సోమవారం, ఏప్రిల్ 09, 2012

చెహోవ్ ఎగరేసిన 'సీతాకోకచిలుక'

ఏ రచననైనా 'గొప్ప రచన' గా నిలబెట్టేది సమకాలీనత. తర్వాతి తరాలు కూడా చదివి "అచ్చం మనచుట్టూ జరుగుతున్న వాటిని గురించి రాసినట్టే ఉంది" అనుకోవడం ఒక్కటీ చాలు, ఓ రచనని గొప్ప రచన అనడానికి. రష్యన్ కథకుడు చెహోవ్ కథల్నిసాహితీవేత్తలనేకులు 'గొప్ప కథలు'గా అభివర్ణించడానికి కారణం బహుశా ఆ కథల్లో కనిపించే సమకాలీనతే కావొచ్చు. చిన్న కథనైనా, పెద్ద కథనైనా ఆసాంతమూ ఆసక్తిగా మలచడం చెహోవ్ ప్రత్యేకత. ఓ. హెన్రీ కథలు చదువుతున్నంతసేపూ ఆలోచన అతడిచ్చే 'మెరుపు ముగింపు' మీదే ఉంటుంది. అదే చెహోవ్ దగ్గరికి వచ్చేసరికి, ముగింపు కన్నా కథనం ఆసక్తికరంగా అనిపిస్తుంది. (హెన్రీనీ, చెహోవ్ నీ పోల్చే సాహసం చేయబోవడం లేదు నేను).

చెహోవ్ రాసిన 'The Butterfly'/The Grasshopper' కథ 'సీతాకోకచిలుక' పేరుతో తెలుగులోకి అనువాదమయింది. ఇది ప్రేమించి పెళ్ళిచేసుకున్న వోల్గా ఇవనోవ్నా, ఓసిప్ దిమోవ్ ల కథ. ఓల్గా అందమైన అమ్మాయి. లలితకళలంటే ఎంతో ఇష్టం. స్వతహాగా చిత్రకారిణి. గొంతు బాగుంటుంది అంటారామె మిత్రులు. మిత్ర బృందమంతా రచన, సంగీతం, చిత్రలేఖనం, నాటక రంగాల్లో పేరున్న వాళ్ళే. దిమోవ్ వృత్తి పట్ల ఎంతో అంకిత భావం ఉన్న ఓ వైద్యుడు. వోల్గా తండ్రి కూడా వైద్యుడే. ఆయన చివరి ఘడియల్లో దిమోవ్ చేసిన సేవలు అతడి పట్ల ఆమెకి మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. దిమోవ్ కి తన వృత్తి తప్ప ఇతర విషయాలు పట్టవు. సాహిత్యాన్నీ, కళల్నీ అతడు బొత్తిగా ఆస్వాదించలేడు. అతన్ని పెళ్ళి చేసుకోడానికి అభిరుచుల్లో తేడా అడ్డుగా అనిపించదు వోల్గాకి.

ఎంతో సౌహార్ద్రమైన వైవాహిక జీవితాన్ని ఆరంభిస్తారు వోల్గా, దిమోవ్ లు. వారికి ఒకరినొకరు గౌరవించుకోవడం తెలుసు. అలాగే ఒకరి మిత్రులని మరొకరు ఆదరిస్తారు. దిమోవ్ వృత్తీ, వోల్గా ప్రవృత్తీ నిరాటంకంగా కొనసాగుతూ ఉంటాయి. అతడు ఆస్పత్రికి వెళ్ళగానే ఆమె తన మిత్ర బృందాన్ని చుట్టి వస్తుంది. వారిలో ఎక్కువమంది పురుషులే. వారానికోసారి వారికి తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తుంది. వారి చర్చల్లో తను పాల్గోలేకపోయినా, విందుల్లో పాల్గొంటూ ఉంటాడు దిమోవ్. భర్త తన మిత్ర బృందంలో చేరకపోవడం రాన్రానూ ఓ వెలితిగా అనిపిస్తూ ఉంటుంది వోల్గాకి. ఇదే విషయం ఓసారి అతన్ని అడిగేస్తుంది కూడా. వైద్యం తప్ప ఇతరాలు తన మనసుకి దగ్గరకి రావనీ, అలాగని వేటినీ తను చిన్నచూపు చూడననీ కచ్చితంగా చెప్పేస్తాడు దిమోవ్. పైకి కనిపించని అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది వోల్గాలో.

కొందరు చిత్రకారులతో కలిసి వోల్గా నదీ తీరానికి బయలుదేరుతుంది వోల్గా. అనుకోని పరిస్థితుల్లో, చిత్రకారుడైన తన మిత్రుడు ర్యాబోవ్ స్కీ కి దగ్గరవుతుంది. పర్యటన నుంచి తిరిగి వచ్చాక కూడా ర్యాబోవ్ తో తన సంబంధాన్ని కొనసాగిస్తుంది వోల్గా. అయితే, ఈ విషయాన్ని తన భర్త నుంచి దాస్తుంది. జరుతున్నదేమిటో సులభంగానే అర్ధమవుతుంది దిమోవ్ కి. సున్నిత మనస్కుడైన దిమోవ్ ఆమెని ఒక్క మాటా అడగడు సరికదా, ర్యాబోవ్ తో ఆమె అనుబంధం తనకి తెలియనట్టే ప్రవర్తిస్తాడు. వోల్గా స్నేహాలు, వారాంతపు విందులూ ఎప్పటిలాగే జరుగుతున్నాయి. వోల్గా-ర్యాబోవ్ ల అనుబంధం అందరికీ తెలిసిపోతుంది.కానైతే, ర్యాబోవ్ నిజాయితీగా లేకపోవడం కలచివేస్తుంది వోల్గాని. తను అటు దిమోవ్ కీ, ఇటు ర్యాబోవ్ కీ దూరం అవుతున్నానని అర్ధమవుతుంది ఆమెకి. 

వోల్గా మనఃస్థితిని గమనించిన దిమోవ్ ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. తన వృత్తిలో సాధించిన అపురూపమైన విజయాన్ని ఆమెతో పంచుకుంటాడు. అయితే, వైద్య వృత్తిని గురించి ఏమాత్రమూ తెలియని, ఆసక్తి చూపని వోల్గా కనీస స్పందన కనబరచదు. మానసికంగా దెబ్బతిన్న దిమోవ్, ఉన్నట్టుండి మంచాన పడతాడు. స్వతహాగా వైద్యుడు కావడంతో వోల్గాని పిలిచి తనకి డిఫ్తీరియా సోకిందనీ, తన దగ్గరికీ రావొద్దనీ చెప్పడంతో పాటు తన వైద్య మిత్రులకి కబురు చేయమని కోరతాడు. దిమోవ్ కి ప్రమాదకరమైన జబ్బు చేసిందన్న విషయం తెలిశాక, వోల్గాలో పశ్చాత్తాపం మొదలవుతుంది. జరిగిందంతా అతనితో చెప్పేసి, క్షమాపణ కోరి, కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. భర్త జబ్బుతో మంచాన పడ్డా, తన మిత్రులెవరూ కనీసం పలకరించడానికి రాకపోవడం ఆలోచనలో పడేస్తుంది వోల్గాని.

దిమోవ్ కి డిఫ్తీరియా సోకడం యాదృచ్చికం కాదనీ, అతడు కావాలనే ఆ వ్యాధి బారిన పడ్డాడనీ అతని మిత్రుల ద్వారా తెలుసుకున్న వోల్గా కుంగిపోతుంది. దిమోవ్ మంచితనం, అతడు సమకూర్చిన సౌకర్యాలూ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయామెకి. జరిగినదానికి ఆమె చింతిస్తూ ఉండగానే, దిమోవ్ చనిపోయాడని చెబుతారు అతని మిత్రులు. దిమోవ్ అంతిమ సంస్కారం కోసం అతడి మిత్రులు చర్చిని సంప్రదించడం ఈ కథకి ముగింపు. ముందుగా చెప్పినట్టు కథతో పాటుగా కథనమూ వెంటాడుతుంది. ఎక్కడా హడావిడి పడకుండా తాపీగా కథ చెబుతాడు చెహోవ్. తను సృష్టించిన పాత్రల ప్రవర్తనపై ఎలాంటి తీర్పులూ చెప్పని ఈ రచయిత, కథను మాత్రం చెప్పి, తీర్పుని పాఠకులకి వదిలేస్తాడు. కథని పూర్తిగా చదివి పక్కన పెట్టినా వోల్గా, దిమోవ్ లు ఓపట్టాన మన స్మృతి నుంచి చెరగరు. (ఎప్పుడో చదివిన ఈ కథని గుర్తుచేసి, మళ్ళీ చదివించిన బ్లాగ్మిత్రులు శైలజాచందు గారికి కృతజ్ఞతలు. ఇంగ్లిష్ వెర్షన్ ని ఇక్కడ చదవొచ్చు).

శనివారం, ఏప్రిల్ 07, 2012

వేసవి వంటలు

వేసవి వచ్చేసింది.. కరెంటు ఉన్నంత సేపూ ఫ్యాన్లు నిర్విరామంగా తిరిగేస్తున్నాయి.. ఏసీలు, కూలర్ల సంగతి చెప్పక్కర్లేదు.. బిల్లు తడిపి మోపెడు అవుతుందన్న భయం ఎక్కడా కనిపించడం లేదు.. ఈ ఎండల గండం గడిస్తే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి. నాల్రోజులు పోతే ఊరగాయల హడావిడి మొదలైపోతుంది. అప్పుడెలాగూ స్పెషల్స్ చేసుకునే టైం ఉండదు కదా.. అందుకని ఈలోగానే వేసవి ప్రత్యేక వంటలు చేసుకు తినేయడం మంచిది. ఇవేమీ బ్రహ్మాండం బద్దలయ్యే వంటలు కావు కాబట్టీ, గరిట పట్టిన అనుభవం లేని వాళ్ళుకూడా అవలీలగా వండి వార్చేసేవి కాబట్టీ డిస్క్లైమర్లూ గట్రా ఇవ్వకుండా నేరుగా వంటింట్లోకి తీసుకెళ్ళి పోతున్నా..

ముందుగా మనం పెరుగిడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ టిఫిన్ తినడానికి ప్రత్యేకంగా వేళా పాళా అంటూ ఏమీ లేదు. పిల్లలు ఎప్పుడు ఆకలని గోలెడితే అప్పుడు చేసి పెట్టేయొచ్చు. అలాగని పెద్దాళ్ళు తినకూడదని ఏమీ లేదు.. తినగలిగినన్ని తినొచ్చు. పెరుగిడ్లీ చేయడానికి కావాల్సిన పదార్ధాలు ఏవేవిటంటే చల్లారిపోయిన ఇడ్డెన్లు, ఫ్రిజ్లో నుంచి తీసిన చల్లని పెరుగు, దానిమ్మ గింజలు లేదా కారా బూందీ. వంటలో ఆరితేరిన వాళ్లకి ఈసరికే ఈ వంటకం ఎలా చెయ్యాలో అర్ధమైపోయి ఉంటుంది. అయినప్పటికీ, యావజ్జాతి ప్రయోజనాలనీ దృష్టిలో ఉంచుకుని నేను వీలైనంత వివరంగా చెప్పితీరతాను.

తయారు చేసే విధానానికి వచ్చేస్తే, బాగా చల్లారిపోయిన - ఇంకొంచం సొష్టంగా చెప్పాలంటే పనిమనిషికి ఇచ్చేద్దామని పక్కన పెట్టిన - ఇడ్లీలని ఓ అందమైన బౌల్ లోకి తీసుకోవాలి. ఫ్రిజ్ లోనుంచి తీసిన పెరుగు చల్లదనం పోకముందే తగుమాత్రంగా చిలకాలి. పెరుగు గనుక ఓ రవ్వ పులిసినట్టు అనిపిస్తే, చిలికేటప్పుడే ఓ రవ్వ ఉప్పు జోడించుకుంటే సరిపోతుంది. చిలికిన పెరుగుని జాగ్రత్తగా ఇడ్లీల బౌల్లోకి ఒంపాలి. ఓ రెండు నిమిషాలపాటు ఇడ్లీలని పెరుగులో నాననివ్వాలి. కమ్మకమ్మగా తినాలనుకుంటే దానిమ్మ గింజలతోనూ, కొంచం ఖారంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే కారా బూందీతోనూ పెరుగిడ్లీని గార్నిష్ చేసుకోవాలి.

టిఫిన్ గురించి చెప్పేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు స్నాక్ చేయడం నేర్చుకుందాం. నూనె ఉండే స్నాక్స్ వేసవిలో తినడం కష్టం. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఏకాలంలోనూ తినలేరు. కాబట్టి మనం చేసుకోబోయే స్నాక్ ఏమాత్రం నూనె లేనిది. వంటకం అన్నాక ఏదో ఒక పేరు ఉండాలి కదా.. దీని పేరు 'ఉప్పు పల్లీ.' కావాల్సిన పదార్ధాలు పల్లీలు (వేరుశనగ గుళ్ళు) మరియు కాసింత ఉప్పు. తయారు చేసుకోవడం ఎలాగంటే, ఓ బౌల్ లో కొంచం నీరు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. నీళ్ళు పొంగుతూ ఉండగా వాటిలో ఉప్పు వేసి, ఆ పై రాళ్ళు లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న పల్లీలని జారవిడవాలి. ఐదు నిమిషాలో పల్లీలు ఉడికిపోతాయి. మిగిలిన నీటిని ఒంపేసి పల్లీలని సర్వ్ చేసేయడమే.

'అబ్బా.. పొయ్యి వెలిగించాలా? అంత పని మావల్ల కాదు' అనుకునే వాళ్ళ కోసం మరో స్నాక్. దీనిపేరు మావిడి ముక్కలు. కావాల్సిన పదార్ధాలు మామిడి కాయ, ఉప్పు కలిపిన వేపుడు కారం. మీరు కనక గుంటూరులో పుట్టి పెరిగినట్టాయనా 'సంబారు కారం' కూడా ప్రయత్నించ వచ్చు. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి తుడవాలి. ఓ పదునైన చాకు తీసుకుని మామిడి కాయని సన్నని పొడవాటి ముక్కలుగా తరగాలి. టెంక పట్టిన కాయ అయితే తరిగేటప్పుడు చెయ్యి తెగకుండా జాగ్రత్త పడాలి. అదే జీడి కాయ అయితే, జీడి ముక్కల్ని జాగ్రత్తగా ఏరి పారేయాలి. తరిగిన ముక్కల్ని ఓ ప్లేట్లో అందంగా అమర్చి, కారాన్ని జత చేసి సర్వ్ చేయాలి. టీవీ చూస్తూ తినడానికి బాగుంటుంది.

అసలు ఎండలు ముదరడంతోనే చల్లగా చల్లగా ఏవన్నా గొంతులో పోసుకోవాలన్న కోరిక మొదలవుతుంది. ఈ గొంతు తడుపుకోవడంలో ఎవరి పధ్ధతి వాళ్లకి ఉన్నప్పటికీ, మనం సభా మర్యాద చెడకుండా, సంసార పక్షంగా ఉండేలాగా షర్బత్ తయారీ గురించి ముచ్చటించుకుందాం. నిమ్మకాయ, ఉప్పు, చక్కెర మరియు చల్లటి నీళ్ళు ఉంటే చాలు చల్ల చల్లని నిమ్మ షర్బత్ సిద్ధం చేసేసుకోవచ్చు. ముందుగా నిమ్మకాయ కోసి, గింజలు తీసేసి గ్లాసులోకి రసం పిండుకోవాలి. ఈ రసంలో తగినంత ఉప్పు, పంచదార కలిపి ఆపై చల్లని నీళ్ళతో గ్లాసు నింపితే చాలు, చక్కనైన షర్బత్ రెడీ. మధ్యాహ్నం వేళల్లో తాగే షర్బత్ లో చక్కెర బదులు గ్లూకోజ్ కలుపుకుంటే ఉభయ తారకంగా ఉంటుంది.. అంటే, దాహం తీరడంతో పాటు కొంచం ఓపిక కూడా వస్తుందన్న మాట. ఇప్పటికివీ వేసవిలో చేసుకునే వంటలు.. వీటిని 'వంటలు' అంటారా? అనొద్దు.. ఎందుకంటే,అదంతే..