ఆదివారం, ఆగస్టు 31, 2014

బాపు ...

చిన్నప్పుడు.. మూలగదిలో ఉన్న సందుగం పెట్టె నిండా రకరకాల పుస్తకాలు. అవేవీ చదువుకునే క్లాసు పుస్తకాలు కాదు కాబట్టి రోజూ వాటితో పనుండదు. బడి సెలవులప్పుడు, మరీ ముఖ్యంగా వేసంకాలంలో ఏళ్ళ తరబడి నాకు కాలక్షేపం అందించిన ఆ పెట్టె నిజానికి ఓ జ్ఞాపకాల భోషాణం. ఆ పెట్టెలో ఎప్పుడూ పెరుగుతూ ఉండే 'జ్యోతి' 'యువ' పుస్తకాలు ఎన్నెన్నో సెలవుల్ని క్షణాల్లా గడిపేశాయి నాకు.

అదిగో, ఆ పుస్తకాల్లో ఆసక్తిగా అనిపించిన పేర్లలో రెండు మరీ ప్రత్యేకమైనవి. ఒకటి వపా అనబడే వడ్డాది పాపయ్య అయితే, రెండోది బాపూగా పిలవబడే సత్తిరాజు లక్ష్మీనారాయణ. వపా నీటి వర్ణ చిత్రాలు కవర్ పేజీలనీ, చివరి పేజీలనీ మెరిపిస్తే, బాపూ రేఖా చిత్రాలు, కార్టూనులు లోపలి పేజీలకి ప్రత్యేకతని అద్దేవి. వీళ్ళిద్దరి గురించీ నాకు తెలియకుండానే చాలా విషయాలు తెలుసుకున్నాను నెమ్మదినెమ్మదిగా.

బాపూ పుట్టింది గోదారికి ఆ పక్కన అని తెలిసినప్పుడు ఏదో తెలియని ఆత్మీయత - మానసికమైనది - మొదలయ్యింది. కాలేజీ రోజుల్లో బాపూ అక్షరాలని అనుకరించిన అనేకానేకమందిలో నేనూ ఒకడిని. కారణాంతరాల వల్ల పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గోవలసి వచ్చింది ఓసారి. నేనేదో బొమ్మతో కుస్తీ పడుతున్నాను. పక్కతను బాపూ బొమ్మని యధాతధంగా దించేస్తున్నాడు. ఇది బాపూ బొమ్మ కదా? అనడిగితే, "అయితే ఏటీ? మనోడి బొమ్మ మనం గీస్తున్నాం" అంటూ వచ్చింది జవాబు. ఎంత మంది ఎన్నిరకాలుగా సొంతం చేసుకున్నారో కదా ఈ బాపూని అనిపించింది.

రచయితలు, రచయిత్రులు పుస్తకాలు ప్రచురించుకున్నప్పుడు వాటికి బాపూ చేత కవర్ పేజీ బొమ్మ వేయించుకోడాన్ని ఓ గౌరవంగా భావిస్తారు. పుస్తకం ప్రూఫ్ ప్రతితో పాటు, ఓ చెక్కుని బాపూకి పంపడం, బొమ్మతోపాటు అభినందనలు చెబుతూ చెక్కుని తిప్పి పంపించడం దాదాపుగా ఒక రివాజు. ఓసారి, ఒక రచయిత్రి విషయంలో మాత్రం బాపూ చెక్కుని క్యాష్ చేసుకున్నారు. అదే సమయానికి నా మిత్రులొకరు బాపూ పక్కన ఉండడం తటస్తించింది.


"చెక్కు బొమ్మకి కాదు, పుస్తకం చదివినందుకు," అన్నారట బాపూ. చమత్కారంతో పాటు, కొన్ని బొమ్మల వెనుక ఉండే చిత్రకారుడి 'శ్రమ' కూడా కనిపిస్తుంది కదూ మనకి. బాపూ బొమ్మలు లేని వంశీ కథని ఊహించగలమా అసలు? సి. రామచంద్ర రావు రాసే కథలకోసం ఎదురు చూసినా, 'మూలింటామె' చదివి, స్పందించి నామినికి ఉత్తరం రాసినా ఇదంతా సాహిత్యం మీద బాపూకి ఉన్న అభిమానం తప్ప మరొకటి కాదు. చిత్రకారుడు సాహిత్యాభిమాని అయితే ఎంత చక్కని బొమ్మలు దొరుకుతాయో పాఠకులకి. బాపూ బొమ్మని రెండు సార్లు చూడాలి - కథ చదవక ముందు, చదివిన వెంటనే.

బొమ్మల బాపు, సినిమాల బాపు అని రెండు రకాలు. ఇద్దరూ ఒక్కటే అనిపించదు ఎందుకో. (వంశీ విషయంలోనూ ఇంతే). బాపూ సినిమాల కన్నా అందులో గోదారి గొప్పగా నచ్చేస్తుంది. 'ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు' పాటలో సంగీత బావుంటుందా, గోదారి బావుంటుందా అంటే గబుక్కున జవాబు చెప్పడం కష్టం. బాపూ బొమ్మలు చాలా వాటిల్లో పుస్తకాలో, పుస్తకాల అలమర్లో తప్పకుండా కనిపిస్తాయి. తన సినిమాల్లో కూడా కనీసం కొన్ని ఫ్రేముల్లో అయినా సరే బుక్ రాక్ కనిపించి తీరాలి. చదివే అలవాటుని ప్రోత్సహించడానికి తనవంతు కృషి. ఎంత గొప్ప ఆలోచనో కదా!

బాపూకి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు అన్న ఫిర్యాదు చాలా మంది నుంచి చాలా సార్లే విన్నాను. నాకెందుకో ఎప్పుడూ అలా అనిపించలేదు. బహుశా, నాకు తెలియకుండానే వపాతో పోల్చి చూడడం వల్ల కాబోలు. శ్రీకాకుళంలోని తన చిన్న డాబా ఇంట్లోనే జీవితం మొత్తాన్ని గడిపేసిన వపా గుర్తొస్తూ ఉంటాడు ఈమాట విన్నప్పుడల్లా. కేవలం చిత్రకారుడు మాత్రమే కాక సినిమా దర్శకుడు కూడా కావడం వల్లే బాపూకి ఇప్పుడున్నంత పేరొచ్చిందనిపిస్తూ ఉంటుంది. సినిమాలే లేకపోతే బాపూలాంటి అంతర్ముఖుడు ప్రపంచం ముందుకు వచ్చేవాడా అసలు?

ఎనభయ్యేళ్ల పరిపూర్ణ జీవితం చూసిన వాడు బాపు. నచ్చిన చదువు చదువుకుని, ఇష్టమైనన్ని బొమ్మలు గీసుకుని, తీయగలిగినన్ని సినిమాలు తీసుకుని, అనేకానేకమంది అభిమానుల్ని ఒకే ఒక్క ముళ్ళపూడి వెంకటరమణనీ సంపాదించుకుని, తన అభిరుచులైన సంగీత సాహిత్యాలని విడిచిపెట్టకుండా జీవితాన్ని ప్రతిక్షణం జీవించాడు బాపు. తను గీసే బొమ్మల్లాంటి అందమైన, రాసే అక్షరాల్లాంటి సొగసైన జీవితాన్ని గడిపాడు బాపు. ఇలాంటి బాపూకి మరణం ఉంటుందా? భౌతికంగా ఎల్లకాలం ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. తెలుగు ఉన్నన్నాళ్ళు తెలుగు వాళ్ళ హృదిలో స్థిరంగా ఉండే కొందరిలో బాపూ ఒకడు. ఒకేఒక్క బాపూకి అక్షరాంజలి.

బుధవారం, ఆగస్టు 27, 2014

నాటకరంగం

తెలుగు నాటకరంగం ఎటు వెళ్తోంది? గడిచిన ఏడాది కాలంగా చూసిన నాటక ప్రదర్శనలని గుర్తు చేసుకున్నప్పుడు అప్రయత్నంగానే ఈ ప్రశ్న వచ్చేసింది. 'నాటకం' అన్న పేరే తప్ప ఎక్కువగా ప్రదర్శనలు జరుపుకుంటున్నవీ, పరిషత్తులు జరుగుతున్నవీ నాటికలే. పౌరాణికాలని పక్కన పెడితే, తెలుగులో ప్రదర్శనా యోగ్యమైన నాటకాలు వేళ్ళమీద లెక్కించదగినన్ని.

మూడు గంటల పాటు నాటకం వెయ్యాలంటే దానికి ఎంతో పరిశ్రమ అవసరం. రసభంగం గానీ అయినట్టయితే, ప్రేక్షకులకి కలిగే శ్రమ వర్ణనాతీతం. కారణాలు ఏమైతేనేం, ఇప్పుడు నాటకం అంటే నలభై నుంచి యాభై నిమిషాల నిడివి ఉండే సాంఘిక నాటిక. ఒకట్రెండు స్త్రీపాత్రలు సహా ఐదారుగురు నటులు, అదే సంఖ్యలో సాంకేతిక నిపుణులు. ఓ రెండు, మూడు నెలల రిహార్సల్స్. అటుపై రాష్ట్రంలో జరిగే అన్ని పరిషత్తులలో వీలైనన్ని చోట్ల పాల్గోవడం. ఆర్నెల్లో, ఏడాదో గడవగానే మరో కొత్త నాటిక పనులు మొదలు.

రెండు దశాబ్దాల క్రితం వృత్తి నాటకాలు దాదాపుగా కనుమరుగై, పరిషత్తులు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో తెలుగు నాటకం మనుగడ ప్రశార్ధకం అయ్యింది. ఆ సమయంలోనే రాష్ర ప్రభుత్వం 'నంది నాటకోత్సవాలు' మొదలు పెట్టడంతో నిజంగానే నాటకరంగానికి ఊపు వచ్చింది. మూసివేత దశకి వచ్చిన నాటక సంఘాలు కొత్త ఊపిరి పోసుకున్నాయి. కొందరు పాత నాటకాలకి మెరుగు పెడితే, మరికొందరు సరికొత్త నాటకాలతో పోటీకి సిద్ధ పడ్డారు.

ప్రభుత్వం అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు రెంటినీ  ఆదరించే విధంగా నంది నాటకోత్సవాలని రూపు దిద్దడమే కాక, బహుమతి పొందిన నాటకాలు అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ప్రదర్శించే విధంగానూ కార్యక్రమం తయారు చేసింది. కొన్నేళ్ళ పాటు ఉత్సాహంగా జరిగిన నంది నాటకాలు కాలక్రమేణా ప్రభుత్వం నిర్వహించే అనేక తంతుల్లో ఒకానొక తంతుగా మారిపోయాయి. తెరవెనుక రాజకీయ కారణాలూ ఇందుకు దోహదం చేశాయన్న మాటా పైకొచ్చింది.


ఒకప్పుడు హైదరాబాద్ రవీంద్రభారతి లో మాత్రమే జరిగిన నాటకోత్సవాలు తర్వాతి కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో అన్న పద్ధతికి మారాయి. రాన్రానూ నాటకోత్సవాలు జరిగాయో, లేదో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు, రాష్ట్ర  విభజన తర్వాత ప్రశ్నార్ధకంగా ఉన్న అనేకానేక కార్యక్రమాలలో నంది నాటకాలు ఒకటి. సినిమా విషయంలో అయితే కళకి ఎల్లలు లేవు కానీ, నాటకం విషయం వచ్చేసరికి పరిమితులు ఏమన్నా వస్తాయేమో చూడాలి. ప్రతి విషయమూ రాజకీయాలతో ముడి పడుతున్న సందర్భం ఇది.

నాటకాల నాణ్యత విషయానికి వస్తే అటు నాటక రచయితల్లోనూ, పరిషత్తు నిర్వాహకుల్లోనూ శ్రద్ధ సన్నగిల్లుతోందేమో అన్న సందేహం క్రమంగా పెరుగుతోంది. నాటికలు, అయితే ఎనభైల నాటి మెలోడ్రమటిక్ పద్ధతిలో లేదా వర్తమాన విషయాలు అన్నింటినీ కవర్ చేసేయాలన్న ఆత్రుతతో వార్తలని తలపిస్తున్నట్టుగా ఉంటున్నాయి చాలావరకు. రాశి పెరిగినంతగా వాసి పెరగలేదన్నది సత్యం. ఒకవేళ ఎక్కడన్నా ఓ మంచి నాటిక వచ్చినా, దాని ప్రదర్శనా కాలం ఏడాదికన్నా తక్కువే ఉంటోంది.

నటీనటుల విషయానికి వస్తే, రంగస్థలం మీద కెరీర్ మొదలు పెట్టి టీవీల్లో అవకాశాలు సంపాదించుకున్నవాళ్ళు నాటకాన్ని విడిచిపెట్టలేదు. నాటకాల నుంచి సినిమాలకి వెళ్ళిన వాళ్ళతో పోలిస్తే, రంగస్థలంతో వీళ్ళ అనుబంధం ధృడంగా కొనసాగుతోందనే చెప్పాలి. పెరుగుతున్న ఖర్చులకి తగ్గట్టు పారితోషికాలు పెరక్క పోయినా, సినిమాలు, టీవీలు, క్రికెట్ మ్యాచ్ల వంటి కారణాలకి ఆడిటోరియాలు సగం మాత్రమే నిండుతున్నా నిబద్ధతతో నటిస్తున్నారు వీళ్ళు.

కళా మాధ్యమాలు అన్నింటిలోకీ నాటకం ఓ ప్రత్యేకమైన, శక్తివంతమైన మాధ్యమం. కాలానుగుణ మార్పులు ఉంటాయే తప్ప నాటకానికి ఏదో అయిపోతుందన్న భయం అక్కర్లేదు. 'నాటకరంగం మరణశయ్య మీదుంది' లాంటి రాజకీయ ప్రకటనలని నమ్మాల్సిన పనిలేదు. ఏదో జరుగుతుంది.. నాటకరంగానికి ఓ కొత్త వెలుగొస్తుంది.

సోమవారం, ఆగస్టు 25, 2014

సుకుమారి

'దేరీజ్ మెనీ ఏ  స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ది లిప్'  అన్నాడు  ఇంగ్లిష్ వాడు. నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'సుకుమారి' నవల విషయంలో నాకీ స్లిప్పు అనుభవంలోకి వచ్చింది. ఈ నవల చదవాలనుకుని, మొదలుపెట్టబోతూ కూడా చదవలేకపోవడం అన్నది చాలాసార్లే జరిగింది. అయినప్పటికీ విడిచిపెట్టకుండా, 'ఇంకానా, ఇకపై సాగదు' అనే ధృడ నిశ్చయంతో చదవడం పూర్తిచేసేశా.

యద్దనపూడి నవల అనగానే కనిపించే మొదటి లక్షణం రీడబిలిటీ. ఆమె రాసిన మిగిలిన అన్ని నవలల్లాగే చదివించే గుణం పుష్కలంగా ఉన్న నవల 'సుకుమారి.' పేరుకు తగ్గట్టే ఎంతో సుకుమారంగా పెరిగి, తనకి ఎదురైన జీవితానుభవాలతో రాటుదేలి, పరిపక్వత గల మహిళగా ఎదిగిన అమ్మాయి కథ ఇది. ఆడపిల్లలు చదువుకుని, తమకాళ్ళ మీద తాము నిలబడాలి అనే  సందేశం ఇచ్చారు సులోచనారాణి.

ఆత్మాభిమానం పుష్కలంగా ఉన్న అమ్మాయి సుకుమారి. అన్నపూర్ణమ్మగారి మనవరాలు. సుకుమారి తండ్రి బొత్తిగా బాధ్యత లేనివాడు. తల్లేమో అత్తచాటు కోడలు. అన్నపూర్ణమ్మకి మనవరాలంటే తగని ప్రేమ.  అవడానికి స్థితిమంతులే అయినా ఆస్తంతా కోర్టు కేసుల్లో ఉండడంతో  మామూలు జీవితం  గడుపుతూ ఉంటారు వాళ్ళు. సుకుమారి  పక్కింటి కుర్రాడు బ్రహ్మానందం. అందరూ బ్రహ్మీ అని  పిలుస్తూ ఉంటారు. సుకుమారి-బ్రహ్మీ బాల్య స్నేహితులు.


సుకుమారికి చదువంటే పెద్దగా  ఇష్టం లేదు. హైస్కూలుతో చదువు ఆపేస్తుంది. డబ్బులేకపోవడంతో బ్రహ్మీ చదువు కూడా ఆగిపోవలసిందే. కానీ, అన్నపూర్ణమ్మ అతన్ని కాలేజీలో చేర్పిస్తుంది. బ్రహ్మీ చదువుకుని  ప్రయోజకుడు అయితే, సుకుమారిని అతనికిచ్చి పెళ్ళిచేసి ఇద్దరినీ కళ్ళముందు ఉంచుకోవాలి అన్నది ఆవిడ ఆలోచన. బ్రహ్మీ తల్లి ఇందుకు సంతోషంగా అంగీకరిస్తుంది. పల్లెలో ఉన్న సుకుమారి, పట్నంలో ఉండి చదువుకుంటున్న బ్రహ్మీ ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు.

అన్నీ అనుకున్నట్టే జరిగిపోతే అది యద్దనపూడి సులోచనారాణి నవలెందుకు అవుతుంది? కాబట్టి, ఇక్కడ కథలో ఇక్కడో ట్విస్టు. అన్నపూర్ణమ్మ కోర్టు కేసు గెలవడంతో ఆ కుటుంబం రాత్రికి రాత్రే బాఘా  డబ్బున్నది అయిపోతుంది. అత్యంత సహజంగానే ఇప్పుడు అన్నపూర్ణమ్మ కంటికి బ్రహ్మీ ఆనడు. వాళ్ళమ్మతో గొడవ పెట్టేసుకుని మాటల్లేకుండా చేసేస్తుంది. అంతేకాదు, ఓ గొప్పింటి సంబంధం చూసేస్తుంది సుకుమారి కోసం.

పెళ్లిచూపులు అని తెలియకుండానే పెళ్లిచూపులు జరిగిపోతాయి సుకుమారికి. పెళ్ళికి అభ్యంతరం చెప్పాలని కూడా తెలీదు ఆ అమ్మాయికి(!!) ప్రపంచం తెలియని సుకుమారి  బామ్మని వదిలి అత్తవారింట్లో అడుగుపెడుతుంది. వాళ్ళెవరూ బామ్మకి కనిపించినంత మంచివాళ్ళు కారు. కానీ, వాళ్ళ చెడ్డతనం గురించి సుకుమారి చెప్పినా బామ్మ నమ్మదు. ఆ ఇంట్లో బందిఖానా లాంటి జీవితం మొదలెట్టిన సుకుమారి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి  తనదైన జీవితాన్ని ఎలా నిర్మించుకుంది అన్నది మిగిలిన కథ.

సులోచనారాణి హీరోలు, హీరోయిన్ల ఆత్మాభిమానాన్ని ఎంతో ఓపికగా భరిస్తూ, వాళ్లకి అవసరమైనప్పుడల్లా బోల్డన్ని సహాయాలూ అవీ చేసేస్తూ ఉంటారు. ఈ నవలలో బ్రహ్మీ కూడా అంతే. సుకుమారి మీద  ప్రేమని మనసులోనే దాచుకుని, ఆమెకోసం కష్టపడుతూ, ఆమె అపార్ధాలకి గురవుతూ ఉంటాడు నవలాఖరివరకూ. ముగింపు ఊహించ గలిగేదే అయినా ఆపకుండా చదివించే కథనం. ఏదన్నా సీరియస్ పుస్తకం చదివిన తర్వాతో, దూర ప్రయాణంలోనో చదువుకోడానికి హాయిగా ఉంటుంది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు  272, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, ఆగస్టు 20, 2014

గుడి

మనిషికి సమాజం పట్ల బాధ్యత ఉంది. సమాజానికీ మనిషి పట్ల బాధ్యత ఉంది.  అయితే, సమాజానికి ఉన్న బాధ్యత మనిషి జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించాక కూడా కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే మనిషి మరణం తర్వాత సమాజం నిర్వహించాల్సిన బాధ్యత అత్యంత ముఖ్యమైనది. మృతదేహం కారణంగా మిగిలిన సమాజానికి ఎలాంటి ఇబ్బందీ రానివిధంగా అంత్యక్రియలు నిర్వహించాల్సింది సమాజమే, మరీ ముఖ్యంగా మరణించింది ఓ అనాధ అయినప్పుడు.

అనాధగా జీవితాన్ని మొదలు పెట్టి, ఎంతో జీవితాన్ని చూసిన తర్వాత చివరి రోజుల నాటికి మళ్ళీ అనాధగా మిగిలిపోయిన విశ్వనాథుడికి ఉన్న బెంగాల్లా ఒక్కటే. తన ఊపిరి ఆగిపోయాక, అంత్యక్రియల బాధ్యతని సమాజం కాక, 'తనమనిషి' నిర్వహించాలని. తను జీవితపు చరమాంకంలో ఉన్నానని రూఢిగా తెలిసిన మరుక్షణం, తనకి అంత్యక్రియలు నిర్వహించే మనిషి కోసం అన్వేషణ ఆరంభించాడు విశ్వనాథుడు.

ఓ శివాలయంలో దర్శనం టిక్కెట్లు అమ్మే పనిలో కుదురుకున్న ఆ వృద్ధుడి అన్వేషణ, ఆ గుడికి క్రమం తప్పకుండా వచ్చే 'రవీంద్ర' ని చూడడంతో ముగిసింది.మామూలు మధ్యతరగతి గృహస్తు రవీంద్ర. అతన్ని అమితంగా ప్రేమించే భార్య కామాక్షి, టీనేజ్ కూతురు లావణ్య ఇదీ అతని కుటుంబం. మొట్టమొదటిసారి విశ్వనాథుడు తన కోర్కెని రవీంద్ర ముందు ఉంచినప్పుడు ఎలా స్పందించాలో అస్సలు అర్ధం కాదు రవీంద్రకి. అందుకే, ఏ సమాధానమూ చెప్పడు. కానీ, విశ్వనాథుడు విడిచిపెట్టలేదు.


రవీంద్ర పెట్టే గడువులు తూచా తప్పకుండా పాటిస్తూ, ఏ మాత్రం విసుగూ విరామం లేకుండా అతనిచుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఈ క్రమంలో కామాక్షికీ, లావణ్యకీ కూడా పరిచయం అవుతాడు విశ్వనాథుడు. అతడి కోర్కెని మన్నించడానికి ఎట్టకేలకి అంగీకరిస్తాడు రవీంద్ర. ప్రతిరోజూ ఉదయాన్నే తనే వచ్చి రవీంద్రకి కనిపిస్తానని షరతు పెడతాడు విశ్వనాథుడు. కనిపించని రోజున, రవీంద్ర తనిచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు సిద్ధపడాలి.  ఇంతకీ, రవీంద్ర ఆ పని చేయగలిగాడా? విశ్వనాథుడి అంతిమ యాత్ర ఎలా జరిగింది? ఈ ప్రశ్నలని జవాబిస్తూ ముగుస్తుంది సినీ రచయిత జనార్దన మహర్షి రాసిన 'గుడి' నవల.

గత శతాబ్దపు ఎనభయ్యో దశకంలో విరివిగా విడుదలైన యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తిల నవలలు చదివిన వాళ్లకి 'గుడి' నవలలో  కనిపించే కొత్తదనం బహు స్వల్పం. ప్రతి పేజీలోనూ ఆ ఇద్దరు రచయితలూ గుర్తొచ్చి తీరతారు. అంతే కాదు. ఈ నవలకి ముందు మహర్షి విడుదల చేసిన 'వెన్నముద్దలు' సంకలనంలో చాలా కవితల్ని సందర్భోచితంగా నవలలో వాడుకున్నారు. దీనితో 'వెన్నముద్దలు' మళ్ళీ చదువుతున్న భావన అదనం.

నవరసాలనీ బ్యాలన్స్ చేయడం కోసం కాబోలు, లావణ్య-రమణల సినిమాటిక్ ప్రేమకథని విశదంగా రాశారు. నవలలో నాటకీయత పాళ్ళు అత్యధికం. రవీంద్ర కుటుంబం, రవీంద్ర-కామాక్షిల అనుబంధం, రమణ కుటుంబం, చివర్లో విశ్వనాథుడు ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, వాటికి వచ్చే స్పందన... ఇదీ అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదేమో. చదువుతుంటే చాలాసార్లు స్టేజీ నాటకంగా బావుంటుంది అనిపించిన ఈ నవల ఆధారంగానే కె.విశ్వనాథ్-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్లో 'దేవస్థానం' సినిమా తీశారట. సినిమా పెద్దగా ఆడినట్టు లేదు. నాటకీయతని ఇష్టపడే వాళ్లకి నచ్చే నవల ఇది. (శ్రావణి-శర్వాణి ప్రచురణ, పేజీలు  151, వెల రూ. 100).

ఆదివారం, ఆగస్టు 17, 2014

ప్రాణం ఖరీదు వంద ఒంటెలు

అవును, మనిషి ప్రాణం ఖరీదు వంద ఒంటెలు. ప్రాణానికి ఖరీదు కట్టిన షరాబులు భారతీయలు కాదు, అరబ్బులు. చెయ్యికి చెయ్యి, కాలికి కాలు శిక్ష అమలు చేసే ఎడారి దేశంలో ఒక్క ప్రాణానికి మాత్రం వెసులుబాటు ఉంది. హత్యకేసులో క్షమాభిక్ష ఖరీదు వంద ఒంటెలు. హతుడి కుటుంబానికి, హంతకుడి కుటుంబం వంద ఒంటెల ఖరీదుని న్యాయమూర్తి సమక్షంలో చెల్లించి క్షమాభిక్ష పొందవచ్చు, అది కూడా హతుడి కుటుంబం అందుకు అంగీకరిస్తేనే. అంగీకరించని పక్షంలో, ఉరి శిక్షే.

కేవలం న్యాయమూర్తి ముందు హాజరవ్వడం కోసమే తెలంగాణ పల్లె నుంచి దుబాయ్ వచ్చింది సావిత్రి. ఐదారేళ్ళుగా దుబాయ్ లో కూలీ పనులు చేస్తున్న ఆమె ఒక్కగానొక్క కొడుకు నాగరాజు ఉన్నట్టుండి శవమయ్యాడు. కేసు న్యాయమూర్తి దగ్గరకి వచ్చింది. వంద ఒంటెల ఖరీదు సావిత్రి కి చెల్లించి క్షమాభిక్ష పొందాలని ఆరాట పడుతోంది హంతకుల కుటుంబం. వంద ఒంటెలంటే తక్కువేమీ కాదు, పాతిక లక్షల రూపాయలు! సావిత్రి కోర్టు బోనులో నిలబడి 'తానాజిల్' అంటే చాలు, పాతిక లక్షలతో తిరుగు విమానం ఎక్కేయడమే. అలాకాక, 'కసాస్' అందో, హంతకులిద్దరికీ ఉరి శిక్షే.

సావిత్రి తండ్రి తెలంగాణా సాయుధపోరాటంలో అమర వీరుడయ్యాడు. భర్త నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి 'ఎన్ కౌంటర్' లో శవమై తేలాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాగరాజుని రక్షించుకోడానికి అతన్ని ఊరినుంచి దూరంగా పంపేయడం మినహా మరో మార్గం కనిపించలేదు సావిత్రికి. తండ్రి సాయంతో అక్షరాలని, భర్త సాయంతో సమాజాన్ని చదవడం నేర్చుకున్న సావిత్రి కొడుకుతో కలిసి బతుకు ఈదడాన్ని నేర్చుకుంది. ఇప్పుడా కొడుకు ప్రాణానికి ఖరీదు కట్టాలా? ఇదీ ఆమె ముందున్న ప్రశ్న.

న్యాయమూర్తి ఎదుట 'తానాజిల్' చెప్పి డబ్బు తీసుకోమనే చెబుతున్నాడు చంద్రం, ఆమెకి దూరపు బంధువు, నాగరాజుకి వరసకి తమ్ముడు. ఆమె ఊరినుంచి ఆ ఎడారిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అందరూ ఆమెని చూడవచ్చి, ఇచ్చిన సలహా కూడా అదే. కానీ, సావిత్రి ఆలోచనలు వేరు. ఆమె దృష్టిలో ప్రాణానికి ఖరీదు కట్టడం తప్పు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. డబ్బుతో కొనుక్కోలేనివి చాలానే ఉంటాయనీ, ఉండాలనీ ఆలోచించే మనిషామె.


సావిత్రి నాణేనికి ఒకవైపైతే, అర్ధం కాని అరవంలో మాట్లాడే బీద ముసలి వొగ్గు మరోవైపు. న్యాయమూర్తి ఎదుటికి వచ్చిన అవతలి పక్షం ప్రతినిధి ఆమె. శ్రీలంక తమిళుల కోసం పోరాడుతున్న కుటుంబ నేపధ్యం ఆమెది. నాగరాజులాగే, ఆమె కొడుకులిద్దరూ కూడా దుబాయి వచ్చారు. పనిలో చేరారు. డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. ఇంటి సమస్యలు ఓ కొలిక్కి వస్తుండగా, నాగరాజుని హత్యచేసి చట్టానికి చిక్కారు ఆ ఇద్దరూ. వంద ఒంటెల ఖరీదు సంపాదించడం ఆ వృద్దురాలికి సులువుగా అయిపోలేదు. నిజానికి, ఆ డబ్బు కోసం చెయ్యకూడని 'త్యాగం' చేసిందామె.

న్యాయమూర్తి ఎదుటికి ఒక్కో పక్షం నుంచీ ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. మనసులో 'కసాస్' అని పదేపదే వల్లె వేసుకుంటున్న సావిత్రి ఆ వృద్ధురాలిని చూసింది. ఒకరి భాష ఒకరికి తెలీదు. అయితేనేం, ఆమెని చూడడంతోనే జీవితంలో అప్పటి వరకూ తను చూసిన ఏ కష్టానికీ చలించని సావిత్రి పక్కున పగిలింది. కడుపులోంచి, నాభిలోంచి, నరనరాల్లోంచి పొంగిన దుఃఖం రోదనగా మారింది. పరిసరాలను మరిచి, ఆమెని గుండెకి హత్తుకుని బావురుమంది.

వారిద్దరి దుఃఖం వ్యక్తిగతమా, సామాజికమా? ఆ దుఃఖం, సావిత్రి నిర్ణయాన్ని మార్చగలిగిందా? నాగరాజు దుబాయి ఎందుకు వచ్చాడు? ఆ వృద్ధురాలు అంత డబ్బు ఎలా తేగలిగింది? ఈ ప్రశ్నలని జవాబులిస్తూ, ఎన్నెన్నో కొత్త ప్రశ్నలని పాఠకుల ముందుంచుతూ ముగుస్తుంది పెద్దింటి అశోక్ కుమార్ రాసిన 'ప్రాణం ఖరీదు వంద ఒంటెలు' కథ. జూన్ 2, 2013 ఆదివారం ఆంధ్రజ్యోతి లో తొలిప్రచురణ పొందిన ఈ కథ, కథాసాహితి ప్రచురించిన 'కథ-2013' లో చోటు సంపాదించుకుంది. చదవడం పూర్తవుతూనే, ఓ గొప్ప కథ చదివిన అనుభూతిని మిగిల్చింది. (ఈ కథతో పాటు, మరో పదమూడు కథలున్న 'కథ-2013,' అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లబిస్తోంది. పేజీలు 197, వెల రూ. 60).

గురువారం, ఆగస్టు 14, 2014

బెండ మిరియం

"ఊరుకున్న వాళ్లకి ఉల్లీ, మిరియం పెట్టడం" అనేది మా ఇంట్లో కొంచం తరచూ వినిపించే మాట. ఋషి మూలం, నదీ మూలం, భాషా మూలం ఇలాంటి వాటి జోలికి వెళ్ళద్దని కదా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. పైగా, అటునుంచి వినిపించే మాటల్ని వెతుక్కుంటూ వెళ్తున్నామని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అలా అని ఊరుకున్నా, పదేపదే వినిపించే మాటల ప్రభావం ఎంతోకొంత ఉండకుండా ఉండదు కదా.

లేత బెండకాయలు చూడగానే ముద్దొచ్చాయి. ముందుగా వాటిని ఫోటో తీయాలనిపించింది. ఆ తర్వాత కూర వండేయాలనిపించింది. అంతే కాదు, రొటీన్ కూరలు ఎప్పుడూ చేసుకునేవే.. ఏదన్నా వెరయిటీ ప్రయత్నిస్తే.. అన్న ఆలోచనా వచ్చేసింది. అదిగో, సరిగ్గా అప్పుడే ఈ ఉల్లీ మిరియం గుర్తొచ్చింది అప్రయత్నంగా.  ఎప్పుడూ కళకళ్ళాడే ఉల్లిపాయల బుట్ట ఖాళీగా కనిపించింది.


ఎవ్వరూ చెయ్యకపోతే కొత్త వంటలు ఎలా పుడతాయి అనిపించేసి, బెండకాయలతో ఓ సరికొత్త వంటకం చెయ్యడానికి నడుం కట్టాను. స్టవ్ వెలిగించే ముందే దినుసులు ఏమేం ఉన్నాయో చూసుకోడం విధాయకం కదా. వంటనూనె కొంచమే ఉంది. పెద్ద డబ్బాలోంచి తియ్యడం కొంచం క్లిష్టమైన పని. కాబట్టి, ఉన్న నూనె తోనే వంట కానిచ్చేయడం క్షేమానికి క్షేమం, ఆరోగ్యానికి ఆరోగ్యం.

బాండీ వేడిచేసి, నూనె వెయ్యకుండా మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేడి చేయడం మొదలుపెట్టా. "చిట్టి చిట్టి మిరియాలు.. చెట్టుకింది పోసి.. బొమ్మరిల్లు కట్టి..." తర్వాతేమిటబ్బా? అని ఆలోచిస్తూ ఉండగానే బాండీలో సుగంధ ద్రవ్యాలు (?) వేగిపోయినట్టుగా అనిపించేసింది. వాటిని మిక్సీ జార్ లోకి మార్చి, కాస్త నూనె పోశాను బాండీలో. నూనె కాగే లోగా బెండకాయలు కడిగి, తుడిచి, కూర కోసం సమంగా తరిగేశా.

వేడెక్కిన నూనెలో బెండకాయ ముక్కలు వేసి, మూత పెట్టకుండా వేగనిస్తూ, జార్ ని మిక్సీ లో పెట్టి ఓతిప్పు తిప్పుతూ ఉంటే గుర్తొచ్చింది.. "అల్లం వారింటికీ.. చల్లకి పోతే.. అల్లం వారి కుక్కా.. భౌ భౌ మన్నదీ.." ఫ్రిజ్ లో అల్లం కూడా లేదు. కాబట్టి కూరలో అల్లం వెయ్యక్కర్లేదు. ముక్కలు వేగాయనిపించాక, పసుపు, ఉప్పు జల్లి, ఓ క్షణం ఆగి జార్ లో పొడిని కూడా జల్లి మూత పెట్టకుండా వేగించడం సాగించా.

బాండీలో వేగుతున్న వంటకాన్ని పరాగ్గా చూస్తే మాడుమొహం వేసిన వేపుడులా ఉందే తప్ప, కూర కళ ఏకోశానా లేదు. వేపుడుని కూరగా మార్చాలంటే ఏవిటి సాధనం? ...గ్రేవీ. ఎస్, ఏదన్నా గ్రేవీ వేసేసి దీన్ని కూరగా మార్చేయవచ్చు. సమయానికి ఉపాయం తట్టినందుకు నన్ను నేను అభినందించుకుంటూ గ్రేవీ కోసం పనికొచ్చేవి ఏమేం ఉన్నాయా అని వెతికితే పచ్చి కొబ్బరి, జీడిపప్పు కనిపించాయి.


కాసిన్ని కొబ్బరి ముక్కలు, నాలుగైదు జీడి పలుకులు కలిపి మిక్సీలో పొడికొట్టి కాసిన్ని పాల చుక్కలు కలిపి ఇంకో తిప్పు తిప్పితే గ్రేవీ సిద్ధం. మూత పెట్టకపోవడం వల్ల పొడి పొడిగా వేగిపోయాయి బెండకాయ ముక్కలు. వాటి మీద గ్రేవీ పోసి, మూత పెట్టి, మూత మీద నీళ్ళు పోసి, మంట బాగా తగ్గించేశా. తదుపరి కర్తవ్యం ఏమిటా అనుకుంటూ ఉండగా 'గార్నిష్' గుర్తొచ్చింది. కొత్తిమీర తరిగి సిద్ధం పెట్టేశాను.

బాండీ మూత తీసి చూస్తే అందమైన కూర సిద్ధం. కొత్తిమీర జల్లేసి, సర్వింగ్ బౌల్ లోకి మార్చేశా. గ్రేవీ వల్లనుకుంటా కొంచం జిగురొచ్చింది. వేడి వేడి అన్నం, గోధుమ రొట్టె రెంటితోనూ బాగుంది కూర. మరీ ఘాటైన వంటలు ఇష్టపడే వాళ్ళ సంగతి చెప్పలేను కానీ, కొత్తవి ప్రయత్నం చేయాలి అనుకునే వాళ్లకి నచ్చుతుందనిపించింది.

సోమవారం, ఆగస్టు 11, 2014

కృష్ణవేణి-18

వయసు తెచ్చిన మార్పు పంతులుగారిలో కన్నా సరస్వతమ్మలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇంట్లోనే నాలుగడుగులు వెయ్యాలన్నా కష్ట పడుతోందామె. ఆయన పూజా పునస్కారాలతో కాలం గడుపుతూ ఉంటే, ఆవిడ ఎక్కువ సమయం టీవీ ముందు కాలక్షేపం చేసేస్తోంది. 

ఇల్లు పాతబడిపోయి వెనకవైపు పెంకు జారిపోతోంది, ఎన్ని మరమ్మతులు చేయించినా. మొత్తం కప్పంతా మార్చాలనే చెబుతున్నారు చూసిన మేస్త్రీలందరూ. 

కుర్చీలో కూర్చుని, భోజనాల బల్ల మీద కూరలు తరుక్కుంటున్న సరస్వతమ్మ, బట్టల మూటతో వస్తున్న రత్తాల్ని చూసి, చేతిలో పని వదిలేసి ముందు గదిలోకి వచ్చింది, కొంగుతో చేతులు తుడుచుకుంటూ.

"మియ్యి నాలుగు సీర్లు, రైకలు, లోపల్లంగాలు. పంతులు గారియి నాలుగు పంచిలు, నాలుగు సొక్కాలు. ఇయ్యి కాకండా రెండు దుప్పట్లు, మూడు తువ్వాళ్లు. బేగీ లెక్క సూడండమ్మా.. అవతల పనున్నాది," అంది రత్తాలు హడావిడిగా.

"చూస్తున్నా ఉండవే.. నీకంతా కంగారే.. ఏవిటీ అంత అర్జెంటు పని?" అడిగింది సరస్వతమ్మ.  

"సచ్చిమూర్తి గోరి దినవారం బోజినానికెల్లాలి.. తినేసి సెయ్యి కడుక్కుని ఒచ్చియ్యిలేంగదమ్మా.. ఏదొక పనుచ్చుకోవాల.." గోడకి జేరబడుతూ అంది రత్తాలు. 

"మాయగా వెళ్లిపోయాడే పాపం," పాత డైరీలో పద్దు వెతుకుతూ అంది సరస్వతమ్మ. 

"మరేనండమ్మా.. ఒద్దేరోజులు మంచాన్నడకుండా ఎల్లిపోయేరు.. ఇంతకీ ఆ కోళ్ళుగోరు బంగార్తల్లి. ఎంతబాగా సూసుకున్నాదో మాంగోర్ని.. " 

"నీ కోడలికి మాత్రం ఏం తక్కువే? చక్కదనాల పిల్ల.. అన్నట్టు, మొన్న పేరంటంలో నా కొత్త చీరకి మరకయ్యిందే.. నీ కోడలికి చెప్పి జాగ్రత్తగా పోగొట్టించు.." చెప్పింది సరస్వతమ్మ. 

"ఏం సక్కదనాలో లెండమ్మా.. దానికల్లిప్పుడు ఐదరాబాదు మీదున్నాయి. దానన్న అక్కడ పంజేత్తన్నాడుగదా.. మా వోడిక్కూడా పంజూత్తాను ఒచ్చియ్య మన్నాడంట.. ఇదేమో మావోన్ని ఒకిటే కొరికేత్తన్నాది.." 

"ఉద్యోగం అవుతుందన్నమాట మీవాడికి.. మంచిదే కదే" 

"మన పెసిరెంటుగోరి మేడ కన్నా శానా పెద్దయ్యంట మేడలు.. పిప్పరమెంట్లో ఏయో కామాలమ్మా అంటారంట.." ఆలోచనలో పడింది. 

"అవా.. అపార్ట్మెంట్లు అంటారే వాటిని.." 

"ఆ అయ్యే అయ్యే.. అందులో ఆచ్మన్ పనంట. ఆల్లే ఇల్లు కూడా ఇత్తారంట.. ఇత్తిరీ కూడా సేసుకో వొచ్చంట.. మా సచ్చెవన్నయ్యోలు గూడా దెగ్గిర్లోలొనే ఉన్నారంట. ఏయో శానా సెబుతున్నాదిలెండి.. మావోడేటంటాడో మరి. బేగీ లెక్క సూసెయ్యండమ్మా ఎల్లొచ్చేత్తాను," కంగారు పెట్టింది. 

"వచ్చే వచ్చే.. ఇదివరకటి ఓపిక ఉండట్లేదే అమ్మా.. నా చీరలు ఉతుక్కి వెయ్యడం ముందెప్పుడన్నా చూశావా నువ్వు?" లోపల్నుంచి అడిగింది సరస్వతమ్మ. 

"డాకటేరు కాడికి ఎల్లి సూపించుకోండమ్మా.. మనూరికి నరసమ్మొచ్చిందిగదా.. ఆయమ్మకి సెప్పినా ఏయైనా మందులిత్తాది?" సలహా చెప్పింది. 

"నరసమ్మెవరే రత్తాలూ?" ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ. 

"అయ్యో.. బలేటోరే అమ్మగోరూ.. గవమెంటోల్లు మనూరికి నరసమ్మనంపేరు.ఏ ఊల్లో ఉజ్జోగం అయితే ఆ ఊల్లోనే ఉండాలంట. ఆయమ్మి మొగుడు రైసు మిల్లులో పంజేత్తాడంట. అద్దిలికిల్లు దొరూతాదా అంటా ఊరంతా తిరిగింది మొన్న. సివరాకరికి ఆ గౌరమ్మ ఇల్లు కాలీగా ఉన్నాది గదా.. అందులో జేరతానన్నాది," వివరంగా చెప్పింది రత్తాలు.

"ఎవరూ, మన మంగళగౌరి ఇల్లా?" 

"అవునమ్మా.. ఆయమ్మ పేరు మీదేగదా సెలామణి. కట్టుకున్నోన్ని తరివేసింది.. ఉంచుకున్నోడు పెల్లి సేసుకుని ఈయమ్మినొగ్గేసేడు. దరిజాగా పుట్టింటికెల్లిపోయింది. ఆల్లనెవులూ అడగరో ఏటో. ఇయ్యే మా ఇల్లల్లో జరీతే ఏడు మనూలోల్లనేత్తారు.." నిష్టూరపడింది రత్తాలు. 

"అమ్మగోరూ.." ఉన్నట్టుండి గొంతు తగ్గించింది తనే. 

"ఏవిటే?" డబ్బు లెక్క చూస్తూ అడిగింది సరస్వతమ్మ. 

"ఆ బాబు జాడ తెలిసిందంటమ్మా.. రంగసాయి బాబు కనబడ్డాడంట. పదేల్లైపోయిందిగదా కనపడకండా పోయి.. ఆసొదిలేసుకున్నారా అన్నా వొదినీను. తిరపతి కాడో ఎక్కడో నాకు సరింగా తెల్దు కానీ అక్కడుంటన్నాడంట," రహస్యం విప్పింది. 

"సుగునమ్మేవీ సెప్పలేదా మీకూ?" ఆరాగా అడిగింది. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది సరస్వతమ్మ. 

"ఆయమ్మదంతా గుట్లెండమ్మా.." సాగదీస్తూ గుమ్మం దాటింది రత్తాలు.


మధ్యాహ్నం భోజనాలయ్యి, పంతులుగారు కునుకు తీస్తూ ఉండగా పేరంటం శనగలనుంచి కొబ్బరి ముక్కలు వేరు చేస్తున్న సరస్వతమ్మ, వీధిలో అలికిడైతే తలెత్తి చూసింది. 

"మా తోడికోల్లండి.." తనతో పాటు వచ్చిన ఆడమనిషిని సరస్వతమ్మకి పరిచయం చేసింది సుగుణ. సన్నగా, పొట్టిగా, చామన చాయలో ఉందామె. కర్ర శరీరం. కాయకష్టం చేసే మనిషని చూస్తేనే తెలిసిపోతోంది. ముతక అంచున్న కలనేత చీర కట్టుకుంది. నూనె రాసి బిగ్గా అల్లుకున్న జడలో పెద్ద చామంతి పువ్వు పెట్టుకుంది. 

"ఇటెంపోల్లే గానీ తిరపద్దగర రేనిగుంట్లో తిరపడ్డారండీల్లు.. మా మరిదిగోరు ఎక్కడెక్కడో తిరూతా ఐదారేల్ల కితం ఈల్లుండే సోటికి ఎల్లేరంట.. ఈయమ్మి పెనివిటి లారీ డైవరు సేసేవోడంట.. పెమాదంలో పోయేడు. ఈల్లిద్దరికీ కలిసింది.. పెల్లి సేసుకున్నారు," చాపమీద కూర్చుంటూ వివరం చెప్పింది సుగుణ. 

ఇద్దరికీ టీ పట్టుకొచ్చి ఇస్తూ, "చాలా మంచివాడమ్మా రంగశాయి.. పోనీలే ఇన్నాళ్ళకైనా ఈ ఊరు, మేవందరం గుర్తొచ్చాం మీ ఆయనకి," సరదాగా అంది సరస్వతమ్మ. నవ్వేసి ఊరుకుందామె. 

"రాజాబాబుకి సమ్మంధం సూసేరంటండి మాయాడమొడుసుగారి పిల్లలు. మొన్నే గనపతొచ్చి కబురు సెప్పేడు. ఈల్ల గురించి కూడా అప్పుడే తెల్సింది. సిన్న మాయ్యని పెల్లికి పిలుత్తానత్తమ్మా అన్నాడు. రేపే పెల్లి. అన్నదమ్ములిద్దరూ ఎల్తారు. ఈయమ్మి నాకాడుంటాది," చెప్పింది సుగుణ.

పక్కనే ఉన్న పెంకుటిల్లు దాదాపు శిధిలావస్థలో ఉంది. ఆవరణ అంతా పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. 

"ఆ ఇంట్లోనేనాండీ రిగాల్సల్సు జరిపించింది.." ఉన్నట్టుండి అడిగిందామె. ఆ ప్రశ్నవింటూనే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు సుగుణ, సరస్వతమ్మ. 

చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ "అవునమ్మా, మీ ఆయన చాలా బాగా వేశాడు నాటకంలో," గుర్తు చేసుకుంటున్నట్టుగా చెప్పింది సరస్వతమ్మ. 

"నాకంతా తెల్సండి," నవ్విందా మనిషి. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. 

కాసేపటికి సరస్వతమ్మే "పిల్లలా అమ్మా" అని అడిగింది. "లేరండి" అని క్లుప్తంగా చెప్పిందామె. 

సంభాషణ సాగడంలేదు. ఇబ్బంది ముగ్గురికీ తెలుస్తోంది. కాసేపు చూసి, "ఎక్కడి పన్లక్కడే ఉండిపోయినియ్యండి.. ఎల్లొత్తాం మరి.." అంది సుగుణ. తోటికోడలు కూడా లేవడానికి సిద్ధపడింది. 

"బొట్టుంచుతాను" అంటూ కుంకుమ భరిణె కోసం లోపలికి వెళ్ళింది సరస్వతమ్మ. ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఏ క్షణంలో అయినా వర్షం మొదలయ్యేలా ఉంది.

బొట్టు పెట్టి, వీధి గుమ్మం వరకూ సాగనంపడానికి వెళ్ళింది సరస్వతమ్మ. ఉన్నట్టుండి చినుకులు మొదలయ్యాయి. చీర కొంగు జాగ్రత్తగా తలమీదికి లాక్కుందామె. 

"అడగడం మర్చేపోయేను.. నీ పేరేవిటమ్మా?" అడిగింది సరస్వతమ్మ. 

వేగంగా అడుగులేస్తున్నదల్లా ఒక్కసారి ఆగి, వెనక్కి తిరిగి చెప్పింది.. 

"క్రిష్ణవేనంటారండి.."

(అయిపోయింది)
*     *     *






నా మడిసికి...

శుక్రవారం, ఆగస్టు 08, 2014

కృష్ణవేణి-17

నాలుగు రోజులై రంగశాయి సినిమా హాలుకి వెళ్ళడం లేదు. కృష్ణవేణి జ్వరపడింది. కొన్నాళ్ళుగా కొంచం తరచుగా ఆమెకి జ్వరం రావడం, రెండుమూడు రోజులకి తగ్గిపోడం మామూలైపోయింది. ఈసారి మాత్రం వారం రోజులైనా జ్వర తీవ్రత తగ్గు ముఖం పట్టే ఛాయలేవీ కనిపించడం లేదు. మగతలో ఉన్న ఆమెని ఒక్కదాన్నీ ఇంట్లో వదిలేసి పనిలోకి వెళ్ళడానికి అతనికి మనసొప్పడం లేదు.

బన్ రొట్టె అంటే అసహ్యం కృష్ణవేణికి. ఆమెకోసం జావ కాచడం నేర్చుకున్నాడు. ఏదో వేళలో ఆమెకి కొంచం పట్టించి, తనూ కొంత తాగి భోజనం అయింది అనిపిస్తున్నాడు. ఇల్లంతా ఘాటైన మందుల వాసన. మధ్యాహ్నం జావ తాగాక కొంచం ఓపిక వచ్చినట్టు అనిపించింది కృష్ణవేణికి. తలగడలకి ఆనుకుని మంచం మీద కూర్చుని, రంగశాయిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం మొదలు పెట్టింది.

"ఇది మాయక్కకొచ్చిన జబ్బే.. నాకు బాగా తెలుత్తున్నాది. వొయిజ్జానికి లొంగేది కాదు. సంపేసేదే కానీ, బతకనిచ్చేదసలే కాదు. మాయక్క నెత్తీ నోరూ మొత్తుకుని సెప్పేది.. ఏ వొయిజ్జవూ పంజెయ్యదే అని.. నేనినిపించుకోలేదు.. ఉప్పుడు నువ్వూ అదే పంజేత్తన్నావు.." అలుపు తీర్చుకోడానికి ఆగింది. వినడం ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టాడు రంగశాయి.

"నాకు తెల్సు.. నువ్వు నన్నిలాగొదిలెయి లేవని.. నీకెంత కట్టంగా వుంటాదో నాకన్నా బాగా ఇంకెవలికీ తెల్దు.. అయినాగానీ నాకు సెప్పక తప్పదు.. అనాసరంగా కట్టపడకు.. అప్పుల పాలవ్వకు.." మాట్లాడుతూ ఉండగా దగ్గొచ్చి, కళ్ళనీళ్ళు తిరిగాయి కృష్ణవేణికి. ఆమెని జాగ్రత్తగా పట్టుకుని, సరిగా కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించాడు.

"ఉప్పటికిద్దరు డాట్టర్లని మారిసేవు. ఆల్లు రాసిచ్చిన మందులల్లా అట్టుకొత్తన్నావు.. ఎంత సదూలేందాన్నయినా ఎంతవుతాదో నాకు తెల్సు.."

తన నోటిమీద వేలుంచుకుని, ఆమెని మాట్లాడొద్దని సైగ చేస్తూ "అయ్యన్నీ ఉప్పుడెందుకు.. నేనున్నాను గదా సూసుకోటాకి.." అన్నాడు రంగశాయి.

"ఇయ్యాల కూంత ఓపికొచ్చింది.. నాలుగు మాటలు సెప్పుకోవాలనిపింతంది. అడ్డెట్టకుండా ఇను.. ఇదేటీ, అదేటీ అనొద్దు," కళ్ళతోనే బతిమాలింది.

ఆ కళ్ళలో మునుపటి కాంతి మచ్చుకైనా కనిపించడం లేదు. ఆమెని పరీక్షగా చూశాడు. జుట్టు చాలా రాలిపోయింది. కళ్ళు గుంటలు కట్టాయి. ముఖం పీక్కు పోయి ఉంది. పెదాలు ఎండిపోయాయి.

ఆలోచనల్లో ఎక్కడో పుట్టిన చిన్న భయం క్షణంలో ఒళ్ళంతా పాకిందతనికి. బయట పడకుండా ఉండడం కోసం సద్దుకుని కూర్చున్నాడు. కానీ, కృష్ణవేణి అతన్ని గమనించడంలేదు. తన ఆలోచనల్లో తనుంది.

"నీమీద మనసెందుగ్గలిగిందో ఇయ్యాల్టికీ ఇసిత్తరవే నాకు. కలిసో ఇంట్లో ఉంటావని కల్లో కూడా అనుకోలేదు. కానైతే అదురుట్టవో, మరోటో.. అవుకాసం దొరికింది. ఆ తరవాత.." ఆగింది ఒక్క క్షణం.

"తరవాత పెతీ ఆడదానికీ కలిగే ఆసే.. ఇంతా కాదు.. ఇసిత్తరవూ కాదు.. అది నాకూ కలిగింది. నీతో ఓ బిడ్డని కనాలని.. నీకెప్పుడూ సెప్పలేదు.. సెప్పాలనిపించలేదు. మా సిన్నమ్మంటావుండేది.. నలుగుర్నడిసే దార్లో గడ్డి మొల్దని.. ఆలీసంగా కనబడ్డాడీ మడిసి అనుకున్నాను.." గుక్క తిప్పుకుంది.

రంగశాయి కళ్ళలో బాధతో పాటు, ఆశ్చర్యమూ కనిపించిందామెకి. ఎందుకో ఉన్నట్టుండి ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది.

"ఏదో దక్కలేదన్న బాద లేదు నాకు.. దక్కింది శానా ఎక్కువని తెల్సు. నేనెల్లిపోటం కాయవనీ తెల్సు.. నువ్వెంత బాద పడతావన్నదీ తెల్సు.. అన్నీ తెల్సి, ఏవీ సెయ్యలేక పోతన్నాను సూడు..." వెక్కిళ్ళు పెట్టింది కృష్ణవేణి. తనే తమాయించుకుంది.

"సూడు.. నీ కోసం నేనేటీ సెయ్యలేను.. నాసేతుల్లో ఏటీ లేదు. అలాగని నిన్నిలా వొదిలెయ్టాకి మనసొప్పటం లేదు.. నేసెప్పేది నీకేమాత్తరం నచ్చదని తెల్సు నాకు. కానీ సెబుతున్నా.." ఆయాసంతో ఆగింది.

"సెప్పే ముందో మాట సెబుతాను, ఆలకించు. బుద్ది తెలిసేక నేనేనాడూ ఎవురికీ.. ఆకరికా దేవుడిక్కూడా.. సెయ్యెత్తి దండవెట్టిందాన్ని గాదు.. ఎట్టాలనిపించలేదు.. ఇయ్యాల నీకు సేతులెత్తి దండవెడతన్నాను.. నా మాట తీసెయ్యకు.. నేనెల్లిపోయాక ఉంకో పెల్లి సేసుకో.. ఈ ఒక్క కోరికా తీరుసు.." గదిలోనుంచి బయటికి వెళ్ళిపోయాడు రంగశాయి.

పది నిమిషాలన్నా గడవక ముందే మళ్ళీ గదిలోకి వచ్చాడు. అలాగే కూర్చుని ఉంది కృష్ణవేణి. మూసుకున్న రెప్పల నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తువ్వాలుతో ఆమె ముఖం తుడిచాడు. భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమెని తన వొళ్ళో పడుకో బెట్టుకుని చిన్నగా జోకొట్టడం మొదలుపెట్టాడు.

