శుక్రవారం, డిసెంబర్ 24, 2010

రైలు ప్రయాణం

జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తారు చాలామంది. చూసే ఓపిక, ఆసక్తీ ఉండాలే కాని రైలు ప్రయాణంలోనే జీవితం మొత్తం కనిపించేస్తుంది మనకి. రకరకాల మనుషులు. ఎవరి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఆగుతుందో మరొకరికి తెలీదు. అయినా కలిసిన ఆ కాసేపట్లోనే అపరిచితుల మధ్య ఎన్నో సంభాషణలు నడిచిపోతూ ఉంటాయి. కొండొకచో పోట్లాటలు కూడా. చొరవగా మాట కలిపేవాళ్ళు కొందరైతే, మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయే వాళ్ళు మరికొందరు.

మనుషులు ఎంత ఎదిగినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇష్టంగా గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం బాల్యం. ఆ బాల్యంలో ఆడిన తొలి ఆటల్లో 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' లేకుండా ఉంటుందా? అలా రైలుకీ బాల్యానికీ అవినాభావ సంబంధం. నావరకు నాకు తొలి రైలు ప్రయాణం ఓ అపురూప జ్ఞాపకం. రైలంటే ఎలా ఉంటుంది? మొదలు, రైలు ఎందుకు కూత పెడుతుంది? వరకూ సవాలక్ష సందేహాలు అప్పట్లో. పెద్దైపోయాక ఎవరినీ అడగక్కర్లేకుండానే జవాబులు తెలుసుకునే వీలున్నప్పుడు బుర్రలో ప్రశ్నలే పుట్టవెందుకో.

రైల్వే ట్రాక్ ల పక్కన బాల్యాన్ని గడిపిన భాగ్యశాలుల రైలు జ్ఞాపకాలు రాయడం మొదలు పెట్టారంటే అది అలా ఎక్ష్ప్రెస్ రైలులా సాగిపోవలసిందే. ట్రాక్ మీద నాణాన్ని ఉంచి నాణెం నాణ్యతని పరిశీలించడం మొదలు రైల్లో వెళ్ళే ముక్కూ మోహం తెలియని వందలాదిమందికి వీడ్కోలు చెప్పడం వరకూ వీళ్ళు ఆడని ఆట ఉండదు. నా చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు కొన్నాళ్ళ పాటు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారు. అప్పట్లో నేనూ ఈ ఆటలన్నీ ఆడానని చెప్పడానికి గర్వ పడుతున్నాను.

అన్నట్టు రైలు పెట్టెలు లెక్క పెట్టే ఆట ఎంత బాగుంటుందో. కొత్తగా అంకెలు నేర్చుకునే వాళ్ళ చేత గూడ్సు బండి పెట్టెలు లెక్క పెట్టించాలి. అప్పుడింక వాళ్లకి అంకెలు, సంఖ్యల్లో తిరుగుండదు. కాకపొతే, మామూలు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండే సరదా, గూడ్సు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండదుగాక ఉండదు. తిరిగి నవ్వే, చెయ్యూపే ఒక్క ముఖమూ కనిపించక పోతుంటే అలా మన పాటికి మనం పెట్టెలు లెక్కెట్టుకోడం భలే విసుగు.


రైలు ప్రయాణంలో కలిసే బంధుత్వాలు భలే చిత్రంగా ఉంటాయి. నిమిషాల్లో ప్రాణ స్నేహితులు అయిపోయిన వాళ్ళే, రైలు దిగిన మరుక్షణం పరాయివాళ్ళు అయిపోతారు. కొండొకచో రైలుబండి నిజమైన స్నేహాలనీ కూర్చి పెట్టినప్పటికీ, అధికశాతం రైలు స్నేహాలు అవసరార్ధపు స్నేహాలే. అసలు ఈ రైలు పరిచయాల్లో తమ తమ నిజ వివరాలని పంచుకునే వాళ్ళు ఎందరు ఉంటారా అనే విషయం మీద ఓ చిన్న పరిశోధన చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.

రైల్లో పైతరగతి ప్రయాణాల కన్నా జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణాలు భలే బాగుంటాయి. నాకైతే సరదాగా కూడా అనిపిస్తాయి. అయితే ప్రయాణ కాలం ఓ రెండు గంటలు మించకూడదు. పైతరగతి పెట్టెల్లో ప్రయాణికులు మూతులు బిగించుకుని కూర్చుంటే, జనరల్లో ప్రయాణికులు కాసేపు వీళ్ళు మౌనంగా ఉంటే బాగుండు అనిపించే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అసలిక్కడ దొర్లని టాపిక్ అంటూ ఉండదు. ఉన్న ఆ కొంచం జాగాలోనే కూసింత సర్దుకుని నిలబడ్డ వాళ్లకి సీటివ్వగల ఔదార్యం జనరల్ ప్రయాణికుల సొంతం.

అయితే, కొంచం ముందుగా బండెక్కిన ఒకే ఒక కారణానికి సామాను పరుచుకుని సీట్లు ఆక్రమించుకుని నిద్ర నటించే వాళ్ళూ ఇక్కడ కనిపిస్తారు. సమస్త వ్యాపారాలు చేసేవాళ్ళూ తమ తమ వస్తువులని 'కారు చౌక'గ అమ్మేది జనరల్ కంపార్ట్మెంట్ లోనే. తాజా కూరలు, పళ్ళు మొదలు పైరేటెడ్ డిస్కుల వరకూ ఏం కావాలన్నా దొరికే సూపర్ మార్కెట్ ఈ జనరల్ కంపార్ట్మెంట్. రౌడీయిజం మొదలు రాజకీయాల వరకూ ఏ విషయాన్ని గురించైనా అలవోకగా చెప్పేయగల ఎన్ సైక్లోపీడియా కూడా ఇదే.

మన సినిమాలు, సాహిత్యం రైలు ప్రయాణాన్ని ఏమాత్రం చిన్నచూపు చూడలేదు. అలా చేస్తే రైలుబండిని ప్రేమించే జనం తమని చిన్న చూపు చూస్తారేమోనన్న భయసందేహం ఇందుకు కారణం కావొచ్చు. అందుకే ఎందరో నాయికా నాయకులు రైలు ప్రయాణంలో కలుసుకున్నారు. మరికొందరు విడిపోయారు. ఇంకొందరి జీవితాలు ఊహించని మలుపు తిరిగి పాఠ/ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రైలు ప్రయాణాల నేపధ్యంలో వచ్చిన కథలు, కార్టూనులకైతే లెక్కేలేదు. అసలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా?

గురువారం, డిసెంబర్ 23, 2010

నాయికలు-హేమసుందరి

మనిషికెప్పుడూ తనకి దొరకని దానిని ఎలా అయినా సాధించుకోవాలన్న తపన ఉంటుంది. అలా సాధించుకునే ప్రయత్నంలో ఎదురయ్యే కష్టనష్టాలని భరించడం పెద్ద పనిగా అనిపించదు. రాజసౌధంలాంటి విశాలమైన భవనంలో విలాస జీవితం గడిపే హేమసుందరికి అందుబాటులో లేనివంటూ లేవు, పిడికెడు ప్రేమాభిమానాలు తప్ప. వాటిని తనకి అందించాడనే ఒకేఒక్క కారణంతో ఆమె ఓ సామాన్యుడైన రంగనాయకుడి తో ప్రేమలో పడిపోయింది. పీకలోతు కష్టాలని ఆనందంగా భరించింది.

నవరసాలనూ తగు పాళ్ళలో రంగరించి నలభై నాలుగేళ్ల క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన 'విశాల నేత్రాలు' నవలలో నాయిక హేమసుందరి. కాంచీ రాజ్య ప్రధాన నగరం నిచుళాపురంలో పేరుగాంచిన వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు. నిజానికి ,హేమ శృంగారమంజరికి సొంత కూతురు కాదు. తను యవ్వనంలో ఉండగా ఇద్దరు బాలికలని చేరదీసి పెద్ద చేసింది శృంగారమంజరి. వారిలో ఒకరు మాణిక్యవల్లి మరొకరు హేమసుందరి.

శృంగారమంజరి పెంపకంలో లోటన్నది ఎరగకుండా పెరిగింది హేమసుందరి. సకల కళలనీ అభ్యసించింది. దొరకనిదల్లా ప్రేమ. తన సొంత వాళ్ళెవరో తనకి తెలీదు. చుట్టూ ఉన్న వారెవరూ తనవారు కాదు. తల్లి తనని వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే రంగనాయకుడి కంట పడింది హేమసుందరి. సాముగరిడీలలో దిట్టైన రంగనాయకుడికి ఓ అందమైన ఆడపిల్లని దగ్గరనుంచి చూడడం, ఆపై చూపు తిప్పుకోలేక పోవడం అదే తొలిసారి.

అది మొదలు రంగనాయకుడి జీవితం మారిపోతుంది. హేమసుందరి దర్శన భాగ్యం కోసం తపించిపోతాడతడు. హేమసుందరి తనని ప్రేమించడం తన అదృష్టంగా భావిస్తాడు. రాత్రిపూట శరీరానికి మసి పూసుకుని శృంగార మంజరి భవంతిలోకి ప్రవేశించడానికి సైతం వెనుకాడడు అతడు. మరోపక్క, కేవలం తనకోసం రంగనాయకుడు అంతటి సాహసాలు చేస్తుండడంతో అతనిపై పుట్టిన ప్రేమ రెట్టింపవుతుంది హేమసుందరికి.

తన ఇంట్లో ఎవరినీ మనస్పూర్తిగా నమ్మని హేమసుందరి, మొదటిసారిగా అక్క మాణిక్యవల్లిని నమ్మి తన ప్రేమకథ చెబుతుంది. అప్పటివరకూ తనని మించిన అందగత్తె అయిన హేమ తన వ్యాపారానికి అడ్డం వస్తుందని మథన పడుతున్న మాణిక్యవల్లికి హేమని అడ్డు తొలగించుకోడానికి ఇదో చక్కని అవకాశంగా కనిపిస్తుంది. చెల్లెలు రంగానాయకుడితో కలిసి శ్రీరంగం పారిపోడానికి పరోక్షంగా సహకరిస్తుంది మాణిక్యవల్లి.

తనకంటూ ఒక ఇల్లు, భర్త, సంఘంలో గౌరవం.. ఈ కొత్త జీవితం ఎంతగానో సంతృప్తిని ఇస్తుంది హేమసుందరికి. వివాహం చేసుకోకపోయినా శ్రీరంగంలో భార్యాభర్తలుగా చెలామణి అవుతారు హేమ, రంగనాయకుడు. అయితే ఆ సంతృప్తి, సంతోషం ఎంతోకాలం ఉండవు. ఒక్కసారిగా దొరికిన స్వేచ్ఛ రంగనాయకుడిని వ్యసనపరుడిని చేస్తుంది. అత్యంత సౌందర్యవతి అయిన హేమ పక్కనే ఉన్నా పరస్త్రీ వ్యామోహంలో పడతాడు. ఇదేమని ప్రశ్నించిన హేమకి జవాబు దొరకదు.

రంగనాయకుడి వ్యసనాలని భరిస్తున్న హేమకి, అతడికి వృద్ధుడైన రామానుజ యతితో ఏర్పడ్డ అనుబంధం మాత్రం కలవరాన్ని కలిగిస్తుంది. రంగనాయకుడు సన్యసిస్తాడేమో అనే సందేహం ఆమెని యతిని కలుసుకునేలా చేస్తుంది. తనకి పిడికెడు ప్రేమని అందించిన రంగనాయకుడి పై సముద్రమంత ప్రేమని కురిపించిన హేమసుందరి జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమెకి తను కోరుకున్నది దొరికిందా? అన్నది నవల ముగింపు. నవల పూర్తయ్యాక కూడా ఏళ్ళ తరబడి వెంటాడే పాత్ర హేమసుందరి.

బుధవారం, డిసెంబర్ 22, 2010

దీక్షలు

రాష్ట్రంలో ప్రస్తుతం దీక్షల సీజన్ నడుస్తోంది. నల్లని దుస్తుల్లో అయ్యప్ప భక్తులు, ఎర్రని దుస్తుల్లో కనకదుర్గ భక్తులు నిష్టగా రోజులు గడుపుతున్నారు. పూజలు, ఉపవాసాలు, భజనలతో దీక్షలు కొనసాగించే భక్తులని చూడడం కొత్త విషయం కాదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం మన చుట్టూ వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కొందరైతే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటూ ఉంటారు కూడా.

ఈ దీక్షకి కారణం కేవలం భక్తి మాత్రమే కాదంటే ఆశ్చర్యపడనవసరం లేదు. భక్తి తో పాటుగా ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకి ఉంటూ ఉంటాయి. ఆయా కారణాలు వాళ్ళని దీక్ష దిశగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అయ్యప్ప దీక్షలు పాపులర్ అయ్యాక భవాని దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష లాంటివి నెమ్మదిగా జనంలోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడు చిన్న చిన్న ఆలయాల్లో కూడా దీక్షలు ఇవ్వడం, భక్తులు వాటిని స్వీకరించడం జరుగుతోంది.

అరుదుగా మాత్రమే కనిపించే రెండో రకం దీక్షలూ ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా చర్చనీయం అయ్యాయి. అవును, రాజకీయ నాయకులకి రైతుల సమస్యలు కళ్ళకి కనిపించడంతో వారిలో ధర్మాగ్రహం పెల్లుబికి నిరసన దీక్షకి కూర్చునేలా చేశాయని ఆయా నాయకుల అనునూయులు టీవీ చానళ్ళలో చెబుతున్నారు. ప్రస్తుతం నిరసన దీక్ష జరుపుతున్న ఇద్దరు నాయకుల అంతిమ లక్ష్యమూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడమే అన్నది ఏ ఊళ్ళో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే మాట.

రైతుల కోసం దీక్ష చేపట్టిన ఇద్దరు నాయకుల్లోనూ ఒకాయన తనకి అపారమైన పాలనానుభావం ఉందన్న విషయాన్ని సందర్భం వచ్చినా రాకపోయినా ఇష్టంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తన అనుభవాన్ని పాలక పక్షం గుర్తించడం లేదన్నది ఆయన నోటినుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. సాంకేతికతని అందిపుచ్చుకుని రాష్ట్రానికి బంగారు తాపడం చేసేయాలనే కుతూహలం కారణంగా కావొచ్చు, ఆయన తన పాలనాకాలంలో వ్యవసాయం లాంటి చిన్నచిన్న విషయాలపై దృష్టి పెట్టలేకపోయారు.

ఇప్పుడు తానున్నది అధికారంలో కాక ప్రతిపక్షంలో కావడంతో రైతులవంటి బడుగు జీవుల కష్టాలని గుర్తించ గలుగుతున్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆయనకి ముఖ్యమంత్రి అన్ని రకాల పళ్ళూ తెచ్చి తినిపించబోతుండగా, ఆయన వద్దు వద్దంటూ తన పక్క మంచం మీద మరణ శయ్య మీద ఉన్న రైతుకు వాటిని తినిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టుగా ఓ దినపత్రిక నిన్నటి సంచికలో వచ్చిన కార్టూను చూసి నవ్వాపుకోడం నా వల్ల కాలేదు. కార్టూన్ అంటేనే వ్యంగ్యం అయినప్పటికీ, మరీ ఇంత వ్యంగ్యమా?

తన 'బలాన్ని' నిరూపించుకోడానికి, ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోకుండా ఉండడానికి సర్వదా సిద్ధంగా ఉన్న యువనేత సైతం రైతులకోసం దీక్ష మొదలు పెట్టారు. వేషాలు లేక మేకప్పులు వెలిసిపోయిన సినిమా వాళ్ళు, రాజకీయ ఊసరవల్లులు ఆయనకి మద్దతు పలికారు, పలుకుతున్నారు. ఆయన సొంత మీడియా చాన్సుని దొరకబుచ్చుకుని 'నేల ఈనిందా? ఆకాశం బద్దలయిందా?' అంటూ జనం మీద 'వార్తలని' రుద్దేస్తోంది.

ఈ యువనేత పదే పదే వల్లెవేసే 'మహానేత' పాలనలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నది నివేదికల సాక్షిగా తేలిన నిజం. మరి ఆయన మొదలు పెట్టిన పథకాలు ఎవరికి చేరాయన్నది ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రతిపక్షాలకీ తన సమస్యలమీద చిత్తశుద్ధి లేదన్న సంగతి రైతుకి మళ్ళీ మళ్ళీ అర్ధమవుతోంది. తనని చుట్టుముట్టిన కష్టాలని మర్చిపోయి, కాసేపు హాయిగా నవ్వుకోడానికైనా ఈ చిత్తశుద్ధి లేని దీక్షలు రైతులకి ఉపయోగ పడుతున్నందుకు మనలాంటివాళ్ళం సంతోష పడాలి.

మంగళవారం, డిసెంబర్ 21, 2010

హాస్య కథలు

పుస్తకం పేరే 'హాస్య కథలు' పైగా రాసిందేమో 'శ్రీవారికి ప్రేమలేఖ' లాంటి అద్భుత హాస్య చిత్రానికి కథ అందించిన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. ఇక, కథలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. రెండేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం లో వారానికో కథ చొప్పున ప్రచురితమైన ఈ కథలని శ్రీధర్ కార్టూనులతో సహా పుస్తకంగా ప్రచురించారు ఎమెస్కో వారు. మొత్తం ఇరవైనాలుగు కథల విందు భోజనం ఈ చిరు పొత్తం.

కథలన్నీ రచయిత్రి బాల్య జ్ఞాపకాలే. చిన్నారి విజయ చేసే చిలిపి పనులతో పాటు అమ్మమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళ చాదస్తాలు, తాతగారి పాట్లు, బంధువుల చిత్ర విచిత్రమైన అలవాట్లు, వాటి కారణంగా విజయతో సహా చిన్న పిల్లలు పడ్డ పాట్లు.. ఇలా ప్రతి జ్ఞాపకాన్నీ ఓ అందమైన కథగా మలిచారు విజయలక్ష్మి. కొన్ని కథలు పూర్తి చేశాక ఓసారి ఆలోచిస్తే, అసలు ఈ జ్ఞాపకాన్ని కథగా మలచవచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చి ఉంటుందబ్బా? అనిపించక మానదు.

అల్లుడుగారు రేడియో పంపించారు. వినకపోతే మర్యాద కాదు. కానీ వింటూ కూర్చుంటే ఇంట్లో పనులు జరగడం లేదు. ఎలా? అన్నది అమ్మమ్మ సమస్య. పక్కింటి వాళ్ళని బతిమాలి వాళ్ళని రేడియో ముందు కూర్చోపెట్టి తను వంట చేయడానికి వెళ్ళే ప్రహసనాన్ని ఆనందించొచ్చు 'ఆలిండియా రేడియో' కథలో. ఇంటికి కరెంటీ పెట్టించుకున్న అమ్మమ్మ పాట్లు, సెకండ్ హ్యాండ్ కారు కదలక మొరాయిస్తున్నా ఆ ప్రయాణానికే సంతోష పడిపోతూ 'కారాగిపోయినప్పుడు పిల్లలు తింటారు' అంటూ చిరుతిళ్ళు కట్టివ్వడం 'కారులో షికారు' కథ.

వియ్యంకుడు తెచ్చిన 'ఇంగ్లీష్' కూరలని ఇరుగుపొరుగు వాళ్లకి చూపించడం కోసం అమ్మమ్మ పడే ఆరాటం 'ఇంగ్లీష్ కూరలు' కథ చెబితే, కొత్తగా వెలిసిన అట్ల దుకాణం ఆవిడ కాపురంలో రేపిన కలతలేమితో 'దొంగ అట్లు' కథ చెబుతుంది. హోటల్ వాళ్ళు రేట్లు పెంచినా, ఇంట్లో వాళ్ళు పాత రేట్లే ఇచ్చి పిల్లల్ని పంపిస్తే అప్పుడు హోటల్ వాళ్ళు ఏంచేస్తారు? గుంటూరు శంకర్ విలాస్ యజమాని ఏం చేశాడో చెప్పే కథ 'పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు.'

మొత్తం మీద ఈ తొంభై ఆరు పేజీల పుస్తకం చదివిన వాళ్లకి డాక్టర్ సోమరాజు సుశీల రాసిన 'ఇల్లేరమ్మ కతలు' గుర్తు రాకుండా ఉండడం అసాధ్యం. అలా అని ఈ కథలు సుశీల కథలకి అనుకరణా కాదు. రెంటిలోనూ బాల్యమే కథ వస్తువు కావడం ఒక్కటే పోలిక. అలాగే వయసుతో పాటు రచయిత్రి ఆలోచనల్లో వచ్చే పరిణతినీ రెండు పుస్తకాలూ పఠితలకి పట్టిస్తాయి. (వెల రూ. 40, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.)

ఆదివారం, డిసెంబర్ 12, 2010

అంకితం

"ఓ కాలమా.. ఇది నీ జాలమా..." పాట, "ఈ ఇల్లు చినబాబుది.. అతనికి ఇష్టం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు..." అన్న జేవీ సోమయాజులు డైలాగు, "కొంతకాలం, నన్ను ఒంటరిగా వదిలేయండి నాన్నా.." అంటూ నాగార్జున చెప్పిన డైలాగు జమిలిగా బుర్రలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఇప్పుడే మన సుమన్ బాబు నటించిన 'అంకితం' ప్రీమియర్ షో రెప్ప వాల్చకుండా చూడడం పూర్తయ్యింది.

మూడు వారాలుగా ఎదురు చూసిన వేళ రానే వచ్చింది. సాయంత్రం ఆరూ ఇరవై ఐదుకి షో ప్రారంభం అని ఈటీవీ షెడ్యూల్ లో చూడగానే, ఆవేళకి కచ్చితంగా టీవీ ముందు ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ఓ పూర్తి స్థాయి కామెడీ షో చూడ్డానికి సిద్ధపడ్డ నన్ను సెంటిమెంటుతో పిండేశాడు సుమన్ బాబు. దర్శకత్వం ఇంద్రనాగ్ దే అయినప్పటికీ, చిత్రీకరణలో సుమన్ బాబు మార్కు పూర్తిగా కనిపించింది.

ముందుగా ఊహించినట్టుగానే ఇది ఓ సిన్సియర్ పోలిస్ కానిస్టేబుల్ కథ. 'నువ్వేకావాలి' సినిమాలో సునీల్ చెప్పిన కామెడీ డైలాగు "రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, పారిపోయిన తమ్ముడు, లేచిపోయిన చెల్లెలు..." గుర్తుంది కదా.. అచ్చం అలాంటి సెటప్. కాకపొతే ఇక్కడ తల్లి లేదు. తండ్రి రోగిష్టి. ఇద్దరు చెల్లెళ్ళు, ఓ తమ్ముడు, వీళ్ళందరి బాధ్యతనీ ఆనందంగా భరించే విజయ్ బాబు (సుమన్ బాబు). ఇంటిళ్ళపాదికీ, వాళ్ళ వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా వండి వార్చడం మొదలు, బట్టలు ఇస్త్రీ చేయడం వరకూ ప్రతి పనినీ యెంతో ఆనందంగా చేస్తాడితడు.

మళ్ళీ సునీల్ ప్రస్తావన తప్పడం లేదు. 'మర్యాద రామన్న' లో సునీల్ కి ఉన్న లాంటి సైకిల్ ఒక్కటే విజయ్ బాబు ఆస్తి. ఆ సైకిల్ మీద తిరుగుతూ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇవాళ్రేపు హోంగార్డులు కూడా హీరో హోండాలు మైంటైన్ చేస్తున్నారు కదా అనకూడదు. ఇతను సిన్సియర్ కానిస్టేబుల్ మరి. రోజూ ఆ సైకిల్ ని అరిగిపోయేలా తుడిచేక కానీ దాన్ని బయటకి తీయడు.

విజయ్ బాబు మీద పడి తినడం అతనికి కొత్త సమస్యలు తేవడం తప్ప, ఇంట్లో ఎవరూ అతనికి లేశమైనా సాయం చేయరు. పాపం, అతని ఇబ్బందులు పట్టించుకోకుండా మరదలు లావణ్య ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతూ ఉంటుంది, అచ్చం మన తెలుగు సినిమా హీరోయిన్లా. కాకపొతే ఈమె 'సుమన్ మార్కు' హీరోయిన్.. లంగావోణీ, వాలుజడ, వంటినిండా నగలు, జడనిండా పూలు.. ఇదీ అలంకరణ. ('అనుబంధం' సీరియల్లో కిన్నెర గుర్తొచ్చింది).

పెద్ద చెల్లెలి పెళ్ళికోసం స్నేహితుడు రాజు దగ్గర చేసిన అప్పు ఎలా తీర్చాలా అని మధన పడుతూ ఉండగానే, ఆ చెల్లెలు వితంతువుగా తిరిగి రావడం జరిగిపోతుంది. పులి మీద పుట్రలా చిన్న చెల్లెల్ని తన స్వహస్తాలతోనే బ్రోతల్ కేసు కింద అరెస్టు చేయాల్సి వస్తుంది. అది చాలదన్నట్టు విజయ్ బాబు కి బ్రెయిన్ ట్యూమర్ అని తెలియడం జరిగిపోతుంది. (సినిమా అయితే ఇక్కడ ఇంటర్వల్ పడి ఉండేది, బహుశా..).

తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేస్తున్న లావణ్య కి తప్పని పరిస్థితిలో తన జబ్బు విషయం చెప్పేస్తాడు విజయ్ బాబు. ఇంట్లో వాళ్ళంతా విజయ్ బాబు ని 'హిట్లర్' అంటూ నానా మాటలూ అంటున్న వేళ, ఉండబట్టలేక అతని జబ్బు విషయం నోరు జారేస్తుంది లావణ్య. తన వాళ్ళ కళ్ళలో కన్నీరు చూడలేని విజయ్ బాబు ఇది భరించలేడు. లావణ్య తో పోటీపడి, తన కిడ్నీ అమ్మేసి తన బాధ్యతలన్నీ తీర్చేసుకుని, బతికినంత కాలం ఒంటరిగా బతుకుతానంటూ సుదూరతీరాలకి విజయ్ బాబు బయలుదేరడం, ఆవెంటే లావణ్య "ఉన్నంతకాలం తోడుంటా.." అంటూ తనూ బయలుదేరడం ముగింపు.

ఈ కథలో కాంట్రడిక్షన్స్ బోలెడు. విజయ్ బాబు ఓ నిజాయితీ పరుడైన కానిస్టేబుల్. కానీ తన చెల్లెలికి 'కట్నం' ఇచ్చి పెళ్లి చేయడం తన బాధ్యతగా భావిస్తాడు. లంచం తీసుకోడు కానీ, తప్పని పరిస్థితిలో భారీ బహుమతిని అంగీకరిస్తాడు. సమస్యలకి ఎదురు నిలబడాలని ఉపన్యాసాలు ఇస్తాడు కానీ, తన సమస్యల పరిష్కారం కోసం తానుగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడు. తనకి జబ్బు అని తెలిశాక, డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తాడే కానీ, తన వాళ్ళలో స్థైర్యం నింపడాన్ని గురించి ఆలోచించడు.

చిరంజీవి సినిమాలు 'హిట్లర్' 'విజేత' నాగార్జున 'గీతాంజలి' చూసి ప్రేరణ పొంది రాసినట్టు అనిపించిన ఈ కథతో ఓ ముప్ఫై ఏళ్ళ క్రితం సినిమా తీసి ఉంటే బ్రహ్మాండంగా ఆడి ఉండేది. ప్చ్.. బ్యాడ్ టైమింగ్. పోలిస్ పాత్రలో ఆశించే రఫ్నెస్ సుమన్ బాబులో కనిపించలేదు. ఇంట్లోనే కాదు, విధి నిర్వహణలోనూ అదే పాసివ్ నేచర్. టీవీ వాళ్లకి అబద్ధం చెప్పి (అదికూడా ఈటీవీనే) ఓ కిడ్నాప్ కి తెర దింపడం, ఓ లెక్చర్ ఇచ్చి విలన్ ని మంచివాడుగా మార్చేయడం పోలిస్ గా అతను సాధించిన విజయాలు.

కథలోనే మెలోడ్రామా విపరీతంగా ఉందనుకుంటే, నటీనటుల నటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. ఈ ప్రీమియర్ షో కి స్పాన్సర్లు 'క్లోజప్' వాళ్ళు. అందుకేనేమో క్లోజప్ దృశ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు నచ్చినవి కొన్ని సన్నివేశాల్లో సుమన్ బాబు ధరించిన చొక్కాలు (అబ్బే ఖాకీవి కాదు, యూనిఫాం లో అరుదుగా మాత్రమే కనిపించాడు), వాళ్ళ ఇంట్లో గోడకి తగిలించిన ఒక హ్యాంగింగ్ ఇంకా కొన్ని సన్నివేశాల్లో వినిపించిన నేపధ్య సంగీతం. నచ్చని వాటి గురించి ఒక టపాలో రాయడం అసాధ్యం. దీనిని థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయలేదో తెలీదు మరి. చాలా బోలెడు మంది స్పాన్సర్లని సంపాదించిన ఈటీవీ ప్రకటనల విభాగం వారిని మాత్రం ప్రత్యేకంగా అభినందించాల్సిందే.

గురువారం, డిసెంబర్ 09, 2010

కారణం...క్రిములు...

"నోటి దుర్వాసన మీకు చింతా? కారణం.. క్రిములు.." అంటూ వచ్చే వాణిజ్య ప్రకటన రెండు రోజులుగా తరచూ గుర్తొస్తూ ఉంది. ఇది ఎప్పుడు మొదలయ్యిందంటే, ఓ ప్రముఖ సిని నిర్మాత "కొందరు దర్శకులు తెలుగు సిని పరిశ్రమకి క్రిములుగా మారారు" అంటూ సుదీర్ఘంగా ఆవేదన చెందడాన్ని టీవీలో చూసినప్పటి నుంచీ. ఆయన తాజాగా నిర్మించిన ఓ భారీ సినిమా అంచనాల మేరకి ఓపెనింగ్స్ తెచ్చుకోకపోవడంతో, కేవలం ఆ దర్శకుడిని మాత్రం అనలేక "కొందరు" అంటూ వ్యాఖ్య చేశాడని వినికిడి.

నిజానికి సినిమానష్టాల గురించి చర్చ ఇవాల్టిది కాదు. ఎప్పటినుంచో నడుస్తున్నదే.. కాకపొతే సదరు అగ్ర నిర్మాత తన ఆవేదనని ఆగ్రహంగా ప్రకటించడంతో మరోసారి చర్చకి వచ్చింది అంతే. ముఖ్యంగా, దర్శకుల హవా తగ్గిపోయాక, నిర్మాతల పెత్తనంలో ఉన్న తెలుగు సినిమా పగ్గాలు, వరుస విజయాలు సాధించిన కొందరు యువ దర్శకుల కారణంగా తిరిగి దర్శకుల చేతిలోకి వచ్చిన తరుణంలో వచ్చిన ప్రకటన కాబట్టి, దీనిని కేవలం ఓ నిర్మాత ఆవేదనగానో, ఆక్రోశంగానో కొట్టి పారేయలేం.

తెలుగు సినిమా గతిని పరిశీలిస్తే, సినిమా నిర్మాణం పెత్తనం మొత్తం ఉంటే నిర్మాత చేతిలో ఉంటోంది. లేని పక్షంలో అగ్ర హీరోలు లేదా దర్శకుల చేతిలో ఉంటోంది. అంతే తప్ప సమిష్టి కృషి అన్నది అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. మరి ఇరవైనాలుగు కళల సమాహారమైన సినిమాని నిర్మించడం అన్నది పూర్తిగా ఒక వ్యక్తి అధీనంలో ఉంచడం (డబ్బు ఎవరిదైనప్పటికీ) ఎంతవరకూ సమంజసం? సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయనక్కరలేదా?

ప్రముఖ స్టూడియోలు సినిమాలు తీసిన రోజుల్లో, నటీనటులు, సాంకేతిక నిపుణులని నెల జీతానికి నియమించుకుని సినిమా పూర్తయ్యేవరకూ వాళ్ళ చేత పని చేయించుకునేవి. అలా వచ్చిన సినిమాల్లో హిట్టైన వాటి పుణ్యమాని అగ్ర కథానాయకులుగా వెలుగొందిన వాళ్ళు తర్వాతి కాలంలో సినిమాని శాసించారు. నిర్మాత మొదలు, కథారచయిత, కథానాయిక ఎంపిక వరకూ ప్రతి ఒక్కటి వారి కనుసన్నల్లో జరిగేది. కొన్ని సినిమాలు ఫెయిలవ్వడంతో, సదరు తారల ప్రభ కాసింత మసకబారడం, అదే సమయంలో కొత్త దర్శకులు తక్కువ బడ్జెట్ తో విజయాలు సాధించడంతో సినిమా నావకి దర్శకుడే చుక్కాని అనే ట్రెండ్ వచ్చింది.

తర్వాత జరిగిన శాఖాచంక్రమణాల్లో సినిమా నావ చుక్కాని అనేక చేతులు మారి మళ్ళీ దర్శకుల చేతుల్లోకి వచ్చింది. కాలంతో పాటు మారిన విలువలు డబ్బు విలువని మరింత పెంచేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకైనా వెనుకాడని నిర్మాతలు బయలుదేరారు. డబ్బు ఖర్చు విషయంలో నిర్మాతే రాజీ పడడం లేదు కాబట్టి, తనది కాని డబ్బుని ఖర్చు పెట్టడంలో దర్శకులూ రాజీ పడడం లేదు. ఒక్క సినిమా భారీ విజయం సాధించడంతో డబ్బు, అవకాశాలూ వచ్చి పడుతూ ఉండడంతో దర్శకులకి 'రేపు' గురించి ఆలోచన ఉండడం లేదు.

నిజానికి ఇప్పుడు సినిమా నిర్మాణంలో బాధ్యత ఎవరికి ఉంది? నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప సినిమా గురించి సమిష్టిగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. నిర్మాత ఖర్చుకి వెనకాడడు. దర్శకుడు ప్రతి ఫ్రేం నీ రిచ్ గా తీస్తాడు. హీరోకి తన సినిమా బడ్జెట్ తన పోటీ హీరో సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఆవిషయాన్ని తన అభిమానులు ఘనంగా చెప్పుకోవాలి. సినిమా షూటింగ్ ఎంత ఎక్కువ కాలం జరిగితే అంత గొప్ప.

తను డబ్బిచ్చి పెట్టుకున్న దర్శకుడు 'క్రిమి' గా మారాడన్న విషయం నిర్మాతకి మొదట్లోనే ఎందుకు తెలియలేదన్నది ప్రశ్న. రోజూ ఎంత షూటింగ్ జరుగుతోందో తెలుసుకుని, ఇంత మాత్రమే ఎందుకు జరుగుతోందని గట్టిగా అడిగితే, అదేదో "తోటకూర నాడే.." సామెతలా విషయం ఇంత దూరం రాదు కదా. హీరోకి నటన రాకపోవడం వల్ల అనో, హీరోయిన్ షూటింగుకి ఆలస్యంగా వచ్చిందనో, హాస్య నటుడు మధ్యలోనే షూటింగ్ ఎగ్గొట్టి వెళ్లి పోయాడనో... ఇలా తనకి ఎదురైన సమస్యని దర్శకుడు నిర్మాతకి చెప్పి ఉండేవాడు, ఇద్దరూ కలిసి పరిస్థితి చక్కదిద్దే వారు.

ఊహాత్మకమైన ప్రశ్నే అయినా, జవాబు కష్టం కాదు. ఎంత ఖర్చు చేయించినా, సినిమా విజయవంతం అయ్యి పెట్టిన డబ్బు పిల్లాపాపలతో తిరిగొస్తే, నిర్మాతకి దర్శకుడు 'క్రిమి' గా కాక 'దేవుడి'గా కనిపించి ఉండేవాడే కదా? ఇది దర్శకుడిని సమర్ధించడం కాదు. కానీ దర్శకుడిని మాత్రమే బాద్యుడిని చేయడం ఎంతవరకూ సబబు? దర్శకుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయడం సమర్ధనీయమేనా? టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడికి తెర వెనుక పెత్తనం ఎవరు చేశారన్నది అనవసరం. సినిమా బాగోకపోతే, టిక్కెట్ కి పెట్టిన డబ్బు వృధా అనిపిస్తే, ప్రేక్షకుడి దృష్టిలో అంతటి చెత్త సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరూ క్రిములే...

