శుక్రవారం, జులై 29, 2011

పాఠకుడు-సమీక్షకుడు-విమర్శకుడు

పుస్తకాలు చదివే వాళ్ళందరూ పాఠకులే. ఆ పుస్తకాలని గురించి సమీక్షలు రాసేవాళ్ళు సమీక్షకులు, రచనని సునిశితంగా విమర్శించే వాళ్ళు విమర్శకులు. అక్షర జ్ఞానం, పుస్తకాలంటే ఆసక్తి ఉండి నచ్చిన పుస్తకాలని చదివే పాఠకులు మొదలు, ఆ పుస్తకంలో మూల వస్తువుకి సంబంధించిన రంగంలో కాకలుతీరి, రచనలో గుణదోషాలని సాధికారికంగా ప్రకటించగల విమర్శకుల వరకూ ప్రతి ఒక్కరికీ తాము చదివిన పుస్తకాలని గురించి ఏదో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.

సమీక్షకుడికీ, విమర్శకుడికీ కొన్ని అర్హతలు కావాలి. ప్రస్తుతం అమలులో ఉన్న సంప్రదాయం ప్రకారం అయితే, పత్రికలు తగినంత అర్హత, అనుభవం ఉన్న వారిని సమీక్షకులుగానూ, విమర్శకులుగానూ నియమించుకుని, మార్కెట్లోకి వస్తున్న పుస్తకాలని వీరి ద్వారా సమీక్ష/విమర్శ చేయించి తమ పత్రికల్లో ప్రచురిస్తున్నాయి. సామాన్య పాఠకులకి ఉన్న అర్హతల్లా ముందుగానే చెప్పినట్టుగానే అక్షరజ్ఞానమూ, ఆసక్తీ మాత్రమే కాబట్టి వీళ్ళు పుస్తకాలు చదివి ఒక అభిప్రాయాన్ని నిశ్శబ్దంగా ఏర్పరచుకోవడమూ సమీక్షకుడో, విమర్శకుడో అలాంటి అభిప్రాయాన్నే ప్రకటించినప్పుడు సంతోషించడమూ జరుగుతూ ఉండేది.

సాంకేతిక పరిజ్ఞానం విరివిగా పెరగడం వల్ల బ్లాగులు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి వారు ఒక బ్లాగు ప్రారంభించుకుని తమ ఆసక్తుల మేరకి తమకి నచ్చిన, నచ్చని విషయాలని గురించి అదే ఆసక్తులున్న మరో నలుగురితో పంచుకోగలుగుతున్నారు. ఈ ఆసక్తులలో పుస్తకం పఠనం ఒకటి అయినప్పుడు అత్యంత సహజంగానే ఇలా పంచుకునే విషయాల్లో చదివిన పుస్తకాలూ, వాటి గురించిన అభిప్రాయాలూ వచ్చి చేరతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, బ్లాగ గలిగే అవకాశం ఉన్న ప్రతి పాఠకుడికీ తను చదివిన పుస్తకాలని గురించి తనవైన అభిప్రాయాలని ప్రకటించడానికి అవకాశం దొరికింది.

'ఈ పరిణామం మంచికా? చెడుకా?' ...మార్పు మొదలైన ప్రతిసారి మొదట వచ్చే ప్రశ్నే ఇది. ఇక్కడ అభిప్రాయాలు పంచుకుంటున్నది కేవలం పాఠకులు అయినందువల్ల, వీరి భావాలు సమీక్షకుల, విమర్శకుల భావాలంత పదునుగానో, విశాలంగానో ఉండకపోవచ్చు. అలాగే ఒక్కోసారి వారికి కనిపించని కోణాలు వీరికి కనిపించనూ వచ్చు. ఫలానీ పుస్తకాన్ని చదివాం అనే కబురుని నలుగురితో పంచుకోవాలనే ఉత్సాహం వల్లనో, అంతకు మించి ఏం చెప్పాలో తెలియక పోవడం వల్లనో ఒక్కోసారి కేవలం పుస్తకాన్ని గురించిన ప్రాధమిక సమాచారాన్ని మాత్రమే ఇచ్చి ఊరుకోనూవచ్చు.

ఈ పాఠకులకి వాళ్ళు చదివిన పుస్తకం పరమాద్భుతంగానో, లేదా కనీసం అద్భుతంగానైనా అనిపించినంత కాలం సమస్య ఏమీ ఉండదు. నచ్చని విషయాలని గురించి మాట్లాడడం మొదలు పెడితే...? సమీక్షకులు, విమర్శకుల ముఖతా ఇలాంటి విషయాలే వచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి అభ్యంతరం కనిపించదు, కానీ 'కేవలం పాఠకుడు' తనకి నచ్చని వాటిని గురించో, అభ్యంతరకరంగా అనిపించిన వాటిగురించో సౌమ్యంగానే చెప్పినా అది అభ్యంతరం అవుతోంది. ఒక రచనని మెచ్చవలసినది సమీక్షకులూ, విమర్శకులూ అయినా, నచ్చవలసింది మాత్రం పాఠకుడికే కదా.

వ్యక్తిగత దూషణలూ, రచయితనో, రచననో కించ పరిచే దాడులూ లేనప్పుడు - రాసిన వాళ్ళు ఎవరు అని కాక రాసిన విషయం ఏమిటి అన్నది చూడడం ద్వారా ఒక రచనని గురించి అనేకరకాల అభిప్రాయాలని తెలుసుకునే వీలుని కలిగిస్తున్నాయి బ్లాగులు. పుస్తకాలు చదివిన వారంతా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని పంచుకో గలుగుతున్నారిక్కడ. కేవలం బ్లాగులో రాయడం కోసం పుస్తకాన్ని హడావిడిగా చదివేసో, పూర్తిగా చదవకుండానో అభిప్రాయాన్ని ప్రకటించే సంస్కృతి ఇక్కడ లేదు. ఎందుకంటే, పత్రికలతో పోల్చినప్పుడు 'ఫీడ్ బ్యాక్' ఇక్కడ వేగవంతం, పారదర్శకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పాఠకుల వేదిక. (ఈమధ్యనే నా టపా 'ముక్కోతికొమ్మచ్చి' పై ఈ బ్లాగులో జరిగిన ఓ ఆరోగ్యకరమైన చర్చ నేపధ్యంలో నాకొచ్చిన కొన్ని ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం..).

9 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు.సామాన్య పాటకుడికి, మంచి పాటకుడికి..తేడా ఉంటుంది ..మురళి గారు. మంచి పాటకుడే మంచి సమీక్ష వ్రాయగలరు. సద్విమర్శ చేయ గలరు. 2 వ ట రావడం లేదు. అచ్చు తప్పులకి మన్నించండి.
    మీకు.. హృదయ పూర్వక..జన్మదిన శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  2. ఈ విషయమై మాట్లాడుతూ మా నాన్నగారికి ఈ బ్లాగులో ముక్కోతికొమ్మచ్చి గురించి ఎం.బీ.ఎస్.ప్రసాద్ గారికీ మన బ్లాగర్లకూ మధ్య జరిగిన చర్చ చదివి వినిపించాను. బ్లాగులకి సాహితీ ప్రయోజనాలేమి ఉంటాయనే వారు ఆయన కూడా మంచి అభిరుచి ఉన్నవాళ్ళ మధ్య సాహిత్య గోష్టులు ఉండేవి గతంలో ఇప్పుడు ఈ బ్లాగులలా ఉపయోగ పడుతున్నాయేమోరా అన్నారు. పుస్తకం.నెట్, మీ వంటి వాళ్ళ బ్లాగులు చదివితే హడావిడిగా చదివి రాసేస్తారన్న అభిప్రాయం మార్చుకోవాల్సిందే.

    రిప్లయితొలగించండి
  3. "తనకి నచ్చని వాటిని గురించో, అభ్యంతరకరంగా అనిపించిన వాటిగురించో సౌమ్యంగానే చెప్పినా అది అభ్యంతరం అవుతోంది. "
    Brilliant observation. Well said.

    రిప్లయితొలగించండి
  4. <<<>>>
    మురళిగారు ఇది చదువుతూ నేను భుజాలు తడుముకున్నాను . ఈమధ్య ఎప్పుడు నేను చదివిన పుస్తకం గురించి రాద్దామన్నా నాకు నెమలికన్ను మురళిగారు గుర్తొస్తున్నారు. రాస్తే ఆయనలా రాయాలి లేకపోతే మానెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను .

    రిప్లయితొలగించండి
  5. @వనజ వనమాలి: గూగుల్ లో 'ఠ' కొంచం ఇబ్బంది పెడుతోంది లెండి :)) ..ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: ఒకేలాంటి అభిరుచి ఉన్నవాళ్ళు ఒక చోట కలుసుకోవడానికి వేదికలుగా బ్లాగులు చాలా చక్కని పాత్ర పోషిస్తున్నాయన్నది మాత్రం నిజమండీ.. ధన్యవాదాలు.
    @రిషి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
    @లలిత: మీ టపాలే కాదండీ, వ్యాఖ్యలూ సరదాగానే ఉంటాయ్ :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. >>కేవలం బ్లాగులో రాయడం కోసం పుస్తకాన్ని హడావిడిగా చదివేసో, పూర్తిగా చదవకుండానో అభిప్రాయాన్ని ప్రకటించే సంస్కృతి ఇక్కడ లేదు.<<

    బాగా చెప్పారండీ..

    రిప్లయితొలగించండి
  8. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి