బుధవారం, జనవరి 30, 2019

ఎవరికెవరు ఈలోకంలో ...

"కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో..
కానీ ఆ కడలి కలిసేది ఎందులో..."

అన్నీ సవ్యంగా ఉన్నన్నాళ్లూ బంధాలు, బంధుత్వాలూ బహు గొప్పగా ఉంటాయి. ఏదన్నా తేడా జరిగినప్పుడే, మనవాళ్ళు ఎవరు, కానివాళ్ళు ఎవరన్న ప్రశ్నా, ఆ వెంటే జవాబూ వస్తాయి. 'సిరిసిరిమువ్వ' (1976)  సినిమాలో కథానాయికకి ఇలాంటి  పరిస్థితే వచ్చింది. సవతితల్లి  పెంపకంలో పెరిగిన ఆమెకి తన తండ్రి జీవించి ఉన్నంతకాలమూ కూడూ, గూడూ దొరికాయి. ఆయన హఠాన్మరణంతో ఆమె దాదాపుగా రోడ్డున పడింది.

ఎక్కడా ఆశ్రయం దొరకని పరిస్థితుల్లో, ఆమెని పట్నం తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు కథానాయకుడు. నిజానికి అతడికి, ఆమెకి ఎలాంటి బంధుత్వం లేదు. మనసునిండా ఆమె మీద ప్రేమని నింపుకున్నా, పైకి చెప్పే ధైర్యం లేనివాడతను. కేవలం అతని వెనుకే, ఎప్పుడూ చూడని ఊరికి వెళ్లి, జీవితాన్ని కొనసాగించాలి. ఈ సన్నివేశంలో నాయిక స్థితికి అద్దం పట్టేలా తేలికైన మాటలతో బరువైన పాట రాశారు వేటూరి. 



"ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక..
ఏదారెటు పోతుందో ఎవరినీ అడుగక.."

ఇదో మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికీ తెలీదు. ఇవాళ్టి బంధుత్వాలు, రేపటికి శత్రుత్వాలు కావొచ్చు. అప్పటివరకూ ఎవరో తెలియని వాళ్ళతో కొత్త బంధుత్వం చిగురించనూ వచ్చు. ఏ బంధం ఎటువైపుకి దారితీస్తుండన్నది ఎవరినీ అడగకూడని ప్రశ్న. అడిగినా, ఎవరు మాత్రం జవాబు చెప్పగలరు?

"జోర్సే బార్సే కోరంగి రేవుకే..
కోటిపల్లి రేవుకే.." 

పడవ ప్రయాణం నేపధ్యంగా సాగుతున్న పాట కాబట్టి, మధ్యలో పడవ నడిపేవారి పదాన్ని చేర్చారిక్కడ. శ్రమని మర్చిపోయేందుకు వారు పాడుకునే పాటల్లో అనేక రసాలు వినిపిస్తాయి, వారి మనఃస్థితిని, చేస్తున్న ప్రయత్నాలన్నీ అనుసరించి. కోరంగి, కోటిపల్లి రెండూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ రేవులు. వారి రాగంలో ఈ రేవుల పేర్లు రావడం సహజమే.

"వాన కురిసి కలిసేదీ వాగులో..
వాగు వంక కలిసేదీ నదిలో.. 
కదిలి కదిలి నదులన్నీ కలిసేదీ కడలిలో..
కానీ ఆ కడలి కలిసేదీ ఎందులో.."

కొండకోనల్లో కురిసే వాన వాగులుగాను, వంకలుగానూ మారి నదుల్లో కలుస్తుంది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. మరి ఆ సముద్రం ఎందులో కలవాలి? కష్టాల బరువుని తనవాళ్ళతో పంచుకుని తేలికపడతారు చాలామంది. ఆ వినేవాళ్ళకీ ఉంటాయి కష్టాలు. వాళ్ళు వాటిని మరెవరితోనో పంచుకుని తేలికవుతారు. అందరి కష్టాలూ విని, తన కష్టం చెప్పుకునే అవకాశం లేని వాళ్ళకి మరి?

వీళ్ళెవరూ అంటే మొదటగా గుర్తొచ్చేది దేవుడు. కానీ, సినిమా కథ ప్రకారం చూసినప్పుడు మాత్రం కథానాయిక. ఆమె పుట్టు మూగ. వినగలదు, కానీ తిరిగి ఏమీ చెప్పలేదు. కష్టం ఆమెదే. ఊరిని విడిచి ప్రయాణం చేయాల్సిదే ఆమే. కానీ, ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం మాట్లాడలేకపోవడం వల్ల మాత్రమే కాదు, ఏమీ మాట్లాడే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా. ఈ సందర్భానికి ఇంతకు మించిన పాట రాయడం అసాధ్యం అనిపించేలా రాయడమే వేటూరి ప్రత్యేకత.

కెవి మహదేవన్ స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషాద గంభీరంగా ఆలపించారీ గీతాన్ని. ఈ తరహా పాటలకి 'జేసుదాసు పాటలు' అని పేరొస్తున్న సమయంలో తనకి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు బాలూ. కె. విశ్వనాధ్ దర్శకత్వంలో జయప్రద, చంద్రమోహన్ అభినయించారు. కళాత్మక చిత్రాల నిర్మాత 'పూర్ణోదయా' నాగేశ్వర రావు నిర్మించారీ సినిమాని.

సోమవారం, జనవరి 28, 2019

బద్దరగిరి రామయ్య ...

"చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగా..
కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ..."

నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అవును, 'నవ్వినా కన్నీళ్లే' నవల ఆధారంగా తీసిన 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా ఎప్పుడు చూసినా ఏదో ఒక సన్నివేశంలో కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఒకవేళ చాలా సన్నివేశాలకి మినహాయింపు ఇచ్చుకున్నా, "సమయానికి తగుపాట పాడెనే.." పాటని సినిమాలో భాగంగా చూస్తున్నప్పుడు మాత్రం మనకి తెలియకుండానే ఓ పల్చటి నీటిపొర కళ్ళకి అడ్డం పడుతుంది.


త్యాగరాజ కీర్తన నుంచి కొంత సాహిత్యం తీసుకుని, సినిమా కథకి తగ్గట్టుగా మిగిలిన భాగం తాను పూరించిన వేటూరి, టైటిల్స్ లో మాత్రం మొదట 'త్యాగరాజ కృతి (సమయానికి)' అనీ, ఆ తర్వాతే తనపేరూ వేయించుకున్నారు. త్యాగరాజ స్వామి మీద వేటూరికి ఉన్న గౌరవం అది!! చాలా మంది సినీ సంగీతాభిమానులు సైతం ఈ పాట సాహిత్యం మొత్తం సద్గురు త్యాగరాజుదే అని పొరబడుతూ ఉంటారు.

"బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా.. పరవళ్లు తొక్కింది గోదారి గంగ..
పాపికొండలకున్న పాపాలు కరగంగా.. పరుగుల్లు తీసింది భూదారి గంగ.."

జానపదులు పాడే ఈ పదంతో పాట ప్రారంభమవుతుంది.. గోదారి భద్రాచలంలో ఉన్న రాముడి పాదాలు కడిగేందుకు పరవళ్లు తొక్కుతోందనీ, పాపి కొండలకి ఉన్న పాపాలు కరిగేందుకు భూదారి వైపు పరుగులు పెడుతోందనీ భావం..

"సమయానికి తగు పాటపాడెనే.." తో పల్లవి ఆరంభమవుతుంది. త్యాగరాజ పంచరత్నాల్లో ఒకటైన 'సాధించెనే ఓ మనసా' అనే కీర్తనలో భాగంగా వస్తుంది. కాగా సినిమా పాటలో ఆ వెంటనే వచ్చే "త్యాగరాజును లీలగా స్మరించునటు.." మాత్రం ఈ కీర్తనలో ఎక్కడా కనిపించదు. "దేవకీ వసుదేవుల నేఁగించినటు" ని "త్యాగరాజును లీలగా స్మరించునటు.." గా మార్చి, తన గీతం త్యాగరాజ కీర్తనకి అనుసరణ అని చెప్పకనే చెప్పారు.


కీర్తనలో తర్వాత వచ్చే సాహిత్యం "రంగేశుడు సద్గంగా జనకుడు, సంగీత సంప్రదాయకుడు.." దీన్ని "ధీమంతుడు ఈ సీతారాముడు, సంగీత సంప్రదాయకుడు" అని మార్చి, కథానాయకుడు సీతారామయ్యని పాటలో ప్రవేశపెట్టారు. త్యాగరాజ సాహిత్యంలో తర్వాత వచ్చే "గోపీజన మనోరథ మొసంగలేకనే, గేలియు జేసేవాడు.." ని కూడా కథకి తగ్గట్టుగా "రారా పలుకరా యని కుమారునే ఇలా పిలువగ నోచని వాడు" అని మార్పు చేశారు వేటూరి. సీతారామయ్య గారికి కొడుకుతో మాటల్లేవు కదా మరి.

"చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు
చిలకంటి మనవరాలు
సదాగ లయల తేల్చి సుతుండు చనుదెంచునంచు ఆడిపాడు
శుభ సమయానికి తగు పాట పాడెనే..."

ఈ చరణం కూడా వేటూరి రాసిందే. తాతయ్యకి మనవరాలు ముద్దు. పైగా చిలకలాంటి మనవరాలు. రాక రాక వచ్చింది. ఆట పాటలతో పాటుగా, కొడుకు వస్తున్నాడనే శుభవార్త కూడా పట్టుకొచ్చింది. మరి, ఆ శుభ సమయానికి తగిన పాట పాడుకోవాలి కదా.

"సద్భక్తుల నడతలిట్లనెనే
అమరిక గా నాపూజ కొనెనే, అలుగవద్దనెనే
విముఖులతో చేరబోకుమనెనే, వెతగల్గిన తాళు కొమ్మనెనే
దమశమాది సుఖదాయకుడగు
శ్రీ త్యాగరాజ సుతుడు చెంతరాకనే..."

పాట చివరి చరణానికి మాత్రం త్యాగరాజ సాహిత్యాన్ని యధాతథంగా ఉంచేశారు. ఈ సాహిత్యం సందర్భానికి అతికినట్టు సరిపోతోంది కనుక, మార్చాల్సిన అవసరం పడలేదు. త్యాగరాజస్వామి వారు ఇంకో అర్ధంతో పాడితే, సీతారామయ్యగారు కొడుకు మీద కినుకని ప్రదర్శించారు. ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన తన తండ్రి మీద, ఆయన తండ్రికి ఇంకా కోపం మిగిలి ఉండడాన్ని జీర్ణించుకోలేక పోయింది ఆ మనవరాలు. అందుకే, పాడడం ఆపేసి, మోకాళ్ళ మీద తల పెట్టుకుని వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది. తాతయ్య ఓదార్చబోతే, అవి కన్నీళ్లు కాదు, ఆనంద భాష్పాలని అబద్ధం చెప్పింది.

సాధారణంగా పాటంటే ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. ఈ పాట జానపదులు పాడుకునే పదంతో మొదలైంది. మరి అక్కడే ముగియాలి కదా.

"బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా.. పరవళ్లు తొక్కింది గోదారి గంగ..
చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగా..కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ.."

గోదారి పాటలోకి 'శబరి' ఎందుకు వచ్చిందన్న సందేహం సహజం. శబరి, గోదావరి నదికి ఉప నది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. కానీ, శబరి మాత్రం గోదారిలో కలుస్తుంది. అప్పటికి ఆయనకి తెలియకపోయినా, సీతారామయ్య గారి జీవితంలో ఓ విపర్యయం జరిగింది. తాను కొడుకు చేతిలో వెళ్లిపోవాల్సి ఉండగా, ఆ కొడుకే తనకన్నా ముందుగా వెళ్ళిపోయాడు. ఆ విషాదం ఆ మనవరాలికి తెలుసు.. కాబట్టే ఆమె కళ్ళల్లో కన్నీటి గంగ పొంగింది. నిజం తెలియని సీతారామయ్య మాత్రం, అలనాడు రాముడికోసం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని ఎదురు చూసిన భక్త శబరిలా కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఆరభి రాగం, ఆది తాళంలో త్యాగరాజ స్వామి స్వరపరిచిన కీర్తన ఆధారంగా తయారు చేసిన ఈ పాట స్వరకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కీరవాణి. సంగీతజ్ఞుల నుంచి అభ్యంతరాలు రానివిధంగా స్వరం చేస్తూనే, సినిమా ప్రేక్షకులని దృష్టిలో ఉంచుకుని ముందూ వెనుకా జానపదుల పదాన్ని చేర్చారు. ముఖ్యంగా వాయులీనంతో మరోమారు అద్భుతం చేశారు.

సినిమా కథ మొత్తాన్ని ఆవాహన చేసుకున్న వేటూరి పాత్రల్లో లీనమై ఒక్క పాటతో సగం కథ చెప్పేసే విధంగా సాహిత్యం అందించారు. కోరస్ తో కలిసి బాలు, చిత్ర హృద్యంగా ఆలపించారు. అభిరుచిగల చిత్రాన్ని నిర్మించిన వి. దొరస్వామి రాజుని, దర్శకుడు క్రాంతికుమార్ నీ కూడా అభినందించాలి. ఇక నాగేశ్వర రావు, మీనా అయితే నిజంగా తాత, మనవరాలు అనిపించేలా చేశారు.

ప్రముఖ కవుల కవిత్వంతో పాటను నింపేసి, సొంతపేరుతో చలామణి చేసుకునే కవులున్న సినిమా ప్రపంచంలో వేటూరి లాంటి కవులు అరుదు. వేటూరి పాటలనుంచి చాలా నేర్చుకున్నాం అని చెప్పేవారందరూ, త్యాగరాజస్వామికి వేటూరి ఇచ్చిన గౌరవాన్ని కొంచమైనా గమనిస్తే బాగుండును.

శుక్రవారం, జనవరి 25, 2019

వేణువై వచ్చాను ...

"రాయినై ఉన్నాను ఈ నాటికీ...  
రామ పాదము రాక ఏనాటికీ..."

నిరుపమాన కవి, సినీ గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తికి తాను రాసిన వేలాది పాటల్లో బాగా ఇష్టమైన పాట - బహుశా - "వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి.. " అయి ఉంటుంది. 1993 లో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా కోసం రాసిన ఈపాటని ఆ తర్వాత అనేక సందర్భాలలో తల్చుకోవడంతో పాటు, 'వేణువై వచ్చాను' పేరిట ఆత్మకథ రాయాలని ఒక దశలో సంకల్పించారు కూడా. ఇదే సినిమా కోసం తానే రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.." పాటకి జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు కూడా "వేణువై వచ్చాను పాటకి అవార్డు వస్తుందనుకున్నా.." అన్నారు వేటూరి.


"వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి.. మమతలన్నీ మౌనగానం.. వాంఛలన్నీ వాయులీనం.." ఇది పల్లవి, వెనుకే రెండు చరణాలు. తరచి చూస్తే పల్లవిలోనే ఒక జీవితం మొత్తం కనిపిస్తుంది. రావడానికీ, పోడానికీ మధ్య కొన్ని మమతలు, మరికొన్ని వాంఛలు.. అవేవీ శాశ్వతాలు కావు. ఆ మాటకొస్తే, రావడం, పోవడం కూడా ఎవరి చేతుల్లోనూ ఉన్నది కాదు కదా. మమతలు మనసులో దాగేవి, అవి మౌనరాగాలే. వాయులీన స్వరాల సరళికీ వాంఛలకీ మధ్య అన్వయం ఎవరికి వారు చేసుకోవల్సిందే. 

"ఏడు కొండలకైన బండ తానొక్కటే.. ఏడు జన్మల తీపి ఈ బంధమే.." కొండలు ఏడయినా వాటన్నింటి బండ (రాయి) ఒక్కటే. ఆ కొండల మీద ఉన్న దేవుడు బండగా మారాడన్న నిందార్ధమూ గోచరిస్తుందిక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, వెనుకటివి ఏడు జన్మల  తాలూకు వాసనలు ప్రస్తుత జన్మలో అనుభవానికి వస్తాయంటారు. అలాగే, ఏడు జన్మలు ఎత్తితే తప్ప మానవ జన్మ రాదన్న మరో వాదమూ ఉంది. మొత్తం మీద "ఏడు జన్మల తీపి" ఈ జీవితం. "నీ కంటిలో నలక లోవెలుగు నే కనక నేను మేననుకుంటె ఎద చీకటి... హరీ..." నా స్థితికి నీ కంట్లో కూడా బాధ ఉంది, కానీ ఆ లోపలి వెలుగు నాకు కనిపించదు. అలా కనిపించక పోవడంతో నిన్ను విస్మరించి 'నేను నా శరీరం' అనుకుంటే నా ఎద చీకటి మయమవుతుంది ప్రభూ.. మొదట నింద, ఆ వెనుకే స్తుతి!!

"రాయినై ఉన్నాను ఈ నాటికీ.. రామపాదము రాక ఏనాటికీ.." నువ్వు రాయివి కాదు. కానీ, నేను మాత్రం రాయిగా పడి ఉన్నాను. ఎన్నాళ్ళకీ ఆ రామపాదం నా దగ్గరకి రానప్పుడు మరి వేరే దారేముంది? కేవలం రామపాదం సోకడంతోనే రాయి అహల్యగా మారిపోవడం ఒక అద్భుతం. అలాంటి అద్భుతం ఏదీ జరగనప్పుడు, రాయిగా మిగిలిపోవడం తప్ప చేయగలిగింది ఏముంది? జీవన పోరాటంలో రాళ్లుగా మారిపోయిన అందరినీ తాకాలంటే ఎన్ని రామపాదాలు కావాలో కదా. జన్మనీ, జన్మ తాలూకు కష్ట సుఖాలనీ తాత్వికంగా చెబుతూ మొదటి చరణం ముగుస్తుంది. ఇక, రెండో చరణం వచ్చేసరికి కథలో నాయిక జీవితం ఊహించని విధంగా తల్లకిందులైపోతుంది. 


