"శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ణి ప్రభావితం చేసింది. ఈ శతాబ్దంలో ఒక రావి తెలుగు వారిని ప్రభావితం చేసి ప్రబుద్ధుల్ని చేస్తోంది. అదే రావిశాస్త్రీయం," అన్నారు మహాకవి శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి రచన 'రావిశాస్త్రీయం' గురించి. కథకుడిగా, నాటక, నవలా రచయితగా రావిశాస్త్రి గురించి ఇవాళ కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. "రావిశాస్త్రి వచనం శ్రీశ్రీ కవిత్వంలా ఉంటుందనీ" "వచన రచనపై రావిశాస్త్రి తనదైన ముద్ర వేశారనీ" ఏనాడో కితాబులు అందుకున్నారు.
రావిశాస్త్రి రాసిన వ్యాసాలు, లేఖలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, వివిధ సందర్భాలలో చేసిన ఉపన్యాసాలు, ప్రకటనల సంకలనమే 'రావిశాస్త్రీయం.' తన బాల్యం, చదివిన పుస్తకాలు, రచయితగా ఎదిగిన క్రమం, తన్ను రచనలకి పురిగొల్పిన అంశాల మొదలు సమకాలీన సమాజం, సాహిత్యం, ఈ రెండింటి పరస్పర ప్రభావాల వంటి అనేక అంశాలని నిర్మొహమాటంగా చెప్పారు రావిశాస్త్రి. తనూ, తన రచనలూ కూడా పేదవాడి పక్షమేనని పదేపదే చెప్పారు.
శ్రీకాకుళంలో నాగావళి నది ఒడ్డున 1922 జూలై 30 నజన్మించిన రావిశాస్త్రి, పెరిగింది ఎక్కువకాలం జీవించింది విశాఖపట్నంలోనే. తన పదహారో ఏట 'దేవుడే చేశాడు'పేరిట తొలి కథని రాశారు. మరో రెండేళ్ళ తర్వాత చెహోవ్ కథ 'మిజరీ' ని తెలుగులోకి స్వేచ్చానువాదం చేశారు. అయితే, తన సాహిత్యం మొత్తాన్ని 'అల్పజీవి' కి ముందు, తర్వాత అని విభజించాలనీ, 'అల్పజీవి' రాసిన నాటినుంచే సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్నాననీ చాలాచోట్ల రాశారు.
'అల్పజీవి' కి అందిన ప్రశంశల్లో ముఖ్యమైనదీ, రావిశాస్త్రి మళ్ళీ మళ్ళీ ఇష్టంగా గుర్తుచేసుకున్నదీ, తానెంతో అభిమానించే మహాకవి శ్రీశ్రీ నుంచి అందిన ప్రశంశ. నిజానికి రావిశాస్త్రి చదువుకున్నది శ్రీశ్రీ తండ్రి దగ్గరే. ఆయన హెడ్మాస్టరుగా పనిచేసిన స్కూల్లోనే ఈయన పాఠశాల విద్య సాగింది. యవ్వనారంభంలో చదివిన సెక్స్ పుస్తకాలు తనని పక్కదోవ పట్టించాయని రావిశాస్త్రి రాసుకున్నది చదివినప్పుడు శ్రీశ్రీ ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల 'అనంతం' గుర్తొచ్చింది. శ్రీశ్రీ ఎంతగానో అభిమానించింది అబ్బూరి రామకృష్ణారావుని కాగా, ఆయన కుమారుడు వరద రాజేశ్వరరావు రావిశాస్త్రికి ప్రాణ స్నేహితుడు. హైస్కూల్లో మొదలైన స్నేహం చివరివరకూ కొనసాసింది.
తనకి 'దేవుడు లేడ'న్న విషయాన్ని మొదట చెప్పింది వరద రాజేశ్వరరావేననీ, అప్పుడు తనకి చాలా భయం వేసిందనీ చెప్పుకున్నారు రావిశాస్త్రి. అలాగే చాయాదేవి గారి సౌశీల్యాన్నీ తలచుకున్నారు. గురజాడ అప్పారావు అంటే తనకున్న అభిమానాన్నిఏమాత్రం దాచుకోలేదు రావిశాస్త్రి. 'కన్యాశుల్కం' కన్నా గొప్ప నాటకం ఇక తెలుగునాట రాదని డంకా బజాయించారు. తన సమకాలికుల్లో కాళీపట్నం రామారావు మేష్టారి మీదున్న గౌరవాన్నీ, బీనాదేవి రచనల మీద ఇష్టాన్నీ చాలాసార్లే ప్రస్తావించారు. కే.ఎన్.వై. పతంజలి 'పతంజలి భాష్యా'నికి ముందుమాట రాశారు.
