"వచ్చే వారం మన బడికి ఇన్స్పెక్టర్ గారు వస్తారు. మీ ఇళ్ళలో ఉండే బొమ్మలేవన్నా పట్టుకురండి. ఇన్స్పెక్షన్ అయిపోయాక, మళ్ళీ పట్టుకెళ్ళి పోదురుగాని," అని బళ్ళో మేష్టారు చెప్పేశారోరోజు. అందరూ ఇన్స్పెక్టర్ గారు వచ్చే విషయం ఇళ్ళలో చెప్పి, ఎవరేం బొమ్మలు తెస్తారో మర్నాడు తనకి చెప్పాలన్నారు. అందరూ ఒకేలాంటి బొమ్మలు తేకూడదు కదా మరి, అందుకన్న మాట. చందనం బొమ్మలు, రబ్బరు బొమ్మలు, కత్తి బొమ్మా, కారు బొమ్మా.. ఇలా ఎవరింట్లో ఉన్న బొమ్మల గురించి వాళ్ళం చెప్పుకుంటూ ఇళ్ళు చేరుకున్నాం.
నేను ఏ బొమ్మ పట్టుకెడితే బాగుంటుందా అని దారిపొడుగునా ఆలోచించాను కానీ, ఇంట్లో ఉన్న ఏ బొమ్మా నాకే నచ్చలేదు. అదీకాక, మంచి బొమ్మ బళ్ళో ఇచ్చేస్తే అది మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో అని అనుమానం ఒకటి. సరే, ఇంటికి వెళ్ళగానే పాలైనా తాక్కుండానే మేష్టారు చెప్పిన సంగతి అమ్మ చెవిన వేశాను. అచ్చం అమ్మకి కూడా నాకొచ్చిన అనుమానమే వచ్చింది, ఇంట్లో బొమ్మలు పట్టుకెడితే మళ్ళీ తిరిగి వస్తాయో, రావో, ఒక వేళ వచ్చినా ఏమీ పాడవ్వకుండా ఉంటాయో లేదో అని. అటు చూస్తే, ఉత్తి చేతులతో వెళ్తే మేష్టారు ఊరుకోరు కదా.
"ఇంట్లో ఉన్న బొమ్మ ఎందుకూ.. మనం రేడియో బొమ్మ చేద్దాం. అదైతే మళ్ళీ ఇంటికి తేవక్కర్లేదు. బళ్లోనే ఉంచెయ్యొచ్చు," అంది అమ్మ. రేడియో బొమ్మ ఎలా చేయాలో, అది ఎలా వస్తుందో బోల్డన్ని సందేహాలు నాకు. కానైతే, నా ఆట బొమ్మల్లో ఏదీ కూడా మేష్టారికి ఇవ్వక్కర్లేక పోవడం బాగా నచ్చింది. మర్నాడు బళ్ళో పిల్లలందరూ ఎవరెవరు ఏయే బొమ్మలు తెస్తారో చెబుతుంటే, నేను లేచి "మా అమ్మగారు రేడియో బొమ్మ చేసి ఇస్తానన్నారండీ.. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోయాక కూడా బళ్లోనే ఉంచెయ్యొచ్చు అన్నారు," అని చెప్పేశాను, చేతులు కట్టుకుని.
మేష్టారు ఏమీ అనలేదు కానీ, అవుట్ బెల్లులో నా ఫ్రెండ్సులందరూ చుట్టూ చేరి ఒకటే అడగడం, రేడియో బొమ్మ ఎలా చేస్తారని. నాకు మాత్రం తెలిస్తే కదా. కొందరేమో వాళ్లకి తోచినట్టు ఊహించేసుకున్నారు. మట్టితో బొంగరాలు, కారుబొమ్మా అవీ చేసినట్టే రేడియో కూడా చేసేస్తారని. నేను అవుననీ, కాదనీ చెప్పలేదు. బళ్లోకి తేకముందే, వాళ్ళని ఇంటికి పిలిచి చూపించేస్తానని మాత్రం చెప్పాను. ఆవేళ సాయంత్రం బడినుంచి ఇంటికి వెళ్లేసరికి, రేడియోకి కావాల్సిన సరంజామా సిద్ధంగా పెట్టేసింది అమ్మ. అవి చూసి నేను నోరు తెరిచేశాను.
ఎక్కడినుంచి సంపాదించిందో కానీ ఓ పెద్ద అట్ట పెట్టి, పాత స్కేలు, ఎలకలు కొరికేసిన జల్లెడ, కొన్ని సీసా మూతలు. "వీటితో రేడియో ఎలా చేస్తాం అమ్మా?" అని అడిగాను, గూట్లో ఉన్న పెద్ద రేడియోని చూస్తూ. "చూస్తూ ఉండు, నేను చేసేస్తాను కదా" అంది అమ్మ. అట్ట పెట్టికి రంగు కాగితం అంటించేసిందా.. సీసా మూతలనేమో నాబుల్లా అతికేసింది. స్కేలేమో, స్టేషన్లు చూసుకోడానికన్న మాట. జల్లెడని మిషన్ కత్తెరతో కత్తిరించి, అరిచేయంత గుండ్రటి ముక్క చేసింది. దానిని స్కేలు కింద అతికించి, రంగు పెన్సిళ్ళతో రంగులేసేసరికి మా బొమ్మ రేడియో అచ్చం నిజం రేడియోలా తయారయ్యింది.
ఆ రేడియో మీద నా పేరు కూడా రాసేసింది అమ్మ. మా ఇంటి దగ్గర ఉన్న నా ఫ్రెండ్సులతో పాటుగా, పెద్దవాళ్ళకి కూడా నచ్చేసింది ఆ రేడియో. బళ్ళో మేష్టారు కూడా భలే మెచ్చుకున్నారు. పుస్తకంలో లేకపోయినా, ఆవేళ మాకు 'రేడియోనందలి భాగములు మరియు అది పనిచేయు విధానము' పాఠం చెప్పేశారు. నా బొమ్మ రేడియోని చూపించే అని వేరే చెప్పక్కర్లేదు కదా. పిల్లలెవరికీ అందకుండా పై గోడమీద పెట్టేశారా రేడియోని. బళ్లోకి ఎవరైనా వస్తే మొదట రేడియోనే కనిపించేది. ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు గోడ మీద నుంచి దింపించి మరీ చూశారు. నేను హైస్కూల్లో చేరాక కూడా, ఎప్పుడన్నా మా పాత స్కూలికి వెడితే ఆ రేడియో పలకరించేది నన్ను.
వావ్ చాలా బాగుంది మురళి గారు.. నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో నేను మా ఇంట్లోని ఒక పనిచేయని పాత రేడియో పార్ట్స్ తో నా క్యాసెట్ రికార్డర్ ని టూఇన్ వన్ గా మార్చిన రోజులు గుర్తొచ్చాయి... ఇంజనీరింగ్ అయ్యేంత వరకూ అదే వాడాను నా రూంలో..
రిప్లయితొలగించండిSo Nice! నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే అగ్గి పుల్లలతో, కర్రలతో.. ఇల్లు బొమ్మ చేసి దాంట్లో నాకున్న చిన్న బొమ్మ ని పెట్టింది. పని అమ్మాయి వచ్చి ఎంత బాగుందో.. అని ఆశ్చర్య పడితే..రేపట్నించీ ఈ ఇంటికే రావాలి పని కి. మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాం.. అంటే.. నిజమేనేమో.. అని చాలా ఎగ్జైట్ అయి తర్వాత నిరుత్సాహ పడిన జ్ఞాపకం మళ్లీ గుర్తు తెచ్చారు :)
రిప్లయితొలగించండిచాల మంచి జ్ఞాపకం మురళి గారు! ఎప్పటిలాగే మీ పాత జ్ఞాపకాల పోస్ట్ సూపర్..
రిప్లయితొలగించండి"ఆకాశవాణి...కబుర్లు చెప్తున్నది నెమలికన్ను మురళి. ఇప్పుడు సమయం తొమ్మిది గంటల అయిదు నిమిషాల పద్నాలుగు సెకన్లు, మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి వాణిజ్య కార్యక్రమం".
రిప్లయితొలగించండిసిలబస్సులోలేని పాఠం చెప్పారంటే నిజంగా మేస్టారి సమయస్పూర్తిని మెచ్చుకోవచ్చు.
బావుందండి మీ రేడియో. :-)
@మురళి గారు,
రిప్లయితొలగించండిఅందమయిన బాల్యం ఒక అదృష్టం,ఆ బాల్య స్మృతుల్ని అందంగా చెప్పడం ఇంకొక అదృష్టం,మీరు రెండూ కలిసిన అదృష్టవంతులకే అదృష్టవంతులు. మీ బ్లాగు చదవడం మా అదృష్టం. చక్కటి స్మృతులు మురళీ గారు, మీ సమయాన్ని వెచ్చించి ఈ బ్లాగు రాస్తున్నందుకు కృతఙ్ఞతలు.
ఫోటో.. తీసి పెట్టుకోవాల్సింది...మురళి గారు. అయినా మనసు పొరలలో.. నుండి చిత్రాన్ని బాగా చూపించారు.బాగుంది.
రిప్లయితొలగించండినా పెవరేట్ ప్రకటన ఏమంటే.. విన్నానులే ప్రియా..! కనుగొన్నానులే ప్రియా..!! దేశ విదేశాలలో..ప్రియ.. మీకెంతో..ఇష్టమైన "ప్రియ" పచ్చళ్ళు..మీరు కోరిన రుచులలో..(రేడియో లో) మురళి గారి నెమలి కన్ను బ్లాగ్లో.. నేమో..సుమన్ బాబు.. విద్వత్ విద్యుత్ వేగంతో .. .
బావుందండి మీ రేడియో జ్ఞాపకం. మీ చిన్ననాటి సంగతులన్నింటినీ ఒక పుస్తకంగా రిలీజ్ చేస్తే ఇంకా బావుంటుందేమో!..
రిప్లయితొలగించండిఇంద్రసేనా గంగసాని గారి వ్యాఖ్యే నాదీను. అందమయిన బాల్యం ఒక అదృష్టం, వాటిని పదిలంగా దాచుకోగలగడం మరో అదృష్టం. ఇప్పటికే చాలామంది చెప్పిన విషయమే - మీ జ్ఞాపకాల టపాలన్నీ పుస్తకంగా తెస్తే బాగుంటుందండి.
రిప్లయితొలగించండిచాలా అందమైన జ్ఞాపకాలు మీవి. మా వాడికి నేను చేసిచ్చిన ఎన్నో మోడల్స్ గుర్తుకొస్తున్నాయి. ఆ స్కూల్ వాళ్ళు ఒక్కటి కూడా తిరిగియ్యలేదు. మీ జ్ఞాపకాల పొదరిల్లు ప్రింట్ అయినప్పుడు మాత్రం తప్పకుండా చెప్పాలి.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: నిజ్జంగా గ్రేట్ అండీ.. బొమ్మ కాదు, ఏకంగా పనికొచ్చే వస్తువు. అది కూడా ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే!! మీ బ్లాగ్ పునః ప్రారంభించ గానే వివరంగా ఓ టపా రాస్తారు కదూ.. ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ: అప్పటి మీ ఎక్సైట్మెంట్ తలచుకుంటే నవ్వొస్తోందండీ.. మీ పిల్లలకి చెబితే వాళ్లేమంటారో, ముఖ్యంగా మీ చిన్నమ్మాయ్ :)) :)) ..ధన్యవాదాలు.
@Tollywood Spice: ధన్యవాదాలండీ..
@శ్రీ: మా మేష్టార్లేవరూ పుస్తకాలు చూసి పాఠాలు చెప్పలేదండీ. ఆశువుగా చెప్పేసేవాళ్ళు. మేము సాధారణంగా టెక్స్ట్ బుక్స్ చదివే వాళ్ళం కాదు.. ఎప్పుడన్నా సరదాగా చూసేటప్పుడు "అరె.. మేష్టారు అచ్చం ఇలాగే చెప్పారే" అనుకునే వాళ్ళం! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఇంద్రసేనా గంగసాని: ఏం చెప్పాలో అర్ధం కావడం లేదండీ.. ధన్యవాదాలు.
@వనజ వనమాలి: ఫోటోలా? భలే వాళ్లండీ.. ఇప్పట్లా అందరి దగ్గరా సెల్ ఫోన్లూ, కెమేరాలూ ఉన్న రోజులు కావు కదా.. మీరన్నట్టుగా మనసులో దాచుకున్న ఫోటోనే బాగుంటుంది .. మీ ప్రకటన బ్రహ్మాండం అండీ :)) ..ధన్యవాదాలు.
@మురారి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@శిశిర: ఇంకా రాయల్సినవి చాలా ఉన్నాయండీ! ..ధన్యవాదాలు.
@జయ: అయ్యయ్యో.. అలాంటిదే జరిగితే మీ అందరికీ చెప్పకుండా ఉంటానా చెప్పండి? ..ధన్యవాదాలు.
beautiful
రిప్లయితొలగించండిమా మేష్టార్లేవరూ పుస్తకాలు చూసి పాఠాలు చెప్పలేదండీ. ఆశువుగా చెప్పేసేవాళ్ళు.
రిప్లయితొలగించండి----------
మళ్ళా ఆ రోజులు వస్తే బాగుండు. పాఠాలు వంటపడుతాయి.
@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రావు ఎస్. లక్కరాజు: నిజం కదండీ.. శాఖా చంక్రమణం జరిగి అలాంటి రోజులు మళ్ళీ వస్తాయని నాకు ఏమూలో ఆశ, నమ్మకమూ.. ధన్యవాదాలండీ..
chala bavundi Muraligaru.. maa teachers kooda textbook open cheeiyyakundane lessons cheppevaru..thanks for posting all those wonderful memories.
రిప్లయితొలగించండి@Godavari: Thank you very much..
రిప్లయితొలగించండి