"నీరు కన్నీరాయె.. ఊపిరి బరువాయే.. నిప్పు నిప్పుగ మారె నా గుండెలో.."  అనారోగ్యంతో శుష్కించిన నాయిక మరణం అంచులో ఉంది. భవబంధాలని ఒక్కొక్కటిగా వదిలించుకునే సందర్భంలో వచ్చే ఈ చరణంలో శరీరంలో ఉన్న పంచ భూతాలూ ఒక్కొక్కటిగా దేహాన్ని విడిచి వెళ్లడాన్ని చెప్పారు వేటూరి. నీరు కన్నీటి రూపంలో బయటికి వెళ్తోంది. తేలికగా ఉండాల్సిన ఊపిరి (గాలి) బరువుగా మారుతోంది. నిప్పు (అగ్ని) గుండెల్లో నిప్పుగా మారిపోయింది."ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు.. పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు.. హరీ..." వచ్చేటప్పటి లాగే వెళ్లేప్పుడూ శూన్యమైపోయాయి బంధాలు. అవి నింగికి (ఆకాశం) చేరుకున్నాయి. మట్టిలో పుట్టిన ప్రాణాలు మట్టిలోనే కలుస్తున్నాయి. ఆమె కథ ముగిసిపోయింది కాబట్టి, పాట అయిపోయినట్టేనా? ఉహు.. లేదు.. అలా ముగిస్తే ఆ కవి వేటూరి కానే కాదు.

"రెప్పనై ఉన్నాను మీ కంటికీ.. పాపనై వస్తాను మీ ఇంటికి.." మరణంతో జీవితం ముగిసినంటే కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు. పుట్టిన ప్రతి ఒక్కరూ పోవాల్సిందే. పోయినవాళ్లు మళ్ళీ ఎక్కడో, ఎప్పుడో పుట్టాల్సిందే. మరణం అంచున ఉన్న వారికీ, వారి సన్నిహితులకీ కూడా ఈ మళ్ళీ పుట్టడం అన్న భావన నిజానికి పెద్ద ఉపశమనం. నేనెక్కడికీ వెళ్లడం లేదు, మీ కంటికి రెప్పలా ఉన్నాను, మళ్ళీ మీ పాపగా మీ ఇంటికివస్తాను అని వెళ్తూ వెళ్తూ తన పిల్లలకి చెబుతోందా తల్లి. అనివార్యాల తాలూకు బాధని కొంచమైనా తగ్గించుకోడానికి ఊతమిచ్చే గొప్ప ఆలోచన ఈ పునర్జన్మ. "వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోయాను గగనానికి.." అంటూ ముగుస్తుందీపాట.

వేటూరితో పాటు ఈ పాటకి ప్రాణం పోసిన మరో ఇద్దరినీ ప్రస్తావించుకోవాలి. స్వరకల్పన చేసిన కీరవాణి, నాయిక పాత్రలో మమేకమై ఆలపించిన చిత్ర. వాయులీనాన్ని గొప్పగా ఉపయోగించే సినీ సంగీత  దర్శకుల్లో కీరవాణి ఒకరు. సెంటిమెంట్ ని హృద్యంగా పలికించదానికి వయోలిన్ ని మించిన వాయిద్యం లేదేమో. ఆడియో విడుదలైన కొత్తలో చాలామంది శ్రోతలు ఈ పాటని ఇళయరాజా స్వరకల్పనగా పొరబడ్డారు! ఇక, ఈ పాట వింటూ చిత్ర ని పరభాషా గాయని అని అస్సలు అనుకోలేం. వేటూరి గాయకుడు కూడా అయితే చిత్ర పాడినట్టే పాడేవారేమో అనిపిస్తుంది విన్నప్పుడల్లా. ఈ పాట ఔచిత్యాన్ని కాపాడిన మరో ఇద్దరినీ తల్చుకోవాల్సిందే. దర్శకుడు అజయ్ కుమార్, కథానాయిక మాధవి. ముఖ్యంగా, రెండో చరణం చిత్రీకరణ, మాధవి నటన వెంటాడుతూనే ఉంటాయి.

జాతీయ అవార్డు ఈ పాటకి వచ్చి ఉంటుందని వేటూరి అనుకున్నారంటే, అనుకోరా మరి! గత శతాబ్దపు ఎనభయ్యో దశకంలో వేటూరి రాసిన రెండర్ధాల పాటల్ని, అర్ధం లేని పాటల్ని తెగ తెగిడిన వాళ్ళు, ఇప్పటికీ విమర్శిస్తున్న వాళ్ళూ ఉన్నారు. అలాంటి పాటలు రాయడం కన్నా, గీత రచయితగా నిష్క్రమించి ఉంటే గౌరవంగా ఉండేది అన్నవాళ్లకూ కొదవ లేదు. అలా నిష్క్రమించడం పెద్ద విషయం కాదు. ఇంకెవరో వచ్చే వారు, రాసేవారు. కానీ, ఆ తర్వాత కాలంలో వేటూరి రాసిన పాటలు - మరీ ముఖ్యంగా ఈ పాట లాంటివి - మాత్రం మనకి దొరికేవి కావు. 'రామపాదం' లాంటి అద్భుతం ఏదో జరిగి వేటూరి మళ్ళీ పుడితే ఎంత బాగుండు!!

గురువారం, జనవరి 24, 2019

పదేళ్ల పండుగ

అసలైతే గడిచిన ఏడాదంతా విస్తృతంగా టపాలు రాసేసి 'దశాబ్ది ఉత్సవాలు' ఘనంగా నిర్వహించాలని బోల్డన్ని ప్లాన్లేసుకున్నాను. 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అని 'మనసుకవి' అల్లప్పుడెప్పుడో చెప్పేశారు కదా. అందుకనే, ఆయనే చెప్పినట్టు 'జరిగేవన్నీ మంచికని' సరిపెట్టేసుకుని, ఈ పుట్టిన్రోజు పోస్టు రాయడానికి ఉపక్రమించానన్నమాట. ఇంకెందుకాలస్యం? 'అక్షింతలు' తీసుకుని రండి. 'నెమలికన్ను' కి పదో పుట్టినరోజు ఇవాళ!!

మార్కులు తక్కువొచ్చాయని ప్రోగ్రెస్ కార్డు చూపించడం మానెయ్యకూడదు కదా. చిన్న చిన్న తొండిలు చేయడం కూడా నేర్చుకోకుండానే రోజులెళ్ళిపోతున్నాయి, ఏవిటో. ఎప్పటిలాగే సమీక్ష లోకి వచ్చేస్తే, ఏడాది మొత్తంలో రాసి అచ్చేసిన పోస్టుల సంఖ్య అక్షరాలా పదహారు. అదృష్టం బానే ఉన్నట్టుంది, మరీ 'అంకె' అనికాకుండా 'సంఖ్య' అని రాయగలిగా. ఈ పోస్టులని గురించి వెనక్కెళ్ళి ఆలోచించడం అంటే, గడిచిన ఏడాది జీవితాన్నీ తిరగతోడుకోవడమే.

ఒక్కమాటలో చెప్పాలంటే కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగిన ఏడాది. సంవత్సర కాలాన్ని గంటల్లోకి మార్చుకుని, రకరకాల వాహనాల్లో ప్రయాణం చేసిన గంటల్ని పక్కన వేసి ఓ టేబుల్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది కానీ, దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు కదా. నిజానికి ప్రయాణాలు చేసేప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కథల్లాంటి వాటితో సహా అనేక బ్లాగు పోస్టులు అలా ప్రయాణాల్లో చేసిన ఆలోచనల నుంచి వచ్చినవే. కాకపొతే, గతేడాది ప్రయాణాల్లో బుర్రలో అలాంటి మెరుపులేవీ మెరవలేదు.

Google Image
టపాలకు మరో ముఖ్యమైన ముడి దినుసు పుస్తకాలూ, సినిమాలూను. పుస్తకాల విషయానికి వస్తే ఎక్కువగా రివిజన్ మీదే నడిచింది బండి. వాటిలో కొన్ని రాయాల్సినవి ఉన్నాయి. కొత్తగా చదివినవి బహు తక్కువ. పైగా, ఒకేసారి నాలుగైదు పుస్తకాలు మొదలెట్టడం అనే అలవాటు పెరిగి పెద్దదయ్యింది. దీంతో, రోజులు గడుస్తున్నాయి కానీ, ఏ పుస్తకంలోనూ పట్టుమని వంద పేజీలు కూడా కదలడం లేదు. దీనికేదో పరిష్కారం వెతకాలి. సినిమాల విషయానికి వస్తే, మంచి సినిమాలేవీ మిస్సవ్వలేదు కానీ చూసిన చాలా వాటిని గురించి పోస్టులు రాయలేదు.

చాలా రోజులుగా నానుతున్న ఆలోచనలు కొన్ని ఉన్నాయి. వాటిని రాయడం అంటూ జరిగితే ఇక్కడే రాయాలి. మొదలు పెడితే తప్పించి అవి ఏ రూపు తీసుకుంటాయన్నది చెప్పడం కష్టం. కాళ్ళ చక్రాలకి ఇప్పుడు మరీ ఎక్కువ పని చెప్పడం లేదు కాబట్టి, ఇకపై కొత్తవి చదవడంతో పాటు ఆలోచనలని ఇక్కడ పంచుకునే ప్రయత్నాలు చేస్తానేమో. 'చేస్తాను' అని ధైర్యంగా చెబుదామంటే పదహారు పోస్టులూ వెక్కిరిస్తున్నాయి మరి.

ఏడాది సంగతి ఇలా ఉండగా, బ్లాగరుగా దశాబ్ద కాలం పూర్తి చేసుకోడం కూడా నా ప్రమేయం పెద్దగా లేకుండా జరిగిపోయిన విషయం. నా పాటికి నేను రాసుకుంటూ ఉండగా, కాలచక్రం అలా దొర్లిందన్న మాట. మాంఛి ఉధృతంగా మొదలైన బ్లాగింగ్ మందకొడిగా మారడం ఈ పదేళ్లలోనూ సంభవించిన పరిణామం. అయితే, ఏడాది నిరాశ పరిచినట్టుగా దశాబ్ది పరచలేదు. వెనక్కి చూసుకుంటే బోలెడన్ని మెరుపులు కనిపిస్తున్నాయి నాకు. రాయాల్సిన విషయాలూ గుర్తొస్తున్నాయి..

పాఠకులందరికీ మరోమారు మనఃపూర్వక ధన్యవాదాలు!!

మంగళవారం, జనవరి 15, 2019

సంకురాత్రి కోడి

ఊళ్ళో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయ్. మనుషులెవరూ కనిపించడం లేదు. ఏమైపోయారబ్బా అనుకుంటూ మా 'హరి' కి ఫోన్ చేశాను. "పందెం బరికాడున్నాం వొచ్చెయ్యెహె" అంటూ గుర్తులు చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. కొన్నేళ్ల  క్రితం వరకూ బరి దగ్గరికి వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. మా ఊరి మర్యాదస్తులు కొందరు నన్నక్కడ చూసి సిగ్గుపడి పోయేవాళ్లు. "అయ్ బాబోయ్.. ఆడతాకి రాలేదండి" అని అడక్కపోయినా చెప్పేవాళ్ళు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని, పండక్కి ఊళ్ళో ఉన్నా పందెం బరి వైపు వెళ్లడం మానుకున్నా. ఇప్పుడిక తప్పడం లేదు.

పొలాల మధ్య కొబ్బరి తోటలో ఎప్పుడూ కన్నా పెద్ద టెంట్ వెలిసింది. బోల్డన్ని మోటార్ సైకిళ్ళు, రెండు మూడు కార్లు బరి చుట్టూ గోడ కట్టినట్టుగా పార్క్ చేసి ఉన్నాయి. మూడొంతుల మనుషులు రెండు కాళ్ళూ భూమ్మీద నిలబెట్టలేని తన్మయావస్థలో ఉన్నారు. సీసాలు, గ్లాసులకి పక్కనే చిన్న స్టవ్ మీద చికెన్ పకోడీలు వేగుతున్నాయి. ఆ సందోహంతో మా వాడిని పట్టుకోడానికి మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది. చాలా మందిమి చెదురుమదురై పోయినా, ఊరినే అంటిపెట్టుకుని ఉన్న కొద్దిమందిలో వాడూ ఒకడు. సొంత ఇల్లు, వ్యవసాయంతో పాటు, స్కూల్ మాస్టర్ ఉద్యోగం పక్కూళ్ళోనే.

"మేస్టార్లు కూడా కోడి పందేలు కాస్తే ఎలాగరా బాబా" అంటూ పలకరించాను. బాల్య స్నేహితుల్ని, మా ప్రాంతం మనుషుల్ని చూసినప్పుడు యాస తెలీకుండా తన్నుకొచ్చేస్తుంది. "ఎహె.. ఎదవ గోల.. పెద్ద స్టోరీ ఉన్నాదిలే.. టీవీలోళ్ళ ఫోన్ నెంబర్లేవన్నా నీకాడుంటే ఇస్తావా.. నాలుగు బూతుల్తిట్టి ఫోనెట్టేస్తాను.." అదేదో సినిమాలో రవితేజ గుర్తొచ్చాడు నాకు. "ఆళ్ళేంజేసేరు మజ్జలో?" అడిగేశాను. "హైదరాబాద్ నుంచి రాటాకి మా బామ్మర్ది నాకొడుక్కి లీవు దొరకలేదంట. అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేడు.." చిన్నప్పుడు బళ్ళో మేష్టారు మూత్రపిండాల గురించి అడిగితే, వీడు హృదయస్పందన గురించి వివరించేడు. పెద్దగా మార్పేమీ లేదు.


నాక్కొంచం సహనం ఉండబట్టీ, నా చేతిలో కర్ర లేకపోబట్టీ, అన్నింటికీ మించి మేస్టార్ని కొట్టకూడదనీ గమ్మునున్నా. "డబ్బులేసేనని ఫోన్ చేసి, నా పేరుమీద మాంచి పుంజుల మీద పందెం కాయ్ బా.. అంటా ఎదవ పురమాయింపు. నేనెక్కడ కాయనో అని, ఆళ్ళక్కక్కూడా చెప్పేడు.. ఇంక తప్పుద్దా?" హమ్మయ్య.  సగం విషయం అర్ధమయ్యింది. ఊరుకుంటే మిగిలిన సగం కూడా వాడే చెపుతాడు కదా. పందేల తిరునాళ్లలో జనం వస్తూ, పోతూ ఉన్నారు కానీ ఎవరికీ ఎవర్నీ పట్టించుకునే తీరుబాటు లేదు. పందేలు కాసిన వాళ్ళు ఫోన్లలో వీడియో షూట్ చేసుకుంటున్నారు. లైవ్ లు కూడా నడుస్తున్నట్టున్నాయ్.

"మొన్నమొన్నటిదాకా ఎలాగుండేయ్రా పందేలు? ఆడేవోళ్ళకి తప్ప ఇంకెవడికన్నా తెలిసేదేటి? మా నాన పందేలకాడికెల్లొత్తే మాయమ్మ కేకలెయ్టం నాగ్గుర్తున్నాది. ఇప్పుడు సూడు, మాయావిడ ఎల్తావా, సత్తావా అని పట్టట్టి పంపింది.." ఎక్కువసేపు తలాడిస్తూ ఉండిపోతే నాకూ ఓ డోసు పడే ప్రమాదం ఉంది, అందుకని "తమ్ముడు సర్దా పడితే ఆవిడమాత్రం ఏం చేద్దిరా" అన్నాను. మావాడు మాంచి కాకమీదున్నాడు. "నా దెవసం జేత్తాది" అనేశాడు. "అదేంట్రా, పండగపూటా.." నిజంగానే నొచ్చుకున్నాను. "కాపోతేట్రా? కోనసీవోళ్లంటే సంక్రాంతికి కోడిపందేలు ఆడక తప్పదు అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.. తయారుజేస్సేరు టీవీలోళ్లు. ముందెప్పుడన్నా ఇలాగున్నాదా?"

వాడి ప్రశ్న విని నేనూ ఆలోచనలో పడ్డాను. నిజమే.. ఇదివరకటి కన్నా బర్లు పెరిగాయి. పందేలు కాసేవాళ్ళూ, చూసేవాళ్ళూ కూడా పెరిగారు. "ఒకప్పుడు తప్పు సేత్తన్నాం అని ఏమూలో ఉండేది. ఉప్పుడు కామనైపోయింది. పందెం కాసేవోడికి తప్ప అందరికీ లాబవే. ఎవడికాడు డబ్బు చేసుకుంటన్నాడు. జనాలకి పిచ్చెక్కించి పందేలు కాసేలాగా సేత్తన్నారు. పెద్ద డ్రామాకింద తయారయ్యింది ఇదంతా.." ఇంతకీ వీడి బావమరిది డబ్బులు పందేల్లో పోయాయా?వీడుగానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడా? వాడిదగ్గర మొహమాటం ఎందుకు? అడిగేశాను.

"మనకయ్యన్నీ పడవురా. పందెం పని మా షడ్డకుడికి అప్పజెప్పేను. పక్కన్నేనూ ఉండాల్సిందే అంటే పన్లు మానుకుని పొద్దున్నుంచీ ఇక్కడే పడున్నాను. బామ్మర్దిగాడైతే ఫోన్లోనే ఉన్నాళ్లే. ఈడు ఫోటోలు పంపటం, ఆడు పుంజులు సెలెక్టు చెయ్యటం.. పెద్ద పెంట కిందున్నాది.." హమ్మయ్య, మావాడి సమస్యేమిటో తెలిసిపోయింది. పరిష్కారం నా చేతిలో లేదు కదా. తక్షణ కర్తవ్యంగా, టాపిక్ మార్చి, వాడిని వేరే కబుర్లలో పెట్టానుకానీ, వాడన్న మాటలు నా బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి.