మంగళవారం, జులై 12, 2011

బాబూజీ అన్నయ్య

నాకన్నా ఏడాది చిన్నవాడైన బాబూజీ నాకు అన్నయ్య ఎలా అయ్యాడో చెప్పాలంటే, ముందుగా బాబూజీ గురించి చెప్పాలి. నలుగురు పిల్లలు పుట్టి పోయిన తర్వాత పుట్టిన బాబూజీ అంటే వాళ్ళమ్మకీ, నాన్నకీ ప్రాణం. ఇంకా చెప్పాలంటే ప్రాణం కంటే ఎక్కువే కూడాను. పిల్లాడిని బతికించుకోడం కోసం చేసిన అనేక ప్రయత్నాల్లో ఒకటిగా పేరు పెట్టలేదు. ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి 'బాబూజీ' అని పిలవడం మొదలెట్టి, చివరికి బళ్ళో కూడా అదే పేరు రాయించారు.

ఊహ తెలిసినప్పటినుంచీ ఆడింది ఆట, పాడింది పాట అవ్వడంతో చాలా చిన్నప్పుడే తను సర్వజ్ఞుణ్ణనే నమ్మకం మొదలయ్యింది బాబూజీలో. కొన్ని కొన్ని నమ్మకాలకి ఆధారాలు ఉండవు. దానికి తోడు, వాళ్ళ నాన్న రెండ్రోజులకోసారి బడికొచ్చి పిల్లలందరి ఎదురుగానూ వాళ్ళబ్బాయి అర్భకం పిల్లాడు కాబట్టి వాణ్ణి కొట్టకండనీ, మిగిలిన పిల్లలు కూడా ఏమీ చేయకుండా చూడమనీ మేష్టారిని బతిమాలి వెళ్ళేవాడు. బాబూజీతో సమస్య ఏమిటంటే తను చెప్పిందే కరక్టు. అది తప్పయి ఉండచ్చనే ఆలోచన పొరపాటున కూడా వచ్చేది కాదు.

రెండూ రెండూ కలిపితే మూడు వస్తుందని తనకి అనిపిస్తే, మేష్టారు ఎంతగా చెప్పినా కూడా జవాబు నాలుగు అని నమ్మేవాడు కాదు. వాళ్ళ నాన్న కారణంగా మొదట్లో బాబూజీని క్షమించేసినా, తర్వాత్తర్వాత మేష్టారు కోపం ఆపుకోలేక సుద్దముక్కలు బాబూజీ తలమీద తగిలేలా విసరడం లాంటి శిక్షలు వేసేవాళ్ళు. అదే మాకైతే తొడ పాశాలూ, గోడకుర్చీలూను. తను నా తర్వాత క్లాసు కాబట్టి, ప్రతి వేసవిలోనూ నా పుస్తకాలు తను తీసుకునే వాడు. మా ఇంట్లో వాళ్ళకీ, వాళ్ళింట్లో వాళ్ళకీ ఉన్న స్నేహం వల్ల నాకు తప్పేది కాదు.

నేను నా పుస్తకాలని ఎలా చూసుకోవాలో అప్పుడప్పుడూ జాగ్రత్తలు చెబుతూ ఉండే వాడు. తర్వాత తను తీసుకోవాలి కదా మరి. కొంచం పెద్దయ్యే కొద్దీ బాబూజీ అభిరుచులు కూడా కొంచం ప్రత్యేకం అని తెలుస్తోంది మాకందరికీ. తనకి కత్తి ఫైటు కాంతారావంటే తెగిష్టం. ఎంతగా అంటే, మా ఊళ్లోకి రికార్డింగ్ డేన్స్ వచ్చినప్పుడు కాంతారావు పాట వేయించమని వాళ్ళ నాన్నతో ట్రూప్ వాళ్లకి రికమెండ్ చేయించే అంత. "ఇప్పటివరకూ కాంతారావు పాటలు ఎవరూ అడగలేదండీ.. మాకు రావు," అని చెప్పేశారు వాళ్ళు.

ఓరోజు బళ్ళో మేష్టారికి బాబూజీ మీద బాగా కోపం వచ్చేసింది. కొట్టడానికి లేదు కదా. అందుకని హాజరు పట్టీ తీసి, "నీపేరు బాబూజీ కాదు. బాపూజీ అని ఉండాలి. తప్పు పడింది" అన్నారు. "కాదండీ నా పేరు బాబూజీనే" అని మావాడి వాదన. అక్కడ మేష్టారిదే బలం కాబట్టి అప్పటికప్పుడు రికార్డులో 'బాపూజీ' అని పేరు మార్చేసుకుని పగ సాధించారు. బాబూజీ ఊరుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు. పేరు విషయంలో మేష్టారు రాజీ పడని కారణంగా మా బాబూజీ రికార్డుల్లో బాపూజీ గా మారిపోయాడు.

రోజులు గడుస్తూ ఉండగా, బాబూజీ ఒకసారి వాళ్ళింట్లో వాళ్ళతో హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. తనకి బాగా నచ్చింది. నేనప్పటికే హైదరాబాద్ చూసేసినా, తను చెప్పే కబుర్లన్నీఆశ్చర్యంగా నోరు తెరుచుకుని వినాల్సి వచ్చేది. లేకపొతే తనకి కోపం వచ్చేసేది మరి. ఆరకంగా నాకు కొద్దిగా నటించడం నేర్పించాడు బాబూజీ. ఊళ్ళో అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ హైదరాబాద్ విశేషాలు చెబుతూ ఉండగా, బాబూజీకి ఉన్నట్టుండి మా ఊరిని కూడా హైదరాబాద్ గా మార్చేయాలని కోరిక పుట్టింది. "మనం పెద్దయ్యాక అలాగే మార్చేద్దాం. మీ ఇంటిదగ్గరే చార్మినార్ కట్టిద్దాం" అని నమ్మకంగా చెప్పాను.

పదో తరగతి పరీక్ష తప్పగానే బాబూజీకి పెళ్లి చేసేయాలని నిశ్చయించారు వాళ్ళింట్లో. వాళ్ళు పెద్ద స్థితిమంతులేమీ కాదు. ఇతగాడికా చదువూ అబ్బడం లేదు, ఏ పనీ చేసేంత బలమూ లేదు. "ముందేదన్నా కుసి (కృషి-చేతిపని) నేర్పించవయ్యా. పెళ్లి తర్వాత చెయ్యొచ్చు" అని ఊళ్ళో వాళ్ళు చెప్పి చూశారు కానీ, వాళ్ళ నాన్న వినకుండా తనకి ఎన్నో ఏట పెళ్లయ్యిందో, వాళ్ళ నాన్నకీ, తాతకీ ఏ వయసులో పెళ్లయ్యిందో ఆపకుండా అరగంట సేపు ఉపన్యసించి అందరి నోళ్ళూ మూయించేశాడు.

తగుమాత్రం వైభవంగా బాబూజీ పెళ్ళయిపోయింది. ఆడవాళ్ళు కూడా మెచ్చుకున్న అందం ఆ అమ్మాయిది. "కాకి ముక్కుకి దొండపండు" అన్నారు కిట్టనివాళ్ళు. పెళ్ళయిన వాణ్ణి, అతని భార్య ఎదురుగా ఏరా, ఒరే అని మాట్లాడకూడదని మా అందరికీ ఇళ్ళలో మళ్ళీ మళ్ళీ చెప్పి ప్రాణాలు తోడేశారు. మిత్రులందరం కలిసి కూర్చుని ఆలోచించుకుని బాబూజీని 'అన్నయ్య' అని పిలవాలని నిర్ణయించేసుకున్నాం. కానైతే పెద్దగా మాట్లాడే పని ఉండడం లేదు. ఎప్పుడో తప్ప తను బయటికి రాడు. మేం వెళ్లకూడదని ఇళ్ళలో ఆర్డర్లు.

బాబూజీ అన్నయ్య ఆడవాళ్ళని కూడా తన ఇంటికి రానివ్వడం లేదనీ, భార్యని ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదనీ బోల్డన్ని కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. కాలేజీ గొడవల్లో పడి పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఒకరోజు, బాబూజీ, భార్యా విడిపోయారనీ, ఆ అమ్మాయి మరో పెళ్లి చేసేసుకుందనీ చెప్పుకున్నారు ఊళ్ళో. పట్టుదలలో పరశురాముడైన బాబూజీ వాళ్ళ నాన్న నెల తిరక్కుండా మరో సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేసేశాడు. మాకెవ్వరికీ పెళ్ళనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు కానీ, బాబూజీకప్పుడే రెండో పెళ్లి!

ఉన్నట్టుండిబాబూజీ తనే మాతో కల్పించుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు. వచ్చిన ప్రతిసారీ తనకి ఉద్యోగానికి రమ్మంటూ బ్యాంకుల నుంచీ, ఆఫీసుల నుంచీ ఉత్తరాలు వస్తున్నాయని, ఇంట్లో ఒప్పుకోవడం లేదనీ చెప్పేవాడు. నమ్మినట్టు నటించేవాడిని. మనకి అబద్ధం అని కచ్చితంగా తెలిసిన విషయాన్ని నిజమన్నట్టుగా వినడంలో ఉన్న ఆనందాన్ని నాకు మొదట రుచి చూపించిన వాడు కూడా బాబూజీనే. నేను ఊరు విడిచిపెట్టిన కొన్నాళ్ళకే, వాళ్ళ కుటుంబమూ బతుకు తెరువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయింది. తర్వాత్తర్వాత ఊరు వెళ్ళినప్పుడల్లా శిధిలావస్తలో ఉన్న వాళ్ళ ఇల్లు చూసినప్పుడల్లా మా ఊరిని హైదరాబాద్ గా చూడాలన్న బాబూజీ కోరిక గుర్తొస్తూ ఉండేది. బాబూజీని మళ్ళీ కలుస్తానో కలవనో..

9 కామెంట్‌లు:

  1. మనచుట్టూ అనేక రూపాలలో ఇలాంటి బాబుజీ లు ఉంటారు. తనకే అన్నీ తెలుసు అనే విశ్వాసం తో, మనకేమి తెలియదు అనే భావంతో ఉంటారు. వాళ్ళు మనతో ఉండడం మన అదృష్టం, వాళ్ళ దురదృష్టం అని ఫీల్ అయిపోతుంటారు.సాధారణంగా వీరు ఎవరిని నమ్మరు. ఈ అభిప్రాయాలు కొంత మందికి పెంపకం తో వస్తే, మరికొందరికి తమ అసమర్ధత వల్లా, ఈర్ష్య అసూయ ల ద్వారా సంక్రమిస్తాయి అనుకుంటాను.
    జాలి పడడం తప్ప మనం బహుశా ఏమి చేయలేము.

    రిప్లయితొలగించండి
  2. మురళిగారు, బాబూజీగారు అలా తయారవ్వడానికి ఒకరకంగా తల్లితండ్రులు, గురువులు, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా కారణమేమో అనిపిస్తోంది...
    ఊహ తెలిసినప్పటినుంచీ ఆడింది ఆట, పాడింది పాట అవ్వడంతో .....
    మొక్కై ఒంగనిది మానై వంగునా...మా చుట్టాలబ్బాయి కూడా ఒకడు ఇలాంటి వాడే ఉన్నాడు, తాత అమ్మమ్మ గారం, తండ్రి చేతకానితనం, తల్లి నిర్లక్ష్యం తో ఈ ఏడు పదోతరగతి తప్పాడు.. ఇప్పుడు వాడు అలా అవ్వటానికి కారణం నువ్వంటే నువ్వు అని ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాడండీ మీ 'బాపూజీ'. మీ ఊరిని మీరు హైదరాబాద్ గా మార్చేస్తే మీకు తప్పకుండా కనిపిస్తాడు.
    మీ 400 పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. ఒకవేళ లేట్ అయినా నా అభినందనలే మీరు ముందు పుబ్లిష్ చేసేయాలి. సరేనా...

    రిప్లయితొలగించండి
  4. హ్మ్ ఆసక్తికరంగా ఉన్నాడండీ బాబూజీ అన్నయ్య.. నేను ఎపుడూ గమనించలేదు ఇలాంటి వాళ్ళని..

    రిప్లయితొలగించండి
  5. @బులుసు సుబ్రహ్మణ్యం: నేను చెప్పని విషయాలని మీరు చెప్పారండీ.. బహుశా చాలామందిని చూసి ఉంటారు.. బాగా చిన్నప్పుడు తనతో గొడవలు పడ్డా, కొంచం పెద్దయ్యాక మేమూ అలాగే వదిలేసేవాళ్ళం.. ధన్యవాదాలు.
    @శ్రీ: ఇతని విషయంలో పూర్తిగా తల్లితండ్రులే కారణం అండీ.. అంటే వాళ్ళ పరిస్థితి కూడా అలాంటిది మరి.. ఇతనొక్కడే బతికాడు. కాబట్టి వాళ్ళనీ తప్పు పట్టలేం.. ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: ....ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  6. @జయ: కానైతే తన కోసం నేను అంత బృహత్కార్యం మొదలు పెట్టలేను కదండీ :-) ... నాలుగొందల్ని గుర్తు చేసిందీ, మొదట అభినందించిందీ కూడా మీరేనండీ మీరే.. చాలా చాలా ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: అదృష్టవంతులండీ.. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వచ్చేది, ఏ విషయంలోనైనా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. జీవితంలో కొందరు మనుషులనీ, కొన్ని సంఘటనలనీ మరచిపోదామన్నా మరచిపోలేం.

    రిప్లయితొలగించండి
  8. @శిశిర: అవునండీ.. నిజం! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి