ఆదివారం, ఆగస్టు 30, 2009

పతంజలిభాష్యం

మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి అధికారులూ, నాయకులూ ఉన్నారు. అయినా సమస్యలు సమస్యల్లాగే ఉన్నాయి. ఎందుకంటే సదరు నాయకులూ, అధికారులూ చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. ఇలాంటప్పుడే మనకి ఆగ్రహం కలుగుతుంది. ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఇది అందరిలోనూ ఉన్నా ఏ కొద్దిమందో మాత్రమే దానిని ప్రకటించ గలుగుతారు.

ఎందుకంటే ధర్మాగ్రహాన్ని ప్రకటించడానికి కావలసినవి నాలుగు.. సమస్యల పట్ల స్పందించే హృదయం, స్పందించగల తెగువ, స్పందించడానికి తగినంత భాష, ఆ స్పందనని ప్రచురించగల పత్రిక. ఈ నాలుగూ ఉన్నవాళ్ళు అతికొద్దిమంది ఉంటారు. ఆ అతి కొద్దిమందిలో ఒకరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. తెలుగు సాహితీ రంగంలో కే.యెన్.వై. పతంజలిగా ప్రసిద్ధుడైన ఈ అలమండ రాసబిడ్డ వ్యవస్థపై తన ధర్మాగ్రహాన్ని ప్రకటించి భాష్యకారుడైనాడు. ఆయన ఆగ్రహానికి అక్షర రూపమే 160 పేజీల 'పతంజలిభాష్యం.'

'నేను ఫలానా రచయిత రచనలు చదివాను' అని చెప్పుకోడాన్ని కొందరి విషయంలో మనం గర్వంగా ఫీలవుతాం. నాకు సంబంధించి ఆ కొందరు రచయితల జాబితాలో పతంజలిది తిరుగులేని స్థానం. తను సృష్టించిన ఒక్క 'వీరబొబ్బిలి' పాత్ర చాలు, పతంజలి రచనలు ఎందుకు చదవాలో చెప్పడానికి. "నేను ఫ్యూడల్ ని" అని రొమ్ము విరుచుకుని చెప్పిన పతంజలి ఎప్పుడూ పేదల పక్షమే. నిజానికి ఆయనది వెన్నలాంటి మనసు. లేకపోతే దగాపడ్డ వాళ్ళ గుండె ఘోష వినగలిగేవాడే కాదు.. వాళ్ళ పక్షాన గొంతు విప్పేవాడే కాదు.

"బాధ్యతారహిత మానవ సమాజం మీద అక్షర శర సంధానం" ఇది పతంజలి భాష్యానికి ప్రచురణ కర్తలు ఇచ్చిన ఉప శీర్షిక. నిజమే.. మన సమాజం బాధ్యతారహితం కాకపోయినట్టైతే రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేది కాదు.. బాల కార్మికులు ఉండే వాళ్ళు కాదు. రైతుల బలవన్మరణాలు ఉండేవి కాదు. లాకప్ మరణాలూ, పోలీసు ఎన్కౌంటర్లూ కూడా ఉండి ఉండేవి కాదు. ప్రజల ముఖాల్లో బతుకు భయం, చావుకళ మచ్చుకైనా కనిపించేవి కాదు. ప్రజలంతా నవ్వుతూ, తుళ్ళుతూ నిశ్చింతగా ఉండేవాళ్ళు.

మనది బాధ్యతా రహిత సమాజం కాబట్టే ఇక్కడ ఎన్నికలు కేవలం ఐదేళ్లకోసారి జరిగే తంతు. ఎన్నికలైపోయిన తరువాత దేశం 'దగాపడిన ఆడకూతురి' లాగ ఉంటుంది. పాలకులకి 'హింసా మార్గమే చక్కని రాజమార్గం' అవుతోంది. 'కత్తిని బతిమాల కూడదు.. కత్తికి విజ్ఞప్తి చేయకూడదు.. కత్తికి ధర్మాలు బోధించకూడదు..' అని చెబుతూనే 'కత్తి ప్రాణ రక్షణ కోసం కాక రక్తదాహంతో వీధిలోకి వచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఆయుధాగారంలోకి నెట్టేయాలి.. ఆ బాధ్యత మొత్తం ప్రజలందరిది..' అంటారు పతంజలి.

నిజానికి 'పతంజలిభాష్యం' పాతికేళ్ళ చరిత్రపై రన్నింగ్ కామెంటరీ. రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక, రాజకీయ సమస్యలు, దేశ రాజకీయాలు, విదేశీ విధానాలు, అనేక సందర్భాల్లో అమెరికా కర్ర పెత్తనం లాంటి జరిగిపోయిన విషయాలన్నీ మనకి గుర్తు చేస్తుంది. కుర్చీల్లో కూర్చున్న మనుషులు మాత్రమే మారారు, వాళ్ళు అనుసరించే విధానాలు మారలేదు అని మనం మరింత స్పష్టంగా అర్ధం చేసుకోడానికి దోహద పడుతుంది. నీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టుగా, ఎలాంటి వ్యక్తైనా కుర్చీలో కూర్చునేసరికి అందుకు తగ్గట్టు మారిపోతాడు అని అర్ధమవుతుంది.

ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రజలపై వేసిన రకరకాల పన్నులు, ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి, చంద్రబాబు చాణక్యం, 'అక్షరాల' సాయంతో అధికారంలోకి వచ్చిన వైనం, అదే అక్షరాలని వాడుకుని అధికారులతో ఆడుకున్న చమత్కారం మాత్రమే కాదు, కేంద్రంలో పీవీ 'చాణక్యం', వాజపేయి 'రాజనీతి,' సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ జార్జి, ఫెర్నాండెజ్ అనే ఇద్దరు నాయకులుగా విడిపోయారన్న నిష్టుర సత్యం, కాశ్మీర్ సమస్యపై అమెరికా అనవసర జోక్యం, మన నాయకుల పొంతనలేని సమాధానాలు.... ఎన్నో, ఎన్నెన్నో అంశాలు.

గత పాతికేళ్ళ కాలం లో వివిధ పత్రికల్లో పతంజలి రాసిన 56 వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. పతంజలిని గురించి ఆర్.కే. విశ్వేశ్వర రావు (ప్రచురణ కర్త), రావి శాస్త్రి, 'మో' రాసిన వ్యాసాల తో పాటు, పతంజలి స్వయంగా రాసిన 'నేపధ్యం' ఇంకా రమణజీవి చేసిన పతంజలి 'చివరి ఇంటర్వ్యూ' లనూ చదవొచ్చు. ఈ తెలుగు పుస్తకం సైజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వెల ఎక్కువే అనిపిస్తుంది. మన చుట్టూ ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకోడానికి తప్పక చదవాల్సిన పుస్తకం. (పర్స్పెక్టివ్స్ ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

17 కామెంట్‌లు:

 1. మీరు చదవని పుస్తకం వుండదేమో ....మంచి పుస్తకాలూ పరిచయం చేస్తున్నారు .

  రిప్లయితొలగించు
 2. ఇంతవరకూ నేనెప్పుడూ చదవని కోణం..తప్పక పుస్తకం కొనుక్కుని చదువుతాను. మంచి మంచి పుస్తకాలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మురళిగారూ!!

  రిప్లయితొలగించు
 3. నా మనసుకు నచ్చినట్టు నాలుగు మంచి మాటలు అందంగా చెప్పిన మీకు కృతజ్ఞతలు. పతంజలిని ఆర్థం చేసుకోవడం సులభం అనుకుంటాం అలాగే అర్థం చేసుకుంటాం. కానీ, చదివిన ప్రతివారికీ, ప్రతిసారీ కొత్తగా అర్థం అవుతూనే వుండడం గొప్ప రచయితల లక్షణం. పతంజలి బావు నిజంగే గొప్పోడు.

  రిప్లయితొలగించు
 4. బాగుందండి మంచి పరిచయం. పేరు చూడగానే ఏమిటి పతంజలి యోగసూత్రాలకు గౌరిశంకర్ గారి అనువాదం పుస్తకం గురించా అనుకున్నా.

  రిప్లయితొలగించు
 5. ఒక మనిషి గొప్పతనం ఆ మనిషి పోయాకనే తెలుస్తుందేమో.. నాకు పతంజలి గారి గురించి తెలిసింది ఆయన పోయాకనే.. టీవీ లో పతంజలి గారు పోయిన విషయం చూపించినపుడు మా అన్నయ్య అన్నాడు.. "అరేయ్ ఈయన నా పాత రూం ప్రక్కనే వుండేవారురా.. రోజు వాకింగ్ లో కలిసే వారురా.. ఈయన ఇంత పెద్ద రైటర్ అని తెలియదు..ఇప్పటివరకు.. "......
  ఈ పుస్తకం గురించి చాలానే చదివాను.. పుస్తకం మాత్రం ఇంకా చదవలేదు.. మీ రివ్యూ చదివిన తరువాత చదవాలనే ఆసక్తి కొంచెం ఎక్కువైంది..మరీ మీరు ఎక్కువ పుస్తకాలు పరిచయం చేసేస్తున్నారు.. ఇంకా కోతి కొమ్మచ్చి చదవడం పూర్తవలేదు ఇక్కడ...

  రిప్లయితొలగించు
 6. మీ వీరబొబ్బిలి టపాలో పతంజలిగారి చివరి రోజుల గురించి చదివినప్పుడు చాలా బాధనిపించింది .ఆరోజు పుస్తకపరిచయం చేశారు ఇప్పుడు ఆయనలోని ఒక కోణాన్ని , ఆయన వ్యక్తిత్వాన్ని మీ అక్షరాల్లో చూస్తుంటే మీకాయనపట్ల ఉన్న అభిమానం కనిపిస్తోంది .
  "ధర్మాగ్రహాన్ని ప్రకటించడానికి కావలసినవి నాలుగు.. సమస్యల పట్ల స్పందించే హృదయం, స్పందించగల తెగువ, స్పందించడానికి తగినంత భాష, ఆ స్పందనని ప్రచురించగల పత్రిక." really nice !
  'పతంజలిభాష్యం' మీద మీవిశ్లేషణ చాలా బావుంది.

  రిప్లయితొలగించు
 7. @సునీత: అవునండీ.. నామిని కి గురుతుల్యుడు పతంజలి.. ధన్యవాదాలు.
  @చిన్ని: అయ్యో.. నేను చదివేవి చాలా తక్కువేనండీ.. ధన్యవాదాలు.
  @ప్రణీత స్వాతి: తప్పక చదవండి.. పతంజలి రచనలు నచ్చని వాళ్ళు ఉండరు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 8. @దుప్పల రవి: చదివిన ప్రతిసారీ ఓ కొత్త కోణంలో అర్ధం కావడం పతంజలి రచనల ప్రత్యేకత..అవునండీ నిజంగానే గొప్పోడు.. ధన్యవాదాలు.
  @భావన: గౌరీశంకర్ గారి పుస్తకం ఇంకా చదవలేదండీ.. ధన్యవాదాలు.
  @సత్య: "మరీ ఎక్కువ పుస్తకాలు..." అంతేనంటారా? 'కోతికొమ్మచ్చి' చదవడానికి ఇన్నిరోజులా? చాలా చిన్న బుక్ కదండీ.. పతంజలి రచనలు తప్పక చదవండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. @పరిమళం: పతంజలి రచనలు చదివినవారికి అవి నచ్చకుండా ఉండవండీ.. పాత్రలన్నీ సజీవంగా కళ్ళముందు ఉంటాయి. పాఠకులు కథాస్థలానికి వెళ్ళిపోతారు.. చిన్న చిన్న మాటలతో, హాస్య వ్యంగ్య ధోరణిలో బరువైన జీవిత సత్యాలు చెబుతారు.. ఏమాత్రం అవకాశం దొరికినా పతంజలి రచనలు తప్పక చదవండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. ఈ రచయిత రాసిన పుస్తకాలేమీ చదవలేదండి..మీ వ్యాసం చదివాకా కొనాలన్నమాట అనిపించింది.

  రిప్లయితొలగించు
 11. తృష్ణ: తప్పక చదవండి.. మిమ్మల్ని నిరాశ పరచవు.. ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 12. నాలాంటి అజ్ఞానులకు పనికొచ్చే పుస్తకమన్నమాట. చదవాలైతే. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. @భవాని; మన గురించి మనం ఏదైతే అనుకుంటామో మనం అది కాదట.. పుస్తకం చివర్లో పతంజలిని ఇంటర్వ్యూ చేసిన రచయిత రమణజీవి చెప్పారు. మీకు అర్ధం కాలేదా? కొంచం స్పష్టంగా చెప్పాలంటే మీరిప్పుడు మిమ్మల్ని మీరు 'అజ్ఞాని' అనుకున్నారు కదా.. కానీ నిజానికి మీరు 'జ్ఞాని' అన్న మాట.. అందుకే అందుకు వ్యతిరేకంగా అనుకుంటున్నారన్న మాట.. అదండీ సంగతి.. తప్పక చదవండి.. మంచి పుస్తకం.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 14. అయితే నాలాంటి జ్ఞానులకు అవసరం లేని పుస్తకమన్నమాట:).

  రిప్లయితొలగించు
 15. @భవాని: హ..హ..హ... what a sense of humour!!! గ్రేట్ అండీ మీరు..

  రిప్లయితొలగించు
 16. పెంపుడు జంతువులు రాసిన పతంజలి గారు... ఒక కర పత్రిక కు సంపాదకుడి గా పని చేయటం నిజం గా విషాదమే.... పని లేక బ్లాగ్ రమణ గారు రావి శాస్త్రి గారి పంకా అయినట్లు... మీరు పతంజలి గారి పంకా అన్న మాట... నేను కూడా 2003 నుండి పతంజలి గారి కి వీరాభిమానిని.... మీ బ్లాగ్ ఇప్పుడే చూశాను.... బాగుంది....

  రిప్లయితొలగించు