శుక్రవారం, అక్టోబర్ 31, 2014

సిరికాకొలను చిన్నది

శ్రీకాకుళం ఓ అందమైన పల్లెటూరు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రధాన ఆకర్షణ అతి పురాతనమైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం. కళ్ళు చెదిరే శిల్ప సౌందర్యం ఈ ఆలయం ప్రత్యేకత. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్త మాల్యద' కావ్యాన్ని రచించింది ఈ ఆలయంలోనే అనే ప్రతీతి. ఈ ఆలయాన్ని గురించి ఎన్నో.. ఎన్నెన్నో కథలు. వాటిలో ఒకటి 'సిరికాకొలను చిన్నది.'

ఆంధ్ర మహావిష్ణువు ఆలయాన్ని ఆనుకుని ఉన్న సిరికాకొలనులో పుట్టిన ఒకానొక అందమైన పద్మం అలివేణి. ఆ వెలది ఆటవెలదే, కానీ 'వెల'ది కాదు. ఆటపాటల్లో మేటి అయిన పసిమి ప్రాయపు అలివేణి మనసు ఆంధ్ర మహావిష్ణువుకి అంకితం. ఆమె ఆటా, పాటా ఆ స్వామి సేవకి మాత్రమే. అటువంటి అలివేణిపై రాజోద్యోగి ఒకడు మనసు పడ్డాడు. కూతురి ద్వారా ధనార్జన చేయాలన్న ఆశచేత కన్నుమూసుకుపోయిన వేశ్యమాత రంగాజమ్మ అతనికి సహకరించింది. ఫలితంగా, అందమైన ఆ పద్మం వాడిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం జరిగిందన్నదే వేటూరి సుందర రామ్మూర్తి రాసిన సంగీత నాటిక 'సిరికాకొలను చిన్నది.'


నిత్య యవ్వనుడు వేటూరి తన ముప్ఫై మూడో ఏట రాసిన ఈ నాటిక, మరి నాలుగేళ్ల తర్వాత ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యింది. సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు స్వరపరిచిన ఈ నాటిక, తెలుగు వారి అదృష్టవశాన ప్రసారభారతి ఆర్కీవ్స్ నుంచి బయటపడి, వారి మార్కెటింగ్ విభాగం ద్వారా ఆడియో డిస్క్ రూపంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. సుమారు తొంభై నిమిషాల వ్యవధి ఉన్న సంగీత నాటకాన్ని తనికెళ్ళ భరణి పరిచయ వాక్యంతో మార్కెట్ చేస్తోంది ప్రసారభారతి. వేటూరి అభిమానులు కొందరు ఈ స్క్రిప్టుని పుస్తక రూపంలోనూ తీసుకువచ్చారు.

'మనుచరిత్ర' ని అల్లసాని పెద్దన నుంచి అంకితం అందుకున్న శ్రీకృష్ణదేవరాయలు, ఆ సంబరం తర్వాత అలివేణి నాట్యాన్ని తిలకించి, ఆమెని సత్కరించాలనే సంకల్పంతో 'ఆనెగొంది' స్థానాపతి మార్తాండ  శర్మని శ్రీకాకుళం సమీపంలోని దేవరకోట మండలాధిపతిగా బదిలీ చేసి, అలివేణిని ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు. అలివేణి మీద మనసు పడతాడు మార్తాండ శర్మ. ఆస్థాన నర్తకికి రాయలు తరపున రాసి ఇవ్వవలసిన తూర్పు భూముల బదిలీ సమయంలో అలివేణి తల్లి రంగాజమ్మతో పరిచయం అవుతుంది శర్మకి. అప్పటికే కూతురి  విష్ణుభక్తిని చూసి విసిగిపోయిన రంగాజమ్మ, మార్తాండ శర్మ అలివేణికి దగ్గరయ్యే ఉపాయం చెబుతుంది.

రంగాజమ్మ సలహా ప్రకారం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో మూలవిరాట్టు శేషవస్త్రాన్ని, ఆభరణాలని ధరించి అలివేణి సరసకి చేరిన మార్తాండ శర్మ, తను సాక్షాత్తూ ఆమె సేవిస్తున్న భగవంతుడిని అని నమ్మిస్తాడు. ఇట్టే మాయలో పడిపోయిన అలివేణి, మార్తాండ శర్మకి తనని తాను అర్పించుకుంటుంది. మార్తాండ శర్మ ద్వారా అందే కానుకల మీద చిన్నచూపు మొదలవుతుంది రంగాజమ్మకి. తన కూతురి ద్వారా ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించవచ్చన్న ఆలోచన ఆమెది.

ఈ క్రమంలో, ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ కళ్ళుతిరిగి పడిపోయిన అలివేణి 'గర్భవతి' అని రాజవైద్యుడు తేల్చడంతో తీవ్రమైన వేదనలో మునిగిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు. మార్తాండ శర్మని బదిలీ చేయడం వల్లే ఇదంతా జరిగిందన్న చింత మొదలవుతుంది. జరిగిన దానిలో రంగాజమ్మ పాత్ర కూడా ఉందన్నది విచారణలో తెలుస్తుంది. జరిగిన మోసం అలివేణి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? రాయలు ఆమెకి న్యాయం చేయగలిగాడా? అన్నది ఆసక్తికరమైన ముగింపు.


సంగీత నాటిక అవ్వడం వల్ల, సంభాషణలు తక్కువగానూ, పాటలు ఎక్కువగానూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలివేణి పాత్ర పోషించిన శ్రీరంగం గోపాలరత్నం గురించి. 'చినదానరా.. వలచిన దానరా..' అన్న జావళి అయినా, 'గోవర్దన గిరిధారీ..' అన్న భక్తిగీతమైనా మళ్ళీ మళ్ళీ వినాల్సిందే. ఇక సంభాషణల్లో అమాయకత్వం, భక్తిపారవశ్యం కలగలసి అలివేణి పాత్ర కళ్ళముందు కదలాడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది రంగాజమ్మ పాత్ర పోషించిన పి. సీతరత్నమ్మని గురించి. ధనాశ మెండుగా ఉన్న వృద్ధ వేశ్యమాతకి తన గొంతుతో రూపు కట్టేశారు.

ఇక, వేటూరి ప్రతిభ ప్రతిక్షణం ప్రత్యక్షమవుతుంది. అలంకారాలని వాడుకున్న తీరు అద్భుతం. పదాలని విరిచి శ్లేషలతో సంభాషణలు నడిపారు. ఎంత చక్కని తెలుగసలు!! వినాలే తప్ప మాటల్లో చెప్పడం కష్టం. "రాయెక్కడైనా రాయలవుతుందా?" "దేవదాసీ అంటే గుడిసొత్తు మడిగట్టుకోమన్నారు కానీ, మడి కట్టుకు బతకమన్నారా?" లాంటి ప్రశ్నలు విన్నప్పుడు, వేటూరిలోని సంభాషణల రచయితను సినిమా రంగం ఎందుకు ఉపయోగించుకోలేకపోయిందో కదా అనిపించక మానదు. నాటితరం రేడియో శ్రోతలని మాత్రమే కాదు, నేటితరం సంగీత, సాహిత్యాభిమానులనీ అలరించే నాటిక ఇది. (ప్రసార భారతి మార్కెట్ చేస్తున్న ఆడియో డిస్క్ వెల రూ. 195).

శనివారం, అక్టోబర్ 25, 2014

'మా తండ్రి శేషయ్య గారు'

నీలంరాజు వేంకట శేషయ్య.. ఈ పేరుని ఈతరం సాహిత్యాభిమానులకి పరిచయం చేయాలి అంటే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను,' బుచ్చిబాబు నవల 'చివరకి మిగిలేది' లని తెలుగు పాఠకులకి తొలిసారిగా అందించిన 'నవోదయ' పత్రిక సంపాదకుడు అని చెప్పాలి. సినీ అభిమానులకైతే తొలితరం తెలుగుసినిమా 'ఉషా పరిణయం' లో కథానాయకుడు అని చెప్పాలి. రాజకీయ రంగంవారికి చెప్పేప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు నీలం సంజీవరెడ్డి వరకూ ఎందరో నాయకులకి ఆంతరంగికుడు అని చెప్పడం మర్చిపోకూడదు.

సంగీతాభిమానుల దగ్గర ప్రస్తావించేప్పుడు భద్రాచలంలో 'రామదాస ధ్యానమందిరం' రూపశిల్పి అనీ, 'వాగ్గేయకార వార్షికోత్సవం' ఏర్పాటు చేసిన సంగీత పిపాసి అనీ చెప్పకపోతే ఎలాగ? ఇక భక్తులకైతే, కంచి పరమాచార్యుల వారి ప్రియశిష్యుడు అనీ, 'నడిచే దేవుడు' పుస్తక రచయిత అనీ చెబితే చాలు. అంతేనా? 'స్వరాజ్య' మొదలు 'ఆంధ్రప్రభ' వరకూ తెలుగు పత్రికల్లో అనేక హోదాల్లో పనిచేసి, స్వతంత్ర పోరాటం మొదలుగా ఎన్నో విశేషాంశాలని గురించి విశ్లేషణలు అందించిన జర్నలిస్టు, సంగీత, సాహిత్య, కళా, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో ఎందరికో ఆప్తుడు, స్నేహశీలి.. ఒక్కమాటలో చెప్పాలంటే 'బహుముఖ ప్రజ్ఞాశాలి.'

ఎందరెందరో ప్రముఖుల గురించి ఎన్నో వార్తలు రాసి, ఇంటర్యూలు చేసిన వేంకట శేషయ్య తన కథని తను రాసుకోలేదు. ఆయన మరణానంతరం, పెద్దకొడుకు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ 'మా తండ్రి శేషయ్య గారు' పేరిట అక్షరబద్ధం చేసిన పుస్తకంలో అనేక ఉద్యమాల నడుమ సాగిన తన తండ్రి ఎనభయ్యేడేళ్ళ జీవితాన్ని రేఖామాత్రంగా స్పృశించారు. ఒంగోలు జిల్లా నూతలపాడు లో 1905 లో జన్మించిన వేంకట శేషయ్య హైస్కూలు చదువుకి వచ్చేసరికి దేశంలో జాతీయోద్యమం ఊపందుకుంది. 'ఆంధ్ర రత్న' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్పూర్తితో హైస్కూల్ బాయ్ కాట్ చేసి ఉద్యమంలోకి దూకిన శేషయ్య, జాతీయ పాఠశాలలో తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం ఆయన జీవితంలో మొదటి మలుపు.


స్వాతంత్రపోరాటంలో తలమునకలుగా పాల్గొంటూ, 'స్వరాజ్య' పత్రికని ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్న టంగుటూరి ప్రకాశం పంతులికి అదే సమయంలో తెలుగు షార్ట్ హ్యాండ్ తెలిసిన సహాయకుడు అవసరం కావడంతో ఆ అవకాశం శేషయ్యని వెతుక్కుంటూ వచ్చింది. ప్రకాశం దగ్గర పనిచేసింది కేవలం ఒక్క  సంవత్సరమే అయినా, ఆ ఒక్క ఏడాదిలోనే ఎన్నో పనులు నేర్చుకున్నారు, ఎందరినో పరిచయస్తులుగా చేసుకున్నారు. ముఖ్యంగా, ప్రకాశం పంతులు ఉపన్యాసాలని 'స్వరాజ్య' పత్రికకి రాసి పంపడం ద్వారా జర్నలిజం మీద ఆసక్తి మొదలయ్యింది. అటుపై వరుసగా 'ఆంధ్ర పత్రిక' 'ఆంధ్రప్రభ'లలో ఉద్యోగాలు, 'నవోదయ' వారపత్రిక స్థాపన, నిర్వహణ. ఐదేళ్ళ తర్వాత 'ఆంధ్రప్రభ' కి పునరాగమనం. ఈమధ్యలో సినిమాలు, సంగీతం, నాటకాలు, సాహిత్యం, ఆధ్యాత్మిక చింతన.. ఎన్నో, ఎన్నెన్నో.

ప్రభుత్వోద్యోగంలో పదవీ విరమణ చేసిన నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ పేరు దినపత్రికలు చదివే వారికి, మరీ ముఖ్యంగా ఎడిటోరియల్ పేజీల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు చదివేవారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నాటి ఆంధ్రప్రభ లో 'ఆలోకన' మొదలు నేటి సాక్షి లో 'జ్యోతిర్మయం' వరకూ ఆయన వ్యాస పరంపర కొనసాగుతూనే ఉంది. వేంకట శేషయ్య పెద్ద కొడుకుగా తండ్రిని బాగా దగ్గర నుంచి చూసే అవకాశం దొరకడంతో, ఎన్నో విషయాలని సాధికారికంగా రాయగలిగారు లక్ష్మీ ప్రసాద్. ముఖ్యంగా, 'నవోదయ' పత్రికలో ఆయనకూడా స్వయంగా పాలుపంచుకోడం వల్ల ఆ పత్రిక్కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆయన సోదరుడు, ప్రముఖ చాయాచిత్రకారుడు, పాత్రికేయుడు నీలంరాజు మురళీధర్ ఛాయా చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.

పారితోషకం కోసం శ్రీశ్రీ అప్పటికప్పుడు పత్రికాఫీసులో కూర్చుని అడిగిన ఆర్టికల్ రాసిచ్చిన వైనం మొదలుకొని, నార్ల వెంకటేశ్వర రావు-ఎన్జీ రంగా ల మధ్య జరిగిన సైలెంట్ వార్ వరకూ, టంగుటూరి ప్రకాశం పంతులు ధృఢ చిత్తం మొదలు నేదురుమిల్లి జనార్ధనరెడ్డి సౌశీల్యం వరకూ ఆశ్చర్యం కలిగించే సంగతులెన్నో అడుగడుగునా కనిపిస్తాయీ పుస్తకంలో. కేవలం వేంకట శేషయ్య వ్యక్తిత్వం మాత్రమేకాదు, ఆయన చుట్టూ ఉన్న వారిని గురించి ఎన్నో సంగతులూ సందర్భోచితంగా ప్రస్తావించారు లక్ష్మీప్రసాద్. ఒకటిరెండు పునరుక్తులు, కాసిన్ని ముద్రారాక్షసాలు ఉన్నా,  అవేవీ ఆపకుండా చదివించడాన్ని ఆపగలిగేవి కాదు. వెనుకటి  తరం జీవితాలని గురించి ఆసక్తి ఉన్నవారు మెచ్చే రచన ఇది. (నవోదయ బుక్ హౌస్ పంపిణీ, పేజీలు 243, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, అక్టోబర్ 15, 2014

ఒకానొక పాట

"ఓ గాలీ, నువ్వు వెదురు సందుల్లో సంగీతం పాడడమేమిటి? శరదృతువులో వేణుగానానికి నెమలి పురివిప్పి ఆడడమేమిటి? మేఘం వెళ్ళే దారిలో మనసు తేలిపోతుంది ఎందుకని? బంధించబడి ఉన్న పుష్పం, గాలిసోకగానే రేకులు విచ్చుకుంటుంది ఎందుకని?" ...మలయాళ సినీ గేయరచయిత రఫీక్ అహ్మద్ రచించిన ఒకానొక పాట మూలార్ధానికి కొంచం దగ్గరగా ఉండే అనువాదం ఇది. అర్ధం నిన్న మొన్ననే తెలిసినా, దాదాపు పదిరోజులై ఆ పాట చెవుల్లో మారుమోగుతోంది.

"కాథే కాథే నీ పుక్కామరథిల్ పాట్టుం మూళి వణ్నో..." ఎలా ప్రవేశించిందో కానీ ఓ పది రోజుల క్రితం ఈ పాట మా ఇంట్లో ప్రవేశించింది, చాలా మామూలుగా. అలనాటి 'లవకుశ'లో సీతమ్మ వేషంలో ఉన్న అంజలీదేవి అడవులకి ప్రయాణమైనప్పుడు వినిపించే నేపధ్యసంగీతాన్ని జ్ఞప్తికి తెచ్చే ఆరంభం.. అటుపై రెండు చిత్రమైన గొంతుల్లో ఏమాత్రం అర్ధం కాని పదాలు.. భాష తెలియకపోతేనేం, ఆ గొంతుల్లో వినిపించిన ఏదో తెలియని ఆర్ద్రత కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా ఆ స్త్రీ గొంతు. అదిమొదలు, ఆ పాట మరుమోగడం మొదలైంది.


"నిన్న అనేది వట్టి కల.. నేడు అనేది కొత్త జ్ఞాపకం.. శోకాన్ని మోసిన భుజాలపై వాలడానికి వస్తోంది కొత్త వెన్నెల.. కుడిచి కుడిచి పాలు తాగే ముద్దుల దూడలు, చిన్ని చిన్ని పువ్వుల్లో ఉయ్యాలలూగే చిరుగాలులు, తేనె పలుకులెన్నింటినో చెబుతున్నాయి.. " ...దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఏమాత్రం తోచని ఈ భావానికి అర్ధాన్ని వెతుక్కోడం కన్నా ముందే, పాట పూర్వాపరాల గురించిన వెతుకులాట మొదలయ్యింది. 'సెల్యులాయిడ్' పేరుతో గత సంవత్సరం మలయాళంలో విడుదలైన సినిమా, 'జేసీ డేనియల్' పేరిట తమిళంలోకీ అనువాదం అయ్యింది. మలయాళ సినిమా పరిశ్రమకి మూలపురుషుడైన జేసీ డేనియల్ జీవిత కథ ఆధారంగా కమల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పృధ్వీరాజ్, మమత మోహన్ దాస్, చాందిని ముఖ్యపాత్రలు పోషించారు. తమిళ వీడియోల్లో  "కాత్రే కాత్రే..." దొరికింది.


"అందాల ఆకాశంలో వేయి చిలుకలు ఎగురుతున్నాయి.. పరిచయమైన చిలుకలు తూరుపు దిక్కున ఇంద్ర ధనుస్సుని చిత్రిస్తున్నాయి.." ...తమిళ వీడియోలో గాయని రికార్డింగ్ లో పాడుతోంది. ఆమె పేరు 'వైకోమ్' విజయలక్ష్మి. విలక్షణమైన గాత్రం. నాటి మేటి గాయని పి. లీల గొంతుని లీలగా గుర్తుచేసే గమకాలు. ఎంత అలవోకగా పాడేసిందసలు! గాయని వివరాలు వెతకడం మొదలయ్యింది. కేరళ లోని వైకోమ్ లో పుట్టిపెరిగిన విజయలక్ష్మికి ఎవరిదగ్గరా అభ్యసించకుండానే సంగీతం పట్టుపడింది, అదికూడా చిన్ననాడే. అంతేకాదు, 'గాయత్రివీణ' గా పిలవబడే ఏక తంత్రి వీణ మీద ఎలాంటి పాటనైనా సరే ఒకసారి వింటే చాలు అలవోకగా పలికించేయగలదు!! యూట్యూబ్ లో ఎన్ని వీడియోలో..

"మిణుగురు కళ్ళలో నక్షత్రాలు పూస్తున్నాయి.. మువ్వల సవ్వడిలో కీర్తనలు వినిపిస్తున్నాయి.. సమయం వచ్చింది, పూయడానికి.." ...పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు దాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలి అనిపించడం అత్యంత సహజం. తమిళ వీడియో కనిపించగానే, తమిళం-తెలుగు బాగా తెలిసి, సంగీతాన్ని బాగా ఇష్టపడే ఓ మిత్రుడికి షేర్ చేశాను. తన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్. నేనడిగిందే తడవుగా తమిళ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఇచ్చారు. "ఇది ట్యూన్ కి రాసినట్టుగా అనిపిస్తోంది, మలయాళీ మిత్రులెవరికన్నా ఒరిజినల్ పాట వినిపించి అర్ధం తెలుసుకోవాలి,"  రాత్రి తను పంపిన మెయిల్ సారాంశం ఇది.

"కాథే కాథే నీ పుక్కామరథిల్ పాట్టుం మూళి వణ్నో..." ...అవార్డులందుకున్న ఈ పాట ఏ పని చేస్తున్నా వెంటాడుతోంది. చివరికి నిద్రలో కూడా వదిలిపెట్టడం లేదు. అవును మరి.. జోలపాట, మేలుకొలుపు కూడా ఈ పాటే అవుతోంది కదూ. ఉదయం నిద్ర లేచేసరికి ఫోన్ లో టెక్స్ట్. మిత్రుడి నుంచి.. అర్ధరాత్రి దాటాక పంపిన సందేశం. "ఇప్పటివరకూ ఇరవైతొమ్మిది సార్లు విన్నానీ పాట.. సింప్లీ ఆసం.." ...ఇంకా ఏదో చెప్పాలనిపించి, చెప్పలేకపోవడం అర్ధమయ్యింది. అది నాకూ అనుభవమే. అనుభూతిని అక్షరాల్లో పెట్టడం అన్నది ఎల్లవేళలా సాధ్యం కాదు.. మరీ ముఖ్యంగా ఓ జేసుదాసునీ, ఓ 'వైకోమ్' విజయలక్ష్మినీ విన్నప్పుడు కలిగే అనుభూతిని. అది, ఎవరికివాళ్ళు పొందాల్సిందే.. మరో దారిలేదు.

మంగళవారం, అక్టోబర్ 14, 2014

తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలు

తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు అనిపించుకున్న ఎన్టీఆర్-ఏఎన్నార్ ల సమవయస్కుడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచే వాళ్ళకి తండ్రి, తాతగా నటించాడు. తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళయిన నటీమణులకి భర్త వేషం వేసి మెప్పించాడు. తెలుగుదనం అనగానే గుర్తొచ్చే నిలువెత్తు శాంత స్వరూపం గుమ్మడి వెంకటేశ్వరరావు. 'గుమ్మడి నాన్న' తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉంటారా? ఆ ప్రేక్షకులకి తన గురించి, తను చేసిన సినిమాల గురించీ మరోవిధంగా తెలియడానికి అవకాశం లేని ఎన్నో విషయాలకి అక్షర రూపం ఇస్తూ గుమ్మడి రాసిన పుస్తకం 'తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలు.'

గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది సాహిత్యం. ఆ వెనుకే నాటకరంగం. 'ఆంధ్రా పారిస్' అన్న ముద్దు పేరు ఉండనే ఉంది కదూ. ఆ తెనాలికి దగ్గరలో ఉన్న రావికంపాడు అనే పల్లెటూరు గుమ్మడి స్వస్థలం. వ్యవసాయం చేసుకునే ఉమ్మడి కుటుంబం. చదువంటే, మరీ ముఖ్యంగా తెలుగంటే చిన్నప్పటినుంచీ చాలా ఇష్టం గుమ్మడికి. తెలుగు మీద ఇష్టం పద్యాలు నేర్చుకోడానికి దోహదం చేస్తే, పద్యం కర్ణపేయంగా చదవగలిగే నేర్పు నాటకాల్లో అవకాశాలు ఇప్పించింది. చదువు, నాటకాలు.. స్కూలు చదువు అవుతూనే పెళ్లి.. వ్యవసాయం మీద ఆసక్తి లేకపోవడంతో తెనాలిలో చిన్న వ్యాపారం ఆరంభించడం.. ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది జీవితం.

సినిమాల మీద గుమ్మడికి ఎటువంటి అభిప్రాయమూ లేదు. కానీ, ఆయన సినిమాలకి పనికొస్తాడని దగ్గరి బంధువుల, ప్రాణ స్నేహితుల నమ్మకం. ఆ నమ్మకమే, గుమ్మడి తరపున ఆయన కోసం వాళ్ళని సినిమా వేషాలు వెతికేలా ప్రయత్నించింది. విజయా సంస్థలో భాగస్వామ్యం కోసం తెనాలి లో ఉన్న తన ఆస్తి అమ్మకం కోసం వచ్చిన చక్రపాణికి గుమ్మడిని పరిచయం చేశారు స్నేహితులు. గుమ్మడిని పరిచయం చేస్తూ "ఈ కుర్రవాడేనండీ నే చెప్పిందీ. నాటకాలే కాకుండా సినిమాలలో కూడా నటించాలనే కోర్కె ఉంది. చదువుకున్నవాడు, మనవాడు," అనడంతోనే చక్రపాణి "సినిమాలలో 'తన' 'మన' అనేవి లాభం లేదు. చదువు, సంస్కారాలు ఏవీ అక్కరకి రావు," అనేశారు.


అక్కినేనితో 'దేవదాసు' నిర్మించిన వినోదా సంస్థ నిర్మాతల్లో ఒకరైన డి.ఎల్. నారాయణ ద్వారా తొలి సినిమా అవకాశం వచ్చింది గుమ్మడికి. చిన్న చిన్న వేషాలు, అంతంత మాత్రం సంపాదన. వచ్చేది ఖర్చులకి ఏమాత్రం చాలకపోవడంతో నెలనెలా  ఇంటికి రాసి డబ్బు తెప్పించుకోడం అలవాటుగా మారింది. అప్పటికే హీరోగా కుదురుకున్న ఎన్టీఆర్ బడ్జెట్ పాఠాలు చెప్పేశారు గుమ్మడికి. "నాకు నెలకి ఐదువందలు జీతం వస్తుంది. ఇది కాకుండా సినిమా మొత్తానికి ఐదువేలు. అంటే నెలకు సుమారుగా వెయ్యి రూపాయలు. నాకు అయ్యే ఖర్చు వంద రూపాయలు మాత్రమే. రూము రెంటు యాభై, కేరేజీ పాతిక రూపాయలు. తక్కిన అమాబాపతు ఖర్చులు పాతిక. మరి మీరు అలా ఖర్చు పెడితే ఎలా?" అన్న ఎన్టీఆర్ ప్రశ్నకి జవాబు లేదు గుమ్మడి దగ్గర.

గుమ్మడి పర్సనాలిటీ చూసి హీరో వేషాలు రాకపోలేదు. కానీ, కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడితేనే ఎక్కువ రోజులు సినిమాల్లో ఉండగలవు అని చక్రపాణి చెప్పిన సలహాని పాటించారు. తనకి హాస్య పాత్రలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్నా, ఆ తరహా పాత్రలు చాలా తక్కువగానే వచ్చాయి అంటారు గుమ్మడి. పరిశ్రమలో అందరితోనూ కలుపుగోలుగా, అజాతశత్రువుగా ఉండాలన్న గుమ్మడి ప్రయత్నం ఫలించని సమయం ఒకటి ఉంది. అక్కినేని హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మిస్తున్న సమయంలో ఎన్టీఆర్-ఏఎన్నార్లమధ్య అపార్ధాలు పొడసూపినప్పుడు ఆ ఇద్దరూ కూడా మొదట గుమ్మడిని అపార్ధం చేసుకుని ఆపై అర్ధం చేసుకున్నారు. ఇలాంటి చేదు జ్ఞాపకాలని రేఖామాత్రంగా ప్రస్తావించి, తీపి గురుతుల గురించి మాత్రం విశదంగా రాశారీ పుస్తకంలో.

గీతరచయిత సి. నారాయణ రెడ్డి, నవలా రచయిత్రి దద్దనాల రంగనాయకమ్మ, నాటక రచయిత మోదుకూరి జాన్సన్.. వీళ్ళంతా సినిమా రంగానికి పరిచయం అవ్వడం వెనుక పూనిక గుమ్మడిదే. నాటకాలన్నా, సినిమాలన్నా ప్రాణం పెట్టే డాక్టర్ గాలి బాల సుందరరావు గారి ఏకైక పుత్రిక జలంధరకి పెళ్లి సంబంధం చూడడంలోనూ (వరుడు సినీ నటుడు చంద్రమోహన్) గుమ్మడిది కీలక పాత్రే. సినీ నటిగా సావిత్రి ప్రస్థానాన్ని తొలినుంచి చివరివరకూ దగ్గరినుంచి గమనించిన కొందరిలో గుమ్మడి ఒకరు. ఆమె వ్యక్తిత్వం గురించి రాసిన విశేషాలు ఆశ్చర్య పరుస్తాయి. చిత్తూరు నాగయ్యన్నా, అటెన్ బరో తీసిన 'గాంధీ' సినిమా అన్నా ఒళ్ళు మర్చిపోయేంత ఇష్టం గుమ్మడికి. ఒక్కమాటలో చెప్పాలంటే నాగయ్యలాంటి నటుడూ, వ్యక్తీ లేడు.. గాంధీ లాంటి మరో సినిమా లేదు అంటారు.

తన డెబ్భై ఐదో ఏట 'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా గుమ్మడి రాసిన కబుర్లకి విక్రమ్ పబ్లిషర్స్ సంస్థ 2001 లో పుస్తక రూపం ఇచ్చింది. గుమ్మడి పోషించిన పాత్రల అరుదైన స్టిల్స్, అనేకమంది ప్రముఖులు గుమ్మడిని గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాటు గుమ్మడి నటించిన సినిమాల జాబితాను అనుబంధంగా ఇచ్చారు. సినిమా అనుభవాలతో పాటు విదేశీ పర్యటనల విశేషాలనూ ప్రస్తావించారిందులో. గుమ్మడి మాటల్లాగే మృదువుగా సాగిపోయే కథనం ఆపకుండా చదివిస్తుందీ పుస్తకాన్ని. నాటి సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ పరిస్థితులని గురించీ తెలుసుకునే అవకాశం ఇచ్చే రచన ఇది. (పేజీలు 190, వెల రూ. 100, 'విశాలాంధ్ర' అన్ని శాఖల్లోనూ లభ్యం).

సోమవారం, అక్టోబర్ 13, 2014

ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్

ప్రభుత్వంలో ఉన్నతోద్యాలు చేసి పదవీ విరమణ చేసిన అధికారులందరూ వరుసగా తమ ఆత్మకథలని వెలువరిస్తున్నారు. అయ్యేయెస్, ఐపీఎస్ అధికారుల ఆత్మకథలు వరుసగా అందుబాటులోకి వస్తూ గడిచిన మూడు నాలుగు దశాబ్దాల పాలనలో, విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెరవెనుక జరిగిన సంగతులు సామాన్యులు తెలుసుకోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. పీవీఆర్కే ప్రసాద్  'అసలేం జరిగిందంటే,' మోహన్ కందా 'మోహన మకరందం' తర్వాత అదే వరుసలో డాక్టర్ కె.వి. రమణాచారి వెలువరించిన పుస్తకం ' ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్'

కరీంనగర్ జిల్లా నారాయణపురంలో సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించిన రమణాచారి పాఠశాల రోజులనుంచే చురుకైన విద్యార్ధిగా పేరుతెచ్చుకుని, కళాశాలకి వచ్చేసరికి తెలంగాణా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని రుచిచూశారు. కాలేజీలో చేరేందుకు ప్రధానమైన అడ్డంకి పేదరికం. కాలేజీలో చేరి కేవలం చదువుతో సరిపెట్టుకోకుండా విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొన్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా, ఉద్యమాన్ని కూడా చదువులో భాగంగానే తీసుకున్నట్టున్నారు రమణాచారి. పీజీ చదివేందుకు పేదరికంతో పాటు సంప్రదాయమూ అడ్డొచ్చింది. ఎదిరించి మరీ పీజీ పూర్తిచేసి కళాశాల లెక్చరర్ గా జీవితం ఆరంభించారు.

జీవితం పెద్ద మలుపు తిరగడానికి కారణాలు సాధారణంగా చిన్నవే అయి ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇవి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం కలిగించేంత అతిచిన్నవి అవుతాయి. లెక్చరర్ గా పనిచేసే కాలంలో కిరోసిన్ రేషన్ లో తప్ప దొరకని పరిస్థితి. రేషన్ కావాలంటే కార్డు తప్పనిసరి. కొందరు లెక్చరర్లు రేషన్ కార్డు కోసం దరకాస్తు చేయడానికి రెవిన్యూ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చిరుద్యోగి చేతిలో జరిగిన అవమానం రమణాచారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిక్షలు రాయడానికి కారణం అయ్యింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి భూ రాజస్వ మండలాధికారి (ఆర్డీవో) గా ఉద్యోగ జీవితం ప్రారంభించే నాటికి రమణాచారి వయసు కేవలం పాతికేళ్ళు.


రేషన్ కార్డు కోసం వెళ్ళినప్పుడు చూడడం తప్ప రెవిన్యూ ఆఫీసు ఎలా ఉంటుందో తెలియదు. ఎవరితో ఎలా మెలగాలో అంతకన్నా అవగాహన లేదు. ఫలితం, తొలి సంవత్సరం దాదాపు ప్రతి నెలా బదిలీలే. కాస్త కుదురుగా చేసిన ఉద్యోగం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఆర్డీవో. అక్కడినుంచి రమణాచారికి బదిలీ అయినప్పుడు ఆ ప్రాంతం ప్రజలంతా బదిలీ ఆపాలంటూ రాస్తారోకో చేయడం, ఆర్డీవోగా ఆయన పనితీరుకి ఓ చిన్న మచ్చుతునక. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పాలనాధికారి బాధ్యత రమణాచారిని రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టిలో పడేలా చేసింది.

కడప కలెక్టర్ గా రమణాచారి బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలోనే, నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కి కడపలో జరిగిన బహిరంగ సభలో దారుణమైన అవమానం జరగడం, జరిగిన సంఘటనకి కారణం కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే అయినప్పటికీ కలెక్టర్ ని బాద్యుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రమణాచారిని బదిలీ చేయడం, ఇంతజరిగినా ఐఏఎస్ అధికారుల సంఘం నోరు మెదపకపోవడం.. అటుపై జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పీవీని రాష్ట్రానికి ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసినప్పుడు సాంస్కృతిక శాఖ సంచాలకుడి హోదాలో రమణాచారే ఏర్పాట్లన్నీ స్వయంగా చూడడం... ఇదంతా ఆపకుండా చదివిస్తుంది.సంస్కృతిక శాఖ సంచాలకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతలని ఎంతో ఇష్టంగా నిర్వహించారు రమణాచారి.

ఎన్టీఆర్, చంద్రబాబులతో సౌకర్యవంతంగా పనిచేయడాన్ని వివరంగా రాస్తూ, కాంగ్రెస్ టైం లో ఎదురైన ఇబ్బందులని రేఖామాత్రంగా ప్రస్తావించారు ఈ పుస్తకంలో.  పీవీఆర్కే, మోహన్ కందాలు తమ పుస్తకాలని తామే రాసుకోగా, రమణాచారి పుస్తకాన్ని పత్రికా రచయిత చీకోలు సుందరయ్య రాశారు. చదువుతుంటే "రమణాచారే స్వయంగా రాసి ఉంటే బావుండేది" అని ఎన్నోసార్లు అనిపించింది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, కథనం విషయంలో సరైన శ్రద్ధ పెట్టలేదన్న భావన పదేపదే కలిగింది. తిరుమల 'కులశేఖరప్పడి ' ని 'కులశేఖరపది' అని రాశారు ప్రతిచోటా. కొన్ని కొన్ని ఎపిసోడ్స్ న్యూస్ పేపర్ క్లిప్పింగులని తలపించాయి. ఫోటోలన్నీ ఒక్కచోటే (చివర్లో) ఇవ్వడం మాత్రం మెచ్చుకోవాలి. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 208, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, అక్టోబర్ 06, 2014

మాటకి మాట

రాజకీయ నాయకులు ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. మంచిగానా, చెడ్డగానా అన్నది అనవసరం. వార్తల్లో ఉండడమే ముఖ్యం వాళ్లకి. హాలీవుడ్, బాలీవుడ్ లతో సహా చాలా సినిమా పరిశ్రమల్లో కూడా ఈ ధోరణి ఉంది. తారలు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, కొండొకచో వివాదాస్పదమైన సంగతులూ తరచూ ప్రసార మాధ్యమాల్లో కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.

ఎందుకోగానీ, తెలుగు సినిమా పరిశ్రమలో మొదటినుంచీ కూడా ఈ ధోరణి కనిపించదు. ఇక్కడ సినిమా వాళ్ళ గురించి గాసిప్పువార్తల ప్రచారం కొంచం తక్కువే. అలాగే, వివాదాలు ఏమన్నా ఉన్నా అవి వార్తల్లో రావడానికి పెద్దగా ఇష్టపడరు  ఇక్కడి సినిమా జనం. తెలుగు సినిమా వాళ్ళు కొందరు రాజకీయాల్లోకి వెళ్ళినా, రాజకీయ నాయకులు అనుసరించే ప్రచార ధోరణులు సినిమా రంగంలోకి రాలేదనే చెప్పాలి. అయితే, ఇప్పుడిప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా వివాదాల ప్రచారంలో మిగిలిన భాషల్ని అనుసరిస్తోందేమో అన్న సందేహం కలుగుతోంది.

ఓ నటుడికీ, ఓ దర్శకుడికీ ఓ సినిమా షూటింగ్ లో మాటా మాటా పెరిగింది. ఆ నటుడు సినిమా నుంచి తప్పుకున్నాడు (లేదా దర్శకుడే తప్పించాడు). ఇలా నటులకీ దర్శకులకీ అభిప్రాయ భేదాలొచ్చి మాటామాటా పెరిగి, సినిమా తారాగణం మారిపోవడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. భానుమతి మిస్సైన మిస్సమ్మ సినిమానే ఇందుకు సాక్ష్యం. (ఫలితంగానే తెలుగు పరిశ్రమకి సావిత్రి దొరికింది అనేవాళ్ళూ ఉన్నారు, అది వేరే విషయం). అయితే, ఇప్పటి తాజా సినిమా అలాంటిలాంటి సినిమా కాదు. అగ్రతారలున్న భారీ చిత్రరాజం.

తీరా సినిమా విడుదల అయ్యాక, అనుకున్నది ఒకటీ అయ్యింది మరొకటీ. బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుంది అనుకున్నది కాస్తా ఫలితం చూడబోతే పెట్టుబడి తిరిగి వస్తుందా అన్న సందేహాన్ని కలిగించింది. ఏదోలా జనం ఆ సినిమా చూసేలా చెయ్యాలి. ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లప్పుడెప్పుడో షూటింగులో జరిగిన వివాదం గుర్తొచ్చింది. సరిగ్గా అదే సమయంలో సినిమా నుంచి తీసివేయబడిన నటుడి మరో సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా కూడా అంచనాలని అందుకోడం కూసింత అనుమానాస్పదంగానే కనిపించింది.

అలనాటి వివాదాన్ని తవ్వితీస్తే ఉభయతారకంగా ఉంటుందని ఎవరికి అనిపించిందో కానీ, మొత్తానికి ఓ సరికొత్త వివాదం తెరమీదకి వచ్చింది. నటుడూ, దర్శకుడూ స్క్రిప్టు ప్రకారం డైలాగులు రువ్వుకున్నారు. ఇక్కడివరకూ బానే ఉంది. కానైతే, వీళ్ళిద్దరి పోరు వల్లా వాళ్ళ సినిమాల కలెక్షన్ల కన్నా ముందే టీవీ చానళ్ళ రేటింగులు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ప్రతి టీవీ చానలూ పూటా ఈ వివాదాన్ని గురించి వార్తా కథనాన్ని వండి వడ్డిస్తోంది. అసలు విషయంతో పాటు, ఆ దర్శకుడి, నటుడి పాత సినిమాల్లో క్లిప్పింగులూ అవీ చూపిస్తోంది కూడా.

ఈ మాటల యుద్ధం రెండు సినిమాలకీ ఏమాత్రం సాయ పడుతుందో తెలీదు కానీ, టీవీ చానళ్ళకీ, గాసిప్ వెబ్సైట్లకీ మాత్రం కావలసినంత ముడిసరుకుని అందిస్తోంది. ఇక్కడో చిన్న పిడకల వేట.. ఒకానొక చానల్లో వివాదం తాలూకు ప్రత్యేక కార్యక్రమం మధ్యలో వచ్చిన బ్రేక్ లో ఓ ప్రకటన వచ్చింది. "మన పెద్ద కొడుకు ఇచ్చాడు" అంటూ ఓ ముసలాయన ఫెళఫెళ్ళాడే కొత్త వెయ్యిరూపాయల నోటుని భార్యకి చూపించడం, ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోటోని గోడకున్న దేవుళ్ళ ఫోటోల పక్కన తగిలించడం ఆ ప్రకటన సారాంశం. "అన్నయ్య నా అప్పు మొత్తం తీర్చేశాడు," అంటూ ఆ దంపతుల కొడుకు - వ్యవసాయం చేసుకుంటూ - ఆనందంగా చెప్పే ప్రకటన ఎప్పుడు వస్తుందో  కదా..

ఆదివారం, అక్టోబర్ 05, 2014

ఆర్తి

ఏడాదికి రెండే పండుగలు. అవిటి (రథోత్సవం), సంకురాత్తిరి. రెండు పండగలకీ ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లడం విధాయకం అంటుంది ఎర్రెమ్మ. కూతురు సన్నెమ్మని అదే ఊళ్ళో ఉండే బంగారమ్మ కొడుకు పైడయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది నాలుగైదేళ్ళ క్రితం. పల్లెలో చేయడానికి పనిలేక, 'కళాసీ' పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోయాడు పైడయ్య. ఖర్చులు భరించలేక అక్కడ కాపురం పెట్టలేదు. ఎర్రెమ్మ మాత్రం సంప్రదాయం తప్పకుండా ఏటా రెండు పండగలకీ కూతుర్ని తీసుకెళ్ళి నెలేసి రోజులు ఉంచుకుని పంపుతోంది. ఇదిగో, ఈ తీసుకెళ్లడం దగ్గరే తగువు మొదలయ్యింది.

బంగారమ్మకి ముగ్గురు కొడుకులు. మూడోవాడు పైడయ్య. పెద్దకొడుకు నారాయుడు భార్య పిల్లల్ని కని కాలం చేసింది. రెండో కొడుకు కోటయ్య భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది. బంగారమ్మకి చెయ్యి సాయం ఉండే కోడలు సన్నెమ్మ ఒక్కర్తే. అయినా కూడా, కోడలు అవిటికీ, సంకురాత్తిరికీ పుట్టింటికి వెళ్ళడం, వెళ్ళినప్పుడల్లా నెలేసి రోజులు ఉండిపోవడం అభ్యంతరం లేదు బంగారమ్మకి. ఆమె అభ్యంతరమల్లా ఒక్కటే, రెండు పండగలకీ కూడా ముందు రోజున పుట్టింటికి వెళ్లి పండగ అయ్యాక నెల్లాళ్ళూ ఉండి రమ్మంటుంది.

ప్రతిసారీ కూడా, నెల ముందు తీసుకెళ్ళి, పండగవుతూనే పంపేస్తుంది ఎర్రెమ్మ. పైగా, నాకూతుర్ని ఎప్పుడు తీసుకెళ్ళాలో  నాకొకరు చెప్పడవా? అంటుంది నోరుగల ఎర్రెమ్మ. చినికి చినికి గాలివానగా మారిన ఆ తగువు, పైడయ్య-సన్నెమ్మ యిడబావులు (విడాకులు) పెట్టుకోడానికి సిద్ధపడే దగ్గరికి వచ్చేసింది ఆ సంకురాత్తిరి పండుగనాటికి. రెండు కుటుంబాలూ రోడ్డున పడి కొట్టేసుకున్నాక, అసిర్నాయుడు గారి సమక్షానికి వెళ్ళింది తగువు. అసిర్నాయుడు ఆ తగువు ఎలా తీర్చాడు? పైడయ్య-సన్నెమ్మ కలిశారా లేదా అన్నదే తెలుగు సాహితీ లోకం కారా మేష్టారుగా పిలుచుకునే కాళీపట్నం రామారావు నాలుగున్నర దశాబ్దాల క్రితం రాసిన 'ఆర్తి' కథ.

సుందరపాలెం గ్రామంలో జరిగిన 'యజ్ఞం' మొదలు, స్వతంత్ర భారత దేశం మీద జరిగిన 'కుట్ర' వరకూ ఎన్నో ఇతివృత్తాలతో మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు రాసిన కారా మేష్టారు 'మానవ సంబంధాలు' ఇతివృత్తంగా రాసిన కథ 'ఆర్తి.' కథా స్థలం పూర్వపు గంజాం జిల్లా. అక్కడ మనుషుల్లాగే, ఆచారాలు కూడా ఒరియా తెలుగుల కలగాపులగంగా ఉంటాయి. అలాంటి ఊరు చివర ఉన్న పల్లెలో కూతవేటు దూరంలో ఉన్న రెండు కుటుంబాలు బంగారమ్మ, ఎర్రెమ్మలవి. కరువు బారిన పడిన పల్లెలో పండుగ కళ లేకపోయినా, సంక్రాంతికి పట్నం నుంచి ఇంటికొచ్చాడు పైడయ్య. ఎర్రెమ్మ వచ్చి అల్లుడిని పండక్కి పిలవడం కథా ప్రారంభం.

పండక్కి నెల్లాళ్ళ ముందే, సన్నెమ్మని పంపే విషయంలో వీరకత్తెలిద్దరూ జుట్టూ జుట్టూ పట్టేసుకోగా, అత్త మాట వినకుండా అమ్మ వెనుక పుట్టింటికి వెళ్ళిపోయింది సన్నెమ్మ. ఆ కోపం కడుపులో పెట్టేసుకుంది బంగారమ్మ. పండుగపూటా ఆడవాళ్ళిద్దరూ మళ్ళీ తలపడిపోయే పరిస్థితి వచ్చేయడంతో, తను రంగంలోకి దిగి సర్దిచెప్పాడు పైడయ్య పెద్దన్న నారాయుడు. ఇలా లాభం లేదనుకున్న పైడయ్య, సన్నెమ్మని ఒంటరిగా కలుసుకుని ఏం జరిగిందో అడుగుతాడు. తను ఏం చెయ్యాలో చెప్పమంటాడు. ఆ ప్రకారం నడుస్తానంటాడు. "ఇలాటివి ఆడమనిషిని నాన్సెప్పా రాదు. నాన్సెప్పినా ఆ సెప్పినట్టు నువ్ నడారాదు" అని తేల్చేస్తుంది సన్నెమ్మ.

మధ్యేమార్గంగా, ఆమెని మాపిటికి తవిటప్ప గారింటికి ఓపాలి రమ్మంటాడు పైడయ్య. అప్పుడు కూడా ఏమీ మాట్లాడదు ఆమె. పైడయ్య చెప్పినదాంట్లో న్యాయం కనిపిస్తుంది పక్కింటి నరసమ్మకి. సన్నెమ్మకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంది. మొగుడు చెయ్యి దాటిపోకుండా కాసుకోవాలని జాగ్రత్తలు చెబుతుంది. చెవిన పెట్టదు సన్నెమ్మ. ఒళ్ళు ఎర పెట్టి మొగుణ్ణి తెచ్చుకోవడం తనకి చేతకాదని తెగేసి చెప్పేస్తుంది. ఇంటి పరిస్థితులూ, తన పరిస్థితులూ తర్కించుకునే పనిలో పడ్డ పైడయ్య పట్నం వెళ్లి తను సాధిస్తున్నది ఏమిటన్న ప్రశ్న దగ్గర ఆగిపోతాడు.

పండుగ రోజు రాత్రి ఒళ్ళు పట్టని కోపంతో బంగారమ్మ ఇంటి మీదకి యుద్ధానికి వెడుతుంది ఎర్రెమ్మ. అంతే కోపంతో ఉన్న పైడయ్య చిన్నన్న కోటయ్య ఆమె మీద చెయ్యి చేసుకోడమే కాదు, సన్నెమ్మని బెదిరించి తీసుకొచ్చి తమ్ముడికి అప్పగిస్తాడు.అదిగో, అప్పుడు న్యాయం చెప్పమంటూ అసిర్నాయుడు గుమ్మం తొక్కుతుంది ఎర్రెమ్మ. అసిరిబాబు తీర్పు ఏమిటన్నది కథలో చదవడమే బాగుంటుంది. (మనసు ఫౌండేషన్ ముద్రించి, ఎమెస్కో పునర్ముద్రించిన 'కాళీపట్నం రామారావు రచనలు' సంపుటంలో ఉందీ పాతిక పేజీల కథ).