గురువారం, జులై 21, 2011

రాజశేఖర చరిత్రము

తెలుగులో తొలి నవల కందుకూరి వీరేశలింగం రచించిన 'రాజశేఖర చరిత్రము.' నూట ముప్ఫై మూడేళ్ళ క్రితం, వీరేశలింగం తన పత్రిక 'వివేక వర్ధని' లో సీరియల్ గా ప్రచురించిన ఈ నవల తర్వాతి కాలంలో ఎన్నో ప్రచురణలు పొందింది. ఐరిష్ రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన 'ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' కి స్వేచ్చానుసరణగా రచయిత చేత ప్రకటింపబడిన ఈనవల ఆసాంతమూ అచ్చతెనుగు నుడికారంతో హాయిగా సాగుతుంది. కథా స్థలాలు ధవళేశ్వరం, రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం కాగా, రచనాకాలానికి రెండు వందల సంవత్సరాలకి పూర్వం జరిగిన కథగా పాఠకులకి చెప్పారు రచయిత.

ప్రధాన పాత్ర గోటేటి రాజశేఖరుడు రాజమహేంద్రవరానికి సమీపంలోని ధవళేశ్వరం గ్రామంలో భార్య మాణిక్యాంబ, కుమార్తెలు రుక్మిణి, సీత, కుమారుడు సుబ్రహ్మణ్యంతో నివసిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఇరవై, ముప్ఫై మంది బంధువులకి తక్కువకాకుండా ఇంటినిండా బంధు జనం. దూరపు చుట్టాలు సైతం పనిగట్టుకుని వచ్చి నెలల తరబడి ఉండిపోతూ ఉంటారు. ఇక రాజశేఖరుడు గారిని పొగిడి పబ్బం గడుపుకునే ఊరిజనానికి లోటు లేదు. కాశీ యాత్రకి వెళ్ళిన రాజశేఖరుడు గారి పెద్దల్లుడు నృసింహ స్వామి మార్గమధ్యంలో చనిపోయాడని వార్త రావడంతో కష్టాలు మొదలవుతాయి ఆ ఇంట్లో.

రుక్మిణికి అనారోగ్యం మొదలు కావడంతో దానిని నయం చేయడంకోసం వచ్చే భూత వైద్యులు, వాళ్ళు చేసే రకరకాల వైద్యాలు, పోయిన వస్తువులని అంజనం వేసి వెతికే వాళ్ళు, రాగిని బంగారంగా మారుస్తామని చెప్పే గోసాయిలు.. ఇలా ఇల్లంతా తిరునాళగా మారుతుంది. బంగారు నగలని రెట్టింపు చేసిస్తానన్న గోసాయి మాటలు నమ్మిన రాజశేఖరుడు, ఇంట్లో బంగారం మొత్తం అతని చేతిలో పెట్టడం, అతగాడు నగలన్నీ పట్టుకుని ఉడాయించడంతో అంత గొప్ప రాజశేఖరుడూ కుటుంబంతో సహా రోడ్డున పడతాడు. ఒకప్పుడు ఆహా ఓహో అన్నవాళ్లు పలకరించినా తిరిగి చూడడం లేదు. ముప్పొద్దులా అతని ఇంట భోజనం చేసిన వాళ్ళూ, చేబదుళ్లు తీసుకున్న వాళ్ళూ ముఖం చాటేస్తారు.

తన చుట్టూ ఉన్న వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్న రాజశేఖరుడికి, కుటుంబంతో కలిసి కాశీయాత్ర చేసి రావాలన్న సంకల్పం కలుగుతుంది. ఇంటిని తాకట్టు పెట్టి, యాత్రకి బయలుదేరిన ఆకుటుంబానికి దారిలో ఎదురైన అనుభవాలతో పాటుగా, పోగొట్టుకున్న సంపదని తిరిగి పొందడం, విలువైన పాఠాలు నేర్చుకోవడంతో నవల ముగుస్తుంది. 'తొలి నవల' అనగానే బుడి బుడి అడుగులని ఊహించుకునే పాఠకులని ఆశ్చర్య పరుస్తూ, అతి తక్కువ నాటకీయతతో, ఉత్కంఠ భరితమైన మలుపులతో ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే కథనం ఈ నవల ప్రత్యేకత. ధవళేశ్వరములోని ధవళగిరి వర్ణనతో మొదలయ్యే ఈ నవల, ప్రారంభంలో వ్యాస రూపంలో ఉన్నా పేజీలు తిరిగే కొద్దీ కథ మొదలై రాను రాను విడవకుండా చదివిస్తుంది.

అప్పటికే సంఘ సంస్కారం మొదలు పెట్టిన వీరేశలింగం ఆనాటి సాంఘిక సమస్యలనన్నింటినీ కథానుసారంగా చర్చకి పెట్టారు నవలలో. గ్రహదోషాలు, జాతకాలు, బాల్య వివావాహాలు, వితంతువుల సమస్యలు, చోర భయం లాంటి ఎన్నో అంశాలని కథలో భాగం చేశారు. అయితే, కుటుంబ సభ్యులంతా విడిపోవడం, మళ్ళీ కలవలవడం, ఊహించని విధంగా వారికి అందే సహాయాలు ఇవన్నీ కొంత నాటకీయంగా అనిపించినా తొలి నవలలో ఈమాత్రం నాటకీయత ఉండడం సహజమేనని సరిపెట్టుకోగలం. కథని ఎన్నో మలుపులు తిప్పినా, సుఖాంతం చేశారు చివరికి. మనుషుల నిజ గుణాలని తెలుసుకున్న రాజశేఖరుడు తిరిగి పూర్వ వైభవం పొందాక వారితో ఎలా వ్యవహరించాడన్నది సైతం విపులంగా రాశారు. "కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు... వీరేశలింగమొకడు మిగిలెను చాలు" లైన్స్ గుర్తొస్తూ ఉంటాయి, నవల చదువుతుంటే.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1987 నుంచీ పదేపదే ప్రచురిస్తున్నఈ నవలలో మెచ్చుకోవాల్సిన అంశం ఫుట్ నోట్స్. ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫుట్ నోట్స్ సాయంతో, నవలలో కొన్ని సన్నివేశాలకి మూలాలని, కొన్ని పదాలకి అర్ధాల్ని, అలాగే అలాంటి సంఘటననే పోలిన సంఘటనలు రచయిత జీవితంలో జరిగిన వైనం, 'స్వీయ చరిత్ర' లో అందుకు సంబంధించిన వివరాల్నీ విపులంగా తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి పెరగడాన్ని గురించీ కూడా ఫుట్ నోట్స్ లో ప్రచురణ కర్తలు వివరించారు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం దూరదర్శన్లో ధారావాహిక గా ప్రసారమైన 'రాజశేఖర చరిత్రము' లో దేవదాస్ కనకాల కుటుంబం రాజశేఖరుడి కుటుంబంగా కనిపించింది. విశాలాంధ్రతో పాటు, అన్ని పుస్తకాల షాపులూ, ఏవీకెఎఫ్ లోనూ లభ్యం. (పేజీలు 223, వెల రూ. 60).

4 కామెంట్‌లు:

  1. రేడియో నాటకం కూడా చాల బాగుంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో..పాత్రలకి..జీవం పోశారు అని చెప్పవచ్చు. మీ పరిచయం మళ్ళీ ఆ నాటికని.. గుర్తుకు తెచ్చాయి. ఆ నవలలోని కొన్ని సమస్యలు ఇంకా మన మద్య వేళ్ళూనుకుని ఉన్నాయి.నా కైతే మనం ఇంకా నట్టడవిలోనే ఉన్నామని గుర్తు చేస్తుంది..అనుకుంటాను. బాగుంది. పరిచయం కి..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. నా సొంత లైబ్రరీ మొదలైందే ఈ నవలతొ.అప్పట్లో మా తెలుగు మేడం (పద్మావతి గారు) సమ్మర్ హాలిడేసు గాలికి తిరక్కుండా ఇలాంటి పుస్తకాలు చదువుకొమ్మంటూ ఓ లిస్ట్ ఇచ్చారు. ఓ ఐదు నెలలు పాకెట్ మనీ (అంటె సైకిలు గాలి కొట్టించుకోవడాలూ, పంచరు వేయించుకోవడాలూ, రికార్డ్ షీట్స్ కొనుక్కోవడాలు, ఎప్పుడన్నా ఇంట్లో జనం మీద అలిగి తిండి మానేసి, కాంటీనులొ మింగడాలకు, ఇలాంటి ఖర్చులకు నెలకు ఇంత అని ఇచ్చేది అమ్మ.
    ఆ డబ్బులు కూడేసి ఈ పుస్తకం, కన్యాశుల్కం (ఇదైతే ఓ 150 సార్లు చదివి ఉంటాను),రామాయణ విషవృక్షం, వేయి పడగలు కొన్నాను (ఈ పుస్తకం చదివాక జీవితంలొ ఈయన పుస్తకాలు చదవకూడదని ఒట్టు వేసుకొన్నాను).ఈ నవల గురించి వేరె చర్చ ఏమీ మొదలు పెట్టను కానీ ఎందుకొ ఓ special place అంతె. ఈ Title చూసి ఇదంతా గుర్తుకు వచ్చింది.

    రిప్లయితొలగించండి
  3. ఇది డీడీ లో చూసినప్పుడు చాలా నచ్చింది. ఈ మధ్యనే ఈ పుస్తకం కొన్నాను కానీ హడావిడి లో చూసుకోలేదు,నేను కొన్న పుస్తకం "సహవాసి" చే సరళీకరించబడినది. ఈ సారి ఒరిజినల్ కొనాలి

    రిప్లయితొలగించండి
  4. @వనజ వనమాలి: నిజమేనండీ.. కొన్ని సమస్యలు ఇప్పటికీ ఎక్కడో అక్కడ అదే రూపంలో ఉన్నాయి.. ధన్యవాదాలు.
    @సునీత: బాగున్నాయండీ జ్ఞాపకాలు.. పాకెట్ మనీ తో పుస్తకాలు కొనడం ఎంతగా నచ్చేసిందో చెప్పలేను.. ఇకపోతే, నాకూ భిన్నమైన అభిప్రాయాలే ఉన్నప్పటికీ 'ఏకవీర' చదవాలన్న కోరిక ఒకటి మాత్రం ఉందండీ.. ఎప్పటికి తీరుతుందో మరి.. ధన్యవాదాలు.
    @రిషి: విశాలాంధ్ర వాళ్ళు మొత్తం నవలని ఫుట్ నోట్స్ తో సహా వేశారండీ.. తాజా ప్రింట్ ఇంకా బాగుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి