శుక్రవారం, ఏప్రిల్ 30, 2010

శతాబ్ద కవి

ఒక వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయినా చాలా ఏళ్ళ తర్వాత కూడా, గుర్తు పెట్టుకుని మరీ అతని శతజయంతిని మనమంతా ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తి చాలా చాలా గొప్పవాడన్న మాట. గొప్ప వాడు కాబట్టే ఉదయం నుంచీ ఊరూరా శ్రీశ్రీ పాటలు వినిపిస్తున్నాయి. సాహితీ మందిరాలన్నీ 'అరుణారుణ' శోభని సంతరించుకున్నాయి. వీఐపీ లందరూ శ్రీశ్రీ గురించి తమకి తెలిసిందో తెలియందో మాట్లాడేస్తుంటే సామాన్య ప్రజలు ఎప్పట్లాగే వింటున్నారు.

శ్రీశ్రీగా మారిన శ్రీరంగం శ్రీనివాసరావు కి ఆత్మవిశ్వాసం హెచ్చు. కాబట్టే "ఈ శతాబ్దం నాది" అని రొమ్ము విరుచుకున్నాడు. చాలా మంది ఒప్పేసుకున్నారు. ఒప్పుకొని వాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళు శ్రీశ్రీ మన మధ్య నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోగానే, రెండో ఆలోచన లేకుండా శ్రీశ్రీ చెప్పింది నిజమేనని అంగీకరించేశారు. బతికున్న వాళ్ళ గొప్పదనాన్ని ఒప్పుకోడానికి ఏ మాత్రం ఇష్టపడని వాళ్ళు సైతం, అవతలి వాళ్ళు దూరం కాగానే రెండో ఆలోచన లేకుండా అభిప్రాయాన్ని మార్చేసుకుంటారు.

శ్రీశ్రీ విప్లవ కవి. ఆకలి నుంచే విప్లవం పుడుతుంది. ఆగర్భ శ్రీమంతుల ఇంత పుట్టినా, చిన్న వయసులోనే దరిద్రాన్ని రుచి చూశాడు శ్రీశ్రీ, పరిస్థితుల ప్రభావం వల్ల. ఆ రుచే అతన్ని మహాకవిని చేసింది. విప్లవం ఎప్పుడూ పేద వాడి పక్షాన్నే ఉంటుంది. శ్రీశ్రీ విప్లవ కవిత్వం కూడా "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?" అని ప్రశ్నించిందే తప్ప, వెన్నెల రాత్రుల్లో బంగారు వన్నెతో మెరిసిపోయే ఆ శ్వేత సౌధపు సౌందర్యాన్ని ప్రస్తుతించలేదు.

శ్రీశ్రీ కమ్యూనిస్టు. సోవియట్ రష్యాని ఎంతగానో అభిమానించాడు. అక్కడి విధానాలని మెచ్చుకున్నాడు. ఆ నోటితోనే ఇందిరా గాంధీ మొదలు పెట్టిన సంక్షేమ పథకాలనీ మెచ్చుకున్నాడు, విప్లవ పార్టీ వారి మనోభావాలు దెబ్బతిన్నా పట్టించుకోకుండా. శ్రీశ్రీ నాస్తికుడు. ఏనాడూ దేవుణ్ణి నమ్మలేదు. కానీ తను రాసిన కొన్ని సినిమా పాటలు విన్నప్పుడు ఈమాట నమ్మడం కష్టం. ఈ వైరుధ్యాలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కాదు, మొదటి నుంచీ ఉన్నవే.

ఎంత గొప్పవాళ్ళనీ శ్రీశ్రీ విడిచి పెట్టలేదు. "ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చాక ఏమన్నా అంటాం" అనేశాడు నిర్మొహమాటంగా. అలాగని తన విషయాలనీ ఏమాత్రం దాచుకోలేదు. పడకింటి విషయాలతో సహా అక్షరబద్ధం చేశాడు, తన ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల 'అనంతం' లో. ఈ పుస్తకం కొంచం అస్తవ్యస్తంగా ఉంది అని మిత్రులు కొందరు అభిప్రాయ పడ్డారు. శ్రీశ్రీ జీవితం కూడా అంతే కదా. శ్రీశ్రీ కి ఆత్మవిశ్వాసం అనిపించిన విషయాలే చాలామందికి అహంభావంగా వినిపించాయి. లోక సహజమే.

ప్రపంచపు బాధనంతటినీ తన బాధగా చేసుకుని శ్రీశ్రీ రాసిన గేయాల సంకలనం 'మహా ప్రస్థానం.' ఇది తెలుగు సాహిత్యం లో ఒక మైలురాయి. ఆ తర్వాత యెంతో మంది ఔత్సాహిక కవులు ఈ గేయాలని అనుకరిస్తూ సాహిత్య కృషి జరిపారు. కానీ అవేవీ 'మహా ప్రస్థానం' కాలేక పోయాయి. వాళ్ళెవరూ శ్రీశ్రీ లు కాదు కదా మరి. నాటికీ నేటికీ సాహిత్యంలో 'మహా ప్రస్థానం' ఒక్కటే..శ్రీశ్రీ ఒక్కడే. అతను చిరంజీవి.

ఆదివారం, ఏప్రిల్ 25, 2010

ఎల్లోరాలో ఏకాంతసేవ

ముప్ఫయ్యేళ్ళ వయసున్న వితంతువు జ్ఞాన సుందరి. అన్నయ్య ముఖప్రాణ్, చెల్లెలు నాగరాజ్యలక్ష్మిల ఇళ్ళలో చెరో కొంత కాలం గడుపుతూ రోజులు వెళ్ళదీస్తూ ఉంటుంది. తను నాగులూ అని పిలుచుకునే చెల్లెలన్నా, ఆమె కూతురు మధురభక్తి అన్నా యెంతో ఇష్టం జ్ఞానసుందరికి. చెల్లెలి ఇంట్లో ఆమెకి నచ్చని వాడు ఒక్కడే, చెల్లెలి భర్త మధుసూదనం. అతని రూపం, చూపులు,మాట తీరు ఏవీ నచ్చవు ఆమెకి.

అత్యంత చిత్రమైన పరిస్థితుల్లో అతనితో మూడు రోజులు ఏకాంతంగా గడపాల్సి వస్తుంది, అది కూడా ఇంటికి దూరంగా ఎక్కడో ఎల్లోరాలో. ఆ మూడు రోజుల్లో వాళ్ళిద్దరి మధ్యా ఏం జరిగింది? అనంతర పరిణామాలు ఏమిటి? అన్న ఇతివృత్తంతో బుచ్చిబాబు రాసిన పెద్ద కథ 'ఎల్లోరాలో ఏకాంతసేవ.' ఈ మధ్యనే చదవడం పూర్తి చేసిన బుచ్చిబాబు కథలు మొదటి సంపుటంలో నన్ను వెంటాడుతున్న కథల్లో ఇదొకటి.

ముఖప్రాణ్ సలహా మేరకు కొందరు కాలేజీ విద్యార్ధినులతో అజంతా, ఎల్లోరా విహార యాత్రకి బయలుదేరుతుంది జ్ఞానసుందరి. నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆ పిల్లల మధ్య ఆమె ఇమడలేక పోతుంది. ఎలిఫెంటా గుహలలో త్రిమూర్తి విగ్రహాన్ని చూడగానే ఆమెకి మధుసూదనం గుర్తొస్తాడు. సరిగ్గా అప్పుడే నాగులు నుంచి ఉత్తరం వస్తుంది. నాలుగు రోజులు క్యాంపు కి వెళ్ళిన మధుసూదనం వారం రోజులైనా తిరిగి రాలేదనీ, ఆఫీసుకి నెల్లాళ్ళు సెలవు చీటీ పంపాడనీ, తనకి భయంగా ఉందనీ జ్ఞానసుందరికి ఉత్తరం రాస్తుంది నాగులు.

"తను వెళ్లి చేసేదేమిటి? పోతే పొయ్యాడులే, పీడ విరగడయ్యింది అనబుద్దేస్తుంది. అట్లాగంటే క్షమిస్తుందా? భర్త లోటుపాట్లన్నీ తను పదిమందిలోనూ యాకరువు పెట్టొచ్చు గాని మరెవరైనా కాస్త ఆక్షేపించారంటే మండిపడుతుంది నాగులు. ...స్త్రీని ఆట వొస్తువుగా, ఆస్తిలో ఒక భాగంగా, బానిసగా వాడుకుంటున్నారు ఈ మొగాళ్ళంతా అంటుంటారు గాని, వీళ్ళెవరికీ అసలు విషయం తెలీదు. స్త్రీయే పురుషుణ్ణి పెద్ద హాల్లో మధ్య బల్ల మీద పూల తొట్టిలాగా చూసుకుంటుందని ఎవరూ పైకనరేం?" ..ఈ రకంగా సాగుతాయి జ్ఞానసుందరి ఆలోచనలు.

జ్ఞానసుందరికి మధుసూదనం అంటే భయం. మనిషేమంత బాగుండడు. చామచాయ, పెద్ద గుండ్రటి మెడ, దట్టమైన కనుబొమ్మలు. క్రాఫింగ్ కి నూని పట్టించడు, తల దువ్వుకోడు. అతని చేతులు, ముఖ్యంగా వేళ్ళ స్వరూపం తలచుకుంటే భయమేస్తుంది ఆమెకి. వేళ్ళతో 'కబళింపు' అంటే అవే గుర్తొస్తాయి. చేసేది జియాలజిస్టు ఉద్యోగం. "నిజంగా రాతి మనిషి" అనుకుంటుంది. తనతో మాట్లాడడం కోసం, ఏదో వంకని తనని తాకడం కోసం అతను చేసే ప్రయత్నాలన్నీ గుర్తొస్తాయ్ ఆమెకి ఆ రాత్రి.



తెల్లవారి అజంతాకి వెళ్తారు మిత్ర బృందం. అమ్మాయిలు తనని అజంతా సుందరి అని వ్యాఖ్యానించినప్పుడు బాధ పడుతుంది జ్ఞానసుందరి. తనకి భర్త లేకపోవడం వల్లనే అందరికీ లోకువయ్యానని అనుకుంటుంది ఆమె. ఆరోగ్యం బాగా లేకపోవడంతో మధ్యాహ్నం పూట వాళ్ళతో గుహలు చూడడానికి వెళ్ళకుండా బస్సు దగ్గరే ఆగిపోతుంది జ్ఞానసుందరి. అదిగో అప్పుడు కనిపిస్తాడు మధుసూదనం ఆమెకి. తను స్వేచ్చ కోసం ఇల్లు విడిచి వచ్చేశాననీ, తనని చూసిన విషయం నాగులుకి చెప్పొద్దనీ కోరతాడు మధుసూదనం.

అతను ఎవరో అమ్మాయితో అక్కడికి వచ్చి ఉంటాడని ఊహించిన జ్ఞానసుందరి ఆ రహస్యం చేదించాలని అనుకుంటుంది. తన బృందానికి ఉత్తరం రాసి పంపి, అతని వెంట బయలుదేరుతుంది. చిత్రంగా అతని గురించి ఆమె ఊహించుకున్నవన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. అతనో ప్రకృతి ఆరాధకుడనీ, ఓ శిల్పం చెక్కేందుకు ప్రయత్నిస్తున్నాడనీ అర్ధమవుతుంది ఆమెకి. ఠీవిగా నిలబడ్డ ఓ స్త్రీ ముందు మోకరిల్లిన పురుషుడి ప్రతిమ చెక్కాలన్నది అతని ప్రయత్నం.

నిజానికి మధుసూదనం శిల్పి కాదు. కానీ రాయి తప్ప మరొకటి అతనికి అర్ధం కాదు. 'స్వేచ్చ' అనే విషయంపై కలకత్తా లో జరగబోయే శిల్పాల పోటీకి తన శిల్పాన్ని పంపాలన్నది అతని ఆలోచన. అందుకోసం శ్రమిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరితో పాటు, వంటవాడు షూజా, మధుసూదనం శిల్పానికి మోడల్ గా ఎంచుకున్న తుక్కమ్మ. జ్ఞానసుందరికి తుక్కమ్మ నచ్చని కారణంగా ఆమెని పంపించేస్తాడతను.

ఎల్లోరాలో గడిపిన మూడు రోజుల్లోనూ ఒక కొత్త మధుసూదనాన్ని చూస్తుంది జ్ఞానసుందరి. మునుపటిలా ఆమెని తాకాలని అనుకోడం లేదు అతను. ఆమె ఆ అవకాశం ఇచ్చినా అతను దూరం జరుగుతున్నాడు. ఇద్దరూ కలిసి కొండల్లో తిరిగారు, వర్షంలో తడిశారు, అయినా ఆ దూరం అలాగే ఉంది. ఇంటికి తిరిగి వచ్చాక అక్కాచెల్లెళ్ల మధ్య అపార్ధం. అక్క మీద చెల్లెలికి అనుమానం, అది తొలగిన వైనం కథకి ముగింపు. నిజానికి కథావస్తువు చిన్నదే అయినా, ఆద్యంతమూ ఆసక్తికరమైన మానసిక విశ్లేషణలతో సాగింది.

జ్ఞానసుందరి ఒంటరి జీవితం, ఒకరి మీద ఆధార పడాల్సిందేనన్న దైన్యం, మధుసూదనం మీద ఆమెకి స్థిర పడిపోయిన అభిప్రాయాలు మారే క్రమం, తానుగా అతన్ని కోరే సందర్భం, అతడు చూపే సంయమనం.. ఇలా ప్రతి సన్నివేశంలోనూ పాత్రల మానసిక స్థితిని విశదంగా పాఠకుల ముందుంచారు రచయిత. అనుభూతి ప్రధానంగా సాగే కథనం. ఈ కథతో పాటు మరో ఇరవయ్యేడు కథలున్న 399 పేజీల సంకలనం విశాలాంధ్ర అన్ని బ్రాంచీల లోనూ అందుబాటులో ఉంది. వెల. రూ. 250.

శుక్రవారం, ఏప్రిల్ 23, 2010

సినిమా నష్టాలు

తెలుగు సినిమా నిర్మాతలకి నష్టాలు వస్తున్నాయిట. మొన్నటివరకూ ఈ నష్టాలకి పైరసీ మాత్రమే కారణం అనున్నారు కానీ, ఇప్పుడు పైరసీ తో పాటు మరో కారణం కూడా ఉందని తెలిసిపోయిందిట వాళ్లకి. నటీనటుల పారితోషికాలు, నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా నిర్మాతలు నష్టపోతున్నారుట. ఏదో ఒకటి చేసి ఆ నష్టాలని తగ్గించుకోడం కోసం మేధోమధనం జరుగుతోందిట. అవసరమైతే కొన్ని రోజుల పాటు భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణాన్ని ఆపేసే విషయాన్నీ పరిశీలిస్తున్నారుట.

ఏ వస్తువుని తయారు చేసే వాడైనా దాని అమ్మకం విలువ ఆధారంగా ఉత్పత్తి ఖర్చు నిర్ణయించుకుంటాడు, కనీస ఖర్చులనీ, కనీస అమ్మకం ధరనీ దృష్టిలో పెట్టుకుని. సినిమా విషయానికి వచ్చేసరికి వాస్తవ వ్యాపారం కన్నా, ఊహాత్మక వ్యాపారమే ఎక్కువ. ఇంత ఖర్చు కావొచ్చు, ఇంత డబ్బు రావొచ్చు అన్న అంచనాలతో సినిమా తీయడం మొదలు పెడితే ఖర్చు రెండింతలు కావడం, ఆదాయం సగమే రావడం చాలా మంది నిర్మాతలకి అనుభవంలోకి వచ్చింది, కాబట్టే ఈ మేధో మధనం.

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్మాణ వ్యయం పెరిగిపోడానికి కారణం మరెవ్వరో కాదు, సాక్షాత్తూ నిర్మాతే. దర్శకుడో, పెద్ద హీరోనో ఏది చెబితే అది గుడ్డిగా వినేసి, తనకంటూ ఒక ఆలోచన లేకుండా డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నది నిర్మాత కాక మరెవరు? ఇవాళ ఎంతమంది నిర్మాతలకి సినిమా నిర్మాణం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది? ఎక్కడ ఎంత ఖర్చు పెట్టొచ్చు, ఏ ఖర్చుని నియంత్రించ వచ్చు? అని తెలిసిన వాళ్ళు ఎంతమంది?


డబ్బు మూటలతో రావడం, వాటిని తక్కువ కాలంలోనే రెట్టింపు చేసుకోవాలన్న ఒకేఒక్క ఆలోచనతో సినిమా మొదలు పెట్టడం. కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల నష్టాలు రుచి చూడాల్సి రావడం. నిర్మాతలు స్టేట్మెంట్ల లో చెప్పుకుంటున్నట్టుగా కళాసేవ కోసమే సినిమాలు తీస్తున్నట్టయితే మనకిన్ని నాసిరకం సినిమాలు ఎందుకు వస్తాయి? ఫార్ములా కథల, మూస సినిమాల బారిన పడాల్సిన అగత్యం మనకి ఎందుకు కలుగుతుంది?

పారితోషికాలు ఎందుకు పెరిగాయి? నిర్మాతలు కొందరు హీరోల చుట్టూ మూగి, వాళ్ళ డేట్లే మహా ప్రసాదంగా భావించి 'బాబు' ఒప్పుకోగానే భారీ ఖర్చుతో సినిమాలు తీసేయడం వల్లనే కదా. విమాన చార్జీ మొదలు, కారు ఖర్చు వరకూ ఇచ్చి ఎక్కడినుంచో హీరొయిన్లని తేవడం ఎందుకు? వాళ్ళ ఖర్చులతో పాటు, వాళ్లకి తెలుగు భాష రాని కారణంగా వేరొకరితో డబ్బింగ్ చెప్పించాల్సిన ఖర్చు అదనం. అలా అని ఆ వచ్చే అమ్మాయిలు అద్భుతమైన నటన ప్రదర్శించేస్తున్నారా? వరుసగా మూడో సినిమాలో కనిపించే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అయినా ఈ వేలం వెర్రి ఆగదు.

జీవ పరిణామ క్రమం ఒకడుగు వెనక్కి వేసిందేమో అని అనుమానం వచ్చే జీవ జాతులని తీసుకొచ్చి, రకరకాల సర్జరీలతో వాళ్లకి మానవ రూపం తెప్పించి, వాళ్ళని హీరోలుగాపెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆపై 'చెట్టు' పేరు చెప్పి వాళ్ళని చెట్టెక్కిస్తున్నది ఈ నిర్మాతలే కదా? రెండో సినిమా నుంచే వాళ్ళు తమ రేంజి ల గురించి ఇమేజిల గురించీ మాట్లాడుతున్నారంటే ఆ పాపం వాళ్ళని చెట్టుమీద కూర్చోపెట్టిన వాళ్ళది కాదూ? ఫలానా నటులు పారితోషికాన్ని ఎంతంత పెంచేసినా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ వాళ్ళతోనే సినిమాలు తీయడం ఎందుకు?
ఇప్పుడు అగ్ర తారలుగా వెలుగు వెలుగుతున్న వాళ్ళంతా ఒకప్పుడు మామూలు నటులే. వైవిధ్యమైన కథలు, పాత్రలు వాళ్లకి ఆ హోదా తెచ్చాయి. అంతే తప్ప వాళ్ళలో ఏదో మహత్తు ఉండి కాదు. సరైన కథ, కథనం లేకుండా వచ్చే సినిమాల్లో తారలు వాళ్ళే అయినా ఆ సినిమాలు మర్నాటికే తిరిగి వస్తున్నాయంటే కీలకం ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదూ? మరి అలాంటి సినిమా కథ కి ఇవాళ ఉన్న గౌరవం ఏపాటిది? కథ మీద నిర్మాతలు ఎలాంటి శ్రద్ధ పెడుతున్నారు?

ప్రపంచంలో ఉన్నవి రెండే కథలనీ అవి రామాయణ మహాభారతాలనీ తరచూ చెప్పే 'అగ్ర' రచయితలు అవే కథలని తిప్పి తిప్పి రాస్తుంటే, ప్రతి ఫ్రేం నీ రిచ్ గా తీసే దర్శకులు రీళ్ళు చుట్టేస్తున్నారు. బోల్డంత పబ్లిసిటీ ఇచ్చి, వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో సినిమా రిలీజ్ చేసి వీలయితే మొదటి రోజునే పెట్టిన డబ్బంతా వెనక్కి లాగేసుకుని, రెండో రోజునుంచే లాభాలు గడించాలన్నది నిర్మాతల ఆలోచన. టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడిని వినియోగ దారుడు అనుకుంటే అతనికి దొరుకుతున్నది ఏమిటి?

టిక్కెట్ రేటు మొదలు, పార్కింగ్ ఫీజు వరకూ అన్నీ భారీ మొత్తాలే. చూడ బోతున్నది భారీ సినిమా కదా మరి. నాసిరకం సినిమా హాల్లో, చిరుగులు పడ్డ సీట్లో ఉంటుందో, ఆగిపోతుందో తెలియని ఏసీలో బోల్డన్ని సార్లు చూసేసిన కథనే మళ్ళీ చూడాలి. హీరో గారి వంశం డైలాగులు, తొడ చప్పుళ్ళు, హీరొయిన్ పలికే వచ్చీ రాని ముద్దు మాటల తెలుగు పలుకులు, ఇప్పటికీ చాలా సార్లు చూసేసిన ఫారిన్ లొకేషన్లో పాటలు, ఏళ్ళ తరబడి పాతుకుపోయిన కమెడియన్లు పరమ రొటీన్ గా నటించేసే హాస్య సన్నివేశాలు.

నిర్మాత నష్టపోకూడదు అంటే వీటన్నింటినీ భరిస్తూ, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తూ ప్రేక్షకులంతా మళ్ళీ మళ్ళీ నష్ట పోవాలి. వాళ్ళ నష్టాల గురించి సమాలోచనలు జరుపుతున్న నిర్మాతలు ప్రేక్షకులకి కలుగుతున్న నష్టాల గురించి కూడా ఆలోచిస్తే బాగుండును. అటు నిర్మాతలకీ, ఇటు ప్రేక్షకులకీ లాభదాయకమైన విధంగా వైవిధ్య భరితమైన సినిమాలు తీయాలని నిర్ణయించుకుంటే ఉభయ తారకంగా ఉంటుంది కదా. చుక్కలనంటే పారితోషికాలు చెల్లించి భారీ తారలతో సినిమా తీసే బదులు, పదునైన కథలతో కొత్త వారితో సినిమాలు తీస్తే, జనమే ఆ కొత్త వాళ్ళని స్టార్లని చేస్తారు కదా. అప్పుడు పారితోషికాలు తగ్గకుండా ఉంటాయా.. ఇలా జరిగే అవకాశం ఉందని ఆశ పడొచ్చా???

బుధవారం, ఏప్రిల్ 21, 2010

దూరపు కొండలు...

మధ్యాహ్నం బళ్ళో అవుట్ బెల్ అయిపోయాక పాఠాలు ఉండవు. ఎండా, వానా లేకపొతే డ్రిల్లు చేయించడమో లేకపొతే పాటలో, పద్యాలో చెప్పడమో ఉంటుంది. మేమేమో దృష్టి బడి గంట మీద పెట్టి మేష్టారు చెప్పేవి వల్లెవేస్తామన్న మాట. ఆవేళ మాకు సూక్తులు, సామెతలు పాఠం. మేష్టారు బోర్డు మీద కొన్ని సూక్తులు, సామెతలు రాసి, లీడర్ని చదవమంటారు. లీడరు ఒక్కోటీ చదువుతుంటే, మిగిలిన పిల్లలు వంత పలుకుతారన్న మాట. లీడర్ని నేనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

మేష్టారు బోర్డు మీద 'పరుల సొమ్ము పాము వంటిది' 'ఐకమత్యమే మహాబలము' 'దూరపు కొండలు నునుపు' ఇలాంటివి రాసి, ఓసారి తను చెప్పి తర్వాత పని నాకు అప్పగించి, పక్క క్లాసు మేష్టారితో మాట్లాడడానికి వెళ్ళిపోయారు. నాకు 'దూరపు కొండలు..' అర్ధం కాలేదు. మేష్టారు మన క్లాసులో ఉంటే అడగాలి కానీ, అలా పక్క క్లాసుకి వెళ్లి అడక్కూడదు. అలా అడిగితే మేష్టర్లిద్దరికీ కోపం వస్తుంది. తర్వాత అడగొచ్చులే అనుకుని, నేను బోర్డు మీదవి ఒక్కోటీ చదువుతున్నా. మిగిలిన వాళ్ళందరూ నేను పలికినవి పలికినట్టు పలుకుతున్నారు.

నేను ఓ కన్ను మేష్టారి మీద వేసి ఉంచాను. ఎందుకంటే ఆయన ఉన్నట్టుండి వాచీ చూసుకుని, నాగరాజునో, శ్రీనునో పిలిచి బెల్లు కొట్టేయమంటారు. వాళ్ళిద్దరూ మా స్కూల్లో పొడుగు పిల్లలు. అందుకని బెల్లు కొట్టే డ్యూటీ వాళ్ళదే. వాళ్ళంత పొడుగైతే కానీ మనకా చాన్స్ రాదు, అప్పటివరకూ ఇలా పాఠాలు చెప్పడమే. బోర్డు మీదవి చదువుతూనే, అమ్మ జంతికల్లాంటివి ఏమన్నా చేసి ఉంటుందా, తాతయ్య నిన్న తెచ్చిన పొట్లం నిజంగానే పూర్తిగా అయిపోయిందా? లేకపొతే అమ్మ నాకోసం ఏమన్నా దాచి ఉంటుందా? లాంటి ముఖ్యమైన విషయాలు కూడా ఆలోచించుకుంటున్నా లోపల్లోపల.

మేమంతా పెద్ద పెద్ద గొంతులేసుకుని బోర్డు మీద ఉన్నవి చదువుకుంటూ ఉండగానే బెల్లు కొట్టించేశారు మేష్టారు. ఇంటికి ఒక్క పరుగు పెట్టి, సంచీ ఓ మూలకి విసిరి కొట్టి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయా. "ముందు కాళ్ళూ చేతులూ కడుక్కురా" అని పెరట్లోకి పంపేసింది అమ్మ. అక్కడ పెరట్లో బామ్మ తన మిత్రబృందంతో నిండుసభలో ఉంది. వాళ్ళంతా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు.

"పండగ వారం రోజులు ఉందనగా పుల్లేటికుర్రు షావుకారు పెద్ద బట్టల మూటతో వచ్చేసే వాడు. చీరలు, పరికిణీ గుడ్డలూ అన్నీ జరీవే. చీరలంటే ఇప్పట్లా మొగ్గలచీరలు కాదు. దోసెడు వెడల్పున జరీ ఉండేది. మేమందరం ఎవరికి నచ్చినవి వాళ్ళం తీసుకునే వాళ్ళం.." అంటూ బామ్మ అనర్గళంగా చెబుతూ ఉంటే, అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి వింటున్నారు. నాకెందుకో బళ్ళో పాఠం గుర్తొచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడి "దూరపు కొండలు నునుపు" అన్నాను. అంతే.. బామ్మకి ఎంత కోపం వచ్చిందంటే కళ్ళే కాదు ఒళ్ళు కూడా ఎర్రగా అయిపోయింది.

"ఎవరు నేర్పుతున్నారు నీకు ఇలాంటి మాటలు? చెప్పు?" అని గద్దించింది, వంటింటి వైపు అనుమానంగా చూస్తూ. అక్కడ అమ్మ నాకోసం పాలు కాస్తోంది. "మా బళ్ళో మేష్టారు చెప్పారు. ఇవాళ పాఠం ఇదే" అన్నాన్నేను జంకూ గొంకూ లేకుండా. బామ్మ ఫ్రెండ్సేమో "పనేల అయిపోయిందండీ .. మళ్ళీ వస్తాం" అని చెప్పి వెళ్ళిపోయారు. "చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇంటికొచ్చిన వాళ్ళ ముందు ఏది పడితే అది మాట్లాడెయ్యడమేనా? పైగా మేష్టారు చెప్పారుట మేష్టారు.." బామ్మ కొనసాగిస్తోంది.

నేను అన్నదాంట్లో తప్పేమిటో నాకస్సలు అర్ధం కాలేదు. తప్పైతే మేష్టారు బళ్ళో చెప్పరు కదా.. పైగా పిల్లలందరి చేతా చెప్పించారు కూడాను. ఏవిటో ఈ బామ్మకేమీ అర్ధం కాదు. ఓ నాలుగు రోజులు బళ్లోకి తీసుకెళ్ళాలి, తాతకి చెప్పి అని నేను ఆలోచించుకుంటూ ఉండగా అమ్మ నాకు పాలగ్లాసిచ్చి, తల దువ్వడం మొదలు పెట్టేసింది. "క అంటే క, కి అంటే కి సాగిస్తోంటే ఇలాగే ఉంటుంది. పిల్లలకి భయం చెప్పుకోవాలి. రానీ మీ నాన్నని. ఇవాళ సంగతేమిటో తేల్చేస్తాను.." బామ్మ శపధాలు వినిపిస్తున్నాయి.

"ఎందుకురా తెలిసీ తెలియకా వాగి తిట్లు తింటావ్?" అని కోప్పడింది అమ్మ. అమ్మకూడా నన్నే అనేసరికి భలే కోపం వచ్చింది. "బళ్ళో చెప్పారమ్మా..కావాలంటే గణేష్ ని అడుగు, లేకపొతే ఇంకెవర్నైనా పిలిచి అడుగు.. ఇంతకీ దూరపు కొండలు నునుపు అంటే ఏమిటమ్మా?" అని అడిగేశాను. "ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి. బొత్తిగా భయం భక్తీ లేకుండా పోతున్నాయ్. మీ నాన్నని రానీయ్.. ఏం నాయనా నేనీ ఇంట్లో ఉండాలా వద్దా? అని అడిగేస్తాను" బామ్మ ఆపడం లేదు.

"నీకు తర్వాత చెబుతాను కానీ, నువ్వు ఆటలకి వేళ్ళు. తాతగారు వచ్చాకే ఇంటికి రా" అని నాకు చెప్పి, "వెంకన్నబాబూ తండ్రీ పిల్లాడికి దెబ్బలు పడక పోతే నీకు కొబ్బరికాయ కొట్టుకుంటాను" అని దేవుడికి మొక్కేసింది అమ్మ. మామూలుగా అయితే నాకు జొరం వచ్చి తగ్గకపోతే కొబ్బరికాయ మొక్కుకుంటుంది అమ్మ. అలాంటిది ఇప్పుడు మొక్కేసుకుందంటే ఏదో పెద్ద గొడవే అవుతుందేమో అనిపించింది నాకు. ఎందుకైనా మంచిదని ఆటలకి వెళ్తూ వెళ్తూ శివుడి గుడి బయట ఆగి "నాన్న కన్నా ముందర తాతయ్య ఇంటికి వచ్చేలా చూడు దేవుడా" అని దండం పెట్టేసుకున్నాను.

ఆటల్లో పడ్డాను కానీ ఇంటి మీద ఓ కన్నేసే ఉంచాను. వెంకన్నబాబు మా అమ్మ మొక్కు విన్నాడో లేక శివుడు నా భక్తికి మెచ్చాడో తెలీదు కానీ ఏడు పెంకులాట సగంలో ఉండగానే తాతయ్య ఇంటికెళ్తూ కనిపించారు. నేను కూడా ఒక్క పరుగందుకున్నా. "విన్నారా మీ ముద్దుల మనవడేం చేశాడో.." తాతయ్యని వీధిలో నిలబెట్టే చెప్పడం మొదలు పెట్టేసింది బామ్మ. నేను గబగబా వెళ్లి తాతయ్యకి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చేశాను. "గుమ్మంలో అడుగెట్టానో లేదో పసి వెధవ మీద పితూరీలు మొదలు. వాడు చూడు నీళ్ళు తెచ్చిచ్చాడు రాగానే," అన్నారు తాతయ్య.

బామ్మ అదేమీ అస్సలు పట్టించుకోకుండా నేనేం చేశానో చెప్పేసింది. వాళ్ళందరి ముందూ నేనలా అనేసరికి తనకి తల కొట్టేసినట్టు అనిపించిందిట. నాకు ఈ తల కొట్టేయడం అంటే ఏమిటో కూడా అర్ధం కాలేదు. కానీ అలాంటప్పుడు అడక్కూడదు కదా. "ఇప్పుడు వాడన్న దాంట్లో తప్పేముందీ.. తెలియక చెప్పినా నిజమే చెప్పాడు. మీ పుట్టింటి వాళ్ళ సంగతి నాకు తెలీదా?" అని తాతయ్య అనేసరికి బామ్మ కోపం ఆయన మీదకి తిరిగింది. "మీ అలుసు చూసుకునే అందరూ నా నెత్తెక్కుతున్నారు.." అంటూ ఇంకా ఏంటేంటో అంది.

"ఇదిగో నా మొహాన కాఫీ నీళ్ళు పోసేదుందా? నువ్వివ్వకపోయినా నాకేమీ లోటు జరగదులే.. ఏ ఇంటికెళ్ళి ఇవాళ మా ఇంట్లో కాఫీ ఇవ్వలేదు అని చెప్పినా లోపలికి పిల్చి కాఫీ ఇచ్చి పంపుతారు" అన్నారు తాతయ్య. నేను గబుక్కున వెళ్లి తాతయ్య చెప్పులు తెచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేశాను. "సరి సరి.. ఆ పని గాని చేస్తిరా నేనెవరికీ మొహం చూపించక్కర్లా.. పట్టుకొస్తున్నాను కాఫీ, తాగేసే బయల్దేరండి పెత్తనాలకి" అంటూ వంటింట్లోకి వెళ్ళింది బామ్మ. ఈ గొడవలో పడి నేను 'దూరపు కొండలు నునుపు' అనే మాటకి అర్ధం తెలుసుకోవడం మర్చిపోయాను.

ఆదివారం, ఏప్రిల్ 18, 2010

ప్రస్థానం

ప్రపంచంలో ఏ సూత్రాలకీ, సిద్ధాంతాలకీ లొంగనిది ఒకటి ఉంది. అది మనిషి మనసు. ఆమనసు మనిషి చేత ఎన్నో పనులు చేయిస్తుంది, రెండోసారి ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా. మనం చాలా పనులు చేసేశాక, ఇలా ఎందుకు చేశామా? అని ఆలోచించుకుంటామే తప్ప, చేసేటప్పుడు ఇలా చేయొచ్చా? అని ఆలోచించం. మనం చేసేదానికి ఫలితం ఏమిటి? అన్న ఆలోచన ఆ క్షణంలో రాదు. శర్వానంద్ కథానాయకుడిగా దేవ (కౌశిక్) కట్టా రూపొందించిన 'ప్రస్థానం' సినిమా కథ చర్చించిన పాయింట్ ఇది.

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళే భారతీయ యువత అక్కడ ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి? అన్న అంశానికి ఓ ప్రేమ కథని జోడించి తీసిన దేవ తొలి సినిమా 'వెన్నెల' అప్పట్లో నాకు బాగా నచ్చింది. తన నుంచి వచ్చిన సినిమా అనగానే 'ప్రస్థానం' చూడాలి అనిపించింది. ఓ వైవిధ్య భరితమైన సినిమా ఇస్తాడన్న నా నమ్మకాన్ని దేవ వమ్ము చేయలేదు. రాజకీయాల్ని నేపధ్యంగా తీసుకుని రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది.


కథ రాయలసీమ తరహా ముఠా కక్షలతో ప్రారంభమై, విజయవాడ రాజకీయం మీదుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారసత్వ పోరు, నాయకుల పోరాటాల్లో నలిగిపోయే కార్యకర్తలు లాంటి ఎన్నో అంశాలని స్పృశిస్తూ సాగింది. ఓ ముఠా నాయకుడి అనుచరుడు లోకనాథం నాయుడు (సాయికుమార్) ఆ నాయకుడి కొడుకు మిత్రా (శర్వానంద్) ల కథ ఇది. నాయకుడి మరణానంతరం అతని కోరిక మేరకు, లోకనాథం మిత్రా తల్లిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ చిన్నా (సందీప్).

మిత్రా అక్క (సురేఖావాణి) తన తల్లి రెండో పెళ్లిని అంగీకరించదు. కానీ మిత్రా లోకనాధాన్నితన తండ్రిగా అంగీకరిస్తాడు. విజయవాడ వచ్చిన లోకనాథం రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే కావడమే కాదు, వరుసగా ఐదుసార్లు గెలుస్తాడు కూడా. అతని రాజకీయ/వ్యాపార శత్రువు బాసిరెడ్డి (జీవా), ఎమ్మెల్యే కావాలని ఆశపడే పార్టీ 'యువ' నేత బంగారు నాయుడు (జయప్రకాష్ రెడ్డి).

లోకనాథం మిత్రాని తన రాజకీయ వారసుడిగా చూడాలని అనుకుంటాడు. రక్తం పంచుకుని పుట్టిన కొడుకుగా అది తన హక్కు అంటాడు చిన్నా. నాయకత్వం కేవలం వారసత్వం కాదు, అందుకు తగ్గ లక్షణాలు ఉండాలంటాడు లోకనాథం. తల్లి నీడ తన ఇంటి మీద పడ్డానికి కూడా ఇష్ట పడదు మిత్రా అక్క. ఆ రెండిళ్ళ మధ్యా వారధి మిత్రా. లోకనాధానికీ, తన ఇద్దరు పిల్లలకీ బంధం బల పరచడానికే చిన్నాని కన్నానంటుంది తల్లి ఒక సందర్భంలో. మరోపక్క చిన్నా రాజకీయాల్లోకి రాడానికి ససేమిరా అంటాడు లోకనాథం.

ఫలితంగా చిన్నాకి మిత్రా మీద చిన్నప్పుడే పుట్టిన అసూయ ఒక్కసారిగా పెరిగి పెద్దదవుతుంది. సరిగ్గా అప్పుడే ఎన్నికలు రావడం, పార్టీ అధిష్ఠానం లోకనాధాన్ని కాదని బంగారు నాయుడికి టిక్కెట్ కేటాయించడం, ఇండిపెండెంట్ గా పోటీలో నిలబడ్డ లోకనాధానికి చిన్నా చేసిన ఒక పని కారణంగా జనంలో వ్యతిరేకత పెరగడం.. ఇలా ఊహించని వేగంతో కథ సాగిపోతుంది. సినిమా మొదటి సగం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగగా, రెండో సగానికి వచ్చేసరికి కథనంలో బిగి కొద్దిగా సడలింది. ఊహాతీతమైన ముగింపు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చింది.

రెండో సగం స్క్రీన్ ప్లే విషయంలో మరికొంచం జాగ్రత్త తీసుకోడం తో పాటు, మిత్రా, అతని తల్లి పాత్రల మీద దర్శకుడు మరికొంచం దృష్టి పెట్టి ఉండాల్సింది. మామూలుగా మొదలైన చిన్నా పాత్ర రెండో సగంలో అత్యంత కీలకం గా మారింది. సందీప్ ఈ పాత్రని సమర్ధవంతంగా పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. 'వెన్నెల' లో శర్వానంద్ పోషించిన పాత్ర ఛాయలు కొన్ని కనిపించాయి చిన్నా పాత్రలో. హీరొయిన్ పాత్రలో నూతన నటి రూబీ పరివార్ బాగానే ఉన్నప్పటికీ ఆమెకి చేయడానికి ఏమీ లేదు.

శేఖర్ కమ్ముల 'ఆనంద్' నుంచి కాకెంగిలి చేసిన పెళ్ళిచూపుల సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు.. కాకపొతే అక్కడ ఓ పాట పెట్టినట్టున్నారు. రెండు పాటలని సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్ ఎడిటింగ్ చేశాడని సినిమా చూశాక తెలిసింది. ఇంకా ఏమన్నా ఎడిట్ చేశాడేమో తెలీదు. అయినప్పటికీ సినిమా నిడివి రెండు గంటల నలభై నిమిషాలు. ఎక్కడా బోర్ కొట్టక పోవడం, వాచీ చూసుకోవాల్సిన అవసరం రాక పోవడం దర్శకుడి ప్రతిభే. (ఈ థియేటర్లలో ఎడిటింగ్ మీద 'మురారి' టైం లో అనుకుంటా కృష్ణవంశీ విరుచుకు పడ్డాడు, నిడివి మరీ పెరిగిపోతే ఆపరేటర్లు మాత్రం ఏం చేస్తారు పాపం!)


జాగ్రత్త తీసుకోవాల్సిన మరో విభాగం సంభాషణలు. దర్శకుడే స్వయంగా రాసుకున్నాడు. కొన్ని డైలాగులు బాగున్నప్పటికీ, చాలా చోట్ల నాటకీయత శృతి మించింది. సినిమా చూస్తున్నట్టు కాక, నాటకం చూస్తున్నట్టు అనిపించింది. బహుశా వాటిని పలికిన సాయికుమార్ గొంతుని దృష్టిలో పెట్టుకుని రాసి ఉంటారు ఆ సంభాషణలని. సాయికుమార్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది. బాగా చేశాడు కూడా. మిత్రాగా శర్వానంద్ పర్వాలేదు. తల్లిగా చేసిన పవిత్ర లోకేష్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. చిన్న పాత్రే అయినా సురేఖా వాణి బాగా చేసింది.

మహేష్ శంకర్ సంగీతం లో పాటల కన్నా రి-రికార్డింగ్ బాగుంది. ఆకట్టుకున్న మరో అంశం ఫొటోగ్రఫి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలని బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించడం, కీలక దృశ్యాలని చిత్రించిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎడిటింగ్ బాగున్నప్పటికీ నిడివి విషయంలో దర్శకుడే జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. "మనిషి తను పండించిన పంటని తనే కోస్తాడు" అనే నోట్ తో ముగిసే ఈ 'ప్రస్థానం' వైవిద్యభరితమైన సినిమాలని ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా.

శుక్రవారం, ఏప్రిల్ 16, 2010

సహచరుడు

'కామ్రేడ్ మోహనరావు అమర్ రహే..' తళతళలాడుతున్న నల్లని వినైల్ ఫ్లెక్సి మీద తెల్లని అక్షరాలు మెరుస్తున్నాయి. పక్కనే గంభీరంగా ఉన్న మోహనరావు ఫోటో. మూడుగదుల అద్దింటి వాటా ముందు వేసిన టెంట్ కి ఫిక్స్ చేశారా ఫ్లెక్సీని. టెంట్ కింద రెండు టేబుళ్లు కలిపి చేసిన వేదిక మీద నిద్రపోతున్నాడేమో అనిపించేలా ఉంది నలభయ్యారేళ్ళ మోహనరావు పార్ధివ దేహం. టెంట్ కర్రలకి పార్టీ జెండాలు అమర్చారు కార్యకర్తలు.

కొద్ది రోజుల క్రితమే మొదలైన ఎన్నికల కోలాహలం బస్తీకి కూడా పాకింది. రకరకాల పార్టీల జెండాలు, బ్యానర్లు, నాయకుల అభిమానులు ఏర్పాటు చేసిన చిన్నా పెద్దా హోర్డింగులు, వీటి మధ్య పట్టి పట్టి చూస్తే తప్ప మోహనరావు మరణ వార్తని చెప్పే చిన్న ఫ్లెక్సి కనిపించడం లేదు. టెంట్ హౌస్ నుంచి వచ్చిన పది కుర్చీలని టెంట్ కింద ఒక వరుసలో అమరుస్తున్నారు కార్యకర్తలు.

మోహనరావు మరణ వార్త అప్పుడప్పుడే బస్తీలో పాకుతోంది. అతని వల్ల చిన్నదో, పెద్దదో ఉపకారం పొందినవాళ్ళంతా ఒకరొకరుగా వస్తున్నారు. ఒట్టి చేతులతో కాదు, పూల దండలతో. తను జీవించి ఉన్నంతకాలం మెడలో పూల దండ వేయించుకోడాన్నితీవ్రంగా వ్యతిరేకించాడు మోహనరావు. చివరిసారిగా అతని మెడలో దండ పడింది ఇరవై ఏళ్ళ క్రితం - ఇప్పుడు సరళమ్మ/ సరళక్కగా మారిన - సరళరేఖని సంతకాల పెళ్లి చేసుకున్నప్పుడు.

మధ్యగదిలో కూర్చుని జరుగుతున్న తతంగాన్ని నిశ్శబ్దంగా గమనిస్తోంది సరళ. తమ ఇద్దరి సంభాషణల్లో మృత్యువు ప్రసక్తి వచ్చినప్పుడల్లా తన అంతిమయాత్ర ఎలా ఉండాలో మోహనరావు చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి ఆమెకి. 'పోయాక కూడా ఇష్టాలు సాగాలనుకుంటే ఎలా?' అనిపించి నిర్లిప్తంగా నవ్వుకుంది. అర్ధరాత్రి దాటాక, స్టీలుగ్లాసు గచ్చు నేల మీద పడ్డ శబ్దానికి ఉలిక్కిపడి నిద్ర లేచింది సరళ. మోహనరావు ఛాతీ పట్టుకుని ఆయాస పడుతున్నాడు. ఆమె దగ్గరికి వెళ్లి ఛాతీ మీద రాయడం మొదలు పెట్టగానే ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు అంతే.. అతని ప్రాణం పోయిందన్న నిజం అర్ధం కావడానికి పదినిమిషాలు పట్టింది ఆమెకి.

ఇంటర్ చదువుతున్న కూతురూ, పదో తరగతి చదువుతున్న కొడుకూ ఆసరికే నిద్ర లేచారు. ఎవరూ బావురుమనలేదు. నిశ్శబ్దంగానే రోదించారు ముగ్గురూ. తెల్లవారుతుండగానే తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఇంటికి రావడం మొదలు పెట్టారు. వాళ్ళ ముగ్గురి ప్రమేయం పెద్దగా లేకుండానే అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొందరు ఆడవాళ్ళు సరళని, పిల్లల్ని ఓదార్చే బాధ్యత తీసుకున్నారు.
                                                              * * *
పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకుల అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహనరావు మరణానంతరం మారబోతున్న సమీకరణాలను గురించి చర్చించడం సమావేశం ముఖ్య అజెండా. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్ధి ఎంపిక జరగాల్సి ఉంది. ఎన్నికల్లో పార్టీ మరో పార్టీతో 'పొత్తు' పెట్టుకుంది. సీట్ల కేటాయింపులో డివిజన్ సీటు పార్టీకి వచ్చింది.

అవతలి పార్టీలో ఇద్దరు నాయకులు సీటు కోసం పోటీ పడడం, ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా మరొకరు టిక్కెట్ ఇచ్చిన అభ్యర్ధిని ఓడించడానికి సిద్ధంగా ఉండడంతో అవతలి పార్టీ సీటుని తెలివిగా వీరికి కేటాయించిందన్నది బహిరంగ రహస్యం. ఎక్కువ డివిజన్లలో తమ అభ్యర్ధులని గెలిపించుకోవడం ద్వారా, భవిష్యత్తులో జరిగే మేయర్ ఎన్నికల్లో చక్రం తిప్పాలన్నది నాయకుల ఆలోచన. ఒక్క అవకాశాన్నీ వదులుకోడానికి సిద్ధంగా లేరు వీళ్ళు. సమావేశంలో పాల్గొన బోయే అరడజను మంది నాయకుల సెల్ ఫోన్లూ నిరంతరాయంగా మోగుతున్నాయి. పార్టీలో వాళ్లకి 'దగ్గరి వాళ్ళు' అడక్కపోయినా ఉచిత సలహాలు ఇస్తున్నారు. నాయకులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. జరగబోయే సమావేశం ఏరకంగా చూసినా ముఖ్యమైనదే.
                                                                 * * *
మోహనరావు దేహం మీద ఒక్కొక్కటిగా పూలదండలు పడుతున్నాయి. పిల్లలు టెంట్ కింద కూర్చున్నారు. ఒక్కొక్కరుగా పలకరించడానికి వస్తుండడంతో సరళ మధ్య గదిలోనుంచి ముందు గదిలోకి వచ్చింది. అది మోహనరావు గది. గదిలో పక్క దీవాన్. మరో పక్క గోడకి ఆన్చి పెట్టిన నిలువెత్తు చెక్క బీరువా నిండా తెలుగువీ, ఇంగ్లీషువీ పుస్తకాలు, అరలో అతనివే నాలుగైదు జతల బట్టలు. ఎప్పుడూ అతను భుజాన తగిలించుకునే రంగు వెలిసిన యెర్ర సంచీ..

సరళకి మోహనరావుతో పాతికేళ్ళ సాహచర్యం. మొదటి ఐదేళ్ళు స్నేహం.. తర్వాతి ఇరవైయేళ్ళు సహజీవనం. గడిచిన పాతికేళ్ళలోనూ అతని జీవన విధానంలో ఎలాంటి మార్పూ లేదు. అతను సంపాదించిన ఆస్తి అంటూ ఏమైనా ఉంటే పుస్తకాలే. దీవాన్ పక్కనే ఉన్న యాష్ ట్రే నిండా కిక్కిరిసిన సిగరెట్ పీకలు, మోహనరావు ఇక లేడనే సత్యాన్ని పరిహసిస్తున్నాయి. పక్కనే చిన్న స్టూలు మీద టీ ఫ్లాస్కు, కప్పు. పక్కనే గత కొన్నాళ్ళుగా మోహనరావు మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం - చలసాని ప్రసాద రావు రాసిన 'ఇలా మిగిలేం.'

తన ఎదురుగా నిలబడ్డ చిన్ననాటి స్నేహితురాలు వనజని చూడగానే కన్నీళ్లు ఉబికి వచ్చాయి సరళ కి. వనజ భుజం మీద తల ఆన్చి ఒక్కసారి భోరుమంది. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో, సరళ భుజం తడుతూ ఉండిపోయింది వనజ. మోహనరావుతో ఆమెదీ సుదీర్ఘ పరిచయమే. అతని హఠాన్మరణాన్ని వనజ కూడా జీర్ణించుకోలేక పోతోంది. మరోపక్క స్నేహితురాలికి వచ్చిన కష్టం... సరళ కి తను ఎలా సాయపడగలనా అని ఆలోచిస్తోంది వనజ.
                                                            * * *
స్కూలు మేష్టారి మూడో కూతురు సరళ. తండ్రి విప్లవ పార్టీలోనూ సభ్యుడు కాకపోయినా, విప్లవ పోరాటాలంటే యెంతో ఆసక్తి కనబరిచేవాడు. "పతితులార, భ్రష్టులార, బాధా సర్ప ద్రష్టులార.." అంటూ ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గొంతెత్తి చదువుతుంటే అప్రయత్నంగానే కళ్ళు తడిసేవి ఆమెకి. అక్కలిద్దరికీ కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయడం కోసం తండ్రి పడ్డ అవస్థలు, తర్వాత పెళ్ళిళ్ళలో ఇమడలేక, బయటికి రాలేక అక్కలు ఎదుర్కొన్న సమస్యలు చూసిన సరళ కి పెళ్లి మీద సదభిప్రాయం ఏర్పడలేదు అప్పట్లో. అందుకే పట్టు పట్టి కాలేజీలో చేరింది.

కాలేజీలో చేరిన పది రోజులకి సరళని విద్యార్ధి యూనియన్ సమావేశానికి తీసుకెళ్ళింది వనజ . అక్కడే మొదటిసారిగా మోహనరావుని చూసింది సరళ. శ్రీకాకుళ ఉద్యమంలో తన వాళ్ళని కోల్పోయిన కుటుంబ నేపధ్యం అతనిది. ఆకర్షణీయమైన రూపం కాకపోయినా, అతను మంచి వక్త. పార్టీ సిద్ధాంతం మీద అతనికున్న గౌరవాన్ని ప్రతి అక్షరంలోనూ ప్రతిబింబిస్తూ యెంతో సిన్సియర్ గా అతను ఇచ్చిన ఉపన్యాసం సరళ అతన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. సరళ విద్యార్ధి సంఘంలో చేరడాన్ని అభినందించాడు ఆమె తండ్రి. త్వరలోనే ఆమెకి మోహనరావుతో స్నేహం కుదిరింది. అతని ప్రోత్సాహంతో విద్యార్ధినుల విభాగం మొదలు పెట్టి, కొంత కాలానికే బాధ్యతల్లో తల మునకలయ్యింది.

చదువు పూర్తవ్వగానే మోహనరావు ని పెళ్లి చేసుకుంది సరళ. పార్టీ పెద్దలతో పాటు వనజ కూడా సాక్షి సంతకం చేసింది. అప్పటికే మోహనరావు పార్టీ ఫుల్ టైం వర్కర్. పెళ్లి తర్వాత జీవితం పూల పానుపు కాలేదు సరళ కి. అసలు మోహన రావు ఇంట్లో పానుపే లేదు. చింకి చాప, మాసిన దిండు, అతి కొద్ది వంట పాత్రలు.. ఇదీ అతని ఇల్లు. మోహనరావు మీద ప్రేమ, పార్టీ మీద అభిమానంతో పెళ్ళైన కొన్నాళ్ళకే సరళ కూడా పార్టీ ఫుల్ టైం వర్కరై, మహిళా సమస్యల మీద పోరాటం మొదలు పెట్టింది.

మొదట్లో జీవితం అద్భుతంగా అనిపించింది సరళ కి. తన పెళ్లి తండ్రికి భారం కానందుకు గర్వ పడింది. అక్కల సంసారాల్లా కాకుండా, తన కాపురం అందరికీ ఆదర్శం కావాలనుకుంది. అయితే రోజులు గడిచే కొద్దీ అసంతృప్తి మొదలయ్యింది. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు బయలుదేరాక, వాళ్ళకోసమైనా ఒక్కొక్కటిగా కనీస సౌకర్యాలు అమర్చుకోవాలని కోరుకుంది. అయితే మోహనరావు ఆలోచనలు వేరు. అతని దృష్టిలో వాళ్ళ జీవితం చాలా మంది జీవితాలకన్నా సౌకర్యవంతంగా ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లలకి కష్టపడడం నేర్పాలన్నది అతని పాలసీ.

వనజ కాలేజీ లెక్చరరై, తన తోటి లెక్చరర్ ని పెళ్లి చేసుకుంది. ఆమె ఇంటినీ, తన ఇంటినీ పోల్చి చూసుకుని సరళ లో అసంతృప్తి పెరిగేది. పార్టీ మీటింగులు, ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు, పోలీసు కేసులు.. జీవితం మరీ యాంత్రికంగా గడిచిపోతోందన్న భావన. కానీ అసంతృప్తి కన్నా మోహనరావు మీద ఆమెకి ఉన్న ప్రేమే ఎక్కువ కావడంతో రాజీ పడడం నేర్చుకుంది.
                                                                * * *
పార్టీ ఆఫీసులో సమావేశ మందిరం తలుపులు మూసుకున్నాయి. ముఖ్య నాయకులు అరడజను మంది మూసిన తలుపుల వెనుక తర్జనభర్జనలు పడుతున్నారు. మధ్య మధ్యలో పార్టీ రాష్ట్ర నాయకులతో ఫోన్లో సంభాషణలు సాగిస్తున్నారు. గత కొంత కాలంగా మోహనరావు పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండడం, ప్రైవేటు సంభాషణల్లో అతడు తమకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు నాయకత్వానికి ఉప్పందడం లాంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా చర్చకి వస్తున్నాయి.

నిజానికి మోహనరావుకి పార్టీ జిల్లా నాయకత్వంతో కన్నా, రాష్ట్ర నాయకత్వంతోనే దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు పార్టీలో పని చేసినా, పదవినీ ఆశించలేదతను. అసలు పదవులంటే లక్ష్యం లేనట్టే వ్యవహరించాడు. "పదవి తీసుకుంటే ప్రజలకి దూరమైపోతాం సరళా" అనేవాడు. ఏం చెప్పాలో అర్ధం కాక మౌనం వహించేది సరళ.

ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ప్రతిసారీ, మోహనరావు నుంచి సిద్ధాంత పరమైన సలహాలు తీసుకోడం ఒక సంప్రదాయంగా మారింది పార్టీ నాయకత్వానికి. పార్టీ సిద్ధాంతానికి ఎంత దగ్గరగా ఉన్నాడో, ప్రజలకీ అంతే దగ్గరగా ఉన్నాడు మోహనరావు. గత కొంత కాలంగా పార్టీ అతని సలహాలు బుట్ట దాఖలు చేయడమే కాకుండా, సిద్ధాంతాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోడం గాయ పరిచింది మోహనరావుని. సాధారణ ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా, పార్టీకి దూరంగా జరిగాడు. "సరళ సేవలని వినియోగించుకోవాలా? లేక ఆమెని కూడా పక్కకి పెట్టాలా?" అన్న విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోక ముందే, మోహనరావు హఠాత్తుగా మరణించాడు.

సమావేశంలో ఉన్న నాయకులందరికీ మోహనరావు ఎంత బాగా తెలుసునో, సరళ కూడా అంత బాగానూ తెలుసును. ఇప్పుడు 'సమస్య' సరళే కావడంతో ఆమె గురించి కొంచం ఎక్కువగానే చర్చ జరిగింది. "సమయం మించి పోకముందే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంద" ని తొందర పెట్టాడొక నాయకుడు. మరికొంత చర్చ తర్వాత, వాళ్ళో నిర్ణయం తీసుకోడం, దానిని అమలు చేసే బాధ్యతని ఇద్దరు నాయకుల మీద పెట్టడం, అదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం పూర్తయ్యింది. అత్యవసర సమావేశం ముగియడంతో మూసిన సమావేశ మందిరం తలుపులు తెరుచుకున్నాయి.
                                                              * * *
"దూరం నుంచి రావాల్సిన బంధువులెవరన్నా ఉన్నారా సరళమ్మా?" గది గుమ్మం బయట తలొంచుకుని నిలబడి, కార్యకర్త అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయట పడింది సరళ. "ఎవరున్నారు రావాల్సిన వాళ్ళు? సర్వం పార్టీనే అనుకున్నాం.. ఇప్పుడా పార్టీకి మేము కావాలో అక్కర్లేదో తెలియడం లేదు.." అనుకుంది సరళ. అతను అడుగుతున్నది అంతిమ యాత్ర ఏర్పాట్లను గురించి కొంచం ఆలస్యంగా అర్ధమయ్యింది. ఎవరూ లేరన్నట్టుగా అడ్డంగా తలూపింది. దీవాన్ మీద తనపక్కనే దట్టమైన సిగరెట్ పొగ మేఘాల మధ్య కూర్చుని మోహనరావు పుస్తకం చదువుకుంటున్నట్టుగా అనిపించింది ఆమెకి. కళ్ళు చికిలించి చూస్తే గదిలో వనజ, మరి కొందరు స్త్రీలు కనిపించారు.

"నా ఇల్లు..నా పిల్లలు.. అనే స్వార్ధం నుంచి కొంచమైనా బయట పడాలి సరళా.. అన్నీ తెలిసిన వాళ్ళం మనం.. ఏమీ తెలియని వాళ్లకి, అమాయకంగా కష్టపడే వాళ్లకి యెంతో కొంత సాయపడాలి.." వాళ్ళిద్దరి మధ్యా డబ్బు ప్రస్తావన వచ్చినప్పుడల్లా మోహనరావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సరళకి. నిజానికి అతని సంపాదనని ఇంటి ఖర్చు కోసం వాడిన సందర్భాలు అరుదు. సాయం కోసం వచ్చిన వాళ్లకి తన డబ్బులు ఖర్చు పెట్టే తత్వం మోహనరావుది. వీధిలోకి చూసిన సరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మోహనరావు పార్థివ దేహం పక్కనున్న పూల దండల రాశి దాదాపుగా టెంట్ ని తాకుతోంది. పక్కనే తన ఇద్దరు పిల్లలూ.. ప్రశ్నార్ధకంగా కనిపిస్తున్న వాళ్ళ భవిష్యత్తు..
                                                                   * * *
పార్టీ నాయకులు రెండు వీధుల అవతలే రోడ్డు మీద కారు వదిలేసి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది మోహనరావు ఇంటికి. వీధులన్నీ జనంతో నిండిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల బస్తీల్లో ఎవరూ పూట పనికి వెళ్ళలేదు. రోడ్ల పక్కన గుంపులుగా చేరి మోహనరావుని తలచుకుంటున్నారు. అప్పటివరకూ నిశ్శబ్దంగా ఉన్న కార్యకర్తలు నాయకులని చూడగానే 'కామ్రేడ్ మోహనరావు అమర్ రహే..' అంటూ నినాదాలు చేశారు. అక్కడి జనాన్ని చూసిన నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువైంది వాళ్లకి. అదే సమయంలో నిర్ణయాన్ని ఎంతవరకూ అమలు పరచగలం? అన్న ప్రశ్న మరోసారి తలెత్తింది వాళ్ళలో.

మోహనరావు కి నివాళులు అర్పించి, పిల్లలని ఓదార్చి, సరళ వైపు దారి తీశారు నాయకులు. వాళ్ళని చూడగానే, ఇంట్లో ఉన్న స్త్రీలంతా మర్యాద పూర్వకంగా బయటికి నడిచారు. బయటికి వెళ్ళబోతున్న వనజని చెయ్యి పట్టి ఆపింది సరళ. పరామర్శలయ్యాక, పార్టీ నిర్ణయాన్ని సరళ చెవిన వేశారు నాయకులు. "నిజానికి విషయం మాట్లాడడానికి ఇది సమయం కాదు. మోహనరావు ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. సమయం ఎక్కువ లేదు.." తాము చెప్పదల్చుకున్నది చెప్పి బయటికి నడిచారు నాయకులు. వారి ఆధ్వర్యంలోనే మోహనరావు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది.

కొడుకు తండ్రి శవం వెంట వెళ్ళాడు. తన స్నేహితులతో మాట్లాడుతోంది కూతురు. గదిలో సరళ, వనజ మాత్రమే మిగిలారు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. "బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో సరళా.. ఎన్నో ఏళ్ళుగా మీ ఇద్దరూ తెలిసిన దానిగా ఇంతకన్నా ఏమీ చెప్పలేకపోతున్నాను" అంది వనజ, ఇంటికి బయలుదేరే ముందు. "పిల్లలతో చర్చించాలా?" అని ఆలోచించలేదు సరళ. ఆమె దృష్టిలో వాళ్లింకా చిన్న పిల్లలే. ఏమీ తెలియని వాళ్ళే. "మోహనరావు ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.." నాయకుల మాటలు గుర్తొచ్చాయి సరళ కి. పరిస్థితి ఎలా ఉండేదో ఆమెకి తెలియనిది కాదు. అందుకే నిర్ణయం తను మాత్రమే తీసుకోవాలని నిశ్చయించుకుంది.
                                                               * * *
మోహనరావు చనిపోయిన ఐదోరోజు.. వీధి వీధంతా సందడిగా ఉంది. ఆవేళ మోహనరావు స్మారక అన్నదానం, పార్టీ ఆధ్వర్యంలో. టెంట్ హౌస్ నుంచి కుర్చీలు, బల్లలు వచ్చాయి. వీధిలో ఒక చివర వంటలు జరుగుతున్నాయి. బస్తీలో నిలువెత్తు కటౌట్లు వెలిశాయి. పార్టీ జెండా పట్టుకుని నడుస్తున్న మోహన రావు, అతని అడుగు జాడల్లో ఎర్రంచు తెల్ల వాయిల్ చీరలో, మెడలో పార్టీ పతాకంతో, జనానికి అభివాదం చేస్తూ నడుస్తున్న సరళ. "కామ్రేడ్ మోహనరావు అమర్ రహే" ఎర్ర రంగులో మెరుస్తున్న పెద్ద అక్షరాలు.

"కామ్రేడ్ మోహనరావు తన చివరి క్షణం వరకూ ప్రజలకోసమే పనిచేశారు. ఆయన ఆశయాలు కొనసాగించడం ఆయన సహచరిగా నా విధి. అందుకే, ప్రజలకి సేవ చేయడం కోసమే నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. పార్టీ నా మీద ఉంచిన బాధ్యత కూడా ఇదే" పత్రికల వాళ్లకి చెప్పింది సరళ. తమ కూటమి అధికారంలోకి వస్తే తనకి మేయర్ పదవి ఇవ్వాల్సిందిగా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి, నాయకుల నుంచి మాట తీసుకున్నాక మాత్రమే పోటీకి అంగీకరించిన విషయం ఆమె చెప్పలేదు. నాయకులు మినహా, సంగతి తెలిసిన మరోవ్యక్తి వనజ ఆవేల్టి కార్యక్రమానికి హాజరు కాలేదు.
                                                             * * *
(మృత్యువు నేపధ్యంగా వచ్చే రచనలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. నేనూ అలాంటి రచన ఎందుకు ప్రయత్నించకూడదు అన్న ఆలోచన ఫలితమే నా నాలుగో కథ 'సహచరుడు')