ఆదివారం, మే 23, 2010

సినీరంగ శ్రీనాధుడు

"వేటూరి సినీ రంగ శ్రీనాధుడు .." సినిమాని ప్రేమించే ఒక మిత్రుడితో ఉదయాన్నే జరిగిన సంభాషణలో అతని నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది. రోజంతా నన్ను వెంటాడుతూనే ఉంది. పేపర్లలో వేటూరి గురించి చదువుతున్నప్పుడు, టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడూ, ఇంకా ఏ పని చేస్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. దీనితో పాటే "వినువీధి నెదురెండ పొగడ దండ.." కూడా.

నిజమే.. వేటూరికీ శ్రీనాధుడికీ పోలికలు లేకపోలేదు. తమ కలాల ద్వారా నవరసాలనీ అలవోకగా పలికించడం ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. వారి వారి కాల మాన పరిస్థితులకి అనుగుణంగా రచనలు చేశారు ఇద్దరూ. తమ కావ్య కన్నియలకి పట్టాభిషేకం జరుగుతుండగా చూసి పులకించిపోయిన వాళ్ళే ఇద్దరూ. తమ తమ రంగాలలో తిరుగులేని స్థానం ఇద్దరిదీ. అంతేనా? ఎవరికీ తలవంచని స్వభావంలోనూ పోలిక ఉంది.

తను రాసిన ఎన్నో పాటల్లో వైరాగ్యాన్నీ, వేదాంతాన్నీ పలికించిన వేటూరి చివరి రోజుల వరకూ భోగ జీవితాన్నే గడిపారు. ఎలా సంపాదించారో అలాగే ఖర్చు పెట్టారు. లేకపొతే, మూడున్నర దశాబ్దాల పాటు సిని గేయ రచయితగా తిరుగులేని స్థానంలో ఉన్న వ్యక్తికి ఫిలింనగర్ లో సొంత ఇంటిని సమకూర్చుకోవడం అన్నది తీరని కోరికగా మిగిలిపోవడం ఎలా సాధ్య పడుతుంది?

ఆరోగ్యం మీద వేటూరికి మొదటి నుంచీ ఆశ్రద్దే అనిపించక మానదు, ఆయన జీవితాన్ని పరిశీలించినప్పుడు. ఎన్నో పాటలని ఆయన హాస్పిటల్ బెడ్ మీద నుంచే రాశారు. వేటూరితో పాటుగా తెలుగు సినిమాకి కూడా ఎంతగానో పేరు తెచ్చిన 'శంకరాభరణం' సినిమా ముగింపులో వచ్చే 'దొరకునా ఇటువంటి సేవ..' పాటని హాస్పిటల్ లోనే రాశారు వేటూరి. నిజానికి ఆయన పాటని డిక్టేట్ చేస్తుంటే, ఆ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ డిక్టేషన్ తీసుకున్నారు.


చాలామంది గీత రచయితలతో పోల్చినప్పుడు, పాటని అతి తక్కువ సమయంలో రాస్తారన్న పేరుంది వేటూరికి. దర్శకుడు టి. కృష్ణ సన్నివేశం చెప్పగానే 'ప్రతిఘటన' సినిమాలో 'ఈ దుర్యోధన దుశ్శాసన..' పాటని పావు గంటలో రాశారు వేటూరి. నిజానికి ఆ సన్నివేశంలో డైలాగుల కన్నా పాట ఉంటే బాగుంటుందన్న సూచన ఆయన చేసిందే. భాష మీద పట్టు తో పాటు, స్వరజ్ఞానం ఆయనకున్న వరం.

ఎలాంటి పాటనైనా రాయగలగడం వేటూరికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ఒకటి. తను రాసిన పాటల్లో మాటలు రికార్డింగ్ సమయంలో మారిపోయినప్పుడు మౌనంగా ఉండిపోకుండా, ఆ విషయాన్ని సూటిగా ప్రకటించారు ఆయన. నిర్మాణ సంస్థ ఎంత పెద్దదైనా, హీరో, దర్శకుడు తనకి ఎంత దగ్గర వారైనా మాటల మార్పు విషయంలో రాజీ పడలేదాయన. ఈ ముక్కుసూటిదనం ఆత్మవిశ్వాసం నుంచి వచ్చిందేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జీవితపు చరమాంకం విషయంలో శ్రీనాధుడి కన్నా వేటూరి అదృష్టవంతులనే చెప్పాలి. తనకి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం, లేదా ఆలస్యంగా దక్కడం జరిగిందేమో తప్ప అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదు. అలాగే పాటలు రాయడం మొదలు పెట్టింది మొదలు, జీవితపు చివరి క్షణాల వరకూ యేరోజూ పాటకి దూరంగా ఉండలేదాయన. సాహిత్యంలో శ్రీనాధుడి లాగే, సిని సాహిత్యంలో వేటూరి ఒకేఒక్కడు.

శుక్రవారం, మే 14, 2010

నలుపు

"నలుపేమో నాకిష్టం.. మీ మనసు మీ ఇష్టం.. నాకోసం మీ ఇష్టం వదలద్దండీ.." ఏదో సినిమా పాట అనిపిస్తోంది కదూ.. వంశీ సినిమా 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' లో "ఎన్నెన్నో వర్ణాలు.. " పాటలో వచ్చే లైన్ ఇది.. నన్ను పదే పదే వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన రంగుల్లో నలుపు ఒకటి. ఈమాట చెప్పగానే కనీసం కొందరైనా చిత్రంగా చూస్తూ ఉంటారు, అందుకే ఎవరికీ చెప్పను నేను.

నలుపు కల్తీ లేని రంగు.. ఏ రంగైనా నలుపులో కలవాల్సిందే. సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో నలుపు రంగుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆమె కాటుక కళ్ళనీ, నల్లని వాలుజడనీ వర్ణించని కవులు అరుదు. నవలా రచయిత్రుల శకం నడుస్తున్న రోజుల్లో కథానాయకులందరూ పడవల్లాంటి నల్లరంగు కార్లలో తిరుగుతూ ఉండే వాళ్ళు. అన్నట్టు వంశీ బోల్డన్ని కథలు రాసినా, తొలినాళ్ళలో రాసిన 'నల్ల సుశీల' కథంటేనే తనకి బాగా ఇష్టం అని చాలా సార్లు చెప్పాడు.

నాకు చీకటి అన్నాకూడా చాలా ఇష్టం. చక్కగా చిక్కగా ఉంటుంది. "చీకటి ఎంత బాగుంటుందో.. మనం దీపం వెలిగించో, లైట్లు వేసో సహజమైన చీకటిని కల్తీ చేసేస్తున్నాం.." అని ఒక కొత్త ఫ్రెండ్ తో అన్నానీమధ్య. అటు వైపు నుంచి కొంచం కన్ఫ్యూజన్ వినిపించింది. మరీ కంగారు పెట్టేసినట్టు ఉన్నాను. రుతువేదైనా చీకటిరాత్రి అందం వేరు. వెన్నెలని మాత్రమే ఆస్వాదించి, చీకటిని ఆస్వాదించక పోవడం కరెక్టేనా?

దుస్తుల విషయానికి వస్తే నలుపు రంగుకి ఏ రంగైనా కాంబినేషన్ బాగోకపోవడం అనే సమస్య దాదాపు ఉండదు. పైగా మెయింటినెన్స్ సులువు. తెలుపు రంగు దుస్తులు వేసుకున్నప్పుడు ఉన్నంత జాగ్రత్తగా అస్సలు ఉండనవసరం లేదు. ఇలా లెక్క పెడితే నలుపు రంగు దుస్తులతో ఎన్ని లాభాలో. ఏమాటకామాటే చెప్పాలి.. ఈ రంగు ఎవరికీ సూట్ కాకపోవడం ఉండదేమో అనిపిస్తుంది.

ఒకప్పుడు నా వార్డ్ రోబ్ నిండా మూడొంతులు నల్ల రంగు దుస్తులే ఉండేవి.. కాలక్రమంలో అత్యంత సహజంగానే ఇతర రంగులూ వచ్చి చేరాయి. ఇంత చక్కని నలుపుని కేవలం నెగిటివ్ విషయాలు చెప్పడానికి ఉపమానంగా ఎందుకు వాడతారో అర్ధం కాదు. నల్ల బజారు, నల్ల ధనం లాంటి మాటలు కొంచం చిత్రంగా వినిపిస్తాయి. అలాగే ఆశుభానికీ, విషాదానికీ సూచికగా వాడడం కూడా అర్ధం కాని విషయమే.

ఎందుకంటే మన దేవుళ్ళకీ, నల్లరంగుకీ సంబంధం ఉంది. నల్లనయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "నల్లని వాడు.. పద్మ నయనమ్ముల వాడు.." అంటూ బోల్డన్ని వర్ణనలు. హాలాహలం మింగాక శివుడి కంఠం నల్లగా మారిందంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డన్ని ఉదాహరణలు దొరుకుతాయి. మొత్తం మీద నలుపు మరీ అంత తీసి పారేయాల్సిన రంగేమీ కాదు. కాదంటారా??

గురువారం, మే 06, 2010

సరిగమలు

పచ్చని కోనసీమలో గోదారి ఒడ్డున ఓ అందమైన పల్లెటూరు. ఊరి నడిబొడ్డున ఠీవిగా నిలబడ్డ దివాణం. ఆ దివాణంలో ఇల్లాలు సత్యవతమ్మ గారు. ఆవిడ ఏకైక కొడుకు కిట్టప్పకి పుట్టెడు అనారోగ్యం. అతను మొండివాడు, మూర్ఖుడు. అతనికి ఉన్న ఒకే ఒక్క బలహీనత తన స్నేహితుడు కాళిదాసు. కిట్టప్ప, కాళిదాసు ఒకరికోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధమే. సత్యవతమ్మగారి బంధువుల అమ్మాయి జ్యోతి, తండ్రిని కోల్పోయి తల్లితో కలిసి దివాణం పంచన చేరింది. సత్యవతమ్మ తీసుకున్న ఒక నిర్ణయం కిట్టప్ప, కాళిదాసు, జ్యోతిల జీవితాలని ఎలాంటి మలుపు తిప్పిందన్నదే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'సరిగమలు' సినిమా కథ. 

మలయాళంలో విజయవంతమైన 'సర్గం' సినిమాకి తెలుగు రీమేక్ అయిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, నిర్మాత సి. అశ్వని దత్ లు సమర్పకులుగా వ్యవహరించారు. ఊళ్ళో సంగీతం పాఠాలు చెప్పుకునే విశ్వనాథం మేష్టారి (జే.వి. సోమయాజులు) కొడుకు కాళిదాసు (వినీత్). పేరుకి విశ్వనాథంగారి అబ్బాయైనా కాళిదాసు భోజనం, బసా అంతా దివాణంలోనే. తల్లి లేని కాళిదాసుని కన్నతల్లిలా ఆదరిస్తుంది సత్యవతమ్మ (భారతి). ఇక కిట్టప్పకైతే (మళయాళ నటుడు మనోజ్ కే.జయన్) కాళిదాసు సొంత తమ్ముడే. చదువు వంటబట్టని కిట్టప్ప ఊరిమీద బలాదూర్ తిరుగుతుంటే, అతని వెంటే ఉంటూ సిగరెట్లు, కిళ్ళీలు అందిస్తూ అతను మూర్చ వచ్చి పడిపోయినప్పుడల్లా చేతిలో తాళాలగుత్తి ఉంచి రక్షిస్తూ ఉంటాడు కాళిదాసు. 

దివాణం ఆదరణతో జీవితం గడుపుతున్న జ్యోతి (ఓ ద్వందార్ధపు డైలాగుల హాస్య చిత్రంతో 'రంభ' గా తెలుగు తెరకి పరిచయమైన విజయవాడమ్మాయి విజయలక్ష్మి) విశ్వనాథం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ, కిట్టప్పని ద్వేషిస్తూ, కాళిదాసుని మూగగా ఆరాధిస్తూ ఉంటుంది. వయసుతో పాటే అనారోగ్యమూ, మొండితనమూ మూర్ఖత్వమూ కూడా పెరుగుతాయి కిట్టప్పకి. చదువు సంధ్యలు లేకుండా కొడుకు చెడిపోతున్నాడన్న బాధ విశ్వనాథం గారిది. సంగీతం నేర్చుకుంటానన్న కాళిదాసుని చదువు మీద దృష్టి పెట్టమంటాడాయన. జ్యోతి తనని హేళన చేయడంతో అవమాన పడ్డ కాళిదాసు కేవలం ఆరునెలల్లో శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుని కచేరీలిచ్చే స్థాయికి ఎదిగిపోతాడు. 

కాళిదాసు-జ్యోతి ల ప్రేమ పాకాన పడుతుంది. మరో పక్క కిట్టప్ప ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో, అతనికి పెళ్లి చేయడమే సరైన చికిత్స అని చెప్పేస్తాడు ఆయుర్వేద వైద్యుడు (అతిధి పాత్రలో అల్లు రామలింగయ్య). కిట్టప్ప సంగతి తెలిసిన ఏ పిల్లా అతన్ని పెళ్లి చేసుకోదని తెలుసు సత్యవతమ్మకి. అందుకే దిక్కు లేని జ్యోతిని కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కొడుకు 'లాంటి' కాళిదాసుని ఆమె ఎలా అడ్డు తొలగించుకుంది? అనంతర పరిణామాలు ఏమిటి? అన్నది మిగిలిన కథ. పేరుకి తగ్గట్టుగానే చక్కని సంగీతం ఉంది ఈ సినిమాలో. 

బోంబే రవి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని 'స్వర రాగ గంగా ప్రవాహమే' అన్న పాట ఒక ఆణిముత్యం. జేసుదాస్ గొంతులో వినిపించే ఆర్తి ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తుంది. "మట్టింటి రాయే మాణిక్యమైపోయె సంగీద రత్నాకరాన" అనే పంక్తి ఉచ్చారణలో కించిత్ శ్రద్ధ తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. జేసుదాస్ మరోపాట 'కృష్ణ కృపా సాగరం..' కూడా మళ్ళీ మళ్ళీ వినే పాట. చిత్ర పాడిన 'సరిగమలాపవయా..' వింటుంటే పాత హిందీ పాటల బాణీలు గుర్తొస్తాయి. బాలు-చిత్ర ల 'గోదావరి పయ్యెద..' యుగళ గీతం చిత్రీకరణతో పాటు, మధ్యలో వచ్చే హమ్మింగ్ కూడా భలేగా ఉంటుంది. 'సంగీతమే..' శాస్త్రీయ బాణీ. పదహారేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల ఇళ్ళలో వినిపిస్తూనే ఉంటాయి. 

మలయాళంలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా తెలుగులో అంత బాగా ఆడకపోడానికి కారణం 'నేటివిటీ' లోపించడమే అనిపిస్తుంది. అప్పటికే 'సీతారామయ్యగారి మనవరాలు' లాంటి అచ్చ తెలుగు సినిమాలు ఇచ్చిన క్రాంతికుమార్, మళయాళ సినిమాని తెనిగించడంలో తడబడ్డారనే భావన కలుగక మానదు. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ తో సాగే కథనం, అనారోగ్యంతో ఉన్న సత్యవతమ్మని చూడడానికి సంగీత విద్వాంసుడు కాళిదాసు కారులో రావడంతో మొదలవుతుంది. వినీత్ నటనలో తడబాట్లు, జేవీ సోమయాజులు పాత్రకి బలం లోపించడం, అప్పటివరకూ కూనిరాగం కూడా తీయని కాళిదాసు కేవలం ఆరునెలల్లో శాస్త్రీయ సంగీత కచేరీలు ఇవ్వడం లాంటి లోపాలని సవరించుకుంటే చాలా చక్కని సినిమా అయ్యి ఉండేది. మనోజ్ కే జయన్ బాగా నటించినప్పటికీ అతని పాత్ర తీరుతెన్నుల్లో లోపాలు కోకొల్లలు. 

ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే రంభ ఈ సినిమా రెండో సగంలో చక్కని నటనని ప్రదర్శించడం. ఇంతటి అవకాశం ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఈ అమ్మాయికి దొరకలేదనే చెప్పాలి. మళయాళ మాతృకలో తను నటించిన పాత్రే కావడం ఈమెకి కలిసొచ్చిన అంశం. స్క్రిప్ట్, నేటివిటీ, నటీనటుల నటన లో లోపాలు ఉన్నప్పటికీ కేవలం పాటల కోసం (నాకైతే లోకేషన్ల కోసం కూడా) చూడాలనిపించే సినిమా ఈ 'సరిగమలు.'