గురువారం, నవంబర్ 08, 2018

మాస్తి చిన్న కథలు

'మాస్తి కన్నడిగులు ఆస్తి' అని కర్ణాటకలో ఒక వాడుక. మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జన్మించిన రెండు నెలల తర్వాత మైసూరు సంస్థానంలోని తమిళ బ్రాహ్మణ కుటుంబలో జన్మించిన మాస్తి వేంకటేశ అయ్యంగార్ కి ఆధునిక కన్నడ కథా రూపశిల్పిగా పేరుంది. 'చిక్కవీర రాజేంద్ర' నవలా రచనకు గాను ప్రతిష్ఠాత్మకమైన 'జ్ఞానపీఠ' బహుమతిని పొందారు. కన్నడ ప్రభుత్వం మాస్తి పేరిట ఒక సాహిత్య అవార్డుని ఏర్పాటు చేయడమే కాక, ఆయన ఇంటిని లైబ్రరీగా మార్చి నిర్వహిస్తోంది. కొడగు ప్రాంతంలో ఆయన పేరిట ఒక పాఠశాలని కూడా నడుపుతోంది. సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై, మైసూరు సంస్థానంలో ఉన్నతోద్యాగాలు చేసిన మాస్తి, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విశేషశమైన రచనలు చేశారు.

కన్నడలో వెలువరించిన 'మాస్తి చిన్నకథలు' సంపుటి సాహిత్య అకాడమీ బహుమతిని అందుకుంది. ఆ కథల్ని తెలుగులోకి అనువదింపజేసి, ప్రచురించి, మార్కెట్ చేసే బాధ్యతలని అకాడెమీనే స్వీకరించింది. ఈ సంపుటిలోని ఇరవైనాలుగు కథల్లోనూ చెప్పుకోవాల్సిన విశేషం వస్తు వైవిధ్యం. చిన్ననాడు తాను విన్నకథలు మొదలుకొని, తన జీవిత అనుభవాలు, కాలక్రంమలో విన్న విశేషాలు, చదివిన సాహిత్యంలో తనని ఆకర్షించిన అంశాలని కథలుగా మలిచారు రచయిత. ప్రధమ ప్రచురణ తేదీలని పేర్కొనకపోవడం ప్రచురణకర్తలు లోపమే కానీ, కథలు చదువున్నప్పుడు దాదాపు అలాంటి నేపథ్యంతోనో, లేక అలాంటి పాత్రలతోనో నూరేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన కథలు గుర్తు రాక మానవు.

పుస్తకంలోని ఇరవై నాలుగు కథల్నీ నాలుగు విభాగాలుగా చూడొచ్చు. రచయిత తన బాల్యంలో విన్న విషయాలు, తనకి ఎదురైన అనుభవాలు, పురాణ కథల ప్రేరణతో రాసినవి, విదేశీ సాహిత్యం స్పూర్తితో రాసిన కథలు. 'మునీశ్వరుడి చెట్టు,' 'చెన్నమ్మ,' 'పిన్నమ్మ,' 'సంజీవయ్య కల,' ' దివాణం ఆచార్యులు' కథలు రచయిత తన బాల్యంలో విన్నవిగా అనిపిస్తాయి. వీటిలో 'చెన్నమ్మ' చదువుతూ ఉంటె మన కొకు రాసిన రెండుమూడు కథలు జ్ఞాపకం వస్తాయి. 'పిన్నమ్మ' కథని ఓ పట్టాన మర్చిపోలేం. పాలకుడైన రాజుకి, ఆచార్యుడికి మధ్య ఉండాల్సిన సంబంధాన్ని వివరించి చెప్పే కథ 'దివాణం ఆచార్యులు,' కాగా ఓ దంపతుల కథ 'మునీశ్వరుడి చెట్టు.' ఇక, 'సంజీవయ్య కల' ఓ సరదా కథ.


రచయితవి లేదా ఆయన స్నేహితుల జీవితానుభవాలుగా అనిపించే కథలు 'కుక్క బ్రతుకు,' 'ఆంగ్ల నౌకా క్యాప్టెన్,' 'కాకిలోకం,' 'నాలుగో అధ్యాయం,' 'కొత్తరకం దాంపత్యం,' 'చట్టికారుడి తల్లి.' వీటిలో 'ఆంగ్ల నౌకా క్యాప్టెన్' కథ నాటి భారతీయ, విదేశీ సమాజపు విలువలని పోల్చే ప్రయత్నంగా అనిపిస్తుంది. 'చట్టికారుడి తల్లి'  బ్రిటన్ పురుషుడి వల్ల తల్లైన భారతీయ స్త్రీ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలని చిత్రించిన కథ. 'కుక్క బ్రతుకు' 'కొత్తరకం దాంపత్యం' కథల్లో ఏ పోలికా లేకపోయినా ఆ రెంటి మధ్యా ఏదో అంతస్సూత్రం ఉన్నట్టే అనిపిస్తుంది. చలం 'బుజ్జిగాడు' వగయిరా రచనల్ని గుర్తు చేసే కథ 'కాకి లోకం.'

ఇక పురాణ కథల స్పూర్తితో రాసిన కథలు 'చీమల లోకం,' 'కుచేలుడి భాగ్యం,' 'మంత్రోదయం.' వీటిలో 'చీమలలోకం' కథ రామాయణం నుంచి తీసుకున్నది. కైకేయి తండ్రి కేకయరాజుకి అన్ని జీవరాశుల భాషలనీ అర్ధం చేసుకునే వరం ఉంది. చీమల భాష తెలియడం వల్ల, వాటి జీవన విధానాన్ని అధ్యయనం చేశాడాయన. ఈ అధ్యయనానికి, రామాయణ కథకీ అందమైన ముడి వేశారు మాస్తి. అందరికీ తెలిసిన కృష్ణ-కుచేలుర కథనే కొత్తగా చెప్పారు 'కుచేలుడి భాగ్యం' కథలో. ఓ మహర్షి జీవితంలోని కట్ట కడపటి రోజుని చిత్రించిన కథ 'మంత్రోదయం.' ఆశ్రమ జీవిత వర్ణన, పాఠకుల్ని నేరుగా ఆశ్రమంలోకి తీసుకుపోయేదిగా ఉంది.

విదేశీ సాహిత్యం స్పూర్తితో పది కథల్ని రాశారు మాస్తి. రోమ్ దేశపు సత్యవాది 'సంయమి కేటో' ఓ ధర్మ నిరతుడి కథ. ఈజిప్ట్ రాజవంశీకులు రాచరక్తం కల్తీ కాకుండా ఉండడం కోసం సోదరీసోదరుల మధ్య వివాహం జరిపించిన వైనాన్ని వివరించే కథ 'రాణి హాట్ సిటో.' తన తమ్ముడిని వివాహం చేసుకున్న ఈ రాణీ, తన కుమార్తెకి కొడుకునిచ్చి వివాహం చేస్తుంది! 'చెడ్డకాలం' (రోమ్), 'నేషహువల్ కోయోటిల్' (మెక్సికో), 'విచిత్ర ప్రేమ,' (ఫ్రాన్స్), 'నర్తకి పరాభవం' (రష్యా), 'పేరు చావదు' (గ్రీక్), 'ధర్మ కింకరుడు ఫట్స్ స్టీఫన్' (ఇంగ్లాండ్), 'యాన్ షేక్స్ పియర్' (ఇంగ్లాండ్), 'టాల్ స్టాయ్ మహర్షి భూర్జ వృక్షాలు' (రష్యా) కథలు ఆయా దేశాల విశేష వ్యక్తుల జీవితాలని పరిచయం చేస్తాయి. చివరి రెండూ, షేక్స్ పియర్, టాల్ స్టాయ్ లని గురించి ఆసక్తి కరమైన విశేషాలు చెబుతాయి. ఇక 'విచిత్రప్రేమ' కథ తెలుగులో వచ్చిన నాలుగైదు నవలలకు ముడి దినుసు!!

జీఎస్ మోహన్ తెలుగు అనువాదం సరళంగా ఉంది. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారికి బాగా నచ్చే సంకలనం ఇది. (పేజీలు 311, వెల రూ. 125, సాహిత్య అకాడమీ స్టాళ్లలో లభ్యం). కథలు చదువుతున్నంతసేపూ, మాస్తికి దక్కిన గౌరవంతో కొంచమైనా శ్రీపాదకి ఇక్కడ దొరకలేదు కదా అని పదేపదే అనిపించింది.

మంగళవారం, అక్టోబర్ 23, 2018

పతంజలి మోనోగ్రాఫ్

సాహిత్య అకాడమీ చేస్తున్న మంచిపనుల్లో ఒకటి 'భారతీయ సాహిత్య నిర్మాతలు' అనే సిరీస్ లో ప్రముఖ రచయితలు, రచయిత్రుల మోనోగ్రాఫ్స్ వెలువరించడం. ఈ క్రమంలో వచ్చిన పుస్తకం విఖ్యాత రచయిత కె.యెన్.వై. పతంజలి ని గురించి కథా, నవలా రచయిత చింతకింది శ్రీనివాసరావు చేత రాయించిన మోనోగ్రాఫ్. పతంజలి పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడే కాక, పతంజలి వీరాభిమానీ మరియు ఆ పరంపరకి చెందిన రచయితగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న చింతకింది అత్యంత భక్తిశ్రద్ధలతో చేసిన రచన ఇది. పతంజలి రచనలు, ఇంటర్యూలు, ఇతరులు వెలిబుచ్చిన అభిప్రాయాలు సవివరంగా చదివిన వాళ్లకి కూడా కొత్త విషయాలు చెప్పే విధంగా ఈ రచన సాగడం విశేషం.

పతంజలి రచనల్ని తలచుకోగానే మొదట గుర్తుకొచ్చేది వ్యంగ్యం. 'రాజుగోరు' మొదలు 'రాజుల లోగిళ్ళు' వరకు, 'ఖాకీవనం' మొదలు 'గెలుపు సరే, బతకడం ఎలా' వరకూ పతంజలి ఏ ప్రక్రియలో రచన చేసినా ఆయన వాక్యాల మధ్య వ్యంగ్యం తొంగిచూస్తూ ఉంటుంది. చేదునిజాలకి చక్కెరపూతగా ఉపయోగపడింది. ఆ వ్యంగ్యమే లేకపోతే 'గోపాత్రుడు' నవ్వించడానికి ముందే ఏడిపించేసి ఉండేవాడు. 'వీరబొబ్బిలి' వెలుగు చూసేదే కాదు. తెలుగు సాహిత్యానికి చాలా చాలా నష్టం జరిగిపోయి ఉండేది. మరి, ఆ వ్యంగ్యం పతంజలి ఎలా అబ్బింది? తెచ్చిపెట్టుకున్నదిగా కాక, సహజాతంగా ఎలా అమిరింది? ఈ ప్రశ్నలకి జవాబిచ్చారు చింతకింది శ్రీనివాసరావు.

పతంజలి భూస్వామ్య నేపధ్యం మొదలు, ఉత్తరాంధ్ర సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల వరకూ ఆ వ్యంగ్యం తాలూకు చరిత్రలో భాగాలే అని బల్లగుద్ది చెబుతారు రచయిత. రాచరికాలు, జమీందారీలు కోల్పోయిన క్షత్రియ కుటుంబంలో పుట్టిన కుర్రాడికి తండ్రిగారి సాహిత్యాభిలాష కారణంగా చిన్ననాడే పుస్తకాలతో పరిచయం ఏర్పడడం, పాఠకుడి నుంచి రచయితగా పరిణమించడానికి అట్టే సమయం తీసుకోకపోవడం లాంటి విశేషాలు, ఈ మోనోగ్రాఫ్ చదవకపోతే ఎలా తెలుస్తాయి? బంధువులు, మరీ ముఖ్యంగా మేనమామ ప్రభావం లాంటి వివరాలని విశదంగా అక్షరీకరించారు ఈ పుస్తకంలో.
కేవలం కుటుంబ నేపధ్యం, చదివిన పుస్తకాలు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాతావరణం, మరీ ముఖ్యంగా సామాజిక పరిస్థితులు రచయిత మీద ప్రభావం చూపిస్తాయి. పతంజలి కలం పట్టిన నాటి సాహితీ, సామాజిక వాతావరణాలని రేఖామాత్రంగా స్పృశిస్తూనే 'కన్యాశుల్కం' నాటకం, చాగంటి సోమయాజులు (చాసో) పతంజలి పై వేసిన ముద్రని ప్రస్తావించడం మర్చిపోలేదు. కాలక్షేప సాహిత్యం పుష్కలంగానూ, ఉద్యమ సాహిత్యం తగుమాత్రంగానూ వెలుగుచూస్తున్న ఆ కాలంలో కలం పట్టి, ఈ రెండూ కాకుండా తనదైన కొత్త మార్గాన్ని నిర్మించుకున్న రచయిత పతంజలి. రచయితగా పతంజలి పరిణామ క్రమాన్ని కూడా ఆయా రచనలు వెలువరించిన కాలంనాటి పరిస్థితులతో బేరీజు వేసి చెప్పడం ద్వారా, పతంజలి రచనల ప్రత్యేకతని అరటిపండు ఒలిచినట్టుగా వివరించారు.

కాలేజీ మేగజైన్ కి రాసిన కథల మొదలు, నవలలు, నవలికల వరకూ పతంజలి ప్రతి రచన తాలూకు నేపద్యాన్నీ సేకరించిన రచయిత కృషిని మెచ్చుకోవాలి. నిజానికి పతంజలికి కథల వల్ల కన్నా నవలల వల్లే ఎక్కువ పేరొచ్చింది. రాసిన కథలు కూడా తక్కువే. 'చూపున్న పాట' కథ ఎక్కువమందికి చేరింది. 'ఖాకీవనం' 'పెంపుడు జంతువులు' నవలల మీద రావిశాస్త్రి ప్రభావం మొదలు, 'రాజుగోరు' నుంచీ పతంజలి సొంత శైలి నిర్మించుకోవడం వరకూ జరిగిన పరిణామ క్రమాన్ని బాగా పట్టుకున్నారు చింతకింది. అయితే, 'కన్యాశుల్కం' స్పూర్తితో పతంజలి రాసిన వాక్యాలు అనేకం ఉన్నా, స్థలాభావం వల్ల కావొచ్చు, కొన్నింటిని మాత్రమే ప్రస్తావించారు.

పత్రికా రచయితగా పతంజలి రాసిన సంపాదకీయాలు, చేసిన ఇతర రచనల్ని గురించి చెప్పారు కానీ 'వీరబొబ్బిలి' ని 'డాగీష్ డాబ్లర్' పేరుతో ఇంగ్లీష్ చేయడాన్ని గురించిన (తన రచనే కాబట్టి అనువాదం అనకూడదు కదా) వివరాలు మోనోగ్రాఫ్ లో లేకపోవడం చిన్నలోటే. పతంజలి రాసిన కవితకి, ఇచ్చిన ఇంటర్యూలకి చోటిచ్చారు చివర్లో. అలాగే, పతంజలిని గురించి కొందరు ప్రముఖులు రాసిన ఆత్మీయ వ్యాసాలు గతంలో చదివినవే అయినా మళ్ళీ చదువుకోవడం బాగుంది. మొత్తం మీద చూసినప్పుడు, శిఖర సమానమైన పతంజలి సాహిత్య సర్వస్వాన్ని 127 పేజీల చిన్న పుస్తకంలో అద్దంలో చూపించే ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తిచేసిన చింతకింది శ్రీనివాసరావుని, చేయించిన సాహిత్య అకాడెమీని అభినందించాల్సిందే. (వెల రూ. 50, సాహిత్య అకాడెమీ స్టాల్స్ లో లభ్యం).

శుక్రవారం, అక్టోబర్ 19, 2018

ఆవరణ

"సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచ స్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు.." అంటారు సుప్రసిద్ధ కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య (ఎస్. ఎల్) భైరప్ప తన నవల 'ఆవరణ' కి రాసిన ప్రవేశికలో. 2007 లో తొలిసారి ప్రచురితమైన ఈ కన్నడ నవల 2015 నాటికి నలభై రెండు పునర్ముద్రణలు పొందింది. ఎమెస్కో సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ లో తెలుగు అనువాదాన్ని మార్కెట్లోకి తెచ్చింది.

చరిత్ర రచనని ఇతివృత్తంగా తీసుకుని రాసిన రాసిన ఈ నవలలో రచయిత రెండు కథలని పడుగు పేకలుగా అల్లారు. మొదటిది రజియాగా మారిన కథానాయిక లక్ష్మి కథ కాగా, రెండవది చరిత్రని ఎంతో ఆసక్తితో పరిశోధించిన ఆమె తండ్రి నరసింహయ్య ఒక పుస్తకాన్ని రచించడం కోసం తయారుచేసి పెట్టుకున్న నోట్సు. రెండు కథలూ సమాంతరంగా నడిచి ఒకే సారి ముగింపుకి చేరుకునే విధంగా రూపుదిద్దడం వల్ల నవల ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ తలెత్తే అనేకానేక ప్రశ్నల్లో చాలావాటికి నవల చివర్లో రచయిత ఇచ్చిన పుస్తకాల జాబితా జవాబుని అందిస్తుంది.

కర్ణాటకలోని కునిగళ్ ప్రాంతానికి చెందిన నరసింహయ్య కూతురు లక్ష్మి. మొదటినుంచీ తండ్రి నుంచి ప్రోత్సాహం ఉండడంతో, డిగ్రీ తర్వాత ఆమె ఫిలిం మేకింగ్ కోర్సులో చేరుతుంది. అక్కడే ఆమెకి అమీర్ పరిచయం అవుతాడు. కొన్నాళ్ళకి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఊహించని విధంగా నరసింహయ్య ఆ వివాహానికి అభ్యంతరం చెబుతాడు. "రేపు నీకు పుట్టే పిల్లలు దేవాలయాలని ధ్వంసం చేసేవాళ్ళు అవుతారు" అంటాడు. తండ్రితో బంధం తెంచుకుని అమీర్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది లక్ష్మి.

అమీర్ తనకి మతం మీద పెద్దగా నమ్మకం లేదనీ, కానీ తన తల్లిదండ్రుల కోసం ఆమె ఇస్లాం తీసుకోక తప్పదనీ స్పష్టంగా చెబుతాడు. కేవలం పెద్దలకోసం చేసుకోవాల్సిన సర్దుబాటు కాబట్టి ఆమె అంగీకరిస్తుంది. ఆమె ఊరివాడే అయిన అభ్యుదయవాద మేధావి వర్గానికి చెందిన ప్రొఫెసర్ శాస్త్రి లక్ష్మి నిర్ణయాన్ని అభినందిస్తాడు. రజియాగా మారి అమీర్ ని వివాహం చేసుకుంటుంది. వివాహం తర్వాత ఆమె మీద ఆంక్షలు మొదలవుతాయి. వస్త్రధారణ మొదలు, నిత్యం క్రమం తప్పకుండా నమాజు చెయ్యడం వరకూ అమీర్ ఇంటి ఆచారాలు అన్నీ పాటించాల్సి వస్తుంది. ఒకే ఒక్క ఊరట ఏమిటంటే, ఆమె సినిమాల్లో పని చేయడానికి అభ్యంతర పెట్టరు ఇంట్లోవాళ్ళు.


సృజనాత్మక రంగంలో స్త్రీలు తక్కువగా ఉన్న రోజులు కావడంతో పాటు, వాళ్ళ ఆదర్శ వివాహం కూడా ఒక ఆకర్షణగా మారి అమీర్-రజియాలకి ఎక్కువ అవకాశాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. వాళ్ళకి పుట్టిన బిడ్డ నజీర్ తాతయ్య-నాయనమ్మల పర్యవేక్షణలో పెరిగి పెద్దవాడవుతాడు. బాబ్రీ మసీదు అల్లర్ల నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజల మధ్య ఆవేశాలు పెరగకుండా ఉండడం కోసం కొన్ని ప్రచార చిత్రాలు నిర్మించాలని సంకల్పించి, ఆ ప్రాజెక్టుని అమీర్-రజియాలకి అప్పగిస్తుంది. మొదటి డాక్యుమెంటరీ హంపీ శిధిలాలను గురించి. హంపి శిధిలమవ్వడానికి కారణం ముస్లిం నాయకులు కాదు, శైవ-వైష్ణవ శాఖల మధ్య వైరమే అని చెప్పే విధంగా ఉండాలని ఆదేశాలు వస్తాయి. రజియా స్క్రిప్ట్ రాస్తే అమీర్ నిర్మాణం, దర్శకత్వం చూడాలి. కానీ, ఆమె స్క్రిప్ట్ రాయలేకపోతుంది.

అదే సమయంలో తన తండ్రి నరసింహయ్య మరణ వార్త తెలియడంతో సొంతూరికి ప్రయాణమవుతుంది రజియా. కూతురి వివాహం తర్వాత, నరసింహయ్య తన జీవితమంతా పరిశోధనల్లోనే గడిపాడనీ, ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల్ని విశేషంగా పరిశోధించి ఒక పుస్తకం రాసేందుకు నోట్సు తయారు చేసుకున్నాడనీ తెలుస్తుంది ఆమెకి. అంతే కాదు, ఇల్లు, ఆస్తి కూతురి పేరే పెట్టి మరణిస్తాడు నరసింహయ్య. తండ్రికి తాను ఏకైక సంతానం కనుక ఆస్థి నిమజ్జనం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని భావిస్తుంది రజియా. అందుకోసం, ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ లక్ష్మిగా మారుతుంది. ఆస్థి నిమజ్జనం అనంతరం తండ్రి రాసిన నోట్సు చదవడం మొదలు పెడుతుంది.

ముస్లింలు బందీలుగా పట్టుకెళ్లిన ఒక రాజపుత్రుడి కథ అది. అతన్ని నపుంసకుడిగా మార్చి, అనేక లైంగిక దాడులు చేసి, అనంతరం రాణివాసపు జనానాలో పనివాడిగా చేరుస్తారు. ఔరంగజేబు పాలనని దగ్గర నుంచి చూసిన ఆ రాజపుత్రుడి అనుభవాలు ఒక పక్క, భర్త నుంచి, కొడుకు నుంచి, ప్రొఫెసర్ శాస్త్రి నుంచి అనేకరూపాల్లో లక్ష్మి ఎదుర్కొన్న ఒత్తిడులు మరోపక్క సాగుతూ కథనాన్ని వేగంగా నడిపిస్తాయి. నజీర్ ఛాందసం, శాస్త్రి ఆలోచనలు-ఆచరణల మధ్య బోలుతనం, మతానికి, భార్యకి మధ్య అమీర్ సంఘర్షణ, తండ్రి యెడల లక్ష్మికి కలిగే పశ్చాత్తాపం ఇవన్నీ పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తాయి. అరిపిరాల సువర్ణ తెలుగు అనువాదం ఏమాత్రం సాఫీగా లేదు. తాను శ్రమ పడి, పాఠకుల్ని శ్రమ పెట్టారు అనువాదకురాలు.

చరిత్రని సమగ్రంగా అర్ధం చేసుకోవాలి అంటే నాణేనికి రెండువైపులా చూడాలి అని నమ్ముతాన్నేను. నవల ప్రాతిపదికలోనే ఇది వామపక్ష దృష్టికోణపు చరిత్ర మీద ఎక్కుపెట్టిన విమర్శ అని తేటతెల్లం అవుతుంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పారు భైరప్ప. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు కావడంతో కథనం ఆసాంతమూ బిగువుగా సాగింది. మతం-రాజకీయాలు-కళలు పరిధిలోనే మొత్తం నవలంతా సాగింది. ప్రధానకథ, ఉపకథా పోటాపోటీగా సాగాయి. చరిత్రని గురించి భిన్న కోణాన్ని తెలుసుకోవాలి అనుకునే వారు తప్పక చదవాల్సిన నవల ఇది. (పేజీలు 328, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, అక్టోబర్ 15, 2018

కొత్తనీరు

మూడున్నర  దశాబ్దాల పాటు అప్రతిహతంగా కథలూ, సాహిత్య విమర్శా చేసిన రచయిత ఉన్నట్టుండి బ్రేక్ తీసుకోడంలో విశేషం లేదు. కానీ, ఆ విరామం పుష్కర కాలం పాటు సాగడమూ, అనంతరం కలంపట్టి ఒకే ఏడాదిలో ఏకంగా 22 కథలూ, వంద వ్యాసాలూ రాసేయడం మాత్రమే కచ్చితంగా విశేషమే. 'విహారి' అనే కలంపేరుతో ప్రసిద్ధులైన ఆ రచయిత పేరు జె.ఎస్. మూర్తి. ఒకే ఏడాది (2007) లో రాసిన 22 కథల నుంచి 15 కథల్ని ఎంచి 'కొత్తనీరు' పేరిట సంకలనంగా ప్రచురించారు. ఈ సంకలనంలోని కథల్లో బాగా ఆకర్షించే విషయం వస్తు వైవిధ్యం. తాను ఎప్పుడూ ఎంచుకునే మధ్యతరగతి జీవితం తాలూకు ఇతివృత్తాలే అయినా, ఏ రెండు కథావస్తువులకీ పోలిక లేకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సంపుటంలో మొదటి కథ 'కొత్తనీరు.' వృద్ధుడైన తన తండ్రికీ, ఈ తరం ప్రతినిధులైన తన పిల్లలకీ (సంపాదనపరురాలైన కూతురు, ఇంజినీరింగ్ చదువుకుంటున్న కొడుకు)  ఇంట్లో నిత్యం జరిగే ఘర్షణని పరిష్కరించలేని ఓ నడివయసు గృహస్థు కథ. అతడికి తన తండ్రి గురించి ఎంతగాబా తెలుసో, తన పిల్లల్ని గురించి అంతకన్నా బాగా తెలుసు. వాళ్ళమధ్య సామరస్య వాతావరణం ఏర్పాటు చేయడం అన్నది తనకి సాధ్యమయ్యే పని కాదు అనే నిర్ణయానికి వచ్చేసిన సమయంలో, వృద్ధ తండ్రి సమస్యకి 'పరిష్కారాన్ని' వెతకడం ముగింపు. నిజానికి తన తండ్రి నిర్ణయం కన్నా, దాని పట్ల తన పిల్లల ప్రతిస్పందన ఆందోళనకి గురిచేస్తుంది ఆ గృహస్తుని.

సాహిత్యం తాలూకు ప్రభావం సమాజం మీద ఏరూపంలో పడే అవకాశం ఉందో చెప్పే కథ 'అవ్యక్తం.' రచయితలు తమ పాత్రలకి ఇచ్చే ముగింపుల కన్నా, మనుషులు తమకి ప్రియమైన వారి విషయంలో తీసుకునే  నిర్ణయాలు భిన్నంగా ఉంటాయని చెబుతుందీ కథ. సినీ నటుడు రంగనాథ్ జీవితం (బలవన్మరణం కాదు) ఈ కథకి కొంత స్ఫూర్తి ఇచ్చి ఉండొచ్చు బహుశా. మానవ-ఆర్ధిక సంబంధాలను మరో మారు చర్చించిన కథ 'శేషప్రశ్నలు.' ఓ నిత్య అసంతృప్త వాది కథ 'మిస్టర్ ఆక్రోశం.' ఇలాంటి వాళ్ళు అన్నిచోట్లా  కనిపిస్తూనే ఉంటారు, సామాజిక మాధ్యమాలతో సహా.


భర్త చేతిలో హింసలకు గురయ్యే ఓ ఉద్యోగిని కథ 'రెండో సముద్రం.' ఇప్పుడొస్తున్న అనేకానేక 'స్త్రీవాద' కథల్లాగే ఉంది. మామూలు కథే అయినా, కథనం ఆసక్తికరంగా సాగింది. ఈజీ మనీ వెంట తాను పరుగులు పెట్టి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసే వ్యక్తి కథ 'కొత్త పాఠం.' ఆ వ్యక్తి జీవితం అతని కొడుక్కి పాఠం కావడం ముగింపు. ఇక, నగరంలో ఉన్న కొడుకుని చూసేందుకు పల్లెనుంచి వచ్చిన ఓ తండ్రి కథ 'ఉభయకుశలోపరి. కథనంతో పాటు, ముగింపు కూడా చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. మిఠాయి కొట్టు యజమాని ఓ వారసుణ్ణి దత్తత చేసుకోడానికి చేసుకున్న ఏర్పాట్లు ఏ మలుపు తిరిగాయో చెప్పే కథ 'రుచుల జాడ.'

మిగిలిన కథలకి భిన్నంగా సాగిన కథ 'వంకర గీతలు.' ఎక్కడా నాటకీయత కనిపించకుండా సాగే ఈ కథ చదువుతుంటే, పాఠకులు కూడా కథకుడితోపాటు సిటీ బస్సు లో ప్రయాణం చేస్తున్న అనుభూతి పొందుతారు. "ఆధునికత తెచ్చిన సాంకేతిక పరిణామాలు జీవితాలను అపారంగా వృద్ధి చేస్తున్నాయి అంటున్నారు కానీ, పూసల్లో దారం లాంటి విశ్వాసం ఏది?" అన్న కథకుడి ప్రశ్న ఆలోచింపజేస్తుంది. వృద్ధాశ్రమాల్లో ఉండే జంటల కథ 'గూడు-నీడ. ఒక్కో జంటది ఒక్కో కథ. పిల్లలు వెనక్కి పిలిస్తే బాగుండుననే ఆశతో ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, పిలుపు వచ్చినా వెళ్ళడానికి ఇష్ట పడని తల్లిదండ్రులు మరికొందరు.

'సిద్ధము సుమతీ,' 'రెండర్ధాల పాట' ఈ రెండు కథలూ నిరుద్యోగ/చిరుద్యోగ సమస్యని చర్చించినవి. ప్రపంచీకరణ ఫలితంగా జాబ్ మార్కెట్లో పెరిగిన పోటీని, పల్లెటూరి నేపధ్యం నుంచి వచ్చిన యువత నగరాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎదుర్కొనే సమస్యలనీ చిత్రించారు రచయిత. మొదటి కథలో నాయకుడికి అతన్ని పెళ్లాడబోయే యువతి సాయం అందిస్తే, రెండో కథలో మార్కెటింగ్ ఉద్యోగంలో ఇమడలేని కుర్రాడు మార్గాంతరం వెతుక్కోడానికి ప్రయత్నం చేస్తాడు. 'భూ మధ్యరేఖ' కథ ఈజీ మనీ, ఆస్థిపంపకాల ఇతివృత్తంతో సాగితే, 'ఎదురద్దాలు' ఏ కాలానికైనా సరిపోయే కథ/స్కెచ్. చివరి కథ 'భ్రష్ట యోగి' పాఠకులకి చిన్న ఉలికిపాటునీ, "ఇలాంటి వాళ్ళు మనకీ తెలుసు" అన్న భావననీ కలిగిస్తుంది.

మొత్తం మీద చూసినప్పుడు, సమకాలీన ఇతివృత్తాలని ఎంచుకొని రాసిన ఈ కథలన్నీ ఆసాంతమూ చదివిస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి కూడా. ఎక్కడా తీర్పులు చెప్పే పని పెట్టుకోకుండా కథలని మాత్రమే చెప్పారు విహారి. కథకులు మునిపల్లె రాజు, పోరంకి దక్షిణామూర్తి రాసిన ముందు మాటలు అచ్చంగా ఆప్తవాక్యాలే. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లు చదవదగ్గ పుస్తకం. (పేజీలు 127, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, అక్టోబర్ 13, 2018

స్థానం నట జీవన ప్రస్థానం

తెలుగు రంగస్థలంతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికీ కూడా స్థానం నరసింహారావుని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. "మీరజాలగలడా నా యానతి, నటవిధాన మహిమన్ సత్యాపతి" పాటని జ్ఞాపకం చేస్తే చాలు, సత్యభామ ఠీవీ ఆ వెనుకే ఆ పాత్రకి రంగస్థలం మీద ప్రాణం పోసిన స్థానం నటనా గుర్తొచ్చేస్థాయి. ఆయన నాటకాలని నేరుగా చూసిన వాళ్లకి మాత్రమే కాదు, వాటిని గురించి పరోక్షంగా విన్నవారికి కూడా చిరపరిచితుడైపోయిన నటుడు స్థానం నరసింహారావు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన కాలంనాటి సామాజిక, రంగస్థల పరిస్థితులు, గొప్ప నటుడిగా పేరుతెచ్చుకోవడం వెనుక ఆయన చేసిన కృషి తదితర విషయాలని వివరించే పుస్తకం ఆచార్య మొదలి నాగభూషణ శర్మ రాసిన 'నటకావతంస స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం.'

గుంటూరు జిల్లా బాపట్ల లోని ఒక పేద కుటుంబంలో 1902 సెప్టెంబరు 23న జన్మించిన స్థానం నరసింహారావు కుటుంబ పరిస్థితుల కారణంగా హైస్కూలు చదువుని కూడా పూర్తి చేయలేక పోయారు. బాల్యంలో సంగీతంలోనూ, చిత్రలేఖనంతోనూ కొద్దిపాటి పరిచయం కలిగింది. తన పద్ధెనిమిదో ఏట తండ్రి హఠాత్తుగా మరణించడం, వెనువెంటనే పెద్దకొడుకుగా కుటుంబ బాద్యత భుజాల మీద పడడంతో తల్లి అభీష్టానికి విరుద్ధంగా నటుడిగా మారారు స్థానం. నిజానికి ఆయన వేసిన మొట్టమొదట వేసింది స్త్రీ వేషమే. 'సత్య హరిశ్చంద్ర' నాటకంలో చంద్రమతి పాత్ర. చామనచాయ రంగులో, పీలగా, పొట్టిగా ఉండడంతో ఆయన్ని స్త్రీ పాత్రకి ఎంపిక చేశారట. రెండేళ్లు తిరిగేసరికల్లా నాటి నాటక సమాజాలన్నీ స్థానం రాక కోసం ఎదురు చూశాయంటే నటుడిగా ఆయన శ్రద్దాసక్తులు, తనని తాను మెరుగుపరుచుకున్న విధానాన్ని ఊహించవచ్చు.

ఆచార్య మొదలి నాగభూషణ శర్మ సాహిత్య విమర్శకుడు మాత్రమే కాక, రంగస్థల నటుడు, రచయిత, విమర్శకుడు కూడా కావడంతో ఈ పుస్తకంలో కేవలం స్థానం జీవిత విశేషాలని మాత్రమే కాక ఆంధ్రదేశంలో నాటి రంగస్థల పరిస్థితులనీ వివరంగా పొందుపరిచారు. వృత్తి నాటక సమాజాలు పోటాపోటీగా నాటకాలు ప్రదర్శించే రోజులు కావడం, స్త్రీ పాత్రలకి అన్నివిధాలా సరిపోయే నటులు దొరకడం అరుదైపోవడం ఒకవైపు, ఇతరత్రా వ్యాపకాల జోలికి పోకుండా క్రమశిక్షణతో నటనమీదే దృష్టి పెట్టి పాత్రకి న్యాయం చేయడం కోసం తపించే స్థానం దీక్షాదక్షతలు మరో వైపు - ఈ రెండింటి కలగలుపే స్థానాన్ని తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి నటుడిగా నిలబెట్టింది అంటారు నాగభూషణ శర్మ.


నటనలో తన లోటుపాట్లని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం మాత్రమే కాదు, తాను పోషిస్తున్న పాత్ర స్వరూప స్వభావాలని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఆహార్యం మొదలు వాచికం వరకూ పాత్రలో పరకాయ ప్రవేశానికి తపన పడడం స్థానం నరసింహారావుని ఆయన సమకాలీన నటులలో ప్రత్యేకంగా నిలబెట్టింది అంటారు రచయిత. సంగీతంతో పరిచయాన్ని ఉపయోగించుకుని పాత్రానుగుణమైన పాటల్ని రాసుకుని స్వరపరుచుకోవడం మొదలు (అలా పుట్టిన పాటల్లో ఒకటి 'మీరజాలగలడా') చిలేఖన విద్య సాయంతో వేషానికి మెరుగులు దిద్దుకోవడం, దుస్తులు, ఆభరణాల విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం ఇవన్నీ తన మూడున్నర దశాబ్దాల నటజీవితంలో ఆసాంతమూ పాటించారు నరసింహారావు.

దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చి, అనేక సన్మానాలు, బిరుదులూ అందుకున్న నటుడికి సహజంగానే ఆ విజయం తలకెక్కాలి. కానీ, స్థానం విషయంలో అలా జరక్కపోవడానికి కారణం తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటన అంటారు నాగభూషణ శర్మ. తొలిసారి బంగారు పతకం అందుకున్న తర్వాత, నాటకం పాంఫ్లెట్ లో తన పేరు పక్కన గోల్డ్ మెడలిస్ట్ అని రాయించుకోడమే కాక, ప్రదర్శనలో యశోద వేషం వేసి బంగారు పతకాన్ని కూడా ధరించారట. నాటకం ఆసాంతమూ గోల్డ్ మెడల్ ని ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేసే ప్రయత్నంలో పాత్ర మీద, నాటకం మీద ఏకాగ్రత చూపలేకపోయారట. అప్పటివరకూ మెచ్చుకున్న వారే, ప్రదర్శన అనంతరం తీవ్రంగా విమర్శించడంతో మరెన్నడూ తన మెడల్స్ ని ప్రదర్శించలేదట.

ఇది కేవలం స్థానం నరసింహారావుని అభినందిస్తూ రాసిన పుస్తకం కాదు. స్త్రీపాత్రలలో రాణించినంతగా పురుష పాత్రల్లో పేరు తెచ్చుకోలేక పోవడం, రంగస్థలం మీద విజయం సాధించినా, సినిమాలలో రాణించక పోవడం లాంటి విషయాలనీ విశదం గానే రాశారు రచయిత. సత్యభామ, రోషనార, చిత్రాంగి, మధురవాణి పాత్రల విశేషాలని, స్థానం నటనపై వచ్చిన సమీక్షలనీ వివరిస్తూనే, నాటి నాటక సమాజాల పోటీ వాతావరణం, నటుల మధ్య స్పర్ధలు లాంటి విషయాలని కూడా సందర్భానుసారం ప్రస్తావించారు. కేవలం స్థానం నరసింహారావు నట జీవితాన్ని మాత్రమే కాక, తెలుగు రంగస్థలం పరిణామ క్రమాన్నీ వివరించే రచన ఇది. (కళాతపస్వి క్రియేషన్స్ ప్రచురణ, పేజీలు 146, వెల రూ. 200, స్థానం నరసింహారావు పాటల సీడీ ఉచితం, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలోనూ లభ్యం).

శుక్రవారం, అక్టోబర్ 12, 2018

రెండు బంట్లు పోయాయి

చాసోకి శిష్య సమానుడూ, 'ఓన్లీ పతంజలి'కి గురు సమానుడూ అయిన ఉత్తరాంధ్ర కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు. రాసిన కథలు నాలుగు పుంజీలకి మించకపోయినా, వాసికెక్కిన కథలవ్వడం చేత అనేకానేక కథా సంకలనాల్లో చోటు సంపాదించేసుకున్నాయి. కథలన్నీ విజయనగరం నేపథ్యంలోనూ, వాటిలో సింహభాగం క్షత్రియ కుటుంబాల్లోని పాత్రలతోనూ సాగుతాయి. 'దివాణం సేరీ వేట,' 'కుక్కుట చోరులు' తో పాటుగా నాకిష్టమైన మరో కథ 'రెండు బంట్లు పోయాయి.' చదరంగం బల్ల దగ్గర మొదలయ్యే ఈ కథ నడక ఆసాంతమూ చదరంగపుటెత్తుల్లాగే సాగుతుంది. అలాగని శ్రీపాద వారి 'వడ్ల గింజలు' తో ఎలాంటి పోలికా ఉండదు.

నిజానికి ఇదో పెళ్లి కథ. చంద్రం గారి కుమార్తె లక్ష్మీదేవిని శ్రీ రాజా కలిదిండి నీలాద్ధిర్రాజు గారి సుపుత్రుడు వరహాలరాజు ఎమ్.ఏ. కి ఇచ్చి చంద్రంగారి స్వగృహంలో వివాహం జరిపించాలని నిశ్చయించారు పెద్దలు. పొరుగూళ్ళలో ఉన్న బంధువులందరికీ మర్యాదపూర్వకంగా పిలుపులందాయి. పిలుపు అందుకున్న వారిలో 'తాతగారు' కూడా ఉన్నారు. తాతగారు ఎక్కడ ఉన్నా వెంట చదరంగం బల్ల ఉండాల్సిందే. ఆయనతో చదరంగం ఆడే అవకాశం కోసం ఆబాలగోపాలమూ ఎదురుచూస్తుంది అనడం అతిశయోక్తి కాదు. శుభలేఖ వచ్చే సమయానికి చదరంగం బల్ల ముందే ఉంటారు తాతగారు, వారి సన్నిహితులూను. అప్పటికప్పుడే ఓ మాట అనుకుని పెళ్ళికి ప్రయాణమవుతారు.

శుభలేఖ తెచ్చిన ఇద్దరు కుర్రాళ్ళ లోనూ ఒకడు శంకరం. పెళ్లికుమార్తెకి మేనబావ. కొన్నాళ్ల క్రితం వరకూ చంద్రం గారు అతన్నే అల్లుడిగా చేసుకుంటారని కూడా బంధువర్గం భావించుకుంది. కారణం తెలీదు కానీ, ఎమ్మే చదువుకుని, మదరాసులో ఏదో పనిచేస్తున్న ఆస్థిపరుడైన వరహాలరాజిప్పుడు వరుడయ్యాడు. మగ పెళ్ళివారు రావడంతోనే విడిదింట్లో మర్యాదలు మొదలయ్యాయి. ఇరువర్గాలూ చేతులు చాచి ఒకరినొకరు ఆహ్వానించుకుని, దయచేయండని గౌరవించుకున్నారు. "తలపాగాలు చుట్టుకుని తిలకం దిద్దుకొని ఠీవిగా ఉన్న రాజులంతా మీసాలు సరిజేసుకుంటూ, ఇస్త్రీ మడతలు నలక్కుండా విడిదిలో వేసిన తివాసీ మధ్యకు నెట్టి మర్యాదగా అంచులమీద ఒకరొకరు అంటీ  ముట్టకుండా జరిగి కూర్చున్నారు."



వంటకాలన్నీ రుచిగానే ఉన్నా తాతగారికెందుకో ఈ శాకాహారం పడినట్టు లేదు. "ఏమిటో మొగ పెళ్ళివారు కొంచం తక్కువ కనిపిస్తున్నారు తాతా" అన్నారు మనవడి (కథకుడి)తో. "దూరంనుంచి కదా" అన్న జవాబు వారికి నచ్చలేదు. "అదేవిటి! మా రోజుల్లో మాత్రం దూరపు చుట్టరికాలు చెయ్యలేదూ? చినబాబు పెళ్ళికి కొప్పాక ముప్ఫయి కార్లలోనూ ఇరవై బస్సులలోనూ జిల్లా సరిహద్దుకు తరలి వెళ్ళేం. ఆ సప్లైలేమిటి? ఆ మర్యాదలేమిటి?" అనేశారు గతాన్ని గుర్తు చేసుకుంటూ. తెల్లవారుతూనే పెళ్లి ముహూర్తం. పెళ్ళరుగు పక్కనే కుర్చీలో తాతగారూ, వారికి ఎదురుగా చదరంగం బల్లా. పై ఎత్తులు వేయడానికి వధువు తాతగారు ఎదురుచూస్తున్నారు. ఆటా, పెళ్ళి తంతూ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఆట రసకందాయంలో పడే సమయానికే, పెళ్లి మండపంలోనూ అలాంటి పరిస్థితే సంభవించింది.

చంద్రంగారు ముహూర్తం సమయానికి సర్దుబాటు చేస్తానన్న కట్నం తాలూకు పాతికవేలూ సర్దలేకపోయారు. తప్పకుండా ఇస్తానని చెబుతున్నా పెళ్ళికొడుకు వినిపించుకోలేదు. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలన్నారు. అదేదీ పనికిరాదు. గతిలేకపోతే మానుకోవాలి. ముందు డబ్బు పడితేనే శుభకార్యం జరుగుతుంది. అంతే" అంటూ పీటలమీద నుంచి లేచి పెళ్లరుగు దిగిపోయాడు వరహాల రాజు. "వీడు రాచపుట్టుకే పుట్టాడా!" అనుకున్నారు తాతగారు. వధువు పితామహుడికి కట్నం ప్రసక్తే తెలియదు. చంద్రంగారి తమ్ముడు ఉగ్రరూపం దాల్చాడు. పెళ్లింటి నాలుగు తలుపులూ మూయించేశాడు. ఊరుకాని ఊరు, పైగా బలగం తక్కువ. ఏం చేస్తారు మగపెళ్లివారు? పెళ్లికుమార్తె పినతండ్రిగారు, మేనమామ గారూ కలిసి పెళ్ళికొడుకుని అమాంతం ఆకాశం మీదకెత్తి ఒక్క కుదుపుతో పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టారు.

"ఏవిటీ కంగాళీ చట్రం" అని తాతగారు అనుకునేలోపే మరో గొడవ. ఈసారి పెళ్లి కుమార్తె లేచి నిలుచుంది. పెళ్లికుమారుడు ముఖం మీద తెరపట్టిన శాలువా విసిరికొట్టింది. అందర్నీ తలెత్తి ధైర్యంగా చూసి, ఒక్క తృటిలో గిరుక్కున తిరిగి ఆరేడు గది తలుపులు తోసుకుని వెళ్లి పేరంటాళ్ళ మధ్య పడింది. ఆమెననుసరించి తల్లిగారు కూడా వెళ్లిపోయారు. "ఏమిటీ దొమ్మరిమేళం! వెధవ సంత! యిది పెళ్లేనా!" అనుకున్నారు తాతగారు. "చూడండి బాబూ ముహూర్తం దాటిపోతోంది" అన్నారు సిద్ధాంతి గారు. వధువు తరపున దాసీ చిట్టెమ్మ జబర్దస్తీగా తెచ్చిన కబురేమిటో, తాతగారి చదరంగ బలగంలో రెండు బంట్లు (రెండే, బంట్లే) పోయిన వైనమేమిటో తెలియాలంటే 'రెండు బంట్లు పోయాయి' కథ చదవాలి. (అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన 'కథాస్రవంతి' సిరీస్ లో 'పూసపాటి కృష్ణంరాజు కథలు' సంపుటిలో (కూడా) ఉందీ కథ).

గురువారం, అక్టోబర్ 11, 2018

ఇడియట్ - ఓ గొలుసు నవల

ముగ్గురు రచయితలు కలిసి ఓ గొలుసు నవల రాశారు. ఆ రచన 'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా వచ్చింది, ఇప్పటికి సరిగ్గా యాభయ్ ఏళ్ళ క్రితం. దయగల ప్రచురణ కర్తలు ఓ రెండేళ్ల క్రితం ఆ నవలని మళ్ళీ ప్రచురించారు, నాటి మరియు నేటి పాఠకుల కోసం. నవల పేరు 'ఇడియట్.' రాసిన ముగ్గురూ సాహిత్య జీవులే కాక వేర్వేరు రంగాల్లో పేరు సంపాదించుకున్న వాళ్ళు కావడం విశేషం. పత్రికా సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతి రావు, నవలా రచయితగానే కాక వైద్యుడిగానూ పేరు తెచ్చుకున్న కొమ్మూరి వేణుగోపాల రావు కలిసి రాశారీ నవలని.

'ఇడియట్' కథని ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో మధ్యతరగతి మందహాసం. ఆర్ధిక సమస్యలతో పాటు విలువల విషయంలో నిత్యం సంఘర్షణకి గురయ్యే ఈ వర్గంలోని కొన్ని కుటుంబాలలో ఒక దశాబ్ద కాలంలో జరిగిన పరిణామాలని రికార్డు చేసిన నవల. క్లుప్తంగా కథ చెప్పుకోవాలంటే రావుగారు రంగమ్మలది కలహాల కాపురం. రంగమ్మ తండ్రికి రావుగారితో కొన్ని విభేదాలు ఉండి, కక్ష తీర్చుకోడం అతనిగురించి వ్యతిరేకంగా నూరిపోస్తాడు కూతురికి. కలిసి కాపురం చేస్తున్నా తండ్రి ఎప్పుడో చెప్పిన మాటలు నాటుకుపోయిన రంగమ్మ, రావుగారితో శత్రుభావంతోనే ఉంటుంది. వాళ్లకి ముగ్గురు పిల్లలు. వీళ్ళతో పాటు రావుగారి చెల్లెలి కుటుంబం, ఆయన ఇంట్లో పొరుగు వాటాల్లో అద్దెకి ఉండే వాళ్ళ కథలూ సమాంతరంగా నడుస్తాయి.

మొత్తం 288 పేజీల నవల్లో మొదటి వంద పేజీలూ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశారు. పాత్రల్ని పరిచయం చేసి, కథకి ఓ ముడి వేశారు. తర్వాత అందుకున్న గొల్లపూడి మారురుతిరావు ఓ 126 పేజీలు రాసి, వీలైనన్ని చిక్కుముడులు వేసి, ముగించే బాధ్యతని కొమ్మూరి వేణుగోపాల రావుకి అందించారు. కేవలం 62 పేజీలు మాత్రమే తీసుకున్న కొమ్మూరి పాత్రల్ని సమస్యలనుంచి వీలైనంత బయటికిలాగి కథని ముగింపు తీరానికి చేర్చారు. పాఠకుల సౌలభ్యం కోసం ప్రచురణ కర్తలు ఏ రచయిత ఏ భాగం రాశారన్న వివరం ఇచ్చారు. ముగ్గురి రచనలలోనూ పరిచయం ఉన్న పాఠకులు మాత్రం విడివిడిగా పేర్లు లేకపోయినా ఎవరిదే భాగమో సులువుగానే పోల్చుకోగలరు.


పురాణం రచనల్లో ఒకలాంటి ఆవేశమూ, ఒక నిర్లిప్తతా కూడా సమపాళ్లలో కనిపిస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ నవల మొదట్లో పాత్రల స్వభావాలు కూడా అవే. ఎన్నో సమస్యలు చుట్టూ ఉన్నా, వాటినుంచి తప్పించుకుని వీలైనంత కులాసాగా బతికేసే ప్రయత్నం చేస్తూ, మళ్ళీ అంతలోనూ అలా ఉండాల్సి వచ్చినందుకు మధన పడుతూ ఉంటాయి. రావుగారి టీనేజీ కూతురు శ్యామల నిత్యం నవలలు చదువుకుంటూ, నవలా నాయకులతో కలల్లో విహరిస్తూ ఉంటే, పెద్దకొడుకు కృష్ణ తన క్లాస్ మేట్ కుసుమతో ప్రేమలో ఉంటాడు. చిన్న కొడుకు మోహన్ బడి ఈడువాడు. వీళ్ళతో పాటు రావుగారి చెల్లెలు డిసిప్లిన్ అత్తయ్య, చుట్టూ వాటాల్లో అద్దెకి ఉండే జగదాంబ, రుక్కు తల్లి, సామ్యూల్ కుటుంబాలతో పాటు, రావుగారూ నిత్యమూ పరిశీలించే మేదరి కుటుంబం పరిచయమూ ఉంటుంది. కుసుమ తండ్రి హఠాన్మరణంతో మొదటిభాగం ముగుస్తుంది.

సంప్రదాయ చట్రాన్ని దాటేందుకు ఇష్టపడనట్టుగా అనిపించే రచయిత గొల్లపూడి మారుతిరావు చేపట్టిన రెండో భాగంలో కృష్ణ తన ఇంటిని విడిచిపెట్టి కుసుమతో సహజీవనం మొదలు పెడతాడు. నిజానికి రావుగారికి పెద్దకొడుకు ఎంతో అవసరమైన సమయం అది. కానీ, తన ఇంటి విషయం కృష్ణకి పట్టదు. తమ్ముడు మోహన్ మీద కోపంతో ఒక నాటకీయంగా సందర్భంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డ శ్యామల అతనివల్ల మోసపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెని తన స్నేహితుడైన ఓ రోజుకూలీకి ఇచ్చి పెళ్ళిచేస్తాడు కృష్ణ. మోహన్ అల్లరి చిల్లర తిరుగుళ్ళకి, వ్యసనాలకీ అలవాటు పడి, డిసిప్లిన్ అత్త కూతురు నర్సుని ప్రేమ పేరుతో మోసం చేసి రెడ్ లైట్ ఏరియా లో అమ్మేసేందుకు సిద్ధ పడతాడు. రావుగారు పక్షవాతం బారిన పడడం, కుసుమ పిన్ని కనకలత తన గతాన్ని ఆయనకి వివరించడంతో ఈ భాగం పూర్తవుతుంది. 

అతితక్కువ నాటకీయతతో జీవితానికి దగ్గరగా ఉండే రచనలు చేసిన రచయితగా పేరు పొందిన కొమ్మూరి వేణుగోపాల రావు రాసిన భాగంలో రంగమ్మ గతం, కృష్ణ-కుసుమ మధ్య గొడవలు, మోహన్ అతివాదిగా మారడం, శ్యామల కష్టాల మీదుగా నడిచి కథ మొదలైన రావుగారి ఇంటి సన్నివేశంతోనే ముగుస్తుంది. నవల మొత్తంలో 'ఇడియట్' ఎవరు అన్న ప్రశ్న అనేకసార్లు కలుగుతుంది పాఠకులకి. ఒక్కో రచయిత రాసిన భాగంలోనూ ఒక్కో పాత్ర ఇడియట్ అనిపిస్తుంది. నిజానికి ప్రతి పాత్రా ఏదో సందర్భంలో ఇడియట్ లా ప్రవర్తించిందే. యాభయ్యేళ్ళ కాలంలో మధ్యతరగతి విలువల్లో వచ్చిన మార్పుని తెలుసుకోడానికి ఉపయోగపడే నవల ఇది. అంతే కాదు, ముగ్గురు రచయితలూ ఎవరికి వారే పూర్తి నవలగా రాస్తే ఎలా ఉండేదో ఊహించుకోడానికి మంచి అవకాశం కూడా. (సాహితి ప్రచురణలు, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, మే 21, 2018

నవలాదేశపు రాణి

హైస్కూలు రోజుల నాటి బరువైన వేసవికాలపు మధ్యాహ్నాలు యిట్టే గడిచిపోయేలా చేసిందీ, అటుపైన సాహిత్యపు రుచిని మప్పిందీ ఒక్కరే.. ఆమె తెలుగుసాహిత్యపు 'నవలాదేశపు రాణి' యద్దనపూడి సులోచనా రాణి. సెలవురోజుల్లో క్లాసేతర పుస్తకం చేతుల్లో కనిపిస్తే కన్నెర్రజేసే అమ్మానాన్నా కూడా, ఆ పుస్తకం సులోచనారాణిది అని గమనిస్తే చూసీ చూడనట్టు తప్పుకునేవారు. అమ్మ, అత్తయ్యలు, పెద్దమ్మలు, పిన్నిలు పోటీలు పడి చదివి చర్చించుకున్నవీ, తాతయ్య తన చివరి రోజుల్లో కళ్ళజోడు సరిచేసుకుంటూ చదువుకున్న నవలలూ యద్దనపూడివే. సులోచనారాణి రచనలు సకుటుంబంగా చదవదగినవీ, వయోభేదం లేకుండా అందరూ ఆస్వాదించగలిగేవీ అనడానికి ఇంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదేమో.

దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి విద్యలో, ప్రత్యేకించి స్త్రీవిద్యలో, వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రమూ ఉంది. "ఆడపిల్లకి చదువెందుకూ" నుంచి "చాకలిపద్దు రాసే చదువు చాలు" మీదుగా "మొగుడికో ఉత్తరమ్ముక్క రాసుకునే చదువన్నా చెప్పించాలి" వరకూ నెమ్మదిగా ఎదుగుతూ వచ్చిన ఆలోచనలని దేశ రాజకీయాలు, ప్రత్యేకించి ఇందిరాగాంధీ లాంటి నాయకులు పదవులు చేపట్టడంతో ఒక్కసారిగా పూర్తిగా మార్చి ఆడపిల్లలకి చదువు అవసరం అన్న ఎరుకని కలిగించాయి. స్వతంత్రం వచ్చి రెండు దశాబ్దాలు గడిచేసరికి చదవడం నేర్చిన మధ్యతరగతి గృహిణుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీరికి అవసరమైన వినోదాన్ని, తగు పాళ్ళలో విజ్ఞానాన్ని అందించే బాధ్యతని వార, పక్ష, మాస పత్రికలు స్వీకరించాయి.

నిరంతరం కొత్తని అన్వేషించే పత్రికా సంపాదకుల దృష్టివల్లనయితేనేమి, పత్రికల మధ్య పెరిగిన పోటీ అయితే ఏమి, మహిళల కోసం మహిళల చేతే విస్తృతంగా రచనలు చేయించే ఆలోచనలు జరుగుతున్న తరుణంలో కలంపట్టారు సులోచనారాణి. పుట్టి పెరిగింది పల్లెటూళ్ళోనే అయినా, అది విద్యావంతుల కుటుంబం కావడం, పెద్దలందరికీ పఠనాసక్తి ఉండడంతో సాహిత్యాన్ని చదువుతూ పెరిగారామె. పెద్ద చదువులు చదవలేకపోయినా ప్రపంచపు పోకడలని ఆకళింపు చేసుకున్నారు. సరదాగా కథా రచన ప్రారంభించి, పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుని, అనుకోకుండా 'సెక్రటరీ' తో నవలా రచన మొదలుపెట్టి తక్కువ కాలంలోనే సాటి రచయితలు అసూయ పడేంత తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.

సులోచనారాణి రచనల్ని గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్నలు రెండు. ఆమె రచనల్లో ఏం ఉంటాయి? ఏం ఉండవు?? నవలల్లో చదివించే గుణాన్ని పుష్కలంగా నింపడం ఆమె ప్రత్యేకత. మళ్ళీ మళ్ళీ చదివేప్పుడు కూడా పాఠకుల్లో అదే ఉత్సుకత, పుస్తకాన్ని పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేని ఒకలాంటి బలహీనత.. ఇదే ఆమె విజయరహస్యం. ఆమె నవలలు సినిమాలుగానూ, టీవీ సీరియళ్లు గానూ రావడం వెనుక, కంప్యూటర్ రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ ముద్రించబడుతూ ఉండడం వెనుక ఉన్న రహస్యమూ ఇదే. మానవ సంబంధాలని దాటి ఆమె రచనవస్తువు మరోవైపు వెళ్ళలేదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, మనింట్లోనో,  పక్కింట్లోనో  జరిగాయేమో అనిపించే సంఘటనలు. ఫలితంగా, తన టార్గెటెడ్ పాఠకులైన గృహిణులతో పాటు అన్ని వర్గాలనీ తన రచనలవైపు ఆకర్షించుకున్నారు. అతిశయాన్నీ, నాటకీయతనీ కూడా అంగీకరింపజేశారు.
 

మానవ సంబంధాల చుట్టూ కథలల్లిన సులోచనారాణి అక్రమసంబంధాల జోలికి వెళ్ళలేదు ఎన్నడూ. 'సంసార పక్షపు రచయిత్రి' అన్న ముద్రని సంపాదించుకుని, నిలబెట్టుకున్నారు. పాపులారిటీ కోసం క్షుద్రపూజలనో, పిశాచాలనో రచనల్లో ప్రవేశపెట్టలేదు. సెక్సు, హింసల జోలికి వెళ్ళలేదు. టీవీ సీరియళ్ల టైపు పగలు, ప్రతీకారాలు మచ్చుకైనా కనిపించవు. సంస్కృత కావ్యాలనో మరో రచనలనో అడ్డం పెట్టుకుని కథానాయికల అంగాంగ వర్ణనలు చేయలేదు.ఆమె సృష్టించిన నాయికలు బేలలు కారు, ధీరలు. అలాగని, నాయికలని ఉన్నతంగా చూపించడం కోసం నాయకుల వ్యక్తిత్వ హననం చేయడమో, వారిని మరగుజ్జులుగా చూపడమో జరగలేదెన్నడూ. విశ్వ విఖ్యాత మిల్స్ అండ్ బూన్స్ రచనలు, బెంగాలీ రచయిత శరత్ బాబు సాహిత్య ప్రభావం సులోచనారాణి రచనల మీద కనిపించినా నేరుగా కాపీ కొట్టారన్న అపప్రధని ఏనాడూ మూటకట్టుకోలేదు.

పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ తనకి తానుగా ఒక ఉన్నత స్థానాన్ని సృష్టించుకుని, దశాబ్దాల పాటు మరొకరిని దరిదాపులకు రానివ్వకుండా నిలబడడం అన్నది మామూలు విషయం కాదు. ప్రతిభకి నిరంతర కృషి తోడవడం వల్ల వచ్చిన ఫలితమది. విజయం వెంట పరుగుతీసే సినిమా వారు, సులోచనారాణి చేత సినిమా రచనలూ చేయించారు. సహజంగానే ఆమె కీర్తి కొందరికి కంటగింపు అయ్యింది. జోక్స్ నీ, సెటైర్స్ నీ ప్రచారంలోకి తెచ్చారు. ఆమెని దృష్టిలో ఉంచుకుని చేసిన వ్యంగ్య రచనలు, "నేను స్త్రీని, పైగా అందమైన పేరు భరిస్తున్నదానిని.. రచనలు చేయడానికి ఇంతకన్నా అర్హతేమి కావాలి?" లాంటి సంభాషణలు, మూడు నాలుగు పత్రికల్లో ఏకకాలంలో సీరియల్స్ రాసే పాపులర్ రచయిత్రి, ఒకసారి పొరపాటున ఒక పత్రికకి పంపాల్సిన మేటర్ని మరో పత్రిక్కి పంపినా పాఠకులు పోల్చుకోలేక చదివేసుకున్న ఇతివృత్తాలతో కథలు... తనని ఉద్దేశించి రాసిన వీటన్నింటినీ ఆమె స్పోర్టివ్ గానే తీసుకుని ఉంటారు బహుశా.

వ్యక్తిగా సులోచనారాణి వివాదరహితురాలు. ఏ వివాదంలోనూ ఆమె తలదూర్చలేదు. తనని విమర్శించిన వాళ్లకి కూడా మరింత పాపులర్ రచనలు చేయడం ద్వారానే సమాధానం చెప్పారు తప్ప మరో మార్గాన్ని ఎంచుకోలేదు. 'మీనా' నవలని కాపీకొట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ ఆ' సినిమా తీసినప్పుడు కూడా ఆమెనుంచి బహిరంగ విమర్శ రాలేదు. అయితే, ఆమె అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, సినిమా విడుదలైన కొన్ని రోజులకి త్రివిక్రమ్ టైటిల్ కార్డ్స్ లో ఆమెకి 'స్పెషల్ థాంక్స్' చెప్పక తప్పలేదు. 'సులోచనారాణి నవలల్లో సామాజిక స్పృహ ఉండదు' అన్నది ఆమె రచనల మీద విన్న ప్రధాన విమర్శ. తెలుగు సాహిత్యంలో అస్తిత్వ వాదం ఊపందుకున్న కాలంలో కూడా ఆమె తన ధోరణిలో రచనలు చేశారు తప్ప, వాదాల జోలికి వెళ్ళలేదు. ఆమె మార్గం మీద ఆమెకి స్పష్టమైన అవహగాన ఉండడం ఇందుకు కారణం కావొచ్చు బహుశా.

తరచి చూస్తే, స్త్రీ సాధికారికతని తన రచనల్లో బలంగా ప్రతిపాదించిన రచయిత్రి సులోచనారాణి. తెలుగునాట తొలితరం ఉద్యోగినులు ఆమె పాత్రలలో తమని తాము చూసుకున్నారు అనడం అతిశయోక్తి కాదు. రచయిత్రిగా తన బలం ఏమిటన్నది ఆమెకి బాగా తెలుసు. తెలుగు లోగిళ్ళలో కనీసం కొన్ని తరాలకి సాహిత్యం చదవడాన్ని అలవాటు చేశాయి ఆమె రచనలు. అసలంటూ పాఠకులు తయారైతే, తర్వాత తమకి నచ్చిన సాహిత్యాన్ని చదువుకుంటారు కదా. ఈ తయారయ్యే ప్రక్రియకి ఆమె నవలలు చేసిన దోహదం తక్కువదేమీ కాదు. 'కమర్షియల్ రైటర్' అని ఆమెని చిన్నచూపు చూసిన సామాజికస్పృహ గల రచయిత(త్రు)లూ ఉన్నారు. వాళ్లకి చెప్పేది ఒక్కటే.. మీ రచనలు చదివిన, చదువుతున్న పాఠకుల్లో అనేకులు మొదట చదివిని ఆమె రచనలనే అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆమె రచనలు చదవడం వల్లే వాళ్ళు మీ రచనల దాకా వచ్చారని మర్చిపోకండి.

'నవలాదేశపు రాణి' అన్న కీర్తి కిరీటాన్ని సృష్టించుకున్న ఘనత సులోచనారాణిది. ఆ స్థానం ఆమెది మాత్రమే. సులోచనారాణి రచనలన్నీ ఒకచోట చేర్చి సంకలనం వెలువరించే దిశగా ఆలోచించాల్సిందిగా ప్రచురణకర్తలని కోరుతూ, నా బాల్యంలో భాగమైన, నేను చదివిన, చదువుతున్న సాహిత్యానికి కారకురాలైన నా అభిమాన రచయిత్రికి కన్నీటి నివాళి.

బుధవారం, మే 09, 2018

మహానటి

'మహానటి' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు సావిత్రి. దక్షిణ భారత సినీ పరిశ్రమ మీద తనదైన ముద్ర వేసి, సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని నిర్మించుకున్న సావిత్రి భౌతిక ప్రపంచాన్ని విడిచి దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా, ఆమె కథ సినిమాగా రికార్డు అవ్వలేదు. బహుశా, నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడి కోసమే ఆ అవకాశం ఇన్నాళ్లూ వేచి చూసిందేమో అనిపించింది, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'మహానటి' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తుంటే. ఒక్కమాటలో చెప్పాలంటే, వెండితెర మీద సావిత్రి ఎంత గొప్ప నటో, ఆమెకి అంత గొప్ప నివాళి ఈ సినిమా.

నిజానికి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. బోళాతనం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం అవ్వడం వల్ల, చాలామంది నటీనటుల్లాగా ఆమె తన గతానికి రంగులు పూసి చూపించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా, ఆమె జీవితం మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కొన్ని నేరుగా ఆమె జీవితకథలుగానే ప్రకటించబడితే, మరికొన్ని ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని తయారైన కథలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కథలన్నీ కాచి వడబోసి, నిజాలు నిగ్గుతేల్చి, ఆమె వ్యక్తిత్వాన్ని పట్టుకుని, ఆమె తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల తాలూకు మూలాల్నివెలుగులోకి తెచ్చి, ఈ నాటికీ ఆమెని అభిమానించే అశేష ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేయడం మామూలు విషయం కాదు. ఆ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలకి ముందుగా అభినందనలు.


చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తనని ఏమాత్రం ఇష్టపడని పెదనాన్న పంచకి తల్లితో సహా చేరుకున్న ఓ అమ్మాయి మొదట నాటకాల్లోనూ, అటు తర్వాత సినిమాల్లోనూ చేరి మహానటిగా ఎదగడం, ఈ ఎదిగే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న అలవాట్ల ఫలితంగా కెరీర్నీ, డబ్బుని, మనుషుల్నీ నష్టపోయి మరణం అంచుకి చేరుకోటం.. ఇది ప్రధాన కథ. గొప్ప పేరు ప్రఖ్యాతులున్న నటీమణి కోమాలోకి జారి, ఎవరూలేని అనాధగా హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నప్పుడు, ఆమె జీవితంలో ప్రజలెవరికీ తెలియని సంఘటనల్ని పరిశోధించి ప్రచురిస్తే ఆ కథనాలు సేలబుల్ అవుతాయని భావించే ఓ పత్రికా, ఆ పత్రికలో కొత్తగా చేరి తనని తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న జర్నలిస్టు, ఆ జర్నలిస్టుని ప్రేమిస్తూ ఆమె ప్రేమకోసం ప్రయత్నించే ఫోటోగ్రాఫరు.. ఇది ఉప కథ.

ఈ రెండు కథల్నీ పడుగూ పేకలుగా అల్లి, సావిత్రి వ్యక్తిగత, వెండితెర జీవితాల్లో ముఖ్య సంఘటనలు వేటినీ విడిచిపెట్టకుండా నడిపించిన కథలో ప్రతి పాత్రకూ రీప్లేస్మెంట్ ఊహించలేని నటీనటులు, పాత్రోచితమైన సంభాషణలు, మీదుమిక్కిలి ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసే నేపధ్య సంగీతం కలిసి 'మహానటి' ని ఓ గొప్ప సినిమాగా నిలబెట్టాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, సావిత్రి అప్పటికే పెళ్ళై పిల్లలున్న జెమిని గణేశన్ కి రెండో భార్యగా వెళ్లడాన్ని మాత్రమే కాదు, ఆమె మద్యానికి బానిస కావడాన్ని కూడా ఒప్పేసుకోగలగడం దర్శకుడి విజయమే. అనారోగ్యంతో ఉన్న సావిత్రి ముఖాన్ని ఎక్కడా తెరమీద చూపించక పోవడమే కాదు, ఎండ్ టైటిల్స్ కి ముందు ఆమె నాటకాల రోజుల సన్నివేశాన్ని రి-ప్లే చేయడం ద్వారా ప్రేక్షకులు సావిత్రిని ఎలా గుర్తుపెట్టుకోవాలని తాను భావిస్తున్నాడో చెప్పకనే చెప్పాడు నాగ్ అశ్విన్.


నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ గురించి. ఈమె తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రని చేయలేరు అనిపించేలా నటించింది. ఒక మేకప్, కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, సావిత్రిగానూ, సావిత్రి నటించిన పాత్రలుగానూ కూడా ఒప్పించింది కీర్తి. జెమిని గణేశన్ గా నటించిన దుల్కర్ సల్మాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి మమ్ముట్టి 'స్వాతి కిరణం' లో అనంత రామశర్మ పాత్రని ఎంత అలవోకగా నటించాడో, జెమిని గణేశన్ పాత్రని అంతే అలవోకగా ఒప్పించేశాడు దుల్కర్. సావిత్రి పెదనాన్న చౌదరి గా రాజేంద్రప్రసాద్ కి కీలకమైన పాత్ర దొరికింది. సావిత్రి నట జీవితంలోని సెలబ్రిటీల పాత్రల్లో నటులు, దర్శకులు మెరిశారు. ఏ పాత్ర ఔచిత్యానికీ భంగం కలగక పోవడం  మెచ్చుకోవాల్సిన విషయం.

సహాయ పాత్రల్లో నాకు బాగా నచ్చింది జెమిని గణేశన్ భార్య అలమేలు గా చేసిన మాళవికా నాయర్. ఆమె తెరమీద కనిపించేది రెండు మూడు సన్నివేశాలే అయినా అవి కథకి కీలకం కావడం వల్లా. కీర్తి, దుల్కర్ లతో పోటీపడి ఆమె నటించడం వల్లా ఆమె నటన గుర్తుండిపోతుంది. దర్శకుడి పనితనాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎస్వీఆర్ గా నటించిన మోహన్ బాబు చేత కూడా అండర్ ప్లే చేయించి, ఎక్కడా మోహన్ బాబు కనిపించని విధంగా నటింపజేశాడు. సినిమా ప్రారంభ సన్నివేశం, ఇంటర్వెల్, ముగింపు వీటిని ఎంత శ్రద్ధగా ఎంచుకున్నాడో, సినిమాలో ప్రతి ఫ్రేమ్ నీ అంతే జాగ్రత్తగా ఎంచుకుని చిత్రించాడు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉండకపోవచ్చు, కానీ ఉన్న సన్నివేశాలన్నీ ఆమె జీవితంలో భిన్న కోణాలని, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని పరిచయం చేసేవే.


ప్రధాన కథ మీద ఎంత శ్రద్ధ చూపించాడో, ఉప కథనీ అంతే జాగ్రత్తగా మలిచాడు దర్శకుడు. ఉప కథలోని పాత్రలకి కూడా తమదైన వ్యక్తిత్వాన్ని ఇవ్వడం, ఉప కథ ముగింపుకి ప్రధాన కథతో లంకె వేయడం నాగ్ అశ్విన్ లో ఉన్న రచయిత తాలూకు ప్రతిభని పరిచయం చేస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఇతడికి దర్శకుడిగా కేవలం రెండో ప్రాజెక్టు కావడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో అనుభవజ్ఞుడిలా, పరిణతితో తీశాడు సినిమాని.  ప్రస్తావించుకోవాల్సిన మరో అంశం సంభాషణలు. గత శతాబ్దపు అరవై, డెబ్బై, ఎనభై దశకాలు, నాటి బెజవాడ, మద్రాసు ప్రాంతాలు, అక్కడి పలుకుబళ్లు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూనే పాత్రల వ్యక్తిత్వాలని ఎలివేట్ చేసే విధంగా క్లుప్తంగా పలికించిన మాటలు. అదికూడా నాటకీయత దాదాపుగా లేకుండా. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, మిక్కీ జె మేయర్ సంగీతం ఇవి రెండూ జిలుగు నగలో వెలుగు రాళ్ళలా అమిరాయి.

ఖర్చుకి వెనకాడకుండా తీసిన చిత్రం అనే మాట ఈ సినిమాకి అక్షరాలా సరిపోతుంది. ఆకాలం నాటి స్టూడియోలు, ఉపకరణాలు, సెట్టింగులు, వాహనాలు, నాటి మద్రాసు మహానగరం.. ఒకటేమిటి? సినిమాలో ప్రతి ఫ్రేము సెట్ లో తీసిందే. ప్రతి సెట్టూ కళ్ళు చెదిరేలా నిర్మించిందే. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి విజయ-వాహిని స్టూడియోస్, మద్రాసు వీధులు, సావిత్రి భవంతి సెట్టింగులు. సావిత్రి వాడిన లాంటివే కాస్ట్యూమ్స్, నగలు, అవి కూడా ఆమె జీవితంలో వివిధ దశల్లోనూ, అనేక సినిమాల్లోనూ వాడినవి. అసలు ఆ రీసెర్చ్ కే ఎన్నాళ్ళు పట్టి ఉంటుందో కదా అనిపించింది. పత్రిక వాళ్లకి కథకి కథనానికి తేడా తెలియకపోవడం, ఒకట్రెండు చోట్ల ఎడిటింగు కాస్త ఇబ్బంది పెట్టాయి కానీ, మూడు గంటలకి మూడు నిముషాలు మాత్రమే తక్కువ నిడివి ఉన్న సినిమాలో ఆమాత్రం ఇబ్బందులు మామూలేనేమో. చివరిగా ఓ మాట, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, రాలేవు. మనం చేయాల్సిందల్లా మర్చిపోకుండా చూడడం, 'మహానటి' జ్ఞాపకాలను నెమరేసుకోవడం.

గురువారం, మార్చి 08, 2018

నా జ్ఞాపకాలు

"పద్నాలుగో ఆర్ధిక సంఘం నిబంధనల కారణంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం.." గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే చెబుతున్న విషయం ఇది. ఆ ఆర్ధిక సంఘానికి సారధ్యం వహించింది ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి యాగా వేణుగోపాల రెడ్డి. పూర్తి పేరు కాకుండా, వై.వి. రెడ్డి అనే పొట్టి పేరు ప్రస్తావిస్తే రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నరు గా పనిచేసిన తొలితెలుగు అధికారి ఈయనే అనే విషయం గుర్తొచ్చి తీరుతుంది. తన బాల్యం మొదలు, ఆర్ధిక సంఘం బాధ్యతల నిర్వహణ వరకూ దాదాపు డెబ్బై ఐదేళ్ల జీవిత విశేషాలని 'నా జ్ఞాపకాలు' పేరిట అక్షరబద్ధం చేశారు రెడ్డి.

కడప జిల్లా రాజంపేట తాలూకా పాటూరు అనే పల్లెటూళ్ళో విద్యావంతుల కుటుంబంలో జన్మించిన వేణుగోపాల రెడ్డి చిన్ననాడే తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు చూశారు. మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా కెరీర్ ఆరంభించారు. రెవిన్యూ ఉద్యోగంలో చేరి,  ఉన్నతహోదాలో పదవీ విరమణ చేసిన యాగా పిచ్చిరెడ్డికి తన పెద్దకొడుకుని ఐఏఎస్ గా చూడాలన్నది కల. తన మొగ్గు అధ్యాపక వృత్తి, పరిశోధన వైపే ఉన్నా, కేవలం తండ్రి కోసం సివిల్ సర్వీస్ పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో ఐఏఎస్ సాధించిన ప్రతిభాశాలి వేణుగోపాల రెడ్డి. ఫలితాలు రాకమునుపే తండ్రి కన్నుమూయడం, ఆ ఆనందం వెనుక ఉన్న అతిపెద్ద విషాదం.

నమ్మిన విలువలకీ, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్ళకీ నిత్యం ఘర్షణే. ముగ్గురు ముఖ్యమంత్రుల - కోట్ల విజయభాస్కర రెడ్డి, జలగం వెంగళ రావు, ఎంటీ రామారావు - తో సన్నిహితంగా పనిచేసిన అనుభవాలు, వారి పనితీరు మొదలు, ఐఏఎస్ లకి జిల్లాల్లోనూ ఢిల్లీలోనూ సౌకర్యాల పరంగా కనిపించే తేడాల వరకూ సునిశితమైన హాస్యాన్ని మేళవించి చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి కొంత తిరుగుడు తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖలో జాయింట్ సెక్రటరీగా చేరిన కొద్ది కాలానికే 1990 నాటి తీవ్ర ఆర్ధిక సంక్షోభం, తదనంతర పరిణామాలకి ప్రత్యక్ష సాక్షిగానే కాక, సంక్షోభ నివారణ చర్యల బృందంలో కీలక సభ్యుడిగా పనిచేసిన నేపధ్యం ఆయనది.


1989-91 మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అస్థిరత, ఆర్ధిక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, అదే సమయంలో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరల పెరుగుదల.. వీటన్నింటి కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం, 1991 నాటి నూతన ఆర్ధిక సంస్కరణలకు దారితీయడం తెలిసిందే. సంస్కరణలకు ముందు, చెల్లింపుల నిమిత్తం భారతదేశపు బంగారం నిల్వల్ని బ్రిటన్ బ్యాంకులో తనఖా పెట్టడం - అది కూడా కాగితం మీద కాక బంగారం నిల్వల్ని విమానంలో తరలించి - జరిగింది. ఈ బంగారం తరలింపులో ఎస్కార్టు అధికారిగా పనిచేశారు వేణుగోపాల రెడ్డి!! అంతే కాదు, ఆ సంక్షోభ సమయాల్లో ఆర్ధిక శాఖ, ఆర్బీఐ అధికారులు ఎదుర్కొన్న ఒత్తిళ్లని ఆయన మాటల్లో చదవాల్సిందే. 

ఆర్ధిక సంస్కరణలు మొదలైన తర్వాత, భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెత్తనం చేసిందన్న విమర్శని ఎదుర్కొన్న ప్రపంచ బ్యాంకులో పనిచేసే అవకాశం వచ్చింది వైవీ రెడ్డికి. ప్రపంచ బ్యాంకు వ్యవహార శైలి, ఒక్కో దేశంలోనూ ఆ బ్యాంకు ప్రాధాన్యతా క్రమాలు, నిబంధనల విషయంలో పట్టువిడుపులు ఇవన్నీ ఆర్ధిక శాస్త్రం గురించి పెద్దగా తెలియని వాళ్లకి కూడా సులువుగా అర్ధమయ్యేలా రాశారు. సాంకేతిక విషయాలని సైతం ఆసక్తికరమైన కథనాలుగా మార్చడంలో ఈ పుస్తకానికి రచనా సహకారం అందించిన కథా రచయిత్రి అరుణ పప్పు కృషి చాలానే ఉండి ఉంటుంది బహుశా. స్వతహాగా హాస్యప్రియులైన రెడ్డి గారి సంభాషణల్లో మెరిసే చెణుకులు సరేసరి.

ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్బీఐ డెప్యూటీ గవర్నరుగా రావడం, అటు తర్వాత గవర్నరు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ మొత్తం క్రమంలో రిజర్వు బ్యాంకు పనితీరు, కేంద్ర ఆర్ధిక మంత్రి - రిజర్వు బ్యాంకు గవర్నర్ల మధ్య ఉండాల్సిన అవగాహన, కీలక సమయాల్లో ప్రభుత్వమూ, బ్యాంకూ పరస్పర పూరకాలుగా పనిచేయడం ఇవన్నీ పరిపాలనాంశాలని గురించి తెలుసుకోగోరే వారిని ఆసక్తిగా చదివిస్తాయి. గవర్నరుగా ఆర్ధిక విషయాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నానని చెబుతూనే, ఫలితంగా మొదట విమర్శలు ఎదుర్కొన్నా గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ లో భారతదేశం చిక్కుకోకుండా ఉండడానికి ఆనిర్ణయాలే సాయపడ్డాయన్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపునీ జ్ఞాపకం చేసుకున్నారు.

ఇక పద్నాలుగో ఆర్ధిక సంఘం చైర్మన్ హోదాలో దేశం మొత్తం తిరగడం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవ్వడం.. సంఘం తరపున చేయాలనుకున్నవీ, చేయగలిగినవీ వీటన్నింటినీ విశదంగానే చెప్పారు. విధి నిర్వహణ ఊపిరి సలపని విధంగా ఉన్నా అధ్యయనం కోసం సమయం కేటాయించడం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతివిషయాన్నీ భిన్న కోణాలనుంచి పరిశీలించడమే కాక, సూక్ష్మ స్థాయి సమాచారాన్ని కూడా సేకరించుకోవడం, టీం వర్కుకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి స్థాయిలో వారితోనూ చక్కని సంబంధాలు నెరపడం... ఇవన్నీ వేణుగోపాల రెడ్డి విజయరహస్యాలు అని చెబుతుందీ పుస్తకం. పాలన, ఆర్ధిక విషయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన రచన ఇది.

('నా జ్ఞాపకాలు,' రచన: యాగా వేణుగోపాల రెడ్డి, ఎమెస్కో ప్రచురణ, పేజీలు: 360, వెల రూ. 175, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, ఫిబ్రవరి 26, 2018

శప్తభూమి

చరిత్రని అధ్యయనం చేసి, కాలం నాటి సామాజిక పరిస్థితులని అర్ధం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ అధ్యయనం ఆధారంగా కాల్పనిక పాత్రలని సృష్టించి, చారిత్రక నవలరాయడం మరోఎత్తు. అలా రాసిన నవలలో రచయిత ఏపాత్ర పట్లా, ఏ సన్నివేశం విషయంలోనూ ఎలాంటి రాగద్వేషాలకీ లోనుకాకుండా, ఎక్కడా తన గళం కానీ, నినాదాలు కానీ వినిపించకుండా అత్యంత సంయమనాన్ని ఆద్యంతమూ పాటించడం మరో ఎత్తు. 'మంచి నవల' కోసం సాహిత్యాభిమానులు చకోరాల్లా ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో, 'గొప్పనవల' స్థాయికి చేరుకోడానికి అన్ని అర్హతలూ ఉన్న రచన 'శప్తభూమి' ని అందించిన బండి నారాయణస్వామికి ముందుగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

'శప్తభూమి' అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. అవును, కథా స్థలం రాయలసీమ. కథాకాలం విజయనగర సామ్రాజ్య పతనానంతరం అధికారం లోకి వచ్చిన హండే రాజుల పాలనాకాలం. స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 1775 నుంచి మొదలు పెట్టి, తర్వాతి పదిహేను, ఇరవై ఏళ్ళ కాలం. ఇరవైవకటో శతాబ్దం అనేక నూతన ఆవిష్కరణలతో జెట్ వేగంతో అభివృద్ధి పధంలో దూసుకుపోతోందన్న ప్రచార హోరు మధ్య, మూడొందల ఏళ్ళు వెనక్కి వెళ్లి నాటి కథని చదవాల్సిన అవసరం ఏమిటన్నది ముందుగా వచ్చే ప్రశ్న. వర్తమానానికి, భవిష్యత్తుకీ బలమైన పునాది గతంలోనే ఉందన్నది జవాబు. మరో మాట చెప్పాలంటే, చరిత్ర అధ్యయనం ఎందుకు అవశ్యమో కూడా ఈ నవల చెబుతుంది.

ఈ నవల రాజుల కథ కాదు. రాజ్యం కథ. రాజ్యంలోని అనేక వర్గాల ప్రజల కథల సమాహారం. ఇందులో రాజ్య రక్షణ కోసం చూపిన సాహసం ఫలితంగా గొర్రెల కాపరి నుంచి అమరనాయకుడిగా ఎదిగిన బిల్లే ఎల్లప్ప కథ ఉంది, అతని అమరనాయక హోదాని ఏమాత్రమూ లెక్కపెట్టక ఒకే ఒక్క పంచాయతీతో వివాహబంధం నుంచి బయటపడిన అతని మరదలు ఇమ్మడమ్మ కథా ఉంది. నాయకరాజుల సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న రాచ వేశ్య పద్మసాని కథ, ఇంగ్లీష్ చదువులు చదివిన ఆమె కొడుకు మన్నారుదాసు కథా ఉన్నాయి. రాజుకి ఉన్న స్త్రీ వ్యసనానికి తన ముద్దుల కూతురు బలైపోతే, రహస్యంగా తిరుగుబాటు తెచ్చి రాజుని పదవీచ్యుతుణ్ణి చేసిన వ్యాపారి బయన్నగారి అనంతయ్య శ్రేష్ఠి కథతో పాటు అదే స్త్రీవ్యసనం కారణంగా వంశాన్ని కోల్పోయిన అమరనాయకుడు వీరనారాయణరెడ్డి కథా ఉంది.

కండబలం పుష్కలంగా ఉన్నా కులం బలం లేకపోవడంతో కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక అడవిదారి పట్టిన కంబళి శరభుడు, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే వీరత్వం, మనసుపడిన వాడి మీద ప్రాణాన్నే పణంగా పెట్టగలిగేంత ప్రేమ, కార్యసాధనకి అవసరమైన లౌక్యం సమపాళ్లలో ఉన్న హరియక్క, మతాన్ని ముసుగు వేసుకుని లైంగిక దోపిడీ చేసే నాగప్ప ప్రెగడ, అదే మతం ఆధారంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసిన గురవడు.. ఇలా ఎందరెందరివో కథలు. అంతే కాదు, ఒకరొట్టెకి, మూడు కాసులకి పసి పిల్లల్ని అమ్ముకునే కరువు, వర్ణవ్యవస్థకి ఆవల ఉన్న కుటుంబాల స్త్రీలని ఊరుమ్మడి సొత్తుగా మార్చే బసివి అనాచారం, స్త్రీ గౌరవం ముసుగులో అమలైన సతీసహగమనం లాంటి దురాచారాలు..వీటన్నింటినీ అక్షరబద్ధం చేసిన నవల ఇది.


అనంతపురం సంస్థానాన్ని హండే రాజు సిద్ధరామప్ప నాయుడు పాలిస్తున్న కాలంలో, ఓ నరక చతుర్దశి నాటి రాత్రి కొందరు దుండగులు ఊరి చెరువుకి గండి కొట్టబోతూ ఉంటే గొర్రెలకాపరి బిల్లే ఎల్లప్ప తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీళ్ళని కాపాడడం, ప్రభువు మెచ్చి అతన్ని రాజోద్యోగిగా నియమించడంతో ఆరంభమయ్యే కథ, అనేక వైవిధ్యభరితమైన పాత్రలు, ఊహకందని సన్నివేశాలతో పరిపుష్టమై, తనకి పదవినిచ్చిన ప్రభువు శ్రేయస్సు కోసం ఎల్లప్ప తీసుకున్న గగుర్పాటు కలిగించే నిర్ణయాన్ని అమలుపరచడంతో ముగుస్తుంది. నిపుణుడైన స్వర్ణకారుడు వెంట్రుకవాసి మందం ఉన్న పొడవాటి బంగారు తీగని అత్యంత నైపుణ్యంతో కళ్లెదుటే అల్లి అందమైన నగగా చేతికందించినప్పుడు కలిగే భావోద్వేగాలన్నీ ఏకకాలంలో అనుభవానికి వస్తాయి ఈ నవల చదవడం పూర్తిచేసే సమయానికి.

హండే రాజుల పాలనా పధ్ధతి, అధికారాలు పరిమితమే అయినా ప్రజలమీద అపరిమితమైన జులుం చూపిన అమరనాయకులు, 'మన గతి ఇంతే' అని సరిపెట్టేసుకున్న స్త్రీలు, అణగారిన వర్గాలు, వీరినుంచే పుట్టిన ఆశాజ్యోతులు, నాటి రాజకీయాలు, కళలు, వినోదాలు, ఆధ్యాత్మిక విషయాలు... ఈ నవల కాన్వాసుని ఒకటి రెండు మాటల్లో చెప్పడం అసాధ్యం. పాలకుల్నీ ప్రజల్నీ మంచి-చెడు అనే చట్రాల్లో బిగించకుండా, ఇరుపక్షాల్లోని మంచి చెడులనీ నిష్పక్షపాతంగా చెప్పడం, రచయిత తాను కథని మాత్రమే చెప్పి, అర్ధం చేసుకునే బాధ్యతని పాఠకుడికి విడిచి  పెట్టడం రచన స్థాయిని పెంచింది. పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన పాఠకుల్ని అదాటున కథా కాలంలోకి, పాత్రల మధ్యకి లాక్కుపోయేవిగా ఉన్నాయి. రాజుల విలాస జీవిత చిత్రణకి, కురువ, మాదిగ కులాల ఆచారాలు, జీవన శైలులని రికార్డు చేయడానికీ సమ ప్రాధాన్యత ఇచ్చారు రచయిత. ఆమాటకొస్తే, ఏ పాత్రనీ ఎక్కువా చెయ్యలేదు, తక్కువా చెయ్యలేదు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఈ రచనకి ఉపయోగించిన భాష. పద్దెనిమిదో శతాబ్దం నాటి రాయలసీమ భాషపై పరిశోధన చేసి, ప్రతి పాత్ర నేపధ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని వారి చేత ఆయా మాండలీకాల్లో సంభాషణలు పలికించారు రచయిత. ఉదాహరణకి, తంజావూరు నేపధ్యం కలిగిన పద్మసాని మాటలు మిగిలిన పాత్రలు పలికే సంభాషణలకి పూర్తి భిన్నంగా ఉంటాయి. పాత్ర సామాజిక స్థాయి ఏమిటన్నది, సంభాషణల్లో వాడిన మాటల ఆధారంగా సులువుగా బోధపడుతుంది పాఠకులకి. అన్నమయ్య కీర్తనల్లో వాడిన మాటలు కొన్ని సంభాషణల్లో అక్కడక్కడా మెరిశాయి. రచన తాలూకు స్థలకాలాదులని చెప్పకనే చెప్పిన భాష తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలిగేంత సరళంగా ఉంది.

ఈ నవల్లో లోపాలేవీ లేవా? చిన్నవే అయినా వాటినీ ప్రస్తావించుకోవడం అవసరం. హరియక్క పాత్ర అసంపూర్ణంగా ముగిసిన భావన కలిగింది. అదికూడా, ఆమెకి ఒక పెద్ద అన్యాయం జరిగినప్పుడు, అందుకు కారకుడు కథలో మరో ప్రధాన పాత్ర అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండాల్సింది. అలాగే, నాగప్ప ప్రెగడ పాత్ర. పేరుని బట్టి, అతని తండ్రి చేసిన లౌకిక వృత్తిని బట్టి అతడు బ్రాహ్మణుల్లో నియోగి శాఖకి చెందినవాడుగా తెలుస్తోంది. ఆలయాల్లో పని చేసే వారు వైదిక బ్రాహ్మణులు. ఒకరి వృత్తిని మరొకరు చేపట్టక పోవడం అన్నది ఇరవయ్యో శతాబ్దం వరకూ కొనసాగింది. ("యీ యింగిలీషు చదువులు లావైనకొద్దీ వైదీకులే అన్న మాటేవిఁటీ, అడ్డవైన జాతుల వాళ్ళకీ ఉద్యోగాలవుతున్నాయి గాని..." అంటాడు 'కన్యాశుల్కం' నాటకంలో నియోగి రామప్పంతులు). నాగప్ప ప్రెగడ ఆలయంలో పూజాదికాలు చేయడం ఆ కాలానికి జరిగే పని కాదు. కథా గమనానికి ఇవి అడ్డం పడేవి కాదు కానీ, జాగ్రత్త తీసుకుంటే మరింత బావుండేది అనిపించింది.

'తానా' సంస్థ 21వ మహాసభల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో గత ఏడాది డిసెంబర్ లో రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మూడు తెలుగు నవలలకు పంచింది. ఆ మొత్తంలో 'శప్తభూమి' వాటా ఎనభైవేల రూపాయలు. ఇరవై ఏళ్ళ క్రితమే 'రేగడి విత్తులు' నవలకి తానా అందించిన లక్షా ముప్ఫయి వేల రూపాయల నగదు బహుమతితో పోల్చుకుంటే రెండు లక్షల రూపాయలు చిన్నమొత్తమే (డాలర్ రేటు పరుగులు పెడుతున్న నేపథ్యంలో). పైగా ఆమొత్తాన్ని మూడు వాటాలు వేయడం వల్ల 'శప్తభూమి' కి అందింది స్వల్పమొత్తమే. కానీ, వేరే ఏ బహుమతులూ లేని వాతావరణంలో దీనినే పెద్దమొత్తంగా భావించాలి. 'శప్తభూమి' కేవలం తెలుగు సాహిత్యానికి పరిమితమైపోవాల్సిన నవల కాదు. ఎల్లలు దాటి సాహిత్యాభిమానుల్ని చేరుకోవాలి. ఈ నవల ఆంగ్లం లోకి అనువాదం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 'తానా' ఆదిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

('శప్తభూమి' రాయలసీమ చారిత్రక నవల, రచన: బండి నారాయణస్వామి, పేజీలు: 263, వెల రూ.125, తానా ప్రచురణలు, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).

ఆదివారం, ఫిబ్రవరి 25, 2018

శ్రీదేవి ...

ఏం జ్ఞాపకం చేసుకోవాలి శ్రీదేవి గురించి? బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి, కథానాయికగా సుదీర్ఘ కాలం కొనసాగి, తల్లిపాత్రలని హుందాగా అంగీకరించి వెండితెరకి వెలుగులద్దిన తార మాత్రమేనా, అంతకు మించి ఇంకేమన్నా ఉందా అన్న ప్రశ్నఉదయం నుంచీ దొలుస్తూనే ఉంది. శ్రీదేవికన్నా ముందు, శ్రీదేవి తర్వాత చాలామంది కథానాయికలున్నారు. కానీ, శ్రీదేవితో సరిసమంగా నటించి, ప్రతిభాషలోనూ తనకంటూ అభిమానులని సాధించుకోవడంతో పాటు, దక్షిణాది తారలకు గగనకుసుమమైన హిందీ సినిమా పరిశ్రమలో స్థానం సంపాదించి, ఏళ్లపాటు అగ్రతారగా వెలుగొందడం మరే నటికీ సాధ్యపడలేదు.

శ్రీదేవి విజయ రహస్యం ఏమిటి? మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది ఆమె తల్లి రాజేశ్వరిని గురించి. బాలతారగా నటిస్తున్న తన కూతుర్ని కథానాయికగా నిలబెట్టాలని నిర్ణయించుకుని, అందుకు తగ్గ కృషి చేయడంతో పాటు, కూతురు ఏమాత్రమూ క్రమశిక్షణ తప్పకుండా అనుక్షణం కంటికి రెప్పలా కాసుకొని, తన మాట జవదాటని విధంగా తర్ఫీదు ఇచ్చారు. శ్రీదేవికి తల్లి పట్ల ప్రేమ, గౌరవం కన్నా భయమే ఎక్కువ అనడానికి దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. పేరూ డబ్బూ సంపాదించుకున్న నాయికలు తల్లిదండ్రులని ధిక్కరించడం, వాళ్ళని పూర్తిగా దూరంపెట్టి ప్రేమవివాహాలు చేసుకోవడం సాధారణమే అయినా, శ్రీదేవి ఇందుకు మినహాయింపు. ఇందుకోసం ఆమె కోల్పోయిందేమిటో తెలీదు కానీ, ఒక సుదీర్ఘ కెరీర్ని సంపాదించుకోగలిగింది అని చెప్పక తప్పదు.

ఎన్టీఆర్ కి మనవరాలిగా నటిస్తున్న బేబీ శ్రీదేవి "ఎప్పటికైనా ఎన్టీఆర్ గారి పక్కన నాయికగా నటించాలన్నది నా కోరిక" అని ముద్దుముద్దుగా ఇచ్చిన ఇంటర్యూ ఆరోజుల్లో చర్చనీయాంశం. అది మొదలు, నిన్నమొన్నటి 'బాహుబలి' వివాదానికి సమాధానం వరకూ పబ్లిక్ ఫోరమ్ లో ఏం మాట్లాడినా ఎంతో ఆచితూచి మాట్లాడడం శ్రీదేవి ప్రత్యేకత. ఏంచెప్పాలి అన్నదానితో పాటు ఎలా చెప్పాలి అన్న విషయంలో కూడా స్పష్టత ఉందామెకి. అందుకే కావొచ్చు, అగ్రశ్రేణి నాయికగా ఉన్న రోజుల్లో కూడా ఆమె స్టేట్మెంట్స్ వివాదాస్పదం కాలేదు. శ్రీదేవి ఇంటర్యూలన్నీ ఒక పుస్తకంగా తీసుకొస్తే, సినిమా రంగంలో ఉన్నవారికి ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడే అవకాశం ఉంది.

Google Image

అగ్రనటి స్థానాన్ని సంపాదించుకోవడం, తీవ్రమైన పోటీని తట్టుకుని ఆ స్థానంలో మనగలగడం అంత సులువైన విషయమేమీ కాదు. ఇందుకు అందం, అభినయ సామర్ధ్యం మాత్రమే చాలవు. ఈ రెండు లక్షణాలూ ఉన్న చాలామంది ఆ స్థానానికి చేరుకోలేక పోయారు. చేరుకున్న కొద్దిమందీ నిలబడలేకపోయారు. క్రమశిక్షణ, నేర్చుకునే తత్త్వం తో పాటు ప్రవర్తన కూడా తనదైన పాత్ర పోషిస్తుంది. వీటన్నింటి కలబోతకీ 'ప్రొఫెషనలిజం' అని పేరు పెట్టింది సినిమా పరిశ్రమ. శ్రీదేవి దగ్గర అది పుష్కలం. ఆమెకి ఇది సహజాతమా, తల్లిపెంపకం వల్ల అబ్బిన గుణమా లేక కాలక్రమంలో నేర్చుకున్న విషయమా అన్నది ఇదమిద్దంగా తెలియదు కానీ, ఆమెని అగ్రశ్రేణి నాయికగా నిలబెట్టడంతో ప్రొఫెషనలిజం పాత్ర చాలా ఉందన్నది నిజం.

జయప్రద అభిమానులకి శ్రీదేవి ఒక కొరకరాని కొయ్య. జయప్రద చేయలేని పాత్రలు ఉన్నాయనీ, వాటిని శ్రీదేవి సులువుగా చేసేయగలదనీ ఎన్నో వాదోపవాదాలు. 'వసంతకోకిల' 'ఆకలిరాజ్యం' లాంటి ఉదాహరణలు. ఆ వాదం కాస్తా అభినయం నుంచి అందం దగ్గరికి వచ్చేసరికి, "జయప్రదది సహజ సౌందర్యం, శ్రీదేవి కాస్మొటిక్ బ్యూటీ" అన్న సమాధానం జయప్రద ఫాన్స్ దగ్గర సిద్ధంగా ఉండేది. కాస్మొటిక్స్ వాడకం అన్నది వెండితెరమీద కనిపించే ప్రతి ఒక్కరికీ తప్పని సరి అయినప్పటికీ, ఆ వాడకాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన నటి శ్రీదేవి. అందాన్ని పెంచుకోడానికి సినీ తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు అనే విషయం జనబాహుళ్యానికి తెలిసింది శ్రీదేవి ముక్కుకి జరిగిన సర్జరీ తర్వాతే. ఏళ్ళు గడిచినా వన్నె తరగని ఆమె సౌందర్యం వెనుక కాస్మొటిక్స్ పాత్ర బహిరంగ రహస్యమే.

సోషల్ మీడియాలో శ్రీదేవిని గురించి సర్క్యులేట్ అవుతున్న అనేకానేక సందేశాల్లో, ఒకానొకటి ఈ కాస్మొటిక్స్ గురించే. సుదీర్ఘంగా ఉన్నా, ఆలోచింపజేసేదిగా ఉంది. శ్రీదేవి హఠాన్మరణం వెనుక ఆమె చేయించుకున్న సర్జరీలు, తీసుకున్న బొటాక్స్ ల పాత్ర తక్కువ కాదన్నది ఆ సందేశం సారాంశం. వయసు దాచుకోడం కోసం తిండిని తగ్గించుకోవడం, శరీరాకృతిని కాపాడుకోవడం కోసం తీసుకున్న చికిత్సలు వీటన్నింటినీ ప్రస్తావిస్తూ సాగిన ఆ సందేశం, శ్రీదేవిని ఎంతగానో ప్రేమించే ఆమె కుటుంబం కూడా ఆమెని ఈ కాస్మొటిక్స్ బారినుంచి కాపాడలేక పోవడం విచారకరమని, శ్రీదేవికి తన అందం మీద ఉన్న అపనమ్మకం వల్లే అలవిమాలిన చికిత్సలు చేయించుకుని ప్రాణం మీదకి తెచ్చుకుందన్న ఆరోపణ ఉంది అందులో.

కారణాలు ఏవైనా కావొచ్చు, ఇకనుంచీ వెండితెర వేలుపు శ్రీదేవి ఒక గతం, ఒక చరిత్ర అనుకోవాల్సి రావడం బాధాకరం. అయితే,  ఆ చరిత్ర స్ఫూర్తివంతమైనదీ, నేర్చుకోగలిగే వాళ్లకి ఎన్నో విషయాలు నేర్పించేది కావడం ఒక చిన్న ఉపశమనం. సినీలోకపు అతిలోకసుందరికి నివాళి..

శుక్రవారం, ఫిబ్రవరి 23, 2018

గుల్జార్ కథలు

వెండితెరకి సంబంధించి 'సున్నితత్వం' అనగానే గుర్తొచ్చే పేర్లలో మొదటివరుసలో ఉండే పేరు 'గుల్జార్' ది. సినీ గేయరచయితగా, దర్శకుడిగా హిందీ సినిమా ప్రేక్షకులకి సుపరిచితుడైన గుల్జార్ కథకుడు కూడా. మొత్తం ఇరవై ఎనిమిది కథలతో 'ధువా' గుల్జార్ రాసిన ఉర్దూ కథల సంకలనం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకుంది. ఈ సంకలనాన్ని భారతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా, తెలుగుసేత బాధ్యతని ప్రముఖ రచయిత్రి, సాహితీ విమర్శకురాలు, మీదుమిక్కిలి గుల్జార్ అభిమానీ అయిన సి. మృణాళిని కి అప్పగించింది అకాడెమీ. 'గుల్జార్ కథలు' పేరిట విడుదలయ్యిందీ సంకలనం.

గుల్జార్ సినిమా మనిషి అనే విషయాన్ని గుర్తు చేస్తూ మొదటి రెండు కథలు 'బీమల్దా,' 'సన్ సెట్ బోలేవా' సినిమా రంగం నేపథ్యంలో రాసినవి. సుప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ ఎలిజీలా అనిపించే 'బిమల్దా' చివరివరకూ ఆపకుండా చదివిస్తుంది. నిజానికి, ఈ సంకలనంలో మెజారిటీ కథలకి చదివించే గుణం పుష్కలంగా ఉంది. రెండో కథ గతవైభవాన్ని నెమరువేసుకుంటూ జీవించే ఒకనాటి వెండితెర నాయిక కథ. ఈ రెండు కథలూ ముగిపు దగ్గర పట్టి ఆపుతాయి పాఠకుల్ని. సినీ హీరోని గుడ్డిగా ప్రేమించే టీనేజీ అమ్మాయి కథ 'గుడ్డో.' మిగిలిన కథలన్నీ సినిమా వాసన తగలనివే.

భారత్-పాకిస్తాన్ ల విభజన గుల్జార్ కళ్ళముందే జరిగింది. ఆ సంఘటన ప్రత్యక్ష సాక్షుల్లో చాలామంది లాగే, గుల్జార్నీ ఆ నాటి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. విభజన ఇతివృత్తంగా ఆయన రాసిన రెండు కథలు 'రావి నదికి ఆవల,' 'విభజన.' రెండూ కూడా వెంటాడే కథలే. ఒక కథా రచయిత ప్రధాన పాత్రగా రాసిన 'ఇది ఎవరి కథ?' ముగింపు, కథకుడిగా గుల్జార్ సామాజిక స్పృహకి ఒక చిన్న మచ్చుతునక. మతకల్లోలాల నేపథ్యంలో రాసిన కథ 'భయం.' ఈ కథ ముగింపు నుంచి అనేక కథలు పుట్టే అవకాశం ఉంది నిజానికి. 'పొగ' కథకీ మతమే నేపధ్యం.


ఫెమినిజం అంటే శానిటరీ నాప్కిన్ల వాడకాన్ని, వివాహేతర సంబంధాల్ని గ్లోరిఫై చేయడం మాత్రమే అని నమ్ముతున్న రచయితలు తప్పక చదివావాల్సిన కథలు 'మగవాడు,' 'వివాహ బంధం.' గుల్జార్ ఎంతటి స్త్రీ పక్షపాతో చెప్పకనే చెబుతాయి ఈ రెండు కథలూ. పంచతంత్రాన్ని తలపించే 'అరణ్యగాధ' విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేతని ప్రశ్నిస్తుంది. 'నిప్పుని మచ్చిక చేసుకున్న హబు' కూడా ఈకోవకి చెందిందే. హవేలీ కథ 'డాలియా' లో ముగింపు ఊహించగలిగేదే అయినా, కథ ఆ ముగింపుకి ఎలా చేరుకుంటుందన్న ఆసక్తిని చివరికంటా కొనసాగించారు రచయిత.

మొత్తం మీద చూసినప్పుడు, భిన్న ఇతివృత్తాలని, విభిన్న కథన రీతులని ఎంచుకుని ఈ కథల్ని చెప్పారు గుల్జార్. వాటిని అత్యంత అలవోకగా అనువదించారు మృణాళిని. పాత్రల పేర్లు, ప్రదేశాలు మినహాయిస్తే ఎక్కడా అనువాదం అన్న భావన కలగకపోవడం తాలూకు గొప్పదనాన్ని కథకుడితో పాటు అనువాదకురాలికీ పంచాల్సిందే. విషయసూచికలో దొర్లినన్ని అక్షరదోషాలు కథల్లో కనిపించక పోవడం పెద్ద ఉపశమనం. వైవిద్యభరితమైన కథల్నీ, కథన రీతుల్నీ ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన కథా సంకలనం ఇది. (సాహిత్య అకాడమీ ప్రచురణ, పేజీలు 200, వెల రూ. 100, న్యూ ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న సాహిత్య అకాడమీ కార్యాలయాలు, మరియు అకాడమీ స్టాల్స్ లో లభిస్తుంది).

సోమవారం, ఫిబ్రవరి 19, 2018

ప్రేమపల్లకీ

నలభయ్యేళ్ళ నాటి ఈ నవలని ఇవాళ మళ్ళీ ప్రస్తావించుకోడానికి ఏకైక కారణం శ్రీరమణ. భార్యాభర్తల చిలిపి తగువులకి తన మార్కు చమక్కులని అద్ది, మళ్ళీ చదివినా బోర్ కొట్టని విధంగా తీర్చి దిద్దారు. ఇప్పటికైతే, శ్రీరమణ ప్రచురించిన ఏకైక నవల ఇది. మరో నవల రాబోతోందని చాన్నాళ్లుగా ఊరిస్తున్నారు కానీ, వస్తున్న అజ కనిపించడం లేదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ సంపాదకత్వంలోని 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో 1978-79 కాలంలో సీరియల్ గా వచ్చి, అటుపై ఒకే ఒక్క సారి నవలగా ప్రింట్ అయ్యి కొద్దిపాటి లైబ్రరీలకి మాత్రమే పరిమితమైన ఈ పుస్తకాన్ని తాజాగా ప్రచురించారు సాహితి ప్రచురణలు వారు.

కథలోకి వెళ్ళిపోతే, రాంపండు-గీత కొత్తగా పెళ్ళైన దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్తులు మరియు వేరేటి కాపురం. రాంపండు 'స్వీట్ హోమ్' నవల్లో బుచ్చిబాబు లాగా అమాయకుడు మరియు మంచివాడు. గీతకూడా అచ్చం అదే నవల్లో విమల లాంటిదే. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనీ, ఆ పెళ్ళిలో పూసల పల్లకీలో ఊరేగాలనీ రాంపండు చిరకాల వాంఛ. ఆ రెండు కోరికలూ తీరనే లేదు. కవిత్వం రాయాలనే, ఇల్లు కళాత్మకంగా అలంకరించుకోవాలనీ.. ఇలా చాలా చాలా ఊహలే ఉన్నా, వాస్తవాలు వేరే రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఏమాటకామాటే, కొత్త కాపురం అవ్వడం వల్లనో ఏమో కానీ, గీత అనుకూలవతి అయిన ఇల్లాలే. అయినా కూడా రాంపండులో ఏదో అసంతృప్తి.

ఆఫీసులో వాళ్ళు, స్నేహితులూ రాంపండు మంచితనాన్ని వాడేసుకుంటూ ఉంటారు. ఫలితంగా అతగాడు అప్పుడప్పుడూ చిక్కుల్లో పడుతూ ఉంటాడు. ఆ చిక్కుల్నించి గీతే అతగాణ్ణి ఒడ్డున పడేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు గీతమీద విపరీతంగా ప్రేమకలిగినా, ప్రేమలేఖలు, పూసలపల్లకీ మిస్సైన బాధని ఓ పట్టాన మర్చిపోలేకుండా ఉంటాడు. ఈ సమస్యకి కూడా గీతే పరిష్కారం వెతికింది. "ఇద్దరం కొన్నాళ్ల పాటు ప్రేమికులుగా ఉండిపోదాం" అని ప్రతిపాదించి, రాంపండు ని ఒప్పించేస్తుంది. ప్రేమికులైపోవడం అంటే భావగీతాలు పాడుకోవడం అన్నట్టుగా కలల్లో తేలిపోవడం ఆరంభిస్తాడు మన కథానాయకుడు.


"ప్రేమికులు వంట చేసుకోరు" అంటూ హోటల్ కేరేజీ తెప్పించడం మొదలు, "ఇంటి పనులుంటే ప్రేమించడం కుదరదు" అని పనిపిల్లని కుదర్చడం వరకూ రాత్రికి రాత్రే అప్పటివరకూ వస్తున్న ఇంటి పధ్ధతిని సమూలంగా మార్చేస్తుంది గీత. ప్రేమ జీవితం బాగుందో బాలేదు రాంపండు తేల్చుకోక మునుపే, "ప్రేమికులకి విరహం అవసరం రామ్" అని చెప్పి, ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటి రైలెక్కేస్తుంది గీత. కథ కంగాళీ అయిపోకుండా రక్షించడం కోసం, గీత చెల్లెలు సీతని కథలో ప్రెవేశ పెట్టి ఆమెకి పెళ్లి కుదురుస్తారు రచయిత. ఆ పెళ్ళిలో రాంపండు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. పూసల పల్లకీ గురించి అతగాడికి జ్ఞానోదయం కలగడం నవలకి ముగింపు.

గీత మాట్లాడే మాటలు, చేసే పనులు చాలాసార్లు 'పెళ్ళిపుస్తకం,'  'మిస్టర్ పెళ్ళాం' సినిమాల్లో నాయికలని గుర్తు చేశాయి. బాపూకి గీత పాత్ర చాలా ఇష్టమని, ఆ ఇద్దరు నాయికల మీద గీత ప్రభావం ఉందనీ శ్రీరమణ రాసిన ముందుమాటని చివర్లో చదివినప్పుడు తెలిసింది. ముందుగా టైటిల్ తో ప్రకటనలు ఇచ్చేశారనీ, కాలమ్ రాసినట్టే ఏ వారానికి ఆదివారం రాసిచ్చేయొచ్చు అనుకుని ముందస్తు ఏర్పాట్లు పెద్దగా చేసుకోకుండా నవలా రచనలోకి దిగిపోయాననీ ఒప్పేసుకున్నారు కూడా. ఈ సీరియల్ విజయవంతమైన ఉత్సాహంలో పురాణం 'రంగుల రామచిలుక' అనే సీరియల్ ప్రకటన ఇచ్చేశారట కానీ, రాసేందుకు శ్రీరమణ ఒప్పుకోలేదట.

'ప్రేమపల్లకీ' దగ్గరకి వస్తే, సత్తా ఉన్న రచయిత సాధారణమైన విషయాన్ని కూడా చదివించేలా ఎలా రాయగలడు అన్న దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. నవలంతా ఒకే గ్రాఫ్ లో వెళ్లకుండా, అక్కడక్కడా ఆసక్తి తగ్గిపోతూ ఉండడం, ఆ వెంటనే కథలో మలుపు చోటు చేసుకోవడం గమనించినప్పుడు పాఠకాభిరుచికి అనుగుణంగా అప్పటికప్పుడు రచయిత తన సీరియల్ లో మార్పులు చేసుకున్న వైనం అర్ధమవుతుంది. రాంపండు పాత్రని కాస్తైనా వాస్తవానికి దగ్గరగా చిత్రించి ఉంటే చాలా ఆసక్తికరమైన నవల అయి ఉండేది అనిపించింది. (పేజీలు 176, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, జనవరి 24, 2018

నవ వసంతం

చూస్తుండగానే 'పుట్టినరోజు జేజేలు...' పాడుకునే రోజు మళ్ళీ వచ్చేసింది. ఎప్పటిలాగే రాసిన విషయాల కన్నా రాయాల్సినవే ఎక్కువ మిగిల్చిన ఏడాది ఇది. అవును, 'నెమలికన్ను' కి తొమ్మిదేళ్లు నిండాయి. ఎప్పటిలాగే గడిచిన ఏడాది కూడా చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల వివరాలే బ్లాగు రాతల్లో సింహ భాగాన్ని ఆక్రమించాయి. మిత్రుల ఆదరణ, ప్రోత్సాహం యధావిధిగా కొనసాగుతున్నాయి. వాళ్ళకే కాదు, అప్పుడప్పుడూ నాకూ ఎదురవుతున్న ప్రశ్న 'ఎందుకు తరచుగా రాయడం లేదు?' ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరికైనా చెప్పేందుకే కాదు, నాకు నేను చెప్పుకునేందుకూ సంతృప్తికరమైన జవాబు దొరకడం లేదు.

ఇతర మాధ్యమాలలో తెలుగు వినియోగంలోకి రావడంతో, బ్లాగింగ్ బాగా తగ్గిపోయింది అన్నది అక్కడక్కడా వినిపిస్తున్న ఫిర్యాదు. కొన్ని బ్లాగుల విషయంలో ఇది నిజమే కూడా. కానీ, బ్లాగులకి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చి గతంలో అంత విస్తృతంగా కాకపోయినా పోస్టులు రాస్తున్న, చదువుతున్న మిత్రులకి కొదవలేదు. ఇంకా చెప్పాలంటే బ్లాగింగ్ ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఎవరూ బ్లాగుల్ని విడిచిపెట్టలేదు. టపాల సంఖ్యనే ప్రాతిపదికగా తీసుకున్నా, గతేడాదిలో రాసిన యాభై నాలుగు పోస్టులని 'పూర్ పెర్ఫార్మన్స్'  కేటగిరీలో వేయలేను. ఇంతకన్నా తక్కువ రాసిన సందర్భాలు ఉన్నాయి మరి.

రాయాల్సిన విషయాలకి కొదవ లేకపోయినా రాయడం అన్నది తరచూ వాయిదా పడుతూ ఉండడం కొంచం గట్టిగానే ఆలోచించాల్సిన విషయం. 'నీచమానవుణ్ణి' కాకూడదని ('ఆరంభించరు నీచ మానవుల్..') ఎప్పటికప్పుడు హెచ్చరించుకుంటూనే, బ్లాగు విషయంలో ఎక్కువసార్లు అలాగే మిగిలిపోతూ ఉండడం నాకూ బాగాలేదు. అప్పుడప్పుడూ పాత టపాలు చదివినప్పుడు (నావీ, మిత్రులవీ) ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాస్తే మరికొన్నాళ్లు తర్వాత వాటినీ ఇలాగే చదువుకోవచ్చు అని. బ్లాగుల నుంచి నాస్టాల్జియాని విడదీయడం మన తరమా?


గతేడాది బ్లాగింగ్ వరకూ చూస్తే, ఏమాత్రం ముందస్తు ప్లానింగ్ లేకుండా మొదలు పెట్టి ఏకబిగిన పూర్తి చేసింది 'కన్యాశుల్కం' సిరీస్. గురజాడ వారి 'కన్యాశుల్కం' నాటకానికి నూట పాతికేళ్ల పండుగ జరుగుతున్న సందర్భంగా ఏదన్నా ఒక పోస్టు రాయాలన్న ఆలోచన, నెమ్మదిగా 'ఒక్కో పాత్రని గురించీ రాస్తే' వరకూ పెరగడం, అకారాది క్రమంలో ముఖ్య పాత్రల పరిచయాలు రాయడం జరిగిపోయింది. ఒక్కో పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని బాగా అర్ధం చేసుకోవడం కోసం ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, 'కన్యాశుల్కం' నాటకం గొప్పదనాన్ని మరికొంచం అర్ధం చేసుకోవడం (ఇంకా చాలా మిగిలే ఉంది) జరిగాయి.

మనసులో పుట్టిన చాలా కథలు కీబోర్డు వరకూ రాకుండానే ఆగిపోయాయి. ఏళ్ళ తరబడి వాయిదా వేస్తున్న రాతలు 'మా సంగతి ఏమిటి?' అని కొంచం మర్యాదగానే గుర్తు చేస్తున్నాయి. చదువు విషయానికి వస్తే, నాన్-ఫిక్షన్ దారిలో వెళ్తోంది బండి. మధ్యలో బ్రేక్ కోసమైనా ఫిక్షన్ చదవాలని బలంగా అనిపిస్తోంది ఒక్కోసారి. కొన్ని మంచి సినిమాలు చూశాను. 'అద్భుతం' అనదగ్గవి తారస పడలేదు. మొత్తం మీద చూసినప్పుడు, సింహావలోకనంలో 'మరికొంచం తరచుగా రాయాలి' అన్నది నాకు బాగా అనిపించిన విషయం. తొమ్మిదేళ్లుగా 'నెమలికన్ను' అని అభిమానిస్తూ, ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు!!