శనివారం, మే 18, 2013

శుభరేకొచ్చింది...

"అయ్ గారు సుభరేకంపారండి..." డొక్కు సైకిల్ని డొంకవార జారేసి, చెప్పులు అక్కడే విప్పేసి, లోపలికొచ్చి శుభలేఖ నా చేతికిచ్చిన అతన్ని ఆగమని చేత్తోనే సైగచేసి లోపలికి పరిగెత్తా. డబ్బాలో ఉన్న చిల్లర డబ్బుల్లోనుంచి ఓ నాణెం పట్టుకొచ్చి అతని చేతిలో వేశాను, ఎటూ అమ్మకి చెప్పినా డబ్బులిమ్మనే చెబుతుంది కదా అని.."సిత్తం" అనేసి వెళ్ళిపోయాడు. ఘుమఘుమ లాడిపోతున్న శుభలేఖ చదువుదామని తీసేలోగా అమ్మ వచ్చేసింది, "ఎవరిదీ శుభలేఖా?" అంటూ. వివరం చెప్పాను. "డబ్బులిచ్చి పంపావా?" అని అడిగి, "గొప్ప వాళ్ళింట్లో పెళ్ళికి పిలుపొచ్చిందన్న మాట!" అనడం ఆలస్యం, "నేనూ వెళ్తానమ్మా" అని ప్రయాణం అయిపోయాను. "ఊ..ఊ... మొదలైంది చీమకి పెళ్లి ప్రయాణం," అంటూనే "పైకి చదవరా శుభలేఖ నేనూ వింటాను.." అని అడిగింది, కళాపి జల్లుతూ.

"యెంత మంచి వాసన వస్తోందో అమ్మా శుభలేఖ.. నాలుగు పక్కలా పసుపు బొట్టుతో పాటు, ప్రత్యేకం సెంటు కూడా రాశారు" అని నేను ఆశ్చర్యాలు పోతున్నానో లేదో... "నీ మొహం... ఆ పసుపులోనే కాస్త సెంటు కూడా కలిపి ఉంటారు.. ప్రత్యేకం రాయడం ఎందుకూ?" అని అడిగింది. అమ్మ చెప్పింది విన్నాక, శుభలేఖని పరీక్షిస్తే నిజమే అని తేలింది.. పోన్లే.. ఓ కొత్త విషయం తెలిసింది.. రేప్పొద్దున్న నా పెళ్ళప్పుడు పనికొస్తుంది కదా అనుకున్నాను మనసులో.. ఆ మాటే పైకంటే క్షణం ఆలస్యం లేకుండా జరిగిపోతుంది పెళ్లి, ఏ చీపురు కట్టతోనో. "అయిందా వాసన చూడ్డం? అక్షరాలు కూడబలుక్కుంటున్నావా?? ఎంతసేపూ చదవడం..." అంది అమ్మ కొంచం ధాటీగా.

పెళ్లి ఆలోచనల్లోనుంచి బయట పడి "కూడబలుక్కోడం ఎందుకమ్మా? నాకు చదవడం వచ్చు కదా.." అంటూనే శుభలేఖ చదవడం మొదలు పెట్టాను... శ్రీరస్తు... శుభమస్తు.. అవిఘ్నమస్తు.. శ్లో.. ఇంతలో ఓ ఆలోచన వచ్చింది.. ఈ శ్లోకానికి అర్ధం చెప్పేసి అమ్మని మెప్పిస్తే?? చూడ్డానికి సులువుగానే ఉంది... అర్ధమవుతోంది కూడాను...ఇదేదో బాగానే ఉందనుకుంటూ శ్లోకం పైకి చదవడం మొదలుపెట్టాను.. "శ్రీరామ పత్నీ... జనకస్య పుత్రీ... అంటే... శ్రీరాముని యొక్క భార్య .. జనకుని యొక్క కుమార్తె... రైటే కదా అమ్మా?" ..."రైటే..రైటే ... మీ బళ్ళో చేప్పేరేవిట్రా?" ..."లేదమ్మా.. నాకే అలా తోచింది... తర్వాత చదువుతా ఉండు.."

"సీతాంగనా... సుందర కోమలాంగీ.... అంటే అందమైన సీత అనే కదా అర్ధం?" ..."అవున్నాయినా అవును... పెళ్లి ఎప్పుడో చెబితే, మీ నాన్నగారికి గుర్తు చేద్దాం అని నిన్ను శుభలేఖ చదవమన్నాను.. కాస్త ఆ ముహూర్తం ఒక్కటీ ముందు చెప్పెయ్ బాబూ..." ..."ఉండమ్మా... వరసగా చదువుతున్నాను కదా..." ఈ అర్ధం చెప్పడం నాకు భలే సరదాగా ఉంది నిజానికి... వేసంకాలం సెలవుల్లో 'గణపతి' పుస్తకం చదివానేమో ..స్కూలు మేష్టారు ఉద్యోగం చేసే రోజుల్లో కథా నాయకుడు గణపతి "శ్రీ రఘురామ.. చారు తులసీ దళధామ" పద్యానికి తాత్పర్యం చెబుతూ "వనవాసంలో శ్రీరాముడు చారు కాచుకొనెను.. కర్వేపాకు దొరక్క పోవడంతో ఆయొక్క చారుని తులసీ దళాలతో కాచుకొనెను" అని చెప్పడం గుర్తొచ్చింది..

మళ్ళీ శుభలేఖలోకి వస్తూ "భూగర్భ జాతా... భువనైక మాతా.... అమ్మా.. భూగర్భ జాత అంటే సీతే కదా... భూమిలో దొరికింది కదా నాగలి దున్నుతూ ఉంటే?" అని నా పురాణ జ్ఞానం ప్రదర్శించేసరికి, అమ్మ బోల్డంత మురిసిపోయి, కళాపి చల్లిన వాకిట్లో పుత్రోత్సాహంతో ముగ్గేయడం మొదలు పెట్టింది.. "భువనైకజాత జాత అంటే ఏమిటో తెలియడం లేదు కానీ, సీతే అయి ఉంటుంది కదా అమ్మా..." అమ్మకి సహనం కొంచం తగ్గినట్టుంది.. "అవతల బోల్డంత పని ఉంది.. తర్వాత ఏమిటో తొరగా చదువు నాయనా..." అంది, మరీ విసుక్కోకుండా, అలాగని మరీ ముద్దుచేసేయకుండా.. తర్వాత లైను తెలిసినట్టే ఉంది కానీ తెలియడం లేదు..

"వధూ వరాభ్యం వరదా భవంతు... అమ్మా... వధూ వరాభ్యం అంటే వధూ వరులు కదా..." నా ఉత్సాహం తగ్గడం అమ్మ కనిపెట్టేసింది... "అవున్నాయనా అవును.. తర్వాత మాటకి కూడా అర్ధం చెప్పేసి, మిగిలిన శుభలేఖ చదువు..." ....ఏవిటి చదవడం?? "వరదా భవంతు అంటే... అమ్మా.. మరీ..." ఏమన్నా మాట సాయం అందుతుందేమో అని చూశా.. అబ్బే.. నాకు అమ్మ కదూ.. "ఊ మరి? చెప్పూ" ... "అంటే.. వధూవరులిద్దరూ వరదల్లో కొట్టుకుపోకుండా ఉందురుగాక అని అయి ఉంటుంది" అన్నాను కొంచం అనుమానంగా... అమ్మ అక్కడ నిలబడలేక, కొబ్బరి చెట్టుకి ఆనుకుని ఒకటే నవ్వడం... "ఇంకా నయం.. వరదల్లో కొట్టుకుపోదురు గాక.. అన్నావు కాదు" అంటూ... పెళ్లి శుభలేఖలో ఈ పద్యం చూసినప్పుడల్లా గుర్తొచ్చే జ్ఞాపకం ఇది..

మంగళవారం, మే 07, 2013

కరెంటు-బిల్లు

ఆంధ్ర ప్రదేశ వాసుల ముందు ప్రస్తుతం ఉన్న సమస్యలు రెండు.. ఒకటి కరెంటు రెండోది బిల్లు.. 'వాన రాకడా ప్రాణం పోకడా' తెలియవన్నది ఇదివరకటి సామెత.. ఇప్పుడు టెక్నాలజీ బోల్డంత అభివృద్ధి చెందేశాక ఆ రెండింటి విషయంలోనూ కొంచం ఇంచుమించుగా ఓ అంచనాకి రాగలుగుతున్నాం.. అయితే, ఇంతింత టెక్నాలజీ ఉండి కూడా బొత్తిగా తెలుసుకోలేక పోతున్న విషయాలు రెండు... కరెంటు రాకడ, బిల్లు 'పోకడ.' అనగా, విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో బొత్తిగా తెలియడం లేదు. కొన్ని చోట్ల రోజులో ఆరుగంటలు పవర్కట్ అయితే, మరికొన్ని చోట్ల అప్పుడో గంటా.. ఇప్పుడో ఘడియా.. చొప్పున మొత్తంగా ఓ ఆరేడు గంటలు కరెంట్ ఇస్తున్నారు..

ఓ పక్క సూర్యుడు భగభగలాడిపోతూ పరీక్షలు పెట్టేస్తూ ఉంటే, కరెంటు అంతకన్నా ఎక్కువగా పరీక్షలు పెట్టేస్తోంది. కరెంటు ఎప్పుడు వస్తుంది? ..ఎప్పుడైనా రావొచ్చు.. ఎప్పుడు పోతుంది? ..ఎప్పుడైనా పోవచ్చు. ఓ బంపర్ ఆఫర్ ఏమిటంటే, కరెంట్ వస్తే మళ్ళీ పోతుందన్న గ్యారంటీ ఉంది కానీ, పోయిన కరెంట్ మళ్ళీ వచ్చే విషయంలో ఏమాత్రం గ్యారంటీ లేదు. ఇది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడిన విషయం. ఇదివరకటి రోజుల్లో కరెంట్ పోయినప్పుడు, కరెంటాఫీసు వాళ్లకి ఓ ఫోన్ చేస్తే, మళ్ళీ పవర్ ఎప్పుడు రిస్టోర్ అవుతుందో టైం చెప్పేవాళ్ళు. మరీ కచ్చితంగా అదే టైం కి కాకపోయినా ఓ అరగంటో, గంటో ఆలస్యంగా అయినా పాపం పవర్ వచ్చేసేది. ఇప్పుడు వాళ్లకి ఫోన్ చేసినా దొరకడం లేదు.. ఒకవేళ దొరికినా "మాకు తెలీదు" అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

పవర్కట్ వల్ల పరిశ్రమలు మూతపడి పోతున్నాయనీ, ఉద్యోగాలు పోతున్నాయనీ పేపర్లలో వస్తోంది... మనం మంచి అనుకున్న దానిలో చెడు ఉన్నట్టే, చెడు అనుకున్న దాంట్లో కూడా ఎక్కడో అక్కడ మంచీ ఉంటుంది కదా.. కరెంటు తను ఉండకుండా ఉండడం ద్వారా మానవ సంబంధాలని మెరుగు పరుస్తోంది. ఇది ఎలా అంటే, ఎప్పుడూ ఇల్లు కదలడానికి ఇష్టపడని మా పక్కింటాయన, పవర్కట్ లో ఉండలేక వాళ్ళబ్బాయి దగ్గరికి బెంగుళూరు వెళ్ళిపోయారు... అక్కడైతే ఇంత ఎండలూ ఉండవు, ఉన్నా పవర్కట్ ఉండదు అంటూ... ఎప్పుడూ ఎన్నిసార్లు పిలిచినా రాని తండ్రి, తనకితానుగా వచ్చేస్తా అనేసరికి వాళ్ళబ్బాయి ఆనందం వర్ణనాతీతం..


చెప్పుకోవాల్సిన మరో విషయం కరెంటు బిల్లుల 'పోకడ.' అసలు ఓ నెలలో వచ్చే బిల్లుకీ, మరోనెల బిల్లుకీ కనీసం మేనమామ పోలిక కూడా ఉండడం లేదు. ఇక, గత వేసవి బిల్లులతో పోలిస్తే 'హస్తిమశకాంతం' అంటారు చూడండి... అంత భేదం ఉంది. అవును మరి.. ఈ ఏడాది లోనూ కరెంట్ చార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి కనుక!! ఇప్పుడైతే దాదాపు నెలకి రెండుసార్లు పెరుగుతూనే ఉన్నాయి, ఏదో అడ్జస్ట్మెంట్ అని పేరు పెట్టి.. పేరు ఏదైనా కట్టాల్సినవి డబ్బులే కదా.. పైగా శ్లాబులూ అవీ కూడా బాగా మారిపోయి చాలా గందరగోళంగా తయారయ్యింది పరిస్థితి. ఓ మిత్రుడికి ఇంటద్దె కన్నా (డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్) కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందిట.. ఆ విషయం ఓనర్ కి తెలిస్తే అద్దె పెంచేస్తారేమో అని భయపడుతున్నాడు ఆ భాగ్యనగరవాసి ప్రస్తుతం..

అసలు కరెంట్ బిల్ రీడింగ్ తీసుకోడాన్ని బట్టి కూడా బిల్లు మారిపోతూ ఉంటుందిట. అంటే, రీడింగ్ తీసుకునే కుర్రాడు బద్ధకించో కుదరకో ఓ రోజో రెండు రోజులో ఆలస్యంగా వస్తే శ్లాబు మారిపోయి చాలా ఎక్కువ బిల్లు కట్టేయాల్సి వస్తుందన్న మాట. ఈ రీడింగ్ కుర్రాళ్ళు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు తప్ప, ముందుగా రారు కదా.. కాబట్టి, వాళ్ళ 'తప్పిదం' వల్ల బిల్లు తగ్గే వీలు లేదన్న మాటే.. అసలైతే ఈ అడ్జస్ట్మెంట్ల వెనుక వేరే కారణం ఉందనీ, 'వ్యవసాయానికి ఉచిత విద్యుత్' తాలూకు బకాయిలు ఈ వంకన లాగేస్తున్నారనీ ఓ రూమరు.. అదే కనుక నిజమైతే, అప్పుడెప్పుడో చేసిన 'మేళ్ళు' ఇప్పుడు తేళ్ళయి కుడుతున్నాయన్న మాటే.. తెరవెనుక సంగతులు ఏమైనా, నెల తిరిగేసరికి బిల్లు రాకా మానదు.. కట్టకా తప్పదు.

నాకైతే ఒకటి అనిపిస్తోంది.. రోజులో అరకొరగా కరెంటు ఉంటేనే ఇంతింత బిల్లులు వస్తున్నాయి కదా..ఒకవేళ రోజంతా కరెంటు కనుక ఇచ్చేస్తే నెలయ్యాక వచ్చే బిల్లు కట్టడానికి ఆయనెవరో పురాణాల్లో మహనీయుడిలాగా ఆలుబిడ్డలని వేలం వేసేయాల్సి వస్తుందేమో అనీ.. (ఆయన వేలానికి పెట్టింది కరెంట్ బిల్లు కట్టడం కోసం కాదని గమనించ ప్రార్ధన).. ఇందుమూలంగా, 'చెడు' లో ఇంకో మంచి కూడా ఉందన్న మాట.. ఇలా వేలాలూ అవీ వేసేయక్కర్లేకుండా, అందరూ కలిసి చీకట్లో హాయిగా ఉండడం కోసమే పవర్కట్ చేస్తున్నారన్న మాట.. (నిన్ననే కరెంట్ బిల్ వచ్చింది.. ఇవాళ కట్టేద్దాం కదా ని కౌంటర్ కి వెళ్తే, 'కరెంట్ వచ్చాక కౌంటర్ తెరవబడును' అన్న బోర్డు పలకరించింది!!)

గురువారం, మే 02, 2013

'నా అంతరంగ కథనం'

బుచ్చిబాబు రచనలని తలచుకోగానే లోతైన మనస్తత్వ చిత్రణ మనసులో మెదులుతుంది.. కథలైనా, నవలైనా కేవలం ఓసారి చదివేసి పక్కన పెట్టడం అన్నది బుచ్చిబాబు రచనల విషయంలో అస్సలు కుదరదు. అదే జాబితాలోకి వచ్చే మరో రచన 'నా అంతరంగ కథనం' పేరిట బుచ్చిబాబు వెలువరించిన ఆత్మకథ. నిజానికి ఇది పూర్తినిడివి ఆత్మకథ కాదు, తనకి ఊహ తెలిసిన నాటి నుంచి యవ్వనారంభ దశ వరకూ తన ఆలోచనా స్రవంతీ, తనకి ఎదురైన అనుభవాలు, తన చుట్టూ ఉన్న వాతావరణం వీటన్నింటినీ వివరంగా పొందుపరిచిన చిరు పుస్తకం ఇది. అయితేనేం, బుచ్చిబాబు అనేక రచనల తాలూకు మూలాలు ఆయన బాల్యంలోనే ఉన్నాయని చెబుతుందీ రచన.

"దానికీ దీనికీ ఏ సంబంధం లేకపోయినా మొదటి ప్రపంచ సంగ్రామం మధ్యలో ఏలూరులో నేను పుట్టినట్టు చెపుతుంది అమ్మమ్మ. ప్రపంచ సంగ్రామానికీ నా జననానికీ ఏ సంబంధమూ లేదని పూర్తిగా ఒప్పుకోలేను. యుద్ధం అంటే భయం నాకు. యుద్ధానికి వెళ్ళిన సైనికుడంటే హడలు. నలుగురు చేరి బిగ్గరగా తగవులాడుతుంటే అక్కడి నుంచి పారిపోతాను నేను. పెద్ద చప్పుడుకి తట్టుకోలేను. మోతగా తలుపులు మూసి గడియేసినా, ట్రంకు పెట్టె మూత దబ్బున మూసినా, తిన్న తర్వాత కప్పులో ప్లేట్లూ చప్పుడు చేస్తూ తీసినా, లారీ వేగంగా వెళ్ళినా, ఎవరైనా పనివాళ్ళని   కూకలేసినా బాధ పడతాను..." అంటూ మొదలయ్యే ఈ ఆత్మకథ ఆసక్తిగా సాగుతూనే, అక్కడక్కడా ఆగి ఆలోచించమంటుంది.

పుట్టింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా, తల్లిదండ్రులు ఇద్దరూ ఆధునిక భావాలు ఉన్నవాళ్ళు కావడం, మరీ ముఖ్యంగా తండ్రికి గారాల కొడుకు కావడం వల్ల అందమైన బాల్యాన్ని గడిపారు బుచ్చిబాబు. అసలుపేరు శివరాజు సుబ్బారావు.. కానీ అందరూ పిలిచిన పేరు 'బుచ్చి.' దీనికి 'బాబు' చేర్చి, మొదటిసారిగా 'బుచ్చిబాబు గారూ' అని పిలిచిన వారు చీరాల లో ఇంటి యజమాని. బుచ్చిబాబు తండ్రికి నీటిపారుదల శాఖలో ఒవర్సీయర్ ఉద్యోగం. పంట కాలువలు, లాకుల నిర్వహణ, ఎవరి పొలానికి ఎంతనీరు వదలాలి లాంటివి నిర్ణయించేది ఆయనే. రైతుల్లో మంచి పలుకుబడి ఉండేది ఆయనకి. అలా బుచ్చిబాబుకి యువరాజ భోగంతో గడిచింది బాల్యం.


తండ్రి ఉద్యోగంలో తరచూ జరిగే బదిలీల కారణంగా చిన్నతనంలో ఎన్నో ఊళ్లు తిరిగారు బుచ్చిబాబు. ఏవూరు వెళ్ళినా ఆయన స్నేహం కాలువలు, పొలంగట్లతోనే. చాలాచోట్ల 'చివరికి మిగిలేది' నాయకుడు దయానిధి, అమృతం సోదరుడు జగన్నాధం కనిపిస్తారు చిన్నప్పటి బుచ్చిబాబులో. అన్నట్టు, తన తల్లిదండ్రుల తమిళ స్నేహితురాలు 'కోమలి' పేరునే తన నవలలో ఒక నాయికకి పెట్టానని చెప్పారు. అంతేకాదు, కోమలి పాత్రమీద తనకి ఉన్న ఇష్టాన్ని గురించి చెబుతూ, ఆమె ప్రకృతికి దగ్గరగా కనిపిస్తుంది అంటారు బుచ్చిబాబు. చిత్రకళ మీద ఆసక్తి చిన్ననాడే మొదలయ్యింది బుచ్చిబాబుకి. కాలువ గట్ల మీద కూర్చుని స్కెచ్ లు గీయడాన్ని చాలాసార్లే గుర్తు చేసుకున్నారు.

అంతర్జాతీయ చిత్రకారుల పనితీరు గురించి నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి బుచ్చిబాబుకి. బాల్యంలో తనని ఆకర్షించిన దృశ్యాలు, తర్వాతి కాలంలో తను చూసిన వర్ణ చిత్రాల్లో ఏ చిత్రకారుడు చిత్రించిన వాటిలా ఉన్నాయో విశదంగా చెప్పారు. అంతేకాదు, ఆంగ్ల సినిమాలంటే కూడా బుచ్చిబాబుకి  ప్రత్యేకమైన ఆసక్తి. చార్లీ చాప్లిన్ అంటే ఆరాధన. చిన్నతనంలో తనది అగ్నిప్రమాదాలు చూసి సంతోషించే మనస్తత్వం అని చెబుతూ, స్కూలు పాకలు తగలబడి పోయిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. చాలామంది పిల్లల్లాగే బుచ్చిబాబుకీ చదువంటే పెద్దగా ఇష్టం లేదు చిన్నప్పుడు. అయితే అందరు తల్లిదండ్రుల్లాగా ఆయన తల్లిదండ్రులు బలవంతంగా చదివించాలి అని ప్రయత్నం చేయలేదు.

బుచ్చిబాబు చిన్నప్పుడు ఆయన తల్లి జబ్బుపడ్డారు. ఇందువల్లే కావొచ్చు, తండ్రి దగ్గర చనువు చాలా ఎక్కువ బుచ్చిబాబుకి. కొంతకాలం పాటు దగ్గర బంధువుల ఇంట ఉండాల్సి వచ్చినప్పుడు, అక్కడి 'స్ట్రిక్టు' వాతావరణం ఎంతైనా ఇబ్బంది పెట్టింది ఆయన్ని. పుస్తకాలు చదవడం, స్నేహితులతో కలిసి సినిమాలు, నాటకాలు చూడడం.. ఇలా చిన్నప్పుడే సాహిత్యం మీదా, కళల మీదా ఆసక్తి ఏర్పడింది బుచ్చిబాబుకి. మొత్తం 112 పేజీలున్న ఈ పుస్తకం కేవలం బుచ్చిబాబు బాల్యం మాత్రమే కాదు. ఆయన ఆలోచనా స్రవంతి. బుచ్చిబాబు రచనలు కొన్నైనా చదివిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం చదవడం బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చదివించే కథనం. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 55, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).