గురువారం, మార్చి 06, 2014

ఒండ్రుమట్టి

ఎందుకో తెలియదు కానీ, తెలుగు నవల తొలినాళ్ళ నుంచీ పట్నవాసం మీద మోజు పెంచుకుంది. నూటికి ఎనభై శాతం జనం పల్లెల్లో ఉంటున్నా, వాళ్ళలో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవితం గడుపుతున్నా, పల్లెటూరి ఇతివృత్తాలు, వ్యవసాయపు నేపధ్యాలూ తెలుగు నవలల్లో కనిపించడం అరుదు. ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు 'మాలపల్లి,' డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి,' సి. సుజాత 'సుప్త భుజంగాలు,' చంద్రలత 'రేగడివిత్తులు' తర్వాత ఇదిగో ఇన్నాళ్ళకి "ఓ తీరగ్రామం-యాభయ్యేళ్ళ కథ" అంటూ వచ్చారు నల్లూరి రుక్మిణి తన 'ఒండ్రుమట్టి' నవలతో.

కథాస్థలం గుంటూరు జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామం.  సముద్రానికి దగ్గరగా ఉండి, తరచుగా తుఫానులని, ఉప్పు గాలుల్ని ఎదుర్కొనే ఆ గ్రామం లో ప్రధాన వృత్తి వ్యవసాయం. జమీందారు అధీనంలో ఉండే పొలాలని 'పాలి' కి తీసుకుని వ్యవసాయం చేసే రైతాంగం అంతా కమ్మ కులస్తులు. పొలాల్లో పనిచేసే రైతు కూలీలు మాల, మాదిగ కులస్తులు. యాభయ్యేళ్ళ నవల అని రచయిత్రి చెప్పినప్పటికీ దాదాపు ఏడు దశాబ్దాల కథాకాలం కనిపిస్తుంది. ఈ ఏడు దశాబ్దాలలో జమీందారు-భూమి, జమీందారు-రైతు, రైతు-కూలీ సంబంధాల్లో వచ్చిన మార్పులని వామపక్ష దృక్కోణం నుంచి నిశితంగా చిత్రించిన నవల ఇది.

కృష్ణాపురం రైతులు సజ్జలు, జొన్నలు పండించుకుంటూ, తమకి కావాల్సిన బట్టలు తామే నేసుకుంటూ బతికిన రోజుల నుంచి, పొగాకు పంటతో లాభాలు గడించి, యంత్రాలతో పనులు చేయించుకునే 'అభివృద్ధి' దశవరకూ సాగుతుంది కథ. వర్తమానం (1985) తో మొదలు పెట్టి గతంలోకి వెళ్లి (1920 ప్రాంతం) మళ్ళీ వర్తమానంలో ముగిసే ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని ఉపయోగించిన రుక్మిణి వ్యవసాయం, గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పులని సునిశితంగా అక్షరబద్ధం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన కృష్ణాపురం గ్రామం కథని మలుపు తిప్పిన సంఘటనలు రెండు. మొదటిది, నిజాం సాగర్ నిర్మాణం అనంతరం కొందరు రైతులు నైజాం ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ భూములు కొనుక్కొని వ్యవసాయం ఆరంభించడం కాగా, రెండోది కృష్ణాపురం రైతాంగానికి పొగాకు పంట పరిచయం కావడం.

చిన్నకారు రైతు కోటయ్య కుటుంబకథ ద్వారా కృష్ణాపురం కథ చెప్పారు రచయిత్రి. జమీందారు కృష్ణస్వామి దగ్గర భూమిని 'పాలి' కి తీసుకుని జొన్నలు పండించే కోటయ్యకి ముగ్గురు కొడుకులు - తిరపతయ్య, అమరయ్య, వెంకయ్య. కొత్తని ఆహ్వానించే తత్త్వం ఉన్న అమరయ్య ఊళ్ళో కొందరు రైతులతో కలిసి నైజాం ప్రాంతానికి వెళ్లి అక్కడ కారుచౌకగా వస్తున్న రాళ్ళు, రప్పలతో నిండిన భూమిని కొని, ఏళ్ళ తరబడి శ్రమించి దానిని వ్యవసాయ యోగ్యం గా మారుస్తున్న తరుణంలోనే, మిగిలిన ఇద్దరు కొడుకుల సాయంతో కొత్తగా వచ్చిన పొగాకు నాటి లాభాలు రుచి చూస్తాడు కోటయ్య. కుటుంబంలో పెళ్ళిళ్ళు, మరణాలు, ప్రకృతి వైపరీత్యాల వచ్చే పంట నష్టాలు వీటన్నింటినీ తట్టుకుంటూ ఇటు కృష్ణాపురం లోనూ, అటు నైజాము లోనూ భూములు బలపరుచుకున్న కోటయ్య కుటుంబం ఊళ్ళో పెద్ద రైతు కుటుంబాల్లో ఒకటిగా ఎదిగిన క్రమాన్ని చూడొచ్చు ఈ నవలలో.

అమరయ్య కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై పార్టీ పనుల్లో తిరుగుతూ ఉండడంతో తిరపతయ్య తమ్ముడి కుటుంబానికి తోడుగా నైజాంకి మారతాడు. కృష్ణాపురం లో స్వతంత్ర పోరాటం, నైజాం లో నిజాం వ్యతిరేక పోరాటం దాదాపు ఏకకాలంలో సాగుతాయి. ఈ రెండు పోరాటాల తోనూ సంబంధం కలిగి ఉంటాడు అమరయ్య. అతని కొడుకు చంద్రానిదీ తండ్రి దారే. అన్నదమ్ములలో చివరివాడైన వెంకయ్య కొడుకు భాస్కరం కృష్ణాపురంలో భూస్వామిగా ఎదుగుతాడు. అతని తరం వచ్చేసరికి రైతు-కూలీ సంబంధాల్లో విపరీతమైన మార్పు వస్తుంది. ఆత్మగౌరవ పోరాటాలు కూలీల్లో విశ్వాసం పెంచితే, వారి ఆత్మవిశ్వాసం మీద రైతాంగానికి మొదలైన అసంతృప్తి పెరిగి, పెద్దదై దళితుల ఊచకోత కి దారితీసిన పరిస్థితులని వివరిస్తారు రుక్మిణి.

మొత్తం 384 పేజీలున్న ఈ నవల కొన్ని తరాల వ్యవసాయ జీవితాలని, ఎన్నో పోరాటాలనీ కళ్ళముందు నిలిపింది. రైతుల వలస 'రేగడివిత్తులు' ని జ్ఞాపకం చేస్తే, నిజాం వ్యతిరేక పోరాటాలు, అప్పటి రాజకీయాలు 'లోపలి మనిషి' 'నిర్జన వారధి' పుస్తకాలని గుర్తు చేశాయి. అయితే, దీనిని ఒక సమగ్ర నవలగా అంగీకరించడానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణాపురం రైతు జీవితాలని చిత్రించినంత నిశితంగా నైజాం జీవితాలని చిత్రించక పోవడం ఒక కారణం కాగా, కమ్యూనిష్టు పోరాటాలు కథలో పూర్తి స్థాయిలో భాగం కాకపోవడం మరొకటి. అప్పటివరకూ కనిపించిన పాత్రలు ఉన్నట్టుండి మాయమైపోయి, పార్టీ సిద్ధాంతాలు అనేక పేజీల్లో కనిపించడం, ఆ తర్వాతే పాత్రలు కనిపించడం లాంటివి పరిహరించి ఉండాల్సింది.

కథలో, సిద్ధాంతాలని భాగం చేయడంలో మరికొంచం శ్రద్ధ చూపిస్తే బాగుండేది అనిపించింది. ఈ నవల పూర్వ రంగాన్ని గురించీ, నవల కోసం ఐదేళ్ళ పాటు తను చేసిన కృషిని గురించీ వివరంగా రాశారు రుక్మిణి తన ముందుమాటలో. కళ్యాణరావు, ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాటలు నవలని  సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యన భౌగోళికంగా ఉన్న మార్పులు, సాంస్కృతిక మార్పులపై వాటి ప్రభావాలని గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు రచయిత్రి. మొత్తం మీద చూసినప్పుడు అభినందించి తీరాల్సిన ప్రయత్నం. (విప్లవ రచయితల సంఘం ప్రచురణ, వెల రూ. 170,  అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, మార్చి 03, 2014

'అర్జున్' మంత్రం

తెలుగు టీవీ చరిత్రలోనే మొదటిసారిగా ఓ సంగీత కార్యక్రమం విదేశంలో చిత్రించారు ఈటీవీ 'పాడుతా తీయగా' బృందం. వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాద్య బృందం, తెరవెనుక సాంకేతిక నిపుణులు మరియు అతిధులు భారతదేశం నుంచి అతిధులుగా వెళ్ళగా, పోటీదారులందరూ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారు కావడం 'పాడుతా తీయగా' తాజా సిరీస్ 'అమెరికాలో రాగసాగరిక' ప్రత్యేకత!

అర్జున్ అద్దేపల్లి మొదటి విజేతగా నిలిచి పదివేల అమెరికన్ డాలర్లు బహుమతిగా అందుకున్న ఈ సిరీస్ లో, పుట్టపర్తి నారాయణాచార్యుల మనవరాలు వంశీప్రియ ద్వితీయ విజేతగా ఐదు వేల డాలర్లు గెలుచుకుంది. ఉదయబిందు, మనీషాలు మిగిలిన రెండు స్థానాల్లో నిలబడ్డారు. వీరిలో అర్జున్, మనీషాలు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు కాగా, వంశీప్రియ, ఉదయబిందు అక్కడికి వలస వెళ్ళిన తొలితరం తెలుగు వాళ్ళు. అర్జున్, మనీషా మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా వినిపించిన 'అమెరికన్ స్లాంగ్' వాళ్ళ పాటలో (ఎక్కడో తప్ప) వినిపించకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

నిజానికి ఈ కార్యక్రమం అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలని చెప్పింది. తెలుగు సంఘాల సహకారం లేనట్టయితే, ప్రవాసాంధ్రులు ఆదరించి ఉండకపోతే ఈ కార్యక్రమం నిర్వహించడం అసాధ్యం అయి ఉండేది ఈటీవీకి. వ్యయప్రయాసలతో పాటు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించారు అనేకమంది ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమం కోసం. ఒక్కో రాష్ట్రం లోనూ రెండు నుంచి నాలుగు ఎపిసోడ్లు చొప్పున చిత్రీకరణ జరుపుకున్న ఈ కార్యక్రమం చూడడానికి టిక్కెట్లు కొనుక్కుని మరీ వెళ్ళారు అక్కడి తెలుగు వారు. (ఇండియాలో ఎంట్రీ పాసులు ఉచితం!)


వనరుల పరిమితి చాలాసార్లే కొట్టొచ్చినట్టు కనిపించింది. అతిధులు ఒక్కొక్కరూ ఆరు నుంచి ఎనిమిది ఎపిసోడ్ల పాటు కొనసాగడం, కొన్ని కొన్ని చోట్ల వేదిక మరీ ఇరుకిరుకుగా ఉండడం లాంటివి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్న ప్రేక్షకుల దృష్టిని దాటిపోలేదు. పోటీకి వచ్చే ఔత్సాహికుల నాణ్యత గత కొద్ది సిరీస్ ల ధోరణి లోనే కొనసాగింది. స్థానికంగానే నాణ్యత తగ్గుముఖం పట్టినప్పుడు, విదేశంలో ఉన్న పరిమితులని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆశించడం సరికాదనే అనిపిస్తుంది. అయితే, పాల్గొన్న గాయనీగాయకులందరూ తమని తాము మెరుగు పరుచుకోవడం మీద చాలా ఎక్కువ శ్రద్ధ చూపించారు. (నిజం చెప్పాలంటే, ఇండియా లో జరిగిన సిరీస్ లలో వారి కన్నా చాలా మెరుగ్గా)

గత సిరీస్ విజేత హరిణి పాడిన ఫ్యూజన్ తో ఆరంభమైన ఈ 'రాగ సాగరిక,' 'పాడుతా తీయగా' ప్రేక్షకులకి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించింది. తెలుగుకి దూరంగా ఉండాల్సి వచ్చిన వారందరూ భాష మీద చూపించిన అభిమానం, ప్రేమ చూసేవారి దృష్టిని దాటిపోలేదు. ఉద్యోగాలు చేసుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ, పిల్లల్ని సముదాయించుకుంటూ కూడా సంగీతం కోసం సమయం కేటాయించుకోడం, 'పాడుతా తీయగా' బృందంతో పాటు రాష్ట్రాలన్నీ తిరగడం మామూలు విషయం కాదు. పాల్గొన్న గాయనీ గాయకులందరూ ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేశారు. మంచులక్ష్మి అమెరికన్ యాసని విశాలహృదయంతో అంగీకరించేసిన 'బాలు'డు, ఎన్నారైల పాటల్లో చిన్న చిన్న ఉచ్చారణా దోషాలని సైతం క్షమించలేదు.

పరాయి నేల అన్న భావనో ఏమో తెలియదు కానీ, అతిధులతో బాలూ ఎప్పుడూ కన్నా మరింత ఎక్కువ చనువుగా ఉన్నారు. సునీత-బాలూ ల అతి పునరావృతం అయ్యింది సిరీస్ చివరి ఎపిసోడ్స్ లో. ఇబ్బంది పెట్టిన మరో విషయం పాటల ఎంపిక. ఈ విషయంలో నిర్వాహకులు ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్నట్టు లేరు. దాదాపు గత అన్ని సిరీస్ లలోనూ వినిపించిన పాటలే ఇప్పుడూ వినిపించాయి. చివరికి, ఫైనల్స్ ఎపిసోడ్ దీ అదే దారి. 'మది శారదా దేవి మందిరమే' 'హాయిహాయిగా' పాటలున్నాయి ఇందులో. ఈ పాటలు ఉండకూడదు అని కాదు, కానీ ప్రతిసారీ ఇవే పాటలా అనిపించేస్తోంది. తెలుగులో సినిమా పాటలకి లోటు లేదు కదా.. వచ్చే వారం నుంచీ చిన్న పిల్లల సిరీస్.. చాన్నాళ్ళ తర్వాత బుల్లి గళాలని వినొచ్చు మళ్ళీ!!