తన కథల్లో పాత్రలని పరిచయం చేస్తూ, చెడు లక్షణాలున్న పాత్రలని కూడా ప్రేమించమని పాఠకులని అడుగుతారు వంశీ. ఆయాపాత్రల మనస్తత్వాలని అర్ధం చేసుకోడానికి, వాస్తవాలని తెలుసుకోడానికి ఇది సహాయపడుతుందంటారు. తను సృష్టించే పాత్రలు వాస్తవికంగా ఉండడంతో పాటు, కొన్ని పాత్రలు నిజ జీవితం నుంచి రావడం వంశీ కథల్లో ప్రత్యేకత. తాను పుట్టి పెరిగిన గోదావరి ప్రాంతం నేపధ్యంగా చేసుకుని కథలని చెప్పేటప్పుడు, చిన్న చిన్నవివరాలు సైతం వదలకుండా కథా స్థలాన్ని కళ్ళకి కట్టడంతో పాటుగా, పాత్రల మనస్తత్వాలనీ, భావోద్వేగాలనీ నిశితంగా వర్ణిస్తారు.
వంశీ కథా సంకలనాలు 'మా పసలపూడి కథలు' 'దిగువ గోదారి కథలు' 'ఆకుపచ్చని జ్ఞాపకం' చదివేటప్పుడు పాఠకులకి కలిగే అనుభూతి ఒకటే.. కథల్లో దృశ్యాలు తమ కళ్ళముందు జరుగుతున్నట్టుగా అనిపించడం. ఇది కథ చెప్పడంలో తన ప్రతిభకి నిదర్శనం. ఈ దృశ్యీకరణకి సహాయ పడడంలో బాపూ గీసిన బొమ్మలకీ ప్రముఖ పాత్ర ఉంది. ఇలా కథని కళ్ళకి కట్టినట్టు చెప్పే నైపుణ్యం వంశీకి సినిమాలు తీయడంలో ఏమన్నా ఉపయోగపడిందా? "ఈ కథలన్నీ రాయడానికన్నా ముందే, జీవితావసరాలు నన్ను సినిమా రంగంవైపుకి తీసుకెళ్ళాయి" అన్నది ఈ 'అంతుచిక్కని' రచయిత నుంచి వచ్చే సమాధానం. నిజానికి వంశీ రచయితగా కన్నా, అవార్డు సినిమా దర్శకుడిగానే ఎక్కువమందికి తెలుసు.
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో జన్మించిన నల్లమిల్లి వంశీ, తన బాల్యంలో ఎక్కువభాగాన్ని జన్మస్థలానికి దగ్గరలోనే ఉన్న పల్లెటూరు పసలపూడిలో గడిపారు. ఓ ప్రముఖ వారపత్రికలో డెబ్భై రెండు వారాల పాటు 'మా పసలపూడి కథలు' రాసినప్పుడు, ఆ కథలకి ఆర్కే నారాయణ్ 'మాల్గుడి కథలు' తో అనివార్యంగా పోలిక వచ్చింది. ఆర్కే నారాయణ్ 'మాల్గుడి' అనే ఊహాత్మక గ్రామాన్ని తన రచనల ద్వారా సృష్టిస్తే, వంశీ పసలపూడి ఊరిని, అక్కడి ప్రకృతినీ, మనుషుల్నీ, వాళ్ళ ప్రేమాభిమానాలనీ, రాగద్వేషాలనీ, ఇష్టాయిష్టాలనీ, భాషనీ, యాసనీ తన కథల ద్వారా పునః సృష్టి చేసి పాఠకులని ఏకకాలంలో అనేక అనుభూతుల్లోకి తిప్పి తీసుకొచ్చారు. .
వంశీది ప్రత్యేకమైన రచనా శైలి. తన హాస్యంలో వ్యంగ్యం మిళితమై, వ్యంగ్య చిత్రాన్ని గుర్తుచేస్తుంది. అయితే తన జీవితంలో మాత్రం హాస్యం లేదని కొట్టిపారేస్తారు వంశీ. "బహుశా, నా జీవిత గమనంలో నేర్చుకుని ఉంటాను," అంటారు క్లుప్తంగా. విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటున్న వంశీ, చాలామంది రచయితలు తనని ప్రభావితం చేశారని చెబుతారు. రాజకీయాలని ఇతివృత్తంగా తీసుకుని కథలు రాయనప్పటికీ, రాజకీయ నిర్ణయాలని వ్యాఖ్యానించడం కొన్ని కథల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి యానాం-ఎదుర్లంకల మధ్యన గోదావరిపై బ్రిడ్జిని నిర్మించడం వల్ల జీవనాధారం కోల్పోయిన పడవమనిషి జీవితాన్ని చిత్రించారు 'రాజహంసలు వెళ్ళిపోయాయి' అనే కథలో.
