బుధవారం, జులై 29, 2009

సూర్యోదయం-నా రేడియో రచన

అప్పుడే జాగింగ్ పూర్తి చేసి వచ్చి బాల్కనీ లో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాను. జాగింగ్ తాలూకు అలసట నుంచి విశ్రాంతి పొందుతూ దూరంగా కనిపిస్తున్న ఆకాశం వైపు చూశాను. నీలాకాశం అరుణిమను దాల్చుతోంది. కాలచక్రంలో మరో రోజుకు తెర తీస్తున్నాననే సంకేతం ఇస్తూ బాల భానుడు ఉదయించేందుకు ఆయత్తమవుతున్నాడు.

సూర్యోదయం..అది నాకెంతో ఇష్టమైన దృశ్యం.. ప్రతిరోజూ చూస్తున్నదే అయినా ప్రతిసారీ ఓ కొత్తదనం. మనసును ఉత్తేజ పరిచే ఆ దృశ్యాన్ని చూసేందుకు నేను సిద్ధపడుతుండగానే శరీరానికి ఉత్తేజాన్నిచ్చే వేడి పానీయంతో శ్రీమతి నా దగ్గరకు వచ్చింది "డాక్టరు గారేదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు.." అంటూ.. నేను ఆలోచనల్లోకి వెళ్ళిపోతే నన్ను నా వృత్తితో సంబోధించడం తన అలవాటు.

తన పలకరింపుకి బదులుగా నేను ఓ చిరునవ్వు నవ్వాను. ట్రేలోంచి ఓ కప్పు నాకిచ్చి మరో కప్పు తను అందుకుంది. కాసేపయ్యాక.. అప్పుడే వచ్చిన న్యూస్ పేపర్ తెచ్చిన వార్తలతో మా సంభాషణ ప్రారంభమయ్యింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర విశేషాలన్నీ ఐపోయాక కాసేపు ఇంటి సంగతులు మాట్లాడి "ఇవాళ హాస్పిటల్ కి వెళ్ళరా?" అంటూ గుర్తు చేసింది. నిజానికి రోజంతా బిజీ గా ఉండే నేను ఆమెతో గడిపేది ఆ కొద్ది సమయమే.

నేను ప్రారంభించిన 'రఘు నర్సింగ్ హోం' కి ఇప్పుడిప్పుడే పేరొస్తోంది. రోగులకి నా హస్తవాసి మీద నమ్మకం కుదరడంతో ఆస్పత్రిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నాకు ఎంత టైమూ సరిపోవడం లేదు. ఈ విషయం ఆమెకూ తెలుసు. అయినా ఆమెతో గడిపే సమయంలోనూ నా బాధ్యతను గుర్తు చేస్తోంది. 'ఈమె భార్యగా దొరకడం నా అదృష్టం' ఇప్పటికీమాట ఎన్నిసార్లు అనుకున్నానో లెక్క లేదు.

"అడుగుతున్నది మిమ్మల్నే సర్" ..ఆమె గొంతు విని ఆలోచనల నుంచి బయట పడ్డాను. ఓ పక్క హాస్పిటల్ కి వెళ్లేందుకు రెడీ అవుతూనే ఆరోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచించుకుంటున్నాను. టిఫిన్ తింటుండగానే హాస్పిటల్ నుంచి ఫోన్. నా అసిస్టెంట్ చేశాడు. తను కాస్త త్వరగా ఇంటికి వెళ్లాలట. నన్ను ముందుగా రమ్మని అభ్యర్ధన. శ్రీమతికి విషయం చెప్పి కారుతాళాలు తీసుకుని బయలుదేరాను. నాకిష్టమైన సంగీతం వింటూ కారు డ్రైవ్ చేస్తున్నాను.

మెడిసిన్ లో ర్యాంకు సాధించడం మొదలు మంచి డాక్టరుగా పేరు తెచ్చుకోడం వరకు నా జీవితంలో నేను వేసిన ప్రతి అడుగు వెనుక ఓ స్ఫూర్తి ఉంది. నా వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తిపరమైన ఎదుగుదలనూ పరిశీలిస్తున్న వారంతా 'డాక్టర్ ప్రశాంత్ చాలా అదృష్టవంతుడు' అంటున్నప్పుడు నాకు యెంతో గర్వంగా అనిపిస్తుంది. అదే సమయంలో జీవితంలోని ఓ ముఖ్యమైన మలుపులో నేను వెయ్యబోయిన ఓ తప్పటడుగూ గుర్తొస్తుంది. నేనా తప్పు చేయకుండా అడ్డుకున్న ఆ మహనీయుడు నా స్మృతిపధం లో ఎన్నడూ చిరస్మరణీయుడే..

కారు హాస్పిటల్ దగ్గరికి రావడంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది. విశాలమైన ఆవరణలో కనువిందు చేసే గార్డెన్. మధ్యలో తెల్లని బిల్డింగ్. నల్లని గేట్ పైన మెరిసే అక్షరాలతో 'రఘు నర్సింగ్ హోం' అనే బోర్డు. నిత్యం చూసేదే అయినా మరోసారి తనివితీరా చూసుకున్నాను. ఒక్కో పేషెంట్ దగ్గరకీ వెళ్లి వారి బాగోగులు కనుక్కోవడం, జాగ్రత్తలు చెప్పడం, వాళ్ళడిగే ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలివ్వడం.. ఇలా నాకు తెలియకుండానే సమయం గడిచిపోయింది. ఇన్-పేషెంట్స్ కి సంబంధిచి రౌండ్స్ పూర్తవ్వగానే అవుట్-పేషెంట్స్ ని చూడడం ప్రారంబించాను.

నా దగ్గరకు వచ్చే రోగుల్లో రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. చిన్నపాటి సమస్యకే కంగారు పడుతూ వచ్చేవారు కొందరైతే, ఎంత పెద్ద అనారోగ్యమైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాళ్ళు మరికొందరు. నాకు తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యంతో పాటు మనస్తత్వాలనూ పరిశీలించడం అలవాటైపోయింది. నా ఈ సైకాలజీ అబ్సర్వేషన్ ఎప్పుడు ప్రారంభమైందన్నది నాకే సరిగా గుర్తు లేదు. పేషెంట్స్ ని చూడడం పూర్తవ్వడంతో కాస్త తీరిక చిక్కింది. శ్రీమతితో మాట్లాడాలనిపించింది. ఫోన్ తీశాను. ఇంటి నెంబరు డయల్ చేసేలోగా బయటేదో కలకలం వినిపించింది. ఫోన్ పెట్టేశాను.

నేను పిలిచేలోగా నర్స్ తనే వచ్చింది. "సూసైడ్ అటెంప్ట్ కేస్ సర్..కండిషన్ సీరియస్ గానే ఉంది.." ఆమె స్వరంలో కాస్త సందేహం. "అడ్మిట్ చేసుకోండి" అని చెప్పి పేషెంట్ దగ్గరకు నడిచాను. పాతికేళ్ళ లోపే ఉంటాయి ఆ కుర్రాడికి. అపస్మారక స్థితిలో ఉన్నాడు. అక్కడున్న స్త్రీలలో ఒకామె, అతడి తల్లి కావచ్చు, "పురుగు మందు తాగేశాడు బాబూ.." అని వెక్కిళ్ళ మధ్య చెప్పింది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ ప్రారంభించాను. కేసు క్రిటికల్ గానే ఉంది. చాలా మందు తగేశాడతాను. స్టమక్ వాష్ మొదలు పెట్టాను.

మృత్యువుతో పోరాటం.. ఒక్కమాటలో చెప్పాలంటే జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడు. అమాయకమైన అతడి ముఖం చూస్తే ఏదో తెలియని అభిమానం పుడుతోంది. ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడో? ..తాగిన విషం కొద్ది కొద్దిగా బయటకు వస్తోంది. నరకం అనుభవిస్తున్నాడతను.. తప్పదు.. అతడి ముఖంలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. కానీ పర్వాలేదు అనుకోడానికి లేదు. ట్రీట్మెంట్ చేస్తున్నానన్న మాటే కానీ ప్రతిక్షణం టెన్షన్ అనుభవిస్తున్నాను.

పాపం..ఇతని తలిదండ్రులు ఇతని మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు? ఎందుకిలాంటి తొందరపాటు పని చేశాడు? ఓ క్షణం తరువాత నా ఆలోచనకు నాకే సిగ్గేసింది. అందుకు కారణం లేకపోలేదు. ట్రీట్మెంట్ కొనసాగుతోంది. చాలా వరకు విషం బయటకు వచ్చేసింది. అతని ముఖంలో తేటదనం వచ్చింది. మనిషి నిస్త్రాణగా సోలిపోయాడు. నర్సుకు చేయాల్సింది వివరించి బయటకు వచ్చాను. అతని కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆందోళన. సాయంత్రానికి స్పృహ రావచ్చునని చెప్పి నా రూం లోకి నడిచాను.

ఈ సంఘటనతో నా మూడ్ మొత్తం మారిపోయింది. నా గతం ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆలోచనల ధాటికి తలపోటు ప్రారంభమైంది. మధ్యాహ్నం లంచ్ చేయలేదన్న విషయం గుర్తొచ్చింది. నర్స్ ని పిలిచి ఆ పేషెంట్ కండిషన్ అడిగాను. ఇంటికి వెడుతున్నానని, అవసరమైతే ఫోన్ చేయమనీ చెప్పి బయలుదేరాను. డాక్టరుగా రోగులు నాకు కొత్త కాదు. కానీ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు నేను నేనుగా ఉండలేదు. అన్యమస్కంగానే ఇంటికి చేరాను.

సీరియస్ గా ఉన్న నా ముఖం చూసి శ్రీమతి నన్ను పలకరించే ప్రయత్నం చేయలేదు. నేను 'అలా' ఎందుకు ఉన్నానో ఆమె ఊహించగలదు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నా అన్నం పైకి దృష్టి పోలేదు. ఆమె తృప్తి కోసం తిన్నాననిపించి లేచాను. ఈజీ చైర్లో కూర్చున్నానన్న మాటే కానీ నా ఆలోచనలు నన్ను స్థిరంగా ఉండనివ్వడం లేదు. సుళ్ళు తిరిగే జ్ఞాపకాల్లోంచి రఘు రూపం నన్ను పలకరించింది. నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

ఫోన్ మోతతో నిద్ర నుంచి మెలకువ వచ్చింది. మెడిసిన్ లో నా క్లాస్మేట్. మెడికల్ జర్నల్ లో నే రాసిన వ్యాసం చదివాట్ట.. అబినందించడానికి ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఐపోయాక నాకు మధ్యాహ్నం పేషెంట్ గుర్తొచ్చాడు. హాస్పిటల్ కి ఫోన్ చేశాను. మధ్యలో ఓసారి స్పృహ వచ్చిందని, ఏడ్చి పడుకున్నాడని నర్స్ చెప్పింది. స్నానం చేసి హాస్పిటల్ కి బయలుదేరాను. పేషెంట్స్ అందర్నీ చూశాక ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లాను. అమాయకంగా నిద్రపోతున్నాడు. అతని తాలూకు బంధువులు కృతజ్ఞతలతో నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు. డిశ్చార్జి చేస్తారా? ఇంటికి తీసుకెళ్ళి పోవచ్చా? అని అడిగారు. కుర్రాడు చాలా నీరసంగా ఉన్నాడని, రాత్రికి గ్లూకోజ్ ఇస్తానని చెప్పాను.

"డిగ్రీ చదివేడు బాబూ.. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.. వాడి అదృష్టమేమిటో.. ఒక్కటీ దొరకలేదు.. వాళ్ళ నాన్న బయటి కోపమంతా వాడిమీద చూపించారు.. ఇంకా ఎన్నాళ్ళు పోషించాలి? సిగ్గనిపించడం లేదా అని అడిగేసరికి.. బిడ్డ తట్టుకోలేక ఈ అగాయిత్యానికి పూనుకున్నాడు.." అతని తల్లి దాదాపు ఏడుస్తూ చెప్పింది. నేనూహించింది నిజమేనన్న మాట. రేపోసారి అతనితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. మర్నాడు ఉదయం హాస్పిటల్ కి వెళ్ళగానే అతని ఆరోగ్యం గురించి కనుక్కున్నాను. నార్మల్ కి వచ్చాడని, ఎవరితోనూ మాట్లాడ్డం లేదనీ చెప్పారు.

పేషెంట్స్ ని చూడ్డం పూర్తయ్యాక అతన్ని నా రూం కి పిలిపించాను. కోల ముఖం, ఉంగరాల జుట్టు, కొద్దిగా మాసిన గెడ్డం.. ఆ వయసు వాళ్ళలో ఉండాల్సిన ఉత్సాహానికి బదులు అతడి ముఖంలో నిరాశా నిస్పృహలు. కూర్చోమని కుర్చీ చూపించాను. రెండు నిమిషాలు నేనేమీ మాట్లాడలేదు. అతను తల దించుకుని కూర్చున్నాడు. నిశ్శబ్దాన్ని చేదిస్తూ నేనే అడిగాను.. "మీ పేరు?" .. "రవి సర్" తలదించుకునే సమాధానం చెప్పాడు. "ఇటు చూడండి.." అతను తలెత్తాడు. లోకాభిరామాయణం మాట్లాడుతూనే అతన్ని గురించి వివరాలు రాబట్టాను.

డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ఇతర క్వాలిఫికేషన్లు బాగున్నాయి. ప్రయత్న లోపం లేకపోయినా ఉద్యోగం దొరకలేదు. సున్నితమైన మనస్తత్వం. తండ్రి మాటలు భరించలేక పోయాడు. అతను కుర్చీలో అసహనంగా కదలడంతో సబ్జక్ట్ లోకి వచ్చాను. "రవీ చనిపోవాలని ఎందుకు అనుకున్నావ్?" అనునయంగా అడిగాను. "నాలాంటి వాడు ఎందుకు బతకాలి సార్..ఎవరికోసం బతకాలి?" అతని స్వరంలో ఆవేదన. "ఎందుకూ పనికి రాని వాణ్ణి సార్ నేను.. అసలు మీరు నన్నెందుకు బతికించారు?" ఉన్నట్టుండి హిస్టీరిగ్గా ఏడవడం మొదలు పెట్టాడు.

అతి కష్టం మీద అతన్ని ఊరుకోబెట్టాను. "ఎందుకు రవీ అంత ఆవేశం? నీ వయసెంతనీ.. నిండా పాతికేళ్ళు లేవు.. అప్పుడే ఎందుకింత నిరాశ? ఈ రోజు బాగుండక పోవచ్చు. కానీ రేపటి రోజు నీదే కావచ్చు.. రేపు నువ్వో గొప్ప స్థితికి వెళ్తే ఫలానా వాడు నా కొడుకని మీ నాన్నే పదిమందికీ గర్వంగా చెప్పుకుంటారు.." ..నా మాటలింకా పూర్తి కాలేదు. "ఎందుకు సార్ లేనిపోని ఆశలు కల్పిస్తారు?" అంటూ అడ్డుకున్నాడు. "విజయాలు సాధించేవాళ్ళు వేరే పుడతారు సార్.. నా లాంటివాళ్ళు ఎప్పటికీ ఇంతే.. ఎన్నేళ్ళు గడిచినా ఏమీ సాధించలేరు... కష్టాలూ కన్నీళ్ళూ తప్ప.." చాలా ఆవేశంగా అన్నాడు.

"రవీ ఎందుకంత నిరాశా వాదం? గొప్ప వాళ్ళంతా ఒకప్పుడు కష్టాలూ కన్నీళ్ళూ అనుభవించిన వాళ్ళే తెలుసా?" చాలా శాంతంగా అన్నాను. "మీకేం సార్..గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు. మా సమస్యలు మీకేం తెలుస్తాయి? అందుకే..ఎన్ని మాటలైనా చెబుతారు" ఒకింత నిరసనగా అన్నాడు. "రవీ.. నువ్వు వింటానంటే నా గతం నీకు చెబుతాను. చాలామందికి సాఫీగా సాగిపోయే డాక్టర్ ప్రశాంత్ జీవితం గురించే తెలుసు తప్ప అంతకు ముందు అతడనుభవించిన అశాంతి తెలీదు. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పాలనిపించింది.. చెప్పమంటావా?"

అతడు అంగీకార సూచకంగా తలూపాడు. ఒక్క క్షణం ఆగి చెప్పడం పారంభించాను.. "అవి నేను ఇంటర్మేడియట్ చదివే రోజులు. డాక్టర్ ని కావాలని నాకు బలమైన కోరిక. బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాణ్ణి. లెక్చరర్లందరికీ నా మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కాలేజీకి మంచి పేరు తెస్తానని ప్రిన్సిపాల్ కూడా అంటుండేవారు. నాన్నగారైతే మా వాడు కాబోయే డాక్టర్ అని అందరికీ చెప్పేవారు. ఈ పరిస్థితుల్లో మెడికల్ ఎంట్రన్స్ రాశాను. ర్యాంకు వస్తుందని అందరికీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఈ నేపధ్యంలో రిజల్ట్స్ వచ్చాయి.

ర్యాంకు కాదు కదా.. కనీసం ఎంట్రన్స్ పాసవ్వలేదు. భయంకరమైన అవమానం.. అమ్మానాన్నలకి ఎలా ముఖం చూపించను? విపరీతమైన బాధ, జీవితం మీద విరక్తి నన్నేమీ ఆలోచించనివ్వలేదు. ఆసాయంత్రం సముద్ర గర్భంలో నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. ఎవరూ లేని చోటు చూసి సముద్రంలోకి దిగడం ప్రారంభించాను. ఓ బలమైన కెరటం నన్ను సముద్రం లోపలి లాక్కుంది. నాకు స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేసరికి ఓ గదిలో ఉన్నాను. చుట్టూ చీకటి. చిన్న దీపం వెలుగుతోంది.

దీపం వెలుగులో పుస్తకం చదువుకుంటున్న వ్యక్తి నేను కదలడం గమనించాడు. వెంటనే నా దగ్గరకు వచ్చి పాలు వేడిచేసిచ్చాడు. నేను మౌనంగా తాగాను. తరువాత నానుంచి జరిగిందంతా విన్నాడు. పూర్తిగా విన్నాక అతడు చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. ఒక్క అక్షరం కూడా మర్చిపోలేదు. ఏమన్నాడో తెలుసా? 'ప్రచండంగా వెలిగే సూర్యుణ్ణి మబ్బులు కమ్మేస్తాయి. అంత మాత్రాన సూర్యుడికి ప్రతాపం లేనట్టేనా? సాయంత్రం అయ్యేసరికి అదే సూర్యుడు సముద్రంలోకి కుంగిపోతాడు. అంతమాత్రాన సూర్యోదయం అవ్వదా?

చూడూ..అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సహజమో, జీవితంలో ఓ విషాదం తరువాత మరో సంతోషం..ఓటమి తరువాత విజయం అంటే సహజం. సూర్యాస్తమయాన్ని చూసి కుంగిపోవడం కాదు, సూర్యోదయం కోసం ఎదురు చూడాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. . ఈ ప్రపంచంలో ఓడిపోయిన వాళ్ళని విమర్శించేవాళ్ళకి కొదవ లేదు. కానీ విజయం సాధించినప్పుడు వాళ్ళే ఆకాశానికెత్తుతారనీ గుర్తుంచుకో. రేపటి సూర్యోదయం నీదేనన్న నమ్మకంతో జీవితం గడుపు. విజయాన్ని సాధించు'

అతని మాటల ప్రభావంతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రే కాదు, నేను కోరుకున్న విజయాన్ని సాధించేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మరెన్నో అవమానాలూ భరించాను. అప్పుడు నా బాధల్లో ఎవరూ పాలు పంచుకోలేదు. కానీ, నేను కోరుకున్న లక్ష్యాన్ని సాధించిన నాడు లోకమంతా నాకు బ్రహ్మరధం పట్టింది.." ఊపిరి తీసుకోడానికి ఒక్క క్షణం ఆగాను. "ఓ దురదృష్టకరమైన విషయం చెప్పనా రవీ.. నా విజయాన్ని, దాని తాలూకు ఆనందాన్ని నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తితో పంచుకోలేక పోయాను. ఆ రాత్రి తర్వాత అతను నాకు మళ్ళీ కనిపించలేదు. తన పేరు రఘు అని మాత్రం తెలుసు..అంతే.." ఓ నిమిషం మౌనం.

రవి తలెత్తాడు అతని పెదాలు వణుకుతున్నాయి. "క్షమించండి సార్..ఆవేశంలో ఏదో మాట్లాడాను. బాధలు నాకొక్కడికే అనుకున్నాను. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని ఊహించలేకపోయాను. సార్.. మీరు నా శరీరానికి చేసిన చికిత్స కన్నా, మనసుకు చేసిన చికిత్స గొప్పది. నా మనసుకు మీరు పునర్జన్మ ఇచ్చారు సార్. ..సార్..నాకు నమ్మకం ఉంది.. రేపటి సూర్యోదయం నాదే" నాకు నమస్కరించి రవి వెనుదిరిగాడు. నేను తృప్తిగా నిట్టూర్చాను. రఘు నాకందించిన స్ఫూర్తిని నేను మరొకరికి అందించగలిగినందుకే ఈ తృప్తి.

(ఓ దశాబ్దం క్రితం ఆకాశవాణి 'జీవితం పట్ల ఆశావహ దృక్పధం' అన్న అంశం మీద కథానికలను ఆహ్వానించినప్పుడు, రాసి పంపానిది. సెలెక్టయ్యింది, నేనే చదివాను. పుస్తకాలు సర్దుతుంటే స్క్రిప్ట్ కనిపించింది. 'ఇ'లా కంప్యూటరీకరించాను. అప్పుడు రాయడానికి, ఇప్పుడు బ్లాగులో ఉంచడానికి ప్రోత్సహించిన మిత్రులకి కృతఙ్ఞతలు.)

మంగళవారం, జులై 28, 2009

ఇట్లు ఒక రైతు

వ్యవసాయం అంటే ఏమిటి? నేలను చదును చేసి విత్తనాలు చల్లడం.. పండిన పంటని కోసి మార్కెట్లో అమ్ముకోవడం. పల్లెలతో పరిచయం లేని చాలా మందికి వ్యవసాయం గురించి తెలిసింది ఇదే. విత్తనం నాటడానికి, పంట కోయడానికి మధ్య రైతుకి ఎదురయ్యే కష్టనష్టాలు, పడే శ్రమ, గురయ్యే ఒత్తిడి వీటిని గురించి ఆలోచించే వారు తక్కువ. ఈ నేపధ్యంలో వ్యవసాయ రంగాన్ని, ఈ రంగంలో ఉండే సమస్యలని, లోటుపాట్లని వివరిస్తూ వచ్చిన పుస్తకం 'ఇట్లు ఒక రైతు.'

చిత్తూరు జిల్లాకి చెందిన ఆదర్శ రైతు, సామాజిక ఉద్యమ కార్యకర్త గొర్రెపాటి నరేంద్రనాథ్ రాసిన ఈ చిరు పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. పెద్ద నగరంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, వ్యవసాయం మీద మక్కువతో స్వగ్రామానికి పయనమైన నరేంద్రనాథ్, ఉమాశంకరి దంపతులు నేలతో చేసిన ప్రయోగాలను వివరించారు ఈ పుస్తకంలో. అలాగే ప్రపంచీకరణ ఫలితంగా వ్యవసాయ రంగంలో పెరిగిన పోటీ, దానిని ఎదుర్కోడంలో రైతులకి ఎదురవుతున్న సమస్యలనీ కళ్ళకి కట్టారు.

పుస్తకం ప్రారంభంలో కొన్ని పేజీలు సిద్ధాంత వ్యాసాన్ని తలపించినా, నరేంద్రనాథ్ తన స్వానుభవాలను వివరించడం మొదలు పెట్టగానే పాఠకులు పుస్తకంలో లీనమై పోతారు. వ్యవసాయానికి కొత్తైన నరేంద్రనాథ్, పొరపాట్లు చేస్తూ, వాటినుంచి నేర్చుకుంటూ సేంద్రీయ వ్యవసాయం చేసిన తీరు ఆపకుండా చదివిస్తుంది. అలాగే, 'ఆర్గానిక్ ప్రొడక్ట్స్' ని సూపర్ మార్కెట్లలో రెట్టింపు ధరలకి అమ్ముతున్నా, వాటినుంచి రైతులకి వచ్చే ప్రతిఫలం, మామూలు పంటలపై వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఉండదన్న సత్యం బోధపడుతుంది.

సేంద్రీయ పద్ధతిలో చెరకు, మామిడి సాగు, 'శ్రీ వరి' పద్ధతిలో వరిసాగు చేసే విధానాన్ని కూలంకుషంగా వివరించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమ గురించి, పంటలు పోయినా పాడి పరిశ్రమ రైతులని ఎలా ఆదుకుంటుందో చెప్పారు నరేంద్రనాథ్. ఈ రంగంలోనూ సమస్యలకి కొదవ లేదు. ప్రభుత్వ ప్రోత్సాహమూ అంతంత మాత్రమే. డైరీల నిర్వహణ, విజయాలూ వైఫల్యాలనూ తెలుసుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా.

వ్యవసాయాన్నీ, గ్రామీణ జీవితాన్నీ వేరు చేసి చూడలేము. గ్రామీణ సమాజంలో బలంగా పాతుకు పోయిన వర్ణ, వర్గ వ్యవస్థలనూ, కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులనూ నిశితంగా పరామర్శించారు రచయిత. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల గ్రామీణ భారతం ఎదుర్కొనే సమస్యలనూ, వాటి తాలూకు పరిణామాలనూ తెలుసుకోవచ్చు.

రచయిత స్వయంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్న వారు కావడం వల్ల, వివిధ సమస్యలపై నాయకులు, అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆయనకి తెలుసు. కుల వివక్షకి వ్యతిరేకంగా జరిపిన ప్రచారంలో తాను గమనించిన అంశాలనూ, భూ పంపిణీ విషయంలో నాయకుల, అధికారుల వైఖరినీ స్థూలంగా వివరించారు. వ్యవసాయ రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పులనీ రేఖామాత్రంగా స్పృశించారు.

ఏ రాజకీయ భావజాలానికీ అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో లేకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకతగా చెప్పాలి. నరేంద్రనాథ్ కేవలం రైతు పక్షపాతి అనిపించక మానదు, పుస్తకం పూర్తి చేశాక. ముందుమాట రాసిన ప్రొఫెసర్ కే.ఆర్. చౌదరి చెప్పినట్టుగా ఈ పుస్తకానికి ఒక్కటే లోపం. వివిధ చాప్టర్ల మధ్య లంకె లేకపోవడం. పుస్తకంలో ప్రస్తావించిన విభిన్న అంశాలను అనుసంధానించే విధంగా కథనం ఉంది ఉంటే మరింత బాగుండేది.

నరేంద్రనాథ్ జీవించి ఉంటే వ్యవసాయంపై మరిన్ని ప్రయోగాలు చేసి ఉండేవారు కదా..అనిపించింది, పుస్తకం పూర్తి చేశాక. గ్రామీణ జీవితం తో పరిచయం ఉన్న వారు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది. ('ఇట్లు ఒక రైతు, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

సోమవారం, జులై 27, 2009

పెళ్లిచూపులు

నేను మొదటిసారి పెళ్లిచూపులు చూసినప్పుడు నాకు ఆరేళ్ళో, ఏడేళ్ళో.. అబ్బే.. పెళ్లిచూపులు నాకు కాదు. మా పక్కింటి అమ్మాయికి. తనని నేను 'అక్క' అని పిలిచేవాణ్ణి. వాళ్ళ నాన్నగారు, తాతయ్య స్నేహితులు. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని ఆయన తాతయ్యని ఆహ్వానించారు, కుర్రాడిని చూడడానికి. పెద్దమనిషి హోదాలో తాతయ్య, చిన్నమనిషి హోదాలో నేనూ వెళ్ళాం పెళ్ళిచూపులకి.

పెళ్ళికొడుకు, వాళ్ళమ్మగారు గుర్రబ్బండి మీద వచ్చారు. అతను తెల్ల ఫేంటు, చొక్కా తొడుక్కుని కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. అక్కేమో పట్టు పరికిణీ, వోణీ, తలలో బోల్డన్ని పూలు. రోజూ నాతో బోల్డన్ని కబుర్లు చెప్పేదా? ఆవేళ నాతో అస్సలు మాట్లాడనే లేదు. నాకైతే చాలా కోపం వచ్చింది తన మీద. ఈ పెళ్ళికొడుకు నన్ను చూసి నవ్వేడు కానీ, నేను నవ్వలేదు. తన వల్లే అక్క నాతో మాట్లాడ లేదు కదా..

ఇటు చూస్తే తాతయ్య కూడా నన్నసలు పట్టించుకోకుండా ఆ పెళ్లికొడుకుతో ఒకటే కబుర్లు. అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు.. ఏమిటో ఒకటే హడావిడి. నేనేదో మాట్లాడబోతే తాతయ్య నన్ను ఇంటికి వెళ్ళేదాకా నోరెత్తొద్దని హెచ్చరించేశాడు. నాకు మాత్రం మహా విసుగ్గా ఉంది. ఇంతలో ఇంట్లోనుంచి కారప్పూసలు వచ్చాయి. అక్క వాళ్ళ నాన్నే నాతోసహా అందరికీ ఇచ్చారు. మామూలు రోజుల్లో నాకు ఆయన్ని చూస్తే భయం..కానీ ఆవేళ ఆయనే అందర్నీ చూసి భయ పడుతున్నట్టు ఉన్నారు.

వచ్చిన వాళ్ళిద్దరూ పళ్ళాలు పక్కన పెట్టేశారు కానీ, తాతయ్య తినడం చూసి, నేను కూడా కారప్పూస నమలడం మొదలు పెట్టాను. కాసేపటికి పెద్దవాళ్ళందరికీ కాఫీలు, నాకు పాలు వచ్చాయి. అప్పుడు పెళ్ళికొడుకు తనకి కాఫీ అలవాటు లేదన్నాడు. తనకి కూడా ఇంకో గ్లాసుతో పాలు తెచ్చారు. నాకు భలే చిత్రంగా అనిపించింది.. నాకు ఇంట్లో కాఫీ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని నేను త్వరగా పెద్దై పోవాలనుకునే వాడిని, అప్పుడైతే కాఫీ తాగొచ్చు కదా.

ఇంత పెద్దవాడు కూడా హాయిగా కాఫీ తాగకుండా పాలెందుకు తాగుతున్నాడా? అని ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యంతో నేను అతన్ని నోరు తెరుచుకుని చూస్తుంటే, తాతయ్య నా వీపు మీద తట్టి, పాలగ్లాసు చూపించాడు. మొత్తానికి ఆ పెళ్ళికొడుకు మీద నాకు ఆసక్తి పెరిగింది. కాఫీలవ్వగానే అక్కని తీసుకొచ్చారు. తనకన్ని బంగారు గొలుసులూ అవీ ఉన్నాయని అప్పటి వరకూ తెలియదు నాకు. పెద్ద వాళ్ళందరికీ (తాతయ్య కి కూడా) కాళ్ళకి దణ్ణం పెట్టి చాప మీద కూర్చుంది. పెళ్లికొడుకు తల్లేమో అక్క పేరు, ఏం చదువుకుందో అడిగారు.

ఓ ఐదు నిమిషాలకి అక్కని లోపలి తీసుకెళ్ళిపోయారు. పెళ్ళికొడుకు, వాళ్ళమ్మగారు వెళ్లడానికి బయలుదేరుతున్నారు. నాకసలే మనసులో ఏమీ దాచుకోడం తెలియదు. అతను కాఫీ తాక్కుండా పాలెందుకు తాగుతున్నాడో అడగాలి? కానీ ఎలా? తాతయ్య వద్దన్నాక మరి మాట్లాడడానికి లేదు. అతను రోడ్డు మీదకి వచ్చేశాడు కానీ ఆవిడింకా ఇంట్లోనే ఉన్నారు. 'మీ పేరేంటి?' అని అడిగాను దగ్గరకెళ్ళి. తన పేరు చెప్పి, 'ఎందుకు' అని అడిగాడు. సరిగ్గా అప్పుడే నాన్న రోడ్డు మీంచి వెళ్తున్నాడు. ఆ కంగారులో నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. 'అక్క అడగమందా?' అని ఇంట్లోకి చూపించి అడిగాడు. నేను గబగబా నిలువుగానూ,అడ్డంగానూ తలూపేసి మా ఇంటికి పరిగెత్తాను, తాతయ్యని అక్కడే వదిలేసి.

కొన్నాళ్ల తర్వాత అక్కకి అతనితో పెళ్ళైపోయింది. అప్పుడు తెలిసింది, అతనికి కాఫీ వాసన ఇష్టం ఉండదని. కానీ పేరు గొడవ అలాగే ఉండిపోయింది. 'నువ్వు అడిగించావు' అంటాడు అతను, 'నేను అడిగించలేదు' అంటుంది అక్క.. ఈ విషయాన్ని నేను మర్చిపోకుండా పదే పదే జ్ఞాపకం చేశారు వాళ్ళిద్దరూ.. ఇప్పటికీ ఎప్పుడైనా కలిసినప్పుడు అక్క తన మనవల కబుర్లు చెబుతూనే, మధ్యలో 'ఆవేళ నిన్ను పేరు అడగమన్నానా?' అని నన్ను ఇరుకున పెడుతూ ఉంటుంది.

శనివారం, జులై 25, 2009

నాయికలు-అమృతం

ఏం చెప్పాలి అమృతం గురించి? ఆమెని తలచుకోగానే అన్నీ ప్రశ్నలే.. ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి.. కానీ అవి సంతృప్తిగా అనిపించవు. అమృతం యెంతోదగ్గరగా అర్ధమైనట్టే అనిపిస్తుంది. అంతలోనే ఏమీ అర్ధంకాని పజిల్లాగా అనిపిస్తుంది. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలోని ప్రధాన స్త్రీ పాత్రల్లో ఓ పాత్ర అమృతం. కథానాయకుడు దయానిధి మరదలు, వివాహిత.

దయానిధి జీవితంలో ఎందరో స్త్రీలు.. కోమలి, నాగుమణి, సుశీల, ఇందిర, కాత్యాయని ఇంకా అమృతం. వీళ్ళలో కోమలి దయానిధి ప్రేమించిన అమ్మాయి. ఇందిర అతను తాళి కట్టి, కాపురం చేయని భార్య. నాగుమణి, కాత్యాయని లు లోకం దృష్టిలో అతనితో సంబంధం ఉన్న అమ్మాయిలు. ఇంక సుశీల, అమృతం అతని మరదళ్ళు.. ఒకరు తండ్రి తరపు, మరొకరు తల్లి వైపునుంచి.

దయానిధి తల్లిది 'మచ్చ' ఉన్న జీవితం.. ఆమె మరణం ఒక మిష్టరీ. ఆమె మరణించాక దయానిధిని పరామర్శించడానికి వస్తారు అమృతం, ఆమె తమ్ముడు జగన్నాధం. (ఈ నవల్లో అమృతం తర్వాత నాకు అంతగా నచ్చిన పాత్ర జగన్నాధం) దయానిధికి కోమలి పట్ల ఉన్న 'వ్యామోహాన్ని' అర్ధం చేసుకుంటుంది అమృతం, అతను చెప్పినట్టుగా అది 'ప్రేమ' అని అంగీకరించకపోయినా.. అతను కోమలికి దగ్గర కావడానికి తనవంతు సాయం చేస్తుంది అమృతం.

పెద్దగా చదువుకోని ఓ పల్లెటూరి అమ్మాయి అమృతం. భర్త కాంతారావు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. పిల్లలు లేరు. భర్త మరో స్త్రీతో సన్నిహితంగా ఉన్నాడని రూఢిగా తెలుసును అమృతానికి. ఆ విషయాలన్నీ 'బావ' దయానిధి తో పంచుకునే చనువు ఉంది.. 'కాపురం అన్నాక ఇలాంటివి మామూలే బావా' పైకి తేలిగ్గా తీసేయగల లౌక్యమూ ఉంది. బంధువుల్లో ఆమెకి 'మంచి వ్యవహర్త' అన్న పేరుంది.

కడుపులో అగ్నిపర్వతాలు దాచుకుని పైకి నవ్వగలగడం తెలుసు అమృతానికి.. ఎటొచ్చీ ఆ నవ్వు 'ఉద్యానవనం తగులడుతోంటే రాణీలు చూసి బాధతో నవ్వినట్టు' ఉంటుంది. దయానిధి పెళ్ళికి ముందు అతన్ని కోమలికి దగ్గర చేయడానికి ప్రయత్నించిన అమృతమే, వివాహం తర్వాత అతనికి మామగారితో వచ్చిన మాటపట్టింపుని సరిదిద్ది ఇందిరతో అతని కాపురం నిలబెట్టడానికీ విఫల యత్నం చేస్తుంది.

