సోమవారం, సెప్టెంబర్ 26, 2011

సమయ పాలన

మనమెంత 'సమయమా...చలించకే...' అని పాడుకున్నా, కాలం దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. మనమంత కచ్చితంగా మన పనులు చేసుకోలేం కాబట్టి టైం సరిపోవడం లేదు అని తప్పించేసుకుంటూ ఉంటాం. గడియారానికున్న కచ్చితత్వం మనకి లేదన్నది ఎంత నిజమో, ఒక యంత్రం పనిచేసినంత కచ్చితంగా మనుషులెవరూ పని చేయలేరన్నది కూడా అంతే నిజం. అలా చేసేస్తే ఇంక మనిషికీ, యంత్రానికీ తేడా ఏం ఉంటుంది కనుక?

మనం ఎక్కాల్సిన బస్సులూ, రైళ్ళూ మొదలు, చూడాల్సిన సినిమాల వరకూ ఏవీ కూడా టైముని పాటించవు. రైళ్ళ విషయంలో 'జీవితకాలం లేటు' లాంటి జాతీయాలే పుట్టేశాయి. మరీ హౌస్ ఫుల్లుగా నడుస్తున్న కొత్త సినిమాలు మినహాయిస్తే, మిగిలిన సినిమాలు కచ్చితంగా షెడ్యూలు సమయానికి మొదలవ్వడం తక్కువ. ఓ ఐదునిమిషాలు ఆగితే మరో పది మందన్నా వస్తారేమో అన్న ఆశ థియేటర్ వాళ్ళని అలా ఆలస్యంగా నడిపిస్తుంది.

చాలా ఆఫీసుల్లో జరగాల్సిన పని, జరగాల్సిన సమయానికి పూర్తిపోవడం అన్నది అత్యంత అరుదైన వ్యవహారం. కారణాలు ఏవిటా అని ఆలోచిస్తే, ఆసమయంలో పూర్తికావడం అసంభవం అనిపించే విధంగా డెడ్ లైను ఉండడం, పనిని పూర్తి చేయాల్సిన బృందంలోని మెజారిటీ సభ్యులకి సమయపాలన లేకపోవడం, 'ఈ పని పూర్తి చేసేస్తే ఇంతకన్నా ఎక్కువ పని వచ్చిపడుతుంది' తరహా ఆలోచనా ధోరణి, చివరిక్షణం వరకూ తాత్సారం చేసి అప్పుడు ఎవరో ఒకరి మీద పడేయెచ్చునన్న ఎస్కేపిస్టు విధానం.. ఇలా అనేకం కనిపిస్తాయి.

కలవాల్సిన వ్యక్తులని చెప్పిన సమయానికి కచ్చితంగా కలవడం అన్నది దాదాపు అసంభవం. బస్సులు, రైళ్ళ ఆలస్యం మొదలు ట్రాఫిక్ జాముల వరకూ ఎన్ని కారణాలన్నా చెప్పుకోవచ్చు. వీటితో పాటు సరిగ్గా సమయానికి వెళ్ళాలన్న సీరియస్ నెస్ లోపించడమూ ఓ ముఖ్య కారణమే. ఎంసెట్ లాంటి పరీక్షలకి 'ఒక్క నిమిషం' నిబంధన విజయవంతంగా అమలు చేస్తున్న తర్వాత కూడా ఆలస్యంగా పరిక్షకి వచ్చి వెనక్కి వెళ్ళే విద్యార్ధులు దీనిని రుజువు చేస్తూ ఉంటారు. పరీక్ష హాల్లో ఉన్న వందల మంది సమయానికే వచ్చినప్పుడు, ఈకొందరు ఎందుకు రాలేకపోయారు? అనిపించక మానదు.


చాన్నాళ్ళ క్రితం ఓ నట వారసుడిని భారీగా లాంచ్ చేశారు. టీవీ చానళ్ళు అతగాడితో ఇంటర్వ్యూలు గుప్పించాయి. "మీ తాతగారు మీకు ఏం చెప్పేవారు?" ఒకానొక టీవీ ఛానల్ వారి ప్రశ్న. తాతగారు పరమపదించే నాటికి మనవడుగారింకా బాలుడు. "తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుకోవాలి... అని చెప్పేవారు" నుదురు మీద పడని జుట్టుని వెనక్కి తోసుకుంటూ కుర్రహీరో గారి జవాబు. "ఓహో.. టైం మేనేజ్మెంట్ గురించి చెప్పేవారన్న మాట," అచ్చ తెలుగు అంతగా రాని యాంకరిణి ఇంగ్లిష్ లో సర్దుబాటు చేసేసింది.

ఆమధ్య చదివిన ఓ కథలో కొడుకు ఓ మల్టి నేషనల్ కంపెనీలో పై స్థాయి ఉద్యోగి. ఉద్యోగానికి వేళా పాళా ఉండదు. "రోజూ అంతంత సేపు ఎందుకు పని చేయాలి? నిర్దిష్టమైన పని గంటలు మాత్రమే పని చేస్తానని కచ్చితంగా చెప్పెయ్. అందుకు ఎంత జీతం ఇస్తే, అంతే తీసుకో" అంటుంది అతగాడి తల్లి. కొడుకు నిర్ణయం మాట ఎలా ఉన్నా, సమయ పాలన ఎందుకు జరగడం లేదన్న దానికి ఇదో ఉదాహరణ. ఆఫీసు ప్రారంభించే సమయమే తప్ప, ముగించడానికి నిర్దిష్టమైన వేళ ఉండకపోవడం వల్ల కూడా పనుల్లో జాప్యం పెరుగుతోందనుకోవాలి.

అసలు మనం టైం సరిపోవడం లేదు అని ఎందుకు అనుకుంటాం? నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఏదన్నా తప్పు చేసినా ఒప్పుకోక పోవడం, దాన్ని మరొకరి మీదకి తోసేయాలని ప్రయత్నించడం మానవ నైజం. ఎవరూ కూడా అతీతులు కాదు కదా. అలా మనం మనకి చేయాలని ఉన్న పనులని చేయలేక పోతున్నప్పుడు, అందుకు ఎవరో ఒకరిని బాధ్యులని చేసేయాలి కాబట్టి నోరూ వాయీ లేని కాలం మీదకి ఆ తప్పుని తోసేసి తప్పుకుంటున్నామేమో కదూ..

బుధవారం, సెప్టెంబర్ 21, 2011

ఒక్క రూపాయ్...

పావలా పరమపదించింది. అర్ధ రూపాయి పరిస్థితి కూడా ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది. మన జేబుల్లో చెప్పుకోదగ్గ నాణెం అంటే ఒక రూపాయి. రూపాయికి ఏమొస్తుంది? "ఓ కేజీ బియ్యం వస్తాయి" అంటున్నారు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి. అందరికీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారికి నవంబరు నుంచీ, ప్రస్తుతం కేజీ రెండు రూపాయలకి విక్రయిస్తున్న బియ్యాన్ని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వబోతున్నామన్నది ముఖ్యమంత్రి ప్రకటన.

ఒక్కో తెల్ల కార్డు కుటుంబానికి నెల ఒక్కింటికీ గరిష్టంగా ఇరవై కేజీల చొప్పున పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ధరని సగానికి సగం తగ్గించడం వల్ల ఎవరికి ప్రయోజనం? దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ఒక్కో కుటుంబానికీ తగ్గే నెలవారీ ఖర్చు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే! అదే సమయంలో అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం మీద పడే అదనపు భారం, బియ్యం లెవీ ధరని అనుసరించి నెలనెలా పెరుగుతూనే ఉంటుంది. పన్నులు కట్టే జనాభా మీద ఏదో రూపంలో ఈ భారం పడుతుందన్నది నిస్సందేహం.

ముప్ఫయ్యేళ్ళ క్రితం కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని రాష్ట్రంలో ప్రకటించినప్పుడూ, ప్రవేశ పెట్టినప్పుడూ అదో సంచనలం. లక్షలాది కుటుంబాలని నిజంగానే మేలు చేసిన ఈపథకం, అప్పట్లోనే రాష్ట్ర ఖజానాకి ఎంతో కీడుని కూడా చేసి, వారుణి వాహిని ఏరులై పారడానికి ప్రత్యక్ష కారణం అయ్యింది. ఎన్టీఆర్ అనంతరం తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడం మానేసిన ఈ పథకాన్ని, ప్రజలకి అనేక మేళ్ళు చేయడంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది.

ఓపక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ రోజురోజుకీ పైపైకే వెళ్తుంటే సబ్సిడీ బియ్యం ధర మాత్రం అంతకంతకూ కిందకి దిగడం వెనుక మతలబు ఏమిటి? అభివృద్ధి కార్యక్రమాలు అమలు సక్రమంగా జరిగితే, పేదరికం తగ్గి ఇలాంటి పధకాల అవసరమే ఉండకూడదు కదా. మరి పథకాలు "విజయవంతంగా" అమలవుతూ ఉండగానే, ఇలా బియ్యం ధర తగ్గించడం ఎందుకు? పోనీ ఈ తగ్గింపు వల్ల పేదల జీవితాల్లో గణనీయమైన వెలుగు వచ్చేస్తుందా? కుటుంబానికి నెలకి ఇరవై రూపాయల చొప్పున మాత్రమే కలిగే ప్రయోజనం వెనుక నిజమైన ప్రయోజనం ఎవరికి?

అసలు ఈ రెండు రూపాయల బియ్యం పధకం అమలు మీద ఓ సర్వే చేయిస్తే, ఆసక్తికరమైన విషయాలెన్నో బయటికి వస్తాయి. ఉపాధి హామీ లాంటి పధకాల కారణంగా కూలీ రేట్లు గణనీయంగా పెరగడంతో, చాలామంది తెల్లకార్డులున్న వాళ్ళు సైతం 'మంచి బియ్యం' కొనడానికే మొగ్గు చూపుతున్నారు. మంచిదే! వాళ్ళకోసం కేటాయిస్తున్న సబ్సిడీ బియ్యం చాలావరకూ నల్ల బజారుకీ, అక్కడినుంచి లిక్కర్ తయారు చేసే బెవరేజేస్ లాంటి అనేకానేక చోట్లకి దారి మళ్ళుతున్నాయన్నది పేపర్లు చెబుతున్న మాట.

నిజానికి, ఇలా సబ్సిడీ బియ్యం ధర తగ్గించడం కన్నా బహిరంగ మార్కెట్లో కేజీ ఒక్కింటికి ముప్ఫై రూపాయలు పైచిలుకు పలుకుతున్న బియ్యం ధరకి కళ్ళాలు బిగిస్తే 'దారిద్ర్య రేఖకి దిగువున ఉన్న' వారితో సహా అనేకానేకమంది జనం ప్రభుత్వాన్ని మెచ్చుకునే వాళ్ళు. కానీ ఏం లాభం, అలా చేస్తే వ్యాపారస్తులంతా గుర్రుమని, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. జనం కన్నా, వాళ్ళ బాగు కొంచం ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళలో చాలామంది ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు, మరికొందరు పరోక్షంగా సహాయకారులు.

ఇలా సబ్సిడీ బియ్యం ధర తగ్గించడం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. పైగా, ఈ బియ్యాన్ని బ్లాకులో కొనుక్కునే వ్యాపారస్తులకి కొంచం బరువు తగ్గుతుంది కూడా. ప్రభుత్వమేమో పేదలకోసం తనెంత కష్టపడుతోందో పేపర్లలోనూ, టీవీల్లోనూ రంగురంగుల్లో చెప్పుకోవచ్చు. సబ్సిడీ కింద పోయేది ప్రజల సొమ్మే కాబట్టి, ఉన్న పన్నులు పెంచో, కొత్త పన్నులు వేసో జనం ముక్కు పిండి వసూలు చేసుకోవచ్చు. ఏమో, ప్రభుత్వం పని చేయడం లేదన్న అపప్రథని ఏ కొంచమైనా తగ్గించుకోవచ్చేమో కూడా.

మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

లేడి చంపిన పులి నెత్తురు

ఎమ్వీయస్ హరనాధ రావు పేరు వినగానే చాలామందికి ఓ సినీ సంభాషణల రచయిత గుర్తొస్తాడు. కానీ అంతకన్నా ముందు ఆయనొక కథకుడు. పదునైన కథలెన్నో రాసినవాడు. బహుశా, ఆ కథల్లో అలవోకగా పలికించిన నాటకీయత తర్వాతి కాలంలో సినిమా రచనని సులువుగా చేసేయడానికి దోహద పడిందేమో అనిపిస్తూ ఉంటుంది. హరనాథ రావు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' ఆసాంతమూ ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతూ, ఓ మంచి కథని చదివిన అనుభూతితో పాటు కొన్ని ప్రశ్నలనూ పాఠకుల ముందుంచే కథ.

కథా స్థలం ఊరిచివర హరిజనవాడ. నాయిక ఆ వాడలో ఉండే అరుంధతి. కానైతే వాడంతా అరుంధతిని నాయికలా చూడదు. చెడిపోయిన దానిని చూసినట్టుగా చూస్తుంది. ఎందుకంటే అరుంధతి చెడిపోయింది. చెడిపోతూనే ఉంది. రోజూ సాయంత్రం అవ్వడం ఆలస్యం కొడుకు కోటేశు పూలమాల తెచ్చి స్వయంగా అలంకరిస్తాడు అరుంధతిని. దగ్గరుండి మరీ 'పెద్ద దొర' కొష్టానికి తీసుకెళతాడు. తెల్లారాక, తల్లిని తీసుకుని వాడకి తిరిగి వస్తాడు.

ఆ ఊళ్ళో గాలీ, నీరూ, దేవుడూ, సత్యం, ధర్మ, న్యాయం తప్ప మిగిలినవన్నీ పెద్ద దొరవే. అటువంటి పెద్ద దొరకి ఎదురు తిరిగిన వాడు దాసు, అరుంధతి భర్త. దొరకి వ్యతిరేకంగా తన వాళ్ళని కూడగట్టాలన్న దాసు ప్రయత్నం ఫలించలేదు. దొరతో దాసు మాటల యుద్ధం మాత్రం, కొంత కాలానికే కర్రల యుద్ధంగా మారింది. అదిగో, అప్పుడు గూడెం నుంచి మద్దతు దొరికింది దాసుకి. మొదటిసారిగా ఒక అడుగు వెనక్కి వేస్తాడు దొర. అదీ ఆ ఒక్కరోజే.

వారం తర్వాత ఊరి చివర ఓ శవం. నాలుగు రోజుల క్రితం కలెక్టరాఫీసుకి వెళ్ళిన దాసు ఇంకా తిరిగి రాలేదు. కుక్కలు ముఖం పీక్కు తినేసిన ఆ భయంకరమైన శవం ఎవరో అడుక్కునే వాడిదని రిపోర్టు తయారైపోయింది. అంతకు ముందు రోజు రాత్రి దాసు పెద్ద దొర బీరువా తాళాలు బద్దలు కొట్టి పారిపోయాడని మరో రిపోర్టు కూడా. పోలీస్ ఇన్స్పెక్టర్ పెద్ద దొరకి స్వయానా మేనల్లుడు మరి. దొరికిన శవం దాసుది కాదన్న రిపోర్టు మీద వేలిముద్ర వేసిన అరుంధతి ఆ తర్వాత కొద్ది రోజులకే దొరకి లొంగిపోయింది.

అరుంధతి చేసిన పనిని హరిజనవాడ హర్షించలేదు. సూటి పోటి మాటలో చిత్రవధ చేసింది ఆ తల్లీ కొడుకులని. ఆమెని ఆ పల్లెలో తిట్టని వాళ్ళంటూ ఉంటే నోరులేని దేవుడూ, నోరున్నా మాట్లాడలేని పసి పాపలు మాత్రమే. చప్పుడు కాకుండా రోదించిందే తప్ప తన పధ్ధతి మార్చుకోలేదు అరుంధతి. తల్లిని దగ్గరుండి ప్రతి రాత్రీ దొర కొష్టానికి తీసుకెడుతూనే ఉన్నాడు కోటేశు. అరుంధతి ఇంటికి నిప్పు పెట్టాలా, అక్కరలేదా అన్న ఆలోచనలో పడింది పల్లె.

ఉన్నట్టుండి ఓ రోజున పెద్ద దొర చచ్చిపోయాడు. దక్షిణంవైపు పొలం దగ్గర చంపబడి ఉన్నాడు. పక్కన రక్తసిక్తమైన గొడ్డలి. ఇన్స్పెక్టర్, ఇతర పెద్దలూ రాగానే కోటేశు చెప్పడం మొదలు పెట్టాడు: "రాత్తిరి మామూలుగా మాయమ్మను తీసుకుని కొట్టం కాడికి వత్తున్నానండి. దారిలోనే అయ్యగారు కనిపించినారు. ఆల్లిద్దరినీ జతసేసి ఎనక్కు తిరిగాను. పెద్ద దొర ఎర్రి కేక పెట్టినాడు. వెనక్కి తిరిగి సూశాను. మా అయ్య.. ఆ గొడ్డలి తీసుకుని పెద్ద దొర ఎదురుగా నిలబడి 'ఎర్రి నాకొడకా - నీ ఇనప్పెట్టె కాదురా నీ తల బద్దలు కొడతాను. నా పెళ్ళాన్ని సెడగొడతావురా' అని నెత్తిమీద గొడ్డలేసిండు...."

"బిడ్డకు తల్లి పాలు ఎలా ఇస్తుందో శాస్త్ర ప్రకారం చెప్పే డాక్టరు వల్ల బిడ్డకు కడుపు నిండదు. పాలిచ్చే తల్లికావాలి. సమస్యలకు ప్రణాళికలు, ఉపన్యాసాలు కాదు కావాల్సింది. పరిష్కారాలను అమలుపరిచే చిత్తశుద్ధి, నైతిక బలం కావాలి," అంటారు హరనాథ రావు. 1977 లో తొలిసారి ప్రచురితమైన ఈ కత ఆధారంగానే రాజేంద్రప్రసాద్-యమునలతో 'ఎర్రమందారం' సినిమా తీశారు.

"ఈ కథలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉంది. కథనంలో ఆసక్తిని రేకెత్తించే సస్పెన్స్ ఉంది. వాక్య నిర్మాణంలో పడునుంది. రచయిత వ్యాఖ్యానంలో ధ్వని ఉంది. ముగింపులో చైతన్య స్పోరకమైన సూచన ఉంది. ఇంతకంటే ఓ మంచి కథకేం కావాలి?" అని అడుగుతారు దర్శక, రచయిత వంశీ, తన 'వంశీకి నచ్చిన కథలు' సంకలనంలో ఈ కథని చేర్చడానికి కారణాలు చెబుతూ. కా..నీ, వ్యక్తులని చంపడం ద్వారా మాత్రమే వ్యవస్థలో మార్పు సాధ్య పడుతుందా???

ఆదివారం, సెప్టెంబర్ 18, 2011

సుమనుడిచ్చిన 'ట్విస్ట్'

బుల్లితెరపై ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సుమన్ బాబు చేసిన తాజా ప్రయోగం 'ట్విస్ట్.' ఇంద్రనాగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రీమియర్ షో పేరులో ఒక ట్విస్టే ఉన్నా, ప్రేక్షకులని మాత్రం మూడుగంటల పాటు అనుక్షణం ట్విస్టుల్లో ముంచెత్తింది. తన కథల్లో హీరో ఎవరు, విలన్ ఎవరు అన్నది ప్రేక్షకులకి సస్పెన్స్ గా ఉంచడం, ఆ సస్పెన్స్ విప్పినవారికి ఖరీదైన బహుమతులు అందించడం అలవాటుగా ఉన్న సుమన్ బాబు (అన్నట్టు 'నాన్ స్టాప్ కామెడీ' శాంత్రో కారు విజేత ఎవరు?) ఈసారి కూడా అదే పోకడని కొనసాగించారు.

ముందుగా కొంచం పిడకల వేట. మహిళా రచయిత్రుల హవా నడిచిన రోజుల్లో వాళ్ళు అలవోకగా రాసేసిన నవలల కారణంగా కనీసం ఓ తరం మహిళలు ఒకలాంటి అసంతృప్తితో బతికేస్తున్నారేమో అనేది మా మిత్రుల మధ్య చర్చల్లో వచ్చే ఒకానొక విషయం. అతి సామాన్యమైన అమ్మాయిని వెతుక్కుంటూ ఓ ఆరడుగుల అందగాడు కారు తాళాలు గాల్లో ఎగరేసుకుంటూ రావడం ఆయా నవలల్లో సాధారణ విషయం అవ్వడం వల్ల, వాటిని చదివిన అమ్మాయిల్లో కొందరైనా అలాంటి వాడు రాక, వచ్చిన వాడిలో నవలానాయకుడి లక్షణాలు కనబడక నిట్టూర్పులు విడిచి ఉంటారు కదా అనుకుంటూ ఉంటాం.

ఈతరం కాలేజీ పిల్లల్లో ఎవరన్నా ఓ కుర్రాడిని - మరీ కెరీర్ ఓరియంటెడ్ కేసుని కాదు - టీకి పిలిచి కబుర్లలో పెట్టి చూడండి. వాళ్ళ నాన్న చిరంజీవో, నాగార్జునో కనీసం అల్లు అరవిందో అయినా కానందుకు వాడిలో ఏమూలో ఉన్న అసంతృప్తిని గమనించొచ్చు. తన తండ్రి ఫలానా అయితే, తను హీరో అవడానికి పుట్టుకతోనే పాస్పోర్టు దొరికేసేది కదా అన్న విషయాన్ని వాడు మర్చిపోలేడు గాక మర్చిపోలేడు. ఇప్పుడీ అసంతృప్తుల జాబితా మన సుమన్ బాబు కారణంగా మరికొంచం పెద్దదయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఇన్నాళ్ళూ దొరికిన భార్యతోనూ, పుట్టిన పిల్లలతోనూ, నా అంతటి వాడు లేడనుకుంటూ ఖుషీ ఖుషీగా బతికేస్తున్న కుటుంబరావుల గుండెల్లో చిచ్చు పెట్టేస్తున్నాడు సుమనుడు. "మా నాన్నకో టీవీ చానలూ, సినిమా స్టూడియో ఉండి ఉంటే, నేను కూడా విగ్గు పెట్టుకుని, దొరికిన వీరోవిన్నుతో డ్యూయట్లు పాడుకుని ఉందును కదా.." అని అనేకానేక మంది నిట్టూర్చడానికి కారణం కాబోతున్నాడు. అవును మరి బుల్లితెర మహానటి భావనతో కలిసి 'అందాల తారక.. అరుదైన కానుక..' అనే పాటకి వాళ్ళ నాన్నారి ఫిలింసిటీ వేదికగా వైవిద్యభరితమైన స్టెప్పు లేశాడు మన సుమన్ బాబు.

అడుగడుగునా ట్విస్టులే ఉన్న తాజా ప్రీమియర్ షోను గురించి పూర్తిగా చెప్పాలంటే బ్లాగర్లో గూగులమ్మ ఇచ్చిన చోటు చాలదు. అయినప్పటికీ ఏదో, కొండని అద్దంలో చూపించే ప్రయత్నం. కొండంత మంచి మనసున్న మంచి మనిషి శ్రీరామ్ కి ఏదో శాపం పెట్టినట్టు అన్నీ కష్టాలే. బహుశా ఆ పాత్ర పోషించింది సుమన్ బాబు అని తెలియడం వల్ల శ్రీరామ్ ని లెక్కకి మిక్కిలి కష్టాలు చుట్టుముట్టి ఉండొచ్చు. ఇళయరాజా స్వరాలని గుర్తు చేసేవిధంగా భోలేషా వలీ మీటిన విషాద వాయులీనాల సాక్షిగా శ్రీరామ్ హీనస్వరంతో ఏకరువు పెట్టే కష్టాలని వింటుంటే రాళ్ళైనా కరగాల్సిందే. అలాంటిది రాయిలాంటి పోలీసాఫీసర్ శిరీష (ప్రవళిక) కరగదా?

సరే, కథని మూడు ముక్కల్లోకి కుదించుకుందాం. తన కష్టాలని మర్చిపోవడం కోసం, ఓ పెద్ద నగరంనుంచి బయలుదేరిన శ్రీరామ్ ఆర్టీసీ వారి ఆర్డినరీ బస్సెక్కి, కళ్ళు చెదిరే తన పల్లెటూరి ప్యాలస్ చేరుకుంటాడు. చిన్నప్పుడెప్పుడో చూసిన పని వాళ్ళు చటుక్కున గుర్తు పట్టేసి, ఆనంద భాష్పాలతో ముంచెత్తుతారు. తను పేరు కూడా మర్చిపోయిన చిన్న నాటి స్నేహితుడు వచ్చి, తనని తాను పరిచయం చేసుకుని చెల్లెలి పెళ్లికి ఆహ్వానించడం, ఆ పెళ్ళికూతురు 'వెన్నెల' శ్రీరామ్ కి అంతకు ముందే పరిచయం ఉండడం, 'ముత్యాలముగ్గు' సినిమాలోలాగా తాళి కట్టబోతుండగా పెళ్ళికొడుకుని పోలీసులు అరెస్టు చేయడంతో, నడిచే దేవుడైన శ్రీరామ్ తన స్నేహితుడి కోసం వెన్నెల మెళ్ళో తాళి కట్టేయడం చక చకా జరిగిపోతాయి.

ప్యాలస్ లాంటి సొంతిల్లు వదిలేసి, తన పనివాళ్ళతో సహా బావమరిది మామూలు ఇంటికి మకాం మార్చేస్తాడు శ్రీరామ్ (కాస్ట్ కటింగ్ అనుకుంటా). కాపురం మొదలెట్టబోతుండగా, మొదటి భార్య రాధిక ఆటో దిగడం, అప్పటికే నేను ఎన్నోదో మర్చిపోయిన ట్విస్ట్ ఈ కథలో. వెన్నెలతో సహా అందరూ ఆ వచ్చినావిడ రాధికే అంటారు, ససేమిరా కాదంటాడు శ్రీరామ్. కాదని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నించి భంగపడతాడు. ప్రతి ప్రయత్నంలోనూ ఒక ట్విస్ట్. మరావిడ రాధిక కాకపోతే ఎవరన్నది, మామూలుగా అయితే పోలీసులు లాకప్పులో వేసి ఇంటారాగేట్ చేస్తే తెలిసిపోయే విషయం. కానీ ఆ నిజం శ్రీరామ్ చేత చెప్పించడానికి పోలిస్ డిపార్ట్మెంట్, సి.బి.ఐ. లాంటి సంస్థల్లోపెద్ద ఉద్యోగులంతా పన్లు మానుకుని, మారు వేషాలు వేసుకుని ఇతగాడి చుట్టూ చేరడమే చివరికి అసలైన ట్విస్ట్. సుమన్ బాబా? మజాకానా?

నటీనటులు అందరూ కూడా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికీ పది రూపాయల అవుట్పుట్ ఇవ్వడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులతో పోటీ పడ్డారు. ప్రతిపాత్రా శ్రీరామ్ ని ప్రతి డైలాగులోనూ పొగిడే విధంగా సంభాషణలు రాయబడ్డాయి. సుమన్ బాబు నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది.. ఎప్పటిలాగే అన్నిభావాలూ అభావంగా పలికించేశాడు. మేకప్,కాస్ట్యూమ్స్ విషయంలో సుమనుడు ఎప్పట్లాగే రాజీ పడలేదు. కాకపోతే రెండు మొదటి రాత్రుల్లోనూ ఒకే దుస్తులు ధరించడం కొంచం నిరాశ పరిచింది. అలాగే తొలి పెళ్ళిలో ధరించిన ఆకుపచ్చ టీ షర్ట్ మళ్ళీ ఓసారి రిపీటయ్యింది కూడా. దర్శకుడు ఇలాంటివి సరిద్దుకోవాలి. టైటిల్స్ దగ్గరనుంచి ప్రతి విషయంలోనూ 'కళ్ళు చెదిరేలా చేయడం' అన్నది ఆశయంగా పెట్టుకున్నాడు దర్శకుడన్నది సుస్పష్టం. కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు కలిగిన కళ్ళు (బుర్ర) తిరుగుడు ఇంకా తగ్గలేదంటే, 'ట్విస్ట్' ఇవ్వడంలో దర్శకుడు కృతకృత్యుడయినట్టే.

శుక్రవారం, సెప్టెంబర్ 16, 2011

నా రక్తంతో నడుపుతాను రిక్షానూ..

రిక్షా ఎక్కడం అంటే భలే సరదాగా ఉండేది చిన్నప్పుడు. దర్జాగా, చాలా గొప్పగా అనిపించేది. ఏం లాభం, ఎప్పుడు పడితే అప్పుడు రిక్షా ఎక్కడానికి ఉండేది కాదు. 'చక్కగా రెండెడ్ల బండి ఇంట్లో పెట్టుకుని, రిక్షా ఎందుకూ?' అనేవాళ్ళు ఇంట్లో. దాంతో పొరుగూళ్లలో గుళ్ళకీ, ఎప్పుడన్నా సినిమాలకీ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్సెక్కడానికీ మా బండిలోనే వెళ్ళాల్సి వచ్చేది. బండికూడా సరదాగానే ఉంటుంది, రిక్షా దర్జా వేరు.

నెమ్మదిగా నాకో విషయం అర్ధమయ్యింది. ఎప్పుడన్నా మేం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, బస్సు దిగ్గానే మా బండి కనిపించక పోతే రిక్షా బేరం చేసేది అమ్మ. "కిట్టదండమ్మా..ఆ ఊరికి రోడ్రే లేదు.. ఎంతిచ్చినా మేం రాలేం" అని నిష్కర్షగా చెప్పేసేవాళ్ళు రిక్షావాళ్ళు. కొన్నాళ్ళకి మా ఊరికి రోడ్డు లాంటిది రావడం, మా బండి వెళ్లిపోవడంతో అప్పుడప్పుడూ రిక్షా ఎక్కే అదృష్టం దొరికింది. ఇరుక్కుని, ఓ మూల కూర్చోవాల్సి వస్తేనేమి? మయూర సింహాసనం మీద కూర్చున్న షాజహాన్ కూడా అంతటి ఆనందం అనుభవించి ఉండడు.

"మీ ఊళ్ళో రిక్షాలు భలేగా ఉంటాయిరా.. ఎంచక్కా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది" అని హైదరాబాదులో ఉండే అత్తయ్యల పిల్లలు చెబుతుంటే, మా రిక్షాల ప్రత్యేకత తెలిసేది కాదు. ఓసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు చూశాను కదా. అబ్బే, నేల టిక్కట్లో కూర్చుని సినిమా చూసినట్టుగా కింద కూర్చోవాలి. గూనిగా నడుం ఒంచాలేమో, బయట రోడ్డుమీద ఏం చూడడానికీ ఉండదు. అదే మా రిక్షాలైతే, కుర్చీ టిక్కట్లో కూర్చుని సినిమా చూసినట్టే. పైన టాపు కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దంటే తీసేయమనొచ్చు.


రిక్షా ఇంకా గొప్పదన్న విషయం మరికొంచం పెద్దై సినిమాలు చూడ్డం అలవాటయ్యాక అర్ధమయ్యింది. డబ్బు అవసరం వస్తే చాలు, హీరోలు రాత్రుళ్ళు రిక్షాలు తొక్కి బోల్డు బోల్డు డబ్బులు సంపాదించడం చూసి, నేను కూడా పెద్దయ్యాక రాత్రిళ్ళు రిక్షా తొక్కాలని నిర్ణయించేసుకున్నాను. ఉద్యోగం కోసం ఊరు విడిచి పెట్టేటప్పుడు అమ్మ జాగ్రత్తలు చెబుతూ "డబ్బులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకో బాబూ," అని చెబితే, "అవసరమైతే రాత్రుళ్ళు రిక్షా తొక్కుతాలే అమ్మా," అని వాతావరణం తేలిక చేశాను. తర్వాతెప్పుడో అమ్మ మర్చిపోకుండా అడిగింది, "రిక్షా తొక్కుతున్నావా?" అని.

చూస్తుండగానే రిక్షాలు నెమ్మది నెమ్మదిగా అదృశ్యం అయిపోతున్నాయి. రిక్షాల స్థానంలో ఆటో రిక్షాలు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా కనిపిస్తున్నాయి. పట్టణాలలో అక్కడక్కడా రిక్షాలు కనిపిస్తున్నా వాటిని ఆదరించే వాళ్ళు కనిపించడం లేదు. రిక్షా కన్నా ఆటో వేగంగా వెళ్ళడం ఒక కారణం అయితే, మన బరువు మరో మనిషి మీద మోపడం ఏమిటన్న సెన్సిబిలిటీ మరో కారణం. రిక్షా నాగరీకం కాదన్న వాదన కూడా ఉంది. చివరికి స్కూలు రిక్షాల స్థానంలో కూడా స్కూల్ ఆటోలు వచ్చేశాయి.

రిక్షా మీద నాకున్న ప్రత్యేకమైన అభిమానం వల్ల అనుకుంటాను, ఆర్. నారాయణ మూర్తి 'ఒరేయ్! రిక్షా' సినిమా తీసినప్పుడు దాన్ని నావంతుగా ఆదరించాను - నేనెప్పుడూ ఏ రిక్షానీ 'ఒరేయ్' అని పిలవకపోయినా సరే. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు పాటల్లో ఒకటి "నా రక్తంతో నడుపుతాను రిక్షానూ.. నా రక్తమే నా రిక్షకు పెట్రోలూ...పెట్రోల్ ధర పెరిగిందీ...డీజిల్ ధర పెరిగిందీ.. నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి ..ఏయ్.. " అప్పటినుంచీ తరచూ పాడుకుంటూ ఉంటాను. మరీ ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఈ పాట అప్రయత్నంగా నా నోటెంట వచ్చేస్తుంది. ఇవాళ పొద్దున్నుంచీ ఇదే పాట పాడుకుంటున్నానని వేరే చెప్పక్కర్లేదు కదా.

గురువారం, సెప్టెంబర్ 15, 2011

మల్లాది 'పరంజ్యోతి'

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ని గురించి చెప్పడానికి కొత్తగా ఏముంది? మధ్యతరగతి జీవితాలని మల్లాదంత అందంగా చిత్రించిన కమర్షియల్ రచయిత మరొకరు లేరనడం అతిశయోక్తి అనిపించదు నాకు. మల్లాది నవలల్లో 'అందమైన జీవితం' 'మందాకిని' లాంటి కొన్ని నవలలు ఇప్పటికీ నా ఆల్ టైం ఫేవరెట్స్ జాబితాలో ఉన్నాయి. 'తేనెటీగ' 'కల్నల్ ఏకలింగం ఎడ్వంచర్స్' లాంటి శృంగార రస ప్రధానమైన నవలలు రాసిన మల్లాది ఈమధ్యన తన బాణీని పూర్తిగా మార్చుకుని ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు!

గత కొంతకాలంగా కమర్షియల్ నవలలు చదవడం తగ్గించిన నాకు చాలా మంది మిత్రులు చదవమని సూచించిన నవల మల్లాది రాసిన 'పరంజ్యోతి.' ఈమధ్యనే చదివాను. ముఖచిత్రం చూడగానే ఆమధ్యనెప్పుడో చదివిన రాబిన్ శర్మ ఆంగ్ల రచన 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెర్రారీ' జ్ఞాపకం వచ్చింది. కానీ, రెంటికీ ఉన్న పోలిక రేఖామాత్రం. మల్లాది నవలల్లో ఆకట్టుకునేది ఆసాంతమూ విడిచిపెట్టకుండా చదివించే శైలి, ప్రతి చిన్న విషయాన్నీ పాఠకులందరికీ అర్ధమయ్యేలా ఓపికగా వివరించే విధానం. 'పరంజ్యోతి' లోనూ అదే శైలి కొనసాగించారు.

ఒకే శరీరంతో రెండు జన్మల జీవితాన్ని గడిపిన పరంజ్యోతి కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు నూట పాతిక సంవత్సరాల క్రితం. కథాస్థలం గోదారి ఒడ్డున ఉన్న నెమలికొండ సంస్థానం (ఎంత అందమైన పేరు!). సంస్థానాదీశుడు కనుమూరి భూపతిరాజు మూడో కొడుకు రామరాజు కి జీవితం ఉన్నది అన్నీ అనుభవించడానికే అని ఓ బలమైన నమ్మకం. "మరణం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఆంటాడు.

పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న రామరాజుకి ఆ సంస్థానంలో అక్షరాలా ఆడింది ఆట. తండ్రి, ఇద్దరు అన్నలు, అక్క కుముదినీ దేవి, అమ్మమ్మ జానకీబాయి ఎవరూ కూడా అతనికి ఎలాంటి అడ్డూ చెప్పరు. మద్యమూ, మగువా యవ్వనారంభంలోనే పరిచయమై విడదీయలేని వ్యసనాలవుతాయి. అహల్యతో వివాహమైనా, భార్యతో అతడు గడిపింది బహు కొద్ది కాలం. ఆ సాంగత్య ఫలితంగా ఓ కొడుక్కి జన్మనిస్తుంది అహల్య. పరస్త్రీలలో,మరీ ముఖ్యంగా గణికల్లో కనిపించే సౌందర్యం తన ఇల్లాలిలో కనిపించదు రామరాజుకి.

సుఖవ్యాధులతో మంచం పట్టిన రామరాజు మీద అహల్య ఎంతటి అసహ్యాన్ని పెంచుకుంటుందంటే, తన అన్న సాయంతో భర్తకి ఇచ్చే ఔషధాలలో విషం కలిపి తినిపించేస్తుంది. ఆస్థాన వైద్యుడితోపాటు, బ్రిటిష్ ప్రభుత్వపు డాక్టరూ రామరాజు మరణాన్ని ధృవపరిచాక గోదావరి తీరాన అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతాయి. చితికి పెట్టిన నిప్పు కాలడం మొదలవ్వగానే, ఉన్నట్టుండి వర్షం వచ్చి, గోదారి పొంగి రామరాజు దేహం నదిలో కొట్టుకుపోతుంది. పాపికొండల సమీపంలోని గుర్రం కొండలో ధ్యానం చేసుకునే సన్యాసి సహజానంద స్వామి, రామరాజుకి కాయకల్ప చికిత్స చేసి కోలుకునేలా చేస్తాడు. గతాన్ని పూర్తిగా మర్చిపోయిన అతనికి 'పరంజ్యోతి' పేరుతో కొత్త జీవితాన్ని ఇస్తాడు.

సహజానందతో పన్నెండేళ్ళ ఆధ్యాత్మిక సాహచర్యం తర్వాత పరంజ్యోతికి అనూహ్యంగా తన గత జీవితం గుర్తొచ్చి నెమలికొండకి ప్రయాణం అవ్వడం, అహల్య అతన్ని రామరాజు కాదనడం, కోర్టు కేసు... ఇలా ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన మలుపులతో ముగింపుని చేరుతుంది. రక్తినీ, భక్తినీ, ఆధ్యాత్మిక విషయాలనీ రాచిళ్ళ రాజకీయాలనీ సమపాళ్ళలో రంగరించి రాసిన ఈ నవలలో, 'నర్మదా పరిక్రమ' లాంటి అతి కొద్ది మంది మాత్రమే తెలిసిన ఎన్నో విషయాలని ఎంతో విశదంగా రాశారు మల్లాది. సన్యాసుల జీవితం, వారు చేసే పనులన్నింటి వెనుకా ఉండే పరమార్ధాన్ని కథ పరిధి మించని విధంగా వివరించారు. ఎంతో క్లిష్టంగా అనిపించే వేదాంత విషయాలని సైతం అందరికీ తెలిసిన ఉదాహరణలతో సులభంగా చెప్పడం ఈ నవల ప్రత్యేకత.

అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం ప్రయాణించిన పరంజ్యోతి, తన గతం గుర్తు రాగానే "నన్ను చంపాలని ప్రయత్నించిన వారికి నేను శిక్ష పడేలా చేయాలి" అని ఐహికంగా మాట్లాడడం ఏమిటో అర్ధం కాలేదు. సహజానంద సహవాసంలో సంపాదించిన జ్ఞానం ద్వారా అతడు అప్పటికే వారిని క్షమించగలిగేంత ఎత్తుకన్నా ఎదిగి ఉండాలి, లేదా తన మీద జరిగిన హత్యా యత్నం అన్నది తన చర్యలకి ప్రతిచర్యగా జరిగిందని అయినా అర్ధం చేసుకుని ఉండాలి. ఓ చిన్నపాటి జెర్క్ తో మొదలయ్యే కథనం అనూహ్యంగా వేగం పుంజుకుని ఆ సాంతమూ విడిచిపెట్టకుండా చదివిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చే నవల ఇది. (లిపి పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 260, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, సెప్టెంబర్ 12, 2011

ఇదేం బాలేదు వంశీ...

వంశీ నాకు మొదట పరిచయమయ్యింది సిని దర్శకుడిగా. కొన్ని సినిమాలు నచ్చాయి మరి కొన్ని నచ్చలేదు.. తర్వాత తన కథలూ, నవలలూ చదివాను.. వీటిలోనూ కొన్ని నచ్చాయి, మరికొన్ని నచ్చలేదు. ఇప్పుడు పుస్తక ప్రచురణలో అయితే వంశీ అనుసరిస్తున్న పధ్ధతి అస్సలు నచ్చక పోగా కోపం రప్పిస్తోంది. చిన్నగా మొదలైన ఓ అసంతృప్తి, ఇవాళ పుస్తకాల షాపుకి వెళ్ళడంతో బాగా పెద్దదయ్యింది.

పుస్తకాలు చూస్తుండగా, "సార్, 'వంశీకి నచ్చిన కథలు' హార్డ్ బౌండ్ వచ్చింది.. తీసుకుంటారా?' అని షాప్ అబ్బాయి అడిగినప్పుడు చూశాను. తళతళ లాడే హార్డ్ బౌండ్ పుస్తకాన్ని. "ఇంతకు ముందు బైండు లేకుండా వచ్చింది కదా. అది తీసుకున్నారు. ఇది ఎప్పుడు వేశారు?" చాలా మామూలుగానే అడిగాను. "అప్పుడే వేశారు సార్. కానీ ఇప్పుడే అమ్మకానికి పెట్టారు," అతనూ మామూలుగానే చెప్పాడు కానీ, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అర్ధం చేసుకోడానికి కొంచం టైం పట్టింది నాకు.

ఎనిమిదేళ్ళ క్రితం ఎమెస్కో ప్రచురించిన 'ఆనాటి వానచినుకులు' వంశీ కథల తొలి సంకలనం. 'అలా అన్నాడు శాస్త్రి!' 'ఆకుపచ్చని జ్ఞాపకం' లాంటి ఎన్నో చక్కని కథలు ఉన్నాయి అందులో. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ వైవిద్యభరితమైన కథ, కథనం ఉన్న కథలే. తర్వాత వరుసగా వంశీ నవలలు 'మహల్లో కోకిల,' 'మంచుపల్లకీ,' 'రవ్వలకొండ,' 'గాలికొండపురం రైల్వే గేటు,' 'వెన్నెల బొమ్మ' నవలని ప్రచురించింది ఎమెస్కో. ఒక్క 'వెండితెర నవలలు' మాత్రం సాహితి వాళ్ళు మార్కెట్లోకి తెచ్చారు.

స్వాతిలో సీరియల్ గా వచ్చిన 'మా పసలపూడి కథలు' సంకలనాన్ని తొలుత ఎమెస్కోనే ప్రచురించింది. స్వాతిలో కథలకి అప్పటికే బాగా పేరు రావడం వల్ల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అప్పుడు రంగ ప్రవేశం చేసింది కుట్టిమాస్ ప్రెస్ ప్రచురణ సంస్థ. అప్పటి వరకూ నలుపు తెలుపుల్లో ఉన్న 'మా పసలపూడి కథలు' సంకలనంలో బాపూ బొమ్మలకి రంగులద్ది, దాదాపు రెట్టింపు ధరతో మార్కెట్లోకి వదిలింది. రంగుల బొమ్మల కోసం చాలామంది ఈ పుస్తకాన్ని కొన్నారు.

ఈ స్పందన చూసే కావొచ్చు, 'ఆనాటి వానచినుకులు' సంకలనం లో ఉన్న కథలకి బాపూ చేత బొమ్మలు వేయించి, వంశీ రాసిన మరికాసిని కొత్త కథలు కలిపి 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతో రంగుల సంకలనం తెచ్చింది. మూడొందల అరవై పేజీల ఈ పుస్తకం వెల అక్షరాలా మూడొందల యాభై రూపాయలు. నాణ్యమైన ప్రచురణ, అందమైన బొమ్మలు.. ఐతేనేం? ముప్పాతిక మూడొంతుల కథలు అప్పటికే చదివేసినవి. అన్నీ కొత్త కథలు అయితే బాగుండును కదా అనిపించింది.

స్వాతిలో 'మా దిగువ గోదారి కథలు' సీరియల్ గా వస్తుండగానే, తనకు నచ్చిన కథకుల యాభై కథలతో వంశీ వెలువరించిన పుస్తకం 'వంశీకి నచ్చిన కథలు' కుట్టిమాస్ ప్రెస్ ప్రచురించిన ఈ నాలుగొందల డెబ్భై పేజీల పుస్తకం వెల రెండువందల రూపాయలు. తర్వాత ఇలియాస్ ఇండియా బుక్స్ సంస్థ 'మా దిగువ గోదారి కథలు' సంకలనాన్ని బాపూ రంగుల బొమ్మలతో విడుదల చేసింది. ఐదొందల పందొమ్మిది పేజీల పుస్తకం వెల నాలుగొందల డెబ్భై ఐదు రూపాయలు. ఈ పుస్తకం స్టాండ్స్ లో ఉండగానే ఇప్పుడు 'వంశీకి నచ్చిన కథలు' హార్డ్ బౌండ్ తో, రెండొందల యాభై రూపాయల వెలతో కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.

కుట్టిమాస్ ప్రెస్, ఇలియాస్ ఇండియా ప్రెస్ అనేవి వంశీకి చెందిన ప్రచురణ సంస్థలే అని వినికిడి. ఎంతవరకూ నిజమన్నది తెలియదు. కానీ, పుస్తకాల ప్రచురణలో వంశీ ఈమధ్యకాలంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడన్నది అత్యంత శ్రద్ధగా తీర్చిదిద్దిన సంకలనాలని చూస్తుంటే అప్రయత్నంగానే అర్ధమవుతోంది. ఇప్పుడు నన్ను వేధించే ప్రశ్నలు: ఒకే పుస్తకాన్నే నలుపు-తెలుపు లో ఒకసారి, రంగుల్లో మరోసారి, సాదా బైండుతో ఒకసారి, హార్డ్ బౌండ్ తో మరోసారి, అవే కథలని పుస్తకం పేరు మార్చి మళ్ళీ మళ్ళీ విడుదల చేయడం అన్నది ఎంతవరకూ సబబు?

ప్రచురణ సంస్థలు తనవి అయినా, కాకపోయినా, పాఠకులు పుస్తకాలు కొనేది రచయిత పేరు చూసే కానీ, ప్రచురణ సంస్థ పేరు చూసి కాదు కదా.. పైగా ఈ పునః ప్రచురణలు జరుగుతున్నది ఏళ్ళ గ్యాప్ తర్వాత కాదు. ఒక ప్రింట్ అమ్మకం మొదలైన కొన్నాళ్ళకి మార్పులు చేర్పులతో మరో ప్రింట్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. "అందరూ మమ్మల్ని అడుగుతున్నారు సార్," అన్న పుస్తకాల షాపతని మాటల సాక్షిగా, ఈ మార్పు చేర్పుల వల్ల పాఠకులతో పాటు, షాపుల వాళ్ళూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడు ఇంక వంశీ పుస్తకం వచ్చిందంటే, 'మార్పు చేర్పులతో మళ్ళీ వస్తుందేమో.. కొన్నాళ్ళు ఆగుదాం' అనిపిస్తోంది.. వంశీ, ఎందుకిలా??

శుక్రవారం, సెప్టెంబర్ 09, 2011

లలిత సంగీతపు తొలి స్వరం

ప్రముఖ స్వరకర్తా, గేయ రచయితా అయిన తొంభై రెండేళ్ళ పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీతాన్ని తెలుగు లోగిళ్ళకి చేర్చే బృహత్కార్యానికి ఆద్యుడు . తెలుగు సంగీతపు ప్రముఖులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, తొలి తెలుగు సిని నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మొదలు, నేటి మేటి గళాలు వేదవతీ ప్రభాకర్, చిత్తరంజన్, కేబీకే మోహన్ రాజు వంటి ఎందరెందరో కళాకారులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలగుమ్మి శిష్యరికం చేసిన వారే.

'అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా.. ' 'మా ఊరు ఒక్కసారి పోయిరావాలి' లాంటి ఎన్నెన్నో లలితగీతాలు తెలుగువారిళ్ళలో వినబడుతూనే ఉంటాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి కలం నుంచి జాలువారిన 'నీపదములే చాలు రామా..' 'రామచరణం..' లాంటి భక్తి పాటలూ, 'నారాయణ నారాయణ అల్లా అల్లా...' వంటి సమైక్య గీతాలూ పాలగుమ్మి విశ్వనాథం స్వర రచన చేసిన వాటిలో కేవలం కొన్ని మాత్రమే. మహాత్ముడి 'గాంధీ శకాన్ని' గుర్తుకు తేవడం కోసం, స్వతంత్ర సమరంలో పాల్గొన్న ఎందరో కవులు ఆలపించిన దేశభక్తి గేయాలని ఎంతో శ్రమదమాదులకోర్చి సేకరించడమే కాదు, వాటిని అవే బాణీలలో భద్రపరిచారు కూడా.

విశ్వనాథం కేవలం స్వరకర్త మాత్రమే కాదు, శక్తివంతమైన గొంతున్న గాయకుడు కూడా. సంగీత కార్యక్రమాల రూపకర్తగా ఆకాశవాణి కి సుదీర్ఘ సేవలందించిన క్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల వరకూ, దాశరధి మొదలు డాక్టర్ సి. నారాయణ రెడ్డి వరకూ ఎందరెందరో కవుల కవితలకి స్వరాలద్దారు. బసవరాజు అప్పారావు, మల్లవరపు విశ్వేశ్వర రావు, బాలాంత్రపు రజనీకాంత రావు, చింతా దీక్షితులు, అడివి బాపిరాజు, గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభుతుల గీతాలెన్నో నేటికీ చిరంజీవులుగా ఉన్నాయంటే అందుకు కారణం పాలగుమ్మి స్వర రచనే.

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూళ్ళో 1919 లో జన్మించిన పాలగుమ్మి విశ్వనాథానికి సంగీతం చిన్ననాడే పరిచయమయ్యింది. అమ్మ, నాయనమ్మ పాడుకునే తరంగాలూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ ఆయన్ని ప్రభావితం చేశాయి. కథకుడిగా, నవలా రచయితగా ప్రసిద్ధుడైన పాలగుమ్మి పద్మరాజు ఈయనకి స్వయానా అన్నగారు కావడంతో సాహిత్యాభిలాషా మొదలయ్యింది. "అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి 'సంగీత భూషణ' పురస్కారం అందుకున్న కాకినాడ వాసి మర్ల సూర్యనారాయణ మూర్తి నా తొలిగురువు. అటుపై, విఖ్యాత వైణికులు ఈమని శంకర శాస్త్రి శిష్యరికమూ చేశాను," అంటూ గుర్తు చేసుకుంటారు విశ్వనాథం. ఈమని ప్రభావంతో వీణనీ సాధన చేశారు.

చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియోస్ లో ఈమని స్వరకర్తగా చేరడంతో, విశ్వనాథం కూడా చెన్నపట్టణం చేరారు. ప్రముఖ నర్తకుడు ఉదయ శంకర్ బృందంలో సంగీత కళాకారుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. "ఉదయ శంకర్ నిర్మించిన 'కల్పన' సినిమాకి, విష్ణుదాస్ సరాళి సంగీత బృందంలో పని చేశాన్నేను. అదే సమయంలో, వాగ్గేయకారుల కృతులపై సాధికారికత ఉన్న సంగీతజ్ఞుడు ఎస్. రామనాథాన్ని కలిశాను. కర్ణాటక సంగీతంలో కొత్త కోణాలని తెలుసుకునేందుకూ, ఈ సంగీతాన్ని ఇతర సంగీత ప్రక్రియల్లో ఉపయోగించుకోగలిగే మెళకువలని అర్ధం చేసుకోడానికీ సాయపడిందీ పరిచయం," అంటారీ సంగీతజ్ఞుడు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1955 లో ఉద్యోగంలో చేరడం విశ్వనాథం సంగీత ప్రయాణంలో ఓ మేలిమలుపు. అప్పటికే అక్కడ ఉద్యోగులుగా ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, గోపీచంద్, నాయని సుబ్బారావు వంటి ఎందరో కవులు, కళాకారుల సాహచర్యం దొరికిందాయనకి. "రేడియో వినే సామాన్య శ్రోతలకి శాస్త్రీయ సంగీతపు సారాన్ని లలిత సంగీతం ద్వారా అందించే ప్రయత్నం చేశాన్నేను," అని చెప్పే విశ్వనాథం, కృష్ణశాస్త్రితో కలిసి ఎన్నో సంగీత రూపకాలు రూపొందించారు. ఆరోజుల్లో వీరిరువురి సారధ్యంలో వచ్చిన గీతం లేకుండా ఆకాశవాణిలో ఒక్క ఉగాది కార్యక్రమమూ లేదన్నది అతిశయోక్తి కాదు.

"ఆరోజుల్లో నేను వీణ వాయిస్తుంటే, ఆ వీణా నాదానికి అనుగుణంగా కృష్ణశాస్త్రి ఆశువుగా గేయాలల్లేవారు," అంటారు విశ్వనాథం. వీరద్దరి కలయికలో వచ్చిన గీతాల్ని ఇప్పటికీ 'లలిత సంగీతపు స్వర్ణయుగ సంపద' గా గుర్తు చేసుకుంటారు సంగీత ప్రేమికులు. 'రసతరంగిణి,' బాలమురళి పాటలతో చేసిన 'సాహిత్యంలో చందమామ,' ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాలిపాటలపై తులనాత్మక అధ్యయనం 'ఉయ్యాల జంపాల' ...ఇవి విశ్వనాథం రూపుదిద్దిన కొన్ని అరుదైన సంగీత రూపకాలు. చిరంజీవత్వం సాధించుకున్న ఈపాటలన్నీ ఆకాశవాణి భాండాగారాన్ని పరిపుష్టం చేశాయి. 'రవీంద్ర సంగీత్' ప్రభావంతో టాగోర్ గీతాలకు తెలుగులో స్వేచ్చానువాదం చేసి బాణీలు కట్టారు.

పిల్లల కోసం, పరిశ్రమలలోనూ, పొలాల్లోనూ పని చేసే కార్మికుల కోసం, మహిళల కోసం విశ్వనాథం స్వరపరిచిన లలితగీతాలు ఇప్పటికీ రేడియోలో ప్రసారమవుతున్నాయి. ఆకాశవాణిలో పదవీ విరమణ అనంతరం డచ్ కి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ హ్యూబర్ట్ కోరిక మేరకు సికిందరాబాద్ లో ఉన్న అమృతవాణి క్రైస్తవ మిషన్ కి భక్తి గీతాలు సమకూర్చారు విశ్వనాథం. వీటికి తన సంగీత ప్రస్థానంలో విలువైన చోటుందంటారు. రేడియో సిలోన్ తో పాటుగా ఫిలిప్పీన్స్ కి చెందిన రేడియో వేరిటాస్ లోనూ ప్రసారమయ్యాయీ గీతాలు. ఆడపిల్లని అత్తవారింటికి పంపాక ఆమె తల్లిదండ్రులు పడే బాధకి అక్షర రూపమిస్తూ 'అమ్మదొంగా..' పాటని రచించి స్వరపరిచారాయన.

లలిత సంగీతాన్ని బోధనాంశంగా చేర్చడానికీ, అవసరమైన అధ్యాపకుల్ని తయారు చేయడానికీ పాలగుమ్మి విశ్వనాథం సేవలని అర్ధించింది తెలుగు విశ్వవిద్యాలయం. "నేనెంతో భక్తితో నిర్వహించానా బాధ్యతని. పాఠాలనీ, అధ్యాపకులనీ తయారు చేయడంతో పాటుగా, లలిత సంగీతం పుట్టుక, విస్తరణని వివరిస్తూ విశ్వవిద్యాలయం కోసం ఓ పుస్తకాన్ని కూడా రాశాను," అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'హంస' అవార్డుతో పాటుగా, ఎన్నో సంస్థల సత్కరాలనీ అందుకున్నారు విశ్వనాథం.

(నేనింకా శారదా శ్రీనివాసన్ రేడియో అనుభవాల అనుభూతుల్లో ఉండగానే, ఇవాల్టి ఉదయం 'Straddling the world of light music' శీర్షికతో Friday Review సంచికలో పాలగుమ్మి విశ్వనాథం గురించి ఓ కథనాన్ని ప్రచురించింది The Hindu దినపత్రిక. గుడిపూడి శ్రీహరి గారి కథనాన్నితెనిగించే ప్రయత్నం ఇది. ఫోటో సౌజన్యం The Hindu).

గురువారం, సెప్టెంబర్ 08, 2011

'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు'

మూడు తరాల తెలుగు శ్రోతలకి రేడియో అనగానే మొదట గుర్తొచ్చే పేర్లలో తప్పకుండా ఉండే పేరు శారదా శ్రీనివాసన్. నావరకు నేను, "అరవావిడైనా తెలుగు ఎంత చక్కగా నేర్చుకుని మాటాడుతోందో" అనుకున్నాను, చాలాసార్లు రేడియోలో ఆవిడ గొంతు వింటూ. కానైతే నా ఆలోచన ఎంత తప్పో చాలా ఆలస్యంగా తెలిసింది. పదహారణాల తెలుగాడపడుచు కాజ శారదా కుమారి, రేడియోలో ప్రయోక్తగా చేరి అదే రేడియో స్టేషన్లో వేణు గాన కళాకారుడిగా పనిచేస్తున్న ఎన్నెస్ శ్రీనివాసన్ ని ప్రేమవివాహం చేసుకుని శ్రీమతి శారదా శ్రీనివాసన్ గా మారిందన్న సంగతి ఆవిడ స్వీయ రచన 'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు' చదివాకే తెలిసింది.

ఇదొక్కటేనా? పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శారద, రేడియోలో చేరడానికి ముందు అసలు రేడియో కార్యక్రమాలేవీ వినలేదనీ, మూడున్నర దశాబ్దాల పాటు లక్షలాది శ్రోతల్ని అలరించిన ఆవిడ గొంతును తొంభయ్యేళ్లకి పైబడి జీవించిన ఆవిడ తండ్రిగారు కనీసం ఒక్కరోజు కూడా రేడియోలో విననేలేదనీ కూడా తెలిసింది ఈ పుస్తకం చదివాకే. రేడియో ఉద్యోగం అస్సలు అనుకోకుండా వచ్చిందే అయినా, దానిని నిలబెట్టుకోడానికీ శ్రోతల మనసుల్లో తన గొంతుని చిరంజీవిగా నిలపడానికీ ఆవిడ చేసిన కృషి అనితర సాధ్యం. ఆ కృషితో పాటుగా, తెలుగు రేడియో పరిణామ క్రమాన్నీ చెబుతుందీ పుస్తకం.

పదవీ విరమణ చేసిన పదిహేనేళ్ళ తర్వాత, తన డెబ్భై ఐదో ఏట రేడియో అనుభవాలనీ, జ్ఞాపకాల్నీ అక్షరబద్ధం చేసిన శారదా శ్రీనివాసన్ తన తొలినాటి సహాధ్యాయుల మొదలు, 'యువవాణి' లో పని చేసి పేరుతెచ్చుకున్నఇప్పటి యువ కళాకారుల వరకూ ఎందరెందరినో తలచుకున్నారు. 1959 లో తను విజయవాడ రేడియో స్టేషన్ లో చేరేనాటికి తెలుగు రేడియోలో పనిచేస్తున్న రచయితలు, సంగీతజ్ఞులతో అనుభవాలని శారద వివరిస్తున్నప్పుడు, ఈవిడ వెళ్ళింది రేడియో స్టేషనుకా లేక శ్రీకృష్ణ దేవరాయలు 'భువన విజయం' సదనానికా అన్న సందేహం కలగక మానదు.

కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు మొదలు పాలగుమ్మి విశ్వనాథం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వరకూ స్థానం నరసింహారావు మొదలు శ్రీరంగం గోపాలరత్నం వరకూ ఒకరనేమిటి? ఆనాటి కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అందరూను.. వీళ్ళందరి మధ్యనా అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఓ ఇరవయ్యేళ్ళ అమ్మాయి బెరుకు బెరుగ్గా.. నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్లకి నేర్పించే వాళ్ళు ఎక్కడైనా, ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటారు. తన చుట్టూ ఉన్నవాళ్ళ నుంచి తాను నేర్చుకున్నవి కేవలం వృత్తిలో మెళకువలు మాత్రమే కాదనీ, వాళ్ళంతా తన వ్యక్తిత్వాన్నీ ఎంతగానో ప్రభావితం చేశారనీ చెప్పుకున్నారు ఈ నిరాడంబర కళాకారిణి.

తనకి రావని ఊరుకోకుండా, తెలంగాణా, తూర్పు కోస్తా మాండలీకాల మొదలు, రికార్డింగ్ టెక్నిక్స్ వరకూ వృత్తికి సంబంధించిన ప్రతి పనినీ ఎంతో శ్రద్ధగా నేర్చుకున్న వైనం చదువుతుంటే ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది. తన గొంతుతో శారద ప్రాణం పోసిన కాల్పనిక పాత్రలకి లెక్క లేదు. "కొన్ని వేల రేడియో నాటకాలు" అని రాశారు తప్ప, ఎక్కడా ఆ సంఖ్యని కూడా ప్రస్తావించలేదు. చలం ఊర్వశి, 'కాలాతీత వ్యక్తులు' నాయిక ఇందిర, తన స్నేహితురాలు యద్దపూడి సులోచనారాణి సృష్టించిన జయంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇక ఆవిడ నిర్వహణ బాధ్యత వహించి నాటకీకరించిన కథలూ, నవలలకి లెక్కే లేదు. తిలక్ 'ఊరి చివర ఇల్లు' కథ, దాశరధి రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు' 'మోదుగుపూలు' ..ఎన్నో, ఎన్నెన్నో..

పుస్తకంలో విషయాలు ఓ క్రమంలో రాయకుండా, ఎప్పుడేది గుర్తొస్తే అది అన్నట్టుగా రాశారు. అయితే, రాసిన సంగతులన్నీ రేడియో గురించీ, శారద గురించే కాబట్టి, కాసిన్ని పునరుక్తులు మినహా ఇతర ఇబ్బందులేవీ లేవు. "రేడియోలో పాత్ర స్వభావం తెలియజెయ్యడానికి కంఠమాధుర్యం ముఖ్యం. సంగీతానికే కాదు మాటలకీ ఉంటాయి శ్రుతిలయలు. అది పట్టుకునేందుకు ప్రయత్నించాలి" అంటారీ మాటల మాంత్రికురాలు. ఈవిడికున్న ఫాన్ ఫాలోయింగ్ ఎంతంటే, జనం శారద శ్రీనివాసన్ ని చూడడానికి రేడియో స్టేషన్ కి వచ్చేసేవాళ్ళు.

"మా స్టూడియో గార్డు మొయినుద్దీన్ పదిమంది చొప్పున జనాల్ని లోనికి తెచ్చేవాడు. అతనికీ విసుగు. అస్తమానం ఈమాటలే చెప్పడానికి. 'యెహ్ అనౌన్సర్ బూత్ హై, వో స్టూడియో హై, యెహ్ మైక్ హై, ఉన్హో శారదా శ్రీనివాసన్ హై' అని అంటూ ఒక్క గుక్కలో చెప్పేసేవాడు." సామాన్యులే కాదు ఎందరో అసామాన్యులూ శ్రీమతి శారద అభిమానుల జాబితాలో ఉన్నారు. 'పురూరవ' నాటకం విని, ఆచార్య ఆత్రేయ శారద ఇల్లు వెతుక్కుంటూ రావడం, రేడియో కార్యక్రమాలని విమర్శించే చలం ఆవిడని ఎంతగానో మెచ్చుకోవడం, పీవీ నరసింహారావు మొదలు గుమ్మడి వెంకటేశ్వర రావు వరకూ ఎంతోమంది వ్యక్తిగతంగా కలిసినప్పుడు అభినందించడం... ఇవన్నీ రాసేటప్పుడు తానెంతో గొప్ప కళాకారిణినన్న అహం ఆవిడలో ఏకోశానా కనిపించదు.. ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే ఇదేనేమో.

అంతటి పేరు సంపాదించుకున్నా సన్మానాలకీ, సత్కారాలకే కాదు పత్రికా ఇంటర్యూలకి కూడా దూరంగానే ఉన్నారావిడ. ప్రతిరోజూ పనేలోకంగా, నేర్చుకోవాలన్న నిరంతర తపనతో పనిచేశారన్న విషయాన్ని ఈ పుస్తకం చెప్పకనే చెబుతుంది. మనం ఏమీ ఆశ్చర్య పోనవసరం లేకుండా ఈ కళాకారిణికి ప్రభుత్వం ఏ అవార్డూ ఇవ్వలేదు. "అమ్మా శారదా! నేను స్టేజీకి, నువ్వు రేడియోకి... అన్నారు స్థానం నరసింహారావు గారు. అంతకన్నాఅవార్డు ఇంకేం కావాలి?" అంటారావిడ సంబరంగా. రేడియో టేపులు భద్ర పరచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వంటి విషయాలని చెప్పీ చెప్పనట్టు చెబుతూనే, ఎప్పటికైనా వాటి విలువని గుర్తిస్తే బాగుండునన్న అభిప్రాయం వ్యక్త పరిచారు.

కార్యక్రమాలని నాణ్యంగా తీసుకురాడానికి రేడియో కళాకారుల తెర వెనుక శ్రమ, వారిమధ్యన ఆరోగ్యకరమైన పోటీ లాంటి వాటితో పాటుగానే ప్రతిచోటా ఉండే లంపెన్ ఎలిమెంట్స్ అక్కడా ఉండడం, వాటి కారణంగా వ్యవస్థకి జరిగే నష్టం వీటినీ రేఖామాత్రంగా స్పృశించారు. బ్లాగ్మిత్రులు తృష్ణ గారి తండ్రి రేడియో రామం గారి కృషిని గురించీ, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గురించీ ప్రస్తావించారు శారద. ఏకబిగిన చదివించే పుస్తకం. జగద పబ్లికేషన్స్ ప్రచురణ. (పేజీలు 198, వెల రూ.125. విశాలాంధ్ర తో పాటు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది). ఇప్పటికిప్పుడు శారదా శ్రీనివాసన్ గొంతు వినాలనుకునే వారు 'ఊర్వశి' గా ఆవిడ తన గొంతుతో చిందించిన హొయలనీ, ఎందరినో మెప్పించిన తెరల తెరల నవ్వునీ ఇక్కడ ఆలకించవచ్చు.

బుధవారం, సెప్టెంబర్ 07, 2011

మిరపకాయ బజ్జీ

ఉదయాన్నే అల్పాహారం.. మధ్యాహ్నం సుష్టుగా భోజనం.. అదయ్యాక మళ్ళీ రాత్రెప్పుడో రెండోపూట భోజనం. మరి ఈ మధ్యలో ఉదయం అల్పాహారం లాగానే తినడానికి ఏదన్నా ఉండాలి కదా. ఈవినింగ్ స్నాక్స్ అని ముద్దుగా పిల్చుకోడానికి రకరకాల వంటకాలున్నాయ్. నాకు తెలిసి తెలుగువారందరి తొలి ఎంపిక మిరపకాయ బజ్జీ. వేడివేడిగా కొంచం కమ్మగా మరికొంచం ఖారంగా నోరూరించే బజ్జీలు కనిపిస్తే తినకుండా ఉండగలమా?

మిరపకాయ బజ్జీని చూడగానే 'ఈనాటి ఈబంధమేనాటిదో..' అని పాడేసుకుంటాను నేను. అంత అనుబంధం ఉంది నాకీ బజ్జీతో. నేను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు, మా బడి పక్కనే ప్రసాదంగారి పాక హోటలుండేది. ఉదయం పూట ఇడ్డెన్లూ, మినప రొట్లూ, సర్వకాల సర్వావస్థల్లోనూ టీ, కాఫీలూ అమ్మేవాళ్ళక్కడ. మధ్యాహ్నం బళ్ళో మేం లెక్కలు చేసుకుంటుండగానే బజ్జీలు వేగుతున్న వాసన ముక్కుకి తగిలి నోట్లో నీళ్లూరేవి.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదేళ్ళ పాటు కేవలం ఆ వాసన పీల్చి సంతృప్తి పడ్డాను నేను. నాదగ్గర డబ్బులుండేవి. ఇంట్లో డిబ్బీలో కూడా డబ్బులుండేవి నాకు. కానీ ఏం లాభం, బయట ఏమీ కొనుక్కోరాదని ఇంట్లో ఆర్డర్. తెగించి కొనుక్కున్నా, ఐదో నిమిషంలో ఆ విషయం ఇంట్లో తెలిసిపోతుంది. ఇంట్లో అమ్మ అప్పుడప్పుడూ బజ్జీలేసేది. ఎందుకో గానీ ప్రసాదంగారి బజ్జీల్లో కనిపించే సొగసు వీటికి ఉండేది కాదు. అందని బజ్జీలదే అందం.

తినగలిగినన్ని బజ్జీలని ఇష్టంగా తిన్నది కాలేజీ రోజుల్లో. కాలేజీ దగ్గర ఓ సాయిబుగారి బజ్జీల కొట్టు ఉండేది. ఆయన బంధువెవరో వేగిస్తూ ఉంటే, ఈయన చకచకా ఒక్కో బజ్జీనీ నిలువుగా చీరి, కారం కలిపిన ఉల్లిపాయ ముక్కలు కూరి, పైన నిమ్మరసం పిండి, అందంగా ఓ కాగితంలో పెట్టి మాకు అందించేసే వాడు. చురుకైన ఆయన వేళ్ళ కదలికలు చూసి "మన సాయిబుగారి చేత డిసెక్షన్ చేయించాలి," అని ముచ్చట పడేవారు బైపీసీ మిత్రులు.

లెక్చరర్లందరూ మా బుర్రల్లో దూరి మరీ పాఠాలు చెప్పెసేవాళ్ళేమో, క్లాసులయ్యేసరికి కడుపు ఖాళీ అయిపోయేది. అందరం కలిసి సాయిబు గారిమీడకి దండయాత్ర. ఎప్పుడన్నా తొలి వాయి నాలుగు బజ్జీలూ ఖాళీ చేసేశాక, వేగుతున్న బజ్జీలవైపు చూస్తూ అప్రయత్నంగా జేబు తడుముకుంటే "మీరు తినండీ.. మేం ఉన్నాం కదా" అని బుజ్జో, ఫణో అన్నప్పుడు, బజ్జీ కారంగా లేకపోయినా సరే, అదేంటో కళ్ళలో నీళ్ళు తిరిగేవి. (హైస్కూల్లో ఏరా, ఒరే అనుకున్నా, కాలేజీకోచ్చేసరికి కొత్త ఫ్రెండ్స్ ని మీరనే అనేవాళ్ళం. లెక్చరర్లు కూడా మమ్మల్ని 'మీరు' అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా పెద్దరికం ఆవహించేది మమ్మల్ని!)

కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, ఆ ఆఫీసు దగ్గరే ఓ బజ్జీల బండి ఉండేది. ఓ సాయంత్రం సన్నగా చినుకులు పడుతుండగా, ఇంటికెళ్లబోతూ "బజ్జీలు తిందామాండీ?" అనడిగా కొలీగుని. "బజ్జీలు కొనుక్కుని తినగలిగేంత జీతాలా మనవి?" అనగానే నాకు నోట మాట పెగల్లేదు. వాళ్ళాయనకి మనసులోనే దండం పెట్టేసుకున్నాను. ఆవిడ దృష్టిలో "బజ్జీలు కొనుక్కోగలిగేంత" సంపాదన వచ్చేసరికి, తినే తీరిక లేక, తినాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు. అప్పుడప్పుడూ ఎవరన్నా గుర్తు చేసినప్పుడు హడావిడిగా ఒకటో, రెండో తినడం.

రాన్రాను ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. కారానికో ఏమో కానీ బజ్జీ తినగానే కడుపు మండుతుంటే ఎసిడిటీ ఏమోనని అనుమానించడం, డాక్టరిచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు వినడం వల్ల, సరిగ్గా వేడి వేడి బజ్జీని కొరికే వేళ అవి గుర్తు రావడం.. ఇలా బజ్జీ అంటే ఇష్టం బదులుగా భయం మొదలవుతోందేమో అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. 'భూమి గుండ్రంగా ఉంటుంది' అనే మాట చాలా సార్లు విన్నాను నేను. మిరపకాయ బజ్జీకి అన్వయించుకుంటే నిజమే అనిపిస్తోంది.. ఎదురుగా బజ్జీలు నోరూరిస్తున్నా తినలేకపోవడం, చిన్నప్పుడూ, ఇప్పుడూ కూడా...

మంగళవారం, సెప్టెంబర్ 06, 2011

ప్రజల మనిషి

'తెలంగాణా తొలినవల' అన్న ప్రత్యేకతని సొంతం చేసుకున్న నవల వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన 'ప్రజల మనిషి.' తెలంగాణా సాయుధ పోరాటానికి పూర్వరంగాన్ని పరిచయం చేస్తూ రాసిన ఈ నవలలో కథా స్థలం నిజామాబాద్ జిల్లాలోని దిమ్మెగూడెం అనే ఓ పల్లెటూరు. ఆ ఊరి శ్రీవైష్ణవుల కుర్రాడు కంఠీరవం ఇంటి సమస్యల కారణంగా చిన్న నాడే ఊరు విడిచిపెట్టి బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడం, మరోపక్క అతను ఊరికి తిరిగి వచ్చేనాటికి ఊరి జనంలో కూడా చైతన్యం రావడం కథాంశం.

దిమ్మెగూడెం 'దొర' రామభూపాల రావు అరాచకాల వర్ణనతో కథ ప్రారంభమవుతుంది. దొరకూతుర్ని కాపురానికి పంపుతున్నాడు. ఊళ్ళో బాగా పాలిచ్చే ఆవు రైతు కొండయ్య పెరట్లో ఉంది. ఆవుని తన కూతురి అత్తారింటికి తోలించమని కబురు పెట్టాడు దొర. అంతేనా? దొర ఇంటికి కావాల్సిన కూరగాయల మొదలు విస్తళ్ళ వరకూ సమస్తమూ సమకూర్చాల్సింది ఊరివాళ్ళే. విస్తళ్ళు పంపాల్సిన బాధ్యత కంఠీరవం తల్లి ఆండాళ్ళమ్మ మీద పడుతుంది. ఆకులు కోసుకు రావడం కోసం బడి మానేస్తాడు కంఠీరవం. అప్పుడే ఆ కుర్రవాడిలో 'దొరకోసం ఇదంతా ఎందుకు చేయాలి?' అన్న ఆలోచన మొదలవుతుంది.

కంఠీరవం తండ్రి హఠాత్తుగా మరణించడం, అన్న వెంకటాచార్యులులో భేదాభిప్రాయాలు రావడంతో ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోతాడతడు. నిజామాబాదు లో శ్రీవైష్ణవ కుటుంబం ఆశ్రయం ఇస్తుందతనికి. వెంకటాచార్యులు దొర పంచన చేరతాడు. దొర ఆగడాలు మితిమీరతాయి. భూములు ఆక్రమించుకోవడం, దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యాలవుతాయి ఆ ఊళ్ళో. నిజాం ప్రభుత్వం మొదలు పెట్టిన హరిజనుల మత మార్పిడి ప్రచారం ఆ ఊరికీ వస్తుంది. అప్పటికే చదువుకుని గ్రంధాలయోద్యమంలో ప్రవేశించిన కంఠీరవం ఊరికి వచ్చి, మత మార్పిడులని ప్రశ్నించి, కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్తాడు.

ప్రభుత్వానికి ఎదురు చెప్పే ధైర్యం లేని రామభూపాలరావు, మత మార్పిడుల అనంతరం హైదరాబాదు నుంచి ఆర్య సమాజికులని రప్పించి, శుద్ధి ద్వారా హరిజనులని తిరిగి హిందువుల్లో కలుపుతాడు. అయితే, వచ్చిన ఆర్యసమాజికులు వెంటనే తిరిగి వెళ్ళకుండా ఊరి ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నించడం మింగుడు పడదు అతడికి. ఊళ్ళో గ్రంధాలయం ఏర్పాటు చేసిన ఆర్య సమాజికులు, జనంలో నాటుకుపోయిన భయాన్నీ, అజ్ఞానాన్నీ పోగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంతలో జైలు శిక్ష పూర్తి చేసుకున్న కంఠీరవం కొందరు మిత్రులతో కలిసి ఊరికి తిరిగివచ్చి దొరతో తలపడడం, మరోపక్క హైదరాబాద్ సంస్థానంతో కాంగ్రెస్ పోరాటం మొదలవడంతో నవల ముగుస్తుంది.

నల్గొండలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆళ్వారు స్వామి, చిన్ననాడే ఊరు విడిచిపెట్టారు. 'శారద' కలంపేరుతో 'రక్తస్పర్శ' వంటి విలక్షణ కథలు రాసిన నటరాజన్ లాగానే హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించారు. గ్రంధాలయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. నవల చదువుతుంటే కంఠీరవం మరెవరో కాదు ఆళ్వారు స్వామే అనిపించక మానదు. అదే విషయాన్ని ధృవీకరించారు ముందు మాట రాసిన దాశరధి రంగాచార్య. అంతే కాదు, ఆళ్వారు స్వామి తనకి పినమామగారవుతారని కూడా చెప్పారు. కథానాయకుడితో సహా పాత్రలన్నీ నేలమీద నడిచేవే అయినా, చాలాచోట్ల సంభాషణలు ఉపన్యాస ధోరణిలో సాగాయి.

రంగాచార్య నవలలు 'చిల్లర దేవుళ్ళు' 'మోదుగుపూలు' గుర్తొచ్చాయి చాలాసార్లు. అయితే, ఆళ్వారు స్వామి స్పూర్తితోనే తాను నవలా రచనకు పూనుకున్నానన్నారు రంగాచార్య. నిజాం పాలనతో తెలంగాణా ప్రాంతంలోని సామాన్యులు ఎదుర్కొన్న కష్టనష్టాలని నిశితంగా చిత్రించిన నవల ఇది. 'ప్రజల మనిషి' కి కొనసాగింపుగా ఆళ్వారు స్వామి రాసిన 'గంగు' నవలని గురించి మరోసారెప్పుడైనా. 1955 లో 'దేశోద్ధారక గ్రంధమాల' తొలిసారిగా ప్రచురించిన 'ప్రజల మనిషి' ని తర్వాతికాలంలో ఆరుసార్లు పునర్ముద్రించింది విశాలాంధ్ర. 154 పేజీల ఈ పుస్తకం వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ దొరుకుతోంది.

సోమవారం, సెప్టెంబర్ 05, 2011

గురుదక్షిణ

నా హైస్కూలు చదువు ఐదేళ్లలోనూ ముగ్గురు హెడ్మాస్టర్లు మారారు మాకు. ముగ్గురిలోనూ నాకు బాగా నచ్చినవారూ, ఇప్పటికీ తరచూ గుర్తు చేసుకునే వారూ శ్రీరామ్మూర్తి గారు. స్పురద్రూపం..పచ్చని పసిమిచాయ...మడత నలగని ఇస్త్రీ దుస్తుల్లో ఠీవిగా ఉండడమే కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు కూడా. ఆయన మా స్కూలికి రానిక్రితం వరకూ మాకు హెడ్మాస్టర్ అంటే సింహస్వప్నం. మేం ఆయన రూముకి వెళ్ళాల్సి వచ్చినా, ఆయన మా క్లాసుకి వచ్చినా గడగడా వణికే వాళ్ళం.

కానీ, శ్రీరామ్మూర్తి మేష్టారు మిగిలిన వాళ్ళలా కాదు. ఏ క్లాసుకి మేష్టారు లేకపోయినా, ఆయన ఆక్లాసుకి వెళ్ళిపోయి పిల్లలందరితోనూ మాట్లాడుతూ ఏదో ఒక పాఠం చెప్పేవాళ్ళు. ఈయనకి ముందు హెడ్మాస్టర్లతో మాట్లాడే అవకాశం కేవలం క్లాసు లీడర్లకి మాత్రమే ఉండేది. కానీ ఈయనొచ్చాక పద్ధతులు మారిపోయాయి. స్కూల్లో అందరూ ఆయనతో నేరుగా మాట్లాడొచ్చు. ఇబ్బందులేవన్నా ఉంటే చెప్పుకోవచ్చు. ఆయన ప్రసన్నవదనంతో చివరికంటా విని, అంత పెద్ద సమస్యనీ చిటికెలో పరిష్కరించేసే వాళ్ళు. పుస్తకాలు కొనడానికీ, ఫీజు కట్టడానికీ టైమిమ్మని అడిగేవాళ్ళు చాలామంది పిల్లలు.

రోజూ జరిగే స్కూల్ అసెంబ్లీలో కూడా చాలా మార్పులు చేశారు శ్రీరామ్మూర్తి గారు. ప్రతిజ్ఞ కేవలం తెలుగులోనే కాకుండా ఇంగ్లిష్, హిందీల్లోనూ చెప్పాలనీ, ప్రతిరోజూ వార్తలు చదవాలనీ, ఒక సూక్తి చెప్పాలనీ ఇంకా అసెంబ్లీ చివర్లో హెడ్మాస్టర్ ప్రసంగం... ఇలా ఆయన చేసిన మార్పుల పుణ్యమా అని పక్కూళ్ళ నుంచి వెళ్ళే మాలాంటి పిల్లలందరం అసెంబ్లీ టైముకే బళ్ళో ఉండేలా ముందుగానే బయల్దేరేసేవాళ్ళం. పక్క స్కూళ్ళలో పోటీలు జరుగుతుంటే మమ్మల్ని ప్రోత్సహించి పంపడం, మేష్టర్లెవరికన్నా బదిలీ అయినా, రిటైర్ అయినా తప్పకుండా ఫేర్వెల్ ఏర్పాటు చేయడం...ఇవన్నీ ఆయన చేసిన ఏర్పాట్లే.

ఎప్పటిలాగే ఆవేళ ఉదయం కూడా స్కూల్లో హడావిడిగా ఉంది. అసెంబ్లీకి ఇంకా టైం ఉండడంతో డ్రిల్లు మేష్టారు పిల్లలందరిచేతా గ్రౌండ్ లో ఉన్న చెత్త కాగితాలు ఏరిస్తున్నారు. నేను ఎస్పీఎల్ అవ్వడంతో, ఆఫీసు రూముదగ్గర ఓపక్క పేపరు చూసి వార్తలు రాసుకుంటూ, మరో పక్క ప్రతిజ్ఞ ఎవరు ఏభాషలో చెప్పాలో, సూక్తి చెప్పాల్సింది ఏ క్లాసు వాళ్ళో చూసుకుంటున్నాను. గుమస్తాగారేదో కబురు తేవడంతో ఉన్నట్టుండి స్టాఫ్ రూములో వాతావరణం మారిపోయింది. సోషలు మేష్టారొచ్చి "ఇవాల్టికి ఇవేమీ వద్దమ్మా" అన్నారు. అర్ధం కాలేదు నాకు.

పిల్లలందరూ అసెంబ్లీకి వచ్చి నిలబడగానే సోషలు మేష్టారు చెప్పారు. "ఇవాళ మన స్కూలుకి ప్రత్యేకంగా సెలవు ప్రకటిస్తున్నాం. మన హెడ్మాస్టరు గారి అబ్బాయి చనిపోయాడు. మీరంతా అల్లరి చెయ్యకుండా పుస్తకాలు తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపొండి.." పిల్లలెవరికీ కూడా సెలవొచ్చిందన్న సంతోషం ఏకోశానా లేదు. నేను స్టాఫ్ రూము దగ్గరే ఆగిపోయాను. అక్కడ తెలిసిన విషయాలు ఏమిటంటే, మా హెడ్మాస్టరు గారికి ఒక్కడే కొడుకు. డాక్టర్ కోర్సు చదువుతున్నాడు. ఎందుకో తెలీదు కానీ ఉరిపోసుకుని చనిపోయాడు. మా హెడ్మాష్టారు గుర్తొచ్చి చాలా బాధనిపించింది. అప్పటివరకూ ఒక్కసారి కూడా చూడకపోయినా సరే వాళ్ళబ్బాయి మీద చాలా కోపం వచ్చింది.

ఇంచుమించు ఓ నెల్లాళ్ళ తర్వాత మా హెడ్మాస్టరు మళ్ళీ స్కూలుకి వచ్చారు. ఎప్పటిలాగే అసెంబ్లీ ఏర్పాట్లలో ఉన్నాను.. ఒక్కసారిగా ఆయన్ని చూసేసరికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. మనిషి బాగా చిక్కిపోయారు. పెద్ద జ్వరం వచ్చి తగ్గినట్టుగా నీరసం తెలుస్తోంది. ఆయన ముఖంలో నవ్వన్నదే కనిపించలేదు. "ఒకవేళ నేను చచ్చిపోతే నాన్నకూడా ఇలాగే అయిపోతారా?" ఆలోచనకే ఉలిక్కి పడ్డాను నేను. మాస్టార్లందరూ ఆయన్ని పలకరిస్తున్నారు. పిల్లలు దూరం నుంచే చూస్తున్నారాయన్ని. అసెంబ్లీ మొదలయ్యింది. అయన వచ్చి నిలబడ్డారు. ప్రధానోపాధ్యాయుడి ప్రసంగం అని ఎస్పీఎల్ ప్రకటించాలి. ఆయన మాట్లాడతారో, లేదో.. సోషల్ మేష్టారి వైపు చూశాను నేను. మాట్లాడతారని సైగ చేశారాయన.

"మీకందరికే తెలిసే ఉంటుంది... నేను ఉద్యోగం మానేద్దామా అనుకున్నాను... చెయ్యాలని కూడా అనిపించలేదు.. కానీ మీ అందర్లోనూ వాణ్ణి చూసుకోవచ్చు అన్నారు మన మేష్టార్లు...నాకూ నిజమే అనిపించింది. ఈ వయసులో ఇంత కష్టం తట్టుకుని నేను నిలబడగలిగానంటే ఒకటే కారణం. పుస్తకాలు చదవడం. చిన్నప్పటి నుంచీ కనిపించిన పుస్తకమల్లా చదివాను నేను. ఉద్యోగం వచ్చినప్పటినుంచీ ప్రతి నెలా జీతం రాగానే ముందు కొనేది పుస్తకాలే. మా ఇంట్లో ఐదారు బీరువాల పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవన్నీ ఒకళ్ళు చెప్పడం కన్నా, ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం బాగుంటుంది. మీరు పెద్దై ఉద్యోగాల్లో చేరాక, మీ సంపాదనలో కనీసం పది శాతం అంటే నూటికి పది రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టండి. ఇది మాత్రం మర్చిపోకండి..."

మాలో చాలామందికి పుస్తకాలంటే గౌరవం పెరిగింది. అవే లేకపొతే మా హెడ్మాస్టారు మళ్ళీ కనిపించే వారు కాదేమో అన్న ఆలోచనే కారణం. అప్పటికే అమ్మ పుణ్యమా అని పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన నాకు, ఆయన మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి. పెద్దయ్యాక తప్పకుండా మేష్టారు చెప్పినట్టుగా పుస్తకాలు కొనుక్కోవల్సిందే అని నాలో నేనే గట్టి నిర్ణయం తీసేసుకున్నాను. కా..నీ.. ఇవాల్టి రోజున వెనక్కి తిరిగి మేష్టారి మాటలు జ్ఞాపకం చేసుకుంటే సిగ్గు కలుగుతోంది. ఆయన చెప్పిన పది శాతం కాదు, కనీసం అందులో పదో వంతైన ఒక్క శాతం కూడా పుస్తకాల మీద వెచ్చించడం లేదు నేను. "ఇలా చేస్తున్నావేమిటి?" అని ఆయన నన్ను ప్రేమగా మందలిస్తున్నట్టుగా అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. (ఈ టపా రాయడానికి పరోక్ష కారణమైన బ్లాగ్మిత్రులు వేణూశ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు)

ఆదివారం, సెప్టెంబర్ 04, 2011

పచ్చబొట్టు

ఎడమ మోచేయి మొదలు మణికట్టు వరకూ ఉండే లోపలి భాగం పచ్చబొట్టు పొడిపించుకోడానికి అనువైన ప్రదేశంగా చలామణీ అయ్యింది చాలాకాలం పాటు. పేర్లూ, బొమ్మలూ, గుర్తులూ ఒకటేమిటి? కాదేదీ పచ్చబొట్టుకి అనర్హం. కొంతమంది వాళ్ళ పేరు రాయించుకుంటే, మరికొందరు తల్లిపేరో, తండ్రి పేరో, ఇష్టమైన వాళ్ళ పేరో లేక ఇష్టదైవం పేరో పచ్చబొట్టుగా పొడిపించుకునే వాళ్ళు. బొమ్మల్లో ఎక్కువగా దేవుళ్ళవీ, అందులోనూ నాగ దేవతవి ఎక్కువగా కనిపించేవి.

వేసంకాలం మధ్యాహ్నాల్లో వీధుల్లో తిరిగే రకరకాల వాళ్ళలో 'పచ్చబొట్లేస్తాం..' అని అరుస్తూ తిరిగేవాళ్ళు కూడా అడపాదడపా ఊళ్లోకి వచ్చేవాళ్ళు. నన్ను కనీసం ఆటలకి కూడా వెళ్ళనివ్వకుండా బంధించి వాళ్ళ మటుక్కి వాళ్ళు హాయిగా నిద్రపోయే ఇంట్లో వాళ్ళమీద కోపం ఏస్థాయిలో ఉండేదంటే (అప్పుడూ ఇప్పుడూ కూడా మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు నాకు) ఆ పచ్చబొట్టు వాళ్ళని పిలిచి చేతిమీద ఏదో ఒక పచ్చబొట్టు పొడిపించేసు కోవాలనిపించేది. ఊరికే ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశమే తప్ప పచ్చబొట్టుగా ఏది రాయించుకోవాలన్న విషయంలో ఇదమిద్దంగా ఓ అభిప్రాయం లేదు.

చిన్నప్పటి నుంచీ చాలామంది చేతులకి పచ్చబొట్లు చూడడమే కాదు, పచ్చబొట్ల గురించి చాలానే విన్నాను కూడా. మరీ ముఖ్యంగా పచ్చబొట్టుని సూది కాల్చి వేస్తారనీ, అది వేసినప్పుడు చెయ్యి మంట పెట్టడమే కాకుండా, ఒకటి రెండు రోజులు జ్వరం కూడా వస్తుందనీ, ఒకసారి పచ్చబొట్టు వేయించుకుంటే దాన్నింక చెరపడం కుదరదనీ... ఇలా కావలసినవీ, అక్కర్లేనివీ బోల్డన్ని విషయాలు. పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నారు? అని చాలామందినే అడిగాను. కొందరు 'సరదాకి' అని చెప్పారు, ఇంకొందరు ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదు.

సినిమాల్లో చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్దయ్యాక వాళ్ళింట్లో వాళ్ళని కలుసుకోడానికి చిన్నప్పుడు ఆనందంగా పాడుకున్న పాటతో పాటు, ఇదిగో ఈ పచ్చబొట్టు కూడా అనేకానేక సందర్భాల్లో ఉపయోగపడింది. ఈ విషయంలో పుట్టుమచ్చలు కూడా చాలా రోజుల పాటు ప్రముఖమైన పాత్రనే పోషించాయి. అలాగే హీరోగారు హీరోయిన్ పేరుని పచ్చబొట్టు పొడిపించుకోవడం, తర్వాత కథ మలుపు తిరగడంలాంటివీ సినిమాల్లో వచ్చేశాయ్. పచ్చబొట్లు పొడిపించుకునే విషయంలో హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్లు అంతగా రిస్కులు తీసుకోలేదనే చెప్పాలి.

సినిమాల్లోనే కాకుండా, బయట ప్రపంచంలోకూడా ప్రేమకీ పచ్చబొట్టుకీ అవినాభావ సంబంధం ఉందని కొందరు మిత్రులని చూసినప్పుడు అర్ధమయ్యింది. వాళ్ళు ప్రేమించిన అమ్మాయి పేరుని నేరుగా కొందరు ధైర్యశాలులూ, వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే కోడ్ భాషలో కొందరు జాగ్రత్తపరులూ, ఇష్టదైవానిదో ఇంట్లోవాళ్ళదో పేరు కూడా కలిసొచ్చేసే విధంగా కొందరు తెలివైనవాళ్ళూ పొడిపించుకున్న పచ్చబొట్లని చూసినప్పుడు. రాను రాను జబ్బలూ, ఛాతీ కూడా పచ్చబొట్టుకి అనువైన ప్రదేశాలుగా మారిపోయాయ్.

అన్నిచోట్లా మార్పులు వచ్చేసినట్టే పచ్చబొట్లలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయ్. టాటూ అనేది ఇప్పుడో ఫ్యాషన్ స్టేట్మెంట్. ఒక్క చెయ్యనేముందీ, అంగుళం ఖాళీ లేకుండా ఒంటినిండా టాటూలు వేయించేసుకుంటున్నారు టీనేజీ పిల్లలు. ఇప్పుడిప్పుడు టాటూ వేయించేసుకోవడం ఇదివరకంతా కష్టం కాదు. ఏమాత్రం నొప్పిలేని వ్యవహారం. అంతేనా? ఇప్పటి పచ్చబొట్టు శాశ్వితం కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేకప్ తుడుచుకున్నంత సులువుగా తుడిచేసుకోవచ్చు.

ఏదో నలభయ్యేళ్ళ క్రితం కాబట్టి నాగేసర్రావూ, వాణిశ్రీ "పచ్చబొట్టూ చెరిగిపోదూలే.. పడుచు జంటా చెదిరీ పోదూలే..." అని పాడేసుకున్నారు. ఇప్పుడు పచ్చబొట్లు చెరిగిపోతున్నాయి.. పడుచు జంటలుకూడా ఎవరికెవరన్నది కూడా ఇట్టిట్టే మారిపోతున్నాయి. సినిమాల్లోనే తీసుకున్నా, హీరో, హీరోయిన్నూ చివర్రీలులోనన్నా ఒకరితో ఒకరు ప్రేమలో పడతారో పడరో దర్శకుడిక్కూడా తెలియడం లేదు. సినిమాలు సమాజాన్ని ప్రతిబింబించడమో లేదా సమాజం సినిమాలని అనుకరించడమో జరుగుతోన్నట్టేనా? పచ్చబొట్లలో వచ్చినట్టే ప్రేమలోనూ మార్పులు వచ్చేస్తున్నాయా?

శనివారం, సెప్టెంబర్ 03, 2011

ఓల్గా నుంచి గంగకు

కంటికి ఎదురుగా కనిపించే వాటిని అలక్ష్యం చేయడం, దొరకని వాటికోసం వెతుకులాడడం ఈరెండూ కూడా మానవ సహజ గుణాలే అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడూ ఎదురయ్యే అనుభవాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో ఏళ్ళుగా రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 'ఓల్గా నుంచి గంగకు' పుస్తకాల షాపుల్లో డిస్ప్లే లో చూస్తూనే ఉన్నాను. ఎందుకో తెలీదు కానీ, ఎప్పుడూ చదవాలని అనిపించలేదు. కనీసం పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, పేజీలు తిప్పిన పాపాన పోలేదు.

ఆమధ్యన ఆచార్య తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీనుంచి హరప్పాదాక' చదువుతుండగా, అందులో రాహుల్జీ ప్రస్తావనా, 'ఓల్గా నుంచి గంగకు' ప్రస్తావనా కొన్ని చోట్ల కనిపించింది. రాహుల్ గొప్ప పండితుడనీ, 'ఓల్గా నుంచి..' తప్పక చదవాల్సిన పుస్తకమనీ రామచంద్ర రాసింది చదివాక, మొదటిసారిగా ఈ పుస్తకం చదవాలని అనిపించింది. సరిగ్గా అప్పుడే పుస్తకం ప్రింట్ అయిపోయింది! మొన్న మొన్నే కొత్త ప్రింట్ రావడంతో నాకు ఈ రచనని చదివే అవకాశం దొరికింది.

క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరాల కాలం నుంచి, క్రీస్తుశకం 1942 వరకూ జరిగిన కాలంలో ఇండో యూరోపియన్ జాతి మానవ సమాజ వికాసాన్ని ఇరవై విడి కథల ద్వారా నిశితంగా చిత్రించారు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషల్లో పండితుడూ, చరిత్రకారుడూ అయిన రాహుల్ సాంకృత్యాయన్. వోల్గా తీరపు మంచు ఎడారి నేపధ్యంగా తీసుకుని రాసిన తొలి కథ 'నిశ' తో మొదలు పెట్టి సోవియట్ ని కాపాడడం కోసం యుద్ధంలో చేరిన 'సుమేరుడు' కథ వరకూ కథలన్నీ ఊపిరి బిగపట్టి చదివించేవే.

తొలి కథల్లో ఆర్యుల సంస్కృతిని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు రాహుల్. స్త్రీ కుటుంబ పెద్దగా ఉండడం, ఆమె సారధ్యంలో కుటుంబం యావత్తూ వేటకి వెళ్ళడం, ఆమె తనకి ఇష్టమైన పురుషుడితో -సోదరుడు, కుమారుడు ఇలా చుట్టూ ఉన్న అందరూ - కూడి సంతానాన్ని వృద్ధి చేయడంతో మొదలుపెట్టి, కుటుంబంలో వచ్చిన చీలికలు, సమూహాలు, వాటి మధ్యన ఆధిపత్యపు పోరు, జీవికని వెతుక్కుంటూ సమూహాలు చేసే మజిలీలు, నెమ్మది నెమ్మదిగా సంస్కృతిలో మార్పులు వచ్చి పురుషుడు కుటుంబ పెద్ద అవ్వడం, వివాహ వ్యవస్థ, స్త్రీ స్థానం తగ్గుతూ పోవడం ఇవన్నీ మొదటి ఆరు కథల్లోనూ చిత్రించారు.

ఒకరి చేత పాలింపబడడం అనేది ఆర్యులకి ఏమాత్రమూ నచ్చని విషయం. కానీ, అనార్యులకి పాలనా వ్యవస్థ ఉంది. ఈ రెండు వర్గాల మధ్యనా యుద్ధాలు జరగడం, ఆర్యులు బలహీన పడడం కాలక్రమంలో జరిగింది. ఇంతలోనే రాజుని తమ చెప్పు చేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు దోహదం చేయడం జరిగిందంటారు రాహుల్. సమాజంలో అసమానతలకి మతమే ప్రధాన కారణమనీ, రాజులూ, పురోహితులూ కలిసి ఈ మతాన్ని ప్రజలపై రుద్ది వారిని బానిసలుగా మార్చారని చాలా గట్టిగా చెప్పారు.

రాజు-పురోహితుడు-మతం ఈ మూడూ కలిసి సమాజ వికాసాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని చెబుతూ, రాజ్యాల మధ్య జరిగిన యుద్దాలనీ, వాటిమీద మతం ప్రభావాన్నీ ఉదాహరణలుగా చూపించారు. బౌద్ధం స్థాపన, విస్తరణ, క్షీణత, దేశం మీద జరిగిన దండయాత్రలు, ఇస్లాం స్థాపన, విస్తరణ, కంపెనీ పాలనలో భారత దేశం, ఆసమయంలో క్రైస్తవం ప్రభావం ఇవన్నీ కథల్లో అంతర్భాగాలుగా ఉంటూనే, మతం పరిణామ క్రమాన్ని సులువుగా అర్ధం చేసుకోడానికి సాయపడతాయి పాఠకులకి.

ఈస్టిండియా కంపెనీ కాలంలో జమీందారీలని ఏర్పరచడం వల్ల రైతులకి ఎదురైన ఇబ్బందులు, సామంత రాజుల బలహీనతల్ని ఆంగ్లేయులు సొమ్ము చేసుకోవడం, సిపాయిల తిరుగుబాటు, మంగళ్ పాండే తదితరుల పాత్ర, తిరుగుబాటు వైఫల్యం మొదలు, గాంధీజీ మొదలు పెట్టిన ఉద్యమం-దానిని వ్యతిరేకించే వర్గం అభిప్రాయాల వరకూ ఏకబిగిన సాగి, సామ్యవాదం మాత్రమే సమాజాన్ని బాగు పరచగలదనే బలమైన అభిప్రాయంతో ముగుస్తుందీ రచన. ఒక్క మాటలో చెప్పాలంటే, వేల ఏళ్ళ దేశ చరిత్రని కేవలం మూడొందల పైచిలుకు పేజీల్లోనే కళ్ళకి కట్టడం ద్వారా కొండని అద్దంలో చూపారు రచయిత.

పుస్తకాన్ని గురించి మొదట చెప్పుకోవాల్సింది చదివించే గుణం. ఒకసారి చదవడం మొదలు పెట్టాక ఎక్కడా కూడా పక్కన పెట్టాలనిపించదు. రచయిత అభిప్రాయాలతో ఏకాభిప్రాయం కుదిరినప్పుడూ, కుదరనప్పుడూ కూడా ఒకే వేగంతో చదివిస్తుందీ పుస్తకం. ఉత్తరాంధ్ర నుడికారం కనిపించినప్పుడు, అనువాదం ఎవరు చేశారా? అన్న సందేహం కలిగి పేరు చూశాను. విఖ్యాత కథకుడు చాసో కుమార్తె, రచయిత్రీ చాగంటి తులసి ఎంతో సరళంగా తెనిగించారీ పుస్తకాన్ని. ఎక్కడో తప్ప అనువాదమన్న భావన కలగదు. వేటాడి పచ్చి మాంసాన్ని భుజించడం మొదలు, తెల్లవాడిపై తుపాకీ ఎత్తడం వరకూ జరిగిన మన పూర్వుల వికాసాన్నీ, పరిణామ క్రమాన్నీ చూపించే పుస్తకమిది. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 160).