సోమవారం, ఫిబ్రవరి 26, 2018

శప్తభూమి

చరిత్రని అధ్యయనం చేసి, కాలం నాటి సామాజిక పరిస్థితులని అర్ధం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ అధ్యయనం ఆధారంగా కాల్పనిక పాత్రలని సృష్టించి, చారిత్రక నవలరాయడం మరోఎత్తు. అలా రాసిన నవలలో రచయిత ఏపాత్ర పట్లా, ఏ సన్నివేశం విషయంలోనూ ఎలాంటి రాగద్వేషాలకీ లోనుకాకుండా, ఎక్కడా తన గళం కానీ, నినాదాలు కానీ వినిపించకుండా అత్యంత సంయమనాన్ని ఆద్యంతమూ పాటించడం మరో ఎత్తు. 'మంచి నవల' కోసం సాహిత్యాభిమానులు చకోరాల్లా ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో, 'గొప్పనవల' స్థాయికి చేరుకోడానికి అన్ని అర్హతలూ ఉన్న రచన 'శప్తభూమి' ని అందించిన బండి నారాయణస్వామికి ముందుగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

'శప్తభూమి' అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. అవును, కథా స్థలం రాయలసీమ. కథాకాలం విజయనగర సామ్రాజ్య పతనానంతరం అధికారం లోకి వచ్చిన హండే రాజుల పాలనాకాలం. స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 1775 నుంచి మొదలు పెట్టి, తర్వాతి పదిహేను, ఇరవై ఏళ్ళ కాలం. ఇరవైవకటో శతాబ్దం అనేక నూతన ఆవిష్కరణలతో జెట్ వేగంతో అభివృద్ధి పధంలో దూసుకుపోతోందన్న ప్రచార హోరు మధ్య, మూడొందల ఏళ్ళు వెనక్కి వెళ్లి నాటి కథని చదవాల్సిన అవసరం ఏమిటన్నది ముందుగా వచ్చే ప్రశ్న. వర్తమానానికి, భవిష్యత్తుకీ బలమైన పునాది గతంలోనే ఉందన్నది జవాబు. మరో మాట చెప్పాలంటే, చరిత్ర అధ్యయనం ఎందుకు అవశ్యమో కూడా ఈ నవల చెబుతుంది.

ఈ నవల రాజుల కథ కాదు. రాజ్యం కథ. రాజ్యంలోని అనేక వర్గాల ప్రజల కథల సమాహారం. ఇందులో రాజ్య రక్షణ కోసం చూపిన సాహసం ఫలితంగా గొర్రెల కాపరి నుంచి అమరనాయకుడిగా ఎదిగిన బిల్లే ఎల్లప్ప కథ ఉంది, అతని అమరనాయక హోదాని ఏమాత్రమూ లెక్కపెట్టక ఒకే ఒక్క పంచాయతీతో వివాహబంధం నుంచి బయటపడిన అతని మరదలు ఇమ్మడమ్మ కథా ఉంది. నాయకరాజుల సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న రాచ వేశ్య పద్మసాని కథ, ఇంగ్లీష్ చదువులు చదివిన ఆమె కొడుకు మన్నారుదాసు కథా ఉన్నాయి. రాజుకి ఉన్న స్త్రీ వ్యసనానికి తన ముద్దుల కూతురు బలైపోతే, రహస్యంగా తిరుగుబాటు తెచ్చి రాజుని పదవీచ్యుతుణ్ణి చేసిన వ్యాపారి బయన్నగారి అనంతయ్య శ్రేష్ఠి కథతో పాటు అదే స్త్రీవ్యసనం కారణంగా వంశాన్ని కోల్పోయిన అమరనాయకుడు వీరనారాయణరెడ్డి కథా ఉంది.

కండబలం పుష్కలంగా ఉన్నా కులం బలం లేకపోవడంతో కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక అడవిదారి పట్టిన కంబళి శరభుడు, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే వీరత్వం, మనసుపడిన వాడి మీద ప్రాణాన్నే పణంగా పెట్టగలిగేంత ప్రేమ, కార్యసాధనకి అవసరమైన లౌక్యం సమపాళ్లలో ఉన్న హరియక్క, మతాన్ని ముసుగు వేసుకుని లైంగిక దోపిడీ చేసే నాగప్ప ప్రెగడ, అదే మతం ఆధారంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసిన గురవడు.. ఇలా ఎందరెందరివో కథలు. అంతే కాదు, ఒకరొట్టెకి, మూడు కాసులకి పసి పిల్లల్ని అమ్ముకునే కరువు, వర్ణవ్యవస్థకి ఆవల ఉన్న కుటుంబాల స్త్రీలని ఊరుమ్మడి సొత్తుగా మార్చే బసివి అనాచారం, స్త్రీ గౌరవం ముసుగులో అమలైన సతీసహగమనం లాంటి దురాచారాలు..వీటన్నింటినీ అక్షరబద్ధం చేసిన నవల ఇది.


అనంతపురం సంస్థానాన్ని హండే రాజు సిద్ధరామప్ప నాయుడు పాలిస్తున్న కాలంలో, ఓ నరక చతుర్దశి నాటి రాత్రి కొందరు దుండగులు ఊరి చెరువుకి గండి కొట్టబోతూ ఉంటే గొర్రెలకాపరి బిల్లే ఎల్లప్ప తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీళ్ళని కాపాడడం, ప్రభువు మెచ్చి అతన్ని రాజోద్యోగిగా నియమించడంతో ఆరంభమయ్యే కథ, అనేక వైవిధ్యభరితమైన పాత్రలు, ఊహకందని సన్నివేశాలతో పరిపుష్టమై, తనకి పదవినిచ్చిన ప్రభువు శ్రేయస్సు కోసం ఎల్లప్ప తీసుకున్న గగుర్పాటు కలిగించే నిర్ణయాన్ని అమలుపరచడంతో ముగుస్తుంది. నిపుణుడైన స్వర్ణకారుడు వెంట్రుకవాసి మందం ఉన్న పొడవాటి బంగారు తీగని అత్యంత నైపుణ్యంతో కళ్లెదుటే అల్లి అందమైన నగగా చేతికందించినప్పుడు కలిగే భావోద్వేగాలన్నీ ఏకకాలంలో అనుభవానికి వస్తాయి ఈ నవల చదవడం పూర్తిచేసే సమయానికి.

హండే రాజుల పాలనా పధ్ధతి, అధికారాలు పరిమితమే అయినా ప్రజలమీద అపరిమితమైన జులుం చూపిన అమరనాయకులు, 'మన గతి ఇంతే' అని సరిపెట్టేసుకున్న స్త్రీలు, అణగారిన వర్గాలు, వీరినుంచే పుట్టిన ఆశాజ్యోతులు, నాటి రాజకీయాలు, కళలు, వినోదాలు, ఆధ్యాత్మిక విషయాలు... ఈ నవల కాన్వాసుని ఒకటి రెండు మాటల్లో చెప్పడం అసాధ్యం. పాలకుల్నీ ప్రజల్నీ మంచి-చెడు అనే చట్రాల్లో బిగించకుండా, ఇరుపక్షాల్లోని మంచి చెడులనీ నిష్పక్షపాతంగా చెప్పడం, రచయిత తాను కథని మాత్రమే చెప్పి, అర్ధం చేసుకునే బాధ్యతని పాఠకుడికి విడిచి  పెట్టడం రచన స్థాయిని పెంచింది. పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన పాఠకుల్ని అదాటున కథా కాలంలోకి, పాత్రల మధ్యకి లాక్కుపోయేవిగా ఉన్నాయి. రాజుల విలాస జీవిత చిత్రణకి, కురువ, మాదిగ కులాల ఆచారాలు, జీవన శైలులని రికార్డు చేయడానికీ సమ ప్రాధాన్యత ఇచ్చారు రచయిత. ఆమాటకొస్తే, ఏ పాత్రనీ ఎక్కువా చెయ్యలేదు, తక్కువా చెయ్యలేదు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఈ రచనకి ఉపయోగించిన భాష. పద్దెనిమిదో శతాబ్దం నాటి రాయలసీమ భాషపై పరిశోధన చేసి, ప్రతి పాత్ర నేపధ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని వారి చేత ఆయా మాండలీకాల్లో సంభాషణలు పలికించారు రచయిత. ఉదాహరణకి, తంజావూరు నేపధ్యం కలిగిన పద్మసాని మాటలు మిగిలిన పాత్రలు పలికే సంభాషణలకి పూర్తి భిన్నంగా ఉంటాయి. పాత్ర సామాజిక స్థాయి ఏమిటన్నది, సంభాషణల్లో వాడిన మాటల ఆధారంగా సులువుగా బోధపడుతుంది పాఠకులకి. అన్నమయ్య కీర్తనల్లో వాడిన మాటలు కొన్ని సంభాషణల్లో అక్కడక్కడా మెరిశాయి. రచన తాలూకు స్థలకాలాదులని చెప్పకనే చెప్పిన భాష తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలిగేంత సరళంగా ఉంది.

ఈ నవల్లో లోపాలేవీ లేవా? చిన్నవే అయినా వాటినీ ప్రస్తావించుకోవడం అవసరం. హరియక్క పాత్ర అసంపూర్ణంగా ముగిసిన భావన కలిగింది. అదికూడా, ఆమెకి ఒక పెద్ద అన్యాయం జరిగినప్పుడు, అందుకు కారకుడు కథలో మరో ప్రధాన పాత్ర అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండాల్సింది. అలాగే, నాగప్ప ప్రెగడ పాత్ర. పేరుని బట్టి, అతని తండ్రి చేసిన లౌకిక వృత్తిని బట్టి అతడు బ్రాహ్మణుల్లో నియోగి శాఖకి చెందినవాడుగా తెలుస్తోంది. ఆలయాల్లో పని చేసే వారు వైదిక బ్రాహ్మణులు. ఒకరి వృత్తిని మరొకరు చేపట్టక పోవడం అన్నది ఇరవయ్యో శతాబ్దం వరకూ కొనసాగింది. ("యీ యింగిలీషు చదువులు లావైనకొద్దీ వైదీకులే అన్న మాటేవిఁటీ, అడ్డవైన జాతుల వాళ్ళకీ ఉద్యోగాలవుతున్నాయి గాని..." అంటాడు 'కన్యాశుల్కం' నాటకంలో నియోగి రామప్పంతులు). నాగప్ప ప్రెగడ ఆలయంలో పూజాదికాలు చేయడం ఆ కాలానికి జరిగే పని కాదు. కథా గమనానికి ఇవి అడ్డం పడేవి కాదు కానీ, జాగ్రత్త తీసుకుంటే మరింత బావుండేది అనిపించింది.

'తానా' సంస్థ 21వ మహాసభల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో గత ఏడాది డిసెంబర్ లో రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మూడు తెలుగు నవలలకు పంచింది. ఆ మొత్తంలో 'శప్తభూమి' వాటా ఎనభైవేల రూపాయలు. ఇరవై ఏళ్ళ క్రితమే 'రేగడి విత్తులు' నవలకి తానా అందించిన లక్షా ముప్ఫయి వేల రూపాయల నగదు బహుమతితో పోల్చుకుంటే రెండు లక్షల రూపాయలు చిన్నమొత్తమే (డాలర్ రేటు పరుగులు పెడుతున్న నేపథ్యంలో). పైగా ఆమొత్తాన్ని మూడు వాటాలు వేయడం వల్ల 'శప్తభూమి' కి అందింది స్వల్పమొత్తమే. కానీ, వేరే ఏ బహుమతులూ లేని వాతావరణంలో దీనినే పెద్దమొత్తంగా భావించాలి. 'శప్తభూమి' కేవలం తెలుగు సాహిత్యానికి పరిమితమైపోవాల్సిన నవల కాదు. ఎల్లలు దాటి సాహిత్యాభిమానుల్ని చేరుకోవాలి. ఈ నవల ఆంగ్లం లోకి అనువాదం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 'తానా' ఆదిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

('శప్తభూమి' రాయలసీమ చారిత్రక నవల, రచన: బండి నారాయణస్వామి, పేజీలు: 263, వెల రూ.125, తానా ప్రచురణలు, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).

ఆదివారం, ఫిబ్రవరి 25, 2018

శ్రీదేవి ...

ఏం జ్ఞాపకం చేసుకోవాలి శ్రీదేవి గురించి? బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి, కథానాయికగా సుదీర్ఘ కాలం కొనసాగి, తల్లిపాత్రలని హుందాగా అంగీకరించి వెండితెరకి వెలుగులద్దిన తార మాత్రమేనా, అంతకు మించి ఇంకేమన్నా ఉందా అన్న ప్రశ్నఉదయం నుంచీ దొలుస్తూనే ఉంది. శ్రీదేవికన్నా ముందు, శ్రీదేవి తర్వాత చాలామంది కథానాయికలున్నారు. కానీ, శ్రీదేవితో సరిసమంగా నటించి, ప్రతిభాషలోనూ తనకంటూ అభిమానులని సాధించుకోవడంతో పాటు, దక్షిణాది తారలకు గగనకుసుమమైన హిందీ సినిమా పరిశ్రమలో స్థానం సంపాదించి, ఏళ్లపాటు అగ్రతారగా వెలుగొందడం మరే నటికీ సాధ్యపడలేదు.

శ్రీదేవి విజయ రహస్యం ఏమిటి? మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది ఆమె తల్లి రాజేశ్వరిని గురించి. బాలతారగా నటిస్తున్న తన కూతుర్ని కథానాయికగా నిలబెట్టాలని నిర్ణయించుకుని, అందుకు తగ్గ కృషి చేయడంతో పాటు, కూతురు ఏమాత్రమూ క్రమశిక్షణ తప్పకుండా అనుక్షణం కంటికి రెప్పలా కాసుకొని, తన మాట జవదాటని విధంగా తర్ఫీదు ఇచ్చారు. శ్రీదేవికి తల్లి పట్ల ప్రేమ, గౌరవం కన్నా భయమే ఎక్కువ అనడానికి దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. పేరూ డబ్బూ సంపాదించుకున్న నాయికలు తల్లిదండ్రులని ధిక్కరించడం, వాళ్ళని పూర్తిగా దూరంపెట్టి ప్రేమవివాహాలు చేసుకోవడం సాధారణమే అయినా, శ్రీదేవి ఇందుకు మినహాయింపు. ఇందుకోసం ఆమె కోల్పోయిందేమిటో తెలీదు కానీ, ఒక సుదీర్ఘ కెరీర్ని సంపాదించుకోగలిగింది అని చెప్పక తప్పదు.

ఎన్టీఆర్ కి మనవరాలిగా నటిస్తున్న బేబీ శ్రీదేవి "ఎప్పటికైనా ఎన్టీఆర్ గారి పక్కన నాయికగా నటించాలన్నది నా కోరిక" అని ముద్దుముద్దుగా ఇచ్చిన ఇంటర్యూ ఆరోజుల్లో చర్చనీయాంశం. అది మొదలు, నిన్నమొన్నటి 'బాహుబలి' వివాదానికి సమాధానం వరకూ పబ్లిక్ ఫోరమ్ లో ఏం మాట్లాడినా ఎంతో ఆచితూచి మాట్లాడడం శ్రీదేవి ప్రత్యేకత. ఏంచెప్పాలి అన్నదానితో పాటు ఎలా చెప్పాలి అన్న విషయంలో కూడా స్పష్టత ఉందామెకి. అందుకే కావొచ్చు, అగ్రశ్రేణి నాయికగా ఉన్న రోజుల్లో కూడా ఆమె స్టేట్మెంట్స్ వివాదాస్పదం కాలేదు. శ్రీదేవి ఇంటర్యూలన్నీ ఒక పుస్తకంగా తీసుకొస్తే, సినిమా రంగంలో ఉన్నవారికి ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడే అవకాశం ఉంది.

Google Image

అగ్రనటి స్థానాన్ని సంపాదించుకోవడం, తీవ్రమైన పోటీని తట్టుకుని ఆ స్థానంలో మనగలగడం అంత సులువైన విషయమేమీ కాదు. ఇందుకు అందం, అభినయ సామర్ధ్యం మాత్రమే చాలవు. ఈ రెండు లక్షణాలూ ఉన్న చాలామంది ఆ స్థానానికి చేరుకోలేక పోయారు. చేరుకున్న కొద్దిమందీ నిలబడలేకపోయారు. క్రమశిక్షణ, నేర్చుకునే తత్త్వం తో పాటు ప్రవర్తన కూడా తనదైన పాత్ర పోషిస్తుంది. వీటన్నింటి కలబోతకీ 'ప్రొఫెషనలిజం' అని పేరు పెట్టింది సినిమా పరిశ్రమ. శ్రీదేవి దగ్గర అది పుష్కలం. ఆమెకి ఇది సహజాతమా, తల్లిపెంపకం వల్ల అబ్బిన గుణమా లేక కాలక్రమంలో నేర్చుకున్న విషయమా అన్నది ఇదమిద్దంగా తెలియదు కానీ, ఆమెని అగ్రశ్రేణి నాయికగా నిలబెట్టడంతో ప్రొఫెషనలిజం పాత్ర చాలా ఉందన్నది నిజం.

జయప్రద అభిమానులకి శ్రీదేవి ఒక కొరకరాని కొయ్య. జయప్రద చేయలేని పాత్రలు ఉన్నాయనీ, వాటిని శ్రీదేవి సులువుగా చేసేయగలదనీ ఎన్నో వాదోపవాదాలు. 'వసంతకోకిల' 'ఆకలిరాజ్యం' లాంటి ఉదాహరణలు. ఆ వాదం కాస్తా అభినయం నుంచి అందం దగ్గరికి వచ్చేసరికి, "జయప్రదది సహజ సౌందర్యం, శ్రీదేవి కాస్మొటిక్ బ్యూటీ" అన్న సమాధానం జయప్రద ఫాన్స్ దగ్గర సిద్ధంగా ఉండేది. కాస్మొటిక్స్ వాడకం అన్నది వెండితెరమీద కనిపించే ప్రతి ఒక్కరికీ తప్పని సరి అయినప్పటికీ, ఆ వాడకాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన నటి శ్రీదేవి. అందాన్ని పెంచుకోడానికి సినీ తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు అనే విషయం జనబాహుళ్యానికి తెలిసింది శ్రీదేవి ముక్కుకి జరిగిన సర్జరీ తర్వాతే. ఏళ్ళు గడిచినా వన్నె తరగని ఆమె సౌందర్యం వెనుక కాస్మొటిక్స్ పాత్ర బహిరంగ రహస్యమే.

సోషల్ మీడియాలో శ్రీదేవిని గురించి సర్క్యులేట్ అవుతున్న అనేకానేక సందేశాల్లో, ఒకానొకటి ఈ కాస్మొటిక్స్ గురించే. సుదీర్ఘంగా ఉన్నా, ఆలోచింపజేసేదిగా ఉంది. శ్రీదేవి హఠాన్మరణం వెనుక ఆమె చేయించుకున్న సర్జరీలు, తీసుకున్న బొటాక్స్ ల పాత్ర తక్కువ కాదన్నది ఆ సందేశం సారాంశం. వయసు దాచుకోడం కోసం తిండిని తగ్గించుకోవడం, శరీరాకృతిని కాపాడుకోవడం కోసం తీసుకున్న చికిత్సలు వీటన్నింటినీ ప్రస్తావిస్తూ సాగిన ఆ సందేశం, శ్రీదేవిని ఎంతగానో ప్రేమించే ఆమె కుటుంబం కూడా ఆమెని ఈ కాస్మొటిక్స్ బారినుంచి కాపాడలేక పోవడం విచారకరమని, శ్రీదేవికి తన అందం మీద ఉన్న అపనమ్మకం వల్లే అలవిమాలిన చికిత్సలు చేయించుకుని ప్రాణం మీదకి తెచ్చుకుందన్న ఆరోపణ ఉంది అందులో.

కారణాలు ఏవైనా కావొచ్చు, ఇకనుంచీ వెండితెర వేలుపు శ్రీదేవి ఒక గతం, ఒక చరిత్ర అనుకోవాల్సి రావడం బాధాకరం. అయితే,  ఆ చరిత్ర స్ఫూర్తివంతమైనదీ, నేర్చుకోగలిగే వాళ్లకి ఎన్నో విషయాలు నేర్పించేది కావడం ఒక చిన్న ఉపశమనం. సినీలోకపు అతిలోకసుందరికి నివాళి..

శుక్రవారం, ఫిబ్రవరి 23, 2018

గుల్జార్ కథలు

వెండితెరకి సంబంధించి 'సున్నితత్వం' అనగానే గుర్తొచ్చే పేర్లలో మొదటివరుసలో ఉండే పేరు 'గుల్జార్' ది. సినీ గేయరచయితగా, దర్శకుడిగా హిందీ సినిమా ప్రేక్షకులకి సుపరిచితుడైన గుల్జార్ కథకుడు కూడా. మొత్తం ఇరవై ఎనిమిది కథలతో 'ధువా' గుల్జార్ రాసిన ఉర్దూ కథల సంకలనం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకుంది. ఈ సంకలనాన్ని భారతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా, తెలుగుసేత బాధ్యతని ప్రముఖ రచయిత్రి, సాహితీ విమర్శకురాలు, మీదుమిక్కిలి గుల్జార్ అభిమానీ అయిన సి. మృణాళిని కి అప్పగించింది అకాడెమీ. 'గుల్జార్ కథలు' పేరిట విడుదలయ్యిందీ సంకలనం.

గుల్జార్ సినిమా మనిషి అనే విషయాన్ని గుర్తు చేస్తూ మొదటి రెండు కథలు 'బీమల్దా,' 'సన్ సెట్ బోలేవా' సినిమా రంగం నేపథ్యంలో రాసినవి. సుప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ ఎలిజీలా అనిపించే 'బిమల్దా' చివరివరకూ ఆపకుండా చదివిస్తుంది. నిజానికి, ఈ సంకలనంలో మెజారిటీ కథలకి చదివించే గుణం పుష్కలంగా ఉంది. రెండో కథ గతవైభవాన్ని నెమరువేసుకుంటూ జీవించే ఒకనాటి వెండితెర నాయిక కథ. ఈ రెండు కథలూ ముగిపు దగ్గర పట్టి ఆపుతాయి పాఠకుల్ని. సినీ హీరోని గుడ్డిగా ప్రేమించే టీనేజీ అమ్మాయి కథ 'గుడ్డో.' మిగిలిన కథలన్నీ సినిమా వాసన తగలనివే.

భారత్-పాకిస్తాన్ ల విభజన గుల్జార్ కళ్ళముందే జరిగింది. ఆ సంఘటన ప్రత్యక్ష సాక్షుల్లో చాలామంది లాగే, గుల్జార్నీ ఆ నాటి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. విభజన ఇతివృత్తంగా ఆయన రాసిన రెండు కథలు 'రావి నదికి ఆవల,' 'విభజన.' రెండూ కూడా వెంటాడే కథలే. ఒక కథా రచయిత ప్రధాన పాత్రగా రాసిన 'ఇది ఎవరి కథ?' ముగింపు, కథకుడిగా గుల్జార్ సామాజిక స్పృహకి ఒక చిన్న మచ్చుతునక. మతకల్లోలాల నేపథ్యంలో రాసిన కథ 'భయం.' ఈ కథ ముగింపు నుంచి అనేక కథలు పుట్టే అవకాశం ఉంది నిజానికి. 'పొగ' కథకీ మతమే నేపధ్యం.


ఫెమినిజం అంటే శానిటరీ నాప్కిన్ల వాడకాన్ని, వివాహేతర సంబంధాల్ని గ్లోరిఫై చేయడం మాత్రమే అని నమ్ముతున్న రచయితలు తప్పక చదివావాల్సిన కథలు 'మగవాడు,' 'వివాహ బంధం.' గుల్జార్ ఎంతటి స్త్రీ పక్షపాతో చెప్పకనే చెబుతాయి ఈ రెండు కథలూ. పంచతంత్రాన్ని తలపించే 'అరణ్యగాధ' విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేతని ప్రశ్నిస్తుంది. 'నిప్పుని మచ్చిక చేసుకున్న హబు' కూడా ఈకోవకి చెందిందే. హవేలీ కథ 'డాలియా' లో ముగింపు ఊహించగలిగేదే అయినా, కథ ఆ ముగింపుకి ఎలా చేరుకుంటుందన్న ఆసక్తిని చివరికంటా కొనసాగించారు రచయిత.

మొత్తం మీద చూసినప్పుడు, భిన్న ఇతివృత్తాలని, విభిన్న కథన రీతులని ఎంచుకుని ఈ కథల్ని చెప్పారు గుల్జార్. వాటిని అత్యంత అలవోకగా అనువదించారు మృణాళిని. పాత్రల పేర్లు, ప్రదేశాలు మినహాయిస్తే ఎక్కడా అనువాదం అన్న భావన కలగకపోవడం తాలూకు గొప్పదనాన్ని కథకుడితో పాటు అనువాదకురాలికీ పంచాల్సిందే. విషయసూచికలో దొర్లినన్ని అక్షరదోషాలు కథల్లో కనిపించక పోవడం పెద్ద ఉపశమనం. వైవిద్యభరితమైన కథల్నీ, కథన రీతుల్నీ ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన కథా సంకలనం ఇది. (సాహిత్య అకాడమీ ప్రచురణ, పేజీలు 200, వెల రూ. 100, న్యూ ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న సాహిత్య అకాడమీ కార్యాలయాలు, మరియు అకాడమీ స్టాల్స్ లో లభిస్తుంది).

సోమవారం, ఫిబ్రవరి 19, 2018

ప్రేమపల్లకీ

నలభయ్యేళ్ళ నాటి ఈ నవలని ఇవాళ మళ్ళీ ప్రస్తావించుకోడానికి ఏకైక కారణం శ్రీరమణ. భార్యాభర్తల చిలిపి తగువులకి తన మార్కు చమక్కులని అద్ది, మళ్ళీ చదివినా బోర్ కొట్టని విధంగా తీర్చి దిద్దారు. ఇప్పటికైతే, శ్రీరమణ ప్రచురించిన ఏకైక నవల ఇది. మరో నవల రాబోతోందని చాన్నాళ్లుగా ఊరిస్తున్నారు కానీ, వస్తున్న అజ కనిపించడం లేదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకత్వంలోని 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో 1978-79 కాలంలో సీరియల్ గా వచ్చి, అటుపై ఒకే ఒక్క సారి నవలగా ప్రింట్ అయ్యి కొద్దిపాటి లైబ్రరీలకి మాత్రమే పరిమితమైన ఈ పుస్తకాన్ని తాజాగా ప్రచురించారు సాహితి ప్రచురణలు వారు.

కథలోకి వెళ్ళిపోతే, రాంపండు-గీత కొత్తగా పెళ్ళైన దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్తులు మరియు వేరేటి కాపురం. రాంపండు 'స్వీట్ హోమ్' నవల్లో బుచ్చిబాబు లాగా అమాయకుడు మరియు మంచివాడు. గీతకూడా అచ్చం అదే నవల్లో విమల లాంటిదే. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనీ, ఆ పెళ్ళిలో పూసల పల్లకీలో ఊరేగాలనీ రాంపండు చిరకాల వాంఛ. ఆ రెండు కోరికలూ తీరనే లేదు. కవిత్వం రాయాలనే, ఇల్లు కళాత్మకంగా అలంకరించుకోవాలనీ.. ఇలా చాలా చాలా ఊహలే ఉన్నా, వాస్తవాలు వేరే రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఏమాటకామాటే, కొత్త కాపురం అవ్వడం వల్లనో ఏమో కానీ, గీత అనుకూలవతి అయిన ఇల్లాలే. అయినా కూడా రాంపండులో ఏదో అసంతృప్తి.

ఆఫీసులో వాళ్ళు, స్నేహితులూ రాంపండు మంచితనాన్ని వాడేసుకుంటూ ఉంటారు. ఫలితంగా అతగాడు అప్పుడప్పుడూ చిక్కుల్లో పడుతూ ఉంటాడు. ఆ చిక్కుల్నించి గీతే అతగాణ్ణి ఒడ్డున పడేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు గీతమీద విపరీతంగా ప్రేమకలిగినా, ప్రేమలేఖలు, పూసలపల్లకీ మిస్సైన బాధని ఓ పట్టాన మర్చిపోలేకుండా ఉంటాడు. ఈ సమస్యకి కూడా గీతే పరిష్కారం వెతికింది. "ఇద్దరం కొన్నాళ్ల పాటు ప్రేమికులుగా ఉండిపోదాం" అని ప్రతిపాదించి, రాంపండు ని ఒప్పించేస్తుంది. ప్రేమికులైపోవడం అంటే భావగీతాలు పాడుకోవడం అన్నట్టుగా కలల్లో తేలిపోవడం ఆరంభిస్తాడు మన కథానాయకుడు.


"ప్రేమికులు వంట చేసుకోరు" అంటూ హోటల్ కేరేజీ తెప్పించడం మొదలు, "ఇంటి పనులుంటే ప్రేమించడం కుదరదు" అని పనిపిల్లని కుదర్చడం వరకూ రాత్రికి రాత్రే అప్పటివరకూ వస్తున్న ఇంటి పధ్ధతిని సమూలంగా మార్చేస్తుంది గీత. ప్రేమ జీవితం బాగుందో బాలేదు రాంపండు తేల్చుకోక మునుపే, "ప్రేమికులకి విరహం అవసరం రామ్" అని చెప్పి, ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటి రైలెక్కేస్తుంది గీత. కథ కంగాళీ అయిపోకుండా రక్షించడం కోసం, గీత చెల్లెలు సీతని కథలో ప్రెవేశ పెట్టి ఆమెకి పెళ్లి కుదురుస్తారు రచయిత. ఆ పెళ్ళిలో రాంపండు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. పూసల పల్లకీ గురించి అతగాడికి జ్ఞానోదయం కలగడం నవలకి ముగింపు.

గీత మాట్లాడే మాటలు, చేసే పనులు చాలాసార్లు 'పెళ్ళిపుస్తకం,'  'మిస్టర్ పెళ్ళాం' సినిమాల్లో నాయికలని గుర్తు చేశాయి. బాపూకి గీత పాత్ర చాలా ఇష్టమని, ఆ ఇద్దరు నాయికల మీద గీత ప్రభావం ఉందనీ శ్రీరమణ రాసిన ముందుమాటని చివర్లో చదివినప్పుడు తెలిసింది. ముందుగా టైటిల్ తో ప్రకటనలు ఇచ్చేశారనీ, కాలమ్ రాసినట్టే ఏ వారానికి ఆదివారం రాసిచ్చేయొచ్చు అనుకుని ముందస్తు ఏర్పాట్లు పెద్దగా చేసుకోకుండా నవలా రచనలోకి దిగిపోయాననీ ఒప్పేసుకున్నారు కూడా. ఈ సీరియల్ విజయవంతమైన ఉత్సాహంలో పురాణం 'రంగుల రామచిలుక' అనే సీరియల్ ప్రకటన ఇచ్చేశారట కానీ, రాసేందుకు శ్రీరమణ ఒప్పుకోలేదట.

'ప్రేమపల్లకీ' దగ్గరకి వస్తే, సత్తా ఉన్న రచయిత సాధారణమైన విషయాన్ని కూడా చదివించేలా ఎలా రాయగలడు అన్న దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. నవలంతా ఒకే గ్రాఫ్ లో వెళ్లకుండా, అక్కడక్కడా ఆసక్తి తగ్గిపోతూ ఉండడం, ఆ వెంటనే కథలో మలుపు చోటు చేసుకోవడం గమనించినప్పుడు పాఠకాభిరుచికి అనుగుణంగా అప్పటికప్పుడు రచయిత తన సీరియల్ లో మార్పులు చేసుకున్న వైనం అర్ధమవుతుంది. రాంపండు పాత్రని కాస్తైనా వాస్తవానికి దగ్గరగా చిత్రించి ఉంటే చాలా ఆసక్తికరమైన నవల అయి ఉండేది అనిపించింది. (పేజీలు 176, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).