మంగళవారం, జులై 19, 2011

నాలుగు నవలికలు

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విడుదల చేస్తోన్న 'పాలగుమ్మి పద్మరాజు రచనలు' సిరీస్ లో మూడో సంకలనం పద్మరాజు రచించిన నాలుగు నవలికల సమాహారం. మొదటి సంకలనంలో కథలనీ, రెండో సంకలనంలో 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' 'రామరాజ్యానికి రహదారి' 'నల్లరేగడి' నవలలల్నీ ప్రచురించిన విశాలాంధ్ర, ఈ సంకలనంలో 'బ్రతికిన కాలేజీ' 'చచ్చి సాధించాడు' 'భక్త శబరి' 'చచ్చిపోయిన మనిషి' నవలికలని చేర్చింది.

కథావస్తువులన్నింటిలోనూ 'మృత్యువు' అంటే పద్మరాజు గారికి ప్రత్యేకమైన ఇష్టమన్న సంగతి ఆయన కథలు చదివిన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజా సంకలనంలోని మూడు నవలికల పేర్లు మృత్యువుని సూచించేవే కావడం విశేషం. మొదటి నవలిక 'బ్రతికిన కాలేజీ.' నిజానికి కథకీ, శీర్షికకీ ఏమాత్రమూ సంబంధమూ లేదు. కనీసం అందుకు సంబంధించిన వివరణా లేదు. 'నా సంజాయిషీ' పేరిట పద్మరాజు రాసిన ముందుమాట ఈ నవలిక ప్రత్యేకత.

'బ్రతికిన కాలేజీ' కి వోడ్ హౌస్ శైలి స్పూర్తినిచ్చిందని చెబుతూనే, "వోడ్ హౌస్ లాగా వ్రాయగలగడం అసంభవమని తెలుసు. అయితే వ్రాయాలన్న అభిలాష చాలా కాలంగా బాధ పెడుతోంది. అసాధ్యమైనది సాధించాలని పూనుకున్నాను, నా వైఫల్యాన్ని మీకర్పిస్తున్నాను" అన్నారు పద్మరాజు తన సంజాయిషీలో. ఆసాంతమూ నవ్వుల్లో ముంచెత్తే 'బ్రతికిన కాలేజీ' ఒక ప్రేమకథ. పెళ్ళిచూపులకి వెళ్లి, పెళ్ళికూతురి చెల్లెలితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డ యువకుడు పట్టూ కథ.

పట్టూ ప్రేమని గెలిపించే బాధ్యతని తన మీద వేసుకున్న అతని స్నేహితుడు మిష్టర్ చింతా ఈ నవలికలో ప్రధాన కథానాయకుడు. శాంతమ్మ, శేషయ్య, కామన్న, రామలింగయ్య, మస్తాను, నటరాజ మార్తాండ శర్మ, రోశయ్య.. ఇలా ప్రతి పాత్రకీ ఒక ప్రత్యేకమైన, హాస్య స్పోరకమైన ఐడెంటిటీ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి గిలిగింతలు పెట్టే ఒకానొక వాక్యం: "మంగలి రాముడు శిలావిగ్రహానికన్నా సరే, పదిచోట్ల గంట్లు పెట్టకుండా క్షవరం చేయలేడు. అతని చేతులకు పక్షవాతం ద్వారా సంక్రమించిన చిన్న వణుకుంది. పట్టుకున్న గడ్డమూ, కత్తీ కూడా వణకడం మూలంగా కత్తి ఒక్క వెంట్రుకలనే గీయదు."

రాజమండ్రి కి చెందిన పేరు మోసిన క్రిమినల్ లాయర్ ముఖ్యప్రాణరావు హత్య కేసు ఇన్వెస్టిగేషనే 'చచ్చి సాధించాడు' అపరాధ పరిశోధక నవల. రాజమండ్రి నుంచి మద్రాసుకి మొదటి తరగతి రైలు పెట్టెలో ప్రయాణం చేస్తూ, మార్గ మధ్యంలో హత్య గావింపబడతాడు ముఖ్యప్రాణరావు. ఆ పెట్టెలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికుల్లో నలుగురు అతనికి కావాల్సిన వాళ్ళే. ఆసాంతమూ ఆసక్తికరంగా చదివించే ఈ నవలికలో, పోలీసులకన్నా ఎక్కువ శ్రద్ధగా కెమాల్ ఎందుకు అపరాధ పరిశోధన చేశాడన్నది జవాబు లేని ప్రశ్న గానే మిగిలిపోయింది.

'భక్త శబరి' వెండితెర నవల. పండరీబాయి టైటిల్ పాత్రధారిణి గా చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో 1960 లో నిర్మితమైన ఈ సినిమాకి సంభాషణలు రాసింది పాలగుమ్మి పద్మరాజే. 'ఏమి రామ కథ శబరీ శబరీ' పాట పెద్ద హిట్. అంతే కాదు, ఈ సినిమాలో 'కరుణ' పాత్ర ద్వారానే శోభన్ బాబు వెండితెర జీవితం ప్రారంభమయ్యింది. నాకు తెలిసి, ఈ 'భక్త శబరి' తొలితరం వెండితెర నవలలో ఒకటి. కానైతే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారాన్నీ ఇవ్వలేదు ప్రకాశకులు. సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా సాగింది రచన.

చిట్ట చివరి నవలిక 'చచ్చిపోయిన మనిషి.' డి.హెచ్. లారెన్స్ రచనకి అనువాదమనీ, 1946 లో తొలి ముద్రణ జరిగిందన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. పద్మరాజు అనువాద కథలతో పోల్చినప్పుడు, ఈ నవలిక నిరాశ పరిచిందనే చెప్పాలి. అనువాదం ఏమంత సరళంగా లేదు. అలాగే కథా, కథనాల్లో స్పష్టత లోపించినట్టుగా అనిపించింది చదువుతుంటే. మూల రచన చదివితే మరింత బాగా అర్ధం అవుతుందేమో మరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా 'పద్మరాజు మార్కు' కనిపించలేదీ రచనలో.

మొత్తంగా చూసినప్పుడు, నాలుగు నవలికలకీ కలిపి ఒక ముందుమాట రాయించి, పద్మరాజు జీవిత విశేషాలని కూడా చేర్చి ప్రచురించి ఉంటే సంకలనానికి నిండుతనం చేకూరి ఉండేది. గత సంకలనంలో లాగానే ఇందులోనూ అక్కడక్కడా అచ్చుతప్పులు తగిలాయి. వీటిని పరిహరించాలి. పద్మరాజు సాహిత్యాన్ని పునః ప్రచురించడం అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన విశాలాంధ్ర దీనిని మరికొంచం శ్రద్ధతో చేస్తే బాగుండునన్న అభిప్రాయం కలిగింది, సంకలనం చదవడం పూర్తి చేయగానే. (పేజీలు 291, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

7 కామెంట్‌లు:

  1. మంగలి రాముడు శిలావిగ్రహానికన్నా సరే, పదిచోట్ల గంట్లు పెట్టకుండా క్షవరం చేయలేడు
    :)

    రిప్లయితొలగించండి
  2. పాలగుమ్మి ఆయన రాసిన పాటలు విని ఆహా అనుకోవడమే కానీ రచనలు పెద్దగా చదవలేదు. మీరు చెప్పారు గా! చూడాలి.
    >> మంగలి రాముడు.. హహ్హహ్హా!!

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగు అప్పుడప్పుడూ చూస్తే కాదు, రోజూ చూడాల్సిందే!
    నేను 'గాలివాన' ఒక్కటే చదివాను :(

    రిప్లయితొలగించండి
  4. ఆయ్యో, P.G.Wodehouse ని కోట్ చెస్తే,మీరు అతని గురించి ఎప్పుడు రాసారబ్బా, నేనెలా మిస్స్ అయ్యానూ అని ఆవేశంగా లింక్ చూస్తే, వికీపీడియా పేజ్! హూం ! Wodehouse నా అభిమాన రచయితల్లో ఒకరు. ముఖ్యంగా అతని బోర్డింగ్ స్కూల్ నవలలు చాలా చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  5. @పక్కింటబ్బాయి: :-) :-) ..ధన్యవాదాలండీ..
    @కొత్తావకాయ: పాలగుమ్మి పద్మరాజు గారు ప్రఖ్యాత కథకుడూ, రచయితానండీ.. వీరి సోదరుడు విశ్వనాథం గారు "ఒక్క సారి మా ఊరికి పోయిరావాలి" లాంటి ఎన్నో మధురమైన లలితా గీతాలు పాడారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @హరిచందన: అన్ని కథలూ, నవలలూ బాగున్నాయండీ.. ధన్యవాదాలు.
    @రూత్: వోడ్ హౌస్ ని తప్పక చదువుతానండీ! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. మద్రాస్ లో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ... మొదతిది జూ పార్కు, రెండోది మ్యూజియం. పాత రచనల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదా - రమణ రచనలు.

    ఫణి, ఈటీవీ - 2

    రిప్లయితొలగించండి