మంగళవారం, అక్టోబర్ 24, 2017

కుక్కకాటు

మా కాలనీలో ఓ కుర్రాడిని కుక్క కరిచింది. కుక్కకాటు గురించి అడపా దడపా పేపర్లలోనూ, టీవీల్లోనూ చూడడమే కానీ, ప్రత్యక్ష జ్ఞానం కలిగింది మాత్రం ఇప్పుడే. ఆ వయసు కుర్రాళ్లందరిలాగే ఇంజినీరింగ్ చదువుతున్నాడతను. కాలేజీకి వెళ్లిరావడం, సెలవుల్లో కాలనీ రోడ్డు మీద మిగిలిన కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడుకోవడం తెలుసు. నిజానికి అతగాడి గురించి చెడుగా ఏమీ వినలేదు కూడా. వాక్సినేషనూ అవీ చేయించాక, కుర్రాడి తండ్రి ఈ విషయాన్ని కాలనీ అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చాడు. "ఇవాళ మా వాడయ్యాడు, రేపు మీ పిల్లలు కావొచ్చు. కాలనీలో కుక్కలు బాగా పెరిగిపోయాయి. వాటిలో కొన్ని పిచ్చివని కూడా అంటున్నారు. మున్సిపల్ వాళ్లకి ఓ రిప్రజెంటేషన్ ఇద్దాం" అన్నది ఆయన ప్రతిపాదన.

కాలనీ మీటింగ్ లో ఈ విషయం చర్చకి వచ్చింది. మా ప్రెసిడెంట్ గారు ఎప్పటిలాగే సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. నిన్న మొన్నటి 'గుంటూరులో చిన్నారిపై కుక్కల దాడి' మొదలుకొని తనకి గుర్తున్న సంగతులన్నీ చెప్పి, అప్పుడు 'కాలనీ కుర్రాడికి కుక్కకాటు' దగ్గరికి వచ్చారు. "ఈయనకి మరీ చాదస్తం కాకపొతే, వీధి కుక్కల బెడద గురించి కంప్లైంట్ ఇద్దాం అంటే, ఎవరు మాత్రం వద్దంటారు? ఇంత ఉపన్యాసం ఇవ్వాలా?" అని లోపల్లోపల అనుకున్నాను కానీ, నేను తప్పని ఆ వెంటనే తేలిపోయింది. కొంతమంది లేచి కుక్కల వల్ల ఇబ్బందేమీ లేదనీ, కుర్రాడి ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే (!!) కుక్క కరిచిందనీ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. 'కుక్కలు-వాటి ఆవశ్యకత' గురించి బోల్డంత జ్ఞానం పంచారు.

కుర్రాడి తండ్రీ, అతని మిత్రులూ, 'కుక్కలు-దుష్ఫలితాలు'మొదలుకొని, వైద్య ఖర్చులు, కుర్రాడి చదువుకి కలుగుతున్న ఇబ్బందులూ అన్నీ చెప్పి, "వీటన్నింటికీ సిద్ధంగా ఉన్నారా?" అన్న ప్రశ్న వేసేశారు. కాలనీకి దొంగల బెడద లేకుండా  వీధి కుక్కలన్నీ ఫ్రీగా కాపలా కాస్తున్నాయన్న కౌంటర్ ఆర్గుమెంట్ మొదలవ్వడంతో, ఇదేదో 'అలమండ భూవితగువు' లా మారే ప్రమాదం ఉందనిపించింది. కుక్కల వల్ల ప్రయోజనాలని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ, కుక్కకాటుని గురించి మాట్లాడడం లేదు. నా చుట్టుపక్కల ఉంటున్న వాళ్లలో ఇంతటి జీవకారుణ్యం ఉన్నట్టు నాకిన్నాళ్ళూ తెలియనందుకు ఆశ్చర్య పడుతూ, మా పక్కాయన్ని విషయం ఏమిటని అడిగాను, ఈ కారుణ్యం వెనుక ఏదో కథ ఉండే ఉంటుందని అనుమానిస్తూ.

(గూగుల్ ఇమేజ్)
ఆ కుర్రాడు వీళ్ళ ఇళ్లలో ఆడపిల్లల్ని ఏదో కామెంట్ చేసి ఉంటాడేమో అన్న ఆలోచన వచ్చింది, కానీ పక్కాయన చెప్పింది పూర్తిగా కొత్త విషయం. కుర్రాడి తండ్రికి ఈ మధ్యనే షేర్ మార్కెట్లో బాగా డబ్బులొచ్చాయిట. తనో కొత్త కారు కొనుక్కుని, ఇల్లాలికి నగలు చేయించాట్ట. అప్పటినుంచీ కొందరికి కన్నెర్రగా ఉందిట. అందుకని కుర్రాడిని కాకుండా కుక్కలని సపోర్టు చేస్తున్నారట. 'ఔరా' అనుకుని వాదోపవాదాలు వింటూ ఉండగా టీలు వచ్చాయి. "కుక్కల్లేకపోతే సెక్యూరిటీ ఏముందండీ? ఇళ్లల్లో పెంచాలంటే బోల్డంత ఖర్చు. పైగా అమేషా కనిపెట్టుకుని ఉండాలి. మనం పడేస్తున్నది తిని, సేవ చేస్తున్నాయవి.." అంటూ సాగిపోతున్నాడొకాయన. ఒకవేళ కాలనీ కుక్కల్లో ఒక పిచ్చికుక్క ఉంటే? ఈ ఆలోచన రాగానే 'కృష్ణారెడ్డి గారి ఏనుగు' కథ గుర్తొచ్చి ఉలికిపడ్డాన్నేను.

వాడి వేడి సమావేశంలో చివరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలా, వద్దా అని వోటింగ్ జరిగింది. ఇవ్వాలన్న వాళ్లదే మెజారిటీ అయ్యింది. పిచ్చికుక్క భయం చాలామందికే ఉన్నట్టుంది. కుక్కకాటుకైతే వైద్యం ఉంది కానీ, పిచ్చి కుక్క కరిస్తే అంతా నాశనమే కదా. కాసేపటికి ఎజెండాలో విషయాలు పక్కకి వెళ్లి, ఎప్పటిలాగే వ్యక్తిగత విషయాలని గురించి కబుర్లు మొదలయ్యాయి. సమూహం కాస్తా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయింది. కుర్రాడిని సమర్ధించే వాళ్ళు, కుక్కలని సపోర్టు చేసే వాళ్ళు కూడా వైరి వర్గం మీద నిందారోపణలు చేస్తున్నారు, రహస్యంగా. కాసేపటికి అసలు విషయం మళ్ళీ చర్చకి వచ్చింది. మొత్తానికి, ప్రెసిడెంట్ గారు, మరికొందరు వెళ్లి ఒక మెమోరాండం ఇచ్చి వచ్చి, ప్రోగ్రెస్ ఏమిటన్నది వాట్సాప్ గ్రూపులో అందరికీ తెలియజేసేలా నిర్ణయం జరిగింది.

గ్రూపులో వచ్చిన మెసేజీ సారాంశం: "ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాల్లోని పట్టణాలు, నగరాల్లో సుమారు రెండు లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటన్నింటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడానికి కుక్కకి వెయ్యి రూపాయల చొప్పున అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే ఆపరేషన్లు మొదలవుతాయి. అప్పటివరకూ ప్రజలు సహకరించాలి." వాకింగ్ స్టిక్ ని సపోర్టు చేసుకుని కాలేజీకి వెళ్తున్న కుర్రాడిని చూస్తుంటే "ఇంకా ఎంతమందో" అన్న భయంతో కూడిన ఆలోచనొస్తోంది రోజూ.