గురువారం, జూన్ 17, 2010

వేదం

కొత్త దర్శకులకి 'రెండో సినిమా గండం' సెంటిమెంట్ ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో 'గమ్యం' లాంటి వైవిధ్య భరితమైన సినిమాతో కెరీర్ ప్రారంభించిన క్రిష్ రెండో సినిమా ఎలా ఉంటుంది? అన్న కుతూహలం చాలా రోజులుగా వెంటాడుతోంది నన్ను. అయితే సినిమా విడుదలకి ముందు అనుష్క పోషించిన సరోజ పాత్రకి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం, ఆమె ప్రొవొకింగ్ స్టిల్స్..ఇంకా మన సెన్సార్ వారు ఈ సినిమా కి 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వడం లాంటి కారణాలు సినిమా మీద ఆసక్తిని కొంతవరకూ తగ్గించిన మాట వాస్తవం.

సినిమా విడుదలైన రెండో వారంలో, 'పర్లేదు' అన్న టాక్ విన్నాక చూశానీ సినిమాని. ఐదు పాత్రల కథల్ని వైవిధ్య భరితంగా చెప్పడానికీ, ఎక్కడెక్కడో ఉన్న పాత్రలన్నింటినీ ఒక చోటకి చేర్చి కథని కంచికి పంపడానికీ దర్శకుడు పడ్డ శ్రమ రెండో సగంలో బాగా కనిపించింది. ఇలా ఒక్కో పాత్ర కథనీ చెప్పుకుంటూ ముగింపుకి వెళ్ళడం సాహిత్యంలో ఎప్పటి నుంచో ఉన్నదే. కొన్నేళ్ళ క్రితం మణిరత్నం 'యువ' సినిమాని ఇదే పంధాలో తీశాడు. (పోలిక ఇక్కడి వరకే)

రాక్ స్టార్ కావాలని కలలు కనే ఆర్మీ నేపధ్యం ఉన్న కుర్రాడు, వేశ్యా గృహం నుంచి బయటపడి తనే సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని ఆశ పడే వేశ్య, మత కలహాల కారణంగా పుట్టబోయే పిల్లల్ని పోగొట్టుకుని ఆ కోపంతో దేశం విడిచి వెళ్లి పోవాలనుకునే ముస్లిం యువకుడూ, కొడుకు చదువు కోసం కిడ్నీ అమ్ముకోడానికి సిద్ధపడ్డ నిరక్షరాస్యురాలైన ఓ పేద తల్లి మరియు డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలనుకునే ఓ బస్తీ కుర్రాడు... ఓ సంవత్సరం డిసెంబర్ ముప్ఫయ్యొకటో తారీఖు వీళ్ళందరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చిందన్నదే 'వేదం' సినిమా కథ.

స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు తగినంత శ్రద్ధ చూపక పోవడం, మల్టీ స్టారర్ గా ప్రచారం జరిగిన ఈ సినిమాలో సదరు స్టార్లెవరూ వారి స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ చేయకపోవడం ఈ సినిమాలో ప్రధాన లోపాలు. ఐదు పాత్రల కథలు చెప్పే క్రమంలో చాలా చోట్ల సాగతీత కనిపించింది. అక్కడక్కడా సినిమా నడక డాక్యుమెంటరీ ని తలపించింది. ముఖ్యంగా సినిమా మొదటి సగంలో ఈ లోపం బాగా కనిపించింది. విశ్రాంతి వరకూ పాత్రలు, వాటి లక్ష్యాల పరిచయం జరిగింది. రెండో సగంలో కథనం వేగాన్ని అందుకుని ఒక బలవంతపు ముగింపుకి చేరింది.

నాకీ సినిమా 'పర్లేదు' అనిపించడానికి ముఖ్యమైన కారణం సహాయ పాత్రల నటన. నిజానికి ఇదే ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పాలి. కిడ్నీ అమ్ముకునే తల్లిగా నటించిన శరణ్య, ఆమె మావ గా చేసిన నాగయ్య, వాళ్ళ ఊరి ఆరెంపీ డాక్టర్ గా చేసినతను, వేశ్య సరోజకి సహాయంగా ఉన్ననపుంసక పాత్ర 'కర్పూరం' గా చేసిన నటుడు/నటి... వీళ్ళందరి నటన చాలా బాగుంది. తెలుగు లో సహాయ పాత్రలు చేసే నటులకి కొదవ లేదనిపించింది. వీళ్ళ నుంచి చక్కని నటనని రాబట్టుకున్న దర్శకుడు ప్రధాన పాత్రల నుంచి ఎందుకు రాబట్టుకోలేక పోయాడన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

సరోజపాత్రలో ఎక్స్ పోజింగ్ మినహా అనుష్క చేసిందేమీ లేదు. నిజానికి నటించేందుకు అవకాశం ఉన్న సన్నివేశాలు కొన్ని ఉన్నాయి ఈ పాత్రకి. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశం. స్టేషన్ ఆఫీసర్ గా అతిధి పాత్ర వేసిన పోసాని కృష్ణ మురళి నటన కూడా అనుష్క కి తగ్గట్టుగానే ఉంది. 'చమేలి' లాంటి హిందీ సినిమాల ప్రభావం ఉంది అనుష్క నటనపై. సరోజ పాత్ర పరిచయంలో 'సరోజ, అమలాపురం' అని చూపించారు. అయితే ఆమె భాషలో ఎక్కడ ఆ ప్రాంతపు యాస వినిపించదు. ఈ 'అమలాపురం' కేవలం పబ్లిసిటీ కి మాత్రమే ఉపయోగ పడింది.

నేను చూసిన మంచు మనోజ్ గత చిత్రం 'ప్రయాణం' తో పోలిస్తే ఇందులో అతని నటన కొంచం మెరుగు పడిందనే చెప్పాలి. కొన్ని ఫ్రేముల్లో అతన్ని చూసినప్పుడు విలన్ గా బాగా రాణిస్తాడని అనిపించింది. ఇక అల్లు అర్జున్ ని వెండితెర మీద చూడడం నాకిదే మొదటిసారి. హాస్పిటల్ లో జరిగే దొంగతనం సన్నివేశం, అక్కడ అతను ప్రదర్శించిన నటన బాగున్నాయి. మనోజ్ బాజ్పాయ్ పాత్ర రూపకల్పనలో దర్శకుడి కన్ఫ్యూజన్ అతని నటనలోనూ కనిపించింది. బాజ్పాయ్ భార్యగా చేసిన నటి కొన్ని సన్నివేశాల్లో నటనలో అతన్ని డామినేట్ చేసింది.

మాస్ ని ప్రతిబింబించే పాత్ర, డబ్బున్న వాళ్ళ మీద సెటైర్లు, 'బుల్లెబ్బాయి' అనే పేరున్న పాత్ర, ముగింపుకి ముందు నాటకీయ డైలాగులతో ఉండే సన్నివేశం... ఇవి 'గమ్యం' 'వేదం' సినిమాలకి ఉన్న పోలికలు. స్క్రిప్టు విషయంలో దర్శకుడు తొలి సినిమాకి తీసుకున్న శ్రద్ధలో పదో వంతు కూడా రెండో సినిమాకి తీసుకోక పోవడం బాధాకరం. సంగీతం, ఎడిటింగ్ సో సో. నిర్మాతకి లాభాలు తెచ్చి పెడుతుందేమో కానీ, దర్శకుడికి ఈ సినిమా విజయాన్ని ఇచ్చిందా? అంటే చెప్పడం కష్టమే.