జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఏప్రిల్ 01, 2022

వేపపువ్వు

'ఉగాది పచ్చడి' అనే చక్కని పేరున్నా 'వేపపువ్వు పచ్చడి' అన్న పేరే స్థిరపరిచేశారెందుకో. 'చేదు పచ్చడి' అనడం కూడా కద్దు. చెరుకు ముక్కలు, మామిడి పిందెల ముక్కలు, అరటి పండు, కొబ్బరి, బెల్లం, పచ్చి మిరప, చింతపండు పులుసు, ఉప్పు, ఇంకా ఎవరి అభిరుచిని, అందుబాటునీ బట్టి వాళ్ళు అనేక దినుసులు చేర్చేసినా ఏమీ అనుకోని పండగ ప్రత్యేక వంటకం ఇది. పచ్చడి కదా అని కర్వేపాకు తగిలించి నేతితో ఇంగువ పోపు వేసేవాళ్ళూ ఉన్నారు. ఎన్ని వేసినప్పటికీ మోడర్న్ వంటల్ని కొత్తిమీరతో 'గార్నిష్' చేసినట్టుగా, ఉగాది పచ్చడికి చివర్లో వేపపువ్వు అలా పడాల్సిందే. ఎవరి చేతిలోనన్నా శాస్త్రోక్తంగా పచ్చడి వేయాలంటే, ముందుగా వేపపువ్వు వేసి, తిననిచ్చి, అప్పుడు మిగిలిన మిశ్రమాన్ని వడ్డించాలి. తలంటులో కుంకుడు పులుసు పడి కళ్ళు మండితే మిగిలిన రోజుల్లో ఉప్పుకల్లు అద్దిన చింతపండు తినే సౌలభ్యం ఉండేది కానీ, ఉగాది రోజున మాత్రం మొదటగా తినాల్సింది వేపపువ్వు పచ్చడినే. 

మార్చి మూడోవారం మొదలు ఏప్రిల్ మొదటి వారం లోగా ఎప్పుడైనా వచ్చే పండుగ ఉగాది. వేసవి మొదలైపోతుంది. ఉక్కపోత, చెమట సరేసరి. వేపచెట్లు పూతకొస్తాయి. పండుగ కాస్త ముందుగా వచ్చేస్తే వేపపువ్వుకి బదులుగా మొగ్గలు పడతాయి పచ్చడిలో. కాస్త ఆలస్యం అయి, పిందెలు మొదలైపోయినా పువ్వైతే దొరుకుతుంది. వినాయక చవితి పండక్కి పత్రి కోసుకోడానికి బోల్డన్ని నిబంధనలుండేవి. కొన్ని చెట్లనుంచి కోసీ కోయనట్టు ఒకట్రెండు ఆకులు మాత్రమే తుంపాలి, మరికొన్ని మొక్కలు, చెట్ల జోలికి వెళ్లనే కూడదు ఇలా అన్నమాట. అయితే, వేపపువ్వు విషయంలో ఈ నియమాలేవీ ఉండేవి కాదు. ఎంత పువ్వు కోసుకున్నా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. కానైతే, కొయ్యడానికే మనసొప్పేది కాదు. పువ్వు వృధా పోకూడదని అంతా పచ్చట్లో వేసేస్తే తినాల్సింది మనమే అన్న జ్ఞానం కాస్త తొందరగానే కలిగింది. ఇలాంటి జ్ఞానాన్ని పత్రీ, ఇతరత్రా పువ్వులూ కలిగించలేక పోయాయి. 

Google Image

రాములవారి గుడి గోడని ఆనుకుని పెద్ద వేపచెట్టు ఉండేది. మొదలు గుడి లోపల ఉంటే, కొమ్మలు గోడ మీంచి వాలి ఉండేవి. చెట్టు మొదట్లో కండ చీమలు పుట్టలు పెట్టుకుని ఉండడమూ, ప్రహరీ గోడ నెరజలు తీసి ఉండడంతో పిల్ల మేళానికి చెట్టెక్కే సాహసం ఉండేది కాదు. గోడ బయట రాతి సోఫా మీద నిలబడి, పొడవాటి కర్రతో వేప కొమ్మల్ని వంచుకుంటే పువ్వు కోసుకోవచ్చు. అయినా, ఎంత పువ్వు కావాలి కనుక? చిక్కేవిటంటే, వేపపువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కోయడానికి లేదు. ఉదయమో, సాయంత్రమో మాత్రమే కొయ్యాలి. సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఓ గోధుమవన్నె ముసలి తాచుపాము వ్యాహ్యాళికి తిరిగేది. ఆ పాము ఎవరినీ ఏమీ చేసేది కాదు, ఆ పామునీ ఎవరూ ఏమీ చేసేవారు కాదు. పిల్లలు తెలిసో తెలియకో రాయి విసురుతారని పెద్దవాళ్ళ భయం. అందుకని, ఆ వ్యాహ్యాళి వేళల్లో కూడా అటువైపు వెళ్లడం నిషిద్ధం. అలా వేపపువ్వు కోసం పంచాంగం చూసి ముహూర్తం పెట్టినంత హడావిడి జరుగుతూ ఉండేది. అన్నట్టు, ఆ చెట్టు వేప పుల్లలకి ఎంత డిమాండ్ అంటే, లెక్కేస్తే దాదాపు  ఊళ్ళో సగం దంతధావనాలకి ఆ ఒక్క చెట్టే దోహదం చేసి ఉంటుంది, కొన్ని దశాబ్దాల పాటు.  

గణాచారి చేతిలో వేపమండల్లాంటి, పువ్వులున్న వేపకొమ్మలు ఇంటికి తేవడంతోనే పనైపోయినట్టు కాదు. తెచ్చిన వేపపువ్వు నుంచి మొగ్గల్నీ, పసిరి మొగ్గల్నీ వేరు చేసే పని కూడా పిల్లలదే. పసిరి మొగ్గల్ని ఎప్పుడూ ఉండనిచ్చే వాళ్ళం కాదు కానీ, మొగ్గల్ని ఒక్కోసారి ఉంచేయాల్సి వచ్చేది. ఉగాది ముందే వచ్చేసి, చెట్టు పూర్తిగా పూత అందుకోక పొతే మొగ్గలోనే పూలని చూసుకోవాలి కదా మరి. పూలు కోసేశాక, ఆ మిగిలిన పుల్లల్ని పడేయకూడదు. వేలెడేసి చొప్పున విరిచి, చిన్న పురికొస ముక్క ముడేసి, ఏ గూట్లోనో గుర్తుగా దాస్తే, గబుక్కున వచ్చే చుట్టాలకి పొద్దున్నే పళ్ళు తోముకోడానికి ఇవ్వొచ్చు. ఈ జ్ఞానమూ ఊరికే వచ్చింది కాదు. ఓ పండగెళ్ళిన పాతనాడు వచ్చిన చుట్టానికి పొద్దుపొద్దున్నే వేపపుల్ల సమకూర్చాల్సి వచ్చి, అష్టకష్టాలూ పడినప్పుడు కలిగింది. తాటాకు ముక్కదేం వుంది, పెరట్లో ఉన్న పాక పైకప్పు నుంచి లాక్కోవచ్చు, వేపపుల్ల అలా కాదు కదా? ఇంతకీ, అలా వేరు చేసిన వేపపువ్వుని చిన్న గిన్నె లోకో, ఖాళీ కొబ్బరి చిప్పలోకో తీసి పెట్టేస్తే అప్పటికి పనైపోయినట్టే. 

పండుగనాడు పొద్దున్నే పచ్చడి నోట్లోవేసుకోగానే కలిగే మొదటి కోరిక 'తియ్యగా ఉంటే బాగుండును'. ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, మొదట వేపపువ్వు చప్పరించాకే మిగిలిన పచ్చడి చేతిలో పడుతుంది. శ్రేష్టమైన వేపచెట్టు కొమ్మన పూసిన పువ్వు తియ్యగా ఎలా ఉంటుంది? పైగా, ప్రకృతి ఇష్టారాజ్యంగా కాకుండా ఓ పద్ధతిగా నడిచిన రోజుల్లో? అయితే, ఉగాది మరీ అంత చేదుగా ఏమీ మొదలయ్యేది కాదు. అప్పటికే పచ్చడిలో నాని ఉండడం వల్ల వేపపూలకి కాస్త పులుపు, తీపి అంటి ఉండేవి. పైగా, చేదు తిన్నందుకు గాను, పచ్చట్లో చెరుకు ముక్కని ఎంచి చేతిలో వేసేవాళ్ళు. ఈసారి వేపపూత అంటుకున్న చెరుకు ముక్క. ఏ ఒక్క రుచో దొరకదు. అన్ని రుచులూ కలగలిసే నాలిక్కి తగులుగూ ఉండేవి. నిజానికి అదో ప్రత్యేకమైన రుచి. ఇదీ అని ప్రత్యేకంగా చెప్పలేం. కావాలనుకోలేం, వద్దనీ అనుకోలేం. మళ్ళీ రుచి చూడాలనిపిస్తుందా అంటే, సందేహమే. ఆ రుచి పేరు 'జీవితం' అని అర్ధమవ్వడానికి కొన్నేళ్లు పట్టింది. మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు!!

సోమవారం, జనవరి 27, 2020

మిత్రుడి సమాధి

ఊరి శివార్లలో పంట కాలువ పక్కనే కొబ్బరి తోట. ఆ తోట మధ్యలో ఓ పాక. ఆ పాక పక్కనే రోడ్డు మీదకి కనిపించేలా ఓ సమాధి. ఆ సమాధి నా మిత్రుడిది. మా ఊరికి వెళ్లాలన్నా, ఊరినుంచి రావాలన్నా ఆ సమాధి మీదుగానే ప్రయాణించాలి. అలా ప్రతిసారీ ఊరికి వెళ్లేప్పుడు, వచ్ఛేప్పుడూ కూడా అతన్ని తల్చుకోకుండా ఉండడం కుదరదు. రీల్ కెమెరా నుంచి డిజిటల్ కెమెరా మీదుగా స్మార్ట్ ఫోన్ కెమెరాకి వచ్చినా ఎప్పుడూ ఆ సమాధిని ఫోటో తీయబుద్ధి కాదు. కానీ అతనితోనూ, ఆ సమాధితోనూ నా జ్ఞాపకాలు ఎన్నెన్నో. 

నేను ఆరోతరగతిలో చేరాక, మా ప్రభుత్వోన్నత పాఠశాలలో తగినంతమంది టీచర్లు లేకపోవడం నన్నో పుంభావ సరస్వతిగా చూడాలనుకున్న మా ఇంట్లో వాళ్ళని కొంచం ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో మా ఊళ్ళోనే ఉన్న డిగ్రీ స్టూడెంట్ ఒకతను ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టడంతో నన్నూ అందులో చేర్చారు. ఐదేళ్ల పాటు మేం చదువుకున్న చిన్న బడి (ప్రాధమిక పాఠశాల) ఆవరణలోనే సాయంత్రం వేళల్లో ప్రయివేటు ఉండేది. ఆ బడి పక్కనే పంచాయతీ ఆఫీసు, ఆటస్థలం కూడా ఉండేవి. 

మా ట్యూషన్ మేష్టారిది కొంచం పైలా పచ్చీసు వ్యవహారం. వారంలో కనీసం రెండు మూడు రోజులు ఆయన టైముకి వచ్చేవారు కాదు. ఒక్కోరోజు వచ్చేవారే కాదు. అయినా కూడా మేము క్రమం తప్పకుండా ప్రయివేటుకి హాజరయ్యేవాళ్ళం, ఇళ్ల నుంచి ఆటవిడుపు కోసం. పంచాయితీ ఆఫీసు పక్కనే ఉన్న ఆటస్థలంలో కబడ్డీ ప్రాక్టీసు జరిగేది ప్రతి సాయంత్రమూ. అది చూడడం కొందరికి వినోదం. ఆ పక్కనే గోళీలు, గూటీ బిళ్ళ లాంటి క్రీడా సంరంభాలూ జరుగుతూ ఉండేవి. మిగిలిన మిత్రులు వాటిలో సర్దుకునే వాళ్ళు. 

నాకు మొదటి నుంచీ క్రీడా స్ఫూర్తి బొత్తిగా లేదు. కాబట్టి నాకు మిగిలిందల్లా పంచాయితీ ఆఫీసులో ఉండే రేడియో వినడం. వ్యవసాయం పనులు పూర్తి చేసుకున్న రైతులు, కొందరు యువకులూ కూడా చేరేవాళ్ళు, వార్తలు వినడానికి. అదిగో అక్కడ కలిశాడీ మిత్రుడు. మా ట్యూషన్ మేష్టారి కాలేజ్మేట్. ఒకే ఊరి వాళ్ళం కావడంతో పరిచయాలు అవసరం లేదు. ఇద్దరి ఇళ్లూ ఊరికి చెరో చివరా ఉన్నా, వాళ్ళ నాన్నా, మా నాన్నా మంచి స్నేహితులు. అలా ఒకరి గురించి మరొకరికి తెలుసు. నాలాగే ఆటలు చూస్తూ, రేడియో వినేవాడు. చేతిలో తప్పనిసరిగా పుస్తకమో, న్యూస్ పేపరో ఉండేవి. 

మేష్టారు రాని ఓ సాయంత్రం నేను రేడియో వింటూ ఉంటే, తనొచ్చి, పలకరించి, పక్కన కూర్చున్నాడు. కబుర్లు మొదలయ్యాయి. అవి ఎంతకీ తెగలేదు. ఆశ్చర్యం ఏమిటంటే, తన వయసులో దాదాపు సగం వయసున్న నన్ను తనతో సమంగా చూసి మాట్లాడాడు. అది మొదలు, ట్యూషన్ లేనప్పుడల్లా తనతో కబుర్లు సాగేవి. గ్రామ రాజకీయాల మొదలు, దేశ రాజకీయాల వరకూ మేం మాట్లాడుకోని విషయం ఉండేది కాదు. ఊళ్ళో జరిగే పంచాయితీ తగువుల్లో కొన్ని తీర్పులు మా వాకిట్లోనే జరిగేవి కాబట్టి, అప్పటి మా ఊరి రాజకీయాలు నాకు కొట్టిన పిండి. స్కూల్ అసెంబ్లీ లో వార్తలు చదవడం కోసం పేపరు చదవడం కొత్తగా అలవాటు చేసుకుంటున్న రోజులు. ఇక రేడియోతో అనుబంధం చిన్నప్పటినుంచీ పెరిగిందే. 

తన ఈడు వాళ్ళు నవ్వుతున్నా పట్టించుకోకుండా, నేను గనుక ఖాళీగా ఉంటే అతను నాతో కబుర్లు చెప్పేందుకే ఉత్సాహ పడేవాడు. అప్పటికే చదివిన కథలు, అప్పుడే చదవడం మొదలు పెట్టిన యద్దనపూడి నవలల్ని గురించిన నా జ్ఞాన ప్రదర్శనని తను చెంపకి చేయి ఆన్చుకుని శ్రద్ధగా వినడం ఇప్పటికీ గుర్తుంది. ఆరోజుల్లో అతని గురించి తెలిసిన విశేషం ఏమిటంటే, ఊరి చివర కాలువ పక్కన ఉన్న వాళ్ళ కొబ్బరి తోటలో ఉన్న పాక అంటే తనకి చాలా ఇష్టమని, ఇంట్లో కన్నా ఎక్కువసేపు అక్కడే గడుపుతాడనీను. "చదువుకోడానికి అక్కడ బాగుంటుంది" అనేవాడు. నాక్కూడా ఎప్పటికైనా అలాంటి ఏర్పాటు దొరుకుతుందేమో అని కలలు కన్నాను. 

ఇలా ఓ ఏడాది గడిచిందేమో. ఉన్నట్టుండి ఊరు అట్టుడుకిపోయే వార్త. తనకి ఇష్టమైన పాకలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. (ఈ వాక్యం రాస్తుంటే మరోసారి ఒళ్ళు జలదరించింది). నాకేమీ అర్ధం కాలేదు. దుఃఖం రాలేదు. చిన్న వాడిని కాబట్టి అతన్ని చివరగా చూసేందుకు వెళ్లే స్వేచ్ఛ లేదు. సాయంత్రానికి వచ్చిన ఒకే ఒక్క ఆలోచన అతను నన్ను మోసం చేశాడని. ఈ ఆలోచన చాన్నాళ్లే వెంటాడింది. అతను వాళ్ళ నాన్నకి చివరి ఉత్తరం రాశాడు. తన డైరీని చితిలో కాల్చేయమని. ఊళ్ళో తగుమాత్రం పెద్దమనుషులు అందులో ఏముందో చదవమని సలహా ఇచ్చినా వినకుండా కొడుకు కోరిక తీర్చారాయన. 

ఊరి పద్ధతికి విరుద్ధంగా శ్మశానంలో కాకుండా ఆ పాక పక్కనే అంత్యక్రియలు చేసి, అక్కడే అతనికో సమాధి కట్టారు. కొన్నాళ్ళకి అతని ఆత్మ అక్కడే తిరుగుతోందని పుకార్లు లేచాయి ఊళ్ళో. మరో మూడేళ్ళ తర్వాత నేను కాలేజీ చదువుకి వచ్చాను. పక్కూళ్ళో కాకుండా, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలో చేరాల్సి వచ్చింది. ఇష్టం లేని కాలేజీ, బుర్రకెక్కని కోర్సు, శరీరంలో ఒక్కసారిగా వచ్చిపడిన మార్పులు, రోజూ ఎడతెగని సైక్లింగ్, ఇవి చాలవన్నట్టుగా ఇంటి వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు.. ఉన్నట్టుండి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిన కాలమది. అప్పుడు మరింత బలంగా అనిపించేది, అతనుంటే బాగుండేదని. 

కాలేజీ నుంచి ఇంటికి వచ్చేప్పుడు రోజూ బాగా చీకటి పడిపోయేది. సైకిల్ డైనమో లైట్లు కాలేజీ పార్కింగు లో తరచూ దొంగతనం జరిగేవి.  ఎటూ పోయేదే కాబట్టి, లైటు ఉండేది కాదు సైకిల్ కి. అప్పటికింకా వీధి దీపాలు పూర్తిగా రాలేదు. చీకట్లో ఆ పాక పక్క మట్టి రోడ్డు మీంచి రావాలంటే ఊళ్ళో పెద్ద వాళ్ళు కూడా లోపల్లోపల భయ పడేవాళ్ళు. నాకు మాత్రం ప్రతి రోజూ ఆశే, అతని ఆత్మ కనిపించి పలకరిస్తుందేమో అని. ఆత్మలు లేవు అనే హేతువుకీ, ఉంటే తప్పేంటి అనే మనసుకీ నిరంతర ఘర్షణ. మనసు బొత్తిగా బాగోని రోజుల్లో ఇంటికెళ్లడానికి ముందు కావాలనే అక్కడ సైకిల్ ఆపి, కాసేపు నిలబడేవాడిని. ఆ దారిలో ఇంకెవరైనా కనిపిస్తే, సైకిలు చైను ఇబ్బంది పెట్టినట్టు నటించేవాడిని. 

పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సమయాల్లో 'అతని దారిలోనే వెళ్తే' అన్న ఆలోచనలు బలంగా వచ్చేవి. కానీ, అతను చేసిన పనిని నేను ఏనాడూ మెచ్చక పోగా తీవ్రంగానే వ్యతిరేకించాను, లోపల్లోపలే. ఈ సంఘర్షణ లోంచి కూడా ఎన్నో ప్రశ్నలు పుట్టేవి, అతన్ని గురించి. కాలం గడిచే కొద్దీ నా సమస్యలు రూపం మార్చుకుంటూ వచ్చాయి తప్ప సమసిపోలేదు. నాకు మాత్రం వాటిని ఎదుర్కొనే శక్తి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. తర్వాత జీవితంలో నా వయసు వాళ్ళ కన్నా పెద్ద వాళ్ళతో సులువుగా స్నేహాలు కుదిరాయి. నా తోటి వాళ్ళకి నా స్నేహాలెప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేవి. 

ముళ్ళూ, రాళ్ల దారుల్లో జీవితపు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆ రోడ్డున వెళ్లేప్పుడు అతనోసారి కనిపిస్తే బాగుండునని బలంగా అనిపిస్తూ ఉంటుంది. తేడా అల్లా ఇప్పుడు నేను ఎదురు చూసేది అతని భుజం కోసం కాదు. నేను చేసిన ప్రయాణాన్ని గురించి చెప్పి, 'నేనే చేసినప్పుడు, నువ్వెందుకు ఈ ప్రయాణం చేయలేకపోయావు?' అని నిలదీయడానికి. 'నువ్వు నాకన్నా చిన్నవాడివి అయ్యుంటే, ఆ నిర్ణయం తీసుకుని ఉండేవాడివి కాదేమో' అని చెప్పడానికి. కానీ లోపలెక్కడో, ఏమూలో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి - 'ఏ పరిస్థితులు, ఏ క్షణాలు అతన్నా నిర్ణయం తీసుకునేలా చేశాయో?' అని. ఈ సంఘర్షణ, బహుశా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే, అతని సమాధి నాకు ఫోటోగా దాచుకునే ఒక జ్ఞాపకం కాదు. అంతకు మించి చాలా చాలా... మాటల్లో చెప్పలేనంత... 

ఆదివారం, ఆగస్టు 14, 2016

జెండా పండగ

"రండీ ఓ మిత్రులార జెండా ఎగురవేయ.. మన జాతికి గౌరవమీయ.." ఆడపిల్లలందరూ గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళకయితే అదొక్కటే పని. అదే మగపిల్లలకయితేనా.. పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి. రంగు రంగుల జెండా కాయితాలు మడతలు పెట్టి, మేష్టారు కత్తిరించడానికి రెడీగా పెట్టాలి. ఎవరింట్లో కత్తెరలు ఉన్నాయో లెక్కేసి, వాళ్లలో ఎవరు తిట్టకుండా ఎరువిస్తారో నిర్ణయించి, జెండా కాయితాలు కత్తిరించడడం కోసం అడిగి పట్టుకురావాలి. మేష్టారు జెండాలు కత్తిరిస్తుంటే, ఆయనకి కోపం రాకుండా చూసుకోవాలి. నోటిమీద వేలేసుకుని చూస్తూ ఉండాలి. అప్పుడు గనక ఏమన్నా మాట్లాడామంటే, చెయ్యి తిరగెయ్యమని వేళ్ళ కణుపుల మీద రూళ్ళ కర్రతో ఒక్కటేస్తారు మేష్టారు.

జెండాలు కత్తిరించడం అయిపోగానే కనీసం ఇద్దరం వెళ్లి కత్తెరని తిరిగిచ్చేసి రావాలి. పురికొస తాడుని బడి బయట ఆ చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి, రామారావు గారి ఇంటి దగ్గరనుంచి తెచ్చిన వేడి వేడి లైపిండి తాడుకి పులమాలి. అప్పుడేమో మేష్టారొచ్చి దగ్గరుండి జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి ఎలా అతికించాలో చూపిస్తారు. కొంతమంది జెండాలు అంటిస్తుంటే, ఇంకొంతమంది రద్దు ఏరి బయట పడేసే పని, బండిముందు ఇసుకలో నీళ్లు జల్లేపనీ చూడాలి. హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల జెండా కాగితాలతో నిండిపోయింది.. మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే. ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు పిల్లలదే. వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది మనకి.

సరే, ఇప్పుడింక ఆడపిల్లల పని మొదలవుతుంది. మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటారు కదా వాళ్ళు. వాటిలో తడిసిన ఇసక మీద రంగు ముగ్గులు పెట్టేస్తారు. మేష్టారు దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు. ఆరిపోయిన జెండాల తాడుని క్లాసులో కట్టే పనీ, నేల బెంచీలు పైకెత్తి, ఇసకంతా తుడిచి, నీళ్లు జల్లే పనీ మళ్ళీ మగ పిల్లలవే. ఇవయ్యాక ఆడపిల్లలు షోగ్గా వచ్చి మేష్టారిచ్చిన రంగు సుద్దలతో గచ్చు నేలమీద ముగ్గులు పెట్టేస్తారు. ఆ ముగ్గులు ఆరిపోయాక నేల బల్లలు మళ్ళీ పరిచేయాలి. అన్నట్టు, అంతకన్నా ముందే, అప్పటికి వారం ముందు నుంచీ రోజూ చేయిస్తున్న 'ఎటేంషన్' 'స్టెండిటీజ్' అందరం కలిసి మళ్ళీ ఓ సారి చేసి చూపించాలి మేష్టారికి.

ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా. అప్పుడేమో మేష్టారు, మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో చెప్పేసి, పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని, ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే జెండా పండగ సగం అయిపోయినట్టే. ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ. కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. "అబ్బే మా నాన్నగారు అస్సలు కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే" అని మనం చెప్పినా సరే, ఫ్రెండ్సులు అనుమానంగా చూస్తారు.

ఇంక బళ్ళోకెళ్లింది మొదలూ ఎండలో నిలబెట్టి 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూను. సగం ముగ్గులు చెరిగిపోయి, మనకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాక అప్పుడొస్తారు పెద్దమనుషులు, జెండా ఎగరెయ్యడానికి. ఫ్రెండ్సులేమో "మీ నాన్నగార్రోయ్" అంటారు మనకి తెలియనట్టుగా. వాళ్ళని కొంచం గీరగా చూసేమనుకో, ఆ కోపం కడుపులో పెట్టుకుని తర్వాతెప్పుడో ఏదో ఒకటి చేసేస్తారు. అందుకని మామూలుగా ఉండాలి, ఏమీ మాట్లాడకుండా. ఓ నాలుగు 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూ అయ్యాక వచ్చే 'ఎటేంషన్' లో పెద్దమనుషులు జెండా కర్ర దగ్గర కొబ్బరి కాయలు కొట్టి, జెండా ఎగరేసేస్తారు. ఆడపిల్లలు పాటలు పాడేస్తారు. ఈలోగా రామారావు గారొచ్చి, కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళింట్లో బేసిన్లో తెచ్చుకున్న పంచదారలో కలిపేస్తారు. ఇంకో బేసిన్లో చాకలేట్లు, బిస్కట్లు కూడా కవర్లు చింపేసి పోసేస్తారు.

అది మొదలు పెద్ద మనుషులు గాంధీ గారనీ, నెహ్రు గారనీ ఏవిటేవిటో మాట్లాడతారు. ఫ్రెండ్సులందరూ చక్కగా కొబ్బరి ముక్కలూ అవీ ఎప్పుడు పెడతారో అని చూడొచ్చు కానీ, మనం మాత్రం పెద్ద మనుషులు మాట్లాడేది శ్రద్ధగా వినాలి. ఇంటికెళ్ళాక ఎవరెవరు ఏమేం మాట్లాడారు అని ప్రశ్నలు ఉంటాయి. సరిగ్గా కానీ చెప్పలేకపోయామా, పొద్దు పొద్దున్నే ఫ్రెండ్సులకి వచ్చిన అనుమానాలు నిజమయిపోతాయి. ఎండలో నిలబడి వినగా వినగా, మేష్టారు సైగ చేసినప్పుడల్లా చప్పట్లు కొట్టగా కొట్టగా, అప్పటికి పూర్తిచేస్తారు వాళ్ళు మాట్లాడడం. గాంధీ గారు, నెహ్రు గారు జైలుకి వెళ్లారు కాబట్టే మీరిలా చదువుకోగలుగుతున్నారు అని చెబుతారు వాళ్ళు. "వాళ్లంత కష్టపడి జైలుకి వెళ్లకపోతేనేం" అనిపిస్తుంది కానీ, ఆ మాట పైకనేస్తే పాతెయ్యరూ?

హమ్మయ్య! చిన్న చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేశారు కదా.. ఎప్పటిలాగే రామారావు గారు "పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని కూడా చెప్పేశారు కదా.. ఇంక ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? అప్పుడే ఎక్కడ.. ఇంకా కాంగ్రెస్ అరుగు దగ్గర జెండా ఎగరెయ్యద్దూ? అందరం రోడ్డుకి ఎడమవైపున వరుసలుగా బయలుదేరతాం.. కాంగ్రెస్ అరుగు దగ్గరికి వచ్చేస్తే మనిల్లు దగ్గరే కూడాను. ఆలా అని ఇంట్లోకి వెళ్లిపోకూడదు. అక్కడ మళ్ళీ కాసేపు 'ఎటేంషన్'  'స్టెండిటీజ్' చేశాక, వేరే పెద్దమనుషులు వచ్చి, కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగరేస్తారు. ఇక్కడైతే ఒకళ్ళో ఇద్దరో మాట్లాడతారంతే. పైగా, కొబ్బరి ముక్కలతో పాటు తీబూందీ, కారబూందీ వేరేవేరే అరిటాకు ముక్కల్లో పెట్టి ఇస్తారు.

అంతేనా? గత సంవత్సరం ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకి నగదు బహుమతుల పంపిణీ కూడాను. డబ్బులు తీసుకుని, ఆ పెద్దమనిషి ఎప్పుడూ మన ఇంటికొచ్చే నాన్న ఫ్రెండే అయినా అస్సలు నవ్వకుండా, ఆయనకీ, మేష్టారికి నమస్కారం చేసేసి, అప్పుడా డబ్బులతో ఏమేం చెయ్యొచ్చో ప్లాన్లు వేసేసుకోవచ్చు. బడికి దగ్గరగా ఇళ్లున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు కానీ, మనం ఉండిపోవచ్చు ఎంచక్కా. వచ్చిన చిరుతిళ్లన్నీ ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి వెళ్తామా? అమ్మ ముందుగా డబ్బులగురించి అడుగుతుంది. "నీ దగ్గరుంటే పారేసుకుంటావు.. నాన్నగారికి చెప్పి పోస్టాఫీసులో వేయిస్తాను" అని ఆమాటా ఈమాటా చెప్పి పుచ్చేసుకుంటుంది. బాగా చదువుకుని, వొచ్చే ఏడు కూడా బహుమతీ తెచ్చుకోవాలనీ, అప్పుడా డబ్బులు అమ్మకి అస్సలు ఇవ్వకుండా ప్రసాదం గారి కొట్లో బజ్జీలూ, వడలు అవీ కొనుక్కుని తినెయ్యాలనీ ప్లాన్లు వేసుకోడంతో ఆ ఏటికి జెండా పండగ అయిపోయినట్టే...

మిత్రులందరికీ డెబ్భయ్యో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

శనివారం, మే 18, 2013

శుభరేకొచ్చింది...

"అయ్ గారు సుభరేకంపారండి..." డొక్కు సైకిల్ని డొంకవార జారేసి, చెప్పులు అక్కడే విప్పేసి, లోపలికొచ్చి శుభలేఖ నా చేతికిచ్చిన అతన్ని ఆగమని చేత్తోనే సైగచేసి లోపలికి పరిగెత్తా. డబ్బాలో ఉన్న చిల్లర డబ్బుల్లోనుంచి ఓ నాణెం పట్టుకొచ్చి అతని చేతిలో వేశాను, ఎటూ అమ్మకి చెప్పినా డబ్బులిమ్మనే చెబుతుంది కదా అని.."సిత్తం" అనేసి వెళ్ళిపోయాడు. ఘుమఘుమ లాడిపోతున్న శుభలేఖ చదువుదామని తీసేలోగా అమ్మ వచ్చేసింది, "ఎవరిదీ శుభలేఖా?" అంటూ. వివరం చెప్పాను. "డబ్బులిచ్చి పంపావా?" అని అడిగి, "గొప్ప వాళ్ళింట్లో పెళ్ళికి పిలుపొచ్చిందన్న మాట!" అనడం ఆలస్యం, "నేనూ వెళ్తానమ్మా" అని ప్రయాణం అయిపోయాను. "ఊ..ఊ... మొదలైంది చీమకి పెళ్లి ప్రయాణం," అంటూనే "పైకి చదవరా శుభలేఖ నేనూ వింటాను.." అని అడిగింది, కళాపి జల్లుతూ.

"యెంత మంచి వాసన వస్తోందో అమ్మా శుభలేఖ.. నాలుగు పక్కలా పసుపు బొట్టుతో పాటు, ప్రత్యేకం సెంటు కూడా రాశారు" అని నేను ఆశ్చర్యాలు పోతున్నానో లేదో... "నీ మొహం... ఆ పసుపులోనే కాస్త సెంటు కూడా కలిపి ఉంటారు.. ప్రత్యేకం రాయడం ఎందుకూ?" అని అడిగింది. అమ్మ చెప్పింది విన్నాక, శుభలేఖని పరీక్షిస్తే నిజమే అని తేలింది.. పోన్లే.. ఓ కొత్త విషయం తెలిసింది.. రేప్పొద్దున్న నా పెళ్ళప్పుడు పనికొస్తుంది కదా అనుకున్నాను మనసులో.. ఆ మాటే పైకంటే క్షణం ఆలస్యం లేకుండా జరిగిపోతుంది పెళ్లి, ఏ చీపురు కట్టతోనో. "అయిందా వాసన చూడ్డం? అక్షరాలు కూడబలుక్కుంటున్నావా?? ఎంతసేపూ చదవడం..." అంది అమ్మ కొంచం ధాటీగా.

పెళ్లి ఆలోచనల్లోనుంచి బయట పడి "కూడబలుక్కోడం ఎందుకమ్మా? నాకు చదవడం వచ్చు కదా.." అంటూనే శుభలేఖ చదవడం మొదలు పెట్టాను... శ్రీరస్తు... శుభమస్తు.. అవిఘ్నమస్తు.. శ్లో.. ఇంతలో ఓ ఆలోచన వచ్చింది.. ఈ శ్లోకానికి అర్ధం చెప్పేసి అమ్మని మెప్పిస్తే?? చూడ్డానికి సులువుగానే ఉంది... అర్ధమవుతోంది కూడాను...ఇదేదో బాగానే ఉందనుకుంటూ శ్లోకం పైకి చదవడం మొదలుపెట్టాను.. "శ్రీరామ పత్నీ... జనకస్య పుత్రీ... అంటే... శ్రీరాముని యొక్క భార్య .. జనకుని యొక్క కుమార్తె... రైటే కదా అమ్మా?" ..."రైటే..రైటే ... మీ బళ్ళో చేప్పేరేవిట్రా?" ..."లేదమ్మా.. నాకే అలా తోచింది... తర్వాత చదువుతా ఉండు.."

"సీతాంగనా... సుందర కోమలాంగీ.... అంటే అందమైన సీత అనే కదా అర్ధం?" ..."అవున్నాయినా అవును... పెళ్లి ఎప్పుడో చెబితే, మీ నాన్నగారికి గుర్తు చేద్దాం అని నిన్ను శుభలేఖ చదవమన్నాను.. కాస్త ఆ ముహూర్తం ఒక్కటీ ముందు చెప్పెయ్ బాబూ..." ..."ఉండమ్మా... వరసగా చదువుతున్నాను కదా..." ఈ అర్ధం చెప్పడం నాకు భలే సరదాగా ఉంది నిజానికి... వేసంకాలం సెలవుల్లో 'గణపతి' పుస్తకం చదివానేమో ..స్కూలు మేష్టారు ఉద్యోగం చేసే రోజుల్లో కథా నాయకుడు గణపతి "శ్రీ రఘురామ.. చారు తులసీ దళధామ" పద్యానికి తాత్పర్యం చెబుతూ "వనవాసంలో శ్రీరాముడు చారు కాచుకొనెను.. కర్వేపాకు దొరక్క పోవడంతో ఆయొక్క చారుని తులసీ దళాలతో కాచుకొనెను" అని చెప్పడం గుర్తొచ్చింది..

మళ్ళీ శుభలేఖలోకి వస్తూ "భూగర్భ జాతా... భువనైక మాతా.... అమ్మా.. భూగర్భ జాత అంటే సీతే కదా... భూమిలో దొరికింది కదా నాగలి దున్నుతూ ఉంటే?" అని నా పురాణ జ్ఞానం ప్రదర్శించేసరికి, అమ్మ బోల్డంత మురిసిపోయి, కళాపి చల్లిన వాకిట్లో పుత్రోత్సాహంతో ముగ్గేయడం మొదలు పెట్టింది.. "భువనైకజాత జాత అంటే ఏమిటో తెలియడం లేదు కానీ, సీతే అయి ఉంటుంది కదా అమ్మా..." అమ్మకి సహనం కొంచం తగ్గినట్టుంది.. "అవతల బోల్డంత పని ఉంది.. తర్వాత ఏమిటో తొరగా చదువు నాయనా..." అంది, మరీ విసుక్కోకుండా, అలాగని మరీ ముద్దుచేసేయకుండా.. తర్వాత లైను తెలిసినట్టే ఉంది కానీ తెలియడం లేదు..

"వధూ వరాభ్యం వరదా భవంతు... అమ్మా... వధూ వరాభ్యం అంటే వధూ వరులు కదా..." నా ఉత్సాహం తగ్గడం అమ్మ కనిపెట్టేసింది... "అవున్నాయనా అవును.. తర్వాత మాటకి కూడా అర్ధం చెప్పేసి, మిగిలిన శుభలేఖ చదువు..." ....ఏవిటి చదవడం?? "వరదా భవంతు అంటే... అమ్మా.. మరీ..." ఏమన్నా మాట సాయం అందుతుందేమో అని చూశా.. అబ్బే.. నాకు అమ్మ కదూ.. "ఊ మరి? చెప్పూ" ... "అంటే.. వధూవరులిద్దరూ వరదల్లో కొట్టుకుపోకుండా ఉందురుగాక అని అయి ఉంటుంది" అన్నాను కొంచం అనుమానంగా... అమ్మ అక్కడ నిలబడలేక, కొబ్బరి చెట్టుకి ఆనుకుని ఒకటే నవ్వడం... "ఇంకా నయం.. వరదల్లో కొట్టుకుపోదురు గాక.. అన్నావు కాదు" అంటూ... పెళ్లి శుభలేఖలో ఈ పద్యం చూసినప్పుడల్లా గుర్తొచ్చే జ్ఞాపకం ఇది..

సోమవారం, జనవరి 14, 2013

మా వెంకన్నబాబు...

దేవుడి గదిలో బియ్యం పోసుకునే జాడీ పక్కనే ఉన్న ఇత్తడి గంగాళం మీద, గంధం అరగదీసుకునే సాన బరువుగా మూత పెట్టి ఉంది. బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని, జాగ్రత్తగా ఆ సానని కిందకి దింపేసి, గంగాళంలో చెయ్యి పెడితే లోపల గరుగ్గా తగులుతూ వడ్లు. ఓ చిన్న పళ్ళెంలోకి వాటిని తీసుకుని, గంగాళం మీద మూతని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసి, ఎందుకన్నా మంచిదని ఓ సారి వంటింటి వైపు చూసేసరికి, అమ్మా, బామ్మా పండగ పిండి వంటల హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. ఇద్దరూ కూడా నన్ను చూడనేలేదు.

ఆ పళ్ళెం తెచ్చి వీధిలో బూరా ఊదుతున్న తలపాగా అబ్బికి ఇవ్వగానే తను యెంత సంతోషించాడో చెప్పలేను. నేను చూస్తూ ఉండగానే ఆ వడ్లు తనతో తెచ్చుకున్న సంచీలో పోసేసుకున్నాడు. అదేమిటీ? గంగిరెద్దుకి వడ్లు పెడతానని కదా నన్ను అడిగాడూ? "మా ఎంకన్నబాబు ఇప్పుడేవీ తినడు బాబయ్యా. మద్దినాల మేం బోయినం సేసేప్పుడు తవరి పేరు సెప్పి నేను తినిపింతాను సావీ" అని చాలా మర్యాదగా చెప్పాడు పాపం. కూడా వచ్చిన రెండో బూరా అబ్బి అవునవునని తలూపాడు. సర్లే నా పేరు చెప్పి తినిపిస్తాడు కదా... పుణ్యం అంతా నాకే కదా అనుకున్నాను.

ఏటా సంక్రాంతి రోజుల్లో వెంకన్నబాబుని తీసుకుని వస్తారు వాళ్ళు. మామూలుగా మన ఊళ్ళో బండి లాగే ఎడ్లు ఉంటాయి చూడూ, వాటికన్నా ఎత్తుగా ఉంటాడు వెంకన్న బాబు. కాళ్ళకీ, మెడ లోనూ, కొమ్ములకీ, పొట్టకీ కూడా మువ్వల పట్టీలు కట్టేస్తారు కదా... తను ఒక్క అడుగు వేసినా ఘల్లు ఘల్లు మని పోతాడు. కొమ్ములకి పట్టు కుచ్చులు, మూపురం వెనుక మడతలు పెట్టిన పాత పట్టు చీరా, చెమ్కీ దండలూ అవీ వేస్తారేమో భలేగా మెరిసిపోతాడు. మన ఎడ్లు అయితే కొరడా కర్రతో కొడితే తప్ప మాట వినవా? అదే వెంకన్న బాబయితే ఏం చెప్పినా ఇట్టే చేసేస్తాడు. అయినా మామూలు ఎడ్లని కొట్టినట్టు వెంకన్నబాబుని కొట్టకూడదు, తను గంగిరెద్దు కదా మరి.. దేవుడితో సమానం.


బూరా అబ్బిలు ఇద్దరూ వెంకన్న బాబుతో భలే భలే పనులు చేయిస్తారులే అసలు. "అయ్యగారికీ దండం పెట్టూ" అనగానే అంత పెద్ద వెంకన్న బాబూ ఇంచక్కా దండం పెట్టినట్టు నిలబడి పోతాడు. అది చూడగానే గంగాళంలో ఉన్న వడ్లన్నీ తెచ్చి తన ముందు పెట్టెయ్యాలని అనిపించేస్తుంది.. అలా చేస్తే ఇంకేమన్నా ఉందా? బామ్మ బతకనివ్వకపోవడం అలా ఉంచి, అటుకులు కావాలంటే ఎక్కడినుంచి వస్తాయీ? అందుకని ఒక్క పళ్ళెంతో, అది కూడా బామ్మ చూడకుండా చూడకుండా తెచ్చి ఇచ్చెయ్యాలి. చూసిందంటే మాత్రం "వాళ్ళు చెప్పే వెధవ సినేమా కబుర్ల కోసం, వడ్లన్నీ సంతర్పణ చేసేస్తున్నావా నాయనా..ఇలా అయితే ఇల్లు గుల్లైపోతుంది. సుపుత్రా..కొంప పీకరా అనీ..." అంటూ సాధిస్తుంది.

బామ్మ తిట్లు కాదు కానీ, బూరా అబ్బిలు చెప్పే కబుర్లు భలేగా ఉంటాయ్ అసలు. "మొన్నా మజ్జినండీ..ఎన్టీ వోడు కబురెట్టేడు మన ఎంకన్నబాబు కోసం.. కొత్త సినీమా తీత్తన్నారంట.. అట్టాంటిట్టాంటి గంగిరెద్దు పనికిరాదు.. ఎంకన్న బాబైతేనే కరెస్ట్ గా సరిపోతాడు అన్నాడంట. ఆళ్ళ మనిసొచ్చి ఒకిటే బతిమాలేసేడు. మావు ఇనలేదు లెండి.. ఇంకో ఎద్దుని సూసుకోమని సెప్పేసాం.." అయ్యో... ఎందుకలాగా? మన వెంకన్న బాబుని అందరూ చక్కగా సినిమాలో చూసేవాళ్ళు కదా?? అని అడిగామనుకో వెంటనే "సినీమానులో పడితే దిట్టి బాబయ్యా..బాబుకి కల తగ్గిపోద్ది..ఒప్పేసుకో కూడదండి అలాగ..ఆయ్.." అని వివరంగా చెప్పేస్తారు.

అదేమిటో పెద్దవాళ్ళు ఎవరూ కూడా వీళ్ళ మాటలు నమ్మరు. "మెడ్రాసులో గంగిరెద్దులకి కరువు మరీ... వీళ్ళని వెతుక్కుంటూ వచ్చారు సినిమా వాళ్ళు" అనేస్తారు. అయినా నిజం అయితే ఏమిటి, కాకపొతే ఏమిటి... వాళ్ళు సరదాగా చెబుతున్నప్పుడు సరదాగా వినొచ్చు కదా. మనం చూస్తూ ఉండగానే బూరా అబ్బిలు ఇద్దర్లోనూ ఒకతను ముగ్గుకి దూరంగా నేలమీద వెల్లకిల్లా పడుకుంటాడా.. వెంకన్న బాబు మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్లి అతని గుండెల మీద కాళ్ళు పెడతాడు. యెంత భయం వేసేస్తుందో. అప్పుడప్పుడూ మన ఎద్దులు కొమ్ము విసిరినట్టు వెంకన్నబాబు కూడా కోపం వచ్చి ఏమన్నా చేస్తే? వాళ్లకి అస్సలు భయం ఉండదేమో.. అలా తొక్కించేసుకుంటారు.

అబ్బిలిద్దరూ వీధిలో నిలబడి పోటాపోటీగా బూరలు ఊదుతూ ఉంటే అమ్మో, బామ్మో తప్పకుండా బయటికి వస్తారు కదా. అప్పుడు వెంకన్నబాబు కాస్తా మాలచ్మి అయిపోతుంది. "పండగ పూటా మాలచ్చిమి వచ్చింది తల్లే... నాలుగు పాతగుడ్డలు, పలారం ఎట్టించి పంపండమ్మా... జయం కలుగుతాది మీకు" అని ఆపకుండా ఏవేవో అడుగుతూనే ఉంటారు. మనకేమీ భయం అక్కర్లా... "అబ్బాయ్ గారు ఎంకన్న బాబుకి వడ్లు పెట్టారమ్మా" అని వాళ్ళు చెప్పరు గాక చెప్పరు. ఈలోగా నాన్నో, తాతో కనిపిస్తే "ఆట ఆడించాం బాబయ్యా...సదివింపులు గనంగా సదివించుకొవాలి బాబయ్యా..." అంటూ రూపాయో అర్ధో ఇచ్చే వరకూ వదలరు. గొబ్బిళ్ళు, హరిదాసు, ఆ తర్వాత వెంకన్న బాబూ అందం సంక్రాంతి పండక్కి.

మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు!!

మంగళవారం, డిసెంబర్ 18, 2012

సుబ్బారాయుడి షష్ఠి

"హమ్మయ్య... 'పోలిస్వర్గం' అయిపొయింది కదా.. ఇంక రోజూ పొద్దున్నే లేచే పని ఉండదు..." అనుకుంటామో లేదో, సుబ్బారాయుడి షష్ఠి వచ్చేస్తుంది. ఏవిటో ఈ పండగలన్నీ ముందే చెప్పుకున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వరసగా వచ్చేస్తాయి. షష్ఠి అంటే స్నానమూ, తీత్తమూ అన్నమాట. రెండూ కూడా పక్క ఊళ్లోనే. పొద్దు పొద్దున్నే లేచేసరికే గుమ్మంలో వెంకాయమ్మ గారి బండి ఉంటుందా... అది నిండేలా బోల్డంతమంది ఆడవాళ్ళూ, పిల్లలూ ఉంటారు. ఎద్దులకి కూడా పాపం చలే కదా. మెల్లిగా నడిచీ నడిచీ పక్క ఊళ్ళో చెరువు పక్కన ఉన్న గుడికి తీసుకెడతాయి. 

మనం బండి దిగేసరికే బోల్డంత మంది పంతులు గార్లు 'సంకల్పం చెబుతామమ్మా' అంటూ ఎదురు వచ్చేస్తారు. ముందర ఎవరు అడుగుతారో వాళ్ళతో 'అలాగేనండీ' అని చెప్పాలన్న మాట. ఈ మాట కూడా పెద్ద వాళ్ళే చెప్పాలి. పిల్లలు గప్ చుప్ గా ఉండాలి. అసలే చలి చంపేస్తూ ఉంటుందా, మన పాటికి మన్ని స్నానం చేయనీయకుండా పంతులు గారు ఏవేవో మంత్రాలు చెప్పేస్తారు. ఓపక్క వణుకు వచ్చేస్తున్నా సరే, వాటిని తప్పుల్లేకుండా పలకాలి. లేకపోతే ముందర ఆయనకీ, తర్వాత అమ్మకీ కోపాలు వచ్చేస్తాయి. స్నానం గండం గడిచిపోయిందంటే, ఇంక గుళ్ళోకి వెళ్లి ప్రసాదం తెచ్చేసుకోడమే. జనం ఉంటారు కదా.. కొంచం ఆలీసం అవుతుంది.

గుడి నుంచి బయట పడేసరికి వెలుగు వస్తూ వస్తూ ఉంటుందన్న మాట. గుడి బయట అప్పుడే సైకిళ్ళ మీదా, బళ్ళ మీదా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మూటలు దింపుకుంటూ ఉంటారు. ఆ మూటల్లో ఏముంటాయంటే తీత్తం లో అమ్మేవి అన్నీను. అన్నట్టు, తీత్తం అంటే ఏమిటో చెప్పలేదు కదూ. బోల్డు బోల్డు జీళ్ళు, కర్జూర పళ్ళూ, బుడగలూ, రంగు కళ్ళ జోళ్ళూ, గాలికి గిరగిరా తిరిగే రంగు కాయితం పువ్వులూ, టిక్కూ టిక్కూ చప్పుడు చేసే కప్పలూ, ఇంకానేమో రంగుల రాట్నం కలర్ సోడాలు, గుండాట (ఇది కొంచం రహస్యం) ఇవన్నీ ఉండే చోటన్న మాట. గుడి ముందు నుంచి చాలా బోల్డంత దూరం ఒకదాని తర్వాత ఒకటి కొట్లు వస్తూనే ఉంటాయి.

మనం బండిలో వెడుతూ వెడుతూ బొమ్మలూ అవీ ఏమేం వచ్చాయో చూసి, ఏ కొట్లో బావున్నాయో గుర్తులు పెట్టేసుకోవచ్చు. 'ఇప్పుడే కావాలీ' అని పేచీ పెట్టకూడదు. అలా కానీ పేచీ పెట్టామంటే, బండి దింపేస్తాం అంటారు పెద్ద వాళ్ళందరూ. హమ్మో... బండి దిగిపోతే ఇంకేమన్నా ఉందా? తీత్తంలో మారిపోమూ? అదే గుర్తులు పెట్టేసుకున్నాం అనుకో, మధ్యాహ్నం మళ్ళీ వస్తాం కదా.. అప్పుడు కొనుక్కోవచ్చు. ఇంచక్కా బడి ఉండదు కాబట్టి, ఇంటికి వెళ్ళాక ఆటలు ఆడుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం బోయినం అవ్వగానే తీత్తం ప్రయాణం ఉంటుంది కదా. "తీత్తం ఏమిటీ తీత్తం? నీ మొహం... తీర్ధం అనాలి" అని బామ్మ అంటుందనుకో.. అయినా మనకి ఎలా పలికితే అలా అనొచ్చు. చిన్న పిల్లలు అన్ని మాటలూ సరిగ్గా పలకలేరని దేవుడికి మాత్రం తెలీదూ?

తీత్తానికి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. అమ్మ, అమ్మ ఫ్రెండ్సులతో అయితే నడిచి, అదే నాన్నతో అయితే సైకిలు మీద. మన ఊరి తీత్తమైతే రోజులో ఆరు సార్లో, పది సార్లో ఇట్టే వెళ్లి అట్టే వచ్చేస్తామా? ఈ తీత్తానికి మాత్రం ఒక్ఖ సారే వెళ్ళగలం. బండిలో చటుక్కున వెళ్లినట్టు అనిపిచేస్తుంది కానీ, నడిచి వెడితే యెంత దూరమో అసలు. వెళ్ళేప్పుడు, మనకి ఎదురు వస్తున్న వాళ్ళ చేతుల్లో ఉండే బూరాలూ, బొమ్మలో చూస్తూ పట్టించుకోము కానీ, ఇంటికి రాగానే మొదలవుతాయి కాళ్ళ నొప్పులు. అదే సైకిలు మీదనుకో, కాళ్ళు చక్రంలో పెట్టేయ్యకుండా జాగ్రత్తగా కూర్చోవాలి. మనం వెడుతూ వెడుతూ ఉండగా తాడుచ్చుకుని కొట్టుకునే వాడు కనిపించాడంటే తీత్తం వచ్చేసినట్టే. వాడిని చూస్తే ఎంత భయం వేస్తుందంటే, తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అమ్మైతే "కళ్ళు మూసుకుని నా చెయ్యి గట్టిగా పట్టుకో బాబూ" అంటుంది కానీ, అదే నాన్నైతే "మొగ పిల్లాడివి, ఏడుస్తావేంటీ?" అనేస్తారు.

ఎన్నేసి జీళ్ళో... ఎన్నెన్ని ఖర్జూరం పళ్ళో... వాటిని చూస్తూనే కడుపు నిండిపోతుంది అసలు.. కొట్ల వాళ్ళందరూ యెంత మర్యాదగా పిలుస్తారో అసలు.. వాళ్ళ కొట్లోనే కొనుక్కోమని. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోకూడదు. ఈగలు లేకుండా ఉన్న కొట్టు వెతుక్కోవాలా... జీళ్ళు అప్పటికప్పుడు చేస్తూ అమ్ముతారు చూడూ, అక్కడైతే బావుంటాయి. ఖర్జూరం పళ్ళ మీద బెల్లం నీళ్ళు చిలకరించి అమ్మేస్తూ ఉంటారు. అది పసికట్టుకోవాలి. మనం యెంత జాగ్రత్తగా ఎంచినా బామ్మ ఏదో ఒక పేరు పెట్టకుండా ఉండదనుకో. అయినా, అమ్మ చెప్పినట్టు డబ్బులు పోసి కొంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తీత్తంలో కళ్ళజోళ్ళు యెంత బావుంటాయో అసలు. ఎన్ని రంగులో.. ఎరుపూ, నీలం, ఆకుపచ్చా, పసుప్పచ్చా... మనకైతే అన్నీ తలోటీ కోనేసుకోవాలి అనిపించేస్తుంది కానీ, ఒకటి కన్నా కొనుక్కోడానికి ఉండదు.

పేరుకి బోల్డన్ని కొట్లు ఉంటాయి కానీ అన్నీ చూడ్డానికి ఉండదు. పెద్దవాళ్ళు ఎక్కడికి వెడితే మనమూ అక్కడికే వెళ్ళాలి. లేకపోతే మారిపోతాం కదా. పోలీసులు ఒకళ్ళు తెగ తిరుగుతూ ఉంటారు. నేనెప్పుడూ చూడలేదు కానీ, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారుట తీత్తంలో. నాన్నైతే బరబరా తీసుకొచ్చేస్తారు, రెండో మూడో బొమ్మలు కొనిపెట్టి. అమ్మతో అయితే తిరగొచ్చు కానీ, ఊరిఖే చూడాలి అంతే. బతిమాలినా ఏమీ కొనిపెట్టదు. "ఎందుకూ.. రేపటికి విరగ్గొట్టేస్తావ్" అంటుంది పైగా. ఏవీ కొనుక్కోక పొతే ఫ్రెండ్సులకి ఏం చూపించాలీ? వాళ్ళందరూ నవ్వరూ?? ఏవిటో..ఇంత పెద్దైనా ఏమీ తెలీదు. ఆ ఏడాది తీత్తానికి నాన్నతో వెళ్లాను కదా... తిరిగొస్తూ "ఎందుకు నాన్నా సుబ్బారాయుడి తీత్తం ఇంత దూరంగా ఉంటుందీ?" అని అడిగా. "ఇదీ ఓ దూరమే? వచ్చే ఏడు నుంచీ నీ బడి ఇక్కడే.. రోజూ రావాలి. మనూళ్ళో హైస్కూలు లేదు కదా మరి" అనేశారు.

బుధవారం, అక్టోబర్ 12, 2011

అమ్మకి కోపం వస్తే..

ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు. నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు. కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు.

అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి. మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట. నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది. నాన్న మనల్ని కొట్టినా, మనం తనని చూడడం లేదనుకుని కళ్ళనీళ్ళు కక్కుకుని, అంతలోనే చెంగుతో తుడిచేసుకుంటుంది.

ఓసారేవయ్యిందంటే, అమ్మతో పాటూ శ్రావణమాసం పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది. చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు.

అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి.

నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం.

మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది. తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేవాడిని. మళ్ళీ కథ మామూలే. అమ్మ కోపం కబుర్లు ఇలా ఉంటే, మన బ్లాగు లోకపు అమ్మ గూగులమ్మకి నా మీద కోపం వచ్చిందివాళ. ఉదయానే నన్ను మెయిల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డగించి ఏదో ప్రశ్న అడిగింది, నా మూడ్ బాగోక ఓ తిక్క జవాబు చెప్పాను. అంతే.. దారి మూసేసింది.

చేసేది ఏముంది? ఇంతకాలం nemalikannu@gmail.com గా ఉన్న నా చిరునామా nemalikannumurali@gmail.com గా మారింది. ఎంతైనా అమ్మ అమ్మే.. గూగులమ్మ అమ్మ అవుతుందా? మనం అలిగినా పట్టించుకుంటుందా??

శుక్రవారం, అక్టోబర్ 07, 2011

రోటి పచ్చడి

మధ్యాహ్నం బడిలోనుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ డబ్బాలో అప్పచ్చులు చిన్న పళ్ళెంలో పెట్టి సిద్ధంగా ఉంచుతుంది కదా. కాళ్ళూ, చేతులూ, ముఖం కడిగేసుకుని, తల దువ్వించేసుకుని, ఆ అప్పచ్చుల పని పట్టగానే ఓ గ్లాసుడు పాలిచ్చేస్తుంది. అవి తాగేసి, బళ్ళో చెప్పిన పాఠాలు కాసేపు చదివేసుకుని, పలక మీద రాయాల్సిన పాఠం ఏవన్నా ఉంటే రాసేసి ఆ పలకని జాగ్రత్తగా ఓమూల పెట్టేస్తే చదువైపోయినట్టే. ఇంక ఆటలకి వెళ్లిపోవచ్చు.

రామాలయం దగ్గరో, కాంగ్రెస్ అరుగు దగ్గరో అప్పటికే ఫ్రెండ్సులంతా వచ్చేసి ఉంటారు కదా.. పంటలేసుకునే లోగా వెళ్ళామంటే సరే. లేకపొతే వాళ్ళ ఆట చూస్తూ కూర్చోవాలి. ఎలాగూ మళ్ళీ నాన్న ఇంటికి వచ్చేలోగానే తిరిగి వచ్చెయ్యాలి కాబట్టి ఎక్కువసేపు ఆడుకోడానికి ఉండదు. గూటీబిళ్లో, ఏడు పెంకులాటో అయితే కనీసం ఒక్క ఆటా అవ్వదు. గుడి మీద మైకులో పాట వినిపించిందంటే ఇంక ఇంటికి వెళ్ళాల్సిందే. అప్పటికి అమ్మ పెరట్లో రోటిదగ్గర ఉంటుంది.

మందార చెట్టుకింద ఉండే ఆ రోలు ఎంత పెద్దదంటే, కడగాలంటేనే ఓ బిందెడు నీళ్ళు పడతాయి. ఆ రోట్లో ముందర పిండి రుబ్బేసుకుని, సుబ్బరంగా కడిగేసి, తుడిచేసి అప్పుడు మొదలు పెడుతుంది అమ్మ పచ్చడి రుబ్బడం. ఎక్కువగా కొబ్బరి పచ్చడి.. తప్పితే కంది పచ్చడో, పెసర పచ్చడో.. ఇంకా ఒక్కోసారి వెలక్కాయ పచ్చడి, వంకాయ రోటి పచ్చడి లాంటివి కూడా చేస్తుందనుకో. కానీ ఒక్క కొబ్బరి పచ్చడినే ఒక్కోరోజు ఒక్కోలా చెయ్యగలదు, రోజూ తిన్నా విసుగు రాకుండా.

రోలుకి ఎదురుకుండా పీటేసుకుని కూర్చున్నామంటే అమ్మ పచ్చడి చెయ్యడం చూడొచ్చు. ఎందుకూ చూడడం? అంటే చూడ్డానికి బాగుంటుంది కాబట్టి. తుడిచిన రోట్లో, ఇంట్లోనుంచి తెచ్చుకున్న వేడి వేడి పోపు దింపి రోకలి బండతో కొంచం దంపి అందులో కొబ్బరి కోరు వేస్తుందా, ఇంకో రెండు దంపులు దంపగానే రుబ్బురోలు పొత్రం జాగ్రత్తగా రోట్లోకి దించుతుంది. మనమేమో రోలు మీద చేతులు వెయ్యకుండా చూడాలన్న మాట. వేస్తే ఇంకేమన్నా ఉందీ, పొత్రం కింద వేళ్ళు కానీ పడ్డాయంటే ఇంక పలక మీద ఏమీ రాయలేం.

ఓ చేత్తో పొత్రం తిప్పుతూ, రెండో చేత్తో పచ్చడి రోట్లోకి తోస్తో భలేగా రుబ్బేస్తుంది అమ్మ. పచ్చడి అన్నంలోకి అయితే ఒకలాగా, ఇడ్డెన్ల లోకి ఇంకోలాగా రుబ్బుతుందా..అదే ఏ గారెల్లోకో అయితే పచ్చడి వేరేగా ఉంటుంది. అసలు అమ్మ రుబ్బే పచ్చడి చూసి అది ఎందులోకో చెప్పేయొచ్చు. శనివారం సాయంత్రం అల్లప్పచ్చడి కానీ రుబ్బుతోందంటే ఆవేళ రాత్రికి ఉప్మా పెసరట్టని అర్ధం. పెసర పచ్చడి బోల్డు బోల్డు రుబ్బుతోందంటే పుణుకులేసి, పులుసెడుతుందని తెలిసిపోయేది. వంకాయ పచ్చడి రాచ్చిప్పలోకి తీస్తోందంటే ఉప్పుడుపిండి తినబోతున్నామని ఇంకెవరూ వేరే చెప్పక్కర్లా.

రోట్లో పిండి రుబ్బుతోన్నా, పచ్చడి రుబ్బుతోన్నా పొత్రం భలేగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఉన్నట్టుండి కర్ర బురుజు ఊడిపోతుందా.. దాంతో రుబ్బడం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఒక్కోసారి ఆ విసురుకి అమ్మ చెయ్యి రోటికి తగిలి ఒహటో రెండో గాజులు చెల్లిపోతాయి కూడాను. బురుజు ఊడిపోయినప్పుడు అమ్మకి మనం బోల్డంత సాయం చెయ్యొచ్చు. పొత్రం పైకి తీసి ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో బురుజు అమరుస్తుందా, మనమేమో రోకలి బండ తీసుకుని ఆ బురుజు మీద చిన్న చిన్న దెబ్బలు జాగ్రత్తగా వేశామంటే అదికాస్తా అమిరిపోతుంది. మనం ఏమరుపాటుగా గానీ ఉన్నామంటే మాత్రం ముందు అమ్మ చేతికి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత మన వీప్పగులుతుంది.

పచ్చడి రుబ్బడం అవుతోందనగా, వంటింట్లోకి పరిగెత్తుకెళ్ళి ఉప్పు రాచ్చిప్పలోనుంచి ఓ గుప్పెడు ఉప్పు గానీ పట్టుకొచ్చామంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో చెప్పలేను. ఆ ఉప్పుని రోలు మీద వేసి, అమ్మ పచ్చట్లోకి కావాల్సింది తీసుకున్నాక ఎక్కువ మిగిలితే మళ్ళీ రాచ్చిప్పలో వేసేయడం.. కాసిన్ని రాళ్ళే అయితే నోట్లో వేసేసుకోవడం. అదికూడా అమ్మకి పచ్చడి రుచి ఎలా ఉందో చెప్పాకే. రుచి కోసం పచ్చడి అరచేతిలో వేయించుకోకూడదు. గుప్పిడు బిగించి చేయి చాపితే మణికట్టుకీ వేళ్లకీ మధ్యలో కొంచం పచ్చడి వేస్తుంది అమ్మ. దాన్ని నాలుకతో అందుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నామంటే రుచి చెప్పేయొచ్చు.

పచ్చడి రుబ్బేటప్పుడు ఊరికే పోచికోలు కబుర్లు కాకుండా (అంటే ఏవిటో తెలీదు.. అమ్మ అలాగే అనేది) రోజూ పద్యాలు నేర్పేది అమ్మ. 'కూజింతం రామ రామేతి...' తో మొదలు పెడితే ఎన్నెన్ని పద్యాలో. విడి పద్యాలు అవ్వగానే అష్టకాలు అందుకుంది. 'వసుదేవ సుతందేవం...' తో మొదలు పెట్టి కృష్ణాష్టకం ఓ వారం రోజులు, అదయ్యాక 'గంగాతరంగ రమణీయ జటా కలాపం...' అంటూ విశ్వనాథాష్టకం మరో వారం.. ఇలా సాగేది చదువు. పచ్చడి రుబ్బుతున్నంత సేపూ ముందటి పద్యం అప్పగించడం, కొత్త పద్యం నేర్చుకోవడం.. ఇదంతా కూడా రుబ్బడాన్ని రెప్ప వెయ్యకుండా చూస్తూనే.

చూస్తుండగానే అన్నిచోట్లా వచ్చి పడిపోయిన మార్పు వంటగదిలోకీ చొచ్చుకుని వచ్చేసింది. అమ్మ స్థానంలో ఆలి ప్రవేశించింది. రోటి గలగలల స్థానాన్ని మిక్సీ గురుగుర్రులు ఆక్రమించేశాయి. నాలుగు ఆవాలు పొడి కొట్టాలన్నా, రెండు మిరపకాయలు నలపాలన్నా కూడా మిక్సీనే శరణ్యం ఇప్పుడు. "ఏవి తల్లీ నిరుడు రుబ్బిన రోటి పచ్చళ్ళు.." అని మూగగా పాడుకుంటూ కాలం గడుపుతుండగా, ఊహించని విధంగా మూలపడ్డ రోటికి పూర్వ వైభవం వచ్చేసింది. కరెంటు కోత పుణ్యమాని మిక్సీ మూగబోవడంతో అన్నపూర్ణ లాంటి రుబ్బురోలు రుచికరమైన పచ్చళ్ళని అందిస్తోందిప్పుడు. 'మరక మంచిదే' అని ఊరికే అన్నారా డిటర్జంట్ కంపెనీ వాళ్ళు?

సోమవారం, సెప్టెంబర్ 05, 2011

గురుదక్షిణ

నా హైస్కూలు చదువు ఐదేళ్లలోనూ ముగ్గురు హెడ్మాస్టర్లు మారారు మాకు. ముగ్గురిలోనూ నాకు బాగా నచ్చినవారూ, ఇప్పటికీ తరచూ గుర్తు చేసుకునే వారూ శ్రీరామ్మూర్తి గారు. స్పురద్రూపం..పచ్చని పసిమిచాయ...మడత నలగని ఇస్త్రీ దుస్తుల్లో ఠీవిగా ఉండడమే కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు కూడా. ఆయన మా స్కూలికి రానిక్రితం వరకూ మాకు హెడ్మాస్టర్ అంటే సింహస్వప్నం. మేం ఆయన రూముకి వెళ్ళాల్సి వచ్చినా, ఆయన మా క్లాసుకి వచ్చినా గడగడా వణికే వాళ్ళం.

కానీ, శ్రీరామ్మూర్తి మేష్టారు మిగిలిన వాళ్ళలా కాదు. ఏ క్లాసుకి మేష్టారు లేకపోయినా, ఆయన ఆక్లాసుకి వెళ్ళిపోయి పిల్లలందరితోనూ మాట్లాడుతూ ఏదో ఒక పాఠం చెప్పేవాళ్ళు. ఈయనకి ముందు హెడ్మాస్టర్లతో మాట్లాడే అవకాశం కేవలం క్లాసు లీడర్లకి మాత్రమే ఉండేది. కానీ ఈయనొచ్చాక పద్ధతులు మారిపోయాయి. స్కూల్లో అందరూ ఆయనతో నేరుగా మాట్లాడొచ్చు. ఇబ్బందులేవన్నా ఉంటే చెప్పుకోవచ్చు. ఆయన ప్రసన్నవదనంతో చివరికంటా విని, అంత పెద్ద సమస్యనీ చిటికెలో పరిష్కరించేసే వాళ్ళు. పుస్తకాలు కొనడానికీ, ఫీజు కట్టడానికీ టైమిమ్మని అడిగేవాళ్ళు చాలామంది పిల్లలు.

రోజూ జరిగే స్కూల్ అసెంబ్లీలో కూడా చాలా మార్పులు చేశారు శ్రీరామ్మూర్తి గారు. ప్రతిజ్ఞ కేవలం తెలుగులోనే కాకుండా ఇంగ్లిష్, హిందీల్లోనూ చెప్పాలనీ, ప్రతిరోజూ వార్తలు చదవాలనీ, ఒక సూక్తి చెప్పాలనీ ఇంకా అసెంబ్లీ చివర్లో హెడ్మాస్టర్ ప్రసంగం... ఇలా ఆయన చేసిన మార్పుల పుణ్యమా అని పక్కూళ్ళ నుంచి వెళ్ళే మాలాంటి పిల్లలందరం అసెంబ్లీ టైముకే బళ్ళో ఉండేలా ముందుగానే బయల్దేరేసేవాళ్ళం. పక్క స్కూళ్ళలో పోటీలు జరుగుతుంటే మమ్మల్ని ప్రోత్సహించి పంపడం, మేష్టర్లెవరికన్నా బదిలీ అయినా, రిటైర్ అయినా తప్పకుండా ఫేర్వెల్ ఏర్పాటు చేయడం...ఇవన్నీ ఆయన చేసిన ఏర్పాట్లే.

ఎప్పటిలాగే ఆవేళ ఉదయం కూడా స్కూల్లో హడావిడిగా ఉంది. అసెంబ్లీకి ఇంకా టైం ఉండడంతో డ్రిల్లు మేష్టారు పిల్లలందరిచేతా గ్రౌండ్ లో ఉన్న చెత్త కాగితాలు ఏరిస్తున్నారు. నేను ఎస్పీఎల్ అవ్వడంతో, ఆఫీసు రూముదగ్గర ఓపక్క పేపరు చూసి వార్తలు రాసుకుంటూ, మరో పక్క ప్రతిజ్ఞ ఎవరు ఏభాషలో చెప్పాలో, సూక్తి చెప్పాల్సింది ఏ క్లాసు వాళ్ళో చూసుకుంటున్నాను. గుమస్తాగారేదో కబురు తేవడంతో ఉన్నట్టుండి స్టాఫ్ రూములో వాతావరణం మారిపోయింది. సోషలు మేష్టారొచ్చి "ఇవాల్టికి ఇవేమీ వద్దమ్మా" అన్నారు. అర్ధం కాలేదు నాకు.

పిల్లలందరూ అసెంబ్లీకి వచ్చి నిలబడగానే సోషలు మేష్టారు చెప్పారు. "ఇవాళ మన స్కూలుకి ప్రత్యేకంగా సెలవు ప్రకటిస్తున్నాం. మన హెడ్మాస్టరు గారి అబ్బాయి చనిపోయాడు. మీరంతా అల్లరి చెయ్యకుండా పుస్తకాలు తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపొండి.." పిల్లలెవరికీ కూడా సెలవొచ్చిందన్న సంతోషం ఏకోశానా లేదు. నేను స్టాఫ్ రూము దగ్గరే ఆగిపోయాను. అక్కడ తెలిసిన విషయాలు ఏమిటంటే, మా హెడ్మాస్టరు గారికి ఒక్కడే కొడుకు. డాక్టర్ కోర్సు చదువుతున్నాడు. ఎందుకో తెలీదు కానీ ఉరిపోసుకుని చనిపోయాడు. మా హెడ్మాష్టారు గుర్తొచ్చి చాలా బాధనిపించింది. అప్పటివరకూ ఒక్కసారి కూడా చూడకపోయినా సరే వాళ్ళబ్బాయి మీద చాలా కోపం వచ్చింది.

ఇంచుమించు ఓ నెల్లాళ్ళ తర్వాత మా హెడ్మాస్టరు మళ్ళీ స్కూలుకి వచ్చారు. ఎప్పటిలాగే అసెంబ్లీ ఏర్పాట్లలో ఉన్నాను.. ఒక్కసారిగా ఆయన్ని చూసేసరికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. మనిషి బాగా చిక్కిపోయారు. పెద్ద జ్వరం వచ్చి తగ్గినట్టుగా నీరసం తెలుస్తోంది. ఆయన ముఖంలో నవ్వన్నదే కనిపించలేదు. "ఒకవేళ నేను చచ్చిపోతే నాన్నకూడా ఇలాగే అయిపోతారా?" ఆలోచనకే ఉలిక్కి పడ్డాను నేను. మాస్టార్లందరూ ఆయన్ని పలకరిస్తున్నారు. పిల్లలు దూరం నుంచే చూస్తున్నారాయన్ని. అసెంబ్లీ మొదలయ్యింది. అయన వచ్చి నిలబడ్డారు. ప్రధానోపాధ్యాయుడి ప్రసంగం అని ఎస్పీఎల్ ప్రకటించాలి. ఆయన మాట్లాడతారో, లేదో.. సోషల్ మేష్టారి వైపు చూశాను నేను. మాట్లాడతారని సైగ చేశారాయన.

"మీకందరికే తెలిసే ఉంటుంది... నేను ఉద్యోగం మానేద్దామా అనుకున్నాను... చెయ్యాలని కూడా అనిపించలేదు.. కానీ మీ అందర్లోనూ వాణ్ణి చూసుకోవచ్చు అన్నారు మన మేష్టార్లు...నాకూ నిజమే అనిపించింది. ఈ వయసులో ఇంత కష్టం తట్టుకుని నేను నిలబడగలిగానంటే ఒకటే కారణం. పుస్తకాలు చదవడం. చిన్నప్పటి నుంచీ కనిపించిన పుస్తకమల్లా చదివాను నేను. ఉద్యోగం వచ్చినప్పటినుంచీ ప్రతి నెలా జీతం రాగానే ముందు కొనేది పుస్తకాలే. మా ఇంట్లో ఐదారు బీరువాల పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవన్నీ ఒకళ్ళు చెప్పడం కన్నా, ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం బాగుంటుంది. మీరు పెద్దై ఉద్యోగాల్లో చేరాక, మీ సంపాదనలో కనీసం పది శాతం అంటే నూటికి పది రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టండి. ఇది మాత్రం మర్చిపోకండి..."

మాలో చాలామందికి పుస్తకాలంటే గౌరవం పెరిగింది. అవే లేకపొతే మా హెడ్మాస్టారు మళ్ళీ కనిపించే వారు కాదేమో అన్న ఆలోచనే కారణం. అప్పటికే అమ్మ పుణ్యమా అని పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన నాకు, ఆయన మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి. పెద్దయ్యాక తప్పకుండా మేష్టారు చెప్పినట్టుగా పుస్తకాలు కొనుక్కోవల్సిందే అని నాలో నేనే గట్టి నిర్ణయం తీసేసుకున్నాను. కా..నీ.. ఇవాల్టి రోజున వెనక్కి తిరిగి మేష్టారి మాటలు జ్ఞాపకం చేసుకుంటే సిగ్గు కలుగుతోంది. ఆయన చెప్పిన పది శాతం కాదు, కనీసం అందులో పదో వంతైన ఒక్క శాతం కూడా పుస్తకాల మీద వెచ్చించడం లేదు నేను. "ఇలా చేస్తున్నావేమిటి?" అని ఆయన నన్ను ప్రేమగా మందలిస్తున్నట్టుగా అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. (ఈ టపా రాయడానికి పరోక్ష కారణమైన బ్లాగ్మిత్రులు వేణూశ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు)

ఆదివారం, ఆగస్టు 28, 2011

కూర్మావతారం

చూడ్డానికే గట్టిగా అనిపిస్తూ, మిలమిలా మెరిసే రక్షణ కవచం, అందులోనుంచి అప్పుడప్పుడూ బయటికి కనిపించే నాలుగు బుల్లి బుల్లి కాళ్ళూ మరియూ వాటి కన్నా కూసింత పెద్దదైన తల. నీళ్ళలో ఈదుతున్నా, నేలపై నడుస్తున్నా రెప్పవెయ్యకుండా చూడాల్సిందే ఆ జీవిని. అదే తాబేలు. మెట్ట తాబేలు కథ చెప్పేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు నీటి తాబేళ్ల గురించి. అమ్మమ్మా వాళ్ళ పెరట్లో ఉండే నిండా నాచు పట్టిన, సగానికి పైగా వరలూడిపోయిన పేద్ద దిగుడు బావిలో సర్వకాల సర్వావస్తల్లోనూ డజనుకి తక్కువ కాకుండా దర్శనమిచ్చేవి నీటి తాబేళ్లు. వీటి పుణ్యమాని సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే, మధ్యాహ్నాలు తోచకపోవడం అనే సమస్య ఉండేదే కాదు.

నూతికి ఓ పక్క పెద్ద పెద్ద నేరేడు, వేప చెట్లు ఉండేవి. వాటుకి వేప చెట్టుకి కూసింత చరిత్ర ఉంది. ఇక, నేరేడు చెట్టయితే మేం అడక్కుండానే పళ్ళు రాల్చేసేది. నల్లగా నిగనిగలాడుతూ, అక్కడక్కడా చిన్న చిన్న గుంటలతో చూడగానే నోరూరేలా ఉండేవి నేరేడు పళ్ళు. నేరేడు చెట్టుకి వెనగ్గా కొంచం దూరంలో ఓ మడుగు ఉండేది. ఆ మడుగులో తామర మొగ్గలు ఉండేవి. అయితే ఆ మడుగు దొంగూబి. పొరపాటున ఎవరన్నా దిగారంటే పైకి రావడం కష్టం. ఇటు చూస్తే దిగుడు బావికి వరల్లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతారన్న భయం ఉండేది పెద్ద వాళ్లకి.

దాంతో మేం పెరట్లో ఆడుతున్నామంటే, హమేషా ఎవరో ఒకళ్ళు మాకు కాపలా ఉండాల్సిందే. ఎంత వేసంకాలం మధ్యాహ్నమైనా నూతి దగ్గర మహా చల్లగా ఉండేది. పిల్లలే కాదు, పెద్దాళ్ళు కూడా అక్కడకి చేరిపోయేవాళ్ళు. పెద్దాళ్ళు వాళ్ళ కబుర్లలో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ, పిల్లలకి అలా కుదరదు కదా. ఎప్పటికప్పుడు కొత్త ఆటలు కనిపెడుతూ ఉండాలి. ఘటోత్కచుడు చెప్పినట్టు ఎవరూ కనిపెట్టకపోతే ఆటలెలా వస్తాయి? (అంటే అచ్చంగా ఇలాగే చెప్పలేదు కానీ, ఈమాత్రం అన్వయించుకోకపోతే ఇంక 'మాయాబజార్' చూడడం ఎందుకూ, దండగ). మేం అనగా, నాతో కలిపి ఓ అరడజనుమంది పిల్లలం ఎప్పుడూ అలా కొత్త ఆటలు కనిపెట్టే పనిలో ఉండేవాళ్ళం.

అలా ఓ మధ్యాహ్నం మేం కనిపెట్టిన ఆటని చాలా రోజులే ఆడుకున్నాం. అసలు నూతి దగ్గరకి వెళ్ళగానే ముందర నేరేడు పళ్ళు ఏరేసుకుంటాం కదా. ఆ నూతి నీళ్ళు ఉప్పగా తాగడానికి పనికి రాకపోయినా, ఇళ్ళలో వాడుకోడానికి ఎవరో ఒకళ్ళు వచ్చి పట్టికెడుతూనే ఉంటారు. అలా పట్టికెళ్ళే వాళ్ళు ఓ చేదడు నీళ్ళు అక్కడ పెట్టి వెళ్ళాలి. అది రూలు. ఏరి తెచ్చుకున్న నేరేడు పళ్ళని ఆ చేదలో వేసేసి బాగా కడిగేస్తామా, ఇప్పుడాపక్కనే చూడ్డానికి పనసాకుల్లా ఇంకొంచం పెద్దగానూ, పల్చగానూ ఉండే ఆకులు కోసుకుని శంఖంలా చుట్టేసి కడిగిన పళ్ళని అందులో వేసేసుకోవడం.

ఒక్కొక్కళ్ళం ఒక్కో పండు తీసుకుని తినడం. గింజ తీసి చేదలో కడగడం -- ఈ కడగడం ఎందుకంటే నూతిలో ఎంగిళ్ళు వెయ్యకూడదు కదా అందుకు -- దానిని సూటిగా చూస్తూ నూతిలో ఉన్న తాబేళ్ళలో మిగిలిన ఫ్రెండ్సులు చూపించినదానికి కొట్టడం. మనం నెగ్గామనుకో, ఇంకో పండు తిని, మళ్ళీ తాబేలుని కొట్టొచ్చు. ఓడిపోతే మన తర్వాత వాళ్లకి వెళ్తుంది ఆట. తాబేళ్లు ఎంతంత ఉంటాయంటే, మన దోసిలి మొదలు, అమ్మ దోసిలి, ఇంకా అమ్మదీ పిన్నిదీ కలిపితే ఎంత దోసిలవుతుందో అంతంత పెద్దవికూడా ఉంటాయి నూతిలో.

మనకి పెద్ద తాబేలు వస్తే సుళువుగానే నెగ్గేస్తాం కానీ, చిన్న తాబేలు కానీ వచ్చిందా, ఇంక అంతే. ఎందుకంటే, చిన్న చిన్న తాబేళ్లు చకచకా కదిలిపోతాయి, నూతిలో. ఒక్కోసారి వాటిల్లో అవి ఆడుకుంటూ పెద్ద తాబేళ్ల కిందకి కూడా వెళ్ళిపోతాయి. అప్పుడేమో మనం కొట్టే నేరేడు గింజ చిన్న తాబేలుకి కాకుండా, పెద్ద తాబేలుకి తగిలి మనం ఓడిపోతాం. చెట్టు మీద నుంచి నేరేడు పళ్ళు ఎప్పుడూ రాలుతూనే ఉంటాయి కాబట్టి, పళ్ళు అయిపోడం అనే సమస్యే ఉండదు. పైగా ఉప్పు నీళ్ళలో కడిగితే బోల్డంత రుచి వస్తుంది కూడాను.

అసలీ పెద్దోల్లున్నారే.. (!!) వీళ్ళు పిల్లల్ని వాళ్ళ పాటికి వాళ్ళని ఆడుకోనివ్వరు. పైగా ఏం ఆడుకున్నా అందులో తప్పులే కనిపిస్తాయి కూడాను. మేమందరం బుద్ధిగా తాబేళ్ళని కొట్టే ఆట ఆడుకుంటున్నామా? ఎలా గమనించిందో కానీ, ఓరోజు పిన్ని గమనించేసింది. ఇంకేవుందీ? "తాబేలంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారం. అలా కొట్టకూడదూ, దండం పెట్టుకోవాలీ" అంటూ పాఠం చెప్పేసింది. పైగా, అంతగా అయితే ఆరబోసిన పిండిల దగ్గరకి వచ్చేస్తున్న కాకుల్ని కొట్టే ఆట ఆడుకోండీ అంటూ సలహాలు. తాబేళ్ళయితే దొరుకుతాయి కానీ, కాకులు మన దెబ్బకి దొరుకుతాయా? ఏంటో, పిన్నికి ఈ చిన్న విషయం కూడా తెలీదు. ఏం చేస్తాం మరి.. తాబేళ్ళకి దండం పెట్టుకుంటూ కొత్త ఆటలు ఆలోచించుకున్నాం.

ఆదివారం, ఆగస్టు 21, 2011

చద్దన్నం

నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు అప్పటివరకూ మేం ఉన్న ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టించారు తాతయ్య. పాతింట్లో ఉండి, కొత్తింట్లో లేని అనేక సౌకర్యాలలో 'చద్దన్నాల గది' ఒకటి. కొత్త ఇల్లు పూర్తవ్వడం, నేను మేతపట్టడం రెండూ ఇంచుమించు ఒకేసారి జరిగాయి. "పాతింట్లో అయితే చక్కగా చద్దన్నాల గదిలో పిల్లల్ని వరసాగ్గా కూర్చోపెట్టి చద్దన్నాలు పెట్టేసేవాళ్ళం. ఇక్కడ అన్నిగదులూ ఒకటే.. చెప్పినా వింటారా," రోజూ చద్దన్నం పెట్టేటప్పుడు మర్చిపోకుండా తల్చుకుని, ఎదురుగా లేకపోయినా సరే, తాతయ్యని ఆడిపోసుకునేది బామ్మ.

అసలు చద్దన్నం తినడం ఒక కళ. వేడన్నం కన్నా కొంచం బిరుసుగా ఉండే ఈ చద్దన్నాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పెరుగులో కలపాలి. ఈ కలపడంలో పెరుగు మీగడ వేళ్ళకి అంటుకుని వెన్నగా మారుతుంది. ముందుగా ఆ వెన్న పని పడితే, ఈలోగా పెరుగులో నానిన అన్నం తినడానికి అనువుగా ఉంటుంది. అందులోకి ఏ మాగాయ టెంకో, ఆవకాయ పెచ్చో నంజుకుని తాపీగా తింటూ ఉంటే, చివరి ముద్దకి వచ్చేసరికి ఆవులింత వచ్చి, కళ్ళు మూతలు పడాలి. అయినా బడికెళ్లడం తప్పదనుకో.

చద్దన్నాన్ని పెరుగుతో తింటే భలే బాగుంటుంది కానీ, ఒక్కోసారి ఇంట్లో పెరుగు తక్కువగా ఉంటుంది. అంటే ఒక్కోసారి కొమ్ముల గేది పాలివ్వకుండా కొమ్ము విసురుతుంది చూడూ, అలాంటప్పుడన్న మాట. అప్పుడేమో బామ్మ, పెరుగులేదని చెప్పకుండా, "రాచ్చిప్పలో ముక్కల పులుసు మరుగుతోంది. నీకిష్టమని గుమ్మడి ముక్కలు ఎక్కువేశాను కూడానూ.. ఈపూటకి వేడివేడిగా పులుసోసుకుని తినేసెళ్ళు బాబూ" అని ప్రేమగా చెబుతుందన్నమాట. అప్పటికలా బామ్మ మాట వినేస్తే, మధ్యాహ్నం అన్నంలోకి పెరుగేసి పెడుతుంది.

కాదని "ఇప్పుడే పెరుక్కావాలీ" అని గొడవ చేస్తే మాత్రం, వీపు విమానం మోత మోగిపోతుంది. అందుకని గప్ చుప్ గా పులుసూ అన్నం తినేయడమే. రాత్తిళ్ళు చెప్పాపెట్టకుండా ఎవరన్నా చుట్టాలొచ్చారనుకో. ఆ మర్నాడు అసలు చద్దన్నవే ఉండదు. మరి, రాత్రప్పుడు అప్పటికప్పుడు వంట చేయడం కుదరదు కదా. అందుకని చద్దన్నం కోసం ఉంచిన అన్నాన్ని వాళ్లకి పెట్టేస్తారన్న మాట. పెరుగు లేకపొతే పులుసూ అన్నమైనా తినొచ్చు కానీ, అసలు చద్దన్నవే లేకపొతే బళ్ళో మేష్టారు ఏం చెప్పినా ఒక్క ముక్కా అర్ధమవ్వదు.

మామూలు భోజనం కంచంలో తింటామా? అదే చద్దన్నానికైతే మాత్రం గిన్ని ఉంటుంది. ఆ గిన్నిలో కలుపుకుని తినేయడమే. ఒక్కోసారి అమ్మే కలిపిచ్చేస్తుందనుకో. శీతాకాలంలో గడ్డ పెరుగు భలేగా ఉంటుంది కానీ, వేసంకాలం వచ్చేసరికి కొంచం పులుపు తగులుతుంది. ఉప్పేసుకున్నా బాగోదు. అందుకని అమ్మో ఉపాయం చేసింది. వేసంకాలంలో ముందురోజు రాత్రే మిగిలిన అన్నంలో పాలుపోసి, తోడు పెట్టేయడం. అస్సలు పులుపు లేకుండా కమ్మగా ఉంటుంది. అందులో కూడా మామూలుగానే మాగాయో, మరోటో నంజుకోవచ్చు. అభ్యంతరం ఉండదు.

ఓసారి వేసంకాలానికి బామ్మ ఊరెళ్ళింది. అప్పుడు మా ఇంటికొచ్చిన ఓ చుట్టాలావిడ వాళ్ళింట్లో పిల్లలకి చద్దన్నం కన్నా తరవాణీ ఎక్కువిష్టమని చెప్పింది. నాకు తరవాణీ అంటే ఏంటో అర్ధం కాలేదు. ఆవిణ్ణి అడగబోతోంటే అమ్మ "నే చెబుతాలే" అనేసింది. ఆవిడ వెళ్ళిపోయాక, చద్దన్నాన్నే కుండలో వేసి, గంజీ ఉప్పూ వేసి ఊరబెట్టి తరవాణీ చేస్తారని చెప్పగానే, "మనవూ చేసుకుందావమ్మా" అని టక్కున అడిగేశాను, అమ్మకి నేను ముద్దొచ్చి ఉంటాననుకుని. అబ్బే ఒప్పుకోలా. ఏవిటేవిటో చెప్పి చివరికి తరవాణీ కన్నా చద్దన్నవే మంచిదని తేల్చేసింది.

వేసంకాలం చద్దన్నాల స్పెషలు మావిడిపళ్ళు. పళ్ళు ఎక్కడ ముగ్గేస్తారో తెలుసు కదా.. మనవే కావలసినవి ఏరుకుని తెచ్చుకోడం, చద్దన్నంతో పాటు తినేయడం. ఇంక, అమ్మ నోరు నొప్పెట్టేలా పిల్చే వరకూ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేం. ఆకలనిపించదు కదా. మిగిలిన రోజుల్లో చక్రకేళి అరిటిపళ్ళూ అవీ ఉంటాయి కానీ, మావిడిపండు రుచి దేనికీ రాదు మరి. అందులోనూ చద్దన్నంతో అయితే ఒకటి తిందామనుకుని రెండు తినేస్తాం. పైగా ఇంట్లో వాళ్ళు కూడా, "ఇప్పుడు కాకపొతే, ఇంకో నెలపోయాకా తిందావన్నా దొరకవూ" అంజెప్పేసి, తినగలిగినన్ని తినెయ్యమంటారు.

చద్దన్నాలు తినే పిల్లలందరిలోనూ శ్రీకృష్ణుడు ఉంటాడని బామ్మ చెప్పింది. కృష్ణుడికి కూడా చద్దన్నం అంటే బోల్డంత ఇష్టంట. "మీగడ పెరుగుతో మేళవించిన చలిది" అని పద్యం కూడా నేర్పేసింది అమ్మ. ఇప్పుడు చద్దన్నం తినడం మర్చిపోయినట్టే, ఆ పద్యమూ మర్చిపోయాను. కృష్ణుడి విషయంలో మాత్రం, "పోతన ఎంత గొప్ప రచయితో కదా.. ఉత్తరాది కృష్ణుడిని దక్షిణాదికి తేవడంలో మీగడ పెరుగులు తినిపించి మరీ తెలుగు నేటివిటీకి తీసుకొచ్చేశాడు" అంటూ చాన్నాళ్ళ క్రితం ఓ మిత్రుడు చెప్పిన మాటలు చద్దన్నాన్ని తలచుకున్నప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

మంగళవారం, ఆగస్టు 02, 2011

మెలిక 'శ'

"ఏరా బాబూ.. మెలిక శ కీ, కుంటి స కీ తేడా తెలియకపోతే ఎలాగరా నీకూ?" చెవి మెలేస్తూ తాతయ్య అడిగిన ప్రశ్న ఇది. నా బాలశిక్ష చదువు సాగుతున్న రోజులు. తాతయ్య ప్రశ్న నోటితో అడుగుతారు. జవాబు నేను పలక మీద రాయాలి. "శ్రీరాముడి భార్య పేరు ఏమిటి?" నేను 'శీత' అని రాశాను, హుషారుగా. "వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది?" తెలిసిన ప్రశ్నే కావడంతో నాలో హుషారు ద్విగుణీకృతం అయ్యింది. 'సీతాకాలం' అని రాసేశా. నేను రాసిన పది జవాబుల్లోనూ ఈ రెండే తప్పులు.

అదిగో అప్పుడు విన్నాను ఈ మెలిక శ, కుంటి స గురించి. 'మెలిక శ' అనే మాట వినగానే భలేగా నచ్చేసింది. ఎందుకో కానీ, 'కుంటి స' అస్సలు నచ్చలేదు. 'కుంటేమిటీ?' అనుకున్నాను కానీ, పైకనలేదు. మొత్తానికి ఈరెండు అక్షరాలతో వచ్చే పదాలు మళ్ళీ మళ్ళీ రాయించీ రాయించీ ఏ అక్షరం ఎక్కడ వాడాలో బాగా అర్ధమయ్యేలా చేసేశారు తాతయ్య. ఎంత గట్టి పునాది అంటే, ఇంక మళ్ళీ వెనక్కి తిరిగే పని లేకపోయింది దాదాపుగా.

చాలామంది పిల్లలు హైస్కూలుకి వచ్చేసినా ఈ 'శ' 'స' లతో కుస్తీలు పడుతూనే ఉంటారన్న సంగతి నేను హైస్కూల్లో ప్రవేశిస్తేనే కానీ తెలియలేదు. అక్కడ మా మేష్టారు మెలిక, కుంటి అనకుండా 'సీత స' 'శకుంతల శ' అని చెప్పారు. ఇదేదో చాలా బాగుందనిపించింది నాకు. చక్కగా సీతనీ, శకుంతలనీ గుర్తు పెట్టుకుంటే చాలు. పైగా అవేమీ మరిచిపోగలిగే పేర్లు కాదు, రామాయణం, శాకుంతలం అప్పటికే చాలాసార్లు విని ఉండడం వల్ల.

కాకపొతే ఒక కొత్త సమస్య వచ్చింది. కొందరు మేష్టర్లు మెలిక శ - అదే శకుంతల శ - ని 'ష' అని పలికేవాళ్ళు. ఉదాహరణకి, శాంతి ని షాంతి అని. (మొన్నామధ్య జానారెడ్డి హోం మంత్రిగా ఉండగా ఆయన ఒక్కసారి కూడా శాంతిభద్రతలు అనలేదు, ఎప్పుడూ షాంతిభద్రతలే! ఉచ్చారణ దోషాల గురించి యధాశక్తి ఉపన్యసించే ఎస్పీ బాలూ కూడా చాలాసార్లు శ,ష ల భేదం పాటించకపోవడం విషాదం) ఇలాంటి గండాలన్నీ దాటుకుని కొంచం పెద్ద క్లాసుల్లోకి వెళ్లి నోట్సులు విస్తారంగా రాయడం మొదలు పెట్టాక కొన్ని కొన్ని అక్షరాలు బాగా అందంగా కనిపించడం మొదలు పెట్టాయి.

అప్పటికే ఖాళీ ఉన్నప్పుడల్లా కాసిని గీతలు గీసి, వాటికి బొమ్మలని పేరు పెట్టుకుని ఆనందించే అలవాటు ఉండడం వల్ల, కొన్నిఅక్షరాలని చూస్తుంటే బొమ్మలే జ్ఞాపకం వచ్చేవి. కొన్నాళ్ళకి నాకు తెలిసిందేమిటంటే, శకుంతల శ తో సహా మెలికలున్న అక్షరాలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం అని. చాలామంది త రాయాలంటే, ల రాసి పైన కొమ్మిచ్చి, మళ్ళీ వచ్చి పొట్టలో సున్నా పెడతారు. నేనేమో సున్నాతో మొదలుపెట్టి, రెండో సున్నా అలవోకగా చుట్టేసి, తలకట్టు పెట్టేసే వాడిని.

రాయగా రాయగా, పొట్టలో పెట్టే సున్నాని సన్నగా చేసేయడం అలవడింది. ఇలాగే మరి కొన్ని అక్షరాలు రాయడంలో కూడా కాసిన్ని సుళువులు పట్టుబడడంతో మేష్టారు నోట్సు చెప్పేటప్పుడు అదే వాక్యాన్ని రెండోసారి చెప్పేవరకూ ఆగకుండా, మొదటిసారే రాయడం పూర్తి చేసేసేవాడిని. కొందరు మిత్రులకి ఇది చాలా ఆశ్చర్యం కలిగించి, ఖాళీ పీరియడ్లో నాకు రాత పరీక్ష పెట్టి, సదరు సుళువులు నేర్చుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు. తలకట్లు పెద్దవిగా ఇవ్వడం, అక్షరాలు వాల్చి రాయడం, పెన్ను నొక్కి పట్టి రాయడం, తేలిక చేసి రాయడం.. అబ్బో ఎన్ని ప్రయోగాలో.

కాలేజీలో కూడా ఈ శ, స లు వదలలేదు. ఓసారి అనుకోకుండా, ఒక మిత్రుడి నోట్సు చూసి, ఈ శ, స లని సరిచేయడం కోసం "ఇక్కడ సీత స కాదు, శకుంతల శ ఉండాలి" అన్నాను. సంభాషణ భాష గురించి కాక, కాలేజీలో సీత గురించీ, శకుంతల గురించీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాలా? మెలికలున్న అక్షరాల మీద నా ఇష్టం మాత్రం కొనసాగింది. అ, ల, త లాంటి అక్షరాలని సున్నాతోనే మొదలు పెట్టక్కర్లేదని కనిపెట్టా. ఇప్పుడిప్పుడు సంతకం చేయడం తప్ప, కాగితం మీద రాసే పని ఉండడం లేదు. అందులోనూ తెలుగు రాసే పని అసలే లేదు. నా చేతిరాత ఎలా ఉందో ఏమిటో...

సోమవారం, జులై 25, 2011

బొమ్మ రేడియో

"వచ్చే వారం మన బడికి ఇన్స్పెక్టర్ గారు వస్తారు. మీ ఇళ్ళలో ఉండే బొమ్మలేవన్నా పట్టుకురండి. ఇన్స్పెక్షన్ అయిపోయాక, మళ్ళీ పట్టుకెళ్ళి పోదురుగాని," అని బళ్ళో మేష్టారు చెప్పేశారోరోజు. అందరూ ఇన్స్పెక్టర్ గారు వచ్చే విషయం ఇళ్ళలో చెప్పి, ఎవరేం బొమ్మలు తెస్తారో మర్నాడు తనకి చెప్పాలన్నారు. అందరూ ఒకేలాంటి బొమ్మలు తేకూడదు కదా మరి, అందుకన్న మాట. చందనం బొమ్మలు, రబ్బరు బొమ్మలు, కత్తి బొమ్మా, కారు బొమ్మా.. ఇలా ఎవరింట్లో ఉన్న బొమ్మల గురించి వాళ్ళం చెప్పుకుంటూ ఇళ్ళు చేరుకున్నాం.

నేను ఏ బొమ్మ పట్టుకెడితే బాగుంటుందా అని దారిపొడుగునా ఆలోచించాను కానీ, ఇంట్లో ఉన్న ఏ బొమ్మా నాకే నచ్చలేదు. అదీకాక, మంచి బొమ్మ బళ్ళో ఇచ్చేస్తే అది మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో అని అనుమానం ఒకటి. సరే, ఇంటికి వెళ్ళగానే పాలైనా తాక్కుండానే మేష్టారు చెప్పిన సంగతి అమ్మ చెవిన వేశాను. అచ్చం అమ్మకి కూడా నాకొచ్చిన అనుమానమే వచ్చింది, ఇంట్లో బొమ్మలు పట్టుకెడితే మళ్ళీ తిరిగి వస్తాయో, రావో, ఒక వేళ వచ్చినా ఏమీ పాడవ్వకుండా ఉంటాయో లేదో అని. అటు చూస్తే, ఉత్తి చేతులతో వెళ్తే మేష్టారు ఊరుకోరు కదా.

"ఇంట్లో ఉన్న బొమ్మ ఎందుకూ.. మనం రేడియో బొమ్మ చేద్దాం. అదైతే మళ్ళీ ఇంటికి తేవక్కర్లేదు. బళ్లోనే ఉంచెయ్యొచ్చు," అంది అమ్మ. రేడియో బొమ్మ ఎలా చేయాలో, అది ఎలా వస్తుందో బోల్డన్ని సందేహాలు నాకు. కానైతే, నా ఆట బొమ్మల్లో ఏదీ కూడా మేష్టారికి ఇవ్వక్కర్లేక పోవడం బాగా నచ్చింది. మర్నాడు బళ్ళో పిల్లలందరూ ఎవరెవరు ఏయే బొమ్మలు తెస్తారో చెబుతుంటే, నేను లేచి "మా అమ్మగారు రేడియో బొమ్మ చేసి ఇస్తానన్నారండీ.. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోయాక కూడా బళ్లోనే ఉంచెయ్యొచ్చు అన్నారు," అని చెప్పేశాను, చేతులు కట్టుకుని.

మేష్టారు ఏమీ అనలేదు కానీ, అవుట్ బెల్లులో నా ఫ్రెండ్సులందరూ చుట్టూ చేరి ఒకటే అడగడం, రేడియో బొమ్మ ఎలా చేస్తారని. నాకు మాత్రం తెలిస్తే కదా. కొందరేమో వాళ్లకి తోచినట్టు ఊహించేసుకున్నారు. మట్టితో బొంగరాలు, కారుబొమ్మా అవీ చేసినట్టే రేడియో కూడా చేసేస్తారని. నేను అవుననీ, కాదనీ చెప్పలేదు. బళ్లోకి తేకముందే, వాళ్ళని ఇంటికి పిలిచి చూపించేస్తానని మాత్రం చెప్పాను. ఆవేళ సాయంత్రం బడినుంచి ఇంటికి వెళ్లేసరికి, రేడియోకి కావాల్సిన సరంజామా సిద్ధంగా పెట్టేసింది అమ్మ. అవి చూసి నేను నోరు తెరిచేశాను.

ఎక్కడినుంచి సంపాదించిందో కానీ ఓ పెద్ద అట్ట పెట్టి, పాత స్కేలు, ఎలకలు కొరికేసిన జల్లెడ, కొన్ని సీసా మూతలు. "వీటితో రేడియో ఎలా చేస్తాం అమ్మా?" అని అడిగాను, గూట్లో ఉన్న పెద్ద రేడియోని చూస్తూ. "చూస్తూ ఉండు, నేను చేసేస్తాను కదా" అంది అమ్మ. అట్ట పెట్టికి రంగు కాగితం అంటించేసిందా.. సీసా మూతలనేమో నాబుల్లా అతికేసింది. స్కేలేమో, స్టేషన్లు చూసుకోడానికన్న మాట. జల్లెడని మిషన్ కత్తెరతో కత్తిరించి, అరిచేయంత గుండ్రటి ముక్క చేసింది. దానిని స్కేలు కింద అతికించి, రంగు పెన్సిళ్ళతో రంగులేసేసరికి మా బొమ్మ రేడియో అచ్చం నిజం రేడియోలా తయారయ్యింది.

ఆ రేడియో మీద నా పేరు కూడా రాసేసింది అమ్మ. మా ఇంటి దగ్గర ఉన్న నా ఫ్రెండ్సులతో పాటుగా, పెద్దవాళ్ళకి కూడా నచ్చేసింది ఆ రేడియో. బళ్ళో మేష్టారు కూడా భలే మెచ్చుకున్నారు. పుస్తకంలో లేకపోయినా, ఆవేళ మాకు 'రేడియోనందలి భాగములు మరియు అది పనిచేయు విధానము' పాఠం చెప్పేశారు. నా బొమ్మ రేడియోని చూపించే అని వేరే చెప్పక్కర్లేదు కదా. పిల్లలెవరికీ అందకుండా పై గోడమీద పెట్టేశారా రేడియోని. బళ్లోకి ఎవరైనా వస్తే మొదట రేడియోనే కనిపించేది. ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు గోడ మీద నుంచి దింపించి మరీ చూశారు. నేను హైస్కూల్లో చేరాక కూడా, ఎప్పుడన్నా మా పాత స్కూలికి వెడితే ఆ రేడియో పలకరించేది నన్ను.

మంగళవారం, జులై 12, 2011

బాబూజీ అన్నయ్య

నాకన్నా ఏడాది చిన్నవాడైన బాబూజీ నాకు అన్నయ్య ఎలా అయ్యాడో చెప్పాలంటే, ముందుగా బాబూజీ గురించి చెప్పాలి. నలుగురు పిల్లలు పుట్టి పోయిన తర్వాత పుట్టిన బాబూజీ అంటే వాళ్ళమ్మకీ, నాన్నకీ ప్రాణం. ఇంకా చెప్పాలంటే ప్రాణం కంటే ఎక్కువే కూడాను. పిల్లాడిని బతికించుకోడం కోసం చేసిన అనేక ప్రయత్నాల్లో ఒకటిగా పేరు పెట్టలేదు. ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి 'బాబూజీ' అని పిలవడం మొదలెట్టి, చివరికి బళ్ళో కూడా అదే పేరు రాయించారు.

ఊహ తెలిసినప్పటినుంచీ ఆడింది ఆట, పాడింది పాట అవ్వడంతో చాలా చిన్నప్పుడే తను సర్వజ్ఞుణ్ణనే నమ్మకం మొదలయ్యింది బాబూజీలో. కొన్ని కొన్ని నమ్మకాలకి ఆధారాలు ఉండవు. దానికి తోడు, వాళ్ళ నాన్న రెండ్రోజులకోసారి బడికొచ్చి పిల్లలందరి ఎదురుగానూ వాళ్ళబ్బాయి అర్భకం పిల్లాడు కాబట్టి వాణ్ణి కొట్టకండనీ, మిగిలిన పిల్లలు కూడా ఏమీ చేయకుండా చూడమనీ మేష్టారిని బతిమాలి వెళ్ళేవాడు. బాబూజీతో సమస్య ఏమిటంటే తను చెప్పిందే కరక్టు. అది తప్పయి ఉండచ్చనే ఆలోచన పొరపాటున కూడా వచ్చేది కాదు.

రెండూ రెండూ కలిపితే మూడు వస్తుందని తనకి అనిపిస్తే, మేష్టారు ఎంతగా చెప్పినా కూడా జవాబు నాలుగు అని నమ్మేవాడు కాదు. వాళ్ళ నాన్న కారణంగా మొదట్లో బాబూజీని క్షమించేసినా, తర్వాత్తర్వాత మేష్టారు కోపం ఆపుకోలేక సుద్దముక్కలు బాబూజీ తలమీద తగిలేలా విసరడం లాంటి శిక్షలు వేసేవాళ్ళు. అదే మాకైతే తొడ పాశాలూ, గోడకుర్చీలూను. తను నా తర్వాత క్లాసు కాబట్టి, ప్రతి వేసవిలోనూ నా పుస్తకాలు తను తీసుకునే వాడు. మా ఇంట్లో వాళ్ళకీ, వాళ్ళింట్లో వాళ్ళకీ ఉన్న స్నేహం వల్ల నాకు తప్పేది కాదు.

నేను నా పుస్తకాలని ఎలా చూసుకోవాలో అప్పుడప్పుడూ జాగ్రత్తలు చెబుతూ ఉండే వాడు. తర్వాత తను తీసుకోవాలి కదా మరి. కొంచం పెద్దయ్యే కొద్దీ బాబూజీ అభిరుచులు కూడా కొంచం ప్రత్యేకం అని తెలుస్తోంది మాకందరికీ. తనకి కత్తి ఫైటు కాంతారావంటే తెగిష్టం. ఎంతగా అంటే, మా ఊళ్లోకి రికార్డింగ్ డేన్స్ వచ్చినప్పుడు కాంతారావు పాట వేయించమని వాళ్ళ నాన్నతో ట్రూప్ వాళ్లకి రికమెండ్ చేయించే అంత. "ఇప్పటివరకూ కాంతారావు పాటలు ఎవరూ అడగలేదండీ.. మాకు రావు," అని చెప్పేశారు వాళ్ళు.

ఓరోజు బళ్ళో మేష్టారికి బాబూజీ మీద బాగా కోపం వచ్చేసింది. కొట్టడానికి లేదు కదా. అందుకని హాజరు పట్టీ తీసి, "నీపేరు బాబూజీ కాదు. బాపూజీ అని ఉండాలి. తప్పు పడింది" అన్నారు. "కాదండీ నా పేరు బాబూజీనే" అని మావాడి వాదన. అక్కడ మేష్టారిదే బలం కాబట్టి అప్పటికప్పుడు రికార్డులో 'బాపూజీ' అని పేరు మార్చేసుకుని పగ సాధించారు. బాబూజీ ఊరుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు. పేరు విషయంలో మేష్టారు రాజీ పడని కారణంగా మా బాబూజీ రికార్డుల్లో బాపూజీ గా మారిపోయాడు.

రోజులు గడుస్తూ ఉండగా, బాబూజీ ఒకసారి వాళ్ళింట్లో వాళ్ళతో హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. తనకి బాగా నచ్చింది. నేనప్పటికే హైదరాబాద్ చూసేసినా, తను చెప్పే కబుర్లన్నీఆశ్చర్యంగా నోరు తెరుచుకుని వినాల్సి వచ్చేది. లేకపొతే తనకి కోపం వచ్చేసేది మరి. ఆరకంగా నాకు కొద్దిగా నటించడం నేర్పించాడు బాబూజీ. ఊళ్ళో అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ హైదరాబాద్ విశేషాలు చెబుతూ ఉండగా, బాబూజీకి ఉన్నట్టుండి మా ఊరిని కూడా హైదరాబాద్ గా మార్చేయాలని కోరిక పుట్టింది. "మనం పెద్దయ్యాక అలాగే మార్చేద్దాం. మీ ఇంటిదగ్గరే చార్మినార్ కట్టిద్దాం" అని నమ్మకంగా చెప్పాను.

పదో తరగతి పరీక్ష తప్పగానే బాబూజీకి పెళ్లి చేసేయాలని నిశ్చయించారు వాళ్ళింట్లో. వాళ్ళు పెద్ద స్థితిమంతులేమీ కాదు. ఇతగాడికా చదువూ అబ్బడం లేదు, ఏ పనీ చేసేంత బలమూ లేదు. "ముందేదన్నా కుసి (కృషి-చేతిపని) నేర్పించవయ్యా. పెళ్లి తర్వాత చెయ్యొచ్చు" అని ఊళ్ళో వాళ్ళు చెప్పి చూశారు కానీ, వాళ్ళ నాన్న వినకుండా తనకి ఎన్నో ఏట పెళ్లయ్యిందో, వాళ్ళ నాన్నకీ, తాతకీ ఏ వయసులో పెళ్లయ్యిందో ఆపకుండా అరగంట సేపు ఉపన్యసించి అందరి నోళ్ళూ మూయించేశాడు.

తగుమాత్రం వైభవంగా బాబూజీ పెళ్ళయిపోయింది. ఆడవాళ్ళు కూడా మెచ్చుకున్న అందం ఆ అమ్మాయిది. "కాకి ముక్కుకి దొండపండు" అన్నారు కిట్టనివాళ్ళు. పెళ్ళయిన వాణ్ణి, అతని భార్య ఎదురుగా ఏరా, ఒరే అని మాట్లాడకూడదని మా అందరికీ ఇళ్ళలో మళ్ళీ మళ్ళీ చెప్పి ప్రాణాలు తోడేశారు. మిత్రులందరం కలిసి కూర్చుని ఆలోచించుకుని బాబూజీని 'అన్నయ్య' అని పిలవాలని నిర్ణయించేసుకున్నాం. కానైతే పెద్దగా మాట్లాడే పని ఉండడం లేదు. ఎప్పుడో తప్ప తను బయటికి రాడు. మేం వెళ్లకూడదని ఇళ్ళలో ఆర్డర్లు.

బాబూజీ అన్నయ్య ఆడవాళ్ళని కూడా తన ఇంటికి రానివ్వడం లేదనీ, భార్యని ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదనీ బోల్డన్ని కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. కాలేజీ గొడవల్లో పడి పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఒకరోజు, బాబూజీ, భార్యా విడిపోయారనీ, ఆ అమ్మాయి మరో పెళ్లి చేసేసుకుందనీ చెప్పుకున్నారు ఊళ్ళో. పట్టుదలలో పరశురాముడైన బాబూజీ వాళ్ళ నాన్న నెల తిరక్కుండా మరో సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేసేశాడు. మాకెవ్వరికీ పెళ్ళనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు కానీ, బాబూజీకప్పుడే రెండో పెళ్లి!

ఉన్నట్టుండిబాబూజీ తనే మాతో కల్పించుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు. వచ్చిన ప్రతిసారీ తనకి ఉద్యోగానికి రమ్మంటూ బ్యాంకుల నుంచీ, ఆఫీసుల నుంచీ ఉత్తరాలు వస్తున్నాయని, ఇంట్లో ఒప్పుకోవడం లేదనీ చెప్పేవాడు. నమ్మినట్టు నటించేవాడిని. మనకి అబద్ధం అని కచ్చితంగా తెలిసిన విషయాన్ని నిజమన్నట్టుగా వినడంలో ఉన్న ఆనందాన్ని నాకు మొదట రుచి చూపించిన వాడు కూడా బాబూజీనే. నేను ఊరు విడిచిపెట్టిన కొన్నాళ్ళకే, వాళ్ళ కుటుంబమూ బతుకు తెరువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయింది. తర్వాత్తర్వాత ఊరు వెళ్ళినప్పుడల్లా శిధిలావస్తలో ఉన్న వాళ్ళ ఇల్లు చూసినప్పుడల్లా మా ఊరిని హైదరాబాద్ గా చూడాలన్న బాబూజీ కోరిక గుర్తొస్తూ ఉండేది. బాబూజీని మళ్ళీ కలుస్తానో కలవనో..

మంగళవారం, జూన్ 28, 2011

తీరిన దాహం

"ప్రపంచమొక పద్మవ్యూహం.. కవిత్వమొక తీరని దాహం.." అన్న మహాకవికి తొలి వందనం. ప్రతి ఒక్కరిలోనూ కళాకారులు ఉంటారు. అంటే ఒక రచయిత, కవి, చిత్రకారుడూ, నటుడూ, గాయకుడూ...ఇలాగన్నమాట. అన్నీ కలిసొచ్చిన వాళ్ళకి వాళ్ళలో ఉన్న కళ బహిర్గతమై, బోల్డంత పేరొస్తుంది. మిగిలిన వాళ్ళని విధి ఏదో ఒక రూపంలో అడ్డుకుంటుంది. ఇంత బరువైన డైలాగులు ఎందుకూ అంటే... మనం అలా అలా కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకూ నడుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

అవి నేను అప్పుడే నిక్కర్లు వేసుకోవడం నేర్చుకుని బడికి వెళ్ళడం మొదలు పెట్టిన రోజులు. అప్పట్లో మా ఇంట్లో ఉన్న ఏకైక వినోద సాధనం రేడియో. నాకే కాదు, మా ఇంటిళ్ళపాదికీ రేడియో అంటే ఒక్కొక్కరికీ ఒక్కోందుకు ఇష్టం. ఈ కారణానికి ఉదయం సిగ్నేచర్ ట్యూన్ తో రేడియో స్టేషన్ మొదలయ్యింది మొదలు, కార్యక్రమాలు పూర్తయ్యి 'కూ..ఊ..ఊ..' అనేంత వరకూ సదరు బుల్లిపెట్టి మోగుతూ ఉండాల్సిందే. రేడియో నాటకాల పుణ్యమా అని మూడో తరగతి చదివే రోజుల్లోనే నాలో రచయిత మేల్కొని నాచేత ఒక నాటిక రాయించేశాడు.

ఐదారు తరగతుల్లోకి వచ్చేసరికి నన్ను అమితంగా ఆకట్టుకున్న రేడియో కార్యక్రమం కవి సమ్మేళనం. నాకు పెద్దగా అర్ధమవ్వక పోయినా సరే, ఆ కవితలన్నీ శ్రద్ధగా వినేవాడిని. కవులంతా తమ తమ కవితలని గానం చేసే విధానం, ముఖ్యంగా ఒక్కో లైనూ రెండేసి సార్లు చదవడం భలేగా నచ్చేసింది నాకు. ఆరో తరగతిలో ఉమామహేశ్వర రావు గారు మాకు తెలుగు చెప్పేవారు. ఆయనది శ్రావ్యమైన కంఠం. ఆయన పద్యాలు చదువుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలని అనిపించేది.

ఒకరోజు ఆయన క్లాసులో పాఠం చెబుతూ, రవీంద్రనాథ్ టాగోర్ చాలా చిన్నప్పటినుంచే కవితలు రాయడం మొదలు పెట్టాడని చెప్పారు. అది నాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. "టాగోర్ ఎక్కువేమిటి? నా తక్కువేమిటి?" అన్న ఆలోచన మొదలై, మర్నాటికల్లా న చేత ఒక పద్యం (???) రాయించేసింది. ప్రధమ పాఠకుడు - పాపం మా తెలుగు మేష్టారే. 'పుష్పము లోని తేనియనంతయు గ్రోలుచు..' అన్నది మొదటి లైన్ అని జ్ఞాపకం. మా క్లాస్ రూం పక్కనే ఉన్న తోటలో తుమ్మెదలని చూస్తూ వాటిమీద రాసిన పద్యం అది. "పద్యాలు రాయాలంటే చందస్సూ అవీ రావాలి. కొంచం పెద్దయ్యాక ప్రయత్నిద్దువుగానిలే" అన్నారాయన బలహీనంగా.

నేనస్సలు నిరుత్సాహ పడలేదు. పద్యాలకైతే ఆగాలి కానీ, కవితలకి ఆగక్కర్లేదు కదా అని నిశ్చయించేసుకుని కనిపించిన ప్రతి వ్యక్తి, వస్తువు మీదా ఆశువుగా కవితలల్లడం మొదలు పెట్టాను. ఇది ఎలా మొదలయ్యిందంటే, ఒక రోజు నేను వీధిలో కూర్చుని చదువుకుంటూ ఉండగా మీరయ్య రోడ్డున వెళ్తూ కనిపించాడు. "మడేలు" అని నా నోటంట అప్రయత్నంగా వచ్చి, ఆ వెంటనే "మడేలు మడేలు మడేలు" అని రాగయుక్తంగా మారింది. అది కవితావేశం అని అర్ధమైపోయింది నాకు. పెద్దగా ఆలోచించక్కర్లేకుండానే "ఫిడేలు ఫిడేలు ఫిడేలు" అన్నది రెండో పంక్తిగా దొరికేసింది.

కవితక్కూడా కనీసం నాలుగు పంక్తులుండాలన్నఅప్పటి నా చాదస్తం కారణంగా మిగిలిన రెండు పంక్తుల కోసం తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాను, చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి. నిజానికి మా మీరయ్యకి ఫిడేలంటే ఏమిటో కూడా తెలీదు. అయినప్పటికీ నా కవితలో మూడో పంక్తి "మడేలు వాయిస్తాడు ఫిడేలు" అయ్యింది. ఇక చివరి పంక్తి కోసం అస్సలు తడుముకోలేదు.. "ఫిడేలు వాయించేది మడేలు.." అంతే! కవిత అయిపోయింది. చివర్లో రాగం కోసం మళ్ళీ "మడేలు మడేలు మడేలు... ఫిడేలు ఫిడేలు ఫిడేలు..." జత చేశాను.

కవిత్వంలో ఉన్న సమస్య ఏమిటంటే, వెంటనే ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపిస్తుంది. నాకు ఎదురుగా అమ్మ కనిపించింది. అంతే, వెంటనే నా కవిత వినిపించేశాను. తల్లి ఋణం తీర్చుకోలేనిది అని ఎందుకంటారు అని ఎవరన్నా అడిగితే, ఇదిగో ఈ సందర్భాన్ని కూడా ఉదహరించొచ్చు. అమ్మ అస్సలు తిట్టకపోగా, బాగుందని మెచ్చుకుంది. నేనింక నా కవితని రేడియోలో చదివేయొచ్చు అనుకున్నాను. ఇంతలో నా స్ఫూర్తి ప్రదాత మీరయ్య వాళ్ళింటికి తిరిగి వెళ్తూ కనిపించాడు. ఆపి, నాకవితని వినిపించాను. "పిడేలంటే ఏటి బాబయ్యా" అని సిగ్గుపడుతూ అడిగాడు. అమ్మ తనకి ఓ గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది, ఎందుకో నాకప్పుడు అర్ధం కాలేదు.

అది మొదలు నాలో కవితా ఝరి ఉప్పెనై ఎగసి పడడం మొదలు పెట్టింది. ఎన్ని కవితలని గుర్తు పెట్టుకుంటాం. అందుకే ఓ చిన్న నోటు పుస్తకం రహస్యంగా సంపాదించి నా ఆశు కవితలన్నీ అందులో రాయడం మొదలు పెట్టాను, రవీంద్రుడి 'గీతాంజలి' లాగా ఓ సంపుటం తేవాలన్న ఆలోచనతో. (నేనప్పటికి 'గీతాంజలి' చదవలేదు. కానీ అది చాలా గొప్ప పుస్తకమని మా తెలుగు మేష్టారు చెప్పడం వల్ల, ఆ రికార్డు బద్దలు కొట్టాలని నా ప్రయత్నం - అమంగళం ప్రతిహతమగు గాక!) అమ్మ నా కవితల్ని మెచ్చుకుంటూ వింటోంది. చూస్తుండగానే నా కవితల పుస్తకంలో తెల్ల పేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

అప్పట్లో నా దృష్టిలో ఆరోజు తెలుగు కవిత్వానికి దుర్దినం. ఆవేళ బడికి సెలవు. నాన్న ఇంట్లోనే ఉన్నారు. సెలవు రోజుల్లో పాఠాలు అప్పచెప్పించుకోవడం, పుస్తకాలకి అట్టలూ అవీ వేసి పెట్టడం లాంటివి చేసేవాళ్ళు అప్పుడప్పుడూ. ఆవేళ కూడా అలాగే నా బ్యాగ్ లో ఉన్న పుస్తకాలు తీస్తూ, నా కవితల పుస్తకం చూసేశారు. నాన్ననెందుకూ అనుకోవడం, నేనే కొంచం అజాగ్రత్తగా ఉండి దాచడం మర్చిపోయాను. సీన్ కట్ చేస్తే, నాకు మళ్ళీ ఎప్పుడూ కవిత్వం రాయాలని అనిపించలేదు. బ్లాగ్మిత్రులు 'పరిమళం ' గారిలాంటి వాళ్ళు అప్పుడప్పుడూ కవిత్వం ప్రయత్నించ మని సూచిస్తున్నప్పుడల్లా నాకీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది.

ఆదివారం, జూన్ 12, 2011

ఇంజినొచ్చింది

పొద్దున్న పొద్దున్నే లేవగానే ఒక్కోరోజు భలే విసుగ్గా ఉంటుంది. బడున్నా, లేకపోయినా ఏంటో ఏ పనీ చెయ్యాలనిపించదు. ఆవేళ కూడా నేనలా విసుగ్గా, చిరాగ్గా ఉండగా బామ్మ అదేమీ పట్టించుకోకుండా నన్ను పిలిచి "ఆ ఇంజిను కుర్రాళ్ళకి కూడా వంట చెయ్యాలేమో మీ తాతగారిని ఓమాటు కనుక్కురా బాబూ" అని పురమాయించేసింది. ఇంకేమన్నా అయితే నాకు చాలా బోల్డంత కోపం వచ్చేసి ఉండేది కానీ, బామ్మ చెప్పింది వినగానే నా విసుగంతా ఎగిరిపోయింది.

అవును మరి, ఇంజిను రావడం అంటే ఆషామాషీ విషయం ఏమిటీ? అందరిళ్ళకీ రాదు ఇంజిను. కొబ్బరి తోట ఉన్న వాళ్ళ ఇంటికే, అదికూడా ఏడాదికి ఒక్కసారే వస్తుంది. వచ్చిందంటే పూటో, పూటన్నరో ఉంటుంది. ఇంక చేతినిండా పని. తాతయ్య దగ్గరికి గంతులేసుకుంటూ వెళ్ళానా? "వాళ్ళు సాయంత్రం వస్తార్రా? అప్పుడు కనుక్కుని రాత్రి వంట చేయిద్దాం" అనేశారు. హాయ్..హాయ్.. సాయంత్రం అయితే ఇంకా మంచిది. చక్కగా బడికెళ్ళి వచ్చేయొచ్చు, ఏదో ఒక వంక పెట్టి మానక్కర్లేకుండా.

బళ్ళోకెళ్లగానే ఫ్రెండ్సులందరికీ చెప్పేశాను, సాయంత్రం తోటకి ఇంజిన్ పెడుతున్నారని. అదిమొదలు, వాళ్ళందరూ నాతో చాలా మంచిగా ఉండడం మొదలు పెట్టారు. నేనేం చెబితే అదే రైటన్న మాట. లేకపొతే నేను వాళ్ళని ఇంజిన్ చూడ్డానికి తీసుకెళ్ళను సరి కదా, బొంగరాలకి మట్టికూడా తీసుకోనివ్వను. అందుకే నాకు ఇంజిన్ అంటే ఇష్టం. అంటే, ఇదొక్కటే కారణం కాదనుకో, అయినా ఫ్రెండ్సులు మనం చెప్పిందానికి కాదనకపోతే ఎంత బాగుంటుందో కదా.

సాయంత్రం అవ్వనే అయ్యింది. బళ్ళో నుంచి వచ్చే సరికి, అప్పుడే రెండెడ్ల బండికి బిగించిన ఇంజిన్ ని ఇంటి ముందు చెరువు గట్టు మీద ఆపి, ఎడ్లని తోలుకుపోయారు. ఇద్దరు కుర్రాళ్ళు నీళ్ళ గొట్టాలు, లావాటి రబ్బరు చూపులు (ట్యూబులు) గబగబా బిగించేస్తున్నారు. డ్రైవరేమో ఇంజిన్లో ఇంజనాయిలు పోస్తుంటే, ఇంజన్ గలాయన డ్రైవర్ మాయచేసి అందులో కిరసనాయిలు కలిపెయ్యకుండా చూస్తున్నాడు. నేను ఇంట్లోకెళ్ళి పాలు తాగేసి వచ్చేశా.

చెర్లోనుంచి నీళ్ళు లాక్కునే చూపూ, ఇంజిన్లో నుంచి తోటలోకి నీళ్ళు పంపే లావు పాటి చూపూ బిగించేశారా? ఈ లావు పాటి చూపు మీద సైకిళ్ళూ అవీ ఎక్కినా పాడవ్వకుండా, అటూ ఇటూ తాటిపేళ్లూ, కమ్మలూ సదిరేశారు. ఓ రెంచితో ఇంజిన్ గాట్టిగా తిప్పేస్తోంటే బడ్ బడ్ బడ్ మని చప్పుడు చేస్తూ ఇంజిన్ పనిచేయడం మొదలెట్టేసింది. గుప్పు గుప్పుమంటూ నల్లటి పొగలు. చూస్తుండగానే లావుపాటి చూపు కొంచం కొంచంగా ఉబ్బుతూ పెద్ద పాము పాకుతున్నట్టుగా తోటవరకూ ఉబ్బింది. చూస్తే ఏముందీ, తోటలోకి బోల్డు బోల్డు నీళ్ళు.

తోట దుక్కి దున్నడం, చుట్టూ గట్లు కట్టడం అప్పటికే అయిపోయింది కదా. నీళ్ళు ఒక్కో కొబ్బరిచెట్టు దగ్గరికీ వెళ్తున్నాయి. తడి తగలగానే మెట్ట తాబేళ్ళూ, తేళ్ళూ, జెర్రిలూ, చిన్న చిన్న పాములూ అవీ ఖంగారు ఖంగారుగా తిరగడం మొదలెట్టాయి తోటలో. అన్నట్టు మొగలి పొద పక్కన పాంపుట్ట ఉంది కదా, అక్కడికి నీళ్ళు వెళ్ళకుండా గట్టు కట్టేశారు. అవన్నీ ఎక్కడివక్కడికి సర్దుకునే వరకూ మనం తోటలోకి వెళ్ళకూడదన్న మాట. అందుకని మళ్ళీ ఇంజిన్ దగ్గరికి వెళ్తే, అక్కడ పొగలు కొంచం తగ్గాయి. సైకిళ్ళ వాళ్ళని, సైకిల్ దిగి పెద్ద చూపు దాటమని చెప్పాను కాసేపు.

తోటలో ఇద్దరు మనుషులు గట్లు కాస్తున్నారు. ఇది ఎందుకంటే, మనం ఇంజిన్ వాళ్లకి కాఫీలూ, టీలూ, భోజనాలే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి ఇంజిన్ పెట్టించుకుంటున్నామా? మనం చూడకుండా చూడకుండా పక్క తోట వాళ్ళు గట్టు కొంచం తెగ్గొట్టేశారంటే చాలు మన నీళ్లన్నీ వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతాయి. సాయంత్రం అవుతుండగా నా ఫ్రెండ్సులు వచ్చారు. మామూలుగా అయితే ఇంజిన్ కుర్రాళ్ళు చిన్న పిల్లల్ని ఇంజిన్ దగ్గరికి రానివ్వరు. కానీ నేను కూడాఉండి తీసుకెళ్ళాను కదా, అందుకని వాళ్ళు ఏమీ అనలేదు.

నీళ్ళల్లో కాసేపు పడవలేసుకుని, బొంగరాలకి ఎక్కడి మట్టి బాగుంటుందో గుర్తులు పెట్టేసుకున్నాం. ఇంజిన్ వెళ్ళిపోయాక, తోట కొంచం ఆరాక ఆ మట్టి తీసుకుంటామన్న మాట. కాసేపు కాళ్ళు కడుక్కునే ఆటా, చేతులు కడుక్కునే ఆటా ఆడుకున్నాం. అంటే ఏమీ లేదు, కాళ్ళకి మట్టి చేసుకుని కడుక్కుంటే కాళ్ళు కడుక్కునే ఆటన్న మాట. "చీకటడిపోతోంది.. పురుగూపుట్రా చేరుతుంది..ఇళ్ళకెళ్ల" మని నాన్న కేకలేసే వరకూ అక్కడే ఆడాం.

వాళ్ళంటే ఇళ్ళకెళ్ళి పోయారు కానీ, నేనెందుకు వెళ్తాను? ఇంజిన్ దగ్గర కూర్చుని కుర్రాళ్ళతో కబుర్లు మొదలెట్టాను. ఇంకా ఎవరెవరి తోటలకి నీళ్ళు పెడుతున్నారో కనుక్కోవద్దూ? రాత్రి ఆ కుర్రాళ్ళకి అన్నం అమ్మ పెట్టింది కానీ, ఆకుల్లో కూరా పచ్చడీ అవీ నేనే వడ్డించా. నీళ్ళూ టీలూ నేనే అందించా. ఇంజిన్ చప్పుడు వింటూ ఎప్పటికో నిద్రపోయానా? పొద్దున్న లేచి చూసేసరికి తోటంతా నీళ్ళు నీళ్ళు. పెద్ద వర్షం వచ్చిందంటే నమ్మేయొచ్చు. వీధిలో చూస్తే ఇంజిన్ లేదు, వెళ్ళిపోయింది. నాకు కాళ్ళు ఒకటే లాగడం. బళ్లోకి వెళ్లాలని కూడా లేదు. కానీ ఇంట్లో చెబితే ఇంకేమన్నా ఉందా? మళ్ళీ ఇంజిన్ ఎప్పుడొస్తుందో..

శుక్రవారం, జూన్ 03, 2011

మా భూషణం

నిచ్చెన మెట్లన్నీ ఎక్కేసి, చివరిమెట్టు మీద ఆగాడు భూషణం. తన నడుము చుట్టూ పెట్టుకున్న పెద్ద బెల్టుకి తగిలించిన బంధం తీసుకుని జాగ్రత్తగా తన రెండు కాళ్ళకీ వేసుకున్నాడు. మరో పట్టీ తీసుకుని దానిని తన నడుము చుట్టూ తిప్పుకుని, కొబ్బరిచెట్టు చుట్టూ తిప్పి ముడేశాడు. బెల్ట్ కి కత్తి ఉంది. పట్టీ నెమ్మది నెమ్మదిగా పైకి జరుపుకుంటూ, బంధం వేసుకున్న కాళ్ళతో మెల్ల మెల్లగా చెట్టు పైపైకి ఎక్కుతున్నాడు. అబ్బా... మెడ నొప్పెడుతోంది. కానీ చూడకపోతే ఎలా, ఒకవేళ భూషణం గబుక్కున జారుతున్నాడనుకో గట్టిగా అరిచి జాగ్రత్త చెప్పొద్దూ.

ఇంకో నలుగురు దింపు వాళ్ళు కూడా చెట్ల మీద ఉన్నారు కానీ, నేనెప్పుడూ భూషణం వెనకాలే తిరుగుతాను. కొబ్బరి తోటలో దింపు తీయిస్తున్నామంటే తాతయ్య, నాన్నలతో పాటు నేనూ ఉండాల్సిందే. దింపు వాళ్ళు తిరిగి నిచ్చెన మీదకి వచ్చే వరకూ ఆగి, అప్పుడు వెళ్ళాలి చెట్టు కిందకి. ఒక్కో చేత్తో ఒక్క కాయకన్నా ఎక్కువ పట్టుకోలేం. నాన్నయితే రెండేసీ, మూడేసీ పట్టుకుంటారనుకో. కానీ ఒక్కో కాయా ఎంత బరువుంటుందో. ఆ ముచిక చుట్టూ బిగించి పట్టుకోవడంలో అరిచేతులు ఎర్రగా అయిపోతాయి కూడాను.

కాయలొకటేనా? అడ్డుగా ఉన్నఎండు కొబ్బరాకులు, డొలకలు ఇంకా దెయ్యపు తొట్లూ కూడా కత్తితో కొట్టేస్తారు కదా. అవన్నీ కూడా కింద పడతాయి. జాగ్రత్తగా కొబ్బరికాయలో రాశి, డొలకలొకటి, ఆకులొకటి, ఇలా వేరువేరుగా రాశులు పొయ్యాలి. మనం ఒక్కళ్ళమే కాదులే. దింపు తీస్తున్నారంటే ఇద్దరో ముగ్గురో అప్పటికప్పుడు వచ్చేసి, పని సాయం చేసేసి వెళ్తూ వెళ్తూ డొలకలో, ఒకటో రెండో కాయలో తాతయ్యని అడిగి పట్టుకెడతారు. ఆకులు మనం మోయ్యలేం. డొలకలేమో కొంచం మట్టిగా ఉంటాయి. అందుకని కాయలైతే కొంచం బరువైనా పని సులువన్నమాట.

భూషణానికి నేనంటే ముద్దు. అలా ఎండల్లో నేను కాయలు మొయ్యడం తనకి నచ్చేది కాదు. నేను ఎర్రగా అయిపోయిన చేతులు మధ్యమధ్యలో ఊదుకుంటుంటే చూసి, "మీరలా కూకోండి బాబో.. శానామందున్నారు కదా" అనేవాడు ప్రేమగా. కానీ కాయలు మొయ్యకపోతే తోటలో ఉండడానికి ఉండదు, ఇంట్లోకి వెళ్లి చదువుకోవాలి. అప్పుడు భూషణం వాళ్ళూ చెప్పే కబుర్లు వినడానికి ఉండదు. ఇంట్లోకి వినిపించవు కదా మరి. ఇంకో కారణం కూడా ఉంది కానీ, అది తర్వాత చెబుతాను. భూషణం వాళ్ళూ రోజూ ఎక్కడో అక్కడికి దింపుకి వెళ్తారు. దింపు అయ్యాక పడ్డ కాయల్ని బట్టి వందకిన్ని అని కాయలో, ఆ మింజువోలె డబ్బులో తీసుకుంటారు.

దింపుకెళ్ళిన ఊళ్లలో ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో భూషణం చెబుతూంటే వినాలంతే. తను నాన్న కన్నా పెద్దవాడు, తాతయ్య కన్నా చిన్నవాడు. కబుర్లు మొదలు పెట్టాడంటే మాత్రం నా అంత చిన్న పిల్లాడైపోయేవాడు. ఏ ఊళ్ళో ఎవరికి ఎన్నెన్ని కాయలు పడ్డాయో, ఎవరి కొబ్బరికాయల రాశిలోకి ఎంత పెద్ద పామొచ్చిందో, ఎక్కడ దింపు తీస్తూ తను ఏ సినిమా షూటింగ్ చూశాడో ఇవన్నీ ఊరిస్తూ ఊరిస్తూ చెప్పేవాడు. "ఈ భూషణం కబుర్ల పోగు. పని తెవల్చడు" అని తాతయ్య, నాన్న తిట్టుకునే వాళ్ళు కానీ, పైకేమీ అనేవాళ్ళు కాదు. దింపు వాళ్ళందరికీ భూషణమే పెద్ద మరి.

మామూలు చెట్లు ఎవరన్నా ఎక్కేవాళ్ళు కానీ, ముచ్చెట్లు మాత్రం భూషణానికే వదిలేసేవాళ్ళు. మామూలు కొబ్బరి చెట్టు కన్నా రెట్టింపు పొడుగుండే ముచ్చెట్లు కొబ్బరి చెట్లలో ముసలివన్నమాట. అలా ఎక్కుతూ ఎక్కుతూ నలకలా అయి, మాయమై పోయేవాడు భూషణం. ముచ్చెట్టు ఎక్కితే పైనుంచి తన గొంతు కూడా వినిపించేది కాదు. తను చెట్టు దిగేంతవరకూ నాకు భయం భయంగా ఉండేది. ఇంకెవరికీ అస్సలు భయం ఉండేది కాదు. "ఈ ముచ్చెట్లు కొట్టించేయొచ్చు కదా" అనుకునే వాణ్ణి. కానీ, భూషణం చెబితే తప్ప చెట్టు కొట్టించే వాళ్ళు కాదు.

ముచ్చెట్లే కాదు, 'నా చెట్టు' కూడా భూషణమే ఎక్కేవాడు. నా చెట్టు అంటే నేను పాతిన మొక్క పెరిగి పెద్దై, చెట్టయ్యిందని కాదు. ఆ చెట్టు బొండాలు చాలా బాగుంటాయి. మిగిలిన బొండాల కన్నా ఆ బొండాలంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఈ రహస్యం తెలుసు భూషణానికి. ఇంకో రహస్యం కూడా ఉంది మా ఇద్దరికీ. తనా చెట్టు ఎక్కుతుంటే నేను "భూషణం, బొండము తియ్యవూ" అని అడగాలి. మాటలు పలకడంలో ఏవన్నా తేడాలోస్తే వీప్పగిలిపోయేది. అందుకని కొంచం పట్టి పట్టి జాగ్రత్తగా మాట్లాడాలి కదా.. నేనలా మాట్లాడితే వినడం భూషణానికి సరదా. అంతేనా? నేనిలా అడగ్గానే "ఏవీ అక్కర్లేదు" అని నాన్న అరుపూ, "పిల్లాడికి నాలుగు బొండాలు తియ్యరా" అన్న తాత ఆర్డరూ, వాళ్ళిద్దరూ తోటలో ఏమూల ఉన్నా వినిపించేవి.

అప్పటికే కాయలు చేరేసీ, చేరేసీ అలిసిపోయేవాడినేమో, బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, తాగడానికి రెడీ అయిపోయేవాడిని. తనే చెలిగి, కొట్టి ఇచ్చేవాడు భూషణం. నీళ్లన్నీ తాగాక, బొండాన్ని రెండు ముక్కలు చేసిచ్చేవాడు, మీగడ తినడానికి వీలుగా. "ఇంకోటి కొట్టమంటారా?" తనెంత మెల్లిగా అడిగినా, తాతయ్యకో, నాన్నకో వినపడిపోయేది. "అక్కర్లేదు. వాడింక అన్నం తినడు.. మిగిలినవి నూతిలో పడేయ్.. రేపు కొట్టిద్దాం" అనేసేవాళ్ళు. అక్కడితో దింపు వదిలేసి నేనింట్లోకి పరిగెత్తే వాడిని, నా పని అయిపోయినట్టే కదా మరి. బొండం కొట్టిస్తూ భూషణం ఎప్పుడూ ఒకటే మాట అడిగేవాడు.... "పెద్దోరయ్యాక నన్ను గుర్తెట్టుకుంటారా బాబూ?" .....

శుక్రవారం, ఏప్రిల్ 29, 2011

కొత్తావకాయ్

"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని శాయమ్మకి చెప్పు బాబూ.. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు..." ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన శాయమ్మ గారి ఇంటికి పరిగెత్తాను నేను. అప్పటికే రాజ్యం గారింటికీ, జగదాంబగారింటికీ రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం. ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ గోలెంలో వేసి బాగా కడిగేసి, ఆరబెట్టేశాను. చిన్నపిల్లాడినన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి?

నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా. రోజూ అలా తిరగడానికి ఉండదు కదా. అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది. ఇట్టే వెళ్లి అట్టే శాయమ్మ గారిని తీసుకొచ్చేశాను. వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. అమ్మ, బామ్మ వరస చూస్తుంటే కాఫీలు కూడా ఉండేలా లేవు.

కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది. కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని, "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ. అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది. చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. "ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది," బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది.

శాయమ్మ గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ, జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది. నేనొక్కడినీ అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు.

కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. "దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా నాయినా" అంది బామ్మ. అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో పాటు బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా నాయినే" అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా.

నేనెంత తొరగా తుడుస్తున్నా, శాయమ్మ గారు గబాగబా కోసేస్తున్నారు కదా. తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్. ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. శాయమ్మ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది.

మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను. అప్పటికి నీరెండ పడుతోంది. బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, శాయమ్మ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు.

మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. అంతే, బామ్మకి కోపం వచ్చేసింది. "దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? రాత్రి అన్నంతిన్న నాన్న, తాతయ్యా కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. ఈసారి బామ్మకి కోపం రాలా. "నేను జాగ్రత్తగానే చూశాను, శాయమ్మ ని కూడా చూడమన్నాను. సాయంత్రం చంటాడూ ఉప్పన్నాడు కానీ, వాడి మోహం వాడికేం తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని. "రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా... ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క రాలేదు.

శుక్రవారం, జనవరి 14, 2011

హరిదాసు

"అమ్మా.. హరిదాసు అవ్వాలంటే ఏం చదవాలమ్మా?" చిన్నప్పుడు అమ్మనీ ప్రశ్న ఎన్నిసార్లు అడిగానో లెక్కలేదు. నాకు అక్షరాభ్యాసం అయ్యింది మొదలు, ఎలాంటి సందర్భం వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళంతా దీవించే మొదటి దీవెన "పెద్ద ఉద్యోగస్తుడివై... దోసెడు రూపాయలు సంపాదించుకుని..." అవ్వడంతో పెద్దయ్యాక నేను ఉద్యోగం చేయాలన్న విషయం అర్ధమైపోయింది. అయితే, ఏ ఉద్యోగం చెయ్యాలో ఎవ్వరూ స్పష్టంగా చెప్పకపోవడం వల్ల, రకరకాల ఉద్యోగాలు నా ఊహల్లో మెదిలేవి. అదిగో, వాటిల్లో ఈ 'హరిదాసు' ఒకటి.

ధనుర్మాసపు ఉదయాల్లో, మంచు వర్షంలా కురిసే సమయంలో నిండా రగ్గు కప్పుకుని నిద్రపోవడం నాకు ఎంత ఇష్టమో. ఈ ఇష్టాన్ని నాకు తీరనివ్వకుండా చేసినవాడు హరిదాసు. అయినా కూడా నాకు హరిదాసంటే బోల్డంత ఆరాధన. హరిదాసు ఊళ్లోకి వచ్చాడన్న సూచనగా తంబురా శ్రుతో, చిరతల చప్పుడో, గజ్జెల ఘల్లు ఘల్లులో లేక "శ్రీమద్రమారమణ గోవిందో హరి.." అన్న పాటో అలలు అలలుగా చెవిని తాకేది. అంతే, నిద్ర మత్తు ఒక్కపెట్టున యెగిరిపోయేది. ముఖ ప్రక్షాళనకి పరిగెత్తేవాడిని, వెంటనే. ఎందుకంటే, ధనుర్మాసం నెల్లాళ్ళూ హరిదాసుకి బియ్యం పోసే డ్యూటీ నాదేకదా మరి. పాచి ముఖంతో బియ్యం పోస్తే పాపం చుట్టుకుంటుంది కూడాను.

ఉదయం ఏడవుతుండగా ఊళ్లోకి వచ్చేవాడు హరిదాసు. పట్టు పంచె, ఖద్దరు బనీను. మెడలో, చేతులకీ పూల దండలు. భుజాల చుట్టూ శాలువా. ఓ భుజం మీద తంబురా, చేతిలో చిరతలు. తలకి పాగా, ఆ పాగా మధ్యలో కొలువు తీరిన తళతళలాడే రాగి పాత్ర. గుమ్మడికాయ ఆకారంలో ఉండే ఆ పాత్రకి అలంకారంగా ఓ పూలదండ. నల్లనివాడైనా కళగల ముఖం మా హరిదాసుది. నుదుట, భుజాలమీద శ్రద్ధగా నామాలు దిద్దుకుని వచ్చేవాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చే వాడేమో, క్రమక్రమంగా దగ్గరయ్యే ఆ గజ్జెల చప్పుడు, తంబురా నాదం వింటుంటే ఏమిటో ఒకటే కంగారుగా ఉండేది.

హరిదాసు ఎవ్వరింటి ముందూ ఆగేవాడు కాదు. "శ్రీమద్రమారమణగోవిందో హరీ.." అంటూ ముగ్గు చుట్టూ ఒకసారి తిరిగి, గుమ్మంలో ఎవరూ నిలబడి లేకపొతే వెంటనే మరో ఇంటికి వెళ్ళిపోయేవాడు. హరిదాసలా తిరిగి వెళ్ళిపోతే అరిష్టం కదా, అందుకని మనం వీధి గుమ్మంలో కాసుకుని కూర్చోవాలి. హరిదాసు కోసం చూస్తున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా వేరే పనులేమీ చెప్పరు. మనం బియ్యం పళ్ళెంతో గుమ్మంలో నిలబడి ఉన్నామనుకో, ముగ్గులో మోకాళ్లమీద వంగి కూర్చుంటాడు హరిదాసు. గొబ్బిళ్ళు ఉన్నాకానీ అస్సలు తొక్కడు. చేతుల్లో తంబురా, చిరతలూ వాటిపని అవి చేస్తూనే ఉంటాయి, తలమీద పాత్ర కదులూమెదులూ లేకుండా అలాగే ఉంటుంది.

అలా చేయి నేలకి ఆన్చకుండా వంగి కూర్చోడానికి ఇంట్లో వాళ్ళెవరూ చూడకుండా నేను రెండు మూడుసార్లు ప్రయత్నించానుకానీ, నా వల్ల కాలేదు. ఇంతకీ హరిదాసు అలా కూర్చున్నప్పుడు మనం పళ్ళెంలో బియ్యాన్ని, రాగి పాత్రలో జాగ్రత్తగా పోసేయాలి. పాత్రని పొరపాటున కూడా తాకకూడదు. బియ్యం ఒలక కూడదు. మనం బియ్యం పూర్తిగా పోసేసిన సంగతి హరిదాసుకి ఎలా తెలుస్తుందో కానీ "కృష్ణార్పణం" అని, తంబురా మీటుతాడు. కొంచం భయంవేసినా అస్సలు భయపడకుండా దండం పెట్టుకోవాలి.

అమ్మకి నాతో పనున్నప్పుడల్లా ప్రశ్నలతో వేధించే వాడిని. హరిదాసు ఎక్కడ ఉంటాడు? తనకి పిల్లలు ఉంటారా? (హరిదాసుకి పిల్లలుండడం నాకు నచ్చలేదు ఎందుకో..), రోజూ రాకుండా నెలపట్టినప్పుడు మాత్రమే ఎందుకు వస్తాడు? మనం ఇచ్చే బియ్యం ఏం చేసుకుంటాడు? ...ఇలా ఉండేది ప్రశ్నల పరంపర. అమ్మ అప్పటికప్పుడు యేవో సమాధానాలు చెప్పేది కానీ, నాకేవీ నచ్చేవి కాదు. రోజూ హరిదాసు కట్టుకునే పట్టు పంచలనీ, కప్పుకునే శాలువలనీ శ్రద్ధగా చూసేవాడినేమో, ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి వెళ్లి తనకి మొత్తం ఎన్ని పంచలు ఉన్నాయో చూడాలని భలే కోరికగా ఉండేది.

హరిదాసుతో మాట్లాడ్డం అస్సలు కుదరదు. ఎందుకంటే తను చాలా తొందర తొందరగా ఊరంతా తిరిగేస్తాడా? మనం ఇంట్లో వాళ్ళు చూడకుండా తన వెంట పడ్డా, మనతో మాట్లాడడు. తలమీద పాత్ర ఉన్నంతసేపూ తను మాట్లాడ కూడదు మరి. ఊళ్ళో తిరిగినంతసేపూ తలమీద భిక్ష పాత్ర తప్పనిసరి. వేళ్ళు నలిగిపోకుండా తంబురా, చిరతలూ ఎలా వాయిస్తాడో అడగాలనీ, పాటలు ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసుకోవాలనీ ఇలా చాలా చాలా అనుకునే వాడిని. ఓసారి ఆ తంబురా మీటి, చిరతలని అలా అలా వాయించడం నా తీరని కోరికల జాబితాలో శాశ్వత స్థానాన్ని సంపాదించేసుకున్నాయి.

ధనుర్మాసం నెల మొత్తమ్మీద హరిదాసు కొంచం తాపీగా ఊళ్ళో తిరిగే రోజు ఒక్కటే ఉండేది. అది పెద్ద పండుగ. ఆవేళ హరిదాసు తలమీద పాత్ర పెట్టుకునేవాడు కాదు. తనతో పాటు తీసుకొచ్చిన మరో మనిషి మోసే కావిడిలో ఆ పాత్ర ఉండేది. రోజూ పొద్దు పొద్దున్నే వచ్చే హరిదాసు, ఆవేళ మాత్రం మధ్యాహ్నం భోజనాలప్పుడు వచ్చేవాడు. వీధిలో ఇంకా ఆరకుండా వెలుగుతున్న భోగి మంటని జాగ్రత్తగా దాటుకుని వాకిట్లోకి వచ్చి, ముగ్గులు తొక్కకుండా ఓ పక్కగా నిలబడి, ఇంట్లో అందరినీ పలకరించి మాట్లాడే వాడు. "అయ్య" "అమ్మ" "బాబు" అని మాట్లాడేవాడు.

అమ్మ, నాన్న పక్కనే ఉండేవాళ్ళు కదా.. అందుకని నాకు హరిదాసుతో మాట్లాడడానికి భయంగా ఉండేది. అదీకాక, ఏం అడిగితే ఏమంటాడో అని భయం కూడాను. తనేమో ప్రతిసంవత్సరం నా చదువు గురించి అమ్మానాన్నలని కనుక్కునేవాడు. ఆవేళ బియ్యంతో పాటు, పిండివంటలు, కొబ్బరికాయ, డబ్బులు ఇచ్చేవాళ్ళు హరిదాసుకి. నేను పండగ భోజనమన్నా చేయకుండా మా వీధి చివరివరకూ దిగబెట్టేవాడిని హరిదాసుని. ఇంక మళ్ళీ ఏడాది వరకూ తను కనిపించడంటే భలే దిగులేసేది. ఒకటి మాత్రం నిజం.. హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం.

....మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు....

ఆదివారం, నవంబర్ 28, 2010

ఉపోషం

"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా.. అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా.. జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.." ఇలా పరిపరివిధాలుగా చెప్పి కార్తీక సోమవారం నాడు నేను ఉపవాసం ఉండడానికి అమ్మని ఒప్పించేశాను నేను. అప్పుడు నేను మూడో తరగతి. పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ, కార్తీక మాసం వచ్చిందంటే సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.

ఆదివారం రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది. "రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.." అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు. "ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పొద్దున్నే చెర్లో కార్తీక స్నానం చేసొచ్చేశామా. ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి. ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు. "గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా బాబూ. నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు. అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ, తను మాత్రం పాలు కూడా తాగలేదు. నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తాడు.." అని.

గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా. అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను. కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది.."ప్రసాదం వద్దనకూడదమ్మా, తినాలి" అని కూడా చెప్పింది. నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా, "ఇవాళ మావాడు కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి పుత్రోత్సాహంతో చెప్పింది అమ్మ. వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.

ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు. "అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను. మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది "అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని. నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా. "పిల్లాడు ఉపోషం ఉన్నాడు, ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ. "ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు. సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది. నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే, "అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.

దీపాల వేళ అయ్యిందో లేదో, హడావిడి పడుతూ పొయ్యి వెలిగించేసింది వంటకి, "అసలే పిల్లాడు కూడా ఉపోషం" అంటూ. నేనేమో వీధిలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం. అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ వంట అవ్వడం, నక్షత్రం రావడం జరిగిపోయింది. ఇంకేముంది, పప్పు, కూర, పులుసు, పెరుగు వేసుకుని బోయినం చేసేశా. "ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది. తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.

మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని. "కార్తీక సోమవారం కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.