నిజానికి వంశీ అభివృద్ధికి వ్యతిరేకి కాదు, అదే సమయంలో జీవనాధారం కోల్పోయిన పడవ మనిషి పట్ల కరుణ కనిపిస్తుందీ కథలో. అలాగే, 'సీతారామా లాంచీ సర్విస్ - రాజమండ్రి' కథలో అందమైన పాపికొండలు అదృశ్యం కాబోవడం పట్ల తన ఆగ్రహాన్ని గమనించొచ్చు. కొన్ని కథల్లో విపరీత పోకడలు కనిపిస్తాయన్నది విమర్శకుల మాట. "నా కథల్లోనే కాదు, నా ప్రవర్తనలోనూ విపరీత పోకడలు కనిపిస్తాయి," అంటూ నవ్వుతారు వంశీ. అలాంటి పోకడలు కనిపించే కథలకి మూలం వాస్తవ సంఘటనలేనన్నది తన వివరణ. "నేను జరిగింది జరిగినట్టుగా చిత్రించాలి కదా," అంటారు. ఆలిండియా రేడియోలో 'సత్యసుందరి నవ్వింది' అనే కథని చదవడం ద్వారా 1974 లో రచనల్ని ప్రారంభించిన వంశీకి రచయితగా తగిన గుర్తింపు వచ్చింది మాత్రం 'మా పసలపూడి కథలు' తోనే.
కథకుడిగా రెండు ప్రతిష్టాత్మక అవార్డులు - రాజమండ్రిలో 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య అవార్డు,' విజయనగరంలో 'గురజాడ అప్పారావు అవార్డు - అందుకున్న వంశీ, సిని దర్శకుడిగా అందుకున్న నంది అవార్డుల కన్నా, కథకుడిగా అందుకున్న అవార్డులే తనకి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చాయంటారు. అరడజను నవలలు, రెండు వందలకు పైగా కథలూ రాసినా, 'సితార' తో సహా వాటిలో కేవలం ఒకటి రెండింటిని మాత్రమే సినిమాలుగా మలిచారు. "కొందరు రచయితలు ఓ కథని రాసేటప్పుడే సినిమానో, టీవీ సీరియల్నో దృష్టిలో పెట్టుకుని రాస్తారని విన్నాను. కానీ నేనలా రాయలేను. బహుశా ఇందువల్లనే కావొచ్చు, నా కథలు సినిమాలు కాలేకపోయాయి. 'సితార' సినిమాని నా నవల 'మహల్ లో కోకిల' ఆధారంగానే తీసినా, సినిమా చూసినప్పుడు నా నవలకి పూర్తి న్యాయం చేయలేక పోయానని అనిపించింది."
వంశీ మాటల్లో నిరాడంబరత వినిపిస్తోందేమో కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ హిట్. నగరాల్లో నివసించే వాళ్ళనీ, పల్లెటూళ్ళలో ఉంటున్న ప్రస్తుత యువతరాన్నీ తన రచనల ద్వారా వాళ్లకి తెలియని ఓ కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తారు వంశీ. తన కథల్ని చదువుతూ పోతే, ఆ పాత్రలు మనకి తెలిసినవే అనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఇది మన గురించే రాసినట్టుంది అని కూడా అనిపిస్తుంది. అభాగ్యుల జీవితాల మొదలు, పల్లెటూరి యువత వన్సైడు ప్రేమలు, మానవసంబంధాలు, అనుబంధాల వైచిత్రి.. ఇవన్నీ మనసుకి పట్టేస్తాయి. జ్ఞాపకాలుగా వెంటాడతాయి. తన కథలని చదువుతుంటే వంశీ సినీ దర్శకుడిగా కన్నా కథకుడిగా బహుముఖీనుడేమోనన్నసందేహం తలెత్తక మానదు.
(ఇవాల్టి The Hindu దినపత్రిక Friday Review సప్లిమెంట్ లో 'Versatile story teller' శీర్షికన ప్రచురితమైన ఎం.ఎల్. నరసింహం గారి కథనాన్ని తెనిగించే ప్రయత్నం. ఫోటో కర్టెసీ: The Hindu).
వంశి బహుముఖీన కథకుడు మాత్రమే కాదు ...బహుముఖ ప్రజ్ఞా శాలి కూడా...అతని ప్రజ్ఞా పాటవాలు అన్ని మచ్చుకు సితార, అన్వేషణ లాంటి చిత్రాలలో ఇప్పటికీ మనకు కనిపిస్తూనే వుంటాయి..
రిప్లయితొలగించండిసినిమాల్లో వంశీ ముద్ర గొప్పదే. కానీ, ఆయనని సాహిత్యమే భవిష్యత్తరాలకు పరిచయం చేస్తుంది. గత పది సంవత్సరాల్లో తెలుగు సాహిత్యంలో దాదాపు చెదురుమదురు సంఘటనలు తప్ప స్తబ్దతే రాజ్యమేలింది. అలాంటి సమయంలో ముళ్లపూడి వారి"కోతి కొమ్మచ్చి", వంశీ "మా పసలపూడి కథలు" లాంటివి కొన్ని మాత్రమే తెలుగు సాహిత్యంలో నిలబడే రచనలు వచ్చాయి. అందులో ముఖ్యంగా మా పసలపూడి కథలు తెలుగు కథల గురించి చెప్పేటప్పుడు చెప్పి తీరాల్సిన స్థాయిలో ఉన్నాయి. మన మహా కథకులలో వంశీ ఓకడయ్యాడు, అదీ చూస్తూ చూస్తూ ఉండగానే అనుకుంటేనే నాకేదో పులకింత కలుగుతుంది.
రిప్లయితొలగించండివంశీ గారంటే మీకున్న అభిమానానికి మరో గుర్తు ఈ పోస్టు :)
రిప్లయితొలగించండినాకు వంశీ దర్శకుడు గా కంటే రచయిత గా ఇష్టం , పసలపూడి కథలు గోదావరి పరిసరాలను మరీ ముఖ్యం గా పసలపూడి ని కళ్ళ ముందు చూపిస్తాయి .
వంశీ పసలపూడి కథలు చదువుతుంటే నాకు సత్యం శంకరమంచి ' అమరావతి కథలు ' , మహమద్ ఖదీర్ బాబు ' దర్గా మిట్ట కథలు ' గుర్తొచ్చాయి . పసలపూడి కథలు చదవటం ఒక అద్భుత అనుభూతి . కథకుడు వంశీకి సినీ దర్శకుడు వంశీ ఏ మాత్రం సరితూగడు .
రిప్లయితొలగించండిyaramana గారితో నేనూ ఏకీభవిస్తాను. సినిమాలు తిసే వంశీ వేరు. కథలు రాసే వంశీ వేరు. ఒక్కో చోట "ఏంట్రా ఇతనూ!" అనిపిస్తుంది, సినిమాలు చూస్తే! ఆణిముత్యాలు ఉన్నాయి. కాదనను. అదే కథకుడిని చూస్తే "అసలేంటితనూ!" అని భలే ముచ్చటేసేస్తుంది.
రిప్లయితొలగించండిమీ తెనిగింపు చక్కగా ఉంది. అసలు దానికి అస్సలు తీసిపోకుండా! :)
చక్కటి వ్యాసాన్ని ఎంచుకుని తెనుగీకరించడంలో కృతకృత్యులైనారు. అభినందనలు.
రిప్లయితొలగించండి@విశ్వనేత్రుడు: కేవలం రచయితా దర్శకుడు మాత్రమే కాదండీ. గీత రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు కూడా. తన దగ్గర చాలా గొప్ప మ్యూజిక్ కలెక్షన్, చక్కని లైబ్రరీ ఉన్నాయని విన్నాను.. ఈరకంగా చూస్తే మీరు చెప్పిన 'బహుముఖ ప్రజ్ఞాశాలి' తనకి సరిపోయే టైటిలే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పక్కింటబ్బాయి: నిజానికి నాకు వంశీ కథల్లో 'మా పసలపూడి కథలు' కన్నా కూడా అంతకు ముందు రాసిన కథలు బాగా నచ్చుతాయి. మీరు 'ఆనాటి వానచినుకులు' కథా సంకలనం చదివారా? కొన్ని గొప్ప కథలు ఉన్నాయందులో.. ఇకపోతే, 'పసలపూడి' లో కొన్ని కథలు బాగా నచ్చుతాయి.. వాటితోపాటు కేవలం వర్ణనల మీదే ఆధారపది విసుగు రప్పించే కథలూ ఉన్నాయి. కానైతే తనకి రచయితగా పేరొచ్చింది మాత్రం 'మా పసలపూడి కథలు' తోనే అన్నది నిజం.. ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: అంతేనంటారా? :-) :-) నిజానికి 'పసలపూడి' సంకలనంలో కన్నా మంచి కథలు 'ఆనాటి వానచినుకులు' లో ఉన్నాయండీ.. కానైతే అవి రాసేటప్పటికి వంశీ దర్శకుడిగా పీక్ లో ఉండడం వల్లా, తరచుగా కాకుండా అప్పుడోటీ అప్పుదోతీగా కథలు రాయడం వల్లా వాటికి రావల్సినంత పేరు రాలేదేమో అనిపిస్తుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@yaramana: నిజమేనండీ పసలపూడి కథలు చదవడం గొప్ప అనుభూతి. అదే సమయంలో తను తీసిన సినిమాల్లో గొప్పవీ, చేత్తవీ ఉన్నట్టే సృజించిన కథల్లోనూ గొప్పగా అనిపించేవీ, పేలవంగా అనిపించేవీ ఉన్నాయి.. ఒక్కో సినిమా చూస్తున్నప్పుడు "ఆ సినిమా తీసినతనే ఈ సినిమా కూడా తీశాడా?" అని సందేహం.. కొన్ని కథలు చదివేటప్పుడు కూడా అంతే.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@కొత్తావకాయ; yaramana గారికిచ్చిన జవాబే మీకూను.. సినిమాలన్నీ అధ్బుతాలు కానట్టే, కథలు కూడా అన్నీ అద్భుతాలు కాదన్నది నా అభిప్రాయం అండీ..
రిప్లయితొలగించండిమీ తెనిగింపు చక్కగా ఉంది. అసలు దానికి అస్సలు తీసిపోకుండా! :) ...ధన్యవాదాలండీ.
@సందీప్; ధన్యవాదాలండీ..