శుక్రవారం, జనవరి 27, 2017

దంగల్

ఆమధ్య 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రమోషన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్యూ చేస్తూ, లాఫింగ్ క్వీన్ రోజా "మీరు దంగల్ సినిమా చూశారా?" అని అడిగి, "తప్పకుండా చూడండి" అని రికమెండ్ చేసింది. తెలుగులో ఆ  తరహా సినిమాలు రావాల్సిన అవసరాన్ని గురించి వాళ్లిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికి వస్తే, రోజా రికమెండేషన్ తో పాటు ఇంకా అనేక కారణాలకి 'దంగల్' చూడాలనిపించి చూసేశాను. పదహారేళ్ళ క్రితం 'లగాన్' తో ఎంత ఆశ్చర్య పరిచాడో, తాజా 'దంగల్' తోనూ అంతే ఆశ్చర్య పరిచాడు అమీర్ ఖాన్.

'దంగల్' అంటే యుద్ధం. అవును, ఇది యుద్ధం కథే. ఆడపిల్లల మీద చూపిస్తున్న వివక్ష మీద యుద్ధం, మిగిలిన క్రీడలతో పోల్చినప్పుడు కుస్తీ మీద చూపిస్తున్న చిన్నచూపు మీద యుద్ధం, గ్రామీణ క్రీడాకారుల మీద పెద్ద నగరాల్లో ఉండే చదువుకున్న కోచ్ ల సంశయాత్మక ధోరణి మీద యుద్ధం.. తరచి చూడగలగాలే కానీ, రెండు గంటల నలభై నిమిషాల పాటు థియేటర్లో సీట్లకి కట్టి పడేసే సినిమా నిండా ఎన్నెన్నో యుద్ధాలు. అంతేకాదు, నాటకీయతకి తావులేని కుటుంబ బంధాలు, సందర్భోచితమైన సున్నిత హాస్యం, మనకి తెలియకుండానే మనసుకు పట్టేసే సెంటిమెంట్.. ఇవన్నీ ఉన్నాయి 'దంగల్' లో.

హర్యానాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన మహావీర్ సింగ్ ఫోగట్ (అమీర్ ఖాన్) కి కుస్తీ అంటే ప్రాణం. కేవలం కుస్తీ పోటీలతో రోజు గడిచే పరిస్థితి కాదు కాబట్టి, ఉద్యోగంలో చేసిన మహావీర్ అటుపై కుస్తీని నెమ్మదిగా మర్చిపోతాడు. దయా కౌర్ (సాక్షి తన్వర్) ని పెళ్లిచేసుకున్నాక, అతని ఆలోచన ఒక్కటే. ఒక కొడుకుని కని వాడిని కుస్తీ యోధుడిగా తయారు చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, వరసగా నాలుగు ప్రయత్నాలు.. నాలుగుసార్లూ ఆడపిల్లలే కలగడంతో కుస్తీ ఆశని పూర్తిగా వదిలేసుకుంటాడు మహావీర్.


బడికి వెళ్తున్న పెద్ద కూతురు గీతాకుమారి ఫోగట్, రెండో కూతురు బబితా కుమారి ఫోగట్ లలో ఉన్న మల్ల వీరుల నైపుణ్యాన్ని ఓ సందర్భంలో గమనించిన మహావీర్ లో 'ఆడపిల్లలకి కుస్తీ ఎందుకు నేర్పించకూడదు?' అన్న ఆలోచన వస్తుంది. భార్యని ఒప్పించి, ఊరిని ఎదిరించి కూతుళ్ళకి కుస్తీ శిక్షణ ఆరంభిచిన మహావీర్ కి ఎదురైన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఒకప్పుడు అంతర్జాతీయ పోటీలో భారతదేశం తరపున ఆడి పతకం సాధించాలని కలలు కన్న ఆ కుస్తీ యోధుడు, ఇప్పుడా కలని కూతుళ్ళ ద్వారా సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ఈ క్రమంలో మహావీర్ కి ఎదురైన సవాళ్లేమిటి? గ్రామీణ క్రీడాకారులకి ప్రభుత్వం నుంచి దొరుకుతున్న మద్దతు ఎంత? స్పోర్ట్స్ అకాడమీ రాజకీయాలు ఎలా ఉంటాయి? అన్నింటినీ మించి, ఇల్లు దాటి హాస్టల్ చేరి కొత్త ప్రపంచాన్ని చూసిన కూతుళ్లు తండ్రి ఆశయాన్ని ఎంతవరకూ అర్ధం చేసుకుని, సహకరించారు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబే 'దంగల్.' వరుసగా మెడల్స్ సాధించడం ద్వారా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన కుస్తీ సోదరీమణులు గీత, బబిత, వాళ్ళ తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్ ల నిజజీవిత కథకి కొద్దిపాటి నాటకీయత జోడించి నితీష్ తివారి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.

అమీర్ ఖాన్ ని బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అని ఎందుకు పిలుస్తుంది అన్న ప్రశ్నకి మరో సమాధానం ఈ సినిమా. అమీర్ ఖాన్ కాక, మహావీర్ మాత్రమే కనిపిస్తాడు సినిమా అంతటా. తండ్రిగా, కోచ్ గా పరస్పర విరుద్ధమైన బాధ్యతల్ని ఒకే సారి నెరవేర్చాల్సిన క్రమంలో ఎదుర్కొనే ఒత్తిడిని అమీర్ ప్రదర్శించిన తీరు మరో నటుడి నుంచి ఊహించలేం. దర్శకుడి కన్నా ముందుగా ప్రస్తావించాల్సింది కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా కృషి గురించి. చిన్నప్పటి గీత, బబితలు పెద్దవ్వడం చూశాక, 'ఆపిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ ఆగి అప్పుడు షూట్ చేశారేమో' అనిపించింది. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కజిన్ ఓంకార్ కూడా అంత చక్కగానూ సరిపోయాడు. దర్శకుడే కాదు, మిగిలిన సాంకేతిక నిపుణులకి కూడా వంక పెట్టలేం. 

అమిర్ ఖాన్, సాక్షి తన్వర్ల తర్వాత పెద్దయిన గీతాకుమారి ఫోగట్ గా నటించిన ఫాతిమా సనా షేక్ కి నటనకి బాగా అవకాశం ఉన్న పాత్ర దొరికింది. కుస్తీ కోచ్ గా నటించిన గిరీష్ కులకర్ణి కూడా గుర్తుండిపోతాడు. ఇరవయ్యేళ్ళ మహావీర్ మొదలు, అరవయ్యేళ్ళ మహావీర్ వరకూ పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని, పాత్ర వయసుకి సరిగ్గా సరిపోయే నటననే ప్రదర్శించిన అమీర్ ఖాన్ ని చూశాక, తమ ఆకృతికి తగ్గట్టుగా పాత్రల తీరునే మార్చేసుకునే తెలుగు సీనియర్ హీరోలు అప్రయత్నంగా గుర్తొచ్చారు. బయోపిక్స్ లో ఒక కొలబద్దగా నిలిచిన 'దంగల్' ని మించిన సినిమా రావాలంటే చాలా సమయమే పట్టొచ్చు, అటు బాలీవుడ్ లో అయినా ఇటు మిగిలిన భారతీయ వుడ్ లలో అయినా... రోజా ప్రశ్నకి జవాబుగా చిరంజీవి ప్రదర్శించిన ఆశాభావాన్ని నింపుకోవడం మాత్రమే మన చేతిలో ఉన్నది.

గురువారం, జనవరి 26, 2017

హక్కులు-అణచివేత

భారత పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరి దయాధర్మమో కాదు.. తెల్లారిలేస్తే మన నాయకులు తప్పకుండా తల్చుకునే రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అరవై ఏడేళ్ల లోనూ ఈ హక్కు ఎన్నోసార్లు అనేకవిధాలుగా అణచివేయబడింది. అణచివేసిన వాళ్ళు, అధికారంలో ఉన్న నాయకులే. పోలీసులని పెద్ద సంఖ్యలో ఉపయోగించి ప్రశ్నించే గొంతులని నిలువరించాలని వందలాది సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినా, హక్కుని వినియోగించుకునే ప్రయత్నాన్ని విడనాడలేదు ప్రజలు. బహుశా, ఇది స్వేచ్ఛ తాలూకు గొప్పదనం.

భారతదేశంలో భాగమైన ఆంద్రప్రదేశ్ లోనూ భావప్రకటన స్వేచ్ఛ ని కట్టడిచేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి. అదీ ఇదీ అన్న భేదం లేకుండా అధికారంలో ఉన్న అన్ని పార్టీలూ ఈ కట్టడి నిమిత్తం పోలీసు బలగాలని వినియోగించినప్పటికీ, మాన్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన, జరుగుతున్న నిలువరింత మిగిలిన ముఖ్యమంత్రులతో పోల్చినప్పుడు మరింత ఎక్కువ అన్నది కళ్ళముందు కనిపిస్తున్న సత్యం. పదిహేడేళ్ల నాటి బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమం మొదలు, ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు జరుగుతున్న ఆందోళన వరకూ అన్నీ అణచివేతకు గురయినవి, అవుతున్నవే.

గౌరవ ముఖ్యమంత్రికి 'పాజిటివ్ మైండ్ సెట్'  అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా, ప్రతిపక్షాలు, పత్రికల వాళ్ళు ఆశావహ దృక్పధాన్ని అలవర్చుకోవాలని పదేపదే చెబుతూ వస్తున్నారు. వారి కృషి ఫలించి, మీడియాలోని పెద్ద సెక్షన్  లో ఈ మార్పు వచ్చేసింది. వాళ్లిప్పుడు ముఖ్యమంత్రిని మించి పాజిటివిటీ ని ప్రదర్శిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలు, వాళ్ళ మీడియాకి మాత్రం ఎంత బోధించినా ఫలితం ఉండడం లేదు. వాళ్ళ ధోరణి వాళ్ళదిగానే ఉంటోంది. ఇదంతా రాష్ట్రంలో శరవేగంగా జరిగిపోతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అంటున్నారు అధికార పక్షం వారు.


సరే, అధికారంలో ఉన్నవాళ్ళ మీద విమర్శలు రావడం సహజం. ఒకప్పటి పాలకులు విమర్శని హుందాగా తీసుకునే వాళ్ళు. అందులో పస ఉంటే, వాళ్ళ ఆలోచనలు మార్చుకునేందుకు వెనకాడేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. గ్రామ పంచాయితీ వార్డు మెంబరు మొదలు ఆపై ఏ పదవి దక్కినా, ఆయా నాయకుల్ని దైవాంశ ఆవహించేస్తోంది. 'నామాటకి తిరుగు ఉండకూడదు' అన్నధోరణే తప్ప రెండో ఆలోచనని ఊహకి కూడా ఒప్పుకోవడం లేదు. ఫలితమే, విమర్శని, విమర్శించే వాళ్ళనీ కూడా ఒప్పుకోలేక పోవడం. వాళ్ళ మీద బలప్రయోగం చేయడం.

బషీర్ బాగ్ ఉద్యమంలో జరిగిన ప్రాణ నష్టానికి, అంగన్ వాడీ వర్కర్లని గుర్రాలతో తొక్కించడానికీ కారణం 'ప్రపంచ బ్యాంకు' అని విశ్లేషించారు అప్పట్లో కొందరు. ఉద్యమాలని అణచివేయకపోతే, ప్రపంచ బ్యాంకు తదితర ద్రవ్య సంస్థల దృష్టిలో రాష్ట్రం పలచన అయిపోతుందనీ, అప్పు పుట్టదనీ, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్పనిసరై అణచివేత అస్త్రం ప్రయోగించారనీ విశ్లేషించారు అప్పట్లో. ప్రస్తుతానికి వస్తే, 'కేంద్రంతో సంబంధాలు' చెడిపోకూడదు కాబట్టే పోలీసు బలగాలని ఉపయోగించాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది. కేంద్రం దృష్టిలో రాష్ట్రం పలచన కాకుండా ఉండేందుకే హక్కు(ల) కోసం పోరాడే వాళ్ళ ముందస్తు అరెస్టులు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్లపై లాఠీ చార్జీలు జరుగుతున్నాయట.

విద్యుత్ ఉద్యమం రోజులతో పోలిస్తే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా విపరీతంగా పెరిగింది. ఇంకెక్కడా లేనన్ని టీవీ చానళ్లు ఉన్నాయిక్కడ. కానైతే ఏం లాభం.. అవన్నీ ఏదో ఒక పార్టీ జెండాని మోస్తున్నవే తప్ప, ప్రజల కోసం పనిచేస్తున్నవి కాదు. ఒకట్రెండు సంస్థలు మినహా, మిగిలినవన్నీ శక్తివంచన లేకుండా 'పాజిటివిటీ' ని నిత్యం జనం చెవుల్లో పోస్తున్నా, గణతంత్ర దినోత్సవం రోజున ఇంతమంది రోడ్లమీదకొచ్చి, ముఖ్యమంత్రి గారి మనసుకి అంత కష్టం ఎలా కలిగించగలిగారు? అప్పుడు లేనిదీ, ఇప్పుడు ఉన్నదీ సోషల్ మీడియా. ఇంతకీ, ప్రజల మైండ్ సెట్ లో వచ్చిన మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారిని చేరుతుందా, లేక ఇదంతా 'ప్రతిపక్షం కుట్ర' అన్న ప్రచారపు హోరు మొదలవుతుందా? వేచి చూడాలి...

మంగళవారం, జనవరి 24, 2017

అష్ట వర్షాత్ ...

ఎనిమిదేళ్లు... ఎనిమిది వందల టపాలు... ఎంతోమంది మిత్రులు... ఎల్లలు లేని ఆదరణ... హేమంతం చేమంతులనీ, పుష్యం భోగిమంటలనీ తీసుకొస్తూ, వాటితో పాటుగా 'నెమలికన్ను' పుట్టినరోజునీ వెంటపెట్టుకొచ్చేశాయి మరోసారి. ఓ శనివారపు మధ్యాహ్నపు వేళ, ఖాళీగా కూర్చుని, తోచీ తోచకా ఆరంభించిన బ్లాగుకి ఎనిమిదేళ్లు నిండి తొమ్మిదో ఏడు ప్రవేశించింది. ఆవేళ ఒక్కడినే.. ఈవేళ నాతోపాటు ఎంతోమంది మిత్రులు.. రాసినవి మెచ్చేవాళ్ళూ, తప్పులు సరిదిద్దే వాళ్ళూ, రాయకపోతే అదేమని అడిగేవాళ్ళూను... ఏంకావాలి ఇంతకన్నా?

గడిచిన ఏడాది కాలంలో చేసినది తగుమాత్రం బ్లాగింగే.. రాసినవి అరవై టపాలే.. వీటిలో ముందుగా ఏమాత్రం ఆలోచించకుండా అక్షరాలు పేర్చుకుంటూ వెళ్ళినవీ, రోజుల తరబడి ఆలోచించి  ఎప్పటికో బ్లాగుకి ఎక్కించినవీ కూడా ఉన్నాయి. టపాలు రాసినప్పుడూ, రాయనప్పుడూ కూడా మిత్రులు నా వెంట ఉండడం సంతోషాన్ని కలిగించిన విషయం. బ్లాగింగ్ కి మరికొంచం ఎక్కువ సమయం కేటాయించాలని మరీ మరీ అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. చదవాల్సిన పుస్తకాలు, వాటితో పాటు చదివి,  రాయడాన్ని పెండింగ్ పెట్టిన పుస్తకాలూ చెప్పుకోదగ్గవిగానే ఉన్నాయి.

గతేడాది బాగా రాసి, ఈ ఏడాది పెద్దగా ఆ జోలికి పోని అంశం కథలు. రాసిన ఒక్క కథా కూడా నాకు సంతృప్తి కలిగించలేదన్నది నిజం. ఆలోచనలు చాలానే ఉన్నాయి కానీ వాటిని అక్షర రూపంలో పెట్టే సమయం ఎప్పుడొస్తుందో.. కొందరు మిత్రులు తరచుగా బ్లాగెందుకు రాయడం లేదు అని అడుగుతున్నారు.. 'స్పందన లేకపోవడం చేతా?' అన్న ప్రశ్న కూడా వచ్చింది. నా జవాబు 'కాదు' అనే. గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా, వ్యాఖ్యలు నాకు బోనస్ మాత్రమే. కేవలం వ్యాఖ్యల కోసమని నేనెప్పుడూ ఏదీ రాసింది లేదు. బ్లాగు రాయడం నా ప్రాధాన్యతల్లో ఇప్పటికీ ముందే ఉంది.


ఆమధ్య అందుకున్న ఒక మెయిల్ కొంచం ఆసక్తికరంగా అనిపించింది. ఆలోచింపజేసింది కూడా.. "మీరు రాజకీయాలని గురించి రాయడం మానేస్తే, మీ బ్లాగు మిత్రులు పెరిగే అవకాశం ఉంది" అన్న సూచనతో వచ్చిందా ఉత్తరం. 'వర్తమానం' లేబుల్ తో కరెంట్ అఫైర్స్ ని గురించి నాకు రాయాలని తోచినప్పుడల్లా రాస్తూ ఉండడం ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టింది కాదు, బ్లాగు తొలినాళ్ళ నుంచీ ఉన్నదే. బ్లాగు మిత్రులకి నచ్చేలా రాయడం అన్నది నా అజెండా కానేకాదు. నా అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు మిత్రులవుతారు. నచ్చనివాళ్ళు దూరం జరుగుతారు.. అంతే.

వ్యక్తిగతంగా గడిచిన ఏడాది చాలా హడావిడిగా గడిచింది. ఒక్కసారి వెనక్కి తిరిగి 'ఏడాదిలో ఏం చేశాను?' అని ఆలోచించుకుంటే వచ్చిన జవాబు 'ప్రయాణాలు.' వీటికారణంగా రొటీన్ లో మార్పులు చేసుకోవడం అనివార్యం అయ్యింది. ఫలితంగా నాకోసం నేను కేటాయించుకునే సమయం తగ్గింది. ఆ ప్రభావం మిగిలిన నా ఇష్టాలతో పాటు బ్లాగింగ్ మీదా పడింది. కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే, అప్పటికే తెలిసిన విషయాలనే అనుభవపూర్వకంగా నేర్చుకున్నా. వాటిలో కొన్ని మంచి కథావస్తువులుగా కనిపిస్తున్నాయిప్పుడు.

నేను బ్లాగింగ్ ని ఆపేయాలనుకోవడం లేదు. ఇందరు మిత్రులనిచ్చిన ఈ వేదిక అంటే నిర్లక్ష్యమూ లేదు. ఈ కొత్త ఏడాది మరికొంచం తరచుగా రాయాలని ఉంది. ఇందుకోసం, నాకోసం నేను కేటాయించుకునే సమయం ఇతరత్రా ఖర్చవ్వకూడదని కోరుకుంటున్నాను. వ్యాఖ్యలతో, మెయిల్స్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేదిక నుంచి మిమ్మల్నందరినీ మరికొంచం తరచుగా కలుసుకునే అవకాశం కలగాలని బలంగా కోరుకుంటున్నాను.. అందరికీ వందనాలు!!