"నా మాట తీసెయ్యవుగదా.." అడుగుతోంది కృష్ణవేణి.. అది మెలకువో, మగతో, నిద్రో తెలియడం లేదు.


మరో నాలుగు రోజులు మామూలుగానే గడిచిపోయాయి. ఐదో రోజు కూడా మామూలుగానే తెల్లారింది. కానీ, కృష్ణవేణి నిద్రలేవలేదు. మతిపోయిన వాడిలా కూర్చున్నాడు రంగశాయి.

ఆ వీధిలో ఎవరికీ అంత త్వరగా తెల్లారదు. ఎండెక్కుతూ ఉండగా ఎవరో తొక్కుతున్న సైకిలు వెనుక కేరియర్ మీద కూర్చుని వచ్చాడు కాశీ. చూడగానే పరిస్థితి అర్ధమయ్యింది అతనికి.

"ఇదేట్రా సాయీ ఇలాగయ్యింది? పది రోజులై రాపోతంటే ఆలు కాడికెల్తా సూసెల్దారనొచ్చేను.." కాశీ చేతులు గట్టిగా పట్టుకున్నాడు రంగశాయి.

"ఈ కాలు కాదు గానీ, కదల్టాకి ఇంకోడి సాయం కోసం సూడాల్సొత్తన్నాది. ఇయ్యన్నీ సరే గానీ, పరిత్తితేటిప్పుడు? కారేక్రమం జరిపించాల.. డబ్బుల మాటేటి? నీ కాడున్నాయా?" ఏమీ మాట్లాడలేదు రంగశాయి.

"ఎదవ డబ్బురా నాయినా.. అది నేకుండా ఏదీ జరగదు.. నీకాడేటీ లేవని తెలుత్తున్నాది గానీ, గుమత్తా గోరికీ, దొరీతే ఓనరు గోరిక్కూడా ఓ మాట సెప్పి డబ్బట్టుకొత్తాను. నువ్వెక్కడికీ కదలకు.. ఇలాటప్పుడిల్లు కదలగూడదు.. ఉప్పుడే వొచ్చెతానొరే.."

బయల్దేరబోతున్న కాశీని ఆపి ఏమేం తేవాలో చెప్పాడు రంగశాయి. ఒక్క క్షణం రంగశాయిని తేరిపారా చూసి, సైకిలెక్కాడు కాశీ.

అతను తిరిగి వచ్చేసరికి చుట్టుపక్కల ఆడవాళ్ళు నలుగురైదుగురు చేరారు అక్కడ. కబురు తెలిసి ఒక్కొక్కళ్ళూ వస్తున్నారు. తల దగ్గర వెలుగుతున్న నూనె దీపం చూస్తే తప్ప, వీధిలో చాపమీదున్న కృష్ణవేణి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తోంది రంగశాయికి.

కాశీని చూస్తూనే ఆత్రంగా ఎదురెళ్ళి పూలబుట్ట అందుకున్నాడు. దేవుడికి పూజ చేస్తున్నంత శ్రద్ధగా పూలతో అలంకరించాడు కృష్ణవేణిని. ఉదయం నుంచీ మొదటిసారిగా అప్పుడు వచ్చింది అతనిలో కదలిక. కాశీ భుజం మీద తలపెట్టుకుని శబ్దం రాకుండా ఏడ్చాడు రంగశాయి. అతని భుజం తడుతూ ఉండిపోయాడు కాశీ.

జరగాల్సింది చూడాలంటూ చుట్టుపక్కల వాళ్ళు కంగారు పెట్టేవరకూ కదల్లేదు వాళ్ళు. ఎగిసి పడిన చితిమంటలు తగ్గు ముఖం పట్టేవరకూ శ్మశానంలోనే ఉండిపోయిన రంగశాయి, వీరబాహుడి పోరు పడలేక అర్ధరాత్రి వేళ రోడ్డు మీదకి వచ్చాడు.

ఆ తర్వాత, ఆ చుట్టుపక్కల ఎవరికీ అతను కనిపించలేదు.

(ఇక ముగింపే ఉంది)

బుధవారం, ఆగస్టు 06, 2014

కృష్ణవేణి-16

ఫాల్గుణ మాసం పూర్తికావొస్తూ ఉండడంతో వసంతాగమన ఛాయలు కనిపిస్తున్నాయి అక్కడక్కడా. వేపచెట్టు మీద కోయిల గొంతు సవరించుకోనా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్టుంది. అమ్మవారి గుడి పూజారి పేర్రాజు, కోయిలని ఏమాత్రం పట్టించుకోకుండా వేప కొమ్మల్ని కోసి తోరణాలతో గుడిని అలంకరిస్తున్నాడు. ఉగాదికి కొంచం ముందుగా గ్రామదేవత జాతర.

వీధి గుమ్మంలో రాశిగా పోసి ఉన్న లేత మావిడాకులని గుమ్మాలకి కడుతున్నారు పంతులుగారు. బట్టతలా, కళ్ళజోడూ వచ్చినా ఆయనలో చురుకు తగ్గలేదు. ఇల్లు కడిగి ముగ్గులు పెడుతున్న సరస్వతమ్మ మాత్రం ఆయాసపడుతూ, ఇదివరకటి ఓపిక తగ్గిపోయినందుకు నిట్టూరుస్తోంది.

చీకటి పడుతూనే బిందెడు మంచి నీళ్ళు మూత, చెంబుతో సహా తెచ్చి వీధరుగు మీద పెట్టేసింది. పంతులుగారు తెచ్చిన పూలతో పది పన్నెండు చిన్నచిన్న మాలలల్లి పక్కన పెట్టింది.

అమ్మవారి గుడి దగ్గర డప్పు మీద దెబ్బ పడడంతోనే ఊళ్ళో హడావిడి మొదలయిపోయింది. కుర్రాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ, పెద్దవాళ్ళందరూ గుడి దగ్గరకి చేరారు, వాళ్ళతో పాటే చిన్నపిల్లలూ.

రంగురంగుల పైజమాలు, వాటిమీద మెరుపుల మెరుపుల గౌన్లు వేసుకుని, కాళ్ళకి గజ్జెలు కట్టుకున్న ఆసాదులు గరగల్ని తలమీద పెట్టుకుని లయబద్ధంగా ఆడడానికి సిద్ధ పడిపోయారు. పదిమంది ఆసాదుల్లో ఇద్దరు ఆడవాళ్ళు. ఓ పక్క డప్పులు, మరోపక్క డోలూ సన్నాయి మోగేస్తున్నాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఆసాదులు రెండు చోట్లా నృత్యం చేస్తున్నారు.

తలపాగాల్లో జాగ్రత్తగా అమర్చిన ఇత్తడి గరగలు తళతళా మెరుస్తున్నాయి. కుండలంతంత ఉన్న ఆ గరగలు ఏమాత్రం కదలకుండా లయబద్ధంగా ఆడుతున్నారు ఆసాదులు. చిన్నపిల్లలు నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు ఆ సంబరాన్ని.

నేలమీద పరిచిన బరకం మీద రెండు రూపాయల నోటు పెట్టి,వెల్లకిలా పడుకుని లయబద్ధంగా కదులుతూ కంటి రెప్పతో ఆ నోటుని అందుకోడం లాంటి విద్యలు ప్రదర్శించారు ఆసాదులు.అర్ధరాత్రి అవుతూ ఉండగా సాంబ్రాణి ధూపాలతో అమ్మవారి ఊరేగింపు ఊళ్లోకి బయల్దేరింది.

పంతులుగారి ఇంటి దగ్గర ప్రత్యేకంగా ఆగి ఆటాడడం, తాంబూలం పుచ్చుకుని వెళ్ళడం రివాజు ఆసాదులకి. ఆట అవుతూనే, అలవాటు చొప్పున గరగలన్నింటికీ పూలదండలతో అలంకరించేందుకు సిద్ధపడింది సరస్వతమ్మ.

డప్పుల వాళ్ళు బిందెలో నీళ్ళు తాగుతూ ఉండగా, ఒక్కో ఆసాదూ ఆమె ముందు తల వంచి గరగకి దండ వేయించుకుంటున్నారు. చివరలో నిలబడ్డ స్త్రీని పరీక్షగా చూసింది సరస్వతమ్మ.

తలమీంచి గరగని తీసి చేత్తో పట్టుకుని, "నేనండమ్మా.. రమాదేవిని.. బావున్నారా?" నవ్వుతూ అడిగింది రమాదేవి.

"ఎక్కడో బాగా తెలిసిన మొహంలా కనిపిస్తోంది.. ఎవరా అనుకున్నాను? నువ్వేమిటమ్మా ఇక్కడ? నాటకాల్లో వేసే దానివి కదా?" ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ.

"అదంతా పెద్ద కతమ్మా.. ఇయ్యాల రాత్రంతా జాగారవే.. పొద్దున్నే ఒచ్చి కనిపింతాను.. సెలవిప్పిచ్చండి," అంటూనే ముందు వెళ్తున్న ఆసాదుల్లో కలిసిపోయింది రమాదేవి.

"ఫలహారానికి వచ్చెయ్యమ్మా," వెనుకనుంచి చెప్పింది సరస్వతమ్మ.


తెల్లారుతూనే చీరలో వచ్చింది రమాదేవి. అలసట, నిద్రలేమితో పాటు ఇంకేదో తేడా కనిపిస్తోంది ఆమె ముఖంలో. ఇంట్లో చాలా మార్పే కనిపించిందామెకి. అలికి, ముగ్గులేసి ఉండే నట్టిల్లు గచ్చుతో మెరుస్తోంది. పెద్ద రేడియో స్థానాన్ని పోర్టబుల్ టీవీ ఆక్రమించింది.

"ఇలా అయిపోయావేమిటి రమాదేవీ? నాటకాల నుంచి గరగల్లోకి ఎప్పుడొచ్చావు?" పళ్ళెంలో ఉప్పుడు పిండి, చిన్న గిన్నెలో మెట్ట వంకాయ కాల్చి చేసిన పచ్చడి వేసి అందిస్తూ అడిగింది సరస్వతమ్మ.

"ఏనాటి నాటకాలమ్మా.. మనూల్లో ఆడే పదేనేల్లయిపోతంది.. ఆ తరవాత ఏడాదో, రెండేల్లో.. ఈదిలో తెరకట్టి సినిమాలు ఆడిచ్చటం వొచ్చాక నాటకాలు సూసేవోల్లు లేరు, ఆడిచ్చే వోల్లూ లేరు.. మర్నాలాటోల్లు బతకాలగదా.. నేను తినాల.. పిల్లలకెట్టుకోవాల," ఓసారి వీధిలోకి చూసింది.

"పనికోసం నెతుక్కుంటంటే తెల్సింది.. ఆడాసాదులు తొక్కువున్నారని.. కాలికి గెజ్జె కట్టటం అలవోటైన ఇజ్జే గదమ్మా.. పైగా దైవ కార్యం.. నాల్డబ్బుల్తోపాటు, కూతంత పున్యమూ వొత్తాది గదా అనేసి..." మంచినీళ్ళు తాగడం కోసం ఆగింది రమాదేవి.

"వయసు పెరిగిందనుకో.. అయినా ఇదివరకటి కళ కనిపించడం లేదు రమాదేవీ? ఆరోగ్యం బాగుండడం లేదా?" మరికొంచం ఉప్పుడు పిండి వడ్డిస్తూ అడిగింది సరస్వతమ్మ.

"మీరు మాత్తరం ఎంత మారిపోయేరు? పంతులుగారూ అంతే.. గబాల్న సూత్తే గుర్తట్టలేకుండా అయిపోయేరు," ఒక్క క్షణం ఆగింది.

"నా కతేం సెప్మంటారు సెప్పండి. నాటకాల్లాగే ఇదీ ఏడాది పొడూతా ఉండే పనేం కాదు. జాతర్లున్నప్పుడే సేతినిండా పని.. ఇస్సూత్తే దేవుడి సేవ.. అంటున్నప్పుడు సెయ్యకూడదుగదా. ఆయడ్డు రాగూడదని మాత్తర్లు వోడేను శాన్నాల్లు.. ఒద్దే వోడకూడదంట. తెలిసేతలికే ఒంట్లో తేడా పెట్టేసింది. ఒకటనిగాదమ్మా, పడాల్సినయి, పడకూడనియి అన్నీ పడ్డాను.." రమాదేవి గొంతులో బాధ తాలూకు జీర.

"చఛ.. బాధ పడకమ్మా.. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు కదా.. బాధలు వొస్తూ పోతూ ఉంటాయి.." ఓదార్పుగా అంది సరస్వతమ్మ.

"నాకు మాత్తరం రాటవే తప్ప పోటం కనబడ్డం లేదమ్మగారూ.. మొగోడు సరైనోడైతే ఆడది ఎంతైనా కమ్ముకు రావొచ్చు. మా మాయున్నాడు సూడండి.. కల్సిరాపోగా నన్ను రోడ్డుమీదెట్టేడు. నాటకాలునన్ని రోజులు బానే ఉండేవోడు. తరవాత ఇంకేపన్లోనూ తిరంగా కుదురుకోలేదు.. మన్నారాయన్రావు గోరు రొండు మూడు సార్లు కొయిటా ఎల్లొచ్చేరన్తెల్సి ఆరిద్వారా ఈసా కార్డుకి ప్రెయిత్నం సేసేను.. పనవ్వలేదు..," ఆగి గుటక మింగింది రమాదేవి.

"మొగోడికి ఇంట్లో ఆడదేగదమ్మా లోకువ. పైగా నేనందర్లాటాడదాన్నీ గాదు.. గుడ్లిప్పుకుని నలుగుర్లోనూ గెంతులేసిందాన్ని.. నిజంగా గెంతులేసినన్నాలూ నోరిప్పలేదు. బేరాలు పోయిన కాన్నించీ ఆన్నోటికి సుతీ పతీ లేకండా పోయింది.. ఎవురికి సెప్పుకోవాలమ్మా.." ఉన్నట్టుండి మాట్లాడ్డం ఆపి, మౌనంగా ఉండిపోయింది రమాదేవి. టీ తెచ్చి ఇచ్చింది సరస్వతమ్మ.

"ఇంటింటికో కథమ్మా.. ఆడదానికే పెడతాడు భగవంతుడు," అంది చెయ్యి తుడుచుకుంటూ. కాసేపటి తర్వాత నోరిప్పింది రమాదేవి.

"ఓ రకంగా కృష్ణేని అదురుట్టవొంతురాలు అనిపిత్తా ఉంటాది. దానికోసం పెల్లాం, కాపరం వొదిలేసుకున్నాడో మొగోడు. నేనూ అందర్లాగే ఇదెన్నాల్లు సాగుద్దిలే, పెల్లాన్నే ఒదిలేసినోడికి కృష్ణేనో లెక్కా అనుకున్నాను.." ఆసక్తిగా చూసింది సరస్వతమ్మ.

"కానమ్మా, ఆల్ల ముందర ఏ మొగుడూ పెల్లవూ సాల్రంటే నమ్మండి. నా కల్లతో సూసింది సెబుతున్నాను. అచ్చరాలా పువ్వుల్లో పెట్టి సూసుకుంటన్నాడు దాన్ని.. దిట్టి తగిలేట్టున్నారిద్దరూను.." చెబుతున్నదల్లా పంతులుగారు రావడం చూసి మాట్లాడడం ఆపేసింది రమాదేవి.

"ఏమ్మా.. బావున్నావా?" అని పలకరించి, లోపలికి వెళ్ళారాయన.

"ఎల్లొత్తానమ్మా.. ఇన్నేల్లైనా ఈ రమాదేవిని ఇంకా గుర్తెట్టుకున్నారు, సంతోసం.. దేవుడు సల్లగా సూత్తే వొచ్చే ఏడాది మల్లీ కనిపింతాను."

బొట్టు పెట్టించుకుని, వెళ్ళడానికి లేస్తూ "పలారం శానా బాగున్నాదమ్మా," అంది రమాదేవి.

"కుక్కర్లో చేశానమ్మా," అంది సరస్వతమ్మ సంతోషంగా.

(ఇంకా ఉంది)

సోమవారం, ఆగస్టు 04, 2014

కృష్ణవేణి-15

పొద్దు వాటారబోతోంది. వాతావరణం గంభీరంగా ఉంది. నలుగురు పెద్ద మనుషుల్లోనూ ఇద్దరు కుర్చీల్లోనూ, మరో ఇద్దరు ముక్కాలి పీటల మీదా కూర్చున్నారు. గోడకి ఆనుకుని కూర్చున్నాడు రంగశాయి. గుమ్మానికి ఆనుకుని నిలబడింది మంగళగౌరి. ఈశ్వరబాబు, సుగుణ వాళ్ళ గుమ్మానికి చేరబడ్డారు. 

గంట దాటింది పంచాయితీ మొదలయ్యి. పెద్ద మనుషులు టీలు పూర్తి చేసి చుట్టలు కూడా వెలిగించారు. తనవల్ల తప్పుందని ఒప్పుకోవడంలేదు మంగళగౌరి.

"కాపరాల్సేసుకునే ఇల్లలో ఇల్లాంటియ్యి కుదరవని సెప్పండి దానికి. సంసార్లుండే ఇల్లియ్యీ.." సాగదీశాడు ఈశ్వరబాబు.

"ఓయబ్బో సంసారాలు.. అందరి సంసారాల కతా అందరికీ తెలుసున్నాదే.. ఇది నా ఇల్లు. నా పక్కన ఉండలేనోల్లు ఏరే ఇల్లు సూసుకోవొచ్చు. అంత కట్టపడి ఉండక్కర్లెద్దు," తనూ తగ్గకుండా సమాధానం చెప్పింది మంగళగౌరి.

"పెల్లాన్నలా ఒదిలేసేవేట్రా నువ్వూ.. నాలుగు తగిలిత్తే దార్లోకొచ్చేది," తమ్ముడి మీద పడ్డాడు ఈశ్వరబాబు. రంగశాయి ఏమీ మాట్లాడలేదు. మంగళగౌరి ఊరుకోలేదు.

"పెట్లో ఉన్న పెల్లాం పట్టుసీర దానికి తెలకుండా అట్టూపోయి ఉంచుకున్న దానిక్కట్టబెట్నోడు కూడా నా గురించి మాట్టాడేవోడే.." ఆ మాటలు వింటూనే తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది సుగుణ. పళ్ళు పటపటా కొరికాడు ఈశ్వరబాబు.

"సూడండొలే.. మీ ఇద్దరికీ పెల్లయ్యింది. ఓ కొడుకుట్టేడు. ఆ కుర్నాకొడుకుని అమ్మమ్మోలింటికి తోలేహేరు. ఇక్కడ సూత్తే మీ ఇద్దరిదీ తలోదారి కిందా కనిపింతన్నాది. కాపరవన్నాక ఏయో ఉంటానే ఉంటాయి. ఎవులో ఒకలు తగ్గాల. పలానీ వోల్లింట్లో ఇల్లాగంట అని మాటడిపోవాల్సొత్తాది. కులానికి సెడ్డపేరు," ఆగి అందరివైపూ చూశాడో పెద్దమనిషి.

"సిన్నోల్లు కాదుగదా ఇద్దరికిద్దరూను. ఆలోసించుకోండోపాలి. బాబొరే రంగసాయీ.. అదేవన్నా పరాయిదంట్రా.. అక్క కూతురే గదా నీకు.. ఎంత సక్కగా సూసుకోవాలి సెప్పు? ఏదో సిన్న పిల్ల.. అయినియ్యేయో అయిపోయేయి.. సదిరేసుకోండి. కుర్రోన్ని తెచ్చుకుని ఎట్టుకున్నారంటే అన్నీ అయ్యే దార్లోకొత్తాయి.." ఆ పెద్దమనిషే చాలా ఓపికగా మాట్లాడాడు. చూసి ఊరుకున్నాడు రంగశాయి.

"ఏటాన్ని బతివాలేది. ఆడేవీ మీక్కబురెట్టి పిల్లేదు గదా.. మిమ్మల్ని పిలిసిన పెద్దమడిసి అడుగో అక్కడున్నాడు.. ఆడికే సెబుతున్నాను. ముసల్దిచ్చిన ఈ ఇల్లు నాది.. ఎనకున్న కొబ్బురు సెట్లు కూడా నాయే. ఆటి పలసాయం సరిపోద్ది నాకు. అమ్మా బాబూ ఉన్నారు, తోడ బుట్టినోల్లు ఉన్నారు. ఇంకోడి దయా దాచ్చిన్యం అక్కర్లెద్దు నాకు," స్పష్టంగా చెప్పింది మంగళగౌరి.

"అది కాదొలే.. మొగుడూ పెల్లాం అన్నాక కొంపా కాపరం ఉండాలి గదంటే," ఇందాకటి పెద్దమనిషే మళ్ళీ అని, "నువ్వు నీ ఇట్టం వొచ్చినట్టు ఉంటానంటే ఎల్లాక్కుదురుతాదీ?" అనడిగాడు.


"ఎందుక్కుదరదూ.. మా రాజాలాగా కుదుర్తాది. నా ఇంట్లో నేనుంటన్నాను. ఒకల్ల సొమ్ము తింటం లేదు.. ఒకల్ల జోలికెల్లటం లేదు. నా జోలికి కూడా ఎవల్లూ రాకండా ఉంటే బాగుంటాది.." అంది మంగళగౌరి.

"మర్నీ మొగుడు.. ఆడి మాటేటి?" రంగశాయిని చిరాగ్గా చూస్తూ అడిగాడు రెండో పెద్ద మనిషి. గోడ బీట నుంచి గడప నెరజలోకి బారుగా పాకుతున్న నల్లచీమల్ని శ్రద్ధగా చూస్తున్నాడు రంగశాయి. 

"ఆన్ని కట్టుకున్నాను.. కొడుకుని కన్నాను.. కాబట్టే ఈ ఇల్లూ, సెట్లూ నాయి. ఆడి సంగతా, సంపాయిచ్చట్టుకొచ్చి నా సేతిలో ఎడితే కూడెడతాను. వొద్దనుకుంటే ఆడిట్టం. ఆణ్ణి నేనేటీ అడగను.. ఆడూ నన్నేటీ అడక్కూడదు. నేను ఎవుల్లకీ ఏటీ సెప్పుకోవక్కర్లెద్దు," స్థిరంగా చెప్పింది మంగళగౌరి.

ఈశ్వరబాబు పులుకూ పులుకూ చూస్తున్నాడు. ఈ తగువెలా తీర్చాలో అర్ధం కాలేదు పెద్దమనుషులకి.

"నువ్వేటంటావురా?" నలుగురూ కూడబలుక్కుని అడిగారు రంగశాయిని.

"ఇల్లూ, సెట్లూ వొదిలేసుకుంటాను.. దానిట్టవైనట్టు సేసుకోమనండి," అన్నాడు రెండో ఆలోచన లేకుండా.

తమ్ముడికేదో అన్యాయం జరిగిపోతున్నట్టు అనిపించింది ఈశ్వరబాబుకి. "బాగా ఆలోసిచ్చేవేరా," తమ్ముణ్ణి గాభరాగా అడిగాడు. అన్నగారి కళ్ళలోకి చూసి, తలూపాడు రంగశాయి. 

"అంటే.. ఇంక ఈడికీ దానికీ ఏ సమ్మందం లేనట్టేనా? ఆడు కట్టు గుడ్డల్తో బయిటికి నడాలా?" అడిగాడు ఈశ్వరబాబు.

"కాపరం తల్లే.. ఇంకోసారి ఆలోసిచ్చుకో.. మీయమ్మోలతో ఆలోసింతావా పోనీ?" పెద్దమనుషులు అడిగారు మంగళగౌరిని.

"ఇందులో ఆలోసించటాకేటుంది? సిన్న పిల్లలం కాదని మీరే సెప్పేరు గదా.. మాకు పట్టంలేదు. ఎవుల్ల దారి ఆల్లం సూసుకుంటన్నాం అంతే.." అనేసింది.

"అయితే.. నా తమ్ముడు ఉంకో పెల్లి సేసుకోవొచ్చు గదా?" పెద్దమనుషులని అడిగాడు ఈశ్వరబాబు.

"ఇల్లూ, సెట్లూ నాకొదిలేసి మారాజులాగా సేసుకోవొచ్చు.. సమ్మందాలు సూసుకోమని సెప్పండి," అంది మంగళగౌరి.

ఈశ్వరబాబు ని పక్కకి పిలిచి "ఎంతయినా పరాయిది కాదు కదంట్రా.. అల్లరిసెయ్యక సూసీ సూన్నట్టూరుకో. ఇందులో నీ తమ్ముడి తప్పూ ఉందొరే.. ఆడు సరింగా సూడక పోబట్టే గదా.. దాన్దారి అది సూసుకున్నాది," అని చెప్పాడో పెద్దమనిషి.

"ఆడదిలాటిదైనప్పుడు ఎవుడు మాత్రం ఏం సేత్తాడు మాయ్యా," లోగొంతుతో అన్నాడు ఈశ్వరబాబు, బీడీ వెలిగించుకుంటూ. "సూద్దార్లేరా.. నాల్రోజులోతే అన్నీ అయ్యే సదురుకుంటాయి," పెద్దమనిషి మాట వినిపించుకోలేదు ఈశ్వరబాబు.

సూర్యాస్తమయం అవుతూ ఉండడంతో గూళ్ళకి చేరే హడావిడిలో ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతున్న పక్షులు కనిపించాయి, కూర్చున్న చోటినుంచి లేస్తున్న రంగశాయికి.

పెద్దమనుషులు ఇంకా బయల్దేరక ముందే, తన బట్టల సంచీ సైకిలుకి తగిలించుకుని అన్నా వదినలకి చెప్పి సైకిలెక్కాడు, "ఎదురుసూత్తా ఉంటాది.." అనుకుంటూ.

(ఇంకా ఉంది)

శుక్రవారం, ఆగస్టు 01, 2014

కృష్ణవేణి-14

"నీకు నాలుగ్గింజలు కొల్టం నాకేం బలువు కాదు బుల్లే.. పరాయిదానివి కాదుగదా. కానొలే, ఇంటికి మొగోడొస్తా ఎల్తా ఉండగా నువ్విలా అప్పుచ్చుకోటవేటే?" ..వెనుక గుమ్మం వైపు నుంచి ఓ ఆడగొంతు నెమ్మదిగా వినిపించడంతో మెలకువ వచ్చింది రంగశాయికి.

పక్కన కృష్ణవేణి లేదు. చూడబోతే ఇంకా పూర్తిగా తెల్లవారినట్టే లేదు. కదలకుండా పడుకున్నాడు. బయటి మాటలు వద్దన్నా వినిపిస్తున్నాయి.

"నెమ్మది సిన్నమ్మా.. ఆ మడిసి లెగుత్తాడు," ..అది కృష్ణవేణి గొంతే, బాగా తగ్గించి గుసగుసగా మాట్లాడుతోంది.

"సూడొలే.. మనకాడికి మొగోడెందుకొత్తాడు? ఆడికి పెల్లం కాడ దొరకందేదో మనకాడ దొరుకుతాదని.. మనవెందుకు రానింతాం? నాల్డబ్బులు సంపాదిచ్చుకుందారని.. మొగోడంటే పడి సచ్చిపోయి కాదుగదా.. అందుకనీ, వొచ్చిన మొగోడి కాడ డబ్బుచ్చుకోవాలి. ఇచ్చుకోలేనోన్ని గుమ్మంలో అడుగెట్టకుండా సెయ్యాలి.."

ఉన్నట్టుండి కోడి కుయ్యడంతో కొన్ని మాటలు వినబడలేదు.

"నీకు తెల్దని కాదు బుల్లే.. డబ్బుచ్చుకోపోగా, కూకోపెట్టి పోసింతానంటే,  మర్నీ పొట్ట గడిసే దారీ సూసుకోవాలి గదా..వొయిసులో వున్నప్పుడే ఇల్లాగుంటే, ఇంక వొయిసైపొయ్యేక పరిత్తితేటే " కాస్త ధాటీ గానే మాట్లాడుతోంది పెద్దావిడ.

"ఏం సెప్పను సిన్నమ్మా? ఆ మడిసిని డబ్బడగలేన్నేను.. నువ్వేటన్నా అనుకో గీనీ.." తర్వాతి మాటలు వినిపించడం లేదు.

"ఓ మాట సెబుతానినుకుంటావా.. మా పెద్దమ్మ కూతురొకత్తుండేది.. నీకు తెల్దులే.. నువ్వప్పటికి బాగా సిన్న పిల్లవి.  డ్రామాల్లో ఏసేది, నీకుమల్లిగానే.  ఓ పాలి నన్నూ తీసికెల్లింది.  అదేదో కన్యా సులకవంట నాటకం. ఇది కట్టినేసం మదురోని.." గొంతు తగ్గించింది కొంచం.

"మన కులం పిల్లే.. ఆ మదురోనంటాదీ అంగడోడికి మిటాయి మీద ఆసి, సాన్దానికి వొలపూ మనసులోనే ఉండాలంట. బంగారం లాటి మాట గదంటే.. అందుకేకావాల ఇన్నాల్లైనా గురుతుండిపోయింది.  కాబట్టి పిల్లా, పేవలూ అయ్యీ పెట్టుకోకు.  మీయక్కకి నువ్వున్నావు కాబట్టి కడతేరిసేవు.  మర్నీకెవులున్నారే? ఆలోసిచ్చుకో..."

ఒక్క క్షణం నిశ్శబ్దం.

"సర్లే సిన్నమ్మా.. ఇయ్యాల్టిగ్గింజలు కొలు. ఏదోలాగ తీరిసేత్తాను.. ఉంచుకునే మడిసిని కాదు," నిష్టూరం వినిపిస్తోంది కృష్ణవేణి గొంతులో.

"ఓయమ్మ.. కోపం సెయ్యకే.. పరాయిదానివంటే నువ్వు? పెద్ద దాన్నిగదా, కూతంత మంచీ సెడ్డ సెబుదారనిపిచ్చింది.. ఎవులంతటోల్లు ఆలమ్మా.. ఉచ్చుకో గింజలు.."

తర్వాత మాటలు వినిపించలేదు రంగశాయికి. తలగడలో మొహం పెట్టుకుని బోర్లా పడుకున్నాడు. కృష్ణవేణి గదిలోకి వచ్చి, చూసి వెళ్ళిన అలికిడి తెలిసినా కళ్ళు తెరవలేదు చాలాసేపటి వరకూ.

నిద్ర లేచిన రంగశాయి చాలా మామూలుగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది కృష్ణవేణి. పెందలాడే భోజనం కానిచ్చి సినిమా హాలుకి బయలుదేరాడతను.

సాయంకాలమైంది. సైకిల్ బెల్ శబ్దానికి వీధిలోకి వచ్చిన కృష్ణవేణి, రంగశాయినలా చూస్తూ ఉండిపోయింది. హ్యాండిల్ కి బరువుగా వేలాడుతున్న రెండు సంచులు, వెనుక కేరియర్ కి బియ్యం మూట. ఒక్కోటీ తెచ్చి లోపల పెట్టాడు. ఏమీ మాట్లాడకుండా మంచినీళ్ళ గ్లాసు అందించింది కృష్ణవేణి.

నీళ్ళ గ్లాసు అందుకోబోతూ, బనీనులో చెయ్యి పెట్టి తామరాకు పొట్లం బయటికి తీశాడు రంగశాయి. పొట్లం జాగ్రత్తగా విప్పి ఆమె దోసిట్లో పెట్టాడు.


ఒక్కసారిగా అతన్ని చుట్టుకుని భోరుమంది కృష్ణవేణి.  వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని ఎలా ఊరుకోబెట్టాలో అర్ధం కాక వెన్ను రాస్తూ ఉండిపోయాడు.

కాసేపటికి తేరుకున్న కృష్ణవేణి ముఖం కడుక్కుని వచ్చింది. ముందుగా టీ కాచి ఇచ్చింది. అతనితో కబుర్లు చెబుతూ, సంచుల్లో కాగితం పొట్లాలని డబ్బాల్లోకి మార్చింది.  చకచకా వంట చేసేసింది.

అతన్ని స్నానానికి పంపి, తనూ స్నానం చేసి వచ్చింది. అద్దకం ఉన్న తెల్ల గ్లాస్కో చీర కట్టుకుని జడ నిండా పూలు తురుముకుంది. భోజనం అవుతూనే అతనితో చాలా మాట్లాడాలనుకుంది కానీ ఆమెకి నోరు తెరిచే అవకాశం ఇవ్వలేదు రంగశాయి.

అర్ధరాత్రి వేళ వడగళ్ళ వాన పడుతున్న శబ్దానికి వీధిలోకి వచ్చారు ఇద్దరూ. నలిగిపోయిన పూలదండని జడలో నుంచి తీసేసింది. గుమ్మంలో ఎదురు చూస్తోన్న తామరాకు పొట్లాన్ని చేతుల్లోకి తీసుకుంది.

"మీయాయిన తెచ్చినియ్యి కామాల," నవ్వుతూ అన్నాడు రంగశాయి.

"నా సిన్నప్పన్నించీ ఏ రోజన్నా తిండి తినకండా ఉన్నానేమో కానీ, పూలెట్టుకోకుండా లేను. అంతిట్టం పూలంటే. మా వోల్లందరూ పిచ్చంటారు. పూలమ్మే వోడు వొతనుగా ఏసేసి ఎల్తాడు. ఆడు కనిపింతే సాలు.. అదుగోలే నీ మొగుడొచ్చేడు అని యేడిపింతారు మావోల్లు.. ఆడికి నా మొగుడనే పేరు కాయం సేస్సేరు.." మాట్లాడుతూనే జడ అల్లుకుని, పూలు తురిమేసుకుంది.

"నా కాతాలన్నీ మా సిన్నమ్మ కూతుల్లకి బెత్తాయించేత్తాను. అసులు మొగుడొచ్చేసేకా ఈల్లందరితోటీ పనేట్నాకు.." అంది కృష్ణవేణి.

ఆమె జళ్ళో పూలు మళ్ళీ నలిగాయి.

(ఇంకా ఉంది)