శుక్రవారం, డిసెంబర్ 03, 2010

తోచీతోచని కబుర్లు

ఏమిటో.. ఏమీ తోచకుండా ఉంది. అలా అని పని లేకుండా లేదు. ఉంటూనే ఉంది.. అయినా తోచీతోచకుండా ఉంది. ఏ తోడల్లుడి పుట్టింటికన్నా వెళ్దామంటే ఎవరూ లేరు మరి. 'తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది' అని కదా సామెత. మరి తోచీ తోచనయ్య చేయాల్సింది ఇదే కదా. చదవాల్సిన పుస్తకాలు 'మా సంగతేమిటి?' అని ప్రశ్నిస్తున్నాయ్. ఉన్నవి చాలనట్టు మొన్ననే ఓ చిన్న పుస్తక ప్రదర్శనకి వెళ్లి ఓ నాలుగు కొత్తవి తెచ్చా. లాభం లేదు, కొంచం స్పీడు పెంచాలి, చదివే విషయంలో.

పుస్తక ప్రదర్శన అంటే గుర్తొచ్చింది. ఓ కొత్త స్నేహితుడితో కలిసి వెళ్లాను పుస్తకాలు చూడ్డానికి. మేము తెలుగు పుస్తకాలు చూడడం పూర్తి చేసి ఇంగ్లీష్ సెక్షన్ వైపు వెళ్లాం. పాల్ కోయిలోనీ, చేతన్ భగత్ నీ మధ్యలో వదిలేసిన విషయం నేను గుర్తు చేసుకుంటుండగానే, "ఏడుతరాలు లేదా అంకుల్?" అని వినిపించింది వెనుక నుంచి. నన్నేమో అని తిరిగిచూశా కానీ, కాదు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు, మేనేజర్ని అడుగుతున్నారు. భలే సంతోషం కలిగింది. ఇద్దరూ నేరుగా కాలేజీ నుంచి వచ్చేసినట్టున్నారు. తెలుగు పుస్తకం, అందులోనూ ఏ వ్యక్తిత్వ వికాసమో కాకుండా 'ఏడుతరాలు' అడిగారు కదా మరి. మేమింకా పుస్తకాలు చూస్తుండగానే వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోయారు.

"జగన్ పార్టీ ఎలక్షన్లో గెలుస్తుందంటారా?" ఉదయాన్నే ఫోన్ పలకరింపు. నాకు "ఆలు లేదు, చూలు లేదు.." సామెత గుర్తొచ్చింది. ఏమిటో సామెతల మీద నడుస్తోంది బండి. ఇంకా పార్టీ పెట్టడం, ఎన్నికలు జరగడం ఏదీ లేదు కానీ, అప్పుడే ఫలితాల గురించి చర్చలు. వైఎస్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పైలట్ తాలూకు కుటుంబ సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావడం లేదు. అతని పిల్లలు కూడా "మా నాన్న పైలట్ కాబట్టి, ఎలాంటి శిక్షణా లేకుండానే మమ్మల్నీ పైలట్లు చేసేయాల్సిందే" అని ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదో మరి.

కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తే వినబడ్డ వ్యాఖ్యానాలు నవ్వు తెప్పించాయ్. "ముఖ్యమంత్రి మారినా కూరల రేట్లు తగ్గలేదు.." అనుకుంటున్నారు జనం. "సొరాజ్జం వస్తే మా ఊరి కానిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా" అంటూ 'కన్యాశుల్కం' లో బండి వాడి ప్రశ్న గుర్తొచ్చేసింది. ఎవరి సమస్యలు వాళ్ళవి మరి. అసలే ఓ పక్క మంత్రుల్ని బుజ్జగిస్తూ, కప్పల తక్కెడని బేలన్స్ చేయడంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రికి కూరల రేట్లు లాంటి చిన్న విషయాలు పట్టించుకునే తీరిక ఉంటుందా? వీళ్ళ పిచ్చి కానీ.

వంశీ 'మాపసలపూడి కథలు' ని సీరియల్గా తీస్తున్నారుట. మా గోదారి తీరంలోనే షూటింగ్ జరుగుతోందిట. త్వరలోనే మాటీవీ లో ప్రసారం అవుతుందిట. వర్ణన ప్రధానంగా సాగే కథలకి దృశ్య రూపం ఎలా ఇస్తారో చూడాలని కుతూహలంగా ఉంది. మరోపక్క వంశీ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' పేరుతో అలనాటి హిట్ 'లేడీస్ టైలర్' కి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. తన కొత్తపుస్తకం 'ఆకుపచ్చని జ్ఞాపకం' కొన్నాను, ఫోటో ఆల్బంలా అందంగా ఉందీ పుస్తకం. కథలన్నీ చదివేసినవే. మళ్ళీ ఓసారి తిరగేయాలి.

థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా రోజులయ్యింది. చూడాలనిపించే సినిమా ఏదీ కనిపించడం లేదు. నా టేస్ట్ లో ఏదో లోపం ఉందేమో మరి. కనీసం నిర్మాణం లో ఉన్న సినిమాలు కూడా ఏవీ చూడాలనే కుతూహలాన్ని కలిగించడం లేదు. రాబోయేకాలం అంతా డీవీడీలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చేలా ఉంది. శ్రీరమణ సంపాదకత్వంలో వస్తున్న 'పత్రిక' మాసపత్రిక తాత్కాలికంగా మూతపడిందని ఎక్కడో చదివి కలుక్కుమనిపించింది. మిత్రులొకరు ఇదే విషయం ధృవీకరిస్తూ మెయిల్ రాశారు. మంచి పత్రికలకి రోజులు కావేమో. ఈ పరిణామం ప్రభావం పరోక్షంగా అయినా వర్తమాన తెలుగు సాహిత్యం మీద ఉంటుందనే అనిపిస్తోంది. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా..