శనివారం, ఫిబ్రవరి 26, 2011

శకునాలుచెప్పే బల్లి

"అందరికీ శకునాలుచెప్పే బల్లి తను వెళ్లి కుడితిలో పడిందిట.." బామ్మ నోట ఈ సామెత ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు చిన్నప్పుడు. ఇవాళ పదేపదే గుర్తొచ్చిన సామెత ఇది. యాదృచ్చికంగా చూసిన రెండు టీవీ కార్యక్రమాలు ఇందుకు కారణం. టీవీ ఛానళ్ళు మారుస్తూ బాపూ సినిమాల్లోని పాటలు వస్తుంటే 'స్టూడియో ఎన్' దగ్గర ఆగాను మధ్యాహ్నం. బహుశా ముళ్ళపూడి వెంకట రమణకి నివాళిగా ఏదన్నా కార్యక్రమం ప్రసారం చేస్తున్నారేమో అనుకున్నాను మొదట.

అయితే, వ్యాఖ్యానం చూశాక అర్ధమయ్యింది ఏమిటంటే, కనుమరుగైపోతున్న తెలుగు వారి కట్టూ బొట్టూ పట్ల ఆ చానల్ వారు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ చేసిన కార్యక్రమం అని. వారి ప్రకారం ఇప్పుడు స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాలలోనూ ఎక్కడా కూడా మహిళల వస్త్రధారణ, అలంకరణ మన సంస్కృతిని ప్రతిబింబించడం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఫ్యాషన్ల వెంబడి పరుగులు తీస్తున్నారు తప్ప, సంస్కృతిని పట్టించుకోవడం లేదు.

టీవీ చానళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా అందుకు ముడి సరుకు సినిమా తప్ప మరొకటి లేదు కాబట్టి, ఈ కథనానికి కూడా జతగా కొన్ని సినిమా పాటల క్లిప్పింగులని వాడుకున్నారు. దర్శకులు బాపూ, వంశీలకి తెలుగు వారి కట్టూ బొట్టూ అంటే యెంతో మమకారం అని చెబుతూ, వారి సినిమాల్లో పాటల క్లిప్పింగులు కొన్ని ప్రసారం చేశారు. అలాగే ఇప్పటి తాజా సినిమాల్లో తారల వస్త్రధారణ గురించి ఆందోళన చెందుతూ అర్ధనగ్న క్లిప్పింగులనీ పనిలో పనిగా ప్రసారం చేసేశారు.

అంతటితో ఊరుకోకుండా, ఇప్పుడందరూ పరభాషా తారలే కాబట్టి వారు తెలుగు అలంకరణని వాళ్లకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటున్నారనీ, అదికూడా పూర్తిగా కాకుండా, కొంతమేరకేననీ కూడా గమనించేశారు. "ఇలా అయితే తెలుగు సంస్కృతి నిలబడేదెలా?" అని ఆవేదన చెందేశారు కూడా. ఈకార్యక్రమం చూడగానే నాకు విపరీతంగా నవ్వొచ్చింది. ఎందుకంటే, సదరు కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేసిన యాంకర్ పేరుకి చీర కట్టుకున్నా, ఇతరత్రా ఏ రకంగానూ కూడా తెలుగు అలంకరణ చేసుకోలేదు.

నేటి తెలుగు నాయికలు జడ వేసుకోడం లేదనీ, వోణీలని మరిచిపోయరానీ అరగంట సేపు ఆవేదన చెందిన ఆ యాంకర్ కూడా జడ వేసుకోలేదు. తూర్పు కొండల మధ్యన ఉదయించే సూర్యుడిలాంటి బొట్టూ కనిపించడం లేదు మన నాయికలకి అని చెప్పినావిడ నుదిటి మీద ఎంత పరకాయించి చూసినా బొట్టు కనిపించ లేదు నాకు. ఇక ఆవిడ చదివిన స్క్రిప్టులో తెలుగు పదాలని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. మరి ఈ కార్యక్రమం చూశాక బామ్మ చెప్పిన సామెత గుర్తు రాకుండా ఎలా ఉంటుంది?

ఈ కార్యక్రమం చూడ్డానికి కొన్ని గంటల ముందే ఉదయాన అనుకోకుండా టీవీ తొమ్మిది దగ్గర కాసేపు ఆగాను. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ లాంటి చర్చ. నిన్ననో, మొన్ననో ఆయన ఆ ఛానల్ మీద దావా వేసినట్టు ఎక్కడో చదివాను. ఆ నేపధ్యంలో, కార్యక్రమం ఏమై ఉంటుందా అని కాసేపు చూశాను. దావాకి కారణమైన తమ వివాదాస్పద ప్రోగ్రాం ని సమర్ధించుకోడానికి శతవిధాల ప్రయత్నించారు యాంకర్. "నా సినిమాలని ఏమన్నా అనండి. కానీ నావి కాని ఉద్దేశాలని నాకు ఆపాదించడం మానండి" అని మళ్ళీ మళ్ళీ చెప్పారు రాంగోపాల్ వర్మ.

"మీరీ వివాదం చేస్తున్నది మీ తదుపరి సినిమాని ప్రమోట్ చేసుకోడానికే కదా?" అని యాంకర్ తెలివిగా ప్రశ్నిస్తే, "నా సినిమా పబ్లిసిటీ కన్నా, మీ చానల్ కి పెరిగే టీఆర్పీ రేటింగే ఎక్కువ" అని అంతకన్నా తెలివిగా జవాబిచ్చారు వర్మ. మధ్యలో యండమూరి కలగజేసుకుని వర్మకి ఏదో సలహా ఇవ్వబోతే, దానిక్కూడా తీవ్రంగా స్పందించారు వర్మ. మెరుగైన సమాజం కోసం చర్చని హడావిడిగా ముగించారు ఛానల్ వారు.

సోమవారం, ఫిబ్రవరి 21, 2011

హంపీ నుంచి హరప్పా దాక

'ఒక శతాబ్దిలో వచ్చిన సుమారు రెండు వందల స్వీయ చరిత్రలలో ఉత్తమోత్తమ రచన' అంటూ ప్రకాశకులు ఇచ్చిన ఉపశీర్షిక అక్షర సత్యమన్న అనుభవం కలుగుతుంది, మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీ నుంచి హరప్పా దాక' చదవడం పూర్తి చేయగానే. ఐదువందల ఆరుపేజీల ఈ గ్రంధంలో తన జీవితంలో జరిగిన సంఘటనల్లో కేవలం మూడో వంతును మాత్రమే అక్షరబద్ధం చేయగలిగానన్న రచయిత ముందుమాటలో ఏమాత్రమూ అతిశయోక్తి కనిపించదు కూడా.

'ఆంధ్రప్రభ' వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన ఈ రచనను అజోవిభో కందాళం ఫౌండేషన్ 1997 లో ప్రచురించింది. ఐదేళ్ళ తర్వాత కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకుందీ రచన. హంపీకి సమీపంలోని కమలాపురం రామచంద్ర స్వస్థలం. జన్మించింది సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో. చదివింది సంస్కృతం, అనుసరించింది గాంధీమార్గం. తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం మరికొన్ని భాషలతో పరిచయం. జీవికకోసం ఎన్నో ఉద్యోగాలు చేసినా తనని తాను 'భాషా సేవకుడి' గానే గుర్తించుకున్నారు రామచంద్ర, చివరివరకూ.

హంపీ నగర చరిత్రతో మొదలు పెట్టిన ఈ ఆత్మకథ చదవడం మొదలు పెట్టాక, పేజీలు అలవోకగా తిరిగిపోతాయి. బసివి నాగమ్మ గురించి చెప్పినా, పాములతో సహవాసాన్ని చెప్పినా, నీటి ఎద్దడిని వర్ణించినా, పన్నారాజుని పరిచయం చేసినా రామచంద్రునిది ఓ ప్రత్యేకమైన శైలి అని అర్ధం చేసుకోడానికి ఎన్నో పేజీలు చదవనవసరం లేదు. ఆనాటి ఆచార వ్యవహారాలూ, కుటుంబ సంప్రదాయాలూ, సాంఘిక ఆర్ధిక పరిస్థితులూ ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగితే రామచంద్ర విద్యాభ్యాసానికి సంబంధించిన జ్ఞాపకాలు మొదలవుతాయి.

స్వాతంత్రోద్యమం ఊపందుకున్న ఆకాలంలో కుర్రవాడిని ఇంగ్లీష్ చదువు చదివించాలా, సంస్కృతం చదివించాలా అన్న విషయంలో చాలా పెద్ద చర్చే జరిగింది ఆ ఇంట్లో. ఇంగ్లీష్ చదువుకి ఆటంకాలు రావడం, సంస్కృతం చెప్పించాలన్న తాతగారి మాట నెగ్గడంతో దూరపు బంధువు శేషాచార్యులు గారి దగ్గర 'భయం భయంగా సంస్కృతం చదువు' మొదలయ్యింది. కొన్ని చిత్రమైన అనుభవాల అనంతరం ఆ చదువు చదవలేనని రామచంద్ర ఖరాఖండీగా చెప్పేయడంతో, అనేగొందిలోని మరో బంధువుల ఇంత అతణ్ణి ఉంచి చదువు కొనసాగేలా చేశారు కుటుంబ సభ్యులు.


బాల్యం తాలూకు చాపల్యాలు, నోరూరించే ఉల్లిపాయ పకోడీలు రుచి చూడడం కోసం ఇంట్లో దొంగతనం చేయడం, పాలకోవా బిళ్ళల కోసం బయట చేసిన మరో దొంగతనం వంటి జ్ఞాపకాలు చదువరులని పేజీల వెంట పరుగులు పెట్టిస్తాయి. ప్రేమాదరాలు ఎక్కువైనా భరించడం కష్టమే అంటారు రామచంద్ర. బంధువుల ఇంట చదువు ఎంత బాగున్నా, తిరుపతి సంస్కృత కళాశాలలో చదువుని గురించి బంధువుల కుర్రవాడి ద్వారా విని ఉండడంతో అక్కడ చేరాలన్న తాపత్రయం మొదలు కావడం, కుటుంబం నుంచి మద్దతు దొరకడం జరిగిపోతుంది.

రామచంద్ర పై గాంధీజీ ప్రభావం ఎంత ఉందన్నడానికి ఈ పుస్తకమే ఉదాహరణ. పుస్తకం చదువుతుండగా మహాత్ముడి 'సత్యశోధన' గుర్తొచ్చిన సందర్భాలు ఎన్నో. ముఖ్యంగా తన బలహీనతలని నిజాయితీగా ఒప్పుకోవడం, యవ్వనాకర్షణలు వాటి తాలూకు పరిణామాలని దాచకుండా రాయడం వంటివి. తన తల్లితో రామచంద్రకి ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమైనది. తన తొలి యవ్వనపు ఆకర్షణలని సైతం తల్లితో చర్చించి, ప్రాయశ్చిత్తానికి ప్రయత్నించడం పఠితలని అబ్బురపరుస్తుంది.

చదువుకోసం ఇల్లు విడిచిన ముహూర్తం ఎలాంటిదో కానీ ఆపై సంచార జీవితాన్నే గడిపారు రామచంద్ర. సహాయనిరాకరణ లో పాల్గొని జైలు జీవితాన్నీ రుచి చూశారు. అంతటి గాంధేయవాదీ జైలు జీవితం తర్వాత అతివాదులని సమర్ధించడం, అతివాద కార్యకలాపాల్లో స్వయంగా పాల్గొనడం ఒక వైచిత్రి అనే చెప్పాలి. జైలు కారణంగా చదువు నెల్లూరికి, అటుపై మద్రాసుకీ మారడం అక్కడో కుట్ర కేసులో ఇరుక్కోవడం, కుటుంబం నుంచి ఎలాంటి మద్దతూ దొరక్క పోవడం..ఇలా ప్రతి అధ్యాయమూ ఓ సస్పెన్స్ నవలని తలపిస్తుంది.

తిరుమల రామచంద్ర జీవితంలో ఆయనకి తారసపడ్డ మహామహుల జాబితాకి అంతు లేదు. ఆయనతో వారి సాన్నిహిత్యమూ గొప్పదే. తన తొలినాటి గురువు మొదలు తనకి తారసపడ్డ వ్యక్తులందరి పేర్లూ గుర్తు పెట్టుకోవడం (డైరీ రాసే అలవాటు లేకపోయినా) ఆయన అపూర్వ జ్ఞాపక శక్తికి నిదర్శనం. మద్రాసు ఓరియంటల్ కాలేజీలో తాళపత్ర గ్రంధాలని పరిష్కరించడం మొదలు, లాహోర్ విశ్వవిద్యాలయం లో పనిచేయడం, అటుపై సైన్యంలో హవల్దారుగా పనిచేసి ఆ తర్వాత పత్రికా రంగానికి మళ్లడం వరకూ రామచంద్ర జీవితం ఊహించని మలుపులు తిరిగింది. (ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే)

సైన్యంలో ఉద్యోగాన్ని విడిచి తిరిగి వస్తూ, హరప్పా నగరాన్ని చూడడాన్ని ఆయన వర్ణించిన తీరు చదివితే మనం స్వయంగా ఆ నగరాన్ని చూసిన అనుభూతికి లోనవుతాం. మొత్తం పుస్తకాన్ని అరవై ఒక్క అధ్యాయాలుగా విభజించిన రామచంద్ర ప్రతి అధ్యాయాన్నీ ఒక సంస్కృత శ్లోకంతో మొదలు పెట్టి, మరో శ్లోకం తో ముగించారు. ప్రతి శ్లోకానికీ అర్ధ వివరణ ఇవ్వడం మర్చిపోలేదు. అధ్యాయాల మధ్యలో సందర్భానుసారంగా మరికొన్ని ప్రాకృత శ్లోకాలనీ, కబీర్ దోహాలనీ పరిచయం చేశారు పాఠకులకి.

ఈ ఆత్మకథలో కుటుంబాన్ని గురించి రాసిన వివరాలు తక్కువ. తన వైవాహిక జీవితాన్ని గురించి కేవలం రేఖామాత్రంగానే చెప్పారు రచయిత. దేశంలో ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలనీ, ఎందరో ముఖ్య వ్యక్తులనీ మనకి పరిచయం చేయడం తో పాటు, భారత స్వంతంత్ర సంగ్రామం, అందులో పాల్గొన్న దేశ భక్తులకి ఎదురైన సమస్యలనీ కళ్ళకు కట్టిందీ పుస్తకం. పుస్తక ప్రియులంతా తప్పక చదవాల్సిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వెల రూ. 225.

బుధవారం, ఫిబ్రవరి 16, 2011

మొదటి సినిమాయాత్ర

ఊరిపక్కన టౌన్లో కొత్తగా టూరింగ్ టాకీస్ కట్టారనీ, రోజూ రెండు సినిమాలు వేస్తారనీ, అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతూ ఊళ్లోకి ప్రచారం రిక్షా రావడంతో అమ్మమ్మ వాళ్ళింట్లో హడావిడి మొదలయ్యింది. సినిమా అలా ఉంచి, అప్పటివరకూ ఊరి పొలిమేర దాటి బయటకి అడుగుపెట్టని అమ్మావాళ్ళ సందడికైతే కొదవ లేదు. అమ్మతో పాటుగా వాళ్ళక్క, ఆఖరి చెల్లి, తమ్ముడు సినిమా చూపించాల్సిందేనంటూ అమ్మమ్మని పట్టుపట్టారు.

పిల్లలకేనేంటి, అమ్మమ్మకి కూడా సినిమా అంటే సరదానే. ఆవిడా అప్పటివరకూ ఆనోటా ఆనోటా వినడమే తప్ప సినిమా అంతే ఎలా ఉంటుందో చూడలేదు మరి. మొత్తం తొమ్మండుగురు పిల్లల్లోనూ పాటు పడుతున్న నలుగుఋ పిల్లలనీ తీసుకెళ్ళి సినిమా చూపించడానికి అనుమతులూ అవీ సంపాదించుకుంది ఆవిడ. పొరుగూరు సినిమాకి వెళ్ళడం అంతే, ఇరుగు పోరుగులతో చెప్పకుండా ప్రయాణం అయిపోవడం కుదరదు కదా. అలా చెప్పడంలో అమ్మ వాళ్ళ మేనత్త, నాలుగిళ్ళ అవతల ఉండే ముసుగు బామ్మగారు కూడా వీళ్ళతో పాటు సినిమాకి ప్రయాణమయ్యారు.

అమ్మకప్పుడు పదేళ్ళు. వాళ్ళ అక్కకి పన్నెండు. తమ్ముడికీ, చెల్లికీ ఏడేళ్ళు, ఐదేళ్ళు వరుసగా. ఈ నలుగురు పిల్లలు, ముగ్గురు పెద్దవాళ్ళు సినిమాకి వెళ్ళే రోజు రానే వచ్చింది. టూరింగ్ టాకీస్ వాడు కేవలం మొదటి ఆట, రెండో ఆట మాత్రమే వేస్తాడు. పిల్లలు మాత్రం ఉదయం నుంచీ ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశారు. అటు మేనత్త ఇంటికీ, ఇటు ముసుగు బామ్మగారింటికీ వంతులవారీగా వెళ్లి వస్తూ, వాళ్ళని కూడా హడావిడి పెడుతున్నారు. ఎట్టకేలకి మధ్యాహ్నం భోజనాలు, కాఫీలు అయ్యాక అందరూ పొరుగూరికి కాలినడకన బయలుదేరారు.

ఇంట్లో దీపాలన్నింటినీ శుభ్రంగా తుడిచి, కిరసనాయిలు పోసిన ముసుగు బామ్మగారు, ఒక లాంతరుని వెలిగించి తెచ్చుకున్నారు, అప్పటికింకా ఫెళఫెళ్ళాడుతూ ఎండ కాస్తున్నప్పటికీ. అంత సందడిలోనూ, చలువ చేసిన మల్లు పంచ కట్టుకోవడం మర్చిపోలేదు ఆవిడ. మట్టిరోడ్డు దాటి, తార్రోడ్డు ఎక్కగానే నలుగురు పిల్లల ఆనందానికీ అంతు లేదు. నల్లటి రోడ్డుని చూడడం వాళ్ళకదే ప్రధమం మరి. రోడ్డు పక్కన షాపుల్ని, రోడ్డుమీద వెళ్తున్న వాహనాలనీ వింతగా చూసుకుంటూ సినిమా హాల్ చేరారా, అక్కడ ఒక్క పిట్ట లేదు. వీళ్ళని చూసి దూరంగా చుట్ట కాల్చుకుంటున్న వాచ్మన్ పరుగున వచ్చి, గేటు తెరిచి, వీళ్ళు కూర్చోడానికి బెంచీ చూపించాడు.

పిల్లలు ఆటల్లోనూ, ఆడవాళ్ళు కబుర్లలోనూ పడ్డారు. కూర్చునీ, కూర్చునీ వీళ్ళకి విసుగొచ్చాక, జనం ఒక్కొక్కరే రావడం మొదలు పెట్టారు. మరికాసేపటికి టిక్కెట్లు అమ్మడం మొదలయ్యింది. ఉన్నవి మూడు క్లాసులు. కుర్చీ, బెంచీ, నేల. ఆడవాళ్ళు కుర్చీకి వెళ్ళకూడదు కదా (ఎందుకు వెళ్ళకూడదో ఎవరికీ తెలీదు, వెళ్ళకూడదు అంతే) అందుకని బెంచీకి టిక్కెట్లు కొనుక్కున్నారు. అమ్మ వాళ్లక్కకి మినహా, మిగిలిన ముగ్గురు పిల్లలకీ ఫ్రీ టిక్కట్లే, కొత్తగా కట్టిన హాలు కదా మరి.

సినిమా మొదలయ్యింది. అందరూ సినిమాలో లీనమైపోయారు,ముసుగు బామ్మగారు మినహా. ఆవిడకి కొంచం గూని అవ్వడ వల్ల, బెంచీ మీద కూర్చుని చూడడం కష్టంగా ఉంది. ఈమాట ఆవిడ అమ్మమ్మ చెవిన వేసింది, నేల క్లాసులో కూర్చుని చూద్దామన్న ప్రతిపాదన కూడా. ఇప్పుడు నేల క్లాసంటే మళ్ళీ టిక్కెట్టు తీసుకోవాలేమో అని సందేహం అమ్మమ్మకి. పిల్లల్ని వెళ్లి గేటు కుర్రాడిని కనుక్కుని రమ్మని బతిమాలింది. అతను ఎంత మంచివాడంటే మళ్ళీ టిక్కెట్ అడక్కుండా వీళ్ళందరినీ నేల క్లాసులో కూర్చోబెట్టేశాడు.

మెత్తని ఇసుకలో కూర్చుని హాయిగా సినిమా చూస్తున్నారు అందరూ. ఉన్నట్టుండి సినిమాలో విశ్రాంతి రావడంతో హాల్లో లైట్లు వెలిగాయి. ఇంటిదగ్గర నుంచి తెచ్చిన అప్పచ్చులు అందరికీ పంచింది అమ్మమ్మ. వాటిని తింటూ అప్పుడు చూశారు పిల్లలు ఇసుకని పరీక్షగా. లైట్ల వెలుగులో మిలమిలా మెరిసిపోతూ గోదారిసక. ఇసకని చూడగానే, అమ్మ వాళ్లక్కతో కలిసి దూదుంపుడక ఆట మొదలు పెట్టేసింది. వాళ్ళ తమ్ముడూ, చెల్లీ అయితే ఇసుక ఒకళ్ళ నెత్తిమీద మరొకరు ఎత్తిపోసుకునే ఆట. ఇసకలో ఏ మేకులన్నా ఉంటాయేమోనన్న అమ్మమ్మ ఖంగారుని అస్సలు పట్టించుకోలేదు వాళ్ళు.

నేల క్లాసుకదా. అప్పుడే ఈనిన కుక్క ఒకటి తన నాలుగు పిల్లలతోనూ అక్కడికి ప్రవేశించింది. చిన్న పిల్లలిద్దరూ, ఆ పిల్లలని తీసుకెళ్ళి పెంచుకోవాల్సిందే అని పేచీలు మొదలు పెట్టారు. వద్దని వాళ్ళని ఒప్పించేసరికి మిగిలిన వాళ్ళ తల ప్రాణాలు తోకకి వచ్చాయి. అంత సందట్లోనూ ఇసుకలో దొరికిన శంఖులు, రంగు రాళ్ళతో మావయ్య జేబులు నింపేసుకున్నాడు. ఈ సరంభాలన్నింటి మధ్యా ఇంటర్వల్ పూర్తయ్యి సినిమా మళ్ళీ మొదలైంది.

విషాద సన్నివేశాలు వచ్చినప్పుడల్లా ముక్కులు ఎగబీల్చీ, కొంగులతో కళ్ళు వత్తుకునీ, వాళ్ళు పడ్డ కష్టాలని తల్చుకునీ మహిళలు ముగ్గురూ సినిమాని జయప్రదం చేసేశారు. ఇంట్లో ఉంటే ఆపాటికి బోయినం చేసేసి గాఢ నిద్రలో ఉండే పిల్లలు, ఆవేళ ఆకలీ, నిద్రా మర్చిపోయారు. సినిమా అవ్వడంతోనే తిరుగు ప్రయాణం. తార్రోడ్డు మీద నడక పూర్తయ్యింది, మట్టిరోడ్డులోకి మళ్ళాలి. పిల్లలు నలుగురూ ఆ రోడ్డులోకి రామంటేరామనేశారు. కావాలంటే తార్రోడ్డు మీద ఎంతదూరమైనా నడవడానికి సిద్ధం అంటారు వాళ్ళు. అలా ఎంత నడిచినా ఇల్లు రాదంటారు పెద్దాళ్ళు.

పెద్దాళ్ళు ముగ్గురూ కలిసి కృత్యదవస్థ మీద పిల్లల్ని మట్టి రోడ్డులోకి మళ్ళించారు. లాంతరు పట్టుకుని ముసుగు బామ్మగారు ముందు నడుస్తుండగా, వెనుకాల వరుసగా పిల్లలు, ఆ వెనుక పెద్దలు. అర్ధరాత్రి వేళకి ఇల్లు చేరారు అందరూ. "ఆ సినిమా కథ గుర్తు లేదు కానీ, ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ గుర్తు చేసుకుంటుంది అమ్మ.

మంగళవారం, ఫిబ్రవరి 15, 2011

వంశీకి నచ్చిన కథలు

తెలుగువాళ్ళకి వంశీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రచయిత, సిని దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రకృతి ఆరాధకుడు... కాలం గడిచేకొద్దీ వంశీలోని మరిన్ని కొత్తకోణాలు ఆవిష్క్రుతమవుతూనే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వంశీ సినిమాలు చూసిన, రచనలు చదివిన వాళ్లకి తన టేస్ట్ ని అంచనావేయడం పెద్ద కష్టమేమీ కాదు. పాఠకుడి నుంచి రచయితగా ఎదిగిన వంశీ, తన అభిమాన రచయితలు రాసిన కథల్లో తనకు నచ్చిన యాభై కథలతో వెలువరించిన సంకలనమే 'వంశీకి నచ్చిన కథలు.'

మెజారిటీ కథల్లో ఇతివృత్తం మానవనైజం. నిజానికి ఈ ఇతివృత్తంతో వందలకొద్దీ వైవిద్యభరితమైన కథలు రాయొచ్చు. ఎందుకంటే అంత చిత్రమైనది మానవనైజం. పరిస్థితులకి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడెలా మారుతుందో ఒక అంచనాకి రావడం కూడా కష్టం. మానవనైజం తర్వాత ఎక్కువ కథలు మృత్యువు ఇతివృత్తంగా సాగినవి. సెంటిమెంట్ తో పాటు, హాస్యం, వ్యంగ్యంతో సాగేవి, కరుణ, రౌద్ర రస ప్రధానమైన కథలకీ ఈ సంకలనంలో సముచిత స్థానం ఇచ్చారు వంశీ.

రవీంద్రనాథ్ టాగోర్ రచనకి వంశీ స్వేచ్చానువాదం 'అక్కడి రాళ్ళు ఆకలితో ఉన్నాయి' తో మొదలైన ఈ సంకలనంలో వంశీ తొలికథ 'నల్ల సుశీల,' గొల్లపూడి మారుతీరావు రాసిన 'జుజుమురా,' శ్రీరమణ 'ధనలక్ష్మి,' రాజేంద్రప్రసాద్-యమునల హిట్ సినిమా 'ఎర్ర మందారం' కి ఆధారమైన ఎమ్వీఎస్ హరనాధరావు కథ 'లేడి చంపిన పులి నెత్తురు,' కెఎన్వై పతంజలి రచన 'సీతమ్మ లోగిట్లో' ల మీదుగా సాగుతూ 'అంపశయ్య' నవీన్ రాసిన 'హత్య' కథతో ముగిసింది.

రావి కొండల రావు పేరు వినగానే హాస్యమే గుర్తొస్తుంది. కానీ సస్పెన్స్ ప్రధానంగా ఆయన రాసిన 'రెండు శవాలు' కథ ఆశ్చర్య పరుస్తుంది. కుప్పిలి పద్మ 'ఆడిపాడిన ఇల్లు' స.వెం. రమేశ్ 'ఉత్తరపొద్దు' కథలు వర్ణన ప్రధానంగా సాగినవి. 'జంగుభాయి,' 'మంత్రసాని' చాలామందికి అంతగా పరిచయం లేని జీవితాలని పరిచయం చేస్తాయి. దుత్తా దుర్గాప్రసాద్ 'దానిమ్మపండు,' తల్లావఝుల పతంజలి శాస్త్రి రచన 'వైతరణికీవల' కథలు చాలారోజులపాటు వెంటాడుతాయి.

అల్లం శేషగిరిరావు కథ 'చీకటి' పాఠకులని పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోతుంది. కథ కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపిస్తుందే తప్ప, చదువుతున్న భావన కలగదు. కాశీభొట్ల కామేశ్వరరావు కథ 'దుప్పటి' మానవనైజాన్ని చాకచక్యంగా చిత్రిస్తే, బివిఎస్ రామారావు కథ 'బైరాగి' ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపుతో అబ్బురపరుస్తుంది. శంకరమంచి పార్థసారధి రాసిన 'ఆరోజు రాత్రి' టి.ఆర్. శేషాద్రి కథ 'ప్రియే చారులతే!' సి.ఎస్. రావు రచన 'మళ్ళీ ఎప్పుడొస్తారు?" కథల్లో ప్రధాన పాత్రలు వేశ్యలు. ఈ మూడు కథల్లోనూ పోలిక ఇదొక్కటే.

నిజానికి ఈ సంకలనంలోని ఏ రెండు కథలనీ పోల్చలేము. హాస్య ప్రధానంగా సాగే మొక్కపాటి నరసింహ శాస్త్రి కథ 'మా బావమరిది పెళ్లి' సెంటిమెంటల్ టచ్ తో ముగిసే పాలగుమ్మి పద్మరాజు కథ 'కోట గోడలు' రొమాంటిగ్గా సాగే కప్పగంతుల సత్యనారాయణ కథ 'తెల్లవారుఝాము పాఠాలు' కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి కథ చివరనా ఆ కథ తనకి ఎందుకు నచ్చిందో వివరిస్తూ వంశీ రాసిన ఫుట్ నోట్స్ కొన్ని కథల్లోని కొత్త కోణాలని అర్ధం చేసుకోడానికి పాఠకులకి ఉపయోగపడుతుంది.

నాలుగొందల డెబ్భై పేజీల ఈ సంకలనం ప్రింటింగ్ కంటికింపుగా ఉంది. బాపు రూపుదిద్దిన కవర్ పేజీ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా ఉంది. తులసికోట దగ్గర నైవేద్యంగా కథల పుస్తకాలని ఉంచడం అన్నది బాపుకి మాత్రమే వచ్చే ఆలోచన. వంశీ అభిమానులు మాత్రమే కాక, వైవిద్యభరితమైన తెలుగు కథలని ఇష్టపడే వారందరూ తప్పక చదవ వలసిన సంకలనం ఇది. కుట్టిమాస్ ప్రెస్ ప్రచురించిన ఈ పుస్తకం 'విశాలాంధ్ర' అన్ని శాఖల్లోనూ దొరుకుతుంది. (వెల రూ. 200.)

సోమవారం, ఫిబ్రవరి 14, 2011

మరోచరిత్ర

తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో 'క్లాసిక్స్' గా స్థానం సంపాదించుకున్న అతికొద్ది విషాదాంత ప్రేమకథా చిత్రాలలో ఒకటి 'మరోచరిత్ర.' ముప్ఫైమూడేళ్ళ క్రితం నలుపు తెలుపుల్లో కే.బాలచందర్ సృష్టించిన ఈ అపూర్వ ప్రేమకావ్యం ప్రేక్షకుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, తమ ప్రేమ విఫలమవుతుందేమో అని భయపడ్డ కొందరు పిరికి ప్రేమికులు ఆత్మహత్యకి పాల్పడేంతగా. బాలచందర్ పుణ్యమా అని బాలు, స్వప్న అనే పేర్లు ప్రేమికులకి పర్యాయపదాలైపోయాయి తెలుగునాట.

కమలహాసన్, సరిత, మాధవిల అపూర్వ నటనా పటిమకి, బాలచందర్ దర్శకత్వ ప్రతిభ, ఎమ్మెస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు తోడవ్వడంతో తెలుగు, తమిళనాట సినిమా చరిత్రలో మరోచరిత్ర సృష్టించిందీ సినిమా. విశాఖ అందాలని ఇంతగా ఒడిసిపట్టిన సినిమా మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. బలమైన కథ, దానిని ఓర్పుగా తెరకెక్కించగల సాంకేతిక వర్గం, నేర్పుగా నటించగల నటీనటులు ఉంటే చిన్న బడ్జెట్ తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణ ఈ సినిమా.


బాలు (కమలహాసన్) ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. విశాఖలో వాళ్ళ పొరుగింట్లో ఉండే బ్రాహ్మణేతర కుటుంబానికి చెందిన అమ్మాయి స్వప్న (సరిత). చేస్తున్న ఉద్యోగం నచ్చక దాన్నివదిలేసి వచ్చిన బాలూ, కాలేజీలో చదువుతున్న స్వప్నతో ప్రేమలో పడతాడు. ఇద్దరి తల్లిదండ్రులకీ తెల్లారింది మొదలు రాత్రి వరకూ ప్రతి విషయంలోనూ తగువే. అమ్మాయికీ అబ్బాయికీ ఒకరి భాష మరొకరికి రాదు. అయినా ఇవేవీ వాళ్ళ ప్రేమకి ఆటంకాలు కాలేకపోయాయి.

చురుకైనదీ, తెలివైనదీ పైగా ఆధునికంగా ఉండేదీ అయిన స్వప్నని అభిమానించే వాళ్లకి కొదవ లేదు. ఆమె తరచూ వెళ్ళే పుస్తకాల షాపు ఓనరు ఆమెని ఆరాధించే వాళ్ళలో ఒకడు. అతని కారణంగా బాలు, స్వప్నల ప్రేమ విషయం వాళ్ళ పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది. అప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి వైజాగ్ మొత్తాన్ని చుట్టేసి పాటలు పాడేసుకోవడమే కాక కనిపించిన ప్రతి చెట్టుమీదా, పుట్టమీదా, రాయీ రప్పలమీదా వాళ్ళ పేర్లు రాసేసుకుంటారు.


ఇరుగుపొరుగులుగానే ఏమంత సఖ్యంగా ఉండని పెద్దవాళ్ళు పిల్లల ప్రేమకి ససేమిరా అంటారు. అయితే పిల్లల పట్టుదల కారణంగా ఓ మెట్టు దిగి వచ్చి, వీళ్ళ ప్రేమకి పరిక్ష పెడతారు. ఏడాది పాటు దూరంగా ఉండి ప్రేమని నిరూపించుకోమంటారు. వాదోపవాదాల అనంతరం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడానికి అంగీకరిస్తాడు బాలూ. వీళ్ళ ప్రేమ మీద ఏమాత్రం నమ్మకం లేని స్వప్న తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

కలిసి ఉన్నప్పటికన్నా విడిపోయాక ఒకరిమీద ఒకరికి ప్రేమ బలపడుతుంది బాలూ స్వప్నలకి. ఆవేశపరుడైన బాలూకి పరిచయమైన బాలవితంతువు సంధ్య (మాధవి) తనకి వచ్చిన నృత్యాన్ని నేర్పడం ద్వారా అతని ఆవేశాన్ని సక్రమమైన మార్గంలో పెడుతుంది. అంతేకాదు అతనికి స్వచ్చమైన తెలుగు నేర్పుతుంది కూడా. మరోపక్క తన పెళ్లి ప్రయత్నాలని తీవ్రంగా వ్యతిరేకించే స్వప్న, బాలూమీద తనకున్న ప్రేమని వ్యక్తం చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదు. గోడల నిండా అతని పేరు రాయడం, తల్లి కాల్చేసిన బాలూ ఫోటో బూడిదని కాఫీలో కలుపుకుని తాగేయడం...ఇవన్నీ సామాన్య విషయాలు స్వప్నకి.


అయితే ఓ చిన్న అపార్ధం కారణంగా మానసికంగా స్వప్నకి దూరమైన బాలూ, సంధ్యకి దగ్గరవుతాడు. స్వప్న ప్రేమలో సిన్సియారిటీని అర్ధం చేసుకున్న సంధ్య బాలూ స్వప్నలని దగ్గర చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుంది. ఇక కథ సుఖాంతమే అనుకుంటున్న తరుణంలో సినిమాని ఓ కర్కశమైన మలుపు తిప్పుతాడు దర్శకుడు. ఫలితం, వాళ్ళ ప్రేమ మొగ్గ తొడిగిన బీచ్ లోనే బాలూ స్వప్నల విషాదాంతం.

నిజానికిది నాయికల కథ. బాలూ పాత్ర కన్నా స్వప్న, సంధ్య పాత్రలు బలమైనవి. అందం, ఆవేశం మినహాయిస్తే బాలూలో మరో చెప్పుకోదగ్గ లక్షణం కనిపించదు. బాలూమీద పిచ్చి ప్రేమ స్వప్నకి. ఎంతగా అంటే 'నిన్ను ప్రేమిస్తున్నాను ఒక పిచ్చిది' అని అతని వీపు మీద రాసేంత. ఇప్పుడిప్పుడు బాలీవుడ్ ఖాన్ లని చూసి మన కుర్ర హీరోలు చేస్తున్న కండల ప్రదర్శనని మూడు దశాబ్దాల క్రితమే కమల్ చేసి చూపించాడు ఈ సినిమాలో. విధి తనకి పరిక్షలు పెట్టినా ఎదురొడ్డి నిలిచే స్థైర్యం సంధ్య సొంతం. కష్టాలకి కుంగిపోదు ఆమె.


ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత సారధ్యంలో పాటలన్నీ ఈనాటికీ మారుమోగుతున్నాయి. బాలూతో కలిసి సుశీల, జానకి, రమోల, ఎల్లారీశ్వరి, వాణీ జయరాం ఒక్కొక్క పాట పాడారు ఈ సినిమాకి. ఇది విశ్వనాథన్ స్టైల్ అనుకోవాలి. అందరూ చెప్పే పాట 'ఏ తీగ పూవునో' అయినా, నాకు మాత్రం 'పదహారేళ్ళకి..' 'విధి చేయు వింతలన్నీ..' బాగా ఇష్టం. 'కలిసి ఉంటే..' పాట సాహిత్యం, చిత్రీకరణ కూడా తమాషాగానే ఉంటాయి. మోడర్న్ దుస్తుల్లో సరిత కుర్రకారుని ఒక ఊపు ఊపింది అప్పట్లో.

హిందీలో 'ఏక్ దూజే కేలియే' పేరిట రీమేక్ చేసిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. హిందీ చిత్రానికి కూడా బాలచందరే దర్శకుడు. వరుణ్ సందేశ్, అనితలతో నూతన దర్శకుడు రవి యాదవ్ నిర్దేశకత్వంలో ఈ సినిమాని గతేడాది తెలుగులోనే రీమేక్ చేశారు నిర్మాత దిల్ రాజు. రీమేక్ ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా నిలబడిందీ సినిమా. అయితే బాలచందర్ 'మరోచరిత్ర' మాత్రం నిస్సందేహంగా తెలుగు సిని చరిత్రలో నిలిచిపోయే సినిమా.