ఓ చీకటిరాత్రి దయానిధితో ఏకమవుతుంది అమృతం.. ఫలితంగా ఓ ఆడపిల్లకి జన్మనిస్తుంది. పసిపిల్లలో తన పోలికలు వెతుక్కోడానికి భయం భయంగా వెళ్ళిన దయానిధిని ఆశ్చర్య పరుస్తుంది అమృతం. వుయ్యాల్లో పిల్లని అతనికి చూపిస్తూ "అత్తయ్యా, అచ్చంగా బావ పోలిక కాదు?" అని తన అత్తగారితో అనగలదు అమృతం. అది గడుసుతనమా? అసహాయత నుంచి పుట్టిన తిరుగుబాటా?

"బావ పోలికంటే కాదంటున్నాడండోయ్.." అని తన భర్తతో అన్నప్పుడు మాత్రం, అతని చేతకాని తనాన్ని ఎత్తిపొడుస్తోందా? అనిపించక మానదు. అమృతానికి తన బలమూ, బలహీనతా తెలుసు. తనకేంకావాలో తెలుసు.. దానిని ఎలా సాధించుకోవాలో తెలుసు. తనకి నచ్చినట్టుగా ఉంటూనే సంఘం చేత వేలెత్తి చూప బడకుండా ఉండడమూ తెలుసు. నాకు మాత్రం ఈ నవల చదివిన ప్రతిసారీ అమృతాన్ని గురించి (ఆమాటకొస్తే మిగిలిన అన్ని పాత్రల గురించీ కూడా) తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలి ఉందనిపిస్తుంది. ('చివరకు మిగిలేది,' విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100)

శుక్రవారం, జులై 24, 2009

బిస్సీని బతికించు

అమ్మమ్మకి పిల్లిని పెంచే అలవాటు మొదటి నుంచీ ఉంది. ఆవిడ కాపురానికి వచ్చింది మొదలు, చివరి రోజుల వరకూ ఏదో ఒక పిల్లిని పెరుగు అన్నం పెట్టి సాకుతూనే ఉంది. ఆవిడ ఎప్పుడూ తను పెంచే పిల్లికి పేరు పెట్టాలనే విషయం పట్టించుకోలేదు. ఐతే, అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వీళ్ళంతా కలిసి పెంపుడు పిల్లికి 'బిస్సీ' అనే పేరు ఖాయం చేశారు. అది మొదలు పిల్లులు మారాయి కానీ, పేరు మారలేదు.

అమ్మమ్మ వారసత్వంగా అమ్మ పిల్లిని పెంచడాన్నీ, దాన్ని బిస్సీ అనే పేరుతొ పిల్చుకోడాన్నీ కొనసాగిస్తోంది. మా చిన్నప్పడు మేము వీధిలో కుక్కని పెంచితే అమ్మ పెరట్లో పిల్లిని పెంచేది. అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ బిస్సీకి ఓ ప్రమాదం జరిగింది..నిజానికి దానిని హత్యాయత్నం అనాలేమో. ఆ ప్రమాదం పూర్వాపరాలు అమ్మ తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

అమ్మ వాళ్ళ ఏడుగురు అక్కచెల్లెళ్ళలో అందరికీ చిన్నదో, పెద్దదో పని ఉండేలా ఒక టైం టేబిల్ ఉండేది. ఈ టైం టేబిల్ ప్రకారం కొందరు వంటకి సాయం చేయడం, మరికొందరు ఇల్లు సర్దడం.. ఇలా పని విభజన ఉండేది. భోజనాలకి కంచాలు పెట్టిది ఒకరైతే, తీసేది ఒకరు. అమ్మమ్మ పిల్లలందరితో పాటు బిస్సీ కి కూడా భోజనం పెట్టేది, ఓ స్పెషల్ కంచంలో. బిస్సీ తన వాటా అన్నం తినేశాక, వీళ్ళని ఒక్కొక్కరినీ మ్యావ్ అని పలకరించి కనీసం పెరుగన్నం ముద్ద ఒకటైనా తన పళ్ళెంలో వేసే వరకూ విసిగించేది.

అమ్మ వాళ్ళ రెండో అక్కకి పిల్లి అంటే చిరాకు. అమ్మమ్మ మాటకి ఎదురు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో బిస్సీ ని భరించేది. ఒకరోజు భోజనాల దగ్గర పెరుగన్నం ముద్ద కోసం ఆవిడని విసిగించడం మొదలు పెట్టింది బిస్సీ. ఆవిడ సహనం కోల్పోయి చేతిలో ఉన్న ఇనుప అట్లకాడ గురిచూసి బిస్సీ మీదకి విసిరింది. అది కాస్తా వెళ్లి బిస్సీ మెడ కింద దిగడం, బిస్సీ రక్తపు మడుగులో కొట్టుకోడం, వీళ్ళ భోజనాలు మధ్యలో ఆగిపోడం క్షణాల్లో జరిగిపోయాయి.

"పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదు" అన్న మాట వింటూ పెరిగిందేమో, ఆవిడ షాక్ తింది. తాతగారు ఆయుర్వేద వైద్యం చేసే వారు కానీ సమయానికి ఆయన ఊళ్ళో లేరు. అమ్మ వాళ్ళ మూడో అక్క బాగా ధైర్యస్తురాలు.. తను తాతగారికి వైద్యంలో అసిస్టెంట్ కూడా.. మిగిలిన పిల్లలందరికీ ధైర్యం చెప్పి, ఆవిడ బిస్సీకి వైద్యం మొదలు పెట్టింది. అట్లకాడ బలంగా లాగి, పసర్లు పోసి కట్టు కట్టింది. అమ్మమ్మ పాలు పట్టుకొచ్చి బిస్సీచేత తాగించే ప్రయత్నం చేసింది.

ఐతే ఈ వైద్యురాలు ఏపని చేసినా "నాకేంటి?..అహా..నాకేమిటీ?" అనే రకం. బిస్సీకి ప్రధమ చికిత్స అవగానే బేరం మొదలు పెట్టేసింది. అసలే షాక్ లో ఉందేమో, రెండో అక్క కండిషన్లన్నీ ఒప్పేసుకుంది. ఆ ప్రకారం, బిస్సీకి నయమయ్యేంత వరకు మూడో అక్క వైద్యం చేసేటట్టు, ఇందుకు ప్రతిగా ఆవిడ వాటా పనంతా ఈవిడే చేసేట్టూ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమ్మమ్మకి తెలియకూడదన్న మాట.

పనన్న మాటేమిటి, తన వంటిమీద బంగారం ఇమ్మన్నా ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉంది రెండో ఆవిడ. "నావల్ల బిస్సీ చనిపోయింది..గుడి కట్టించండి నాన్నగారూ.." అని అడగలేదు కదా. పగలు ఇద్దరు మనుషుల పని, రాత్రి నిద్రపోకుండా బిస్సీ కి కాపలా.. ఇలా పది రోజులు కష్టపడిందిట ఆవిడ. ఆవిడ కష్టం ఫలించి బిస్సీకి నయమయ్యింది. అది మొదలు ఆవిడ ఎవరిమీదా చేయి చేసుకోలేదు.

గురువారం, జులై 23, 2009

పరుగు ఆపడం ఓ కళ

నాకు సినిమా వాళ్ళ జీవిత చరిత్రలన్నా, వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. ఐతే ఈ మధ్య ఓ వ్యక్తిత్వ వికాసం టైపు టైటిల్తో వచ్చిన ఓ సినిమా నటుడి జీవిత చరిత్ర చదవాల్సి వచ్చింది. ఆ పుస్తకం 'పరుగు ఆపడం ఓ కళ' అను శోభన్ బాబు జీవిత చరిత్ర. పుస్తకం మొదటి సగం ఒకింత ఆసక్తికరంగానే ఉంది.

శోభన్ బాబు ఓ విలక్షణమైన వ్యక్తి, సహ నటులకన్నా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అందుకే తండ్రి, తాత పాత్రలు వేసే అవకాశం ఉన్నా వద్దనుకుని రిటైరయ్యాడు. ప్రశాంత జీవితం కోరుకున్నాడు. ప్రచారానికి దూరంగా, ప్రశాంతంగా గడిపాడు తన చివరి రోజులని. కెమెరాకి, పబ్లిసిటీకి దూరంగా ఉన్నా, ప్రజలు శోభన్ బాబు ని మర్చిపోలేదని నిరూపించిన సంఘటన అతని అంతిమ యాత్ర.

'సోగ్గాడు' గా పేరొందిన శోభన్ బాబు మరణించిన యేడాది తరువాత ఓ పుస్తకం వచ్చింది. ఇందులో ఉన్న కంటెంట్ శోభన్ బాబు పుస్తకం కోసమని స్వయంగా చెప్పింది కాదు. పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర రకరకాల సోర్సుల ద్వారా సేకరించినది. పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం శోభన్ బాబు స్వయంగా చెప్పినదే అనీ, వివిధ పత్రికకి విభిన్న సందర్భాలలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలే పుస్తకానికి ఆధారమని చెప్పారు రచయిత తన ముందుమాటలో.

అంతే కాదు, ప్రతి అక్షరం శోభన్ బాబుదే కాబట్టి ప్రధమ పురుష లో రాసే స్వేచ్చను తీసుకున్నాననీ చెప్పారు. తన జీవితపు చివరి రోజు ఉదయం తన ఆఫీస్ రూం లో కూర్చుని శోభన్ తన గతాన్ని నెమరు వేసుకున్నట్టుగా రాశారు కథనాన్ని. కాలేజి రోజులు, సినిమాల్లో చేరాలని గాఢమైన కోరిక, మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భార్య శాంత కుమారి సహకారం..ఇవన్నీ విపులంగా రాశారు.

లా చదివే వంకతో మద్రాసు లో కాపురం పెట్టిన శోభనాచలపతి రావు (అసలు పేరు) వేషాల కోసం పడ్డ పాట్లు, శోభన్ బాబుగా తనని తాను నిరూపించుకునే క్రమంలో పడ్డ సంఘర్షణ ని వివరంగా రాశారు. ఇక అక్కడినుంచి కథనం దారి తప్పి ఎటో వెళ్ళిపోయింది. హిట్లూ, ఫ్లాపులూ, సహనటులతో సంబంధాలూ, రిటైర్మెంట్ గురించి ఆలోచనలు, భూముల కొనుగోలు..ఇలా సాగింది కథనం.

నిజానికి శోభన్ బాబు అభిమానులకి ఈ పుస్తకం నుంచి కొత్తగా తెలుసుకోడానికి ఏమీ లేదు, కొన్ని అరుదైన ఛాయా చిత్రాలు దాచుకోగలగడం మినహా. ఇది సినిమా నటుడి చరిత్ర కాబట్టి సహజంగానే పొగడ్తలు సింహభాగం ఆక్రమించాయి. వెండితెర మీద హీరో గా వెలుగొందాలి అని కలలు కన్న వ్యక్తి, అవకాశాలు వస్తున్నా రిటైర్మెంట్ కోరుకోడానికి దారితీసిన పరిస్థితులని వివరించిన తీరు సమగ్రంగా లేదు.

ఒక సహనటి తో శోభన్ కి ఉన్న అనుబంధం వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిన విషయమే.. ఆ అంశానికి అతి ప్రాధాన్యత ఇవ్వడం చికాకు కలిగించింది. కథనం దారి తప్పుతోందనీ, సంపూర్ణత లోపించిందనీ చాలా సార్లు అనిపించింది. పుస్తకం పూర్తి చేశాక తలెత్తిన ప్రశ్న అసలు శోభన్ జీవించి ఉంటే ఈ పుస్తకం విడుదల కావడాన్ని అంగీకరించి ఉండేవాడా? అని. (బండ్ల పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 363, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

బుధవారం, జులై 22, 2009

గ్రహణం విడిచిందా?

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన సూర్య గ్రహణం పూర్తయ్యింది. ప్రజలంతా ఆకాశంలోనో, టీవీలోనో ఈ గ్రహణాన్ని వీక్షించారు. మనకి గ్రహణాలు కొత్త కాదు కానీ గ్రహణాన్ని కూడా 'అమ్మకపు సరుకు' మార్చుకునే సంస్కృతి కొత్త. అత్యంత సహజమైన గ్రహణం చుట్టూ రకరకాల కథలు సృష్టించి, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి సొమ్ము చేసుకునే మార్కెటింగ్ మాయాజాలాన్ని చూడడం కొత్త.

ఈ సూర్య గ్రహణం తో యుగాంతం తధ్యమన్న పుకారు ఎక్కడ బయలుదేరిందో తెలియదు కానీ, గడిచిన వారం రోజులుగా దేశమంతా షికారు చేసింది. ముఖ్యంగా గత రెండు రోజులుగా ఏ నోట విన్నా ఇదే మాట. మత గ్రంధాలను ఉటంకించే వారు కొందరైతే, రకరకాల శాస్త్రాలను సాక్ష్యం గా చూపించే వారు మరికొందరు. ముప్పు సునామీ రూపంలో వస్తుందా లేక ప్రపంచం మొత్తం అంధకార మయం అయిపోతుందా అన్న చర్చలు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ప్రజలని చైతన్య వంతులని చేయాల్సిన మీడియా - ముఖ్యంగా డ్రాయింగ్ రూముల్లోకి చొచ్చుకుని వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా - ఈ పుకారుకి విస్తృత ప్రచారం కల్పించడం. గత రెండు రోజులుగా ఏ చానల్ తిప్పినా ఇదే వార్త. ఈ ప్రచారం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వార్త చూసి కుప్ప కూలిపోయేటంతగా.

ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పిన విషయానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఏదో ముప్పు రాబోతోందనే అంశానికి మాత్రం విశేష ప్రాధాన్యత ఇచ్చి ఊదరగొట్టడం లో చానళ్ళు పోటీ పడ్డాయి. ఈ విషయం లో ఏ చానలూ మరో చానల్ కన్నా తక్కువ తినలేదు. ఎవరు ఎక్కువ భయపెట్టగలరు అన్న అంశం మీద చానళ్ళు పందెం వేసుకున్నాయా? అనిపించేలా సాగింది ప్రచారం. 'గండం గడిచింది' అని ఓ వార్త ప్రసారం చేసి చేతులు దులుపుకోడం ఈ కథకి కొసమెరుపు.

నిజానికి 'యుగాంతం' పేరు చెప్పి మీడియా ప్రజల్ని భయపెట్టడం ఇదే మొదటి సారి కాదు. మూడు దశాబ్దాల క్రితం అప్పటికి పసి వయసులో ఉన్న ఓ తెలుగు పత్రిక స్కై లాబ్ కూలిపోతోందని చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ పత్రిక ప్రచారం పట్ల అప్పట్లో చాలా విమర్శలు వినిపించాయి, ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అప్పుడు తాత్కాలికంగా ప్రజల విశ్వసనీయత కోల్పోయిన ఆ పత్రిక ఆ తర్వాత కృత్యదవస్థ మీద దానిని తిరిగి సంపాదించుకోగలిగింది.

మరి ఇప్పటి పరిస్థితి? టీఆర్పీ రేటింగులు పెంచుకోడమే లక్ష్యంగా, ప్రకటనలు సాధించుకోడమే ధ్యేయంగా పని చేస్తున్న టీవీ చానళ్ళు ప్రజల విశ్వసనీయతను కోల్పోవడం ఇదే మొదటిసారి ఐతే కాదు. మరో సారి. ఐతే ఈ సారి పెద్ద మొత్తంలో. ఎందుకీ చానళ్లకి ప్రజలంటే ఇంత లోకువ? వార్తా వ్యాపారం కనీస విలువలని ఎందుకు పాటించలేక పోతోంది?

తాము ప్రసారం చేసే వార్త సమాజం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో, విశ్వసనీయత కోల్పోతే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో చానళ్ళ యాజమాన్యాలకి తెలియదా? ఈపూటకి ప్రకటనలు సంపాదించుకుంటే చాలు (వార్తలు సెకండరీ) అన్న ధోరణి, సంస్థల దీర్ఘకాలిక మనుగడకి ఎలా సాయపడుతుంది? ఈ మీడియా గ్రహణానికి విడుపు ఎప్పుడు?

మంగళవారం, జులై 21, 2009

అబద్ధం

'నిజం నిప్పులాంటిది' అన్న మాట విన్నప్పుడల్లా నాకు కలిగే సందేహం 'మరి అబద్ధం ఎలాంటిది?' అని. విచిత్రం ఏమిటంటే చిన్నప్పుడు బళ్ళో 'అసత్యము ఆడరాదు' అని చెప్పిన మేష్టర్లే సత్యం కోసం అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడి కథ చెప్పేవాళ్ళు. హైస్కూల్లో చదివే రోజుల్లో మేము సరదాగా అనుకునే వాళ్ళం.. నిజం చెబితే హరిశ్చంద్రుడు పడినన్ని కష్టాలు పడాలి.. అదే అబద్ధం చెబితే ఏ బాధా ఉండదు అని.

అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అని తెలియని పసితనంలో నిజం చెప్పి దెబ్బలు తిన్న సందర్భాలు కోకొల్లలు. నిజానికి ఆ పనిష్మెంట్లే అబద్ధం గురించి ఆలోచించేలా చేశాయేమో అనిపిస్తూ ఉంటుంది. మొదటి అబద్ధం ఎప్పుడు చెప్పానన్నది ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. అలాగే అబద్ధం చెప్పి దొరికిపోయిన తొలి సందర్భం కూడా. చాలా సందర్భాలు ఉన్నాయి మరి..

ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. వయసుతో పాటు అబద్ధాలు చెప్పడం పెరిగింది అని. కొన్నిసార్లు ఇది ఆత్మరక్షణ లో భాగం ఐతే, మరికొన్ని సందర్భాలలో నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా ఓ అబద్ధంతో కవర్ చేసేయడం బెటర్ కదా అన్న ఆలోచన. అబద్ధం అప్పటికప్పుడు మనల్ని రక్షించినా దీర్ఘ కాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకి మన మీద నమ్మకం పోగొడుతుందని కొన్నాళ్ళకి అనుభవ పూర్వకంగా అర్ధమైంది.

ఇక అది మొదలు, దగ్గరవాళ్ళు అని ఫీలైన వాళ్ళ దగ్గర సాధ్యమైనంత వరకూ అబద్ధం చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించాను. పరిస్థితులు మనకి పెట్టే పరిక్షలు అన్నీ ఇన్నీ కాదు కదా. అబద్ధం చెప్పడానికి, నిజం చెప్పకుండా ఉండడానికి ఏమైనా భేదం ఉందా? అన్నది నన్ను ఎప్పుడూ వేధించే ప్రశ్న. ఓ నిజాన్ని చెప్పడం కన్నా దాచడం వల్ల ఎదుటివాళ్ళని సంతోషం గా ఉంచగలం. కానీ అది అబద్ధం చెప్పడం అవుతుందా? కాదా?

చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (చిన్నవైనా, పెద్దవైనా) చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలని ఓ చిన్న సరదా పుట్టింది. అదెంత ప్రమాదకరమైన సరదానో లెక్కలు చూశాక అర్ధమైంది. ఆ సరదా ఫలితంగా అనవసరంగా చెప్పే అబద్ధాలను బాగా తగ్గించ గలిగాను. పర్లేదు..మనం మరీ ఎక్కువ అబద్ధాలు చెప్పడం లేదు అని ఓ చిన్న ఫీలింగ్ రాడానికి సాయపడింది ఆ సరదా. ఎప్పుడూ నిజాలే ఎందుకు మాట్లాడ లేక పోతున్నాం అన్న మరో 'ప్రమాదకరమైన' ఆలోచన అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది.

దివాకరం గురించి చెప్పకుండా అబద్ధాల గురించి చెప్పడం పూర్తవ్వదు. అవును.. 'ఏప్రిల్ 1 విడుదల' హీరో దివాకరమే. అతను సినిమా మొదటి సగం లో చెప్పినన్ని అబద్ధాలు కానీ, రెండో సగం లో చెప్పిన లాంటి నిజాలు కానీ నేనెప్పుడూ చెప్పలేదు. అయినా నిజం మాట్లాడిన దివాకరాన్ని రక్షించడానికి 'గోపీ' ఉన్నాడు. మనకలా ఎవరూ లేరు కదా.. అదీకాక దివాకరం నిజాలు మాట్లాడింది భువనేశ్వరి తో పందెం నెగ్గేందుకు. మనకి అలాంటి రిస్కులు ఏవీ లేవు కాబట్టి, అవసరార్ధం అప్పుడప్పుడూ అబద్ధాలు తప్పవు. ఆ ప్రకారం ముందుకు పోవడమే..

సోమవారం, జులై 20, 2009

కలవరమాయే మదిలో

"టూబీ ఆర్ నాట్ టూబీ.." షేక్స్పియర్ సృష్టించిన పాత్రకి కలిగిన సందిగ్ధమే కలిగింది నాకు. 'కలవరమాయే మదిలో..' సినిమా చూడ్డం కన్నా ఏదైనా గుళ్ళో హరికథా కాలక్షేపానికి వెళ్ళడం బెటరని ఒక స్నేహితుడి ఉవాచ. 'సినిమా మిస్సవ్వద్దు..యూ విల్ ఎంజాయ్ ఇట్..' అని సినిమా చూస్తూ ఇంటర్వల్లో మరో మిత్రుడి ఫోన్. అసలే 'గోపి గోపిక గోదావరి' షాక్ లో ఉన్నానేమో, కొంచం ఆలోచనలో పడ్డాను. సినిమా పేరు వినగానే 'పాతాళ భైరవి' ఆ వెంటే 'సాహసం సేయరా డింభకా..' గుర్తొచ్చాయి. సాహసం చేసేశాను.

శ్రేయ ('కలర్స్ స్వాతి) ఓ గాయని. శాస్త్రీయ సంగీతం రాదు, ఓ హోటల్లో పాటలు పాడుతూ ఉంటుంది. మరో పక్క చార్టెడ్ అకౌంటేన్సి చదువుతూ ఉంటుంది. తండ్రి లేని శ్రేయ కి తల్లే (ఢిల్లీ రాజేశ్వరి) అన్నీ.. ఆ తల్లికి సంగీతం అంటే కిట్టదు. ఎప్పటికైనా రెహ్మాన్ దగ్గర పాడాలన్నది శ్రేయ కల. (హమ్మయ్య.. హీరోయిన్ కీ ఓ లక్ష్యం ఉంది) లండన్ లో ఉండే శ్రీను (కమల్ కామరాజు, ఆవకాయ్-బిర్యాని ఫేం) ఓ ఆరు నెల్ల ప్రాజెక్టు కోసం హైదరాబాదు వచ్చి హోటల్లో శ్రేయ ని చూస్తాడు. తొలిచూపులోనే శ్రీను తో ప్రేమలో పడిపోతుంది శ్రేయ. పాపం, అతనికి ఇవేవీ తెలియవు, ఫారిన్ రిటర్న్డ్ కదా..

ఇలా చకచకా కథ సాగిపోతుండగా రావు గారు (విక్రం గోఖలే) అనే సంగీత విద్వాంసుడు ఓ రోజు హోటల్లో శ్రేయ సంగీతాన్ని అవమానిస్తాడు, దారుణంగా. శ్రీనూ కూడా శ్రేయ నేర్చుకోవాల్సింది చాలా ఉందనీ, రావుగారైతేనే సరైన గురువు అనీ చెబుతాడు. అసిస్టెంట్ శాస్త్రి (తనికెళ్ళ భరణి) మినహా తనకంటూ ఎవరూ లేని రావుగారు ముక్కోపి. కృత్యదవస్థ మీద ఆయన్నితనకి పాఠాలు చెప్పడానికి ఒప్పిస్తుంది శ్రేయ. శ్రేయ తల్లికి సంగీతం అంటే ఎందుకంత అలెర్జీ? రావుగారి గతం ఏమిటి? శ్రేయ తన లక్ష్యం సాధించిందా? శ్రీనూ కి తన ప్రేమని ప్రకటించిందా? ఇవన్నీ సినిమా రెండో సగం.

'హోప్' సినిమా తో దర్శకుడిగా పరిచయమైన సతీష్ కాసెట్టి కి దర్శకుడిగా ఇది రెండో సినిమా. తనే స్వయంగా సమకూర్చుకున్న కథమీద కె. విశ్వనాధ్, శేఖర్ కమ్ముల ప్రభావం బాగాకనిపించింది. సినిమా చూస్తున్నంత సేపూ 'శంకరాభరణం' 'సాగరసంగమం' 'స్వర్ణకమలం' 'ఆనంద్' 'గోదావరి' సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి. కథకి విశ్వనాధ్ సినిమాల నుంచీ, కేరెక్టరైజేషన్కి, కథనానికి శేఖర్ కమ్ముల సినిమాల నుంచీ స్ఫూర్తి పొందాడేమో అనిపించింది. హింస, ద్వందార్ధాలు లేకుండాక్లీన్ సినిమా తీసినందుకు మాత్రం దర్శకుడిని అభినందించాలి.

ఇది సంగీత ప్రధాన చిత్రం. శరత్ వాసుదేవన్ సంగీతం బాగుంది, ఎక్కడా సాహిత్యాన్ని (వనమాలి, సింగిల్ కార్డ్) మింగెయ్యకుండా. చాలా రోజుల తర్వాత చిత్ర గొంతు వినిపించింది. పాటల చిత్రీకరణ పట్ల మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. విక్రం గోఖలే కి ఎస్పీ బాలు డబ్బింగ్ చక్కగా కుదిరింది, ఒకరకంగా రావు గారు పాత్రకి తన డబ్బింగ్ తో ప్రాణం పోశారు బాలు. శాస్త్రిగా తనికెళ్ళ నటన పాత్రోచితంగా ఉంది, రెండో సగంలో అక్కడక్కడా కాస్త శృతి మించినప్పటికీ. 'కలర్స్' స్వాతి ది కీలక పాత్ర. మరీ పేపర్లలో రాసినట్టు సావిత్రి ని మరపించలేదు కానీ, మునుపటి చిత్రాలకన్నా బాగా చేసింది.

కమల్ కామరాజు కండల ప్రదర్శన ఓకే. నటన, వాచకం, ఆహార్యం విషయాల్లో చాలా శ్రద్ధ చూపాలి. కీలక సన్నివేశాల్లో అతని నటన, వాచకం తేలిపోయాయి. ఆ ముదురు రంగు లిప్ స్టిక్ వాడకపోతే ఇంకా బాగుంటాడేమో. మొదటి సగం చాలా చక్కగా తీసిన దర్శకుడు రెండో సగం మీద మరికొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చెప్పే పధ్ధతి. రెండో సగం లో సినిమా నిడివి ని కొంచం తగ్గించొచ్చు, ఎడిటింగ్ ద్వారా. అనవసర సన్నివేశాలు లేవు కానీ, కొన్ని సన్నివేశాల నిడివి బాగా పెరిగింది. నేనైతే నా మిత్రులకి చూడమని చెప్పాను, 'మెంటల్ కృష్ణ' నిర్మాతల నుంచి వచ్చిన సినిమా అని భయపడొద్దని కూడా...

ఆదివారం, జులై 19, 2009

ఎలా ఉంటుంది?

చాలా మంది చిన్నపిల్లలకి పక్క వాళ్ళ దగ్గర ఏముంటే అది తమ దగ్గర కూడా ఉండాలనీ, వాళ్లకి జరిగిన ముచ్చట్లు తమకీ జరగాలనీ అనిపిస్తుంది. ఇందుకు నేనూ మినహాయింపు కాదు, చిన్నప్పుడు. బొమ్మలో ఆటవస్తువులో ఎవరి దగ్గరైనా చూశానంటే వాటిని ఏదోలా కొనిపించుకునేందుకు ప్లాన్లు వేసే వాడిని. పెళ్లి ఊరేగింపులు చూసినప్పుడల్లా నాకూ పెళ్ళైతే బాగుండును అనిపించేది.. కాకపొతే బయటికి చెప్పే వాడిని కాదు. పేక బెత్తం తో నాకెప్పుడూ నిత్య కళ్యాణమే కదా!

మా ఇంట్లో మా బామ్మ (నాయనమ్మ) కీ తేలుకీ అవినాభావ సంబంధం. ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నట్టుండి ఆవిడ 'కెవ్వు' మని అరిచేది. అమ్మ ఇంట్లో ఏమూల ఉన్నా వెంటనే పరుగున వచ్చేది. బామ్మ తనకి తేలు కుట్టింది అని చెప్పడం ఆలస్యం, అమ్మ ఓ పాత చెప్పునో ఒంటరి పాంకోడునో వెతికి తెచ్చేది. మా ముత్తాత వాళ్ళ నాన్నగారి పాంకోళ్ళ జతలో తాతయ్యకి మిగిలిన ఆస్తి ఈ వంటరి పాంకోడు. పాత చెప్పు దొరకని సందర్భాలలో ఈ పాంకోడు దొరకబుచ్చుకునేది మా అమ్మ.

బామ్మని అలా దీర్ఘాలు తీయనిస్తూనే, చెప్పు చేత్తో పట్టుకుని 'కోడు..కోడు..కోడు..' అని కూతపెడుతూ తేలుని వెతికి చంపేసేది అమ్మ. 'కోడు..కోడు' అంటే పరిగెడుతున్న తేలు కూడా ఆగిపోతుందిట. చచ్చిన తేలుని అవతల పారెయ్యడానికి లేదు. దానిని ఓ పాత సిల్వర్ ప్లేట్ లోపెట్టి ముందు గదిలో పెట్టేది. అంతేనా, అక్కడ బామ్మకో మడత మంచం వాల్చేది. నేనీలోగా మా పెరట్లో కొబ్బరి తోట సరిహద్దులో ఉన్న శాయమ్మ గారింటికి పరిగెత్తే వాడిని.

శాయమ్మ గారు బామ్మకి ఇష్టసఖి. రెండు రోజులకోసారైనా వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఆవిడకి తేలు మంత్రం వచ్చు. మంత్రం వేయడానికి రమ్మని ఆవిడకి కబురు చెప్పి ఇంటికి వచ్చేసరికి, ఆసరికే బామ్మ ఏడుపు విన్న ఒకరిద్దరు పరామర్శకి వచ్చేసేవాళ్ళు. వాళ్లకి ఆ చచ్చిన తేలుని చూపించి ఎంత గట్టిగా కుట్టిందో వర్ణించి చెప్పి బాధ పడేది బామ్మ.

ఇంట్లో అమ్మది మరో రకం బాధ.. తేలు కుట్టింది కాబట్టి బామ్మ ఇంకా ఆ పూటకి ఇంట్లో పని చేయలేదు. పైగా పరామర్శ కి వచ్చిన వాళ్లకి కాఫీలో, టిఫిన్లో (వాళ్ళతో ఆవిడకి ఉన్న స్నేహాన్ని బట్టి) పట్టుకురమ్మని అంత బాధలోనూ పురమాయించేది బామ్మ. పరామర్శకి వచ్చిన వాళ్ళ చేత, రాని వాళ్లకి కబురు పంపేది. ఈ వచ్చిన వాళ్ళలో కొందరు "సందలడిపోయింది..వొంటకి ఆలీసం అయిపొయింది.. పిల్లలు ఏడుత్తా ఉంటారు..కూరో పచ్చడో ఎట్టండి.." అని అమ్మని అడిగి తీసుకెళ్ళే వాళ్ళు.

బామ్మని కనీసం నెలకోసారైనా తేలు కుడుతూనే ఉండేది. తేలు కుట్టిన ప్రతిసారీ మా ఇంట్లో ఇంచుఉమించు ఇదే దృశ్యం. ఆవిడని తేలు కుట్టడం ఎంత సహజం అంటే.. చాలా రోజులపాటు ఆవిడకి కనిపించని వాళ్ళు ఎవరైనా ఆవిడని కలిసినప్పుడు ఏమీ తడుముకోకుండా "మొన్న తవర్ని తేలు కుట్నాదని తెలిసిందండి.. వొద్దారనుకున్నాను కానీ కుదర్లేదండి.." అని చాలా నమ్మకంగా చెప్పేసేవాళ్ళు. "దీపం పట్టికెళ్ళకుండా చీకటి గదుల్లో తిరిగితే తేళ్ళు కుట్టవేమిటీ?" అని అమ్మ రహస్యంగా విసుక్కునేది.

ఎప్పటిలాగే ఓ సారి బామ్మని తేలు కుట్టింది.. అమ్మ తేలుని చంపేసింది. మంత్రం వేయడానికి వచ్చిన శాయమ్మ గారు "ఇది తేలు కాదండి, మండ్రగబ్బ..మంత్రం పని చెయ్యదు.." అని చెప్పేశారు, పళ్ళెంలో ఉన్న తేలు శవాన్ని చూసి. అక్కడికీ ఆవిడ జిల్లేడు పాలూ అవీ రాసి వైద్యం చేస్తూనే ఉంది.. బామ్మ ఎప్పటికీ ఏడుపు ఆపదే. మంత్రం లేదనేసరికి ఈవిడకి భయం పెరిగిపోయింది. ఈ హడావిడి చూసి ఆవిడని పాము కరిచిందని అపార్ధం చేసుకుని ఎప్పుడూ కన్నా ఎక్కువమందే వచ్చేశారు పరామర్శకి.

ఆవేళ ఎందుకో నాక్కూడా ఆవిడని పలకరించాలనిపించింది. కానీ ఏం మాట్లాడాలో సరిగ్గా తెలియదు. "బాగా నొప్పిగా ఉందా బామ్మా.. అదేంటో తేలు ఎప్పుడూ నిన్నే కుడుతుంది..నన్ను ఒక్కసారీ కుట్టదు..ఎలా ఉంటుంది తేలు కుడితే..?" అని అడిగాను, ముద్దుగా. ఆవిడ ఇంక బాధని మర్చిపోయి.. "వొద్దు నాయనా.. వొద్దు.. ఈ బాధ పగవాడికి కూడా వొద్దు" (అప్పటికే నేను పగవాడి జాబితాలో ఉన్నాను) అని నాకు చెప్పి, పరామర్శ కి వచ్చిన వాళ్ళందరికీ "మా మనవడికి తేలు చేత కుట్టించుకోడం మనుసూ.." అని మర్చిపోకుండా చెప్పింది.

శనివారం, జులై 18, 2009

వార్తల వెనుక కథ

"మీరీ పుస్తకం చదవాల్సిందే.." పుస్తకాల షాపులో నాకు కావలసినవి వెతుక్కుంటూ ఉండగా సేల్స్ అసిస్టెంట్ ఓ పుస్తకం పట్టుకుని వచ్చాడు. పరాగ్గా చూశానేమో సైజులో 'వేయి పడగలు' కి కసిన్ లా అనిపించింది. (నిజానికి మరీ అంత పెద్దదేమీ కాదు). కవర్ పేజి చూస్తే 'వార్తల వెనుక కథ' అని ఉంది. "ఇదేదో జర్నలిస్టుల వ్యవహారంలా ఉంది" అన్నాను, తప్పించుకు తిరిగి ధన్యుడిని అయ్యే ఉద్దేశంతో. కానీ అతను వదల్లేదు. "మీకు నచ్చుతుంది.. నచ్చక పొతే తిరిగి ఇచ్చేయండి, పేరు రాయొద్దు" అని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. లోగడ అతను సూచించిన చాలా పుస్తకాలు నచ్చాయి నాకు. అలా ఆ పుస్తకం కొన్నాను రెండేళ్ళ కిందట. చాలా సార్లు చదివాను. ఇప్పుడు కథల ప్రస్తావన వస్తే నాకు ఆ వార్తల వెనుక కథలు గుర్తొచ్చాయి. వాటి పరిచయం 'పుస్తకం' లో...

శుక్రవారం, జులై 17, 2009

కోతి కొమ్మచ్చి

చాలా రోజులుగా నాకొక కల.. అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పుస్తకం కొనడానికి నేను షాపుకి వెళ్తే ఆ షాపు వాళ్ళు కొనడానికి వచ్చిన వాళ్లకి 'ఆ పుస్తకం స్టాకు ఐపోయిందండీ' అని చెబుతుంటే వినాలని. 'భాష చచ్చిపోతోంది' 'సాహిత్యం మరణశయ్య పై ఉంది' లాంటి స్టేట్మెంట్లు చూసినప్పుడల్లా బెంగగా అనిపించేది, నా కల తీరదేమో అని. అదృష్టం..గత వారం నా కల నిజమయ్యింది. థాంక్స్ టు ముళ్ళపూడి వెంకటరమణ.. ఆ పుస్తకం 'కోతి కొమ్మచ్చి.'

పుస్తకం విడుదలని టీవీ చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయడం చూడగానే నాకు కాపీ దొరకదేమో అని డౌట్ వచ్చి ముందుగానే బుక్ చేసుకున్నా.. ఆ కాపీ తీసుకోడానికి వెళ్ళినప్పుడు వినబడింది ఈ మాట. ఇంటికొచ్చి పుస్తకం ఓపెన్ చేయడం మాత్రమే నేను చేసిన పని..చదివించే బాధ్యతని పుస్తకమే తీసుకుంది. అనుభవించేసిన కష్టాలూ, ఈదేసిన గోదారీ అందంగా ఉంటాయని చెబుతూనే, ఆ అందాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు ముళ్ళపూడి.

ఇది ముళ్ళపూడి వెంకటరమణ జీవిత కథ అనడం అసంపూర్ణం గా ఉంటుంది..ఎంత అసంపూర్ణంగా అంటే కేవలం రమణనో లేక కేవలం బాపుని మాత్రమే తల్చుకున్నంత. ఈ అపూర్వ మిత్రుల స్నేహం చిగురు తొడిగింది చిన్ననాడే కాబట్టి, రమణ బాల్యంలో బాపు కూడా ఓ భాగం కాబట్టి ఇది బాపు-రమణల కథ. ఇద్దరూ కలిసి ఆడిన ఆటలూ, చూసిన సినిమాలూ, చదివిన/రాసిన పుస్తకాలూ, తీసిన సినిమాలూ, ఉమ్మడి అభిరుచులూ, విడివిడి అభిరుచులూ..ఇలా ఎన్నో..ఎన్నెన్నో..

ఊహ తెలిశాక రోజంతా ఆటలాడి సాయంత్రం ఇద్దరు పనివాళ్ళ చేత కాళ్ళు పట్టించుకున్న కుర్రాడు, ఇంటా బయటా అందరిచేతా చక్రవర్తీ అని పిలిపించుకున్న పిల్లాడు, తను తప్పు చేసినప్పుడు తనకి బుద్ది చెప్పడం కోసం ఇంట్లో వాళ్ళు పని కుర్రాడిని దండిస్తుంటే చూసిన బుడుగు యేడాది తిరక్కుండానే దుర్భర దారిద్ర్యం అనుభవించాడు అంటే అది విధి లీల కాక మరేమిటి? తండ్రి మరణం తో కుటుంబం విచ్చిన్నం కావడం తో తల్లితో కలిసి ఊరు విడిచిపెట్టారు అప్పటి ముళ్ళపూడి వెంకట్రావు. (రమణ చిన్నప్పటి పేరు)

విస్తళ్ళు కుట్టడం మొదలు, తల్లితో కలిసి మిలిటరీ వాళ్ళ చొక్కాలకి గుండీలు కాజాలు కుట్టడం వరకు తల్లితో కలిసి చేయని పని లేదు. వైభవాన్నీ, దారిద్ర్యాన్నీ చిన్నప్పుడే చూసేయడం వల్ల కలిగిన స్థితప్రజ్ఞత అనుకుంటాను..జీవితం ఎప్పుడూ భయపెట్టలేదు రమణని. అలా భయపడకుండా ఉండడాన్ని తల్లి నుంచి నేర్చుకున్నానన్నారు ఆయన. కాస్త చదువు అబ్బాక తనకన్నా చిన్నపిల్లలకి ప్రైవేట్లు చెప్పడం, ఆ తర్వాత రేడియో బాలానందం కార్యక్రమాలు, 'బాల' పత్రిక కి రచనలు..ఇవన్నీ ఆదాయ మార్గాలు.

విశాఖపట్నం లో రోజు కూలి చేసినా, మద్రాసులో నిరుద్యోగ జీవితం గడిపినా అవన్నీ 'రేపు' మీద నమ్మకం తోనే. తనమీద తనకున్న ఆత్మవిశ్వాసం తోనే. 'ఆంద్ర పత్రిక' లో ఉద్యోగం వచ్చేవరకు రమణ ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటినీ హాస్యస్పోరకం గా చెప్పడం ముళ్ళపూడికి మాత్రమే తెలిసిన విద్య. అటు సినిమాలనీ, ఇటు సాహిత్యాన్నీమాత్రమే కాదు సంగీతాన్నీ మధించారు ఆయన.

జీవితం ఇలా సాగుతూ ఉండగానే 'ఆంద్ర పత్రిక' ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడూ అదే ఆత్మవిశ్వాసం. పక్కన బాపు కొండంత అండగా ఉండగా తర్వాత ఏంచేశారు అన్నది తెలుసుకుందామని ఆత్రంగా పేజీలు తిప్పేసరికి 'ఇంటర్వెల్' ప్రకటించేశారు అచ్చం సినిమా లాగా. అంటే మిగిలింది పుస్తకం రెండో భాగం లో ఉంటుందన్న మాట. ఆద్యంతం స్పూర్తివంతంగా ఉండే పుస్తకం ఇది. కళ్ళు చెమ్మగిల్లకుండా పేజీ తిప్పడం అసాధ్యం. అవును..నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ('హాసం' ప్రచురణ, వెల రూ. 150).

గురువారం, జులై 16, 2009

ఆషాఢ మాసాన...

ఆషాఢం..కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి ఒకే సారి రకరకాల అనుభూతులని ఇచ్చేది.. అదే కొత్త పెళ్లికొడుకుతో ఐతే "తెలుగు కేలండర్ లో నాకు నచ్చని ఒకే ఒక్క నెల'' లాంటి డైలాగులేవో చెప్పించేది. మాట్లాడడం తెలియని మగ వాడిని కూడా మహాకవిని చేసేయగల శక్తి ఆషాఢానికి ఉందని ఊరికే అన్నారా పెద్ద వాళ్ళు?

చిన్నప్పుడు ఆషాఢం అంటే తెలగపిండి, మునగాకు కూర (చేదుగా ఉన్నా తప్పదు) ఇంకా గోరింటాకు. టీనేజి కి వచ్చాక కొన్ని కలలు.. ఆ తర్వాతి సంగతి చెప్పడానికి లేదు.. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టించుకోడం సరదాగానే ఉండేది కానీ, హైస్కూలికి వచ్చేసరికి ముఖ్యంగా పెద్ద క్లాసులకి వచ్చాక కొంచం ఇబ్బందిగానే ఉండేది. అరచేతిలో ఓ చుక్కైనా పెట్టించుకోకపోతే ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు.

బళ్ళోనేమో అబ్బాయిల చేతులు చూసి వోణీ నోటికి అడ్డుపెట్టుకుని నవ్వుకునే అమ్మాయిలు. అక్కడికీ ఒకరిద్దరు మేష్టార్లు కూడా గోరింటాకుతో వచ్చేవాళ్ళు..కానీ అమ్మాయిలకి అబ్బాయిలే లోకువ కదా. కాలేజీ కి వచ్చేసరికి గోరింటాకు వద్దని గట్టిగా చెప్పే ధైర్యం వచ్చేసింది. వీడితో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ వదిలేశారు.

ఒక వయసు వచ్చేసరికి మనం ఏమీ ప్రయత్నించక పోయినా కొన్ని కొన్ని విషయాలు వాటంతట అవే తెలిసిపోతూ పోతూ ఉంటాయి. ఆషాఢం ప్రత్యేకత కూడా అలాగే తెలిసింది. వోణీ వెనుక మంగళ సూత్రాలు దాచుకుని ముఖాన ముసిముసి నవ్వులతో, భుజాన పుస్తకాల సంచీతో బడికొచ్చిన కొత్త పెళ్లి కూతుళ్ళకి ధన్యవాదాలు. ఐతే అంతగా బాధ/ఇబ్బంది పడడానికి కారణం ఏమిటో పూర్తిగా అర్ధం అవ్వడానికి మాత్రం కాలేజీ వరకూ ఆగాల్సి వచ్చింది. ఎంతైనా మావి మట్టి బుర్రలు.

కాలేజీలో ఒకసారి కొందరు మిత్రులం సమావేశమయ్యాం.. ఏదో క్లాసు కేన్సిల్ అయ్యింది.. ఆషాఢం నెల నడుస్తోంది.. చర్చకి అదే టాపిక్. భవిష్యత్తులో రాబోయే తొలి ఆషాఢాన్నిఎలా గడపాలి? అని. ఎవరు చేయాలనుకున్న వీరోచిత కార్యాలు వాళ్ళు చెప్పారు. (వాటిని ఇక్కడ చెప్పడం సభా మర్యాద కాదు) "నేను శ్రావణం లో పెళ్లి చేసుకుంటా.." అన్నాడో మిత్రుడు. మేమందరం చాలా ఆశ్చర్య పోయాం తన తెలివికి. అదే టైములో అమ్మాయిలు కూడా అదే విషయం మాట్లాడుకున్నారని అభిజ్న వర్గాల ద్వారా విని త్రిల్లైపోయాం.

ఆషాఢం మీద బోల్డన్ని కథలు, నవలలు, జోకులు, కార్టూన్లు, పాటలు, సినిమాలు వచ్చాయి. తెర మీద రొమాన్స్ ని చిత్రీకరించడం లో దిట్ట ఐన దర్శకుడు బాపూ కూడా ఆషాఢం బాధితుడే. భార్యని సినిమా హాల్లో కలుసుకోవాలని ప్లానేసి, ఆవిడ తన సమస్త బంధుగణం తోనూ తరలి రావడంతో అది కాస్తా వికటించడంతో ఆగ్రహించి, ఆ తర్వాత ఆమెకో ప్రేమలేఖ రాసి పంపి..లేఖ చదువుతున్నప్పటి ఆవిడ హావభావాలను రహస్యంగా గమనించి ఓ బొమ్మ గీసేశారు బాపు. ఈ కబుర్లు చెప్పింది ముళ్ళపూడి వెంకట రమణ, 'కోతి కొమ్మచ్చి' లో.

ఇప్పటి అమ్మాయిలని అబ్బాయిలని ఆషాఢం పెద్దగా బాధిస్తున్నట్టు లేదు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో 'అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు' అన్న రూల్ బ్రేక్ కావడం లేదు కాబట్టి విరహం తో వెక్కిళ్ళు పెడుతున్న వాళ్ళు చాలా తక్కువే. వీళ్ళకి జ్యేష్టము, శ్రావణము లాగే ఆషాఢము కూడా. ఈ ఏర్పాటు వల్ల ఎడబాటు లేదు. సందేశాలు మోసుకెళ్ళే పనిలేదని కాబోలు మేఘాలు కూడా ముఖం చాటేస్తున్నాయి. కానీ...దీర్ఘ ఎడబాటు తర్వాత వచ్చే పునస్సమాగమ మధుర క్షణాలను ఈ జంటలు మిస్సవుతున్నాయేమో కదా? కొత్త దంపతులు నా మీదకి దాడికి రావొద్దని మనవి.

బుధవారం, జులై 15, 2009

నాయికలు-జయంతి

ప్రతిరోజూ ఉదయాన్నే ఓ నల్లటి పొడవాటి కారు వచ్చి ఆమె ఇంటి ముందు ఆగుతుంది. ఆమె ఆ కార్లో ఆఫీసుకి బయలుదేరుతుంది. మళ్ళీ సాయంత్రం అదే కారు ఆమెని ఇంటి దగ్గర దింపి వెళ్తుంది. ఆమె కలక్టరో, జిల్లా జడ్జీనో కాదు. కారు తాళాలు గాల్లో ఎగరేసి పట్టుకునే ఆరడుగుల అందగాడు రాజశేఖరం దగ్గర 'సెక్రటరీ.' ఆమె పేరు జయంతి.

'నవలాదేశపు రాణి' గా కీర్తి కిరీటం అందుకున్న యద్దనపూడి సులోచనారాణి తొలి నవల 'సెక్రటరీ.' 1965 లో తొలిసారి ముద్రింప బడ్డ ఈ నవల గడిచిన 44 సంవత్సరాలలో 80 పునర్ముద్రణలు పొందింది. తెలుగు నవలా సాహిత్యానికి సంబంధించి బహుశా ఇదొక రికార్డు. అసలు ఏముందీ నవల్లో? సులోచనారాణి నవలలకి మహారాణి పాఠకులు మహిళలే. వాళ్ళని ఉర్రూతలూగించిన పాత్ర రాజశేఖరం.

మరి రాజశేఖరం గురించి రాయకుండా జయంతి గురించి ఎందుకు? ఎందుకంటే అంతటి రాజశేఖరమూ దాదాపు పిచ్చివాడైపోయింది ఈ జయంతి ప్రేమ కోసమే. మధ్యతరగతి నేపధ్యం ఉన్న అందమైన అమ్మాయి జయంతి. చిన్నప్పుడే తల్లినీ తండ్రినీ పోగొట్టుకుని బామ్మ పెంపకంలో పెరిగింది. బీయే చదివి, టైపు నేర్చుకుంది కానీ టైపు పరీక్షలు పాస్ కాలేదు. నాయనమ్మ పెళ్లి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటూ ఉండగా ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్న జయంతి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతుంది.

'వనితా విహార్' అన్న మహిళలకి సంబంధించిన సేవాసంస్థలో 'సెక్రటరీ' గా తొలి ఉద్యోగం వస్తుంది జయంతి కి. అక్కడ సభ్యులైన ప్రముఖ మహిళలందరి నోటి వెంటా 'రాజశేఖరం' పేరు ఎన్నోసార్లు వింటుంది. అనుకోని సందర్భంలో అతనితో పరిచయం అవుతుంది. ఆత్మాభిమానం తాకట్టుపెట్టలేక వనితావిహార్ ఉద్యోగం మానేస్తుంది జయంతి. అప్పటికే బామ్మ ఆరోగ్యం పాడవ్వడంతో వెంటనే మరో ఉద్యోగం వెతుక్కోడం అవసరం.

పిలిచి తన 'సెక్రటరీ' గా ఉద్యోగం ఇస్తాడు రాజశేఖరం. 'తనకి మరో ఉద్యోగం దొరకగానే పంపించేయాలని' కండిషన్ పెట్టి ఉద్యోగంలో చేరుతుంది జయంతి. పొద్దున్నే పడవలాంటి కార్లో, విశాలమైన రాజశేఖరం బంగ్లా కి వస్తుందా.. అక్కడ మరింత విశాలమైన డైనింగ్ టేబిల్ మీద రాజశేఖరం తో కలిసి ఫలహారం, కాఫీ తీసుకుంటుంది. రాజశేఖరానికి వచ్చే ఉత్తరాలను విభజించి, జవాబులు రాయాల్సినవి అతనికి ఇస్తుంది. అతను జవాబులు రాసేస్తే వాటిని టైపు కొడుతుంది. ఒకవేళ ఆమె టైపు కొట్టకపోయినా రాజశేఖరం ఏమీ అనడు, తనే స్వయంగా టైపు చేసుకుంటాడు.

మధ్యాహ్నం రాజశేఖరం తో కలిసి భోజనం. తర్వాత పెద్దగా పనుండదు.. కారెక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. రాజశేఖరానికి బోల్డన్ని ఇన్విటేషన్లు వస్తూ ఉంటాయి.. నాటకాలు, డాన్స్ ప్రోగ్రాములు ఇలా.. అతనికి వెళ్లడానికి తీరుబడి ఉండదు కదా.. తనకి నచ్చినవి తీసుకుని జయంతి తన స్నేహితురాలు సునందతో కలిసి వెళ్లి వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా బాస్ తో సినిమాలు, డిన్నర్లు ఉంటాయి. ఆమె ఆత్మ గౌరవానికి భంగం కలిగే పనులేవీ చేయడు రాజశేఖరం. మామూలుగా ఐతే ఎవరికైనా ఈ ఉద్యోగం స్వర్గంలా అనిపించాలి.. కానీ అదేమిటో జయంతికి ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది.

రాజశేఖరం తన మీద చూపించే అభిమానాన్ని తన అందానికి వల విసరడంగా భావిస్తుంది జయంతి. ఆమెకి ఆరోగ్యం బాగోనప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయిస్తాడు రాజశేఖరం. అప్పుడే బామ్మ ద్వారా జయంతి తన మరదలని తెలుస్తుంది అతనికి. జయంతిని, బామ్మని తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఏకాకి రాజశేఖరం. ఆమె మీద ప్రేమ రెట్టింపై, ఆమె తనకు తానుగా తనని ఇష్టపడెంత వరకూ బంధుత్వం విషయం బయట పెట్టకూడదు అనుకుంటాడు. జయంతి కోలుకునేలోగా గుండెపోటు తో బామ్మ మరణిస్తుంది.

వనితావిహార్ వాళ్ళు వచ్చి జయంతి ని పెళ్లి చేసుకుంటే రాజశేఖరం వ్యాపారం దివాలా తీస్తుందని, అతని క్షేమం కోరి అతన్ని పెళ్లి చేసుకోవద్దని చెబుతారు జయంతికి. ఆమెకి ఎలాగూ అతని మీద బోలెడన్ని సందేహాలు. చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది జయంతి. కొన్ని అత్యంత నాటకీయమైన మలుపుల తర్వాత రాజశేఖరం, జయంతి కలుసుకోవడం నవల ముగింపు. ఓ ఊహా ప్రపంచాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించడంలో రచయిత్రి కృతకృత్యు లయ్యారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అప్పట్లో నేను ఎనిమిదో తొమ్మిదో మిడుకుతున్నా.. మొదటిసారి ఈ నవల చదివినప్పుడు 'చేస్తే ఎప్పటికైనా ఇలాంటి ఉద్యోగం చేయాలి' అనుకున్నా, జయంతి ఉద్యోగం చూసి. డిగ్రీ లో ఉండగా మళ్ళీ చదివినప్పుడు మాత్రం నేనే రాజశేఖరం ఎందుకు కాకూడదు? అనిపించింది. ఈ నవలని ఇదే పేరుతో సినిమాగా తీశారు.

రాజశేఖరం గా అక్కినేని నాగేశ్వర రావు, జయంతిగా తెలుగు తెరమీద 'ఆత్మాభిమానా' నికి పర్యాయపదంగా నిలిచిన వాణిశ్రీ నటించారు. సినిమా నాకు నచ్చలేదు. 'ఏంటీ తిక్కా..' డైలాగు విన్నప్పుడల్లా తిక్క పుట్టింది. ఎమెస్కో ప్రచురించిన 'సెక్రటరీ' వెల రూ. 75. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.

శుక్రవారం, జులై 10, 2009

గోపి గోపిక గోదావరి

"వరుస పరాజయాలు వచ్చిన ప్రతిసారీ ఓ గొప్ప విజయం నన్ను వరిస్తోంది..." నాలుగేళ్ల క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతి కి తన ఫెయిల్యూర్ స్టోరీ చెబుతూ దర్శకుడు వంశీ అన్న మాటలు గుర్తొచ్చాయి థియేటర్ లోకి వెళ్ళగానే. మూడు వరుస పరాజయాల తర్వాత వస్తున్న సినిమా.. అది కూడా గోదారి మీద గోదారంత అభిమానాన్ని చూపే వంశీ ఆ గోదావరిని ఓ ముఖ్య పాత్రగా సినిమా తీశాడంటే రిలీజ్ షో చూడకుండా ఎలా? సినిమా టైటిల్ లో ఉన్న మూడు 'జి' లకి తోడూ నా సీట్ వచ్చింది 'జి' రో లో. తెల్లటి తెరని కూడా రెప్ప వెయ్యకుండా చూడడం మొదలు పెట్టాను.

ప్రారంభ దృశ్యం సింగన్నపల్లి గోదారి రేవు.. 'ఎర్ర నూకరాజు గారి కాఫీ హోటల్' నన్ను పసలపూడి కి తీసుకెళ్ళి పోయింది. ఇంతలో 'శ్రీ సీతారామ లాంచీ సర్వీస్' వారి లాంచీ వచ్చింది. సైడు పాత్రలన్నీ వచ్చి కోలాహలం మొదలు పెట్టాయి. డాక్టర్ గోపిక (కమలిని ముఖర్జీ) ఆ గోదారిలో ఓ లాంచీలో మొబైల్ హాస్పిటల్ నడుపుతోంది.. కార్పోరేట్ హాస్పిటల్స్ కి దీటుగా తీర ప్రాంత వాసులకి వైద్య సేవలందిస్తోంది. ఆ సేవలు చూడ్డానికొచ్చిన ఓ కుర్ర డాక్టరు చెట్టు కొమ్మ మీద కూర్చుని మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నా గోపికని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు.

డాక్టరమ్మ గారి అమ్మగారు (జయలలిత) వయసులో ఉండగా ఎవరి చేతిలోనో మోసపోయారు..అందువల్ల వారికి ప్రేమలు గిట్టవు. ఐతే కుర్ర డాక్టరు తన ప్రేమని గురించి తన బంధువు (జీవా) ద్వారా కబురు పెట్టడం తో, కుర్రాడు మంచాడని ఒప్పేసుకోడంతో పాటు, గోపిక్కి కూడా అతనంటే ఇష్టం అన్న భ్రమలో ఉంటూ ఉంటారు. గోపిక మాత్రం తను చేయాల్సిన సేవలు చాలా ఉన్నాయని పెళ్లి గురించి ఆలోచిస్తే మొదట కుర్ర డాక్టరు పేరునే పరిశీలిస్తానని అతనికి చెప్పేస్తుంది. తల్లేమో గోపిక అడిగినప్పుడే పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటుంది. డాక్టరమ్మ ఫోన్లు మాట్లాడుకుంటూ బిజీ గా ఉంటే, కాంపౌండరు, నర్సు పంచి డైలాగులు విసురుకుంటూ ఉంటారు.

వీళ్ళ గొడవ ఇలా ఉండగా.. హైదరాబాద్ లో స్వాతి ఆర్కెష్ట్రా.. దానికి మేనేజరు రమణ బాబు (కృష్ణ భగవాన్). ఓ లాయర్ (కొండవలస) వచ్చి ముగ్గురు మగ పిల్లల తండ్రైన రమణ బాబు అర్జెంటుగా ఓ ఆడపిల్లని కంటే దూరపుబంధువు ఆస్తి కలిసొస్తుందని చెబుతాడు. అబద్దాలాడితే ఆడపిల్ల పుడుతుందని అబద్ధాల వ్రతం మొదలు పెడతారు రమణ బాబు, అతని భార్య. రమణ బాబు కి కథతో సంబంధం ఏమిటంటే ఇతని ఆర్కెష్ట్రా లో ప్రధాన గాయకుడు గోపి (వేణు తొట్టెంపూడి) ఈ సినిమాకి హీరో. సింగన్నపల్లి డాక్టరమ్మ ఫోనుల్లో తెగ మాట్లాడేది తన హైదరాబాద్ స్నేహితురాలితో.. ఆ స్నేహితురాలు ఫోన్ పోగొట్టుకోడం, అది గోపి కి దొరకడం తో నాయికా నాయకుల తొలి సంభాషణ జరుగుతుంది, సినిమా మొదలై అరగంటకి పైగా గడిచాక.

ఇంతలోపు సదరు స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోడం, గోపి, గోపికని ఓదార్చడం లాంటి సన్నివేశాలతో కథ సాగుతూ ఉంటుంది. నాయికా నాయకులిద్దరూ కలుసుకుందాం అనుకుంటారు కానీ విధి దర్శకుడి రూపంలో అడ్డు పడుతుంది. కొరియర్లో కానుకల రవాణా జరగడంతో పాటు, ఫోన్లోనే 'నువ్వక్కడుంటే..' పాట కూడా పాడేసుకుంటారు. తన అబద్ధాల వ్రతంలో భాగంగా రమణ బాబు గోపికకి చెప్పిన ఓ అబద్ధం వల్ల గోపి, గోపికల మధ్య అపార్ధం పొడసూపడం, తన కూతురు ఫోన్లలో మాట్లాడుతున్నది కుర్ర డాక్టరుతో కాదనీ, ఓ ఆర్కెష్ట్రా గాయకుడితోననీ గోపిక అమ్మగారికి తెలియడం ఒక్కసారే జరుగుతాయి. ప్రేమ వివాహాలు కూడదు అంటుంది తల్లి, గోపి అందరిలాంటి వాడు కాదు అంటుంది కూతురు.

తొలిసారి ముఖాముఖి చూసుకోవాలనీ, అప్పటివరకు ఫోటోలు కూడా చూసుకో కూడదనీ అనుకుంటారు గోపి, గోపిక. వీళ్ళిద్దరి మధ్య పొడసూపిన అపార్ధాన్ని గోపి తల్లి (గీతాంజలి) సరిదిద్దుతుంది. ఇంతలో ఆవిడకి కళ్ళ సమస్య రావడం, త్వరలో చూపు పోతుందని డాక్టరు చెప్పడం జరుగుతాయి. గోపిక దగ్గరికి బయలు దేరిన గోపి, మసక చీకట్లో దుండగులు కొట్టిన దెబ్బలకి వొళ్ళంతా గాయాలతో గోదారి ఒడ్డున స్పృహ తప్పి పడిపోతాడు. అతని, ఫోన్, బ్యాగ్ ఓ దొంగ ఎత్తుకుపోతాడు. గోపి ఏమైపోయాడో అన్న అయోమయంలో గోపిక, సినిమా ఎటు పోతోందో అన్న అయోమయంలో ప్రేక్షకులు ఉండగా మొదలైన గంటన్నరకి విశ్రాంతి వచ్చింది.

సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడి ఊహకి అందే విధంగా, అప్పటి వరకు పెద్దగా పని లేకుండా ఉన్న మొబైల్ హాస్పిటల్ గోపిని రక్షిస్తుంది. అచ్చం సినిమాల్లో లాగే అతను గతం మర్చిపోతాడు. ఓ క్రైస్తవ మత బోధకుడు అతనికి ప్రభు అని పేరు పెడతాడు. ప్రభుగా కొత్త జీవితం మొదలు పెడతాడు గోపి. మరో పక్క గోపి ఏమయ్యాడో తెలియని గోపిక స్విచ్ ఆఫ్ అని వస్తున్నఅతని ఫోన్ కి రోజూ ఫోన్లు చేస్తూనే ఉంటుంది. కంటి చూపు కోల్పోయిన గోపి తల్లి గోపిక దగ్గరికి వచ్చి వెళ్తుంది. గోపి ఒంటి నిండా కట్లతో పడుకుని ఉంటాడు కాని ఆ తల్లి కి చూపు లేకపోవడం వల్ల గుర్తు పట్టలేదు. ప్రభుకి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళిన గోపిక, కుర్ర డాక్టర్లకి గోపి చనిపోయాడని తెలుస్తుంది. శవం గుర్తు పట్టలేని విధంగా ఉన్నప్పటికీ, వస్తువులు చూసి మృతుడిని గోపిగా గుర్తు పడతారు పోలీసులు.

గోపి చనిపోయాడని తెలిశాక కుర్ర డాక్టరుకి గోపిక పట్ల ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఈసారి పెళ్లి బాధ్యత తన భుజాల మీద వేసుకుంటాడు ప్రభు. తాళిబొట్టు తేడానికి వెళ్ళిన గోపి మీద దుండగులు మళ్ళీ దాడి చేయడంతో అతనికి గతం గుర్తు వచ్చేస్తుంది. తర్వాత ఏమైందన్నది ముగింపు. మామూలుగా ఐతే ఇది వంశీ సినిమానేనా అన్న సందేహం వచ్చేది కానీ 'దొంగరాముడు అండ్ పార్టీ' 'కొంచం టచ్లో ఉంటే చెబుతాను' సినిమాలు చేసిన గాయాల పచ్చి ఇంకా ఆరకపోడం వల్ల అలాంటి డౌట్ రాలేదు. 'అసలు దర్శకుడు ఏం చెబుదాం అనుకుంటున్నాడు?' అన్న డౌట్ సినిమా మొదలైన పావుగంటకి మొదలై ముగింపు వరకూ కొనసాగుతూనే ఉంది.

హీరోయిన్ డాక్టరు..కానీ హీరో కి తప్ప ఎవరికీ వైద్యం చెయ్యదు..ఆ మాటకొస్తే ఆవిడకి ఫోన్ తోనే సరిపోయింది. హీరో ఆర్కెష్ట్రా లో సింగర్.. కానీ ఒక్కసారి కూడా పాట పాడిన పాపాన పోలేదు. అసలు మొదటి సగం అంతా నాయికా నాయకులవి అతిధి పాత్రలే. సైడు పాత్రలే హంగు చేశాయి. ఆ హంగు శృతి మించడం వల్ల సినిమా నిడివి విపరీతంగా పెరిగిపోయింది.. మొత్తం రెండు గంటల నలభై నిమిషాలు. పాటల ప్లేస్మెంట్ అస్సలు కుదరలేదు. ఆడియోలో వినసొంపుగా ఉన్న 'బాలగోదారి' పాటకి సినిమాలో చోటు దక్కలేదు. ఎండ్ టైటిల్స్ రోల్ అవుతుంటే వినిపించారు. 'నువ్వక్కడుంటే..' చిత్రీకరణ ఒక్కటీ పర్లేదు. రెండో సగంలో కథ ఉందికదా చూద్దామనుకుంటే కథనం అష్ట వంకర్లు తిరిగింది.

కమలిని గ్లామర్ కి కృష్ణ పక్షం ప్రారంభం అయినట్టు ఉంది. కాటన్ చీరలు సొగసుగా కట్టినా ముఖంలో కళ తగ్గింది. వేణు గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. తన తొలి సినిమా 'సితార' లోనే స్క్రీన్ ప్లే మెరుపులు మెరిపించిన వంశీ కథను ఇంత నీరసంగా చెబుతాడని అస్సలు అనుకోలేదు. చాలా సీన్లు తినేసిన రమణ బాబు అబద్ధాల వ్రతం చివరికి ఏ ముగింపుకి చేరుకుందో చెప్పడం మర్చిపోయాడు దర్శకుడు. దీనితో కామెడీ కాస్తా 'కొంచం టచ్లో ఉంటే చెబుతాను' ని గుర్తు చేసింది. ద్వితీయార్ధం లో కథ ఉన్నా అది చాలా సార్లు 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' ని పోలి ఉన్నట్టు అనిపించింది. కామెడీ నవ్వించడానికి బదులు విసిగించింది. ప్రధమార్దంలో మందు పార్టీ 'సుందరి' పాట లేకపోయినా కథకి నష్టమేమీ లేదు. గోదారిని కథలో భాగం చేశామన్నారు కానీ ఈ కథకి గోదారే అవసరం లేదు..ఎక్కడైనా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం బెటర్ లక్ వంశీ..

చిన్నప్పుడు ఎప్పుడైనా బడికి ఎగ్గొట్టాలనిపిస్తే కడుపు నొప్పనో, కాలునొప్పనొ వంక పెట్టే వాడిని. అమ్మకి విషయం తెలిసి కోప్పడేది.. 'అలా చెడు కోరుకోకూడదు..పైన తధాస్తు దేవతలు ఉంటారు..' అంటూ. రిలీజ్ షో చూడడం కోసం ఉదయం ఆఫీస్ కి ఫోన్ చేసి 'తలనొప్పిగా ఉంది..ఈ పూట రాలేను' అని చెప్పాను..

గురువారం, జులై 09, 2009

వంశీ తో కొన్ని క్షణాలు...

"నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల.." డయలర్ టోన్ వినిపిస్తోంది.. ఫోన్ ని చెవికి మరికొంచెం దగ్గరగా లాక్కుని, ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చాను. కాల్ కట్ చేద్దామా? అనిపించింది ఒక్క క్షణం. కానీ అవతలి గొంతు వినాలన్న కుతూహలం నన్ను ఆ పని చెయ్యనివ్వ లేదు. నెల్లాళ్లుగా నిత్యం వింటున్న గొంతే..కాకపొతే 'గోపి గోపిక గోదావరి' పాటల రూపంలో.. ఇప్పుడు సంభాషణ ఎలా ఉంటుందో?

ఇలా ఆలోచించడానికి సరిగ్గా గంట క్రితం 'ఈనాడు' తిరగేస్తూ సినిమా పేజి దగ్గర ఆగిపోయాను.. గోదారి ఫోటో పెద్దది.. పక్కనే నవ్వుతున్న వంశీ. 'మా గోదారి తల్లి' అని హెడ్డింగ్. గబగబా చదివేశాను. చివరికి వచ్చేసరికి ఒక్కసారిగా ఓ శీతల పవనం నన్ను బలంగా తాకి వెళ్ళిన అనుభూతి. గోదారితో నాకెలాంటి అనుబంధం అని ఒక ఫ్రెండు చాలా రోజుల క్రితం అడిగినప్పుడు "గోదారి నాకు, అమ్మ, సోదరి, స్నేహితురాలు, ప్రేయసి, అన్నీ.." అని చెప్పాను కించిత్ పరవశంగా.. ఇప్పుడు అదే వాక్యం వంశీ అక్షరాలలో.. యెంత యాదృచ్చికం!

ఫోన్ తీసుకుని మిత్రులందరికీ సంక్షిప్త సందేశాలు పంపడం మొదలు పెట్టాను..ఈ ఆర్టికల్ చదవడం మిస్ కావొద్దని.. అరగంట గడిచిందో లేదో ఒక మిత్రుడి నుంచి ఫోన్.. గోదారి మిత్రుడు.. "అంత నచ్చిందా?" అంటూ మొదలు పెట్టి "వంశీ కి స్వయంగా చెబుతావా?" అని ప్రతిపాదించి నన్ను ఆశ్చర్య పరిచాడు. 'ఇది నిజమేనా?' అని నేను సందేహిస్తుండగానే..ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడంతో పాటు "ఇది ఎవరికీ ఇవ్వొద్దు" అన్న కండిషన్ కూడా వినిపించింది అవతలి నుంచి. తను తరచూ ఫోన్ నంబర్లు మార్చేస్తూ ఉంటానని వంశీ అప్పుడెప్పుడో సాక్షి 'డబుల్ ధమాకా' లో చెప్పిన విషయం గుర్తొచ్చింది.. సందేహిస్తూనే డయల్ చేశాను.

"నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల.." పాట కొనసాగుతోంది. "ఇంకా నిద్ర లేవలేదా.. ఏదైనా పనిలో బిజీ గా ఉండి ఉండొచ్చా?" నా ఆలోచనల్లో నేను ఉండగానే "హలో" అని వినిపించింది. ఏం మాట్లాడాలి? బుర్రంతా శూన్యం. "వంశీగారేనా అండి?" నా గుండె గొంతులోకి వచ్చినట్టుగా..నా గొంతులో ఉద్వేగం నాకే వినిపిస్తూ... "అవునండీ.." ఆగొంతులో గోదారి గలగలలు. 'మాట్లాడు..మాట్లాడు' అని నా సెన్స్ ఏదో నన్ను తొందర పెడుతోంది. "నా పేరు మురళీ అండీ.." గోదారి యాస వచ్చేసింది గొంతులోకి. "ఈనాడు లో మీ ఆర్టికల్ చదివానండీ.. మీ సినిమాలన్నీ ఒకేసారి చూసినట్టు అనిపించింది.."

నేను మాటలకోసం వెతుక్కునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ అవతల నాతో మాట్లాడుతున్నది 'మహల్లో కోకిల' ని 'సితార' గా మలచిన స్రష్ట.. 'ఆకుపచ్చని జ్ఞాపకా'లు పూయించిన కథా వనమాలి. ఏం మాట్లాడాలి? అదీ ఫోన్లో? "థాంక్యూ అండీ.." అని వినిపించింది.. ఉన్నట్టుండి నాలో సినిఅభిమాని నిద్రలేచాడు.. "రేపటి సినిమా ఎలా ఉంటుందండీ?" అడిగాను 'గోపి గోపిక గోదావరి' గురించి. తనా కమిటయ్యేది? "చూడాలండీ.." అని సమాధానం. సంభాషణ ఎలా? ఎదురుగా ఉన్న పేపర్ వైపు చూశాను. 'మా గోదారి తల్లి' కనిపించింది.

"కొండూరి రామరాజు గారు మీ రచనలు చాలా వాటిల్లో కనిపిస్తారు.. క్లోజ్ ఫ్రెండా అండి?" అడిగాక కానీ అర్ధం కాలేదు, అదెంత అర్ధం లేని ప్రశ్నో. "అవునండీ...బాగా.." జవాబు వచ్చింది. "మీరిది ఎప్పుడు రాశారు?" అడుగుతున్నానే కానీ మాట్లాడుతున్నది వంశీ తో అన్న భావన నన్ను నిలవనివ్వడం లేదు. "మొన్న రాత్రి రాశానండి.." మొన్నరాత్రి? అంత పాత విషయాలు? "అంటే పాత డైరీ రిఫర్ చేశారా?" పర్లేదు నా బుర్ర పనిచేస్తోంది. "లేదండి..నాకు ఎప్పటి విషయాలైనా గుర్తుంటాయి.. ఎప్పుడు కావాలంటే అప్పుడే గుర్తు తెచ్చుకుని రాసేస్తాను.."

"అంటే మా పసలపూడి కథలు కూడా అలా రాసినవేనా?" నా మనసులో సందేహం గొంతు దాటి వచ్చేసింది.. అటు నుంచి చిన్నగా నవ్విన సవ్వడి. "అవునండీ..అలా రాసినవే.." చిరునవ్వు కొనసాగింది. "అంటే ఆ మనుషులు.. వర్ణనలు..అన్నీ.." తడబాటు తగ్గి కొంచం ఫ్రీ అయ్యాను. "అవునండీ..అన్నీ.." మళ్ళీ అదే నవ్వు. "అందుకే మీరు అక్కడున్నారు.." నా మనసులోమాట నా ప్రమేయం లేకుండానే నోటివెంట వచ్చేసింది. "థాంక్యూ మురళిగారూ.." తన గొంతు నుంచి నా పేరు.. ఆ గొంతులో హడావిడిని గమనించాను.

"రేపటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానండి...ఉంటాను.." చెప్పేశాను..మరో "థాంక్యూ.." వినిపించింది అవతలి నుంచి. ఓ ఐదు నిమిషాలు అలాగే కూర్చుని సంభాషణ మొత్తం గుర్తు చేసుకున్నాను.. "వంశీ ఎవరితోనూ సరిగా మాట్లాడడు.." లాంటి కబుర్లన్నీ రూమర్లే అన్నమాట. నాకు నెంబర్ ఇచ్చిన మిత్రుడికి ఫోన్ చేసి సంభాషణ మొత్తం రికార్డు వేశాను. "థాంక్యూ వెరీ మచ్.. ఇవాల్టి రోజును నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.." చెప్పాను తనకి.

బుధవారం, జులై 08, 2009

సహకారం

పుష్కర కాలం క్రితం అట్టహాసంగా ఆరంభించిన 'ఇజ్రాయిల్ తరహా కాంట్రాక్టు వ్యవసాయం' ఓ చారిత్రిక తప్పిదమని తెలిశాక, వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో తాజా ప్రతిపాదనకి తెర తీసింది. చైనా నుంచి అరువు తెచ్చుకున్న 'సహకార వ్యవసాయం' అన్ని సమస్యలనీ పరిష్కరించేస్తుందని ప్రకటిస్తోంది.కేవలం 'జలయజ్ఞం' ద్వారా మాత్రమే హరితాంధ్ర సాధన సాధ్యపడదనే గ్రహింపు వల్లనో లేక 'కొత్తొక వింత' అన్న నానుడి మీద నమ్మకంతోనో తెలియదు కానీ, ఈ సహకార వ్యవసాయం మీద ప్రభుత్వం బాగానే దృష్టి కేంద్రీకరిస్తోంది.

దాదాపు ఐదు దశాబ్దాల క్రితం దేశం లో హరిత విప్లవాన్ని ఆరంభించి తిండిగింజల సమస్యని పరిష్కరించిన శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ సహకార వ్యవసాయానికి పచ్చ జెండా ఊపడం ప్రభుత్వానికి సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. ఐతే సహకార వ్యవసాయం రైతుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశమనీ, చాలా జాగ్రత్తగా అమలు పరచాలనీ పెద్దాయన చేసిన సూచనని ఎంతవరకూ పట్టించు కుంటుందన్నదే సందేహం. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకునే అలవాటు ఆది నుంచీ లేదు కాబట్టి, వాళ్ళ ఘోష వట్టి కంఠశోషే.

ప్రస్తుతం వ్యవసాయం చిన్న చిన్న కమతాల్లో జరగడం వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయం తగ్గుతోందని ప్రభుత్వం అభిప్రాయం. ఈ చిన్న కమతాలన్నింటినీ కలిపి వ్యవసాయం చేస్తే ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచ వచ్చుననీ, చైనా వంటి దేశాలు దీనిని ఆచరించి నిరూపించాయనీ తెలుసుకుని రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని ప్రారంభించాలని సంకల్పించింది. రాజు తల్చుకుంటే కానిదేముంది? ప్రతి జిల్లా లోనూ రెండేసి గ్రామాల్లో ఈ వ్యవసాయాన్ని ప్రారంభించాలని నిర్ణయమయిపోయింది. "రైతుల ఇష్టంతోనే సహకార వ్యవసాయం మొదలు పెడతామని" ప్రకటనలు వస్తున్నాయి.

ఓ ఊళ్ళో ఉన్న కమతాలన్నీ కలిపి ఓ వ్యవసాయ క్షేత్రంగా మలచి వ్యవసాయం చేయాలన్నది ప్రభుత్వ అభిమతం. రైతులు భూమి మీద తమకున్న హక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసే సొసైటీ కి బదలాయించాలి. ఇందుకు ప్రతిగా సొసైటీ లో వారికి భాగస్వామ్యం లభిస్తుంది. వ్యవసాయంలో వచ్చిన లాభాల్లో రైతులకి వాటా ఉంటుంది. నష్టం వస్తే భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడైనా రైతులు ఈ వ్యవసాయం నుంచి విరమించుకోవాలంటే తమ భాగస్వామ్యాన్ని మరో భాగస్తుడికో లేదా ప్రభుత్వానికో అమ్మేసుకోవచ్చు. భూమి మీద హక్కు మాత్రం తిరిగి రాదు.

రైతులు భూమిని కేవలం వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తే, గ్రామ స్థాయిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా రైతులంతా అన్నదమ్ముల్లా కలిసి ఉంటే, సకాలంలో పెట్టుబడులు పెట్టగల ఆర్ధిక పరిపుష్టి సొసైటీ లకి ఉంటే, నాణ్యమైన విత్తనాల సరఫరా మొదలు పంట కొనుగోలు వరకు ప్రభుత్వ సహాయం చిత్తశుద్ధితో కొనసాగితే ఈ పథకం విజయవంతం కావడం అసాధ్యమేమీ కాదు. కానీ మన రైతులకి నేలతో అనుబంధం ఎక్కువ.. చాలామంది రైతులకి వ్యవసాయ భూమి అన్నది తెంచుకోలేని ఒక బంధం. ఇక గ్రామ రాజకీయాల గురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వం చిత్తశుద్ధి తో రైతులకి సాయం చేసేతట్టయితే వ్యవసాయ సంక్షోభమే ఉండదు.

సహకార రంగంలో పాడి పరిశ్రమ విజయవంతం అయినట్టే, వ్యవసాయమూ విజయవంతం అవుతుందని అంటున్నారు స్వామి నాథన్. ఈ రెండు రంగాలకీ మౌలికంగానే ఎన్నో భేదాలున్నాయి. పాడి పరిశ్రమ ఒక అనుబంధ పరిశ్రమ. ఇక్కడ పశువుల మీద యాజమాన్య హక్కు రైతు దగ్గరే ఉంటుంది. ఉత్పత్తిని ఎవరికి అమ్మాలన్నది ఐచ్చికం. కానీ వ్యవసాయానికి వస్తే భూమి అనేది తరతరాల వారసత్వం. తండ్రి నుంచి వారసులకి సంక్రమించే ఒక హక్కు. సహకార వ్యవసాయంలో ప్రవేశించాలనుకునే రైతు ఈ హక్కుని వదులుకోవాలి. ఇది ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది వేచి చూడాల్సిన విషయం.

వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయాల్సినవి చాలానే ఉన్నాయి. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయినా కౌలు రైతుల సమస్య అలాగే ఉంది. వారికి తాము వ్యవసాయం చేసే భూమి మీద ఎలాంటి హక్కూ లేదు. ఈ కారణంగా రుణాలు, ఇతర సహాయమూ అందవు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో నూటికి డెబ్బై మంది కౌలు రైతులే అన్నది ఇక్కడ గమనించాలి. ఎరువులు, పురుగుమందుల ధరలపై నియంత్రణ లేదు. విత్తనాల నాణ్యత పై భరోసా లేదు. ప్రకృతి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ఇన్ని సమస్యల నడుమ గడిచిన సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు మన రైతులు. సమస్యలలో ఏ కొన్నింటిని పరిష్కరించినా మరింత దిగుబడి సాధించ గలరన్నది నిస్సందేహం. మరి 'సహకారం' పై ప్రభుత్వానికి మొదలైన మోజు వ్యవసాయ రంగాన్ని ఎటు తీసుకెడుతుందో?

మంగళవారం, జులై 07, 2009

'ఇల్లేరమ్మ' కొత్త కథలు

పుస్తకాల షాపుకెళ్ళి చాలా రోజులైందన్న విషయం నిన్న సాయంత్రం హఠాత్తుగా గుర్తొచ్చింది. నేను లేడి ని కాదు కానీ, ఇలాంటి విషయాల్లో మాత్రం నాకు లేచిందే పరుగు. సాయంత్రం షాపుకెళ్ళి, తీరిగ్గా ఒక్కోటీ చూస్తూ, నచ్చినవి ఎంపిక చేసుకుంటున్నానా..ఓ చోట కళ్ళు ఆగిపోయాయి. 'దీపశిఖ' కథలు అని పేరు..కింద బాపు బొమ్మ. బాపు బొమ్మ గీశారంటే రచయిత ఎవరై ఉంటారా అన్న కుతూహలంతో చూశా.. ఓ చిన్న షాకూ, సర్ప్రైజూ.. అక్కడున్న పేరు 'డా.సోమరాజు సుశీల.'

అప్పుడెప్పుడో హైదరాబాదు గోషా స్కూల్లో చదువుతుండగా తనకో తమ్ముడు పుట్టిన విషయం కబురు చెప్పి, తన బాల్య స్మృతులు 'ఇల్లేరమ్మ కతలు' ని ఆపేసి మాయమైపోయిన సుశీల ఇలా సడన్ గా ప్రత్యక్షమయ్యేసరికి ఆ మాత్రం ఆశ్చర్యం సహజమే కదా. 'ప్రధమ ముద్రణ: శ్రీ విరోధి నామ సంవత్సర జ్యేష్ఠ పూర్ణిమ 7 జూన్ 2009' అని ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకుని, అక్కడితో షాపింగ్ ఆపేసి, ఇంటికొచ్చి పుస్తకం పూర్తి చేసి కానీ నిద్రపోలేదు.

మొన్నటిదాకా అమ్మ గురించీ, నాన్న గురించీ, చిన్నారి, ఇందూ, బుజ్జీల గురించీ చెప్పిన పిల్ల ఒక్కసారిగా మా అత్తగారు, ఆయన, పిల్లలు, మనవలు అంటూ చెబుతుంటే సర్దుకోడానికి కొంచం టైం పట్టింది..బోల్డంత ముచ్చట గానూ అనిపించింది. మన కళ్ళ ముందు పిల్ల అలా పెరిగి పెద్దైపోతే సంతోషం కలగదూ.. ? సుశీల గారు అనడానికి మనసొప్పడం లేదు, ఇల్లేరమ్మ బాగా అలవాటైపోయి. కానీ తప్పదు.. పెద్దరికాన్ని గుర్తించాల్సిందే.

జీవితంలో తనకెదురైన రక రకాల అనుభవాలని సుశీల కథలుగా మలిచారనిపిస్తుంది ఈ పుస్తకం పూర్తి చేశాక. గడిచిన తొమ్మిదేళ్ళ కాలంలో వివిధ పత్రికల్లోఅచ్చైన పదమూడు కథల సమాహారం ఈ 'దీపశిఖ.' ముందుగా అభినందిచాల్సిన విషయం ఏమిటంటే రచయిత్రి తనదైన శైలిని కొనసాగించడం..నిష్టుర జీవిత సత్యాలని కూడా సరదా మాటల్లో చెప్పడం. 'ఇల్లేరమ్మ' మార్కు చెణుకులకి ఏమాత్రం లోటుండదు ఈ కథల్లో. చాలా కథలు సాఫీగా సాగి చివర్లో ఓ మెరుపు మెరిపిస్తాయి, ఓ.హెన్రీ కథల్లా.

మొదటి కథ 'జవహరి' మార్వాడి సేట్ పెళ్లి ప్రయాణాన్ని కళ్ళకి కడితే, రెండో కథ 'చిట్టితల్లి' తండ్రి ఆస్తిలో తన వాటా సాధించుకునేందుకు ఓ కూతురి ప్రయత్నం. తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు పిల్లల ప్రవర్తన చివుక్కు మనిపిస్తుంది. పనిమనిషి, ఆమె చంటిపిల్లతో అనుబంధం పెంచుకునే ఓ కుటుంబం కథ 'మరచెంబులో మందారపూలు.' ఆద్యంతమూ వ్యంగ్యోక్తులతో సాగుతుంది. క్రికెట్ మాచ్ ఫిక్సింగ్ నేపధ్యంలో రాసిన కథ 'సంబంధం కుదిరింది.' అతి తక్కువ ఖర్చుతో తన మనవరాలి పెళ్లి జరిపించేసిన బామ్మ కథ 'ఈవెంట్ మేనేజర్.'

రిటైరైన ఓ ఆఫీసర్ గారు తన భార్యతో కలిసి చేసే తీర్ధ యాత్రల ప్రయాణం లో పదనిసలు 'యాత్రా స్పెషల్' కాగా, అమెరికాలో ఉద్యోగాలు ఎందుకు పెరుగుతున్నాయో, పదో తరగతి పాసైన వాడు అమెరికా ప్రయాణం కట్టడం లో మర్మం ఏమిటో వివరించే కథ 'అవుట్ సోర్సింగ్.' ప్రొఫెసర్ కీ పిచ్చివాడికీ మధ్య ఉన్న సన్నని విభజన రేఖని వివరిచే ప్రయత్నం 'నలుసంత నమ్మకం.' పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి బెంగటిల్లే ఓ పేదింటి తల్లి కథ 'కాబోయే తల్లి.' ఉద్యోగం చేయడాన్ని అవమానంగా భావించే ఓ వ్యాపారిని 'మిఠాయి కొట్టు' లో పలకరించి, అమ్మ ఉండడానికీ లేక పోడానికీ తేడాని 'కరువు' లో చూడొచ్చు.

'నేను చూసిన చిట్టితల్లి' కూడా చివర్లో మెరుపు మెరిపించే కథ. ఇక చివరిది 'దీపశిఖ' అమెరికా జీవితం గురించి, జీవితం తనకి పెట్టే పరీక్షలని ధైర్యంగా ఎదుర్కొన్న ఓ అమెరికన్ యువతి గురించి. "ఏ తరంలోనూ మన వాళ్ళు అనుభవించని క్షోభ మా తరం తలిదండ్రులు అనుభవించాల్సి వస్తోంది. ఎదురుగా ఉండి బాధలు పడుతుంటే చూడలేక ఎక్కడికో పోయి బతకండ్రా అని తోలేస్తున్నాం. ఈ పిల్లలూ అంతే. ఐసరబజ్జా అనుకుని పోయిన వాళ్ళు అదే పోత! పూర్వం మహాపరాధాలు చేసిన వాళ్లకి దేశాంతర వాస శిక్ష వేసేవారుట. ఇప్పుడా శిక్ష అమ్మలే వేస్తున్నారు. పోనీలే మీరెవరూ పిల్లల్ని దూరాలు పంపుకోనక్కరలేదు! అమెరికా కన్నా డబ్బున్న దేశం ఉండదు కదా" ఓ తల్లి తన కూతురితో చెప్పిన ఈ మాటలు వెంటాడతాయి.

"ఏది ఏమైనా మన పవిత్ర భారత దేశం లో నిమ్మళంగా సుఖంగా బతకాలంటే భగవంతుడు అష్ట దరిద్రాలని ఇచ్చినా పర్వాలేదు. అనుకూలవతి ఐన ఒక్క పెళ్లాన్నిస్తే చాలు.. వాడు చక్రవర్తే కదా!" (జవహరి) లాంటి జీవిత సత్యాలూ, "మా ఇంట్లో ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు అత్తలు వెరసి ముగ్గురం.." (మరచెంబులో మందారపూలు) లాంటి పొడుపు కథలూ, "టీవీలో ఏ ఆటల పోటీ లోచ్చినా, ఏ దేశాల, ఏ గ్రహాల మధ్య జరిగినా ఆవిడ రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉంటారు" (సంబంధం కుదిరింది) అంటూ అత్తగారిమీద చెణుకులూ చాలానే ఉన్నాయి.

రైలు ప్రయాణాల్లో రచయిత్రికి చాలా అనుభవం ఉందనిపించక తప్పదు ఈ కథలు చదివినప్పుడు. 'మిఠాయి కొట్టు' చదువుతున్నప్పుడు నాకు అనుకోకుండా శ్రీరమణ 'ధనలక్ష్మి' గుర్తొచ్చింది, పోలిక లేకపోయినప్పటికీ. అన్నట్టు శ్రీరమణ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో కథలు ఏ వరుసలో చదవాలో సూచించారు కానీ, నేనా ముందుమాటని చివర్లో చదివా. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదల్చుకున్నది 'కరువు' కథ గురించి. ఇల్లేరమ్మ కతల్లో చివరి కథలో పుట్టిన తమ్ముడి గురించిన కథ ఇది. అతని పేరు రవి. కథంతా సరదాగా సాగినా, చివరి వాక్యం చదువుతుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

'కాబోయే తల్లి' కథాంశం బాగున్నా. పల్లెటూరి యాస రాయడంలో రచయిత్రి సఫలం కాలేకపోయారనిపించింది. కథ జరిగేది రాజమండ్రి దగ్గర పల్లెటూళ్ళో.. అక్కడక్కడా తెలంగాణా, రాయలసీమ పదాలు పంటికింద రాళ్ళలా తగిలాయి. మొత్తం 116 పేజీల ఈ పుస్తకం వెల రూ. 80. ప్రింటు కంటికింపుగా ఉంది. అచ్చుతప్పులు తక్కువే. ఉమా బుక్స్ ప్రచురణ. ప్రచురణ సంస్థ తో పాటు, నవోదయ, విశాలాంధ్రలలోనూ దొరుకుతుంది. ఇక్కడితో ఆపకుండా డా.సోమరాజు సుశీల మరిన్ని మంచి రచనలు చేయాలని కోరుకుంటూ...

ఆదివారం, జులై 05, 2009

మల్లికాసులు

చిన్నప్పుడు నాకు కథల్లో తరచూ వినిపించినవీ, మా ఊళ్ళో యెంత వెతికినా కనిపించనివీ రెండు జంతువులు. మొదటిది గాడిద, రెండోది నక్క. బళ్ళో చేరక ముందే సర్కస్ తో సహా చాలా వింతలు చూశాను కానీ ఈ రెండు జంతువులని మాత్రం ఊహలలోనే చూసుకోవాల్సి వచ్చింది. మా ఊరికి ఉన్న ఏకైక మడేలుకి గాడిద లేదు. మా ఊళ్ళో శ్మశానమే లేదు కాబట్టి నక్క కూడా లేదు.

అసలు విషయం లోకి వచ్చే ముందు ఇంకో కొసరు విషయం కూడా చెప్పాలి. మా ఎలిమెంటరీ స్కూలు రెండు పూటలా ఉండేది. నడక దూరం కావడం తో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి, మళ్ళీ బడికి వెళ్ళే వాళ్ళం. ఈ విభజన సులువుగా అర్ధం కావడానికి పొద్దున్న బడి, మధ్యాహ్నం బడి అనే వాళ్ళం. వేసవి ప్రవేశిస్తుండగా ఒంటిపూట బడి ఉండేది. అంటే మధ్యాహ్నం సెలవన్న మాట, హాయిగా.

నేను మూడో తరగతి చదివేటప్పుడు మొదటిసారిగా మల్లికాసులిని చూశాను. అబ్బే.. అమ్మాయి కాదు. ఓ సంచార జాతి. చిన్నా, పెద్దా, ఆడా, మగా అంతా కలిపి ఓ పదిహేను మంది, వాళ్ళ జంతువులు, పక్షులు. ఊరూరూ తిరుగుతూ వాళ్ళ విద్యలు ప్రదర్శించి, యాచించి బతుకుతూ ఉంటారు. ఇళ్ళకి వచ్చినప్పుడు "మల్లికాసులం వచ్చాం బాబయ్యా.." అని తెలుగులోనే మాట్లాడే వాళ్ళు కానీ, వాళ్ళలో వాళ్ళు మాత్రం ఏదో తమాషా భాష మాట్లాడుకునే వాళ్ళు.

ఓ రోజు భోజనం చేసి మధ్యాహ్నం బడికి వెళ్ళేసరికి, బడికి కొంచం దూరం లో ఉన్న కళ్లం లో కోలాహలం. భోజనానికి ఇంటికి వెళ్ళిన మేష్టారు ఇంకా రాకపోవడం తో, అక్కడ దిగిన మల్లికాసులని చూడ్డానికి మిత్రులతో కలిసి వెళ్లాను. వాళ్ళ వేషభాషలు, సామాను, పక్షులు, జంతువులు.. అన్నీ వింతగానే ఉన్నాయి. కొద్దిపాటి తేడాతో ఉన్న రెండు జంతువులు నన్ను భలే ఆకర్షించాయి. ఒకటి గాడిద, మరొకటి కంచర గాడిద అని మిత్రులు చెప్పారు. చెప్పొద్దూ, గాడిద భలే ముద్దొచ్చింది.

మధ్యాహ్నం బడి అయ్యాక ఇంటికి గాల్లో తేలుతూ వెళ్లాను. పుస్తకాల సంచీ గిరవాటేసి, పెరట్లో పప్పు రుబ్బుతున్న అమ్మ దగ్గరికి ఒక్క పరుగు పెట్టా. ఓ ఇటుక బొంత మీద కూర్చుని వగర్చుకుంటూ మల్లికాసుల వాళ్ళ వింతలన్నీ చెప్పడం మొదలు పెట్టాను. "తెల్లగా ఉందమ్మా.. యెంత ముద్దుగా ఉందో.. నేనింకా కథలు విని ఏదో పెద్ద జంతువు అనుకున్నానా.. చాలా పొట్టిగా ఉంది.. మనదేం ఊరమ్మా.. ఒక్క గాడిదా లేదు.." అని నేను ఒళ్ళు మరచి వర్ణిస్తున్న వేళ... "నువ్వున్నావు కదా నాయనా.." అని వినిపించింది వెనుక నుంచి.

ఈవేళప్పుడు నాన్న ఇంటికెందుకు వచ్చారో ఆలోచించేంత సమయం లేదు. తక్షణ కర్తవ్యంగా ఇంట్లోకి పరిగెత్తి సంచీ లోంచి తెలుగు పుస్తకం బయటికి లాగి, పేజీలు తిప్పక ముందే పాఠం చదవడం మొదలు పెట్టేశాను. (ఈ సౌకర్యం ఒక్క తెలుగు పుస్తకం తో మాత్రమే సాధ్యం) "గాడిద.. అడ్డ గాడిద.. చదువు సంధ్యా లేకుండా తిరుగుతున్నాడు.." నేపధ్యంలో దీవెనలు సాగుతున్నాయి. ఎప్పుడూ వినేవే.. అప్పుడు మాత్రం 'గాడిద' అనిపించు కున్నందుకు కూసింత గర్వంగా అనిపించింది. (నవ్వి పోదురు గాక..)

మల్లికాసులు చిన్న చిన్న వస్తువులు అమ్ముతారుట. గద్దగోరు, ఐసు కాయింతం కొనుక్కోవాలని మిత్రులు ప్లాన్లేస్తున్నారు. నాకు ఆ రెండూ ఏమిటో అర్ధం కాలేదు. అక్కడికీ 'గద్దగోరు ఎందుకూ?' అని ఒక మిత్రుడిని అడిగేశా. "ఎవడైనా మన మీదకి వచ్చాడనుకో.. అదుచ్చుకుని గీరొచ్చు.. అది మన దగ్గరుంటే ఎవడూ మన జోలికి రాదు.." అసలు ఎవరైనా మన జోలికి ఎందుకొస్తారో తెలియలేదు. అవడానికి భారీ కాయుణ్నేఅయినా శాంతి కాముకుడిని కావడం వల్ల యుద్ధతంత్రం మీదదృష్టి పెట్టలేదు.

ఐసు కాయింతం సంగతి అమ్మని కనుక్కుందాం అనుకున్నా.. 'ఇది కూడా తెలీదా?' అంటారని. నాకు ఐసు, కాయింతం (కాగితం) తెలుసు కాని, ఈ కొత్త వస్తువేమిటో అర్ధం కాలేదు. "అది అయస్కాంతం రా.. మన సూదుల పెట్లో పడేసుకుంటే సూదులన్నీ ఓ చోట పడి ఉంటాయి," అమ్మ స్వార్ధ బుద్ధితో ఆలోచించింది. ఇంతకీ కొనడానికి ఇష్ట పడలేదు. "వాళ్ళ దగ్గర కొనడం నాన్నగారికి ఇష్టముండదు" అని కొట్టి పారేసి "తాతగారికి ఉత్తరం రాసి తెప్పించుకో" అని సలహా ఇచ్చేసింది. అదేమిటో తెలిసి పోయాక నాకూ ఆసక్తి పోయింది.

మల్లికాసులు ఓ దేవుడిని తీసుకుని ఊరేగేవాళ్ళు. అదికూడా వాళ్ళు ఊరు విడిచి పెట్టే ముందు. ఓ పెట్టె లో దేవుడిని పెట్టి, ఓ తెర కప్పి ఇల్లిల్లూ తిరిగి, తెర తీసి చూపించే వాళ్ళు. ఆ దేవుడెవరో అర్ధం కాలేదు. అలాగే వాళ్ళ భాష కూడా. డబ్బులు, బియ్యం, పాత బట్టలు ఇలా ఏదిస్తే అది తీసుకునే వాళ్ళు. వాళ్ళు ఆడే ఆట చూసే అవకాశం మాత్రం నాకు దొరక లేదు. చీకటి పడ్డాక దూరం పంపేవారు కాదు. నాకు నేనుగా వెళ్ళే వయసొచ్చేసరికి వాళ్ళు రావడం మానేశారు.

శనివారం, జులై 04, 2009

విజేత

చిరంజీవి సినిమాల్లో నాకు ఇష్టమైనవి చెప్పమంటే మొదటి ఐదింటి లో ఉండే పేరు 'విజేత.' ఈ ఫ్యామిలీ డ్రామా ని ఎన్ని సార్లు చూసినా విసుగు కలగదు నాకు. అప్పటివరకు ఆకతాయిగా తిరుగుతూనే, కీలకమైన సందర్భంలో ఇంటి బాధ్యతను భుజాల మీద వేసుకునే ఇంటి చిన్న కొడుకు చినబాబు పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు. సంగీతం ఒక్కటి నిరాశ పరిచినా, మిగిలిన అన్ని విధాలుగా నాకు నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నా వ్యాసం 'నవతరంగం' లో..

శుక్రవారం, జులై 03, 2009

కథల కథ

తెలుగు సాహిత్యం లో మంచి కథల కొరత ఉందనే మాట ఈ మధ్య తరచూ వినిపిస్తోంది. సంఖ్యా పరంగా చాలా కథలే వస్తున్నా నాణ్యత పరంగా నిలబడే కథలు తక్కువే అనేది విమర్శకుల మాట. ఈమాట లోనూ నిజం ఉంది.. ఐదారు పత్రికలు తిరగేస్తే ఎక్కడో ఓ కథ 'పర్లేదు' అనిపిస్తుంది. ఒకప్పుడు నాణ్యమైన కథలకు పేరొందిన వార పత్రికలు, దిన పత్రికల ఆదివారం అనుబంధాలలో వస్తున్న కథలను చూస్తుంటే ఏదో మొక్కుబడిగా ప్రచురిస్తున్నారని అనిపిస్తోంది.

ఓ కథ రాయడానికి రచయితని ప్రేరేపించే అంశాలు ఏమై ఉంటాయి అని ఓ సగటు పాఠకుడిగా ఆలోచించినప్పుడు, నాకు తట్టిన జాబితా ఇది: పేరు, డబ్బు మరియు ఆత్మ సంతృప్తి. రచనా శైలి పదునెక్కాలంటే రచయిత తరచూ రాస్తూ ఉండాలి. చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఇందుకు చాలా సమయం వెచ్చించాలి. మొదటినుంచీ రచయితల నేపధ్యాలని పరిశీలిస్తే ఎక్కువమంది అధ్యాపక, పాత్రికేయ వృత్తుల నుంచి వచ్చిన వారు కనిపిస్తారు. మిగిలిన రంగాల వారు లేరని కాదు కాని, వీరి సంఖ్య ఎక్కువ.

మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా అన్ని రంగాలవారి జీవనాల్లోనూ వేగం పెరిగింది. పరుగు పందెం లో మొదట ఉండడానికే తొలి ప్రాధాన్యత. బ్రతుకు తెరువుకి చేపట్టిన ప్రధాన వృత్తి ఏమైనా సమయం మిగిలిస్తే అప్పుడు ప్రవృత్తి ఐన రచనా వ్యాసంగం గురించి ఆలోచన. కథా/నవలా రచననే పూర్తి స్థాయి వృత్తిగా చేపట్టే పరిస్తితులు ఇప్పుడు లేవు. రాయాలనే తపన ఉన్నప్పటికీ రచయిత కి తగినంత సమయం దొరకాల్సిన అవసరం ఉంది.. అప్పుడు మాత్రమే నాణ్యమైన రచనలు ఆశించడం సాధ్య పడుతుంది.

పత్రిక్కి రచన పంపడం, వాళ్ళు దానిని ప్రచురించడం, అది చదివి పాఠకులు ఉత్తరాలు రాయడం..ఇదంతా చాలా సమయం తీసుకునే వ్యవహారం. అదీ కాక, మీడియా బాగా విస్తరించిన నేపధ్యంలో తమతమ రంగాల్లో కృషి చేసి పేరు తెచ్చుకునే అవకాశం గతంలో కన్నా బాగా పెరిగింది. ఇంటర్నెట్ పత్రికలు, బ్లాగులు లాంటి ప్రత్యామ్నాయాల వైపు కూడా రచయితలు దృష్టి పెడుతున్నారు. గతంలో కొన్ని పత్రికలు మాత్రమే ఉండడం, కథలు కోరుకునే వాళ్ళు వాటిని చదవడం జరిగేది. ఇప్పుడు అలా కాక, మంచి కథ కోసం రకరకాల సోర్సులు వెతుక్కోవలసి వస్తోంది. దీనివల్ల కూడా ఒక్కోసారి మంచి కథ పాఠకులను చేరడంలో జాప్యం జరుగుతోంది.

రచయిత చేత మంచి కథ రాయించడానికి పారితోషికం ఒకప్పుడు స్ఫూర్తి నిచ్చేది.. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పత్రిక నుంచి కథ తాలూకు పారితోషకం తెచ్చే పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసే వాళ్ళట. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఇప్పుడు పత్రికలు ఇస్తున్న పారితోషికాలు కూడా ఏమంత ఆకర్షణీయంగా ఉండడం లేదు (పోటీలకు మినహా) 'వాళ్ళిచ్చే పారితోషికం కాగితాలు, పోస్టల్ ఖర్చులకి చాలదు' అన్నమాట వినిపిస్తోంది. కేవలం డబ్బు కోసమే రాస్తారనను కానీ, డబ్బు కూడా రాయడానికి స్పూర్తినిస్తుందన్నది నిర్వివాదం. ఈ పరిస్థితుల్లో బాగా రాయగలిగే రచయితలు కూడా ఇతరత్రా వ్యాపకాలలో ఆత్మ సంతృప్తి ని వెతుక్కుంటున్నారా? అన్న సందేహం కలుగుతోంది.

బుధవారం, జులై 01, 2009

టాంపండు లీలలు

తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మ ఉత్సాహంగా చెప్పే కబుర్లు టాంపండు ప్రస్తావన లేకుండా పూర్తవ్వవు. తాతగారికి తొమ్మిది మంది సంతానం ఉన్నా, వీళ్ళు చాలరన్నట్టు ఓ కుక్కనీ పెంచారు.. ఆ కుక్క పేరు టామీ..ముద్దుగా టాంపండు. అమ్మ టాంపండు గురించి చెప్పినప్పుడల్లా నేను "కొడుకులతో పాటు రాజు కుక్కని పెంచి..." పాడి తిట్లు తింటూ ఉండేవాడిని.

అసలు టాంపండు తాతగారింటికి రావడమే చిత్రంగా జరిగింది. ఆయన ఏదో పనుండి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న పొరుగూరికి వెళ్ళినప్పుడు ఒకరి ఇంట్లో ఓ చిన్న కుక్కపిల్ల కనిపించిందిట. ఆయనకి వాళ్ళు ఇచ్చిన పాలలో కొంచం ఓ కొబ్బరి చిప్పలో పోసి శవాకారంలో ఉన్న ఆ కుక్క పిల్ల ముందు పెట్టారుట. అది ఆ పాలు తాగి ఇక ఆయన్నివిడిచి పెట్టలేదు. ఆయన వెంటే నడుస్తూ ఇంటికి వచ్చేసింది.

ఓ రెండు మూడు రోజులు చద్దాన్నాలు అవీ తిని కాస్త తేరుకుంది.. దాని ప్రాణానికి ఏమీ ఢోకా లేదని తెలిశాక, దానికో పేరు పెట్టాల్సిన బాధ్యత అమ్మ వాళ్ళ మీద పడింది. పిన్నిలిద్దరూ కలిసి దానికి టామీ అనే పేరు నిశ్చయించారు. అప్పటివరకూ తాతగారిని వేధించిన సమస్యలు ఒక్కొక్కటీ ఓ కొలిక్కి రావడం మొదలవ్వడంతో ఆయన "టామీ వచ్చిన వేళ.." అని దానికి బోల్డంత క్రెడిట్ ఇచ్చేశారు.

టామీ ఆయనకి ప్రియమైనది అయిపోవడంతో మొదలయ్యాయి ఇంట్లో వాళ్ళ కష్టాలు. అదెంత అల్లరి చేసినా దానిని ఏమీ అనడానికి లేదు. వర్షాకాలంలో ఇంటి చుట్టుపక్కల తిరిగే బురద పాములు, నీరుకట్లని (ప్రమాదం లేని పాములు) మాటేసి, తన పంజాతో వేటాడి కొట్టి నోటికి కరుచుకుని ఇంట్లోకి తెచ్చేసేదిట. అమ్మమ్మ బాపిరాజునో, లేకపొతే పిల్లలనో బతిమాలి ఆ చచ్చిన పాముల్ని బయట పడేయించేది, మనసులో టామీ ని తిట్టుకుంటూ.

టాంపండు ఊరికే తిని కూర్చుంటోందని, దానికేమైనా పనులు నేర్పాలని మా పిన్నిలిద్దరూ ప్రయత్నించి దానికి దూరంగా ఉన్న వస్తువులు నోటికి కరుచుకుని రావడం లో ట్రైనింగ్ ఇచ్చారు. ఓ రోజు మా పిన్ని కొత్త ఇంకు పెన్ను కొనుక్కుని పుస్తకాల దగ్గర పెట్టుకుంది. చదువుకునేటప్పుడు పెన్ను కావల్సోచ్చి టాంపండుకి పురమాయించింది. టాంపండు గా..ట్టిగా నోటికి కరుచుకు రావడంతో ఆ పెన్నుకి నాలుగు చిల్లులు పడ్డాయి. వెంటనే కొత్త పెన్నంటే ఇంట్లో ఒప్పుకుంటారా?

అమ్మమ్మవి మరో రకం కష్టాలు.. కాపురానికి వచ్చినప్పటినుంచి పిల్లిని పెంచడం ఆవిడకి అలవాటు. పిల్లికి కుక్కకి జన్మవైరం కదా.. పిల్లి పిల్లల్ని పెట్టిందంటే టాంపండు వాటిని ఏం చేసేస్తుందో అని ఆవిడకి బెంగ. సగం రాత్రి వరకు తను కాపలా ఉంది, పిల్లల్ని వంతులేసుకుని చూస్తూ ఉండమని బతిమాలుకునేదిట ఆవిడ. టాంపండు మీద తాతగారికి కంప్లైంట్ చేయడం అనవసరం, చేసిన వాళ్ళే తిట్లు తినాలి. పైగా 'దానిని ఏమైనా అంటే నన్ను అన్నట్టే' అని ప్రకటించేశారు కూడాను.

దాదాపు పదేళ్ళ పాటు రాజ్యం చేశాక, టాంపండుకి జబ్బు చేసింది. పశువుల ఆస్పత్రి చాలా దూరం. తాతగారు లెక్క చేయకుండా రోజూ రిక్షా కట్టించి పిల్లల్ని ఇచ్చి టామీని ఆస్పత్రికి పంపి వైద్యం చేయించారు. "ఆ వైద్యానికి పెట్టిన డబ్బు పెడితే ఎకరం పొలం వచ్చేది" అని చెప్పుకున్నారుట ఊళ్ళో అందరూ. మానవ ప్రయత్నం యెంత చేసినా విధిని ఎవ్వరూ ఆపలేరు కదా.. వైద్యం జరుగుతుండగానే ప్రాణం విడిచింది టాంపండు. బిడ్డని పోగొట్టుకున్నట్టుగా బాధపడ్డారట తాగారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రకరకాల ఒడిదుడుకులు చుట్టుముట్టాయట ఆయన్ని..