బుధవారం, మార్చి 31, 2010

ఇది కథ కాదు

మూడున్నర దశాబ్దాల క్రితం ఆయన మా ఊరికి వచ్చారు. భార్య, పదేళ్ళ కూతురితో కలిసి మా ఇంటికి నాలుగిళ్ళ అవతల ఖాళీగా ఉన్న ఓ ఇంటి పక్క వాటాలో దిగారు. రెండు గోతాలతో సామాను, ఓ ట్రంకు పెట్టెతో వాళ్ళు ముగ్గురూ ఒంటెద్దు బండి దిగడాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వద్దనుకున్నా ఒకరి వివరాలు మరొకరికి తెలిసిపోతూ ఉండడం పల్లెటూళ్ళ ప్రత్యేకత. అలా మర్నాటికి వాళ్ళ గురించి కొన్ని వివరాలు తెలిశాయి.

వాళ్ళు బతుకు తెరువు వెతుక్కుంటూ మా ఊరికి వచ్చారు. ఓ పదెకరాల భూస్వామి దగ్గర రైతుగా చేరాడాయన. వాళ్లకి పిల్లలు లేరు. ఆవిడ చెల్లెలి కూతురిని పెంచుకుంటున్నారు. మా ఊరోచ్చిన మర్నాడే ఆవిడ తన మెళ్ళో గొలుసు తాకట్టు పెట్టించి రెండు గేదెల్ని కొనిపించింది. వాళ్ళ చిన్న వాటా వెనుక ఉన్న కాసింత ఖాళీ స్థలం లోనే వాటికోసం ఒక పాక వేయించింది. ఆయన పొలం పనులకి వెళ్తే, ఆవిడ గేదెల సంరక్షణ చూసుకునేది. ఇంటి పనంతా ఆ పిల్లదే.

వాళ్ళ ఇంటికి ఐదారు ఇళ్ళ అవతలే సాటి కులస్తులు ఓ పదిహేను కుటుంబాలుగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు పచ్చగా ఉండడంతో వీళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళ వాళ్ళు అని చెప్పుకోడానికి సిగ్గు పడ్డారు. "కులం ఒకటే కానీ, బంధుత్వం లేదు" అని భుజాలు తడుముకున్నారు. సైకిలుకి పాల బిందె కట్టుకుని పొరుగూళ్లో ఉన్న కాఫీ హోటళ్ళకి పాలు పోసి రావడంతో ఆయన దినచర్య ప్రారంభమయ్యేది. ఆ పని అవ్వడంతోనే పొలం వెళ్ళిపోయే వాడు. మళ్ళీ ఏ రాత్రికో తిరిగి రావడం.

పాల మీద వచ్చిన డబ్బుతో ఆవిడ వడ్డీ వ్యాపారం మొదలు పెట్టింది. డబ్బు దగ్గర ఆవిడ నిక్కచ్చి మనిషి. శుక్రవారమైనా అప్పిస్తుంది, కానీ వడ్డీ మిగిలిన రోజుల కన్నా కొంచం ఎక్కువ వసూలు చేస్తుంది. ఆవిడ ఒంటి మీద చిన్నగా నగలు అమురుతున్నాయి. అరకల కాలంలో ఊళ్ళోనూ, పొరుగూళ్ళ లోనూ అరకలకి డిమాండ్ ఉండడం గమనించాడాయన. ధైర్యం చేసి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నాడు. మా ఊళ్ళో మొదటి ట్రాక్టర్.

రెండేళ్ళు గడిచేసరికి పొలం యజమాని పొలంలో కొంత భాగాన్ని అమ్మకానికి పెడితే ఆయనే కొన్నాడు. మరో పక్క నల్లని ఆవిడ మెడ బంగారంతో పచ్చబడుతోంది. పెంపుడు కూతురికి పెళ్లీడు రావడంతో తన చెల్లెలి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి, అతన్ని తన దగ్గరికే తెచ్చుకుని వ్యాపారం పెట్టించాడాయన. ట్రాక్టర్ల సంఖ్య మూడుకి పెరిగింది. ఆవిడ పాల వ్యాపారం, వడ్డీ వ్యాపారమూ అదే స్థాయిలో పెరిగాయి. చూస్తుండగానే పొలం యజమాని నుంచి మిగిలిన పొలాన్నీ, ఇంటినీ కొనేశాడాయన.

కూతురికి పిల్లలు బయలుదేరి, వాళ్ళు కొంచం పెద్దవాళ్ళు అయ్యే నాటికి పాత ఇల్లు స్థానంలో మేడ వెలిసింది. అప్పటికే ఊళ్ళో పెద్ద మనిషిగా వెలిగిపోతున్న ఆయన, రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. పార్టీలని నమ్ముకోలేదు, నాయకులకి మద్దతు ఇచ్చాడు. ఒకప్పుడు వాళ్ళని తమవాళ్ళు అని చెప్పుకోడానికి సిగ్గు పడ్డ వాళ్ళని ఆయనిప్పుడు లెక్కే చేయడం లేదు. వాళ్ళు మాత్రం ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

ఈ వారంలో జరగబోతున్న ఆయన మనవరాలి పెళ్ళికి ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు రాబోతున్నారానీ, అందుకోసం మా పంచాయితీ వారు యుద్ధ ప్రాతిపదికన రోడ్లకి మరమ్మతులు చేస్తున్నారనీ మా ఊరి నుంచి ఇప్పుడే అందిన తాజా వార్త.

మంగళవారం, మార్చి 30, 2010

ఓ ప్రయాణం

సూర్యుడింకా ఉదయించే ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. కాటుక లాంటి చీకటి అతి నెమ్మదిగా కరుగుతోంది. గోదారి బ్రిడ్జి మీద ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా సాగుతోంది. దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్న బాల గోదారి గాఢ నిద్రలో ఉన్నట్టుంది. కళ్ళింతలు చేసుకుని చూసినా కాసింతైనా దుప్పటి సవరించలేదు, దర్శనమే ఇవ్వలేదు..ప్చ్.. చైత్ర మాసం సగం గడిచినా మంచు కురుస్తూనే ఉంది. ఆసరికే బయలుదేరాల్సిన పడవల జాడ ఎక్కడా కనిపించనే లేదు.

మంచు కరిగే క్షణాల్లో అప్పుడే బద్ధకంగా నిద్ర లేచిన గోదారి అందం ఎలా ఉండి ఉంటుంది? నారింజ రంగు సూర్య కిరణాల తాకిడికి తెల్లని మంచుతెర నెమ్మదిగా, అతి నెమ్మదిగా కరుగుతూ ఉంటే.. ఆపై నల్లని వర్ణంలో కనిపించే నీళ్ళమీద ఆ కిరణాలు పరావర్తనం చెంది ఓ వింత కాంతిని వెద జల్లుతూ ఉంటే.. ప్రశాంతంగా ఉన్న నీళ్ళు, అప్పుడప్పుడూ వెళ్ళే పడవల బరువుకి తుళ్ళి పడి, అంతలోనే సర్దుకుంటూ ఉంటే.. ఓ చక్కని సూర్యోదయాన్ని మిస్సయ్యాను కదా? అనిపించింది చాలాసేపు.

బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తున్నంత సేపూ రెప్ప వెయ్యకుండా గోదారినే చూస్తున్నా.. మంచు దుప్పటి కాసింతైనా పక్కకి తొలగక పోతుందా? నిద్ర కళ్ళతో గోదారి దర్శనం ఇవ్వక పోతుందా? అన్న చిన్న ఆశ. ఉహు.. ఆశ తీరనేలేదు.. చూస్తుండగానే కళ్ళ ముందు దృశ్యం మారిపోయింది. గోదారి స్థానంలో కొబ్బరి తోపులు. రోడ్డుని ఆనుకుని ప్రవహిస్తున్న గోదారి కాలవ. మసక చీకట్లో నల్ల నల్లగా.. నలుపు-తెలుపుల వర్ణ మిశ్రమాలతో గీసిన చిత్రంలా..

కాసేపటి తర్వాత.. వీధి అరుగు మీద కూర్చుని చెరువు మీద నుంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ, కాఫీ తాగుతూ, మధ్య మధ్యలో పేపర్ తిరగేస్తున్నా.. శివాలయంలో గంట మోగడంతో మామిడి చెట్టు కొమ్మల మీద కూర్చున్న కొంగలన్నీ ఒక్కసారిగా పైకెగిరాయి. ఓ కొంగ ఉన్నట్టుండి మెరుపు వేగంతో నీళ్ళ అంచు మీదికి వచ్చి ఓ చేపని ముక్కున కరుచుకుని అంతే వేగంతో పైకెగిరింది. కొంగ ముక్కు తాకినంత మేరా చెరువు నీళ్ళలో వలయాలు.. అనాసక్తిగా పేపర్ పూర్తి చేసి, తూగో జిల్లా తోక పేపర్ చేతిలోకి తీసుకుని, ఓ వార్త దగ్గర ఒక్కసారిగా ఆగాను..

రెండు రోజుల పాటు ఏ పని చేస్తున్నా ఆ వార్త నన్ను వెంటాడుతూనే ఉంది. చేయాల్సిన పనులు పూర్తి చేశాక తిరుగు ప్రయాణం.. గోదారి సమీపిస్తుండగా నాకు తెలియకుండానే నా మనసులో కలకలం. ఆకాశంలో సూర్యుడు అస్తమించడానికి తొందర పడుతున్నాడు. పక్షులు గూళ్ళు చేరే హడావిడిలో ఉన్నాయి. అరుణ వర్ణపు సూర్యకిరణాలు నల్ల బడుతున్న గోదారి నీళ్ళమీద పడుతున్నాయి. ఎక్కడా పడవల జాడ లేదు. నీళ్ళ మధ్యలో ఇసుక మేటలు. నిజం చెప్పాలంటే గోదారి ఇసుక తిప్పల మధ్య ప్రవహిస్తున్న పిల్ల కాలువలా అనిపించింది.

ఇంకిపోతున్న నీళ్ళని చూడగానే పేపర్లో వార్త మళ్ళీ గుర్తొచ్చింది. గోదారి ఎండిపోతున్న కారణంగా పంట నిలబడదేమో అని ఆందోళన చెందుతున్న రైతులు.. ఇది మొదటి సారి కాదు.. వరుసగా రెండో సారి.. ఇలా జరగడం. కాటన్ మహాశయుడు ఆనకట్ట కట్టక పూర్వం వచ్చిన కరువు గురించి విన్న కథలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. పచ్చని సీమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన వెన్నులో చలి పుట్టించింది. తనని చూసిన వాళ్ళ కళ్ళలో తడిని చూడడం గోదారికి అలవాటై పోయినట్టుంది.. అభావంగానే నాకు వీడ్కోలు ఇచ్చింది.

ఆదివారం, మార్చి 21, 2010

అనార్ కలి

ఆమె ఓ బానిస యువతి. ఆట పాటల్లో మేటి. అనారు పూలంటే ఆమెకి యెడ తెగని ప్రీతి. కేవలం ఆ పూల కోసమే అక్బర్ చక్రవర్తికి చెందిన పూదోటకి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా, చక్రవర్తి సైన్యంలో పనిచేసే ఓ యువకుడిని చూసి భయపడి, అనంతరం ఆ సిపాయితోనే ప్రేమలో పడిపోయింది. ఆ యువతి పేరు నాదిరా.. ఆమె ప్రేమించింది మరెవరినో కాదు, మారు వేషంలో ఉన్న చక్రవర్తి కుమారుడు సలీంని.

అంతస్తుల భేదానికీ, అధికారంలో ఉన్నవారి అహంకారానికీ, ఇంకా సలీం పిరికితనానికీ, మొండి పట్టుదలకీ బలైపోయింది ఆమె ప్రేమ. ఫలితం.. రాజ ప్రాసాదంలో ఆమె సమాధి.. సమాధి ఎదుట వెలుగుతున్న జ్యోతి.. ఆ పక్కనే ఆమెనే కీర్తిస్తూ సలీం. యాభయ్యయిదేళ్ళ క్రితం వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అంజలీదేవి భర్త పి. ఆదినారాయణ రావు నిర్మించిన సంగీత భరిత ప్రేమకథా చిత్రం 'అనార్ కలి' లో ప్రారంభ దృశ్యం ఇదే.


అనారు పూల తోటలో 'జీవితమే సఫలము..' అని పాడుకుంటున్న నాదిరా (అంజలీదేవి) తో తొలి చూపులోనే ప్రేమలో పడ్డ సలీం (అక్కినేని నాగేశ్వర రావు), తన వివరాలు దాచి ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. స్నేహం ప్రేమగా మారాక తన 'సిపాయి' కోసం నాదిరా ఆ పాట పాడుతూ ఉండగా అక్బర్ చక్రవర్తి (యస్వీ రంగారావు) పూదోటకి వస్తున్నారన్న వార్త తెలిసి ఆమెని అక్కడే వదిలి పారిపోతాడు సలీం. వచ్చిన వాడు అక్బర్ చక్రవర్తని తెలీదు అమాయకురాలైన నాదిరాకి.

తమ ఏకాంతానికి భంగం కలిగించినందుకు కోపగించుకుని, ఆపై తగువు పెట్టుకుని, తన ప్రేమ గొప్పదని నిరూపిస్తానని, తన ప్రియుణ్ణి పిలుస్తాననీ శపథం చేస్తుంది నాదిరా. పాట పాడి సలీముని పిలిచినా, అతను చక్రవర్తికి ఎదుట పడక, చెట్టు చాటునే నిలబడతాడు. తాను చక్రవర్తినని చెప్పిన అక్బర్, నాదిరాని ఏం కావాలో కోరుకోమంటాడు. "మీ ప్రేమకి పాత్రమైన ఆ అనారు పుష్పాలని ఇప్పించండి చాలు" అంటుంది నాదిరా.. పూలతో పాటు, ఆమెకి 'అనార్ కలి' అనే బిరుదు కూడా ఇస్తాడు అక్బర్.


సలీం ప్రేమ విషయం అక్బర్ ఆస్థానంలోని మాన్ సింగ్ (చిత్తూరు నాగయ్య) కి తెలిసిపోతుంది. యువ రాజుని మందలించడమే కాదు, తనతో యుద్ధానికీ తీసుకెళతాడు మాన్ సింగ్. ఇంతలో బానిసల స్థావరం మీద దాడి జరగడం, అనార్ కలి ని దుండగులు ఎత్తుకుపోయి, వేలానికి పెట్టడమూ జరిగిపోతుంది. మారువేషంలో వేలానికి వచ్చిన సలీం ఆమెని వేలంలో కొనుక్కుంటాడు. యుద్ధంలో గాయపడ్డ సలీం ని తన పాటతో బతికించుకుంటుంది అనార్ కలి. అప్పుడే ఆమెకి తన ప్రియుడు మామూలు సిపాయి కాదనీ, కాబోయే చక్రవర్తి అనీ తెలుస్తుంది.

అక్బర్ ఆమెకి ఆస్థాన నర్తకి పదవి ఇచ్చి గౌరవిస్తే, రాజా మాన్ సింగ్ ఆమెని సలీం ని మరచి పోవాల్సిందిగా ఆదేశిస్తాడు. తల్లిదండ్రుల ఎదుట అమాయకత్వం నటించే సలీం, చాటుగా అనార్ కలి ని ప్రేమిస్తూ ఉంటాడు. రాజ నర్తకి కుతంత్రం కారణంగా అనార్ కలికి రాజద్రోహ నేరం పై శిక్ష పడ్డప్పుడు, తల్లి జోధా బాయి (కన్నాంబ) తో తాను అనార్ కలి ని ప్రేమిస్తున్న సంగతి చెబుతాడు సలీం. ప్రేమని వ్యతిరేకించిన అక్బర్ చక్రవర్తిపై యుద్ధం ప్రకటించి, తల్లి కోరిక మేరకు రణరంగం నుంచి వెనుతిరుగుతాడు.

సలీం, అనార్ కలి ఇద్దరికీ మరణ శిక్ష విధించిన అక్బర్ చక్రవర్తి, కన్నప్రేమ కారణంగా సలీం కి విధించిన శిక్షని అమలు చేయలేక పోతాడు. అనార్ కలికి యెంతో ఇష్టమైన దానిమ్మ పూల తోటలో ఆమె సమాధి ఎదుట పాటలు పాడుకుంటూ సలీం శేష జీవితాన్ని గడపడం ఈ విషాదాంత ప్రేమ కథకి ముగింపు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వ ప్రతిభ, ఆదినారాయణ రావు సంగీత ప్రతిభ సినిమా ఆసాంతమూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. 'జీవితమే సఫలమూ' తో పాటుగా 'రాజశేఖరా నీపై మోజు తీర లేదురా..' పాట ఎవర్ గ్రీన్. చిత్రీకరణ పరంగా 'కలిసె నెలరాజు కలువ చెలిని' పాట ఒక అద్భుతం.


నాదిరా తన ప్రేమ గురించి అక్బర్ చక్రవర్తి ఎదుట ధైర్యంగా మాట్లాడడం, సలీంతో పీక లోతు ప్రేమలో మునిగాక ఆమె రాజా మాన్ సింగ్ ని ఎదిరించే సన్నివేశం, అక్బర్-జోధా బాయి-సలీం మధ్య వచ్చే సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. నటీ నటుల విషయంలో మొదట చెప్పుకోవాల్సింది అనార్ కలి గా టైటిల్ పాత్ర పోషించిన అంజలీ దేవి గురించే. నర్తకి పాత్రకే అవసరమైన రూప లావణ్యం తో పాటు, నృత్య ప్రతిభా ఆమె సొంతం కావడం తో అనార్ కలి పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేసింది అంజలి. తర్వాత చెప్పుకోవాల్సింది అక్బర్ గా ఎస్వీ రంగారావు, జోధాబాయిగా కన్నాంబల గురించి.. పోటీ పడి నటించారు ఇద్దరూ. వీరితో పాటే చిత్తూరు నాగయ్య.

సలీం గా అక్కినేని నాగేశ్వర రావుది పాసివ్ పాత్ర. కొంత పిరికితనం, మరి కొంచం మూర్ఖత్వం మేళవించిన పాత్ర. అక్బర్ ని ఎదిరించే సన్నివేశంలోనూ, తల్లి మాటకి ఎదురు చెప్పలేక యుద్ధరంగం నుంచి వెనుతిరిగే సన్నివేశం లోనూ నాగేశ్వర రావు నటన గుర్తుండి పోతుంది. ముస్లిం యువరాజుగా కనిపించడం కోసం నాగేశ్వర రావు వాడిన విగ్గు బాగుంది. కళ్ళు చెదిరే రాజ మహల్ సెట్టింగులతో భారీగా తీశారీ సినిమాని. ఐదున్నర దశాబ్దాల క్రితం సినిమా కాబట్టి అక్కడక్కడా కొంచం సాగతీత అనిపిస్తుంది. అలా అని అదేమీ ఈ సినిమా చూడడానికి అడ్డంకి కాదు. అన్నట్టు అంజలి-అక్కినేని ల 'సువర్ణ సుందరి' గురించి మరికొన్ని కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

శుక్రవారం, మార్చి 19, 2010

వడియాలు

పక్క వాళ్ళ కొబ్బరి తోటకి ఇంజిన్ తో నీళ్ళు పెట్టారు కదా.. మట్టంతా తడితడిగా ఉంది. ఎవరూ చూడకుండా నాలుగు దోసిళ్ళ తడి మట్టి తెచ్చి ఇంటి పక్క సందులో కుండ పెంకులో దాచాను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తాతయ్య, నాన్న ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే దాచి పెట్టుకున్న మెరుపు కాగితాలు జేబులో పెట్టుకుని సందులోకి పరిగెత్తాను.

రాళ్ళు లేకుండా మట్టి అంతా ముద్దగా కలుపుకుని, ఎన్ని బొంగరాలు చేయాలో ఆలోచించుకుంటూనే, మట్టి మిగిలితే కారు బొమ్మో, రైలు బొమ్మో చేయాలని కూడా ప్లాన్లేస్తున్నా. ఇంతలో నన్ను వెతుక్కుంటూ బామ్మొచ్చేసింది. గుండెల్లో రాయి పడింది కానీ, నాన్న ఇంట్లో లేరని గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నా. అయితే, బామ్మ "మట్టితో ఆడుతున్నావా? మీ నాన్నకి చెబుతానుండు.." అనకుండా "ఒక్కడివీ ఏం చేస్తున్నావు బాబూ?" అని అడిగింది ప్రేమగా.

బామ్మ కేకలేయక పోవడం కొత్తగా అనిపించింది. "బొంగరాలు చేసుకుంటున్నాను.. నీక్కూడా ఒకటి ఇస్తాలే" అని హామీ ఇచ్చాను. బామ్మ అస్సలు సంతోషించకుండా "నా పనిప్పుడు బొంగరాలు ఆడేలాగే ఉంది.. అసలే శాయమ్మని రమ్మని కబురెట్టాను" అంది. "పర్లేదులే బామ్మా.. శాయమ్మ గారికి కూడా బొంగరం చేసిస్తాను.. బోల్డంత మట్టి తెచ్చాను కదా" అన్నాను. అయినా కూడా బామ్మ సంతోష పడలేదు. "శాయమ్మని కత్తిపీట పట్టుకురమ్మని చెప్పేశాను.. మీ తాతా, నాన్నా ఇద్దరికిద్దరే.. చెప్పింది చేయరు. మళ్ళీ అడిగితే కోపాలు" అంది.

నాకేంటో పొడుపు కథలా అనిపించింది. తనే చెబుతుందిలే అని నా పనిలో నేనున్నాను. మట్టి ఆరిపోతే బొంగరాలు సరిగ్గా రావు మరి. "కాఫీలు తాగేసి పని మొదలు పెట్టాలి.. ఓమాటు చెయ్యి కడుక్కుని వస్తావా?" అని అడిగింది ప్రేమగా.. నాతో ఏదో పని ఉందని అర్ధమయ్యింది. "అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను. నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు. మామూలప్పుడు కాఫీ అడిగితే "మీ నాన్నకి చెబుతా" అని బెదిరించే బామ్మ, ఆ పూట "మా నాయినే.. అదేవన్నా బంగారవా? పలకల గ్లాసుతో ఇస్తాను, రా" అంది, మళ్ళీ ప్రేమగా. పలకల గ్లాసంటే పెద్ద గ్లాసన్న మాట.

నేను ఊదుకుంటూ కాఫీ తాగుతున్నానా.. అప్పుడు విప్పింది బామ్మ పొడుపు కథని. "బూడిద గుమ్మడికాయలకి నాటెట్టి వెళ్ళమంటే మీ తాతకీ, నాన్నకీ చెయ్యి ఖాళీ లేకపోయింది. ఇంట్లో మగ పిల్లాడివి ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపొతే ఎవర్నన్నా బతిమాలుకోవాల్సి వచ్చేది.." ఇదన్న మాట సంగతి.. "వడియాలు పెడుతున్నారా? కారం లేకుండా వడియం అట్టు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో.." అన్నాన్నేను, తగు మాత్రంగా లొట్టలేస్తూ. నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?

"ఓస్.. అంతే కదా.. మీ అమ్మకి చెబుతానుండు, కారం కలపకుండా పిండి తియ్యమని.. రేపు మధ్యాహ్నం అన్నంలోకి నీకు అట్టు కాల్చి పెడతాను..సరేనా?" హామీ ఇచ్చేసింది బామ్మ. కాఫీలయిపోయాయి కదా, ఇప్పుడు బామ్మ పని మిగిలింది. పెరట్లో తులసి కోట చుట్టూ పెద్దవీ, చిన్నవీ కలిపి ఓ డజను బూడిద గుమ్మడి కాయలున్నాయి. దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే కత్తి పట్టుకొచ్చింది బామ్మ. ఆ కత్తితో బామ్మ పర్యవేక్షణలో ఒక్కో కాయ మీదా నాటు పెట్టాన్నేను, కత్తి బరువనీ, చెయ్యి నొప్పనీ హడావిడి చేసి..

నా పని పూర్తవుతూనే కత్తిపీటతో శాయమ్మ గారు వచ్చేశారు. అది మొదలు అమ్మ, బామ్మ, శాయమ్మ గారూ ఆ గుమ్మడికాయలు ఒక్కోటీ ముక్కలుగా తరగడం. నా బొంగరాల పని పెరట్లోకి మార్చేశాను, వాళ్లకి కొంచం సాయంగా ఉంటుందని. సాయంత్రానికి తరగడం పూర్తయ్యింది. ఓ చీరలో ముక్కలన్నీ వేసి, రాళ్లుప్పు జల్లి, మీరయ్య పట్టుకెళ్ళే బట్టల మూటంత పెద్ద మూట కట్టి, ఆ మూటని పెద్ద పీట మీద పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి కుంది రోలు సాయం పట్టి ఆ మూట మీద పెట్టేశారు.

మర్నాడు పొద్దున్నే అమ్మ మినప్పప్పు, పచ్చి మిరపకాయలు విడిగా రుబ్బేసిందా? తర్వాత నాకోసం కారం కలపకుండా విడిగా కొంచం పిండి ఉంచి, మిగిలిన పిండిలో కారం కలిపేసింది. రాత్రంతా మూట లోనుంచి నీళ్ళు కారిపోడంతో అంత పెద్ద మూటా చిన్నదైపోయింది. గుమ్మడి ముక్కల్లో కారంపిండి కలిపేసి అమ్మా, బామ్మా కలిసి వడియాలు పెట్టేశారు. మధ్యాహ్నాలు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వడియాలు కాకులెత్తుకు పోకుండా కాపలా కాసే పనీ, రోజూ సాయంత్రం వడియాలు లేక్కెట్టే పనీ నామీదే పడ్డాయి.

నాలుగోరోజుకి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయాయి వడియాలు. ఆవేళ మధ్యాహ్నం భోజనంలోకి వేగించింది బామ్మ. తాతయ్య, నాన్న, నేనూ భోజనాలు చేస్తున్నాం. "బాగున్నాయ్ వడియాలు.. ఇంకో రెండు ఎండలు ఎండితే నిలవుంటాయ్" అన్నారు తాతయ్య. "రెక్కలు ముక్కలైపోయాయ్.. శాయమ్మ కూడా సాయం వచ్చింది కాబట్టి సరిపోయింది.. కాస్త పనా, కూస్త పనా.. రాక్షస చాకిరీ," అంది బామ్మ, నేను కూడా కష్టపడ్డా ఆ విషయం అస్సలు చెప్పకుండా. నాక్కోపం వచ్చేసింది.

నాన్నున్నారనైనా చూడకుండా, "చూడు తాతా.. మొన్న నేను కష్టపడి నాట్లు పెట్టాను కాబట్టి పెట్టారు వడియాలు. ఆవిషయం అస్సలు చెప్పడం లేదు," అని కంప్లైంట్ చేసేశాను. "నువ్వూ, నేనూ ఎంత చేసినా మీ బామ్మకి కనిపించదు లేరా.. ఆవిణ్ణి మెప్పించడం మన వల్ల కాదులే.." అన్నారు తాతయ్య. బామ్మ నా బొంగరాల విషయం నాన్నకి చెప్పేస్తుందేమో అని భయ పడ్డాను కానీ, మర్చిపోయినట్టుంది.. నావైపు కోపంగా చూసి ఊరుకుంది, అంతే..

ఆదివారం, మార్చి 14, 2010

బ్లాగులు-హిమబిందువులు

లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కోవడం సులువే.. కానీ చేరుకోవడం చాలా కష్టం. కృషి, పట్టుదల, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోగలగడం, కొత్త ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం..ఇవన్నీ అవసరం. పెళ్లై, ఒక బిడ్డకి తల్లైన మహిళ ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, పట్టుదలతో కృషి చేసి, ఆ లక్ష్యాన్ని చేరుకోడం చెప్పినంత సులభం కాదు. విజేతలు లక్ష్య సాధన కోసం జరిపిన కృషి, చేసిన త్యాగాలూ, ఇవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు. కానీ.. అలాంటి ఒక విజేత కృషిని తెలుసుకోగలిగే అవకాశాన్ని కల్పించిందొక బ్లాగు.. ఆ బ్లాగు పేరు హిమబిందువులు.

ప్రభుత్వ సర్వీసుని తన లక్ష్యంగా నిర్ణయించుకోవడం మొదలు, దానిని సాధించడం వరకు తను చేసిన కృషి, కుటుంబ సభ్యులు, మిత్రుల నుంచి అందిన సహకారాన్ని వివరంగా రాశారు బ్లాగర్ చిన్ని 'నా స్నేహితులు' అనే సిరీస్ లో. లక్ష్య సాధన కోసం కృషి చేసే ప్రతి ఒక్కరూ చదవాల్సిన టపాలివి. ఫిబ్రవరి 6, 2009 న 'కొత్తగా బ్లాగులోకంలోకి' అనే టపా తో బ్లాగుని ప్రారభించి, గడిచిన ఏడాది కాలంలో తన బాల్య జ్ఞాపకాలు, ఆలోచనలు, కవితలు, తన దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు.., ఇంకా తనకి నచ్చిన పాటలు.. ఇలా ఎన్నో కబుర్లని బ్లాగు పాఠకులతో పంచుకున్నారు చిన్ని.

తామరాకులో ఆమ్లెట్ తిన్నా, వజ్రాల వేట సాగించినా, అభిమాన హీరోల గురించి చెప్పినా, నాన్న గురించి రాసినా.. ప్రతి జ్ఞాపకం లోనూ ఏదో ఒక ప్రత్యేకత. ఈవిడకి నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉన్నాయని ఇట్టే తెలిసిపోతుంది, వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళని, మిగిలిన స్నేహితులని గైడ్ చేసిన విధానం చదవగానే. ఒక ఉమ్మడి కుటుంబ దృశ్యాన్ని కళ్ళముందు ఉంచడమే కాదు, అప్పుడప్పుడూ అయినా మన వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉండాలి సుమా అన్న ఆలోచన మనకి తెలియకుండానే కలిగిస్తాయీ టపాలు.

చిన్ని గారికి సీరియళ్ళంటే బాగా ఇష్టమేమో అన్న సందేహం రాక మానదు, ఆవిడ రాసిన టపాల సీరియళ్ళు చదివినప్పుడు. 'నా స్నేహితులు' తో పాటు, 'మా వంటింటి కథ, 'కార్ డ్రైవర్ కథ,' ఇంకా 'నేను' సీరియల్ టపాలు ఉన్నాయి ఈ బ్లాగులో. 'నేను ఎవరిని,' 'ఏం రాయమంటావే చిన్నారి,' 'సంధ్యా సమయంలో..' 'బంధం' ఇవి చిన్ని గారు రాసిన కొన్ని కవితలు. చాలా వరకు మనల్ని ఆలోచనలో పడేసేవే. కవితలు రాయడం మాత్రమే కాదు, తనకి నచ్చిన సినిమా పాటల సాహిత్యాన్ని, వీడియోలనీ అప్పుడప్పుడూ బ్లాగులో ఉంచుతూ ఉంటారు.


ఆమధ్య ఎప్పుడో ఒక బ్లాగులో వ్యాఖ్య రాస్తూ బ్లాగర్ కొత్తపాళీ గారు మహిళలకి పూలన్నా, మొక్కలన్నా ప్రత్యేకమైనా అభిమానం అన్నారు. చిన్ని గారు కూడా మినహాయింపేమీ కాదు. 'ఇప్పపూలు' 'తంగేడుపూలు' టపాలే ఇందుకు సాక్ష్యం. అన్నట్టు కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ సభకి వెళ్లి, ఆ వెంటనే ఆ విశేషాలని బ్లాగ్మిత్రులందరితో పంచుకున్నారు. ఆయన కథల గురించి కూడా టపాలు రాస్తారేమో చూడాలి. కథలు అనగానే మరో విషయం గుర్తొచ్చింది. వంశీ కథలు వన్నె తగ్గుతున్నాయని నిర్మొహమాటంగా చెప్పేశారు, దిగువ గోదారి కథలు చదువుతూ. అలాగే చలం అట్లపిండి కథను యెంతో సరదాగా పరిచయమూ చేశారు.

చిన్ననాటి మిత్రులని కలుసుకునే అవకాశం మనకి అరుదుగా మాత్రమే దొరుకుతుంది కదా.. కానీ చిన్ని గారికి మాత్రం ఆ అవకాశం తరచూ దొరుకుతున్నట్టు ఉంది. 'ఆనాటి హృదయాల ఆనంద గీతం' పాడిన నాలుగు నెలలు తిరక్కుండానే 'ఒక లైలా కోసం' పాటకి మిత్రులు చేసిన డేన్స్ చూసి వచ్చారు మరి. మిత్రులంతా దేశ, విదేశాల్లో స్థిర పడినా తరచూ కలుసుకుంటూనే ఉంటామని 'నా స్నేహితులు' లోనే చెప్పారు. పూలచెట్లు, పాటలు, పుస్తకాలతో స్నేహం ఉండనే ఉంది.

నా సంగతి కొంచం చెప్పాలి. 'నెమలికన్ను' మొదలుపెట్టిన ఐదు నెలలకి 'ఈనాడు' నాకో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇస్తే, అలాంటి సర్ప్రైజ్ నే అదే రోజు ఇచ్చారు చిన్ని గారు. 'ఈనాడు లో నెమలికన్ను' గురించి టపా రాసి, కూడలికి వచ్చేసరికి 'మురళికి నెమలిపించం' అంటూ చిన్ని గారు తన బ్లాగులో రాసిన టపా నాకు స్వాగతం పలికింది. ధన్యవాదాలు చిన్ని గారూ. 'హిమబిందువులు' బ్లాగు నుంచి నేను నేర్చుకున్న మరో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఈ బ్లాగులో కనిపించే అప్పుతచ్చుల గురించి నేను వ్యాఖ్యలు రాసే వాడిని. మొదట్లో 'సరి దిద్దుకుంటా' అని ఓపిగ్గా చెప్పారు.

నేను నా పధ్ధతి మార్చుకోక పోవడంతో ఆవిడకి సహనం నశించినట్టుంది, "నాకు ఇలాగే వచ్చు" అని వ్యాఖ్యలో చెప్పేశారొక సారి. ఆలోచిస్తే అనిపించింది.. ఎవరి బ్లాగు ఎలా ఉండాలో చెప్పడం మనపని కాదు అనీ, అలాగే బ్లాగు ఇలాగే ఉండాలి, ఇలాగే రాయాలి అనడం కూడా సరికాదు అని. అప్పటినుంచీ ఏ బ్లాగులో అయినా అప్పుతచ్చులు కనిపించినా వ్యాఖ్య రాసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నా. చిన్ని గారు తన విజయగాధని మరికొంచం వివరంగా రాస్తే చదవాలని ఉంది. కబుర్లు, కవితలతో మరికొంచం తరచుగా టపాలు రాస్తే బాగుంటుంది.

బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

శుక్రవారం, మార్చి 12, 2010

ఎన్ కౌంటర్

రాజ్యహింస, ప్రతిహింస, విప్లవ సాహిత్యం, కిట్ బ్యాగులు, ఆత్మరక్షణ, ప్లీనరీ, దళాలు, ఇన్ఫార్మర్లు... ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారీ వినిపించే పదజాలమిది. అధికారంలో ఏ నాయకుడున్నా, నిర్ణయాధికారం ఏ అధికారి చేతిలో ఉన్నా పెద్దగా తేడా లేకుండా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి ఈ ఎన్ కౌంటర్లు. తరచుగా మావోయిస్టులూ (గతంలో వీళ్ళనే నక్సలైట్లు అనేవాళ్ళు) అప్పుడప్పుడూ పోలీసులూ ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ కౌంటర్లలో. ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా..

ఏ ఉద్యమమైనా అణచివేత నుంచే పుడుతుంది. దోపిడీకి, పీడనకి గురయిన వాళ్ళే పోరు బాట పడతారు. నక్సల్బరీ ఉద్యమమూ ఇందుకు మినహాయింపు కాదు. సమాజంలో ధనిక, బీద తారతమ్యాలు పతాక స్థాయికి చేరినప్పుడు, డబ్బు, అధికారం ఉన్నవాడి చేతిలో అవేమీ లేని వాడు ఓ ఆటబొమ్మగా మారినప్పుడు, ఎర్రబడ్డ కంటికొసల నుంచీ, బిగుసుకున్న పిడికిళ్ల నుంచీ పుట్టిన ఉద్యమమే నక్సల్బరీ. ఉన్నవాడిని కొట్టి, లేనివాడికి పంచడం అన్న రాబిన్ హుడ్ థియరీ ని అమలు పరచడం ద్వారా పీడితుల ఆదరాన్ని పొందగలిగిందీ ఉద్యమం.

ఒక చోటి నుంచి మరో చోటికి త్వరత్వరగా ఉద్యమం విస్తరించడంతో, నక్సలైట్లకి టార్గెట్ గా మారిన వర్గాలలో అభద్రతా భావం పెరిగిపోయింది. పెరుగుతున్న దాడులు, ప్రభుత్వానికి సవాలు విసిరాయి. మొదటి నుంచీ ప్రభుత్వం ఈ సమస్యని కేవలం 'శాంతి భద్రతల సమస్య' గా మాత్రమే చూసింది. అణచివేత చర్యలు మొదలు పెట్టింది. ప్రత్యేక పోలీసు దళాలు, ఇన్ఫార్మర్ల వ్యవస్థ, అడవుల్లో కూంబింగులు..ఆపై ఎన్ కౌంటర్లు. అటు నక్సలైట్లకీ, ఇటు వాళ్ళపై పోరాడుతున్న పోలీసులకీ అడవులే స్థావరాలు అయ్యాయి.

ప్రకృతిలో భాగంగా జీవితం గడుపుతున్న గిరిజనుల జీవితాలు అతలాకుతలం కావడం మొదలయ్యింది. అటు నక్సలైట్లకీ, ఇటు పోలీసులకీ ఇన్ఫార్మర్లు గిరిజనులే అయ్యారు. అడవి ఆనుపానులు బాగా తెలియడం, నమ్మకమైన మనుషులన్న పేరు ఉండడం ఇందుకు కారణాలు అని చెప్పాలి. పోలీసు ఇన్ఫార్మర్లన్న నెపంతో నక్సలైట్లూ, నక్సల్ ఇన్ఫార్మర్లన్న నెపంతో పోలీసులూ వీళ్ళని హింసించిన సంఘటనలూ కోకొల్లలు. మరోపక్క పౌరసమాజం నుంచీ నక్సలైట్లకి మద్దతు రావడం మొదలయ్యింది. మేధావి వర్గం హక్కుల సంఘాలని ఏర్పాటు చేసింది.


అన్ని ఉద్యమాలలో లాగే, నక్సల్బరీ ఉద్యమంలోనూ 'క్రమశిక్షణ' సమస్య తలెత్తింది. సభ్యులు పెరిగే కొద్దీ వారిపై నియంత్రణ తగ్గడం మొదలయ్యింది. ఉద్యమం అసలు ఉద్దేశాలు ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు తలెత్తాయి. కొన్ని చీలికలూ వచ్చాయి. ప్రభుత్వం ఓ పక్క పోలీసు బలగాలని ఉపయోగిస్తూనే, మరోపక్క నక్సలైట్లని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు చేయడం మొదలు పెట్టింది. లొంగిపోయిన నక్సలైట్లకి ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించింది. కొందరు లొంగి పోయారు, లొంగిపోయిన వారిలో కొందరు పోలీసు ఇన్ఫార్మర్లన్న ముద్ర వేసుకున్నారు.

నక్సలైట్లు మావోయిస్టులుగా మారే సమయంలోనే నక్సల్ సమస్యకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండా లో ప్రముఖమైన చోటు లభించింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మావోయిస్టులని చర్చలకి ఆహ్వానించింది. చర్చలు విఫలంయ్యాయనే సంకేతాలు జనంలోకి వెళ్ళినప్పటికీ, ప్రభుత్వం మాత్రం తను చర్చలకి సిద్ధమని ప్రకటిస్తూనే ఉంది. మరో పక్క ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ కౌంటర్లని 'రాజ్యహింస' గానూ, మావోయిస్టుల చేతిలో పోలీసులు మరణించినప్పుడు దానిని 'ప్రతిహింస' గానూ చెబుతున్నాయి హక్కుల సంఘాలు.

దశాబ్దాల కాలంలో నక్సలైట్లు, పోలీసులు వందల సంఖ్యలో మరణించారు. మరెందరో గాయ పడ్డారు. సమస్యకి మూలమైన దోపిడీ, అన్యాయం ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజనుల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మాన ప్రాణాలనీ ప్రభుత్వం రక్షించ లేక పోతోంది. ప్రభుత్వ పధకాలు అమలుకు నోచుకున్నవి తక్కువే. నిజంగా అమలై ఉంటే ప్రజలే మావోయిస్టులకి స్వచ్చందంగా సహాయ నిరాకరణ చేసి ఉండే వాళ్ళేమో. ఉద్యమం లో చేరి తుపాకీ పట్టిన వాళ్ళనందరినీ బెదిరించి భయ పెట్టడం ద్వారానూ, ఎన్ కౌంటర్ల ద్వారా నిర్మూలించడం ద్వారానూ పరిష్కారం అయ్యే సమస్యే అయితే మావోయిష్టు సమస్య ఎన్నో ఏళ్ళ క్రితమే పరిష్కారం అయి ఉండేది కదా??

గురువారం, మార్చి 11, 2010

గోపాత్రుడు

అప్పటివరకూ ఒకే మాటగా ఏకతాటి మీద ఉన్న అలమండ గ్రామం మొత్తం ఆ పూట రెండు గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపులో అలమండ ఊరు మొత్తం. రెండో గ్రూపులో ఒకే ఒక్కడు. మచిలీపట్నం గోపాత్రుడు, ఆ ఊరి ఏకైక వైద్యుడు. అలా విడిపోడానికి కారణం ఒక తగువు, ఆ తగువు మొదలయ్యింది గోపాత్రుడి వల్లే.

తగువు జరిగింది రామ కోవెల దగ్గరున్న బొబ్బిలి రాజుగారి కిళ్ళీ కొట్టు దగ్గర. పట్నంలో చదువుకుంటున్న చింతలపాటి వారి చిన్న రాజు జాగ్రఫీ పాఠాల గురించి లెక్చరు దంచుతుంటే "బాబూ భూమి ఎలాగుంటుందోయ్" అని అడిగాడు గోపాత్రుడు. "గుండ్రంగా ఉంటుం"దన్నాడు చిన్నరాజు. "బల్లపరుపుగా" ఉంటుందని వాదించాడు గోపాత్రుడు. అంతే.. ఊరు మొత్తం అగ్గి ఫైరై పోయింది.

ఊరంతా ఒక మాట మీద ఉంటే బాగుంటుంది కాబట్టి, అభిప్రాయం మార్చుకోమన్నారు ఊరి వాళ్ళు. అభిప్రాయం మార్చుకోనని తెగేసి చెప్పాడు గోపాత్రుడు. ఊరి వాళ్ళ అభిప్రాయంతో తనకి ఎలాంటి పేచీ లేదన్నాడు. కానీ ఊరు ఊరుకోలేదు. గోపాత్రుడిని ఒంటరివాడిని చేసి నలుగురూ నాలుగు మాటలు అంటున్న వేళ, తోకూపుకుంటూ వచ్చింది వీరబొబ్బిలి.

గోపాత్రుడికి మద్దతు పలకడమే కాదు, "మూర్ఖ జనంతో జెట్టీకి దిగొద్ద"ని సలహా కూడా ఇచ్చింది వీరబొబ్బిలి. గోపాత్రుడు అసలెందుకు భూమి ఆకారం గురించి ఊరితో వాదనకి దిగాడు? అందుకు కారణం అతని తండ్రి పెదపాత్రుడు, వైద్యం రాకపోయినా ఆ ఊళ్ళో వైద్యుడిగా చలామణీ అయిన వాడు. తన చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి పెదపాత్రుడు అతని చెవిలో చెప్పిన మాటల్లో ముఖ్యమైనది "ఎప్పుడూ భూవి గుండ్రంగా ఉందని ఒప్పుకోవద్ద"ని.

"దిడ్డీ పెట్టె లో ఉన్న పుస్తకాలు చదవక పోయినా పర్వాలేదు, నీకు వైద్యం వచ్చని జనాన్ని నమ్మించ గలిగితే నువ్వు వైద్యుడిగా చెలామణి అయిపోవచ్చు" అని కూడా చెబుతాడు పెద పాత్రుడు. అందుకే, ఊరు ఊరంతా గోపాత్రుడిని "ఎవరొచ్చి చెబితే భూమి గుండ్రంగా ఉందని నమ్ముతావు?" అని బతిమాలి నప్పుడు ఏ మాత్రం తొణక్కుండా "మా నాయన వచ్చి చెబితే" నమ్ముతానన్నాడు.



'సాక్షి' కోసం అన్వర్ గారు గీసిన గోపాత్రుడి చిత్రం
వీరబొబ్బిలిని పోషిస్తున్న ఉప్పలపాటి ఫకీర్రాజుకి గోపాత్రుడితో మంచి స్నేహం. ఇద్దరూ కలిసి ఊరి జనానికి వైద్యం చేస్తూ ఉంటారు. అదిగో ఆ ఫకీర్రాజు కూడా, జరిగిన గొడవ సావధానంగా విని, భూమాత ఆకారం గురించి తన అభిప్రాయం వెంటనే చెప్పకుండా "రాజులేవన్నారోయ్.. వెలమలేవన్నారోయ్.." అని వాకబు చేసి, ఊరి వాళ్ళతో తనకి కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి, భూవి గుండ్రంగానే ఉందని నమ్ముతున్నానని చెప్పేస్తాడు.

అప్పుడు కూడా పాత్రుడు తొణకడు, బెణకడు. తన అభిప్రాయం ఏమాత్రం మార్చుకోడు. ఆవేల్టి సాయంత్రానికే అనూహ్యంగా పాత్రుడికి మద్దతు పలుకుతాడు ఫకీర్రాజు. అతని వెంటే అలమండ రాజులు, కొందరు ఇతర కులాల వాళ్ళు. ఒక్క వెలమలు మాత్రం భూమి గుండ్రంగా ఉందంటారు. సమితి ప్రెసిడెంట్ లగుడు ముత్తేలు నాయుడు వాళ్లకి నాయకత్వం. నాయుడితో పనులున్న వాళ్ళు అతని పంచన చేరతారు.

ముత్తేల నాయుడంటే పడని మరో వెలమ నాయకుడు రొంగలి బుజ్జి మాత్రం రాజులకి మద్దతు ఇస్తాడు. ఎప్పటికైనా సమితి ప్రెసిడెంట్ కావాలని బుజ్జి ఆశ. భూమాత ఆకారం విషయమై అలమండ రాజకీయాలు పూట పూటకీ మారిపోతూ ఉంటాయి. రాజులు-వెలమల గ్రూపుల్లో ఇతర కులాల వాళ్ళు అటూ ఇటూ మారుతూ ఉంటారు. చేతి వృత్తుల వాళ్ళెవరూ భూవి గుండ్రంగా ఉందని వాదించే వాళ్లకి పనులు చేయరాదని పెద రాజులు ఆర్డరేస్తారు.

భూవి గుండ్రంగా ఉందన్న వాళ్ళ గడ్డాలు మాసిపోతాయి, ఇళ్ళలో మాసిన బట్టలు మోపులు కడతాయి. అయినా వాళ్ళెవరూ తమ అభిప్రాయాలు మార్చుకోరు. చివరికి ఊరి బయట రావి చెట్టుకింద రెండు గ్రూపులూ యుద్ధం చేసుకుని ఎవరి అభిప్రాయం గొప్పదో తేల్చేసుకోవాలని నిర్ణయానికి వస్తాయి. యుద్ధం సగంలో ఉండగానే జామి పోలీసులు వచ్చి రెండు గ్రూపులనీ అరెస్టు చేయడం, మేస్ట్రేటు గంగాధరం గారు గోపాత్రుడిని మెచ్చుకోవడం తర్వాతి కథ.

కే.ఎన్.వై. పతంజలి రచనల్లో 'గోపాత్రుడు' ఒక గొప్ప రచన. ఎందుచేత గొప్పదో నవల చదివి తెలుసుకోవాల్సిందే. గోపాత్రుడు, అతన్ని సమర్ధించే, వ్యతిరేకించే జనం మనకి అన్ని చోట్లా కనిపిస్తారు. పతంజలి మనకి దూరమై నేటికి ఏడాది పూర్తయ్యింది.

శనివారం, మార్చి 06, 2010

పాటల తోట

జనసామాన్యంలో పాటలు పాడలేని వాళ్ళు ఉండొచ్చేమో కానీ, ఇష్టపడని వాళ్ళు ఉండరు. నేనూ సదరు జన సామాన్యంలో భాగమే కాబట్టి పాటలని నేనూ ఇష్టంగా వింటూ ఉంటాను. వినసొంపుగా ఉండే పాట ఏదైనా నాకు నచ్చుతుంది. చాలా మందిలాగే నేను కూడా మొదట విన్నది అమ్మ పాడిన జోల పాటే.

"మరీ విడ్డూరం కాక పోతే నెలల వయసులో విన్నవి కూడా ఎలా గుర్తున్నాయో" అని ఎవరూ అనక ముందే అసలు విషయం చెప్పేస్తున్నా.. నాకు ఏడెనిమిదేళ్ళ వయసు వచ్చే వరకూ అమ్మ పాట విన్నాకే నిద్రపోయేవాడిని. ముఖ్యంగా "వసుదేవ పుత్రుడమ్మా.." పాట.

రేడియో, గ్రామఫోన్, ఇంకా పండగలకీ, పెళ్లిళ్ళకీ ఊళ్లోకి వచ్చే మైకు.. వీటిలో నాకు పాట మీద ఇష్టం పెంచింది ఏదీ అంటే ఇదమిద్దంగా చెప్పలేను. రేడియోలో పాట వస్తుంటే ఇంట్లో ఏ మూల ఉన్నా రేడియో గదికి పరిగెత్తే వాడిని. గ్రామఫోన్ లో పాటలు వచ్చేటప్పుడు నేను హెచ్.ఎం.వీ వారి లోగోలో కుక్క పిల్లలా తల ముందుకు వంచి రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండడాన్ని అమ్మ చాలాసార్లు గుర్తుచేసింది.


ఎక్కడ మైకు పెట్టినా రహస్యంగా వెళ్లి నాకు కావాల్సిన పాటల జాబితా చెప్పి వచ్చేవాడిని, మైకుసెట్టు కుర్రాడికి. ఆ పాటలు వేసినప్పుడు శ్రద్ధగా వినడం, అమ్మ నాకు పెట్టిన అప్పచ్చులు పొట్లం కట్టి పట్టుకెళ్ళి ఆ కుర్రాడికి పెట్టడం.. కొన్నాళ్ళ పాటు అదో ఆనందం. అక్షరాలు రాయడం వచ్చాక చాలా రోజులు రేడియోలో వచ్చే పాటలు రాయడానికి ప్రయత్నించే వాడిని. రాయగలిగినంత రాయడం, మిగిలింది ఆ పాట మళ్ళీ వచ్చినప్పుడు విని రాయడం.

మరికొంచం పెద్దయ్యాక అయితే నాకు నచ్చిన పదాలతో ఖాళీలు పూరించడం. మా ఊళ్ళో సంగీతం మేష్టారు లేక పోవడం వల్ల నేను సంగీతం నేర్చుకోలేక పోయాను. అయితేనేం.. పదే పదే పాటలు విన్నవాడు గాయకుడైపోవడం మామూలు విషయమే కదా.. అలా నేను కూడా పాడడం మొదలు పెట్టాను. హైస్కూల్లో పాటల పోటీలో మొదటి బహుమతి సంపాదించాను.

అలా అని నేనేదో గొప్ప గాయకుణ్ణి అనుకుంటే పొరపాటు. ఓ అమ్మాయి దగ్గర అడిగి తీసుకున్న పాటల పుస్తకం చూస్తూ, నేను పల్లవి పాడి, చరణం అందుకోగానే "కూర్చో అమ్మా.." అన్నారు మేష్టారు అనునయంగా. మరి బహుమతి ఎలా వచ్చిందంటే, బాలుర విభాగం నుంచి పోటీలో పాల్గొన్న వాడిని నేనొక్కడినే మరి.


నాకు మొదటి బహుమతి వచ్చిందంటే అమ్మతో సహా ఎవరూ నమ్మలేదు, సర్టిఫికేట్ చూపించేంత వరకూ. అదీ పాడడంలో మన టాలెంటు. నేను పాడడం కన్నా పాడకపోవడమే అందరికీ క్షేమమన్న విషయం అర్ధమైన మరుక్షణం నేను జనంలో పాడడం మానేశాను. అంత మాత్రాన పాట మీద నాకున్న ఇష్టం తగ్గలేదు.. నిజం చెప్పాలంటే పెరిగింది.

టేప్ రికార్డర్లో నేను పాటలు వినడం మొదలు పెడితే "కేసెట్లు రిబ్బన్లయ్యే వరకూ వింటూనే ఉంటావా?" అని కోప్పడేది అమ్మ. పాటలు నాకు ఇష్టమే అయినా సినిమా జరుగుతుంటే ఉన్నట్టుండి పాటలు ఎందుకు వస్తాయో అర్ధమయ్యేది కాదు చిన్నప్పుడు. చూస్తుండగానే నాయికా నాయకులు డ్రెస్ లు ఎప్పుడు మార్చేసుకున్నారో అని మరో సందేహం.

చాలా సినిమాల్లో ఉమ్మడి కుటుంబం అంతా కలిసి పాట పాడుకోవడం, ఆ తర్వాత ఏదో ఒకటి జరిగి చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోవడం, చివర్లో మళ్ళీ ఆ పాట పాడుకుని కలవడం.. రెండు మూడు సినిమాలు చూశాక ఇంట్లో మేమందరం కలిసి పాట పాడుకుంటే బాగుండు అనిపించేది. ('ఇల్లేరమ్మ కతలు' లో ఇల్లేరమ్మ కూడా ఇలాగే అనుకోడం చదివే వరకూ, ఇలాంటి ఆలోచనలు నాకు మాత్రమే వస్తాయేమో అని సందేహ పడ్డాను..)


మానసిక ఒత్తిడి అంటే ఏమిటో తెలిశాక, పాట గొప్పదనం మరింత బాగా అర్ధమయ్యింది నాకు. ఇయర్ ఫోన్స్ పరిచయం కావడం ఓ గొప్ప మలుపు. చక్కగా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మనకి కావాల్సిన పాటలు, కావల్సినంతసేపు వినొచ్చు. ఒక్కోసారి సమూహంలో బలవంతంగా ఉండాల్సి వచ్చినా, ఇయర్ ఫోన్స్ తగిలించేసుకుంటే మన ప్రపంచంలో మనం ఉండొచ్చు. అయితే ఈ ఇయర్ ఫోన్స్ ఒక వరం అనిపిస్తుంది. మన టేస్టు ఫలానా అని అందరికీ చెప్పుకోనవసరం లేదు కూడా.

కొన్ని కొన్ని పాటలతో పాటు కొన్ని జ్ఞాపకాలూ ముడిపడి పోయాయని ఈమధ్యనే తెలిసింది. ఇప్పుడు కొన్ని పాటలు వింటుంటే మొదటి సారి ఆ పాట విన్న సందర్భమో, నాకు పాడి వినిపించిన వాళ్ళో, లేక ఆ పాట గురించి చెప్పుకున్న కబుర్లో గుర్తొస్తున్నాయి. ఒక్కసారి ఆ జ్ఞాపకాలలోకి వెళ్తే ఎన్నెన్నో భావోద్వేగాలు.

ఇంటర్నెట్ లో పాటలు వెతుక్కుంటూ, కావాల్సిన పాటల కోసం జాల మిత్రులని అడిగినప్పుడు చాలా ఆదరంగా పంపుతున్నారు. అలా ఏనాడో విన్న పాటలని మళ్ళీ ఇప్పుడు వినగలుగుతున్నాను. వాటితో పాటే వాటి చుట్టూ అల్లుకుపోయిన జ్ఞాపకాల పరిమళాలని ఆఘ్రాణించ గలుగుతున్నాను. పాట నా ప్రపంచం కాకపోవచ్చు, కానీ నా ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం.

గురువారం, మార్చి 04, 2010

అత్తగారి కథలు

తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు పుట్టడంతోనే అమృతం తాగేశాయి. అందుచేత అవి ఎప్పటికీ చిరంజీవులే. ఉదాహరణకి అలాంటి కొన్ని పాత్రలు: గురజాడ అప్పారావు గారు సృష్టించిన మధురవాణి, బాపు-రమణ ల బుడుగు, కే.ఎన్.వై. పతంజలి వీరబొబ్బిలి ఇంకా భానుమతీ రామకృష్ణ 'అత్తగారు.' తరాల అంతరాలతో సంబంధం లేకుండా మెజారిటీ తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు అందుకున్న పాత్రలివి.

సినిమాల్లో అత్తగారు అనగానే సూర్యకాంతం గుర్తొచ్చినట్టు, సాహిత్యంలో అత్తగారు అనగానే మొదట గుర్తొచ్చేది భానుమతి అత్తగారే. బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం.. ఈ లక్షణాలన్నీ కలబోసిన మూర్తే 'అత్తగారు.'

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ యధాలాపంగా సృష్టించిన 'అత్తగారి' పాత్రకి ఎంతటి పాఠకాదరణ లభించిందంటే, తర్వాతి కాలంలో ఆవిడ రాసిన కథలన్నింటిలోనూ ప్రధాన పాత్ర అత్తగారే. "నేను సృష్టించిన అత్తగారి పాత్ర ఎవరో కాదు మా ఇంట్లో మా అత్తగారే అనుకుంటారు చాలామంది.. కానీ అత్తగారి పాత్ర కోసం మా అత్తగారిలోని కొన్ని లక్షణాలు మాత్రమే తీసుకున్నాను నేను," అని భానుమతే ఒక సందర్భంలో చెప్పారు. అత్తగారి చుట్టూ తిరిగే కథలన్నింటి సంకలనమే 'అత్తగారి కథలు.'


ఆవకాయ పెట్టడంలో ఓనమాలు తెలియక పోయినా నిమ్మకాయ పచ్చడి చేసినట్టే ఐదువేల మామిడి కాయలతో ఆవకాయ పెట్టేయాలనే అత్తగారి ప్రయత్నమే సంకలనం లో మొదటి కథ 'అత్తగారూ-ఆవకాయ.' అత్తగారి స్వరూప స్వభావాలని ఈ కథలోనే పటం కట్టేశారు భానుమతి. మన ఊహకి అందని లక్షణాలని కూడా స్పష్టంగా చూపించడం కోసం పక్కనే బాపూ బొమ్మ ఉండనే ఉంది. రైతు మీద అజమాయిషీ చేసి మామిడి కాయలు తెప్పించిన అత్తగారు, వాటిని ఏం చేశారన్నదే ఈ కథ.

పశు పోషణలో అత్తగారు కొంచం వీక్. కానీ ఆవిషయం ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ పోషణలో ఓ గేదె తనువు చాలించగా, ఓ ఆవుని పెంచుకోవాలని సంకల్పిస్తుంది. ఆ సంకల్పం నెరవేర్చుకోడానికి ఆవిడ చేసే ప్రయత్నాలు 'అత్తగారూ-ఆవు నం: 23' కథలో చదవాల్సిందే. 'అత్తా తోటికోడలీయం' 'అత్తగారూ-అరటికాయ పొడి' 'అత్తగారూ-జపాన్ యాత్ర' కథలు చదువుతున్నంత సేపూ నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా జపాన్ వెళ్లాలని కలగనే అత్తగారి బొమ్మని చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు.


తనకి లంకె బిందెలు దొరుకుతాయని అత్తగారి జాతకంలో ఉంది. కానీ ఎప్పుడు దొరుకుతాయో స్పష్టంగా లేదు. ఎప్పటికైనా దొరుకుతాయని ఆవిడకి ఆశ. ఇంతలో ఊరి చివర తోటలో ఇల్లు కొనుక్కోవడం, ఆ ఇల్లు అచ్చం అత్తగారి జాతకం లో లంకె బిందెలు దొరికే ఇల్లులాగే ఉండడం తో ఆవిడ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది, కోడలితో కలిసి. లంకె బిందెల విషయం ఎవరికీ తెలియకూడదు కదా, అందుకని అర్ధ రాత్రి లేచి పెరట్లో తవ్వకాలు. ఓ రాత్రి నేలలో గునపం వేయగానే 'ఖంగ్' మని చప్పుడు వస్తుంది. ఇంతకీ లంకె బిందెలు దొరికాయా?

ఆచారాల్ని సర్దుబాటు చేయడం, పెళ్లి సంబంధాలు కుదర్చడం మొదలు పని వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచడం, కొడుక్కీ, మనవడికీ వాళ్లకి నచ్చేవి తనకి చేతకాక పోయినా చేసి పెట్టాలనుకోడం వరకూ అత్తగారిలో ఉన్న ఎన్నో లక్షణాలని మనకి హాస్య స్పోరకంగా వర్ణించారు భానుమతి. సాహిత్య అకాడెమీ బహుమతి గెలుచుకున్న ఈ సంకలనం లోని మొత్తం కథలు చదివాక, ఈ అత్తగారు ఒక కల్పిత పాత్ర అంటే వెంటనే నమ్మబుద్ధి కాదు మనకి. సంకలనానికి బయట ఉండిపోయిన మరికొన్ని కథలనీ ఇందులో చేరిస్తే బాగుండు. (అత్తగారి కథలు, పేజీలు:300 వెల: రూ. 130, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.) కొన్ని కథల్ని ఇక్కడ చదవొచ్చు.

మంగళవారం, మార్చి 02, 2010

చిత్ చోర్

మూడున్నర దశాబ్దాల క్రితం.. రాజశ్రీ సంస్థ నుంచి సినిమా అంటే ఆడంబరంగా జరిగే గొప్పింటి పెళ్ళిళ్ళు, నడిచే నగల దుకాణాల్లా కనిపించే స్త్రీ పాత్రలు, అరగంటకో, ముప్పావు గంటకో ఒకసారి 'బిజినెస్ టూర్' అంటూ కాసేపు అదృశ్యమై మిగిలిన సమయం అంతా ఇంట్లోనే తింటూ, తాగుతూ, ఆట పాటలతో గడిపే పురుష పాత్రలూ, అంత గొప్పవాళ్ళతోనూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే పనివాళ్ళూ ఉండే కథతో వచ్చే సినిమా.. అన్న ముద్ర పడ్డానికి చాలా ముందు.. ఆ సంస్థ నుంచి వచ్చిన ఒకానొక సున్నితమైన ప్రేమకథ 'చిత్ చోర్, ' ఇదో మధ్యతరగతి మందహాసం.

'మానస చోరుడి'గా (చిత్ చోర్) ప్రధాన పాత్ర పోషించిన వాడు అమోల్ పాలేకర్. డెబ్భైల నాటి సగటు మధ్యతరగతి యువకుడికి అచ్చమైన ప్రతిరూపం. నిజానికీ ఇదీ పెళ్లి కథే.. కానీ ఒక భిన్నమైన కథ. మధుపూర్ అనే ఒక పల్లెటూళ్ళో స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న పీతాంబర్ చౌధురి (ఏ.కే. హంగల్) మూడో కూతురు గీత (జరీనా వహెబ్ - 'గాజుల కిష్టయ్య' లో మన సూపర్ స్టార్ కృష్ణ తో నటించిన అమ్మాయి) పెళ్లి కథ. ఆమెకో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలన్నది చౌధురి కుటుంబ సభ్యులందరి ఆశ.

ఎస్సెల్సీ చదువుతూ, అర్ధిమేటిక్ పేపర్ పాసవ్వగలనా లేదా అని భయపడే గీతకి పసితనం పోదు. ఏడెనిమిదేళ్ళ బుడతడు దీపక్ కుమార్ అగ్నిహోత్రి అలియాస్ దీపు (మాస్టర్ రాజు శ్రేష్ఠ) తో ఆమెకి స్నేహం. ఇద్దరూ కలిసి రోజంతా ఆడే ఆటలు పతంగులు ఎగరేయడం, నీళ్ళలో పడవలు వదలడం, చెట్టునున్న కాయలని రాళ్ళతో గురి చూసి కొట్టడం.. "నువ్వు పెద్దదానివి అవుతున్నావు గీతా" అని తల్లి (దీనా పాఠక్) చేసే హెచ్చరికలని ఏమాత్రం పట్టించుకోదు గీత. ఆమె ఆటపాటలు ఆమెవి.

ఒకరోజు చౌధురి కి బొంబాయి లో ఉంటున్న పెద్ద కూతురు మీరా నుంచి ఒక ఉత్తరం వస్తుంది. తనకి తెలిసిన ఇంజినీర్ మధుపూర్ లో బ్రిడ్జి కట్టడానికి వస్తున్నాడనీ, అతనికి గీత గురించి చెప్పాననీ, అతను ఇష్టపడితే అది తమ కుటుంబానికి పెద్ద అదృష్టమనీ రాస్తుంది మీరా. గీతని అతనితో మాట్లాడనివ్వమని తల్లికి చెప్పమనీ, మరీ పాత పద్ధతుల్లో వుండొద్దనీ సూచిస్తుంది. కూతురు రాసిన ప్రకారం రాబోయే ఇంజనీర్ కోసం ఒక పెద్ద ఇల్లు చూసి ఉంచి, అతన్ని రిసీవ్ చేసుకోడానికి స్టేషన్ కి వెళ్తాడు చౌధురి.

బొంబాయి నుంచి వచ్చిన వినోద్ (అమోల్ పాలేకర్) చౌదురిని కలుసుకుని, అతని ఇంటికి వచ్చి ఆతిధ్యం అందుకుంటాడు. గీత పరిచయం అవుతుంది. మొదట్లో అతన్ని అంతగా ఇష్టపడని గీత, క్రమక్రమంగా అతని మీద ఇష్టం పెంచుకుంటుంది. అతని దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటుంది. వినోద్-దీపు మంచి స్నేహితులవుతారు. వినోద్ గీతని ఇష్ట పడడాన్ని సంతోషంగా గమనిస్తారు చౌధురి దంపతులు. పెళ్ళికి ముహూర్తం పెట్టించాలని అనుకుంటుండగా మీరా నుంచి మరో ఉత్తరం వస్తుంది. తను చెప్పిన ఇంజనీర్ ప్రయాణం అప్పుడు వాయిదా పడిందనీ, ఇప్పుడు రాబోతున్నాడనీ..




మరి వినోద్ ఎవరు? సదరు ఇంజనీర్ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి. ఇంజనీర్ సునీల్ కిషన్ (విజయేంద్ర ఘట్గే) ని తన ఇంటికి తీసుకు వస్తాడు చౌధురి. అది తన ఇల్లే అన్నట్టు హడావిడి చేస్తాడు వినోద్. అతను తీసుకునే అతి చనువు చౌధురి దంపతులకి నచ్చదు. పైకి ఏమీ అనలేరు. గీత కి మాత్రం చెప్పేస్తారు. వినోద్ ని మర్చిపోమ్మనీ, సునీల్ కిషన్ ఆమెని ఇష్టపడితే అతనికిచ్చి పెళ్లి చేస్తామనీ. గీత-వినోద్ లు కలుసుకోకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. మరో పక్క సునీల్ గీత గురించి వినోద్ అభిప్రాయం అడుగుతాడు. గీత-కిషన్ ల పెళ్లి చేయాలని అనుకుంటున్నారనీ, మొదట తనని సునీల్ గా పొరబడ్డారనీ అర్ధం అవుతుంది వినోద్ కి. గీత తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ముగింపు.

బసు చటర్జీ స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఈ కథ మన ఎదురింట్లోనో, పొరుగింట్లోనో జరుగుతోందా? అనిపిస్తుంది. పాత్రలని మలచిన తీరు మరీ ప్రత్యేకమైనది. ఎక్కడా నాటకీయత అన్నది కనిపించదు. అమోల్, జరీనా పోటీ పడి నటించారు. మిగిలిన పాత్రల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చౌధురి భార్య గా నటించిన దీనా పాఠక్, ఆవిడని చూస్తున్నంత సేపూ సినిమాలో పాత్ర అని అస్సలు అనుకోలేం. అంత సహజంగా చేసింది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ అంటూ లేని ఈ సినిమా ఆసాంతమూ నవ్వుల్ని పూయిస్తుంది. సున్నితమైన భావోద్వేగాలు ప్రతి సన్నివేశం లోనూ కనిపిస్తాయి.

సంగీతాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ఇది. గీత రచన, సంగీత దర్శకత్వం బాధ్యతలని రవీంద్ర జైన్ విజవంతంగా పూర్తి చేశారు. పాటలన్నీ దక్షిణాది గాయకుడు జేసుదాస్ పాడారు, హేమలత తో కలిసి. ముందుగా చెప్పుకోవాల్సిన పాట గురించి బోల్డన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. ప్రతి పాటా మొదట చెప్పుకోవాల్సిందే అయినప్పటికీ నా చాయిస్ మాత్రం 'గోరి తేరా గావ్ బడా ప్యారా.." అసలు ఈ పాట ప్రారంభంలో వచ్చే హమ్మింగే మనల్ని ఒక మూడ్ లోకి తీసుకెళ్ళి పోతుంది. తన ఇంటికి బొకే తో వచ్చిన గీత, దీపులని కూర్చోపెట్టి మధుపూర్ అందాలని వర్ణిస్తూ వినోద్ పాడే పాట ఇది.

గీత-వినోద్ పాడుకునే పాట 'జబ్ దీబ్ జలే ఆనా..' ఎక్కడికో వెళ్ళిపోతాం ఈ పాట వింటున్నప్పుడు. వినోద్ గీతకి సంగీతం నేర్పించి, సునీల్ ఎదురుగా ఆమెచేత పాడించే/ఆమెతో కలిసి పాడే పాట 'తుజో మేరె సుర్ మే..' ఇది కూడా మనసుని తాకేదే. మొదటి సగం హుషారుగానూ, రెండో సగం బరువుగానూ సాగే పాట 'ఆజ్ సే పెహలే..' గీత, సునీల్, వినోద్, దీపు కలిసి పిక్నిక్ కి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ వినోద్ పాడే గీతం. తిరుగు ప్రయాణంలో, సునీల్-గీత ల పెళ్లి గురించి తెలిసినప్పుడు వినోద్ పాడే చరణాన్ని జేసుదాస్ పాడిన తీరు, అమోల్ అభినయించిన తీరూ పోటీ పడ్డాయి. గీతకి మాత్రమే కాదు, ప్రేక్షకులకీ 'చిత్ చోర్' అయిపోతాడు వినోద్.

ఈ కథ మీద రాజశ్రీ సంస్థ కి ఎంత ప్రేమ అంటే, మధ్య తరగతి నేపధ్యాన్ని గొప్పింటికి మార్చేసి ఇదే కథ ని 'మై ప్రేమ్ కీ దీవానీ హూ' గా తీసి విడుదల చేశారు ఏడేళ్ళ క్రితం. 'చిత్ చోర్' డీవీడీ ని మోజర్ బేర్ సంస్థ విడుదల చేసింది. వెల రూ. 45. తొంభై ఐదు నిమిషాల నిడివి ఉండే ఈ బుల్లి సినిమా మనం 'రీ ఛార్జ్' అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు చూడదగ్గది.