ఆదివారం, జులై 31, 2011

చేపలెగరా వచ్చు!!!

చేపలు ఏటికి ఎదురీదగలవు.. కానీ ఆనకట్టలని యెగిరి దూకలేవు. సహజ నదీ ప్రవాహాలని మానవావసరాల కోసం అడ్డుకుని, దారి మళ్ళించేందుకు నిర్మించే ఆనకట్టలు కొన్ని జాతుల చేపలకి శాశ్వితంగా మరణశాసనం రాసేస్తున్నాయి. అయితే, ఇలా అంతరించిపోతున్న మత్స్య జాతిని రక్షించుకునేందుకు కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జరుగుతున్న నష్టంతో పోల్చినప్పుడు ఈ ప్రయత్నాలు మాత్రం బహు స్వల్పమనే చెప్పాలి.

'సామన్' ఇది మన దేశపు చేప కాదు.. అమెరికన్ చేప జాతి. ఐరిష్, అమెరికన్ ప్రజల భోజనాల్లో మాత్రమే కాదు, జీవితాల్లోనూ సామన్ ఒక భాగం. ఒక ముఖ్యమైన భాగం. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల్లోనూ, గ్రేట్ లేక్ తదితర సరస్సుల్లోనూ కనిపించే ఈ అన్ హైడ్రస్ చేప, మంచి నీటిలో పుట్టి, సముద్రంలో పెరిగి, తిరిగి మంచినీటిలోనే సంతానాభివృద్ధి చేస్తుంది. తను మరణించి, తన సంతానానికి తొలి పౌష్టికాహారంగా మారిపోయే అరుదైన లక్షణం ఈ సామన్ చేపలది.

చిరు సామన్లకి సముద్ర వలసకి సిద్ధం అయ్యేందుకు అవసరమైన శారీరక మార్పులు సహజంగానే మొదలవుతాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల వ్యవధిలో పరిణతి చెంది, సంతానోత్పత్తికి సిద్ధమై తిరిగి సముద్రం నుంచి మంచి నీటికి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఇది సామాన్ల జీవన చక్రం. ఈ చక్రం ఆగిపోయింది. కారణం, నదులమీద కట్టిన ఆనకట్టలు. వాటి ఫలితంగా వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు. ఈ మార్పులు ప్రకృతి ధర్మాల్ని మార్చేశాయి. నియమాలని తిరగరాశాయి.

భారీగా నిర్మించిన ఆనకట్టల మీద నుంచి సామన్లని ఎగిరేలా చేయడం ఎలా? అమెరికన్ సమాజానికి ఎదురైన ఈ సవాల్ కి సాంకేతికంగా వచ్చిన జవాబు 'చేపల నిచ్చెన.' సియాటెల్ లో ఉన్న క్లార్క్ ఇంగ్లిష్ బొటానికల్ గార్డెన్ సమీపంలో, యూనియన్ సరస్సు, వాషింగ్టన్ సరస్సులని పసిఫిక్ మహాసముద్రం తీరప్రాంతం పగెట్ సౌండ్ తో కలుపుతూ నిర్మించిన చిట్టెన్డన్ లాక్స్ లో చూడొచ్చు ఈ చేపల నిచ్చెనని.

ఎక్కడో అమెరికాలో ఉన్న సామన్ చేప ఏమైపోతే మనకెందుకు? ఆ చేపని మిగుల్చుకోడం కోసం వాళ్ళు ఏం చేసినా, చేయకపోయినా మనకేమిటి సంబంధం? ...ఈ ఆలోచనలని వదిలించుకోవడం అవసరం. ఎందుకంటే, మనదైన పులసకూడా సామన్ బాటలోనే ప్రయాణించేందుకు రంగం సిద్ధం అవుతోంది. సరిగ్గా సామన్ లాంటి జీవచక్రమే పులసది. గోదారిపై రాబోతున్న ఆనకట్టలు పులస మనుగడని ప్రశ్నార్ధకం చేయబోతున్నాయి.

జలావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని 'దృశ్యాదృశ్యం' నవలని రాసిన రచయిత్రి చంద్రలత సామన్ చేపలగురించి రాసిన చిరుపుస్తకం 'చేపలెగరా వచ్చు!!!' రెండేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతి ముఖచిత్ర కథనంగా వచ్చిన వ్యాసానికి, 'దృశ్యాదృశ్యం' నవలలో పెద్దకట్ట నిర్మాణం కారణంగా అదృశ్యమై పోయిన చంద్రవంక చేపని గురించి రాసిన 'సెందర వొంక' చాప్టర్ ని జతచేసి వెలువరించిన పొత్తమిది. మనకి తెలిసిన జలచరాల వెనుక ఉన్న తెలియని సంగతులని విశదంగా చెప్పే ఈ పుస్తకాన్ని ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురించింది. (వెల రూ. 30. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

6 కామెంట్‌లు:

  1. మురళిగారు, గోదారి అమాయకపు పులసకి నిచ్చేనేక్కడం వచ్చో లేదో పాపం.

    మీరు కాంట్రాక్టర్లకు మాత్రం 'చేపల నిచ్చెన' మొదలగు కొత్త ప్రాజక్టుల పేర్లు చెప్పి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపుతున్నారు ;-)

    రిప్లయితొలగించండి
  2. మురళీగారు, చాలా బాగుంది. అమెరికా చేప గురించి మనకెందుకు అనే ఆలోచనని విడిచిపెట్టాలని మీరన్న మాట నాకు చాలా నచ్చింది. జీవితం విలువైంది.. అది ఎవరిదైనా సరే. ఈ భూమి మీద స్వేచ్ఛగా, ఆరోగ్యంగా బ్రతకడానికి మనిషికెంత హక్కుందో మిగతా జీవులకి అంతే ఉంది. భూమి మనుషుల కోసం మాత్రమే కాదు. కానీ మన స్వప్రయోజనాల కోసం ఈ గ్రహాన్ని పూర్తిగా ఆక్రమించేసి, ఇష్టమొచ్చినట్టు దీని రూపురేఖలు మార్చేస్తూ మిగతా జీవుల మనుగడని ప్రమాదంలో పడేస్తున్నాం. దీనికి ఏదో ఒకరోజు బ్రేక్ పడకపోతే చివరికి అంతమైపోయేది మానవజాతే.

    రిప్లయితొలగించండి
  3. @శ్రీ: సరదాగానే చెప్పినా నిజం చెప్పారు.. మనవాళ్ళు కచ్చితంగా ఇలాగే ఆలోచిస్తారనిపిస్తోంది.. ధన్యవాదాలండీ..
    @చాణక్య: నిజమేనండీ.. ఆలోచన మొదలవ్వాలి.. ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: ఈ బుక్ దొరికితే చదవండి.. అలాగే 'దృశ్యాదృశ్యం' కూడా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. వావ్! చేపలకీ ఇన్ని కష్టాలుంటాయా! పాపం అనిపించింది ఇది చదివితే! హ్మ్! మన పులస సంగతేంటో.... అమెరికావాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు మనవాళ్ళు కనీసం తీసుకుంటారా??? నాకైతే అనుమానమే!

    రిప్లయితొలగించండి
  5. @ఇందు: అయ్యో.. చేపల కష్టాలు అన్నీ ఇన్నీ కావండీ.. ముఖ్యంగా వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం, పెరిగిన వేట, ఫుడ్ చైన్ లో కొన్ని లింక్స్ మిస్ కావడం... చాలానే ఉన్నాయి.. పులస భవిత కష్టమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి