' గురించి, 'చంద్రరావు' గురించీ బోల్డన్ని కబుర్లు చెప్పారు. గొప్ప  రచయితలతో సన్నిహితంగా మసిలినా వాళ్ళ పుస్తకాలేవీ చదవలేదని, ఆ విషయం ఆయా రచయితలకి కూడా తెలుసనీ చెప్పారు. 

ఆవిడ మాటలు వింటున్నంతసేపూ రచన  అన్నది ఆవిడకి సహజాతం అనిపించింది. ఆవిడ మాటలన్నీ ఆవిడ కథల్లో వాక్యాల్లాగే ఉన్నాయి. ఏ  విషయాన్ని గురించైనా ఆవిడ చెప్పే పధ్ధతి కథ చెప్పినట్టే ఉంటుంది. చిన్న సంఘటనకి కూడా బోల్డంత హాస్యాన్ని, వ్యంగ్యాన్ని రంగరించి చెప్పడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య అని అర్ధమయ్యింది. చాలామంది రచయితలు వాళ్ళ రచనల్లో దొరకరు. రచయితలకీ, రచనల్లో పాత్రలకే పోలికే ఉండదు. కానీ, సోమరాజు సుశీల ఇందుకు మినహాయింపు. తను నవ్వుతూ, చుట్టూ ఉన్నవాళ్ళని నవ్వించడం, ఆ నవ్వుల మధ్యలో అనేక జీవితసత్యాలని అలవోకగా చెప్పడం ఆవిడ తన రచనల్లో రాయడం మాత్రమే కాదు, ఆచరించీ చూపించారు.  నొప్పించక, తానొవ్వక ఉంటూనే తప్పించుకోకుండా నిలబడడం ఆమె ప్రత్యేకత. ఆమె ఇకలేరన్న వార్త వినగానే మొదటగా అనిపించిన మాట 'హంసలా ఆర్నెల్లు...' ఎలా బతకాలో చూపించి వెళ్ళిపోయిన డాక్టర్ సోమరాజు సుశీల ఆత్మకి తప్పక శాంతి కలుగుతుంది. 


బుధవారం, సెప్టెంబర్ 25, 2019

ఓడను జరిపే ...

"తరాలు మారే జతలే, స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే, సృజించే మూడో తనువే.."


సినీరంగ శ్రీనాధుడు వేటూరి సుందర రామ్మూర్తికి సద్గురు త్యాగరాజస్వామి మీద ఉన్న గౌరవం తెలిసిందే. అనేక త్యాగరాజ కృతుల్ని తన పాటల్లో సందర్భానికి అనుగుణంగా ఉపయోగించుకున్నారు వేటూరి.  కొత్తగా పెళ్ళైన ఓ యువజంట సల్లాపాలనూ, ఆ ఇద్దరు, ముగ్గురవుతున్న సంతోషాన్నీ వర్ణించే క్రమంలో వచ్చే పాటకి పల్లవిగా త్యాగరాజ విరచిత 'నౌకా చరిత్రము' లో ఓ కృతిని ఎంచుకోవడం, ఇటు సందర్భానికి అటు కృతికీ కూడా అతికినట్టు చరణాలు రాయడం ఈ పాటలో విశేషం. 

'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా అనూహ్య విజయం సాధించడంతో మరికొందరులు నిర్మాతలు ఆ తరహా సినిమాల నిర్మాణం మీద దృష్టి సారించారు. ఆ సినిమా  ప్రధాన తారాగణం నాగేశ్వరరావు, మీనాలతో పాటుగా దర్శకుడు క్రాంతికుమార్ తో 'రాజేశ్వరి కళ్యాణం' చిత్రాన్ని నిర్మించారు నటుడు, నిర్మాత మురళీమోహన్. సంగీత ప్రధానంగా సాగే ఈ సినిమాలో త్యాగరాజ కృతుల్ని సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. 

ఇప్పుడు చెప్పుకుంటున్న పాట కథని ముందుకు తీసుకెళ్లే సందర్భ గీతం, రెండు జంటలు పాడుకునే యుగళగీతం కూడాను. వృద్ధ జంట మాస్టారు, సీత (నాగేశ్వరరావు, వాణిశ్రీ), యువజంట శంకరం, రాజేశ్వరి (సురేష్, మీనా) లపై ఈ గీతాన్ని చిత్రించారు క్రాంతికుమార్. 

