శనివారం, నవంబర్ 25, 2017

మెంటల్ మదిలో ...

సమకాలీన సమాజాన్ని గమనిస్తూ, జీవన శైలిలో వస్తున్న మార్పులని జాగ్రత్తగా రికార్డు చేసుకుని కథ రాసుకుంటే ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడం, రెండు గంటల పాటు కూర్చోపెట్టడం సమస్య కాబోదని మరోసారి నిరూపించిన సినిమా 'మెంటల్ మదిలో ...' కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ తనే రాసుకున్న కథని ఆద్యంతమూ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ అవ్వడంతో కథనం మీద బాగా శ్రద్ధ పెట్టి సినిమాని సాధ్యమైనంత వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం చేశాడు.

కథలోకి వెళ్ళిపోతే, గోదావరి యాస మాట్లాడే హైదరాబాద్ కుర్రాడు అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) మహా కన్ఫ్యూజన్ మనిషి. ఒకటికి మించిన అషన్లు ఎదురైన ప్రతిసారీ ఒకదాన్ని ఎంచుకోవడం అతనికి అసాధ్యం. ఇది రాత్రికి రాత్రికి వచ్చిన సమస్య కాదు. చిన్నప్పటినుంచీ ఉన్నదే. దానికితోడు, బాల్యంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఆడపిల్లల జోలికి వెళ్ళడు. వాళ్ళతో మాట్లాడాలన్నా భయమే. అతను మాట్లాడే స్త్రీ అమ్మ ఒక్కర్తే. పక్కింటి అమ్మాయి మొదలు, ఆఫీసు కొలీగ్స్ వరకూ అందరినీ తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అమ్మకీ నాన్నకీ ఒక్కడే కొడుకు. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయినా కూడా పెళ్లి సంబంధాలు తప్పిపోతూనే ఉంటాయి వరసగా.

ఇరవై తొమ్మిదేళ్ల ఎనిమిది నెలల వయసున్న అరవింద్ కృష్ణ కి పెళ్లి చేయడం వాళ్ళ నాన్న (శివాజీ రాజా) ముందున్న ప్రధానమైన సమస్య. పెళ్ళిచూపులకి వెళ్లి తలొంచుకుని కూర్చునే కుర్రాడిని ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? చాలా విచిత్రంగా, స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) అతన్ని పెళ్లి చేసుకోడానికి అంగీకరిస్తుంది. ఆమెకి అవే మొదటి పెళ్లిచూపులు. అతగాడు నోరువిప్పి మాట్లాడింది ఆమెతోనే. అక్కడికీ అంటాడు, "తొందరపడకండి.. మీకు మంచి సంబంధం దొరుకుతుందేమో" అని. "నాకేం కావాలో నాకు తెలుసు" అంటుంది స్వేచ్ఛ. పెళ్ళికి ముహూర్తం కుదిరేలోగా ఫోన్లో సంభాషణలు, చాటింగ్స్, ఔటింగ్స్ తో బిజీ అయిపోతుందా జంట.


ఇంతలో ఆఫీసు పని మీద ముంబై వెళ్లిన అరవింద్ కి రేణు (అమృత శ్రీనివాసన్) పరిచయం అయి దగ్గరవుతుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఎవరిని ఎంచుకోవాలి అన్న సమస్య వస్తుంది కథానాయకుడికి. ఆ సమస్య నుంచి అతగాడు ఎలా బయట పడ్డాడు అన్నదే సినిమా ముగింపు. ముందే చెప్పినట్టుగా, కథ కన్నా కథనం బలంగా ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. మొదటి సగం అయితే  'అప్పుడే ఇంటర్వల్ వచ్చేసిందా' అనిపించేలా చకచకా సాగిపోయింది. చాలా మంది కొత్త దర్శకుల్లాగే వివేక్ కూడా రెండో సగంలో కాస్త తడబడ్డాడు.

ఫలితంగా, మొదటి సగంతో పోల్చినప్పుడు కించిత్ సాగతీత అనిపించింది. రెండో సగంలో వినోదం పాళ్ళు తగ్గడం కూడా ఇందుకు కారణమేమో బహుశా. రేణు పాత్రని బలంగా రాసుకుని ఉంటే కచ్చితంగా సినిమా మరో మెట్టు పైన ఉండేది. నటీనటుల్లో శ్రీవిష్ణు, నివేదలు మంచి మార్కులు కొట్టేస్తారు. అరవింద్ కృష్ణ పాత్రని అలవోకగా చేసేశాడు శ్రీవిష్ణు. రేణుగా చేసిన అమృత పాత్రలో స్పష్టత లేకపోవడం ఆమె నటనలోనూ ప్రతిఫలించింది. సపోర్టింగ్ కాస్ట్ లో శివాజీరాజా, అనితా చౌదరి కి చెప్పుకోదగ్గ పాత్రలు దొరికాయి. పాటలు గుర్తుండేలా లేకపోవడం, రెండో సగంలో ఎడిటింగ్ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు.

ఈ సినిమా టైటిల్ నాకు నచ్చలేదు. ట్రైలర్ అవీ కూడా చూడలేదు. అయితే, సోషల్ మీడియా 'మేధావులు' కొందరికి ఈ సినిమా నచ్చకపోవడంతో నాకు నచ్చుతుందనిపించి చూసేశా. నా అంచనా తప్పలేదు. హీరోలని కాక కథలని నమ్మి సినిమాలు తీస్తున్న రాజ్ కందుకూరిని అభినందించాల్సిందే.

శుక్రవారం, నవంబర్ 10, 2017

పీఎస్వీ గరుడవేగ

ముందుగా ఓ ఒప్పుకోలు. 'చందమామ కథలు,' 'గుంటూర్ టాకీస్' లాంటి వైవిద్యభరితమైన సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు అనగానే, "అయ్యో, ఇదేంటీ" అనుకున్నాను. గత కొన్నేళ్లుగా, కథ ఏదైనా, దర్శకుడు ఎవరైనా రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ దాదాపు ఒకే మూసలో ఉండడమే ఇందుకు కారణం. అయితే, కథలో బలం ఉన్నప్పుడూ, చెప్పదలచిన విషయం మీద స్పష్టత ఉన్నప్పుడూ హీరో ఎవరైనా సరే, దర్శకుడు హీరోని ఒప్పించి కథకి అనుగుణంగా నటింపజేసుకో గలడని తన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' తో నిరూపించారు ప్రవీణ్. 

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగు నటీనటులు హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ లో నటించినట్టుగా ఉంది. సామాన్య ప్రేక్షకులకి పెద్దగా తెలియని, ఎక్కువమందికి ఆసక్తి కలిగించని మైనింగ్, సాఫ్ట్వేర్ హ్యాకింగ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్నైయ్యే) లాంటి సబ్జెక్టులన్నింటినీ కలగలిపి కుటుంబకథనీ, రాజకీయాలనీ జోడించి ఆద్యంతం ఆసక్తిగా చిత్రించిన సినిమా ఇది. ఎప్పుడూ సీక్రెట్ ఆపరేషన్స్ లో పనిచేసే ఎన్నైయ్యే అధికారి శేఖర్ (రాజశేఖర్) సాధారణ డ్రగ్స్ కేసుగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి తీగలాగేకొద్దీ కదిలిన డొంక, ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే ఇబ్బందులు ఒక థ్రిల్లర్ సినిమాని చూసిన అనునుభూతిని కలిగించాయి.

మరోపక్క అతని తీరుతో విసిగిపోయి విడాకులు కోరుతున్న భార్య,శేఖర్ విచారణ జరుపుతున్న కేసు కారణంగా క్షణక్షణం మారే రాజకీయ పరిస్థితులు. బ్రేకింగ్ న్యూస్ కోసం శేఖర్ టీం వెంటపడే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, అసలు ఈ టీం మెంబర్లకే విలన్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయేమో అనిపించేలాంటి సన్నివేశాలు.. ఇలా రాస్తుంటే చదవడం కాస్త కంఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ, మొత్తం సినిమాని ఎక్కడా కన్ఫ్యూజన్ కి తావు లేకుండా, కథ తాలూకు ఒక్కో ముడినీ విప్పుకుంటూ, సస్పెన్స్ చివరికంటా ఉండేలా జాగ్రత్త పడుతూ, సామాన్య ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చిత్రించడం దర్శకుడి ప్రతిభే.


పోలీస్ పాత్రలు రాజశేఖర్ కి కొత్త కాదు. కానీ ఇందులో ఇటు పోలీసుగానూ, అటు ఫ్యామిలీ మ్యాన్ గానూ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఈ పాత్రని పండించడానికి రాజశేఖర్ అనుభవం బాగా ఉపయోగానికి వచ్చింది. అయితే, వయసుని దాచే ప్రయత్నం మాత్రం సఫలం కాలేదు. మరీ ఐదేళ్ల పిల్లాడికి తండ్రిగా కాకుండా, మిడిల్ ఏజ్డ్ కాప్ గా ఆ పాత్రని తీర్చి దిద్ది, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇచ్చి ఉంటే శేఖర్ పాత్ర మరింత గంభీరంగా ఉండి ఉండేది అనిపించింది. వయసుని లెక్క చేయకుండా, స్టెంట్స్ వేయించుకున్నాక కూడా రిస్కీ సినిమాని తీయడమే కాక, రిస్కీ షాట్స్ లోనూ నటించాడు రాజశేఖర్. అయితే, ఈ రిస్కీ సన్నివేశాలు కథకి అవసరం మాత్రమే కాదు, ఆయువుపట్లు కూడా.

సినిమాలో రెండు డాక్టర్ పాత్రలు - ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసే డాక్టర్ పాత్రలో అలీ, కేన్సర్ స్పెషలిస్టు గా థర్టీ ఇయర్స్ పృద్వీ. దర్శకుడు ఈ రెండు పాత్రలనీ రాసుకుని, చిత్రించిన తీరు నిరాశ పరిచింది. ఒకానొక దశలో 'పూర్ టేస్ట్' అని కూడా అనిపించేసింది. డాక్టర్లు ఇద్దరూ కూడా హీరోని 'సర్' అని సంబోధిస్తే, అంత పెద్ద అధికారీ కూడా నేరస్తులతో మాట్లాడినట్టు 'నువ్వు' అనే మాట్లాడతాడు ఇద్దరితోనూ. 'సెన్సిబిల్ పర్సన్' అని ఎస్టాబ్లిష్ చేయదలచుకున్న పాత్ర చేత దర్శకుడు ఇలా ఎందుకు నటింపజేశాడు అన్నది ప్రశ్న. పోలీసుల్ని హైలైట్ చేయాలంటే డాక్టర్లని కించపరచాల్సిన అవసరం లేదు కదా.

మరో ఇబ్బంది సినిమా నిడివి. యాక్షన్ ప్యాక్డ్ సినిమా అలా కొనసాగుతూ ఉంటే అందులో లీనమై చూస్తున్నంత సేపూ బాగుంటుంది కానీ, పూర్తయ్యాక మెదడుకి కలిగిన శ్రమ ఎంతటిదో తెలుస్తుంది. ఈ ఒక్క కారణానికి, ఓ పావుగంట నిడివి తగ్గిస్తే బాగుండేది అనిపించింది. తగ్గించి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉండేది కూడా. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం వల్ల కథకి ఒరిగింది ఏమీ లేదుకానీ, సినేమాకిమాత్రం బాగానే ప్లస్ అయినట్టు అనిపించింది, ఆ పాట అవుతూనే లేచి వెళ్ళిపోయిన కొందరు ప్రేక్షకుల్ని చూసినప్పుడు. మొత్తం మీద, 'పీఎస్వీ గరుడవేగ' కి ఇద్దరు హీరోలు. నిర్మాత, కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా.