శుక్రవారం, ఏప్రిల్ 08, 2011

నల్లరేగడి

పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి గ్రామ రాజకీయాలెలా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఒక్కసారిగా తమ జ్ఞాపకాలని తడిమి చూసుకునే నవల పాలగుమ్మి పద్మరాజు రాసిన 'నల్లరేగడి.' గ్రామీణ జీవితంతో ఏ మాత్రమూ పరిచయం లేనివాళ్ళకి అక్కడి ఒకనాటి సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిస్థితులని గురించి దాదాపు పూర్తిగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుందీ పుస్తకం. సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ నవలని 'పాలగుమ్మి పద్మరాజు రచనలు-2' సంకలనంలో మూడో నవలగా అందించింది విశాలాంధ్ర.

కథాకాలం దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళు. కథాస్థలం ఆంధ్ర దేశంలోని ఓ పల్లెటూరు. ఊరికేల్లా ఇద్దరే మోతుబరి రైతులు రామయ్య కాపు, సుబ్బయ్య కాపు. ఇద్దరిదీ చక్కని స్నేహం. ఒకరినొకరు బావా అని పిలుచుకుంటూ, ఊరి బాగుకోసం కలిసి పని చేయడమే కాదు వియ్యమందాలని కూడా నిర్ణయించుకుంటారు. మోతుబరులిద్దరూ ఏకమైపోతే ఊళ్ళో తన ఉనికి ప్రశ్నార్ధకమవుతుందన్న భయం మొదలవుతుంది కరణం ధర్మరాజులో.

కథానాయకుడు రాజు, సుబ్బయ్య కాపు చిన్న కొడుకు. ఆధునిక భావాలున్న వాడు. వ్యవసాయ పద్ధతుల మొదలు, కుటుంబ సంప్రదాయాల వరకూ ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నవాడు. నాయిక లక్ష్మి రామయ్య కాపు గారాబుపట్టి. రాజంటే ప్రాణం ఆమెకి. రాజు ఇంట్లోనే ఉండే అతనికి మరదలి వరసయ్యే దూరపు బంధువు మల్లికి రాజుమీద అవ్యక్తమైన అభిమానం. చాలా సందర్భాల్లో రాజు అభిప్రాయాలూ అతను చేసే పనులూ తండ్రికీ, మామకీ ఇష్టం ఉండవు. కానీ అతను ఏం చేసినా ఆలోచించే చేస్తాడని నమ్మకం వాళ్లకి.

ఊరి పద్ధతికి విరుద్ధంగా ట్రాక్టరు వ్యవసాయం మొదలు పెడతారు రాజు. ఇది పెద్దలకి నచ్చదు. పశువులు తమ చెప్పుచేతల్లో ఉంటాయి, కానీ యంత్రం ఎలా పని చేస్తుందో తెలీదు. అదీకాక వ్యవసాయపు పనుల్ని నమ్ముకున్న కూలీల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇవన్నీ ఆలోచించినప్పటికీ, వాళ్ళు రాజుని నిరుత్సాహ పరచరు. అలాగే పెళ్ళికి కట్నం తీసుకోనంటాడు రాజు. ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా చట్టం చేసిన్దంటాడు. ఇవ్వకపోవడం తనకి పరువు తక్కువగా భావిస్తాడు రామయ్యకాపు. తీసుకోకుండా ఉండడం సుబ్బయ్యకాపుకీ ఇష్టం ఉండదు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడదన్నది రాజు అభిప్రాయం. అందుకే తన పెళ్ళికి ముందే తన కోసం ఇంటి నిర్మాణం మొదలు పెడతాడు. ఈ విషయంలోనూ పెద్దవాళ్ళే సర్దుకుంటారు. గ్రామదేవత మల్లమ్మ తల్లి జాతరకి ముందు అమ్మవారి సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటారు రామయ్య కాపు, సుబ్బయ్య కాపు. ఇక ముహూర్తాలు నిర్ణయించుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో, గుడి దగ్గర చిన్నగా మొదలైన ఓ తగువు రెండు కుటుంబాల మధ్యనా దూరాన్ని పెంచి పెంచి రామయ్య కాపు సుబ్బయ్యకాపులిద్దరినీ బద్ధ శత్రువులని చేస్తుంది.

ఎప్పుడూ లేని విధంగా ఊళ్లోకి పోలీసులు వస్తారు. అప్పుడే పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామ రాజకీయాలు వేడందుకుంటాయి. ధర్మరాజు తన చానక్యాన్ని చూపి ఊళ్ళో ముఖ్యుడైపోతాడు. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలో హత్య, కిడ్నాపులు జరుగుతాయి. ఊహించని మలుపులతో కథ చకచకా సాగి ఊహాతీతమైన ముగింపుకి చేరుకుంటుంది. ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే కథనం. కాకపొతే లెక్కకి మిక్కిలిగా ఉన్న అచ్చుతప్పులు చికాకు కలిగిస్తాయి.

నిజానికి నేను ఈ సంకలనం లో ఉన్న 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' 'రామరాజ్యానికి రహదారి' నవలలు పూర్తి చేసి, కొంత విరామం తర్వాత ఈ నవల చదవాలని అనుకున్నాను. కానీ అంతకాలం బుక్ షెల్ఫ్ లో నిరీక్షించడానికి పద్మరాజు గారు ససేమిరా అన్నారు. ఒక పాత్రకీ, మరోపాత్రకీ ఎలాంటి పోలికా లేకుండా పాత్రలని సృష్టించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేయడం, మనస్తత్వాలని ఆధారంగా చేసుకుని కథని మలుపులు తిప్పడం పద్మరాజు గారి ప్రత్యేకత. (మూడు నవలల సంకలనం లో పేజీలు: 391, వెల రూ.180, విశాలాంధ్ర అన్ని శాఖలు)

3 కామెంట్‌లు:

  1. నల్లరేగడి సినిమాగా వచ్చింది. చీకటివెలుగులు నిర్మించిన రంజిత్‌కుమారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాడని గుర్తు. కృష్ణ హీరో. జయప్రద హీరోయిన్ అని గుర్తు. మల్లి పాత్ర రోజారమణి ధరించింది. సినిమా బాగా ఆడలేదు.

    పుస్తకం కూడా దాదాపు సినిమా వచ్చిన సమయంలోనే వచ్చింది; ఎమెస్కో పాకెట్ బుక్ అని గుర్తు. సినిమాకోసం రాసుకున్న కథ నవల అయ్యిందేమోనని అనుమానం.

    పద్మరాజుగారిలో ఉన్న విశిష్ట గుణమేమిటంటే ఆయన నగరంలో ఐశ్వర్యవంతుల సంస్కృతినుంచి, పల్లెల్లో పాలేర్ల జీవితం వరకూ సాధికారికంగా వ్రాయగలరు. అది ఈ నవలలో కూడా కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. నల్లరేగడి సినిమాగా వచ్చింది. చీకటివెలుగులు నిర్మించిన రంజిత్‌కుమారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాడని గుర్తు. కృష్ణ హీరో. జయప్రద హీరోయిన్ అని గుర్తు. మల్లి పాత్ర రోజారమణి ధరించింది. సినిమా బాగా ఆడలేదు.

    పుస్తకం కూడా దాదాపు సినిమా వచ్చిన సమయంలోనే వచ్చింది; ఎమెస్కో పాకెట్ బుక్ అని గుర్తు. సినిమాకోసం రాసుకున్న కథ నవల అయ్యిందేమోనని అనుమానం.

    పద్మరాజుగారిలో ఉన్న విశిష్ట గుణమేమిటంటే ఆయన నగరంలో ఐశ్వర్యవంతుల సంస్కృతినుంచి, పల్లెల్లో పాలేర్ల జీవితం వరకూ సాధికారికంగా వ్రాయగలరు. అది ఈ నవలలో కూడా కనిపిస్తుంది. -- జంపాల చౌదరి

    రిప్లయితొలగించండి
  3. @జంపాల చౌదరి: నవల చదువుతుంటే చాలా చోట్ల సినిమా స్క్రిప్ట్ లా అనిపించిందండీ.. ముఖ్యంగా మల్లి పాత్ర, క్లైమాక్స్ దృశ్యాలు సినిమాని తలపించాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి