శుక్రవారం, జులై 08, 2011

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర

మనకి బాగా ఆత్మీయులైన వాళ్ళు మన ఇంటికి వస్తారు. వాళ్ళతో కబుర్లలో మనకి కాలమే తెలీదు. ఉన్నట్టుండి వాళ్ళు వెళతామని బయలుదేరతారు. "అప్పుడేనా? ఇంకాస్సేపు ఉండి వెళ్తే బాగుండును కదా," అనిపిస్తుంది మనకి. 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' చివరి పేజీలు చదువుతుంటే నాకు అచ్చం ఇలాగే అనిపించింది. అప్పుడే అయిపోయిందా? మరికొన్ని పేజీలు రాసి ఉండాల్సింది కదా అని..

నిజానికి నేనీ పుస్తకం చదివాను అనడం కన్నా, ఒక ఆత్మీయుడు తన జ్ఞాపకాలని ఒక్కొక్కటిగా చెబుతుంటే శ్రద్ధగా, కొండొకచో ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని విన్నానని చెప్పడం సబబు. 'జీవితాన్ని ఆస్వాదించడం' అంటే ఏమిటో వేంకటరమణ శాస్త్రిగారి దగ్గర నేర్చుకోవాలి. తృప్తిని మించిన ఆనందం మరొకటి లేదన్న సత్యాన్ని తెలుసుకున్న వారు కావడం వల్ల తను ఆనందంగా ఉండడమేకాకుండా, తన చుట్టూ ఉన్నవాళ్ళకీ సంతోషాన్ని పంచారు.

శాస్త్రి గారి తండ్రి ఇంట్లో చాలా రిజర్వుడు. బయట వాళ్ళతో ఎంత సరదాగా ఉంటారో, ఇంట్లో అంత గంభీరంగా ఉంటారు. ఆయన మొత్తం తన జీవిత కాలంలో కొడుకుతో మాట్లాడిన మాటలు పదికి మించవు. "మరేమీ కాదుగాని, తండ్రికి మరింత సన్నిహితంగా ఉండి, ఇంకా కొంత ఆనందం పొందే అవకాశం మనకి లేకపోయిందే అని మాత్రం అప్పుడప్పుడు ఇప్పటికీ అనుకుంటూంటాను," అని రాసుకున్నారు. ఈ అనుకోలు కేవలం శాస్త్రిగారి ఒక్కరిది మాత్రమే కాదు, గడిచిన తరాల్లో పుట్టిన ఎంతోమందిది.

సంస్కృతం చదువు నిమిత్తం పన్నెండేళ్ళ వయసులో, తల్లిదండ్రులని వదిలి తాతయ్య, నాయనమ్మల దగ్గర రెండేళ్ళ పాట్లు స్వగ్రామం మసకపల్లిలో ఉన్నారు శాస్త్రి గారు. గౌతమీ తీరంలో ఉన్న పచ్చని పల్లెటూరది. నాయనమ్మ వంట మొదలు పెట్టాక, అప్పుడీయన పెరట్లోకి వెళ్లి ఆవేళ వండాల్సిన కాయగూరలు కోసుకు వచ్చేవారు. వండగా మిగిలిన కాయగూరలని పశువులకి పెట్టాల్సిందే తప్ప మరోపూట వంటకి వినియోగించే ప్రసక్తే లేదు. అప్పుడే కోసిన కూరల్లో ఉండే రుచికి మరేదీ సాటిరాదని, నాయనమ్మతో పాటు ఆకాలం వాళ్ళందరి నమ్మకం.

స్వగ్రామంతో పాటుగా, ద్రాక్షారామ, కొంకుదురుల్లో చదువు ముగించుకుని, విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్ధిగా ప్రవేశించిన శాస్త్రి గారు, అదే కళాశాలలో అధ్యాపక వృత్తి ప్రారంభించి, అటుపై కొవ్వూరు, చిట్టిగూడూరు, విశాఖపట్టణాలలో నలభైఐదేళ్ళ పాటు వృత్తిలో కొనసాగి తన అరవైఐదో ఏట పదవీ విరమణ చేశారు. గురువుల పట్ల ఆయనకున్న గురి ఆశ్చర్య పరుస్తుంది. తను చేయాల్సిన ఉద్యోగం వంటి కీలక విషయాల్లో కూడా నిర్ణయాన్ని గురువులకే వదిలివేయడం, వారే తన శ్రేయస్సును కోరేవారన్న ఆయన నమ్మకం ఇప్పటి రోజుల్లో ఊహాతీతం. ఆ గురువులు ఈయన్ని సొంత కొడుకు కన్నా ఎక్కువగానే చూసుకున్నారు.

శాస్త్రిగారు సున్నితమైన మనిషి. ఒకరిని బాధ పెట్టని స్వభావం. శాంతం, సహనం ఉన్న మనిషే కానీ ఏ కోశానా కోపం అన్నది కనిపించదు. అలాగని లౌక్యం తెలియని వ్యక్తి కాదు. సెనేట్ ఎన్నికలు, జయపూర్ మహారాజుని అడిగీ అడగనట్టుగా పులితోలు అడిగి సాధించుకోవడం లాంటివి ఆయన లౌక్య ప్రజ్ఞని చెప్పకనే చెబుతాయి. సాధ్యమైనంతవరకూ తన చుట్టూ ఉన్నవాళ్ళని సంతోషంగా ఉంచాలన్న ఆయన స్వభావం శాస్త్రిగారికెందరినో మిత్రులని చేసింది. ఇక శిష్యులకి ఆయనపై ఉన్న గౌరవం, శాస్త్రిగారికి తన గురువుల పట్ల ఉన్న గౌరవానికి తక్కువదేమీ కాదు.

చిన్ననాడు రోజూ గడ్డ పెరుగు పంపిన గోవిందమ్మ మొదలు, గుంటూరులో రెండేళ్ళ పాటు అద్దెకున్న ఇంటి యజమాని, తన వాటాలో మేకులు కొట్టుకోడానికి సైతం శాస్త్రిగారి అనుమతి అడగడం, ఆపై ఆయన విశాఖ వెళ్ళిపోయాక గుంటూరికి పనిమీద వచ్చినప్పుడు అత్తవారింట ఉన్న తన కుమార్తెని సైతం రప్పించి సకుటుంబంగా స్వాగతం పలకడం లాంటివి చదివడం ద్వారా ఆయన సమ్మోహన శక్తిని అంచనా వేయొచ్చు. బహుశా ఈ శక్తే పాఠకులని ఈ పుస్తకం పట్ల ఆకర్షితులని చేస్తోందేమో.

సొంత విషయాలు బహు కొద్దిగా మాత్రమే ఉన్న ఈ స్వీయ చరిత్ర, వెనుకటి తరం గడిపిన భద్ర జీవితాన్ని ఓ ప్రశాంత చిత్తుడి నుంచి వినే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇద్దరూ సంస్కృత పండితులు, భాషా సేవకులు అవడం వల్లనేమో, ఈ పుస్తకం చదువుతుంటే ఆచార్య తిరుమల రామచంద్ర 'హంపీ నుంచి హరప్పా దాక' గుర్తొచ్చింది అక్కడక్కడా. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదించి తీరాల్సిన ఈ పుస్తకాన్ని తిరుపతికి చెందిన 'అభినవ ప్రచురణలు' ప్రచురించింది. పేజీలు 240, వెల రూ. 150. నాణ్యమైన ప్రచురణ. ఈ పుస్తకాన్ని గురించి బ్లాగ్ మిత్రులు మెహెర్ గారి టపా ఇక్కడ చదవొచ్చు.

5 కామెంట్‌లు:

  1. గుంటూరు ఇంటి యజమాని ఇంటరెస్టింగ్.
    చదవాల్సిన బుక్ అన్నమాట అయితే!

    రిప్లయితొలగించండి
  2. @హరిచందన: అవునండీ.. పుస్తకం మొత్తం ఆసక్తికరంగానే సాగింది కథనం.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: తప్పక ప్రయత్నించండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. కవిత్వాన్ని రాజసౌధాలనుంచి ప్రజల్లోకి తీసికొనివచ్చిన తొలితరం కవులలాగానే దురవగాహమైన వ్యాకరణదీధితిని విద్యారణ్యంలో నుంచి విద్యార్థిహృదయాలలోకి ప్రసరింపజేసిన మహామనీషి దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారి ఆత్మకథను హృద్యంగా సమీక్షించారు.

    తొలిముద్రణలోని అందమైన పీఠికాపద్యాలను "మేము మెట్లుగ వాణికి మేడcగట్టి, రాజిలిన మేస్త్రి వేంకటరమణశాస్త్రి" వంటివాటిని ఎన్నోసార్లు మననం చేసేవాళ్ళం. వాటన్నిటినీ తొలగించకుండా ఈ ముద్రణలోనూ చేర్చివుంటే మరింత బాగుండేది.

    మీకు నా అభినందనలు.

    ఏల్చూరి మురళీధరరావు, న్యూఢిల్లీ

    రిప్లయితొలగించండి
  4. @మురళీధర రావు ఏల్చూరి: తొలి ముద్రణ కోసం ప్రయత్నించాలని బలంగా అనిపించిందండీ మీ వ్యాఖ్య చదివాక. అసలు తొలి ముద్రణ తాలూకి వివరాలే ఇవ్వలేదు వీళ్ళు.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి