మంగళవారం, మార్చి 13, 2012

పాకుడురాళ్ళు

సినిమా.. ఓ రంగుల ప్రపంచం. తమని తాము వెండి తెర మీద చూసుకోవాలన్నది లక్షలాదిమంది కనే కల. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి.. వీటన్నింటినీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. ఇప్పుడంటే గాసిప్ వెబ్సైట్ల పుణ్యమా అంటూ సినిమా వాళ్ళ జీవితాలు తెరిచిన పుస్తకాలు అయిపోయాయి కానీ, ఓ నలభై-యాభై ఏళ్ళ క్రితం అంతా రహస్యమే.. తెర వెనుక జరిగేదేదీ తెరమీద సినిమా చూసే ప్రేక్షకుడికి తెలిసేది కాదు.

అలాంటి సమయంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశారు రచయిత రావూరి భరద్వాజ. 'పాకుడురాళ్ళు' నవల, కేవలం 'మంజరి' గా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకునే జర్నలిస్టూ.... ఇలా ఎందరెందరిదో కథ ఇది.

కథా స్థలం గుంటూరు సమీపంలో ఓ పల్లెటూరు. కథా కాలం పద్య నాటకాలు అంతరించి, సాంఘిక నాటకాలు అంతగా ఊపందుకోని రోజులు. నాటకాలంటే ఆసక్తి ఉన్న మాధవరావు, రామచంద్రం కలిసి 'నవ్యాంధ్ర కళామండలి' ప్రారంభించి సాంఘిక నాటకాలు ప్రదర్శించాలి అనుకుంటారు. వాళ్ళ నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడం కోసం వస్తుంది పదిహేనేళ్ళ మంగమ్మ. బళ్ళారి రాఘవ ట్రూపులో పనిచేశానని చెప్పుకునే నాగమణి పోషణలో ఉంటుంది మంగమ్మ. అప్పటికే మంగమ్మ మీద సంపాదన ప్రారంభించిన నాగమణి, నాటకాల్లో అయితే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చునని ఈ మార్గం ఎంచుకుంటుంది. మాధవరావు-రామచంద్రం తర్ఫీదులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది మంగమ్మ. కళామండలి కి మంచి పేరు రావడంతో, నాగమణి కి కొంత మొత్తం చెల్లించి మంగమ్మని చెర విడిపిస్తారు మిత్రులిద్దరూ.

కొంతకాలానికి కళామండలి మూతపడే పరిస్థితి వస్తుంది. మంగమ్మ, నాగమణి 'కంపెనీ' కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పాత మిత్రుడు చలపతి తనో సినిమా తీస్తున్నాననీ, మంగమ్మ అందులో నాయిక అనీ చెప్పి ఆమెని మద్రాసు తీసుకెడతాడు. చలపతి సినిమా తీయకపోయినా, మంగమ్మకి వేషాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. స్వతహాగా తెలివైనదీ, మగవాళ్ళని కాచి వడపోసినదీ అయిన మంగమ్మ సైతం -మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సినిమా హీరోయిన్ల వైభవం, ఐశ్వర్యం చూశాక తనుకూడా హీరోయిన్ కావాల్సిందే అని నిర్ణయించుకుని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో, ఓ సిద్ధాంతి సూచన మేరకి తన పేరు మంజరి గా మార్చుకుంటుంది. వేషాలు రానప్పుడూ, చివరివరకూ వచ్చి జారిపోయినప్పుడూ మంజరి నిర్ణయం మరింత పదునెక్కుతూ ఉంటుంది.

మెల్లగా అవకాశాలు సంపాదించుకుని, నాయికగా పేరు తెచ్చుకుని తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి నాయిక అవుతుంది మంజరి. అనుకున్నది సాధించాక ప్రపంచాన్నిలెక్కచెయ్యదు మంజరి. చలపతిని కేవలం ఓ సెక్రటరీగా మాత్రమే చూస్తుంది. నిర్మాతలని అక్షరాలా ఆడిస్తుంది. అయితే, తనని తీర్చిదిద్దిన మాధవరావు-రామచంద్రం మీద, కష్టకాలంలో తనని ఆదుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. నవల పూర్తి చేసి పక్కన పెట్టినా, మంజరి ఓ పట్టాన ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళకపోడానికి కారణం రచయిత ఆ పాత్రని చిత్రించిన తీరు. కథ పాకాన పడేసరికి, మంజరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా "ఈమె దీనిని ఏరకంగా ఎదుర్కొంటుంది?" అన్న ఉత్కంఠ, పేజీలు చకచకా కదిలేలా చేస్తుంది. పాఠకులని ఎక్కడా నిరాశ పరచదు మంజరి.

అగ్రహీరోలతో కయ్యం పెట్టుకుని, దానివల్ల తనకి పోటీగా మరో నాయిక తయారవుతున్నప్పుడు కయ్యాన్ని నెయ్యంగా మార్చుకున్నా, తనని సినిమా నుంచి తీసేయాలని ప్రయత్నించిన నిర్మాతకి ఊహించని విధంగా షాక్ ఇచ్చినా మంజరికి మంజరే సాటి అనిపించక మానదు. గుర్రాప్పందాల మీద లక్షలు నష్టపోయినా కొంచం కూడా బాధ పడదు కానీ, ఎవరన్నా డొనేషన్ అంటూ వస్తే రెండో ఆలోచన లేకుండా తిప్పి పంపేసి మళ్ళీ రావొద్దని కచ్చితంగా చెప్పేస్తుంది. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే, హిందీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది మంజరి. ఇందుకోసం తన కాంటాక్ట్స్ ని తెలివిగా వాడుకుంటుంది. అంతేనా? భారదేశం తరపున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళిన తొలి తెలుగు నటి మంజరి. అక్కడ మార్లిన్ మన్రో ని కలుసుకున్న మంజరి, సిని నాయికలందరి జీవితాలూ ఒకేలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటుంది.

మంజరి తర్వాత ప్రాధాన్యత ఉన్న మరో నాయిక కళ్యాణి. సీనియర్ హీరోయిన్. మంజరి అంటే చాలా ప్రేమ కళ్యాణికి. సొంత చెల్లెలికన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఆద్యంతం ఆసక్తిగా అనిపించే మరో పాత్ర చలపతి. అవ్వడానికి చలపతి 'కింగ్ మేకర్' అయినా, మంజరి తనని నిర్లక్ష్యం చేసినప్పుడు సైతం ఆమెని వెన్నంటే ఉంటాడు. మంజరితో జీవితం పంచుకోవాలన్న ఆలోచన కానీ, ఆమె సంపాదన సొంతం చేసుకోవాలన్న ఆలోచన కానీ చలపతికి ఉన్నట్టు కనిపించదు. ఆత్మాభిమానం విషయంలో రాజీ పడని, ఆ విషయం బయట పడనివ్వని, చలపతి ఓ చిత్రమైన పాత్ర అనిపించక మానదు. నవల ఆసాంతమూ ఎంతో ఆసక్తిగా తీర్చిదిద్దిన భరద్వాజ ముగింపు విషయంలో నిరాశ పరిచారు నన్ను. 'ఈ తరహా కథలకి ఇలాంటి ముగింపే ఉండాలి' అన్నట్టుగా ముగించారు మంజరి కథని. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 506, వెల రూ. 200,
ఏవీకెఎఫ్ లోనూ లభ్యం).

శనివారం, మార్చి 10, 2012

లవ్ ఫెయిల్యూర్

చాలా రోజుల తర్వాత థియేటర్లో సినిమా చూశాను. కొంచం అరవ వాసన వేసిన డబ్బింగ్/ద్విభాషా చిత్రం పేరు 'లవ్ ఫెయిల్యూర్.' పేరు లాగానే, సినిమాలో సంభాషణలు కూడా ఎక్కువగా ఇంగ్లిష్ కలిసిన, అప్పుడప్పుడూ అరవంలాగా అనిపించే తెలుగులో వినిపించాయి. తొమ్మిదేళ్ళ క్రితం శంకర్ తీసిన 'బోయ్స్' మొదలుకొని ఇప్పటివరకూ కాలేజీ కుర్రాడి పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తున్న సిద్ధార్థ కథానాయకుడు. నాయిక అమలపాల్. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ విద్యార్ధులు. వీళ్ళు ప్రేమించుకోవడం అది విఫలమవుతూ ఉండడమే ఈ సినిమా.

అరుణ్ (సిద్ధార్థ్)ది చూడ చక్కని కుటుంబం. తండ్రి లాయర్, తల్లి మాటకి ఎదురు చెప్పనివాడు. ఈ కారణానికి అరుణ్ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి (అమలా పాల్) నేపధ్యం ఇందుకు విరుద్ధం. తల్లిదండ్రులు (అలనాటి అందాల హీరో సురేష్, కేరక్టర్ నటి సురేఖా వాణి) ఎప్పుడూ గొడవలు పడుతూ, విడిపోయేందుకు మానసికంగా సిద్ధపడిపోయి ఉంటారు. రెండు జంటలదీ ప్రేమ వివాహమే. అరుణ్, పార్వతి అనుకోకుండా ఒకరికొకరు పరిచయమై, అనుకుని స్నేహితులై ఆ తర్వాత ప్రేమికులవుతారు. ఏడాది తిరక్కుండానే అరుణ్ ప్రేమలో ఓడిపోతాడు.

అరుణ్, తగు మాత్రం ఉపన్యాసాలతో తన ప్రేమ కథని ప్రేక్షకులతో పంచుకోవడమే రెండుగంటల సినిమా. అరుణ్ ప్రకారం, పార్వతికి సహనం తక్కువ. తన మాటే నెగ్గాలంటుంది, నెగ్గించుకుంటుంది. ఇతగాడు మిక్కిలి ఓరిమితో భరిస్తున్నప్పటికీ, ఎప్పుడూ ఏదో ఒక కొత్త తగువు తెస్తూ ఉంటుంది. అరుణ్ లో తప్పులు వెతకడానికి ఉత్సాహ పడే పార్వతి, తన దగ్గర తప్పులున్నాయనే విషయాన్ని ఒప్పుకోనే కోదు. కథని అరుణ్ కోణం నుంచి చూపడం వల్ల అనుకుంటా, పార్వతి ఓ తెలివి తక్కువ అమ్మాయిలాగా అనిపించింది.


ప్రేమలో ఓడిపోయిన అరుణ్, తన మిత్రుల ప్రేమ ప్రయత్నాలు చూస్తూ, తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. పార్వతికి పాపం ఇంటి గొడవలకే ఎంత సమయమూ చాలదు. అదీ కాకుండా, ఆ అమ్మాయి కెరీర్ ఓరియంటెడ్. స్టేట్స్ వెళ్లి పై చదువులు చదవాలన్న లక్ష్యం ఒకటి ఉంటుంది. అరుణ్ కి ఈ శషభిషలేవీ లేవు కాబట్టి పార్వతి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు. పార్వతి తల్లిదండ్రుల కథ, అరుణ్ మిత్రుల ప్రేమకతలతో పాటు, పార్వతి-అరుణ్ ల ప్రేమ కథ కూడా ఓ మలుపు తిరగడమే సినిమా ముగింపు.

కథలో కొత్తదనం ఏమీ లేదు. కథనంలో కొత్తదనం చూపించడం కోసం ప్రయత్నించాడు దర్శకుడు బాలాజీ మోహన్. మరికొంచం గట్టి ప్రయత్నం చేసి ఉండాల్సింది. సిద్ధార్థ్ ని కాలేజీ విద్యార్ధిగా చూడగానే, "నే బీయే పాసయ్యానమ్మా" అంటూ గాద్గదికంగా పలికే 'అన్నగారు' గుర్తొచ్చారు. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని. ప్రేమకథలకి సంగీతమే బలం అంటారు కానీ, ఈ సినిమాకి ఆ బలంకూడా లోపించింది.

సాంకేతిక విభాగాల్లో, ఫోటోగ్రఫీ బాగుంది. మొదటి సగం బాగా సాగతీతగా అనిపించడానికి ఎడిటింగ్ కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ గానీ, హాస్యనటులు కానీ లేరు. అరుణ్ స్నేహితుడు విగ్నేశ్ ప్రేమకథని హాస్య భరితంగా చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన విభాగాల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. అనేకానేక ఉపన్యాసాల తర్వాత, సినిమా చివర్లో ఇచ్చే ఉపన్యాసంలో ఒక్కసారైనా ప్రేమలో పడ్డవాళ్ళకి తన కథ నచ్చి తీరుతుందనే అర్ధం వచ్చేలా మాటాడాడు అరుణ్. బహుశా, నేనింకా ప్రేమలో పడలేదేమో...

గురువారం, మార్చి 01, 2012

జెయింట్ వీల్

రొమాన్సు రాయడంలో తెలుగు కథకులు ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. మధ్యతరగతి 'ఇల్లాలి ముచ్చట్ల'ని వారం వారం వరుసతప్పకుండా రాస్తున్నది ఓ మగవాడన్న సందేహం ఆంధ్రదేశంలో పాఠకులెవరికీ ఈషన్మాత్రమన్నా కలిగించని రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఈయన రచనల్లో రొమాన్సుని పాఠకులు తమ ఊహాశక్తి మేరకి ఆస్వాదించ వచ్చు అనడానికి సీతమ్మ చేత చెప్పించిన ముచ్చట్లే సాక్షి. శర్మ గారి కథల దగ్గరికి వస్తే, 'జెయింట్ వీల్' అనే ఒక్క కథ చాలు, కొత్త దంపతుల చిలిపి తగువులనీ, స్వీట్ నతింగ్స్ నీ ఎంత అందంగా అక్షరాల్లో పొదగచ్చో చెప్పడానికి.

బెజవాడ నగరంలో ఏటా జరిగే ఎగ్జిబిషన్లో కొత్తగా దంపతులైన సూర్యం, సుబ్బులు చేసిన హడావిడే 'జెయింట్ వీల్' కథ. నిజానికి హడావిడి అంతా సుబ్బులుదే. ఎందుకంటే, సూర్యం బొత్తిగా తల్లిచాటు బిడ్డ. తండ్రి యెడల విపరీతమైన భయభక్తులు ఉన్నవాడూను. భార్యని ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళే ముందు కూడా, "అమ్మా, తలకి నూనె రాయవే' అని అడిగి, చెంపల మీదకి కారేలా నూనె రాయించుకునే శుద్ధ బుద్ధిమంతుడు లేదా మొద్దావతారం మన కథానాయకుడు. కిసుక్కున నవ్వి అటు భర్తకీ, ఇటు అత్తగారికీ ఏక కాలంలో కోపం తెప్పించగల గడుసుతనం సుబ్బులు సొంతం.

కొత్త కోడలి ముందు కొడుకు పరువు పోకూడదని, ఆ తల్లి ఓ పది రూపాయలు తెచ్చి కొడుక్కి ఇస్తుంది, ఎగ్జిబిషన్లో కావలసినవి కొనుక్కొమ్మని. ఇల్లు దాటి వీధిలో అడుగు పెట్టగానే మొదలవుతాయి, సుబ్బులు కోరికలు, అలకలు, డిమాండ్లూను. నాలుగడుగులేస్తే ఎగ్జిబిషనే కదా, నడిచి వెళ్ళిపోదాం అంటాడు సూర్యం. ససేమిరా కుదరదు, రిక్షా ఎక్కాల్సిందే అంటుంది సుబ్బులు. రిక్షా టాపు వేసేయాలంటాడు సూర్యం, తీసేయమంటుంది సుబ్బులు. ఇక ఎగ్జిబిషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టాక సుబ్బులు ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.

ఆడవాళ్ళ క్యూలోకి వెళ్లి ఇట్టే టిక్కట్లు తెచ్చేస్తుందా, లోపలి అడుగు పెట్టాక సూర్యం ఎలా ఉన్నాడో గమనించకుండా వంటింటి సామాన్లు, రొట్టెల మిషను, చెంచాలు, గరిటలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు తరిగే మిషను - ఇవన్నీ చూపిస్తున్న వాడితో హస్కు వేసి డిమానిస్ట్రేషన్ చేయించి, 'భలే భలే' అని చప్పట్లు కొట్టి ఆనందిస్తుంది. చిన్న చిన్న వస్తువులు బేరమాడి 'ఇవి కొందామండీ' అని గోముగా అడిగితే, 'మళ్ళీ వచ్చేపుడు కొందాంలే' అని చేయి పుచ్చుకుని ఇవతలికి లాగేస్తాడు సూర్యం.

ఫ్యాబ్రిక్ స్టాల్లోనూ అదే తంతు జరిగాక, సుబ్బులుని బులిపించడానికి 'ఎందుకు దండగ, నేను హైదరాబాద్ నుంచి తెస్తానుగా. అక్కడివి చాలా చవక' అని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఇక ఇది పనికాదని, ఫ్రీగా చూపించే ఫ్యామిలీ ప్లానింగ్ డాక్యుమెంటరీ, ప్రభుత్వ స్టాళ్లు తిప్పుతాడు కాళ్ళు నొప్పులు పుట్టేవరకూ. ఆమె పీచు మిఠాయి తిందామని సరదా పడితే ఇంట్లో అమ్మ చేసిన గారెలు ఉన్నాయనీ, మిరపకాయ బజ్జీలు తిందామని ముచ్చట పడితే వెధవ నూనె మంచిది కాదనీ సూర్యం అందుకునే సరికి, ఇక లాభం లేదని తనే రంగంలోకి దిగుతుంది సుబ్బులు.

పీచు మిఠాయి, బజ్జీలు మొదలు రుమాళ్ళు, పూసల దండలు, రింగులు, వంటింటి పరికరాల వరకూ తను కొనదల్చుకున్న సమస్తమూ కొనేస్తుంది సుబ్బులు. ఇద్దరూ చెరుకురసం తాగేశాక, "జాయింట్ వీల్ ఎక్కుదాం రండి సరదాగా" అన్న సుబ్బులు మాటలు విని కంగు తింటాడు సూర్యం. "నాకు భయం" అనడానికి సిగ్గుపడి, "ఎందుకూ దండగ, చిన్నపిల్లల్లా" అంటాడు కానీ, అప్పటికే టిక్కట్లు తెచ్చేస్తుంది సుబ్బులు. అక్కడ కనిపించిన ఓ బుష్ షర్టు కుర్రాడితో సుబ్బులు కబుర్లు మొదలెట్టగానే, సూర్యం బుర్రలో జెయింట్ వీల్ తిరగడం మొదలవుతుంది. "నేరకపోయి దీంతో.. ఇది సిసింద్రీ అని తెలీక ఎగ్జిబిషన్ కి వచ్చాన్రా భగవంతుడా" అనుకుంటూ ఉండగానే వాళ్ళు ఎక్కిన జెయింట్ వీల్ తిరగడం మొదలవుతుంది.

జెయింట్ వీల్ మీద కళ్ళు తిరిగి పడిపోయిన సూర్యాన్ని రిక్షాలో ఇంటికి చేరుస్తుంది సుబ్బులు, బుష్ షర్టు కుర్రాడి సాయంతో. గదిలో పందిరి మంచం మీద సూర్యం "శోషోచ్చిన శేషశాయిలా" పడుండగానే, అత్తగారికి రొట్లొత్తుకునే మిషను, నిమ్మకాయ పిండేది తదితరాలు, మావగారికి నాప్కిన్స్, చుట్టలు పెట్టుకునే పెట్టి ప్రెజెంట్ చేసేస్తుంది సుబ్బులు. స్పృహలోకొచ్చిన సూర్యానికి కలిగిన సవాలక్ష సందేహాలకి,సుబ్బులిచ్చిన సమాధానాలే ఈ చిన్న కథ ముగింపు. ముందే చెప్పినట్టుగా, రచయిత రొమాన్సుని రాయడానికన్నా, పాఠకుల ఊహకే ఎక్కువగా వదిలారు. ('తెలుగుకథకి జేజే!' సంకలనంలో చదవొచ్చీ కథని..)