కథ ప్రకారం, మాస్టారు, సీత శాస్త్రీయ సంగీతాభిమానులు. సంతానం లేని ఆ జంటకి రాజేశ్వరి అంటే అభిమానం. ఆమె సవతి తల్లి (జయచిత్ర)ని ఎదిరించి మరీ రాజేశ్వరి ప్రేమించిన యువకుడితో ఆమె పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత ఆ జంటని తమతోపాటే ఉండిపొమ్మంటారు. వడియాలుపెట్టుకుంటూ సీత తీసే కూనిరాగంతో పాట ఆరంభమవుతుంది. 

"ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడూ..
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచు అందరు చూడగా.."

ఇది యధాతధంగా 'నౌకా చరిత్రము' నుంచి తీసుకున్నదే. త్యాగరాజు రచించిన రెండు సంగీత నాటకాల్లో 'నౌకా చరిత్రము' ఒకటి (రెండోది 'ప్రహ్లాద భక్తి విజయం' ). బాలకృష్ణుడి లీలల్ని వర్ణించే ఈ నాటకాన్ని తర్వాతి కాలంలో నృత్య నాటకంగానూ మార్చి ప్రదర్శనలు ఇచ్చారు/ఇస్తున్నారు శాస్త్రీయ నృత్య కళాకారులు. 

పల్లవి తర్వాత వచ్చే తొలిచరణంలో యువజంట ముద్దు ముచ్చట్లని చిత్రించారు దర్శకుడు. నది ఒడ్డున ఇంట్లో ఉండే జంటకి ఏకాంతం కావాలంటే పడవే శరణ్యం మరి. (చిత్రీకరణలో ఈ చరణానికి న్యాయం జరగలేదనిపిస్తుంది నాకు) 



"వలపుతడీ తిరణాలే పొంగిన యేటికి అందం..
కెరటాలకు వయ్యారం, కరిగే తీరం..
తిలకమిడే కిరణాలే.పొద్దుటి తూరుపుకందం..
చినదానికి సింగారం, సిగమందారం.. 

పదాల మీదే పడవ, పెదాలు కోరే గొడవ.. 
ఎదల్లో మోగే దరువే, కదంగా నావే నడవ..
ఇలా నీలాటిరేవులో..." 
 

నీలాటి రేవులో ముగిసిన చరణానికి, 'ఓడను జరిపే' పల్లవితో చక్కని లంకె. తొలిచరణంలో సాగిన ముద్దుముచ్చట్ల ఫలితం ఏమిటన్నది పల్లవి సాగుతుండగా తెరమీద కనిపిస్తుంది. తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఆ జంట పాడుకునే చరణం ఇలా సాగుతుంది: 

"చిలిపితడీ వెన్నెలలే గౌతమి కౌగిలికందం..
తొలిచూలుకు శ్రీకారం, నడకే భారం..
ఉలికిపడే ఊయలలే కన్నుల పాపలకందం..
నెలవంకల సీమంతం, ఒడిలో దీపం.. 

తరాలు మారే జతలే, స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే, సృజించే మూడో తనువే..
త్యాగయ్య రామ లాలిలో..." 

త్యాగయ్య రామలాలితో ముగిసే ఈ చరణానికి కూడా పల్లవితో అందమైన లంకె కుదిరింది. రామలాలి వింటూ పెరిగే బాలకృష్ణుడి విలాసాలే కదా 'నౌకా చరిత్రము.'  కథలో సందర్భాన్ని, నౌకాచరిత్రపు నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వింటూ ఉంటే, వినే ప్రతిసారీ మరింత సొగసుగా వినిపించే పాట ఇది. కీరవాణి సంగీత సారధ్యంలో కోరస్ తో కలిసి బాలూ, చిత్ర పాడారు. (చరణాల ప్రతిపదార్ధం ఇక్కడ చెప్పడం కంటే, ఎవరి ఊహా శక్తి మేరకు వారు అన్వయం చేసుకోడమే బావుంటుంది).