కథాసాహిత్యం ద్వారా కన్నా ప్రజాగాయకుల ద్వారా జనంలో చైతన్యం తీసుకురావడం సులభమని నమ్మిన రావిశాస్త్రి, గదర్, వంగపండు ప్రసాదరావులు ఆపనిని సమర్ధవంతంగా చేస్తున్నారని అభినందించారు. విప్లవ రచయితల సంఘం (విరసం) ప్రారంభంలో కీలక భూమిక పోషించిన రావిశాస్త్రి, తర్వాత కొంతకాలంపాటు విరసానికి దూరం జరిగారు. విరామం తర్వాత మళ్ళీ చేరువయ్యారు కూడా. మార్క్సిజం పట్ల రావిశాస్త్రికి నమ్మకం, గౌరవం. వ్యక్తిగత ఆస్తి లేని సమాజంలోనే మాత్రమే అసమానతలన్నీ తొలగిపోతాయని నమ్మారు. గాంధీని ఎంతగా అభిమానించారో, నెహ్రూనీ, ఆయన వారసులనీ అంతగా విమర్శించారు.
వ్యక్తిగత జీవితం, ప్లీడరుగా ప్రాక్టీసు, తన దగ్గరకి వచ్చే 'పార్టీ' లనీ, వాళ్ళు మాట్లాడే భాషనీ గమనించి తన రచనల్లో ఉపయోగించడం మొదలు, తనని చుట్టుముట్టిన అనారోగ్యం, ఆర్ధిక సమస్యల వరకూ అన్నింటినీ పంచుకున్నారు తన 'రావిశాస్త్రీయం' లో. అసంపూర్తి నవలలు 'రాజు-మహిషి' 'రత్తాలు-రాంబాబు' లని పూర్తి చేసే ఉద్దేశ్యం లేనట్టేనని చాలాసార్లే చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో అనుభవించిన జైలు జీవితం, అక్కడి స్నేహాలు, వాతావరణం వీటన్నింటి సంగతులూ వివరించారు. రంగనాయకమ్మ 'బలిపీఠం' తనకెందుకు నచ్చలేదో చెప్పడంతో పాటు, స్త్రీవాదానికి తాను వ్యతిరేకినంటూ కారణాలని వివరించారు.
మొత్తం పుస్తకాన్ని ఇరవై అధ్యాయాలుగా విభజించారు ప్రకాశకులు. ఇది ముందుగా ప్లాన్ చేసి రాసిన పుస్తకం కాదు కాబట్టి, చాలా సంగతులు చర్విత చర్వణమయ్యాయి. కథలెలా రాయాలన్న విషయాన్ని గురించి శాస్త్రి గారి వ్యాసాలు కొత్తగా కలం పట్టే వారికి తప్పక ఉపయోగ పడగలవు. కొన్ని 'పూర్తిగా వ్యక్తిగతం' అనిపించే లేఖలకీ స్థానమిచ్చారు ఇందులో. అలాగే కొన్ని ఆంగ్ల లేఖలూ, వ్యాసాలూ కూడా ఉన్నాయిందులో. విప్లవ కవి చెరబండరాజుకి అంకితమిచ్చిన 'రావిశాస్త్రీయం' పుస్తకాన్ని 'రాచకొండ ప్రచురణలు' ప్రచురించింది. (పేజీలు 384, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
మురళిగారు ,
రిప్లయితొలగించండి' రావిశాస్త్రీయం ' పరిచయం చాలా బాగుంది . రావిశాస్త్రిగారి రచనల గూర్చి ఎందరో మహానుభావులు చర్చించారు . చలసాని ప్రసాద్ , కాత్యాయని విద్మహే , వల్లంపాటి వెంకట సుబ్బయ్య ... ఈ లిస్ట్ పెద్దదే అవుతుంది . అయితే ఇవన్నీ చాలా ఎకడమిక్ గా ఉంటాయి .
మీరు చెప్పదలచుకున్న విషయాన్ని సరళంగా , సూటిగా రాస్తున్నారు . ఈ శైలిలో మీరు రావిశాస్త్రిగారి క్లాసిక్స్ నేటితరానికి పరిచయం చెయ్యగలిగితే బాగుండుననిపిస్తుంది . శ్రమతో కూడుకున్న ఈ బాధ్యతని మీరు నిర్వర్తించగలిగితే మాలాంటివాళ్ళం సంతోషిస్తాం .
తెలుగు బ్లాగులు , బ్లాగర్ల గౌరవం పెంచే మీ రచనలు నాకు బాగుంటాయి . అభినందనలు .
బావుంది..బావుంది..పదిసార్లు చదివిన పుస్తకమే అయినా మీరు రాస్తే ఈ పరిచయం మళ్ళీ బావుంది.థాంక్స్.
రిప్లయితొలగించండినమస్కారం మురళి గారు
రిప్లయితొలగించండిమీ వ్యాసం చాలా విషయాలను తెలిపింది. మీరు తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ ప్రశంసనీయం. మీ అభిమానిగా ఒక చిన్న సలహా -- మీరు వ్రాసిన ఈ విషయాలను తెలుగు వికీలో కూడా భద్రపరిస్తే బాగుంటుంది. దీనికి కావలసిన ధాతువులు మీ దగ్గర ఉండనే ఉన్నాయి. మీ బ్లాగే ఒక వికీలాగా ఉంది -- అందరి గురించిన వ్యాసాలూ ఉన్నాయి. మీకు పని చెప్తున్నాను అనుకోకండి. మీరు వ్రాసిన తెలుగు వికీలను ఆంగ్లంలోకి అనువదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
భవదీయుడు
సందీప్
వీరు కవిత్వం కూడా రాసారు తెలుసాండీ? "ఎన్నెలో ఎన్నెల" అని రావిశాస్త్రి గారి కవిత్వం పుస్తకరూపంలో వచ్చింది.
రిప్లయితొలగించండిమురళిగారు,
రిప్లయితొలగించండిసందీప్ గారు చెప్పిన మాట చాలా బావుంది...మీరు ఆపని చెయ్యవలసిందే....నేను డిమాండ్ చేస్తున్నాను...మీ అభిమానిగా...
@yaramana: సాహిత్యానికి సంబంధించి నేను కేవలం పాఠకుడినండీ.. ఓ రచన చదివినప్పుడు నాకేమనిపించిందో నాలుగు మాటలు ఇక్కడ రాసుకుంటూ ఉంటాను. ఇకపోతే మీ సూచన.. 'శ్రమతో కూడుకున్న..' అని నేనస్సలు అనుకోవడం లేదండీ.. ఎందుకంటే చదవడంతో పాటుగా, రాయడం కూడా నాకు ఇష్టమైన వ్యాపకంగా మారిపోయింది.. మరీ ముఖ్యంగా గడిచిన రెండున్నరేళ్లుగా. వీలు వెంబడి శాస్త్రిగారి ఇతర రచనల గురించి కూడా రాసే ప్రయంతం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుధ: పెద్ద ప్రశంశ ఇచ్చారు కదా! సందీప్ గారికి జవాబిస్తున్నాను చూడండి :-) ..ధన్యవాదాలు.
@సందీప్: 'సేవ' అంటూ చాలా పెద్ద మాట వాడేశారండీ.. yaramana గారికి చెప్పినట్టుగా నేను చదివిన పుస్తకాల గురించి నాకు తోచిన నాలుగు మాటలు ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను అంతే.. ఇక తెవికీ గురించి.. చాలా కాలం క్రితమే, వికీ నుంచి కాజ సుధాకర్ బాబు గారు నా టపాలలో వికీకి సరిపోయే వాటిని అక్కడ భద్ర పరుస్తామనీ, కొన్నింటిని భద్ర పరిచామనీ చెప్పారండీ.. అప్పుడప్పుడూ వికీ చూస్తుంటే నా టపాలు కొన్ని పలకరిస్తున్నాయి కూడా :-) ..మీ అభిమానానికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: అవునండీ.. 'రావిశాస్త్రీయం' లో కూడా కొన్ని కవితలు ఉన్నాయి. టపాలో ప్రస్తావించలేదు నేను :( ..ధన్యవాదాలు.