సోమవారం, జులై 26, 2021

జయంతి ...

 కొందరు నటీనటుల్ని తలచుకోగానే వారికి సంబంధించిన ఒకటో రెండో విషయాలు ప్రస్ఫుటంగా మొదట గుర్తొస్తాయి. అలా జయంతి అనుకోగానే నాకు మొదట గుర్తొచ్చేది ఆమె గొంతు. జయంతి గొంతుకు నేను ఫ్యాన్ ని. రేడియోతో పాటు పేపర్లు పుస్తకాలూ, అటుపైన టీవీ అలవాటున్న ఇల్లవ్వడం వల్ల మా ఇంట్లో సినిమా కబుర్లతో సహా సకల సంగతులూ దొర్లుతూ ఉండేవి. "ఆ జయంతి గొంతేంటి బాబూ, రేకు మీద మేకుతో గీసినట్టుంటుంది" అంది మా పిన్ని ఓసారి. బహుశా అప్పుడే నేను జయంతి గొంతుని శ్రద్ధగా వినడమూ, అభిమానించడమూ మొదలైనట్టుంది. ఆమె గొంతు మెత్తనా కాదు, అలాగని గరుకూ కాదు. ఒకలాంటి సన్నని జీరతో, కాస్త విషాదాన్ని నింపుకున్నట్టుగా (రొమాంటిక్ డైలాగులు చెబుతున్నా సరే) వినిపిస్తుంది. ఆ జీరే నాకు బాగా నచ్చి ఉంటుంది బహుశా. 

మిగిలిన భాషల్లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసినా, తెలుగులో బాగా పేరు తెచ్చినవి మాత్రం సహాయ పాత్రలే. నాగేశ్వరరావుకి చెల్లెలు,  ఎన్టీఆర్   డబుల్ ఫోటో సినిమాల్లో ముసలి పాత్రకి భార్య.. ఇలా అన్నమాట. నాగేశ్వరరావు-వాణిశ్రీల 'బంగారు బాబు' సినిమా గుర్తుందా? అందులో హీరో చెల్లెలు 'చంద్ర' పాత్రలో జయంతి. చంద్ర అంధురాలు. ఆమెకి కళ్ళు రప్పించడమే హీరో జీవిత ధ్యేయం. మరీ రిక్షాలూ అవీ తొక్కించకుండా రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఏర్పాటు చేశారు. "నీకిష్టమని ఉప్మా చేశానన్నయ్యా" అనే డైలాగు, ఓ చేతిలో ప్లేటు, మరో చేత్తో తడుముకుంటూ జయంతి ఎంట్రీ, నేను మర్చిపోలేని సీన్లలో ఒకటి. దాదాపు అదే టైములో వచ్చిన కృష్ణ 'మాయదారి మల్లిగాడు' లో ఇంకో ఉదాత్తమైన చెల్లెలి లాంటి పాత్ర. పడుపు వృత్తిలో ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది. ఆ సినిమాలో సూపర్ హిట్ పాట 'మల్లెపందిరి నీడలోనా జాబిల్లీ..' ఆమె కలే!!

ఎన్టీఆర్-జయంతి కాంబినేషన్ గురించి ఓ పుస్తకం రాయొచ్చు అసలు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, వాటిలో సెంటిమెంటు సీన్లకి అస్సలు లోటు లేకపోవడం, ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించడమూను. అటు 'జస్టిస్ చౌదరి' లోనూ, ఇటు 'కొండవీటి సింహం' లోనూ ఒకటికి ఇద్దరు ఎన్టీఆర్లతో ఒకే ఫ్రేమ్లో సెంటిమెంట్ సీన్లు పండించిన నటి జయంతి. అసలు, 'ఊర్వశి' శారదని 'సారో క్వీన్' అంటారు కానీ ('మనుషులు మారాలి' సినిమా నుంచీ) ఆ బిరుదు జయంతికి ఇవ్వాలి. కావాలంటే ' కొండవీటి సింహం' లో 'మా ఇంటిలోన మహలక్ష్మి నీవే' పాటోసారి చూడండి. ఓ పక్క వృద్ధ ఎన్టీఆర్ లౌడ్ గా సెంటిమెంట్ అభినయిస్తూ ఉంటాడు. మధ్యలో చిన్న ఎన్టీఆర్ వచ్చి చేరతాడు (జూనియర్ కాదు). తన పాత్రేమో కుర్చీకే పరిమితం (పెరలైజ్డ్). చక్రాల కుర్చీలోంచి కదలకుండా అభినయించాలి. ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది కానీ, అప్పట్లో ఆ పాట మహిళల చేత కన్నీళ్లు పెట్టించి, కాసులు కురిపించింది. 


వీళ్లిద్దరి కాంబోని తలచుకోగానే అప్రయత్నంగా గుర్తొచ్చే ఇంకో పాట 'జస్టిస్ చౌదరి' లో పెళ్లి పాట. వేటూరి మనసు పెట్టి రాసిన 'శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వే కట్నం..' సాహిత్యంలో నాకు ఇష్టమైన లైన్స్ అన్నీ జయంతి మీదే చిత్రీకరించారు. ముఖ్యంగా 'అడగలేదు అమ్మనైనా' చరణంలో విషాదం సుశీల గొంతులో బాగా పలికినా, నాకెందుకో జయంతి చేతే పాడించే ప్రయత్నం చేయాల్సింది (ఆమె గాయని కూడా) అనిపిస్తూ ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితపు జోలికి ఎందుకు గానీ, వృత్తిగతంగా వివాదంలో జయంతి పేరు బాగా వినిపించింది మాత్రం 'పెదరాయుడు' షూటింగ్ అప్పుడు. ఓ సీన్లో ఆమె పరిగెత్తాలిట. ఆమె పరిగెత్తలేను అందిట. ఆమె రోజూ ఉదయం వాకింగ్, రన్నింగ్ చేయడం హీరో కమ్ నిర్మాత మోహన్ బాబు చూశాట్ట. పంచాయతీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. డైలాగుల కేసెట్ చాలాసార్లు వినేయడం వల్ల నేనా సినిమా చూడలేదు. అప్పట్లో 'ఆంధ్రప్రభ' ఈ సంగతులన్నీ పసందుగా రిపోర్టు చేసింది. 

కేసెట్ అనగానే గుర్తొచ్చిన ఇంకో విషయం ప్రయివేటు మిమిక్రీ కేసెట్లు. పందొమ్మిది వందల ఎనభయ్యవ దశకంలో ప్రయివేటు మిమిక్రీ కేసెట్లు విరివిగా వచ్చేవి. సహజంగానే వాటిలో సినిమా వాళ్ళ గొంతులు మిమిక్రీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీ చానళ్ళు పండగ స్పెషల్ ప్రోగ్రాం కోసం ఏదో ఒక థీమ్ అనుకుంటున్నట్టుగా, ఈ కేసెట్లకి కూడా ఒక్కో థీమ్ ఉండేది. కేసెట్ ఏదైనా జయంతి పాత్రకి సెంటిమెంట్ డైలాగులే, ముఖ్యంగా 'నాకేం కావాలండీ.. డబ్బాడు పసుపు, డబ్బాడు కుంకుమ చాలీ జీవితానికి' అనే డైలాగు తప్పనిసరిగా వినిపించేది. (అప్పట్లో ఇలాంటి కేసెట్లు చేసిన ఒకాయన ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్య విద్వాన్ గా పరిణమించడం విశేషం). ఈ మిమిక్రీల వల్ల కూడా జయంతి అంటే సెంటిమెంటు అనే ముద్ర బలపడిపోయింది జనాల్లో. అసలు జయంతి తెరమీద కనిపించగానే ఆ పాత్రకి కథలో రాబోయే కష్టాలని ఊహించేసిన వాళ్ళు నాకు తెలుసు. 

కె. విశ్వనాథ్ 'స్వాతి కిరణం' లో జయంతి పాత్ర పేరు పక్షితీర్థం మామ్మగారు. కథా నాయకుడు గంగాధరానికి సంగీతంలో తొలి గురువు ఈ మామ్మగారే. జయంతి కేవలం సినిమాలే కాదు టీవీలోనూ నటించారని ఎందరికి తెలుసో మరి. ఈటీవీలో వచ్చిన 'అనూహ్య' సీరియల్లో కథానాయిక అనూహ్య (శిల్పా చక్రవర్తి) బామ్మ అనసూయమ్మ పాత్రలో కనిపించారామె. 'అయ్యో రామా అనూహ్య మనసే పారేసుకుందీ' అనే టైటిల్ సాంగ్ తో వచ్చిన ఆ సీరియల్ నేను క్రమం తప్పకుండా చూడడానికి ఒకే ఒక్క కారణం జయంతి. ఆ కథలో బామ్మ పాత్ర కీలకం. భలే గంభీరమైన డైలాగులు ఉండేవి జయంతికి. మనకి సినిమా అంటే హీరోలు. అప్పుడప్పుడూ హీరోయిన్లు కూడా. కథ మొదలు, కెమెరా వరకూ అన్నీ వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమాల్లో కొద్దిమంది ఇతర నటీనటులు మాత్రం తమదైన ముద్ర వేస్తారు. అలాంటి కొద్దిమందిలో జయంతి ఒకరు. ఆమె ఆత్మకి శాంతి కలగాలి.