గురువారం, జనవరి 28, 2016

ఎక్స్ ప్రెస్ రాజా

స్క్రీన్ టైంని గౌరవించే దర్శకుడు ఎలాంటి కథని ఎంచుకున్నా ప్రేక్షకుడిని చివరికంటా థియేటర్లో కూర్చోపెడతా డనడానికి తాజా ఉదాహరణ మేర్లపాక గాంధీ. 'స్వాతి' మార్కు సరసమైన సీరియళ్ళ రచయిత మేర్లపాక మురళిగారబ్బాయి దర్శకత్వంలో వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా సంక్రాంతి పోటీని తట్టుకుని థియేటర్లలో నిలబడిందని తెలియగానే చూసేందుకు మొదలుపెట్టిన ప్రయత్నాలు ఎట్టకేలకి ఫలించాయి. దర్శకుడికి మాత్రమే కాదు, సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.

సినిమా కథలో సింహభాగం రోడ్డు మీదే జరిగితే అలాంటి సినిమాలకి 'రోడ్ మూవీ' లని పేరు. శర్వానంద్-సురభి జంటగా వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా' కథ ఎనభైశాతం రోడ్డు మీదే జరుగుతుంది. ప్రధాన పాత్రలు ఇళ్ళలో కన్నా, రోడ్ల మీదే ఎక్కువసమయం గడుపుతాయి. కథ కూడా కొత్తదేమీ కాదు. సింగల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న ప్రేమకథ. అయితే, ఆ పాయింట్ బలంగా ఉండడం, అల్లికలో శ్రద్ధ చూపించడం వల్ల ఆరంభంలో మొదలైన ఆసక్తి ఎండ్ టైటిల్స్ వరకూ ఏకరీతిలో కొనసాగింది.

హాస్యాన్నీ, ఉత్కంఠతనీ సమపాళ్లలో రంగరించి రాసుకున్న స్క్రిప్టులో ప్రేమకథని ప్రయాణాలూ, చేజింగులూ డామినేట్ చేసేసిన భావన కలగడం, చివరి పాట ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకునేలా ఉండడం మినహా, వంక పెట్టడానికేమీ లేదీ సినిమాలో. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇవ్వడం మాత్రమే కాదు, ప్రారంభాన్నీ, ముగింపునీ కూడా ఇచ్చే విధంగా కథ రాసుకోవడం వల్ల ఎక్కడా అనవసర పాత్రలకీ, సన్నివేశాలకీ చోటు లేకపోయింది. చూస్తున్నంత సేపూ 'బొంబాయి ప్రియుడు' సినిమాలో డైమండ్ మొదలు, 'యమలీల' సినిమాలో చెల్లిపెళ్ళి వరకూ చూసేసిన సినిమాలు చాలానే గుర్తొచ్చినా, సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు.


చిన్ననాటి అనుభవాల కారణంగా కుక్కల్ని విపరీతంగా ద్వేషించే రాజా (శర్వానంద్), ఉద్యోగం కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ పెంపుడు కుక్కపిల్లని ప్రాణంగా ప్రేమించే అమ్మూ (సురభి) తో ప్రేమలో పడతాడు. రాజా చేసిన ఓ పని కారణంగా తప్పిపోయిన ఆ కుక్కపిల్ల చిన్న విలన్ దగ్గరికి చేరితే, తన ప్రేమని గెలిపించుకోడం కోసం ఆ కుక్కపిల్లని దొంగిలిస్తాడు. చిన్న విలన్ భవిష్యత్తు మొత్తం ఆ కుక్కపిల్లతో ముడిపడి ఉంది. హీరోయిన్ కి మెయిన్ విలన్ తో పెళ్లి నిశ్చయం కావడంతో కథ నెల్లూరికి మారుతుంది. అక్కడ మెయిన్ విలన్ తల్లికీ ఒకానొక కారణానికి ఆ కుక్కపిల్ల కావాలి. అంతే కాదు, అనూహ్యంగా ఓ కేసులో చిక్కుకున్న హీరో తండ్రిని రక్షించగలిగేదీ ఆ కుక్కపిల్లే!!

ఓ మామూలు కుక్కపిల్లకి ఇంతలేసి శక్తులు ఎలా వచ్చాయీ అంటే, దర్శకుడు పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్ వల్ల. క్లాసూ, మాసూ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చే విధంగా రాసుకున్న స్క్రీన్ ప్లే వల్ల. ఏ పాత్ర విషయంలోనూ, ఏ సన్నివేశంలోనూ కుక్కపిల్లని మర్చిపోలేదు దర్శకుడు. చివరికి విలన్ కీ, హీరోకీ మధ్య వచ్చే కాన్ ఫ్లిక్ట్ కి కూడా హీరోయిన్ కన్నా ముందుగా కుక్కపిల్లే కారణం! విలన్ తల్లి వీరభద్రమ్మగా చేసిన ఊర్వశి థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా గుర్తొచ్చి నవ్విస్తుంది. హీరో స్నేహితులుగా ప్రభాస్ శ్రీను, సప్తగిరి లకి పూర్తి నిడివి పాత్రలు దొరికాయి.

'జబర్దస్త్' హాస్యనటులు ధనరాజ్, శంకర్ లవి చిన్న పాత్రలే అయినా అవి లేకపోతే కథలో మలుపుల్లేవు.హరీష్ ఉత్తమన్ స్థానంలో ఎవరన్నా తెలుగు విలన్ని (కనీసం కొత్త నటుడు) తీసుకుని ఉంటే బాగుండేది. పోసాని, నాగినీడు, సూర్య, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. శర్వానంద్ సినిమా అనగానే 'పర్లేదు చూడొచ్చు' అన్న నమ్మకాన్ని సినిమా సినిమాకీ పెంచుకుంటున్నాడు. సురభికి బలమైన సన్నివేశాలు పెద్దగా లేవు. ప్రవీణ్ లక్కరాజు  నేపధ్య సంగీతం 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' ని గుర్తు చేసింది. మొత్తం మీద అందరికీ నచ్చే సినిమా 'ఎక్స్ ప్రెస్ రాజా.'

ఆదివారం, జనవరి 24, 2016

ఏడడుగులు ...

రోజులు వారాలుగా, వారాలు నెలలుగా చూస్తుండగానే తిరిగిపోయి మరో ఏడాది గడిచిపోయింది. 'నెమలికన్ను' ఏడేళ్ళు పూర్తిచేసుకుని ఎనిమిదో ఏట అడుగుపెడుతోంది. ఒకానొక చిత్తచాంచల్యానికి 'సెవెన్ ఇయర్స్ ఇచ్' అని ఓ ముద్దుపేరు పెట్టాడు ఇంగ్లీష్ వాడు. అది పెళ్ళికి సంబంధించిందే అయినప్పటికీ, ఏడేళ్ళు అనుకోగానే అప్రయత్నంగా గుర్తొచ్చేసింది. అమంగళం ప్రతిహతమగుగాక! పుట్టినరోజు కాబట్టి, గడిచిన ఏడాది తాలూకు  బ్లాగింగ్ పరిణామాలని గురించి మాట్లాడుకుందాం..

పరిమాణం పరంగా గతేడాదితో పోలిస్తే పోస్టుల సంఖ్య తక్కువే. అయితే, వెనక్కి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించేలా రాశికి అరడజను కథలు రాశాను. 'గులాబీరంగు వోణీ' తో మొదలుపెట్టి, 'వర్ణచిత్రం,' 'తెరవెనుక,' 'అడివిదారి,' 'గుడి ఎనక నాసామి' మరియు 'అర్జున మంత్రం' అచ్చేశాను. వీటిలో మొదటి కథకి బోల్డన్ని ప్రశంసలూ, చివరిదానికి తగుమాత్రం విమర్శలూ అందుకున్నాను. పోస్టుల సంఖ్య తగ్గడానికి ఈ కథల పెరుగుదల కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనిపిస్తోంది.

పోస్టుల విషయంలో స్పందించినట్టే, కథల విషయంలోనూ ముక్కుసూటిగా అభిప్రాయాలు చెప్పి నాకు తోడ్పడుతున్న బ్లాగ్మిత్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గతంతో పోల్చినప్పుడు బ్లాగు పాఠకులు పెరగడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్న మరో విషయం. గతేడాది రాసిన మొత్తం టపాల్లో అత్యధిక సంఖ్యలో పాఠకులు చదివిన పోస్టు 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.' నిజానికి ఏడాది కాలంలో చూసిన వాటిలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది. బోల్డంత నాటకీయత ఉన్నప్పటికీ సినిమాని ఆస్వాదించడానికి అదేమీ అడ్డంకి కాలేదు మరి.


కొత్త పుస్తకాలు చదివే విషయంలో అసంతృప్తి కొనసాగింది. చదివిన వాటిలో 'కరుణకుమార కథలు,' 'దేవర కోటేశు,' 'భూచక్రం,' 'కొల్లాయిగట్టితేనేమి' నవలలు మళ్ళీ చదివించాయి. శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం కోసం ఎదురు చూడడంలోనే ఏడాది గడిచిపోయింది. పుస్తకం చేతికి రావడం ఇక 'మనసు' వారి దయ. పాత పుస్తకాల రివిజన్ మాత్రం కొంచం సంతృప్తికరంగానే సాగింది. ఏడాది కాలంలో మరణ వార్తలు కొంచం ఎక్కువగానే విన్నాను. సినీ, సాహితీ రంగాల ప్రముఖులతో పాటు వ్యక్తిగతంగా ఆప్తులైన వారూ దూరమయ్యారు. కాలం తన పని తను చేసుకుపోతోంది.

సినీసంగీత, సాహిత్య రంగాలవారిని కొందరిని కలుసుకునే అవకాశాలు అనుకోకుండా దొరికాయి. అయితే, ఆ కబుర్లని బ్లాగ్మిత్రులతో పంచుకోడం మాత్రం వీలుపడలేదు. సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావించాలి ఆ సంగతులని. కాలం తెలియకుండా గడిచిపోవడం అనేది నిత్య సత్యమే అయినా, ఈసారి మాత్రం మరింత వేగంగా ఏడాది గడిచిపోయినట్టు అనిపిస్తోంది, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే. గత పుట్టినరోజున రాసిన పోస్టు ఇప్పుడు చదువుకుంటే, అందులో రాసిన 'చేయాల్సిన పనులు' దాదాపుగా అలానే ఉండిపోయాయి. కాలం పరుగుని అందుకోవాల్సిందే.

వ్యాఖ్యలు, మెయిల్స్ ద్వారా నా బ్లాగింగుని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కామెంట్ బాక్సుని ఉపయోగించడానికి ఇబ్బందులు ఉన్నవారు, వ్యాఖ్య కన్నా వివరంగా అభిప్రాయం పంచుకోవాలి అనుకున్నవారూ తప్పకుండా మెయిల్ చేయచ్చు. ఇక, అక్షరాల్లో కమిట్ అవ్వడం కొంచం కష్టమైన పనే కానీ, చదవాల్సినవీ, రాయాల్సినవీ చాలానే ఉన్నాయి. చూస్తుండగానే ఏడేళ్ళు పూర్తయ్యాయంటే ఆశ్చర్యం, ఆనందం.. అయితే, There is a long way to go..

మంగళవారం, జనవరి 19, 2016

వాళ్ళు వెళ్ళిపోయాక ...

మృత్యువుని అల్లుకుని ఉండే రాజకీయాలు ప్రతిసారీ  ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఆప్తుల మరణాలని, అనంతరం జరిగే అనేకానేక పరిణామాలని దగ్గర నుంచి చూడడం కొత్త కాకపోయినా, చూసిన ప్రతిసారీ అనేక కొత్త ఆశ్చర్యాలు, మరెన్నో ప్రశ్నలు చుట్టుముడుతూ ఉంటాయి. మిగిలిన ప్రపంచం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో దగ్గరవాళ్ళిద్దరు రెండు రోజుల తేడాతో దూరమయ్యారు. ఇద్దరూ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న వాళ్ళే కాబట్టి, వాళ్ళ మరణం ఊహాతీతం కాదు.

నిజం చెప్పాలంటే ఇద్దరి కుటుంబ సభ్యులు, బంధువులూ, స్నేహితులూ మరణ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడే ఉన్నారు. అయితే, అంత్యక్రియల తతంగం - వాడుక భాషలో కర్మకాండ - ముగియక మునుపే రాజకీయాలు మొదలయ్యాయి. దశ దిన కర్మ పూర్తయ్యే వరకూ ఆస్తిపాస్తులు, వారసత్వాల సంగతులు బహిరంగంగా చర్చకి వచ్చే సంప్రదాయం కాదు కాబట్టి, తెరవెనుక అనేకానేక సంగతులు జరుగుతున్నాయి. పోయిన వాళ్ళతో ఉన్న దగ్గరతనం దృష్ట్యా, జరుగుతున్న సంగతులు వద్దన్నా నా చెవిన పడుతున్నాయి.

పోయిన ఇద్దరిలో ఒకాయన కొడుకులంటే ఆయన సర్కిల్ లోనే ఉన్న ఒకానొక పెద్దమనిషికి సరిపడదు. వాళ్ళని మాట అనే అవకాశం కోసం కాసుకుని ఉంటాడు. తండ్రి బతికి ఉన్నంతకాలం తన పిల్లల మీద ఈగ వాలనివ్వలేదు. ఆ కట్టె కాలిపోవడంతోనే, పెద్దమనిషి ప్రచారం మొదలయ్యింది. "చివరి క్షణాల్లో పిల్లలెవరూ దగ్గర లేరు.. తులసి నీళ్ళు నేనే పోశాను.. పోనీలే, ఆ పుణ్యం నాకు దక్కింది.." తన కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ పనికట్టుకుని ఫోన్ చేసి మరీ చెబుతున్నాడు. అది పచ్చి అబద్ధమని తెలిసిన వాళ్ళు కొద్దిమందే. మిగిలిన వాళ్ళిప్పుడు అది నిజమేనా అన్న సందిగ్ధంలో ఉన్నారు.

పెద్దమనిషి ఫోన్ అందుకున్న ఒకాయన ఫోన్ చేసి "ఆ తండ్రి తన పిల్లని ఎంత ప్రేమగా చూసుకున్నాడు.. వాళ్ళు చూడండి, ఆయన అవసరానికి అక్కరకి రాకుండా పోయారు.." అంటూ మొదలు పెట్టి, లోకం మీద కొడుకులందరినీ దుమ్మెత్తిపోయడంతో అవాక్కవ్వడం నా వంతయ్యింది. ఇక వినలేక, అసలు జరిగిందేమిటో, సదరు పెద్దమనిషి సమస్యేమిటో కుండ బద్దలుకొట్టేశాను. కానైతే, నా మాట నమ్మాలని ఏముంది? ఆ పోయినాయాన్ని అడ్డం పెట్టుకుని, "ఆయన నన్నప్పుడు అలా మెచ్చుకున్నాడు.." అంటూ స్వోత్కర్షలు.. అసలు విషయాలు తెలిసి, ఈ అబద్ధాలు వినడం ఎంత కష్టం అసలు..

ఇక, రెండో చోట పరిస్థితి మరీ దారుణం. మూడేళ్ళ పాటు కష్టపడి సొంత ఇల్లు కట్టుకుని, ఇల్లు పూర్తవుతున్న సమయంలో తీవ్రంగా అనారోగ్యం చేసి నడివయసులోనే ప్రాణం వదిలాడాయన, అది కూడా వృద్ధులైన తన తల్లిదండ్రుల సమక్షంలో. ఆ తల్లిదండ్రులకెంత క్షోభ.. ఆ కుటుంబానికి శ్రేయోభిలాషిగా చెప్పుకునే పెద్దమనిషికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. అంత్యక్రియలన్నా పూర్తి కాకమునుపే పంచాంగం తిరగేసి, "పోయిన ముహూర్తం అస్సలు మంచిది కాదు.. ఇల్లు పాడు పెట్టకపోతే పెద్ద ప్రాణాలు రెంటికీ ప్రమాదం.." అని అందరినీ చూస్తూ ప్రకటించాడు.

అక్కడితో ఆగలేదు. "కొంత డబ్బు అప్పుతెచ్చి కట్టారు ఇల్లు.. ఇప్పుడు తీర్చలేరు కదా.. బేంకు వాళ్ళు వేలానికి పెట్టేస్తారేమో.. చూసుకోవాలి.." అంటూ ప్రసంగిస్తూ ఉంటే, చుట్టూ ఉన్న అందరూ అతనివైపు అసహ్యంగా ఓ చూపు చూసి, జరగాల్సిన కార్యక్రమం వైపు దృష్టి పెట్టారు. 'నలుగురిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాలనే కోరిక వీళ్ళ చేత ఇలా అసందర్భంగా మాట్లాడేలా చేస్తుందా?' అన్న ఆలోచన మాత్రం తెగలేదింకా..

గురువారం, జనవరి 07, 2016

నాణేనికి మరోవైపు

సుమారు పాతికేళ్ళ క్రితం మాట.. అప్పుడప్పుడే కొత్తగా జనబాహుళ్యంలోకి వస్తున్న 'ప్రపంచీకరణ' అంటే ఏమిటన్న చర్చ జరుగుతోంది."మరేమీ లేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకి జలుబు చేస్తే, ప్రపంచ దేశాలన్నింటికీ తుమ్ములు రావడం" అన్నాడో పెద్దాయన. ప్రపంచీకరణ కారణంగా మార్కెట్లు పతనం అవుతున్న ప్రతిసారీ ఆయన మాటలు నాచెవిలో రింగుమంటూ ఉంటాయి. తాజాగా, గడిచిన మూడు రోజులుగా షేర్ మార్కెట్ తిరోగమనంలో ఉండడం చూసినప్పుడు సహజంగానే ఆ పెద్దమనిషి మాట మళ్ళీ గుర్తొచ్చింది.

ఆయన భాషలో, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకి వస్తున్న 'తుమ్ములకి' కారణం అమెరికా కాదు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన చైనా. గడిచిన పదేళ్లుగా వెలుగులు విరజిమ్మిన చైనా మార్కెట్టు ఒక్కసారిగా పతనమవ్వడం ప్రారంభమయ్యింది. ఇనుము, ఉక్కు తదితర కమోడిటీస్ అన్నింటికీ చైనా మార్కెట్లో విలువ పడిపోవడంతో మొదలయిన తిరోగమనం, ఆ దేశం తన కరెన్సీ విలువని తగ్గించడంతో వేగం అందుకుంది. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు స్టాక్ ఎక్స్చేంజి కార్యకలాపాలని సగంలోనే ఆపేసింది చైనా.

మామూలప్పుడు మన శరీరంలో ఏదన్నా చిన్న తేడా చేస్తే, ఒకట్రెండు రోజుల్లో సర్దుకుంటుంది లెమ్మని ఊరుకుంటాం. అదే మనకి జలుబు చేసినప్పుడు ఇంకేదన్నా తేడా చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగెడతాం. ఎందుకంటే, జలుబుతో పాటు వచ్చే అనారోగ్యం ఓ పట్టాన తగ్గదని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు, చైనా జలుబుతో పాటుగా వచ్చిన మరికొన్ని అనారోగ్యాల తాలూకు ఫలితాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. చైనా సరిహద్దు దేశమైన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబుని పరీక్షించింది. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. లిబియా అశాంతి సరేసరి.

విడివిడిగా చూసినప్పుడు వీటికి ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేసేంత శక్తి లేనప్పటికీ, చైనా మాంద్యం దెబ్బకి విలవిలలాడుతున్న పెట్టుబడిదారులని ఈ అననుకూల పరిస్థితులు ఆచితూచి అడుగేసేలా ప్రోత్సహిస్తున్నాయి. చైనా సంక్షోభం ప్రభావం భారత దేశంతో పాటుగా జపాన్, సింగపూర్ తదితర దేశాలమీదా కనిపిస్తోంది. ఒక్క భారత దేశం సంగతే తీసుకుంటే, బ్యాంకింగ్, భారీపరిశ్రమలు, నిర్మాణ రంగం, ఔషధ పరిశ్రమల షేర్ల ధరలు పతనమయ్యాయి. అమెరికన్ డాలర్ విలువ అరవై ఏడు రూపాయలకి దగ్గరలో ఉంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు శరవేగంతో పెరుగుతున్నాయి.

