మంగళవారం, జనవరి 24, 2012

ముచ్చటగా మూడేళ్ళు...

బ్లాగుల్లోకి వచ్చిన తొలి సంవత్సరంలాగే మూడో సంవత్సరం కూడా తెలియకుండా గడిచిపోయింది. అవును, 'నెమలికన్ను' కి మూడేళ్ళు నిండి నాలుగో వసంతంలోకి అడుగుపెడుతోందివాళ. అప్పుడే మరో ఏడాది గడిచిపోయిందా అనిపిస్తోంది. గడిస్తే మరీ బిజీగానూ, లేకపొతే బహు తీరికగానూ గడిచింది జీవితం. గడిచిన ఏడాది బ్లాగింగ్ దానిని ప్రతిఫలించింది. అన్నట్టు, గడిచిన సంవత్సరం నా బ్లాగు నాకు తెచ్చిపెట్టిన కొత్త మిత్రుల సంఖ్య కొంచం ఎక్కువే!

తొలిసంవత్సరం లో నా టపాల జోరు చూసిన బ్లాగ్మిత్రులు కొందరు, మొదట్లో అందరూ ఇలాగే రాస్తారు కానీ, పోను పోను ఈ వేగం ఉండదు అన్నారు. వారి మాటలని నిజం చేసింది రెండో సంవత్సరం. రాయాలని ఉన్నా రాయలేని పరిస్థితులు. కానైతే, మూడో సంవత్సరానికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒడిదుడుకులు లేకపోలేదు. ఫలితమే, వస్తే రోజుల తరబడి విరామం, లేకుంటే వందరోజుల పాటు నిర్విరామంగా టపాల ప్రచురణ.

తొలి రెండేళ్ళలోనూ కాసిన్ని కథలు ప్రయత్నించిన నేను, మూడో సంవత్సరంలో వాటి జోలికి వెళ్ళలేకపోయాను. కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నా వాటిని కాగితం మీద పెట్టేంత స్పష్టత లేకపోవడం ఒక కారణం. కథలు రాయాలంటే మరికొంచం చదువు అవసరమేమో బహుశా. ఇక చదువు విషయానికి వస్తే, మునుపటితో పోలిస్తే పుస్తకాలు కొంచం బాగానే చదవగలిగాను. వీటిలో కొన్ని పుస్తకాలని గురించి మాత్రమే చెప్పడం అంటే కష్టమే అయినా, 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' పుస్తకం చదవగలగడం మిక్కిలి సంతోషాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు.


ఏడాది కాలంలో నేను రాసుకున్న వాటిలో నాకు కొత్తవిగా అనిపించిన అంశాలు రెండు. మొదటిది అనువాద వ్యాసాలు కాగా, రెండోది యాత్రా కథనం. వంశీ, పాలగుమ్మి విశ్వనాథం గురించి ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసాలని తెనిగించే ప్రయత్నం చేశాను. అలాగే, కుటుంబంతో కలిసి చేసిన ఉత్తరాంధ్ర యాత్ర ని నాకు తోచ్చినట్టుగా టపాయించాను. మొదటిది యాదృచ్చికంగా జరిగింది కాగా, రెండోది ఓ మిత్రులిచ్చిన సలహా మేరకి కొంచం ముందుగానే ప్లాన్ చేసుకున్నది. వారికి కేవలం థాంకులతో సరిపెట్టలేను.

ఏ సంతాన లక్ష్మినైనా నీ పిల్లల్లో ఎవరంటే ఇష్టం అని అడిగి జవాబు రప్పించడం కష్టం. అసలు ఆ ప్రశ్నే వృధా. బ్లాగరు-టపాలకీ ఇదే సామ్యం వర్తిస్తుందని నా అనుకోలు. రాసిన అన్ని టపాలమీద ఒకేలాంటి ప్రేమ ఉన్నా, యాదృచ్చికంగా రాసిన 'భామిని విభునకు వ్రాసిన' పత్రికనూ, మా ఊరు పలికించిన 'పదనిస'లనూ మళ్ళీ మళ్ళీ చదువుకున్నప్పుడు 'నేనే రాశానా ఇవి?' అన్న ఆశ్చర్యం కలిగింది చాలాసార్లు. అలాగే నాకు చాలా ఇష్టమైన 'సాగర సంగమం' గురించి గత పుట్టిన రోజుకి కొంచం ముందర రాసుకున్న టపా కూడా.

ఆన్లైన్లో మెయిలూ, బ్లాగూ మాత్రమే ప్రపంచంగా ఉన్న నేను గడిచిన ఏడాది కాలంలో బజ్జులో ప్రవేశించి, దాని అంతం చూసి, ప్రస్తుతం ప్లస్సులో నేనున్నా అంటున్నాను. బ్లాగ్మిత్రులు సన్నిహితం కావడంతో పాటు, కొత్త మిత్రులు పరిచయం అవుతున్నారక్కడ. మంచి పరిణామమే కదా. మెచ్చుకోళ్ళు, సద్విమర్శలతో పాటుగా వ్యక్తిగత దూషణలూ విన్నానీ సంవత్సరం. వేటిని ఎక్కడవరకూ తీసుకెళ్ళాలో, అక్కడివరకూ మాత్రమే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయాణాలని ఆస్వాదించే నేను, ఈ బ్లాగు ప్రయాణాన్నీ ఆస్వాదిస్తున్నాను. అందుకు కారకులైన మీ అందరికీ పేరుపేరునా మనః పూర్వక కృతజ్ఞతలు. ఊహించని బహుమతితో నన్ను ఆశ్చర్య పరిచిన బ్లాగ్లోకపు పక్కింటబ్బాయి సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

శనివారం, జనవరి 21, 2012

ఉక్కుపాదం

పెట్టుబడి దారులకీ, శ్రామికులకీ మధ్యన తగాదా వస్తే, శ్రామికులంతా ఏకమై పెట్టుబడిదారుల మీద తిరుగుబాటు చేస్తే పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది ఊహిస్తూ నూటైదేళ్ళ క్రితం అమెరికన్ రచయిత జాక్ లండన్ రాసిన నవల 'ది ఐరన్ హీల్.' అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమైన ఈ పుస్తకాన్ని 'ఉక్కుపాదం' పేరుతో తెనిగించారు సహవాసి. పాతికేళ్ళ విరామం తర్వాత, మూడో ముద్ర ణని మార్కెట్లోకి తెచ్చింది ప్రజాశక్తి బుక్ హౌస్.

కారల్ మార్క్స్ శిష్యుడూ, అమెరికన్ లేబర్ పార్టీ కీలక సభ్యుడూ అయిన జాక్ లండన్, భవిష్యత్ పరిణామాలని చాలా బాగా ఊహించాడనే చెప్పాలి. 1871 నాటి 'పారిస్ కమ్యూన్' అణచివేతని ఆధారం చేసుకుని భవిష్యత్తును ఊహిస్తూ సృజించిన ఈ అసంపూర్ణ నవలలో కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవర్ హార్డ్, ఓ కార్మిక నాయకుడు. కథానాయిక ఎవిస్, సంఘంలో ఉన్నతస్థానంలో ఉన్న, ఉన్నతభావాలున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. కథంతా ఎవిస్ గొంతు నుంచే వినిపిస్తుంది.

కార్మిక సంఘాల కార్యకలాపాల్లో పాల్గొంటూ, కార్మిక సమస్యల మీద వ్యాసాలు రాస్తూ, ఉపన్యాసాలు ఇచ్చే ఎర్నెస్ట్ కి ఎవిస్ తో పరిచయం చాలా చిత్రంగా జరుగుతుంది. ఉదార భావాలున్న ఎవిస్ తండ్రి ఏర్పాటు చేసిన ఒక పార్టీకి ఆహ్వానితుడిగా వచ్చిన ఎర్నెస్ట్, అక్కడి పెద్ద మనుషులతో వాదనకి దిగడం కథా ప్రారంభం. తన ధోరణితో ఇద్దరినీ బాగా ఆకట్టుకుంటాడు ఎర్నెస్ట్. ఒకరు ఎవిస్ కాగా మరొకరు బిషప్ మూర్ హౌస్. వీరిలో ఎవిస్ తర్వాతి కాలంలో ఎర్నెస్ట్ తో ప్రేమలో పడి అతడి అర్ధాంగిగా మారుతుంది.

ఇక, ఎర్నెస్ట్ కారణంగా పేదల సమస్యలని అర్ధం చేసుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మూర్ హౌస్ తన బిషప్ పదవిని కోల్పోవడంతో పాటు, 'పిచ్చివా'డన్నముద్ర వేయించుకుంటాడు. నవల పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా, వెంటాడే కొన్ని పాత్రల్లో మూర్ హౌస్ పాత్ర ఒకటి. ఎర్నెస్ట్-ఎవిస్ ల వివాహాన్ని సమర్ధించిన ఎవిస్ తండ్రి కూడా చిక్కుల్లో పడతాడు. ఆస్తులు కోల్పోయి, బీదరికంలోకి నెట్టివేయబడతాడు. అయినప్పటికీ తన స్థిర చిత్తాన్ని వదలడు.

కార్మికులకోసం చేసే ఉద్యమంలో భాగంగా, ఎర్నెస్ట్, ఎవిస్ లో ప్రభుత్వ గూఢచర్య విభాగంలో ఉద్యోగాలు సంపాదించ గలుగుతారు. ఇందుకోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని తమ రూపు రేఖలు మార్చుకుంటారు కూడా. తమవాళ్ళని చాపకింద నీరులాగా అన్ని ప్రభుత్వ సంస్థలలోనూ ప్రవేశ పెట్టగలుగుతారు. కార్మికుల తిరుగుబాటుకి రంగం సిద్ధం చేస్తారు. కానీ, ప్రబుత్వం పెట్టుబడి దారుల పక్షం కావడంతో తన ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయ గలుగుతుంది.

ధనస్వామ్య వ్యవస్థ పైశాచికత్వం, ఫాసిస్టు తత్వానికి 'ఉక్కుపాదం' అని పేరు పెట్టాడు రచయిత జాక్ లండన్. ఈ ఉక్కు పాదానికున్న శక్తి మరి దేనికీ లేదని చెబుతూనే, ఏదో ఒక నాడు ఈ ఉక్కుపాదం శ్రమశక్తి ముందు ఓడిపోతుందన్న ఆశావహ దృక్పధాన్ని చూపుతాడు. ఆసాంతమూ ఆపకుండా చదివించే నవల ఇది. వర్గ భేదాల గురించిన సిద్ధాంత చర్చలు కథలో భాగమయ్యాయి. సహవాసి అనువాదాన్ని గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? అయితే, అచ్చుతప్పులు మాత్రం కొంచం ఎక్కువగానే కనిపించాయి. (పేజీలు 176, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). 'ఉక్కుపాదం' మాతృక 'ది ఐరన్ హీల్' గురించిన వికీ సమాచారం ఇక్కడ చూడొచ్చు.

శుక్రవారం, జనవరి 20, 2012

'జంధ్యావందనం' లో 'జంధ్యామారుతం'

కొందర్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సింది మిగిలిపోతూనే ఉండడం ఈ కొందరి ప్రత్యేకత. దర్శక, రచయిత జంధ్యాల ఆ కొందరిలోనూ ఒకడనడం నిస్సందేహం. జంధ్యాల విశేషాలని పంచుకోడానికీ, స్మరించుకోడానికీ బ్లాగ్మిత్రులు పప్పు శ్రీనివాసరావు గారి సారధ్యంలో వెలుగు చూసిన వెబ్సైటు 'జంధ్యావందనం.'

దర్శకుడిగా జంధ్యాల తెరకెక్కించిన సినిమాల విశేషాలతో సిని జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ వెలువరించిన వ్యాసాలని 'జంధ్యామారుతం' పేరిట సంపుటీకరించింది 'హాసం.' ఆ పుస్తకం తాలూకు విశేషాలతో నే రాసిన టపా కి 'జంధ్యావందనం' లో చోటిచ్చిన మిత్రులకి ధన్యవాదాలు.

బుధవారం, జనవరి 18, 2012

నాన్న-నేను

తల్లి తన బిడ్డల పట్ల చూపే ప్రేమని గురించి ఎన్నో దృష్టాంతాలున్నాయి. కానైతే, ఒక తండ్రి తన కొడుకుని ఎంతగా ప్రేమించగలడో చూపే ఉదంతాలు తక్కువే. నిజానికి, బిడ్డల పట్ల ప్రేమని 'ప్రకటించే' విషయంలో నిన్నమొన్నటి వరకూ 'తండ్రి' దురదృష్టవంతుడు మన సమాజంలో. అందుకే కాబోలు గడిచిన తరాల వారికి తల్లి అనగానే ప్రేమ, తండ్రి అనగానే భయం మాత్రమే గుర్తొస్తాయి. ఈ లోకం పోకడకి భిన్నంగా, గడిచిన తరంలోనే తన కొడుకు పట్ల అవ్యాజమైన అనురాగాన్ని ప్రకటించారో తండ్రి.

ఆ తండ్రి ప్రేమ ఎంతటిదంటే, ఐదో ఏడు నిండిన కొడుక్కి అక్షరాభ్యాసం చేయడానికి బదులుగా, చంకనెత్తుకుని తన వెంట ఊళ్లు తిప్పుకునేంత! డిగ్రీలు లేకపోయినప్పటికీ, స్వయం ప్రతిభతో ఆ కొడుకు ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించుకుంటే, కేవలం అతనికి దూరంగా గడపాలనే కారణానికి ఆ ఉద్యోగానికి వెళ్ళనీయనంత!! అలాగని ఆ తండ్రి అక్షరజ్ఞానం పామరుడేమీ కాదు. విఖ్యాత కవీ, పండితుడూ అయిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆ కొడుకు, తెలుగునాట తొలితరం కార్టూనిష్టుల్లో ఒకరైన బుజ్జాయి.

బుజ్జాయి వెలువరించిన ఆత్మకథ 'నాన్న-నేను' లో అత్యంత సహజంగానే సింహభాగం విశేషాలు కృష్ణశాస్త్రిని గురించే. కవిగా, సిని గీత రచయితగా, అభ్యుదయ వాదిగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన కృష్ణశాస్త్రి లో తెలియని కోణాలెన్నింటినో ఆవిష్కరిస్తుందీ పుస్తకం. కృష్ణశాస్త్రి తల్లిగారు సీతమ్మగారు, ఆగర్భ శ్రీమంతురాలు. నగల సవ్వడిని బట్టి ఆవిడ నడచి వస్తోందని గమనించేవారట అందరూ. కొడుకంటే అపరిమితమైన ప్రేమ ఆవిడకి. భావకవిత్వం రాసి, ప్రచారం చేస్తున్న కృష్ణశాస్త్రి పట్ల ఆగ్రహించిన పిఠాపురం రాజా 'దేవిడి మన్నా' (దేవిడి నుంచి బహిష్కరణ) విధించినా, కొడుకుని పల్లెత్తు మాట అనలేదు ఆవిడ. చదువు పూర్తవుతూనే సుబ్బలక్ష్మితో వివాహం జరిగింది శాస్త్రిగారికి.

సుబ్బలక్ష్మి గారి అకాల మరణం తో వ్యాకుల పడ్డ కృష్ణశాస్త్రిని మనిషిని చేయడం కోసం 'రాజహంస' తో రెండో పెళ్ళి జరిపించారు సీతమ్మ. కృష్ణశాస్త్రి-రాజహంసల తొలి సంతానమే బుజ్జాయి. అసలు పేరు సుబ్బరాయశాస్త్రి, కృష్ణశాస్త్రి పెదనాన్నగారి పేరు. బుజ్జాయి పుట్టాక కృష్ణశాస్త్రి గారికి కొడుకు తోడిదే ప్రపంచం. "శాస్త్రి బుజ్జాయికి పాలివ్వడం తప్ప అన్నీ చేస్తున్నాడు," ఈ మాటన్నది మరెవరో కాదు, కృష్ణశాస్త్రి గురువు రఘుపతి వేంకటరత్నం నాయుడు. మేనకోడళ్ళని (వింజమూరి సీత, అనసూయ) కో-ఎడ్యుకేషన్ లో చేర్పించి మరీ చదివించిన కృష్ణశాస్త్రి, బుజ్జాయిని బళ్ళో వెయ్యకపోవడం చాలా విమర్శలకే తావిచ్చింది.

అయితే, కృష్ణశాస్త్రి ధోరణి వేరు. విమర్శలని లెక్కపెట్టలేదు. "నాతో తిరగడమే వాడికి ఎడ్యుకేషన్" అని ఊరుకున్నారు. అదీ నిజమే అయ్యింది. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, నండూరి సుబ్బారావు, పింగళి లక్ష్మీకాంతం, శ్రీరంగం శ్రీనివాసరావు... వీరంతా ప్రముఖ కవి పండితులు మాత్రమే కాదు, బుజ్జాయిని ఎత్తుకుని తిప్పిన వారు కూడా. భావకవిత్వాన్ని గురించీ, బ్రహ్మ సమాజాన్ని గురించీ తండ్రి ఊరూరూ తిరిగి ఉపన్యాసాలు ఇస్తుంటే, ప్రేక్షకుల్లో కూర్చుని కాలక్షేపం కోసం పెన్సిల్ స్కెచ్చులు వెయ్యడం మొదలు పెట్టారు బుజ్జాయి. అడివి బాపిరాజు వంటి వారి సలహాలూ, సూచనలూ తన ప్రతిభని మెరుగు పెట్టుకోడానికి ఉపయోగపడ్డాయంటారు ఆయన.

సిని రచయితగా కృష్ణశాస్త్రికి పేరు తెచ్చిన 'మల్లీశ్వరి' సినిమానే బుజ్జాయి కెరీర్నీ మలుపు తిప్పింది. కథాచర్చల సమయంలో, తండ్రి పరోక్షంలో బీఎన్ రెడ్డి తన పట్ల జాలి చూపడాన్ని విన్న బుజ్జాయి, తనకంటూ ఓ మార్గం ఏర్పరుచుకోవాలని ధృడంగా నిర్ణయించుకుని కార్టూనుల మీద దృష్టిపెట్టారు. ఇక వెనుతిరిగి చూసింది లేదు. ఓ వంక తండ్రితో పాటు "జిప్సీ" లాగా తిరుగుతూనే, కార్టూనిస్టుగా తన కెరీర్ని కొనసాగించి తనకంటూ పేరు తెచ్చుకున్నారు బుజ్జాయి. పిన్న వయసులోనే కార్టూన్ పుస్తకాలు ప్రచురించినా, పెద్ద పెద్ద పత్రికలకి కార్టూన్ స్ట్రిప్స్ వేసినా తనని తాను నిరూపించుకొవాలనే తపనతోనే, అది కూడా తండ్రి నీడన ఉంటూనే.

ఆనాటి సిని, సాహితీ వాతావరణం, మద్రాసు, హైదరాబాదు జీవితాలు, రాజకీయ ప్రముఖులు కవులకిచ్చిన గౌరవం వంటి వాటితో పాటు, కృష్ణశాస్త్రి గారి చిత్రమైన అలవాట్లు, చివరి వరకూ కూడా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోకపోవడం లాంటి ఆశ్చర్యకరమైన విషయాలనీ చెబుతుందీ పుస్తకం. "చదువంటే బడిలో, గురువు ముఖత సాధించే విద్య అని తెలియని ఒక వ్యక్తి చెప్పిన కథగా, గడిచిన తరం వైభవాన్ని తన నీడలాగ వెంబడించిన ఒక అదృష్టవంతుని జీవితంగా ఊపిరి తిరగనీయకుండా చదివించే ఇతివృత్తమిది. ఒకనాటి ఆంధ్రదేశపు ఔన్నత్యాన్ని ఒరుసుకు సాగిన ఒక విచిత్రమైన, విభిన్నమైన బుజ్జాయి కథ ప్రతి పేజీలోనూ మిమ్మల్ని మిరుమిట్లు గొలుపుతుంది," అన్న ప్రకాశకుల మాటలో అతిశయోక్తి కనిపించదు.

కళాతపస్వి క్రియేషన్స్ ప్రచురించిన ఈ 196 పేజీల పుస్తకంలో కృష్ణశాస్త్రి అరుదైన ఛాయాచిత్రాలూ, బుజ్జాయి బొమ్మల కథల వివరాలూ అదనపు ఆకర్షణ. బుజ్జాయి నిజాయితీ, బోళాతనం అడుగడుగునా కనిపించి, ఆశ్చర్య పరుస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకం. (వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, జనవరి 12, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-6

తిరిగి తిరిగి అలసిపోయి, ఆపై భోజనం చేశామేమో, అందరికీ నిద్ర ముంచుకొచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ నిద్రని పోగొట్టడానికా అన్నట్టు ఒక్కసారి డప్పు శబ్దాలు వినిపించాయి. అవేమిటా అనుకునే లోగానే గైడు వచ్చి చెప్పాడు, హోటల్ ప్రాంగణంలోనే టూరిస్టుల కోసం గిరిజనుల 'ధింసా' నృత్యం ఏర్పాటు చేశామని. ఆ ప్రకటన వినగానే అందరూ ఒక్కుదుటన డేన్స్ చూడడానికి కదిలారు. అందరితో పాటే మేమూను. ఓ డజను మంది గిరిజన స్త్రీలు టూరిస్టులతో కలిసి ఫొటోలకి ఫోజులిస్తున్నారు. గిరిజన యువకులు డప్పుల దరువు సరి చూసుకుంటున్నారు.

కాసేపట్లో ధింసా నృత్యం మొదలైపోయింది. నృత్యం జరుగుతూనే ఉంది కానీ, నేనెందుకో లీనం కాలేకపోతున్నాను. అప్పుడు చూశాను కొంచం పరిశీలనగా. అంచున్న శిల్కు చీరలు వాళ్ళు పద్ధతిలో కట్టుకుని, సిగలో ప్లాస్టిక్ పూలు ముడుచుకుని నృత్యం చేస్తున్న మహిళలు ఏదో యాంత్రికంగా కదులుతున్నట్టు అనిపించిందే తప్ప చేస్తున్న నృత్యంలో లీనమైనట్టు అనిపించలేదు. మధ్యమధ్యలో టూరిస్టుల వీడియో కెమెరాల వైపు చూస్తున్నారేమో, నాకు 'సాగర సంగమం' సినిమా ప్రారంభంలో ఎస్పీ శైలజ చేసే డేన్స్ గుర్తొచ్చింది.

నృత్యం అవుతుండగానే అందరినీ బస్సులు ఎక్కమన్న ప్రకటన వచ్చింది. మొదట గాలికొండ వ్యూ పాయింట్ చూపించి, అక్కడినుంచి బొర్రా గుహలు తీసుకెడతారట. బస్సు కిటికీ నుంచి చూస్తుంటే అరకు అందంగానే కనిపిస్తోంది.. ఏదో లోపం.. అదేమిటో అర్ధమయ్యేసరికి మేము గాలికొండ వ్యూ పాయింట్ చేరుకున్నాం. అరకులోనే ఎత్తైన ప్రదేశమట అది. బైనాక్యులర్స్ సరి చేసుకునే వాళ్ళు, ఫోటోలు దిగే వాళ్ళు, ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు.. అంతటా కోలాహలం. కొందరు గిరిజనులు కాఫీ గింజలు, కాఫీ పొడి, మసాలా దినుసులు అమ్మకానికి పెట్టారక్కడ. మన్యం కాఫీ అంటూ అప్పుడెప్పుడో పేపర్లో చూసింది గుర్తొచ్చి కాఫీపొడి తీసుకున్నాం.


నా ఆలోచన నిజమేనా అని నన్ను నేను పరిక్షించుకుంటూ, చుట్టూ వెతుకుతూ ఉండగానే బస్సు అనంతగిరి కాఫీ తోటలు దాటుకుని బొర్రా గుహలు చేరుకుంది. ఇక్కడ మాకు గంట టైం ఇచ్చాడు గైడు. మెట్లు ఎక్కుతూ, దిగుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఆ గుహలని లైట్ల వెలుగులో చూడడం ఓ చిత్రమైన అనుభూతి. రాక్ ఫార్మేషన్ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన సంగతులు గుర్తొచ్చాయి. గుహల నిర్వహణ బాగుంది. బయటికి వచ్చి రెస్టారెంట్లో టీ తాగుతుండగా గైడు కొంచం ఖాళీగా కనిపించాడు, ఇంకా రావాల్సిన వాళ్ళకోసం ఎదురు చూస్తూ. నాక్కలిగిన సందేహాన్ని అతని ముందు ఉంచేశాను. "అరకు అనగానే పసుపచ్చ పూలే గుర్తొస్తాయసలు. వాటిని చూడ్డం కోసమే ఈ సీజన్ ఎంచుకుని వచ్చాం. ఒక్క పువ్వూ కనిపించడం లేదిక్కడ," నా ప్రశ్న పూర్తి కాకముందే అందుకున్నాడతను.

"వాటిని వలస పువ్వులంటారు సార్ ఇక్కడ. ఆవ నూనె లాంటి నూనె వచ్చే గింజలని ఇచ్చే మొక్కలవి. ఇక్కడ, ఒరిస్సాలోనూ వంటలో ఆ నూనెనే వాడతారు. రెండు మూడేళ్ళ నుంచీ ఆ పంట వెయ్యడం మానేశారు వీళ్ళు. గత ఏడాది వరకూ అక్కడక్కడా కనిపించేది, ఈ ఏడాది ఒక్క మొక్కా లేదు," అతను చెప్పింది విన్నాక చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. మరికొంచం కబుర్లలో పెట్టాను. గిరిజనుల నుంచి నూనె గింజలని గిరిజన కార్పోరేషన్ కొంటుందిట. రేటు గిట్టుబాటు కావడం లేదని ట్రైబల్స్ ఎప్పటినుంచో గొడవ చేస్తున్నాకార్పోరేషన్ పట్టించుకోవడం లేదుట. దానితో, ట్రైబల్స్ అంతా కూడగట్టుకుని, పంట వెయ్యడమే మానేశారుట. "ఎవరన్నా సినిమా వాళ్ళు వచ్చి, షూటింగ్ కోసమని డబ్బులిస్తే వాళ్ళు అడిగినంత మేరా పంట వేస్తారు సార్. ఈసారి సినిమా వాళ్ళు కూడా ఎవరూ వచ్చినట్టు లేరు," చెప్పాడు గైడు.

చాలా చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. గిరిజనులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం, అన్నింటికీ మించి అనవసరమైన విషయాలకి హడావిడి చేసే మీడియా ఇంత ముఖ్యమైన విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడం.. తరువాతి ప్రయాణమంతా ఇదే ఆలోచన వెంటాడింది నన్ను. పచ్చపూలు లేని అరకు బోసిగా కనిపించింది. అంతకు మించి, గిరిజనుల్లో వచ్చిన చైతన్యం ఓ వెలుగులాగా అనిపించింది. తైదా రిసార్ట్స్ దగ్గర టీ, స్నాక్స్ కోసం బస్సులు ఆగినప్పుడు మళ్ళీ కదిలించాను గైడుని. "బొర్రా గుహలు ఒక్కటే టూరిస్ట్ ఎట్రాక్షన్ సార్ ఇప్పుడు. బాక్సైట్ అంటున్నారు.. ఈ కొండలు ఉంటాయో, తవ్వేస్తారో, నాకు అనుమానంగానే ఉంది," అన్నాడతను.

అరకులో కనిపించిన మార్పులు, యాంత్రికంగా చేసిన ధింసా నృత్యం, పచ్చపూలు లేని అరకు, కొత్తగా వచ్చిన బాక్సైట్ విపత్తు..ఈ లోయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, ఆలోచనకి అందలేదు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణం.. మెలికలూ, మలుపులూ ఎక్కువకావడంతో మావాళ్ళు కొంచం ఇబ్బంది పడ్డారు. దీనితో అలసట మరీ ఎక్కువగా అనిపించింది నాకు. జవాబు లేని ప్రశ్నలతో విశాఖ చేరుకున్నాను. బహుశా, కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్నలివి. ....."టూర్ అనగానే పొరుగు రాష్ట్రాలు కాదు. మన రాష్ట్రంలో చూడని వాటిని ముందుగా చూసెయ్యాలి," ఇల్లు చేరగానే మావాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఇది. (అయిపోయింది).

బుధవారం, జనవరి 11, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-5

ఉదయం ఐదూ యాభైకంతా విశాఖ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫాం కి దగ్గరలో ఉన్న ఏపీ టూరిజం వారి కౌంటర్ చేరుకున్నాం. అప్పటికే మాలాంటి యాత్రికులు కొందరు వేచి ఉన్నారక్కడ. మా టిక్కెట్లు చెక్ చేసిన టూరిజం ఉద్యోగి, మమ్మలనందరినీ నాలుగో నెంబరు ప్లాట్ఫాం మీదకి అక్షరాలా ఈడ్చుకుపోయాడు. ఆ వేళకాని వేళలో కూడా రైల్వే స్టేషన్ శుభ్రంగా ఉంది. అంతేనా, కాఫీ రుచిగా ఉంది కూడా. కాసేపట్లోనే కిరండల్ పాసింజర్ రైలు కూతపెట్టుకుంటూ వచ్చేసింది. టూరిజం వారు ప్రత్యేకంగా రిజర్వు చేసుకున్న బోగీలోకి మమ్మల్ని ఒక్కొక్కరుగా ఎక్కించి, మా సీట్లలో సుఖాసీనుల్ని చేశారు.

గైడు వచ్చి తనని తను పరిచయం చేసుకుని యాత్ర ఎలా ఉండబోతోందో వివరించాడు. ట్రైన్ కదిలిన కాసేపటికి అల్పాహారం వచ్చింది. రెండు ఇడ్లీలు, ఉప్మా, రెండు చట్నీలు. సందేహిస్తూనే తినడం మొదలు పెట్టాను. ఆశ్చర్యంగా, టిఫిన్ చాలా బాగుంది. మినరల్ వాటర్ బాటిల్స్, పొగలుగక్కే టీ వచ్చాయి. అవయ్యేసరికి టూరిజం వాళ్ళ హాస్పిటాలిటీ బాగుండబోతోందన్న నమ్మకం కలిగింది. ఇంతలోనే టూరిజం వాళ్ళ ఉద్యోగి ఒకరు వచ్చి, యాత్ర సీడీలు కొనమని ఒక్కొక్కరినీ అడగడం మొదలుపెట్టాడు. సీడీలు కొనుక్కుని చూసే పనే అయితే ఇంతదూరం రావడం ఎందుకూ అనుకున్నాను మనసులో. ఇదే మాట పైకే అనేశారెవరో.

రైలు శృంగవరపు కోట దాటిన కాసేపటికి గైడు వచ్చి చెప్పాడు, మరి కాసేపట్లో టన్నెల్స్ మొదలవుతాయనీ, మొత్తం నలభై రెండు టన్నెల్స్ దాటుకుని ముందుకు వెళ్లాలనీను. నెహ్రూ హయాం లో వేసిన ఆ రైలు మార్గాన్ని గూడ్స్ రైళ్ళ కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నరానీ, ఐరన్ ఓర్ ని విశాఖ పోర్ట్ కి చేరవేయడం కోసమే ఆ లైను వేయడం జరిగిందనీ చెప్పాడు. "ఈ సింగిల్ ట్రాక్ రూట్లో గూడ్స్ రైళ్ళు నడపడం రైల్వే కి లాభం. పాసింజర్ రైలు నడపడం నష్టం. అందుకే, గూడ్స్ రైలు ఎదురొస్తే మన రైలుని ఆపేస్తారు. పదకొండుకల్లా అరకు చేరుకుంటాం మనం," అని తెలుగులో చెప్పి, అదే విషయాన్ని ఇంగ్లిష్లోనూ చెప్పాడు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టుల సౌలభ్యం కోసం.

అప్పటికే గూడ్సు రైలు కోసం రెండుసార్లు ఆగిన మా రైలు, నెమ్మదిగా సాగుతూ మొదటి టన్నెల్ లో అడుగుపెట్టింది. అప్పటివరకూ నిశ్శబ్దంగా ఉన్న బోగీలో కోలాహలం మొదలయ్యింది. పిల్లలతో పాటు పెద్దలూ కేరింతలు కొట్టారు. కుడివైపు కిటికీలో లోయ, ఎడమవైపున అప్పుడప్పుడూ మెరిసి మాయమవుతున్న జలపాతాలు. ఒక్కో టన్నెల్ దాటుతుంటే రైలు పైపైకి వెళ్ళడం తెలుస్తోంది. ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియో షూట్ చేసేవాళ్ళు, సిగ్నల్ ఉన్న చోటల్లా ఫోన్లలో తమ వాళ్లకి లైవ్ కామెంటరీ చెప్పేవాళ్ళూ...ఇలా బోగీ అంతా గోలగోలగా ఉంది. ఇంతలో 'జార్ముడే' అంటూ వచ్చాడొకతను. ఏమిటా అని చూస్తే మరమరాలు అవీ ఉన్న సంచీతో కనిపించాడు. ఒరియా స్నాక్ అన్నమాట. కొత్త చోటికి వెళ్ళినప్పుడు అక్కడి రుచులు కూడా చూడాలికదా అని తీసుకున్నాం. పిడతకిందపప్పుని జ్ఞాపకం చేసింది రుచి.


చుట్టూ పరికిస్తుంటే, అరకుని నేపధ్యంగా తీసుకుని వంశీ రాసిన కథలూ, నవలలూ గుర్తొచ్చాయి. మరీముఖ్యంగా 'గాలికొండపురం రైల్వే గేటు' నవల. ఉన్నట్టుండి రైలాగింది. బయటికి తొంగిచూస్తే, స్టేషన్ పేరు 'బొర్రా గుహలు.' రైలు బయలుదేరాక చూస్తే, దాదాపుగా లోయ మొత్తం కనిపిస్తోంది. నేను ఊహించుకున్న దానితో పోల్చుకుంటే ఏదో తేడా అనిపిస్తోంది కానీ, అదేమిటో ఇదమిద్దంగా తెలియలేదు. పదకొండున్నరకి అరకు స్టేషన్ చేరుకుంది మా రైలు. బయట బస్సులు రెడీగా ఉన్నాయని చెబుతూ, ఎవరెవరు ఏయే బస్సులెక్కాలో ఒకటికి రెండుసార్లు చెప్పాడు గైడు. మరో పదినిమిషాల్లో బస్సులో ఉన్నాం. అది మొదలు, రాత్రి విశాఖ చేరుకునే వరకూ అదే బస్సు, అవే సీట్లు.

బయలుదేరిన పావుగంటకి అరకు ట్రైబల్ మ్యూజియం ఎదుట ఆగాయి బస్సులు. బిలబిల్లాడుతూ దిగాం. ఇరవై నిమిషాల్లో చూసి రావాలని చెప్పాడు గైడు. లోపల ఎగ్జిబిట్స్ అన్నీ సెల్ఫ్-ఎక్స్ప్లనేటరీ అని కూడా చెప్పాడు. మ్యూజియం చాలా బాగుంది. ఒకప్పటి అరకు గిరిజనులు జీవితాలను రికార్డు చేసేందుకు చేసిన మంచి ప్రయత్నం. వాళ్ళ జీవన శైలి, కళలు, కట్టుబాట్లు ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే అర్ధమయ్యాయి. వెదురుతో చేసిన వస్తువులు అమ్మే స్టాళ్లు ఉన్నాయి, మ్యూజియం లోపలా, ఎదుటా కూడా. రేట్లు మరీ ఎక్కువగా ఏమీలేవు. మ్యూజియం ఎదురుగా ఉన్న కాఫీ షాపులో కాఫీ రేట్లు మాత్రం చుక్కల్ని తాకుతున్నాయి. టూరిజం వాళ్ళ ప్యాకేజీలో కాఫీ లేదు కాబట్టి, మా కాఫీలు మేమే తాగాం. మిట్ట మధ్యాహ్నం కూడా చిరు చలిగా అనిపిస్తున్న ఆ వాతావరణంలో, చిక్కని ఫిల్టర్ కాఫీ తాగడం ఓ చక్కని అనుభూతి.

మరో ఐదు నిమిషాల్లో బయలుదేరిన బస్సులు, పావుగంటలో 'పద్మాపురం గార్డెన్స్' ముందు ఆగాయి. దారంతా హోటళ్ళూ, రిసార్టులతో పాటుగా, ప్రభుత్వ ఆఫీసులూ, క్రైస్తవ మిషనరీలు నడిపే విద్యాలయాలూ కనిపించాయి. యూనిఫాం ధరించిన పిల్లలూ, నైటీలతో వంటలు చేసుకుంటున్న గిరిజన మహిళలూ అరకు మారుతోందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. రకరకాల పూలమొక్కలతో ఉన్న పద్మాపురం గార్డెన్స్ నిర్వహణ మరికొంచం బాగుండవచ్చు అనిపించింది. గార్డెన్ పక్కనే ట్రీ-టాప్ రిసార్టులున్నాయి. అలాగే తేనె, కుంకుళ్ళు అవీ అమ్మే స్టాల్స్ కూడా కనిపించాయి. గైడు మాకు అరగంట టైం ఇచ్చాడు. అందరూ చెప్పిన టైం కన్నా ముందే బస్సుల దగ్గరికి చేరుకున్నారు. రోడ్డు పక్కన, వెదురు బొంగుల్లో చికెన్, మసాలా కూరి, కాల్చి అమ్మే వంటకాన్ని వింతగా చూశారు కొందరు టూరిస్టులు. అటు అమ్మే వాళ్ళకీ, ఇటు కొనుక్కునే వాళ్ళకీ భాషే సమస్య.

తర్వాతి కార్యక్రమం మధ్యాహ్న భోజనం. టూరిజం వారి హరిత హోటల్ ముందు ఆగాయి బస్సులు. బఫే భోజనం. "ఆకొన్న కూడె అమృతము.." లాగా కాకుండా, నిజంగానే రుచిగా ఉంది భోజనం. పొరుగు రాష్ట్రాల టూరిస్టులకీ తెలుగు భోజనమే. ఒకరిద్దరు మినహా అందరూ ఆస్వాదించారు కొత్త రుచులని. గైడు వచ్చి అందరినీ పేరు పేరునా కనుక్కున్నాడు, 'భోజనం చేశారా?' అని. త్వరగా కానిమ్మని తొందరపెట్టలేదు సరికదా, 'కాసేపు విశ్రాంతిగా కూర్చోండి, అప్పుడు బయలుదేరదాం' అన్నాడు. అంతే కాదు, పర్యాటక శాఖ తరపున ఓ వినోద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పాడు(ఇంకా ఉంది).

మంగళవారం, జనవరి 10, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-4

"ఇవాళ మనం సింహాచలం చూడబోతున్నాం. అంటే రోజూ చూసే సింహాచలం కాదు. ఇది మహా పుణ్యక్షేత్రం," ఉదయాన్నే ప్రకటించాన్నేను. మా ఎదురింటి వాళ్ళ పనిమనిషి పేరు సింహాచలం. ఆవిడంటే మా వీధి వీధంతటికీ హడల్. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తల స్నానాల హడావిడి. "సూది పిన్నీసు కావా"లంటూ వచ్చింది ఇల్లాలు. "మంగళసూత్రంలో లేదా?" ప్రశ్న నోటి చివరివరకూ వచ్చి ఆగిపోయింది. "గుడి దగ్గర దిగగానే అమ్మేవాళ్ళు ఎదురొస్తార్లే," అన్నాను, ఆరేళ్ళనాటి సింహాచలాన్ని గుర్తు చేసుకుంటూ.

కారు నగరం దాటి, సింహాచలంలో అడుగు పెట్టడంతోనే కారు అద్దాలు దించాను, సంపెంగల పరిమళాలని ఆఘ్రాణించడం కోసం. సింహాచలం వెళ్ళినప్పుడల్లా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మరీ సంపెంగలు తెచ్చిచ్చే మిత్రులున్నారు నాకు. ఘాట్ రోడ్డు సగానికి పైగా కరిగిపోయింది, ఎక్కడా సంపెంగల జాడ లేదు. అంతేనా? కొండ పైకి వెళ్ళగానే కలిగిన మొదటి సందేహం, 'వచ్చింది సింహాచలానికేనా?' అని. అంతగా మారిపోయింది గుడి, ఆవరణ, అంతా. గుడిముందు విశాలమైన ఖాళీ స్థలం, కుడివైపున ప్రసాదం కౌంటర్లు మరియు గోకులం, ఎడమ వైపున అన్నసత్రం లాంటి నిర్మాణాలు.

సూది పిన్నీసులే కాదు, సంపెంగలు అమ్మేవాళ్ళూ కనిపించలేదు. ఒకే ఒక్క చల్ల బుట్ట మాత్రం కనిపించింది. 'ఏమైపోయారు వీళ్ళంతా?' సందేహం తొలిచేసింది నన్ను. ఊహించనంత రద్దీగా లేదు ఆలయం. కళ్యాణం జరుగుతోంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. క్యూలో కదులుతుంటే, కల్యాణ మండపం దగ్గర తిరునామాలు పెట్టుకున్న ఒకాయన ఎవరితోనో నవ్వుతూ మాటాడుతున్నారు. ఆ మందహాసం ఎంతగా నచ్చిందంటే, "ఎవరండీ ఆయన?" అని అక్కడే ఉన్న ఓ ఆచార్యులని అడిగాను. "వారు స్థానాచార్యుల వారు," అన్నారాయన. అర్చన చేయించుకుని, కప్ప స్తంభాన్ని కౌగలించుకుని, ఆలయం నుంచి బయటికి వస్తుండగా, అక్కడ కనిపించాయి సంపెంగలు, కేవలం ఒకే ఒక్క బుట్టలో. ఇంకా సీజన్ మొదలవలేదట.

చిన్న చిన్న దుకాణాలన్నింటినీ గుడికి ఎదురుగా కొంచం దూరానికి తరలించారు. మాలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళెవరో "అచ్చం తిరుపతిలాగా చేసేశారు కదూ" అనుకోవడం వినిపించింది. 'తిరుపతి ఒక్కటీ తిరుపతి లాగా ఉంటే చాలు కదా, సింహాచలాన్ని కూడా ఎందుకలా మార్చేయడం?' అనిపించింది కాసేపు. కనకమాలక్ష్మి గుడైతే అస్సలు ఆనవాలు పట్టలేని విధంగా మారిపోయింది. గుడి మొత్తం స్టీలు బారికేడ్ల మయం. గుడి పక్కనే కట్టిన ఓ బిల్డింగులోనుంచి మొదలుపెట్టారు క్యూని. అందులో చొచ్చుకుని వెళ్ళగా, వెళ్ళగా ఒక్క క్షణం దర్శనం. బయట పడ్డాక గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను.


భోజనానంతరం కైలాసగిరి ప్రయాణం. "కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల?" ప్రశ్న గుర్తొచ్చింది దారిపొడవునా. ఈ పార్కుని చూడాలని నేనెప్పుడూ అనుకోలేదు. పెద్దగా అంచనాలేవీ లేకుండానే బయలుదేరాను. కానైతే, వెళ్ళాక నచ్చడం మొదలుపెట్టింది. మొదట్లో చూసిన వ్యూ పాయింటే బాగా ఆకర్షించేసింది. ఆ కొండ మీద నుంచి సముద్రాన్నీ, నగరాన్నీ చూడడం చక్కని అనుభూతి. పార్కు నిర్వహణ కూడా చాలా చక్కగా ఉంది. బహుశా నిత్యం రద్దీ గానే ఉంటుందేమో. నెమ్మదిగా పార్కంతా చుట్టి వచ్చేసరికి కనుచీకటి పడింది. అప్పుడు చూశాం పార్కులో ఉన్న రైలుని.

ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమంటే, పదిహేను టిక్కెట్లు అమ్మగానే రైలు బయలుదేరుతుందిట. పార్కు చుట్టూ ఇరవై నిమిషాల్లో ఓ ప్రదిక్షణ చేస్తుందిట. రైల్లో ప్రయాణించే వారు పార్కుని కాక, నగరాన్ని చూడొచ్చుట. 'ఏం చూస్తాం' మొదలు 'చూసొద్దాం' వరకూ ఆలోచనలు సాగాయి. మేము రైలెక్కాక, మరో గ్రూపు కూడా వచ్చింది. కదిలిన రైల్లోనుంచి ఆకాశంలోకి చూస్తే, మబ్బు పట్టినట్టు ఉంది. ఒక్క నక్షత్రమూ కనిపించలేదు. తల దించితే వందల వేల నక్షత్రాలు. దీపాల వెలుగులో నగరమంతా నక్షత్రాలమయంగా కనిపించింది. కనిపించే దీపాలని బట్టి ఆ ప్రదేశం దై ఉంటుందో ఊహించుకోవడం. ఇరవై నిమిషాలు ఇట్టే గడిచిపోయాయి.

తిరిగి వస్తుండగా విశాఖని పరికించి చూశాను. మామూలు నగరం నుంచి మహా నగరంగా అతి త్వరగా మారిపోతోంది. ఎక్కడ చూసినా జనం జనం.. జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, పోలీస్ బరాక్స్.. ప్రాంతం ఏదైనా షాపులన్నీ జనంలో కిటకిటలాడుతున్నాయి. జనం ఎవరి కొనుగోలు శక్తి మేరకి వాళ్ళు తగిన మార్కెట్లలో బేరసారాలు చేస్తున్నారు. నగరంలో ఎక్కడా కూడా పార్కింగ్ ఫీజు సంస్కృతికి కనిపించలేదు నాకు. అంతటా ఫ్రీ పార్కింగే. హైదరాబాద్ తో పోల్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలూ తక్కువే. కాస్టాఫ్ లివింగ్ వేగంగా పెరిగిపోతోందన్న ఫిర్యాదు మాత్రం చాలామంది నుంచే విన్నాను.

సాంస్కృతిక మార్పు కూడా వేగవంతంగానే జరుగుతోన్నట్టుంది. ఎక్కడో తప్ప ఉత్తరాంధ్ర నుడికారం వినిపించలేదు. దీనిని అభివృద్ధి అనాలా లేక అస్తిత్వం మనుగడకి సవాల్ అనాలా అనే సందేహం కలిగింది నాకు. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను కానీ, ఆరాత్రి కలత నిద్రే పట్టింది నాకు. అవును, తెల్లవారు జామునే లేచి, మావాళ్ళని సిద్ధం చేసి ఆరుగంటలకల్లా రైల్వే స్టేషన్ చేరుకోకపోతే, అరకు వెళ్ళే కిరండొల్ పాసింజర్ రైలుని మిస్సైపోమూ మరి? (ఇంకా ఉంది).

సోమవారం, జనవరి 09, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-3

భుక్తాయాసంతో కారెక్కానేమో, కొంచం మగతగా అనిపించింది. ఆ వేళలో పట్టే కునుకుని 'కూటి కునుకు' అంటారట తూర్పున. నాకైతే ఆ కునుకేమీ రాలేదు. రోడ్డు పక్కన కనిపిస్తున్న ఒక్కో ఊరినీ చూస్తూ డ్రైవరుతో కబుర్లు మొదలు పెట్టాను. ఊళ్ళ పేర్లు చాలావరకు ఆయుర్వేద మూలికలని గుర్తు చేస్తున్నాయి. డ్రైవరు గోదారి జిల్లా వాడట. ఉపాధి వెతుక్కుంటూ విశాఖలో స్థిరపడ్డాడట. "మా జిల్లా నుంచి వలసలెక్కువ. గల్ఫ్ లో ఉన్న తెలుగు వాళ్ళలో మా జిల్లా వాళ్ళదే మెజారిటీ" అని నేనెంత మొత్తుకున్నా నమ్మని మిత్రులకి, ఇతన్ని ఉదాహరణగా చూపించాలని అనిపించింది.

'కథా నిలయం' చూడలేదన్న లోటుని మినహాయిస్తే, శ్రీకాకుళం టూరు అనుకున్నట్టే జరిగింది. కారు హైవే నుంచి విజయనగరం రోడ్డులోకి తిరిగిన కాసేపటికి 'డెంకాడ' బోర్డు కనిపించింది. "నేను డెంకాడ సూరిని. ఒంటి చేత్తో అడివి పందిని చంపిన వాడిని. ఈటె సూరి అంటారు నన్ను," అంటూ వీరబొబ్బిలికి తనని తాను దర్పంగా పరిచయం చేసుకున్న రాసబిడ్డ గుర్తొచ్చాడు. ఆవెంటనే ఆ పాత్రని సృష్టించిన అలమండ రాజుగోరు పంతంజలీ గుర్తొచ్చాడు. "అలమండ ఎలా వెళ్ళాలి?" అడిగాను డ్రైవరుని. ఉలిక్కిపడ్డాడతను. "వెళ్దాం" అంటానని అనుకున్నాడో ఏమో, "కొంచం ముందు కెళ్ళాక కుడేపుకి తిరగాలం"డని చెప్పాడు.

పతంజలి లేని అలమండని చూడాలని అనిపించలేదు. అదీకాక, ఆ రాజుల లోగిళ్ళన్నీ ఇప్పుడసలు ఉన్నాయో లేదో.. నా ఆలోచనలో నేనుండగానే, రోడ్డు పక్కన మురిక్కాలవలు, పందిపిల్లలూ కనిపించడం మొదలయ్యింది. గమ్యస్థానం సమీపిస్తున్నట్టుంది. "బుజ్జి బుజ్జి పందిపిల్లలు.. ఎంత ముద్దొస్తున్నాయో.." వినబడ్డ వ్యంగ్యాన్ని విననట్టు నటించా. సందడి సందడిగా ఉన్న బజారు వీధిలో కష్టపడి రోడ్డు క్రాస్ చేసి, పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నాం. సాయంకాలం కావడంతో గుడి బాగా రద్దీగా ఉంది. గుడి ఎదురుగా రెడీమేడ్ బట్టలు రాశులు పోసి అమ్ముతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు పాలనని గురించి చదివింది గుర్తొచ్చి, నవ్వొచ్చింది.

"గురజాడ ఇల్లు" కారెక్కుతూ చెప్పాన్నేను. డ్రైవరు ముఖంలో ప్రశ్నార్ధకం. ఇద్దరు ముగ్గురిని అడిగి, రెండు మూడు వీధులు తిప్పి, గురజాడ వీధిలో కారు సర్రున పోనిస్తుండగా, బోర్డు చూసి "ఇదే..ఇదే.." అన్నాన్నేను. మిత్రులు చెప్పినట్టుగానే మంచి స్థితిలోనే ఉంది ఇల్లు. మరమ్మతులు చేసినట్టున్నారు. ఓ రీడింగ్ రూము నడుస్తోంది. పై అంతస్తుకి వెళ్లాం. తలుపులకి తాళాలు వేసి ఉన్నాయి. బాల్కనీ నుంచి చూస్తే కోట ఓ పక్కా, ఊరు మరో పక్కా కనిపిస్తున్నాయి. తాళాలు వేసిన గదుల్లో గురజాడ వాడిన వస్తువులని భద్రపరిచారేమో. మహాకవిని మన ప్రభుత్వం ఈమాత్రం పట్టించుకుందంటే అదే పదివేలనిపించింది. 'మధురా'న్ని మనసులోనే స్మరించుకున్నాను.


తరువాత వెళ్ళాల్సింది కోటకి. "లోపలేదో ప్రైవేటు స్కూలు పెట్టారట సార్. లోపలి వెళ్లనివ్వడం లేదు ఎవర్నీ," డ్రైవరు మాట లక్ష్య పెట్టలేదు నేను. గేటు దగ్గర ఆపిన సెక్యూరిటీ గార్డుని "లోపల చూడొచ్చా?" అని అడిగితే, ఆనందంగా గేటు తీశాడు. గజపతుల గత వైభవానికి గుర్తుగా, ఠీవిగా నిలబడ్డ కోటని చూడగానే, మళ్ళీ అదే భావన.. నాకు బాగా తెలిసిన ప్రాంతానికి వచ్చానని. నిజమే, ప్రభుత్వ కాలేజీతో పాటు, ఓ ప్రైవేటు స్కూలూ నడుస్తోంది కోట ప్రాంగణంలో. శిధిల సౌందర్యం అనలేను కానీ, ఒకప్పటితో పోలిస్తే వైభవం బాగా తగ్గిందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. కోట నుంచి బయటికి రావాలనిపించలేదు. కానీ, రాక తప్పదు కదా.

"అయ్య కోనేటికి తోవ ఇదే" అని చెప్పడానికి గిరీశం లేడక్కడ. కానైతే, కోట ముందు నిలబడి ఎవర్ని అడిగితే చెప్పరు కనుక? కోనేటి చుట్టూ కారుని ఓ ప్రదిక్షణ చేయించి, తూర్పు గట్టున ఆపాడు డ్రైవరు. ఎదురుగా ఆంజనేయస్వామి గుడి. బయటినుంచి చూడ్డానికి పాతకాలం ఆలయం లాగా ఉన్నా, లోపల మెరిసిపోతున్న పాలరాతి ఫ్లోరింగ్, కాంతివంతమైన లైట్లూ, చిన్న చిన్న కాగితాల మీద పెన్నుతో టిక్కులు పెట్టుకుంటూ హడావిడిగా ప్రదిక్షణలు చేస్తున్న మహిళలూ. అయ్యవారెందుకో అన్యమనస్కంగా ఉన్నారు. ఎవరితోనో కబుర్లు చెబుతూ పూజ కానిచ్చారు. మసక చీకటిలో అయ్య కోనేటి గట్టుని చూస్తుంటే ఎన్నో ఆలోచనలు.. ఎన్నెన్ని సాహితీ చర్చలకి వేదికై ఉంటుందో కదా ఈ ప్రదేశం అనిపించింది. విజీనారం మార్కు దోమలు విడవకుండా కుడుతుంటే, కార్లోకి లంఘించి "మహారాజా సంగీత కళాశాల" అని చెప్పా. "ఎవరూ ఇవి చూళ్ళేదండి," మరోసారి చెప్పాడు డ్రైవర్.

అప్పటికే బాగా చీకటి పడిపోయింది. శీతవేళ కదూ. అయ్యవార్లూ, పిల్లలూ పాఠాలు ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోయినా, తాళం వేసి ఉన్న లోగిలినన్నా చూసి వెళ్ళాలన్నది మా ఆలోచన. ఆశ్చర్యం!! గేట్లు తెరచి ఉన్నాయి. నెమ్మదిగా లోపలి వెళ్లేసరికి, కనిపించిన దృశ్యం ఎంతటి సంతోషాన్ని ఇచ్చిందంటే, వర్ణించడానికి కూడా మాటల్లేవు. విశాలమైన ఆవరణలో, చెట్లకింద అనేక వృత్తాలుగా కూర్చున్న విద్యార్ధులు. ఒక్కో వృత్తమూ ఒక్కో సంగీతం తరగతి. ఇవి కాకుండా, పక్కనే ఉన్న క్లాసు రూముల్లో వీణ, వాయులీనం, తబలా పాఠాలు జరుగుతున్నాయి. గేటు బయటి రణగొణ ధ్వనులేవీ లోపలి రావడం లేదు. మా ఉనికి, వాళ్ళెవరి ఏకాగ్రతకీ భంగం కలిగించలేదు కూడా. ఋషుల్లా, తపస్వినుల్లా పాఠాల్లో లీనమైపోయారు వాళ్ళు.

తరగతి గదుల్లో ఘంటసాల, ద్వారం ఇంకా మరికొందరి ఫోటోలు బయటికి కనిపిస్తున్నాయి. మొత్తంగా ఓ రెండు మూడొందల మంది విద్యార్ధులు ఉండి ఉంటారు. సాధనలో కొందరు, చర్చల్లో కొందరు, వాద్యాల మరమ్మతులు నేర్చుకుంటూ మరికొందరు... గజపతుల కళాభిరుచికి మనసులోనే మరో మారు జోహార్ చెప్పుకున్నాను నేను. తదుపరి మజిలీ విశాఖే కావడంతో, చాలా సేపే గడిపాం ఆ ఆవరణలో. అప్పుడు కూడా కదలాలని అనిపించలేదు మాకు. కోట సెంటర్లో కాఫీ టిఫిన్లు కానిచ్చి కారెక్కుతుంటే, ప్రియమైన వారిని విడిచి వెళ్తున్న భావన. అయితే, మరి కాసేపట్లో ఓ మిత్రుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ నా మూడ్ మార్చేసింది. ఉన్నట్టుండి, "తూనీగా...తూనీగా.." అంటూ కూనిరాగం అందుకున్నా (ఇంకాఉంది).

ఆదివారం, జనవరి 08, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-2

వేళ్ళు కొంకర్లు పోయేంత చలేమీ కాకపోయినా, ధనుర్మాసపు ఉదయం చలచల్లగానే ఉంది. విశాఖ నగర పొలిమేర దాటిన కారు జాతీయ రహదారి మీద దూసుకుపోతోంది. మామూలుగా అయితే బద్ధకంగా నిద్రపోవాలని అనిపించాలి. కానీ, ఉద్యమాలకి పుట్టిల్లైన ప్రాంతాన్ని చూడబోతున్నానన్న ఉత్సాహంలో ఉన్నాన్నేను. 'శ్రీకాకుళం-90 కిమీ' బోర్డు కనిపించింది. వెంపటావు సత్యం మొదలు కారా మాష్టారు వరకూ ఎందరో మహానుభావులు గుర్తొచ్చారా ప్రాతః సమయంలో.

తూర్పున సూర్యుడింకా కనిపించడం లేదు. మంచు దుప్పటి చాటున బద్ధకంగా కదులుతున్నాడు. మేము మొదటగా చూడబోయేది ఆయన్నే! అంతటా కనిపిస్తున్న ప్రత్యక్ష దైవానికి కూడా ఓ గుడి ఉండడం, దానిని చూడబోతుండడం ఓ చిత్రమైన అనుభూతి. 'ఎలా ఉండబోతోంది శ్రీకాకుళం?' ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేసుకున్నానో లెక్కలేదు. నేను చూడని అతి కొద్ది జిల్లాలలో ఇదీ ఒకటి మరి. విశాలమైన హైవే కి రెండు పక్కలా అక్కడక్కడా దాబాలూ, ఇంజినీరింగ్ కాలేజీలూ, కొత్తగా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ లే-అవుట్లూ కనిపిస్తున్నాయి. కారు అద్దాన్ని కిందకీ, కంటి అద్దాలని పైకీ జరిపాను, అప్రయత్నంగా.

అతికొద్ది నీటి ప్రవాహంతో పలకరించింది నాగావళి. ఎందుకో తెలీదు కానీ స్వర్ణముఖి గుర్తొచ్చింది. బ్రిడ్జీ మీద కారు వెళ్తుంటే 'బాణం' సినిమాలో ప్రారంభ దృశ్యం తలపుకొచ్చింది. వచ్చేశాం శ్రీకాకుళం! రోడ్డుకి రెండు వైపులా షాపులు, టీ కొట్ల దగ్గర గుంపులుగా చేరిన జనం. స్కూళ్ళు, కాలేజీలకి వెళ్ళే హడావిడిలో ఉన్న పిల్లలు. అప్పుడే డ్యూటీ ఎక్కుతున్న కానిస్టేబుళ్లు. ప్రత్యేకంగా ఏమన్నా కనిపిస్తుందా అని వెతుకుతుండగా ప్రత్యక్షమైన దృశ్యం.. బస్సులు, కార్లు, హడావిడి మధ్య నుంచి నెత్తిన చేపల బుట్టలతో తాపీగా నడుచుకుంటూ వస్తున్న జాలారత్తలు. నేత చీరని కుడిపైటతో కట్టుకుని, ముక్కున తళుక్కున మెరిసే అడ్డబాస, నోట్లో అడ్డపొగతో ప్రపంచంలో ఉన్న ప్రశాంతతనంతా ముఖంలో నింపుకుని వెళ్తున్న వాళ్ళని కించిత్ ఆరాధనతో చూశాన్నేను. ఏ సంపద ఇవ్వగలదు ఆ సంతృప్తిని??

శ్రీకాకుళాన్ని పూర్తిగా పరికించకముందే అరసవిల్లి వచ్చేసింది. 'అరె, ఇంత దగ్గరా?' అని ఆశ్చర్యపోయాను. అరసవిల్లి కూడా శ్రీకాకుళం పట్టణంలో భాగమేనని డ్రైవర్ చెబితే తెలిసింది. రోడ్డుని ఆనుకునే సూర్యుడి గుడి. రోడ్డంతా చిరు వ్యాపారుల సందడి. ఆశ్చర్యంగా, గుడి ఖాళీగానే ఉంది. అయినప్పటికీ అనేకానేక మలుపులున్న, సుదీర్ఘమైన క్యూలో నడిచి నడిచి గర్భాలయం చేరుకోవాల్సి వచ్చింది. గుడి ప్రాంగణం మొత్తం క్యూ తాలూకు స్టీలు బారికేడ్లతో నిండిపోడంతో ఏమాత్రం ఊపిరి సలపనట్టుగా అనిపించింది. అర్చనాదికాలయ్యాక, సెక్యూరిటీ గార్డు కళ్లుగప్పి గుడి ఆవరణలో ఫోటోలు తీసేశారు మావాళ్ళు. గుడి ఎదురు వీధిలో తాజా చేపలమ్ముతున్న జాలర్ల ఇళ్ళు దాటుకు వెడితే కనిపించిన కోనేరు, గట్టున ఉన్న గోకులం బాగా నచ్చాయి నాకు.

అరసవిల్లి నుంచి శ్రీకూర్మానికి ప్రయాణం. దారిపొడుగునా రోడ్డుకి ఇరుపక్కలా కళ్ళు విప్పార్చుకుని చూస్తుండగా నన్ను దొల్చేసిన ప్రశ్న ఒక్కటే. శ్రీకాకుళోద్యమం పుట్టిందీ, నక్సల్బరీ ఉద్యమం విస్తరించిందీ ఇక్కడేనా? నిన్నమొన్నటి కొవ్వాడ ఉద్యమం జరిగింది ఈ నేల మీదేనా? అని. ఉద్యమాల కోణం నుంచి చూసినప్పుడు శ్రీకాకుళాన్ని గురించి నా అంచనా వేరు.. కనిపిస్తున్న దృశ్యం వేరు. శ్రీకూర్మం ఆలయంలోకి అడుగుపెట్టగానే ఐహిక ప్రపంచం తాలూకు ఆలోచనలతో లంకె తెగిపోయింది నాకు. పురాతనమైన ఆ ఆలయ నిర్మాణం చూడగానే చిర పరిచితంగా అనిపించింది. విశాలమైన ఆవరణ, కోనేరు, తాబేళ్ల పార్కు దాటుకుని గుడిలోకి అడుగు పెడుతుండగానే ఒకలాంటి ప్రశాంతత ఆవహించింది. సుభద్రాచార్యుల వారి ఇల్లాలు వరదమ్మ పుట్టిన ఊరు ఇదే అని గుర్తు రావడంతోనే నా కళ్ళు 'పోటు' కోసం వెతికాయి. ఆ కథ కల్పితమన్న నిజాన్ని ఒక్కోసారి ఒప్పుకోలేన్నేను.

అరసవిల్లి ఆలయం నుంచి ఎంత తొందరగా బయట పడదామా అనిపిస్తే, శ్రీకూర్మంలో ఎంత ఎక్కువ సేపు గడుపుదామా అనిపించింది. పెద్దగా రద్దీ లేదు. మిగిలిన ఆలయాల్లా కాకుండా, ప్రతి భక్తుడూ గర్భగుడిలోకి నేరుగా వెళ్ళే సౌకర్యం ఉందిక్కడ. తాపీగా పూజ చేసి, ప్రసాదం ఇచ్చి, ఆలయ ప్రాశస్త్యం గురించీ, తెల్లవారు జామున జరిగే అభిషేకాన్ని గురించీ వివరంగా చెప్పారు ఆచార్యులు. ప్రతి స్తంభాన్నీ పలకరించి, ప్రతి గోడనీ పరిశీలించి, 'రియల్ స్టార్' రఘుముద్ర శ్రీహరి, శ్రీమతి శాంతి దంపతులు పునః ప్రతిష్టించిన ధ్వజ స్తంభాన్ని తడిమి చూశాక, ఆవరణలో ఫోటోలు దిగి, తాబేళ్ళతో కాసేపు గడిపి అప్పుడు బయట పడగలిగాను, కృత్యదవస్థ మీద.

శ్రీకాకుళంలో మిత్రుడి ఇంట్లో ఆతిధ్యం, ఆ మధ్యాహ్నం. మాటల్లో "శ్రీకాకుళం అంటే 'బాణం' సినిమాలో లాగా ఉంటుందనుకున్నా" అన్నాను. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అలాగే ఉంటుందనీ, ఆ సినిమా షూటింగ్ అక్కడ జరిగిందనీ చెప్పారు తను. సంభాషణ ఏజెన్సీ మీదకీ, ఏటా ఊళ్ళ మీదకి వచ్చి పడుతున్న ఏనుగుల సమస్య మీదకీ మళ్ళింది. జిల్లా రాజకీయాలు, జరుగుతున్న ఉద్యమాలూ ఇవన్నీ చర్చకి వచ్చేశాయి. భోజనం అవుతుండగానే 'తర్వాత ఎక్కడికి?' అన్న ప్రశ్న వచ్చేసింది. శైవ క్షేత్రం 'శ్రీముఖ లింగం' చూసి, సాయంత్రానికి విశాఖ వెళ్ళొచ్చు అన్నది డ్రైవర్ సూచన. కానీ నా ఆలోచన వేరుగా ఉంది. శ్రీముఖలింగం గురించి మిత్రుడిచ్చిన ఫీడ్ బ్యాక్ విన్నాక, మావాళ్ళ మొగ్గు అటునుంచి తగ్గింది. ఇదే అదనుగా నేను 'అయితే విజయనగరం వెళ్దాం' అనేసి, రియాక్షన్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను. మా హోం డిపార్ట్మెంట్ 'సరే' అనడంతో నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు(ఇంకా ఉంది).

శనివారం, జనవరి 07, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-1

సముద్రమంటే నాకిష్టం. చిన్న ధారగా పుట్టి, సన్నగా ప్రవాహం మొదలు పెట్టి, ఉరుకులూ పరుగులెత్తి, ఎందరికో అన్నం పెట్టే మా గోదారి చివరకి కలిసేది సముద్రంలోనే కావడం ఇందుకు ఒక కారణం. అదిగో, ఆ సముద్రంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలనీ చూసిరావాలనే సంకల్పంతో కుటుంబంతో కలిసి నాలుగు రోజుల ఉత్తరాంధ్ర యాత్రకి బయలుదేరాను. ఒకటి రెండు ప్రదేశాలు మినహా చూడాలనుకున్నవన్నీ చూడగలిగాం, కారు అద్దం నుంచి. ఆరేళ్ళ విరామం తర్వాత చూస్తున్నానేమో, చాలా మార్పే కనిపించింది నాకు.

మహాకవి శ్రీశ్రీలో కవితావేశాన్ని రగిల్చిన సముద్ర కెరటాలని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.. విశాఖతో సమ చరిత్ర ఉన్న భీమిలి అన్నింటా వెనుకబడే కనిపించింది, బీచీతో సహా. ఎంతో మంది పర్యాటకులు వస్తున్నా, కనీస సదుపాయాలు కానీ, పరిశుభ్రత కానీ లేవక్కడ. కారు భీమిలి వైపు పరుగులు తీస్తుండగా, దారంతా చేతిలో ప్లాస్టిక్ కవర్లు పట్టుకున్న పల్లె పడుచులు 'బాబూ..బాబూ.. బాబూ' అని అరుస్తూ కనిపించారు. ఇద్దరు ముగ్గుర్ని దాటి ముందుకు వెళ్ళాక అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో కారాపమన్నాను డ్రైవర్ని.

ఓ ప్లాస్టిక్ సంచీలో వేయించిన జీడిపప్పు. మొత్తంగా ఓ ఇరవై పలుకులు ఉంటాయేమో. 'యాబై రూపాయలు' అంది అమ్మే ఆవిడ. తెగే బేరం కాదనిపించి, కారు పోనిమ్మన్నాను. ఆవిడ అదాటున నా చెయ్యి పట్టేసుకుని, "నలబై ఇవ్వండి బాబూ.. పోనీ ముప్పై.. బాబ్బాబ్బాబూ..." అనడం మొదలు పెట్టింది. ఊహించని 'పాణిగ్రహణా'నికి బిత్తరపోయాన్నేను. మావాళ్ళకి మాత్రం కావలసినంత వినోదం దొరికింది. నా అవస్థ గ్రహించిన వాడై, డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. తోటల్లో రాలిన కాయలు ఏరి, కాల్చి అమ్ముతారని వివరం చెప్పాడు.

భీమిలి చూడగానే చలం గుర్తొచ్చాడు అప్రయత్నంగా. అక్కడ ఉన్నంతసేపూ గుర్తొస్తూనే ఉన్నాడు. తిరిగి వస్తూ 'ఎర్రమట్టి దిబ్బలు' చూడాలన్నాను నేను. ఆశ్చర్యం! అవి ఎక్కడున్నాయో తెలీదన్నాడు డ్రైవర్. నా పోరు పడలేక ఒకరిద్దర్ని వాకబు చేసి తీసుకెళ్ళాడు. రోడ్డుకి అటు పక్క తెల్లటి ఇసుకతో మెరిసిపోతున్న బీచ్.. ఇవతలి ఒడ్డున ఎర్రటి మట్టి దిబ్బలు. ఎన్నో తుపానుల్ని తట్టుకుని మరీ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాయవి. దట్టంగా పరుచుకున్న జీడిమామిడి తోటలూ, ఠీవిగా నిలబడ్డ సర్వీ చెట్లనీ చూసుకుంటూ రుషికొండ వైపు బయలుదేరాం.

ప్రయివేటు విశ్వవిద్యాలయం 'గీతం' ఎదురుగా ఉన్న రుషికొండ బీచీలో జనం పల్చగా ఉన్నారు. నిమ్మకాయ, కారం అద్దిన అపుడే కాల్చిన, లేత మొక్కజొన్న కండె తింటూ సముద్ర కెరటాలని చూస్తుంటే 'చిన్న చిన్న ఆనందాలు' అన్న మాట అప్రయత్నంగా గుర్తొచ్చింది. ఓ నవ్వూ వచ్చింది. భీమిలి బీచ్ లో పూర్తి పల్లెటూరి వాతావరణం కనిపిస్తే, రుషికొండ బీచ్ లో అర్బన్ పోకడలు కనిపించాయి. ఇనిస్టెంట్ ఫోటో తీయించుకోమంటూ వెంట పడే ఫోటోగ్రాఫర్లనీ, గుర్రం ఎక్కమని బలవంతం చేసే కుర్రాడినీ తప్పించుకుని ఆర్కే బీచ్ చేరేసరికి కనుచీకటి పడింది.

కాస్మోపాలిటన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా ఓ సాయంత్రం ఆర్కే బీచ్ చూస్తే చాలు. క్లబ్బులకీ, డిస్కోలకీ వెళ్ళక్కర్లేదు. విశాఖ 'అభివృద్ధి' ఎంత వేగంగా జరుగుతోందో తెలుసుకోడానికి కూడా ఈ బీచ్ ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో. బీచ్ రోడ్డుని మాత్రం ఒకప్పటి ట్యాంక్ బండ్ తరహాలో రూపుదిద్దారు. శ్రీశ్రీ మొదలు, రావిశాస్త్రి వరకూ రచయితలూ, అల్లూరి సీతారామ రాజు వంటి త్యాగధనులు, ఘంటసాల, ద్వారం వెంకటస్వామి నాయుడు తదితర కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేశారక్కడ!! నాక్కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. గతంలో చూడలేదు వాటిని.

సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో సముద్రం మరింత అందంగా ఉంటుంది. మేము సూర్యాస్తమయ వేళలో మాత్రం చూడగలిగాం సముద్రాన్ని. ఆ సాయంత్రం వేళ, కెరటాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ తీరాన్ని తాకుతున్నాయి. వాటిని చూసి, ఒక్కసారిగా చిన్నపిల్లాడినైపోయి, గవ్వలేరే ప్రయత్నం మొదలు పెట్టాను. తొలి కెరటం ఓ ప్లాస్టిక్ కవర్నీ, రెండో కెరటం ఖాళీ కోక్ టిన్నునీ ఇచ్చాయి నాకు. నిరాశ ముంచుకొచ్చి, గవ్వలేరే ప్రయత్నం విరమించుకున్నాను. (ఇంకా ఉంది).