'నేను' 'నాది' అనే స్వార్ధం ఆవహించిన మనిషి తన చుట్టూ ఉన్నవాళ్ళకి స్నేహితుడు కాలేదు సరికదా, 'విరోధి' అవుతాడు. ఆమనిషి మహానగరంలో ఉన్నా, మహారణ్యంలో తిరిగినా ఫలితం మాత్రం ఇదే. నాయకుడు కావాలనే తన లక్ష్యం కోసం, తనకంటూ పేరు తెచ్చుకోవాలనే కాంక్షని నిజం చేసుకోవడం కోసం తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలతో ఆడుకోడానికి ఏమాత్రం వెనుకాడని నక్సలైట్ నాయకుడు 'గోగి' కథే నీలకంఠ తాజా సినిమా 'విరోధి.'
తొలిచిత్రం 'షో' తో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్ననీలకంఠ రెండో సినిమా 'మిస్సమ్మ' పర్లేదనిపించగా, మూడో సినిమా 'సదా మీసేవలో' నిరాశ పరిచింది. తర్వాతి సినిమాలు 'నందనవనం' 'మిస్టర్ మేధావి' చూడలేదు. ఇక ఈ 'విరోధి' నక్సలైట్ ఉద్యమం నేపధ్యంగా తీసిన సినిమా అని తెలియడంతో ఆసక్తి కలిగినా, పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే చూశాను. నటుడు శ్రీకాంత్ నిర్మాతగా మారి 'మేకా మీడియా' బ్యానర్ పై తీసిన తొలి సినిమా ఇది.
దర్శకుడే కథని సమకూర్చుకున్న 'విరోధి' సినిమా చాలా నెమ్మదిగా మొదలై, చిన్నపాటి జెర్క్ తో ఊపందుకుని, పరిగెడుతూ, నెమ్మదిస్తూ, మళ్ళీ పరిగెత్తే కథనంతో ముగింపుకి చేరుకుంది. నీతి, న్యాయం పక్షాన నిలబడే పాత్రికేయుడు జయదేవ్ (శ్రీకాంత్), సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన అతని భార్య (కమలిని ముఖర్జీ) లది అన్యోన్య దాంపత్యం. పార్లమెంట్ సభ్యుడు జంగయ్య (ఆహుతి ప్రసాద్) అక్రమార్జనపై తన పత్రికలో వరుస కథనాలు రాసిన జయదేవ్, ఒకరోజు అతని ఇంటికి వెళ్తాడు, ఇంటర్యూ చేయడం కోసం. జంగయ్య 'డీల్' కుదుర్చుకుందామంటూ చేసిన ప్రతిపాదన తిరస్కరించి, తను ప్రజలపక్షం అని చెబుతాడు జయదేవ్.
అప్పటివరకూ తను పనిచేసిన దళం నుంచి విడిపోయి సొంతంగా దళం స్థాపించిన నక్సలైట్ గోగి (అజయ్) తన బృందంతో సహా ఎంపీ ఇంటిపై మెరుపు దాడి చేసి, జంగయ్యని హతమార్చడంతో పాటుగా, జయదేవ్ ని కిడ్నాప్ చేయడంతో కథ అడవికి చేరుతుంది. ఇక అక్కడినుంచి జయదేవ్ గోగి లోనూ, అతని దళ సభ్యులలోనూ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేయడం, జయదేవ్ ను చంపడమా, విడిచి పెట్టడమా అని గోగి ఊగిసలాడడం, ఎంపీ ఇంటిదగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడ్డ గోగి గురువు రామదాసుకి వైద్యం అందిచాలా, మెర్సీ కిల్లింగ్ చేయాలా అనే విషయంలో దళ సభ్యులకీ, గోగికీ అభిప్రాయ బేధాలు, మరోవంక నక్సల్స్ కోసం పోలీసుల కూంబింగ్, జయదేవ్ కోసం జర్నలిస్టుల ఆందోళనల నేపధ్యంలో కథ ముగింపుకి చేరుతుంది. నక్సలైట్ల అడవి జీవితాన్ని బాగా డాక్యుమెంట్ చేశారు.
నటన పరంగా చెప్పాలంటే శ్రీకాంత్ కన్నా, గోగి గా చేసిన అజయ్ కే ఎక్కువ మార్కులు పడతాయి. కథా పరంగా కూడా, గోగి పాత్ర యాక్టివ్ జయదేవ్ పాత్ర పాసివ్ కావడంతో శ్రీకాంత్ కి పెద్దగా చేయడానికి ఏమీ లేకపోయింది. ప్రధమార్ధంలో చాలా సన్నివేశాల్లో కేవలం సెట్ ప్రాపర్టీ గా ఉండిపోయాడు. దళ సభ్యులుగా చేసిన వారిలో శివాజీ రాజా, కమల్ కామరాజు, శ్రీరమ్య ఆమె బాయ్ ఫ్రెండ్ గా వేసిన కుర్రాడు, అలాగే రెహనా గా చేసిన నటి చాలా బాగా నటించారు. కాకపొతే ముఖ్యమత్రిగా వేసిన విజయచందర్, డీజీపీ గా చేసిన నాగినీడు ('మర్యాద రామన్న' ఫేం) బాగా నిరాశ పరిచారు.
శ్రీకాంత్ ముఖంలో వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. బాగా బరువు తగ్గడం వల్ల అనుకుంటా, ముఖంలో ముక్కు మాత్రమే కనిపించింది. ఆ గడ్డం అస్సలు సూట్ కాలేదు. కమలినీ ముఖర్జీది కేవలం అతిధి పాత్ర. ఆమె గ్లామరంతా ఏమైపోయిందో కానీ, పెద్ద జబ్బు చేసి కోలుకున్నట్టుగా ఉంది. జూనియర్ ఆర్టిస్టుల ఎంపికలో మరీ ఉదాసీనత చూపించినట్టున్నారు, జర్నలిస్టులుగా, రాజకీయనాయకులుగా, పోలీసులుగా చేసిన వాళ్ళ నటన తేలిపోయింది. బడ్జెట్ పరిమితులేమన్నా ఉన్నాయేమో తెలీదు. నటుల్లో అజయ్, కమల్ కామరాజులకి మంచి పేరు తెస్తుందీ సినిమా.
తను రాసుకున్న కథని సినిమాగా మలిచే క్రమంలో నీలకంఠ కథకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు. బలహీనమైన స్క్రీన్ ప్లే, ఏమాత్రం పదును లేని, కొండొకచో మరీ నాటకీయంగా అనిపించే సంభాషణలు (ఈ రెండు బాధ్యతలూ కూడా తనవే), ఈ రెండూ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి. సంభాషణలకి వాడిన భాష, యాసలని పలికించిన తీరూ లోపభూయిష్టంగా ఉన్నాయి. బాగా చేయగలిగే నటులు ఉన్నప్పటికీ తగినంత నటన రాబట్టుకోలేదని అనిపించింది. నక్సలైట్ల చెరలో నాలుగైదు రోజులున్న జయదేవ్ దుస్తులు మాసాయి కానీ, ట్రిం చేసిన గడ్డంలో కించిత్తైనా మార్పు లేకపోవడం కంటిన్యుటీ లోపమే. ఎంపీ ఇంటి దగ్గర జరిగిన ఎదురు కాల్పుల కన్నా, అడవిలో ఎదురు కాల్పులని చిత్రించిన తీరు బాగుంది.
పాటలంటూ ప్రత్యేకంగా లేకపోయినా, నేపధ్యంలో అనేకసార్లు వచ్చే జానపద గీతం ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కి జానపద గీతాలు చేయడంలో తనదైన శైలి ఉంది కదా. ఉన్నంతలో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ పర్లేదు. నిర్మాతగా తొలి సినిమాకి మంచి కథని ఎంచుకున్న శ్రీకాంత్ ని అభినందించాల్సిందే. దర్శకుడు నీలకంఠ తన డిపార్ట్మెంట్ల నిర్వహణలో మరికొంచం శ్రద్ధ చూపించి ఉంటే చాలా మంచి సినిమా అయ్యిఉండేది ఈ 'విరోధి.' రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలని ఇష్టపడే వాళ్ళు ప్రయత్నించొచ్చు.
నిన్ననే చూసా ఈ మూవీ.
రిప్లయితొలగించండిసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కి జానపద గీతాలు చేయడంలో తనదైన శైలి ఉంది కదా. Is it a complement? :))
అదేంటి మీకు 'సదా మీసేవలో' నచ్చలేదా మీకు ఆశ్చర్యం :))) మీరిచ్చిన లిస్టు ప్రకారం ఐతే నేను నీలకంఠ అన్ని మూవీస్ చూసినట్లు ఉన్నాను (ఈ విరోధి తప్ప) ఒక్క మేధావి నే కొంచెం మొదట్లో బోరింగ్ బట్ ఒకే . మొత్తానికి ఇది కూడా చూడొచ్చు అంటారు !
రిప్లయితొలగించండి@హరిచందన: పక్కన స్మైలీ పెట్టారంటే నా ఉద్దేశ్యం మీకు అర్ధమయ్యిందనే అనుకుంటున్నానండీ :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: అవునండీ స్క్రిప్ట్ మొదలు, కాస్టింగ్ వరకూ ఏదీ కూడా సంతృప్తికరంగా అనిపించలేదు ఆ సినిమాలో. అక్కడికీ థియేటర్ లో చూసినప్పుడు నేను సరైన మూడ్ లో చూడలేదేమో అని టీవీలో వచ్చినప్పుడు మళ్ళీ చూశాను.. కాన్సెప్ట్ బాగుంది కానీ, సినిమాగా వచ్చేటప్పటికి ఎందుకో గానీ నచ్చలేదు.. 'సదా మీసేవలో' తో పోల్చినప్పుడు 'విరోధి' పర్లేదండీ.. కాకపొతే స్క్రీన్ప్లే లోపాల వల్ల నేరేషన్ అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది.. ధన్యవాదాలు.