ఆదివారం, నవంబర్ 29, 2009

బ్లాగులు-కొత్తపాళీ

"ఈయనెవరో తాపీ ధర్మారావు గారి అభిమాని అనుకుంటా.." ఈ సంవత్సరం మొదట్లో 'కొత్తపాళీ' బ్లాగు మొదటి సారి చూసినప్పుడు ఆ బ్లాగర్ గురించి నాకు అనిపించిందిది. తాపీ వారి రచనల్లో 'కొత్తపాళీ' ఒకటి. అప్పట్లో బ్లాగు లోకంలో దాదాపు ప్రతిరోజూ ప్రముఖంగా కనిపించిన పేర్లలో 'కొత్తపాళీ' ఒకటి.. ఆరకంగా బ్లాగులు చదివే తొలి రోజుల్లోనే కొత్తపాళీ గారి బ్లాగుతో పరిచయమయ్యింది. చాలా బ్లాగుల్లో ఆయన వ్యాఖ్యలు కనిపించేవి.. అభిప్రాయాలు, సలహాలు, సూచనలు.. ఇలా..

బ్లాగుల్లో మాత్రమే కాకుండా 'నవతరంగం' వ్యాఖ్యల్లోనూ అప్పుడప్పుడూ ఈ పేరు కనిపించేది. అడపా దడపా వ్యాసాలూ వచ్చేవి. 'కొత్తపాళీ' బ్లాగులో నేను చదివిన మొదటి టపా నాకు బాగా జ్ఞాపకం.. 'చిగిర్చే చెట్టు' ఆ టపా పేరు. అప్పుడే బ్లాగుల్లోకి వచ్చిన నాకు ఇక్కడి పోకడలు అర్ధం చేసుకోడానికి ఎంతగానో సాయపడిన టపా అది. బ్లాగర్లకి రాడానికి అవకాశం ఉన్న ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవలసిన పద్ధతులు ఇవన్నీ తెలుసుకోగలిగాను.

వేదం, వేదాంత సారం మొదలు ,రాజకీయాలు సైన్సు సంగతుల వరకు, తెలుగు కథ మొదలు ప్రపంచ సాహిత్యం వరకు, శాస్త్రీయ సంగీతం, భరత నాట్యం మొదలు నుంచి జాజ్, రాక డేన్స్ వరకు, పాత సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ...ప్రతి అంశం మీదా దాదాపు సాధికారంగా మాట్లాడగల వ్యక్తి రాసే బ్లాగులో ఆయా అంశాలన్నింటి గురించీ ప్రస్తావనలు ఉండడం సహజమైన విషయమే కదా. కేవలం తెలుగు సినిమాల గురించే కాదు విదేశీ సినిమాల కబుర్లూ చదవొచ్చు ఇక్కడ. పేరడీ రాసినా, సమీక్ష రాసినా, విమర్శ రాసినా 'సమగ్రత' మిస్సవకుండా చూస్తారన్నది నా చిన్న పరిశీలన.

ఏ అంశాన్ని ఎన్నుకున్నా, ఆ సబ్జక్టు గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లకి సైతం అర్ధమయ్యేలా రాయడం బ్లాగర్ కొత్తపాళీ గారి ప్రత్యేకత. బాపట్ల జ్ఞాపకాలు, ఆటవా విశేషాలు లాంటి సరదా విషయాలు మొదలు, 'గట్టు తెగిన చెరువు' లాంటి సీరియస్ కథల పుస్తకం మీద సమీక్ష వరకూ అందరిచేతా చదివించేలా రాయడం అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు. కథ రాయమని బ్లాగర్లని ప్రోత్సహించడం మొదలు వారం వారం కబుర్లు చెప్పడం వరకూ బ్లాగులో ఆయన చేసిన ప్రయోగాలు అనేకం. కొత్త టపాలతో పాటు పాత ముత్యాలూ దొరుకుతాయి ఈ బ్లాగులో.

కొత్తపాళీ గారి అసలు పేరు నారాయణ స్వామి అనీ, అమెరికా లో ఉంటారనీ, అక్కడ కొందరు ఆయన్ని 'నాసీ' అని పిలుస్తారానీ కాలక్రమంలో తెలిసింది. 'బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా' అన్నది కొత్తపాళీ బ్లాగు ట్యాగ్ లైన్. తను గురించి తను చెప్పుకున్నది ఒకటే వాక్యం 'రాయాలని ఆశ..' అందుకేనేమో పాఠకులకి ఈ బ్లాగు 'చదవాలని ఆశ' కలుగుతూ ఉంటుంది. కేలండర్ ప్రకారం కచ్చితంగా టపాలు రాయడం బ్లాగుల్లో అంతగా ఆచరణ సాధమైన విషయం కాకపోయినా, ప్రతి సోమ, గురు వారాల్లో కొత్త టపాలు వెలువరిస్తూ ఉంటారు కొత్తపాళీ, అప్పుడప్పుడూ మినహాయింపులు ఉన్నప్పటికీ.

ఆయన బ్లాగు ప్రొఫైల్ కొత్తపాళీ అక్టోబర్ 2006 నుంచి బ్లాగ్లోకం లో ఉన్నారని సూచిస్తోంది. అయితే 'కొత్తపాళీ' బ్లాగు మొదలయ్యింది ఫిబ్రవరి 2007 లో. ఈ బ్లాగర్ కి మరో మూడు బ్లాగులున్నాయి మరి. ఈ బ్లాగర్ కథారచయిత, కవి, సాహితీ, సిని విమర్శకుడు కూడా. జాల పత్రికల్లో ప్రచురితమైన ఆయన కథలు కొన్ని చదవ గలిగాను నేను. వాటిని పుస్తక రూపం లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినికిడి. భాష మీద ఈయనకి ఎంత అభిమానం అంటే, బ్లాగుల్లో ఎక్కడైనా భాషా, వ్యాకరణ దోషాలు కనబడితే సరి చేయకుండా వదలరు. ఈ బ్లాగులో తరచూ కనిపించే 'కాల్చేసి' (కాల్ చేసి) అనే పదం మాత్రం ఎప్పుడూ కొంత అయోమయ పరుస్తూ ఉంటుంది నన్ను.

కొత్తబ్లాగర్లని ప్రోత్సహించడం, రాయడానికి బద్ధకిస్తున్న వాళ్లకి రాయమని గుర్తు చేయడం మాత్రమే కాదు, ఒక విషయం మీద భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు తను చెప్పింది మాత్రమే సరైనది అని కాకుండా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించే లక్షణం కూడా కొత్తపాళీ గారిని చాలా మంది బ్లాగర్లు 'గురువు గారు' అని పిలుచుకునేలా చేసిందన్నది నా అభిప్రాయం. పోలిక సరికాదేమో కానీ, ఎంకి గురించి నాయుడు బావ 'కన్నెత్తితే సాలు కనకాభిసేకాలు' అనుకున్నట్టుగా మన బ్లాగ్మిత్రులు చాలా మంది కొత్తపాళీ గారు 'కామెంటితే చాలు..' అని వ్యాఖ్యల్లో రాయడం చూశాన్నేను.

గత నెలలోనే పుట్టిన రోజు జరుపుకున్న కొత్తపాళీ గారికి (ఎన్నో పుట్టిన రోజని నన్నడగొద్దు.. ఆయన్నే అడగండి) బ్లాగ్లోకం తరపున మన కృష్ణపక్షం భావన గారు ఒక అందమైన కానుక ఇచ్చారు. నిజానికి ఆ కానుక బ్లాగు పాఠకుల కోసమే.. అది మరేమిటో కాదు..కొత్తపాళీ గారి టపాల సంకలనం. తీరిక చిక్కినప్పుడల్లా తిరగేయాల్సిన సంకలనం. కొత్తపాళీగారు సెలవులివ్వకుండా బ్లాగు రాయాలనీ, ఇతర కళా, సాహితీ ప్రక్రియలనీ కొనసాగించాలనీ కోరుకుంటున్నాను.

మంగళవారం, నవంబర్ 24, 2009

చెయ్యి విరిగినట్టుంది..

భాస్కర్ రామరాజు గారు 'నాన్న' బ్లాగులో దేశీ పాకశాస్త్ర నిపుణుడు మెహతా వంటల పోటీల్లో పాల్గోబోతున్నాడని రాసినప్పుడు మెహతా కి అభినందనలు చెప్పాను. తర్వాత మెహతా ఓడినా గెలిచినట్టే అని మరో టపా రాస్తే 'నిజమే' అని నా అభిప్రాయం ప్రకటించాను. 'సాహితి' మాలాకుమార్ గారు ఉసిరికాయ గురించీ, ఊర్వశి గురించీ రాసినవి చదివి 'ఉసిరికాయ తో చవన్ప్రాస్ చేసుకోవచ్చు కదండీ?' అనే సందేహాన్ని వెలిబుచ్చి, 'ఇన్నాళ్ళ తర్వాత కూడా ఊర్వశి ని గుర్తు పెట్టుకోడం నిజంగా గ్రేట్' అని అభిప్రాయం చెప్పాను.

నిషిగంధ గారు మీటిన 'మానసవీణా' నాదాన్ని విని, 'మరువం' ఉష గారు బ్లాగుకి సెలవులు ప్రకటిస్తే 'సెలవుల్ని ఎంజాయ్ చేసొచ్చి ఆ కబుర్లన్నీ చెప్పండి' అని అడిగి, అటునుంచి అటే 'పరిమళం' గారి కవిత మీద, 'జ్యోతి' గారి నవలానాయకుడి మీదా నా అబ్బిప్పిరాయాన్ని ప్రకటించి వచ్చాను. అంతేనా? కూడలి లో టపాలు చదివి నచ్చిన టపాలకి వ్యాఖ్యలు రాశాను. "ఇవన్నీఅందరూ రోజూ చేసే పనులే కదా.. జైల్లో రామదాసు 'సీతమ్మకి చేయిస్తీ..' అన్నట్టు ఈ జాబితా అంతా ఎందుకు?" అంటే... అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే.. నా వ్యాఖ్యలేవీ ప్రచురింప బడలేదు.

గత వారం నా కంప్యూటర్ కి వైరల్ ఫీవర్ వచ్చింది.. సాంకేతిక పరిభాషలో వైరస్ అన్నమాట. వైద్యం జరిగింది.. అక్కడే కథ అడ్డం తిరిగింది. 'ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్నట్టుగా అయ్యింది పరిస్థితి. అప్పటి నుంచీ కొన్ని బ్లాగుల్లో కామెంటడం వీలవ్వడం లేదు. అసలు ఇప్పటికే వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయడం సహన పరీక్షగా మారడం తో, చాలాసార్లు కామెంటాలనిపించినా వీలు కాక మౌనంగా వచ్చేస్తున్నా.. ఇప్పుడు కొన్ని బ్లాగ్ స్పాట్ బ్లాగుల్లో వ్యాఖ్య రాసినా అది ప్రచురింప బడడం లేదు.

మొదటి రెండు రోజులూ ఈ సమస్యని పట్టించుకోలేదు.. అదే సెట్ అవుతుందిలే అని ఒకలాంటి ధీమా. 'నాతో నేను నాగురించి' వేణూ శ్రీకాంత్ గారి 'పొగబండి' టపా చదివి, ముచ్చట పడి, కామెంట్ రాసే వీల్లేక పోవడం తో ఆయనకి మెయిల్ ద్వారా వ్యాఖ్యని పంపాను. పనిలో పనిగా, సమస్య నుంచి బయట పడ్డానికి తగు సలహాలు, సూచనలు ఇమ్మని మిత్రులని అడిగాను. సమస్య లోకి కొంచం పరిశోధన చేస్తే అర్ధం అయిన సంగతి ఏమిటంటే, వ్యాఖ్యలు ఫుల్ పేజి లోనూ, పాప్-అప్ విండో లోనూ ఉన్న బ్లాగులతో ఎలాంటి సమస్యా లేదు. టపా కింద 'ఎంబెడెడ్' గా ఉన్న బ్లాగుల్లోనే వస్తోంది చిక్కు.

నా మిషిన్ లో వాడుతున్నది ఐయీ (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్).. కారణాంతరాల వల్ల మంటనక్క (ఫైర్ ఫాక్స్) కి మారలేను. అందువల్ల ఐయీ లోనే సమస్య పరిష్కరించుకునే మార్గాలు కావాలి. మిత్రులు చెప్పిన ఒకటి రెండు చిట్కాలు పని చేయలేదు. గతం లో నా బ్లాగులోనూ కామెంట్లు ఎంబెడెడ్ పద్ధతిలో ఉండేవి.. బ్లాగ్మిత్రుల సూచనల మేరకు ఫుల్ పేజీలోకి మార్చాను. ఇప్పుడు నో కంప్లైంట్స్. ఇప్పుడు బ్లాగ్మిత్రులని నేను కోరేది ఏమిటంటే.. మిత్రులారా మీలో చాలామంది కంప్యూటర్ కార్మికులు (సాఫ్ట్ వేర్ నేపధ్యంగా ఆర్. నారాయణ మూర్తి సినిమా తీస్తే టైటిల్ ఏం పెడతాడా? అన్న ఆలోచన ఫలితం), ఈ సమస్య గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు.. ఈ సమస్య నుంచి బయట పడే చిట్టి చిట్కాలు ఉంటే చెప్పండి.

టపా చదివాక వ్యాఖ్య రాయాలనిపించక పోతే అది వేరే విషయం. అలా కాక, అబ్బిప్పిరాయం ప్రకటించాలని అనిపించినా పూర్తి 'సాంకేతిక' కారణాల వల్ల ఇలా మౌనంగా ఉండాల్సి రావడం భలే ఇబ్బందిగా ఉంది. దీనికి మిషిన్ మార్చడం అనే శాశ్విత పరిష్కారం ఉంది కానీ, దానికి కొంచం టైం పట్టేలా ఉంది. బ్లాగ్ కమ్యూనికేషన్స్ లో కామెంట్ బాక్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో కదా అనిపిస్తోందిప్పుడు.

ఆదివారం, నవంబర్ 22, 2009

ప్యాసా

కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని చూడకుండానే మనం వాటి గురించి మాట్లాడేయగలం. ఎందుకంటే వాటిమీద అప్పడికే ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. దానితో మనకి ఆ సినిమా గురించి మాట్లాడ్డం సులభమైపోతుంది. గురుదత్ సినిమా 'ప్యాసా' మీద పడ్డ ముద్ర 'ఏడుపుగొట్టు సినిమా' అని. నిజమేనా? యాభైరెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలో ఏడుపు తప్ప ఇంకేమీ లేదా?

సున్నిత హృదయాల సంఘర్షణ, కాలం చేసే గారడీని తట్టుకోలేని నిశ్చేష్టత, విధికి ఎదురీదలేని దైన్యత, ఎన్ని సమస్యలు ఎదురైనా చెక్కు చెదరని, వన్నె తరగని మానవత్వం, సున్నితత్వం.. ఇవన్నీ కనిపిస్తాయి 'ప్యాసా' (దాహార్తి) లో. బతక నేర్వని కవి విజయ్ (గురుదత్) బతక నేర్చిన అతని (ఒకప్పటి) ప్రియురాలు మీనా (మాలా సిన్హా) అతనిలోని కవిని ఆరాధించి, అతన్ని ప్రేమించే వేశ్య గులాబో (వహీదా రెహమాన్) ల కథ ఇది.

తెర మీద కథానాయకుడి పాత్రతో పాటు, తెర వెనుక రచన, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు చూసింది గురుదత్తే.. అందుకే ఇది నూటికి నూరుశాతం గురుదత్ సినిమా. కథాకాలం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజులు. కాలేజీ చదువు పూర్తి చేసిన విజయ్ ఉద్యోగ ప్రయత్నాలలో విసిగి వేసారి, చిన్న చిన్న కూలిపనులు చేస్తూ ఉంటాడు. వృద్ధురాలైన తల్లి, అతన్ని పోషించడం బరువుగా భావించే ఇద్దరు అన్నలు. ఇదీ అతని నేపధ్యం.

విజయ్ యెంతో ఇష్టంగా రాసుకున్న కవిత్వాన్ని చిత్తుకాగితాలుగా అమ్మేస్తారు అతని అన్నలు. షాపులో అనుకోకుండా వాటిని చదివి, ముచ్చట పడి కొనుక్కుంటుంది గులాబో. మరోపక్క పత్రికాఫీసులో తన కవితలు చిత్తు కాగితాల బుట్టలో పడేయడం తో ఆగ్రహించిన విజయ్ వాటిని తీసుకుని ఇంటికి వస్తాడు. అన్నలు చేసిన పని తెలిసి వాళ్ళతో గొడవ పడతాడు. ఇదే అవకాశమని అతన్ని ఇంటి నుంచి గెంటేస్తారు అన్నలు.

పార్కులో తన కవితని పాడుతున్న గులాబో ని చూసి, మిగిలిన కవితల కోసం ఆమెని అనుసరిస్తాడు విజయ్. అతను 'కష్టమర్' అనుకుని ఇంటికి తీసుకెళ్తుంది ఆమె. అతనో బికారి అని తెలిసి వెళ్ళగొడుతుంది. ఆ తర్వాత తన దగ్గరున్నవి అతని కవితలే అని తెలిసి అతనిమీద ఇష్టం పెంచుకుంటుంది గులాబో. పని వెతుక్కుంటున్న విజయ్ కి మీనా ఎదురు పడుతుంది. నగరం లో పెద్ద ప్రచురణ కర్త ఘోష్ భార్య ఆమె.

ఘోష్ దగ్గర పనివాడిగా చేరతాడు విజయ్. మీనా-విజయ్ ల ప్రేమ గురించి తెలిసిన ఘోష్ అతన్ని పని నుంచి తీసేస్తాడు. రైలు కింద పడి ఒక వ్యక్తి మరణించడం, అతని వంటి మీద విజయ్ కోటు ఉండడంతో అందరూ చనిపోయింది విజయ్ అనే అనుకుంటారు. తన నగలు ఖర్చు పెట్టి ఘోష్ ద్వారా విజయ్ కవితల్ని అచ్చు వేయిస్తుంది గులాబో. విజయ్ ఆత్మహత్య వార్త కారణంగా ఆ పుస్తకాలకి యెనలేని డిమాండ్ వస్తుంది. ఇంతలో విజయ్ బతికే ఉన్నాడన్న వార్త తెలుస్తుంది.

విజయ్ బతికి ఉన్నాడని పాఠకులకి తెలిస్తే అతని పుస్తకాలకి డిమాండ్ ఉండదని భావించిన ఘోష్, అతని సోదరులని, మిత్రులని డబ్బుతో కొని, విజయ్ జీవించి లేడని ప్రచారం చేస్తాడు. ఘోష్ కారణంగా పిచ్చాసుపత్రిలో చేరి, అక్కడినుంచి తప్పించుకున్న విజయ్ భారీ ఎత్తున జరుగుతున్న తన సంస్మరణ సభకి హాజరవుతాడు. అతని కవితలు తిరస్కరించిన పత్రికా సంపాదకుడు విజయ్ ని గుర్తు పడతాడు. అతను బతికే ఉన్నాడని చెప్పడం ద్వారా, అతని చేత కవితలు రాయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేస్తాడు ఆ సంపాదకుడు.

తన అన్నలు, మిత్రులు తన కళ్ళ ఎదుటే తను జీవించి ఉన్నాడా, మరణించాడా అని చెప్పడానికి బేరాలు కుదుర్చుకోడం చూసి చలించిపోతాడు విజయ్. సంపాదకుడు ఏర్పాటు చేసిన సభలో తాను విజయ్ ని కాదని చెబుతాడు. జనం కొట్టిన రాళ్ళ దెబ్బలు తిని, గులాబోతో కలిసి అస్తమిస్తున్న సూర్యుడి వైపు నిడిచి వెళ్ళిపోతాడు విజయ్. సినిమా ప్రారంభ సన్నివేశంలో జనం కాళ్ళ కింద పడి నలిగిపోయే పూలని చూసి బాధ పడడం మొదలు, ప్రతి సన్నివేశం లోనూ విజయ్ లోని సున్నితత్వాన్ని చూడొచ్చు.

మీనా తనకి ఎదురు పడినప్పుడు, తల్లి మరణ వార్తని సోదరులు తనకి చెప్పలేదని తెలిసినప్పుడు, వేశ్యా వాటికలో స్త్రీల జీవితాన్ని చూసినప్పుడు, 'తన' వాళ్ళంతా డబ్బు కోసం తను చనిపోయాడని చెప్పడానికి సిద్ధ పడ్డ సన్నివేశంలోనూ గురుదత్ నటన గుర్తుండి పోతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది వహీదా రెహమాన్ గురించి. ఈ తెలుగు నటికి తొలి హిందీ సినిమా ఇది. క్లిష్టమైన పాత్రని సమర్ధంగా చేసింది. క్లోజప్ దృశ్యాల్లో చూపిన ఆమె కళ్ళు సినిమా పూర్తైనా వెంటాడతాయి. మాలా సిన్హాది గ్లామర్ పాత్ర. మాలిష్ చేసే సత్తార్ పాత్రలో జానీ వాకర్ నవ్వించడమే కాదు, కథలో కీలక మలుపులకి కారణమవుతాడు కూడా.

ఎస్డీ బర్మన్ సంగీతం లో సాహిర్ లూధియాన్వీ రాసిన పాటలూ, పద్యాలూ సినిమాకి ప్రాణం పోశాయి. గీతా దత్, మహమ్మద్ రఫీ, హేమంత్ కుమార్ లు ఆలపించారు పాటల్ని. సన్నివేశాలకి తగిన నేపధ్య సంగీతం. అక్కడక్కడా సినిమా కొంచం సాగతీతగా అనిపిస్తుంది. కథానాయకుడిది పాసివ్ రోల్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. తెలుగులో శోభన్ బాబు కథానాయకుడిగా వచ్చిన 'మల్లెపూవు' సినిమాకి స్ఫూర్తి 'ప్యాసా'నే. ('చిన్న మాటా. . ఒక చిన్న మాటా..' పాట 'మల్లెపూవు' లోదే) మోజర్ బేర్ విడుదల చేసిన డీవీడీ క్వాలిటీ బాగుంది. ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ సౌకర్యం ఉంది. (వెల రూ. 45)

శనివారం, నవంబర్ 21, 2009

మదర్పిత... తాంబూలాది

కొన్ని కథలు ఆసాంతమూ ఉత్కంఠ భరితంగా చదివిస్తాయి. మరికొన్ని చివర్లో వచ్చే ఒక ఊహించని మలుపుతో మెరిపిస్తాయి.. ఇంకొన్ని చదువరుల చేత చిరు దరహాసాలు కురిపిస్తాయి. మొత్తం నలభై కథల సంకలనాన్ని గురించి మూడు మాటల్లో చెప్పాలంటే అందుకు సరిగ్గా సరిపోయే మూడు మాటలు ఇవి. 'మానస' కలం పేరుతో ఉన్నవ హర గోపాల్ అరవై-ఎనభై దశకాల మధ్య రాసిన కథలను 'మదర్పిత... తాంబూలాది' పేరిట సంకలనంగా వెలువరించారు. ఆయనే రాసిన 'నవ్వినా కన్నీళ్ళే..' నవల ఈ సంకలనం లో బోనస్.

తొలికథ 'మదర్పిత... తాంబూలాది' నే పుస్తకం శీర్షిక గా ఉంచారు మానస. మూర్తి పని చేసే కంపెనీ ఎండీ గారమ్మాయి పెళ్లి. మూర్తి భార్య సుజాత కి ఆయన మావయ్య వరస. ఆ పెళ్ళికి మూడు రోజులు సెలవు పెట్టమని భర్తని బలవంతం చేస్తుంది సుజాత. మూర్తి మొహమాట పడుతుండగానే, ఆఫీసులో మేనేజరు కి విషయం తెలిసి, ఎండీ గారు మూర్తి పేరిట పంపిన శుభలేఖ ని అతని చేతిలో పెట్టి లీవు శాంక్షన్ చేసేస్తాడు. పెళ్ళికి వెళ్ళిన మూర్తి తో యెంతో సాదరంగా మాట్లాడతారు ఎండీ గారూ, ఆయన బంధువులూ. 'మన సుజాత వాళ్ళాయన' అంటూ మర్యాద చేసేస్తారు.

ఇంక పెళ్ళిలో హడావిడి అంతా సుజాతదే. ఎండీ గారి భార్యకి ఏం కావలసినా మొదట పిలిచేది సుజాతనే. ఎండీ గారి తమ్ముడైతే మూర్తిని అస్సలు వదిలి పెట్టడు.. వాళ్ళిద్దరూ చదరంగం ఆడుతూనే ఉంటారు, ఓ పక్క పెళ్లవుతున్నా. ఎండీ గారి సింప్లిసిటీ కి మూర్తి ముచ్చట పడుతుండగానే పెళ్లయిపోతుంది. పెళ్లికూతురితో పాటు సుజాతనీ, మూర్తినీ వెళ్ళిరమ్మని మూర్తిని రిక్వెస్టు చేస్తాడాయన. అనుకోకుండా ఎండీ గారు, వాళ్ళ తమ్ముడి సంభాషణ వింటాడు మూర్తి. అసలు సుజాత వాళ్ళకి ఎలా బంధువు? అని చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళు.

"మనం వైజాగ్ లో ఉన్నప్పుడు మన పక్కింట్లో ఉండే వాళ్లండీ.. అప్పుడది చిన్నపిల్ల.. మావయ్యా మావయ్యా అంటూ మీ చుట్టూ తిరిగేది.. గుర్తు లేదూ' అంటుంది ఆవిడ. మూర్తి తన ఆఫీసులోనే ఒక క్లర్కని తెలిసి హతాశుడవుతాడు ఎండీ గారు. ఆయన తమ్ముడిదీ అదే పరిస్థితి. తర్వాత ఏం జరిగిందనేది మర్చిపోలేని ముగింపు. అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తే చాలని కుక్కర్లు పుట్టక ముందు పుట్టిన ఒక సామెత. అలా కథల పుస్తకం లో కథలు ఎలా ఉండబోతున్నాయో ఒక కథ చదవగానే కొంతవరకూ అర్ధమవుతుంది కదా..

కథలన్నీ దాదాపు మధ్యతరగతి మందహాసాలే. యద్దనపూడి సులోచనారాణి నవలల్లో శీను, మామి పాత్రల్లా, మానస కథల్లో సుజాతో, మూర్తో, ఒక్కోసారి ఇద్దరూ కలిసో మనకి తప్పక ఎదురు పడతారు. చాలా కథల్లో కథాంశం మానవత్వం.. మనుషుల్లో అది తగ్గిపోతుండడం వల్ల జరుగుతున్న పరిణామాలు. కాలేజీ ఎన్నికలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, స్టార్ హోటళ్ళ సంస్కృతి, సంప్రదాయాలను వదులుకోడానికి ఇష్టపడని పెద్దలు, వాళ్ళని ఎదిరించలేక నలిగిపోయే పిల్లలు.. ఇలా కథలన్నీ మన కళ్ళ ముందు జరిగినట్టు అనిపిస్తాయి.

ఒకే రచయిత కథలతో వచ్చిన సంకలనాలలో ప్రతి కథా అద్భుతంగా ఉండడం అన్నది చాలా అరుదైన విషయం.. అలాగే ఈ సంకలనం లోనూ కొన్ని సాధారణ కథలూ ఉన్నాయి. అప్పటికే బాగా నలిగిన సబ్జక్టుని కథగా మలచినా కొసమెరుపు తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రచయిత. రచనా శైలి రచయిత మన ఎదురుగా కూర్చుని కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. వర్ణనలు అవీ ఏమీ లేకుండా సూటిగా కథ చెప్పేస్తారు. 'ట్విస్ట్' అంతే రచయితకి ఇష్టమని అనిపిస్తుంది, చాలా కథల్లో కొసమెరుపు చూసినప్పుడు.

మొత్తం సంకలనం చదవడం పూర్తి చేయగానే ఒక సందేహం తప్పక వేధిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు తనకెదురైన ప్రతి అంశాన్నీ సమర్ధవంతంగా కథలుగా మలచిన రచయిత ఆ తర్వాత ఉన్నట్టుండి అస్త్ర సన్యాసం ఎలా చేయగలిగారా? అని. ఇప్పుడింక ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు కాబట్టి మానస మళ్ళీ రాయడం మొదలు పెడితే బాగుంటుంది. ('మదర్పిత... తాంబూలాది,' రచన, ప్రచురణ: మానస, పేజీలు:422, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, నవంబర్ 19, 2009

పెద్దక్క పెళ్లిచూపులు

నా మొదటి పెళ్ళిచూపుల గురించి టపా రాస్తున్నప్పుడే అమ్మమ్మ వాళ్ళింట్లో జరిగిన మొదటి పెళ్ళిచూపుల గురించి అమ్మ చెప్పిన కబుర్లు గుర్తొచ్చాయి.. వాటి గురించి ఇప్పుడు. ఇంట్లో ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారంటే, ఇంటాయన (అంటే ఇంటి ఓనరు కాదు, ఇంటి పెద్ద) పట్టించుకోక పోయినా చుట్టాలూ, స్నేహితులూ ఆ పిల్లలకి సంబంధాలు చూడడం, ఉచిత సలహాలు ఇవ్వడం వాళ్ళ బాధ్యతగా భావిస్తారు కదా.. అలా ఇంట్లో చివరి పిల్లలు ఇంకా బళ్లోకి వెళ్తుండగానే పెద్దమ్మాయికి పెళ్ళిసంబంధాలు రావడం మొదలయ్యాయి.

అమ్మ అప్పటికి హైస్కూలికి వెళ్తోంది.. పిన్నిలిద్దరూ, మామయ్య ఎలిమెంటరీ స్కూల్. పెద్ద పెద్దమ్మ, అంటే అమ్మ వాళ్ళ పెద్దక్కని చదువు మానిపించేశారు. పెద్ద పిల్లకి పెళ్లి చేసేయాలని అమ్మమ్మ తొందర పడుతున్నా, తాతగారు అస్సలు పట్టించుకోకుండా పనులు చూసుకుంటున్న సమయంలో బంధువులెవరో అమ్మమ్మ పాలిట దేవుళ్ళలా వచ్చి ఓ సంబంధం తెచ్చారు. ఫలానా రోజున పెళ్ళివారు అమ్మాయిని చూసుకోడానికి వస్తారు అని కబురొచ్చింది.. ఇంకేముంది.. ఇల్లంతా హడావిడి.

ఇంటి నిండా ఉన్న పిల్లల్ని చూసి, వచ్చిన వాళ్ళు హడిలి పోతారనుకున్నారో లేకపొతే పిల్లలందరినీ పరిచయం చేయడం ఎందుకనుకున్నారో, అమ్మమ్మ తాతగారు పిల్లలెవరూ పెళ్లివారుండగా బయటికి రాడానికి వీల్లేదని ఆర్డరేశారు. పాపం ముందు రోజు ఒళ్ళు హూనంయ్యేలా ఇల్లంతా సర్దింది వీళ్ళే కాని, అసలు ముఖ్యమైన పెళ్ళిచూపుల ఘట్టం వచ్చేసరికి సైడైపోవాల్సి వచ్చింది. తాతగారు సున్నితంగానూ, పెద్ద మావయ్య ఘాటుగానూ మరోసారి గుర్తు చేశారు పిల్లలందరికీ, ఎత్తి పరిస్థితుల్లోనూ పెళ్లి వాళ్ళుండగా బయటికి రావొద్దని.

పెళ్ళికూతురిని వంటింట్లో తన దగ్గర ఉండమని, మిగిలిన పిల్లలందరినీ వెనుక గదిలో ఉండమని చెప్పింది అమ్మమ్మ. పిల్లలంతా వెనుక గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరో వచ్చిన అలికిడి, తర్వాత తాతగారు, పెద్ద మావయ్యల హడావిడి వినబడుతున్నాయి. అమ్మ వాళ్ళ మూడో అక్క, నాలుగో అక్కలకి కుతూహలం మొదలయ్యింది.. అవతలి గదిలో ఏం జరుగుతో ఉండి ఉండొచ్చో గుసగుసగా ఊహాగానాలు చేస్తున్నారు పిల్లలందరూ. ఇద్దరక్కలూ కూడబలుక్కుని ఒక ప్లాన్ వేశారు.

పిల్లలున్న గదిలోనే ఒక మూలకి నిచ్చెన ఉంది. ఆ నిచ్చెనని మధ్య గోడకి ఆన్చి పైకి ఎక్కితే గోడ అవతల గదిలో జుర్గుతున్న పెళ్లిచూపుల తతంగమంతా చూడొచ్చు. ప్లాన్ విని మొదట భయ పడ్డ పిల్లలంతా ఏం జరుగుతోందో అన్న కుతూహలం కొద్దీ ఆ ప్రకారం ముందుకు పోడానికి సరే అనేశారు. చప్పుడవకుండా నిచ్చెనని తెచ్చి గోడకి ఆన్చి వేశారు. ఇద్దరు పిల్లలు నిచ్చెన పట్టుకోగా మొదట మూడో అక్క నిచ్చెన ఎక్కి అవతలి గదిలోకి తొంగి చూసింది.

అక్కడ కనిపించిన దృశ్యం ఏమిటంటే తాతగారు, పెద్ద మావయ్య తో పాటు మరో ఆయన కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన జుట్టు సగం నెరిసిపోయింది. "పెళ్ళికొడుకు బాగా ముసలాడే" అని ప్రకటించింది ఆమె నిచ్చెన దిగి. పిల్లలంతా బోల్డంత నిరాశ పడ్డారు. ఎలాంటి వాడైనా పెళ్లి కొడుకు కదా.. చూడక తప్పదు కదా.. ఒక్కొక్కరుగా నిచ్చెన ఎక్కడం, తొంగి చూసి దిగిపోవడం.

ఇక చివరికి మిగిలింది ప్లానేసిన నాలుగో అక్క. ఆమెకూడా నెమ్మదిగా నిచ్చెన ఎక్కి తొంగి చూస్తూ, సరిగ్గా అదే సమయానికి ఎందుకో తల పైకెత్తిన పెద్ద మావయ్యకి దొరికి పోయింది.. తర్వాత పెద్దమావయ్య ఏం చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. ఇంతకీ ఆ వచ్చినతను పెళ్ళికొడుకు కాదు.. పెళ్ళివారికి వీలవక వాళ్ళ బంధువుని చూసి రమ్మని పంపించారుట.

మంగళవారం, నవంబర్ 17, 2009

నాయికలు-కిరణ్మయి

చదివిన చదువును జీవితానికి అన్వయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కొందరి కోవకి వస్తుంది కిరణ్మయి. ఆమె మనస్తత్వ శాస్త్రం లో పీజీ చేసింది. ఊహించని కష్టం వచ్చి పడినప్పుడు, అందమైన పొదరిల్లు లా ఉండాలని తను కోరుకున్న తన వైవాహిక జీవితం పునాది దశలోనే కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనస్తత్వ శాస్త్రాన్నే తనకి ఆసరాగా చేసుకుంది కిరణ్మయి. పోలీసులకి దీటుగా అపరాధ పరిశోధన చేసి తన భర్తని రక్షించుకుంది. ఈ క్రమంలో 'లేడీస్ హాస్టల్' లో జరుగుతున్న అక్రమాలెన్నింటినో వెలుగులోకి తెచ్చింది.

కిరణ్మయిది విచిత్రమైన కుటుంబం. ఉద్యోగం నుంచి సస్పెండైన తండ్రి, ఇంటి బాధ్యత పట్టించుకోని అన్నలు. ఇంట్లో రాజకీయాలు చేసే వదినలు. ఏ ఇద్దరి మనుషుల మధ్యా అనుబంధం లేదా ఇంట్లో. 'తన' ఇల్లు అలా ఉండకూడదని కిరణ్మయి కోరిక. ఆమెకి పెళ్లి చేయడం కన్నా ఉద్యోగానికి పంపితే తనకి వెసులుబాటుగా ఉంటుందని ఆలోచిస్తాడు ఆమె తండ్రి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకో పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి కొడుకు రంజీ క్రికెట్ ప్లేయర్.. పేరు రాయన్న. ఆమె కన్నా తక్కువ చదువుకున్నాడు. అయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది.

మనస్తత్వ శాస్త్రం ఆధారంగా మొదటి రాత్రి తన భర్తని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది కిరణ్మయి. తన ఆశ, శ్వాస క్రికెట్టే అనీ, భారత జట్టుకి ఎంపికవ్వాలన్నది తన ధ్యేయమని రాయన్న చెప్పినప్పుడు, "రెండేళ్ళ పాటు ఉద్యోగం మానేసి ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టండి.. ఈ రెండేళ్ళూ నేను ఉద్యోగం చేస్తాను.." అంటుంది, అప్పటివరకూ క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని కిరణ్మయి. ఆమెతో తన జీవితం బాగుంటుందన్న నమ్మకం లుగుతుంది రాయన్నకి. తనకి ఏ అమ్మాయితోనూ శారీరక సంబంధం లేదని భార్యకి చెబుతాడతను. అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాపులు తీసుకుంటారనీ, అంతకు మించి ఎవరితోనూ పరిచయం లేదనీ చెబుతాడు.

రాయన్నతో జీవితం తను కోరుకున్నట్టుగా ఉండబోతోందన్న నమ్మకం కిరణ్మయి కి కలుగుతున్న సమయంలోనే తలుపు చప్పుడవుతుంది. అర్ధరాత్రి వేళ వచ్చిన పోలీసులు రాయన్న ని అరెస్టు చేస్తారు.. లేడిస్ హాస్టల్ లో ఉంటున్న అపురూప లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్యకి కారణమయ్యాడన్న అభియోగంపై. "నాకే పాపమూ తెలీదు.. కనీసం నువ్వైనా నమ్ము" అని భార్యకి చెప్పి పోలీసు జీపెక్కుతాడు రాయన్న. ఆ అర్ధరాత్రి వేళ తన మనో నిబ్బరం కోల్పోకుండా ఉండడం కోసం కిరణ్మయి చేసిన పని ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చోడం. ఆ మర్నాడే సెలక్షన్స్ కోసం పిలుపొస్తుంది రాయన్నకి.

అతనికి బెయిల్ ఇప్పించడం మొదలు సెలక్షన్స్ లో ఆడడానికి అతన్ని మానసికంగా సిద్ధం చేయడం వరకూ కిరణ్మయి చేసిన కృషి అసామాన్యమైనది. అతను సెలక్షన్స్ కి వెళ్ళగానే లాయర్ తో కలిసి భవిష్యత్ కార్యక్రమం ఆలోచించి, రాయన్న నిర్దోషి అని నిరూపించే ఆధారాలను వెతికే పనిలో పడుతుంది ఆమె. ఓ పక్క రాయన్న దోషి అని బలంగా నమ్ముతున్న పోలీసులు, మరోపక్క అతను నేషనల్ టీం లో సెలక్ట్ కాకూడదని పావులు కదుపుతున్న క్రికెట్ ప్రత్యర్ధులు, ఇంకోపక్క జరుగుతున్నా పరిణామాల వల్ల తనమీద తనకే నమ్మకం పోతున్న స్థితిలో ఉన్న రాయన్న.. కుటుంబ సభ్యులెవరూ సాయం చేయడానికి ముందుకు రాని నేపధ్యంలో పరిస్థితులతో పోరాటానికి సిద్ధపడుతుంది కిరణ్మయి.

రాయన్న భార్యగా కాక, ఓ విద్యార్ధిని గా హాస్టల్లో చేరిన కిరణ్మయికి రాయన్నని అనుమానించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఓ పక్క రాయన్నకి కావాల్సిన మనో ధైర్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే, అతని నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు సేకరించడం మొదలు పెడుతుంది కిరణ్మయి. రాయన్న అపురూపలక్ష్మికి 'కొంత' సన్నిహితుడన్న విషయం తెలిసినప్పుడూ, ఆ అమ్మాయి రాయన్నని ప్రేమించిందన్న నిజం బయట పడినప్పుడు కలత చెందుతుంది కిరణ్మయి. అంతమాత్రాన తన బాధ్యతని మరచిపోదు. హాస్టల్ అమ్మాయిలతో స్నేహం చేసి జరిగినదేమిటో తెలుసుకుంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ నవల 'లేడీస్ హాస్టల్' చదివిన ప్రతి ఒక్కరినీ చాలా రోజులపాటు వెంటాడే పాత్ర కిరణ్మయి. తనదైన శైలిలో ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు యండమూరి.

ప్రతి అంశాన్నీ తనదైన దృక్కోణం నుంచి ఆలోచించడం, మానసికంగా బలహీనమైనప్పుడు సైతం ఆలోచనల్లో లాజిక్ ని విడిచిపెట్టక పోవడం కిరణ్మయి ప్రత్యేకత. చివరి ఆధారం దొరికే వరకూ రాయన్న నేరం చేసే ఉండొచ్చన్న ఆలోచన ఏమూలో గుచ్చుతూనే ఉంటుంది ఆమెని. వైవాహిక జీవితాన్ని గురించి సంతోషంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపాటులా అనిపించే భర్త అరెస్టు మొదలు, ఇంటా బయటా అతనిపై వచ్చిన నిందలు, చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపాలు మరోసారి బహిర్గతం అవడం వల్ల కలిగే శూన్యత.. వీటన్నింటినీ ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించిన కిరణ్మయి ని అభినందించకుండా ఉండలేం. ('లేడీస్ హాస్టల్,' రచన: యండమూరి వీరేంద్రనాథ్, 'నవసాహితి' ప్రచురణ, వెల రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

ఆదివారం, నవంబర్ 15, 2009

సుమన్ బాబు

ఉదయాన మగత నిదుర చెదిరిపోయిన వేళ 'ఈనాడు' చూసి ఉలిక్కి పడ్డాను.. 'ఈనాడు' అంటే కమల్ హాసన్-వెంకటేష్ బాబు సినిమా కాదు.. దిన పత్రిక. ఉలికిపాటుకి కారణం సినిమా పేజీలో 'నాన్ స్టాప్' వినోదం హెడ్డింగ్ తో వచ్చిన వార్త. ఇన్నాళ్ళూ 'ఈటీవీ' సుమన్ గా మనందరికీ చిర పరిచితుడైన సుమన్ 'సుమన్ బాబు' గా మారాడన్నది ఆ వార్త చదివాక నాకు అర్ధమైన మొదటి విషయం. నిర్మాతల కొడుకులు, హీరోల కొడుకులు 'బాబు'లవ్వడం తెలుగు సినిమా పరిశ్రమలో మామూలు విషయమే కాబట్టి ఉలికిపాటు అందుక్కాదు.

భారీ పౌరాణిక చిత్రం 'ఉషాపరిణయం' తర్వాత, సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ తన రెండో ప్రయత్నంగా నిర్మించిన 'నాన్ స్టాప్' సినిమా త్వరలో విడుదల కాబోతోందన్నది ఆ వార్త సారాంశం. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు, సంగీతం, దర్శకత్వం వంటి తెర వెనుక బాధ్యతలతో పాటు తెరపై నటించడం లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సుమన్.. సారీ సుమన్ బాబు.. ఈ సినిమాకి కేవలం నిర్మాత బాధ్యతను మాత్రమే తీసుకున్నారు. ఇంత షాకింగ్ వార్త తెలిశాక ఉలికి పాటు కలగదూ మరి??

సుమన్ బాబు సినిమాకి ఎవరో కథ, మరెవరో మాటలు, ఇంకెవరో పాటలు రాయడం, ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం నాకస్సలు మింగుడు పడలేదు. సకల కళల సవ్యసాచి అయిన సుమన్ బాబు, అజ్ఞాత వాసం లో అర్జునుడు బృహన్నల వేషం వేసినట్టుగా ('ఉషాపరిణయం' లో తను కూడా బృహన్నల వేషం లో ఓ మెరుపు మెరిశాడు) ఇలా తన టాలెంట్స్ అన్నింటినీ దాచేసుకోవడం విధి చేయు వింత కాక మరేమిటి? కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమైతే ఏదో ఒకటి.. మహా అయితే రెండు బాధ్యతలను కొత్త వాళ్లకి ఇవ్వొచ్చు.. అంతేకానీ తను ఒకేఒక్క బాధ్యతకి పరిమితమైపోతే ఎలా??

అభిమానులంతా 'ఉషాపరిణయం' మొదటి రోజే చూశారంటే అందుకు కారణం తెరమీద, తెర వెనుక సుమన్ బాబు అన్నీ తానే అవ్వడం వల్లనే.. (తర్వాతి రోజు సినిమా ఉంటుందో ఉండదో అనే అనుమానం వల్ల.. కూడా అని కొందరు గిట్టని వాళ్ళు గొణుగుతున్నారు కానీ అవన్నీ పట్టించుకోనవసరం లేదు) మరిప్పుడు సుమన్ బాబు కేవలం నిర్మాత పాత్రకే పరిమితమైతే ఈ సినిమా చూడాలనిపిస్తుందా? సాంకేతిక వర్గం మాత్రమే కాదు, నటీనటులు కూడా అందరూ కొత్తవాళ్ళేట.. అనుభవజ్ఞుడైన సుమన్ కూడా నటించి ఉంటే వాళ్లకి ఎంత ఉత్సాహం గా ఉండేది? అతన్నుంచి వాళ్ళు ఎన్ని విషయాలు నేర్చుకుని ఉండేవాళ్ళు?

మానవుడు ఆశాజీవి కాబట్టి, నేను కూడా మానవుడినే కాబట్టి నాకో ఆశ కలుగుతోంది. పేపర్లో వేసిన ఫోటోలో సుమన్ బాబు కొత్త గెటప్ లో కనిపించాడు.. నిజం చెప్పాలంటే కొంచం ఒళ్ళు చేసిన శ్రీకాంత్ లా అనిపించాడు. (శ్రీకాంత్ అభిమానులూ.. ఇది కేవలం అభిమానం తో చెబుతున్న మాట) బహుశా 'నాన్ స్టాప్' లో తను ఏదైనా 'ప్రత్యేక' పాత్ర పోషించి ఉండొచ్చేమో కదా.. ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుతారేమో.. కేవలం నా ఊహాగానమే సుమా.. నిజమైతే బాగుండును కదా..

అన్నట్టు 'నాన్ స్టాప్' సినిమా కి కామెడీ అనే ఉప శీర్షిక ఉందిట.. టైటిల్స్ లో సుమన్ బాబు పేరుండగా ఇంక కామెడీ అని ప్రత్యేకంగా చెప్పాలా? కొత్త దర్శకుడి పిచ్చితనం కాకపొతే.. కామెడీ తో పాటు సస్పెన్స్ కూడా ఉంటుందిట సినిమాలో.. సుమన్ బాబు తెర మీద కనిపిస్తాడో లేదో అన్న సస్పెన్స్ ఉండనే ఉంది కదా. తెలుగు తో పాటు తమిళంలోనూ విడుదల చేస్తారుట. ఇలా రెండు భాషల్లో సినిమా నిర్మించడం నిర్మాత పరిణతి కి నిదర్శనం కాదూ?

ఇంద్రనాగ్ అనే కుర్రాడు స్క్రీన్ ప్లే రాశాడుట. ఇంకా క్రియేటివ్ డిజైనర్, ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు కూడా చూశాడుట. ఈటీవీ లో చూసిన ముఖమే.. విధి విలాపం వల్ల ప్రభాకర్ దూరమయ్యాక, ఇప్పుడా పాత్ర(ల)ని తనే పోషిస్తున్నాడుట ఈ కుర్రాడు.. అంటే సుమన్ బాబు రాముడైతే ఇతను సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అన్నమాట. ఆడియో వచ్చే శనివారం వస్తుంది.. సినిమా కోసం మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.

శుక్రవారం, నవంబర్ 13, 2009

పోలిస్వర్గం

దీపావళి బాణాసంచా అంతా ఆనందంగా కాల్చేసి భోజనం కానిచ్చి ముసుగుతన్ని పడుకున్నానా.. అసలే చలికాలం అవడం వల్ల వెంటనే నిద్ర పట్టేసిందా.. బుగ్గ మీద చల్లటి చెయ్యి తగలడం తో మెలకువ వచ్చేసింది. అప్పుడు నాకు ఏడేళ్ళు. ఆ చెయ్యి అమ్మది. అమ్మేమీ మాట్లాడకుండానే నాకు విషయం అర్ధమయిపోయింది. కప్పుకున్న దుప్పటినే నెత్తి మీదనుంచీ ముసుగులా వేసుకుని, ఓ చేత్తో చివర్లో ఇత్తడి తొడుగు తొడిగిన పేద్ద కర్రా, మరో చేత్తో లంతరూ పట్టుకుని బయలుదేరాను. నా వెనుక పూజ సామాన్ల బుట్టతో అమ్మ.

చప్పుడవకుండా తలుపు దగ్గరగా వేసి, ఇంటి ముందు రోడ్డు దాటగానే చెరువు. చెరువు గట్టు మీద మెట్లలా పరచిన రాళ్ళ మీద కర్ర చప్పుడు చేసుకుంటూ నేను.. లాంతరు వెలుగులో నా వెనుక జాగ్రత్తగా నడుస్తూ అమ్మ. అమ్మని ఒక నిమిషం ఆగమని సైగ చేసి, నేను చివరి మెట్టు వరకూ దిగి, కర్రతో రాళ్ళు తట్టి, నీళ్ళని రెండు మూడు సార్లు కదిపి, గట్టు మీదకి వచ్చి కూర్చున్నాను. మెట్ల మీద పాములేవైనా నిద్ర పోతూ ఉంటే ఆ చప్పుళ్ళకి చెర్లోకి వెళ్లిపోతాయన్న మాట.

నేనేమో చలికి పళ్ళు కొరుక్కుంటూ గట్టు మీద కూర్చున్నానా, అమ్మ 'కార్తీక దామోదరుడా.. మోక్షగుండ దామోదరుడా.. ' అనుకుంటూ నీళ్ళలోకి దిగి, మూడు మునకలు వేసి, తడి చీరతో గట్టు మీదకి వచ్చి లాంతరు వెలుగులో పూజ మొదలు పెట్టేస్తుంది. నేను కునికి పాట్లు పడుతూనే అమ్మ 'నైవేద్యంబిదిగో..' పాడేస్తుందేమో అని ఒక చెవి అటు వేసి ఉంచడం. ముందు రోజు సాయంత్రమే సంపాదించి పెట్టుకున్న అరటి దొప్పలో దీపం వెలిగించి అమ్మ ఆ పాట పాడుతూ గంట వాయించేస్తుందన్న మాట.

మరి నాకేంటి లాభం? అంటే.. ఉంది కదా.. ఇంట్లోనుంచి జాగ్రత్తగా తెచ్చిన చిన్న బెల్లం ముక్కని తమలపాకులో నైవేద్యం పెట్టేది దేవుడికే అయినా, 'ప్రసాదం' ఆరగించేది నేనే కదా.. నల్లటి చెరువు మీద తెల్లటి మంచు కురుస్తూ ఉంటుందా.. అరటి దొప్పలో వెలిగించిన దీపం మెరుస్తూ నీళ్ళలోకి వెళ్తుంటే ప్రసాదం చప్పరిస్తూ చూడడం భలేగా ఉంటుంది.. చెరువులో చేపలు దీపాన్ని ఎక్కువ దూరం వెళ్ళనివ్వవు.. దీపాన్ని తినడానికి ప్రయత్నించి ఆర్పేస్తాయి.. తప్పు తప్పు.. దీపం కొండెక్కిపోయింది అనాలి. దీపం కొండెక్కే వరకూ ఉండి, అప్పుడు ఇంటికి వెళ్ళాలి మేము. అది మొదలు కార్తీక మాసం నెల్లాళ్ళూ దిన చర్య ఇలాగే ఉండేది చిన్నప్పుడు.. అంటే నా ఐదో ఏటి నుంచి దాదాపు పదేళ్ళు.

ప్రసాదం ఒక్కటేనా? తెల్లవారు జామునే అమ్మకి సాయం వెళ్లాను కాబట్టి మరో అరగంటో, గంటో ఆలస్యంగా లేవొచ్చు. ప్రసాదం తో పాటు క్షీరాబ్ది ద్వాదశి కి, పున్నమికి, పోలిస్వర్గానికి ఐదేసి పైసల చొప్పున దక్షిణ కూడా దొరికేది. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించేది అమ్మ. పున్నమికి అయితే ఇంటి పక్కనే జ్వాలా తోరణం జరిగేది. అంటే ఒక పేద్ద వెంటిని (ఎండుగడ్డి తో పేనిన లావుపాటి తాడు) తోరణంలా కట్టి వెలిగించి, మంటల్లోనుంచి దేవుడి పల్లకితో పాటు మూడు సార్లు 'హర హర మాహాదేవ' అంటూ తిరగాలన్న మాట. ఈ కార్యక్రమం రాత్రి పూట చంద్ర దర్శనం అయ్యాక జరుగుతుంది.

పున్నమి స్పెషల్ చలివిడి. అమ్మ ఉపవాసం ఉండి పిండి కొట్టి చలివిడి చేసుకునేది.. సారెల్లో పంచి పెట్టే చలివిడి కన్నా ఈ చలివిడి చాలా రుచిగా ఉండేది. కొంచం పెద్ద క్లాసుల్లోకి వచ్చాక కార్తీక మాసం నుంచి మరిన్ని లాభాలు పొందొచ్చని తెలిసింది. మామూలుగానే నాకు చిన్నప్పుడు సోమవారం బడికి వెళ్ళాలంటే భలే చిరాగ్గా ఉండేది.. ఆదివారం అంతా ఆటల్లో గడపడం వల్ల సోమవారం కూడా ఇంట్లో ఉండి పోవాలనిపించేది. కార్తీక మాసం ఐతే 'అమ్మా నేను కూడా ఉపవాసం ఉంటానమ్మా..' అంటే చాలు అమ్మ నా భక్తికి బోల్డంత మురిసిపోయి అయితే ఇవాళ బడి మానేయ్ అని అడక్కుండానే పర్మిషన్ ఇచ్చేసేది. హైస్కూలుకి వచ్చాక అమ్మకి కొంచం మస్కా కొట్టి దక్షిణ రోజూ ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాను. అంటే రోజూ ఐదు పైసలన్నమాట.

మొదటి వారంలో ఉదయాన్నే లేవడం కొంచం ఇబ్బందిగా ఉండేది కానీ, త్వరలోనే అలవాటైపోయేది. ముఖ్యంగా అమ్మ చెర్లోకి వదిలిన కార్తీక దీపాన్ని ఎంతసేపైనా చూడాలనిపించేది. కార్తీక మాసానికి అలవాటు పడేలోగానే 'పోలిస్వర్గం' వచ్చేసేది.. అంటే మరేమిటో కాదు కార్తీక అమావాస్య. ఆరోజు తెల్లవారు జామున మా వీధి మహిళలంతా పిల్లలని తోడు తీసుకుని స్నానానికి వచ్చే వాళ్ళు, చెరువుకి. వాళ్ళంతా స్నానం, పూజ లో ఉంటే మేమంతా చలిమంటలు వేసుకునే వాళ్ళం. ఓ పక్క పూజలు అవుతుండగానే ఎవరి ప్రసాదం ఏమిటో ఎంక్వయిరీలు చేసుకునే వాళ్ళం.

పోలిస్వర్గం రోజున ఒక్కొక్కరూ రెండు మూడు రకాల ప్రసాదాలు పెట్టేవాళ్ళు. అరటిపండు ముక్కలు, జాంపండు ముక్కలు ఇలా అన్నమాట.. ఇక చలివిడి, వడపప్పు సరేసరి. పిల్లలందరం రాజ్యంగారి ప్రసాదం కోసం ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళు కొంచం గొప్పవాళ్ళన్న విషయం ఆవిడ ఎప్పుడూ గుర్తు పెట్టుకునేవారు. అందుకే ప్రసాదాలు కూడా అందర్లా కాకుండా యాపిల్ ముక్కలు, కమలా ఫలం తొనలు ఇలా కొంచం ఘనంగా ఉండేవి. అంతేనా.. ఆవిడ దక్షిణ పది పైసలు మొదలు పావలా వరకూ ఉండేది, తీసుకునే పిల్లల వయసును బట్టి.

మిగిలిన రోజుల్లా కాకుండా, పోలిస్వర్గం రోజున ఒక్కొక్కరూ ముప్పై కి తక్కువ కాకుండా దీపాలు వదిలేవాళ్ళు. చెరువంతా భలే మెరిసిపోయేది దీపాలతో. పూజ అయ్యాక ఒక కథ చెప్పుకుని అప్పుడు దీపాలు వదిలేవాళ్ళు. ఆ కథ ఏమిటంటే ఒక ఊళ్ళో ఓ మడేలమ్మ ఉంటుంది. ఆవిడకి బోల్డంత భక్తి. కార్తీక మాసం నెల్లాళ్ళూ తెల్లవారు జామునే దగ్గర్లో ఉన్న నదికి వెళ్లి స్నానం చేసి, దీపం వదిలి ఇంటికి వచ్చేది. అయితే ఆవిడ చాలా గయ్యాళి. తన కోడలు 'పోలి' కి కూడా యెంతో భక్తి ఉన్నా, ఆ అమ్మాయిని స్నానానికి తీసుకెళ్ళేది కాదు. అత్తగారికి ఎదురు చెప్పలేక పోలి బోల్డంత బాధ పడేది.

అమావాస్య రోజున అత్తగారు స్నానానికి వెళ్ళాకా, ఒక్క రోజు కూడా దీపం వదల్లేక పోయానే అని పోలి బోల్డంత బాధ పడి, ఇంట్లోనే స్నానం చేసి, వంటింట్లో కవ్వం చివర ఉన్న వెన్నతో దీపం వెలిగించి ఊరందరి బట్టలూ ఉతికే మట్టి బాన లో నీళ్ళు నింపి అందులో దీపం వదులుతుంది. వెంటనే దేవుడు విమానంలో వచ్చి 'పోలీ నీ భక్తి కి మెచ్చాను.. స్వర్గానికి తీసుకెళ్తాను' అంటాడు. అప్పుడే నది నుంచి వచ్చిన అత్తగారు అడ్డుపడి 'మరి నేను రోజూ దీపం వదిలాను కదా' అని వాదిస్తుంది. అప్పుడు దేవుడు 'నాకు భక్తి ప్రధానం.. పోలి భక్తితో వదిలిన దీపమే గొప్పది..' అని చెబుతాడు. అప్పుడు పోలి 'మా అత్తగారిని కూడా తీసుకొస్తేనే నేను స్వర్గానికి వస్తాను' అంటుంది. దేవుడు వాళ్ళిద్దరినీ స్వర్గానికి తీసుకెళ్తాడన్న మాట.

ఈ కథ చెప్పి అమ్మ, అమ్మ ఫ్రెండ్సు అత్తగార్లు ఎన్ని బాధలు పెట్టినా కోడళ్ళు వాళ్ళ మంచే కోరతారు అని జోకులు వేస్తే, రాజ్యం గారిలాంటి వాళ్ళు తిరిగి ఏదో సమాధానం చెప్పేవాళ్ళు. మేమేమో 'మన గుర్రమ్మని వాళ్ళ కోడలే స్వర్గానికి తీసుకెళ్లాలన్న మాట' అనుకునే వాళ్ళం. 'అంబ నీకిదిగో హారతీ..' 'క్షీరాబ్ది కన్యకకు..' లాంటి పాటలు పాడి అప్పుడు దీపాలు వదిలేవాళ్ళు.

ఆవేళ బళ్ళో మేము ఎవరికి ఎవరు ఎన్ని డబ్బులిచ్చారో లెక్కలేసుకునే వాళ్ళం. నాకోసారి పోలిస్వర్గం కథ విన్నాక ఓ డౌటు వచ్చింది. ఆడ వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళారు సరే.. మరి వాళ్ళింట్లో మగవాళ్ళకి స్వర్గం వద్దా? అని. ఇంటికొచ్చాక అమ్మని ఈ డౌట్ అడిగితే, నాన్న విని 'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగాళ్ళకి ఇంక ఇల్లే స్వర్గం..' అన్నారు. ఆ జోకు అర్ధం కావడానికి మరి కొన్నేళ్ళు పట్టింది నాకు.

గురువారం, నవంబర్ 12, 2009

పిల్లల పండుగ

రెండు రోజుల్లో బాలల దినోత్సవం వచ్చేస్తోంది. మన నాయకులకి నెహ్రూనీ, ఆయన వారసులనీ ఘనంగానూ, పిల్లలని కంటి తుడుపుగానూ తల్చుకోడానికి ఓ అవకాశం వస్తోంది. బొత్తిగా పిల్లలకోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదని జనం అనుకోకుండా పిల్లల కోసమని రాష్ట్ర రాజధానిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరపడానికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మరి ఆ సినిమాలు చూడడానికి అవకాశం లేని పిల్లల కోసం ప్రభుత్వం ఏమీ చేయనట్టే కదా.. అని అడక్కూడదు. ఆరోజు స్కూళ్ళకి సెలవు ఇస్తోంది.. ఇంకేం కావాలి??

అసలు పిల్లల కోసం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే పిల్లలే భవిష్యత్తు కాబట్టి. మన ఇంటికైనా, మన దేశానికైనా భవిషత్తు పిల్లలే కదా. మరి పిల్లల కోసం ఆలోచించడం అంతే రేపటి రోజు కోసం ఆలోచించడమే కదా? మన పిల్లలకోసం మనం ఆలోచిస్తున్నట్టే, మొత్తం అందరు పిల్లల గురించీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా మరి? ఆలోచించడం అంతే, 'బడి బాట' 'మళ్ళీ బడికి' లాంటి పేరు గొప్ప ప్రోగ్రాములు ప్రకటించి ఊరుకోవడమేనా? వాటి అమలు సంగతి పట్టించుకోవాలా, వద్దా?

అక్షరాస్యత లాంటి విషయాల్లో వెనుకబడిఉన్న ఆంధ్ర దేశం, బాలకార్మికుల సంఖ్య విషయంలో మాత్రం ముందుంది. చవకగా దొరికే కూలీలు, చెప్పిన పని కిమ్మనకుండా చేస్తారు, ఇచ్చింది పుచ్చుకుంటారు, పెద్దల యందు ఉండే భయం వల్ల జాగ్రత్తగా పని చేస్తారు.. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే కాబోలు పొలాల్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ, చివరికి ఇళ్ళలో కూడా చిన్న పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. పిల్లలు పని చేస్తున్నారు అంటే, కేవలం వయసుకు మించి శ్రమ పడుతున్నారు అని మాత్రమే కాదు.. భవిష్యత్తు అనేది లేకుండా చేసేసుకుంటున్నారు కూడా. చదువనేదే లేకపోవడం వల్ల వాళ్లకి ఎప్పటికీ కూలి పని తప్ప మరో ప్రత్యామ్నాయం దొరకదు కదా..

బాలకార్మిక వ్యవస్థని రూపుమాపడం కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఎందుకు విజయవంతం కావడం లేదు? రెండు కారణాలు కనిపిస్తాయి. పథక రచనలో పొరపాట్ల కారణంగా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనిపిస్తుంది. పిల్లలు పనికి వెళ్లడానికి మూల కారణం పేదరికం. తల్లిదండ్రుల సంపాదన కుటుంబం గడవడానికి సరిపోకపోవడం. ఇంకొంచం లోతుకి వెళ్తే తండ్రి సంపాదన తాగుడుకి పోగా, కేవలం తల్లి సంపాదనతోనే కుటుంబం గడవాల్సి రావడం. అసలు జబ్బుకి చికిత్స చేయకుండా పైపైన మందు పూయడం వల్ల రోగం పూర్తిగా తగ్గదు కదా. పోనీ ఆ మందైనా సక్రమంగా పూస్తున్నారా అంటే, పథకాల అమలులో వైఫల్యాలు బోల్డన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా జవాబుదారీ తనం కనిపించదు.

ప్రతి విషయానికీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమేనా? మనం ఏమీ చేయలేమా?? కచ్చితంగా చేయగలం. పనిమనిషి పిల్లలు వాళ్ళమ్మ వెనుక వచ్చి మనింట్లో పని చేయకుండా మనం ఆపగలం. మన వీధి చివర టీకొట్లో చిన్న పిల్లాడు టీలు అందిస్తుంటే, అతన్ని మానిపించే వరకూ ఆ కొట్టుకి రానని చెప్పగలం. ఏదైనా షాపులో చిన్న పిల్లలని పనిలో చూస్తే, ఆ యజమానితో మాటకలిపి మాటల మధ్యలో పిల్లలని పనిలో పెట్టుకుంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెడతారని చెప్పగలం. పని మానేసిన పిల్లలు బడికి వెళ్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించగలం. వీటన్నింటితో పాటు ప్రభుత్వం చేత పని చేయించడానికి ఏదైనా మార్గమూ ఆలోచించగలం. ఇదంతా స్వార్ధానికి అతీతంగా కాదు.. రేపటి రోజు బాగుండాలనే స్వార్ధం తోనే..

మంగళవారం, నవంబర్ 10, 2009

నవ్వినా కన్నీళ్ళే..

ఒకటి కాదు.. రెండు కాదు.. పద్దెనిమిదేళ్ళ నా నిరీక్షణ ఫలించింది. అవును 'నవ్వినా కన్నీళ్ళే..' అనే నవల కోసం నేను అక్షరాలా పద్దెనిమిదేళ్ళు ఎదురు చూశాను.. ఎన్నో చోట్ల వెతికాను.. యెంతో మందిని అడిగాను. చివరికి చాలా యాదృచ్చికంగా నిన్న సాయంత్రం నా కంట పడింది ఈ పుస్తకం. ఇంతకీ ఏమిటీ నవల ప్రత్యేకత? సమాధానం ఒకే ఒక్క మాట.. ఈ నవల ఆధారంగానే 'సీతారామయ్య గారి మనవరాలు' అనే సినిమా తీశారు.

మొదటిసారి సినిమా చూడడం పూర్తవ్వగానే నేను చేసిన మొదటి పని కథ ఎవరిదీ అని ఎంక్వయిరీ చేయడం. 'మానస' రాసిన 'నవ్వినా కన్నీళ్ళే..' నవల ఆధారం గా సినిమా తీశారని తెలిసింది. అది మొదలు ఆ నవల చదవాలని ప్రయత్నం. ఆ నవల 'ఆంధ్ర ప్రభ' లో ప్రచురించారని తెలిసి ఆ దిశగానూ ప్రయత్నాలు చేశాను..ప్చ్.. దొరకలేదు. గత పద్ధెనిమిదేళ్ళలోనూ సినిమాని వందల సార్లు (అక్షరాలా కొన్ని వందల సార్లు) చూశాను.. టైటిల్స్ చూసిన ప్రతిసారీ ఒకటే అసంతృప్తి.. నవల చదవలేక పోయాను కదా అని..

నిన్న సాయంత్రం పుస్తకాల షాపుకి వెళ్లి, ముందుగా అనుకున్న రెండు పుస్తకాలూ తీసుకుని, కొత్తగా ఇంకేం వచ్చాయా అని చూస్తున్న సమయంలో బాపు కవర్ పేజీతో వచ్చిన ఓ బరువైన పుస్తకం నా దృష్టిలో పడింది. పుస్తకం పేరు 'మదర్పిత...తాంబూలాది...' కథల సంపుటం. రచన 'మానస' . బుర్రలో బల్బు వెలిగింది.. నేను వెతుకుతున్న మానస ఈ మానస ఒక్కరే అయితే తప్పకుండా 'నవ్వినా కన్నీళ్ళే..' గురించిన వివరం ఈ పుస్తకంలో దొరుకుతుంది.

ఓ పక్కగా నిలబడి ముందుమాట చదువుతూ, ఎగిరి గంతెయ్యాలనే కోరిక బలవంతంగా అణచుకున్నాను. ముందుమాట లోనే నాక్కావలసిన వివరం దొరికేసింది.. అంతే కాదు.. అదే పుస్తకం చివర్లో ఆ చిన్న నవలనీ జత చేశారన్న తీపి కబురు కూడా . తర్వాత నేను ఏంచేశానో వివరంగా రాయక్కర్లేదు.. ఓ నవలని సినిమాగా తీసినప్పుడు చాలా మార్పులు, చేర్పులు చేస్తారాన్ని విషయాన్ని బాగా గుర్తు చేసుకుని చదవడం మొదలు పెట్టాను.

కథానాయిక సమీర పాతికేళ్ళ అమ్మాయి. బెజవాడ లోని తాతగారింట్లో తన మేనత్త కూతురి పెళ్ళికి అమెరికా నుంచి వస్తుంది. పెళ్ళికూతురు మినహా మిగిలిన బంధువులంతా ఆమెని ఆహ్వానించడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తారు. మద్రాస్ విమానాశ్రయంలో ఆమెని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళిన పెద్ద బావ సుందర్ ఇంటి పరిస్థితి అంతా వివరంగా చెబుతాడు సమీరకి.

తాతగారు పరంధామయ్య (ఈ పేరు సాహిత్యం లో మాత్రమే కనిపిస్తుంది) ఎనభై కి దగ్గర్లో ఉంటే బామ్మ అనసూయమ్మకి డెబ్బై దాటేశాయి. సమీర తలిదండ్రులు ఇండియా వదిలి వెళ్ళిపోడానికి కారణం ఆమె తండ్రి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వర్ణాంతర వివాహం చేసుకోవడమే. తాతగారు మనవరాలికి కుటుంబంలో కలుపుకోలేరు, ఆమె తల్లిది వేరే కులం అన్న కారణంగా..

బామ్మగారికి మాత్రం సమీరని సుందర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. ఇందుకోసం ఒక వృధా ప్రయత్నం కూడా చేస్తుంది ఆవిడ. సుందర్, అతని తమ్ముళ్ళ ప్రేమ కథలు, సమీర కాలేజీ లెక్చరర్ గా పనిచేయాలనుకోవడం, అక్కడి సమస్యలు, ఆమె మేనమామ రాజశేఖరం కుటుంబం.. ఇలా నవల్లో ఎన్నో కొత్త పాత్రలు, కొత్త సన్నివేశాలు ఉన్నాయి.

తాతయ్య-బామ్మ లతో మనవరాలి అనుబంధాన్ని రేఖామాత్రంగానే స్పృశించారు. అనసూయమ్మగారి హఠాన్మరణంతో యోగిగా మారిపోతారు పరంధామయ్యగారు. సమీర తలిదండ్రులు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన ప్రమాదం లో మరణించారన్న నిజం సుందర్ కి తెలియడమే నవల ముగింపు. ఊహించినట్టుగానే నవలకీ, సినిమాకీ చాలా భేదం ఉంది. అయితేనేం.. ముందుమాటలో అవసరాల రామకృష్ణారావు చెప్పినట్టు 'నవ్వినా కన్నీళ్ళే..' నవల లేకపొతే 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా లేదు.

దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం రాసిన ఈ నవల అప్పట్లో 'ఆంధ్రప్రభ' నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి గెలుచుకుంది. 'మానస' అన్నది రచయిత ఉన్నవ వెంకట హరగోపాల్ కలం పేరు. స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన హరగోపాల్ తన భార్య 'మానస' పేరు మీద రాశారీ నవలని అప్పట్లో. ఈ నవలని సినిమా కథగా మార్చి యెంతో మందిని కలవడం, చివరికి క్రాంతికుమార్ సినిమా గా తీయడం, ఆనాటి తన అనుభవాలు, అనుభూతులు ముందుమాటలో రాసుకున్నారు రచయిత.

నాకైతే నవల చదువుతున్నంత సేపూ సినిమా కోసం కీరవాణి చేసిన నేపధ్య సంగీతం చెవుల్లో వినిపిస్తూనే ఉంది. దానికి తోడు మొన్నరాత్రే సినిమాని మరో సారి చూశాను, కాకతాళీయంగా.. ఈ నవలతో పాటుగా 'మదర్పిత..తాంబూలాది..' తో సహా నలభై కథలున్నాయి.. వాటన్నింటినీ చదవాల్సి ఉంది, వరుసగా... ('మదర్పిత..తాంబూలాది..' పేజీలు 422, వెల 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

ఆదివారం, నవంబర్ 08, 2009

ఊరి చివరి ఇల్లు

హోరున కురిసే వర్షం.. చిమ్మ చీకటి.. ఊరికి దూరంగా ఉన్న ఒంటరి ఇల్లు.. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులు.. ఎవరికి ఎవ్వరూ ఏమీ కారు. ఆ రాత్రి వాళ్ళ జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందన్నదే దాదాపు యాభయ్యేళ్ళ క్రితం తిలక్ రాసిన 'ఊరి చివరి ఇల్లు' కథ. కవిత్వం లాగే కథలమీదా తనదైన ముద్ర వేసిన రచయిత తిలక్. వచనమైనా, కవిత్వమైనా భావుకత్వం ఆయన కలం నుంచి పరవళ్ళు తొక్కుతుంది. మానవ మనస్తత్వ చిత్రణ మీద తిలక్ కి ఉన్న పట్టు కి పరాకాష్ట ఈ కథ.

రమ ఓ పాతికేళ్ళ యువతి. ఆమెది ఓ బరువైన గతం. మూడు నెల్ల పసికందుని కోల్పోయిన గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఇంత బాధ లోనూ ఆమె కళ్ళు 'విజయుడి' కోసం వెతుకుతూనే ఉన్నాయి. నిజానికి ఆ 'ఊరి చివరి ఇల్లు' రమ ది కాదు. ఆమె స్థితికి జాలిపడీ, తనకి పనికొస్తుందన్న ఆశ తోనూ ఆమెకి ఆఇంట్లో ఆశ్రయమిచ్చింది 'ముసిల్ది.' ఎందుకంటే జీవితపు చివరి రోజుల్లో తన బాగోగులు చూసే మనిషి కావాలి ముసిల్దానికి. రమ అందం, వయసు, అసహాయత చూశాక నమ్మకం కలిగింది, ఆమె తనని చూసుకోగలదని.

మన్నూ మిన్నూ ఏకమయ్యేలా వర్షం కురుస్తూనే ఉంటుంది బయట.. ఆ వర్షాన్ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది రమ. వర్షం ఆమెని గతంలోకి తీసుకు పోతుంది. 'ఆరోగ్యం పాడైపోతుంది పిల్లా.. శాలువా కప్పుకో..' అన్న ముసిల్దాని మాటలు లెక్క పెట్టదు రమ. వర్షానికి అడ్డం పడి రోడ్డున వెళ్తున్న నిలువెత్తు మనిషి ఉన్నట్టుండి రమ కంటపడతాడు, ఆ సంజెవేళ. వర్షంలో చిక్కుకుపోతాడేమో అన్న భయంతో అతన్ని ఇంటికి పిలుస్తుంది రమ. ఆజానుబాహుడైన అతనిలో తన 'విజయుడి' పోలికలు చూసి కలవర పడుతుంది. ఆ రాత్రి తన ఇంట ఉండి మర్నాడు ఉదయం రైలుకి వెళ్ళమంటుంది అతన్ని.

రమ కలవరపాటుని గుర్తిస్తాడతను. అతని పేరు జగన్నాధం. తనకంటూ ఎవరూ లేని జీవితం అతనిది. ఎక్కడా స్థిరంగా ఉండే మనస్తత్వం కాదు జగన్నాధానిది. అతని పట్ల యెంతో ఆదరం చూపుతుంది ముసిల్ది. వేడి వేడిగా వండి పెడుతుంది. పక్క సిద్ధం చేస్తుంది. రమ కూడా అతని పట్ల అభిమానంగా ఉంటుంది. అతను తన విజయుడేమో అన్న ఆశ ఏ మూలో మినుకు మినుకు మంటూ ఉంటుంది ఆమెకి. బయట వర్షం ఆగాగి కురుస్తూ ఉంటుంది.

ఓ రాత్రి వేళ తను గాఢ నిద్రలో ఉండగా రమ లాంతరుతో వచ్చి తన ముఖాన్ని పరిశీలనగా చూడడం గమనిస్తాడు, అప్పుడే మేల్కొన్న జగన్నాధం. ఆమెకి తన గతం చెబుతాడు.. ఇంట్లోనుంచి పారిపోయి సైన్యంలో చేరిన వైనాన్ని వివరిస్తాడు. 'విజయుడు కూడా సైన్యంలోకే వెళ్ళాడు' అంటుంది ఆమె. ఓ స్నేహితుడిని చూడడం కోసం అతని ఊరికి వెళ్లి, అతను చనిపోయాడని తెలిసి అక్కడ ఉండడానికి మనస్కరించక తిరుగు ప్రయాణంలో ఆ ఊళ్ళో, ఆమె ఇంట్లో ఎలా చిక్కుకు పోయాడో చెబుతాడు జగన్నాధం.

అతను తనకి దగ్గరవాడు గా అనిపించడం తో తన గతాన్ని పంచుకుంటుంది రమ. అనాధ శరణాలయం లో కష్టాలు, విజయుడి స్నేహం, ఎడబాటు, మరో మోసగాడి బారిన చిక్కిన వైనం, చివరికి ముసిల్దాని ఆశ్రయం పొందడం వరకూ ఏదీ దాచకుండా చెబుతుంది రమ. ఆమె కథ విని కరిగిపోతాడు జగన్నాధం.. ఆమెని వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిశ్చింతగా నిద్రపోతుంది రమ. గదిలో మాటల్ని బయటినుంచి వింటుంది ముసిల్ది. జగన్నాధాన్ని బయటికి పిలిచి మాట్లాడుతుంది.. ఫలితం..అతను అప్పటికప్పుడే పెట్టె తీసుకుని బయటకు నడుస్తాడు.. తర్వాత ఏం జరిగిందన్నది కదిలించే ముగింపు. తిలక్ కథలన్నింటిలోనూ నాకు ఈ కథంటే ప్రత్యేకమైన ఇష్టం.

శనివారం, నవంబర్ 07, 2009

ప్లంబరుడు

మా ఇంట్లో ట్యాప్ కి జలుబు చేసింది. శీతాకాలం లో మనుషులకి జలుబు చేయడం మామూలే కానీ, ఈసారి వెరైటీ గా ట్యాప్ కి జలుబు చేసింది. అదేదో యండమూరి సస్పెన్స్ నవల్లోలా ఠాప్ ఠాప్ ఠాప్ మంటూ ఒకటే చప్పుళ్ళు. చేతనైన వైద్యాలు చేసినా లాభం లేకపోవడం తో ప్లంబర్ ఆచూకీ వెతికి కాకి చేత కబురు పంపాను. యధాప్రకారం ప్లంబర్ రాలేదు. కబుర్లు మోసుకెళ్ళ లేక కాకులు నాకు కన్పించడం మానేశాయి. ఇక లాభం లేదని నేనే రంగం లోకి దిగాను.

నిన్న తనని కలిస్తే ఇవాళ తప్పక వస్తానని మాటిచ్చాడు. తన పేరు బాషా అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నిజానికి బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్టే.. కానీ, ఎందుకైనా మంచిదని ఉదయాన్నే నేనే బయలుదేరాను, బాషా ని తోడ్కొని రావడం కోసం. "ప్లంబరంటే డాక్టర్ లెక్క సార్.. మాతోని పనుంటే మా తానికే వస్తారు జనం.." ఇది బాషా మొదటి డైలాగు. కొంచం షాక్కొట్టినా తట్టుకున్నాను. అవసరం నాది కదా.

ఒక చిన్న చేతి సంచీ తో ఇంట్లోకి అడుగు పెట్టి నలు వైపులా కలియ చూసి, "ఇల్లు కట్టేది వేస్ట్ సార్.. ఏదొక ప్రాబ్లం ఉంటది.. అదే రెంట్ అనుకో.. ఏమొచ్చినా ఓనర్ చూస్కుంటడు" అని మరో విలువైన అభిప్రాయం ప్రకటించాడు. నిజానికి నేను మా ఓనర్ చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పనవ్వక పోవడం తో, బోల్డంత బిజీ గా ఉన్నా కూడా స్వయంగా ప్లంబర్ వేటకి బయలుదేరాను, 'చెవిలో జోరీగ' లాంటి పోరు పడలేక. అయాచితంగా నన్ను ఇంటికి ఓనర్ ని చేసేసినందుకు లోపల్లోపల సంతోష పడ్డాను.

"గిది మార్వాలే సార్.. నాతాన కొత్తదుంది" అని సంచిలోనుంచి ఓ ట్యాప్ తీశాడు. నాకు తెలియకుండానే నేను బాషా అసిస్టెంట్ గా మారిపోయాను. ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించి మాట్లాడడం గృహస్తు మర్యాద కదా.. అందుకని బాషా తో మాటకలిపాను. అతను చాలా స్వేచ్చా పిపాసి అనీ, బడి బందిఖానాలా అనిపించడం వల్ల చిన్నప్పుడే చదువు మానేసి ప్లంబింగ్ నేర్చుకున్నాడనీ తెలిసింది. ఒకే చోట ఉండడం తనకి చిరాకుట.. అందుకే ఊళ్ళు తిరుగుతూ ఉంటాడుట.

"సదివి బాగుపన్నోడెవడు సార్? ఎంత సదివినా ఒకని కింద నౌక్రీ నే సెయ్యాలి" మరో జ్ఞాన గుళిక ని ప్రసాదించాడు. "నా తమ్ముడు పది సద్విండు.. నౌక్రీ ల చేరిండు.. ఏం లాబం? పాణం బాలేకున్నా పనికి పోవాలె.. ఏడకీ పోనీకి లేదు.." అతనితో మాట్లాడడం కన్నా, చెప్పింది విని గమ్మునుండడం మంచిదని అభిప్రాయానికి వచ్చేశాను. "గదే నన్ను సూడండి.. నచ్చితే పని చేస్తా.. లేకుంటే ఫోన్ బంద్ చేస్తా.. ఎవడేమంటడు?" నేను ఓవర్ హెడ్ టాంక్ ఆపి, తను వదలమన్నప్పుడు నీళ్ళు వదిలే పనిలో ఉన్నాను. ట్యాప్ సెట్ అవ్వలేదు. మళ్ళీ బిగిస్తున్నాడు.

"పిల్లకాయలు సదువులు సదువులని తిరుగుతుంటే బాదేస్తాది సార్.. అంతా నౌక్రీ కోసం తిప్పల్లెక్క. గదే ఏదన్నా పని నేర్సుకున్నరనుకో, ఒకని తో పని లేకుండా ఆల్లే సంపాదిచ్చు కోవచ్చు కదా.. నా లెక్క పని చేసేటోనికి ఉన్న గౌరం, నౌకరి చేసేటోనికి ఏడికెల్లి వస్తది సారూ?" అతను పని పూర్తి చేసి చేతులు తుడుచుకుంటున్నాడు. నేను 'ఉషాపరిణయం' క్లైమాక్స్ లో సుమన్ గారి విశ్వరూపం చూసినప్పుడు కూడా అంతగా చేష్టలుడిగి పోలేదు. మనం జీవితంలో ఎంతమందినో కలుస్తూ ఉంటాం.. కొందర్ని ఆలస్యంగా.. ఇతన్నైతే జీవిత కాలం లేటుగా.. డబ్బులిచ్చి బాషా ని పంపించాను.

గురువారం, నవంబర్ 05, 2009

విలేజ్ లో వినాయకుడు

తొలి సినిమా తో తనని తాను నిరూపించుకుని ప్రేక్షకుల రివార్డు తో పాటు ప్రభుత్వ అవార్డునూ అందుకున్న దర్శకుడు తనే నిర్మాతగా మారి తీస్తున్న రెండో సినిమా. అది కూడా మొదటి సినిమాకి సీక్వెల్. కోనసీమ నేపధ్యంలో గోదారి ఒడ్డున తొంభై శాతం షూటింగ్ జరుపుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. హీరో పెర్ఫార్మన్స్ ఆల్రెడీ నచ్చింది... ఈ కారణాలు చాలనిపించాయి నాకు, 'విలేజ్ లో వినాయకుడు' సినిమా రిలీజ్ షో చూడ్డానికి.

ప్రేక్షకులకి ఒక కథ చెప్పడం కన్నా తెలిసిన కథని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించడంలో ఓ సాహసం ఉంది. ఆ సాహసాన్ని చేశాడు యువ దర్శకుడు సాయికిరణ్ అడివి. ఒక పల్చని, బాగా నలిగిన కథాంశాన్ని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని కూర్చోబెట్టి చూపించాలంటే ఏం చెయ్యాలో అవన్నీ చేశాడు దర్శకుడు. వీనుల విందైన సంగీతం, కంటికి ఇంపైన లొకేషన్లు, సిట్యుయేషనల్ కామెడీ.. ఇవన్నీ ఉన్నాయి సినిమాలో.

మెడిసిన్ చదివిన కావ్య (నూతన నటి శరణ్య మోహన్) మన కార్తిక్ ('వినాయకుడు' ఫేం కృష్ణుడు) ని ప్రేమిస్తుంది. తను వైద్యం చేసిన పేషెంట్ కి ఏమైనా జరిగితే తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం కావ్యది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కావ్య అంటే యెంతో గారాబం ఆమె తండ్రి లక్ష్మీపతి రాజు (రావు రమేష్) కి. ఈ కోనసీమ భూస్వామి, ఆర్మీ లో పని చేసి రిటైరై ఉమ్మడి కుటుంబాన్ని ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా నడుపుతూ ఉంటాడు.

లక్ష్మీపతి స్నేహితుడు పజిల్స్ భాస్కరం (యండమూరి వీరేంద్రనాథ్). ఇతని పనులు రెండు.. కనిపించిన వాళ్ళందరినీ పజిల్స్ తో వేధించడం, కావ్యకి తగిన వరుణ్ణి వెతికే పనిలో ఫెయిలవుతూ లక్ష్మీపతి చేత చివాట్లు తింటూ ఉండడం. ఎలాంటి వాళ్ళూ ఓ పట్టాన నచ్చరు లక్ష్మీపతి కి. ఇలాంటి పరిస్థితిలో కావ్య ఎంతగానో ప్రేమించిన అబ్బాయిగా ఆ ఇంట్లో అడుగుపెడతాడు కార్తిక్. అతను లక్ష్మీపతి మనసు గెలుచుకోగాలిగాడా? అన్నది కథ.

నిజానికి తెలుగు ప్రేక్షకులకి ఇదేమీ కొత్తకథ కాదు. అందుకే కథనం మీద ఆధార పడ్డాడు దర్శకుడు.. ప్రేక్షకుడు ఆలోచనలో పడకుండా ఉండడం కోసం హాస్య సన్నివేశాలని గుది గుచ్చాడు. క్లీన్ కామెడీ ని మాత్రమే ఎంచుకోవడం అభినందించాల్సిన విషయం. జంద్యాల పాపులర్ డైలాగు 'నాన్నా చిట్టీ..' కి నేపధ్యం లో వచ్చే సంగీతాన్ని కథానుసారం వాడుకుని మొదటి సగం లో హాయిగా నవ్వించాడు. అలాగే 'ముద్దుగారే యశోద..' కీర్తనని హీరో మీద చిత్రీకరించి 'పడమటి సంధ్యారాగం' గుర్తు చేశాడు.

తండ్రికూతుళ్ళ సెంటిమెంట్ సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణవంశీ 'చందమామ' 'శశిరేఖా పరిణయం' లో చూసేసినవే.. తండ్రికి ఎదురు చెప్పలేని కూతురు, కూతురి ఎంపిక ని అంగీకరించలేని, అలా అని ఆమెని కష్ట పెట్టలేని తండ్రి. చాలా ఫ్రేముల్లో తెరమీద కిటకిటలాడుతూ జనం కనిపించడం వల్ల కూడా కృష్ణవంశీ గుర్తొచ్చాడు అప్పుడప్పుడు. అయితే, ప్రతి పాత్రకీ ఒక ఐడెంటిటీ ఇచ్చే విషయం లో మాత్రం కొంచం జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.

నేటివిటీ విషయంలో గురువు శేఖర్ కమ్ముల చేసిన పొరపాటునే శిష్యుడు సాయికిరణ్ కూడా చేశాడు. కేవలం తెర నిండా గోదారినీ, పచ్చని కొబ్బరి తోటలనీ చూపించడం ద్వారా నేటివిటీ వచ్చేస్తుందనుకోడం పొరపాటు. పాత్రల ఆహార్యం, భాషా సంస్కృతులు.. ఇవన్నీ ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించాలి. ఈ దిశగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ('శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ' లాంటి వంశీ పాత సినిమాల్లో గోదావరి నేటివిటీ ని చూడొచ్చు) అలాగే సినిమా ప్రారంభం, ముగింపు విషయాల్లో ఇంకొచం శ్రద్ధ చూపి, సన్నివేశాలని రొటీన్ కి భిన్నంగా రాసుకుని ఉండాల్సింది అనిపించింది.

మణికాంత్ కద్రి సంగీతం లో వనమాలి (సింగిల్ కార్డ్) రాసిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 'చినుకై వరదై..' 'నీలి మేఘమా..' పాటలు వెంటాడతాయి. ఎడిటింగ్ ఇంకొంచం జాగ్రత్తగా చెయ్యొచ్చు, ముఖ్యంగా రెండో సగంలో.. కృష్ణుడిని పెద్దగా ఫోకస్ చేయలేదనిపించింది.. బహుశా అతని పాత్ర 'వినాయకుడు' కి కొనసాగింపు కావడం వల్ల కావొచ్చు. కొంచం డల్ గా కనిపించాడు చాలా చోట్ల. శరణ్య బాగా చేసింది. రావు రమేష్, యండమూరి పర్వాలేదు.

"సినిమా విజయానికి యాభై శాతం క్రియేటివిటీ, మరో యాభై శాతం పబ్లిసిటీ సాయపడతాయి" అని ఆమధ్య ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడు సాయికిరణ్. క్రియేటివిటీ పాళ్ళు మరో పది, పదిహేను శాతం కలిపితే మరింత చక్కని సినిమా అయి ఉండేది 'విలేజ్ లో వినాయకుడు.'

బుధవారం, నవంబర్ 04, 2009

నాయికలు-కజు

ఆమె తన మూడవ ఏట జరిగిన మారణకాండకి ప్రత్యక్ష సాక్షి. ఆ గాయం తాలూకు గుర్తులు చెరగక ముందే పెంపుడు తల్లితో కలిసి పొరుగు దేశానికి ప్రయాణమయ్యింది. సంఘర్షణ ఆమె జీవితంలో ఒక భాగమయ్యింది. పెంపుడు తల్లి ఎలాంటి లోటూ చేయకపోయినా వయసుతో పాటు ఆమెలో పెరిగిన కోరిక ఒక్కటే.. ఎప్పటికైనా "తన వాళ్ళని" కలుసుకోవాలని.. చదువు పూర్తవ్వడంతోనే, అమెరికా నుంచి ఇండియా కి ప్రయాణమయ్యింది, బంధువులని చూసే వంకతో. మూలాలని వెతుక్కుంటూ ఆ అమ్మాయి చేసిన అన్వేషణే సోనాలి బోస్ రాసిన ఆంగ్ల నవల 'అము.' కథానాయిక కజు.. కజోరి రాయ్.

అమెరికా వర్ణ వివక్ష కారణంగా ఇబ్బందులు పడుతున్న మూడో ప్రపంచ దేశాల పౌరుల కోసం పనిచేసే ఉద్యమకారిణి కేయ రాయ్ పెంపుడు కూతురు కజు. ఢిల్లీ శివార్లలోని చందన్ హోలా అనే పల్లెటూళ్ళో అంటు వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారనీ, అప్పుడే తాను మూడేళ్ళ కజు ని పెంపకానికి తీసుకున్నాననీ కూతురికి చెబుతుంది కేయ. తన ఊరిని చూడాలని, తనవారంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకోవాలనే కోరిక వయసుతో పాటే పెరుగుతుంది కజు కి. తను తన గతాన్ని తలచుకోవడం తల్లికి ఇష్టం లేదని తెలుసు ఆమెకి. అందుకే చదువు పూర్తవ్వగానే, అమ్మమ్మనీ (కేయ తల్లి), మావయ్య కుటుంబాన్నీ చూసే వంకతో ఢిల్లీ బయలుదేరుతుంది.

స్వతంత్ర భావాలున్న కేయ పెంపకం, అమెరికా వాతావరణం నేపధ్యంలో పెరిగిన కజు ది విలక్షణమైన వ్యక్తిత్వం. తను అనుకున్నది ఎలాగైనా సాధించే పట్టుదల ఉన్న అమ్మాయి. అయితే అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేని మొహమాటం కూడా ఉంది. ఎలాంటి విషయాన్నైనా తల్లితో ధైర్యంగా చర్చించగలదు. తన పదమూడో ఏట కలిగిన 'తొలి ముద్దు' అనుభవాన్ని ఆమె మొదట చెప్పింది కేయకే.

చిన్నతనంలో తన స్నేహితుల కుటుంబాలని చూసి, తనకీ తల్లీ, తండ్రీ వాళ్లకి ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మాత్రమే ఉండే ఉద్యోగాలు, చక్కటి సాయంత్రాలు, ఆహ్లాదకరమైన వారాంతాలు ఉంటే బాగుండేవని అనుకుంటుంది కజు. అయితే వయసు పెరిగే కొద్దీ తల్లి చేసే పనుల్లో గొప్పదనం అర్ధమవుతుంది ఆమెకి. ముఖ్యంగా తన స్నేహితులంతా తల్లిని అడ్మిరేషన్ తో చూస్తున్నప్పుడు ఆమె కూతురు అయినందుకు గర్వపడుతుంది కజు. ఆమెతో పాటే ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటుంది, తనకి వీలైనప్పుడల్లా.. పేదలనూ, వాళ్ళ కష్టాలనూ చూసి చలించిపోయే మనస్తత్వం ఆమెది.

ఢిల్లీ లో ఉంటున్నా బెంగాలీ సంప్రదాయాలని క్రమం తప్పకుండా పాటించే మావయ్య కుటుంబంతో, ముఖ్యంగా తన ఈడుదే అయిన మావయ్య కూతురు తుకి తో తొందరలోనే అనుబంధం పెరుగుతుంది కజు కి. ఇండియా వచ్చిన నెల్లాళ్ళకి పల్లెటూరు చూడాలనే వంకతో చందన్ హోలాకి ప్రయాణం చేస్తుంది కజు. ఆమెని ఒంటరిగా బయటకు పంపడానికి ఇష్టపడని మేనమామ కుటుంబం ఆమె వెంటే వస్తుంది. ఎంతగా ప్రయత్నించినా ఆ గ్రామం తో తనకి ఎలాంటి అనుబంధం ఉన్నట్టు అనిపించదు కజు కి.

ఓ గురుద్వారా నుంచి వినిపించే గుర్బానీ యెంతో పరిచయమైనదిగా అనిపిస్తుంది కజుకి. 'ఎందుకు' అన్న విషయం లో స్పష్టత ఉండదు ఆమెకి. తుకి బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ స్నేహితుడైన కబీర్ తో పరిచయమవుతుంది ఆమెకి. సీనియర్ బ్యూరోక్రాట్ అరుణ్ సెహగల్ కొడుకైన కబీర్ తో మాటల యుద్ధంతో మొదలైన పరిచయం, అతనితో కలిసి ఒక మురికి వాడని చూడడానికి వెళ్ళేలా చేస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో దాబా నడిపే గోబింద్ భయ్యా ఇల్లు, ముఖ్యంగా దగ్గరలోనే ఉన్న రైల్వే ట్రాక్ తనకి బాగా తెలిసినవిగా అనిపిస్తాయి కజుకి.

తనని ఎవరో తరుముతున్నట్టుగానూ, తనని తాను రక్షించుకోవాలని అంతరాత్మ చెబుతున్నట్టుగానూ అనిపించి ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతుంది కజు. కబీర్ సాయంతో తన జన్మ రహస్యం తెలుసుకునే పని మొదలు పెడుతుంది. పాత రికార్డులు చూడడం ద్వారా తన మూడో ఏట చందన్ హోలలో అంటు వ్యాధి ప్రబలి పెద్ద యెత్తున జనం చనిపోయిన సంఘటన ఏదీ జరగలేదని తెలిసి ఆశ్చర్య పోతుంది. ప్రతి విషయాన్నీ తనతో చర్చించే కేయ ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పిందో అర్ధం కాదు ఆమెకి. అది మొదలు తన ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేసి జన్మరహస్యాన్ని చేధిస్తుంది.

ఇండియన్ అమెరికన్ రచయిత్రి సోనాలి బోస్ రాసిన 'అము' నవల్లో కజుతోపాటు కేయ పాత్రకూడా చాలా బలమైనదే. తనకి ఏమీ కాని పసి పిల్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన స్త్రీ కేయ. గతం తెలుసుకోడానికి కజు పడే తపన, చేసే ప్రయత్నాలు అలెక్స్ హెలీ 'రూట్స్' నవలని గుర్తు చేస్తాయి. ఇలాంటి కథాంశం తో వచ్చే సాహిత్యంపై 'రూట్స్' ప్రభావం పడకుండా ఉండడం సాధ్యం కాదేమో. మార్కిస్టు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల కావచ్చు, సోనాలి బోస్ రచనలో చాలా చోట్ల 'ఎరుపు' నీ 'ఎర్రజెండా' నీ సింబాలిక్ గా వాడారు. రాజకీయాంశాల చర్చలో ఆమె మార్క్సిస్టు పార్టీ భావజాలాన్నే బలపరిచారు.

'అము' పేరు తో కజు పాత్రలో కొంకణ సేన్ శర్మ, కేయ పాత్రలో తన పిన్ని, మార్కిస్టు పార్టీ నేత బృందా కరత్ లతో సోనాలి తను తీసిన ఆంగ్ల చిత్రానికి 2004 సంవత్సరానికి గాను 'గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ నేషనల్ అవార్డు' అందుకున్నారు. స్క్రీన్ ప్లే ని కొద్ది మార్పులతో నవలగా విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితం తొలిసారిగా చదివిన ఈ నవలని, మాజీ ప్రధాని ఇందిర హత్య జరిగి పాతికేళ్ళు గడిచిన సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన ప్రదర్శనల నేపధ్యంలో మరో సారి తిరగేశాను. గతం లో లాగే కజు, కేయ పాత్రలు వెంటాడుతున్నాయి. ('amu,' పేజీలు 142, వెల రూ. 200, పెంగ్విన్ ప్రచురణ).

ఆదివారం, నవంబర్ 01, 2009

మీరయ్య-గుర్రమ్మ

అలనాడు త్రేతాయుగంలో ఓ మడేలు మోపిన నింద కారణంగా సీతమ్మ ని అడవులకి పంపాడు శ్రీరాముడు. ఇలనాడు ఈ కలియుగంలో, కొన్ని దశాబ్దాల క్రితం, రాముడంతటి మంచి బాలుడినైన నా మీద నింద మోపింది ఓ మడేలమ్మ. ఫలితంగా ఏం జరిగిందో తెలియాలంటే, జరిగిన కథలోకి వెళ్ళాలి.

సృష్టి కర్త బహు చమత్కారి.. ఆయన సృష్టించిన జంటలు చాలు, ఆయన లీలా వినోదాలు ఎంతటివో తెలుసుకోడానికి. మచ్చుకి కొన్ని జంటలు.. అతను కప్ప అయితే ఆమె పాము.. అతను మేక అయితే ఆమె పులి.. అతను మీరయ్య అయితే ఆమె గుర్రమ్మ.. మీరయ్య మా ఊరంతటికీ ఏకైక మడేలు. 'గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చెయ్యాలి' అనే నీతి కథలో మడేలుకి ఉన్నట్టుగా మా మీరయ్య కి గాడిద, కుక్క లేవు.

మీరయ్య కి ఎవరి మాటకీ ఎదురు చెప్పడం తెలీదు. వినయంగా తలొంచుకుని తన పని తాను చేసుకుపోతాడు. చివరికి తను చేయ దల్చుకున్నది మాత్రమే చేస్తాడు. అతని ఇల్లాలు గుర్రమ్మ. ఆమె కి పెద్దా చిన్నా అన్న భేదాలేవీ లేవు.. ఫెడీల్మని సమాధానాలు చెబుతుంది. 'కొరకంచు' అని ఆమెకి ముద్దుపేరు మా ఊళ్ళో. అసలు ఆమె పుట్టినప్పుడు వాళ్ళ ఊరి పంతులు గారు పంచాంగం చూసి 'గ' అనే అక్షరంతో పేరు రావాలని చెప్పి, 'గృహలక్ష్మి' అని ఆయనే పేరు నిర్ణయించాడట. జనం నోళ్ళలో ఆ పేరు గుర్రమ్మ గా రూపాంతరం చెందింది.

మామూలప్పుడు మనిషే కానీ, కోపం వచ్చినప్పుడు మాత్రం గుర్రమ్మ అస్సలు మనిషి కాదు. 'మన సత్యానికి సెల్లెలిగా పుట్టాల్సిన మడిసి' అని మా ఊరివాళ్ళు అనుకోడమూ కద్దు. అయితే ఆ కోపం ఎప్పుడు వస్తుందన్నది నర మానవుడికి తెలీదు. మా ఇంట్లో బట్టలు ఉతకడానికి వేసే అలవాటు లేక పోయినా తాతయ్యవి, నాన్నవి పంచలు, ఫేంట్లు, చొక్కాలు పొడిస్త్రీ (పొడి + ఇస్త్రీ) కి ఇచ్చే వాళ్ళు. మీరయ్య పిలవగానే వచ్చి పట్టుకెళ్ళి, ఓ ఐదారు కబుర్లు పెట్టాక తనకి వీలు కుదిరినప్పుడు పట్టుకొచ్చేవాడు. పిల్లల బట్టలకి ఇస్త్రీ అనే సమస్యే ఉండేది కాదు.

నేను ఐదో తరగతిలో ఉండగా ఒక రోజు బళ్ళో హెడ్మాస్టారు గారు వచ్చే వారం బడికి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారనీ, ఆ రోజు పిల్లలందరూ స్నానం చేసి, ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని రావాలనీ చెప్పారు. మా బళ్ళో పిల్లలందరూ ఉతికిన బట్టలు వేసుకుని వస్తే అది ఎనిమిదో వింత.. ఇంక ఇస్త్రీ అంటే అది కల్లో మాట. నేను ఇంటికి రాగానే ఈ వార్త అమ్మ చెవిన వేశాను.. అమ్మేమో ఆ వచ్చేది ఏ ప్రధాన మంత్రో, ముఖ్యమంత్రో అయినట్టు హడావిడి చేసి, నా బట్టల్లోనుంచి మూడు జతలు మంచివి తీసి సాయంత్రం మీరయ్యకి ఇస్త్రీ కి ఇచ్చేసింది.

అప్పుడు మొదలయ్యాయి నా కష్టాలు.. మీరయ్య ఎక్కడ కనిపించినా గుర్తు చెయ్యడం.. అతనేమో 'ఆయ్.. అట్టుకొచ్చేత్తానండి.. నానేం సేసుకుంటానండి మీ బట్లు.." అని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఈ "నానేం సేసుకుంటానండి" లో కూసింత వ్యంగ్యం లేకపోలేదు. ఎందుకంటే, పొడిస్త్రీ కి ఇచ్చిన చొక్కాలు (తాతయ్యవీ, నాన్నవీ) మీరయ్య వేసుకుని తిరుగుతాడనీ, తర్వాతెప్పుడో ఉతికి తెస్తాడనీ బామ్మకి బలమైన అనుమానం. మీరయ్య ఎప్పుడు కనిపించినా అనుమానాస్పదంగా చూసేది.. ఈ విషయం మీరయ్యకీ తెలుసు. హెడ్మాస్టారు రోజూ ఇస్త్రీ బట్టల విషయం గుర్తు చేస్తున్నారు.. నేను మీరయ్యకి కబుర్ల మీద కబుర్లు పెడుతూనే ఉన్నాను.

బళ్ళో ఇనస్పెక్షన్ రెండు రోజులకి వచ్చేసిందనగా నాకు టెన్షన్ మొదలయ్యింది. ఇస్త్రీ అట్టే పోయే ఉన్న వాటిల్లో మంచి బట్టలన్నీ మీరయ్య దగ్గరే ఉండిపోయాయి. పోనీ ఇస్త్రీ చెయ్యకుండా అయినా తెచ్చేయమని అడిగాను.. 'అయబాబోయ్.. అదేం మాటండీ.. మావింక ఊల్లో ఉండొద్దేతండీ.." అని బోల్డంత ఫీలయిపోయాడు, ఉదయాన్నే. నేను పొద్దున్న బడి నుంచి భోజనానికి ఇంటికి వచ్చి అమ్మని కనుక్కున్నా, బట్టలు వచ్చాయేమోనని.. రాలేదని చెప్పింది. సరిగ్గా అప్పుడే గుర్రమ్మ మా వీధిలో వెళ్తోంది. నాకు చాలా కోపం వచ్చినా బోల్డంత సహనంగా నా బట్టల గురించి అడిగాను.

"నాకు తెల్దండి.. మీ మీరయ్య గోర్ని అడగండి." అని కొంచం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందామె. "అదేంటీ.. మీరిద్దరూ ఓ ఇంట్లోనే ఉంటారు కదా" నేను చాలా అమాయకంగానే అడిగాను కానీ, గుర్రమ్మకి కోపం నషాళానికి అంటింది. బుజాన ఉన్న మూట రోడ్డు మీద పడేసి, చేతులు బారజాపి అరవడం మొదలు పెట్టింది.. "ఏటండీ.. ఏటి మాటాడుతున్నారు? నేను మీరయ్య పెళ్ళాన్ని కాదంటారా? ఇదిగొండీ.. ఆడు కట్టిన తాడు" అంటూ దూసుకొచ్చింది.. నేనేదో చెప్పబోతున్నా కానీ ఆమె వినిపించుకోడం లేదు..

ఆవిడ గొంతు విని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా ఆగారు.. "అబ్బాయిగోరు అడూతన్నారూ.. నువ్వు మీరయ్య కి కట్టుకున్న పెల్లానివేనా.. లేక పోతే X Xకున్న దానివా.. అంతన్నారండీ.." అనేసరికి నాకు కాళ్ళలో వణుకు మొదలయ్యింది.. బుర్ర మొద్దు బారింది. అసలే నాన్న భోజనానికి వచ్చే టైము.. ఇదెక్కడ గొడవరా దేవుడా అనుకుంటున్నా.. పాపం.. నన్ను రక్షించడానికి అమ్మ రంగంలోకి దిగింది.. "ఇదిగో గుర్రమ్మా.. మా వాడు అలా అనలేదు.. మీ ఇద్దరి మాటలూ నేను చెవులారా విన్నాను" అంది కొంచం ధాటీగా.. గుర్రమ్మఅదే స్వరంలో అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ చెప్పేస్తోంది..

నాన్నొచ్చేలోగా ఈ గొడవ చల్లబడాలని నేను దేవుళ్ళందరికీ మొక్కడం మొదలెట్టాను. ఇంతలో గొడవ చూస్తున్న కొందరు ఉత్సాహవంతులైన మహిళలు తీర్పు చెప్పడానికి ముందుకొచ్చారు.. "ఆ బాబు అలాంటి మాటలు ఆడరు గుర్రమ్మో.. మాకు తెల్సు ఆయన సంగతీ.. నీ సంగతీ.." అనేసరికి, నా కళ్ళకి వాళ్ళు దేవతల్లా కనబడ్డారు.. కాసేపు అరిచి అరిచి అలిసిపోయిన గుర్రమ్మ, అమ్మ ఇచ్చిన మజ్జిగ తేట తాగి, ఊరగాయ పొట్లం పట్టుకుని, మూట భుజాన్నేసుకుని బయలుదేరింది.. మరి కాసేపటికి నాన్నొచ్చారు.

ఆ మర్నాడు సాయంత్రం మీరయ్య నా బట్టలు తెచ్చాడు.. "ఏటండీ.. గుర్రమ్మతో తగువేసుకున్నారంట" అని నవ్వుతూ అడిగి.. "మడిసి మంచిదేనండీ.. పాపం.. కూసింత కోపమెక్కువ.. మద్దినేల రేవు కాడినుంచి వొచ్చి అదే మీ బట్లు ఇస్త్రీ సేసింది.." అంటున్న మీరయ్య కేసి గుడ్లప్పగించి చూశాన్నేను. నేను తగువేసుకున్నానా? ఆమెకి 'కూసింత' కోపమా? .. నాన్న గానీ కొంచం ముందు వచ్చి ఉంటే ఏం జరిగేదో తల్చుకోడానికే భయమేసింది..