శుక్రవారం, డిసెంబర్ 04, 2009

దృశ్యాదృశ్యం

భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమయ్యేది జన హితం కోసమే. ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందించడం కోసమే.. అయితే ఒకసారి ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యాక, ప్లాన్ లో చివరి నిముషం మార్పులు ఎందుకు జరుగుతాయి? తయారయ్యే ప్రాజెక్టు మొదట వేసిన ప్లానుకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఎందుకని? కాంట్రాక్టర్లు-అధికారులు-రాజకీయనాయకులు అనే బలమైన ఇనుప త్రికోణ చట్రం ప్రాజెక్టు పనులని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఐదారేళ్ళ క్రితం వరకూ ఇవి అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయాలు. ఇప్పుడంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జలయజ్ఞం' పై వెల్లుతుతున్న విమర్శల పుణ్యమా అని సామాన్యులు సైతం ఈ 'ఇనుప త్రికోణం' బలాన్ని అంచనా వేయగలుగుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని కథావస్తువు గా తీసుకుని ఆరేళ్ళ క్రితం తాను రాసిన 'దృశ్యాదృశ్యం' నవలలో నీటి పారుదలకి సంబంధిన ఎన్నోకీలకమైన అంశాలను అత్యంత సరళమైన భాషలో వివరించారు రచయిత్రి చంద్రలత.

ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకునే వివిధ వర్గాలు, వాళ్లకి కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులు, అప్పటివరకూ నది ఒడ్డున జీవించి కేవలం ప్రాజెక్టు కారణంగా తమ ఊరు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏమీ చేయలేని అసహాయతతో కొత్త ఊరిని నిర్మించుకునే జనం, కేవలం మానవ జీవితాల్లోనే కాదు, సమస్త ప్రకృతిలోనూ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన మార్పులు.. ఇలా ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, కీలకమైన పర్యావరణం, నిర్మాణ శాస్త్రాలని పరిశోధించి, సంబంధిత నిపుణులతో చర్చించి, నోట్సు తయారు చేసుకుని దాదాపు ఆరేళ్ళ పరిశ్రమ తర్వాత 2004 లో చంద్రలత వెలువరించిన నవల ఇది.

కథాస్థలం రాష్ట్రంలో ఫలానాచోట అని స్పష్టంగా చెప్పలేదు. ప్రాజెక్టు కట్టే ప్రతి ఊరికీ ఈకథ వర్తిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెనడా లో పుట్టి పెరిగి, అక్కడే భారీ ఆనకట్టల మీద పరిశోధన చేస్తున్న అక్షత తన పరిశోధనలో భాగంగా తల్లి యశోద పుట్టిన ఊరికి రావడం తో నవల ప్రారంభం అవుతుంది. తన మామ పట్టాభి పార్లమెంట్ సభ్యుడు. ఆయన తన భార్య వత్సల, ఇద్దరు పిల్లలతో పట్నంలోనే ఉంటూ, అప్పుడప్పుడూ ఊరికి వచ్చి పోతూ ఉంటాడు.

ఊరిలో ఉన్న ఇంట్లో పెత్తనం అంతా వృద్ధురాలైన వంటమనిషి రాగవ్వదే. జీపు డ్రైవరు పాండు, పట్టాభి కి ఊళ్ళో కుడి భుజంగా మసలే యువకుడు శ్రీను.. వీళ్ళు ముగ్గురూ అక్షత ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. రాగవ్వ మొదలు ఊరిజనం లో వయసుమళ్ళిన ప్రతి ఒక్కరూ అక్షతని చూసి ఆమె మేనమామ 'కేశవ' ను గుర్తు చేసుకుంటారు. కేశవ ఆ యింటి పెద్ద కొడుకు. అతన్ని గురించి తన తల్లి కానీ, తన దగ్గరే గడిపిన అమ్మమ్మ కానీ ఎప్పుడూ పెద్దగా తల్చుకోక పోవడం ఆశ్చర్య పరుస్తుంది అక్షతని.

ఇక శ్రీను.. బాల్యం అంతా నదికి దగ్గరలో ఉన్న 'పాతూరి' లో గడిపి, జ్ఞానం తెలుస్తున్న వయసులో ప్రాజెక్టు కారణంగా 'కొత్తూరి'కి వలస వచ్చిన తరానికి ప్రతినిధి. తన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ఏకాకి. నదన్నా, పశువులన్నా విపరీతమైన ప్రేమ ఉన్నవాడు. "నేను నదిని చూడడానికి వచ్చాను" అని అక్షత అంటే.. "చాలా ఆలస్యం చేసినారు.. నది చిక్కి శల్యమైన పొద్దు వచ్చినారు.. నది ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాది," అంటాడు అతను.

పెద్దకట్ట (ప్రాజెక్టు) కట్టక ముందు ఊరి వారి జీవితం హాయిగా గడిచింది . నది పుణ్యమా అని నేలలో బంగారం పండేది. ప్రతి ఇంట్లోనూ ఉండే కుటుంబ కలహాలు మినహా, ఊరివాళ్ళకి పెద్ద కష్టం అంటూ ఉండేది కాదు. నదిలో చేపో, అడివిలో ఆకో,కాయో అన్నానికి అడ్డం పడేవి. కాయగూరలు, పూలు, పండ్లు, వంట చెరకు.. వేటికీ లోటు ఉండేది కాదు. ఊరి పెద్ద భూపాలయ్యది నలుగురికి సాయం చేసే చెయ్యి.

కాలం అవ్యక్త మధురంగా గడిచిపోతుండగానే నది మీద ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, తామంతా ఊరిని ఖాళీ చేయక తప్పదనీ తెలుస్తుంది గ్రామస్తులకి. ఇంజనీరింగ్ చదివిన భూపాలయ్య పెద్ద కొడుకు కేశవ అదే ప్రాజెక్టు కి జూనియర్ ఇంజనీర్ గా వస్తాడు. ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలు అతనికి తెలిసినా, ముంపు ప్రాంతంగా తన ఊరిని మార్కు చేయాల్సి వచ్చినప్పుడు కదిలిపోతాడు సున్నిత మనస్కుడైన కేశవ.

ఓ పక్క ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉంటూనే తన పై అధికారి కూతురు 'బంగారి' తో ప్రేమలో పడతాడు కేశవ. తండ్రితో పోరాడి, కుటుంబ కట్టుబాట్లకి వ్యతిరేకంగా చెల్లెలు యశోద ని మెడిసిన్ చదివిస్తాడు. పాతూరి నుంచి కొత్తూరికి జనమంతా వలస రావడంలో భూపాలయ్య క్రియాశీల పాత్ర తీసుకుంటాడు. ఈ క్రమంలో కుటుంబ ఆర్ధిక పరిస్థితిలో మార్పు వస్తుంది. తండ్రికి ఆసరాగా ఉండడం కోసం, చదువు పూర్తి చేసిన పట్టాభి తల్లి పేరిట 'కౌసల్య కనస్ట్రక్షన్స్' ప్రారంభించి, ప్రాజెక్టు కి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టులు చేయడం మొదలు పెడతాడు.

ప్రాజెక్టు పనుల్లో తెర వెనుక జరుగుతున్న తతంగాన్ని కేశవ కన్నా పట్టాభే త్వరగా అర్ధం చేసుకుంటాడు. కాంట్రాక్టరు ఎదగాలంటే రాజకీయ నాయకుల, అధికారుల సహాయం అవసరమని గ్రహించి ఆ దిశగా పావులు కదుపుతాడు. పరిస్తితులతో రాజీ పడలేని కేశవ ఏంచేశాడు, అక్షత తల్లి యశోద కానీ, అమ్మమ్మ కానీ కేశవని ఎప్పుడూ ఎందుకు తలచుకోలేదు లాంటి ప్రశ్నలన్నింటికీ హృద్యమైన ముగింపు ద్వారా సమాధానాలు దొరుకుతాయి నవలలో.

'దృశ్యాదృశ్యం' పూర్తి చేశాక పాఠకులని వదలకుండా వెంటాడేవి రెండు..నది, కేశవ. నదిలో వచ్చిన మార్పులు, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు కేశవలో చెలరేగే భావ సంఘర్షణ ఎప్పటికీ మర్చిపోలేం. ఈ నవలకి ముందు తను రాసిన 'రేగడి విత్తులు'నవలలో జరిగిన పొరపాట్లని సరి దిద్దుకున్నారు చంద్రలత. ఈ నవలలో ఏ పాత్రా అనవసరం అనిపించదు. ప్రతి పాత్రనీ కథలో భాగం చేశారు. నవలలో ప్రతి పాత్రకీ నదితోనూ, కేశవతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంటుంది. ఇదో అందమైన అల్లిక. ఎన్నో అంశాలని చర్చించినప్పటికీ ఎక్కడా ప్రధాన కథ పక్కదోవ పడుతోందన్న భావన కలగదు.

ప్రకృతి వర్ణనలలో తనది అందెవేసిన చేయి అని తొలి రెండు నవలలతోనే నిరూపించుకున్న చంద్రలత, శాంత, గంభీర వాతావరణాలే కాదు ప్రళయ భీభత్సాన్నీ తనదైన శైలిలో వర్ణించారు. ప్రాజెక్టు పూర్తయ్యి ఊరు నీళ్ళలో మునగడం ప్రారంభం కాగానే చేల మధ్య పుట్టలో ఉన్న త్రాచుపాము ప్రాణభయంతో చెట్టు కొమ్మని చుట్టుకోవడం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. యెంతో క్లిష్టమైన సాంకేతిక విషయాలకి, కుటుంబ కథను జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా మలచారు రచయిత్రి. టెక్నికల్ విషయాలని కేశవ డైరీ రూపంలో ఇవ్వడం ద్వారా ఆసక్తిగా చదివించారు.

ప్రాజెక్టు వల్ల మాయమైపోతున్న చంద్రవంక చేప మొదలు, వాతావరణం లో వచ్చిన మార్పులు తట్టుకోలేకా, కొత్త పరిస్థితులకి అనుగుణంగా తమని తాము మార్చుకోలేకా తల్లడిల్లే అమాయకులైన గిరిజనుల జీవన విధానం ఏ మలుపు తిరిగిందో వివరించిన తీరు అద్భుతం. నేనైతే ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటి అని చెబుతాను. ('దృశ్యాదృశ్యం,' ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 354, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.)

16 కామెంట్‌లు:

  1. పరిచయం బాగుందండీ.. దొరుకుతుందేమో ప్రయత్నించాలి మరి.
    "రేగడి విత్తులు" గురించి మీ బ్లాగ్లో చదివాకా కొనటానికి ప్రయత్నించానండీ..దొరకలేదు...ఈ మధ్యనయితే ఇక మళ్ళీ అడగలేదు.

    రిప్లయితొలగించండి
  2. "నేనైతే ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటి అని చెబుతాను."
    మీకు ఇంతలా నచ్చిందంటే తప్పక మన స్వంత లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకమన్నమాట! ఇలా కాదుకాని మురళీ, మన బ్లాగు సాహిత్యాభిమానులందరం (ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవాళ్ళం) కల్సి మీరు అధికారిగా బుక్ ఫౌండేషన్ ఒకటి ఏర్పరిస్తే, ఇలా మీకు నచ్చిన పుస్తకాలన్నీ మాక్కూడా ఒక కాపీ కొనేసి ఉంచొచ్చు :-)

    లేకపోతే ఇదొక పెద్ద టార్చర్ అయిపోతుంది అసలు! ఇంత మంచి ఇతివృత్తం ఉన్న పుస్తకం గురించి మీ మాటల్లో చదివి అది వెంటనే లభించే అవకాశం లేక మేము పడే బాధ మిరస్సలు ఊహించలేరు :-)

    రిప్లయితొలగించండి
  3. నాకు దీనికంటే రేగడివిత్తులే నచ్చింది. బహుశా నవల ప్రణాళికా, ప్రయత్నమూ తేటతెల్లంగా కనపడుతూ ఉండడం వల్లనేమో!

    రిప్లయితొలగించండి
  4. "భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమయ్యేది జన హితం కోసమే. ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందించడం కోసమే.. "
    ఇదే నాకు ఆశ్చ్యర్యం కలిగిస్తుంది. ఏవిధంగా చూసినా పెద్దఈ(భారి) ప్రాజెక్టులు నష్టమె.
    వనరులు కేంద్రీకృతం చేయడం, పిడికెడు మందిని బలవంతులను(రాక్షసులను) చేయడమే.
    ఆంధ్ర ప్రదేశ్ లొ వై.ఎస్.చేపట్టిన జలయజ్ఞం ప్రచారం "లక్ష కోట్లతొ కోటి ఎకరాలకు సాగు నీరు"
    అంటె ఎకరానికి లక్ష. ఇంతకుముందు (3,4ఏండ్ల క్రితం) భూమి ధర కంటె 3,4 రెట్లు ఎక్కువ.
    పది ఎకరాల రైతుకు పది లక్షలు ఇస్తె సరిపోదా?
    ----సమతలం

    రిప్లయితొలగించండి
  5. "ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటి"
    మంచి నవలే కానీ ఈ మాట అతిశయోక్తి. అసలు తెలుగు నవలలు వచ్చిందే గత వందేళ్ళల్లో. మెచ్చదగిన లక్షణాలతోపాటే చాలా చిరాకు పరిచే అంశాలూ చాలానే ఉన్నాయీ నవల్లో. తెలుగు సృజనాత్మక సాహిత్యంలో సమర్ధులైన ఎడిటర్ల అవస్రాన్ని ఋజువు చేస్తున్నదీ నవల, నా వుద్దేశంలో. రచయిత్రి చేసిన ప్రకృతి వర్ణనల్ని గురించీ, ముఖ్య పాత్రల వ్యక్తిత్వాన్ని చిత్రించిన తీరు గురించీ మీతో ఏకీభవిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. నాగార్జున సాగర్ లో ఉన్న మాకు ప్రాజెక్ట్ నీళ్ళు ఒదిలినప్పుడు కొండల్లో ఉన్న చిన్న చిన్న ఊళ్ళు ఒక్కొక్కటే మునిగి పోవటం నాకు తెలుసు. కాకపోతే అప్పుడు చాలా చిన్నపిల్లను కాబట్టి నాకంత అవగాహన ఉండేది కాదు. ఈ నవలలోని వివరాలు చదివాకా నాకవే గుర్తుకొస్తున్నాయి. వీలైతే చదవాలి.
    మొన్న బజార్లో చాలా నెమలి కన్నులు చూసాను మురళిగారు.

    రిప్లయితొలగించండి
  7. తప్పక చదవాలనిపించేలా పరిచయంచేసారు. చదువుతాను.
    అలానే ఈ ముంపు వలన కలిగే నష్టాలు మా ప్రాంత వాసులకు అనుభవమే. మీ పరిచయం మరింత దగ్గరితనం చూపింది.

    రిప్లయితొలగించండి
  8. మురళిగారు ఒక మంచి విషయాలు బ్లాగ్ లో రాసారు....
    ఈ ప్రాజెక్ట్ల విషయమందరికి తెలుసు ఇప్పుడు కాని దైర్యంగా వాటిలోని అవినీతి పై స్పందిచే వారు లేక పోవడంవల్లనే అవకతవకలు జరుగుతున్నాయ్
    www.tholiadugu.blogspot.com

    రిప్లయితొలగించండి
  9. @తృష్ణ: 'విశాలాంధ్ర' లో దొరుకుతాయండీ.. డిస్ప్లే లో ఉండకపోవచ్చు.. అడిగితే ఇస్తారు.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: అర్ధం అవుతోందండీ :) మాకన్నా, మీకే త్వరగా తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయిత కదా ఇప్పుడు.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్: కావొచ్చండీ.. నేను 'రేగడి విత్తులు' ని తక్కువ చేయడం లేదు.. కాకపొతే అందులో కొన్ని పాత్రలు అర్ధంతరంగా మాయమైపోతాయి.. ఈ నవలలో ప్రతి పాత్రకీ అర్ధవంతమైన ముగింపు ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @సమతలం: బ్రిటిష్ పాలనా కాలంలో గోదావరి, కృష్ణ తీర ప్రాంతాలు తీవ్రమైన కరువు కాటకాలు ఎదుర్కొన్నాయి.. గోదారి ప్రాంతంలో ప్రజలు తిండి లేక మట్టిని నీళ్ళలో కలుపుకి తిని ఆకలి తీర్చుకున్నారని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.. 'డొక్కల కరువు' (గుంటూరు జిల్లా, మనుషుల్ని, మనుషులు పీక్కు తిన్నారని చరిత్ర) లాంటి కరువులు చూశాక బ్రిటిష్ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణానికి నడుంకట్టారు. ఒక్కసారి ఊహించండి.. గోదారి మీద ఆనకట్ట, కృష్ణ మీద నాగార్జున సాగర్, ప్రకాశం బారేజీ లేక పొతే రాష్ట్రం ముఖచిత్రం, ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఎలా ఉండి ఉండేదో... ప్రాజెక్టుల వల్ల కన్నా, డిజైన్లని ఇష్టానుసారంగా,కొందరి ప్రయోజనాల కోసం మార్చేయడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయండీ.. ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోడం కూడా మంచిది కాదు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @కొత్తపాళీ: ఒక సినిమా చూసినప్పుడు, పుస్తకం చదివినప్పుడూ కథ, కథనాల కన్నా ప్రేక్షకుడు/పాఠకుడిగా నాకు కలిగిన అనుభూతి ఆధారంగా ఆ సినిమాని, రచననీ అంచనా వేయడం నాకు అలవాటండీ.. ఈ కారణం వల్లనే కావొచ్చు నాకు బాగా నచ్చిన సినిమాలు, పుస్తకాలు చాలా మందికి అంతగా ఆకట్టుకోక పోవచ్చు. అలాగే మెజారిటీకి నచ్చనివి నాకు నచ్చడం జరుగుతూ ఉండొచ్చు. ఈ నవల చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతిని ఆధారం చేసుకుని నాకై నేను వేసుకున్న ఉత్తమ నవలల జాబితాలో చేర్చాను. 'రేగడి విత్తులు' తో పోల్చినప్పుడు ఈ నవలకి ఎడిటింగ్ అవసరం తక్కువే అని నా అభిప్రాయం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @జయ: అలా అయితే మీరు తప్పక చదవాల్సిన నవల ఇది.. చదివి వీలయితే ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.
    @కేక్యూబ్ వర్మ: చాలామంది ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడానని రచయిత్రి ముందు మాటలో రాశారండీ.. మిమ్మల్ని నిరాశ పరచదు ఈ నవల.. ధన్యవాదాలు.
    @కార్తీక్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  13. సాహితీతులనలను పక్కనబెడితే...ఇది ఖచ్చితంగా ఒక సామాజికంగా ఉపయోగకరమైన నవల.

    రిప్లయితొలగించండి
  14. @కత్తి మహేష్ కుమార్: నిజమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. మురళి గారు, పుస్తకం చదవడంలో మీ వయ్యక్తిక అనుభవాన్ని తక్కువ చెయ్యడం నా వుద్దేశం కాదు. బ్లాగుల్లో నాకు అమితంగా నచ్చే లక్షణం అదే .. పుస్తకంగానీ సినిమాగానీ జీవిత సంఘటనల్ని గానీ .. మీ అనుభూతుల్ని మీ అస్ఖరాల్లో చదవడం నాకిష్టమే.

    రిప్లయితొలగించండి
  16. మీ బ్లాగుని గత పది రోజుల నుంచి చదువుతున్నానండి. ఒక 100 పోస్టులకు పైనే చదివుంటాను. ఎన్నో విషయాలను చెప్పారు. ఎంతో సమయం వెచ్చించివుంటారు. ధన్యవాదములు.
    ఇక పొతే అన్ని పోస్టులు చదివి, ఈ పోస్ట్ క్రింద ఎందుకు ఈ వ్యాఖ్య వ్రాస్తున్నానంటే నేను చదివిన ఒకే ఒక నవల ఈ దృశ్యా దృశ్యము, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన షాడో నవలలు కాకుండా. మా అమ్మ నాతొ కొన్ని రోజులు ఉండటానికి అమెరికా వచ్చినప్పుడు తన కోసం తెలుగు పుస్తకాలు లైబ్రరీ నుండి తీసుకొద్దామని సమీప లైబ్రరీ కి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం చూసి, నచ్చి తెచ్చి వదలకుండా చదివాను.

    మీ బ్లాగు చూడక ముందు, ఇప్పుడు తెలుగు నవలలెవరైనా చదువుతున్నారా అని అనుకునే వాన్ని, కొంత మంది తమిళ్ వాళ్ళు పుస్తకాల గురించి వ్రాస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు పరిచయం చేసిన పుస్తకాలన్నీ తెచ్చి చదవాలి అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఇలా పుస్తకాలు చదివి వాటిని పరిచయం చేయటం ద్వారా మాలాంటి, అంటే పదవ తరగతి తరువాత తెలుగు పుస్తకం ముట్టని వాళ్ళు, ఎంతమందిని తెలుగు పుస్తకాలు చదవటం
    వైపు అడుగులు వేయిస్తున్నారో! వారందరి తరపున మీకు కృతజ్ఞతలు.

    అన్నట్లు, (ఎవరూ అనలేదులెండి), ఇప్పుడే వేదం సినిమా చూసి వస్తున్నాను. సినిమా చాలా బాగుంది, నచ్చింది అనాలేమో. నటీ నటుల నటన విషయం వద్దు (తక్కువ మాట్లాడుకుంటే మంచిదని) గాని, సినిమా గురించి మాత్రం మీరు చూసి, తప్పక వ్రాయండి.

    రిప్లయితొలగించండి