దేశీయంగా మార్కెట్ నష్టాలని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ప్రయత్నం ప్రపంచ దేశాలన్నింటి వైపు నుంచీ జరగాల్సి ఉండగా, వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. మిగిలిన దేశాలన్నీ కరెన్సీ విలువని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉండగా, అమెరికా ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకుని తన డాలర్ ని బలపరుచుకునే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. పక్క వ్యాపారి నష్టాన్ని తన లాభంగా మార్చుకునే వాణిజ్య మనస్తత్వాన్ని తప్పు పట్టలేం.

ఇదేమీ ఊహించని పరిస్థితి కాదు. భారత దేశం ప్రపంచ విపణిలోకి అడుగుపెట్టినప్పుడు లోతుగా చర్చకి వచ్చిందే. అంతర్జాతీయ వాణిజ్యం తాలూకు లాభ నష్టాల గురించి దేశవ్యాప్తంగా సుదీర్ఘమైన చర్చలే జరిగాయి. అయితే, అప్పట్లో చాలామంది ప్రమాదం కేవలం అమెరికా నుంచి మాత్రమే వస్తుందని ఊహించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని వ్యాపారాల్లాగే అంతర్జాతీయంగా జరిగే వాణిజ్యమూ భేషుగ్గా ఉంటుంది. వాతావరణంలో తేడాలు వచ్చినప్పుడే నాణేనికి రెండో వైపు కనిపిస్తుంది. తగినంత ఆర్ధిక బలంతో, నిష్పాక్షికంగా పనిచేసే ఒక అంతర్జాతీయ వేదిక ఏర్పాటు జరిగితే ఈ తరహా సంక్షోభాల బారిన పడకుండా మార్కెట్లని రక్షించుకోవచ్చేమో..

బుధవారం, జనవరి 06, 2016

కలల రాజధాని

ఆంధ్రుల కలల రాజధాని 'అమరావతి' నిర్మాణానికి అనుకోని విధంగా ఓ చిన్న ఆటంకం వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం పాఠశాల విద్యార్ధులు ఒక్కొక్కరి నుంచీ తలకి పది రూపాయల చొప్పున నిర్బంధ చందా వసూలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలని కొట్టేస్తూ తీర్పునిచ్చి హైకోర్టు స్వతంత్రంగా వ్యవహరించింది. ఓ బృహత్కార్యం తలపెట్టినప్పుడు ఇలాంటి చిన్నా చితకా ఆటంకాలు మామూలే కాబట్టి, వీటిని పెద్దగా పట్టించుకోనవసరంలేదు.

నిజానికి రెండు తెలుగు దినపత్రికలు, నాలుగైదు వార్తా చానళ్ళలో 'అమరావతి' గ్రాఫిక్స్ రూపాలని చూసీ చూసీ చాలా మంది తెలుగు ప్రజలకి కొత్త రాజధాని ఎలా ఉండబోతోందో అర్ధమైపోయింది. రాబోయే రాజధానిలో చూడబోయే వింతలూ, విడ్డూరాల విశేషాలకైతే అంతేలేదు. ప్రభుత్వం చెప్పేవి కొన్నైతే, ప్రజలకి మరింత బాగా విషయాన్ని అర్ధం చేయించడంలో భాగంగా పేపర్లు, చానళ్ళూ రంగులద్ది చూపిస్తున్నవి మరికొన్ని. మొత్తం మీద 'ఇదిగో రాజధాని' అంటే 'అదిగో సింగపూర్' అనే విధంగా తయారయింది పరిస్థితి.

విశాలమైన రహదారులు, ఆకాశ హర్మ్యాలు, సుందర ఉద్యాన వనాలు, ఏడు తారల హోటళ్ళు, హైక్లాసు జూదశాలలు... ఒకటేమిటి? పర్సు నిండా డబ్బున్న వాడికి కావాల్సిన సకల సౌకర్యాలూ 'అమరావతి' లో ఉండబోతున్నాయి. కొత్త రాజధానిలో వ్యాపారులంటే సింగపూర్, జపాన్ వారే.. ఉద్యోగులంటే లక్షల్లో జీతాలు తెచ్చుకునే సాఫ్ట్వేర్ నిపుణులు మాత్రమే. వీళ్ళకి అవసరం అయ్యేవి, అవసరం అవ్వబోయేవి అన్ని సౌకర్యాలూ 'అమరావతి' లో ఉంటాయి. వెతికి చూసినా సామాన్యుడి ప్రస్తావన మాత్రం ప్లాన్లలో ఎక్కడా కనిపించడం లేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సామాన్యుడి కోసమంటూ ఎలాంటి ఏర్పాట్లూ లేని రాజధాని కోసం సామాన్యుడు నిర్బంధంగా చందాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశించడం. పైగా, "పది రూపాయలంటే చిన్న మొత్తమే కదా?!" అంటూ సంబంధిత మంత్రి గారు ఆశ్చర్యం ప్రకటించడం.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు నుంచి చూసినప్పుడు పది రూపాయలు అంటే పది కేజీల బియ్యం. దాదాపుగా, పేద కుటుంబానికి సగం నెల ప్రధాన గ్రాసం. ఓ వంక  పదిరూపాయలకి పది కేజీల బియ్యం ఇస్తూ, మరో వంక 'చిన్న మొత్తం' అనడం విచిత్రమే..

ఇప్పటికే ఆన్లైన్ లో జరిపిన ఇటుకల అమ్మకంలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని రికార్డు సంఖ్యలో 'ఇ'టుకలు కొనుగోలు చేసేశారు, రాజధాని కోసం. జరపబోయే మహా నిర్మాణానికి ఇటుకలు ఒక్కటే ఉంటే సరిపోతుందా? మిగిలిన సంబారాల మాటేమిటి? దుష్ట కాంగ్రెస్ పచ్చని రాష్ట్రాన్ని రెండు గా చీల్చి, ఆంధ్రులని రోడ్డున నిలబెట్టింది. మిత్ర బీజీపీ ప్రత్యేక హోదా విషయంలో పెదవి విప్పడంలేదు. అయినప్పటికీ, రాజధాని నిర్మాణం కోసం మాన్య ముఖ్యమంత్రి అహరహం శ్రమిస్తున్నారు. శ్రమ అయితే వారు పడగలరు కానీ, డబ్బు మరీ? అది ప్రజలనుంచి రావాల్సిందే.

ఎవరికి తప్పినా ప్రజలకి తప్పదు కాబట్టీ, వారు తప్పించుకోలేరు కాబట్టీ రాజధాని నిర్మాణం కోసం త్యాగాలు చేయాల్సిందే. భూముల సేకరణతో మొదలైన ఈ త్యాగాల పరంపర ప్రస్తుతం నిర్బంధ చందాల మీదుగా కొనసాగుతోంది. ఇప్పటికైతే హైకోర్టు కలుగజేసుకుంది..  కానీ ఈ పరంపర ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చూపాలంటే ప్రపంచ స్థాయి రాజధాని రావాల్సిందే.. అందుకోసం సామాన్యులంతా ఏదో ఒక రూపంలో త్యాగాలు చేయాల్సిందే. కలల రాజధాని కాస్తా పీడకలల రాజధాని అవ్వబోతోందా? అన్న సందేహానికి చోటే ఇవ్వకూడదు. రంగురంగుల 'అమరావతి' గ్రాఫిక్స్ రూపాన్ని గుర్తుచేసుకుని గర్వపడాలి..

సోమవారం, జనవరి 04, 2016

ఒక మేఘం కథ

క్రమం తప్పకుండా తెలుగు కథలు చదివే వారికి సుంకోజి దేవేంద్రాచారి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాయలసీమ సమస్యలని సొంతగొంతుతో కథలుగా కళ్ళముందుంచుతున్న కొద్దిమంది రచయితలలో దేవేంద్రాచారి ఒకరు. వ్యవసాయ సంక్షోభం, వలసలు, వీటి ఫలితంగా కుటుంబ బంధాలు, మానవ సంబంధాల్లో వచ్చి పడుతున్న మార్పుని కథా వస్తువులు తీసుకుని చారి రాసిన పద్ధెనిమి కథల సంకలనమే 'ఒక మేఘం కథ.' పేరు లో కనిపిస్తున్న తడి, సంకలనంలోని చాలా కథల్లోనూ కనిపించడమే ఈ పుస్తకం ప్రత్యేకత.

సంకలనానికి శీర్షికగా ఎంచుకున్నకథ  'ఒక మేఘం కథ' చదువుతున్నంతసేపూ దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాం రాసిన కథలు పదేపదే గుర్తొచ్చాయి. ఉహు, ఇది రాజారాం కథల్ని పోలిన కథ లాంటిది కాదు. శైలికూడా అయ్యోరిది కాదు. కానీ, కథ రెండో పేజీలోకి వెళ్లేసరికి పాఠకులు ప్రధాన పాత్రలో లీనం కావాల్సిందే. అతడి సంతోషం, విచారం మనవి అయిపోతాయి. పల్లెటూరు, పట్టణం రెండు చోట్ల జీవితాల్లోనూ ఉండే కష్టసుఖాలు, వీటితో పాటే వ్యవసాయంలోనూ, చిన్నపాటి వ్యాపారంలోనూ ఉండే లాభాలు, ఇబ్బందులు ఇవన్నీ మనకి చిరపరిచితం అయిపోతాయి.

తిరుపతిలో చిన్నకొడుకు నడిపే కిళ్ళీ బడ్డీలో కూర్చుని పల్లెటూళ్ళో ఉండే తన పెద్ద కొడుకు కథని చెప్పిన ప్రధాన పాత్ర, పల్లెకి వెళ్ళాక చిన్నకొడుకు కథని అందుకుంటాడు. కథ ముగింపు పాఠకుల పెదవుల మీద ఓ నవ్వుని పూయిస్తుంది. సేద్యం చేసే తండ్రి-ఇంజినీరింగ్ చదివే కొడుకు కథ 'చెనిక్కాయలు.' సీమలో వేరుశనగ రైతుల ఇబ్బందుల్ని కళ్ళకి కట్టే ఈ కథ, ఎక్కడా డాక్యుమెంటరీ లాగా అనిపించకపోగా, తర్వాత ఏమవుతుంది అనే కుతూహలంతో పేజీలు  తిప్పిస్తుంది. ముగింపు విషయంలో రచయిత కొంచం హడావిడి పడ్డారేమో అనిపించింది.


వ్యవసాయ సంక్షోభం కారణంగా సీమలో నిత్యకృత్యంగా మారిన వలసలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథల్లో మొదటగా చెప్పుకోవాల్సింది 'మనుషులు మరణించాక...' వలస తాలూకు విషాదం కన్నా, మానవ నైజపు నగ్నస్వరూపం కదిలిస్తుంది ఈ కథలో. పల్లె కరువుకీ, నగరపు మాంద్యానికీ ముడిపెట్టి రాసిన కథ 'వలస దేవర.' రాజకీయాల ప్రభావం సామాన్యుల మీద ఎలా ఉంటుందో చిత్రించిన కథలు 'అంత్యక్రియలు' 'దీపం పురుగులు.' మొదటి కథ పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చుల్నీ, రెండో కథ ప్రభుత్వం వారి ఒకానొక సంక్షేమ పథకపు అమలు తీరునీ చర్చించాయి.

'ప్రకటన,' 'రాజమ్మ,' 'పరువు,' 'బహుమతి' ఈనాలుగూ బలమైన స్త్రీ పాత్రలున్న కథలు. వీటిలో 'రాజమ్మ' కథ ముగింపు, 'పరువు' కథా ప్రారంభం గుర్తుండిపోతాయి. 'బహుమతి' కథని ఎవరో స్త్రీవాద రచయిత్రి రాశారంటే నమ్మేయొచ్చు. 'పారేడు కూర,' 'ఇరుకుమాను,' 'దాహం,' 'చెదిరిన బింబం,' 'ఆకుపచ్చని లోకంలోకి' ఈ ఐదూ నోస్టాల్జియా కథలు. రచయిత బాల్యంలో పాఠకులు తమ బాల్యాలనీ వెతుక్కోవచ్చు. 'పెళ్లికళ' కథ నగరజీవితపు ఒడిదుడుకులని చిత్రిస్తే, 'ఇల్లీగల్ లవ్ స్టోరీ' అత్తా-కోడళ్ళ సమస్యని ఓ కొత్త కోణం నుంచి చూపించి, ఊహాతీతంగా ముగుస్తుంది.

"ఒక మేఘం కథ శీర్షికతో పద్ధెనిమిది జీవిత శకలాలు ఇవి. లేనిపోని కల్పనలు, లేనిపోని వర్ణనలు, ఇంకా కృత్రిమమైన వ్యర్ధ విషయాలు లేని అచ్చమైన యదార్ధ జీవితం వీటిలో అంతటా పరుచుకుని ఉంది... ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితమంత బరువైనది..." అన్నారు విఖ్యాత కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య 'వర్తమాన సీమ జీవితాన్ని నిజాయితీగా రికార్డు చేసిన చరిత్ర' పేరిట రాసిన ముందుమాటలో. దేవేంద్రాచారి మరిన్ని మంచి కథలద్వారా మట్టి వాసనల్ని పాఠకులకి అందించాలని కోరుకుంటూ... ('ఒక మేఘం కథ,' పేజీలు 191, వెల రూ. 120, యుక్త ప్రచురణలు ప్రచురణ, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).

శనివారం, జనవరి 02, 2016

చదువులలోని సారమెల్ల ...

ఇంజినీరింగ్  చదువుతున్న ఓ నలుగురు కుర్రాళ్ళ మధ్య జరిగిన సంభాషణని వినాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోకుండా. వాళ్ళు మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్ధులని వాళ్ళ మాటల్ని బట్టి అర్ధమయింది. సుమారు ఇరవై నిమిషాల వ్యవధిలో ముప్ఫై ఒకటో తారీఖు రాత్రి కొట్టిన మందు తాలూకు హేంగోవర్ మొదలు రేణూ దేశాయ్, ఎస్జే సూర్య కలిసి లంచ్ చేసి, ఆ ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేయడం వరకూ ఎన్నో విషయాలు వాళ్ళ మధ్య చర్చకి వచ్చాయి. వాళ్ళెవరూ కూడా, వాళ్ళ మాటల్ని ఎవరూ వినకూడదు అనుకోలేదు.

"అనవసరంగా ఇంజినీరింగ్ లో చేరి బోల్డంత ఫీజులు కడుతున్నాం.. మామూలు డిగ్రీలో చేరితే సరిపోయేది.." ఓ కుర్రాడు అన్న ఈ మాట కారణంగానే నేను వాళ్ళ సంభాషణ మీద దృష్టి పెట్టాను. మామూలు డిగ్రీల వాళ్ళకీ, ఇంజనీరింగ్ వాళ్ళకీ కూడా ఒకేరకం ప్లేస్మెంట్స్ వస్తూండడం నుంచి వాళ్ళకా అభిప్రాయం కలిగిందని అర్ధమయ్యింది. "కాలేజీలో ఏం చెబుతున్నారో, మనం ఏం చదువుతున్నామో మనకే తెలియడం లేదు. మనకేదన్నా డౌట్ వస్తే ఫ్యాకల్టీనే కాదు, హెచ్ ఓ డీ కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇన్స్టిట్యూట్ లో చేరి నేర్చుకోవాల్సి వస్తోంది," అన్నాడొకతను.

"నేను-శైలజ బాగుందిట. నిన్న హ్యాంగోవర్ గా పడుకుండిపోయాను. ఇవాళ వెళ్దామా మనం?" గొంతు కొంచం కీచుగా ఉంది. "నేనూ అందుకే చూళ్ళేదు" అన్న మాట పూర్తవకుండానే మరొకతను అందుకున్నాడు."నేను ఏం అడిగినా 'అది ఇంపార్టంట్ కాదమ్మా' అంటాడు ఫ్యాకల్టీ. హెచ్ ఓ డీ మేడం దగ్గరికి వెళ్తే 'ఇది మీ ఫ్యాకల్టీని అడగాలమ్మా' అంటుంది. బీ టెక్ అయిపోతోంది, ఇంకా సి లాంగ్జేవ్ కూడా సరిగ్గా రాదంటే నవ్వుతారు జనాలు," వెనక్కి తిరిగి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాను.

"ట్విట్టర్ చూసేరా? రేణూ దేశాయ్, ఎస్జే సూర్యాతో లంచికెళ్ళి ఫోటోలు పెట్టింది. సూర్యా అంటే 'ఖుషి' 'నాని' డైరెక్టరు. ట్విట్టర్ లో పెట్టకుండా ఉండాల్సింది" మళ్ళీ కీచుగొంతే. "ల్యాబ్ లో సగం సిస్టమ్స్ మెయింటెనెన్స్ లో ఉన్నాయి. ఎప్పుడు బాగవుతాయో తెలీదు. ఫీజులు మాత్రం తగ్గించరు.. కేంపస్లొచ్చినప్పుడు తప్ప ల్యాబెప్పుడూ ఖాళీగానే ఉంటోంది. వైఫై అన్నా ఇస్తే మన లేప్టాపులు పట్టుకెళ్ళచ్చు.." ఫ్యాకల్టీ మీద కంప్లైట్ ఉన్న కుర్రాడే.. మొబైల్లో న్యూ ఇయర్ మెసేజీలు డిలీట్ చేస్తూ వింటున్నా.

"కేంపస్ లో ఏమేం కొచ్చిన్స్ వొస్తాయి?" ఒకతని కుతూహలం. "ప్రోగ్రామింగ్ గురించి అడుగుతారు," అని మరొకతని సమాధానం. "ఎన్నెక్కువ ప్రోగ్రాములోస్తే అంత త్వరగా కేంపస్ వస్తుందంటున్నారు. కాలేజీ ఫీజు, బయట ఇన్స్టిట్యూట్ లకి ఒక్కో ప్రోగ్రాముకింతని వేరే ఫీజు. మొత్తం లెక్కేస్తే చాలా అవుతోంది. అదే ఏ బీఎస్సీ లోనో చేరిపోయి, బయట కోర్సులు నేర్చుకుని ఉంటే ఇంజినీరింగ్ ఫీజు కలిసొచ్చేది," వివరించినతను ఫైనల్ ఇయర్ అనుకుంటా. "సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితేంట్రా ?" కీచుగొంతు. ఆ ముఖ్యమైన ప్రశ్నని మిగిలిన ముగ్గురూ పట్టించుకోలేదు.

"ఇప్పుడేనా మనం సీరియస్ గా కష్ట పడకపోతే కేంపస్ రాదు. కేంపస్ రాకపోతే ఫ్రీడం ఉండదురా. జాబ్ కొట్టామంటే చాలు.. మనం ఏం చేసినా అడిగేవాడుండడు. సి, డాట్ నెట్, జావా నేర్చుకుంటే చాలు ఏదో ప్లేస్మెంట్ కొట్టెయ్యొచ్చు. కాలేజీని నమ్ముకుంటే కష్టం.." ఇతనొక్కడే సీరియస్ గా మాట్లాడుతున్నాడు.  "రేయ్.. నేను-శైలజ కి టికెట్లు బుక్ చేస్తున్నాను.. ఎవరొస్తారో చెప్పండ్రా.." కీచుగొంతు ప్రశ్న పూర్తవ్వకముందే వాళ్ళ సంభాషణ ఆగిపోయింది.