మంగళవారం, మార్చి 22, 2011

రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన

తెలుగు సాహిత్యంలో వ్యంగ్య రచనలు తక్కువే. మరీ ముఖ్యంగా రాజకీయాలపై వచ్చిన వ్యంగ్య నవలలు, నవలికలు మరీ తక్కువ. వ్యంగ్యం రాసి ఒప్పించడం అక్షరాలా కత్తిమీద సాము కావడం ఇందుకు కారణం కావొచ్చు. తెలుగు కథా సాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న కథకుడు పాలగుమ్మి పద్మరాజు రాసిన వ్యంగ్య నవలిక 'రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన.' కథకుడిగా లోతైన మనస్తత్వ చిత్రణకి పెట్టింది పేరైన పద్మరాజు, డెబ్భయ్యవ దశకం లోని దేశ రాజకీయాలని నేపధ్యంగా తీసుకుని వ్యంగ్య ధోరణిలో రాసిన నవలిక ఇది.

పశ్చిమగోదావరి జిల్లా 'పేర్వాలి' గ్రామానికి చెందిన మోరి అశోక వర్ధన రాజు అనే సామాన్య క్షత్రియుడు, ఊహించని పరిస్థితుల్లో దేశానికి రాజు కావడం, కేవలం మూడు రోజులు మాత్రమే దేశాన్ని పాలించినా, తన అజ్ఞానం కారణంగా పాలనపై తనదైన ముద్ర వేయడమే ఈ తొంభై రెండు పేజీల నవలికలో కథ. అసలు ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి రాజుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా, కేవలం పెరవలి గ్రామం తప్ప ప్రపంచం ఏమాత్రమూ తెలియని, ఇల్లు కదలకుండా అశోకుడి శాసనాలని అనువదించుకుంటూ కాలం గడిపే అశోకవర్ధన రాజుని రాచ పదవికి ఎంపిక చేయడం ఏమిటి?

ఈ నవలిక చదువుతుంటే, మొత్తంగా దేశ రాజకీయాలని, విడి విడిగా ప్రతి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులని, అనేకానేక అంశాల మీద ప్రముఖ రాజకీయ పార్టీల వైఖరులనీ రచయిత ఎంత నిశితంగా గమనించారో అర్ధమై, ఆశ్చర్యం కలుగుతుంది. ఉత్తరాది వారి హిందీ భాషాభిమానం, శివ సైనికుల ప్రాంతీయ వాదం, ఘెరావోల పట్ల బెంగాలీల మమకారం, కమ్యూనిస్టుల్లో చైనా-రష్యా గ్రూపులు, నక్సల్బరీ పార్టీల్లోని సిద్ధాంతపరమైన చీలికలూ.. ఇలా ఏ విషయాన్నీ విడిచిపెట్టకుండా లోతుగా పరిశీలించి, సందర్భానికి తగ్గట్టుగా పుస్తకంలో ఉపయోగించుకున్నారు పద్మరాజు.


అవసర విషయాలని పక్కన పెట్టి, అనవసరమైన విషయాల గురించి రోజుల తరబడి చర్చల పేరుతో పోట్లాడుకునే గౌరవ పార్లమెంటు సభ్యులు, అధికారంలో ఉన్న వారిని ఇరుకున పెట్టడమే పనిగా రంద్రాన్వేషణకి పూనుకునే ప్రతిపక్షీయులు, తమ రాజకీయ భవితవ్యం కోసం ఏమైనా చేసే నాయకులు, పదవి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడని వ్యాపారవేత్తలు వీళ్ళందరినీ వ్యంగ్య ధోరణిలో చిత్రించారు రచయిత. కేరళ కి చెందిన ఎనిమిదేళ్ళ కుర్రాడు బాలకృష్ణ నాయర్ (బాలూ) కథ ద్వారా, శివసేన పోరాటాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర వచ్చి స్థిరపడ్డ ప్రజల ఇబ్బందులని కళ్ళకు కట్టారు. అయితే కథ గడిచే కొద్దీ, బాలూకి వయసుకి మించిన నాయకత్వ లక్షణాలు ఆపాదించడం వల్ల ఆ పాత్ర సహజత్వానికి దూరంగా జరిగినట్టుగా అనిపించింది.

కేవలం దేశానికి సంబంధించిన అంశాల మీదే కాదు, అంతర్జాతీయ రాజకీయాల మీదా రచయితకి మంచి పట్టు ఉందని నిరూపించే ఘట్టాలు ఈ నవలలో అనేకం. ముఖ్యంగా భారతదేశం రాచరికం వైపు వెళ్తోందనగానే వివిధ దేశాల స్పందనలనీ, వాటి వెనుక అంతరార్దాలనీ చెప్పకనే చెప్పారు. అలాగే ఏ దేశం నుంచి సహాయం ఏ రూపం నుంచి వస్తుందన్న రచయిత ఊహ, ఈనాటికీ ఆయా దేశాల పాలసీలకి తగ్గట్టుగా ఉండడం విశేషం. అశోక వర్ధన రాజు జీవితం, పదవి దక్కాక ఒక్కసారిగా అతనిలో వచ్చిన మార్పు, అతని అజ్ఞానాన్ని పొరుగు దేశాలు మహాజ్ఞానంగా స్వీకరించడం ఇవన్నీ పుస్తకం పేజీలు చకచకా తిరిగేలా చేస్తాయి.

అశోకవర్ధన రాజు, బాలూతో పాటుగా ఖాన్ చంద్ర శర్మ, శ్రీమతి హట్టియంగాడీ పాత్రలు గుర్తుండి పోతాయి. పార్లమెంటు లోపల, బయట జరిగే సంఘటనల కారణంగా రాజకీయ వాతావరణంలో అనూహ్య మార్పులు రావడం, ప్రజా ప్రతినిధులంతా భవిష్యత్తు గురించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాల్సి రావడం లాంటి సన్నివేశాలు కథనానికి బిగిని ఇచ్చాయి. పన్నుల గురించి రాజు గారి నిర్ణయం, దానికి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన స్పందన వ్యవస్థలోని బోలుతనాన్ని ఎత్తి చూపాయి. నవలిక చదువుతుంటే కే.ఎన్.వై. పతంజలి వ్యంగ్య నవలిక 'అప్పన్న సర్దార్' చాలాసార్లు గుర్తొచ్చింది. అయితే, పతంజలి రచన రాష్ట్ర రాజకీయాల గురించి కాగా, ఈ నవలిక దేశ రాజకీయాలని ఉద్దేశించింది. ముందుమాట అలా ఉంచి, కనీసం గత ముద్రణలకి సంబంధించిన పూర్తి వివరాలని ఇవ్వకపోవడం ప్రకాశకుల ఆలక్ష్యాన్ని మాత్రమే సూచిస్తోంది.

'రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన' తో పాటుగా 'రామరాజ్యానికి రహదారి,' 'నల్లరేగడి' నవలల్ని కలిపి 'పాలగుమ్మి పద్మరాజు రచనలు-2' సంకలనంగా ప్రచురించింది విశాలాంధ్ర. పేజీలు 391, వెల రూ. 180, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.

5 కామెంట్‌లు:

  1. మురళి గారూ !

    ఆరోగ్యకరమైన రచనలే కరువైపోయిన ఈ రోజుల్లో ఎప్పుడో చదివిన పా. ప. గారి రచనని పరిచయం చేసి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. విశాలాంధ్ర కి వెళ్లి కూడా..నాకోసం పుస్తకాలు కొనుక్కోకుండా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని వచ్చేశాను. అప్పుడు చూశాను పాలగుమ్మి పద్మరాజుగారి పుస్తకాలు.

    పుస్తక పరిచయానికి ఎప్పటిలాగే వంద మార్కులు.

    రిప్లయితొలగించండి
  3. @SR Rao: నిజమేనండీ.. ఇప్పటివేమీ చెప్పుకోదగ్గవి లేవు కాబట్టే ఆనాటి రచనలు మళ్ళీ మళ్ళీ చదువుకోవడం.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: కథలు, నవలలూ రెండూ చాలా బాగున్నాయండీ.. వీలు వెంబడి చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఈ పుస్తకం నా "తర్వాత చదువుదాంలే "జాబితాలో ఉంది.ఇక ఆలస్యం చెయ్యనులెండి.మీ టపాలో -పశ్చిమగోదావరి జిల్లా పేర్వాలి గ్రామానికి చెందిన-అని మళ్ళీ -పెరవలి గ్రామం తప్ప అన్నారు యేది ఒప్పు రెంటిల్లో?
    తర్వాత మీరు కూడా పత్రికల్లో డెస్కువీరుల్లాగా రాస్తే ఎలాగండీ???-డెబ్భయ్యవ దశకం లోని.... ఎప్పటి డెబ్భయ్యవ దశకం???70 పదులు700,పైగా మనం ఇప్పుడు మారిన శతాబ్దంలో ఉన్నాం కదా??

    రిప్లయితొలగించండి
  5. @రాజేంద్రకుమార్ దేవరపల్లి: నిశితంగా చదివి వ్యాఖ్య రాసినందుకు మొదటగా ధన్యవాదాలండీ.. మొదటి పాయింటు: అశోక వర్ధన రాజు గారి స్వగ్రామం పెరవలి. అయితే హిందీ భాషోద్యమం పుణ్యమా అని అది 'పేర్వాలి' గా మారిపోయింది అంటారు రచయిత. నేను పేర్వాలి కి కొమ్ములు పెట్టి ఉండాల్సిందేమో. రెండోది, దశకం: నిజమేనండీ.. నేనింకా పాత శతాబ్దంలోనే ఉండిపోయినట్టు ఉన్నాను :-) సరి చేసుకోవాలంటే డెబ్భైల్లో అనాలా లేక నలభయ్యేళ్ళ క్రితం అంటే బాగుంటుందా?(సీరియస్గానే అడుగుతున్నానండీ) అన్నట్టు నేనిప్పుడు 'రామరాజ్యానికి రహదారి' చదువుతున్నా.. పుస్తకం చదవడం వెంటనే మొదలుపెట్టేయమని నా సిఫార్సు..

    రిప్లయితొలగించండి